Jump to content

కవిజనరంజనము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

కవిజనరంజనము

తృతీయాశ్వాసము

శ్రీకాళికామనోహర,
లోకత్రయరంజనైక లోలుపహృదయా,
యాకాశకేశ, వందిత
నాకేశా, రామచంద్రనగరనివేశా!

1


వ.

అవధరింపుము:


క.

సంతసముఁ జెంది భూసురుఁ
డంత న్విజయాస్పదమున కరిగి ధగిత్రీ
కాంతునిఁ బొడఁగాంచి శుభో
దంతము వినుచుటయు నతఁడు హర్షముఁ జెందెన్.

2


వ.

అంతఁ జంద్రమతికిఁ దద్వృత్తాంతం బెఱింగించి,


క.

అమితోత్సాహంబునఁ జం
ద్రమతీకల్యాణవార్త ప్రజ లెఱుఁగఁగ భూ
రమణుం డాస్థాననివే
శమునం బ్రస్థానభేరి సఱువంబంచెన్.

3


వ.

అప్పుడు ప్రధానులం బిలిపించి వీడుగై సేయించి వివాహ
యోగ్యద్రవ్యంబులు సమకూర్చునది యని యానతి
చ్చిన,

సీ.

కస్తూరిపన్నీటఁ గలయంపిఁ జల్లించి
                  ముగ్గులు ముత్తియంబుల నమర్చి,
బంగారుమగరాలపగడంపుగొణిగలఁ
                  గురువేళ్లఁబందిళ్లు కుదురుపఱిచి,
తీరుగా మరకతతోరణంబులు గట్టి
                  మేలుక ట్లంతటఁ గీలుకొలిపి,
చంద్రకాంతవితర్ది సవరించి కల్యాణ
                  మంటపం బొక్కఁడు మట్టుపఱిచి,
పొంకముగ నిట్లు నగరం బలంకరించి
పర్వతమునంతపొడవుగాఁ బరిణయార్హ
వస్తువులు గూర్చి సామంతవర్గమెల్ల
బ్రభున కెఱిఁగింప సంతోషభరముఁ బూనె.

4


వ.

అంత నక్కడ వసిష్ఠుండు మంత్రులం బిలిపించి హరి
శ్చంద్ర వివాహమహోత్సవంబునకు నిఖిలదిగ్దేశవ
సుంధరాపతులం బిలువనంపుఁడని నియోగించిన,


చ.

సకలనృపాలకోటికి వెసన్ శుభలేఖలు వ్రాసిపంప భ
ద్రకరితురంగమాభరణరత్నపరంపరలెల్లఁ గొంచుఁ బా
యక తముఁ జుట్టుముట్టి చతురంగబలంబులు కొల్చిరా నయో
ధ్యకుఁ జనుదెంచి రప్డు చతురర్ణవమధ్యమహీతలాధిపుల్.

5


వ.

అప్పుడు హరిశ్చంద్రుండు:

సీ.

సముచితమంగళస్నానపుణ్యాహవా
                  చనముఖ్యకృత్యము ల్చతురవృత్తి
దీర్చి, భక్తి నరుంధతీవసిష్ఠులకును
                  నభినతి చేసి, తదభ్యనుజ్ఞఁ
గమనీయమణికిరీటము మౌళిఁ దాలిచి,
                  కలికికట్టాణిచౌకట్లు వెట్టి,
వలిపెబంగరుసాలు వలెవాటుగా వైచి,
                  కేయూరహారము ల్గీలుకొలిపి,
వ్రేళ్ల మహనీయరత్నముద్రికలు దాల్చి,
పచ్చలకడెంబులును సరపణులు పూని,
భద్రదంతావళం బెక్కి ప్రభువరుండు
నుదయగిరిఁ దోఁచుఁ భానున ట్లుల్లసిల్లె.

6


సీ.

ఘోషించెఁ దొలుత దిక్కూలంకషోత్తుంగ
                  భేరికాభయదభాంకారరవము,
లంతట దిక్తటం బలమెను నిర్వక్ర
                  రథచక్రనేమిఘర్ఘరరవంబు,
ప్రబలె నా వెన్క నిజ్జాడ్యగర్జారవో
                  దారమత్తేభఘీంకారరవము,
లా వెన్క నత్యుగ్ర మగుచు రోదసి నిండెఁ
                  జటులగంధర్వహేషారవములు,

భూసురాశీరవంబులు పొలుపుమీఱె,
బహుళమర్దళకాహళార్భటులు చెలఁగె,
వేత్రధరహుంకృతులు వందివినుతు లడరె,
నవనివల్లభుకల్యాణయాత్రవేళ.

7

హరిశ్చంద్రుని వివాహయాత్ర

సీ.

శ్వేతాతపత్రాళి చీఁకట్లు దొలఁగించె
                  రాజన్యభూషణరత్నరుచులు,
తురగఖురోద్ధూతధూలిపెం పడగించెఁ
                  గరిపుష్కరోజ్ఝతకంకణములు,
సింధురమదవృష్టి సింధుల నింకించె
                  సామంతమకుటకర్షణరజంబు,
సైన్యసమ్మర్దసంజనితోష్మఁ దొలఁగించె
                  నమితపతాకాంబరానిలంబు,
సైన్యజనితావరోధంబు సైన్యముననె
తొలఁగెనని సైనికాళి సంతోషమందఁ
జనియె సైన్యంబు కతిపయదినములకును
రమ్యవిజయాస్పదపురీవరంబుఁ జేర.

8


వ.

అంత,

మ.

అతులోత్సాహముతో నుశీనరధరాధ్యక్షుండు దానాప్తసం
తతితో బంధులతోఁ బురోహితులతో నానానృపశ్రేణితో
జతురంగంబులతో నెదుర్కొని హరిశ్చంద్రాధిపుం దోడితె
చ్చి తగం గాంచనసౌధపాళి విడియించె న్నేర్పు దీపింపంగన్.

9


చ.

మరకతసమంచితకాంచనరత్నవేదులన్
సురుచిరకాయమానముల శోభితపట్టవితానపంక్తులం
బరిమళవస్తుజాలముల భాసిలు బల్విడిదిండ్లు చూపినం
బరిణయవీక్షణాగతనృపాలకకోటి వసించె నందులన్.

10


క.

ఎక్కడఁ జూచినఁ గాల్బల,
మెక్కడఁ జూచిన రథంబు లిభతురగచయం,
బెక్కడఁ జూచినఁ దామై
క్రిక్కిఱిసెం బైటనాల్గు కెలఁకుల సేనల్.

11


క.

నరవరశిరోమణి యుశీ
నరునిసభామంటపంబునం జంద్రమతీ
పరిణయకర్ణేజపములు
పరగెం బ్రస్థానభేరిభాంకరణంబుల్.

12


గీ.

అంతట నుశీనరుఁడు మఱికొంతవడికి
మంత్రులను బిల్చి కల్యాణమందిరమున
నధిపుఁ దోడ్తెచ్చునది యని యానతీయ
వేడ్క రాజేంద్రునకు విన్నవించుటయును.

13

సీ.

రాజన్యకోటీర రత్యమరీచులు
                  గరదీపికాప్రభల్ గలసి మెలఁగఁ,
నాభీలపటుభేరికాభూరిభాంకృతుల్
                  మత్తేభఘీకృతుల్ మైత్రి సలుప,
నుర్వీసురప్రజాశీర్వాదనాదముల్
                  విమలవందిస్తుతు ల్వియ్యమంద,
వారాంగనాదత్తనిీరాజనాంశువుల్
                  హైమవేత్రద్యుతు లల్లుకొనఁగ,
భజ్రకరి నెక్కి రూపవైభవసమృద్ధి
దర్శనవ్యగ్రపౌరసంతతికి నేత్ర
పర్వ మొనరించుచును సార్వభౌముఁ డపుడు
భూతలాధిపుశుద్ధాంతమునకు వచ్చె.

14


క.

మూకలయి జవ్వనులు త
న్నాకాంక్షను జూడ హస్తిపాంకుశకృతసం
జ్ఞాకుంచితాంఘ్రికరి డిగె
భూకాంతుఁడు కొదమసింగము గిరింబోలెన్.

15


వ.

ఇట్లు భద్రదంతావళంబు డిగ్గి సముచితపరివారబం
ధునృపపురోహితసహితుండై కక్షాంతరంబులు
గడిచి, యెడనెడ సువాసినీదత్తనీరాజనోపచారంబు
లంగీకరించుచుఁ గర్పూరదీపికాగంధిలంబును, ఘనసార

చూర్ణవిరచితరంగవల్లికారాజమానంబును మరక
తతోరణాలంకృతంబును, బరిణతఫలరంభాస్తంభ
శాతకుంభపూర్ణకుంభాభిశోభితంబును, జూతపల్లవ
సమిల్లాజాక్షతభాసమానంబును, బరిణయోచితవస్తు
పరంపరానయనవ్యగ్రపురోహితవ్యాకులంబును,
సువర్ణమయవేదికాద్వితయాలంక్రియమాణంబును,
నగు కల్యాణమంటపంబుఁ బ్రవేశించి యుశీనరమహీ
జానికి నమస్కరించి తదీయహస్తనిర్దిష్టసమున్నతా
ష్టాపదపీఠికాభ్యాసీనుం డయ్యె నయ్యవసరంబున;


క.

మునివరుఁడైన వసిష్ఠుఁడు
జనపతి వీక్షించి లగ్నసమయము గావ
చ్చెను బెండ్లికూఁతుఁ దోడ్తేఁ
బనుపు విలంబనము సేయఁ బనిలే దింకన్.

16


క.

అని యానతీయ వల్లే
యనుచు నుశీనరధరావరాగ్రణి ప్రమదం
బును జెంది యచ్చటిసువా
సినులకుఁ దోడ్తెండటంచు సెలవిచ్చుటయున్.

17


వ.

అంత నంతఃపురంబునకుం జని చంద్రమతిం దోడ్తెచ్చి
సువర్ణపీఠికం గూర్చుండఁబెట్టి,

చ.

జిలుఁగుపయంట దూల నునుఁజెక్కుల లేచెమ టంకురింప గు
బ్బలు నటియింపఁ దాళగతి బంగరుగాజులు మోయ హారము
ల్మెలిగొన నూర్పు లుప్పతిల లేనడు మల్లలనాడ మెల్లనే
యలికులవేణి యోర్తు శిరసంటెను గెంజిగురాకుబోఁడికిన్.

18


క.

తలదువ్వె నొక్కజవ్వని,
నలుఁగిడె నెమ్మేన నొకవనజముఖి, గంధా
మలకంబు వెట్టె నొకసతి,
జలకం బార్చె నొకలేమ చంద్రాసనకున్.

19


చ.

కలపము మై నలంది, యలికంబునఁ గస్తురిబొట్టు వెట్టి, వే
నలి విరిదండఁ జెర్వి, నయనంబులఁ గజ్జలరేఖఁ దీర్చి, చె
క్కుల మకరీకలాపము గూర్చి, యమూల్యవిభూషణాంబరం
బులు గయిసేసి రాసతికిఁ బ్రోడితనంబులు మీఱ జవ్వనుల్.

20


క.

రమణీజనము లొనర్చిన
యమలిన కల్యాణసముచితాలంక్రియ చం
ద్రమతీముఖహిమకరబిం
బమునకుఁ గార్తికివలెం బ్రబలరుచి యొసఁగెన్.

21


గీ.

చికిలి చేసిన మరుచేతిచిక్కటారి
యనఁగ సముచితశృంగార మలవరించి
పెండ్లికూఁతును గావించి పేరఁటాండ్రు
వెలఁదిఁ దెచ్చిరి కల్యాణవేదికడకు.

22

వ.

ఇట్లు తోడ్తెచ్చినఁ దెరయెత్తి రనంతరంబ యుశీనరుం
డాదిమసార్వభౌమునకు యథావిధి మధుపర్కాది
మంగళార్హణవిధానంబు లొసంగి,

చంద్రమతీహరిశ్చంద్రులవివాహము

క.

సుమతి యుశీనరుఁ డప్ప
ద్మముఖిం దన కూర్మిసుత 'నిమాం కన్యాం తు
భ్య మహం సంప్రదదే' యని
ప్రమదంబున ధారవోసె రాజేంద్రునకున్.

23


గీ.

భూజనాసేచనకరూపములఁ దనర్చు
దంపతులమధ్యమునఁ దెర పెంపుమీఱె
రోహిణీపూర్ణశర్వరీంద్రులనడుమను
గదిసియున్న శరన్మేఘఖండ మనఁగ.

24


క.

అంత మఱికొంతవడికిం
గాంతలు తెరవంపఁ గుసుమకార్ముకశృంగం
బెంతయు వంచెను గంతుం,
డింతి త్రపావాప్తి మో మొకించుక వంచెన్.

25


గీ.

తగవుబలిమిని గొంకొకింతయును లేక
తనదుమదిఁ బట్టజాలని తనివి దీఱఁ
బూర్ణచంద్రుని నిరసించు పూవుబోఁడి
యాననాబ్జంబు వీక్షించె నవనివిభుఁడు.

26

గీ.

నానమైఁ గొంకు గదిరెడునాతివీక్ష
ణంబు లనియెడి యరివిరినల్లగల్వ
తూపులను విభుధైర్యంబుఁ దూలనేసి
యలరుఁగైదువజోడు బిట్టార్చె నపుడు.

27


గీ.

ఇంతిసౌందర్యరేఖాదిదృక్షచేత
నెపుడు తెర వంతురను, వంచినపుడు గోరు
నిమిషపరికల్పితాంతరాయము విదిర్చ;
భూమిపతులందు వాంఛాప్రపూర్తిగలదె?

28


వ.

తదనంతరంబ,


చ.

అలఁతికవు న్వడంక వలయధ్వనినిర్మలబాహుమూలకాం
తులు గొనియాడ లేనగవు తొంగలిరెప్పల డాఁగ హారము
ల్మెలిగొన జిల్గుపయ్యెద చలింపఁ గుచద్వయి రాయిడింబడం
జెలి దలఁబ్రాలు వోసె నృపశేఖరునౌదలపైని దోయిటన్.

29


మ.

అలమన్ మైఁబులకాంకురాళి దగహాసాంకూరము ల్కన్గవం
దొలక న్ముత్యపుటొంట్లు గండయుగళిం దూఁగం గనత్కంకణం
బులు మ్రోయ న్భుజమధ్యసీమరతనంపుందాళి తార్మాఱుగాఁ
దలఁబ్రా ల్వోసె లతాంగియౌదలపయిన్ ధాత్రీశుఁ డత్యాదృతిన్.

30


క.

తలఁపునఁ బేర్కొనుకోర్కుల
చెలువున నొకచేతి కొక్కచే యెచ్చనఁగాఁ
జెలిపైఁ బతి పతిపైఁ జెలి
తలంబ్రా ల్వోసిరి మనోరథము లీడేఱన్.

31

క.

మంగళతూర్యంబులు పు
ణ్యాంగనలశుభార్హగీతికారావము లు
ప్పొంగంగ హరిశ్చంద్రుఁడు
మంగళసూత్రంబు చంద్రమతికిం గట్టెన్.

32


క.

కువలయదళాక్షీహస్తము
కువలయపతి కేలఁ గీలుకొలిపె నొకసరో
జవిలోచన యిరుగేలను
నవపులకస్వేదజలకణంబులు గదురన్.

33


వ.

అనంతరంబ యరుంధతీవసిష్ఠపురస్సరంబుగాఁ గల్యా
ణమందిరంబుం బ్రవేశించి యగ్నిప్రతిష్ఠాపనానంతరంబున,


క.

అనఘ వసిష్ఠమహాముని
ఘనతరమంత్రావసానఘటితస్వాహా
నినదానుసరణిఁ దనిపిరి
యనలుని దంపతులు నవగవాజ్యాహుతులన్.

34


క.

వనితామణిపాదాబ్జము
తసహస్తాబ్జములఁ బట్టి దరహాసరుచుల్
కనుఱెప్పలలోఁ డాఁచుచు
సనికల్ ద్రొక్కించె రాజు జవ్వనిచేతన్.

35


క.

చనుదోయి బాహు లాడం
గను, దాటంకములు దూలఁ, గౌ నసియాడం

గ, నగల్ చలింప, లాజలు
వనజానన దోయిలించి వహ్ని న్వేల్చెన్.

36


ఉ.

భ్రాజదురోజసంపదకు బాహులతాభుజమూలదృగ్రుచుల్
తేజ మొసంగ; హారమణిదీప్తులు జిల్గుపయంటగుంపుపై
రాజిలఁ, గౌనుదీగలహొరంగులు చూడ్కికి విందు సేయ, నీ
రాజన మాచరించిరి చిరంటులు గొమ్మకు భూమిభర్తకున్.

37


సీ.

కేలుమోడ్చిరి ప్రదక్షిణపూర్వకంబుగా
                  నాశుశుక్షణికి నత్యాదరమునఁ,
గాంచిరి గ్రహతారకామండలోపరి
                  స్థానసంవాసి నౌత్తానపాదిఁ,
ప్రణతిఁ గావించిరి భక్తి నరుంధతీ
                  సీమంతినికిని వసిష్ఠునకును,
జేసి రుత్సవమునఁ జేలాంచలగ్రంథి
                  సముచితపరిణయాచారనియతి,
ద్విజవరేణ్యులు బహుపురంధ్రీజనములు
ప్రీతి నాశీర్వదించి యర్పించుశోభ
నాక్షతలు గైకొని ధరించి రౌదలలను
జంద్రమతియు హరిశ్చంద్రచక్రవర్తి.

38


వ.

దీనచతుష్టయానంతరంబున నుశీనరుండు దుహితృ
జామాతలం బయనంబు చేసి,

ఉశీనరుండు కూఁతున కరణ మిచ్చుట

క.

మత్తద్విపసాహస్రం,
బుత్తమతురగాయుతంబు, నురుమణిభూషల్
పుత్తడియరదము లొక నూ
ఱత్తఱిఁ బ్రియ మెసఁగ మామ యల్లున కొసఁగెన్.

39


సీ.

గుజరాతి కెంపులు, గోమేధికంబులు,
                  దారవజ్రములు, ముక్తాఫలములు,
కాటుకమచ్చముల్ కస్తూరివీణెలు,
                  గపురంపుఁగ్రోవులు, గందవొళ్లు,
కుంకుమపూవు, సంకుమదంబు, పన్నీరు,
                  తళుకుటద్దములు, రత్నపుబరిణెలు,
దంతపుదువ్వెనల్, తాంబూలపేటికల్
                  సవరముల్, మణిదండచామరములు
హారకేయూరకటకమంజీరముఖ్య
భూషణంబులు, పలువన్నెపుట్టములును
బ్రియముతో నిచ్చె గారాపుబిడ్డయైన
చంద్రమతికి నుశీనరక్ష్మావరుండు.

40


క.

మఱియు నుశీనరనరపతి
తఱచగుమణిభూషలు దొడి తనపుత్రికకున్

మెఱుపులువోని యొయూరపు
తెఱవలఁ బెక్కండ్ర నిచ్చె దృఢసంప్రీతిన్.

41


వ.

ఇ ట్లొసంగి యక్కూకుదాగ్రేసరుండు చంద్రమతిం
జూచి యిట్లనియె.


సీ.

అనుఁగుబిడ్డల భంగి ననుజీవులను బ్రోవు,
                  మిలువేలుపులఁ గొల్వు మేమఱికల,
బతికిముం దనుభవింపకు మేపదార్థంబు,
                  జవదాటకుము నిజేశ్వరునిమాట,
మగఁడు గావించిన మన్నన కుబ్బకు,
                  మదిఁ గృశింపకు మవమానమునకు,
నవనిసురాభ్యాగతార్థికోటుల నెల్ల
                  నాప్తబంధువుల య ట్లాదరింపు,
కరుణగల్గుము బంధువర్గముల కెల్ల
గురుజనంబుల సద్భక్తిఁ గొలువు మెపుడు
దైవమన్నను, గురువన్న, ధర్మమన్నఁ
బ్రాణనాథుండుసుమ్ము మాయమ్మకాన.

42

హరిశ్చంద్రుఁడు భార్యతో సాకేతంబు చేరుట

వ.

అని వీడ్కొలిపి యయ్యుశీనరభూజాని శిబిరంబెత్తఁ
బడవాళ్లం బంచినం జతురంగబలసమేతుండై హరి
శ్చంద్ర సార్వభౌముండు కతిపయప్రయాణంబులకు

నౌశీనరీవిలోకనవ్యగ్రపురంధ్రీవ్రాతంబగు సాకేతంబుఁ
బ్రవేశించి పుణ్యాహవాచనపూర్వకంబుగా గృహ
ప్రవేశమంగళాచారం బాచరించిన యనంతరంబ:


గీ.

నిజకులాలంకరిష్ణులై నెగడినట్టి
దంపతులశోభ నాగమోత్సవముఁ జూచి
యింటి కేగెడుగతి వాసరేంద్రుఁ డపుడు
చరమభూధరసానుదేశమున కొఱఁగె.

43


గీ.

అంత కంతకు దీర్ఘంబు లగుచు జగతి
నిగుడునీడలతోడనే నిగుడసాగెఁ
జక్రవాకావళీమానసవ్యథలును
బాంథజనకామినీనేత్రబాష్పములును.

44


క.

కొలఁకులఁ దమ్ములతోడన
నెలవుల నానావియోగినీసంఘాత
మ్ముల కనుదమ్ములు మొగిడెను
జలజాప్తుఁడు చరమశైలసానువుఁ జేరన్.

45


క.

జరఠారుణశోణకిరణ
పరంపరలు సాగె ధాత్రి పైని రథాంగో
త్కరముల మనములఁ జేరెడు
స్మరపావకశిఖ లనంగ సాంద్రం బగుచున్.

46

గీ.

అరుణపరిణతఫల మపరాద్రినాఁట
దోనయెఱసంజచివురాకుతో జనించె
రాత్రికుజము తచ్చాయనాఁ బ్రబలెఁ దమము
చుక్క లమఁరెఁ దదీయప్రసూనము లన.

47


క.

తరణిరథనేమిచూర్ణత
చరమగిరిమనశ్శిలారజము తద్వనసిం
ధురపుష్కరముల నెగసిన
కరణిని నెఱసంజరోచి గదిసెఁ బ్రతీచిన్.

48


గీ.

నృత్యదళికాక్షవేగాసహిష్ణుమాళి
గాంగజలజోద్గతశిలీముఖవ్రజంబొ;
సాంధ్యరాగహసంతిక సమయకాచ
కారకృతకాచచయమొ నాఁగఁ దమ మమరె.

49


సీ.

ధ్వాంతదంతావళోత్కరపుష్కరోద్ధూత
                  గగనగంగాపయఃకణము లనఁగ,
శర్వతాండవ దిదృటే సమాగత ని
                  ర్జరీహారమౌక్తిక శ్రేణు లనఁగ,
నభ్రకళిండజాహ్రదమున నిండార
                  విరిసినతెలిగల్వవిరు లనంగ,
భావినిశాచంద్రపరిణయంబున కీడు
                  దిక్కుడ్యములపిండిచుక్క లనఁగ,

గ్రిక్కిఱిసె నొక్కమొగి నెల్లదిక్కులందు
క్షీరఘనసారపాటీరతారహార
హీరపారదనారదశారదాభ్ర
గౌరరుచి మీఱఁ దారకావార మపుడు.

50


గీ.

తమమడరెఁ బాంథజనమోహతమముతోడ
వహ్ని వెలుఁగొందె మరుశౌర్యవహ్నితోడ
దారకలు దెల్విఁ గనె నభిసారికాప
రంపరలతోడ నెంతయుఁ బెంపుమీఱి.

51


గీ.

నృత్యదీశాట్టహాసస్తనితము లమర
నభినవతమోభ్రములు జగ మాక్రమించి
విరహిణీబాష్పములపేర వృష్టి గురిసి
జారిణీజారసస్యపుంజములఁ బెనిచె.

52


స్మరభూపాగమనప్రసారితసమచ్ఛాచ్చామరాందోళన
స్ఫురణంబుల్, హరతాండవాసహఫణీడ్ఫూత్కారముల్ కైరవి
ణ్యురుడోలాకలన ల్వియోగిజనదీర్ఘోత్కృష్టనిశ్వాసముల్,
చరియించెన్ జనతాసుఖప్రదములై సాయంసమీరౌఘముల్.

53


సీ.

యమునాపయఃపూర మనఁగ నిమ్నోన్నత
                  స్థలముల నెల్లెడ సమము పఱచి,
గంధాంధసింధురఘట యన నిశ్శంకఁ
                  బంకజాతమ్ములపొంక మడఁచి,

యసితాంబుదకదంబ మనఁగారుకొంచును
                  విరహిణీబాష్పాంబువృష్టి గురిసి,
యనుపమాంజనపుంజ మన నభిసారికా
                  జనము కన్నులఁ గప్పకొనఁదనర్చి,
స్వచ్ఛశిఖిపింఛతాపింఛగుచ్ఛభాసు
రచ్ఛవిచ్ఛటఁ దెగడు నీరంధ్రవృత్తి
నఖలదిక్కుహరంబుల నాక్రమించి
కానిపించెను గటికిచీఁకటులగుంపు.

54


శా.

తారామండలఫేనఖండపటలీధారాళపాండుప్రభాం
కూరంబు ల్సయిపై వెలుంగఁ దిశాకూలంకషం బౌచుఁ ద
ద్భూధ్వాంతకళిండజాపటుపయఃపూరంబు జృంభించి చ
ల్లారం జేసెను వ్రేల్మిడిం బ్రబలసంధ్యాజాతవేదశ్శిఖన్.

55


సీ.

దిద్దనికస్తూరితిలకంబు లాయెను
                  బాలేందునిభఫాలఫలకములకుఁ,
గూర్పనినీలిరంగులకంచుకము లయ్యె
                  గుత్తంపుబిగిచన్నుగుబ్బలకును,
దాల్పనితాపింఛతరుపల్లవము లయ్యెఁ
                  గొమరొప్పునెఱిగప్పు గొప్పులకును,
గీలుకొల్పని హరినీలంపుసరు లయ్యెఁ
                  గంబుసన్నిభచారుకంధరలకు,

జేయకయె చేయునట్టి కైసేఁత లయ్యె
నంధతమసపరంపర లనుచు బొంగి
యసమశరకేళులను నోలలాడెనపుడు
జారులను గూడి జారిణీసముదయంబు.

56


సీ.

పతులయందును బోలె బహువిధాలంకర
                  ణములయందు ననాదరము వహించి,
నిందయందును బోలె నిబిడతమిస్రవి
                  హారంబులందు భయంబు దక్కి,
వరకులాచారసంవర్తనంబునుఁ బోలె
                  మృదుతల్పసౌఖ్యంబుఁ బ్రిదిలఁ జేసి,
సముచితం బైన లజ్జాభరంబునుఁ బోలెఁ
                  బ్రియసఖీసఖ్యంబుఁ బిల్కు మార్చి
కుడ్యములు బొమ్మరిండ్లలాగునను దాఁటి
పాడుగోడలు కేళికాభవనములుగ
నసమశరకేళులను నోలలాడె నపుడు
జారులను గూడి జారిణీసముదయంబు.

57


క.

అమణిత, మబంధచాతురి,
యమూల్య, మనలంక్రియంబు, నసుగంధవిలే
ప, మతాంబూల, మపర్యం
కము నగు జారరత మపుడు గాటం బయ్యెన్.

58

క.

అమరాధీశదిశాభా
గమునందలి తెల్ల యపుడు గనపించె రజ
స్యమృతమయూఖమిధస్సం
గమసముచితహంసతూలికాతల్ప మనన్.

59


గీ.

అంబుజభవాండ మను హజారంబులోన
నలరుఁగైదువపాదుషా యధివసింప
సమయభృత్యుఁడు పెట్టు కెంజాయపట్టు
బటువుబిళ్లనఁ జంద్రబింబంబు దోఁచె.

60


క.

అప్పుడు చంద్రుం డొప్పె
న్నిప్పులకుప్పవలె విరహిణీమండలికిం
జిప్పిల నమృతమునించిన
గొప్పపసిఁడికుండవలెఁ జకోరంబులకున్.

61


మ.

యామవతీవధూటి బిగియారం గవుంగిటఁ జేర్చుటం దదం
గామలచందనంబు మయి నంటె ననం దెలుపయ్యె బింబ మా
కోమలగాత్రిగబ్బిచనుగుబ్బలకస్తురి ఱొమ్ము సోఁకెనో
నామహిఁదత్కళంకము గనబడెఁ గల్వలఱేని కయ్యెడన్.

62


క.

తిమిరాపహృతికిఁ గ్రోధర
సము పూనె సితాంశుఁ డుదయసమయంబునఁ ద
త్తమ మెడల సహజధవళిమ
నమరెన్ ద్విజరాజ కోప మతిదీర్ఘంబే?

63

మ.

కరమొప్పారు నిశానవోఢకు నిశాకాంతుండు మెల్మెల్లనే
కరము ల్సాఁచి తమోవినీలపట ముత్కంఠం దొలంగింప ని
ర్భరలజ్జం బతిమేనిపై ధవళవస్త్రంబు న్మెయిం గప్పుకొ
న్కర ణిం గ్రొందెలివెన్నెల ల్నిబిడమై కన్పట్టె నల్దిక్కులన్.

64


సీ.

కుముదినీజృంభణాంకురమూలకందంబు,
                  తోయజశ్రీపశ్యతోహరుండు,
సకలజీవంజీవసంజీవనౌషధి,
                  చక్రవాకీమనస్తాపకార,
తిమిరవారణఘటాసమదమృగేంద్రంబు,
                  చిత్తజమాంద్యవిచ్ఛేదనుండు..
నఖిలదిదృక్షుజనాసేచనకమూర్తి,
                  బహుళౌషధీప్రియంభావుకుండు,
సురలయాఁకటికూడు, మ్రుచ్చులకుఁ గీడు,
రిక్కలకు ఱేఁడు, వెలుఁగులయిక్కజోడు,
లచ్చిసైదోడు, రేబోఁటివెచ్చకాఁడు,
చంద్రుఁ డలరారె సత్కళాసాంద్రుఁ డగుచు.

65


క.

పొంగె బయోనిధు,లిరులు దొ
లంగెను, జక్కవలగమి కలంగె, మనములం
ద్రుంగె వియోగులధృతులు, చె
లంగెఁ జకోరము, విధూప లంబులు గరంగెన్.

66

సీ.

భన్యచకోరదంపతులకోరనికోర్కి,
                  వనజాతములకుఁ బెట్టనివిసంబు,
కాముకశ్రేణికిఁ గన్నులపండువు,
                  విరహిణీజనముల వేఱువిత్తు,
నభిసారికాసమూహము కాలిసంకిలి,
                  మ్రుచ్చుచేరువలకు విచ్చుమొగ్గ,
కైరవిణీసముత్కరము నోముఫలంబు,
                  కోకసంఘములకు గుండెదిగులు,
పండురేయెండ బ్రహ్మాండభాండములను
నిండుకొనియుండె డిండీరపుండరీక
కుండలీశ్వరమండలాఖండలేభ
ఖండనోద్దండపాండితి పాండురుచిని.

67


క.

బలువెన్నెలవేఁడిమిఁ గొం
దల మందుచుఁ జెట్లమఱువున వసింప వియో
గులు పఱచిన కంబళముల
పొలుపున దట్టముగఁ బొలిచె బుడమి న్నీడల్.

68


క.

కలశాబ్ధిభంగి వెన్నెల
పొలిచెం దెలిదీవిఠీవి పూర్ణసుధాంశుం
డలరె నచట నున్న రమా
లలనాధిపుభంగిఁ దత్కళంకం బొప్పెన్.

69

క.

వలిపెపుఁజలువవలువలై,
మలయజపంకంబులై, సమంచితముక్తా
ఫలహారములై, యాశా
లలనలఁ గైసేసె వెన్నెలలు దట్టములై.

70


వ.

అయ్యవసరంబున,


చ.

కలపము, పున్గు, గందవొడి,కస్తురివీణెలు, పచ్చకప్రపుం
బలుకులవీడెము, ల్కనకపంజరశారిక, లంచదూదిపా
న్పులు, ఘనసారదీపికలు, పూవులపందిరి, తూగుటుయ్యెల
ల్లలరవము, ల్వితానములు గల్గిన కేళిగృహంబు లోపలన్.

71


క.

దోమతెర పట్టెమంచము
పై మెత్తనియంచదూదిపానుపున ధరి
త్రీమండలాధిపతి ని
స్సీమనవోఢారిరంసచే నుండుటయన్.

72


గీ.

చంద్రమతిని హరిశ్చంద్రసార్వభౌము
నంకపీఠికయందు నలంకరింప
నిండువేడ్కలతోడుత నెమ్మనములఁ
బ్రౌఢసతు లూహసేయ సైరంధ్రు లపుడు.

73


క.

కలపం బలంది, మృగమద
తిలకం బిడి, కజ్జలంబు దీరిచి, పూదం

డ లలంకరించి, రవణం
బులు దొడి కైసేసి రిట్లు పూవుంబోఁడిన్.

74


వ.

ఇట్లలంకరించి సముచితమంజరీభరవినమ్రమల్లికా
వల్లికం బోలె లజ్జాభరంబున నానతాస్య యగు చంద్ర
మతిం జూచి నెచ్చెలు లిట్లనిరి;


గీ.

పతులసన్నిధి కేగెడు పద్మముఖులు
పడఁతి యీచందమున లజ్జ పడుదు రటవె
కలితవాంఛాసరిన్నిదాఘంబు సూపె
ప్రబలమందాక్షభర మది పరిహరింపు.

75


క.

చేరంబిలిచినఁ బొమ్మా,
గారవమున నంకపీఠిఁ గైకొనుమీ, స్వే
చ్ఛారతుల కియ్యకొనుమీ,
యూరక యుండెదు సుమీ పయోరుహనయనా!

76


క.

ప్రేమ విడె మొసఁగఁ గైకొను
మీ, మగనిని గౌఁగలింత కెడవెట్టకుమీ,
మో మెత్తి ముద్దొసంగుమి,
యోముద్దులగుమ్మ! యూరకుండెదుసుమ్మీ!

77


వ.

అని యివ్విధంబున,


గీ.

సఖులు ప్రార్థించుతతిని లజ్జాస్రవంతి
పద్మగంధికి మోకాలిబంటి యయ్యెఁ

బడకయిలు సేరుతఱి మొలబంటి యయ్యెఁ
బతిని డాయంగఁ బుక్కిలిబంటి యయ్యె.

78


గీ.

సఖులు, ముందరిదెసకు లజ్జావధూటి
వెనుకదెసకును, ద్రోయ నవ్వేళయందుఁ
గలికి నవరత్నమయడోలికయును బోలి
భూతలాధిపుచిత్త ముఱ్ఱూత లూఁచె.

79


వ.

ఇట్లు ప్రసభాచరణంబున దలిమంబుఁ జేర్చి,


క.

అక్కాంతామణి నెచ్చెలు
లొక్కొకపనిపేరు చెప్పి యూడనిబాడన్
మిక్కిలి మన్ననఁ బెనుచుట
నక్కలికిని ద్రప వయస్యయై భజియించెన్.

80


సీ.

ఆస్యేందురుచిని శశాంకాశ్మకుడ్యముల్
                  కరఁగునంచునొ నెమ్మొగంబు వంచె,
మహితలజ్జాసరిన్మగ్న యగుట నేమొ
                  వరునిమాటకు మాఱు పలుక దయ్యె,
భావినఖక్షతభయము గీల్కొనుటనో
                  కలకంఠి నెమ్మేనఁ గంప మందెఁ,
గ్రొవ్వాఁడిచూపుముల్కుల కోర్వఁడంచునో
                  సుందరి పతిఁ దేఱి చూడ దయ్యె,
భూవరవసంతసంపర్కమున లతాంగి
యంగలత కోరకితమయ్యె ననఁగఁ జూడఁ

బటుతరస్వేదకణములు పర్వె మేన
సారసాయతనేత్ర కాసమయమందు.

81


క.

పిలిచినచో మాఱాడమి
తలయెత్తమి తేఱిచూడఁ దలపోయమి ముం
గలనయ్యెడు జలజానన
పొలయలుకలపొలుపుఁ దెలిపె భూపతిమదికిన్.

82


గీ.

తల్పమునఁ బ్రాణనాథుఁడు తరుణి యాన
తాస్య మెగ నెత్తి కౌఁగిట నలమికొనఁగఁ
బ్రమద గొనయంబు డించిన పంచబాణు
పుష్పకోదండమో యనఁ బొలిచె నపుడు.

83


ఉ.

పయ్యెదఁ బాపుడు న్సుదతి పాణిసరోజములం గుచద్వయం
బొయ్యనమాటఁబోక ముడి యూడిచి చక్కిలిగింత గొల్పిరా
జయ్యెడఁ జన్నుదోయి తనకగ్గము చేసెను గ్రమ్మఱన్ భళా
యెయ్యదిగాదు లోకువ మహీస్థలి సమ్య గుపాయశాలికిన్.

84


తమిజన్లప్పు దొలంగఁజేసినఁ గుచద్వంద్వంబు హస్తారవిం
దముల న్మాటుడు నీవిఁ బాప మతియత్నం బేమియుం దోఁచరా
ప్రమదారత్నము నాథుకౌఁగిట ఘటింప న్మేల్స్వయంగ్రాహసౌ
ఖ్యము గల్పించె నవోఢలజ్జ యనుచుం గాంతుండు పొంగె న్మదిన్.

85


గీ.

కోపనాహ్రీభరంబుచే నాపువడియు
మనుజపతి రాగలత యూఁత గొనుచు నిలిచెఁ

బ్రసవశరుఁ డెంత చెడుగు? కాల్పట్టి తన్నఁ
జూరు పట్టి వ్రేలాడంగఁ జొచ్చె నపుడు.

86


గీ.

సరసవృత్తి ముహుర్ముహుఃక్షతకదుష్ణ
చంద్రవదనాఢరేక్షురసంబుఁ గ్రోలె
గల్లచుంబన ముపదంశకంబు గాఁగ
రసికశేఖరుఁ డాధరారమణవరుఁడు.

87


క.

ప్రసభగ్రాహ్యస్త్రీకుచ
మసుఖాప్తవధూపగూహ మధికశ్రమసా
ధ్యసతీజఘనమగు నవ
ప్రసవాయుధకేళి యయ్యె రాజేంద్రునకున్.

88


క.

వేడుక యొసంగె విభునకుఁ
జేడియ సేఁతకును బదులు సేయనిచెయువున్
న్వీడని వ్రీడాభరమును
జూడనిచూడ్కియును బ్రథమసురతక్రీడన్.

89


గీ.

నిండుతమిఁ జంద్రమతియందు నిద్రయందు
లీల దక్షిణభావంబు గీటుకొలిపి
రాత్రి గోల్పుచ్చె నొకముహూర్తంబుఁబోలె
సాధుకీర్తి హరిశ్చంద్రచక్రవర్తి.

90


గీ.

అసమశరతంత్రవేదపాఠావసాన
సముచితోంకారమంత్రరాజంబులొక్కొ

యనఁగఁ జెలువొందెఁ దామ్రచూడారవమ్ము
లఖిలదిక్కులయందుఁ దదవసరమున.

91


గీ.

మోర యల్లార్చినందున ముందరిదెసఁ
దూలి పడినట్టి రవిరథతురగవదన
ఫేనఖండం బనంగను గాన నయ్యె
విమలతరకాంతి పెంపెక్క వేగుఁజుక్క.

92


క.

రేనెలఁత యపుడు ముదుసలి
యైనకతంబునను దట్టమై కనుపట్టెం
బూనినపలితద్యుతి యనఁ
గా నాలుగుదెసలు ధవళకాంతిఁ దనర్చెన్.

93


క.

నిరుపమతమమదనోత్సవ
హరణకళాకేతుతారకాధిపభరపాం
డురవిగ్రహములొ యన మం
దిరదీపాంకూరపటలి తెల్లం బాఱెన్.

94


గీ.

లలితదీపాంకురాళికిఁ బలితముద్ర
కువలయశ్రేణులకును జోకొట్టుపాట
కంజపుంజంబులకును మేల్కలుపుమరుని
యూఱట ప్రభాత మెంతయు నొఱపు నెఱపె.

95


క.

సితకిరణుం డపు డొప్పెం
బ్రతీచీనిఁ బ్రభాతసమయపవమానసము

ద్గతచరమశైలదవద
గ్ధతరుచ్ఛద మనఁగ నుజ్ఝితద్యుతి యగుచున్..

96


గీ.

రా జపరభూభృదాప్తి నిస్తేజుఁ డగుచు
నపరవారాశిలోపల నస్తమింప
స్ఫుటతరంబుగఁ గువలయంబునకు నపుడు
మిత్రుఁడే శత్రుఁ డగుట విచిత్రమగునె.

97


క.

పులుఁగులరొదలు చెలంగెం
బలుచీఁకటి బూచిపిండు పాఱఁదగులగా
నిల సమయమాంత్రికుఁడు దా
వలనొప్పఁ బఠించు మంత్రవర్ణంబు లనన్.

98


గీ.

తరుణతపనాంశుశిఖిశిఖాతతులు పేర్చి
ఘనతరతమస్తమాలకాననము నేర్చఁ
బ్రభవమందిన చిటచిటార్భటి యనంగ
విహగరావంబు దిక్కుల విస్తరించె.

99


క.

అరుణోదయంబు దోఁచిన
నిరులు మహాహార్యగుహల కేగె దవశిఖిన్
బరికించి భల్లుకసము
త్కరములు దూఱఁగ నికుంజతతి డాఁగుగతిన్.

100


గీ.

ప్రాగ్దిశాయజ్వపత్ని ప్రభాతమునను
జంద్రికాస్వచ్ఛజలధార జలకమాడి

కట్టుకొన్నట్టి కెంబట్టుపుట్ట మనఁగఁ
బూర్వసంధ్యారుణిమ చూడఁ బొలిచె నపుడు.

101


గీ.

అరుణకిరణంబు లుదయాద్రి నలముకొనఁగ
సార్థకతఁ గాంచె దివి నభం బనుసమాఖ్య
వసుమతీనామ మల్ల యుర్వరకు నమరె
జండభానూదయం బైనసమయమునను.

102


కలువలసూఁడు తమ్మిచెలికాఁడు నిశావిభుజంట చుట్టుపు
ల్గులగమినోముపంట ఖగఘోటునకు న్వలచూపు మూఁడుమూ
ర్తులు నొకటైనరూపు తొగరుం జిగిరంగువెలుంగుప్రోవు ప్రాఁ
బలుకులఠావు పూర్వగిరిపై నపు డొప్పె దినేంద్రుఁ డెంతయున్.

103


గీ.

దినదినంబున కొకవింత దిట్టతనము
దినదినంబున కొకవింత తెఱఁగుచెయువు
దినదినంబున కొకవింత తివుట గలిగి
జరిగె నాదంపతుల మిథస్సంగమంబు.

104


కాంతారత్నసమాగమంబును నెద న్గాంక్షించు నేతెంచుడుం
జెంతం జేరఁగఁగోరుఁ జేరుడుఁ గుచాశ్లేషాప్తిఁ గాంక్షించుఁ గా
నంతం దత్కళ లంటఁగోరు ఫలతృప్తాత్మత్వ ముర్వీవధూ
కాంతానర్హ మటంచుఁ బల్కు స్మృతివాక్యస్ఫూర్తిసార్థంబుగన్.

105

సీ.

జాఱిననెఱికొప్పు సవరించునెపమున
                  బాహుమూలద్యుతు ల్బయలుపఱిచి
ప్రిదిలిన నీవిక బిగియించుమిషమున
                  గబ్బిగుబ్బ లురమ్ము గదియఁ గ్రుమ్మి
చెదరుపయ్యెదఁ జక్కఁ జేర్చుదంభంబున
                  నూరులపై నూరుయుగళి బెనఁచి
డిగఁజాఱు ముంగురు లెగదువ్వుకైతవం
                  బున నెమ్మొగంబుపై మోముఁ జేర్చి,
యంతకంతకు వెగ్గలం బగుచుఁ దనదు
భావమునఁ దోచుతమి బయల్పడకయుండ
విభుని డెందంబునకుఁ గొల్పె వింతచవులు
కువలయదళాక్షి మఱియొకకొన్నినాళ్ళు

106


సీ.

పదిపిల్పులకును దాఁ బలుకఁ గొంకెడుకాంత
                  పలుమాఱు వింతగాఁ బలుకనేర్చెఁ
జేయిసాఁచిన నోరసిలు పయోజానన
                  కులుకుగుబ్బల ఱొమ్ము గుమ్మనేర్చెఁ
బ్రార్థింప మొగ మెత్తి పాఱఁజూడని చాన
                  చుఱుకువాల్చూపులఁ జూడ నేర్చె
మోవి పంటను నొక్క మోముద్రిప్పెడు లేమ
                  తియ్యనిమోవి యందియ్య నేర్చె

రతికిఁ జులుకగ మైకోని రాజవదన
ప్రబలపుంభావసంభోగపటిమఁ దేల్చె
నసమసాయకకేళిలో ననుదినంబు
నంతకంతకుఁ గడిదేఱి యామిటారి.

107


సీ.

నిశ్శ్వాససురభిళానిలముల సంపద
                  సరసవసంతర్తు సరణిఁ జేయ
నన్యోన్యనఖరరదాంకురక్షతజోష్మ
                  పటిమ గ్రీష్మర్తువైభవముఁ దెలుపఁ
గమనీయతరతనూఘర్మాంబుకణవృష్టి
                  గరిమ వర్షాగమస్ఫురణఁ జేయ
విమలచిత్తాంభోజవికసనాతిశయంబు
                  మహనీయశరదృతుమహిమఁ బెనుప
నొఱపు నెఱపు దృఢాలింగనోత్సుకతయు
నధరచుంబనసీత్కరణానురక్తి
శేషితర్తుద్వయస్ఫూర్తిఁ జేయ రతము
సకలఋతుసౌఖ్య మొసఁగె నాదంపతులకు.

108


క.

లీలోద్యానపరంపర
కేళీకాసారములను గృతకాద్రిదరీ

పాలికలఁ గేళి సలుపుచు
బాలికయు న్విభుఁడు గని రపారసుఖంబుల్.

109


గీ.

సత్యము దృఢవ్రతంబుగా సంగ్రహించి
రాజసూయాదివివిధాధ్వరము లొనర్చి
వరగుణోజ్జ్వలసంతానవంతుఁడై క
రమును సుఖ ముండె నాధరారమణమాళి.

110


శా.

మాయాభిల్లవపుష్క, మౌనిజనతామధ్యేహృదంభోరుహ
ధ్యేయాత్మీయపదారవింద హిమరుగ్ధిక్కారి కీర్తిప్రభా
వైయాఘ్రాజినచేల నర్తనకళావైయాత్య భక్తావళీ
శ్రేయోదాయిశుభేక్షణా శ్రుతివధూసీమంతముక్తాఫలా!

111


క.

ప్రభ్రష్టకదభ్రాపగ
దభ్రేతర కీర్తిశోభిత జగత్రయర
క్షా భ్రాజిష్ణు భుజార్గళ
శుభ్రాంశు కనత్కళాభిశోభి కపర్దీ!

112

చతుర్విధ కందగర్భిత ప్రమితాక్షర వృత్తము

హరమౌని పుంగవమనోబ్జరవీ
పరమేష్ఠివంద్య పదపంకరుహా
కరిదానవాంతక జగద్భరణా!
నరకాంబువాహపవనా వరదా!

113

గద్య:
ఇది శ్రీమదశేషమనీషిహృదయంగమమృదు పద
నీరంధ్ర శుద్ధాంధ్రరామాయణఘటనావైదుషీ
దురంధ రాడిదము బాలభాసర్కకవితనూభవ
సరసకవిత్వవైభవసౌజన్యనిధాన సూర
యాభిధానప్రణితంబైన కవిజనరంజనం
బను మహాప్రబంధంబునందు సర్వం
బును దృతీయాశ్వాసము.


సంపూర్ణము.