కవిజనాశ్రయము/సంజ్ఞాధికారము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు.

కవిజనాశ్రయము.

[1]అవతారిక.

క. శ్రీకరముగ రేచనపై
లోకంబున సుకవివరులు లోలతఁ బొగడన్
బ్రాకటముగ నీఛందము
లోకం బౌ ననఁగఁ దెలుఁగులో నొనరింతున్. 1

క. వేములవాడను[2] వెలసిన
భీమేశ్వరుకరుణ గల్గుభీమసుకవి నేఁ
గోమటిరేచనమీఁదను
నీమహిఁ గవు లెన్న ఛంద మెలమి రచింతున్. 2

క. [3]అనవద్యకావ్యలక్షణ
మొనరంగాఁ గవిజనాశ్రయుఁడు మల్లియ[4] రే
చనసుకవి[5] కవిజనాశ్రయ
మనుఛందముఁ దెనుఁగు బాస నరుదుగఁ జెప్పెన్. 3

ఛందఃప్రశంస


క. నెఱయంగా నీఛందము
తెఱఁ గెఱుఁగక కవిత చెప్పుధృష్టాత్ముఁడు ద
బ్బఱచీఁకు చీఁకుగుఱ్ఱము[6]
బఱపిన క్రియ నిఖిలహాస్యపదనిరతుఁ డగున్. 4

క. [7]కడుఁ గవితామహిమకుఁ దివి
రెడుకవి కిచ్చదువు[8] తెఱఁ గెఱింగినఁగా కె

    క్కడనుండి వచ్చు బెడఁ గడ
    రెడుకబ్బము సెప్ప నురుపరిజ్ఞాన మిలన్. 5

క. అతిశయముగఁ జెప్పినస
   త్కృతి కవుల కుదాత్తఫలముఁ గీర్తియుఁ జేయున్';
   మతి నెఱుఁగక[9] చెప్పినదు
   ష్కృతి కపుల కుదాత్తఫలముఁ గీర్తినిఁ జెఱుచున్. 6

క. అమరఁగ వేల్పులచేఁ గ
   బ్బము[10] సెప్పియ కాదె వరము వడసిరి మును బా
   ణమయూరాదులు, సత్కా
   వ్యము సెప్పినఁ బడయరానివస్తువు గలదే[11]. 7

క. [12]కమనీయసమస్తకళా
   గమములకును[13] జన్మభూమి కావ్యము, కావ్యా
   గమవిదుఁడు సర్వవిదుఁ డని
   సమయచతుష్టయమునందుఁ జదివిరి మొదలన్[14] . 8

క. [15]కావునఁ గవిత్వతత్త్వము
   భూవలయములోన సం దద్ద [16] పూజ్యం బని స

    ద్భావమునఁ జెప్పెఁ[17] గావ్యక
    ళా వేదులు వొగడఁ గావ్యలక్షణము మహిన్ .9

- కావ్యవిభాగము. -



క. హృద్యానవద్యకావ్యము
   గద్యము పద్య మని చెప్పఁగా ద్వివిధ మగున్ ;
   గద్యం బపాదపదనిక
   రద్యోతితనవరసార్థరచనలఁ జెల్లున్ . 10

క. నాలుగుపాదంబులచే[18]
   నాలుగుప్రావళ్లు గూడినం[19] బద్యము, ప
   ద్యాలియు నిరుదెఱఁ గై చను
   నోలిని వృత్తములు జాతు లొనరం[20] గృతులన్ . 11

- పద్యవిభాగము. -



క. కమనీయ[21] వృత్తములు గణ
   సమకనిబద్ధములు; శేషజాతులు మాత్రా
   సమకనిబద్ధము లగు; నొ[22]
   క్కమాత్ర లఘు వై ద్విమాత్రకము గురు వయ్యెన్[23]. 12

- గురులఘువివేకము. -

క. గురువులు నిడుదలు జడ్డ
   క్కరముల బొట్టులపిఱుందకడ నూఁదినయ
   క్కరములుఁ; బెఱయవి లఘువులు;
   గురులఘువులు మూఁడుఁ గూడికొన[24] గణమయ్యెన్ . 13

క. [25]నీచిత్తంబున మెత్తు స
   దాచారుల ననినఁ బిఱిఁదియవి[26] గురువు లగున్ ;
   నీచిత్త మిగ్రుచుఁ[27] బ్రకటస
   దాచారుల ననినఁ బిఱిఁదియవి లఘువు లగున్. 14

క. [28]తరుణతరశిశిరకర సురు
   చిరరేఖాకారముగను జెలువుగ వ్రాయన్[29]
   గురువు; మఱి లఘువు నిశిత
   స్మరశరనిభ మైనవ్రాయి[30] మల్లియరేచా ! 15

- గణస్వరూపము. -



క. ఒనరఁగ మూఁడెడలను మొద
   ల నడుమఁ దుదిఁ గదియఁగ గురులఘువులు నేతెం

   చిన మ భ జ స న య ర త నా
   మనిరూపితగణము లయ్యె[31] మల్లియ రేచా ! 16

క. [32]గురువులు మూఁ డిడ మగణము,
   పరఁగంగా నాదిగురువు భగణం బయ్యెన్;
   సరి మధ్యగురువు జగణము,
   సరసగుణా యంత్యగురువు సగణం బయ్యెన్.[33] 17

క. [34]లఘువులు మూఁ డిడ నగణము,
   లఘు వాద్యం బయ్యెనేనిగ[35]లలి యగణ మగున్,
   లఘుమధ్యం బగు రగణము,
   లఘు వంత్యము[36] తగణ మయ్యె లాలితకీర్తీ ! 18

క. [37]గగ మాయె రెండుగురువులు,
   సగణంబును నొక్క లఘువు సల మనఁ బరఁగున్,
   నగణము లఘువును నల మగు,
   సగణంబును నొక్క గురువు నగ మనఁ బరఁగున్ . 19

క. [38]గగణ మన నొక్కగురు వగు,
   లగణం బన నొక్కలఘువు లాలిత్యముగా[39] ,
   వగణ మన లఘువు గురువును,
   హగణం బన గురువు లఘు వహర్పతి తేజా. 20

క. [40]పరువడి గురులఘు లఘుగురు
   గురులఘువులు గ ల వ హము లగున్ మఱి దీర్ఘ.
   స్వరయుత మై యున్నగణా
   క్షరములు[41] తద్గణము రెండుగా[42] నెన్నఁబడున్. 21

క. [43]భ ర త న గ నల సలంబులు
   వరుసనె యియ్యాఱు నెన్న వాసవగణముల్ ;
   మరి న హము లిసగణంబులు,
   సరవిం దక్కినవి యెల్లఁ జంద్రగణంబుల్ . [44] - [45] 22

- గణాధిదేవతలు. -

క. మ భ జ స న య ర తగణముల
   కభిమతముగ భువియు శశియు నర్యమపవనుల్
   ఋభునిలయ సలిల పావక
   నభములు దేవతలు బుధజనస్తుత రేచా![46] 23

- గణఫలములు. -



క. శుభ సుఖ రుక్ క్షయ ధన కన
   క భయైశ్వర్యములఁ జేయుఁ గ్రమమునఁ గావ్య
   ప్రభులకుఁ గవులకు మొదలిడ
   మ భ జ స న య ర తగణములు మల్లియరేచా ! 24

క. [47]సరసాన్న రుచిరభూషణ
   పరితాప స్థానచలన బహుదుఃఖ రుజా
   పరమాయు రచలలక్ష్మీ
   కరములు మ య ర స త జ భ నగణములు వరుసన్. 25

- గణవర్ణములు. -

క. గారుత్మత గోరోచన
   సారంగ పిశంగ కుముద చందన రక్తాం
   భోరుహ కనకప్రభలను
   నారయ మగణాది యగుగణావలి వొల్చున్.[48] 26

- గణగ్రహములు. -



క. ధరణిజ శశి రవి బుధ గురు[49]
   సురరిపుగురు మంద ఫణులు సొరిదిగ్రహంబుల్
   పొరి మ భ జ స న య ర త గణ
   సరణికి ఛందోమతంబు చర్చింపంగన్. 27

- గణకులములు. -



క. మగణంబు శూద్రకులజము,
   భగణం బగు వైశ్యజాతి, బ్రాహణజాతుల్
   సగణయగణములు, రగణము
   జగణము నృపజాతి యంత్యజంబులు నతలున్.[50] 28

- గణగోత్రములు. -

ఆ. కాశ్య[51] పాత్రికపిలకౌశిక వాసిష్ఠ
    గౌతమాంగిరోజకణ్వమునుల[52]
    గోత్రముల్ ప్రసిద్ధపాత్రముల్ మరణాది
    నెన్నఁబడిన గణము లెనిమిదికిని.[53] 29

- గణోత్పత్తి. -



ఆ. చంద్రవహ్ని సూర్యచక్షుఁ డౌరుద్రుని
     మూఁడుకన్నులందు మూఁడుగురువు
     లుదయ మయ్యె; దాన[54] నొప్పారె మగణంబు,
     నందు సప్తగణము లమరఁ బుట్టె. 30

క. [55]భగణము సగణము నగణము
   తగణంబు మరుద్గణములు తనరంగ మను
   ష్యగణంబులు జయగణములు
   మగణంబును రగణ మరయ మహి రాక్షసముల్. 31

- గణనక్షత్రములు. -



తే. జ్యేష్ఠమృగశిరయుత్తర చెలఁగు స్వాతి
    సరవి రేవతి పూర్వకాషాఢ కృత్తి

   కయుసు బుష్యమి యనెడునక్షత్రపంక్తి
   కదియు మ భ జ స న య ర త గణములకును. 32

- గణరాసులు. -



క. అళి వృషభ సింహ తుల యుగ[56]
   జలచర చాపాది కటక [57]సంజ్ఞక రాసుల్
   లలి మ భ జ స న య ర తగణ
   ముల కయ్యెను జగతిలోన మోహనరూపా. 33

- గణయోనులు. -



ఆ. హరిణ సర్ప వృషభ వాయరిపు కుంజర
    మర్క టాజ చారు[58] మహిషములును
    మలసి యోసులయ్యె మ భ జ స న య ర త
    గణసమూహమునకు గుణగణాఢ్య. 34

- గణగుణదోషవిచారము. -



తే. [59]మొదల సంయుక్తవర్ణంబు పొందెనేని
    మఱవ కారెంటికిని గ్రహమైత్రి వలయు ;
    నిది విచారింప రేని కృతీశ్వరుండు
    పిడుగు మొత్తినగతిఁ గూలు బిట్టబిఱ్ఱు. 35

క. మగణం బెప్పుడు శుభగణ
   మగు, నెన్నం గ్రూరగణము మఱి డాసినచోఁ

   దెగఁజంపు, [60]బుధుఁడు క్రూరం
   బగుగ్రహముం గదిసి క్రూరుఁడై చనుమాడ్కిన్. 36

క. [61]మగణంబు పద్యముఖమున
   సగణముతోఁ గూర్చి చెప్పఁ జనుఁ గృతి యొండెం
   దగుపద్య మొండెఁ గర్తకు
   యగణాంతము[62] చెప్పు శుభము లయ్యెడుకొఱకున్. 37

క. మభనయలు పద్యముఖమున
   శుభ సుఖ ధన జయము లొసఁగి సొం పొనరించుం ;
   బ్రభునాశము జతరస లవి
   సభలం బద్యాది[63] నిడఁగఁ జన చెయ్యెడలన్. 38

క. నయలం జెప్పిన శుభ మగు,
   జయలం జెప్పినను బతికి జయకీర్తు లగున్,
   మయలం జెప్పిన సౌఖ్యము,
   రయలం జెప్పినను బెంపు రయమున నిచ్చున్.[64] 39

క. పొగడొందఁ బద్యముఖమున
   రగణము యగణమును గూడి రాగిల్లిన నీ
   జగ మంతయు నేలెడువాఁ
   డగుఁ గృతిపతి విభవయుక్తుఁ డగుఁ గవివరుఁడున్ . 40

క. రసలం జెస్పినఁ జి చ్చగు,
   జసలం జెప్పినను దెవులు చయ్యన వచ్చున్ ,
   తసలం జెప్పిన మే లగు,
   మసలం జెప్పినను గర్త మండల మేలున్. 41

క. మునుకొని పద్యముఖంబున
   ననిలగణం బిడిన నాయురారోగ్యంబుల్
   కొనసాగు, దానిముందట
   ననలగణం బిడినఁ బతికి నలజడి[65] సేయున్. 42

క. తగణంబు తొలుతఁ బిమ్మట
   భగణంబును గదిసి యుండఁ బద్యము హృద్యం
   బుగ రచియించినఁ గర్తకు
   నగణితముగ నొసఁగు[66] నాయురైశ్వర్యంబుల్ . 43

క. నగణంబు గదిసి శుభకర
   మగు యగణము గూడి యొసఁగు నర్థము సిరులున్;
   నగణయుత మైన భగణము
   జగణంబును గూడి భాగ్యచయముల నిచ్చున్. 44

క. రజతలఁగూడిన నూరక
   గజిబిజి గావించుఁ, గావ్యకర్తకు సంప
   ద్విజయములఁ జేయు భగణము,
   నిజముగ నయరసల డాసి నిలిచినచోటన్. 45

క. సభలం జెప్పిన విభవము
   రభలం జెప్పినను జెట్ట[67] రయమున వచ్చున్ ;[68]
   శుభ మగు రయలం జెప్పిన,
   నుభయము వర్ధిల్లునందు రుత్తమచరితా ![69] 46

క. రాజున కాదిన్ మగణము
   నోజం గదియించి సుకవు లొసఁగెడి పద్యం
   బాజులజయ మీఁ జాలదె
   తేజులు నేనుఁగులు భటులుఁ దేరులు సేనల్ .[70] 47

క. అనిలానలసంయోగం
   బనుపమకీలాక రాళ మగువహ్ని భయం
   బొనరించుఁ గర్త[71] గృహమున
   కను[72]మానము లేదు దీననండ్రు కవీంద్రుల్ .[73] 48

క. తగణంబు గదిసి చంపును,
   రగణము దా భీకరంపు రణ మొనరించున్ ,
   సగణం బిఁకనొకచిత్రము
   మగణముతోఁ గూడఁ గాలమానము పతికిన్. 49

క. [74]అగినిగణంబున కిరుదెస[75]
   సగణముతోఁ గూర్చి చెప్ప[76] సత్కవి మదిలో

నగి[77] యైనఁ దిట్టి యైనను[78]
బగనము గాకుండఁ గమలభవుఁడో శివుఁడో ? 50

ఏగణముఁ గదిసె నగణం
బాగణము సమస్తమంగళా వాప్తం బై[79]
రాగిల్లు నినుము పరుసపు[80]
యోగంబునఁ బసిఁడివన్నె నూనినకరణిన్ . 51

- అక్షరగుణదోషవిచారము. -



[81]శ్రీకారము గలపద్యము
ప్రాకటముగ లచ్చియొసఁగి పతి క నవరతా
స్తోకజయము లొనగూర్చును
మాకరుణారక్షి తాంగ మల్లియరేచా ! 52

[82]పాఫాబాభామాలను
పాపాక్షరసంజ్ఞ లేనుఁ బద్యము మొదలన్
రూపించి నిలిపి చెప్పిన
నాపద్దశలకును మూల మండ్రు కవీంద్రుల్. 53

- గణలింగములు. -

క. [83]ఇలఁ దగణ రగణ జగణం
   బులు పురుషగణములు, భగణమును యగణంబున్
   లలనాగణములు, నగణము
   పొలుచు మగణ సగణములు నపుంసకగణముల్ . 54

- అక్షరనిర్ణయము. -



క. [84]ఆదులు పదియే ననఁగాఁ
   గాదులు దా మిరువదేను గణుతింపంగా
   యాదులు పది యని చనఁగా
   నీదెస నక్షరము లమరు నేఁబది యనఁగన్. 55

- బీజాక్షరములు. -

సీ. [85]అ ఇ ఉ ఋ ఌ ను నైదు నాదీర్ఘ వర్ణంబు
          [86]లైదు నేకారాదు లైదు నిలిపి
    వరుసగ వర్గాదివర్గపంచకమును
          యాదు లైదును షాదు లైదుఁ గూడఁ
    బదివర్గముల[87] వర్ణపఙ్త్కుల నొండొంటి
         క్రిందఁ బొందుగ నిల్ప[88] నందులోనఁ
    బ్రథమాక్షరంబులు పవనబీజంబులు
        నవలివి దహనబీజాక్షరములు

గీ. అవనిబీజంబు లగుఁ దృతీయాక్షరములు
   వరుణబీజంబు లగుఁ దరువాతిపదియు
   గగనబీజంబు లైదవకడల వెల్ల[89]
   వాని మేలును గీడును వలయుఁ దెలియ.[90] 58

మ. క్షితిబీజంబులసంపదల్[91] పొదలుఁబోషించుంబయోబీజము
     ల్సతతంబుంబ్రమదఁ బొనర్చు శిఖిబీజంబుల్మృతుంజేయుమా
     రుతబీజంబులు శోకవారిధిఁ బడంద్రోచు న్న భోబీజముల్
     పతినత్యంతదరిద్రుఁజేయు మొదలంబద్యాలి నొందించినన్.[92]

- వళ్లు. -

క. [93]విశ్రాంతి విరతి విశ్రమ
   విశ్రామ విరామ విరమ విరమణ లనఁగా
   విశ్రుత మగు యతి కృతి కధి
   కశ్రావ్యం బై బెడంగు గా నిడవలయున్ . 60

క. [94]చరణాద్యక్షరమే వడి
   చరణంబుద్వితీయవర్ణసమితియె ప్రాసం
   బరయఁగఁబ్రాసం బొక్కటి
   చరణంబుల వళ్లు వేఱె జగతిం జెల్లున్ . 61

- యతిభేదములు. -

క. [95]స్వరవర్గాఖండప్రా
   చ్యురుబిందుప్లుతములున్ బ్రయుక్తాక్షరముల్
   [96]పరఁగఁగ నెక్కటి పోలిక
   [97]సరసలు నాఁ బదివిధములఁ జను వళ్లు మహిన్. 62

- స్వరయతులు. -



క. [98]అఆ లైఔలకు మఱి
   ఇఈలు ఋకారసహిత మెఏలకు నౌ
   [99]ఉఊ ల్తమలో నొడఁబడి
   ఒఓలకు వ ళ్లగు న్న యోన్నతచరితా! 63

క. [100]స్వరగణము కకారాద్య
   క్షరములతో సంధి చేసి కదియించినఁ ద
   త్స్వరము కొని చెప్పునది వ
   ళ్లరవిందజసదృశ కవిజనాశ్రయ కృతులన్. 64

- వర్గయతులు. -

క. [101]నిక్కువ మయ్యెన్ వర్గపు
   టక్కరముల వళ్లు నిలుప నగు జఞణనమల్ !
   తక్కఁ బెఱనాలుగింటికి[102]
   దిక్కరిసన్ని భుఁడ రేచ ధీజనవినుతా! 65

- అఖండయతి. -



ఉ. [103]మానుగ విశ్రమాక్షరసమన్వి[104]త మై స్వరమూఁదినన్ దదీ
    యానుగుణాక్షరంబెకొనియైనను జెప్పఁగనొప్పు[105] నీక్రియన్
    భానుసహస్రభాసి వృషభాధిపుఁ డన్నటు లర్థయుక్తమై
    [106]పూనినచో నఖండయతి పొ ల్పగునాదికవి[107] ప్రసిద్ధమై. 66

- ప్రాదియతులు. -



క. ప్రపరాపసమనుసుప్ర
   త్యపినిర్దురధిన్యుపాభ్యుదాఙ్న్యత్యవప
   ర్యుపసర్గవింశతికి[108]
   ళ్లుపరిస్వరయుక్త మైన నుభయము చెల్లున్ .[109] 67

- బిందుయతి. -

క. [110]కచటతప లనఁగఁ బరఁగిన
   ప్రచురం బగు నేనువర్గపంక్తుల పిఱుఁదన్
   రుచిరము గ బిందు వూఁదిన
   నచలం బై వళ్లు చెల్లు నంత్యాక్షరముల్. 68

గీ. జౌకు వడి చెల్లు రత్నకంకణ మనంగ
    ఞాకు వడి చెల్లు బర్హి పింఛం బనంగ
    ణాకు వడి చెల్లుఁ గనకమండప మనంగ
    నాకు వడి చెల్లు దివ్యగంధం బనంగ
    మాకు వడి చెల్లు విజతశంబరుఁ[111] డనంగ. 69

- ప్లుతయతి. -



క. [112]దూరాహ్వానమునందు మ
   హారోదనగానసంశయార్థములతుదన్[113]
   [114]జేరువఁ దగ నాద్యచ్చుల
   [115]నారూఢిగఁ బ్లుతమువడి మహత్త్వము మీఱున్. 70

- సంయుక్తాక్షరయతి. -

క. [116]వరకృతులను సంయుక్తా
   క్షరములలో నెద్ది యైనఁ జను వడి యిడఁగా
   గురుబుధజనవరదాయక
   స్మరసన్నిభసుభగమూర్తి మల్లియ రేచా ! 71

- ఎక్కటివడి. -



క. ధరజఞ లను నీరెండ
   క్షరములు విన్నయది లేదు శబ్దము మొదలన్
   [117]మరఱలవము లను నేన
   క్షరములు తమతమకె వళ్లు కమలాధీశా ! 72

- పోలికవడి. -



క. పోలఁగ, పుఫుబుభులకు మూ
   పోలికవడి శీల ముల్లమున కెన యనఁగా[118]
   శీలం బుల్లం బనఁ గా
   భూలోకం బమరలోకమున కెన యనఁగన్ . 73

- సరసయతి. --

క. [119]అయహలు చఛజఝశషసలు
   నయసంయుత నణలు[120] రేచనా సరసగుణ
   ప్రియ యివి యొండొంటికి ని
   శ్చయము గ వళ్లయ్యె సర్వశాస్త్రవిధిజ్ఞా. 74

- సంఖ్యావాచక పదములు. -


క. [121] [122]హిమకర [123] కర [124] వైశ్వానర
   [125] సముద్ర [126] బాణ [127] ర్తు [128] ముని ౮ భుజంగమ ౯ నందా
   ద్యమితగణితోక్తి సంజ్ఞా
   క్రమమెఱుఁగఁగ వలయు నెన్నఁ గాఁ దగునెడలన్. 75

- ప్రాసములు. -

క. భాసురము లగుచు సుకర
   ప్రాసానుప్రాసదుష్కరప్రాసాంత్య
   ప్రాసద్విప్రాసత్రి
   ప్రాసము లన షడ్విధములఁ బరఁగును [129]గృతులన్. 76

వ. అందు సుకరప్రాసం బన్నది సులభాక్షరములు ప్రాసం బిడి చెప్పునది.[130] 77

క. పరమోపకార ధరణీ
   సురవరసురభూజ [131]సుగుణసుందర తరుణీ
   స్మరనిభ సుకరప్రాసం
   బరుదుగఁ గృతులందు నొప్పు నభినుతచరితా ! 78

వ. దుష్కరప్రాసం బన్నది విషమాక్షరంబులు ప్రాసం బిడి చెప్పునది. 79

క. స్వఃకాంతాసమ యోషిదు
   రఃకృతరతిచిహ్న దుష్కరప్రాసం బా
   విఃకృత మగు నిట్లు సుపు
   త్రః కులదీపక యనంగఁ దగుచు మహాత్మా! 80

వ. మఱి ద్విప్రాసం బన రెండక్షరంబులు ప్రొసం బిడి చెప్పునది.

క. దోసంబు లేక వస్తు ని
   వాసం బై వెలయఁ జెప్పవలయును ద్వంద్వ

   ప్రాసం బుచితాక్షరవి
   న్యాసంబుగఁ గృతుల రేచ నయ[132]తత్త్వనిధీ. 82

వ. మఱి త్రిప్రాసం బన మూఁ డక్షరములు ప్రాసం బిడి చెప్పునది. 83

క. దానమున సత్యమున నభి
   మానమునం బోల్ప నీసమానము ధరణిం
   గాన మనం ద్రిప్రాసము
   [133]దాన మనోహర మగును బుధస్తుతచరితా! 84

వ. మఱి యనుప్రాసం బన్నది ప్రాసాక్షరంబు పెక్కెడల నిడి చెప్పునది. 85

క. విత్రస్తాఘపవిత్రచ
   [134]రిత్ర జితత్రిదశవర ధరిత్రీసుతస
   న్మిత్రాంబుజమిత్రగుణా
   మత్ర యనుప్రాస మిదియ మల్లియరేచా ! 86

వ. మఱి యంత్యప్రాసం బన్నది మొదటిపాదము కడపటి యక్షరంబు నాలుగుపాదంబుల కడపట నిడి చెప్పునది. 87

క. జననుత భీమతనూజా !
   సునయార్పితవిభవ[135]తేజ సుభగమనోజా !

వినుతవిశిష్టసమాజా!
యన నంత్యప్రాస మగు[136] నహర్పతితేజా ![137] 88

వ. మఱియుఁ బ్రాసాక్షరలక్షణవిశేషం బెట్టి దనిన ?[138] 89

క. వలసినచో లళములు డళ
   [139]ములు మఱి ఋక్రాంతవర్ణములు ప్రాసము లై
   యలవడు సత్కవికృతులన్
   నిలుపం దగు వానిఁ దెలిసి నియతప్రీతిన్. 90

క. తాళము దాలము నాఁ జనుఁ
   జోళుఁడు చోడుండు నాఁగ సొం పగుఁ గృతులస్
   వ్యాళము వ్యాలము వ్యాడము
   నోలిని సమరూఢిఁ బ్రాసయుక్తము లయ్యెన్. 91

గీ. భీక రాకారుఁ డయ్యు నభీకృతుండు
   మేదురక్రోధి యయ్యు ననాదృతుండు
   [140]పావనాత్మకుఁ [141]డయ్యు ఖలావృతుండు
   నాఁగఁ బ్రాసములకు సమానంబు లెపుడు. 92

[142]గద్యము. ఇది[143] వాదీంద్రచూడామణిచరణసరసీరుహమధుకరాయమాన శ్రావకాభరణాంకవిరచితం బైనకవిజనాశ్రయంబనుఛందంబునందు సంజ్ఞాధికారము.[144]


__________
  1. ఈయవతారికఁలో చేరిన పద్యము లాఱును జ-యను ప్రతిలో మాత్ర మున్నవి.
  2. వేమనవాడ యని మాతృక. వేములవాడ, లేములవాడ యని వ్యావహారిక నామములు. ఈగ్రామము హైదరాబాదు రాజ్యములోఁ బూర్వము వెలిగందల జిల్లా యనియు నిప్పుడు కరీంనగర్ జిల్లా యనియు వాడుక గల మండలమందు మహారాజా కిస్సెన్ ప్రసాదుగారి జాగీరులో నున్నది. అందు సుప్రసిద్ధమయిన భీమేశ్వరాలయము కలదు.
  3. ఈపద్యమునకుఁ బూర్వమం దీక్రిందిపద్యములు రెండును బ - ప్రతిలోఁ గనుపడుచున్నవి.
    (1) పరఁగిన విమలయశోభా
    సురనిరతుఁడు భీమనాగ్రసుతుఁ డఖిలకళా
    పరిణతుఁ డయ్యెను భూసుర
    వరుఁడు ప్రపాదోదితధ్రువశ్రీయుతుఁడై.
    (2) అసమానదానరవితన
    యసమానోన్నతుఁఢు యాచకాభరణుఁడు ప్రా
    ణసమానమిత్రుఁ డీకృతి
    కి సహాయుఁడుగా నుదాత్తకీర్తి ప్రీతిన్.
  4. ద-లో ‘మల్లియ’ కు బదులుగా నన్నిచోట్ల ‘మల్లయ’ యని యున్నది.
  5. జ- దాను
  6. జ - లం, బరచీకుగుఱ్ఱమును వడి
    డ - న, బ్బుర నెక్కి గుడ్డిగుఱ్ఱము
    ద - చెప్పఁదివిరెడుకవి ద, బ్బఱచీఁకటిగుఱ్ఱమునున్.
    శబ్దరత్నాకరమందు. దివురు నతఁడు ద, బ్బఱచీకుచీకు గుఱ్ఱముఁ, బఱపినగతి
  7. పోల్చి చూడుఁడు.
    ఛందమ నఱియదె కవితెయ
    దందు గదొళ్ తొళలినుళివకుకవియె కురుడం
    ముందెకవల్వట్టెయిర
    ల్కందుమణంపదమనిడలదేంగెయ్దపనో. (కర్ణాటచ్ఛందో౽౦బుధి.)
  8. ద - కవికిన్ జదువు
    బ - తివిరెడువానికిఁ జదువు
  9. జ - మతివగపున. మఱికొన్ని ప్రతులలో 'మతిపగనక'.
  10. జ - అమరంగా నొక్కొక కా, వ్యము. బ - అమరంగ విభులచేఁ ద - అమరంగా నొక్కొకక, బ్బము.
  11. బ - సత్కావ్యమునం బడయంగ రాని వస్తువు గలదే?
  12. ఈపద్యము ట - గ - లలో లేదు.
  13. ద - క్రమములకును.
  14. క - సభలన్
  15. ఈ పద్యము ప - జ - డ - లలో మాత్ర మున్నది.
  16. ప - డ - బెడ్ద.
  17. జ - దెలుపు.
  18. ద - పాదంబులలో.
  19. చ - గలిగినన్, ప - చెప్పిసన్ , ద - ప్రావడులఁ జెప్పినన్.
  20. ద - నోలిని జాతు లుసజాతు. బ - నోలిన వృత్తమును జాతియును ననఁ గృతులన్.
  21. ద - రమణీయ.
  22. ద - సమక నిబద్ధమ్ము లగుచు జరుగున్ దగుక , బ్బములందు నెన్నఁగా నొ.
  23. డ - నొ, క్కొమాత్ర లఘు వై ద్విమాత్ర గురు వై నెగడున్.
  24. చ - ట - చేర్చికొన. జ - ద - చేసికొన.
  25. చ - గ - లలో లేదు.
  26. ప - మె త్తుచి, తాచారుల కనిన మొదలియవి.
  27. ద - మె నయు.
  28. ట - జ - లలో నీ పద్యము " నీచిత్తంబున ?" పద్యముకంటెఁ బైగా నున్నది. బ - ప్రతిలో “ గురువులు నిడుదలు " పద్యముకంటెఁ బైగా నున్నది.
  29. ట - రేఖాకార మగుచుఁ జెలు వలరినవ్రాల్ జ - రేఖాకార మగుచుఁ జెలు పడరినవ్రాల్.
  30. ద - నిభ మగును వ్రాయ.
  31. డ - ర త లన, మనుచుండును నీగణాళి. ఈపద్యంబునకు ముందు వెనుకల నీక్రిందిపద్యములు బ-ప్రతిలోఁ గనుపట్టుచున్నవి.(1)ద్విత్రిచతుర్గురుభవములు, ధాత్రిని రెండేసి దక్కఁ, దక్కినగణముల్, మితేంద్రచంద్రు లనఁదగు, మాత్రాదిగణంబు మొదల మాత్ర లిడంగన్. (2) మొదట నడుమ నుదుద గురు వొదవె నేని, 'భజస' లగు నట్లు లఘువును బరఁగె నేని, 'యరత' లగు నట్లు మూఁడేసిగురువు లున్న, లఘువులున్న సు మరణంబు నగణ మగును. (శ్లో. ఆదిమధ్యావసా నేషు యరతాయాంతి లాఘవమ్, భజసా గౌరవం యాంతి మనౌతు గురులాఘవౌ'. అను దీనికిఁ బై పద్యము తెలుఁగు.)
  32. ఈపద్యమునకు ముందు చ - ట - జ - లలో, "చంద్రవహ్ని సూర్యచుక్షుఁ డౌరుద్రుని, మూఁడుకన్నులందు మూఁడుగురువు, లుదయమయ్యె దాన నొప్పారె మగణంబు, నందుసప్త గణము లలగఁబుట్టె" అను పద్య మున్నది.
  33. జ-విరచితముగ నంత్యగురువు విను సగణ మవున్ .
  34. ల - ప్రతిలో దీనికిబదులు గా , నగణంబు మూఁడులఘువులు, యగణంబున, కాది లఘువు య మతన యనిభా! రగణంబు మధ్యలఘు వగుఁ, దగణంబున కంత్య లఘువు దానవినోదీ! అనియున్నది.
  35. ద - లఘువాదినినుండె నేని.
  36. (అయ్యె నేని, ఆధ్యాహార్యము).
  37. ప - జ - లలో లేదు.
  38. ట - త - ద - జ - లలో లేదు.
  39. ప - లక్ష్యము గొనఁగా.
  40. క - డ - ద - లలో మాత్ర మున్నది
  41. ద - క్షరమును.
  42. ద - రెట్టిగా.
  43. క - డ - ద - లలో మాత్ర మున్నది. ప - లో నీ పద్యమునకు బదులుగా, భరతనగనలసలంబులు, సురపతినామములు నహలు సూర్యుని పేళ్లౌ, గురుముఖ లఘుముఖ చతుర , క్షరపంచాక్షరము లిందుసంజ్ఞలఁ బరఁగున్. అని యున్నది.
  44. క - ఉరుతరసత్కీర్తి హార యున్నతచరితా!
  45. ఈపద్యమునకు ముందు చ - జ - లలో నీక్రింది పద్యములు రెండును గలవు. (1) చను మగణము శ్రీనాథా, యనిన ముకుందా యనంగయ గణమురగణం,బన నొప్పుమాధవా యనఁ జనునోవరదా యనంగ సగణం బగుచున్ (2) కగణము శ్రీకృష్ణయనఁగ, నగుజగణంబును మురారియనఁగా జగతిన్ , భగణము శ్రీపతి యనఁగా, నగణం బగు నృహరి యనఁగ నలినదళాక్ష! ఇందు మొదటిపద్యము అనంతుని ఛందమునందును గలడు. జైనుఁడగుకవి విష్ణుప్రతిపాదకము లగుపద్యముల రచించుట యసంభవము . కనుక యీపద్యములు ప్రక్షిప్తము లని యూహింపఁ దగును.
  46. ట - నభములు నధిదైవతములు నవ్యగుణాఢ్యా! డ - నభములు నధిపతులు రేచ! నయతత్త్వనిధీ ! ద - బుధజనస్తుతచరితా!
  47. ట- జ -లలో మాత్ర మున్నది.
  48. ట - జ - దారతను మభజసనయ రత గణంబులకున్ .
  49. ద - ధర బుధ శశి రవి కుజ గరు.
  50. క - తగణము యగణము రగణము, జగణము నృపజాతి యంత్యజము సగణంబౌ. జ - నగణయగణములు రగణము, జగణము నృపజాతి యంత్యజంబులుసతలున్ . ద - నగణ తగణములు యరలున్ , జగణము నృపజాతి యంత్యజము సగణం బౌ.
  51. ద - కశ్య.
  52. గౌతమాంగిరాఖ్య కణ్వు లనెడి - మఱియొకపాఠము గలదు.
  53. ద - లన్నిటికిని.
  54. ద - వాని.
  55. క - ట - ద - భగణము సగణము తగణము, నగణంబును దేవగణము నరునిగణంబుల్, జగణము యగణము లయ్యెను, మగణంబును రగణ మొప్పు మఱి రాక్షసముల్.
  56. వర.
  57. ద - చాపాజమకర.
  58. ప - నీల.
  59. స - లో మాత్ర మున్నది.
  60. తెగిచంపు.
  61. ఇది మొదలు "రాజున కాదిన్" అను పద్యము వఱకుఁ గలపద్యములు క - ద - లలో మాత్ర మున్నవి.
  62. ద - యగణాదిగఁ జెప్పు.
  63. ద - బద్యాళి.
  64. ద - చెట్ట రయమున వచ్చున్.
  65. ద-నలమట.
  66. ద-నొదవు.
  67. ద - చెటు.
  68. నిచ్చున్ , పాఠాంతరము.
  69. ద - గ
  70. ద - నేలన్.
  71. ద - గర్తృ.
  72. ద - నను.
  73. ప - కనుమానము లేదు దీనినంటకు రేచా!
  74. ఇందు , అగ్ని, భగ్నశబ్దములకు, ఆగిని నము ననుతద్భవములు కనుపడుచున్నవి.
  75. ద - గడ.
  76. ద - యె
  77. ద - ఁదెగి.
  78. చెప్పిన.
  79. క - ద - బాగుగ యగణము గదిసిన, నాగణము సమస్తమంగళావాప్తం బై.
  80. చ - పరుసము.
  81. ప - లో మాత్ర మున్నది.
  82. మొదటిపాదములోని వ్యంజనములపయి దీర్ఘస్వరము బుచ్చారణసౌకర్యార్థమని యెఱుంగునది. ఇట్టి యుచ్చారణము లోక వ్యవహారమునందును గలదు. ఈ పద్యమునందు, సఫలకుఁ బ్రాసము విధింపఁ
    బడినది.
  83. గ - లోమాత్ర మున్నది.


    ప - మగణము నగణముఁ బురుషులు

          జగణరగణసగణముల్ నిజంబుగ నింతుల్

          యగణము తగణము భగణము

          నగును నపుంసకము లుత్తమాదిఫలంబుల్ .

  84. గ - ఆదులు పదియా ఱనఁగాఁ, గాదులు తా మిఱువదేను (గాఁగన్ ) బరఁగున్ , యాదులు తొమ్మిది యనఁగా, నీదెస నక్షరము లనురు నేఁబది యనఁగన్. అం, అః, అనుస్వరములకు రుద్రుఁ డధిదేవత. సమదైవత్వము కలదు గనుక అః అను విసర్గాక్షరమును విడిచిన ఆదులు 15, కాదులు 25, కకార, షకార సంయుక్తం బయి భిన్న దైవత్వంబును బ్రత్యేకఫలదంబు నగుటం జేసి క్షతోఁగూడ యాదులు 10. అంతు 50 అక్షరములు.
  85. క - ప -జ - ద లలో నున్నది.
  86. ద - లైదును నవలివి యైదు నిలిపి.
  87. ద-వర్గములు.
  88. ప - జ - పొందుగా నొండొంటి క్రిందఁ బోవఁగ నిల్వ. ద-నిల్చినందులోన
  89. ప - జ - ధరణి బీజంబు లగు వాని దాపువ్రాలు, వారి బీజంబు లాతరువాతిలిపులు.
  90. ప - జ - వాని ఫలములు తెలియంగ వలయు రేచ.
  91. క - ప - జ సంపదన్ .
  92. ప - జ నెపుడుం బద్యాది నొందించినన్. ద - మొదలం బద్యాది నొందించినన్ . ఈపాఠంబు సమంజసముగా లేదు. ఈ పద్యమునకుఁ దరువాత , ప - జ - ల లో :- "పరఁగఁగ అ ఆ వీలును, వరుసఁ గ చ ట తపయషలు ధ్రువంబుగఁ బదియున్, దరఁ బవనబీజములు గో, పరవాహన దహన వసుధ వన నభము లగున్." అనుపద్య మున్నది. ప - లో నీపద్యమునకుఁ బిదప "ఇది శ్రీకవిజనాశ్రయచ్ఛందంబునందు సంజ్ఞాధికారము సంపూర్ణము. ఇఁక వళ్లు” అని యున్నది. మఱియు జ - లో నీస్థలమున నక్షరఫలములఁ గూర్చిన పద్యములు కలవు .
  93. చ - డ లలో నున్నది. క - ద-ప్రతులలో -గీ. విరతి విశ్రమ విశ్రాంతి విరమ విరమ, ణాభిధాన విరామము లనెడి పేళ్లు, యతికిఁ బర్యాయ పదములై యమరుఁ గృతిని, యుక్తపదములఁ గృతులయం దునుపవలయు.-- అనియు, ప -ప్రతిలో -గీ . విరతి విశ్రమ విశ్రాంతి విరమణయతు , లనఁగఁ బర్యాయ శబ్దంబు లగుచు నుండు, యతుల కొప్పగునక్షర తతుల నెల్లఁ , గృతుల నిలుపఁగ రేచన కీర్తి గలుగు. - అనియునున్నది.
  94. క - ప - ద - ల - లో నున్నది. చ - డ - ప్రతులలో, క. విలసత్పాదాద్యక్షర, ములు వళ్లగు
    నాద్వితీయములు ప్రావళ్లు, న్నెలకొని తమ తమ పాదం, బుల యతిపై నన్ని పాదములఁ బ్రా లమరున్. అని యున్నది.
  95. క - ప - ద - లలో నున్నది.
  96. బరువడి.
  97. ప - సరసమనన్ బ - సరసలు నాఁ బదియు వళ్లు చను నిద్ధాత్రిన్ . వ. స్వరయతి, వర్గయతి, అఖండయతి, ప్రాది బిందు ఫ్లుతములు, ప్రయుక్తాక్షరయతి, ఎక్కటి, పోలిక , సరసయతి, ఈపదియును యతుల పేళ్లు.
  98. క - ప - డ - ద-లలో నున్నది - ఈపద్యంబున - అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఒ ఓ -అనుచోట్ల ద్వితీయాక్షరములు ద్విత్వాక్షరములవలె నుచ్చరింపఁబడును గావున వానిముం దున్న హ్రస్వాక్షరములు గురువులుగాఁ బ్రయోగింపఁబడిన వని యూహించునది. మఱియు నిందుఁ
    గేవలస్వరములకుఁ బ్రాసము విధించుట విశేషము .
  99. ద - నుఊలొడఁబడి తమలో.
  100. క - డ - ద - లలో నున్నది.
  101. క - ప - డ - ద - లలో నున్నది.
  102. నాలుగింటను.
  103. క - ప - ద - లలో నున్నది.
  104. సమంచిత మై.
  105. ద - బ - వచ్చు.
  106. ద - పూని యఖండనామ యతి పొల్పగు.
  107. ద - ప్రణీత మై.
  108. ద - చయమునకు.
  109. డ - ప్రపరిదురన్వ వసంప్రతి, నిపరాసూదత్యుపాధినిరపాభివ్యా, ఞ్ఞపులనఁ బ్రాదులవళ్లకు , నుపరిస్వరయుక్తమైన నుంచంజెల్లున్.
  110. బ - దీనికి బదులుగా, క. పంచకవర్గాక్షరములు, పంచమవర్ణములఁ గూడి పరఁగఁగ నిలుచున్ , వంచింపఁగఁ బెఱనాలుగు, సంచితముగఁ బిఱుఁద సున్నలంటిన చోటన్.
  111. ప - దివిజవంశం బనంగ.
  112. ద - లో నీ పద్యమునకు ముందు , క . ప్లుత మనఁబరఁగుఁ ద్రిమాత్రా, న్వితవర్ణము దానిమీఁద వితతస్వరముల్ , కృతిపై యక్షరమునఁ జనుఁ, జతురాననచతుర (యతులు) వళ్లు చక్కటిఁ జెల్లున్. అను పద్య మున్నది.
  113. ద - ములు తుదిన్.
  114. ద - జేరువతో
  115. ద - తో రూఢిన్ బ్లుతమువడి యెదుర్కొని నిలుచున్ ప - లో నీ పద్యమునకు లక్ష్యముగా 'ఏజనకాత్మజన్' అను భాస్కరరామయణపద్య ముదాహరింపఁబడినది.
  116. ద - క. వెలయఁగ సంయుక్తాక్షర , ములలో నెద్ది యును జనును మునుకొని వడిగా, నిలుపం దగుఁ బాదంబుల, నలఘుపరాక్రముఁడ రేచ యసదృశ విభవా. గీ. పాదముల నాది జడ్డ లైపరఁగుచున్న , వళ్లరెండక్షరంబుల వలసినదియు, నిలుపఁదగు వళ్లపట్టున నిశ్చలాత్మ, బుధజనప్రియ కవిరాజభూషణాంక.
  117. ద - యరమరవలవదు. బ - మరవన లను నీయే నక్కర.
  118. ద - మునమెత్తు రనన్.
  119. ప - ద - లలో మాత్ర మున్నది.
  120. ద - నయసన్నుతవళ్లు, ఈపైని వివరింపఁబడిన యతులు గాక - క - లో
  121. అభేదయతి.
  122. క - డ - లలో మాత్ర మున్నది.
  123. వృద్ధియతి.
  124. ఆదేశయతి యను మూఁడును - ప - లో నివిగాక.
  125. నిత్యసమాసయతి.
  126. కాకుస్వరయతి.
  127. హశవర్ణ యతి.
  128. ప్రాసయతి యును నీయేడుయతులు నధికముగా వివరింపఁబడినవి. ఇవి ప్రక్షిప్తములని యె ఱుంగునది. మఱియును, పదివళ్లను వాని లక్ష్యములను జెప్పుచు రామస్తుతి గా నున్న భీమనచాటు వని కవిజీవితములో నీ క్రిందిపద్యము కనఁబడుచున్నది. సీ. అబ్జగర్భశివ 'స్వరా' థ్యపూజ్యపదాబ్జ కమలాక్ష మౌని 'వర్గ' ప్రసన్న, వైభ 'వాఖండ' దేవాదిదేవ కృపాబ్ధి యఖిలదిక్పాలక 'ప్రాది ' నిలయ. నుత పుణ్యహాస 'బిందు' యుతాసనాంభోజ యతిదయా 'ప్లుత' నిజాత్మా మహాత్మ, స్వచ్ఛపౌరుషకీర్తి 'సంయుక్త' సంచార మహిమ 'నెక్కటి' యైన మాన్యచరిత. గీ. పోల్పనీ 'పోలిక'కు దైవములు ను గలరె, 'సరస' నుతిపాత్ర భక్తరంజన చరిత్ర, 'ప్రాస' నిర్భిన్న చండతరాసురేంద్ర, యలఘు యతిగణ్య రఘురామ యఘవిరామ.
  129. ప - రేచా.
  130. ఈ వచనము ద - లో లేదు.
  131. ద- వణిజ.
  132. ద - నయవినయ
  133. దానమనోహారమగు.
  134. ద-రిత్రత్రిదశవరపర ధరిత్రీసుతస.
  135. ద - విభవ రేచ.
  136. ద-ప్రాస మిది యహ.
  137. ఇంతవఱకుఁ బ్రాసములను గూర్చిన పద్యములు క-డ-ద-బ-లలో మాత్ర మున్నవి.
  138. ఈవచనమును దీనిపిదప వచ్చుపద్యములు మూఁడును క-డ-ద-లలో మాత్ర మున్నవి. ఈపద్యములు విన్నకోట పెద్దన్న కావ్యాలంకార చూడామణియందుఁ గూడ గన్పట్టు చున్నవి. కావున నిందుఁ బ్రక్షిప్తము లైనవేమో యని సంశయింపఁదగి యున్నది.
  139. ద-ములు మఱియును నిట్టివర్ణములు.
  140. ద-పాదకా.
  141. ద-డయ్యనలా.
  142. ప-ఇతి.
  143. ద-వాగీంద్ర.
  144. స-ఇతి, కవిజనాశ్రయ చ్ఛందంబునందు యతిచ్ఛందో౽ధికారము సంపూర్ణము. డ-లో, సంజ్ఞాధికారమునకు బదులుగా యతిచ్ఛందో౽ధికార మని యున్న ది. బ-లో, ప్రథమాశ్వాస మని యున్నది.