కవిజనరంజనము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

కవిజనరంజనము

ద్వితీయాశ్వాసము

శ్రీగిరిసుతాకుచోపరి
భాగమృగీమదవిభాసిబాహ్వంతర, స
ద్యోగిధ్యేయపదాంబుజ,
భోగివలయ, రామచంద్రపురవరనిలయా!

1


వ.

అవధరింపుము.


చ.

వలపులకు న్నిదాన, మలివారముగోరనికోర్కి జాతికిం
దలఁపనికీడు, పాంథసముదాయముపాలిటి వేఱువిత్తు, కో
కిలములనోముపంట,స్మరకేవలశౌర్యహుతాశిధాయ్య, రా
చిలుకలభాగధేయ మిలఁ జెన్నలరారె వసంత మంతటన్.

2

వసంతకాలవర్ణనము

సీ.

తరుణపల్లవలతాంతములతో గూడనె
                  వలరాజుశౌర్యకీర్తులు వెలింగె,
నంచితసుమమరందాసారములతోన
                  విరహిణీబాష్పాంబువృష్టి గురిసె,
గమనీయలతికాప్రకాండంబుతోడనె
                  శుకపికమధుకరోత్సుకత నిగిడె,

మలయానిలాంకూరములతోన కాముక
                  సమితివాంఛాకందళములు ప్రబలె,
భవ్యనవ్యప్రభాపరంపరలతోన
పరిమళంబులు దట్టమై పర్వె దిశల
సకలఋతుసార్వభౌమ వసంతఋతువు
త్రిభువనీమోహనం బయి తేజరిల్ల.

2


సీ.

చిగురాకుటెఱసంజజిగికిఁ బాండుర
                  కోరకములు భాసురతారకములు గాఁగఁ,
బ్రసవరసాసారపటిమంబునకు రాలు
                  కుసుమము ల్వడగండ్లగుంపు గాఁగఁ,
బ్రవహించుమధునిర్ఘరములకుఁ బుప్పొళ్ల
                  నెఱితిప్ప లిసుకదిన్నియలు గాఁగ
మంజుతరసికుంజకుంజరంబులకు రో
                  లంబముల్ శృంఖలాలతలు గాఁగఁ
బ్రసవకిసలయఫలరసరసికమధుక
రపికశుకనికరారవాక్రాంతదశది
గంతరాళము దనరె వసంతకాల
మఖిలభూజనరంజనం బగుచు నంత.

3


సీ.

మావులు నెత్తావిదీవులై తనరారెఁ
                  దమ్ములఁ బుష్పగుచ్ఛమ్ము లమరె;

దాఁకలఁ బూదేనెవాఁకలు ప్రవహించె
                  నిప్పలఁ బుప్పొళ్లతిప్ప లమరెఁ;
గోరకంబుల సిందువారకంబులు పొల్చె
                  బూవులఁ దనరారె మోవులెల్లఁ;
గలికావళులచేఁ గదళికాతరు లొప్పె
                  మొగడలఁ దనరారె బొగడ లెల్ల
బూగముల నవ్యకుసుమపరాగ మెసఁగె
నిమ్మలందును లేఁతపూరెమ్మ లమరె
ననలఁ బెనఁగొనెఁ జిన్నిగుంపెనలగుంపు
లభినవంబగు నావసంతాగమముస.

5


క.

చిలుకల చదువులబడులయి
యలులకుఁ బానీయశాల లయి కోకిలమం
డలముల కామెత లయి వల
పులకు నిదానంబు లగుచుఁ బొలిచెం దరువుల్.

6


సీ.

మధుభూపసైనికమండలి లాలుజెం
                  డా లనఁ దలిరాకుడాలు నిగిడె
లతికావధూజనాలంకృతహరినీల
                  సరములు నాఁదగె షట్పదములు
మలయాగతానిలమత్తేభకరధుత
                  రజమునాఁ బుప్పొళు రాలెఁ దరుల

భువనత్రయజిగీషు పుష్పేషుచాపటం
                  కృతియనఁ బికనాద మెగసె దిశల
మహితవనరమాఝుల్లరీమౌక్తికంబు
లనఁగఁ బాండురనవకోరకాళి దనరె
నమితదోహదధూపధూమ్యాంబువాహ
వృష్టి యనఁగను మకరందవృష్టి గురిసె.

7


సీ.

పథికవియోగాగ్నిపాణింధమంబులు
                  ప్రాసనామోదధురంధరములు
గురుసరశ్శీకరకుక్షింభరులు లతి
                  కాబాలికాడోలికాకలనలు
చైత్రభూమికళత్రచామరచలనము
                  ల్కాముకసౌభాగ్యకండళములు
పటుఘర్మజలకణపశ్యతోహరములు
                  మందగామిత్వసంపద్గజములు
ఫుల్లకాననమల్లికావల్లికామ
తల్లికావేల్లితనికుంజతతులఁ దాఱి
వలపు మెలపునఁ గొలుపుచుఁ బొలసె నపుడు
గంధగిరిగంధవాహస్తనంధయములు.

8

గీ.

ధీరమలయసమీరకిశోరకములు
సురభిళమనోజ్ఞవనపరంపరలయందు
నలరు దీవియతూఁగుటుయ్యేలల నూఁగెఁ
దేఁటిఝుంకారములె జోలపాటలుగను.

9


గీ.

అరుణపల్లవరుచి తెల్పె నపరసంధ్యఁ
జూపెఁ దిమిరంబు దోహదధూపధూమ్య
పాండుకోరకతతి యుడుప్రభల నించె
దాన మరుశౌర్యవహ్ని యెంతయు వెలింగె.

10


సీ.

పథికనిశ్వాసదంభమున వేఁడిమిఁ జూపి
                  సవినయస్ఫూర్తి వేసవి భజింప,
గళదురుసుమరసచ్ఛలమున జడిఁ జూపి
                  వారక సేవింప వర్షఋతువు,
వ్యాకోచసుమకైతవమున సితాభ్రవై
                  భనముఁ జూపిఁ శరద్దృతువు గొలువఁగ,
బాటీరగిరిశీతపవనమిషమున శై
                  త్యము జూపి హేమంత మనుసరింప
శుకపికగళన్మరుద్ధూతశుభ్రపుష్ప
రజముపేర హిమానిఁదోరముగఁ జూపి
యవిరతంబుగ శిశిరర్తు వాశ్రయింప,
సకలఋతురాజమయిన వసంత మలరె.

11

సీ.

సరసోరుకదళికాస్తంభంబులను మించి
                  శుభకరపల్లవస్ఫురణ నెగడి,
పృథులకుచంబులఁ బెంపొంది చారుచం
                  పకకలికాతనుప్రభలఁ దనరి,
యనుపమసుమమాలికాభిరూప్యముఁ దాల్చి,
                  రాచిల్క పల్కుల రహి దనర్చి,
భ్రమరకనీలశోభామంజిమ వహించి,
                  పలుమల్లెమొగ్గలఁ బరిఢవిల్లి,
తిలకరుచిఁ బొల్చి, మోవికాంతిని జెలంగి,
పాపటఁ బొసంగి, యామోదభరము నించెఁ,
జూపఱకు నెల్ల వనలక్ష్మి సొంపెలర్ప
నభినవంబైన యా వసంతాగమమున.

12


వ.

ఇట్లు త్రిలోకీమనోహరంబైన వసంతంబు ప్రవర్తిల్లిన
నయ్యాదిమసార్వభౌముండు.


గీ.

పటునవద్వయద్వీపసంప్రాప్తి గాంచి
విమలచంద్రమతీకటిద్వీపవాంఛ
వెట్టె నపుడు త్రిశంకుభూవిభుసుతుండు
గలదె ఫలతృప్తి వసుమతీకాంతులకును?

13

సీ.

ఎలనాగపల్కుల కెన గావటంచునో
                  చెవియొగ్గి వినఁడయ్యెఁ జిలుకపల్కు
లింతినెమ్మోముతో నీడుగాదంచునో
                  తళుకుటద్దముఁ జూడఁ దలఁపఁ డయ్యెఁ;
బూఁబోఁడిబాహులఁ బోలలే వంచునో
                  పూవుదండలు మేనఁ బూనఁడయ్యెఁ;
బొలఁతి మైతావితోఁ బురుడుగా దంచునో
                  మొనసి శ్రీగంధంబు ముట్టఁడయ్యె;
బోటినిట్టూర్పుగాడ్పుతో సాటిగా ద
టంచునో యుశీరతాలవృంతానిలంబు;
సొంపునకు నించుకేనిఁ గాంక్షింపఁడయ్యె
మదనసాయకఖిన్నుఁడై మనుజవిభుఁడు.

14


గీ.

తత్కథామృతసేవనతత్పరతను
నృపతిచిత్రవిలోకనానిమిషవృత్తిఁ
దెఱవ యాహారనిద్రలు మఱిచిపోయె
నితరభోగపరిత్యాగ మెన్ననేల?

15


గీ.

మేను గృశియించె ధైర్యసమృద్ధితోన,
కాలమును వింతతోన దైర్ఘ్యము వహించె
గాలి వేఁ డయ్యె నిట్టూర్పుగాడ్పుతోన,
విరహసంతాపభరమున వెలఁది కపుడు.

16

క.

అళుకొంచె నప్పు డాతొ
య్యలి మధుకరనికరశుకపికావళికిన్, జా
బిలికిన్, జిలిబిలివలికరు
వలికి, న్విరివిలుతు నెక్కువ హళాహళికిన్.

17


గీ.

చిత్తరువుబొమ్మవలె నుండె జెయువుఁదక్కి,
పాండిమ వహించి శశిరేఖ భంగిఁ దోఁచె,
నలరుతీవియఁబోలె నతాస్య యగుచు,
శోభ యొసఁగదె వికృతియు సుందరులకు!

18


గీ.

అతనుతాపంబు గావింత మనుచుఁ గోరి
సఖులు శైత్యోపచారము ల్సతికిఁ జేయ
దైవ మొండొకయర్థంబు దాగ్రహించి
యతనుతాపంబు గావించె నబ్జముఖకి.

19


గీ.

ఒగి దివారాత్రములు తరణ్యు డుపయోగ
ములఁ బడియు నింటికి వియోగజలధి దాఁటఁ
గా నొకించుక శక్యంబు గాకపోయె
నతనుశరవృష్టినీరంధ్ర మగుచుఁ బర్వ.

20


గీ.

ఎగిరిపడి కోయిలలు గన్ను లెఱ్ఱఁజేసెఁ
బండ్లు గొఱికెను రాచిల్కపఙ్క్తులెల్ల
దర్పకుఁడు దాడిఁజూపంగఁ దద్భటాళి
దరుణిమీఁదను దయఁజూడఁదలఁచు నెట్లు?

21

గీ.

మలయపవమానపాణింధమప్రవర్ధ
మానపల్లవశిఖియుతోద్యానవిహృతి
కిని నొకింతయు మదినిఁ గాంక్షింపదయ్యెఁ
గొమ్మ యోర్చునె నవనీతకోమలాంగి.

22


క.

కిసలయమృదుతల్పపితృ
ప్రసూప్రభలు గానుపింప బటుమోహతమం
బెసఁగ శ్రమబిందుతారా
విసర మడర సతికి రాత్రవిధ మయ్యెఁ బగల్.

23


గీ.

విరహపాండురతాజ్యోత్స్నవిలసనంబు
నతను తాపాతపస్ఫూర్తి యలముకొనఁగ
రేయి పగ లిది యని యేర్పరింపరామి
ముదిత నేత్రాంబుజము లరమోడ్పుఁ గాంచె.

24


వ.

ఇట్లు విరహదోదూయమానమానస యగు చంద్ర
మతిం జూచి వయస్యలు తత్తాపోపశమనార్థంబు మదన
తుహినకరణ మలయపవనాదుల నిట్లని స్తుతియించిరి.


క.

పురుషోత్తమాత్మజుఁడ నై
వనసుమనోధర్మ మూని వర్తిల్లెడు నీ
కరవిందపత్రలోచనఁ
గరుణింపఁగరాదె మదన! కరుణాసదనా!

25


వ.

అని చంద్రు నుద్దేశించి,

మ.

అమృతాంభోనిధి లక్ష్మితోడ నుదయంబై రాజనంబొల్చి తో
రముగా సత్పథవర్తినా నెగడి సర్వజ్ఞావతంసుండవై
కమనీయాఖిలసద్గణంబులనుతుల్ గైకొన్నని న్నెన్న శ
క్యమె? యీ యుత్పలపత్రలోచనఁ గృపం గాపాడు రాకాశశీ!

26


వ.

అని మలయపవమాను నుద్దేశించి,


శా.

శయ్యాదంభమున న్మురాంతకుఁడు భూషాకైతవస్ఫూర్తిచే
నయ్యార్యారమణుండు దాల్చిరి భుజంగాధీశుల న్నీయసా
హాయ్యప్రస్ఫుటధాటి కోర్వ కనుచో నబ్జాలాస్యలా యోర్చువా
రయ్యా గంధసమీర ప్రోవగదవయ్యా యీకురంగేక్షణన్.

27


వ.

అని ప్రశంసించి తదనాభిముఖ్యంబున కిట్లని యుపా
లంభించిరి.


గీ.

కొమ్మల నదల్చు నెప్పుడుఁ గమ్మగాలి,
విధుతనయుఁడు మనోజుఁడు, మధుఁడు జాతి
వైరి, దోషాకరుం డుడువల్లభుండు
గలికి, వీరికి సుగుణంబు గలుగు టెట్లు?

28


వ.

అని మనోభవు నుద్దేశించి,


క.

వనముననె సంభవించియు
వన మేర్చుదవానలంబు వరుసయెఱిఁగి కా
మనమున జనించి మన్మథ,
మనము గలంచంగ నీవు మదిఁ డలఁచితి వౌ.

29

క.

పలుసాధనములు దాల్పక
నలరుం గైదువులు దాల్చునట్టి మత మహో
తెలియఁబడె మాకు సుమకో
మలగాత్రల నేచఁగాదె మనసిజ, నీకున్.

30


గీ.

తోడఁబుట్టువునింటికిఁ గీడుఁదలఁచు
నట్టిదోషాకరుండ నీ వని శశాంక,
నిన్ను సుతుఁడని చూడక పిన్ననాఁడె
భవజటాటవీవాటిపా ల్పఱిచెఁ గడలి.

31


గీ.

విసము గంఠంబునను దాల్చి విసముకంటె
నతిభయంకరమూర్తి నీ వని శశాంక,
యుత్తమాంగంబునందు ని న్నుంచె హరుఁడు
వ్యర్ధమే, శర్వ సర్వజ్ఞవైభవంబు.

32


తే.

చల్లగానున్న యట్లుండి చంద్ర నీవు,
విరహిణీప్రాణనిహతిఁ గావింతు వెపుడు
జలువ మైనంటి కాదె రుజం గృశించు
భూతకోటులప్రాణముల్ వుచ్చికొనుట.

33


క.

కాకోదరములవలెనే
లోకభయదుఁడ వని మనసులోఁ దలఁచి విభూ
షాకలనను సర్వజ్ఞుఁడు
గైకొనెఁ బాండురుచి సహజకౌటిల్య! నినున్.

34

క.

కుండలితఫణివి యటుగా
కుండినఁ బలుమాఱు రాహు వొడిసిన సప్రా
ణుండ వయి యుండనేర్తువె
పాండుమరీచిమరుదశన, భర్గాభరణా?

35


చ.

త్రిపురహరుండు లోకహతికృద్భయదామితకాలకూటము
న్నిపుణత మ్రింగి తత్సహజు నిన్ బ్రతిపాకము చేసి మ్రింగఁడే
యపుడు సుధామయూఖసమయంబును నాత్మ నెఱింగి నీవు గూ
ఢపదవిభూషణోన్నతజటావనవాటిని డాఁగకుండినన్.

36


మ.

తొలుత న్నిప్పులకుప్పచందమునఁ దోడ్తో నెంతయు న్ఘోరకుం
డలితాహీంద్రముచాడ్పున న్సహజచండత్వంబు నీ రూపమే
యిలపైఁ జెప్పక చెప్పెఁ బాంథతతికై యేతాదృశుం జంద్ర, ని
న్నలరం బ్రోవుమటంచు వేఁడదగునా యస్మాదృశు ల్వీఱిడుల్.

37


క.

పడఁతుకచన్ను లరుల్ క్రొ
మ్ముడి చీఁకటిగుంపు వక్త్రము సరోరుహ మం
చిడుమం బెట్టకు శశధర,
యుడునఖరఁ జకోరనయన నుత్పలగంధిన్.

38


వ.

అని మలయపవమాను నుద్దేశించి,


చ.

శమనునిదిక్కునం బొడమి సర్పముఖంబుల బైలువెళ్లి ని
త్యమును బలాశసంగతులు దప్పకఁ ద్రిమ్మరు నట్టినాలిబూ

తమ, పవమాన, నీకుఁ గలదా మఱి భూతదయార్ద్రబుద్ధి? యు
క్తమకద నీకుఁ గొమ్మల నదల్చుట; నీవడి ధూళిపాలుగాన్.

39


వ.

అని విరహిణీధైర్యవిదళనచుంచువ్యాహారంబగు రాజ
కీరంబుంగని యిట్లని యూపాలంభించిరి:


గీ.

పరభృతంబుగానఁ బరికించి యొకవేళఁ
గోకిలంబు సేయఁగూడుఁగాక;
కాంతనామధేయ మెంతయుఁ గైకొని
చిలుక, నీకు వెట్ట సేయఁదగునె?

40


వ.

అని,


గీ.

పడఁతి విరహార్తి నెన్ని యుపాయములను
శాంతిఁ బొందింప నెచ్చెలు ల్చాలరైరి;
వనజముఖి నిమిషం బొక్కవత్సరముగఁ
గడుపుచున్నది వేదనాగౌరవమున.

41


వ.

తదనంతరంబున నుశీనరధరావరాగ్రేసరుండు వయ
స్యలవలనం జంద్రమతి చిత్తంబు హరిశ్చంద్రనృపాయ
త్తంబగుట యెఱింగి పరిణయచికీర్షాధీనమానసుండై తన
పురోధసుండగు దృఢవ్రతునిం బిలిపించి యిట్లనియె:


గీ.

చంద్రమతిచిత్త మా హరిశ్చంద్రనృపుని
యందు నెలకొల్పియున్న దా యతివతెఱఁగు
నీ వయోధ్యకు వెళ్లి యానృపతిమణికి
విన్నపముఁ జేసి తోడ్తెమ్ము విప్రవర్య!

42

ధృఢవ్రతుఁ డయోధ్యకు వచ్చుట

క.

అన వల్లే యని భూసుర
తనయుఁకు దనపేర నుడుసుధాకరబలము
ల్చనుపడు నొక్కముహూర్తం
బునఁ జనుడుం బూర్ణకుంభములు రెండెదుటన్.

43


క.

కనిపించిన శుభశకునం
బని భూసురవరుఁడు గతిపయదివంబులకు
స్వనములు పురములు నదులును
జనపదములు గడచి కాంచె సాకేతంబున్.

44


వ.

ఇట్లు గనుంగొని యా రాజధాని యదృష్టశ్రుతపూర్వ
శృంగారంబున కచ్చెరు వందుచుఁ బణ్యవీథిం జనువాఁడు
వివిధవర్ణాంబరరత్నపరంపరలయు, నానావిధామ్లాన
సూనమాలికలయుఁ, గర్పూరకస్తూరికాహిమజలాది
సుగంధిద్రవ్యంబులయు, సద్యఃకదుష్ణతప్తక్షీరాదిపానీ
యంబులయుఁ, గ్రాయకశక్త్యనుసారమూల్యరాత్రింది
వక్రయ్యాల్పేతరత్వంబుల కరుదెంచుచు నొక్క బ్రాహ్మ
ణగృహంబున విడిసి యనంతరంబు నిరంతరయాతాయాత
మూర్థాభిషిక్తపరంపరాపరస్పరముకుటకషణ
చ్ఛురితమణిగణశర్కరిలం బగు నృపసభాభవనద్వా
రంబునం గొంతదడవు నిలిచి తత్ప్రాజ్యసామ్రాజ్య

వైభవంబునకు విస్మయాకాంతనిజస్వాంతుండై దౌవా
రికప్రయత్నంబున హరిశ్చంద్రుసమ్ముఖం బగుటయు.


సీ.

నందనం తే విప్రవల్ల భాదిమసార్వ
                  భౌమ తుభ్యం సదాభద్రమస్తు
అత్రోపవిశ భవదాగమనం కుతో?
                  విజయాస్పదపురా ద్వివేకధుర్య
తవనామ కిం ద్విజోత్తమ? దృఢవ్రత ఇతి
                  ప్రాహు ర్మనీషిణః పార్థివేంద్ర
యుష్మదాగమనప్రయోజనం కిం విప్ర?
                  రహసి వక్ష్యే ధరారమణవర్య
యనుచు నన్యోన్యపరిభాష లాడి పిదప
సముఖమందున్న యాశ్రితజనుల నెల్ల
వేఱొకనెపంబుఁ గల్పించి వీడుకొల్పి
మంతనంబుండె వసుమతీకాంతుఁ డపుడు.

45


వ.

అంత దృఢవ్రతుండు సమ్రాట్ఛిరోమణి కిట్లనియె.


సీ.

దేవ యుశీవరక్ష్మావల్లభునకును
                  సుత దనరును జంద్రమతి యనంగ
నారాజముఖి చిత్రకారులవలన నీ
                  కమనీయరూపవిభ్రమముఁ గాంచి

నీయంద డెందంబు నెలకొల్పి నిర్భరా
                  నంగజార్తినిఁ గుందు టరసి నృపతి
యాకన్యకామణి నీకు నర్పింపంగఁ
                  దలపోసి నీసన్నిధానమునకు
నన్నుఁ బుత్తెంచె విజ్ఞాపనంబు సేయఁ
జిత్తగింపుము నేను వచ్చినతెఱంగు
సరసశుభమూర్తి వినిహతసంశ్రితార్తి
సాధుకీర్తి హరిశ్చంద్రచక్రవర్తి.

46


వ.

తదీయసౌందర్యాతిశయంబు చిత్తగింపుము.


సీ.

కాలిగోరునఁ బోలఁగా లేవు చుక్కలు
                  చుక్కవంటిదియన సూటిపడునె?
గమనరేఖకు నుద్ది గాఁజాల వంచలు
                  హంసవంటిదియన ననువుపడునె?
దంతమంజిమకు ముక్తాపరంపర లోడె
                  నాణిముత్తెమువంటి దనఁగఁ దగునె?
శశిమోము నన పోలఁ జాలమి శశిరేఖ
                  వంటిదియని పల్క వాటపడునె?
కలికిపలుకులకే యోడెఁ జిలుకపిండు
చిలుకవంటిది యంచు వచింపఁదగునె?
కాన నతిలోకసౌందర్యగరిమ గలుగు
తరుణి కెనయైనవస్తువు ధరణిఁ గలదె?

47

ఉ.

ఆనగుముద్దుమోముసొగ, సాయిఱిగుత్తపుచన్నుదోయితీ,
రానునుఁదళ్కుమేనిహొయ, లాతెలివాలికకన్నుదోయియొ,
ప్పానెఱికీలుగంటునొఱ, పాయసదున్నునుఁగౌనుచెల్వ మా
హా, నుతియింపఁగా వశమె యాగజయానయెయార మేరికిన్?

48


క.

లోకత్రయాభినంద్యశు
భైకవయోరూపగుణసమగ్రిమచేత
న్నీకుఁ దగు నావధూమణి,
యాకన్యకు నీవ తగుదు వవనీశమణీ!

49


క.

కులరూపగుణసమగ్రిమ
గలజవ్వని గలుగు టరుదు గలిగినయేని
న్నలువకు వేమోములుగల
చిలువకుఁ దన్మహిమ వినుతి సేయందరమే?

50


క.

ఆపుంస్కోకిలవాణికి
నీపయిఁగలకూర్మిచేత నిద్రాహార
వ్యాపారము లుడిగెను వసు
ధాపాలక, చెప్పనే లితరభోగేచ్ఛల్?

51


క.

తెలుపుడు చేయంగలనా
చెలియమనోవ్యథ; శుభస్యశీఘ్ర మ్మను న
ప్పలు కాదరింపఁగావలెఁ;
బలుకులు వేయేల ధరణిపాలవతంసా!

52

వ.

అనిన నౌశీనరీసుందరాంగీపరిణయాంగీకరణభంగీ
పేశున మందహాసనకందళసుందరవదనారవిందుండై త్రిశం
కునందనండు మహర్షిశ్రేష్ఠుడగు వసిష్టుం బిలిపించి యిత్తె
ఱం గెఱింగించిన యోగ్యసంబంధం బెనసెనని సంతోషించె.
రాజేంద్రుండును వివాహలగ్నం బొకండు నిశ్చయించునది
యని యానతిచ్చిన నరుంధతీజాని దృఢవ్రతునిం బిలిపించి
దంపతుల పేరం బంచాంగశుద్ధియు, సూర్యసంక్రమసగ్రహ
పాపషడ్వర్గభృగుషట్కదంపత్యష్టమకుజాష్టమకుజనవాంశ
క్రూరర్క్షచంద్రషష్ఠాష్టమవ్యయస్థితిప్రభృతిదోషరహి
తంబగు నొక్కకల్యాణలగ్నంబు సిద్ధాంతీకరించి లగ్న
పత్రిక వ్రాయించి కర్పూరవీటికాసహితంబుగా దృఢవ్రతు
నకు సమర్పించె. సార్వభౌముండును సువర్ణాంబరాభరణంబుల
దృఢవ్రతుని బహూకరించి వీడ్కొలుపుటయు,


శా.

కైలాసాద్రిదరీవిహార, ఫణిరాడ్గ్రైవేయసంశోభితా,
నీలగ్రీవ, జగత్త్రయాననకళానిష్ణాతచంచద్భుజా,
నాళీకాసనవంద్య, భక్తహృదయానందానుసంధాయకా,
ప్రాలేయాద్రిసుతాపృథుస్తనపరీరంభప్రియంభావుకా!

53

క.

త్రిపురభిదాచణభుజబల,
కపటకిరాత, యఘదమనగంగాభరణా,
తపనగ్లావనలేక్షణ,
కృపాళునిజహృదయసేవ ధీశ్వరమిత్రా!

54


స్వరధిపముఖదివిజవినుతచరణా,
సరసిరుహనయనసఖగిరిశరణా,
స్మరదమన, పరమసదమలచరితా,
సరసవచన కవిజనజలజరనీ!

55

గద్య:
ఇది శ్రీమదశేషమనీషిహృదయంగమమృదుపద
నీరంధ్ర శుద్ధాంధ్రరామాయణఘటనావైదుషీ
ధురంధ రాడిదము బాలభాస్కరకవితనూభవ
సరసకవిత్వవైభవసౌజన్యనిధాన సూర
యాభిధానప్రణీతం బయిన కవిజనరంజనం
బను మహాప్రబంధంబునందు
ద్వితీయాశ్వాసము.