Jump to content

కవిత్వతత్త్వ విచారము/అవతారిక

వికీసోర్స్ నుండి


అవతారిక

ఈ గ్రంథముయొక్క చరిత్రము గొంతవఱకుఁ జిత్రము. తొలుత 1899 వ సంవత్సరములో, నేను చెన్నపురి క్రైస్తవ కళాశాలయందు విద్యార్థిగా నున్నప్పడు, కళాపూర్ణోదయ పఠనోత్సాహెూత్కర్షంబునం జేసి సూరనార్యుని యెడఁ గృతజ్ఞతయు, ఋణమునుండి విముక్తియు, సాధ్యమైనంతవఅకు బడయంగోరి యాత్మతృప్తికై యొుక యుపన్యాసము వ్రాసితి. అది మొట్టమొదట బహిరంగపఱుపఁ బడిన రంగము. ఆ కాలేజికిం జేరిన "యాంధ్ర భాషాభిరంజనీ" సమాజము. దీని నత్యంతముగాఁ బొగడిన వారిలో నొకఁడు సహపాఠియుఁ బరమ మిత్రుండు నగు మొండేటి బాపనయ్య. అతని వాసస్థలము రాజమహేంద్రవరము. ఆ సుకుమారచిత్తుని ప్రోత్సాహము నాహ్వానముఁ గారణముగ రాజమహేంద్రవరమునకుఁ బోయి యచ్చట నప్పడు ప్రముఖముగా నుండిన "విద్యాభివర్ధనీ" సమాజమువారి యాశ్రయమున నడుపcబడిన గొప్పసభలో నావ్యాసమును మిక్కిలి జంకుతోఁ జదివితి. అక్కడఁ దటస్థించిన వాదములం జర్చలం బట్టి చూడఁగా, నా కాలమునఁ గళాపూర్ణోదయము మంచి ప్రసిద్ధికి వచ్చియుండలేదని తోఁచినది. తెనుఁగున నవల లనఁబడు కథలఁ గల్పించుటలో నద్భుత ప్రతిభులగు శ్రీ చిలకమర్తి లక్ష్మీనృసింహము గారు ఉదారులగుట గొంచెమును బెద్దగా గణించి యామోదసూచకముగఁ దమ కృతుల నాకు సమ్మానముగా నిచ్చిరి. బాలుండనగు నాకు నట్టి వారి యంగీకార మెంతటి యాత్సుక్యము నొసంగెనో మీరే యోజింపడు. భాషాకృషికి ప్రోత్సాహకములలో వారి సంభావన ప్రథమగణ్యము. పిమ్మట నా వ్యాసము మఱి రెండు స్థలముల నివేదించితిని. అందొక దాన నగ్రాసన మలంకరించిన కవీశ్వరులు శ్రీ వేదము వేంకటరాయ శాస్త్రులుగారు. నేను అత్యుక్తిదోషము పాలైతినని మృదువచనములతో మనము నొవ్వని విధంబునఁ గొన్ని స్ఖాలిత్యములం జూపి నన్నుం గృతార్థునింజేసి నాకు నెప్పటికంటె నెక్కువగ వందనీయులైరి. నెల్లూరులో నివసించు శ్రీ దుర్భా సుబ్రహ్మణ్యంగారు నా వ్యాసముంగూర్చి ప్రశంసించుచుఁ బద్యము నొకండు వ్రాసి పంపిరి. తరువాత 1902 వ సంవత్సరమున విద్యార్థినై గవర్నమెంటు వారొసంగిన బహుమాన వేతనము సహాయముగ నింగ్లాండునకుం బోయితిని. విదేశములయందును గళాపూర్ణోదయము మఱి మఱిం జూచుచుంటినిగాని వదలలేదు. వదలఁగాదు గాన. మరల స్వదేశమునకు వచ్చుటకు సుమారు 5 సంవత్సరములు పట్టెను. వచ్చియుండిన కొంచెము తెనుగన్ననో సగానికి సగము అంతర్ధాన మైనందునఁ జింతాక్రాంతుఁడనై, యే ప్రాచుర్యములు నాకేలయని యుండఁగా, ప్రస్తావవశమున నా యుపన్యాసము సంగతి వినిన అస్మత్పితృసఖుని పుత్రుఁడు వావిళ్ళ వేంకటేశ్వరశాస్త్రి దానిం బ్రకటింపగోరి తనకిమ్మని యడుగఁగా నెట్టకేలకు సమ్మతించితి. ఇంటికి వచ్చి యెక్కడ వెదకినను నా కా విమర్శనము లభించినది గాదు. దానిగతి యేమాయెనో దేవునికే యెరుక. నూతన ప్రారంభములు నావంటి యన్యకార్యమగ్నునకు దుర్ఘటములు. కాలము నిలువదు. పోవును. తరుణము సులభము కాదు. తనంతట రాదు. ఇట్లు కొన్నియేండ్లు చెల్లఁగా నేది యెట్లున్నను వ్రాయక పోరాదని పునఃపఠనమునకుం దొడంగుతఱికి నా యభిప్రాయము లనేకములు నాకుఁ దెలియకయ ఈమధ్యమునఁ బలు దెఱుంగుల మార్పులం గాంచియుండుట వ్యక్త మయ్యెను. దానిచే నుపన్యాసమునకు మాఱుగ నీ విపులగ్రంథము వ్రాయుటయుఁ గొత్తపేరిడుటయు ననివార్యము లాయెను.

ఒంటిగా నే సమర్ధించి యుండఁజాలను. నాకుం దోడుగ మైసూరు మహారాజుగారి కాలేజియం దాంధ్రపండితులగు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు నిలిచినందునఁ గార్యము నెఱవేఱెఁ గాని లేకున్న నైయుండుట సందిగ్ధము. ఇంత త్వరలో నైయుండుట యసంభవము.

తొలుతటి యుపన్యాసము వాసన యిందు నింకను నుండుట చదువరు లెఱుంగుదురు. కళాపూర్ణోదయముతోడ ప్రభావతీ ప్రద్యుమ్నమును ఆక్రమింపవలసివచ్చె. దృష్టి యొక కావ్యమునుండి యింకొక దానిపైఁ బ్రసరించియుండుట స్పష్టము. సహజవ్యాప్తినేల నిరోధింపవలయునని దాని ప్రకృతి కనర్గళసంచార మొసంగితి. గ్రంథ వైపుల్యముంగూర్చి మీ క్షమాపణ వేఁడెద.

ఈ కార్యమునకుఁ దొలుత నత్యంత ప్రోత్సాహకుఁడైన మన్మిత్రుఁడు మొండ్రేటి బాపనయ్య కీర్తిశేషుఁడగుటచే దీనిం జూచి నాపైఁ బ్రేమచేనైన సంతసింప లేమికిఁ జింతిలుచున్నాఁడ ! చిర సమీక్షచే గార్యములు నిష్ఫలము లగునుగదా ! కావున నీ చింత దురద్పష్టము గాదు. నా నేరమునకు నైనదండన.

ఇట్లు, తమ విధేయుఁడు
కట్టమంచి రామలింగారెడ్డి