కవిజనాశ్రయము/పీఠిక

వికీసోర్స్ నుండి

పీఠిక.

గ్రంథప్రయోజనము.

కవిజనాశ్రయ మనునది యీగ్రంథమునకు గ్రంథకర్త యిడిన పేరు. లోకములో దీనికి సర్వసాధారణముగా భీమన ఛంద స్సను వాడుక కలదు. దీనికిఁ గారణము ముందు దెలియఁ దగును. ఈ గ్రంథములోని పద్యములు కొన్ని సులక్షణ సారమునందుఁ జేరియున్నవి, గాని, కవిజనాశ్రయ మింతవఱకు నెచ్చటను సమగ్రముగ ముద్రింపింపఁబడి యుండలేదు. ఆంధ్రచ్ఛందోలక్షణము సవిస్తరముగ నెఱుంగఁగోరువారల కప్పకవీయమునకు మించినగ్రంథము లేదని చెప్పవచ్చును, గాని, యది పెద్దది యగుటచేత ఛందోలక్షణము సంక్షేపముగ గహింపవలయు ననువారికిఁ గవిజనాశ్రయ ముపయోగపడిన ట్లది యుపయోగపడదు. మఱియును, గవిజనాశ్రయ మాంధ్రచ్ఛందో గ్రంథములందెల్లఁ భ్రాచీనతమమయిన ట్లగపడుచున్నది, కావున, ఛందోలక్షణము కాలక్రమమున నెట్లుమాఱినదియుఁ దెలియఁగోరు విద్వాంసులకు మిక్కిలి యుపకరించును.

పాఠనిర్ణయము.

ఈక్రింది వివరింపఁబడు పది వ్రాఁతపుస్తకముల శోధించి యీగ్రంథపాఠము నిర్ణయింపఁబడినది. అవి యేవియన — క . “ చిదంబరము పుస్తకము” అనుపేరుతో నున్నది. ఈప్రతి దోషాధికారాంతమును బూర్తిగ నున్నది. దానిపిదప ఛందోవిషయమైన సీసమాలిక గలదు. అది కవిజనాశ్రయములోఁ జేరినది కాదు. ప్రతి యంతప్రాఁతదికాదు. అచ్చటచ్చటఁ దప్పులుకలవు. మొత్తముమీఁద మంచి ప్రతి. ఇది పరిషత్పుస్తక భాండాగారమం దున్నది.

చ. పరిషత్సంఖ్య 3. ఈ సంపుటములో మొదట నాంధ్ర కౌముదియుఁ, బిదపఁ గవిజనాశ్రయమును గలవు. అంత మంచిప్రతి కాదు. అసంపూర్ణము. వేంకటేశయ్యగా రిచ్చినది.

ట. పరిషత్సంఖ్య 31. ఈసంపుటములో లక్షణశిరోమణియును గవిజనాశ్రయమును గలవు. కవిజనాశ్రయము లయవిభాతిలక్షణమువఱకు నున్నది. అంత మంచిప్రతి కాదు. .

త. పరిషత్సంఖ్య 34. ఈ సంపుటములో 1 కవిజనాశ్రయము, 2 ఆంధ్ర భాషాభూషణము, 3 కవిజనాశ్రయఘు, 4 అంగజవిజయమును గలవు. అసంపూర్ణము.

స. పరిషత్సంఖ్య 65. అక్కరలవఱకు మాత్ర మున్న ది. మంచిప్రతి. పుదుకోట రత్నసామయ్య బి ఏ. గారిచ్చినది. గ. పరిషత్సంఖ్య 164. ఈ సంపుటములో 1 ఆనందరం గరాట్ఛందము, 2 కవిజనాశ్రయము, 3 నానార్థ నిఘంటువు గలవు. కవిజనాశ్రయము మంగళ మహాశ్రీవృత్తమువఱకు నున్నది.

జ. పరిషత్సంఖ్య 257. ఈసంపుటములో నరసభూపాలీయము, కవిజనాశ్రయము నున్నవి. మిక్కిలి ప్రాఁతప్రతి. మత్తకోకిలవఱకు నున్నది. ఈగ్రంథము భీమకవిరచించినట్లున్న యవతారిక యీప్రతియందు మాత్రమే యున్నది. తొట్టియం బాలసుబ్రహ్మణ్యముగా రిచ్చినది.

డ. పరిషత్సంఖ్య 391. ఈపుస్తకములో 1 ఆంధ్రనామ సంగ్రహము. 2. ఆంధ్రభాషాభూషణము, 3. కవిజనాశ్రయము, 4 అనంతునిఛందస్సు, 5 దేశి తెనుఁగుమఱుఁగులు, 6 నానార్థనిఘంటువు, 7 రేఫఱకారనిర్ణయము, 8 కవిచింతామణి యను గ్రంథము లున్నవి. కవిజనాశ్రయ మసంపూర్తిగా నున్నది. వృత్తపాదములకుఁ బ్రస్తారక్రమము చూపఁబడినది.

ద. సి. పి. బ్రౌనుగారు వ్రాయించిన కాగితపుఁబ్రతి. దొరతనమువారి ప్రాచ్యలిఖితపుస్తకభాండాగారము లో నున్నది. అసంపూర్ణము. ఈ ప్రతి బ్రౌనుగారి యొద్దనుండిన పండితులచే సంస్కరింపఁబడియున్నది. బ. పరిషత్సంఖ్య 320. సమగ్రము. పిళ్లపాళియం సుబ్రహ్మణ్యముగా రిచ్చినది.

ఈ ప్రతులలోఁ దొమ్మిది తాటియాకులమీఁద వ్రాయఁబడినవి. వీనిలో ననేకములు ద్రవిడదేశమున దొరకినవి. పరిషత్పుస్తకభాండాగారమునం దున్నవి. ద. యనునది కాగితపుఁ బుస్తకము. సి. పి. బ్రౌనుమహాశయుని యాజ్ఞానుసారముగాఁ బరిష్కరింపఁబడిన ట్లగపడుచున్నది. కాని, కొన్నిస్థలములయందుఁ బరిష్కర్తలు సంప్రదాయముతెలియక యొప్పులఁ దప్పులుగా దిద్దినారు. పైప్రతులలోఁ గొన్ని యసమగ్రములు. కొన్ని సమగ్రములు. వ్రాఁతతప్పు లన్నిటియందును గలవు, ఇది లేఖక ప్రమాదజనితమా, లేక కవి ప్రయుక్తమాయని నిర్ణయించుట కష్టమని తోఁచుపట్టు లచ్చటచ్చట నున్నవి. కవ్యుద్దేశమునకు భంగము కలుగకుండ వ్రాఁతతప్పులను మాత్రమె దిద్దవలయు నను సంకల్పముతో నాబుద్ధికిఁ దోఁచినట్లు సవరణలు చేసినాఁడను. పాఠభేదము లున్నచో నాయాపుటలయం దడుగునఁ జూపినాఁడను. కొన్నిపద్యములు కొన్నిప్రతులయందుమాత్రమే యున్న యెడల నవి యేప్రతులందున్నవో సూచించినాఁడ. అన్య గ్రంథములనుండి తెచ్చి యిందుఁ గలిపినపద్యములఁ బరిహరించినాఁడ. ప్రక్షిప్తము లని తోఁచిన పద్యముల ననుబంధముగాఁ గూర్చినాఁడ. కన్నడ ఛందమునకును దెలుఁగుఛందమునకును గలసామ్యము లచ్చటచ్చటఁ గనఁబఱిచినాఁడ. ఇవి జాత్యధికారమునం దధికముగా నున్నవి. వ్రాఁతపుస్తకములు శోధించుట లో పోతుకుచ్చి వేంకటసుబ్రహణ్యము ఎం. ఏ. గారును, ముద్రణకాలమందుఁ దప్పులు దిద్దుటలో మల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారును సాహాయ్య మొనరించిరి, గాన, వారికి వందనము లర్పించుచున్నాఁడను.

- గ్రంథకర్తృనిర్ణయము. -

ఈ గ్రంథమునకుఁ గర్త యెవ్వఁడో, యిదియెప్పుడు పుట్టినదో నిర్ణయింపవలసి యున్నది. కవిజనాశ్రయుఁడు మల్లియ రేచసుకవి' యీగ్రంథమును రచించినట్లు గ్రంథమునం గవి ప్రతిజ్ఞలో నున్నది; కాని, "జ" యను ప్రతిలోఁ గల యవతారికలో, రేచన రచియించినట్లుగ వేములవాడ భీమకవి యీగ్రంథమును రచించిన ట్లున్నది. ఈయవతారిక యొక్క ప్రతిలోమాత్ర ముండుటచేఁ బ్రక్షిప్త మని తోఁపవచ్చును, గాని, కవితా వైఖరినిబట్టి చూడ నది ప్రక్షిప్తము కాదనియే నానమ్మకము. దీని కనుగుణముగా లోకమందెల్లెడల నీగ్రంథము వేములవాడ భీమకవికృత మనియే ప్రతీతికలదు. అప్పకవ్యాది లాక్షణికుల మతముకూడ నిదియే. అనేకము లగువ్రాఁతపుస్తకముల యట్టలమీఁద "భీమనఛందస్సు" అని వ్రాయఁబడి యున్నది. "అనవద్య కావ్యలక్ష” ణేత్యాదిపద్యమునకుఁ బూర్వము "బ" ప్రతిలో నీక్రిందిపద్యములు రెండున్నవి.

1. పరఁగిన విమలయశోభా
   సురనిరతుఁడు భీమనాగ్రసుతుఁ డఖిలకళా
   పరిణతుఁ డయ్యెను భూసుర
   వరుఁడు ప్రసాదోదితధ్రువశ్రీయుతుఁ డై.

2. అసమాన దాన రవితన
   యసమానోన్నతుఁడు యాచకాభరణుఁడు ప్రa
   ణసమానమిత్రుఁ డీకృతి
   కి సహాయుఁడుగా నుదాత్తకీర్తి ప్రీతిన్ .

ఈపద్యము లనన్వయముగా నుండుటచేత నందుఁ బేర్కొనఁబడిన భీమునకును గ్రంథమునకును గలసంబంధ మిట్టిదని నిర్ణయింప వలను గాక యున్నది.

కాకతీయ ప్రతాపరుద్రుని కాలమున వర్ధమానపురము నేలిన భీ రాజు తమ్ముఁ డైనగోకర్ణుఁ డీగ్రంథమును రచించి కల్యాణపురాధీశ్వరుఁ డైనజగదేకమల్లుని సేనాపతి యగురేచ భూపాలున కంకితము చేసె ననియు, వేములవాడ భీమకవిరచించినది నృసింహపురాణము, గాని, కవిజనాశ్రయము కాదనియు “ఆంధ్రులచరిత్ర"[1] మందు, చిలుకూరి వీరభద్రరావుగారు వ్రాసిరి; కాని, యావ్రాఁత కాధారము లేవియుఁ గనఁబఱిచి యుండలేదు. గ్రంథము రేచనకృత మని యొక్కటియు, భీమకవి కృత మని యొక్కటియు లోకమున రెండు ప్రతీతు లుండ నీ రెంటికి భిన్నముగ మూఁడవత్రోవఁ ద్రొక్కిన వీరభద్రరావుగా రందుకుఁ బ్రమాణ మేమియుఁ గనఁబఱుపకయుండుట వింతగా నున్నది. నిరాధార మగు నీ సిద్ధాంతమును ఖండింపఁ బూనుట యనావశ్యకము గావున గ్రంథము భీమకవి కృతమే యనులోక ప్రతీతి ననుసరింతము.

-: రేచన విషయము :-

రేచన భీమన లెవ్వరో యేకాలమం దేదేశమం దుండిరో నిర్ణయింపవలసి యున్నది.

క. వేములవాడను వెలసిన
   భీమేశ్వరకరుణగల్గు భీమనుకవి నేఁ
   గోమటిరేచనమీఁదను
   నీమహిఁ గవులెన్న ఛంద మెలమి రచింతున్.

అను నవతారికాపద్యముం బట్టియు, దండకవృత్తలక్ష్యములోని "వణిగ్వంశచూడామణీ” యను సంబోధనముం బట్టియు రేచన వైశ్యుఁ డనియు, శ్రావకాభరణాంకుఁడును, వాదీంద్ర చూడామణి శిష్యుడును, "జినమతహితుడు” (పుట 37, పద్యము 45) నని యుండుటచే జైనుఁ డనియుఁ దెలియుచున్నది. మఱియు నితఁడు ధనికుఁ డనియుఁ, గవుల కాశ్రయుఁడనియుఁ గూడ నీగ్రంథమువలననే తెలియవచ్చుచున్నది. కాని యంతకంటె నధికముగా నతనింగూర్చి తెలిసికొనుట కాధారములు లభింపలేదు.

-: వేములవాడ భీమకవి జన్మభూమి నిర్ణయము. :-

భీమకవి గోదావరీమండలమందు కాకినాడకు సమీపమందున్న వేములవాడలో జన్మించె ననియు, వేములవాడ కామడదూరములో నున్న దాక్షారామగ్రామమున వెలసియున్న భీమేశ్వర ప్రసాదమున జన్మించుటచే భీమన యను నామ మతనికిఁ గలిగిన దనియు లోకములో నొక ప్రతీతి గల దు. గురుజాడ శ్రీరామమూర్తిగారును, రావుబహదరు కందుకూరి వీరేశలింగము పంతులుగారును దాము రచియించిన కవిజీవితములలో నీప్రతీతినే యవిమర్శముగా గ్రహించినారు. దీనికి బలముగా

మ. ఘనుఁడ న్వేములవాడవంశ జుఁడ దాక్షారామభీ మేశనం
     దనుఁడన్ దివ్యవిషామృతప్రకటసా నా కావ్యధుర్యుండ భీ
     మననా పేరు వినంగఁ జెప్పితిఁ గళింగాధీశ కస్తూరికా
     ఘనసారాదిసుగంధవస్తువులు వేగందెచ్చి లాలింపురా.

అను చాటుపద్య ముదాహరింపఁబడినది. కాని, భీమకవి గోదావరీమండలములోని వాఁడు కాఁ డనియు, గోలకొండదేశములోని వేములవాడగ్రామమునకు సంబంధించినవాఁ డనియు నా యభిప్రాయము. ఈ వేములవాడ పూర్వము వెలిగందలజిల్లా యనియు నిప్పుడు కరీంనగరం జిల్లాయనియుఁ బేర్కనిన మండలమందున్నది. దీనికి లేములవాడ యనియు, లేమలవాడయనియు నామాంతరములు గలవు. ఆగ్రామమందున్న కొన్ని శాసనములలో "లేమ్బలవాడ” యనుపేరు గనఁబడుచున్నది. " లేమ్బల” క్రమముగా లేమల, లేముల, వేముల యయి యుండవచ్చును. ఈ గ్రామమున కరకోసు దూరములో నామపల్లి యను నొక యూరు గలదు. నామపల్లియు వేములవాడయుఁ గలిసి పూర్వ మొక పెద్దపట్టనముగా నుండె ననియు, నచట రాజరా జను రాజు రాజ్యముచేసెననియు, నా కాలమునందువేములవాడలో లేమలు (భోగస్త్రీలు) నివసించుటచే నాగ్రామమునకు లేమల వాడయను పేరు గలిగిన దనియు వేములవాడ ప్రాంతమందుఁ బ్రబలమైన వాడుక గలదు. రాజరాజేశ్వరుఁడను రా జీదేశము నేలినట్లు శాసనప్రమాణముకూడఁ గలదు.[2]

పూర్వోదాహృతావతారికాపద్యములో భీమన కిష్టదైవమైనభీమేశ్వరుఁడు 'వేములవాడను వెలసిన' ట్లున్నది, గాని, దాక్షారామములోనిదేవుఁడనిలేదు. వెలిగందల వేములవాడలో భీమేశ్వరుని యాలయ మొకటి గొప్పది యున్నది. భీమకవి యా యూరివాఁడే యైన ట్లాప్రాంతమందు దృఢమైన ప్రతీతి యున్నది. ఈ వషయముం గూర్చి యాగ్రామమందలి తగుమనుష్యులు కొందఱు

"వేములవాడ భీమకవి యీ గ్రామనివాసి యని యీ గ్రామములో పరంపరా చెప్పుకొను వాడుక గలదు.”

"భీమకవి యీగ్రామంలో జన్మించి ప్రబుద్ధుడై ప్రాగ్దేశమందు కళింగరాజు వుండే గ్రామమునకు పోయినట్టు వినుకరి వుంన్నది.”

“ఆ భీమకవి వైదీకుడే. పూర్వమందు మాకు వార్కి సంబంధంబులు వుండెనని చెప్పంగ విని వుంన్నాము."

అనివ్రాసి, భీమకవి శాపముచే నన్నము సున్నము , పప్పలు కప్పలు నయ్యె నను కథ నుదాహరించి"యేయింటిలోపల ప్రయోజనం అనగా అంన్న సంతర్పణ అయివుండెనో ఆయింటివారు నాటనుంచి అప్పాల (పప్పల) వారని పేరుగలవారై యున్నారు. అంతకుముందు వీరియింటిపేరు కొండపలక అని వుండెను. ఆవంశం పరంపరా యిదివరకు జరుగుతు వుంన్నది.”

అని వ్రాసినారు. మఱియు, భీమన యిష్టదైవ మయిన భీమేశ్వరుని గూర్చి వారే యిట్లు చెప్పుచున్నారు.

“వేములవాడలో భీమాలయము మహాదండిది కలదు. రాజేశ్వరమహాత్మ్యములోపల యా రాజేశ్వరుణ్నిన్ని భీమేశ్వరుడని చెప్పి వున్నది. ఆలయము మిక్కిలి విశాలమైనది. లింగము మిక్కిలి గొప్పది. ఇటువంటి దేవాలయ నిర్మాణము యెక్కడ లేదు. జై నవిగ్రహములు భీమేశ్వరాలయములో లేవు, అచ్చటి కోనేరును యేబది సంవత్సరముల కింద పూడ్చి వేసినారు. ఆ కోనేరుయొక్క కణీల తెచ్చి రాజేశ్వరస్వామి సన్నిధియందున్న సరోవరము తంతెలుగా నిర్మాణము చేసిరి. భీమకవినర ప్రదాత యీభీమేశ్వరుడే"[3]

వీరు వ్రాసినదంతయు విశ్వాసపాత్ర మని చెప్పుట కవకాశము లేదు, గాని, భీమకవి యాప్రాంతమువాఁ డనుప్రతీతి యచట నిప్పటికి నున్న దనుట కిది ప్రబలప్రమాణము కాక పోదు. ఈప్రతీతిని దృఢపఱుచుటకు వేఱొకసాధనము గూడఁ గలదు. రేచన జైనకోమటిగదా. పూర్వకాలమందు గోదావరీ మండలమునఁగూడ జైనమతము వ్యాపించి యుండె ననుటకు సందేహములేదు. కాని, భీమకవికాలమం దుండె నని చెప్పుట కాధారములు కనఁబడలేదు. వెలిగందల ప్రాంతదేశమం దిప్పటికిని జైనకోమ ట్లున్నట్లు కనుపట్టుచున్నది. ఈవిషయ మయి వేములవాడ గ్రామస్థులు:-

"యీగ్రామమందు వెన్కటికి జైనమతస్థులు చాలా వుండిరి. ఆ జైనమతస్థాపనా అయిన దేవాలయములు వున్నవి. యెక్క డనగా మూడేపల్లిలో, విలాసవరంలో, కొత్తపల్లిలో, నగనూరిలో మొదలుగాగల గ్రామములలో వున్నవి. యీ గ్రామములు వేములవాడ సమీపగ్రామములు. ఆజైనమతస్థులైన కోమట్లు యిప్పటికి జగత్యాలలో, దోమకొండలో, బిక్కనూరిలో వున్నారు. ఆగ్రామములున్నూ వేములవాడ సమీపంగానే వున్నవి”

అని వ్రాయుచున్నారు.

భీమకవి వెలిగందలవేములవాడగ్రామనివాసి యని యా ప్రాంతమందుఁ బ్రతీతి యుండుటంబట్టియు, గ్రంథావతారికలో భీమన తనయిష్టదైవము వేములవాడ భీమేశ్వరుఁడే యని చెప్పుటంబట్టియు, వెలిగందల వేములవాడలో భీమేశ్వరాలయ ముండుటవలనను, నాఁటికినేఁటికినిగూడ నాప్రాంతమందు జైను లైన కోమట్లుండుట చేతను భీమకవి యాదేశమువాఁడే యనినిర్ణయించుట కాక్షేప ముండఁగూడ దని నాయభిప్రాయము.

"ఘనుఁడ న్వేములవాడవంశ జుఁడ దాక్షారామభీమేశనం
 దనుఁడన్..........................."

అనుచాటుపద్య మీసిద్ధాంతమును బాధించునట్లు స్థూల దృష్టికిఁ దోఁపవచ్చును, గాని, బాధింపదు. ఏల యన, వేములవాడక్షేత్రమాహాత్మ్యములో నాస్థలమునకు దక్షవాటి యను సంజ్ఞకూడఁ గలదు. దీనికిఁ బ్రమాణము.

శ్లో. ఏవం శ్రుత్వావచోదేవా వీరభద్రము ఖేరితం,
    ప్రణేముశ్చ శివౌతత్ర పూజయామాసురుత్తమౌ.
    ఉపయాతౌతతో భూయో మివపశ్ళిఖరంశివౌ,
    జనయామాసతుస్తత్ర శివలింగం సనాతనమ్.
    దక్షవాట్యాం భీమలింగం యత్ర రాజేశ్వగ శ్శివః ,
    అస్య లింగస్య మాహాత్మ్యం దృష్ట్వా సర్వేహవిర్ముఖాః,
    పుపూజు స్సర్వకామైశ్చ వీరభద్రస్యసన్నిధౌ,
    సదేవతౌఘై రపి పూజ్యమానం విలోక్యభీమేశ్వర మప్రమేయం,
    అధోక్షజాద్యైరభినంద్యకామాన్ దదౌ మహాత్మా యివ సద్గుణేభ్యః.

ఇతి శ్రీభవిష్యోత్తరపురాణే రాజేశ్వరమాహాత్మ్యే శివ స్వరూపదర్శనన్నామ చత్వారింశోధ్యాయః,

(అని యున్నది.)

ఈహేతువు లన్నిటింబట్టి భీమకవి వెలిగందలసీమవాఁడు, గాని, గోదావరీమండలమువాఁడు కాఁ డని యూహింపఁ దగియున్నది.

-: భీమక వి కాలనిర్ణయము :-

ఇక భీమకవికాలమును నిర్ణయింపవలయును. పూర్వో దాహృత మగు-

మ. ఘనుఁడ న్వేములవాడ వంశజుఁడ దాక్షారామభీ మేశనం
     దనుఁడన్ దివ్యవిషామృతప్రకటనానాకావ్యధుర్యుండ భీ
     మననా పేరు వినంగఁ జెప్పితిఁ గళింగాధీశ కస్తూరికా
     ఘనసారాదినుగంధవస్తువులు వేగందెచ్చి లాలింపురా.

అనుపద్యము మూఁడవపాదములోఁ గొంచెము పాఠభేదముఁ గల్పించి యదియే ముఖ్యాధారముగా భీమకవి నన్నయ భట్టుకంటెఁ బూర్వుఁడని గురుజాడ శ్రీరామమూర్తిగారును, ఈ పద్యమును మఱికొన్ని పద్యములను నాధారము చేసికొని భీమన పదునాల్గవశతాబ్దమువాఁడని కందుకూరి వీరేశలింగముపంతులుగారును వ్రాసినారు. ఈ రెండుమతములుగూడఁ నసమ్మతములే. శ్రీరామమూర్తిగారి పాఠముప్రకారము పైపద్యములో “భీమన నా పేరు వీనంగఁ జెప్పితి వెలుంగాధీశ” యని యుండవలయును . “వెలుంగాధీశ” యనఁగా "విమలాధీశ” యని యర్థ మఁట ! విమలాధీశుఁ డనఁగా రాజనరేంద్రునితండ్రి యఁట ! 'ఈ హేతువుచే భీమన నన్నయభట్టుకంటెఁ బ్రాచీనుఁ డట ! ఈ వాదమందెన్ని దోషము లున్నవో చూడుఁడు. రాజనరేంద్రునితండ్రి విమ లాదిత్యుఁడు గాని, విమలాధీశుఁడుగాఁడు. విమలాధీశుఁడన విమలాదిత్యుఁ డెట్లగునో తెలియకున్నది. విమలాధీశుఁ డననర్థ మేమి? ఇదియొకదోషము. విమలాధీశునకు వెలుంగాధీశుఁడనుపే రెట్లు కలిగినదో తెలియదు. తెలుంగురాయఁ డనినట్లు వెలుంగురాయఁ డని కాని, వెలుంగురా జని కాని, రూఢనామ మున్నదా? లేదు. విమలశబ్దము విశేషణము. వెలుఁగుశబ్దము విశేష్యము. ఈరెంటికి నర్థములో భేదమున్నది. భీమనవంటిమహాకవి విమలాదిత్యునిసంబోధించు నవసరమున నతనిని సరియైన పేరు పెట్టియే పిలుచునుగాని యిట్లవకతవకగా నేల మార్చును? ఇది రెండన దోషము. వెలుంగాధీశ యనునప్పుడు సంధి యెట్లు కుదిరినది? వెలుంగు + అధీశ, యనికదా పదచ్ఛేదము. సంస్కృతసమాసము చేసినచో "వెలుఁగ్వధీశ" యని కావలయును. "తెలుఁగుసమాసము చేసిన యెడల "వెలుంగధీశ” యగును, “వెలుంగ + అధీశ” యని రెండుపదములు సంబోధనాంతములే యన్నపక్షమున “వెలుంగయధీశ" యని యుండవలెను. "వెలుంగాయధీశ" యని యుండిన నుండవచ్చును. ఏవిధముగాఁ జూచినను "వేలుంగాధీశ”యని కానేరదు. ఇది మూఁడవదోషము. త్రిదోష సహితమయిన యీవాదము శ్రీరామమూర్తిగారిమనస్సున కెట్లువచ్చినదో తెలియకున్నది.

ఈపద్యములో "వెలుంగాధీశ" యనుటకు బదులుగాఁ “దెలుంగాధీశ" యసుపాఠమును జెప్పి, తెలుంగురాయఁ 14 వ శతాబ్దమువాఁడు గావున భీమనయు నా కాలమువాఁడే యని వీరేశలింగముగారు నిర్ణయించిరి. ఈ పాఠమునకు శ్రీరామ మూర్తిగారిపాఠమునకుఁ బట్టిన మొదటి రెండుదోషములును బట్టవు, గాని, మూఁడవదోషము తప్పక పట్టును. భీమకవి యిట్టి దుష్టప్రయోగము చేయఁడు. చేయునని యూహించుట యసమంజసము.

ఈ హేతువులను బట్టి యీపాఠములు రెండును దప్పే యని నిశ్చయింపవలసి యున్నది. భీమకవి కళింగదేశపురాజు నాశ్రయించియుండెనని సర్వజనసమ్మతమైన ప్రతీతిగలదు. శ్రీరామమూర్తిగారు, వీరేశలింగము పంతులుగారును గూడ నీప్రతీతి సత్యమైన దని గ్రహించియున్నారు. కళింగాధీశ యను పాఠ మీ ప్రతీతి కనుగుణము. సర్వవిధముల , నిర్దుష్టము. ఇదియే కవిప్రయుక్తమైన పాఠమై యుండవలయును.

ఈనిర్ణయమువలన భీమకవి నన్నయభట్టునకుఁ బూర్వుఁడను శ్రీరామమూర్తిగారి సిద్ధాంతము పూర్వపక్షమైనది. వీరేశలింగము పంతులుగారివాదమునకుఁ గల యితరప్రమాణముల విమర్శింతము. అవి రెండు. ఏవియన:--

(1) ఉ. చక్కఁదనంబుదీవి యగుసాహిణిమారుఁడు మారుకైవడిం
         బొక్కి పడంగలండు చలమున్ బలమున్ గల యాచళుక్యపుం
         జొక్కనృపాలుఁ డుగ్రుఁడయి చూడ్కులమంటలు రాలఁ జూచినన్
         మిక్కిలి రాజశేఖరునిమీఁదికివచ్చిన రిత్తవోవునే.

అనుచాటువు భీమకవి చెప్పిన ట్లూహించి సాహిణిమారుఁడు ప్రతాపరుద్రునికాలములో నుండినట్లు సోమదేవరాజీయమునఁ జెప్పఁబడియున్నదనియు నందువలన నాతఁడును భీమకవి యుఁ గూడఁ బదునాల్గవశతాబ్దాదియం దుండినవా రని నిశ్చయింపవలసి యున్న దనియు వ్రాసినారు. ఈపద్యము భీమకవి చెప్పిన దనుట కప్పకవి సాక్ష్యముతప్ప వేఱొకసాక్ష్యము లేదు. అప్పకవి భీమనకాలమువాఁడు గాఁడు. సాహిణిమారుని కాలమువాఁడును గాఁడు. వారిరువురకు నెంతో తరువాతివాఁడు. నన్నయభట్టాంధ్రశబ్దచింతామణి కలియుగమునకాదిని రచియించెనని వ్రాసినయాతఁ డితఁడే. ఈతఁడన్న మాత్రాన నాపద్యము భీమనరచియించినదే యని యెట్లు విశ్వసింపవలెనో తెలియదు. ఈయప్పకవియేకదా భీమకవియు నన్నయభట్టును సమకాలికులని వ్రాసెను. దానికినిదీనికిని నెట్లుసమన్వయము చేయవచ్చును? ఇట్టిసాక్ష్యమునుబట్టి తీర్మానములు చేసినయెడల సత్యముతేలదు.

కవిజనాశ్రయములోని యతిచ్ఛందోధికారమునందు –

(2) క. ద్వీపమునకు నాకమునకు, నాపై శాస్త్రోక్తి వచ్చు లాదేశసమా
        సాపత్తి గలుగుటయు వళు, లాపాదింపుదురు కొంద ఱచ్చును హల్లున్ .

అను లక్షణమునుజెప్పి, లక్ష్యములుగాఁ గావ్యాలంకారచూడామణి నుండి-

ఉ. ద్వీపులఁ ద్రుంచి విశ్వజగతీపతి యుత్తమశక్తి జూంబవ
     ద్వీపమునందు గోవులకు నిమ్ముగఁ జేయుటయుం బ్రసన్నయై
     గోపతిధేను వవ్విభునకుం దనవైభవ మిచ్చెఁగాకయే
     భూపతు లీవదాన్యగుణబుద్ధిఁ బ్రసిద్ధివహించి రుర్వరన్.

క. నీకరవాలముపాలై, నాకంబున కరిగి రాజనారాయణ యా
   భూకాంతులెట్టిచనవో, నాకవిటోత్తములఁ దూలనడుతురు లీలన్ .

అను పద్యములను గవి యుదాహరించియున్నాఁడు. దీనిని బట్టి వేములవాడ భీమకవి కావ్యాలంకారచూడామణిని గృతి నందిన విశ్వేశ్వరరాజు కాలములోనో తరువాతనో యుండి యుండవలె” నని వీరేశలింగము పంతులుగారు వేఱొకహేతువు చెప్పినారు.

ఈలక్షణము లక్ష్యముఁగూడఁ గావ్యాలంకార చూడామణిలోనివి గాని కవిజనాశ్రయములోనివి కావు. కావ్యాలంకారచూడామణి యచ్చుప్రతిలో నీపద్యము లాదేశవళికి లక్షణలక్ష్యములుగా నున్నవి. కవిజనాశ్రయమునం దాదేశవళి చెప్పఁబడలేదు. కవిజనాశ్రయము లిఖతప్రతులు కొన్నింటిలో నీపద్యములు దూర్పఁబడి యుండవచ్చును. అట్లయినచో నవి ప్రక్షిప్తములు. కవి లక్ష్యలక్షణములు రెంటిని దానేచెప్పెను గాని యితరులు రచించిన పద్యముల లక్ష్యములుగాఁ దెచ్చికొనియుండలేదు. "వికటకవులు కొన్నివింతలు గల్పించి, కవిజనాశ్రయమునఁగలపినా”రని యప్పకవి వ్రాసినది యథార్థము. ఈయనర్థము ప్రాచీనగ్రంథముల కన్నిటికిం బట్టినదియే. చక్కఁగా శోధించి ప్రక్షిప్తముల నిరాకరించు భారము విమర్శకుల యం దున్నది. ఈహేతువులం బట్టి వీరేశలింగముపంతులుగారు చేసిన కాలనిర్ణయము కూడఁ ద్యాజ్యమే.

భీమన కాలమును నిర్ణయించుట కాతఁడు కళింగగంగు రాజునాస్థానమునం దుండె నని తెలుపు రెండు చాటుపద్యములు ముఖ్యాధారములుగ నున్నవి. ఆపద్యము లెవ్వియన:-

(1) [4]వేములవాడభీమకవి వేగమె చూచి కళింగగంగు తా
      సామముమాని కోపమున సందడిదీరిన రమ్ము పొ మ్మనెన్
      మోమును జూడ దోషమిఁక ముప్పదిరెండుదినంబు లావలన్
      జామున కర్ధమం దతనిసంపద శత్రులఁ జేరుఁగావుతన్.

(2) వేయిగజంబు లుండఁ బదివేలతురంగము లుండ నాజిలో
     రాయలగెల్చి సజ్జనగరంబునఁ బట్టము కట్టుకో వడిన్
     రాయకళింగగంగ కవిరాజు భయంకరమూర్తి చూడఁదాఁ
     బోయిన మీనమాసమునఁ బున్నమపోయిన షష్టినాఁటికిన్.

వీనిలో మొదటిపద్యముచే భీమన రాజును దిట్టి పదభ్రష్టుని జేసెననియుఁ బిదపఁ గొంతకాలమునకు రెండవపద్యముచే దీవించి పదస్థుని గావించె ననియు గాథ కలదు. అది కవిజీవితములలోఁ జూడ నగు.

ఈపద్యములును జూటువులే కాఁబట్టి ప్రబలప్రమాణములు కావనితోఁపవచ్చును. చాటువులేయైనను భీమనకృతములని యన్నిమతములవారు నేకగ్రీవముగ నంగీకరించి యుండుటచేతను, మొదటి పద్యములో భీమనపే రుండుటవలనను, నీపద్యములప్రామాణ్యమును బాధించు హేతుపులు లేకుండుటనుబట్టియు వాని నాధారముగా గ్రహించుట కాక్షేపముండఁగూడదని నాయభిప్రాయము. ఈపద్యములలోఁ గళింగగంగు, రాయకళింగగంగు నని పేర్కొనఁబడిన రాజెవ్వఁడో నిర్ణయింపవలయును. 999 స శకాబ్దము మొదలు రమారమి యఱువదిసంవత్సరములు కళింగదేశము ననంతవర్మయను నామాంతరముగల చోడకళింగ గంగదేవుఁడు పాలించినట్లు శాసనములవలనఁ దెలియుచున్నది. ఈరాజుకాలమునఁ బుట్టిన మూఁడు తామ్రశాసనములు ఇండియన్ అంటిక్వెరీ (Indian Antiguary) అనుపత్రిక 18 వ సం పుటములోఁ బ్రకటింపఁబడియున్నవి. వానిలో నీతనిపట్టాభిసేకకాల మిట్లు వివరింపఁబడినది.

శకాబ్దే నందరంధ్రగ్రహగణగణితే (999) కుంభసంస్థే దినేశే
శుచే పక్షేతృతీయాయుజి రవిజదినే రేవతీభే నృయుగ్మే
లగ్నేగఁ గాన్వవాయాంబుజవనదినకృద్విశ్వవిశ్వంభ రాయా
శ్చక్రం సంరక్షితుం సద్గుణనిధి రధిప శ్చోడగంగోభిషిక్తః.

ఈకాలమునందే రాజరాజచోడగంగనురాజు వేంగీదేశమును బాలించుచుండెను. ఈతఁడు రాజనరేంద్రుని పౌత్రుఁడు. కాంచీపురము రాజధానిగా వేంగీచోళదేశములనేకచ్ఛత్రముగా నేలిన కుళోత్తుంగచోళుని యగ్రపుత్రుఁడు. తండ్రి యాజ్ఞానుసారముగ వేంగీదేశమును బాలించెను. అతఁడు 1006వ శకాబ్దమునం దభిషిక్తుఁడైనట్లు ఎపిగ్రాఫియా ఇండికా (Epigraphia Indica) యనుపత్రిక 6వ సంపుటమునఁ బ్రకటింపఁబడిన టేకిశాసనమునం దిట్లు చెప్పఁబడియున్నది.

"శాకాబ్దేరసఖాంబరేందుగణితే (1006) జ్యే ష్ఠేథమా సేసితే
పక్షేపూర్ణతీథౌ దినే సురగురోర్జ్యేష్ఠాం శశాంకేగతే

సింహే లగ్నవరే సమస్తజగతీరాజ్యాభిషిక్తోముదే
లోక స్యోద్వహతిస్మ పట్ట మనఘః శ్రీరాజరాజో విభుః,

ప్రస్తుతవిచారమునకు భీమనకాశ్రయుఁడైన రాజు వీరిరువురిలో నెవ్వఁడైన నొక్కటియె. కాని, కళింగగం గనుసంజ్ఞ యనంతవర్మ చోడగంగదేవునకే యన్వర్థ మగును. అతఁడు 999 శక సంవత్సరమాదిగా నించుమించు 60 సంవత్సరములు రాజ్యముచేసెను. భీమకవి యీతనిరాజ్యకాలము పూర్వభాగములో నుండె ననిన 924 వ శకాబ్దమునఁ బట్టాభిషిక్తుఁ డైన రాజ రాజు నాస్థానకవి యగు నన్నయభట్టునకు రమారమి 100 సంవత్సరముల తరువాతివాఁ డగును. - భీమకవి యనంతవర్మ రాజ్యావసానదశయం దుండె ననుకొన్నచో మఱి ముప్పది నలువది సంవత్సరముల తరువాతివాఁ డగును. కాని, శ్రీరామమూర్తిగా రనుకొన్నట్లు నన్నయభట్టుకంటెఁ బ్రాచీనుఁడు కాడు. వీరేశలింగముపంతులుగా రెంచినట్లు 14 వ శతాబ్దమువాఁడును గాఁడు. 12 వ శతాబ్దారంభమువాఁ డగును.

గ్రంథనిర్మాణకాలమును నిర్ణయించుటకుఁ గొంతవఱ కనుకూలపడు నంశములు రెండు కవిజనాశ్రయమునందే కలవు. ఈ గ్రంథమునందుఁ బదివిధములగుయతులు చెప్పఁబడినవి. కావ్యాలంకారచూడామణియందుఁ బదిరెండువళ్లు చెప్పఁబడినవి. “అనంతుఁ డిరవనాల్గు విశ్రమములు నామీఁదఁ గొందఱు కవి గ్రామణు లిరువదియు నేడును " విశ్రమములఁ జెప్పిన ట్లప్పకవి చెప్పియున్నాఁడు. అప్పకవి నలువదియొక్కయతుల వర్ణించియు న్నాఁడు. యతులసంఖ్య కాలక్రమమున వృద్ధియైనట్లు దీనివలనఁ దేలుచున్నది. కవిజనాశ్రయములోఁ జెప్పఁబడిన యతులసంఖ్య యన్నిటికంటెఁ దక్కువది, కావున, నాగ్రంథమె యన్నింటిలోఁ బ్రాచీన మైన దని యూహింపవచ్చును.

మఱియు నీగ్రంథమున మధ్యాక్కరకుఁ బ్రతిపాదమునందు నాల్గవగణముమొదట యతి విధింపఁబడినది.[5] ఇది యాధునిక మతము. నన్నయభట్టుకాలమున యతి యయిదవ గణము మొదట నుండినట్లు భారతమువలన విశద మగును. తిక్కనసోమయాజి కవిత్వములో మధ్యాక్కరలు నాకుఁ గనఁబడలేదు. కాని, యెఱ్ఱాప్రెగడకృత మగు నారణ్యపర్వ శేషమందు యతి చతుర్థగణాదియందె యున్నది. ఈమార్పు నన్నయభట్టునకు నెఱ్ఱాప్రెగ్గడకును మధ్యకాలములోఁ గలిగియుండవలయును. ఈరెండుహేతువులంబట్టి భీమన నన్నయభట్టు తరువాతి వాఁడును విన్నకోట పెద్దనకుఁ బూర్వుఁడును నైనట్లు తేలుచున్నది. కళింగగంగు కాలనిర్ణయముకూడ దీనికి సరిపోవుచున్నది.

-: భీమకవిఖ్యాతి :-

భీమకవి రాఘవపాండవీయాది గ్రంథములు మఱికొన్ని రచియించినట్లు వాడుకయే గాని యాగ్రంథము లింతవఱకు లభింపలేదు. సరివారలలో నిరంకుశముగాఁ బవర్తించుటయం

దాంగ్లేయకవులలో జాన్సక్ (Dr. Samuel Johnson) కవి కెట్టిఖ్యాతి కలదో యాంధ్రకవులలో భీమకవికట్టి ఖ్యాతిగలదు.

- కవిజనాశ్రయమునకు జైనమతమునకును సంబంధము. -

జైనసంబంధము గలయాంధ్రగ్రంథ మీకవిజనాశ్రయ మొక్కటియె కనఁబడుచున్నది. కన్నడభాషలోని ప్రాచీన గ్రంథము లించుమించుగా నన్నియు జైనులు రచించినవియే. అఱవ భాషయందుఁ గూడ జైనకృతగ్రంథము లున్నట్లు తెలియుచున్నది. పూర్వకాలమందుఁ దెలుఁగుదేశమందును జైనమతము వ్యాపించి యున్నట్లు నిదర్శనములు గలవు. నాగవర్మ మొదలగు కొందఱు జైనకర్ణాటకకవులు తాము వేంగీదేశములో నుండి కన్నడదేశమునకు వెళ్లినట్లు చెప్పికొని యున్నారు. ఆకాలమందు జైనకృతాంధ్ర గ్రంథములుకూడఁ గొన్ని పుట్టియుండవచ్చును. అవి యేకారణమువలననో యింతవఱకుఁ బైటికి వచ్చియుండలేదు.

- కవిజనాశ్రయములోని కర్ణాటభాషాసంప్రదాయము. -

కృత్యాదిని సరస్వతీప్రశంస చేయుటయందును మఱికొన్ని విషయములందును నీగ్రంథముప్రాచీన కర్ణాటగ్రంథములమర్యాద ననుకరించి యున్నది. ఈ సామ్యముల నందందు గ్రంథమునం జూడనగు.

ఛందోవిషయము.

- గురులఘునిర్ణయము. -

గురులఘుసంయోగముచే గణములు పుట్టును. గణములకూడిక చేఁ బద్యము లగును. కావున గురులఘు నిర్ణయము ఛందశ్శాస్త్రమునకెల్ల మూలము. దీర్ఘాక్షరములును, “జడ్డక్కరముల బొట్టులపిఱుందకడనూఁదిన యక్కరములు"ను గురువులు. శేషించినవి లఘువులు. “ఊఁదిన” యను విశేషణసామర్థ్యమునఁ

బదాదియందు సంయుక్తాక్షరముండి దానివెనుకనున్న భిన్నపదము చివర హ్రస్వాక్షర ముండినచో నాహ్రస్వాక్షరము లఘువే యని గ్రహింపవలయును. పూర్ణబిందువునకుఁ బూర్వమున్న యక్షరము లన్నియు నూఁది పలుకఁబడున ట్లూహించునది. “వారల్", "చెలఁగున్” ఇత్యాదిస్థలములయందుఁ బొల్లులతోఁ గూడినహ్రస్వాక్షరములు కూడ సంయుక్తాక్షరపూర్వవర్ణతుల్యములె యని గ్రహింపవలయును. సంస్కృతములోఁ బాదాంత మందలి లఘువుకూడ వికల్పముగా (అనఁగా వలసినప్పుడు) గురువగును. ఈశాస్త్రము కన్నడమందును గలదు, గాని, తెలుఁగులో నిరాకరింపఁబడినది. “ఒక్క మాత్ర లఘువై ద్విమాత్రకము గురు వయ్యె” నని సామాన్యముగాఁ జెప్పినాఁడు, గాని, యీలక్షణము సర్వత్ర వర్తింపదు. లఘు వెప్పుడు నొక్క మాత్రమే యగును, గాని, గురువు రెండుమాత్రలకంటె నెక్కువగాఁ గాని తక్కువగాఁ గాని యుండవచ్చును. వ్యంజన మర్థమాత్ర యను న్యాయముచే “వనితన్" అనునప్పుడు "తన్" అను గురువు సార్థమాత్రక మగును. “అనఁగాన్” అనుచో “గాన్” అను గురువు సార్ధద్విమాత్రక మగును. ప్లుతస్వరములో మూఁడుమాత్ర లున్నవి. కావున నొక్క మాత్ర గలయక్షరము లఘు వనియు నంతకంటె నధికము గల యక్షరములు గురువు లనియుఁ జెప్పనొప్పును.

- గణనిర్ణయము. -

గురులఘువులు మూఁడేసి కూడిన నొక్కగణ మగును. మూఁడుగురువులైన మగణ మగును. అన్నియు లఘువు లైన నగణము. ప్రథమద్వితీయతృతీయాక్షరములు మాత్రమే గురువులైనచో నాగణములకు భ, జ, స, లనియు, నాయక్షరములు మాత్రమే లఘువులైనచో వానికి య, ర, త, లనియుఁబేళ్లు. ఇవి యన్నియుఁ జేరి యెనిమిదిగణము లైనవి. వీని కక్షరగణములనిపేరు. వీనిలో సమానమాత్రకము లగుగణములు సయిత మొకదానికి వే ఱొకటి ప్రయోగింపరాదు.

అక్షరగణములకంటె భిన్నములైనవి మాత్రాగణములు. ఈగణములలో మాత్రాసంఖ్యయే ప్రధానముగాని, గురులఘు వర్ణక్రమము ముఖ్యము గాదు. ఎట్లన : __ సీసపద్యమం దింద్ర గణములు సూర్యగణములు వచ్చును. ఇంద్రగణము లాఱును సూర్యగణములు రెండును గలవు. వీనిలో నేదియైనను బ్రయోగింపవచ్చును. ఆప్రకారమే చంద్రగణములును.

ఈమాత్రాగణములకు జాతులలో వినియోగము. దేశ్య జాతులలో వచ్చుగణములు సూర్యగణము లనియు, నింద్రగణములనియుఁ జంద్రగణము లనియు మూఁడు విధములు. ఇవి వరుసగా రెండు, మూడు, నాలుగు గురువులఁ బెట్టి ప్రస్తరింపఁగాఁ బుట్టును, ఎట్లనిన :-
ఆంధ్రకవు లీమూఁడువరుసల గణములలోను మొదటివి రెండేసి గణములు వదలి తక్కినవి గ్రహించి మొదటివరుసలో మిగిలిన రెండుగణములకు సూర్యగణము లనియు, రెండవవరుసలో మిగిలినయాఱుగణములకు నింద్ర గణములనియు, మూఁడవవరుసలో మిగిలిన పదునాలుగుగణములకుఁ జంద్రగణములనియు సంజ్ఞలుపెట్టిరి. కన్నడకవులు ప్రస్తరింపఁగావచ్చిన గణములన్నియు గ్రహించి మొదటివరుసలోని నాలుగుగణములకు బ్రహ్మగణము లనియు, రెండవవరుసలోని యెనిమిదిగణములకు విష్ణుగణము లనియు, మూఁడవవరుసలోని పదునాఱుగణములకు రుద్రగణము లనియు సంజ్ఞలు చేసిరి. సూర్యేంద్రగణములు దేశ్యజాతు లన్నిటియందును వచ్చును. చంద్రగణము లక్కరలు, షట్పదములు వీని యందుమాత్రము వచ్చును.

- వృత్తములు. -

పద్యములు, వృత్తము లనియు జాతు లనియు రెండు విధములు. అక్షరగణనిబద్ధములు వృత్తములు. మాత్రాగణ నిబద్ధములు జాతులు. సామాన్యవృత్తము లనియు నుద్ధర మాలావృత్తము లనియు వృత్తములు రెండువిధములు. ఉక్తాచ్ఛందము మొదలుకొని యుత్కృతిచ్ఛందమువఱకును గల యిరువదియాఱుఛందములలోఁ బుట్టినవి సామాన్యవృత్తములు. ఈ వృత్తములలోఁ బాదమున కొకయక్షరము మొదలు ఛందఃక్రమమున నిరువదాఱక్షరములవఱకు నుండును. పాదమున కిరువదియాఱక్షరములకంటె నధికముగా నుండునవి యుద్ధరమాలావృత్తములు. మఱియు సమవృత్తము లనియు, నర్ధసమ వృత్తము లనియు, విషమవృత్తములనియు వృత్తములు మూఁడు విధములు. గణసంఖ్యయందును, గణక్రమమునందును నన్ని పాదములు సమానముగా నున్న వృత్తములు సమవృత్తములు. రెండుపాదము లొకవృత్తమునకును మఱిరెండుపాదములు వేఱొకవృత్తమునకును సంబంధించినచో నావృత్త మర్ధసమ వృత్తము. అట్టివృత్తములు రెండు నేకచ్ఛందములోఁ జేరినయెడల స్వస్థానార్ధసమవృత్త మగును. ఒకవృత్త మొకఛందములోనిదియు నింకొకటి యింకొకఛందములోనిదియు నయిన పక్షమున నది పరస్థానార్ధసమవృత్తము. నాలుగుపాదములును బరస్పరభిన్నములుగా నున్నవృత్తము విషమవృత్తము. విషమ వృత్తములకుఁ గూడ స్వస్థానపరస్థాన భేదము కల్పింపవచ్చునని తోఁచెడును. సమవృత్తముల సంఖ్యయే ప్రస్తారక్రమమున 134217726 అగును. అర్ధసమవిషమవృత్తములం జేర్చిన మొత్త మెంతయగునో గణితజ్ఞులు గణింతురుగాక ! వృత్తము లన్నియు సంస్కృతచ్ఛందమునుండి గ్రహింపఁబడినవియే.

- జాతులు. -

మాత్రాగణములవలనఁ బుట్టినవి జూతులు. ఇందుఁ గందాదులు కొన్ని సాంస్కృతికములు. సీసాదులు దేశ్యములు. గీతాదుల కుపజాతు లనుసంజ్ఞకూడఁ గలదు. దేశ్యజాతులలో సూర్యేంద్రచంద్ర గణములు మాత్రమే వచ్చును. అక్కరలు మొదలగు కొన్ని దేశ్యజాతులు కన్నడమునందును గలవు.

అల్పాక్కర, అంతరాక్కర , మధురాక్కర , మధ్యాక్కర, మహాక్కరయని యక్షర లైదు తెఱుఁగులు. అల్పాక్కరకుఁ బాద మునకు మూఁడుగణములు. తరువాతివానికిఁ గ్రమముగా నాక్కొక్క గణ మధికము. ఈయక్కరలకుఁ గన్నడములో, కిఱియక్కర, ఎడెయక్కర, నడువణక్కర, దొరెయక్కర, పిరియక్కర యనిపేళ్లు. తెలుఁగులో మధ్యాక్కర యనునది కన్నడములో దొరెయక్కరమైనది. దొరెయన సమాన మని యర్థము. ఈయక్కరలో భాగమునకు రెండేసి యింద్రగణములు నొక సూర్యగణము చొప్పున ప్రతిపాదమును రెండు సమానభాగములుగా విభజింపవచ్చును గాన దీనికి సమానాక్కర యను పేరును, బాదమున కై దేసి గణములుగల యక్కర గణసంఖ్యచే నైదక్కరలకు మధ్యస్థానముననుండుటచే మధ్యాక్కర మను పేరును నన్వర్ధములుగా నున్నవి.

- యతి. -

యతిపర్యాయపదములలో వడి యనునది తెలుఁగు, దానివ్యుత్పత్తి యూహ్యము. తక్కినపదములు సంస్కృతచ్ఛందశ్శాస్త్రమునుండి గ్రహింపఁబడినవి. యతిస్వరూపవిషయములో సంస్కృతమునకును దెలుఁగునకును జాల భేద మున్నది. సంస్కృతమున యతియనఁగా విశ్రమించుస్థానము. అనఁగాఁ బద్యముచదువునపుడు గ్రుక్క విడుచుతా వని యర్థము. పదమధ్యమున గ్రుక్కవిడుచుట కనుకూలింపదు, గావున యతిస్థానమందుఁ బదము తెగిపోవలయును. కనుక యతియనఁ బదవిచ్ఛేదమని భావము. “యతి ర్విచ్ఛేదసంజ్ఞకః” యని వృత్తరత్నాకరము. ఈవిషయము పింగళసూత్రములలో నిట్లు చెప్పఁబడినది.

“అధాతు నామభేదేన విరమో విరతి ర్యతిః
 స్వరసంధ్యాప్తసౌందర్యా త్తద్భే దేపీప్యతే క్వచిత్.”

అనఁగా సాధారణముగా ధాతుమధ్యమందును బ్రాతిపదికమునడుమను విరతి యుండదు. స్వరసంధివలనఁ జెవికింపుగలు గనప్పు డొకానొకచోట నీవిధికి భిన్నముగా యతి యుండిన నుండవచ్చు నని తాత్పర్యము. మహాకవుల కావ్యములలోఁగూడ నచ్చటచ్చట యతిభంగము కన్పట్టుచున్నది. ఉదాహరణము.

"యాచ్ఞాదైన్యపరాంచి యస్య కలహాయంతే మిథ స్త్వంవృణు
 త్వం వృణ్విత్యభితో ముఖాని స దశగ్రీవః కథం కథ్యతామ్.”

అనర్ఘ రాఘవనాటకము.

తెలుఁగులో వళియనఁగాఁ బాదాద్యక్షరమునకు సవర్ణమైన యక్షరము వచ్చుటయే. తుల్యాస్యప్రయత్నము లగువర్ణములు సవర్ణములు. సవర్ణము పదాదియందైనను రావచ్చును. పదమధ్యమందైనను రావచ్చును. పదాదియం దున్నప్పుడు పద్య మధిక శ్రావ్యముగా నుండుననుటకు సందేహములేదు. నన్నయభట్టు, బమ్మెర పోతరాజు మొదలగు కొందఱు మహాకవుల గ్రంథములలో నిట్టియతు లధికముగా నున్నవి. తిక్కనసోమయాజి కవిత్వములోఁ దఱచుగా యతి పదమధ్యమందే యుండును. మహాకవు లెందునకును సమర్థులే, కాని, సామాన్యకవులు యతిస్థానమందుఁ బదచ్ఛేదము చేయవలయునన్న ననావశ్యకశబ్దము లనేకములు ప్రయోగింపవలసివచ్చును. కవిత్వ మిమిడికగానుండదు. "యతి కృతి కధిక శ్రావ్యంబై బెడంగుగా నిడవలయున్” అని భీమన చెప్పినాఁడు. తొలుత వళియుఁ బ్రాసముఁగూడ శబ్దాలంకారములుగానే ప్రయోగింపఁబడి క్రమముగాఁ బద్యలక్షణములుగా మాఱినట్లు తోఁచుచున్నది. కన్నడమందు యతి లేదు గాని ప్రాస మున్నది ప్రాసమువలనఁ బద్యమునకు శోభవచ్చునని నాగవర్మ యిట్లు చెప్పెను.

క. నుతశబ్దాలంకారదొ
   ళతిశయమదుకన్నడక్కె సతతంప్రాసం
   కృతకృత్య మప్పుదెల్లర
   మతదిందదుత ప్పెకావ్యమేంశోభిపుదో ! (ఛందోంబుధి)

తెనుఁగులోని యతివంటియతి యఱవములో నున్నదఁట, ఆ భాషలో దానికి “మోనై "యనిపేరు. కన్నడములో నేవిధమైన యతియులేదు. కర్ణాటాంధ్రభాషల క నేకవిషయములలో నత్యంతసంబంధము కలదు. వీనికి యతివిషయములో నింతభేదమేలకలిగెనో యుభయభాషా వేదులు నిర్ణయింతురుగాక ,

సంస్కృతములోఁ బదియవదియగు పంక్తిచ్ఛందము మొదలుకొనియే విశ్రమము విధింపఁబడినది. మొదటి తొమ్మిది ఛందస్సులలోఁ బుట్టినవృత్తములు చిన్నవిగావునఁ బాదమధ్యమందు విశ్రమస్థాన మనావశ్యకమని గ్రహించునది. ఈమర్యాదనేయాంధ్రకవులు నవలంబించిరి. వృత్తములకు సంస్కృతములో నెచ్చట నెచ్చట విశ్రమమో తెలుఁగునఁగూడ నచ్చటనే విధింపబడినది, గాని, కొన్నితావుల నించుకభేద మున్నది. సంస్కృతములో శిఖరిణీవృత్తమున కాఱక్షరములమీఁదను, బృథ్వీవృత్తమున కెనిమిదియక్షరములమీఁదను యతి. తెలుఁగులో వీనికిఁ బండ్రెండు, పదునొకండునక్షరములమీఁద యతి విధింపఁబడినది. ఇట్లే మఱికొన్నిస్థలములందును భేదమున్నది.

- ప్రాసము. -

యతివలెనే ప్రాసమును మొదటఁ బద్యాలంకారముగాఁ బ్రయోగింపఁబడిన ట్లగపడుచున్నది. కాని, యది యిప్పు డఱవ మందును, గన్నడమందును, దెలుఁగునందును గూడఁ బద్యలక్షణములలోఁ జేరియున్నది. అరవములో దీనికి “యదుఘై” యని పేరఁట. ప్రాసమునకు వ్యంజనము ప్రధానము గాని స్వరము కాదు. యతికివలె సవర్ణాక్షరము ప్రయోగింపరాదు. కావున యతికంటెఁ బ్రాసము కవులకుఁ గష్టతరము. మొత్తముమీఁద యతిప్రాసనియమాధిక్యముచేత నితరభాషలయందు కంటెఁ దెలుఁగునఁ బద్యములు చెప్పుట కష్టతర మనుటకు సందేహములేదు. ఈకారణముచే నీనియమముల రెంటిని గూడఁ ద్యజింపవలయు నని కొందఱ కభిలాషముకలదు. యతి ప్రాసలు పద్యాలంకారము లగుటయేకాక శబ్దస్వరూపము నిర్ణయించుట కత్యంతోపయోగకరములుగా నుండుటం బట్టియు, నేఁటిదనుక నాంధ్రవాఙ్మయాభివృద్ధి కీనియమములు బాధకములుగా నుండియుండక పోవుటం బట్టియు, నిప్పుడుగూడ నితర భాషలయందుకంటె నాంధ్రమందే కవితాప్రచార మధికముగా నుండుటం బట్టియు, వృత్తనియమములఁ బాటింపశక్తిలేనివారు సీసాది జాతులలోనే పద్యము లల్లవచ్చును గనుకను, నందుకును జాలనివారు గద్య కావ్యములు రచించుట కాక్షేపములేదు గావునను యతిప్రాసనియమము త్యజించుట కాంధ్రలోక మంగీకరించు నని తోఁపదు.

జయంతి రామయ్య.


___________


ద్వితీయముద్రణపీఠిక.

ఈగ్రంథము తొలుత 1917 వ సంవత్సరములోఁ బ్రకటింపఁబడినది. అప్పు డచ్చుపడిన ప్రతు లన్నియు వ్యయపడుటచే నిప్పుడు తిరుగ నచ్పు వేయింపఁబడినది. ఈద్వితీయముద్రణమునందు మూలపాఠములోఁ గొన్ని చిన్నిమార్పులు చేయఁబడినవి. అవి యేవి యనఁగా. __

అవతారికాపద్యములలో మొదటి పద్యము ప్రక్షిప్తములలోఁ జేర్పఁబడినది. వృత్తాధికారమందు 136 వ పద్యము తరువాత పరస్థానార్థసమవృత్తములలో” అను శీర్షిక క్రొత్తగాఁ జేర్పఁబడినది. ఈక్రింద సూచింపఁబడు పద్యములలోఁ జిన్న మార్పులు కొన్ని చేయం బడినవి. సంజ్ఞాధికారములో 38, 39, 72; వృత్తాధికారములో 137; జాత్యధికారములో 20.

గ్రంథకర్తృత్వమును గూర్చియు, నిర్మాణకాలమును గూర్చియుఁ గొందఱుపండితు లిటీవలఁ దమతమయభిప్రాయములను బత్రికాముఖమునఁ బ్రకటించినారు. గ్రంథకర్త భీమకవి కాఁ డని కొందఱును, గ్రంథము ప్రథమపీఠికలో నేను సూచించినంత ప్రాచీనము కా దని కొందఱును వ్రాసిరి. ఈ యభిప్రాయముల సమబుద్ధితో నేఁ బరిశీలించినాఁడను. కాని, నే నిదివఱలోఁ బడిన యభిప్రాయమును మార్చుకొనుటకు హేతువు లేవియుఁ గానరా లేదు. కాని కాలనిర్ణయవిషయములో బ్రహ్మశ్రీ వఝల చినసీతారామస్వామిశాస్త్రులుగారు చెప్పిన యొకమాటకు మాత్రము సమాధానము చెప్పవలసియున్న ది. మధ్యాక్కరలోని యతిస్థానవిషయము నెత్తుకొని పూర్వపీఠికలో నే నిట్లు నుడివితిని.

“మఱియు నీగ్రంథమున మధ్యాక్కరకుఁ బ్రతిపాదమునందు నాల్గవగణముమొదట యతి విధింపఁబడినది.[6] ఇది యాధునికమతము. నన్నయభట్టుకాలమున యతి యయిదవ గణము మొదట నుండినట్లు భారతమువలన విశద మగును. తిక్కనసోమయాజికవిత్వములో మధ్యాక్కరలు నాకుఁ గనఁబడలేదు. కాని యెఱ్ఱాప్రెగడకృత మగునారణ్యపర్వ శేష మందు యతి చతుర్థగణాదియందె యున్నది. ఈమార్పు నన్నయభట్టునకు నెఱ్ఱాప్రెగ్గడకును మధ్యకాలములోఁ గలిగి యుండవలయును. ఈ రెండు హేతువులంబట్టి భీమన నన్నయభట్టు తరువాతివాఁడును విన్నకోట పెద్దనకుఁ బూర్వుఁడును నైనట్లు తేలుచున్నది. కళింగగంగు కాలనిర్ణయము కూడ దీనికి సరిపోవుచున్నది.”

దీనిని ఖండింపఁ దలఁచిన శ్రీశాస్త్రులుగారు రక్తాక్షి సంవత్సరాషాఢమాసభారతిసంచికలో - "మహాకవుల లక్ష్యములను బట్టియే లక్షణములు చెప్పఁబడుట లక్షణశాస్త్రసంప్రదాయ మగుటంజేసి నన్నయాక్కరలకు విలక్షణముగాఁ జతుర్థ గణాదిని యతిని నిల్పవలె నని చెప్పుచున్న కావ్యాలంకార చూడామణి చతుర్థగణాదిని యతిని ప్రయోగించి యున్న యెఱ్ఱాప్రెగడకుఁ దర్వాతిదె యని నొక్కి వక్కాణింపఁ దగియున్నది. ఇట్టి స్థితిలో లక్షణశాస్త్రసంప్రదాయవిరుద్ధముగాఁ మ||రా||శ్రీ || జయంతి రామయ్యపంతులుగారు “మఱియు . . ." అని యిట్లు వ్రాయుట మిక్కిలి వింతగ నున్నది." అని వ్రాసినారు.

లక్ష్యములను బట్టి లక్షణ మేర్పడుట శాస్త్రసంప్రదాయ మనుట నిర్వివాదాంశమే. కాని యాలక్షణమున కాధారము లయిన లక్ష్యము లేవి యై యుండు ననునది మిక్కిలి జాగరూకతతోఁ బరిశీలింపవలసిన విషయము. ఏదియో యొక్కపద్యమును బట్టి లక్షణకర్తలు లక్షణ మేర్పఱిచి యుందు రనుట సాహసము. సుప్రతిష్ఠిత మైన లక్ష్యసంప్రదాయ మేర్పడియుండినఁ గాని యది లక్షణమున కాధారము కానేరదు. ఎఱ్ఱాప్రెగడ పద్యము తప్ప వేఱుపద్యములు మనకిప్పుడు కనఁబడకుండుటచేఁ బూర్వము లేవని నిర్ణయించుట సముచితము గాదు. యుద్ధమల్లుని శాసనము దొరకకపూర్వము ప్రాచీనసంప్రదాయమునకు నన్నయభట్టారకుపద్యములే కద యాధారముగా గణింపఁబడుచుండెను?

మఱియు లక్ష్యములే మొదటిలక్షణమున కాధారములయి యుండినను నాలక్షణము పుట్టినపిదప బయలుదేఱు లక్ష్యముల కాలక్షణమే విధాయక మగు ననుమాట యనుభవసిద్ధము, శ్రీ శాస్త్రులుగారు పద్యములు చెప్పినప్పు డప్పకవ్యాధి లక్షణగ్రంథముల ననుసరింతురు గాని పూర్వకవి ప్రయోగముల వెదకరుగదా ! ఆలాగుననే తనకాలమందుఁ బ్రచారములో నున్న లక్షణము ననుసరించియే యెఱ్ఱాప్రెగ్గడ పద్యము చెప్పె నని యేల యూహింపరాదు? శాస్త్రులుగారి యాక్షేప మసార మని నామనవి.

జ. రామయ్య.


  1. మధ్యయుగము. పుట-164.
  2. సారంగధరచరిత్రములోని యితివృత్త మీ నామపల్లియందే జరిగినదని వేములవాడవాస్తవ్యుల నమ్మకము.
  3. భీమకవి వెలిగందల ప్రాంతమువాఁ డైనట్లుగ నచ్చటఁ బ్రమాణము లేమైన నున్నవేమో తెలిసికొని రావలయునని పరిషత్పక్షమున - 1915 సం. జూలై నెలలో దూపాటి తిరుమల వేంకటరమణాచార్యులు గారిని బంపఁగా నాయన వేములవాడగ్రామనివాసులలోఁ గొందఱచే నొకపత్రము వ్రాయించి తెచ్చెను. ఆపత్రములోని భాగములే పై నుదాహరింపబడినవి.
  4. లేములవాడ భీమునవలీలనుజూచి-యను పాఠాంతరముగలదు.
  5. ఇది లక్ష్యమును బట్టిగ్రహింపఁదగు.
  6. ఇది లక్ష్యమును బట్టి గ్రహింపఁదగు.