కవికోకిల గ్రంథావళి-4/సారస్వతవ్యాసములు
కవిత్వతత్త్వ నిరూపణము
1. కవి
ఓ కవీశ్వరుఁడా, నీవు సృష్టికర్తవు. నీ సృష్టి లోకోత్తరము; అనన్య పరతంత్రము; ఆనందదాయకము. నీమహిమ వర్ణనాతీతము. నీ నిర్మాణము దైవసృష్టిని సైత మధ:కరించు చున్నది. నీ కల్పన యాదర్శప్రాయము.
నీ సృష్టియందు లతికలు జంగమలు; శంపాలతలు నిశ్చలములు. కలువకంటులు, కలకంఠకంఠులు, చంద్రముఖులు, విద్యుల్ల తాంగులు నీ పట్టములలోఁ జరియించు . సామాన్య స్త్రీలు! నీకు పరిచితలైన యువతులెల్లరు సౌందర్య వతులు; హృదయ సమ్మోహన మంత్రాధిదేవతలు! అందరు సీతలు, సావిత్రులు, దమయంతులు, చంద్రమతులు, ద్రౌపదులు, శకుంతలలు.
ఓయి కవితాశిల్పి, నీచే సమ్మానింపఁబడిన పురుషులందఱు వీరులు, లోకోత్తరకార్య దురంధరులు! భూమిని చాపకట్టుగాఁ జుట్టగలిగిన హిరణ్యాక్షులు; విశ్వమును మూఁడడుగులతోఁ గొలువఁగలిగిన వామన మూర్తులు; రాజలోకమును గండ్రగొడ్డంట నఱికి రక్తప్రవాహముచేఁ బితృతర్పణము గావించిన పరశురాములు; ఱాల్గరగంగ వేణుగానము గావించిన శ్రీ కృష్ణమూర్తులు, సముద్రమును మధింపఁగల దేవదానవులు, స్వర్గమందుఁ బ్రవహించు గంగానదిని భూమికి నవతరింపఁ జేయఁగల భగీరధులు, సృష్టికిఁ బ్రతిసృష్టిగావింపఁ గలిగిన విశ్వామిత్రులు!
నీ పట్టణములోని చంద్రశిలా సౌధములు సూర్యచంద్రుల రాకపోకల నడ్డగింపఁగల యంతటి యున్నతములు, నీతోఁటలోనివృక్షములెల్ల ఫలవంతములు, లతలెల్లఁ గుసుమభరితములు, షడృతుధర్మము లేక కాలమున నీ యుద్యానమును సేవించుచుండును, ప్రకృతియంతయు నీ దృష్టికి సచేతనము, మేఘములు, హంసలు, కాముకీ కాముకుల ప్రణయ సందేశములఁ గొనిపోవుచుండును!
ఓయీ, నీసృష్టి కాలబద్దముగాదు. అనుక్షణ యౌవన విజృంభణమువలన, కంచెల బిగియుచుండ "ప్రియంవద నిర్దయముగ నా కంచెలవల్కలమును బిగించి ముడివేసినది. నీవు కొంచెము సడలింపుము” అని యనసూయతో ముగ్ధముగఁ బలుకుచుఁ బూఁదీవలకు జలసేచనము సేయుచుండిన శకుంతల దుష్యంతుని కన్నులకు నిర్వాణసామ్రాజ్యమై కనుపట్టిన శకుంశతల, నేఁటికిని అదేవిధముగ మా కన్నులకు బొడకట్టు చున్నది! కాని, ప్రకృతి సృజించిన శకుంతల యేమైనది? యౌవనమును, సౌందర్యమును గాలక్రమముగఁ గోలుపోయినది. జరాభార మామెను సైతము పీడించినది. తుట్టతుదకు ఆ మోహనదేవత, ఆ శకుంతల యనంతకాల సాగరమున బుద్బుదమువలె మఱఁగిపోయినది!
ఓ యైంద్రజాలికుఁడా, నీవు కుంచె నొక్కసారి విసరి నంతనె మాయాత్మలు తేలికయై పూలఱేకులు ఱెక్కలుకట్టు కొని నిర్వృతి పదంబునకుఁ జల్లగ నెగిరిపోవును. మొగము మొత్తినట్లు, కన్నులు మిటారించుకొని మమ్ములను గనుఁ గొనుచున్న ప్రాపంచిక యధార్ద్యము, మెల్ల మెల్లగ సమసిపోయి యనిర్వచనీయమగు నానంద స్వప్నము అవతరించును! ఓయి, నీ కలము సోఁకిన ప్రతివిషయము, ప్రతిపదము, ప్రతిభావము, ప్రతిరూపము శాశ్వతమై యమృతమై యొప్పారును! ఒక్క నిమిష మనంత కాల స్వరూపముగఁ గన్పట్టును. భూమి స్వర్గముగఁ బరిణమించును. ఓ కవీ, మానవ జీవితమును ఆనందమఖముగ నొనరింపుము.
- __________
2. కవిత్వావతరణము
"ఋషే, ప్రబుద్దో౽సి వాగాత్మని
తత్ బ్రూహిరామచరితం
అవ్యాహతజ్యోతిరార్షం
తే చక్షుః, ప్రతిభాతి; అద్యఃకవి రసి”
“నీవు మొదటికవివి” అని బ్రహ్మ వాల్మీకి మహర్షితో జెప్పినటుల రామాయణమునఁ గూర్పఁబడియున్నది. అందువలన వాల్మీకి యాదికవియనియు రామాయణ మాది కావ్యమనియుఁ గాలక్రమముగఁ బ్రజలు విశ్వసించుచువచ్చిరి. నేఁటికిని విశ్వసించుచున్నారు. బోయచేఁ గూల్పఁబడిన క్రౌంచమును గాంచినప్పుడు వాల్మీకికిఁ గలిగిన శోకావేశమే ప్రథమ కవిత్వావతరణమని లోకప్రసిద్ది. కానీ, నేను వేఱుగఁ దలంచెదను. క్రౌంచ మిధునగాధ వాల్మీకి కవియైన విషయమును మాత్రము తెలుపుచున్నది. రసార్ద్రమైన వాల్మీకిహృదయము క్రౌంచపక్షి శోకమునకు మఱింత యుద్రిక్తమై శ్లోకరూపమున బయలు వెడలెను. కవితాశక్తి అతని భావమునఁ బిక్క టిల్లుచు వెలికుఱుకుటకు సమయము వేచియుండెను. అట్టి సమయము క్రౌంచపక్షి యాక్రోశవేదనవలన సిద్ధించినది. అప్పుడు వాల్మీకి నోటినుండి యొక లయాన్వితమైన వాక్యము ఆకాంక్షితముగను, అప్రయత్నపూర్వకముగను బయలు వెడలెను. అది యపూర్వము. కావున వాల్మీకి యాశ్చర్యపరవశుఁడై దానినే తలపోయుచుండెను. అంతట బ్రహ్మ ప్రత్యక్షమై ఆయనుష్టుబ్ చ్ల్ఛోకములతో రామకథను రచింపుమని యాదేశించెను.
వేదములు ఛందోబద్దములు, ఛందస్సు వేదాంగములలో నొకటిగఁ బరిగణింపఁ బడుచున్నది. రామాయణము కన్నను వేదములును వేదాంగములును బూర్వము లనక తప్పదు. ఇట్లగుట వైదిక కవులేల ఆదికవులు కాకపోయిరి? దీనినిగుఱించి నేనిట్లూహించుచున్నాను. వేదమును విరాట్స్య రూపుని నిశ్వాసములనియుఁ గావుననే యవి యపౌరుషేయము లనియు ఆర్యులు విశ్వసించియుండినందున ఆ ఛందములు మానవు లనుకరింప సాధ్యములు గావని తలంచియుందురు. కొంతకాలమునకు వాల్మీకి యుద్భవించి, అంతకుమున్నె కథల మూలమునఁ బ్రజలయందు వ్యాపించియున్న రామాయణ గాధను కావ్యముగ రచియించెను. ఇట్లనుటవలన వేదముల కనంతరమును రామాయణమునకుఁబూర్వమును కవిత్వర చన లేదని చెప్పుటగాదు. నన్నయ భారతమునకుఁ బూర్వము తెలుఁగు దేశమున వ్యాపించియున్న గ్రామ్య సారస్వతము, తరువాత, అభినవమార్గ మవలంభించిన ఆ యుద్గ్రంథముతో పోటీకి నిలువ లేక యెట్లునశించెనో, అట్లే రామాయణమునకుఁ బూర్వమున్న చిన్న చిన్న కావ్యములు, గేయములు ఈ బృహత్ప్రబంధముధాటికి నిలువ లేక యత్మహత్య గావించుకొని యుండును. రామాయణమునందు వర్ణింపఁబడిన నాగరకతను గమనించినయెడ ఆకాలమున కవిత్యశిల్పము కొదువపడి యుండెనని చెప్పుట కెవ్వరును సాహసింపరు. సత్యము. భూతకాలగర్భమున దాఁగియున్నది. వాల్మీకి ఆదికవియైనను కాక పోయినను, రామాయణ మాదికావ్వమైనను కాకపోయినను సీతారాములు చారిత్రక నాయికానాయకులైనను లేక , వాల్మీకి మహాకవి యగాధ భావసాగారము మధింపగా బైకుబికిన యమృత నవనీత రాసులైనను మనకొక్కటియె ! ఇందలి సత్యా సత్యములు చరిత్రకారులకు వదలిపెట్టెదము. వారికి సాధ్యము గాని రసాస్వాదనమునకు మనము పూనుకొందము. రామాయణము శాశ్వతకల్పనయైనది ! దాని యధికార మనంతము! సర్వకాలీనము !
కవిత్వము ప్రత్యేకముగ నొక దేశమునకును, ఒక జూతికిని, ఒక నాగరకతకును సంబంధించియుండునదిగాదు. అది విశ్వజనీనమైనది. మొట్టమొదట మానవ హృదయమెప్పుడు రసార్ద్రమాయెనో, అప్పుడే కవితాబీజ మంకురించెను. అప్పుడే మానవుని కల్పనాశక్తియు ప్రతిభయు బయలయ్యెను. అప్పటి నుండియు కవితామహాలత శాఖోపశాఖలుగఁ జీలి మానవ సంఘమునం దల్లుకొనుచున్నది. మానవజాతి యజ్ఞాన నిమగ్నమై బాల్యదశయందున్నప్పుడు, రామాయణము. మహా భారతము మున్నగు పెద్దకల్పనలకుసు, శాకుంతలాది మనోహర నాటక రచనలకును కావలసినంత లోకానుభవమును, సృజనశక్తియు, శిల్పనైపుణియు నలవడి యుండదనుట స్పష్టము. హైందవసమాజము చాల ఉన్నతదశకు వచ్చిన యనంతరము అట్టికావ్యములు, నాటకములు పుట్టియుండునని నిర్ణయించుటకు వానియందు వర్ణింపఁబడిన సాంఘికాచార వ్యవహారములే తగిన సాక్ష్యములుగ నున్నవి.
మానవునికి భావప్రకటనము గావింపవలసినయక్కఱ జ్ఞాన మంకురించినప్పటినుండియుఁ గలదు. ఉద్దేశములు వెలిపుచ్చుటకుఁ దగినభాష యుత్పన్నముగాని ప్రధమదశయందు గూడఁ, జేసైగలు, కనుసైగలు మున్నగువానిచేత మనుజులు తను వ్యవహారములను సాఁగించుకొనుచుండిరి ఆ కాలమున వారిబుద్ధి యంతగా వికసింపకుండినందువలన వివిధ భావోత్పత్తి కంతయవకాశ ముండియుండదు. కాని, బహిః ప్రకృతిసంబంధమువలన వారిహృదయములందుఁ గ్రమక్రమముగ భావవికసనమును, ఆ భావమును బ్రకటించుటకుఁ గావించు ప్రయత్నము వలన భాషయు నభివృద్ధి చెందుచు వచ్చెను. ఉరుములు, మెఱుములు, మేఘములు, వర్షములు, వడగండ్లు, ఉల్కా పాతములు, నక్షత్రములు, సూర్యోద యా స్తమానములు, నదులు, కొండలు మున్నగు నైసర్గిక చిత్రములను దర్శించినప్పుడు ఆయా కారణములఁ దెలియమి, ఆదిమమానవులు సంతోషాశ్చర్య భయవిషాదముల వెలిపుచ్చుచుండిరి, నాట్యములు సలుపుచుండిరి, పాటలు పాడుచుండిరి. ప్రార్థనలు సలుపుచుండిరి. కాని, వారి యాటపాటలకు నియమములు లేవు. మానవసంఘము రానురాను నాగరకత నొందుకొలఁది. ఆ యాటపాటలు నియమబద్దములు గావింపఁడినవి.
నాట్యము, గానము, కవిత్వము, ఆద్యకళలు. ఇతర కళలు పరికర సాధ్యములు గావున తదనంతరము పుట్టినవి. అన్ని జాతులవారి యాద్యకవిత్వమును బరిశీలించినయెడల సామాన్యముగ నది గేయరూపముగ నుండును. వేదములు గూడ నొకవిధమైన గేయములె. వానిని ఉదాత్తానుదాత్తాదిస్వరములతోఁ జదువకుండిన శ్రుతిహితములుగ నుండవు. ముఖ్యముగ సామవేదమును సామగానమని చెప్పుటయుఁ గలదు. రామాయణముగూడ గేయకావ్యమె, దానిని కుశలవులు గానము చేసినట్లు రామాయణమందు మనము చదువుచున్నాము. నేఁటికిని, అక్షరములు లేని "కొడగు" మున్నగు అనాగరక భాషలుగలవు. వానియందు, కవిత్వము గేయ రూపమునఁ బ్రచారములో నున్నది. అనాగరక జాతుల యందు గేయప్రతిభ మిక్కుటముగ నుండును. వారియం దొక్కఁడొక్కడును కవియె! ఒక్కఁడొక్కఁడును నటకుడె! ఈ విషయమును, మనము ప్రత్యక్షముగఁ జూచుచున్నాము. ఏనాది, యెఱుకల, జోగుల, మాలమాదిగజాతులవా రొకసారి యొక క్రొత్తపాటనుగాని వర్ణ మెట్టునుగాని వినుట. తటస్థించెనేని, మఱునాఁడె అట్టివియెన్నియో వారు రచించి పాడుచుందురు. హృదయము నాకర్షించు నేవిషయమును గుఱించియైనఁ గ్రొక్తక్రొత్త ఛందస్సులలో, అకృత్రిమముగ వారు పాటలల్లి పాడుచుందురు. కోటప్పకొండ మీద పోలీసువారికిని, అచ్చట మ్రొక్కుఁబడి. ప్రభల నూరేగించుచుండిన రెడ్లకును బరస్పరము కలహము సంభవించి హత్యలుజరిగిన విషయమును గుఱించి, బిచ్చమెత్తు జోగుల జాతివారు "ఔరా! చెన్నప్పారెడ్డి, నీ పేరే బంగార్పాకడ్డి” అను వీర రసోద్రేక పూరితమైన యొక గేయమును రచించి పాడుచుండిరి. ఇట్టివి యెన్ని యేనియుం గలవు. కలుపుఁదీయు కాలమున నిట్టి చిత్రవిచిత్ర గేయములను మనము యధేష్టముగ వినవచ్చును. పల్లెటూరి కాఁపులకీ విషయము చక్కగ బోధపడఁగలదు. మధురమైన గ్రామ్య సాహిత్యముతో వారికెక్కుడు పరిచయము గలదు.
ప్రకృతితత్త్వ జిజ్ఞాసయు, శాస్త్రజ్ఞానమును, విమర్శ శక్తియు, మానవసంఘమునందు హెచ్చుకొలదికవిత్వశ క్తియు దగ్గిపోవుచుండును, ఎన్ని యో ఋక్కులకు కారణభూతములైన యురుములు, మెఱుములు, ఉషస్సులు నేఁడు మనకు సామాన్యములైనవి. వానిని గాంచినప్పుడు మనము ఆశ్చర్యపడుటలేదు. వెఱపొందుటలేదు. ఈకాలమునఁ బిడుగును ఇంద్రునిచేతి శతారధారనుగ మనము తలంచుట లేదు. ఎందు వలన? “వాతావరణమున సంచరించు సహ్యపసవ్య విద్యుత్ప్రవాహములు మేఘముల మూలమున కలసికొన్నప్పుడు భూమిని దాఁకును! అదియే పిడుగు” అని మనము పాఠశాలలోఁ జదివితిమీ. స్త్రీల ముఖములకు చంద్రబింబమును సరిపోల్చి పూర్వకవులు సంతసించుచుండిరి. కాని, నేఁటికవుల హృదయములో నొక మాలిన్యము ప్రవేశించినది. చంద్రబింబమును చూచినంతనే యందలిసౌందర్వముగోచరించుటకు బూర్వమే ఖగోళశాస్త్రములోఁ జదివిన చంద్రవర్ణనము పెను భూతమువలె మనమునందుఁ బొడకట్టును, చంద్రబింబము సుధాకర బింబముగాదు అందు అగాధములగు పల్లములు, ఎత్తైన కొండలు, అగ్నిపర్వతములు గలవు, చంద్రునిలోని మచ్చ కుందేలుగాదు, మఱ్ఱిచెట్టు గాదు; జింక కాదు. ఏకులు వడుకు అవ్వయుఁగాదు. అది అంతులేని చీఁకటి పల్లము ! మనమునందు ఈ భావము లుదయించుటతోడనే సుధాకర మండలము నావరించియున్న కవిత్వము నాశనమై పోయినది.
ఇట్లనుటవలన నింకమీఁద కవులు లోకములో పుట్టరా? నూతన కావ్యములు రచియింపఁబడవా, అని కొందఱు ప్రశ్నింపవచ్చును. కవులును బుట్టుదురు. నూత్న కావ్యములును రచియింపఁబడును. కాని, గుణమునందును గల్పన యందును వ్యత్యాస మగుపట్టును. ఇందుకుఁ జాల కారణములు గలవు. పరిస్థితులు మాఱినవి. ప్రజల విశ్వాసములు, భావములు, ఆదర్శములు మాఱినవి. బుద్ధికి బలము హెచ్చినది. భావమునకు బలము తగ్గినది. కవు లేకాలమునఁ బుట్టినను వారి మనఃస్థితి కవిత్వ రచనకుఁ దగినదియే యయ్యును, సమకాలీన భావములకును, నాగరకతకును, వశవర్తియై యుండును. వాల్మీకి మహాకవి యీ కాలముననే జన్మించి యుండియుండిన రామాయణమువంటి మహాకావ్వమును రచియింపఁజాలఁడనియే చెప్పవలయును. నాగరక దేశములలో నగ్రగణ్యమగు అమెరికా దేశమునందు నేఁడు రచియింపఁబడు కవిత్వమును జదివినయెడల ఈ రహస్యము కొంతవఱకు తెలిసికొనవచ్చును. ఆ కవిత్వమునందు మోటారుకారుల శబ్దము, ట్రాంబండ్ల గడగడలు ప్రతిధ్వ నించుచుండును. యంత్రాగారములలోని పొగ, రస్తాలలోని దుమ్ము ఆ దేశపుఁ గవిత్వమును క్రమ్ముకొనినట్లుండును. ఆ కవితలందు కోకిలాలాపములు వినఁబడుటకు మాఱు శ్రవణ దారుణములైన రైలుబండి కూతలు వినఁబడుచున్నవి ! .
మన తెలుఁగు కవిత్వమున కీ గతి యెప్పటికిని బటకుండుఁగాక!
- __________
3. కవిత్వ తత్త్వము
కవిత్వ తత్త్వమును గుఱించిన చర్చ లాక్షణికులు తలచూపినప్పటినుండియు జరుగుచున్నది. కవిత్వమన నేమి? అను ప్రశ్న అన్ని దేశములందును, అన్ని కాలములందును అడుగఁబడుచున్నది. కవులును, లాక్షణికులును, విమర్శకులును వారివారికిఁ దోఁచినరీతిని కవిత్వ లక్షణములను తత్త్వమును నిర్వచించిరి. నేఁడును ఆ ప్రశ్న యంతరింపలేదు. చాల తేలికగ నడుగఁబడి యసంపూర్ణముగఁ బ్రత్యుత్తరము పొందు ప్రశ్నలలో నిది యొకటిగ నున్నది.
ఛందోబద్దమగు పదసముదాయమె కవిత్వమని యభిప్రాయ పడువారును గొందఱు గలరు. కాని, యీ యూహ యవిచార మూలకమైనది. యదార్ధ కవిత్వమునకు ఛందస్సు అనివార్యముగ ననుగతమగును. అయినను ఛందమును కవిత్వ మనుసరింప వచ్చును, లేకపోవచ్చును. నిఘంటువులు, వైద్యశాస్త్రములు, వ్యాకరణములు మున్నగునవి ఛందోబద్దములై యున్నను వానియందు కవిత్వము పొడసూపకుండు టయు, కాదంబరి, వావసదత్త మున్నగు గద్య కావ్యములందు రసస్పూర్తి గన్పట్టుటయు నందుకు నిదర్శనము, సంస్కృత లాక్షణికులు గద్యములుగూడ కావ్యముగఁ బేర్కొనిరి. పద్యకావ్యములను రచియించి సహృదయులను మెప్పించుట కన్న గద్యముల రచించి మెప్పించుట కష్టతరమను నభిప్రాయము ఆ కాలమున సలవాటులో నుండినటుల, వామనుఁ డుదాహరించిన “గద్యం కవీనాం నికషం వదన్తి” అను లోకోక్తివలన మన మూహింపవచ్చును.
కవిత్వమునకు వలయు వస్తుగుణ సామగ్రి యంతయు గద్యపద్యములకు సామాన్యమయ్యును ఛందము పద్యమునకు విశేషము. ఇట్లనుటవలన వాని రెంటికింగల భేదము ఛందస్సు నందేగాదు, దానిననుసరించు మఱికొన్ని గుణములయందుఁ గూడ. గాన లయా సమ్మేళనమువలనఁ గలుగు శ్రుతి మనోహరత్వమును భావప్రేరకశక్తియు ఛందమునందుఁ గలదు. ఛందస్సు కేవలము మానవ నిర్మితమగు కృత్రిమ శాస్త్రము గాదు. ఇందుకుఁ బ్రకృతియందె బీజములు గలవు. శోకరసా వేశుఁడైన వాల్మీకినోట అప్రయత్న పూర్వకముగ ఛందో బద్దమగు వాక్యము వెడలుట స్వభావ విరుద్దము గాదు. కవి హృదయము భావశబలితమై యుద్రిక్తమైనపుడు, భావములు తమంతఁ దాము ఉచితమయినభాష వెదకికొని లయాన్వితముగఁ బ్రవహించును. కోపభయాదులచేఁ జిత్తము చంచల మయినప్పుడు మనము మాటలాడ భాషకును, ఉచ్చారణకును, సామాన్య మనస్థితిలో నున్నపుడు మాటలాడు భాషకును జాల భేదము గనుపట్టుచుండును. భావతీవ్రతయు గాంభీర్యమును ననుసరించి వాక్యమునందు మాటలు వెనుక ముందు ముందు వెనుక లయి యేదోయొక లయాధర్మమున కనుగుణముగఁ గుదురు పడుచుండును. “వచ్చెడువాడు ఫల్గుణుఁ డవశ్యము గెల్తుమనంగ రాదు” అను పద్యపాదమును “ఫల్గుణుఁడు వచ్చెడుఁవాడు” అని మార్చినయెడల మొదటివాక్యమునఁ బిక్కటిల్లు ఆతురతయు భావతీవ్రతయు రెండవవాక్యమునఁ సన్నగిల్లి చప్పిడియగును. ప్రకృతి యందు బీజరూపముగను అస్పష్టముగను, అసం పూర్ణముగను, సంకీర్ణముగ నున్న రామణీయకమును గేంద్రీ కరించి సహృదయుల భావమునందుఁ బరిపూర్ణముగస్ఫురింపఁ జేయుట శిల్పముయొక్క ప్రధాన ధర్మముగావున, కవిత్వ మునందు లయాస్వరూపము సర్వాంగసుందర మై పొడకట్టు చున్నది.
గద్యము పద్యముతోఁ గొంచె మించుమించుగఁ దుల తూఁగుచున్నను, ఛందోలోపము వలన రూపసౌందర్యమును కొంత గోల్పోవుచున్నది. గద్యము రసవంతముగను భావస్పో రకముగ నుండవచ్చును. కాని దానిని గద్య కావ్య మందుమే గాని కవిత్వమనము. [1]కవిత్వమునంగల శ్రుతిరంజకత్వము గద్యమున నుండుటకు వీలు లేదు, “మనకు భావము, రసమే గదా ప్రథానము, ఛందస్సుతో నేమిపని?” యని కొందఱు ప్రశ్నింపవచ్చును, అర్థము లేని శబ్దముల సంయోగ వియోగ భేదములవలన నుత్పత్తియగు రాగములు మనల నానంద పరవశులఁ గావించుచున్నవి. ఒక్కొక రసము నుప్పతిల్లఁ జేయుటకు నొకొక్క రాగ మనుకూలించు నని గానశాస్త్రవేత్తలు నిర్ణయించి యున్నారు. వీరణము (వీరంగము) వాయించి నపుడు కొందఱికి ఆవేశము వచ్చుటగలదు. యుద్ధపు బ్యాండు విన్నంతనే పిఱికివాని హృదయమునందైన రణోత్సాహము చిప్పిల్లును, ఇట్టి వికారములన్ని యు గేవలము శబ్దసంయోగ సారస్యమువలన హృదయమునఁ గలుగు మార్పు లేగదా! ఇఁక భావయుక్త పద్యములమాట వేఱుగఁ జెప్పవలయునా?
ఒక ఇంద్రియమునకంటె రెండింద్రియములకు సుఖము గూర్చు వస్తువు ననుభవించునపుడు మన యానందము ఇమ్మడించును, శిల్పముయొక్క. పరమప్రయోజనము “సద్యఃపర నిర్వృతి”ని గలిగించుటయెగాన నొ కేసమయమున నొకటి కన్న నెక్కు డింద్రియములకు •సుఖము గల్గించునదియె యుత్తమ శిల్పమని మనము నిర్ణయింప వచ్చును. [2]కావున ఛందోబద్ధమగు కావ్యము వచనముకంటె నెక్కుడు సుఖదాయక మనియె చెప్పవలయును.
సంస్కృత లాక్షణికుల కవిత్వ తత్త్వ నిర్వచనములు కొన్ని యెడలఁ బాక్షికములుగను అసంపూర్ణములుగ నున్నవి. లాక్షణికులు తత్త్వవేత్తలును తార్కికులును కావున వారిబుద్ధి యవయవ పృథఃకరణమునందు నిశితముగఁ బ్రవేశించును. వా రొకరూపముయొక్క యంగాంగ సంయోగతను సమష్టి సౌందర్యమును గమనింపక, యవయవములను, గుణములను ఆత్మను వేఱుపఱచి వానిలో నేవి ముఖ్యములో యను దీర్ఘ చర్చలకుఁ దొడంగి తుదకుఁ దమ యభిమానమునకుఁ బాత్రమైనదానికిఁ బట్టాభిషేకము గావింతురు. కాని, వానివాని స్థానములందు ఉచితమైనరీతిని అవియవి ముఖ్యములనియు, వానిలో నేవి లోపించినను అంగవైకల్యమో గుణవైకల్యమో లేక ప్రాణాపాయమో సంభవించు ననియు వారు తలంపరు.
“తదదోషౌశబ్దార్థౌసగుణౌ అనలంకృతీపునః క్వాపి” అని మమ్మటుఁడు కావ్యలక్షణమును నిర్వచించెను. కాని, యీ వాక్యమును సాహిత్యదర్పణకారుఁడును, రసగంగాధరకర్తయు విమర్శించి తీవ్రముగ ఖండించియున్నారు. నిర్దోషత్వముచేత కావ్యత్వము సిద్ధించునెడలఁ బ్రాణరహితములగు కావ్యములు గూడ సమ్మానార్హములగును. పేరువడసిన యుత్తమ కావ్యము లందేవో కొన్ని దోషములున్న యెడల అట్టి కావ్యములు ఆదరణపాత్రములు గాకపోవలసి వచ్చును. ఇట్టి ప్రమాణము నంగీకరించినయెడల మనకావ్య ప్రపంచము చాల సంకుచితమై పోఁగలదు. ఎట్టి యుత్తమ కావ్యమందైనను ఏదోయొక విధమైన దోషములు కొన్ని యుండకపోవు. రామాయణ మహా కావ్యము నందు పునరుక్తిదోషములు గలవు, మమ్మటాది సంస్కృత లాక్షణికులు రసౌచిత్యముల యుత్కర్షాపకర్షములను దెలుపుటకు కాళిదాసాది మహాకవుల గ్రంథములనుండి యుదాహరణములను గ్రహించిరి. కావున అటువంటి కావ్యములు పరిత్యాజ్యములు కావలయునా? బండి ఱాకును మేలు రాకును యతి ప్రాసమైత్రి గూర్చెనని అప్పకవివలె పోతన్నను దిట్టిపోసి భాగవతమును నీటఁ గలుపుదుమా ! ఏవో కొన్ని వ్యాకరణ విరుద్ధ ప్రయోగములను చేమకూర వెంకన్న యంగీకరించెనని యాతని విజయవిలాసమును, క్త్వార్థక ఇకార సంధులు గలవని ఆముక్తమాల్యదను మనము నిరాద రింతుమా! రసాస్వాదన నిమిత్తము కావ్యముఁ జదువువారికి నిటువంటి దోషములపై బుద్ది చొరదు, ఈలాటి భాషావిషయక దోషములకంటెను అనౌచిత్యము, నీరస కల్పనము మున్నగు రచనాలోపములు రమణీయతకు భంగము గలిగించును.
మమ్మటుఁడు కావ్యముల కిట్టి కఠినమైన బహిష్కార దండనము విధించునా? ఇది చింత్యము, పూర్వాపరముల యోచించినయెడల ఆయన యభిప్రాయమును మఱికొంత విరివిగ మనము తెలిసికొనవచ్చును. కావ్యప్రకాశికయందుఁ బ్రారంభముననే మమ్మటుఁడు కవి సృష్టి నిట్లు కొనియాడెను;
“నియతికృతి నియమ రహితాం
హ్లాదైక మయీ, మనన్య
పరతంత్రాం నవరస రుచిరాం,
నిర్మితి మాదధతి భారతి కవేః"
ఇందలి యొకొక్క పదము నొకొక్క వ్యాసమునకు శీర్షి కగ నుండఁదగినంత భావగంభీరముగ నున్నది. కవియొక్క. భారతి ప్రకృతి నియమ బద్దకముగాదు! హ్లాదైక మయమును నవరస రుచిరమునైన యొక స్వతంత్ర నిర్మా ణము ! మఱియు లోకోత్తర వర్ణనా నిపుణ కవికర్మ కావ్యమని మమ్మటుఁడు వివరించెను. ఈ యభిప్రాయమును లాక్షణికు లందఱు నేదో యొకవిధముగ నంగీకరించి యున్నారు. లోకోత్తరత్వమనఁగా అనుభవసాక్షికమయిన యాహ్లాదగత చమత్కారమని పండిత రాయలును, చమత్కార మనఁగా చిత్త విస్తార రూపమగు విస్మయమని విశ్వనాఁథుడును వివరించిరి. ఇట్లనుటవలన చమత్కార రహితములగు కేవల శబ్దార్థములకు కావ్యయోగ్యత సిద్దింప దనియు, అవి ప్రతిభాశాలియగు కవి రచనా నైపుణ్యము వలన నలౌకిక రూపగుణ సౌందర్యములను దాల్చి, కావ్య మనిపించుకొనుననియు మన మూహింపవలయును. లోక సామాన్యమైన రూపములను జూచినప్పుడు మన కేలాటి విస్మయము జనింపదు. దానియందు మన చిత్తము నాకర్షింపఁజాలినంత యసాధారణ విశేష మేదియు గోచరింపదు. కాని, మన మెన్నడునుజూచి యెఱుఁగని యొక సౌందర్యవతిని దారిలోఁ గనుగొన్నపుడు, ఆహా? యీమె యెంత రూపవతి ? అని యచ్చెరుఁవొందుచుఁ గొంతసేపు నిలబఁడి. నిర్వ్యాజముగ నామెతట్టు చూచుచుందుము. అసామాన్య రూపసందర్శనమువలన నిటువంటి వింత పొడముచుండుట సహజము. కవిత్వమునఁ గూడ నీలాటి లోకోత్తరత లేనియెడల కావ్యము చదువరుల హృదయమును లౌకిక వ్యాపారములనుండి మరల్చి తనయందు లగ్నమ---------- రింపఁజాలదు. చిత్రకారునికి రంగులకు నెట్టి సంబంధము గలదో కవికిని కవితాసామాగ్రికిని అట్టిసంబంధ మె. అంగాంగ సంయోగత, ఔచిత్యము, వర్ణ నా సౌందర్యము, జీవకల్పనము మున్నగునవి కవియొక్క శిల్పనైపుణ్యమునకు జెందినవి. కావున కవి ప్రతిభా శక్తివలన కావ్యమునకు సాధుత్వమును, ప్రతిభా దౌర్బల్యమువలన అసాధుత్వమును సిద్దించును. ఇట్లనుటవలన కావ్యములు వ్యాకరణదోష భూయిష్ఠములుగ నుండవలయుననుట నామతముగాదు. కాని, భాషావిషయక దోషములకన్న శిల్ప కల్పనాదోషములె రస రామణీయకములకు భంగము వాటిల్లఁ జేయునని నామనవి.
[3] విశ్వనాథుఁ డొక దోషమును ఖండించి మఱియొక దోషమును దెచ్చి పెట్టెను. ఆయన 'వాక్యం సాత్మకం కావ్యం ' అని కావ్యలక్షణమును నిర్ణయించెను. ఇది (ఆచార్య దండిమతముతప్ప) పూర్వలాక్షణికుల మతములకన్న విశా లముగ నున్నట్లు తోచినను, విమర్శించిచూడ నీ వచనము శీర్షికగత్వావరణమును సంకుచితము చేయుచున్నది. ఏలయెన 'విభావానుభావ వ్యభిచారి సంయోగా ద్రసనిష్పత్తిః' అని భరతుని రసలక్షణము. దీనిఁబట్టిచూడ రసము కేవలము మానవచర్యలకు సంబంధించినదని తేలుచున్నది. తిర్యగ్జంతువుల చేష్టలయందు రసాభాసము (రసస్పర్శ) మాత్రము గలదని విశ్వనాథుని యభిప్రాయము. కావున రసమనునది మానవ చర్యలయందుఁ బూర్ణముగను, పశుపక్షి మృగాదుల చేష్టల యందు ఆభాసముగను ఉండునని తెలియ వచ్చుచున్నది. కాని, యచేతన వ్యాపారములందు ఏలాటి రసస్పర్శకుఁగూడఁ జోటులేదు. కావున ‘వాక్యం రసాత్మకం కావ్యం' అను లక్ష.ణమును మన మంగీకరించిన యెడల పాశ్చాత్యుల ప్రకృతి కవిత్వమును, (Lake Poetry, Nature Poetry! సూర్యా స్తమయములు, ఉద్యానవనములు, నదులు, కొండలు, మేఘములు, నక్షత్రములు, చంద్రుఁడు మున్నగువాని వర్ణ నములకు కావ్యత్వము సిద్ధింపదు.
'ఉపవన జల చంద్రికోత్సవార్తనలీల లాత్మవిహారంబు లనఁబరగు' అని యుండుటవలనఁ 'బై నఁ బేర్కొనఁ బడిన యుద్యానాది విషయములు ఉద్దీపన విభావములకు నాధార భూతములుగావున రసవ్యంజకములగును. అట్లగుట “వాక్యం రసాత్మకం కావ్యం' అను లక్షణములో నివిగూడ నిమిడి యున్నవి, అని కొందరు తలంపవచ్చును. కాని, యీలాటి వర్ణనములు నాయికా నాయకుల వ్యాపారములలోఁ గలసి పోయి వారి చర్యలకు సంబంధ పడినప్పుడె అవి యుద్దీపన విభావములకుఁ గారణములగును. కాని, కవియె యట్టిదృశ్య ములను నాయికానాయక సంబంధమపేక్షింపక , తన యాంతరంగిక ప్రేరణమువలన రచియించిన యుద్యాన విషయాది వర్ణనములకు ఉద్దీపనత్వము సిద్ధింపదుగాన, వానిని నీరసము లనియె నిర్ణయింపవలయును. ఇదియొక సందిగ్ధ విషయము. ఇప్పుడు మనము విశ్వనాథుని లక్షణము నంగీకరింపవలసి యున్న, సంకుచితమైన రసలక్షణమును మఱింత విరివి చేసి, యుద్యానాది పర్ణనములకు గతి కల్పింపవలయును. లేక, పూర్వికుల రసలక్షణ మంగీకరింతుమేని విశ్వనాథుని కావ్య లక్షణమును సంకుచితమైనదని తలంపవలయును.
సాహిత్య దర్పణకారుని కన్నను, నర్వాచీనుఁడైన పండితరాయలు 'రమణీయార్థప్రతిపాదక శబ్దః కావ్యం' అని రామణీయకమునకుఁ బ్రాధాన్య మొసఁగినందువలన కవితా నర్తకి నాట్యరంగము విశాలమైనది. కావ్యమున మనము చూడ వలసినది చిత్తాకర్షకమగు రామణీయకము. అట్టిగుణ మేకావ్యమునందుఁ బూర్ణముగ నుండునో నదియెల్ల సాధువును, ఉత్తమము నగును.
పాశ్చాత్య లాక్షణికులును, కవులును కవిత్వ లక్షణములను వచియించియున్నారు. [4]భావోత్కర్షతను వెలిపుచ్చు టయె కవిత్వమని వర్డ్సువర్తును, షెల్లీయు (Wordsworth, Shelley) అభిప్రాయపడిరి. కాని, యీ లక్షణము సందిగ్ధముగ నున్నది. భావోత్కర్ష తను బ్రకటించుటయంతయు కవిత్వ మగునా? ఇదియె యధార్ధమైనయెడలఁ గోపోద్రిక్తుడైఁ తిట్టెడి వాని మాటలను, సభ్యుల హృదయము చెలరేఁగునటుల నేదోయొక రాజకీయ విషయమును గుఱించి యుపన్యసించు. నాయకుని వాక్యములును కవిత్వము కావలసివచ్చును. కేవలము భావప్రకటనము కవిత్వముకానేరదు.
కార్లయిల్ పండితుఁడు (Carlyle) గానాన్వితమైన యాలోచన కవిత్వమని నుడివియున్నాఁడు. ఈ లక్షణము సత్యమునకుఁ గొంచెము సమీపముననున్నది; అయినను పూర్ణసత్యముగాదు. కార్లయిలు పండితుఁడు గానాన్వితమైన యాలోచన యనుటలో కావ్యమునందు భావములకును శిల్పమునకునుగల సంబంధము నించుక సూచించెను. ఇంతకంటెను లే హంటుగారి (Leigh Hunt) నిర్వచనము మఱికొంత సత్యసమీపవర్తిగనున్నది. ఆయన కవిత్వమునకు సత్యసౌందర్యముల స్పర్శను గలిగించెను కానీ, యమెరికా దేశపుఁ బ్రఖ్యాత కవియగు ఆలన్ పో (Allan Poe) గారి నిర్వచనమునందు కవిత్వ లక్షణము పరిపూర్ణత నొందినది. ఆలన్ పో గారిని అమెరికాదేశపు పండితరాయలని చెప్ప వచ్చును. 'రామణీయకమును లయారూపమున సృజించుటయె కవిత్వము' అని ఆయన తెలిపియున్నాఁడు, ఈ లక్షణము. ప్రాచ్చపాశ్చాత్యులకుఁ బరమసమ్మతమైనదిగ నుండ వచ్చును.
కవిత్వప్రభవమును దెలిసికొన్నఁ గొంతవఱకు కవిత్వ స్వభావమునుగూడ మన మూహింపవచ్చును. సహజమైన ప్రతిభయె కవిత్వమునకుఁ గాకరణము. ఇతరములు సంస్కారములు. అవి కవిత్వమునకు వన్నె దెచ్చును. [5]నవనవోన్మేషణ శాలినియగు ప్రజ్ఞయె ప్రతిభ యని భామహుఁడు నుడివి యున్నాఁడు. ఇట్టి శక్తి కవియందు లేనియెడల నాతని రచన లన్నియు నిర్జీవములుగ నుండును. అట్లయిన కవికి పాండిత్య మక్కఱలేదా? కవుల పాండిత్వమునకును పండితుల పాండిత్యమునకును జాలభేదమున్నది. కవుల పాండిత్యము సహజమయి ప్రతిభాంత ర్భూతమయి యుండును. పండితుల పాండిత్యము విశేషగ్రంథపఠనము వలనను శిక్షవలనను నలవడు విషయజ్ఞానము.
కవి యందఱివలె నూరకుండక రమ్యమైన భావప్రపంచము నేల సృజింపవలయును? ఇది కవియొక్క యాంతరంగిక ప్రేరణము; శమనాతీతమైన సౌందర్యపిపాస; అనివార్యమైన రసావేశము! భావోన్మాదము; కవి హృదయైక వేద్యము. 'తుమ్మువచ్చినను నవ్వు వచ్చినను పట్టరాదు' అనెడి సామెత యొకటికలదు. కవి ఆవేశముగూడ నిట్టిదియె. మనోహరమైన దృశ్యమును జూచినపుడు మన మానందము నొందుదుము. అంతట మన యనుభవమును నితరులకుఁ దెలుపవలయు నను కోరిక యొకటి పుట్టును. వినినవారు సంతసించుచుండ మన యానందమును వర్ణించి వర్ణించి సంతృప్తి నొందుచుందుము. కోరిక పుట్టిన వెనుక దానిని దీర్చుకొననిదే మన మనసు కుదుటఁబడియుండదు. మన యనుభూతి నితరులకుఁ జెప్పుటకుఁ జేతకానియెడల నొకవిధమైన యతృప్తి గలుగును. మనభావములను పదిమంది స్నేహితులకు వెల్లడిచేయనిదే ఆనందము పరిపూర్ణమైనటులఁ దోఁపదు. అందువలననే మన మేదైన సంతోషవార్త వినినప్పుడు దానిని నందఱికి జెప్పుచుందుము. ఇది సామాన్యమైన మానవ స్వభావము. కాని, కవియందిట్టి స్వభావ మతి బలీయముగనుండను. నిశితములును, శిక్షితములును, సంయమితములును, అందువలననే యుత్పతనక్షమములును నైన కవి మనోవికృతులు తుట్టతుదకు నిర్బరములై లయాన్విత వాగ్రూపమునఁ బ్రవహించును. భావోద్రేకము గలిగినపుడు ఆయావికారములకుఁ దగినటుల వాక్యములువెడలుట మానవులకందఱికి సహజమైనను, కవియందు మఱొక విశేషము గలదు. కవి వాక్యములు ఏవోకొన్ని నిర్మాణ న్యాయముల కనుగుణముగ మూర్తీభవించుచుండును,
ముత్తెపుఁజిప్పలో వానచినుకు పడినపు డది మంచి ముత్యముగ మాఱునుగాని, కాకిచిప్పలోఁ బడినపుడుమార్పు నొందదు. ఎందువలన? ముత్తేపుఁజిప్పయందుఁగల సృజనశక్తి కాకిచిప్పయందుండక పోవుటవలన. నీటిబొట్టు ముతైపుఁజిప్ప కడుపులోఁ బడినప్పుడు అందొక వికారము పుట్టును. అందు వలనఁ జిప్ప లోపలిభాగమున కంటుకొనియున్న పింగాణిరంగు వానచినుకుపైఁ జుట్టుకొని దానినొక యమూల్యమైన ముత్యముగ మార్చివేయును. ఇటులనే బహిః ప్రపంచసంగతి. వలన కవి మనమునఁ గొన్ని వికారము లుప్పతిల్లి అవి యాతని రసార్ద్రభావములందలి యింద్రధనుర్వర్ణములతో వెలికుఱికి లోకమోహన స్వరూపమును దాల్చును. కవిభావ మేవస్తువుపైఁ బ్రసరించునో యదియెల్ల రూపాంతరము నొందును. అనిర్వాచ్యమైన సౌందర్యము దాని నాశ్రయించి యుండును. ఎన్నియో వస్తువులను పలుమాఱు చూచియుందుము. కాని, అవి మన చిత్తముల నాకర్షింపఁజాలక పోయియుండవచ్చును. ఆ వస్తువే కవిభావముతో మొలాము చేయఁబడినప్పుడు ఇది వఱకు లేని క్రొత్తందనమును జక్కందనమును వహించి మన దృష్టి, నాక గొనును. ఎన్ని మాఱులు ఆషాఢమాసమునందలి మేఘములను మనము చూచియుండలేదు? ఆ మేఘమె కాళిదాసమహాకవి కావ్యాంబరమున భావకిరణ శబలితమయి పొడకట్టి మనలను ఆనందపులకితులను జేయుట లేదా? ఇదియే కవిత్వేంద్రజాలము!
- ______
4. కావ్య జీవితము.
నిర్జీవములగు కావ్యములు సహృదయానురంజకములు గానేరవు. అట్టివి చచ్చుబిడ్డలు. అవి నిరాదరణ పాత్రములై యెట్టకేలకు నశించిపోవును. కొందఱి కవుల యొక్కయు కావ్యములయొక్కయు పేరులు కవుల చరిత్రలందు మాత్రమె భద్రపఱుపఁ బడియుండును. కాని, మఱికొందఱి కవుల నామ ములు అనుదినమును స్మరింపఁబడుచున్నవి. వారికావ్యములు నిరంతరము ప్రజల హృదయములపై ప్రభుత్వము చేయుచున్నవి. రామాయణము, మహాభారతము, భాగవతము, అభిజ్ఞానశాకుంతలము, ఉత్తర రామచరిత్రము, మేఘసందేశము మున్నగు కావ్యములును నాటకములును, షేక్స్‌పియరుమహాకవి రచియించిన నాటకములును (అందు ముఖ్యముగ విషాదాంతములు) స్వదేశములందేగాక పరదేశములందుగూడ సమ్మానింపఁబడుచున్నవి. ఎందువలన? అవి యుత్తమశిల్పలక్షణములకనన్యసాధారణ లక్ష్యములయి ప్రధానకావ్యప్రయోజన మగు సద్యఃపర నిర్వృతినిఁ గలిగించుచున్నవి. కావున నిట్టి యానంద ముప్పతిల్లఁ జేయు ప్రతికావ్యమును సజీవమని మనము తలఁపవలయును. కావ్యములను బ్రాణవంతములుగఁ జేయు చిచ్ఛక్తియేది? ఇందుకు సంస్కృతలాక్షణికు లేమి ప్రత్యుత్తర మిత్తురో దానిని మొదట దెలిసికొందము.
- 1. రీతిరాత్మా కావ్యస్య. -వామసుఁడు.
- 2. ప్రక్రోక్తిః కావ్యజీవితం. -కుంతకాచార్యుఁడు
- 3. అలంకారా స్త్యలంకారా గుణా ఏప గుణ! సదా ఔచిత్యం రససిద్ధస్య స్థిరం కావ్యన జీవితం. - క్షేమేంద్రుఁడు
- 4. కావ్యస్యాత్మా ధ్వనిరితి మీధైర్యః సమామ్నాతపూర్వంః - ఆనందవర్ధనాచార్యులు
- 5. శబ్దార్ధా మూర్తి రాఖ్యాతౌ జీవితం వ్యంగ్య వైభవం. - విద్యానాథుఁడు.
- 6. యే రనస్యాంగినీ ధర్మా! శౌర్యాదయ ఇవాత్మనః. -మమ్మటుఁడు.
- 7. వాక్యం రసాత్మకం కావ్యం. - విశ్వనాథుఁడు.
పై లాక్షణికులలో వామఁనుడు రీతియు, కుంతకాచార్యుఁడు వక్రోక్తియు, క్షేమేంద్రుఁడు ఔచిత్యమును, ఆనందవర్ధన విద్యానాథులు ధ్వనియు, మమ్మట విశ్వనాథులు రసమును, కావ్యజీవితమని నిర్వచించియున్నారు. కాని, వీని యన్నిటిలో నిశ్చితమైన ప్రమాణమేది? ఆలంకారికు లిట్లు భిన్నాభిప్రాయులైనపుడు సహృదయుల యంతరాత్మయె కడపటి ప్రమాణముగఁ దలంపవలయును. పై మతములను విమర్శించి చూడ లాక్షణికుల తీర్మానములు, [6]ఏనుఁగును జూచుటకై పొరుగూరికిపోయి వివాదములు పెంచుకొన్న గ్రుడ్డివారి రూపజ్ఞానముగ నున్నది.
రీతి, రసపోషణమున కనుకూలమైన వర్ణ సంఘటనము; కావునఁ గావ్యాంగమునకు సంబంధించినది. అంగము జీవితమున కాశ్రయమగునుగాని, తానే జీవితము కాఁ జాలదు.
వక్రోక్తి యొకవిధమైన అలంకారము. అలంకార మస్పుటముగ నున్న వాక్యములకుఁగూడ (అనఁగా అలంకారము తర్కముచే మాత్రము సాధింపఁబడి, దాని మూలమున రాఁదగిన సౌందర్యము. 'యః కౌమార హరః' అను శ్లోకమునందువలె [7]అభావ మయినపుడు) కావ్యత్వము సిద్ధించుచున్నదిగాన, అలంకారములు కొన్ని యెడల నావశ్యకములయ్యు, ఔపచారికములు గావునను, వానికి జీవత్వము లేదు.
ఔచిత్యము అన్నిశిల్పములకుఁ బరమావశ్యక మగు నియమము. ఇది రసపోషకము. సౌందర్యమున కొక యంగము.
ధ్వన్యాత్మకముగాని వాక్యము సైతము కావ్యమని నిరూపింపఁబడియుండుట చేతను, వ్యంగ్య వైభవము ఉత్తమ కావ్యలక్షణమని పలువురచే నంగీకరింపఁబడి యుండుటచేతను, ఉత్తమ మధ్య మాధమ కావ్యవిచారము జీవత్వము సిద్దించిన వెనుక జరుగు చర్చ యగుటచేతను, ధ్వనిని కావ్యసౌందర్యాపాదకము లగు నుత్తమ గుణములలో నొకటిగ గ్రహింపవచ్చును.
రసము కేవలము మానవ చర్యలకు సంబంధించినదే యైనయెడల అవ్యాప్తిదోషమువలన కావ్యాత్మ కానేరదు.
అట్లయిన నిఁక కావ్యాత్మ యెట్టిది? ఆత్మ అంత స్సారభూతమయినది. ఇదిమిత్థమని వర్ణించుటకు నలవిగానిది. కావుననే భిన్న నిర్ణయములకుఁ బాత్రమయినది! ఉపనిషత్తులు బోధించు ఆత్మ వేఱు; ఆ యాత్మ అవాఙ్మౌనసగోచరము, కావ్యాత్మ ఇంద్రియ గోచరమును అనుభవసాక్షికము నగు సౌందర్యస్ఫురణము. పాంచభౌతికమయిన ప్రకృతి చిత్సంబంధమువలనఁ బ్రాణవంతమగునట్లు, కావ్యసామగ్రి కవి ప్రతిభతోడ సంయోగమునొంది. జీవన్మూర్తిని దాల్చు చున్నది. కావ్యమునకు కవిప్రతిభయె జీవితము. కావ్యము నందలి చిత్ప్రకాశము సౌందర్యస్పురణముగ గోచరించును, శిల్పనైపుణ్యమును కవితాసామాగ్రియు నవిభాజ్యముగ నొకదానియం దొకటి లీనమయినపుడు సజీవవిలసనము కావ్యమునందుఁ దేలియాడుచుండును. అది సహృదయ హృదయైక వేద్యము. గాలి కంటి కగుపడక యున్నను స్పర్శేంద్రియమువలనఁ దెలిసికొనఁబడునటుల, కావ్యాత్మ యిట్టిదని వచియింపనలవిగాకున్నను ఆనందజనకశ క్తివలన నూహింప సాధ్యమగును. ప్రతిభావంతులగు కవుల రచనలను మనము విమర్శించి చూచితిమేని, అవి చిరంజీవములగుటకుఁ గారణములు మనకు గోచరింపకపోవు. వానియందు కాలమును ధిక్కరించు శాశ్వతగుణమేదియో యొకటి తప్పక యుండితీరును. ఉత్తమ కృతుల విమర్శ నమువలనఁ దేలిన సామాన్యాంశముల నిటఁ బొందుపఱచుచున్నాను:
- (1) అంగాంగ సంయోగత.
- (2) అనురూపత.
- (3) వస్తువునందలి సర్వజనీన స్వభావము.
- (4) కవి వ్యక్తిత్వము .
అంగాంగ సంయోగత ప్రతిరూపమునకును ఆవశ్యకమైన నియమము విచ్చిన్నావయవ సమూహము సమష్టి రూపజ్ఞానము బుట్టింపనేరదు. కావున 'సంయోగత' శిల్ప శాస్త్రమునందు బ్రధాన సూత్రము. ఈ సూత్రమునకు లోఁబడని కావ్యములు నిర్జీవములుగ నుండును. ఉత్తమ కావ్య నిర్మాణమునం దీనియమము బహుజాగరూకతతో ననుసరింపఁబడును.
ఉచితానుచిత జ్ఞానము లేనివాఁడు, కవి కానేరడు. అనౌచిత్యము రసభంగమునకుఁ బ్రధాన హేతువు. కాండ జ్ఞానము, కళాభిరుచియు లేనందునను, లోభమువలనను, కవి యనౌచిత్యదోషమునకుఁ బాల్పడుచున్నాఁడు. అది వఱకు వ్రాసికొనియుంచిన రసవంతములగు పద్యములందలి లోభముచేతఁ గొందఱు కవులు అనవసరముగను, అసందర్భముగను తమ కావ్యములయందో, నాటకములయందో వానిఁ జొప్పించి రసభంగమునకు సహాయపదుచున్నారు, అట్టివారియందు కళాభిరుచి లోభ తిరస్కృతమై యడఁగి యుండును. మఱియు కవి మొట్టమొదటఁ దన పతిభ కను రూపమైన వస్తువును, రసమును రూపమును గుర్తెఱిఁగి యేర్పఱచుకొనవలయును. ఇది చాల ముఖ్యము. కొందఱు కవులు కొలఁది యెఱుఁగక కొండను కౌఁగిలించుకొనఁబోయి భగ్నమనోరథు లగుటయు, మఱికొందఱు తమ ప్రకృతి కనుకూలింపని రసములఁబోషింపఁ బయత్నించి చెడగొట్టు కొనుటయు మనము చూచుచున్నాము. కాళిదాసు శృంగారమును బోషించుటలో నసదృశుఁడు. భవభూతి కరుణయం దద్వితీయుఁడు కాని, ఆయన ప్రతిభ నాటక రచన కనుకూలించునది గాదు. కావుననే యుత్తరరామ చరిత్రము దృశ్యప్రబంధమునకన్న శ్రవ్యప్రబంధముగ నెంచఁబడు చున్నది. సర్ వాల్టర్ స్కాటు మొట్టమొదట కవిత్వము వ్రాయుచుండెను. కాని, యంతకన్నఁ దన ప్రతిభ నవలలు రచియించుట కనుకూలించునని యెఱింగి, యపూర్వ కథా సాహిత్యమును నిర్మించెను. రవీంద్రనాథ టాగూరునందు గేయ ప్రతిభ మిక్కుటముగ నున్నది. ఆయన వేలకొలది చక్కని గీతములను రచియించెను. కాని, మయికేలు మధుసూదనదత్తువలె 'మేఘనాథవధ' వంటి పెద్ద కావ్యమును రచియింప లేదు, ఒక్కొక్క కవి అంతః ప్రకృతి యొక్కొక విధమయిన కావ్యకల్పనకుఁ దగియుండును. కావున వారివారి కనుకూలమైన త్రోవలు వెదకికొనుట. విజయమునకు మూల సాధనము. అందుకు భిన్నముగఁ బ్రవర్తించువారు ఏటికి నెదు రీఁదినట్లు శ్రమకుఁబాత్రులయ్యు గమ్యస్థానము చేరఁజాలరు. ఉత్తమ కవులెల్లరు తమ ప్రకృతి కనుకూలించిన రచనల యందె శక్తిసామర్ధ్యములను వినియోగించి కృత కృత్యులైరి.
కావ్యము చిరంజీవముగ నుండవలయునన్న అందలి వస్తువుగూడ సర్వజనీన స్వభావమును, దదనుగుణమయిన మనోవికారములను వెల్లడించుట కనుకూలమైనదిగ నుండవలయును. ఏలయన, దేశ కాలపరిస్థితులకు లోఁబడిన సంకుచిత విషయములును, భావములును అన్ని కాలములయందు నందఱిని రంజిపఁజేయఁజాలవు. ఆచార వ్యవహారములు, భాషలు వేఱైనను మానవుల మనోవికారములు అంతటనొకేవిధముగ నుండును. సుఖదుఃఖములు, మంచిసెబ్బరలు, జన్మమరణములు సర్వసామాన్యముగ మానవజాతికంతయు సహజము: శృంగార వీర కరుణాధిరసము లందఱుకు ననుభోగ్యములుగ నుండును. అట్టిరసములాదర్శప్రాయముగఁ జిత్రింపఁ బడినపుడు దేశ కాలపాత్రాతీతములై సర్వజనానురంజకములుగ నుండఁ గలవు. ఇంగ్లీషు నాటకములు చదివి మనమానందించు చున్నాము; సంస్కృత నాటకములను జదివి పాశ్చాత్యులు సంతోషము నొందుచున్నారు. ఎందువలన? నోటిగుండ వెడలు భాష రెండు దేశములవారికి వేఱయ్యును హృదయము నుండి వెడలు మనోవికారములభాష మానవజాతికంతయు సామాన్యము. కావున నొక కావ్యము చిరంజీవముగ నుండవలయునన్న సర్వజనీన స్వభావ ద్యోతక వస్తు సంవిధాన కల్పనా చమత్కృతితో నొప్పి యుండవలయును. ఇందుకు భారతాది మహాగ్రంథములును, శాకుంతలాది నాటకములును నిదర్శనములు.
కవి వ్యక్తిత్వము ఆతని రచనలయందుఁ బరిస్ఫుటముగ నంకితమైయుండును. ఒ కేవిషయమును పలువురు కవులు, కావ్యములుగ రచియించి రేని వానియం దొకటొక్కటియుఁ బ్రత్యేకరూపగుణ విశిష్టముగ నుండును. ఒక్కొక్కరియందు కళానైపుణ్యమును, ప్రతిభయు, నభిరుచియు భిన్నభిన్నముగ నుండుటవలన వారి కృతులందు సైత మట్టి భేదములు గనుపట్టుచుండును. సర్వసామాన్య వస్తువైనను, అది కవి యంతః ప్రకృతితో సమ్మిళతమఁయి రూపాంతరమునొంది, కావ్య కుటుంబమునకుఁ జేరీనదయ్యుం బ్రత్యేకత వహించి యుండును. కవి తనకు మాత్ర మిష్టమైన వస్తువును భావమును మనోవస్థను సర్వజనీనముఁ జేయుటకుఁ బ్రయత్నించుట కన్న, సర్వజనీన వస్తుభావ మనోవస్థలను దన వ్యక్తిత్వముచే నంకితముఁ జేయుట మేలు. అనఁగా అన్ని ప్రకృతులకు సామాన్యమైన భావావస్థలకు రూపముఁగల్పించి యే ప్రకృతి నైన రంజి.పఁ జేయవచ్చునుగాని, యొక ప్రకృతికి మాత్రము సమ్మతమైన దానిని సర్వజనీన మొనరించుట యసాధ్యము.
మహాకవుల కావ్యములందుఁ బైన చర్చింపఁబడిన నాలుగంశములు ననివార్యముగ నుండును. ఇంకను విమర్శించుకొలఁది యెన్నియైన సూక్ష్మాంశములు తేలవచ్చును. కాని, గ్రంథ విస్తర భీతిచే వానినిఁ చర్చింప మానుకొంటిని.
5. కవిత్వ శిల్పము—అనుకరణము
కవిత్వము లలితకళలకుఁ జేరినది కావున, నిచ్చట శిల్ప విచార మనివార్యమైనది. శిల్పము నిదర్శక మనియు నాదర్శకమనియు రెండు విధములు. కొంచమైనను భేదము లేక ప్రకృతి ననుసరించునది. మొదటిది. వలసినంతవఱకు ప్రకృతి సనుసరించి దానిని మించిపోవునది. రెండవది. మొదటిది మాతృకకు సరియైన నకలు; రెండవది, స్వతంత్ర కల్పనము. శిల్పులు భూమ్యాకాశములందు సంచరించు రససిద్ధులు, కావున వారి సృష్టియు మర్త్యలోకమునకును స్వర్గలోకమునకును సంబంధించి యుండును. నిదర్శ కాదర్శక శిల్పములలో రెండవది యుత్తమమైనది. ఒక రూపమును పొల్లుపోక యనుకరించి చిత్రించుట నయనేంద్రియము యొక్కయు బుద్దియొక్కయుఁ గార్యము. కాని, అందు శిల్పకారుని భావనాప్రదర్శనమునకుఁ జోటులేదు. అనుకరణమునందు నూతనసృష్టి యుండదు గాన అది యుత్తమ శిల్పము గానేరదు.
శిల్పము అనుకరణమా? లేక సృష్టియా? అను విషయమును గుఱించి చాల అభిప్రాయ భేదములు గలవు. వానిని గొందఱు అనుకరణ మనియు, మఱికొందఱు సృష్టి, యనియుఁ బలుపలు విధములుగఁ దలంచుచున్నారు. శిల్పము అనుకరణమని తీర్మానించిన వారిలోఁ బ్రథముఁడు గ్రీసు దేశస్థుఁడైన అరిస్టాటల్ అను తత్త్వ శాస్త్రజ్ఞుఁడు. అప్పటి నుండియుఁ బాశ్చాత్యులెల్లరును శిల్పము ప్రకృతియొక్క యనుకరణ మనియే విశ్వసించుచుండిరి. కాని; [8]అరిస్టాటలు నిర్వచించిన అనుకరణము (Imitation) నకును మనమిప్పుడు అనుకరణ మను మాటకుఁ జేసికొను నర్థమునకును జాలభేదమున్నది. ఆయన యుపయోగించిన పదము విశాల భావగర్భితముగ నున్నదని ఆయన యొనరించిన నియమములు వలననే మనము తెలిసికొనఁ గలము.
శిల్పము తన మాతృకను ఉన్నదియున్నట్లు అనుకరింపక యింద్రియములకు గోచరించిన విధమునఁ బునర్నిర్మాణము చేయుననియు, ఆదర్శప్రాయ మగు మానవజీవితము, ప్రవర్తనములు, చర్యలు మున్నగునవి శిల్పమునఁ బ్రతిబింబించు చుండు ననియు అరిస్టాటలు చెప్పియున్నాడు. [9]ఇందువలన శిల్పి యనుకరించువాఁడు గాఁడనియు, రసార్ద్రమైన యాతని భావమున నింద్రియముల ద్వారా ఏవేవి యంకిత మగునో దానిని మాత్రమే మూర్తీభవింపఁజేయు ననియుఁ దేలు చున్నది. శకుంతలనాటకములోని కథ షుమారు ఆరు సంవత్సరములకాల పరిమితి గలదిగాఁ దోఁచుచున్నది. కాని, కాళిదాసమహాకవి దానిని రెండుమూడు గంటలలోఁ బ్రదర్శింపఁబడుటకు వీలగు నాటకముగ రచించెను. ఏయే కథా భాగములు గ్రహించినయెడల కథావిషయమునకు లోపము వాటిల్లక, శిల్పధర్మమునకు విరుద్దము గాక యుండునో అట్టిరీతిని ఉచితమైన సన్నివేశములన గల్పించి, ఆది మధ్యాంతములు గల యొక మనోహర దృశ్యమును రచించెను. లోక సామాన్యము లగు మానవచర్యలను గ్రహించి, వానిని లోకోత్తర వర్ణనాచమత్కృతి వలన అపూర్వమును, ఆదర్శ ప్రాయమునైన యొక విచిత్ర సృష్టినిగ మార్చివేసెను. ఇట్టి నిర్మాణమును సృష్టియందుమా! లేక యనుకరణ మందుమా! దీనిని అనుకరణ మనుటకంటె ప్రతి సృషి యనుటయే సమంజసము. అరిస్టాటలు గ్రంథమును చాల శ్రద్ధతో తర్జుమాచేసి, చక్కగ విషయము, బోధపడుట కొఱకు విపులమైన వ్యాఖ్యానము వ్రాసిన - ప్రొఫెసరు బుచ్చెరుగారు, అరిస్టాటలు ఉపయోగించిన 'అనుకరణము' అను పదమునకు, 'నిర్మాణము' 'ప్రతిసృష్టి' అను అర్థములు కలవని వాసియున్నారు.[10]
మమ్మటాచార్యులు కవిత్వమును నియతికృత నియమ రహిత మనియు, అనన్య పరతంత్రమనియుఁ నిర్మితి యనియుఁ జెప్పియుండుటవలన సంస్కృతలాక్షణికులకుఁగూడ, శిల్పము స్వతంత్రసృష్టి యను నిర్వచనము సమ్మతముగ నున్నట్లు దోఁచుచున్నది.
అపూర్వ వస్తునిర్మాణమునందు కావ్యశిల్పము ప్రకృతి సృష్టిని మించుచున్నది; కావుననే కళకు ప్రత్యేకమైన స్థితి కలిగినది. జంగమ వల్లులు, నిశ్చల చంచలా లతికలు, నొక్కిన పాలుగాఱు చెక్కిళ్ళు, పుప్పొడికట్టల నొ'రసి కొనుచు ప్రవహించు తేనె వాకలు, ఆకసము నంటు మేడలు మున్నగునవి కవికల్పనములు; వాస్తవజగత్తులో లేనివి.
లయవిభాతి
చలువగల వెన్నెలల చెలువునకు సౌరభము
గలిగినను, సౌరభముఁ జలువయుఁ దలిర్పం
బొలుపెసఁగు కప్పురపుఁ బలుకులకుఁ గోమలత
నెలకొనిన, సౌరభము జలువ పసయుం గో
మలతయును గలిగి జనముల మిగులఁ బెంపెసఁగు
మలయ పవనంపుఁ గొదమలకు మధురత్వం
బలవడిన, నీడు మఱి కలదనఁగనచ్చుఁ గడు
వెలయఁగల యీ సుకవి పలుకులకు నెంచన్.
ఈపద్యమునందు పింగళి సూరనార్యుఁడు ప్రకృతిపై నొక పంతము వేసినాఁడు. వెన్నెల చెలువునకు సౌరభము గలుగవలయును! కప్పురమునకుఁ గోమలత నెలకొనవలయును! పై గుణము లెల్లను గల మలయపవనమునకు మాధుర్య మలవడవలయు ! అప్పుడుమాత్రమే అది సుకవి పలుకులకు ఈడనవచ్చును! కోటి సంవత్సరములు తలక్రిందయి తపసుజేసినను ప్రకృతి యిట్టి యపూర్వ వస్తు గుణ సమ్మేళన మొనరింప లేదు. కావున సుక విపల్కులకు అసంపూర్ణ మయిన సృష్టి , యెట్లు ఈడనవచ్చును? వస్తుగుణములను అపూర్వముగ నేర్చి కూర్చుటయందు కవి అత్యంత నిపుణుఁడు. ఈ నైపుణ్యము భావనకు సంబంధించిన మహిమ. కవి కల్పనములు కొన్ని యెడల అలౌకికము లైనను చదువరులకు బోధపడకపోవు. ఏలయన : సంయోగము క్రొత్తదైనను వస్తువులుమాత్రము పూర్వపరిచితములె. తాను సృజించిన వస్తువు స్వభావికమా, లేక యస్వాభావికమా యను విచారము కవి కనవసరము. ఇట్టినవస్తువు భావప్రపంచమున నుండిన నెంత రమ్యముగా నుండును అను తలంపె కవికి ముఖ్యము; రసనిష్పత్తికి సాధక మగునేని నెట్టి యలౌకి కేంద్రజాలమునైనఁ బన్నవచ్చును. ఏలయనఁగా కవిసృష్టి యానందమాత్ర ప్రయోజనము గలది. -
ఆదర్శప్రాయమగు రూపమును జిత్రించు చిత్రకారుఁడు ఏదో యొక బహిరాకృతినిఁ దన రచనకు ఆలంబముగఁ గొనఁడు. ఆ రూపమును తాను భావనచేసిన తన మనమునందుఁ బ్రతిబింబించిన విగ్రహమును పటముపైఁ జిత్రించును. అటులనే కవియు భావనా కల్పితమైన చర్యలను వాగ్రూపమున వెలిపుచ్చును. ఒక యుదాహరణము: చిత్రకారుఁ డొకఁడు రతీదేవి స్వరూపమును లిఖంపవలయు నని తలంచి యొక సౌందర్యవతిని ఆదర్శముగఁ దీసికొని తత్ ప్రతిబింబకముగఁ జిత్రించును. రతీదేవి స్వరూపమునందు స్త్రీ సౌందర్య పరమావధిని మూర్తిభవింపఁజేయవలయునని ఆతని యుద్దేశము. తాను రచియించిన రూపముకన్న రమణీయవతి యగు మఱొక కాంత గాన్పించిన యెడల చిత్రకారుఁడు పూర్వచిత్రమును జించి పాఱవైచి, క్రొత్తరచనకుఁ బూనుకొనవలయును ప్రకృతి పరిణామ శీలము; రూపములను సృజించుచుఁ 'బోవుచుండును. స్త్రీసౌందర్య పరమాదర్శమును సృజించుటకుఁ బ్రకృతి యెన్ని నమూనాలను వ్రాసి చింపివేయవలయునో, యెన్ని వేల సంవత్సరములు పట్టునో యెవరి 'కెఱుక? నిఫుణుఁడైన చిత్రకారుఁడు స్వయముగ సౌందర్యమును ధ్యానించి తదనుసరణముగ లిఖించిన చిత్రము చిరంజీవముగ నుండగలదు. శకుంతలాది యద్భుతసృష్టు లీ తెగకుఁ జేరినవే.
- ___________
6.. రస రామణీయకములు
'విభా వానుభావ వ్యభిచారి సంయోగాద్రస నిష్పత్తి! అని భరతముని రసలక్షణము నిర్వచించెను. అప్పటి నుండియు రసస్వరూప విచార చర్చ నిరంతరముగఁ జరుగుచు వచ్చినది వ్యాఖ్యాతలును ఆలంకారికులును వారివారికిఁ దోఁచినట్లు భిన్న భిన్నముగ భరతసూత్రమును వివరింపుచు వచ్చిరి. సూత్రమునకు అనుకూలమును బ్రతికూలము నగు నెన్నియో మతములు బయలు దేరినవి* [11] కాని వాని నెల్ల నిచ్చట వివరింప నవసరము లేదు. సంస్కృతలాక్షణికుల వాద ప్రతివాదములవలనఁ దేలిన సారాంశములను క్రిందఁ బొందుపఱచుచున్నాను :
(1) విభావము (ఆలంబనోద్దీపనములు), అను భావము (సాత్వికము అనుభావము నందె చేరియున్నది.), వ్యభిచారి యని భావములు మూడు విధములు.
(2) విభా వానుభావ వ్యభిచారి సంయోగమువలన నొక భావము పరిపూర్ణతనొంది 'స్థాయి' అని పేర్కొన్న బడుచున్నది.
(3) ఆ స్థాయి భావము, చర్వణమువలన రసత్వము నొందుచున్నది.
(4) భావత్రయ సంయోగము వలన రూపాంతర పరిణామము గలుగుచున్నది. (దధ్యాదులవలె)
(5) [12]*భావ్యమాన భావత్రయములో నేదైన నొకటి రసమగును.
పై సారాంశములను వలసినచోట్ల గ్రహించి విమర్శించెదము.
పాంచ భౌతిక ప్రపంచమును మనము శబ్ద స్పర్శ రూప రస గంధముల వలనఁ దెలిసికొనుచున్నాము. ఇంద్రియములు సాధనమాత్రములు. వాని నుపయోగించునది బుద్ధి. మన మనస్సు పరాయత్తమైనపుడు దగ్గర నిలుచుండు వారినిఁ గూడ (చూచుచుండియు) కనుఁగొన లేము. ఇంద్రియములు గొంపోవు సూచనలను బుద్ది గ్రహించునప్పుడె జ్ఞాన ముదయించుచున్నది. అది యెట్లన : మన మొక పుస్తకమును జూచి దానిని పుస్తకమని గుర్తింతుము. నయనేంద్రియములు కొనిపోయిన రూపమును ఇదివఱకు స్మృతి యందడఁగియున్న పుస్తక రూపముతో సరిపోల్చి, దాని వంటిదే ఇది కావున 'ఈ రూపము పుస్తకము' అని బుద్ధి నిర్ణయించును. కాని, యీవ్యాపారము అమిత త్వరితిము గను అలక్షితముగను జరుగుచుండును గావున సామాన్యముగఁ దెలిసి కొనుట కష్టము. మొట్టమొదట బుద్ధికి పుస్తక రూపజ్ఞానము లేనియెడల అట్టి వస్తువును జూచినపుడు 'ఇది ఫలానిది' యని నిర్ణయించుటకు వీలు లేదు
వస్తు స్వభావ జ్ఞాన ముదయించిన వెంటనే ఆలోచనయు, దాని వెంట భావమును (మనోవికారమును), తరువాతఁ గోర్కెయు, దానితోడ సంకల్పనమును, అనంతరము కార్యమును బుట్టుచుండును ఉదాహరణము: మనమొక దారిలో నడుచుచుండగా నొక పుట్ట యొద్ద, కాలికి మూరెఁడు దూరమున పామును జూచితి మనుకొందము. దానినిఁ జూడఁగనె పైన వివరించిన విధమున వస్తుస్వభావ జ్ఞానము గలుగును పాము దగ్గరనున్నందువలనఁ గఱచు నని తలంతుము (ఇది ఆలోచన), తలఁచిన వెంటనే భయము గలుగును (ఇది భావము), తరువాత దానినుండి తప్పించు కొనవలయునని కోరిక పుట్టును(ఇదికోరిక ). దానిని నెఱవేర్చు కొనుటకు ధృఢసంకల్పనము గలుగును (ఇది సంకల్పము), అనంతరము వెనుకకుఁ బరుగెత్తి తప్పించు కొందుము (ఇది కార్వము), అట్లుగాక మనము చూచినది నిరపాయకరమగు నీళ్ళపామని తెలిసికొన్న యెడల భయము శమించి యూరక నిలుచుందుము. ఇంద్రియ సందేశమును బుద్ది గ్రహింపలేని యెడల భావములు పుట్టవనియు వ్వతిరేకముగ గ్రహించిన యెడల వ్యతిరేక భావములే కలుగు ననియు నిందువలన మనము తెలిసికొనవచ్చును. వస్తువు లెట్లు అనుకూల ప్రతికూలములో వాని వలనఁ గలుగు భావములుగూడ నట్టివియె వస్తువుల సుఖదు ఖ భానజనకతా పరిమితికి సమముగ ఆకర్షణ వికర్షణములు పుట్టును.
ప్రతి వస్తువును జిత్తము నందొక భావమును రేఁపును. అట్టిభావములు అనుకూల్య ప్రాతికూల్యముల ననుసరించి సుఖ దాయకములుగనో క్లేశ దాయకములుగనో యుండును. సుఖ దుఃఖ తారతమ్యముల కనురూపముగ భావములు కొన్ని దుర్బలములుగను, మఱికొన్ని తీవ్రములుగ నుండును. భావములవలె రసములును అనంతములు. అయినను ఇందుఁ బ్రధాన రసములు తొమ్మిది, వానియొక్క సాంకర్య సాజాత్య భేద సంబంధముల వలన రసములు వివిధములగుచున్నవి.
ఒక్కొక భావము తనకనురూపమైన రసమును బుట్టింపఁ గలుగునెడల భరతాదులు భావత్రయ సంయోగము నేల బోధించి రని కొందఱు శంకింపవచ్చును. ప్రధాన రసములు పుట్టుటకు విభావానుభావ వ్యభిచారి సంయోగ మావశ్యకము, ఏలన, భిన్న ప్రకృతులందు నొ కేవిభావము పరస్పర విరుద్ధములగు రసములఁ బుట్టించును. పులిని చూచినపుడు పిఱికివానియందు భయమును, శూరునియందు శౌర్యమును బొటమరించును. భావానుభావములకుఁ గారణ కార్య సంబంధము గలదుగాన, భావము. తీవ్రముగ రేఁగినప్పుడు అనుభావములు తప్పక పుట్టును. మనము గ్రహింపని యెడలఁ బులిని చూచివవానికిఁ గలిగినదిఁ పిఱికితనమా లేక శౌర్యమా యని నిర్ణంయిపఁ జూలము. గడగడ వడఁకుచుఁ గంటనీరు పెట్టుచుఁ బరుగెత్తఁబోయి తొట్రుపడుచుండుటఁ గని అతడు భీతిల్లెననియు, లేక , బొమలు ముడివైచి పండ్లు పటపటఁ గొఱకుచుఁ, గత్తిదూసి పులిపైకి దూకుటనుగని, యాతనియందు శౌర్యము దొనికినదనియు మన మూహింప వచ్చును. వీనికి వ్యభిచారి భావమును దోడ్పడినఁ బ్రధాన భావము పరిపూర్ణత నొందును. అనఁగా మూడు చిన్న దీపపు వత్తు లొకటిగఁ జేరినప్పుడు వేడిమియుఁ . గాంతియు హెచ్చునటుల, మూడుభావములు చేరి యొక స్థాయి భావమయి తీవ్రతను దాల్చును. కావున పరిస్పుటమగు రసము బుట్టింప వలయునన్న బ్రధానభావమునకుఁ బరిపోషకముగ ననుభా వాదులు గూడ వలయును.
ఇఁక రసస్వరూపమును జర్చింతము. స్థాయి భావమో లేక మఱియేదైన నొ క భావమో చర్వితమగునపుడు రసత్వము నొందుచున్నది. అనఁగా ఆభావమును సహృదయుఁడు తన హృదయమునందు నిలిపికొని పలుమాఱు భావించుట వలన ఆనంద ముప్పతిల్లును. రసము ఆనందమాత్ర గ్రాహ్యము, కావున, భావము అనుభవయోగ్యమైనది. రసము అనుభవ సిద్ధమగునది. భావచర్వణము, రసానుభవము నేక కాలమున జరుగుచుండును.
వస్తువునందు భావములేదు; కాని భావస్పోరక హేతు వున్నది. అటులనే కావ్య సమర్పిత విషయములు అనుభవ రసికుల హృదయములందు భావముల స్ఫురింపఁ జేయును. ఉదాహరణము: నీటియందు ఱాయి రువ్వఁబడినపుడు తరంగములు రేఁగును, నీటియందు లీనమైయున్న యలలు కారణ మలవడుటవలన వ్యక్తము లయినవి. అటులనే మన మనము నందు వాసనారూపముగ లీనమైయున్న సుఖక్లేశాది భావములు కావ్వగత హేతు ప్రేరితములై స్వరూపములు దాల్చి యనుభూతము లగుచున్నవి.
అట్లయిన కావ్యమునందు రసము లేదా ? కావ్యము నందు భావ ప్రేరక విషయములు గలవు. ఆ భావములె అనుభూతము లగునపుడు రసత్వము నొందుచున్నదని యిదివరకే తెలిసికొనియుంటిమి. అట్లయిన కావ్యము రసవంతముగ నున్నదని యేల చెప్పుదురు ? సామాన్యమైన వాడుకనుబట్టి బియ్యము అన్నమునకు వలెనే భావమునకును రసముసకును గొంత భేదముగలదు. అప్పుడె యెసటిలో బియ్యమును బోసి ప్రొయ్యి మంటపెట్టు వంటవానిని 'నీ వేమి చేయుచున్నా 'వని యడిగిన, 'నేను అన్నమువండుచున్నా 'నని జవాబు చెప్పును. అన్న మే యైన యెడల వండనక్కఱలేదు, ఈ సందర్భమున బక్వము కాని బియ్య మెట్లు అన్నమని పేర్కొనఁబడినదో అటువలెనే కావ్యము గూడ, అంత్యఫలముదృష్టియందుంచు కొనఁబడి, రసవంతమని యూహింపఁబడుచున్నది. రసము మానవచర్యలకే సంబంధించియుండుననియు, తిర్యగ్జంతువుల చేష్టలయందు రసస్పర్శ గలదనియు, అచేతన వస్తువర్ణనములు రసాభాసము లనియు, ఆలంకారికులు చెప్పుచున్నారు. ఇది చింత్యము. ఏలయన, అచేతన వస్తువులు గూడ రమణీయ భావముల బ్రేరించును. అవి యనుభవింపఁబడునపుడు ఆనందము పుట్టును. సుఖానుభవ యోగ్యమగు ప్రతిభావమును రసత్వము నొందఁగలదు, క్రౌంచపక్షి శోకము వాల్మీకిని అశ్రుగద్గద కంఠుని గావించినది. గొఱ్ఱె పిల్ల బుద్దుని హృదయమునఁ గరుణాంస మొలకించినది. ఉషస్సులను దర్శించిన వైదిక ఋషులు ఆనంద నిర్మగ్నులై వాని నత్యద్భుతముగఁ గొనియాడిరి. ఆషాఢ మేఘము నీరస భావద్యోతక మైనయెడల, కాళిదాసుఁడు దానినిఁ దన కావ్యమునకు ఆలంబముగఁ గొనునా? అయిన మఱియొక టి. మానవ చర్యలు హృదయుమునకు దగ్గఱివిగావున వాని మూలకముగ భావోత్కర్షత గలిగింపవచ్చును; కాని యింత మాత్రమునకె తదితరములు నీరసములని శాసించుట సాహసము. తేనెలో మెదిపిన వస్తు వేదైనను రుచిపుట్టించునటుల ఏభావమైనను సౌందర్యవాహకమై సుఖానుభోగ్యమగును. రస నీరసత్వములు కావ్య సమర్పితవస్తువుల చేతనా చేత నత్వమునకు సంబంధించియుండక కేవలము అలౌకిక కల్పనా చమత్కృతియొక్క భావాభావములపై నాధారపడి యుండును. రసమునకుఁ జమత్కారమే ప్రాణమని విశ్వ నాథుఁదు నుడివియున్నాఁడు. కల్పనా చమత్కృతి లేనిదే వాక్యమునకు కావ్యత్వము సిద్ధింపదు. కావునఁ బ్రతి కార్య మును స్వగత చమత్కార తారతమ్యమున కనురూపముగ రసవంతముగ నుండవలయు ననియె నిర్ణయింపవచ్చును. పండితరాయలు రసమునందు రామణీయక మున్నదని నుడివి యున్నాఁడు. అంతకన్న రామణీయకమునందు (రమణీయ భావమునందు)రసమున్నదని చెప్పుట సమంజసముగ నుండును.
లోకమున శోక బీభత్సాదిభావములు మనకుఁ గష్టమును గలిగించును. అట్టివి కావ్య సమ్పతము లైనపు డెట్లు ఆనందముఁ గలిగించుచున్నవి? ఎట్లన, అటువంటి భావములు శిల్ప నిపుణుఁ డగు కవిహృదయమునుండి వెడలి సహజకర్కశత్వమును బోనాడి, లోకోత్తర రమణీయములై అద్భుతానంద సంజనకములయి సహృదయులకు సుఖానుభోగ్యము లగుచున్నవి. కావుననె విషాదాంత నాటకములుగూడ ననుభవింపఁబడుట. కావ్యగతమైన ప్రతిభావమును రుచికరముగ నుండును. ఇందుకు కవియొక్క. శిల్పకల్పనా నైపుణ్యమును, భావనేంద్ర జాలమును గారణము,
రామణీయకము ఇట్టిదని నిర్వచించుటకు సాధ్యము గాని భావము, ఒకేరూపము చూచు వారి హృదయ పరిపాకము: ననుసరించి కొందఱికి సుందరముగను మరికొందఱికి నసహ్యముగను దోఁపవచ్చును. ఇది యందఱికిఁ దెలిసిన విషయమె. లంబాడి వారికిని యెఱుకల వారికిని జాల యింపుగనుండు గవ్వలదండలు దంతపు కడియములు మన యాఁడువారికి నేవ పుట్టించును. వీరికి రమ్యముగ నుండు కాసులదండలు తావళములు మున్నగునవి ఆంగ్లేయ స్త్రీలకు మోటు నగలుగఁ దోఁపవచ్చును. అట్లయిన, సౌందర్యము వస్తుగతమా లేక మనోగతమా? ఈ విషయమై తుద ముట్టని చర్చలు జరిగియున్నవి. జగన్మిధ్యావాదులు (Idealists) సౌందర్యము మనోగతమనియు, జగత్సత్యవాదులు (realists) సౌందర్యము వస్తుగతమనియుఁ దీర్మానించియున్నారు. కాని, యిరువురి పాదములందును సగము సగము సత్యము గలదు. రూపమునందు సౌందర్యభావము రేఁపు శ క్తిలేని యెడల భావజ్ఞత యుండియు నిరుపయోగము. అట్టి భావము ప్రేరించు శక్తి రూపమునందుండియు దానిని దెలిసికొనఁగల యనుభవజ్ఞానము బుద్ధికి లేనియెడల రూపగత సౌందర్యమును నిరుపయోగము. అనఁగా అటువంటి మందబుద్ధికి రూపమునందు సౌందర్యము లేనట్లె తోఁచును. ఇంద్రియ వ్యాపార మందఱికి నొకే విధముగ జరుగుచుండును; కాని తత్సం దేశములను జక్కఁగ నర్థము చేసికొనుటపై జ్ఞాన మాధార పడియున్నది. కావుననే యాలంకారికులు సహృదయుల హృదయములందుమాత్రమె కావ్యము రసముపుట్టింపఁ గలదని పలుమాఱు నొక్కి చెప్పియున్నారు. 'భావ స్ఫోరక శక్తి బుద్ధి యందును గలదు. కావున రెండును ముఖ్యములె.
రామణీయక మనునది యేక వస్తువుగాదు. అది సమష్టి భావము. రోజాపువ్వు రమ్యముగ నున్నదనుటలో, దాని యాకారము, రంగు, పరిమళము మున్నగునవి చేరియున్నవి. సౌందర్యమును గ్రహింపవలయునన్న సింహావలోకము చేయవలయును. అనఁగా సమష్టి దృష్టితోఁ జూడవలయును. ఆకారము మన సమష్టి దృష్టికి నందక మించిపోవునంత పెద్దదైన యెడల దానిని మెచ్చుకొనఁజాలము .
సౌందర్యమున కేదోయొక లక్షణమును గల్పించి దానిని బందిఖానాలో వేయుటకంటె స్వేచ్ఛగ వదలుట మేలు. ప్రతి మానవుని బుద్ది నిర్ణయమె సౌందర్యమునకు బ్రమాణము.. అది ప్రత్యేకము. సామాన్య వస్తువులలోఁ గూడ ననంత సౌందర్యమును దర్శించిన మహాను భావు లెందరోగలరు.
"In all poor foolish things that live a day
Eternal beauty wandering on her way"
అని సుప్రసిద్ధ ఐరిషు కవి ఈట్సు గానము చేసి యున్నాఁడు.
- ___________
7. శిల్పసీమలు
లలితకళలన్నియు, నొకే మూలసూత్రమునకు బద్దములై యును, ఒకే యంత్య ప్రయోజనము గలవైయును వాహక భేదముల ననుసరించి వానివాని యధికార సీమలును భిన్నములుగ నుండును. కళలన్ని యు నొకే విధమైన శక్తి పరిమితులు గలిగియున్న యెడల, గానము, కవిత్వము, చిత్రలేఖనము, భాస్కర్యము మున్నగునవి పృథగ్భావము భజింప నవసరముండదు ఒక్కొక కళయందు నితరకళలలో లేని యానుకూల్యమును గుణమును హెచ్చుగ నుండుటచేతఁ గళలన్నియు మనకు నావశ్యకము లైనవి. ' గానమున రాగము ప్రధానము. తక్కిన గుణములన్నియు రాగమునకు లొంగియుండును. కవిత్వమున రామణీయకము ముఖ్యము; ఇతర గుణములు దానికి పోషకములుగ నుండును. భాస్కర్యమునందు నిమ్నోన్నత స్థలములును ఘనిష్టతయుఁ జక్కగఁ బ్రదర్శింపఁబడును. చిత్రకళ మూలమున వివిధ వర్ణములతో సూక్ష్మాతి సూక్ష్మములైన వివరములనుగూడఁ జిత్రించి దృశ్యమును కన్ను లకుఁ గట్టినట్లు చేయగలము. కావున నొక్కొక కళకు నొక్కొక విషయము ప్రధానముగ నేర్పడినది. కవిత్వమునకుఁ బ్రతిక్షణ భిన్నములగు మానవ చర్యలును, చిత్రలేఖనమునకు విశాల దృశ్యములును, భాస్కర్యమునకు విగ్రహరచనయు ననుకూల వ్యాపారములు. ఇట్లగుటవలన, కళలన్నిటిని పృథఃకరించి వాని వానికిఁ గల సంబంధమును ద్రెంపివైచుటకు నేను సాహసింపను. కళలన్నియుఁ బరస్పర సాపేక్షకములు, కవిత్వమునఁ గొంత చిత్రలేఖనము చిత్రలేఖనమునందుఁ గొంత కవిత్వమును అవిభాజ్యముగ మిళితమైయున్నది.
చిత్రకారుఁడు స్థలపరిమాణ బద్దములగు రంగుల నుపయోగించును. కవి కాల పరిమాణ బద్దములగు శబ్దముల నుపయోగించును. చిత్రకారుఁడు రూపమునకుఁ జర్యను వశవర్తినిఁ జేయును. కవి చర్యకొఱకు రూపమును వర్ణించును. చిత్రకారుఁడు అనంత కాలమునుండి యేదో యొక క్షణమును (అనఁగా ఆక్షణములో జరుగు కార్యమును) గ్రహించి దానికి శాశ్వతస్థితిఁ గల్పించును. కవి క్రమముగఁ బ్రతిక్షణమునం జరుగు కార్యముల వర్ణించుచుం బోవును. ఇంతింతై వటు డింతయై మఱియుఁ దానింతై నభోవీథిపై
నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రునికంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్థియై.
ఈ పద్యమందు అనుక్షణ వర్ధమానమైన వామనుని స్వరూపము వర్ణితమైయున్నది. ఈ విషయమును స్ఫురింపఁ జేయుటకుఁ జిత్రకారుని కన్నను కవికి ఆనుకూల్య మెక్కువ. ఏ నిమిషమున జరుగుచున్న కార్యము (విజృంభణము) చిత్రించినయెడల ముందుజరిగిన విషయమును ఇఁకముందు జరుగఁబోవు విషయమును సూచితమగునో అట్టి చర్యను మాత్రము చిత్రకారుఁడు చిత్రింపవలయును. చిత్రమును మ్యాజికు లాందరు బొమ్మకును, కవిత్వమును బయస్కోపు బొమ్మలకును బోల్చవచ్చును.
చిత్రకారుఁ డొకరమణీయ రూపమును లిఖంచి మనలను నానంద పరవశులను జేయును. మనకానంద మెట్లు కలిగినది? ఆరూపముయొక్క సర్వావయవములు సమష్టి యాకారమున కనురూపముగను, రమ్యముగను చిత్రింపఁబడియుండును. అవి యెల్లను సమష్టిగా నొకేసమయమున గోచరించును. అప్పుడా రూపసౌందర్యమును మెచ్చుకొనుట వలన ఆనందము మనకుఁ గలుగును. కవియు నొక సౌందర్యవతిని వర్ణింపవలయునన్న నేమి చేయవలయును? చిత్రకారునివలెఁ బ్రత్యంగముఁ దాను వివరముగ వర్ణించి అట్టి యానందమును మనకుఁ గలిగింపఁ గలఁడా! ఎన్నటికిఁ గలిగింపలేఁడు. ఎందువలన? కవి యొక్కొక్కయవయవమును ప్రత్యేకముగ వర్ణించును. శరీర వర్ణనము వివరముగఁ బూర్తియగువఱకు నిరువది ముప్పది పద్యములు పట్టును. ఆ పద్యములన్నిటియందు నిమిడియున్న అవయవ వర్ణనమంతయు నొక్క చోటికిచేర్చి యొక యాకారముగ నిర్మించి సమష్టి సౌందర్యమును గ్రహించుట యసాధ్యమైన యుద్యోగము. అంగములను విడివిడిగా కత్తిరించి వేఱుపఱచి వాని యంద చందముల మనము కనుగొనఁజాలము. కావున, కవి యెల్లప్పుడును సమష్టివర్ణనముచేయుట యుపయోగకరము. చిత్రకారుఁడు ఆనందకార్యమును చిత్రింపక తత్కారణభూతమగు రూపమును ప్రత్యక్షము చేయును. కవి కారణమును వర్ణింపక కావ్యమును ( కారణమైన రూపమును జూచుట వలనఁ గలుగు ఆనందమును) వర్ణించును. అట్లయిన అవయవ వర్ణనము కవికి నవసరము లేదా ? కొంతవఱకు అవసరము గలదు. అటువంటి వర్ణనములు సమష్టి వర్ణనమును సార్థక పఱచు నట్లుండిన నదియొక విశేషము,
ఆలరుం దండలఁ దమ్మి దుద్దులను గ్రీవాలంకృతుల్ చేసి కా
మలతోఁ దెచ్చిన కల్వలం జెవులఁ గ్రమ్మన్మాటి, వాసంత పు
ష్ప లతారమ్యతఁ గేరుచున్ నయన నిర్వాణమ్ముఁ గావించు నా
కలకంఠింగని గౌతముం డెదను జిక్కేంబట్టు యత్నంబునన్.
గోరంటాకురసానఁ బాణితలముల్ గోళుల్ పదాబ్జంబులున్
సారాశోక కిసాల రోచి రుదయ స్థానమ్ములై రక్తిమల్
వాఱం, గాఁటుక చీఁకటిం గనులక్రేవంజేర మోహంబు శో
భారాజ్యంబును నేలు రాణియయి దైవాఱుం గురంగాక్షియున్.
(కడపటి వీడుకోలు)
చెలువుగ వ్రాసి దిద్ది విధి చిత్తము రంజిల జీవమిచ్చెనో?
పొలుపులఁగూర్చి మానస విభూతిని గౌతుకియై రచించెనో?
మెలఁతుక మేనిఁజూడఁ బరమేష్ఠి ప్రభావము నెంచిచూడ నా
నెలఁతుక దోఁచు నొండు తరుణిమణి సృష్టియటంచు నామదిన్.
(శాకుంతలము)
పై పద్యమునం దంతయు సమష్టి వర్ణనమే. దుష్యంతుని యీమాటలవలన శకుంతల అసదృశ లావణ్యవతి యనియు లోకమోహన సౌందర్యవతియనియు మన మూహింపగలము.
పై చర్చయంతయుఁ జిత్రకారుఁడును కవియు రూపగత సౌందర్యము నెట్లు స్ఫురింపఁ జేయవలయునను విషయమునకు సంబంధించినది. కాని, చర్యను వర్ణింపవలసి వచ్చి నప్పుడు కవి కేవలము సమష్టివర్ణనముతో సంతుష్టి పడి యుండరాదు,
ఏవిహంగముగన్న నెలుఁగించుచును సారెకునుసైకతంబులఁ గూడఁదారుఁ దారి కన్గొని యది తనజోడుగాకున్న మెడయెత్తి కలయంగ మింటినరయు నరసి కన్నీటితో మరలి తామరయెక్కి వదన మెండగ సరోవారి నద్దు నద్ది త్రాపఁగసైఁప కట్టిట్టు కన్గొని ప్రతిబింబ మీక్షించి బ్రమసియుఱుకు
నుఱికి యెఱకలు దడియ వేఱొక్క తమ్మి
కరుగు నరిగి రవంబుతోఁ దిరుతేంట్లఁ
బొడుచు ముక్కున మఱియును బోవువెదక
నంజఁ బ్రియుఁబాసి వగ నొక్కచక్రవాకి,
(మనుచరిత్ర)
పై పద్యమున విరహచంచలయైన యొక చక్రవాకి చర్యలు వర్ణింపబడినవి. కవి యెచ్చోటనైనను 'ఆ చర్యలు మనోహరములుగ నున్నవి' అని చెప్పలేదు. ఎందువలన ? అవసరములేదు. ఆ చక్రవాకి చర్యలు. మన భావమునకుఁ దట్టిన వెంటనే అవి హృద్వములుగ నున్నవని మనమే యెఱుంగుదుము కార్యకారణములను రెంటినిఁ జెప్పుట రచనా కౌశలమునకు లోపము. ఒకటి తెలిసిన మఱియొకటి తప్పక తెలియఁగలదు, కళానియమబద్ధుఁడై కవి వదలి పెట్టిన వివరములను పాఠకుఁడు తన సొంత భావముతో బూరించు కొనవలయును. కావుననె, పాఠకులు సహృదయులుగ నుండ వలయుననుట.
- ___________
8. కవిత్వ ప్రయోజనము
కావ్య ప్రయోజనములను గుఱించిన మన యూలంకారికుల మతము ఈ క్రింది శ్లోకము వ్యక్తపఱచుచున్నది.
శ్లో॥ కావ్యం ,యశసే౽ర్థకృతే,వ్యవహారవిదే శివేతరక్షతయే
సద్యఃపర నిర్వృతయే కాన్తాసమ్మితతి యోపదేశయుజే.
ఇందు "సద్యఃపరనిర్వృత యే" అనునది ముఖ్య ప్రయోజనము. ఆనందాస్పదమయిన రసోత్పాదకత్వమె లలిత కళల గంతవ్యము. శాస్త్రము \యొక్క కార్యము వస్తుతత్త్య పరిశోధనము, శిల్పముయొక్క పని వస్తువు నావరించిన మనోహరత్వమును మూర్తీభవింపఁ జేయుట. మొదటి దాని ఫలితము విజ్ఞానము. రెండవ దాని ఫలితము ఆహ్లాదము.
కవి యేమనోవస్థలోఁ దనకావ్యమును రచియించెనో ఆ యవస్థనే సహృదయుఁ డా కావ్యమును జదివినప్పుడు పొందును, సంకుచితములైన ప్రపంచసీమలను భేదించుకొని మనస్సు విశాలమయిన భావప్రపంచమున అనిర్వచనీయమైన యానందము ననుభవించును, కావ్య జగత్తునందుఁ జిత్తము లగ్నమైనపుడు అదియు బాహ్యప్రపంచము వలె యదార్థముగ దోఁచును. ఒకనాడు నే నభిజ్ఞాన శాకుంతలముఁ జదువుచుండ, మనోహరారణ్యముల సంచరించినట్లను శకుంతల పూఁదీవలకు నీరుపోయుచుండ నేను ప్రత్యక్షముగ జూచినట్లును, ఆమె నత్తవారింటికి వీడ్కొలుపుటకు నీటి కాలువవఱకు వచ్చిన కణ్వమహర్షి యు ననసూయా ప్రియం వదలు మున్నగు సఖులలో నేను గూడ నొకఁడనియు దలపోసి వారి సుఖ దుఃఖములను నేనును బంచుకొనుచుంటిని. కణ్వుని యాక్రోశము నాకర్ణ పుటముల గింగురుమని మాఱుమ్రోయు చుండెను. కాని నేను చదువుచుండినది నాటకమనియుఁ గాళిదాసుని యసదృశమైన రచనా చమత్కృతియుఁ బ్రతిభయు నన్నటుల ముగ్ధుని గావించినదనియుఁ దెలిసికొనుటకు నాకుఁ జాలసేపు పట్టెను. మనసు సామాన్య శ్రుతిలోఁ బడిన వెనుక , కల గని నిదుర లేచిన యనంతరము స్మృతిలేశములు స్ఫురించునటులఁ గణ్వుని సంసారము నా భావమునకుఁ బొడ్డకట్టు చుండెను. హెన్రీవుడ్ అనునామె రచిచిన 'ఈస్ట్లి ను* అను నవలలోని కడపటి యధ్యాయమును, 'ఒథెలో' నాటకములోని “హత్వరంగమును' జదువుచుండినపుడు నాకుఁ దెలియక యే నేను గన్నీరు. నించుచుంటిని. ఈయవస్థ నాకెంత సేపుండెనో తెలియదు. తెలిసినప్పుడు, నేలపై జారిపడినవాఁడు తన్నెవరైనఁ జూచుచున్నా రాయని యటు నిటు పరికించునటుల లజ్జాకరమైన నాస్థితిని ఎవరైనఁ గాంచు చున్నారాయని పాఱఁజూచి అచ్చట నెవరును లేకుంట నెఱింగి తృప్తిపడితిని. కావ్యలోకము ఆ సమయమునకు సత్యమని తోఁపనిదే మనకు సహానుభూతి యెట్లు గలుగును !
జర్మను కవి శేఖరుఁడగు గెతె కావ్య ప్రయోజనములను గొంచె మించుమించుగ మన యాలంకారికుల వలెనే నుడివియున్నాఁడు.
“Each age has sung of beauty,
He who perceives is from himself set free"
కాళిదాసుని కాలమునఁ జిత్ర లేఖనము, నృత్యము, సంగీతము, నాటకము మున్నగు లలితకళలు చాలవ్యాప్తిలో నుండినవి. మాళవికాగ్ని మిత్రమునం గల యంతర్ణాటిక యందు కాళిదాసు ఆకాలపు రాజకుటుంబముల నృత్యవినోదములను చూపించినాఁడు. శకుంతలను అత్తవారింటికిఁ బంపు సమయమున వనస్పతు లొసఁగిన యాభరణములచేతఁ దమ సకియ నలంకరింపఁబోవుచు ననసూయ ' మే మింతవఱకు భూషణముల నుపయోగించి యెఱుఁగము. అయినను జిత్తరువు వాఁత యలవాటునుబట్టి నీ యంగములయం దాభరణ వినియోగము చేసెదము' అని పలికెను. వనమున నివసించు ఋషి కుమారికలె చిత్ర లేఖనమునం దంత నిపుణులై యుండ, నిఁక నాగరక యువకులమాట వేఱ చెప్పవలయునా? ఆద ర్శక కవుల కావ్యములందైనను దేశ కాలములు తమ పద చిహ్నముల ముద్రింపకపోవు, రామాయణ మహాభారతములు ఆయాకాలమునాఁటికి హైందవ సంఘముయొక్క. ఆదర్శక ప్రతికృతులని తలంపవచ్చును.
మనో వికారములను, భావములను శిక్షించి, సంస్కరింపఁగల యనుభవములు మాటిమాటికి లోకమునఁ దటస్థింపవు. ఒకవేళ తటస్థించినను, అవి పరిపూర్ణముగను, ఆదర్శక ప్రాయముగను నుండవు. కాని, ఇట్టి యనుభూతులను కావ్యములందు మనము యథేచ్చముగఁ బొందవచ్చును. కవిత్వ సంపర్కమువలన సంకుచితభావము తొలఁగి యఖండ జీవముయొక్క పరతటము నంటఁగలము. క్రమముగ మన స్వభావము సున్నితముగ మాఱి తిలకించు ప్రతి వస్తువునందు సౌందర్యమును గుర్తించి యానందింపగల యభిరుచి హెచ్చును. కావున కావ్యము మానవప్రకృతి నుద్దరింపఁగల యొక మనోహర సాధనము,
సంఘముయొక్క సంయోగతను బోషించుటకుఁగూడ గావ్యము లమోఘ సాధనములు. అట్టి ప్రబంధముల యందలి సర్వజనీన భావములు ప్రజనందఱిని నేక సంప్రదాయ బద్దులను గావించి, సంఘముయొక్క యైక్యమును బలపఱచును. రామాయణ, మహాభారతములు లేకుండిన హైందవ సంఘ మేమై యుండునో! హిమవత్పర్వతము మొదలు కన్యాకుమారి పఱకుఁ గల యీ విశాల భారత దేశమున నీ రెండు జూతీయ కావ్యములను జదువని, వినని హైందవుఁడుండునా? ఎన్ని శతాబ్దములనుండి యీ కావ్యద్వయము మన సంఘమును. బాలించుచున్నది! కాలము మాఱినది, చక్రవర్తులు గతించిరి. రాజ్యములు బంతులవలె నొకరిచేతినుండి మరియొకరి చేతికి దుమికినవి, మతములు పుట్టి చచ్చినవి, చచ్చిపుట్టినవి, అన్య దేశ నాగంకతా సంఘర్షణము గలిగినది. ఆచార వ్యవహారములు మాఱినవి. పూర్వార్యావర్తమెఁ రూపము మార్చుకొని క్రొత్తదేశమైనది కాని, మన జాతీయకావ్యములు ప్రాతపడలేదు, వాని యధికారమింకను మొక్క వోలేదు. హైందవ జీవన ప్రవాహమునకు ఆ కావ్యములు తటములవలె నున్నవి. కాలమా, తీవు చచ్చితివి! రామాయణ మహాభారతములు చావ లేదు; అవి చిరంజీవములు!
9. కావ్యము : నీతి
మతము, శాస్త్రము, ధర్మము, లలితకళలు మున్నగునవి వానివాని కుచితమైన రీతుల మానవ శిక్షణమునకుఁ దోడ్పడు సాధనములు. కొన్ని బుద్దిని ఉత్తేజన మొనరించునవి. మఱికొన్ని హృదయమును పరిపక్వపఱచునవి.
ప్రతియుగమునందును బ్రతిసంఘమునందును కాలమునకంటె ముందు నడచు ప్రతిభావంతులు, విప్లవకారులు దూరదృష్టి గలవారు కొంద ఱుదయించుచుందురు. అట్టి మహనీయుల భావములు, సృష్టులు ఆ యుగమునకు, ఆ సంఘమునకు ఆదర్శకములుగ నుండును, ఆపురుష పుంగవులు మార్గ ఋషకులు; అస్ఫుటముగను, అవ్యక్తముగనున్న భావికాల నిఁక నా--- కన్నులకుఁ బొడకట్టునట్లు చేయఁగల మహిమా వంతులు. వారి పలుకుబడివలన మానవసంఘము క్రొత్త క్రొత్తదారులు ద్రొక్కుచుండును. జాతీయత అట్టి యుదార హృదయుల భావసంపర్కముచేత నంతర్జాతీయతగఁ బరిణమించుచుండును. బుద్ధుడు, వాల్మీకి, ఏసుక్రీస్తు, మహమ్మదు మున్నగు మహాపురుషు లీతరగతికి సంబంధించినవారు. వారి జీవితమే యొక యుత్కృష్టమైన కావ్యము, వారి ప్రవర్తనమే నీతికి ఆదర్శకము..
ప్రతియుగమునం దోక్కొక్క భావము ప్రముఖమై యుండును. అది యాధ్యాత్మికమైనను, సాంఘికమైనను, రాజకీయమైనను, లేక మఱి యిం కేవిధ మైన మానవచర్యకు సంబంధించినది యైనను గావచ్చును. ఆ భావములందుఁ బ్రజల యాంతరంగిక దృష్టి లగ్నమై యుండును. ఇట్టిభావము సార్వజనీనముగ నుండక తప్పదు. దానిని కవియో, చిత్రకారుఁడో, ప్రవక్తయో, తన సృష్టిమూలమున బయలుపఱచును. మన మెల్లర మానాయకుని ననుసరింతుము. ఎందువలన? మనయందు అస్పష్టములుగను నిగూఢములుగను నున్న భావములను ఆయన వెలిబుచ్చును. ప్రజాబాహుళ్యము యొక్క భావములు అతని సృష్టియందు ఆది శేషావతారము దాల్చి రెండు వేలనాలుకలతో మాటలాడుచుండును. ఆయనకును మనకును సహానుభూతి గలదు. కావుననే యూ నాయకుఁడు మనలనాకర్షించును. అట్టి మహనీయుల యుద్దేశములు, సంభాషణములు, ప్రవర్తనములు విశ్వశ్రేయమును జేకూర్చు చుండును. ఏది విశ్వశ్రేయమును సంపాదింపఁగలదో యది నీతిబాహ్యముగ నుండనేరదు. లలితకళలు జాతీయ జీవితమునందు అంతర్వాహినులై ప్రవహించు భావముల రమణీయాభివ్యక్తులే. కావున, వానియందు ముఖ్యములును, సర్వజనాదరణీయములును అగు భావములను ఆకర్షించి, శిల్పులు తమ రచనాచమత్కృతి వలన వానిని ఆదర్శకములుగ నొనరింతురు, ఇట్లనుట వలన మానవసమాజమును కళలును పరస్పర సాపేక్షకములని మన మూహింపవలయును. తాత్కాలికములైన భావములు కొన్ని ప్రజలను శిల్పులను ఆకర్షింపవచ్చును. అట్టివి క్షణికములు. కాని, కాలపారంపర్యముగ నొకజాతి యందు అస్థిగతమై మజ్జలో నాటుకొనియున్న భావములను మూర్తీభవింపఁజేయుట జాతీయశిల్ప మనఁబడును. అదియే లోకాదరణపాత్రము. తన వ్యక్తిత్వమును బోఁగొట్టుకొనక చిరంజీవముగ నుండును. తాత్కాలికములైన విజాతీయాను కరణములు మన స్వభావమునకుఁగూడ విజాతీయము లే కావున సత్యపటుత్వము కొఱఁతపడి కళాప్రపంచమునందు నిరాదరింపఁబడును.
ప్రాచ్యపాశ్చాత్యశిక్షణ మార్గములందుఁ బరస్పర వైరుధ్యము గోచరించుచున్నది. ఒకరికి శాంతియు నిరాడంబర మైన జీవనము ప్రధానము. మఱియొకరికి, తృష్ణ, చిత్త సంక్షోభము , ఆటోపము ముఖ్యము. నేతి చేఁ దడుపఁబడిన అగ్నిహోత్రమువలె భోగము లనుభవింపఁబడుకొలఁది వృద్ధిచెందుచుండుననియు, కావున భోగముల నియమితముగ గ్రహింపవలయుననియు నొకరిమతము. భోగముల వీలైనంతవఱకు వృద్ధిపొందించి వాని ననుభవింపనిదే నాగరకత గాదని మఱియొకరి యభిప్రాయము. ప్రాచ్యులకు జీవితము పరమార్థమును సాధించుటకై ఏర్పడిన యొక యుపకరణము. పాశ్చాత్యులకు, జీవితమే యొక పరమార్ధము. కావున యిట్టి మార్గభేదములు రెండు ఖండములయొక్క లలితకళల యందు నస్థిగతముగ నంకితమైయున్నవి. ప్రాచ్యశిల్పము, నందు రూపయథార్థ్య మంతముఖ్యముగాదు ఏలయన, వారిశిల్పము చాలవఱకు సాంకేతికము. సాంకేతికశిల్ప మెప్పటికి కొన్ని శిల్పసమయములకుఁ గట్టువడియుండును. అజంతాగుహలయందలి రేఖాచిత్రములు ఈతరగతి శిల్పమునకుఁ బ్రబలమైననిదర్శనములు. మనశిల్పము ధ్యానమూలకము; వారిశిల్పము ప్రకృత్యనుకరణము. .
'కళలయందు రసరామణీయకములె ప్రధానములు కాని, నీతికిని ఆధ్యాత్మికభావములకును నేమిసంబంధము గలదు? అని కొందఱు విమర్శకులు ప్రశ్నించుచున్నారు. ఇది మనకు నవీనమును విజాతీయమునునైన సందేహము, ఆస్కర్ వైల్డు (Oscar Wildr) అను నొక ఆంగ్లేయ విమర్శకుఁడు *[14]కళలన్నియు నీతిబాహ్యములనియు. నీతియనునది యేదోకొద్దిపాటి తెలివితేటలు గలవారికేగాని, ప్రతిభావంతులకు నీతి యనవసరమనియు చెప్పియున్నాఁడు. ధర్మశాస్త్రములయందు వలె కావ్యములందు నీతిబోధ యనవసరమనుటయే ఆయన యుద్దేశమైనయెడల మే మిరువురము ఏకాభిప్రాయులమే. కాని నీతికిని కావ్యమునకును ఏలాటి సంబంధములేదని వాదించువారికిని నాకును భిన్నాభిప్రాయము గలదు. ఈ విషయమును గొంచెము చర్చింతము.
కావ్యమందు రామణీయకము ముఖ్యము; తక్కిన గుణములు అందుకు పోషకములుగ నుండవలయును. రామణీయకమనునది ప్రతిభావంతుఁడైన గవియొక్క రచనా నైపుణ్యమునకు సంబంధించినది. గుణమెప్పుడు తనకాలంబమైన వస్తువును ఆశ్రయించియుండునుగాన, వస్తుగుణములు రెంటికిని ప్రాధాన్యము గలదు. ఒకవేళ నీతిబాహ్య మైన వస్తువు రమణీయమై యుండినయెడల షేక్సిపియగు (Shakespeare) మహాకవి సృజించిన క్లియోపాట్రా (Cleopatra) కస్యవలె మానవలోకమున కుపద్రవము గలుగఁజేయును. శకుంతెలవలె అనుభోగ్యము గాదు
మఱియొక పూర్వపక్షము గలదు: శిల్పముకొఱకే శిల్పము' (Art for art) అనఁగా శిల్పమున కేలాటి బాధ్యతలు లేవు. కవి భావోదేకమువలనఁ దనకిష్టమైనరీతిని గానము చేయును. అట్లుచేయుట యితరులకొఱకుఁగాదు; తన సంతోషమునకు, కోకిలకూయుట యెవరిని ఆనంద పెట్టుటకొఱకు? ఈ వాదము మొట్ట మొదట వినుటకు ఇంపుగానే యుండును; కాని విమర్శించుకొలఁది యందలి లోపములు బయలువడును. కోయిలకూఁతను విని మన మానందించుచున్నాము; నిజమే, దానికూఁత మధురముగ నుండుటవలనను ఆ కూఁత మనకు సమ్మతమగుటవలనను మనము సంతోషించుచున్నాము. అది తన కిష్టము వచ్చినట్లు కూయుటవలనఁ గాదు. కాకిగూడ తన కిష్టమువచ్చినట్లే కూయును. దానిని మన మేమాత్రమాద రించుచున్నాము? అటులనే కవి చేయు గానము మానవ సమాజము నుద్దరించుటకు యోగ్యమైనదిగ నుండుటవలననే గౌరవింపఁబడుచున్నది. 'నాకు నోరున్న ది. తిట్టుటకు చాల మాటలు తెలియును. కావున నేను తిట్టుకొనుచుందును' అని చెప్పి వీధుల వెంబడి తప్పుదారి కూఁతలు కూయుచుఁ దిరుగు చుండిన 'ఆతనికి పిచ్చి పట్టిన' దని పిచ్చివారి ఆసుపత్రికి పంపుదుము. సమాజ మెట్లు తనయందలి వ్యక్తికి బాధ్యమొ, వ్య క్తికూడ సమాజమునకు బాధ్యుఁడు.
కవి యొకమూలఁ గూర్చుండి తన సంతోషముకొఱకు నొక కావ్యము రచియించుకొని దానిని బదిలముగ నింట దాఁచుకొని యుండినయెడల నేలాటి యిబ్బంది లేదు. అట్లుగాక కవిరచనలు వ్యాప్తిలోనికివచ్చి, లోకజీవనము పై నధికారము చేయుచుండును. కావున నందఱికంటెను కవికి బాధ్యత యెక్కువ. ఉత్తమకవి సృష్టియం దా కాలపు మానవ సంఘమునందలి సమంచిత భావములు మూర్తీభవించి యుండును. ఆతని రచనలందు భవిష్యద్వాణి రహస్య మర్మర రవములతో సంభాషించుచుండును.
మానవ జీవితమునకును శిల్పమునకును సహజమైన సంబంధము గలదు. జీవిత ప్రయోజనము ననుసరించి శిల్ప ప్రయోజనము కూడ నిర్ణయింపఁబడుచుండును. మన జీవితమును గుఱించి ఉమ్రఖయ్యాం (Omar Khayan) అను పారసీక కవి యిట్లు నుడివియున్నాఁడు: One thing is certain and the rest is lies:
The flower that once has blown for ever dies.
Many knots unravelled by the road.
But not the knot of human death and fate;
There was a door to which I found no key.
Tbere was a veil past which I could not see.
While you live, drink;
for once dead, you never shall return,
ఉమ్రఖయ్యాము కొంచె మించుమించుగా చార్వాక మతస్థుఁడు. 'వికసించిన పూవు మరల వికసింపఁబోదు. మరణించిన మానవుఁడు మరల తిరిగి రాఁబోఁడు, పొణముండఁగనే భోగము లనుభవించెదము. చచ్చిన వెనుక యేమగునో ఆ విషయము నాకు తెలియదు. ఆ ముడిని నేను విప్పఁజాలక పోతి' నని చెప్పెను. అట్టివారికి జీవితము భోగమాత్ర ప్రయోజనము. జీవితము ననుసరించి శిల్పముగూడ విషయభోగముల ప్రతిబింబముగ నుండును,
కాని, మన విశ్వాసములు వేఱు. ధర్మార్థ కామ మోక్షములను నాలుగు పురుషార్థములను మానవజీవితము సాధింపవలయునని మన పెద్దలు నిర్ణయించరి . వారు ఇహ పరిముల రెంటికిని సమాన గౌరవమును చూపియున్నారు, సన్న్యాస మనునది అతీత ధర్మము. లోకసామాన్యము 'గాదు. ధర్మార్థ కామమోక్షములు పరస్పర సాపేక్షములు కావున, మన కవిత్వ ప్రయోజనము, జీవితాదర్శకము నను సరించి బ్రహ్మానంద సోదరమైన పరనిర్వృతిగ నిర్ణయింపఁబడినది. కావ్యము లనఁగాఁ బసిబిడ్డ లాడుకొనుటకై మన మిచ్చు రంగుల బొమ్మలుగావు; అనాగరకతా దోషము పాపుకొనుటకు మేజా బల్లలపైఁ బ్రదర్శింపఁబడు భూషణ గ్రంధములనుగా కావ్యములను మన మెప్పుడు తలంప లేదు. మన జీవితమునందు కావ్యములు మిళితమై పోయినవి. ఆర్య సాంఘిక జీవన ప్రవాహమునకు రెండు తటములుగ నున్న రామాయణ మహాభారతములే యిందులకు దృషాంతము. సీత, దమయంతి , సావిత్రి, ద్రౌపది మున్నగు పౌరాణిక సతీ రత్నములు భారతదేశమునం దెందఱు పతివ్రతల సృజింప లేదు ? సంసారమందు నిర్భర దారిద్ర్యమును, కష్టపరంపరలను ననుభవించుచున్న సతీమణులకు దమయంతి, ద్రౌపది, చంద్రమతి మున్నగు నిల్లాండ్ర చరిత్రము లెంత యూఱట నొడగూర్చియుండలేదు. ఈ నారీవతంసము లందఱు వ్యాస, వాల్మీకి మహాకవుల భావప్రపంచమునఁ బుట్టి పెంపొందిన ఆదర్శక సృష్టులేకదా ! అట్టి కవులెన్నఁటికైన నిర్భాధ్యు లగుదురా ? వారి రచనలు నీతి బాహ్యములగునా ?
కీట్సు {keats) అను ఆంగ్లేయకవి Beauty is truth, truth beauty అని చెప్పియున్నాఁడు. మన పూర్వికులు సత్య సౌందర్యములకు శ్రేయమునుగూడఁ జేర్చిరి. కావ్యము విశ్వశ్రేయము చేకూర్చునదిగ నుండవలయును. అనీతి దాయకమైన దేదియు లోకళల్యాణము నాపాదింపలేదు.
ఇఁక నీతియననేమి? దాని నెవరు కల్పించిరి? దానివలనఁ బ్రయోజనమేమి? అను నీ విషయములు మనసున కెక్కనిదే కావ్యములందు నీతి యావశ్యకమా? లేదా? యను సం దేహమును మనము తీర్చుకొనలేము. నీతి యనుపదమును విశాల భవముగల దానిగా నూహించి నేనిచట ప్రయోగించుచున్నాను. దేశకాల పాత్రములకు లోఁబడి నీతులు భిన్నములుగ నుండవచ్చును. ఒక సంఘమువారికి నొక దేశమువారికి ననుకూలమయిన నీతులు మఱియొకరికి విరుద్దముగఁ దోఁపవచ్చును. కాని, యిట్టి పరస్పర విరుద్దము లైన నీతులందు నంతర్వ్యాపియగు నుద్దేశ మొక్కటియే. అది యేదన : మానవ జీవితోద్ధరణము, లోకయాత్రా సౌకర్యము. నేనిచటఁ బ్రయోగించిన నీతి అను పదమును దేశకాల పాత్రాచార వ్యవహారములకు వశవర్తి యయి సంకుచితమయిన నీతినిగ నర్థముచేసికొనఁ గూడదు. అన్ని నీతులకు జన్మకారణమయిన యావశ్యకతనుగఁ దలంప వలయును. ఇది జగ దేకము,
సంఘ సమష్టికిని దదంశ మైన వ్యక్తికిని భిన్న భిన్న వ్యక్తులకును గల ప్రవర్తన సామరస్యము, ఆనుగుణ్యము నీతి యనఁబడును, ఈనీతి మానవుల యావశ్యకతనుబట్టియు ననుభవము ననుసరించియు, క్రమక్రమముగ రూపముదాల్చి సంఘయంత్రమును నడుపుచుండును. ఈ నీతులు సకల విధములైన మానవచర్యలకు సంబంధించియున్నవి. ఇట్లనుట వలన, విశేష సంఖ్యాకులగు ప్రజల యభిప్రాయము ఘనీభవించి నీతిగను శాసనముగను మాఱును. కాని, నీతి శాసనములకుఁ గొంత భేదముగలదు. రాజూధికార ముద్రగలది శాసనము, సంప్రదాయ సిద్దమయి మానవుల భావములను బరిపాలించునది నీతి. నాగరకత హెచ్చుకొలఁది అధికార ముద్రాంకితములగు శాసనములకంటె స్వయమారోపితములగు నీతు లే మనుష్యసంఘమును బాలించుచుండును. విరుద్ద శాసనమునకు లొంగియుండుట దాస్యమైనను స్వయంకృత నియమమునకు వశవర్తియై యుండుట స్వాతంత్ర్య మనఁబడును.
నీతులును శాసనములును (స్వయంకృతములైనను, పరకృతములై నను) సంఘమును శాసింపనియెడల వ్యక్తి స్వాతంత్ర్యము నశించి మానవజాతికిఁ బ్రళయము సంభవించును. కావున నీతి మానవులయం దన్యోన్య ప్రవర్తనానుగుణ్యమును బోషించును.
కళలు సాంఘిక జీవితముయొక్క యుచ్చ్వాస నిశ్స్వాసముల యాదర్శక లేఖనములని యిదివఱకే తెలిసికొని యుంటిమి. కావున జీవిత మొక వంకను, కళలు వేఱొక వంకనుఁ బ్రవహింప నేరవు. సాధారణ జీవితమునందు నేవేవి నీతిబాహ్యములుగను, నేవము పుట్టించునవిగ నుండునో అట్టివి కళలయందును నింపుగొలుపవు. అట్లగుట కావ్యమునకును నీతికని సంబంధ మెట్లు తెగిపోవును?
ధర్మ శాస్త్రములు వేఱు; కావ్యములు వేఱు, వాని వాని ప్రయోజనములును భిన్న ములు. పాలనాదండము చేతబట్టుకొని 'సత్యంవద' 'ధర్మంచర' అని వేదములు శాసించును. కవి 'సత్యంవద' అని శాసింపక హరిశ్చంద్రుని సృజించెను. 'సత్యమేవజయతి' అను ధర్మ వాక్యమునకు హరిశ్చంద్రోపాఖ్యానము లక్ష్యము. ఆకథను జదివినవారికి హరిశ్చంద్రునిపై భక్తి గౌరవములు గలుగకపోవు. మన మెవరిని ఉత్తములని మెచ్చుకొందుమో వారి ననుకరింప వలయుననియో, వారివలెఁ బ్రవర్తింపవలెననియో మన మభిలషింతుము. ఈకోరిక మనయందు సహజముగఁ బుట్టును. సత్కావ్యములయందు ఇట్టి యున్న తాశయములను, ఆసలను బ్రేరించు శక్తిగలదు. *[15]బలాత్కార నీతిబోధనమునకు కావ్యము లెన్నఁడును బూనుకొనఁగూడదు. అట్టివి కావ్యములుగాక మనుధర్మ శాస్త్రములవంటి స్మృతులుగ మాఱును. కళలయందలి నీతి యంతర్లీ నమై యలక్షితముగ మన హృదయముఁ బ్రవేశించును. దాని పదచిహ్నము లదృశ్యములు. ఇట్లు రచించుట కళానైపుణ్యము.
కావ్య మర్థింపవలసినది రససౌందర్యము లేకదా ! అంతర్లీనమైన నీతియైనను వానికెటుల నుపకరించును? అను సంశయము కొందఱకుఁ గలుగవచ్చును, నీతిస్పర్శ లేనిదే సౌందర్యము పరిపూర్ణముగాదని నాయుద్దేశము. ఈదృష్టితో మనము విమర్నింపఁబూనినయెడల ఏదేశముయొక్క యుత్తమశిల్పమునందుఁగాని యనీతిపరత్వము గోచరింపదు. ఒక చిత్రకారుఁడు రమణీయవతియగు కాంతను విగతవస్త్రనుగఁ జిత్రించి మనకుఁ జూపినయెడల ఆ సౌందర్యమునంతయు మ్రింగివేయఁగల యసహ్యముపుట్టి మొగము చిట్లించు కొందుము. ఎందువలన? ఆ చిత్రపటమునకును జీవితము నందు మన కలవాటుపడియున్న యౌచిత్యమునకును వైరుద్ద్యము సంభవించినది. అందలి రమ్యత సర్వజనోపభోగ్యమగు నంతలేదు. సభ్యముగ ఇట్టి చిత్రములు ఆహ్లాదమును గలిగించి మనసు నుద్దరించుటకు నూఱు, ఇంద్రియచాపల్యమును, అసభ్యములగు మనోవికారములను బ్రేరేపించు చుండును. అట్లుచేయుట యుత్తమకళయొక్క ధర్మముకాదు.
అట్లయినయెడల మానవచర్యలకు సంబంధింపని వనములు, కొండలు, మేఘములు, ఉషస్సులు, సూర్యాస్తమయములు మున్నగు దృశ్యముల ప్రతిలేఖనములు కాంచు వారలకు ఆనందము గలగించునుగదా! అట్టి చిత్రమునందుఁ గూడ నీతి అంతర్లీనమై యున్న దా ? అని కొంద ఱడుగ వచ్చును. అట్టి చిత్రములు అనీతిస్ఫోరకములు గాకుండుట చేతనే వానియందలి రామణీయకమును బ్రతిబంధకము లేక మన మనుభవింతుము. నీతి సౌందర్యమునకు హేతువుగాదు; పరిపూర్ణతకు ఆవశ్యకమైన యొక ఔచిత్యము,
కావ్వమునందు శిల్పనైపుణ్యము హెచ్చుకొలఁది యందలి కథాభాగమునకుఁ జదువరుల హృదయము నాకర్షించు శక్తియు హెచ్చుచుండును. గుణ మెప్పుడు వస్తువు నాశ్రయించియుండును. గావున నితరకళలయందు వలెనే కావ్యమునందును వస్తుగుణములు రెంటికిని వానివానికి దగిన ప్రాధాన్యము గలదు.
మానవుని ప్రతికోరికకును రెండుదిక్కులు గలవు. మొదటిది వాంఛాపరిపూర్తి; రెండవది తజ్జనితమైన యుపయుక్తి. ఒక యుదాహరణము: మిఠాయినిఁజూచినపుడుతినఁ గోరిక పుట్టును. ఇది జిహ్వాచాపల్యము. మనదృష్టి కోరిక తీర్చుకొనుట యందే లగ్నమయి యుండునుగాని, దాని యుపయోగమును గుఱించిన తలంపె సాధారణముగఁ గలుగదు. కాని, మనము తలంచినను, తలంపకపోయినను మిఠాయి తినుటవలన రెండులాభములు చేకూఱినవి. ఒకటి: కోరిక తీరుటవలన గలుగు తృప్తి , రెండు ; దేహపుష్టి. ఇచ్చట మిఠాయిలోని మాధుర్యము రుచిచూచుటవలన గోరిక తీరినది. ఆమాధుర్యము, ఆహారవస్తువు నాశ్రయించి యుండుటవలన దేహమునకు బలము కలిగించినది. కాని, మాధుర్యము మాత్రము కోరిక తీర్చునదిగా నుండి తదాశ్రయవస్తువు అనారోగ్యకరమై యుండినయెడల దాని ప్రతిఫలమును మనము తప్పక యనుభవింతుము; ఈ సాదృశ్యమును కావ్యములో రససౌందర్యములకును, కధాభాగమునకును వాని ననుభవించు మానవసమాజమునకును నన్వయించి చూడుఁడు; అంత్యఫలితము మీరే యూహింపఁ గలరు;
మానవస్వభావ నిర్మాణమునందుఁ బరిస్థితులు చాల ముఖ్యములని మనస్తత్వ శాస్త్రజ్ఞులెల్లరు నొప్పుకొన్నవిషయమే ! కావ్యములం దట్టి పరిస్థితులు గలవు, ఇంద్రియ గోచరములగు విషయములు మనల నెట్లు లోఁగొనునో, కావ్యాంతర్గత విషయవర్ణనముకూడ నట్లే మనల వశవర్తులఁ జేసికొనును. కావున కావ్యములతోఁ గవికిఁ గల సంబంధము కన్నను దానిని జదివి యానందించు లోకుల కెక్కు డుసంబంధము గలదు. మతమును శిల్పమును ఒక పూవులోఁబుట్టిన రెండు రేకులని చెప్పవచ్చును. వాని రెంటికి మిక్కిలి సమీప బాంధవ్యము గలదు. ఒక దానినొక టి యపేక్షించి యవియన్యోన్య సహకారమువలన నభివృద్ధి చెందినవి.
వైదిక ఋషుల భావమును, కవిత్వ కల్పనాశక్తియు సమ్మిళితమయి, యందుండి యపూర్వ సృష్టులు బయలుదేరినవి. పౌరాణిక ప్రపంచమంతయు నిట్టి మతకవిత్వ సాంకర్యముయొక్క యద్భుత సృష్టియేకదా! ఇట్టి కల్పనలు లేకున్న మానవజీవిత మెంత సంకుచితముగ నుండియుండెడిదో !
మతమును, శిల్పమును ఆనంద సాక్షాత్కారమునకై పాటుపడుచున్నవి. గంతవ్య మొకటి; మార్గములు భిన్నములు,
“ఆనందా దేవ ఖ ల్విమాని భూతాని జాయంతి,
ఆనందా దేవ జాతాని జీవంతి.
ఆనందం ప్రయాన్త్యభి సంవిశంతి. "
ఈ భూతసృష్టియంతయు నానందమునుండి యుత్పన్నమగుచున్నది. ఆనందమున వర్ధిల్లుచున్నది. ఆనందము దిక్కునకే ప్రవహించుచున్నది. తుదకాయానందమును బ్రవేశించు చున్నది. శిల్పిసృష్టియు నిట్టిదే. భక్తుఁడును శిల్పియు నేది “సత్యం శివం సుందర'మో దానిని దర్శించుచున్నారు. ఈ యంతస్తునందు నిద్దఱికిఁగలభేదము నశించినది. కవి భక్తుఁడు, భక్తుఁడు కవి; శిల్పము మతము నొక్క టియే యైనవి.
మొదటి యనాగరక దశయందు మానవుఁడు పశుప్రాయుఁడై కామ్యసౌఖ్యములతో సంతృప్తిపడియుండును. అంతకు మించిన సంతోషము నతఁ డెఱుఁగడు. రెండవ దశ యందుఁ బ్రాపంచిక జ్ఞానము కొంత యుదయించి, మనో వికృతులు శిక్షితములయి శాస్త్రములు, శిల్పములు మున్నగువాని మూలమున నానందముఁ బొందును. మూఁడవ దశయందు రానురాను ఆతనిజ్ఞానము విశేషముగ నభివృద్ధినొంది పూర్వమున కన్న శాశ్వతమైన యానందము నన్వేషింప మొదలిడును. అదియే యమృతానందము.
'ఏకం రూపం బహుధా యః కరోతి. .....
తమ్ ఆత్మస్థం యే౽ను పశ్యంతి ధీరా,
తేషాం సుఖం శాశ్వతం నేత రేషామ్.
ఒక రూపమును బహురూపములుగ నెవ్వఁడొనరించు చున్నాఁడో, ఆత్మస్థుఁడైన ఆపరమాత్మను ఏ ధీరులు దర్శించుచున్నారో వారు శాశ్వత సుఖమును బొందుదురు. అన్యులు పొందరు. *[16]శిల్పము తన యాదర్శకమును క్రమక్రమముగ మార్చుకొని, యెట్ట కేల కీ శాశ్వత సుఖమును మానవుల కందింపఁగల యంతటి యున్నతపదవికి నారోహించినం గాని, కృతకృత్యము కానేరదు.
సంపూర్ణం
- ____________
మర్మ కవిత్వము
పాశ్చాత్యదేశములందు శాస్త్రవిజ్ఞానము పెచ్చు పెరిఁగి లలితకళలస్థానమును సైతము నాక్రమింపఁ జొచ్చెను. కావ్యములందు మనోమోహనమయిన దివ్యానుభూతికి మాఱు మేధోవ్యాపారము అధికారస్థాపనము గావించెను. ఆతరుణమున ఫ్రాంసుదేశమునందు నిందుకుఁ బ్రతీకారముగ నొక కవిత్వోద్యమము బయలు దేఱెను. ఆయుద్యమకారకులు సమకాలీన కవిత్వముతోఁ దృప్తిపడియుండక, యింద్రియముల సంతర్ముఖములఁ గావించి, యగాధమును విశాలమునైన సూక్ష్మ ప్రపంచమును జొచ్చి, యందలి యనిర్వచ నీయమయిన సత్యమును సౌందర్యమును గానముచేసిరి. ఈ తెగకు సంబంధించిన కవులను పాశ్చాత్యులు మర్శ (Mystic) కవు లనియు, సాంకేతిక (Symbolist } కవులనియు నామకరణము గావించిరి. బాడిలేర్ అను ఫ్రెంచి కవి ఇటువంటి కవిత్వమునకు మొదటమార్గము సిద్ధపఱచెను. అనంతరము వెర్లెన్ , మ్యాలర్మీ అనుకవులు సుప్రసిద్ధులైరి. ఈ మర్శకవిత్వము యూరపుఖండమునందుఁ దన ప్రకృతి కనుకూలించిన దేశములందెల్ల వేరు నాఁటుకొనెను. జర్మనీ దేశమందు డెమ్మెల్ అను యువక కవియు ఆతని యనుచరులును, అయిర్లాండునందు ఈట్సు, యే. యి. ఆర్థరె సిమ్మన్సు.*[17] జేమ్సు హెచ్. కజిన్సు మున్నగు కవులును ఈమర్మకవిత్వసంప్రదాయమునకు సంబంధించినవారు.
మర్మకవిత్వము సామాన్యముగ గీతి ( Lyric) రూపమున నుండును. ఆ గీతములందు గానమునకును భావమునకును సమానగౌరవము గలదు; ఒకవేళ గానమే ప్రాధాన్యము వహించినదనిగూడఁ జెప్పుటకు వీలున్నది. కావ్య రూపములలో గీతమే యుత్తమోత్తమ మని కొందఱి యాథునికుల యభిప్రాయము. మర్శకవులు తక్కువపదములలో నెక్కువగానమును, నూచనలను గర్బీకరింతురు, పాల్ వెర్లెన్ ఈ తెగ కవిత్వమునకు లక్షణముగఁ గ్రింది గీతముల రచించెను.
Music, Music before all things
The eccentric still prefer,
Vague in air, and nothing weighty,
Soluble, yet do not err,
Choosing words, still do it lightly,
Do it too with some contempt.
Music always, now and ever
Be they verse the thing that flies
From a soul that's gone escaping,
Gone to other loves and skies.
ఈ కవిత్వమునకు మర్మకవిత్వ మని యేల పేరు రావలయును? ఈ కావ్యములందు సామాన్యప్రజల కగమ్య గోచరములైన విషయము లుండును. సాధారణముగ నీ తరగతి గీతముల వస్తువు ఆధ్యాత్మిక విషయముగ నుండును. కవియొక్క యాంతరంగికానుభవమును విశ్వజనీనతయు గీతములయం దంకితమై యుండును. కవులయం దాధ్యాత్మిక స్వభావము నిర్నిద్రము. కావున వారు బహిరింద్రియ నిర్ణీతములైన సీమలనుదాఁటి సూక్ష్మప్రకృతినిఁ బ్రవేశించి యందుఁ గలిగిన యనుభూతిని ధ్వనీమూలకముగనో, సూచనగనో, సాంకేతికముగనో వెలిపుత్తురు. ఈ మర్శకవిత్వము కేవలము ఆత్మానుభవజనితముగను, ఆత్మోపభోగమునై యున్నది. జీవనముయొక్క యవ్వలిగట్టు ఈ గీతములందుఁ బొడకట్టుచుండును. యూరపుదేశపు సామాన్యజనులకు ఆధ్యాత్మిక గంధము శూన్యము. కావున వారి కీకవిత్వము మర్మముగఁ దోఁచినది. బాడిలేర్ కవిత్వము ఆధునిక పాశ్చాత్యమర్శకవిత్వమునకు మార్గదర్శకమైనదని యిది వఱకుఁ దెలిపియుంటిని. ఆతని రచనలోఁ జాలప్రసిద్ధమైన ఈ క్రింది పద్యములలోని యగాధాశయములను గమనింపుడు:
Earth is a temple, from whose pillared mazes
Murmurs confused of living utterences rise;
Therein man thro' a forest of symbols paces,
That contemplate him with familiar eyes.
As prolonged echos, wandering on and on,
At last in one far tenebrous depth unite,
Impalpable as darkness, and as light,
Scents, sounds, and colours meet in unison,
ఈ తెగ కవులలో మఱల ఫ్రెంచివారికిని ఐరిషువారి కినిఁ గొంత భేదము గలదు. అయ్యది దేశకాలపరిస్థితులకు సంబంధించినది. ఐరిషుకవుల కుండినంత ప్రకృతి సాంగత్యము ఫ్రెంచికవులకు లేదు. అందువలన వారి కావ్యములందుఁ గొంత కృత్రిమత పొడకట్టుచున్న ది. మనకు సమకాలీనుఁడైన ప్రసిద్ధ ఐరిషుకవి, *[18]ఈట్సు రచియించిన ఈపేరిన తేనెగడ్డను చవిచూడుఁడు:
In all poor foolish things that live a day
Eternal beauty wandering on her way,
ఈకవి తన యాత్మానుభూతిని పై రెండు పాదములలో నిమిడ్చియున్నాఁడు; అనంత సౌందర్యమును బ్రతివస్తువునందు సందర్శించినాఁడు.
'............................సత్కవిశ,
భావలోచన మెరవుగాఁ బడయకున్నఁ
గాంచనేర వంతర్లీన కాంతిసరణి.'
-కృషీవలుఁడు
సత్యము! సత్కవీశుని భావలోచనముగాక, అంతర్లీన కాంతిని సౌందర్యమును తక్కిన కన్నులు చూడఁగలుగునా?
మర్మకవిత్వమునం దొకవిధమున యస్పష్టతయు ననూహ్యమైన భావ నేంద్రజాలమును గోచరించుచున్నది. ఆ గీతములందు భాపములు అంటీయంటక-చిక్కీ చిక్కక -దక్కీ దక్కక-మనతో దాఁగుడుమూత లాడుచుండును. 'ఆ కావ్యము నుండి నీ వేమి గ్రహించితివి?' అని యితరులు ప్రశ్నించినపుడు 'ఏమో నేను జెప్పజాలనుగాని, యొక విధమైన యవ్యక్త మాధుర్యమును, ఆనందమును అనుభవించితిని' అని చెప్పుటకు మాత్రము సాధ్యమగును, కళయొక్క పరమావధియు నిట్టి యనిర్వచనీయమైన రసానుభూతిని గలిగించుటయే యని యన్ని సంప్రదాయములకు సంబంధించిన రసజ్ఞులును, శిల్పులును నిర్ణయించిన విషయమే. 'When one art can fully be explained by another then, it is a failure' అని రవీంద్రుఁడు కళయొక్క యనిర్వచనీయతను బోధించెను. “It (art) is to be felt, not to be explanned.' శిల్పము అనుభవింపఁ దగినదిగాని, వివరింపవలసినదిగాదని డాక్టరు అవనీంద్రనాథ టాగూరు నుడివియున్నాఁడు. ఇట్లనుటవలన ఉత్తమశిల్పము నందు వివరించి చెప్పనలవిగాని యొకవిధమైన రసస్ఫురణము గలదని మనము తెలిసికొనవచ్చును.
అడయారునందు జెమ్సు హెచ్ . కజిన్సుగారి యింట నేను మూడు చిత్రపటములను జూచితిని. ఒకటి నందలాలు వసువు రచియించిన 'శివనాట్యము'. మఱిరెండు కజిన్సుగారు జపానునుండి తెచ్చినవి. వానిలో నొక దానియందు జపాను స్త్రీలు మంచుకాలమునఁ గాగితపు గొడుగులు వేసికొని సంచరించుట చిత్రింపబడియున్నది. మఱియొక దానియందు కేవలము సన్ననిగీతలతో _నవియు నేడెనిమిదింటితో, నొక జపాను దేశపు స్త్రీముఖము అత్యద్భుతముగ నింపఁబడి యున్నది. ఈమూడు చిత్రములు నా హృదయమును హరించినవి. మర్మకవిత్వము (Mystic poetry) యొక్క రహస్యము ఆ చిత్రపటముల మూలమున నేరుగ నామనమున నంకితమైనది. అంతవఱకు ఆకవిత్వములోని యస్పష్టత (Vagueness) యొక్క గుణమును నేను పూర్ణముగ గ్రహింప లేకుంటిని. శివనాట్యమును, మంచుకాలమున జపాన స్త్రీల సంచారమును చిత్రింపఁబడిన పటమును సాధారణమైన బొమ్మలపటముల వలె పరిస్ఫుటముగ రంగులు పూయఁబడినవి కావు. వానిలోని యాకృతులు మనకు అస్పష్టముగఁ బొడకట్టును. ఆ యస్పష్టత శిల్పకళానైపుణ్యముయొక్క పరసీమయని తలఁప వలయునేగాని, అల్పకౌశలముగల చిత్రకారుల వచ్చీరాని బీరకాయపీచుఁదనముగాదు. అట్లు చిత్రించుటకు శిల్పి చాల కళాభిరుచి గలవాఁడుగను, చేయితిరిగినవాఁడుగను, వర్న సమ్మేళనాదివిషయములందుఁ బరిపూర్ణజ్ఞానము గలవాడుగను నుండవలయును. ఆ పటములయందలి రూపములనుఁ దిలకించినపుడు మన మనస్సు గాలిలోఁ దేలిపోవునటులఁ దేలికయై చిత్రసారూప్యమును బొందినట్లుండును, ఆ రూపము ఏదో యొక యగాధ రహస్య వాలెవరణమున, వెన్నెలరాత్రి యందుఁ దేలియాడు. మేఘశకలములవలెఁ బొడకట్టును. చూడఁజూడ నవి గాలిలోఁ గరగిపోవుచున్నవా యేమి? యను సంశయముగూడ పొడమును. ఇట్టి యస్పష్టతామాధుర్యమే నాకు మర్మకవిత్వమునఁ దోచుచున్నది. రేఖలతో లిఖంపంబడిన పటమును గాంచినపుడు 'ఎన్ని కొద్ది గీరలతో నెంత సుందరమైన యాకృతిని నేర్పరియైన చిత్ర కారుఁడు సృజింపఁ
గలడు ? అను సొశ్చర్యము దోఁపకమానదు. జపానుకవుల * [19]'హొక్కు' కవిత్వమునందువలె ఈ చిత్రపటమునందును అనవసర కళా ప్రదర్శనము నాకగపడ లేదు. అయినను అందు సౌందర్వమును నిరాడంబర తయుఁ దొల కాడుచున్నవి. అట్టి యస్పష్టతయు సంక్షి, పతయుఁ కేవలము అనల్పకళానై పుణ్య సాధ్యములని నేనుగ్రహించితిని,
మర్శకవిత్వమునందలి యస్పష్టతనుగుఱించిన కొందటి యభి ప్రాయముల నీట సంకలించితిని :
i. And the very perfection of such poetry often appears to depend, in part, OD 4 certain suppresssion or vagueness of mere subjects, so that the meaning reaches us through ways not distinctly traceable by the understanding -- Yone Norjuchi. 2. Vagueness is often a virtue; a god lives in a cloud, truth cannot be put on one's finger tip-Walter pater
3. I think there should be nothing but allusions. The contemplation of objects, the flying image of reveries evoked by them are sunk.........To name an object is to take the three quarters from the enjoyment of the poem, which consists in the happiness of guessing little by little, to suggest that is the dream. -Jues Huret,
ఈ లక్షణములు ముఖ్యముగ గీతకవిత్వమున కన్వయించును.
మర్మకవిత్వమును టాల్ స్టాయి 'శిల్పమననేమి?' అను తన గ్రంథమందుఁ జాలతీవ్రముగ ఖండించియున్నాడు. అందు కా కవిత్వమునఁ గల యగమ్యగోచరత్వము కారణము. అయినను టాల్ స్టాయి తర్కమంత సహేతుకముగఁ దోఁపదు. ఆయన ప్రజాపక్షవాది కావున సామాన్యజనుల కర్థముగాని శిల్పము వ్యర్థమనియు నింద్యమనియు ఆయన యభిప్రాయము. ఈ యపూర్వమైన మానదండమును గల్పించి టాల్ స్టాయి రషియా దేశమునందలివేగాక యూరపుఖండమునందలి యన్ని దేశముల లలితకళలను దానితోఁ గొలిచి, సరిపడని వానిని తన విపరీతపు విమర్శనమునకు గుఱి గావించెను. ఒక పెద్దసౌధమునుగాని, క్రైస్తవుల ప్రార్థనాలయమునుగాని దిలకించినప్పుడు వాని సౌందర్యముఁ దోఁచుటకుఁ బూర్య'మే ' ఈ కట్టడము లెందరి పాటక పుజనులనిట్టూర్పుల తోడను, గన్నీటితోడను, కడుపుమంటలతోడను రూపొందినవో' యను కారుణ్య మా దయాశాలి మెత్తనిమనసును తడిసేయును. కావున టాల్ స్టాయి నిర్వచనములందుఁ గళా న్యాయనిర్ణయమునకంటె గరుణారసమె యెక్కుడుగా నుండును, ఒక కళయొక్క శేష్ఠత్వము దాని నర్థముచేసి కొనఁగల ప్రజలసంఖ్య ననుసరించి యుండుననియు, నట్లుగాక యెవరో కొందఱిభాగ్యవంతులకును, కేవలము శిల్పాభిరుచి గలవారికిని మాత్రమే పనికివచ్చు కళ యొకకళ గాదనియు , ఆయన సిద్ధాంతీకరించెను. ఇది చాల యన్యాయ్యమును, శిల్పతత్త్వమునకు పరమవిరుద్ధమైన తీర్మానముగను నున్నది.
మన మొక కావ్యమును జదువునపుడు హృదయము రసాతిరేకమైనదా ? లేదా? యనుదాని ననుసరించియు, ఐనయెడల దానితీవ్రతనుబట్టియు ఆ కావ్యముయొక్క గుణా గుణములను నిర్ణయింతుము, ఒకప్పుడు కావ్యము రమ్యమైన దయ్యుఁ జదువరి హృదయము సంస్కారపక్వము గానియెడల రసోత్పాదనము గాకపోవచ్చును. ఈ రెండు సందర్భములందును కృతికిని చదువరి స్వభావమునకుం గల సంబంధము ముఖ్యము. కాని, 'ఇతరు లెందఱీకావ్యమును జదివి యానందించిరి?' అను ప్రశ్నపై అతని యనుభూతి ఆధారపడి యుండవలసిన యక్కఱలేదు. చిత్రముల విషయముగూడ నిట్లే యూహింపవలయును.
టాల్ స్టాయి సిద్ధాంత మంగీకరింపఁబడిన యెడల లోకమునందలి చాల యుత్తమోత్తములగు చిత్రములు, కావ్యములు, శిల్పములు,కట్టడములు ధ్వంసము కావలసి యుండును. ఒకరచనయొక్క రసవత్తతయు, కళానైపుణ్యమును, సూక్ష్మ బుద్దిగ్రాహ్యము లగు గుణ విషయములును హెచ్చుకొలఁది వానిని గ్రహించి తదనురూపానందమును బొందు రసికుల సంఖ్యయు తగ్గుచుండును, కావుననే కాళిదాసుని అభిజ్ఞాన శాకుంతలము జంగమ కథలవలె పామాన్య ప్రజానురంజకము కాకుండుట, రసజ్ఞత కుశాగ్రముగ నుండని దే యుత్తమమైన కళాసృష్టిని మెచ్చుకొనుటకు సాధ్యముకాదు. అట్లు మెచ్చు కొనుటకు శిక్షితమైన అభిరుచియు అవసరము. అట్టి రసజ్ఞత ప్రజాసామాన్యమునందు నభివృద్ధి చెందియుండదు. వారికిఁ దగిన శిల్పము లుండనేయున్నవి. ఇంక ను గావలసిన యెడల అట్టివి వేనవేలుగఁ గల్పించి క్రమక్రమముగఁ ప్రజల యభిరుచిని శిక్షించి యుత్తమశిల్పముల మెచ్చుకొనునట్లోనరింపవచ్చును గాని, యాదర్శమును మాత్రము జనబాహుళ్యము నకుఁ దెలియఁగల క్రిందిమెట్టులోనికి దింపరాదు. మేఘసందేశములోని రామణీయకము ఒక పల్లెటూరి కాఁపునకు గోచరింపని కారణముచేత దానిని సరస్వతీదేవి యంక పీఠమునుండి క్రిందికిఁ ద్రోయవలసిన దేనా ? "
కాళిదాస భవభూతులు సమకాలీనప్రజల యభిరుచి ననుసరించి వారి నాటకములను రచియింప లేదు. అట్లే వారు రచియించి యుండినయెడల అవి యెల్ల కాలమునకు నాదర్శ ప్రాయములుగ నుండనోపవు, ప్రజల యభిరుచిమాఱిన వెనుక వానిమొగము చూచువారుండరు, కాని శకుంతలనాటకము కాళిదాసుని యభిరుచి ననుసరింని సృష్టింపఁబడిన దగుట చేతనే చిరంజీవమైనది. ఈ విషయము కవులకుఁ దెలియనిది గాదు. తన నాటకములోని సారమును భవభూతి మహాకవి తెలిసికొని, సమకాలీనుల యజ్ఞాన జనితమైన నిరాదరణము నిట్లు తూలనాడెను.
యేనామ కేచి దిహ సః పథయం త్యవజ్ఞాం
జానంతి తే కిమపి తావ్ప్రతినైష యతః
ఉత్పత్స్యతే౽ స్తిమమ కో2పి సమానధర్మా!
కాలో హ్యయం నిరవథి ర్విపులాచ పృథ్వీ
ఈ విశాల ప్రపంచమునందు సనంత కాలమునఁ దనతోడి సమాన ధర్మముగలవాఁ డెవ్వడై న జన్మించి, తన నాటకమును చదివి యానందింపఁడా! యను తలంపు భవభూతిని నూరడించినది. ఎంతసహనము ! ఎంత స్వార్ధ త్యాగము ! నేఁటి కవులు అప్రయాస లభ్య జనరంజకత్వమునకయి తమ శక్తిని వ్యర్థపుచ్చుచున్నారు.
మాలర్మి ప్రభృతుల కావ్యములలోని సూచనలను, అస్పష్టతను దోషములుగఁ బరిగణించి టాల్ స్టాయి ఖండించుటయందుఁ దప్పులేదు. ఏలయనఁగా : ఆయనకుఁ దోఁచిసట్లును, ఆయన భావించినట్లును దాపఱికములేక విమర్శించెను. ఇది చాల గొప్పతనము. కాని సామాన్య ప్రజల మనస్తత్వమును బ్రమాణముగఁ గొని, ఆ కావ్యములలోని విషయములు వారి కగ్రాహ్యములు గాన దోషము లని తీర్మానించుట సాహసము.
మన దేశమునందు 'మర్శకవిత్వ' మనాదియైనది. దానిని మర్మకవిత్వమని పేర్కొనక ఆధ్యాత్మిక కవిత్వమని వ్యవహరించెదను. ఏలయన, ఆలాటి రచనలను మర్మకవిత్వముగ మన మెన్నడును భావించినదిలేదు. హైందవజనసా మాన్యమునకు అవి మర్మములు గావు. పంచేంద్రియగోచరమగు స్థూలప్రపంచమునకన్న భిన్న మగు మఱియొక యంతః ప్రకృతి గలదనియు, నశించునది పాంచభౌతిక శరీర మేగాని యాత్మ గాదనియు, జన్మాంతరము గలదనియు, నేమియుం దెలియని కూలివాని మొదలు సకలశాస్త్ర పారంగతుఁ డగు పండితుని వఱకు హిందూదేశమున నందఱును విశ్వసింతురు, ప్రతిదినము మనయింటికి బిచ్చమునకు వచ్చు దాసరిగూడ -
“మనది తనది యనుచు నరుడా, మాయలో బడబోకురా
మరణ మొందిన మనది తనది మంటలో యే మౌనురా!
బంకమట్టి యిల్లురా యిది బుగ్గిబుగ్గీ మౌనురా
ఆత్మ యొక్కటె బ్రహ్మరూప మ్మంతటా తానుండురా."
అని పాడుచుండును. కావున మనవారు ఆధ్యాత్మిక గీతములను, కీర్తనలను మర్శకవిత్వమని పేర్కొనలేదు.
మొట్టమొదట ఆర్యావర్తమున వేదములయం దీయాధ్యాత్మిక కవిత్వము జన్మించి, యుపనిషత్తులయందుఁ బరిపూర్ణత నొందినది. అనుక్షణము విస్తరించుచుండిన వైదికకవి యాత్మ బహిః ప్రపంచమునఁ దనివినొందక, అంతర్ముఖేంద్రియమై యగాధమైన యమృతానందమున నోలలాడి ఆ యనుభూతిని వెలికి నిట్టూర్చినది.
“శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రా, ఆయేధామాని దివ్యాని తస్థుః
వేదాహ మేతం పురుషం మహాన్త మాదిత్యవర్ణం తమసః పరస్తాత్.”
అని వైదికఋషి. ఘోషించినాడు. ఇంతటి మహానందము వెలికుఱుకక కవిహృదయమున నెట్లు దాఁగియుండగలదు? పిపీలికాది బ్రహ్మపర్యంతముగల ప్రాణికోటులను 'అమృత సంతానములారా' యని సంబోధించినాఁడు. ఎంత ప్రేమ ! ఎంతయానందము ! ఎంతసత్యము ! తాను దర్శించిన తేజస్సు అప్రాకృతము. కావున నది వర్ణింపనలవిగానిది. సామ్యముచే మాత్రము నూహింపసాధ్యమైనది. అదియు విలోమమార్గమున-
“నతత్ర సూర్యోభాతి న చంద్రతారకం
నేనూ విద్యుతో బాంతి కుతో౽య మగ్ని:
తమేవ భాంత మనుభాతి సర్వం తస్య భాపా
సర్వ మిదం విభాతి."
ఆత్మానుభవజన్యమైన యిట్టి యపూర్వసత్యములను వైదిక ఋషులు వర్షించిరి. వారు ఆధ్యాత్మిక కవిగురువులు, ప్రథములు.
వివిధమత సంప్రదాయములయందును ఇట్టి కవిత్వ మంకురించి శాఖోపశాఖలుగ నభివృద్ధినొందినది. వైష్ణవ కవుల కీర్తనలయందు రసమాధుర్యములు పొంగిపొరలినవి. ఇందుకుఁ గొన్ని కారణములు గలవు. వైష్ణవులకు 'భక్తి ప్రధానము, ప్రేమ యాలంబము. ఆత్మకును బరమాత్మకును గల సంబంధమును రాధాకృష్ణుల ప్రేమలీలలుగ సంకేతించి వారు సంకీర్తనము చేసిరి,
విరహిణియైన నాయిక యెన్ని యవస్థలకుఁ బాల్పడునో, తన్ను రాధనుగను సర్వేశ్వరుని కృష్ణునిగను సంకేతించుకొన్న భక్తుఁడును అన్ని యవస్థల ననుభవించును. నాయకుని నెడఁ బాసిన నాయిక పునః సమాగములు కెట్లు త్వరపడుచుండునో, అటులనే పరమాత్మ విశ్లేషమును సహిం పఁజాలని భక్తుఁడును వేదనఁ బొందుచుండును. ఇట్టి పారవశ్యము సాధారణముగ నందఱిభక్తులకుఁ గలుగునది గాదు. ఇది భవముయొక్క పరపారము నంటు కడపటియవస్థ, పన్నిద్దరాళ్వారులలో నమ్మాళ్వారులకే యాదశ కలిగెను. చైతన్యుఁడును నట్టియవస్థ ననుభవించెను. రామకృష్ణ పరమహంసయు నట్టి విశ్లేష వేదన నొందెనని వివేకానందస్వామి నుడివియున్నారు. నమ్మాళ్వారులు రచించిన "తిరువాయి మొజ్షి " అంతయుఁ గొంచె మించుమించుగ విరహిణీగీతము లని చెప్పవచ్చును. మీరాబాయియు, మహారాష్ట్ర దేశపు భక్తులును అట్టి కీర్తనలను రచియించిరి.
తెలుఁగు దేశమున మఱియొక విధమైన యాథ్యాత్మిక కవిత్వము ప్రచారములోనికి వచ్చినది. పోతులూరి వీరబ్రహ్మము, అతని శిష్యుఁడగు సిద్ధయ్య, వేమన్న మొదలగు తత్త్వజ్ఞాను లీ సంప్రదాయమున ముఖ్యులు. బ్రహ్మంగారి కాలజ్ఞాన కీర్తనలను వేదాంత కీర్తనలను తరుణాయి దాసరులు పాడుచుండగ మనము చాలమాఱులు వినియుందుము. భక్తిగీతములందువ లె వానియం దంతరసము చిప్పిల్లుటకు వీలులేదు. అయినను అవి నీరసములుగ నుండవు. ఇచ్చట నొకటి రెండు ఉదాహరణములు అప్రస్తుతములు గావని తలంచెదను.
1. తెలుసుకొండి యన్నలార, తేట తెరువు బట్టాబయలు
నట్టనడుమా పుట్టాలో గురునాథూ డున్నాడు,
మూడుచుట్లా కోటలోన ముప్పయిముగ్గూ రున్నారన్నా
ధ్యానాము కోటాకు ఎక్కూ పెడితే తలుపూలు దీసేమన్నారు.
ఇంపుకాదూ మెప్పూగాదు ఎన్నరాని యీ బ్రహ్మపదవి
చప్పరించి చూడండన్న సారా మున్నాది.
2. తనకు బొందెకు ఎపుడో తగులాట మాయెను
వీరెవ్వరో గురుడ! వా రెవ్వరో!
పుట్టి బూరగమాను పూసి లెస్సా కాసి
గట్టిగ కొమ్మలు కదిలాడగా
సుడిగాలి దెబ్బకు తొడిమజాఱిన పండు
తొడిమాతో యేమైన నుడివిపోయిందా;
తనకు బొందెకు...........................
వీ రెవ్వరో గురుడ.........................
3. చిత్తాస్వాతులు రెండు సంధింప ముత్తెపు
చిప్పాలో పడ్డాది చిను కొక్కటి,
ముత్యమై నీళ్ళల్లో మునిగి పాయ్యేనాఁడు
చిప్పతో యేమైన చెప్పిపోయిందా ?
తనకు బొందెకు..............
వీ రెవ్వరో గురుడ
వేమన పద్యములలోని భావములను గ్రహించి కొందరు, వానినిఁ గీర్తనలలో నిమిడ్చిరి. అట్టికీర్తనలె యిప్పుడు తెలుఁగు దేశమునందుఁ జాలవఱకు వ్యాపించియున్నవి.
సమకాలీనమైన ఆధ్యాత్మిక కవిత్వమునుగుఱించి కొంత విచారించి యీ వ్యాసమును ముగించెదను. బెంగాలు దేశమున రవీంద్రనాథ టాగూరును, ఆయన కవిత్వమార్గమును మెచ్చుకొని దాని ననలంబించు సత్యేంద్రనాథదత్తు మున్నగు నితర యువక కవులును ఆధునిక కవిత్వ సంప్రదాయమునకు సంబంధించినవారు. ఈ తెగకు రవీంద్రుఁడు మార్గ దర్శకుఁడు. కావున మొట్ట మొదట ఆయన కవిత్వమునుగుఱించి తెలిసికొందము. రామమోహన రాయలు కలకత్తా నగరమున బ్రహ్మసమాజమును స్థాపించిన వెనుక బెంగాలీ సారస్వతమున నూతన జీవసంచలనము ప్రారంభమయి, దినదినాభివృద్ధి గాంచినది. బ్రహ్మసమాజపు ప్రార్ధన మందిరములందుఁ జదువుటకను, మతప్రచారము గావించుటకును క్రైస్తవుల పాటలు (Psalms) వంటి గీతములు రచియింపఁబడినవి. ఈ గీతారచనమే బెంగాలుదేశపు ఆధుని కాధ్యాత్మిక కవిత్వమునకు బీజము. రవీంద్రుఁడు బాల్యమునందే ఇంగ్లీషు కావ్యములను జదివెను. అందు ముఖ్యముగ కీట్సు, షెల్లి , బ్రౌనింగు అను ఇంగ్లీషుకవుల కవిత్వములలోని సారమును దనివి దీఱ నాస్వాదించెను, కాళిదాసుని శాకుంతలము, కుమారసంభవము, మేఘసందేశము రవీంద్రుని హృదయమును ప్రబలముగ నాకర్షించిన వనుటకు ఆయన 'ప్రాచీన సాహిత్యము' అను గ్ర«థమునఁ గావించిన తత్సంబంధము లైన విమర్శనములే సాక్ష్యములుగ నున్నవి.
చైతన్యుఁడు, జయదేవుఁడు మున్నగు వైష్ణవ భక్తుల కీర్తనలను టాగూరు గానము చేసి చేసి, యానందించెను. ఆ కీర్తనల యధికారము ఆయన రచించిన “భానుసింహపదావళి' యను గీతములందు సుస్పష్టముగ నంకితమై యున్నది.
కీట్సు సౌందర్యమును బోషించిన కవి. పెల్లి యింద్రియాతీతములైన ఆధ్యాత్మిక విషయములను గానము చేసిన తపసి. రవీంద్రుని కవిత్వమందు కీట్సు రచనలలోని రామణీయకము, షెల్లీ కావ్యములలోని యాధ్యాత్మిక తృష్ణయు, వైష్ణవ గీతములలోని భక్తిపారవశ్యమును_వీని మూటిని ఆత్మసాక్షాత్కరించుకొని మించిన స్వకీయ ప్రతిభావ్యక్తిత్వములును సామరస్యము నొందినవి. కావున రవీంద్రుని యాధ్యాత్మిక కవిత్వము ప్రాచ్యపాశ్చాత్య మనస్తత్వముల కనుగుణమైన సంధిస్థానమై యున్నది.
'తుమి యేన్ ఒయ్ ఆకాశ్ ఉదార్
ఆమి యేన్ ఎయ్ అసీమ్ పాథార్
అకుల్ కొరేచె మాఝ కానే తార్
ఆనందపూర్ణిమా'
(మానసి - ధ్యానము)
[నీవు విశాలమైన ఆ యాకాశమవు;
నేను సీమారహితమైన యీ సముద్రమును ;
వాని రెంటిమధ్య ఆనందపూర్ణిమ
తాండవించుచున్నది.]
ఆంగ్లేయ సారస్వత సంబంధమువలన బెంగాలునందు, వలె తెలుఁగు దేశమున సైతముఁ గొంత యూందోళనము గలిగినది. యువక కవులు సంప్రదాయసిద్ధములైన పురాతన పద్దతులను ద్యజించి స్వతంత్రముగఁ క్రొత్తదారులు త్రొక్క సాగిరి. ఇప్పుడు తెలుగు దేశమున నాంగ్లేయ వాఙ్మయ పరిచితి గల యువక కవులందఱు కొద్దిగనో గొప్పగనో Romantic కవు లనుటకు యోగ్యులు. రవీంద్రుఁడు 'నోబెల్' బహుమానముచే సత్కరింపఁబడి యాతని కావ్యములు హిందూ దేశమంతటను వ్యాప్తిచెందిన యనంతరమున తెలుఁగు రొమాన్టిక్ కవిత్వము ఆధ్యాత్మిక కవిత్వ ముగఁ బరిణమింప మొదలుపెట్టెను. తత్పరిణామ చిహ్నములు ఇప్పుడిప్పుడు తెలుఁగు కవుల రచనలయందు బొడకట్టుచున్నవి. కాని, యిది ప్రథమదశ యగుటవలనఁ గొందఱి రచనలయందు అనవసర పదాడంబరత్వమును, కళా కౌశలమువలనఁ బ్రాప్తమైన భావనేంద్రజాలముగాక భావ ప్రకటనము: గావింపఁజాలని గజిబిజితనమును గోచరించుచున్నది. ఈ లోపము మొట్టమొదట అనివార్యమైనది. కావున సహింపఁదగినది. ఇందుకు లక్ష్యములుగ సమకాలీనుల కావ్యములనుండి కొన్ని యుదాహరణములను సంకలింపవచ్చును గాని, అనవసర వివాద హేతువుగఁ బరిణమించు నని మానితిని.
సంపూర్ణము.
- ___________
నాటక కళా సంస్కరణము
ఉపోద్ఘాతము
సంఘసమష్టి తనయందలి వ్యక్తిని నైతిక బంధములఁ జిక్కించుకొని యెట్లు అధికారముచేయునో, ఒక్కొక్కప్పుడు వ్యక్తియుఁ దన సంకల్ప బలముచేత సంఘసమష్టిని తన యభిప్రాయమువంకకుఁ ద్రిప్పుకొనుచుండును. ఇందుకు మన సాంఘికజీవితమునందు లెక్క లేని నిదర్శనములను జూచుచున్నాము. సంఘమునకును, అందలియంశమైన వ్యక్తికిని బరస్పర సంబంధము గలదు. కావున నొక జాతి నాగరక మైనదని చెప్పుటలో నూటికి తొంబైమంది మనుష్యులైనను నాగరకులుగ నుందురని మన మూహింతుము.
జాతీయ జీవితమార్గము కొండదారివలె నిమ్నోన్నతముగ నుండును. వాతావరణములోని మార్పులను భారమితి (Barometer) సూచించునటుల శిల్పము జాతీయ జీవితమునందలి సీచోచ్చదశలను దెలియఁ జేయుచుండును. కవులు స్వతంత్రముగ వస్తుకల్పనము చేయుచున్నను, సమకాలీన భావములును, ఆచార వ్యవహారములును వారి రచనల యందుఁ బ్రవేశించియుండును. . కాళిదాసుని నాటకములను మనము చదివినయెడల ఆ కాలపు నాగరకతను మనము కొంచె మించు మించుగ నూహింపఁగలము. వాల్మీకిమహాకవి లోకోత్తర వీరుఁడైన శ్రీరాముని చరిత్రమును సృజించి నప్పటికిని, సమకాలీనమైన హైందవ సంఘముయొక్క నాగరకతయు ఆచార వ్యవహారములును అందు నంకితమైయుండక తప్పవు.
ప్రస్తుతవిషయమునకు వత్తము : మన తెలుఁగుజూతి చాల మంది కవులకును, శిల్పులకును, నటకులకును ఆకరమై యున్నది. వారి రచనలు, సృష్టులు, అభిప్రాయములు భావి సంతతికి మన కళాభిరుచిని, కల్పనానైపుణ్యమును, ఔచిత్య గౌరవమును, మీఁదుమిక్కిలి మన శిక్షణమును, దెలియఁ బఱచును కావున ఇప్పటి కవులును, తక్కుంగల శిల్పులును సమకాలీన ప్రజా బాహ్యుళముయొక్క యశిక్షితమైన యభిరుచి యడగులకు మడుఁగులొత్తి సునాయాస లభ్యమయినఁ గీర్తికొఱకు పాటుపడుటయే వారి బాధ్యతయని తలంచు కొనక, భావిసంతతులకుఁ గూడ మన శిల్పసిద్దిపైని గౌరవ ముండునటులు, తమ యభరుచిని మఱికొంత సభ్యముగను, ఔచిత్వదృష్టిని మఱికొంత : నిశితముగను అలవఱచుకొనుట యావశ్యకము.
సుమా రొక సంవత్సరము క్రిందట ఒంగోలునందుండిన నామిత్రులు రావు సాహెబ్ డాక్టరు శేషాద్రిరెడ్డిగారికి (ఇప్పుడు స్వర్గస్థులు) అతిథినై యచ్చట రెండు మూఁడు దినములు గడపితిని. ఆయూరియందు స్థాపింపఁబడియున్న యొక నాటక సమాజమువారిచేఁ బ్రయోగింపఁబడిన[20] *సుమతి అను నాటకమును చూచుట మా కిరువురకుఁ దటస్థించినది, రెండు మూఁడు గంటల వినోదము కొఱకును, ఆ వినోదముస అలక్షితముగ మిళితమైన రీతిని సమకూరుచుండు భావ శిక్షణము కొఱకును మనము సాధారణముగ నాటకశాలకుఁ బోవుచుందుము. చేతిడబ్బు వదలించుకొని, నిద్రలేమి మున్నగు శ్రమలకుఁ బాల్పడియు మనము నాటకము చూచుట కవిచేతను నటకులచేతను “మీరు సభ్యతా శూన్యులు! మీరు మృగప్రాయులు ” అని చెప్పక చెప్పించు కొనుటకుఁ గాదు. సహృదయుల భావములు దూషింపఁబడుటకు గాదు ! కాని, దురదృష్టవశమున మా కానాఁ డట్టి యసభ్యవినోదము ప్రాప్తించినది. ఆ నాటకమునందలి యనౌ చిత్యముల నుదహరించి సభ్యలోకమునకు విసుగుపుట్టించి నా యభిరుచినిగూడ దూష్యముగ నొనరించుకొనుటకు నా కిష్టము లేనప్పటికిని 'శిల్పము' కొఱకు అట్లు చేయక తప్పినది కాదు. మేము నాటకశాలయం దున్నంతవఱకు జఱిగిన కథ యీ క్రిందివిధముగ నున్నది: భాగ్యవంతుడైన బ్రాహ్మణయువకుఁ డొకఁడు ఒక భోగముసాని నుంచుకొని తన యాస్తినంతయుఁ గొల్లగొట్టుకొనును. కొంతకాలమునకుఁ దన భార్యనుగూడ ఆ సానికిఁ బరిచారికనుగ నియమించును. అటుపైన కొల్లఁగొట్టుటకు విటునియొద్ద నొక గవ్వయైనను లేదని తోఁచిన వెంటనే ఆసాని యాతనిని విడనాడి, మఱియొకనిని దగుల్కొనును. రెండవ విటుఁడును ఆ భోగ ముదియు నేక శయ్యాగతులయి యుండునప్పుడు పరిత్యక్తుఁడైన మొదటి విటుఁడు వచ్చి చూచి “బ్రతికి చెడిన వాని వైరాగ్యావేశముతో " ఆసానిని దిట్టుటకుఁ ప్రారంభించును. భోగమువారిని దిట్టుటయే సంఘ సంస్కరణము యొక్క ప్రధానసూత్రమని తలంచువారును కొందఱు గలరని, అట్టి కోటిలో మన నాటకరచయితనుగూడ చేర్చుకొని నాటకము నందలి ఆ సంవిధానమును సహించినను, సహింప నలవిగానివి మఱికొన్ని బయలుదేరినవి. ఆ నాటకశాలయందు స్త్రీలు చాలమంది యుండిరి . ఆతిట్లు భోగమువారికి సంబంధించినవే కాక సామాన్యముగ స్త్రీజాతికంతటికి సిగ్గును రోఁతను బుట్టించునట్లు తోఁచినవి.*[21] "సాని వాకిటిలో నొకనిని, ముందువాకిటిలో మఱియొకనిని పెట్టుకొని చిత్తకార్తిలో కుక్కలవలె ......... వారి ......... సొరకాయలవలె నుండును; అవి...... కావు. సోగములబొందలు”. మొదటి మాటతో నిప్పుఅంటింపఁబడి రెండవమాటతో కిరసనాయిలు పోయఁబడి, మూఁడవమాటతో భగ్గని మండిన నా హృదయము సంయమన సాధ్యముకాక పోయినది. ఏవో రెండు మాటలని నాటకశాల వీడివచ్చితిని. రెడ్డిగారును నా వెనువెంట వచ్చిరి. బయటికివచ్చి మనము స్తిమితపఱచుకొను నప్పటికి నా యొడలంతయుఁ గంపించుచుండెను. నాటకము ముగిసిన వెనుక మా దుర్ణయమును గుఱించి ఆ సమాజము యొక్క కార్యదర్శి యుసన్యసించెనని వింటిమి,
మఱుఁనాటి యుదయమున ఆ సమాజములోని యొక సభ్యుఁడు, తాము రాత్రి ప్రదర్శించిన నాటకమును, చింతామణియను నాటకమును దీసికొనివచ్చి, ఆ నాటకము చింతా
.
మణివలె నున్నదనియు; అందులో లేనిబూతులు ఇందులో గూడ లేవనియు, మేము నాటకశాలనుండి వెడలివచ్చిన యనంతరము చాల నీతిప్రదమైన కథ జరిగినదనియుఁ జెప్పెను.
మొదటి విషగుళికతోడనే మా జీర్ణశక్తి నాశనమైనది ? ఆపైని విరివిగాఁ బంచిపెట్టబడిన నీతిఖాద్యములు మే మొకవేళ గైకొన్నను నిరుపయుక్తములై యుండును.
తరువాత ఆ రెండు నాటకములలోని సంవిధానములను నేను జూచితిని. సుమతి నాటకము చింతామణికిఁ బ్రతిబింబముగ వ్రాయఁబడి యున్నదనుటకు సందియములేదు. నే నిప్పుడు చింతామణిని సమర్థించుటకుఁ బూనుకొనలేదు, కాని, ఆ రెండు నాటకములను సరిపోల్చినప్పుడు మాత్రము, సభ్యతయందు చింతామణీయే మెఱుఁగుగనున్నది. చింతామణికారుడు రచనా నైపుణ్యముతో వెల్లడించిన బూతులను సుమతి నాటక రచయిత జట్కా బండివారి సభ్యతలోనికి దింపి, శృంగార రసమును సిరాబుడ్డిలో ఊరవేసినాఁడు. ప్రకరణమున కిట్టి వస్తువు ఆవశ్యకమని అలంకార శాస్త్రముయెక్క మఱుఁగు సొచ్చినను, అభిరుచి విషయకమైన చర్చ వచ్చినప్పుడు, దానిని కవియొక్క చిత్తసంస్కార పరిపాకములకు సంబంధించినదిగ మన మెఱుంగుదుము. మృచ్చకటికము ప్రకరణమయ్యు సహృదయులకు ఏవపుట్టించు బూతుకూఁతల మట్టునకు దిగ లేదు. అట్లనుటవలన సంస్క తమునందు, అధమములైన ప్రహసనములు లేవని నేను నుడువుట లేదు. కాని, అవి సహజముగ నిరాదరింపబడినవి. నింద్యవిషయ మేభాషయందున్నను నింద్యమే. భావమువలన భాషకు గౌరవము కలుగుచున్నది గాని, భాషవలన నింద్య భావమునకుఁ గూడఁ బ్రశక్తి కలుగదు.
నేను సుమతి నాటక ప్రదర్శనమును చూచినప్పటి నుండియు, నాటక రచయితలయందును, నటకులయెడను, ప్రేక్షకులయందును నా కొకవిధమైన శ్రద్ధపుట్టినది. అప్పటి నుండియుఁ గొందఱి యాధునిక కవుల నాటకములను జనరంజుకములని ప్రజలచేఁ దలంపఁబడు మఱికొన్ని నాటకములను సుప్రసిద్ధులని తలంపఁబడు నటకులచే పదర్శింపబడుచుండినపుడు చూచుచుంటిని. జనరంజకత్వమునకుఁ గారణములను, . అంద కై కవులును నటకులును జేయుచున్న వ్యాపారరహస్యములను, మోసములనుగూడ గ్రహించి నా యభిప్రాయములను ఈ వ్యాసమూలమునఁ బ్రకటింపఁ దలంచితిని. ఇట్లు చేయుటవలన, నే నెందఱెందఱి యనుమానములకు, విమర్శనములకుఁ బాత్రుఁడను కానున్నానో నే నెఱుంగుదును. ఈ వ్యాసమునందు నే ఇచ్చట నైనను నిదర్శనపూర్వకముగ నాయభిప్రాయమును వెలిపుచ్చవలసివచ్చినప్పుడు, ఎవరినై న నాటక రచయితలను నటకులను సమాజములను విమర్శించి దృష్టాంతములుగఁ గైకొనుట నాకు. వారిపైగల ద్వేషముచేఁ గాదు. కాని, శిల్పముఁపై గల గౌరవముచేత, నేను కొన్ని నాటకములలో అనౌచిత్యములకు నుదాహరణములను గైకొంటినిగావున, ఆ నాటకములెల్ల అనౌచిత్య భూయిష్టములనియు, ఆయానాటక రచయితలు కల్పనా నిపుణులు కారనియుఁ బాఠకమహాశయులు తలంపరాదు. ఆ గ్రంథములపై నను ఆ కవులపైనను నా కత్యంతగౌరవము కలదు. నటకుల విషయమైగూడ నేనిట్లే మనవిచేసికొనుచున్నాను. కావున నేను నిర్మలహృదయముతోడను శిల్పదృష్టితోడను రచియించిన యీ వ్యాసమును నాటక కళాభిమానులెల్లరును అన్యధా తలంపక నా సదుద్దేశమును గ్రహింతురని ప్రార్థనము.
నాటక కవి
ఇప్పుడు వెలువడుచున్న నాటకములలో 100 కి 90 నాటకములు 'నాటక 'మని పేర్కొనుటకుఁ దగినవి 'కావు. ఒకకధలోని కొన్నిసీనులను ఒకటిగా జోడించినంతనె అది యొకనాటక మగునని కొందఱు నాటకరచియితల యుద్దేశ మైయుండును. నాటకమునకు ఆదిమధ్యాంతములు కలవనియు, సంధిబంధమును, సంయోగతయు సడలినయెడల నాటక శరీరము విచ్చిన్నావయవ సమూహమువలె నుండుననియు వీరెఱుఁగరు. ఒకవేళ నెఱింగియు ఆచరణమున నసమర్థులై యున్నారు. ఇప్పటి కొన్ని నాటకములలో మేకపోతుమెడ చన్నులు, ఆఱవవ్రేలు' మున్నగు రచనా విశేషము లగపడుచున్నవి. ప్రజలకన్నులలోఁ దేలికగా దుమ్ముకొట్టుట కలవాటుపడి రంగ సంప్రదాయములను చక్కగాఁ దెనిసినకవులు అట్టి రచనావిశేషముల నాశ్రయింతురు. వానితో నాటకసమష్టికి నవసరమైన సంబంధ మేమియుండదు. నిరుపయోగములును, విపరీతములును నైస అట్టియవయవములను గత్తిరించినను లోప మేర్పడదు. ఇది రచనాన్యూన తయైనను, లేక పేక్షకులను సులభముగ వలలో వేసికొనుటకు కవి ప్రయత్నపూర్వకముగ నొనరించిన వంచనమైనను గావలయును. ఒక ఉదాహరణము: రామదాసు నాటకములో 'అహమక్కు సీను' లవకుశలో 'చాకలివానియింటిసీను' వానిని వేఱుపఱచి, అట్టిసీనులు ప్రత్యేకముగఁ బ్రదర్శింపఁ బడినపుడు హాస్యరసోత్పాదకములయి వినోదము కలిగిలింప వచ్చును. కాని ఆనాటకము లందు ఆయకథాభాగమున వాని కంత ప్రాముఖ్యము లేదు. మొగమునకు ముక్కు అందమని యొకశిల్పి మూరెడు ముక్కునుజేసి యొక మానవ విగ్రహమున కంటించి నట్లున్నది, నాటక శరీరమందు అంగాను గుణ్యము చాల ముఖ్యము. కేవలము, లోభముచేత అనుచిత మైన కల్పనలకుఁ బూనుకొనుట నింద్యము.
ధర్మవరము రామకృష్ణాచార్యులవారి నాటకరచనతోడఁ గ్రొత్తనాటకలక్షణము లేర్పడినవి. సంక్షేపముగభావమునుఁ బ్రకటించుటయన్న ఆకవి యెఱుంగని పరమరహస్యము. రెండుమూఁడు మాటలలోఁ జెప్పఁదగిన భావమును అచ్చులో నరపేజికిఁ దక్కువగాఁ జెప్పఁడు. దుఃఖము! యొక్క పరిమాణము వాక్యముల దీర్ఘత్వము ననుసరించియు సంఖ్య ననుసరించియు నుండునని తలంచికాఁబోలు బాహుకునికిఁ గొండవీటి చేంత్రాడువంటి స్వగతమును గల్పించి ప్రేక్షకులపై ఆయనకుఁగల కసియంతయుఁ దీర్చుకొన్నాఁడు. వ్రాసిపెట్టిన పద్యములు గ్రంథస్థములు కాకపోయినయెడల విస్తృతములగు నను తలంపుతో బాహుకుఁడు చంద్రుని దూషించు కథా భాగమున నిక్షేపించినాఁడు. వీనినన్నిటిని తలదన్ను చాపల్యము మఱియొకటి గలదు. ప్రహ్లాదనాటకమున లీలావతి పాడునట్టి “రారా ధీలోలా-నా బాల' అను పాటయందు, 'సుకుమారా-గుణశాలి' అను పాటయందును “ రామకృష్ణకవిరత్నముఁ బ్రోవ' అనియు 'కవి రామకృష్ణ' అనియు, కవిగారు తన పేరును ఇముడ్చుకొన్నారు. అచ్చట ఒక చుక్క గుర్తును బెట్టి జ్ఞాపికలో 'లీలావతి యీ పాట చదువునప్పుడు ఆంకితము పేరును తీసివేయవలయును' అని యైన హెచ్చరించలేదు. నటకలును ఆ యంకితముయొక్క యనౌచిత్యమును గ్రహింపలేదు. లీలావతి పాత్రము ధరించిన యొక నటకుఁడు 'రామకృష్ణకవిరత్నము.' అని పాడుచుండగా విని నేను ఆశ్చర్యపడితిని. లీలావతిని ఇంద్రునివలె చెంగుపట్టుకొని రామకృష్ణకవి కాలమునకు లాగవలయునో, లేక కవినే లీలావతి కాలమునకు నెట్టవలయునో, తోఁపకున్న ది. అట్లు చేసినను లీలావతి రామకృష్ణకవిపేరు నేల స్మరింప వలయునో నా కనూహ్యముగ నున్నది. నాటకములో కవి దాఁగియుండవలయు నేకాని ముక్కు వెళ్ళఁబెట్టవలసిన యావశ్యకత లేదు. అట్టినాటకముల నాదరించు నభిరుచిగల మనము కాళిదాసాదుల నాటకముల నెట్లు మెచ్చుకొనగలము?
'నాటకము చాల బాగుగానున్నది' అని యనిపించు కొనుటకు మఱియొక యుపాయము గలదు. స్థానికమైనను అస్థానికమైనను దేశభక్తి దేశానుసారము మున్నగుభావములను వెండ్రుకపట్టు మాత్రమైనను సందు కల్పించుకొని బారెడుపొడుగు ఉపన్యాసములోఁ బొదిపి ప్రవేశపెట్టుట; హిందువులు మహమ్మదీయులు కలిసియున్న నాటకకథయైన యెడల [ఆ కథ జరుగు. కాలమందు అట్టిభావములు ప్రజలలో లేకున్నను] హిందూ మహమ్మదీయమైత్రిని గుఱించిన యుపన్యాసము నొక పాత్రమునోటఁ జెప్పించి నాట్యశాలను రాజకీయోపన్యాస మందిరముగ మార్చుట; పుట్టినదాది అడవులలోఁ గాలము పుచ్చుచు, గ్రంథములలో వర్ణింపఁ బడిన లక్షణములచేత గుఱ్ఱమును గుర్తించిన కుశలవులు మాతృదేశాభిమానమును గుఱించి నేఁటికాలపు భావముల వెడలఁగ్రక్కు ఉపన్యాసముల బలాత్కారముగ ప్రేక్షకులపైఁ గురిపించుటచూడ, “ఆంధ్ర పత్రిక " వాల్మీకి ఆశ్రమమునకుఁ గూడఁ బంపబడుచున్న దా యను భ్రాంతి పొడముచున్నది. దేశకాలపాత్ర విరుద్ధమైనను పురాతన వస్తువునకు ఆధునిక వాసన దగిలించుట చాలమంది నాటక రచయితల కభ్యాసమైయున్నది. ఇది యొక వ్యాపార రహస్యము.
చాలమంది నాటకకవుల రచనాలోపములను, పాటలును బద్యములును గప్పిపుచ్చుచున్నవి. నాటకములోని కల్పనను బృథక్కరించినయెడల ఆ లోపములు బయలుపడును. ఎట్టినాటకమునైనను జక్కఁగా బాడఁగలిగిన యొకరిద్దఱు సటకుల నాశ్రయించి ప్రసిద్ధికి రావచ్చును. అల్లూరు నాటక సమాజమువారు రామదాసు నాటకమును బ్రదర్శించు చుందురు. పర్వతరెడ్డి రామచంద్రారెడ్డి గారు (ఆ సమాజమునఁ బ్రధాన నాయక పాత్రము ధరించు నటకుఁడు) కబీరు పాత్రమును ధరింతురు. ఆ ప్రదర్శనములను జాలమంది కొనియాడుచుందురు. రెడ్డిగారు నాట్య ప్రపంచమున ఆర్జించిన పేరు ప్రతిష్టలకు ఆ నాటకము పట్టుఁగొమ్మ. ప్రజల ప్రశంసకు నాస్పదమైన విషయము నెఱుంగవలయునని చాలమంది యభిప్రాయములను గనుగొంటిని. కొంచె మించుమించుగ అందఱును ఈ క్రింది విధమున జబాబిచ్చుచుందురు: 'రామచంద్రారెడ్డి హిందూస్థాని పాటలను జక్కఁగా పాడఁగలడు. నాటకము ప్రారంభమునుండి తుదివఱకు పాడుచున్నను, కొంచెముగూడ ఆయనగొంతు రాఁపుపుట్టదు. ఆయన పాడుచున్నప్పుడు మఱికొంతసేపు పాడుచుండిన బాగుగానుండునని తోఁచును. నా మట్టుకు నేను రెండుమారులు Once more, అన్నాను.' రామచంద్రారెడ్డిగారిని గుఱించి చెప్పఁబడున దంతయు యధార్థమె. కాని నాటకము ఏ విధముగ మెచ్చుకొనబడవలయును? షేక్‌స్పియరు మహాకవియొక్క ప్రతిభ, గ్యారిక్కు ననుసరించి యుజ్జీవింపవలయునా? లేక యాతని రచనలకు స్వతంత్రమైన యంతస్సారముగలదా? చదువరు లూహింపఁగలరు. బూటకపు టాదారముల నాశ్రయించి ప్రసిద్ధికెక్కిన నాటకములు ఆశ్రయచ్యుతి గలిగిన వెంటనే విస్మృతములగును. ప్రేక్షకుల యభిరుచి ననుసరించి వ్రాయఁబడు నాటకములు వారియభిరుచి మాఱువఱకే గౌరవింపఁబడును. తర్వాత సధఃపతనము,
పాత్రోచితమైన భాషనుపయోగించు టావశ్యకము . మహోపాధ్యాయ, కళాప్రపూర్ణ వేదము వేంకటరాయశాస్త్రులవారు బొబ్బిలినాటకమున బుస్సీ దొర పాత్రమునకు వ్యాకృత భాషనే యుపయోగించిరి. కోలాచలము శ్రీనివాసరావుగారు రామరాజు నాటకమున పటానునకు ఉత్తమభాషనే యుపయోగించిరి. వారిని ఉత్తమ పాత్రలనుగఁ జిత్రించి అట్టిభాష నుపయోగించి యుందురు. కాని, ప్రదర్శనమునందు వారి వేషములకును వారి భాషలకును జాల వైరుద్ధ్యము గోచరించుచుండును. దాని నొప్పుకొన్నను, ఆ పాత్రముల హైందవపురాణ పరిచితి చూఁడ చిత్రముగ నున్నది. బుస్సీదొర 'స్తంభమునుండి పైకురికి' అను పద్యమును చదువును. పటాను సంస్కృతపద భూయిష్టమైన పొడవగు సమాసములతో సప్తమారుతములను జిల్లర దేవుళ్ళను తన్నుఁ జంపుటకుగా ఆహ్వానించును. హైందవేతర జాతులకు సంబంధించిన యుత్తమ పాత్రములచే నుత్తమభాషను మాట్లాడించుట యొకవిషయము. కాని, వారికి మనశాస్త్ర పురాణములయందుఁ బరిచయము గలిగినట్లు వ్రాయుట వేఱొకవిషయము మహమ్మదీయుల యుత్తమ పాత్రత్వమునకు హైందవ పురాణ పరిచయము ఆవశ్యకముగాదు. దుఃఖము కలిగినప్పుడు తమ తమ మనస్సులలో నెలకొని యున్న దైవమునో దేవతలనో స్మరించుట స్వాభావికముగ నుండునుగాని, అట్టిసమయమున మహమ్మదీయుఁడు పౌరాణిక దేవతలను తెలంచుట విరుద్ధముగఁ గనుపట్టును. బుస్సీదొర బైబిలునుండి యుపమానమును గ్రహించినయెడల నుచితముగ నుండెడిది. పటాను ఖొరానునందో లేక మఱి యేవిధమైన మహమ్మదీయ పురాణమునందో పరిచితమైన దేవతలను ప్రవక్తలను ఆహ్వానించియుండిన మెఱుఁగుగ నుండెడిది.
చిలకమర్తి లక్మీనరసింహంగారు రచియించిన గయోపాఖ్యానమున కృష్ణార్జునుల దెప్పిపొడుపులు, ఆత్మ గౌరవముపై దృష్టిగల యే పెద్దమనుష్యుఁడును మాట్లాడి యుండఁడు. ఇక కృష్ణార్జునుల మాట యేల? సంవాదములలో అంతమాత్రము గాటులేనిదే ప్రజలకు రుచింపదు, పాపము ! కవియేమిచేయును? శతావధానులు పిశుపాటి చిదంబరశాస్త్రులుగారు, గయోపాఖ్యానమును జూచి దానిని మించ వలయునను కోరికతో శ్రీరామాంజనేయమను నాటకమును వ్రాసి శ్రీరామునికిని అంజనేయునకును వైరము గల్పించి యిగువురిసంవాదమును ముదిరిన కొండమిరపకాయ పాకములోనికి దింపినారు. రామకృష్ణాచార్యులవారు ప్రమీలార్జునీయనాటకమును రచించి, నాగరిక విద్యాంసులచే వ్రాయఁబడు నాటకములలో బూతు ఎంతవరకు నొప్పుకొనఁ దగ్గది యనువిషయమును దృష్టాంతపూర్వకముగ దృఢపఱచినారు. వ్రాయుకొలఁది యిట్టి యుదాహరణములకు లెక్క యుండదు. రెండుమూఁడు ఊరక మచ్చుచూపితిని.
నటకులు
కొంచె మించుమించు ఇరువది యిరువదియైదు సంవత్సరములకు , బూర్వము తెలుఁగుదేశమున, నాటకవృత్తి నవలంబించినవారే నాటకము లాడుచుండిరి. (మరల నిప్పుడు కూడ) ఆకాలమున నాటకములన్నను, నటకులన్నను ఒక విధమైన యనుమానము, హైన్యమును దోఁచుచుండెడిది. ఇందుకుఁ గారణము లేకపోలేదు. ఆనటకులలోఁ జాలవఱకు దేశద్రిమ్మరులు, తల్లిదండ్రులను, ' దారపుత్రాదులను వదలినవారుగనో లేక యితరుల సంసారములను జెడఁగొట్టిన వారుగనో యుండిరి. వారు ప్రదర్శించుచుండిన నాటకము లెల్లను వారి సొంతసృష్టులు. ఈ కాలమున పాపట్ల కాంతయ్య గారు రచియించిన నాటకగీతావిశ్వకోశమువంటిది వారికిఁ గూడ నొకటి యుండినది. ఇదివరకు రచియింపఁబడినవి, యిపుడు రచియింపఁబడునవి, యిఁకమీఁద రచియింపఁబడఁబోవు సర్వనాటకములకును అందు పాటలు గలవు, రేపటి రాత్రి నాటకము వేయవలయునని యనుకొన్నయెడల, ఈ నాఁటి ప్రొద్దున నాటక పాత్రములును, సీనులను వారే తీర్మానించుకొని సందర్భానుసారముగ పాటలు చొప్పించి స్వంత కవిత్వముతో నాటకమును తుదముట్ట ఆడివేయుదురు. ఇట్టి దురవస్థనుండి నాటకములను రక్షించినందులకు నేఁటికాలపు శిక్షిత నాటకసమాజములవారు ప్రశంసాపాత్రులు!
పూర్వపునటకులకన్న నేఁటికాలపునటకులకు బాధ్యత యెక్కువ ; ఏలయన -- ఇప్పటినటకులు విద్యావంతులు, నాగరకులు, ప్రేక్షకులుకూడ నట్టివారే. కావున నటకులు నిర్బాధ్యముగఁ బ్రవర్తించుటకు వీలు లేదు. వారు గమనింపవలసిన విషయములు చాల గలవు. కాని, వ్యాసవిస్తర భీతిచే నిచ్చట కొన్నిటినిమాత్రము వ్రాయుచున్నాను.
తాను ధరింపఁబోవు పాత్రమును, కవి పోషించిన విధమును, ఆపాత్రయొక్క గుణగణములను, మనస్తత్వమును నాటక బంధమునందు ఆ పాత్రమునకుఁగల స్థానమును ప్రయోజనమును, తన కార్యప్రవృత్తికి హేతువైన భావమును నటకుఁడు మొట్టమొదట గుర్తెఱుఁగవలయును. వారు మాటాడు ప్రతిమాటకును అర్థము చక్కఁగఁ దెలిసియుండవలయును. అర్థము తెలియనిదే భావోదయముగాదు; భావోదయము కానిదే తాను అభినయించు పాత్రము యొక్క యవస్థయందు సహానుభూతి యుండదు. నటకుఁ డెప్పుడును పాఠ మందిచ్చు వావి పై (Prompter) ఆధారపడియుండఁగూడదు.
నాటకమునకు అభినయము (చేష్ట) ప్రధానము. కార్య ప్రచలనము లేనియెడల నాటక మనిపించుకొనక యొక యుపన్యాసమగును.[22] *కార్యప్రచలనమును, అభినయమును అడ్డగించుపాటలను పద్యములను నటకు లంగీకరింపరాదు. కాని పాట పద్యములపైని చాపల్యముచేత కవి యుద్దేశింపని చోటులలోఁగూడఁ గ్రొత్తక్రొత్త పద్యములను బాటలను జేర్చి కార్యగతికి భంగము గలిగించుకొందురు, ఏల? అభినయలోపమును సంగీతముచేఁ బూరించుకొనుటకు ఒక దాని యందలి లోపమును భిన్నమగుమఱియొక దానితో బ్రయత్నించుట [23]+చింతకాయ బహుమానమువలె నున్నది.
+ నాకు సంగీతముపై ద్వేషబుద్దికలదని నా మానవత్వమును సంశయింపబోకుఁడు. తగవుకానిచోట మంచిదియైనను చెడ్డదిగఁ దోఁచును. ఒకవేళఁ బౌరాణిక నాటకములలోని నాయికానాయకులు పాటలు పాడినప్పుడు అనిష్టముగనైన మన్నింపనచ్చును. పౌరాణిక నాయకులు అమానుష శక్తి సంపన్నులగుటవలన వారిజీవితము మనజీవితముకన్న భిన్నము గను, ఊహ్యముగను, గొన్నియెడల నలౌకికము గను గనుపట్టుచుండును. మానవసహజములగు సుఖదు:ఖములను వా రనుభవించునప్పుడే మనము వారితో నేకీభవింతుము. కాని, చారిత్రక సాంఘిక నాటక ములలోని నాయకు లట్లుగాదు. వారు మనుష్యులు, అమానుషశక్తి వారియొద్ద నించుకేనియు లేదు. కావున వాని సుఖదుఃఖములతో మనకు సమీప బాంధవ్యము గలదు. అందులో ముఖ్యముగ సాంఘిక నాటకముల నాయకుల ప్రవర్తనము ప్రస్తుతపు సాంఘికజీవితముయొక్క ఆదర్శక ప్రతిబింబముగ నుండును. అంగడివీధిలో గుడ్డల వ్యాపారము చేయుచుండ మనము ప్రతిదినమును జూచుచుండిన సుబ్బిశెట్టియు జిల్లా కోర్టులో మనము చూచుచున్న ప్లీడరు వెంకోజిరావుగారును మనము ప్రతిదినమును ఇంటిలో సంభాషించుచున్న తల్లి దండ్రులు, ఆలుబిడ్డలు స్నేహితులు మున్నగు వారు స్టేజిమీదకువచ్చి “తులువా పలువా” యనియు ““ ఛీఛీ, పోపో" యనియు ఫార్సీమెట్లకు అనువుగ విఱిగెడి అర్ధములేని పాటలతో సంవాదములు సలుపుకొనుచుండఁ జూచినప్పుడు వారిని బిచ్చివారి ఆసుపత్రికిఁ బంపింప బుద్ధి పుట్టునుగాని అందలి యానందము ననుభవింపఁజాలము. గొంతులేని నటకులకు, పాటను సైతము మ్రింగివేయగల హార్మోనియము శ్రుతి మేలుచేసి పుణ్యము గట్టుకొనునట్లు, అభినయ చాతుర్యము కొఱతఁపడిన నటకులకు పాటలు అభయప్రధానము చేయుచున్నవి. ఇట్లనుటవలన నటకుఁడు బొంగురుగొంతువడి సంగీతజ్ఞాన శూన్యుఁడై యుండవలయునని నా సిద్ధాంతముకాదు. నాటకమున సంగీతము అభినయమునకుఁ గేవలము ఔపచారికముగ నుండవలయును; కార్యగతికి నేలాటి యభ్యంతరముఁ గల్పింపరాదు.
నేడు కొందఱు నటకులు పద్యములు చదువుటలో నొక యపూర్వపద్ధతిని గనిపెట్టినారు. ఒక పద్యమును రెండు మాఱులు చదువుట. సీసపద్యమైనయెడలఁ బ్రతిచరణమును రెండు రెండు మాఱులు చదువుట. మొదటి తూరి రాగముకొఱకుఁ జదువుట! రెండవతూరి అర్థముకొఱకుఁ జదువుట! తా నొక సభయెదుట నటించుచున్నాఁడనియు తానుజేయు అభినయము, తాను పలుకు మాటలు సభాస్తారులు గ్రహించిరో లేదో యను విచారము, తర్కము, నటకుని కెప్పటికి నుండగూడఁదు. అట్లుండినయెడలఁ దాను నటకుఁడు కాక , విద్యార్థులకు ఉక్తలేఖనము చెప్పు బడి పంతులవంటివాఁ డగును. రామకృష్ణమాచార్యుల నాటకములలో భూమికలు ధరించు నటకులందు పునరుక్తిదోషమొక గుణముగ వెలసినది. ఇందులకు మార్గదర్శకుఁడు కవియె. పద్యములోని భావమునే గద్యములోను పాటలోను గూడఁ జెప్పును. పాపము, ప్రేక్షకుల గ్రహణశక్తి ననుమానించి కాఁబోలు రెండుమూఁడు విధముల నయ భయముల తోడ, కవిగారు తనభావములను వారి మనస్సులోనికి బిచికారి చేయును.
“భామవేషగాడికి మఱింత నెయ్యి పొయ్యండి. తిత్తి వూదేవాఁడికి పప్పుకూడా కావాల్నా” అను ప్రాఁత భాగవతుల పాత్రగౌరవములు ఇప్పటి నాటకసమాజములలో గూఁడఁ బొడకట్టుచున్నవి. ఏ నాటకమందైనను, ఆయాస్థలముల ఆయాపాత్రము ప్రముఖమనియు, ఎంతనీచపాత్రమైనను తన నియోగమును జక్క-గాఁ నిర్వర్తించినయెడలఁ బ్రశంసార్హమనియు, నటకునికివచ్చు పేరుప్రతిష్ఠలు తానుపోషించు పాత్రయొక్క యుదాత్తగుణముల ననుసరించికాక , పాత్రలోచితాభినయ చాతుర్యమువలన ననియు, నటకు లెఱుంగరు. ఒకవేళ యెఱింగియుఁ జాపల్యమును జిక్కఁబట్ట లేనున్నారు. ప్రతినటకునకును దాను నాయక పాత్రమును ధరించిననేగాని సుప్రసిద్ధుఁడు గానేరఁడను అపోహ గలదు. ఇట్టి దురభిప్రాయము చేతనే చిల్లర పాత్రములను అభినయించిన కొందఱు తయ పాఠములను జదువక ఉదాసీనులయి నాటకము యొక్క సమష్టిరంజకత్వమునకు లోపమువాటిల్లఁ జేయుదురు. ఒక్కొక్కప్పుడు చెడగొట్టుదురు.
తాను ధరింపబోవు పాత్రముయొక్క గుణపోషణమునకు, స్వభావమునకు తన మనస్తత్వము సరిపోవునా లేదా యను విచారము నటకుని కుండవలయును. మొట్టమొదట తాను తన మనస్సును స్వభావమును పృథక్కరించుకొనుట యావశ్యకము. తన స్వభావమునందు గాంభీర్యమును Tragic element ను లేని నటకుఁడు పాత్రమును స్వభావ సిద్ధముగ అభినయింప లేఁడు. .
భూమికా ధారణమును గురించి యించుక వ్రాయవలసియున్నది. పాత్రోచితగౌరవమును బోషించునది వేషము. వేషమునుబట్టి సాధారణముగ మన మొక మనుష్యుని స్వభావశీలాదులను, అభిరుచిని, శిక్షణము మున్నగు వానిని గురించి కొంచె మెచ్చుతక్కువగఁ దెలిసికొనఁగలము కాని చాలమంది నటకులు పాత్రోచిత వేషములు ధరించుట లేదు. సావిత్రి, సీత, దమయంతి మున్నగు పౌరాణిక నాయకులు మోచేతుల కిందికి జాఱుచుండు జాకెట్టులు, ఎఱ్ఱని పట్టుతోఁ జేయబడిన "బో" అమర్చబడియున్న టోపా, ఉల్లిపొరలవంటి సిల్కులు ధరించుచుందురు. వారి వేషములను జూచినప్పుడు గౌరవమునకు మాఱు లాఘవము మన మనస్సులలో నుత్పత్తియగును. వారి కులుకు బెళుకులు మూతి త్రిప్పుటలు మున్నగు పోకు లక్షణములు బజారీజంతలకుఁగూడ సిగ్గు పుట్టించును. చేటికలు నాయికల తల దన్నునట్లు అలంకరించుకొందురు. వారిలో నాయిక యెవతయో చేటిక యెవతయో గుర్తించుటకుఁ గొంత సంభాషణము జరిగినఁగాని సాధ్యముగాదు. హిరణ్య కశిపుఁడు మున్నగు రాక్షసనాయకులు పదియాఱవశతాబ్దమున రోమను వీరులు ధరించు ఉడుపులను వేసికొందురు. ఆ యుడుపులలోని చీలికలకు, కత్తిరింపులకు ఏలాటి యర్థముండదు. ఇతర రాజపాత్రలు పదునెనిమిదవ శతాబ్దము నాఁటి | ఫ్రెంచి విగ్గులను ధరించుకొని సర్వకాల సర్వావస్థల యందుఁ దలలు విరియబోసికొని తిరుగు చుందురు.
కవికల్పనమును దమయిష్టమువచ్చిన రీతిని కత్తిరించు అలవాటు నటకులకు మిక్కుటముగ నున్నది. కవి నటకుల కన్నఁ దక్కువ ప్రతిభగలవాఁడయినప్పుడును, కథ కొంచెము దీర్ఘమైనప్పుడును నాటకమిట్టి శస్త్రచికిత్సకుఁ బాల్పడుచున్నది. కాని యిట్టి కత్తిరింపు జరిగిన వెనుక నాటక మెట్లు స్వరూపలోపమును బొందకయుండునో, సంయోగత చెడిన ఆ నాటకమును సహృదయరంజకముగ నటకు లెట్లు ప్రదర్శింపగలరో తోఁపకున్నది. వీనినన్నిటిని దృణప్రాయ మొనరించు సాహసము మఱియొకటి కలదు, తెలుఁగు నాటకములలో భిన్నమగు మరియొక భాషను జొప్పించుట ! ఇది కవి యొనరించిన పాపము కాదు. నటకులు Stage effect కొఱకు (అందేమి Stage effect ఉన్నదో గోచరించుట లేదు. Effect కు మాఱు defect కనబడుచున్నది.) స్వచ్ఛమైన యుర్దూ భాషను ఎవరిచేతనైన వ్రాయించుకొని గుడ్డిపాఠము జేసి సభాస్తారులపైఁ గసిదీర్చుకొందురు. సుప్రసిద్ధనటకులని పేరు వహించినవారు కూడ సామాన్య ప్రజల కన్నులలో దుమ్ము కొట్టుటకు వీలయిన యీ యథమమార్గము నవలంబించు చుండిరన్న , ఇఁక ఈ రంగసంప్రదాయముల పయిని మమతపోవని నటకు లుండుట యరుదు. పఠానువేషము దరించిన . రాఘవాచార్యులవారి పద్ధతి నవలంబించియే కాబోలు పర్వతరెడ్డి రామచంద్రారెడ్డిగారు కబీరుపాత్రమును ధరించి రామదాసుతో ఉర్దూభాషలో మాటలాడు దురు, పాపము! రామదాసునకు ఉర్దూభాష శ్రుతపాండిత్యమే కావున చెప్పినమాటల నెటులో అర్థము చేసుకొనునే కాని, ఉర్దూభాషలో తిరిగి జవాబు చెప్పు భాషాజ్ఞానము లేక "తెలుఁగుతో మాటలాడును. తెలుఁగువారు ఉర్దూభాష చక్కగా నేర్చుకొనునంతవఱకైన నటకులిట్టి చాపల్యము వంకకుఁ బోకుందురని నా ప్రార్ధనము,
మహమ్మదీయ పాత్రోచితమైన భాష నుపయోగింప నిష్టమైనయెడల మహామహోపాధ్యాయ వేదము వేంకటరాయ శాస్త్రులవారు ప్రతాపరుద్రీయమున వలీఖాను ప్రభృతులకును బొబ్బిలియుద్ద నాటకమున హైదరుజంగు మున్నగు వారికి నుపయోగించిన మిశ్రభాష రమ్యముగ నుండును; కాని, పఠాను మొట్టమొదటి ప్రవేశమున స్వచ్చమైన యుర్దూ భాషయును కడపటిసీనులలో అందుకు విరుద్ధముగ సంస్కృతపద భూయిష్టమైన సమాసములను మాటలాడుట విపరీతముగ దోఁచును.
ఒక్కొక్కప్పుడు నటకులు సామాన్య ప్రేక్షకులను నవ్వించి చప్పటలు కొట్టించుటకు, అవసరమైన యభినయము చూపి కవి యుద్దేశించిన రసమునకు విరుద్ధమైన రసము నుప్పతిల్లఁ జేయుదురు. ఒక్క యుదాహరణము : హిరణ్యకశిపుని యొద్దకు చండామార్కులు విద్యాపారంగతుఁడైన ప్రహ్లాదుని దీసికొనివచ్చి పరీక్ష, చేయుఁడని చెప్పుదురు. రాజు పరీక్ష చేయును. ప్రహ్లాదుఁడు విష్ణువునేస్మరించును. హిరణ్యకశిపుఁడు కోపగించుకొని గురుపుత్రులతట్టు చూచును. అంతట వారికి వడఁకురోగముపుట్టి కాలుసేతు లతితీవ్రముగ వడఁకింతురు. ఈయసామాన్యమైన యభినయ కౌశలము చూచినంతనె కొందఱు ప్రేక్షకులు పొట్టలుపిసుకుకొని నవ్యుదురు. ఈ మెచ్చుకోలుచేఁ బ్రోత్సహింపబడి చండామార్కులు మఱికొంత తీవ్రముగ వడఁకుదురు పాపము ! వారి నిస్సహాయతకుఁ బేక్షకుల మనస్సులో కవి కరుణరస ముప్పతిల్ల జేయ వలయునని తలంచెనుగాని, సటకుఁడందుకు భిన్నమైన హాస్యరసమును బుట్టించెను, ఇతరులను నివ్వించుటకు నాట్యకళా కౌశలము అవసరము లేదు. చీలమండలవఱకు గుడ్డ కట్టుకొని యుండినయొకఁడు స్టేజిపైకివచ్చి మోకాళ్ళ, వఱకు గుడ్డ నెగఁదీసికొన్న యెడల ఆవై చిత్ర్యమునకుఁ జాల మంది నవ్యుదురు.
నటకులు కవులవలెనె వారి వారి శిల్పనైపుణ్యము చేత లోకము నుద్దరింపఁ దగినవారు. వారిబాధ్యతయుఁ గొంచెముకాదు. కావున ప్రజాసామాన్యము యొక్క యభిరుచికి వారు తమ శిల్పమును దింపుటకంటెఁ బ్రజల యభిరుచిని గ్రమక్రమముగ సంస్కరించుటకుఁ బ్రయత్నము సల్పవలయును.
నాటకశాల
నాట్యరంగ మెప్పటికిని యాదార్ధ్యభ్రమను గొల్పవలయును కాని, మన ముపయోగించు నర్దాలకును, మనము ప్రదర్శించు నాటకములకును దేశకాలపరిస్థితి వైరుద్ద్యము: కనుపట్టుచున్నది. సారంగధరునో లేక కృష్ణార్జునులనో మద్రాసు మౌంటురోడ్డులో తిరుగుచున్నటుల ప్రదర్శింతుము. కన్యాశుల్కములోని గిరీశమును రాజంతఃపురములో సంచరించు చున్నటుల చూపింతుము. పిడుగునకు బియ్యమునకు ఒకే మంత్రము వేయుటవలన అట్టి వైరుధ్యము సంభవించు చున్నది. పౌరాణిక నాటకములాడినను లేక చారిత్రక సాంఘిక నాటకము లాడినను మొదటిపర్దా, వీధి, అంతఃపురము, దర్బారు, అడవి అను నీ అయిదు వర్గాలనే యుపయోగింతురు; ఒకనాటకములోని నాయకుఁడును ప్రతినాయకుఁడును ఒకే యంతఃపురములోనో, లేక యొ కేదర్బారులోనో మార్చి మార్చి కనఁబడుచుందురు. నేఁడు నాటకశాలలో అగపడుచున్న పర్దాలు సీనులును ఇరువదియవశతాబ్దపు సంకర శిల్పముయొక్క ప్రతికృతులు,
ఇట్టివైరుద్ధ్యము సంభవింపకుండుటకుఁ గొన్ని ప్రయత్నములు చేయవచ్చును, నాటకములను బౌ రాణికములనియుఁ జాంత్రకములనియు సాంఘికములనియు విభజించి ఒక్కొక నాటక సమాజము వారు ఒక్కొక వర్గమునకు సంబంధించిన నాటకములకుఁదగిన యుపకరణముల నేర్పఱచు కొని నాట్యకళ యందుత్తమ సిద్ధిని పొందవచ్చును. అట్లుగాక సమాజము భాగ్యవంతమైనయెడల ఆమూడువిధములైన నాటకములకు ఆయా దేశ కాలపరిస్థితులకు సంబంధించిన పర్దాలును ఇతరోపకరణములను సేకరించి తరువాత అట్టి నాటకములఁ బ్రదర్శింపవలయును, కాని, యిట్టి ప్రయత్న ములు జమీందారుల పోషణమున నభినృద్ధియగుచుండు మైలవరం సమాజము, ఏలూరు సమాజము మున్నగువాని కే యొక వేళ సాధ్యము. పౌరాణిక నాటకముల పర్దాలకు సీనులకు రామాయణ మహాభారతములందుఁ గానవచ్చు రాజప్రాసాదాది శిల్ప వర్ణనముల నాదర్శకముగఁ గొనవచ్చును. చారిత్రక నాటకములకు బౌద్ద మొగలాయి శిల్పములను గ్రహింప వచ్చును. వర్తమాన స్థితిగతులఁ దెలుపు సాంఘిక నాటకములకు నేఁటికాలపు సంకరశిల్పముపయోగపడును. ఏ దియెట్లున్నను, ప్రస్తుతము నాట్యరంగము ఆపాదమస్తకము మార్పు నొందవలయును.
ఏ నాటకి సమాజమువారైనను పదునైదు నాటకములను అవకతవకగ నాడుటకంటె నొకటిరెండు నాటకములనై నను సరియైన యుపకరణములతో య్యోముగఁ బ్రదర్శించినయెడల అదియే యశస్కరము. సంఖ్యకన్నను రాశికన్నను, గుణమే ప్రధానము. ఇంగ్లండులో అయిదాఱు సంవత్సరములు విద్యనభ్యసించి మరల హిందూదేశము చేరిన నామిత్రుని అచ్చటి నాటక విషయములను గుఱించి ప్రశ్నింపఁగా ఆయన యిట్లు చెప్పెను: “నేనొక నాటకము ఆఱునెలలకుఁ బూర్వమునుండియు ప్రదర్శింపఁబడుచున్నదని విని యొక నాఁటిరాత్రి చూడఁబోయితిని. అప్పటికిని ప్రేక్షకులు క్రిక్కిరిసియుండిరి. నాప్రక్కను గూర్చుండియున్న యొక పెద్దమనిషిని విచారింపఁగా ఆయన ఇట్లు చెప్పెను— 'ఇంక ఆఱునెలలవఱకు నాడినఁగాని చూడదలఁచుకొన్న వా రందఱును చూడలేరు, ప్రతిదినమును క్రొత్తప్రజలే వచ్చుచుందురు,' కంపెనీవారు ఈనాటకమును సంవత్సరముపాటు ఆడనిదే పర్దాలు మున్నగువానికై వారు వెచ్చించిన పెట్టుబడి ద్రవ్యముపోను లాభము మిగులదు.” నాటకరంగమున యాదార్ధ్యభ్రమకల్పించుట కెంత ద్రవ్యమైనను యూరపియను నాటకసమాజములవారు ఖర్చు పెట్టుదురఁట! అంత ద్రవ్యమును మనము వెచ్చింపలేకపోయినను వెచ్చించు ద్రవ్యమైనను ఇచితముగ వినియోగించు టావశ్యకము.
ప్రేక్షక మండలి
ప్రేక్షకమండలిలో అన్నివిధములైన శిక్షణముగల మనుష్యులుందురు. బహి ర్వేషములను చూచి “వీరు నిక్కువమైన కళాభిరుచిగలవా"రని యూహించుట యసాధ్యము. నేనట్లూహించి చాలమాఱులు పొరపడితిని. ప్రేక్షకునికొక దుర భ్యాసముగలదు. అది దురభ్యాసమే కాదు, దురభి రుచియు. ఒక నటకుఁడు శ్రావ్యముగఁ బద్యమునో పాటనో పాడిన వెంటనే (Once more, once more) అని కేకలువేసి చప్పటులు తట్టును. హల్వా తీపుగానున్నదని అజీర్ల వ్యాధి పుట్టువఱకుఁ దినవలయునని వీరిమతము కాబోలు! ముక్కు ఒక వేళ అందముగా నున్నదని మఱిరెండుముక్కులు చేయించుకొని చెంపలకతికించుకొనుటకు వీరిష్టపడుదురా? పునరుక్తి యితర శిల్పములం దెంతదోషమో అంతకన్న నాటకకళ యందును మహాపాతకము. శ్రుతిచాపల్యముచేత నొకపద్యమునకుఁ జెప్పఁబడిన Once more ను మన్నించెదమను కొన్నను సీనునకంతయు Once more చెప్పు ప్రేక్షకుల యభిరుచి మన్నించుటకు వీలుకానిది. అల్లూరు నాటకసమాజము వారు రామదాసు నాటకమును నాగరకులకు ఆకరమైన యొక పురమునఁ బ్రదర్శించినపుడు అచ్చటి ప్రేక్షకులు అహమక్కు సీను పునరభినీతము గావలయునని ప్రార్ధించిరఁట!!
నటకుని సద్యః ప్రేరితమైన యభినయములోని యౌచిత్యమును సౌకుమార్యమును సూక్ష్మతను గ్రహించుటకంటె పాటలోని మాధుర్యమును జవిసూచి యానందించుట తేలిక . కావునఁ జాలమంది మెచ్చుకోలు పాటపద్యములకు సంబంధించియుండును. నేను జూచినంతవఱకు మెచ్చుకోదగిన అభినయమునకు Ooce more చెప్పిన ప్రేక్షకులు చాల అరుదు. చేయికదలింపనేరని నటకుఁడుగూడ రాగయుక్తముగ పాడె నేని ప్రేక్షకమండలి యాతని నద్భుతమైన నటకునిగ శంకించి బంగారు పతకముల దానము చేయుచుండును.
ఇఁకమీద నెన్నటికైనను కవి నటక ప్రేక్షకుల సహకార సాహాయ్యములచేత నే నాటకశిల్పము సంస్కరింపఁ బడవలయును; అభ్యున్నతి నొందవలయును. ఈ మువ్వురును వారి వారి బాధ్యతను జక్కగఁ గుర్తెఱిఁగి ప్రవర్తింతు రేని నాటక కళకు మంచిదినములు రానున్న వని నా తలంపు.
ఈ వ్యాసమునందలి నా యభిప్రాయములు నాట్య శిల్పమును నిబద్ధీకరించు బిరుసు సిద్ధాంతములుగావు. స్నేహ పూర్వకమైన సలహాలు; కావుననే దిద్దుకొనుట కనుకూలములు.
- ___________
అల్లసాని పెద్దన :
సమకాలీన భావ ప్రతినిధి
సమకాలీన భావములు సాంఘిక పరిస్థితులు కావ్య దర్పణముసందుఁ ప్రతిఫలించుచుండును. కవి స్వతంత్రుఁడయి పూర్వాచార బద్దుఁడు కాకపోయినయెడల రచనాపద్దతి యందును కావ్యవస్తు నిర్ణయమునందును భావ ప్రకటనము నందును దన కాలమునందు వ్యాప్తిలోనుండు పద్ధతులను గ్రహించును; లేక క్రొత్తభంగుల నావిష్కరించును. లక్షణములు ప్రతిభావంతులైన కవులరచనల పరిశీలనము వలఁ దేలిన సామాన్యధర్మములే కావున, అట్టి కవులను అన్యలక్షణములు బంధింప లేవు ఒక్కొక్కప్పుడు వారిరచనలు పూర్వ సంప్రదాయములకన్న బిన్నములుగనుండి మార్గదర్శకము లగును. ఒక్కొక్క. కాలమునకు ఒక్కొక్క సంప్రదాయము రూఢియై యుండును. ఒక కాలముయొక్క సృజనశక్తి తగ్గిన యనంతరము సంప్రదాయము కరుడుకట్టును.
శాస్త్రముకాని శిల్పముకాని ఏకాలమందైనను అప్పటికన్న నభివృద్ధిచెందుటకు వీలులేనంత పరిపూర్ణత చెంది యుండదు. నిర్దోషతయును బరిపూర్ణతయును ఈ లోకమునకు సంబంధించిన గుణములు గావు. కవి కేవలము క్రొత్త పద్దతులను గనిపెట్టవలయునను దీక్షతో పద్మాసనము వేసి కొని కూర్చుండఁడు. ప్రాచీన సంప్రదాయములు నిస్సారము లయి పండిన పండ్లవలె కాలక్రమమున వృంతచ్యుతములగును. కాలారఁ దిరుగ నేర్చిన బిడ్డ రక్షకత్వగర్వము వహించిన ముసలి దాది పట్టియుంచినను పెనఁగులాడి పట్టు వదలించుకొనునటుల స్వతంత్రమైన కవిహృదయము సంకుచిత నియమ బద్దముగాక యెదురుతిరుగును. అసంతృప్తి కలిగినప్పుడు అజ్ఞాతముగనె కవిప్రతిభ అనుకూలమైన ప్రచల నావరణము నేర్పఱచుకొనును. ఈ కార్య మాతనియందు అప్రయత్నముగ నే జరిగిపోవుచుండుట వలన స్వాభావికముగ నుండును; కవి నిరంతరము నేక సంప్రదాయ బద్దుఁడే యైన యెడల రచనలయందు వివిధత్వముండదు. ఇట్లనుట చేత కవి నియమరహితుఁడని చెప్పుటగాదు. స్వయంకల్పిత నియమములు కలవు. నియమబద్దముగాని శిల్పమునందు ఔచిత్య ముండదు. అరాజకత్వముండును. స్వాతంత్ర్యముకూడ నియమబద్దమె.
జాతీయ జీవిత ప్రవాహమును ఆనకట్టలుకట్టి నూతన మార్గముల మరలింపఁగల నాయకులు, కవులు, చారిత్రక మహాపురుషులు ప్రతిదినమును పుట్టుచుండరు. అట్టివారిని సృజించుటకుఁ బ్రకృతికూడ కొంతకాలము వేచియుండి శ క్తిని సంపాదించుకొనవలయును. అట్టి ప్రతిభావంతులు పుట్టినపుడు ఆ కాలమునకు వారివాక్కు ప్రాతినిధ్యము వహించును.
ఆంధ్రదేశ రాజకీయ చరిత్రమునందు కృష్ణదేవరాయల రాజ్యకాలమొక సువర్ణ ఘట్టము, హరిహర రాయలచేఁ బ్రారంభింపఁబడిన విజయనగర సామ్రాజ్యము కృష్ణదేవరాయలనాఁటికి బరిపూర్ణతనొంది, భోగభాగ్యములఁ దులఁ. దూగుచు నడిమింటి సూర్యునివలెఁ బ్రకాశింపఁజొచ్చెను. తెలుఁగు శౌర్యము, తెలుఁగుకీర్తి నల్గడలఁ బ్రసరించెను. ఆకాలమునందు ఆంధ్ర సారస్వతమును కళలును విశేషముగ వృద్ధిచెందినవి. “గులాబిపూవు లంతటను అమ్మబడుచున్నవి. ఆప్రజలు గులాబిపూలను ఆహారముకంటె ఆవశ్యకములయినవిగా భావించుచుండిరి. " ఇక విజయనగర ప్రజల నాగరకతయు సౌందర్య ప్రీతియు భోగలాలసత్వమును వేఱుగఁ జెప్పవలయునా?
పరస్పర భిన్న ప్రకృతులుగల రెండు నాగరకతలకు సంబంధము గలిగినప్పుడు రెంటి యందును గొంత మార్పు గలుగును. బలిష్టమగు నాగరకత దుర్బలమగుదానిని మింగ్రివైచి, తనయందు జీర్ణించుకొనును. అట్లుకాక రెండును తుల్యబలయుతము లయ్యెనేని ఇచ్చిపుచ్చుకొనుటలు, అనుకరణములు, ఆత్మీకరణములు జరుగుచుండును. భిన్న నాగరకతల సంఘర్షణము అభివృద్ధికి అత్యంతావశ్యకము. ఈ కాలమున ఆంధ్రదేశమునందు హిందూ మహమ్మదీయ నాగరకతలకుఁ గొంత సంబంధమును స్పర్దయుఁ గలిగినది, “ ప్రాత యొక రోత, క్రొత్తయొక వింత" యనునట్లు మొగలాయీల భోగ ప్రియత్వము విజయనగర ప్రజలకు వచ్చినది. మహమ్మదీయ స్త్రీల రవికెలు పావడలు ఆంధ్రకాంతల మనముల నాకర్షించినవి.
విజయనగరము సుమారు నూటనలుబది చదరపు మయిళ్ళ వైశాల్యముగల గొప్ప పట్టణము. ఆంధ్ర సామ్రాజ్యమునకు రాజధాని. సింహళమునుండికూడ సామంత నృపా లురు రాయలకు కప్పములను చెల్లించుచు రాయబారులను పంపుచుండిరి. పోర్చుగీసు సిపాయిలుకూడ కృష్ణదేవరాయల దండయాత్రలందు పాల్గొనుచుండిరి. వ్యాపారము నిమిత్తము వివిధదేశముల ప్రజలు ఆపట్టణమున నివాసమేర్పఱచుకోని సుఖజీవనము సల్పుచుండిరి. చక్కని నీటివసతి యేర్పడుట వలన ఎచ్చట చూచినను పైరుపచ్చలు చెట్టుచేమలు ద్రాక్ష తోఁటలు బలిసియుండినవి. విజయనగరమను మూసయందు వివిధ సంప్రదాయములు, ఆచారములు, నాగరకతలు కరఁగి నూతన నాగరకతగ కరుడు కట్టుచుండినది. కృష్ణదేవరాయల దండయాత్రలలో పాల్గొనని కుటుంబము విజయనగరమున నుండియుండదు. విజయగర్వ మొకవంకయు, విరోధి పట్టణములు కొల్లగొట్టుటవలన ప్రాప్తించిన ద్రవ్య మొకవంకయుఁ బ్రజల ఆత్మగౌరవమునకు సుఖజీవనమునకు సాయపడుచుండినవి. దేశానురాగము స్వభాషానురాగము పొటమరించినది. తెలుఁగు మాటకుఁ జెల్లుఁబడి హెచ్చినది. " దేశభాషలందుఁ దెలుఁగు లెస్స” యను నానుడి పుట్టినది.
ఇట్టి సందర్భములలో సంఘమునందు స్వాతంత్ర్య ప్రీతియుఁ బూర్వాచార వైముఖ్యమును హెచ్చినదనుట యతిశయోక్తిగాదు. ఈమార్పు ఆనాఁటి సారస్వతము నందును గోచరించవలయును. రాయల యూస్థానమునందు అల్లసాని పెద్దన, నంది తిమ్మన, అయ్య రాజు రామభదుఁడు, పింగళి సూరన, ధూర్జటి, మాదన, రామరాజ భూషణుఁడు, తెనాలి రామలింగన్న అను అష్టదిగ్గజము లుండిరని ప్రతీతి కలదు. వీరి సమకాలీనతలో గొంతకాలవిపర్యాసదోష మున్నది. ఒకవేళ ఉండిరనుకొన్నను, వీరిలో నెన్వరి రచనయందు ఆనాఁటి పరస్పర భిన్నాదర్శక సంఘర్షణమును నూతన దృక్పథమును గనఁబడుచున్నది? పెద్దన మనుచరిత్రమునందు. కృష్ణదేవరాయలకు పెద్దనపైఁ బ్రీతిగౌరవములు మిక్కుటము. కావుననే
సీ. “ఎదురైనచోఁ దన మదకరీంద్రము డిగ్గి
కేలూఁతయొసగి యెక్కించుకొనియె;
మనుచరిత్రం బందుకొనువేళఁ బురమేఁగఁ
బల్లకిఁ దన కేలఁ బట్టి యెత్తె ;
బిరుదైన కవిగండపెండెరమున కివె
తగుదని నాదు పాదమునఁ దొడగెఁ
గొకట గ్రామాద్య నేకాగ్రహారము
లడిగిన సీమల యందునిచ్చె;
గీ. ఆంధ్రకవితా పితామహ యల్లసాని
పెద్దనకవీంద్ర! యని నన్ను బిలిచె....”
ఇట్టి సత్కారమును గౌరవమును కృష్ణదేవరాయలు మఱే కవికినిఁ జేసియుండలేదు. పెద్దన రాయలకుఁ బియ స్నేహితుఁడు కూడ. రాజు వేఁటకు వెడలునప్పుడు కవీంద్రుని వెంటఁ బెట్టుకొని పోవుచుండెనఁట[24] *కడపజిల్లా
- </ref>
బద్వేలియందొక సరస్సుగలదు. పెద్దన వేఁటకువచ్చినప్పుడా సరస్సులో స్నానము చేయుచుండెనని యచ్చట ప్రజలు చెప్పుకొనుచుందురఁట.
“ఆందకవితా పితామహుఁడ”ని కృష్ణదేవరాయలు పెద్దనను సంబోధించుట కేవలము ప్రీతి మూలకమనియుఁ, దక్కినవారి రచనలకన్న అందు ముఖ్యముగా నందితిమ్మన కవిత్వమునకన్న పెద్దన కవిత్వమేమంత రసవంత మనియుఁ గొందఱు వితర్కింతురు. అది కేవలము ప్రీతిమూలక సంబోధనముగాదు. పెద్దన కవిత్వమునందు సౌకుమార్యము, తెనుఁగుమాటల తియ్యందనము, తేలిక మాటలలో నియమింపఁబడిన భావగాంభీర్యము, ప్రకృతి రామణీయక ప్రీతియు, నవ్యతయుఁ గలవు, పెద్దన పబంధపు నమూనాను సృజించిన వాఁడు కాకపోయినను, ఆంధ్రీకరణము గాక స్వతంత్ర కధావస్తువును గ్రహించి కావ్యము రచించి నూతన సంప్రదాయ మేర్పఱచెను. శ్రీనాధుని నైషధము ఆంధ్రికరణమయ్యును స్వతంత్ర ప్రబంధమువలె నొప్పారుచు పెద్దనకు మార్గము సిద్ధపఱచెను.
ఇతివృత్తము మార్కండేయ పురాణము నుండి గ్రహింపఁబడినది. తన మనమును ఆందోళనపఱచుచున్న భావయుద్ధమును ద్వైధీభావమును ప్రతిఫలింపఁ జేయుట కనువైన కథనే కవి యేర్పఱచుకొనెను. మూర్తీభవించిన రెండు ఆదర్శకములు మన కన్నులయెదుటఁ బొడకట్టు చున్నవి. ఒకటి: హృదయములేని నైతిక కర్కశత్వము; రెండు: భోగలాలసత్వము. మొదటిదానియందు ఆచార పరాయణత్వమును రెండవ దానియందు మానుషత్వమును గలవు. కవి యీ రెండు ప్రకృతులను సృజించి శీలపోషణమునందుఁ దారతమ్యము జూపించి యొక దాని కొకటి భిత్తిగ నొనరించెను.
ఆంధ్రదేశమునందు భిన్న మతములు ప్రబలుటవలన వైదిక మతమునందును వర్ణాశ్రమధర్మములందును బ్రజలకుఁ గొంత అశ్రద్ధ జనించినది. మాధవ శాయణులు వేద భాష్యమును రచించియు రాజకీయ విషయములందుఁ బాల్గొనియు వైదికమతమును గొంతవఱకుఁ బునరుద్దరించిరి. కాని, కాలక్రమమున ఆ యుద్యమముగూడ సన్నగిల్లినది. దేశపరిస్థితులు సౌమ్యముగా లేవు ; మాటిమాటికి యుద్ధములు, కొల్లలు, సర్వజన సామాన్య కష్టములు కలుగుచున్న సమయములందు నీతులు ఆచారములు వర్ణాశ్రమ ధర్మములు నిర్వర్తింపఁబడుటకు వీలులేదు. యుద్ధకాలము లందు వర్ణ సాంకర్యము సామాన్యము..
ఒక జాతిగాని సంఘముగాని బలశౌర్యములు గలిగి పరాక్రమవంతమై యితర జాతులపై దండయాత్రలు వెడలి జయము గాంచినప్పుడు ఆవిజయఫలము ననుభవించుచు వారు భోగపరాయణులయ్యెదరు. వైరాగ్యము మంచునకైన లభింపదు. గృహస్థ జీవితమె ఆదరణీయమగును. మతము అభ్యాస వశమున అర్ధములేని యాచారముగ మాఱియుండు నేగాని, దైనందిన జీవితమునందు దాని యూపశ్యకత అంతముఖ్యముగ దోఁపదు. కృష్ణదేవరాయల రాజ్యకాలమునందొకప్పు డిట్టి పరిస్థితులు సమకూడినవి. పెద్దన హృదయమును వంశపారం పర్యముగ వచ్చు ఆచారప్రీతి యొక వంకకు, నూతన గతులు మఱొక వంకకు ఆకర్షింపఁజొచ్చినవి. ఈ గుంజులాటయె వరూధినీ ప్రవరుల వ్యవహారమునందు మనకు గోచరించును.
కవికి ఎవరిపై ప్రీతియెక్కువ? వరూధినియందా లేక ప్రవరునియందా ? ఈ విషయము గనుగొనుటకు సాధ్యమగునా? ఈ రెండు పాత్రలను కవి చిత్రించిన విధమును విమర్శించితి మేని. ఈరహస్యము బయలు పడును. కవుల కిట్టి పక్షపాత ముండునా? ఏల యుండకూడదు ? వారును మానవు లే ? వారికిని రాగ ద్వేషములు కలవు. ఇష్టానిష్టములు కలవు. . మానవుని లోపత్వమునందును అసంపూర్ణతఁయందును కవికి సానుభూతికలదు. అపుడే యాతఁడు మానవ స్వభావమును గుర్తించినవాఁడగును. పీడించుటయు వేధించుటయు నీతియుతమైనను నీతి బాహ్యమైనను రసార్ద్రహృదయుని చిత్తమును గాయము సేయును. “ధర్మమునిర్వర్తింపవలయును: పరధర్శముకంటె స్వధర్మము శ్రేయము" అని చెప్పఁబడినది, ఎఱుకల వాని ధర్మము పక్షులను జంపి జీవించుట, అయినను, వాని కఱకుటమ్మునకు గుఱియైన క్రౌంచము యొక్క దుస్థితిని జంటపక్షియొక్క శోకావేగమును గాంచినప్పుడు నవనీత సదృశమైన వాల్మీకిచిత్తము కరఁగి ధారలుధారలుగ స్రవించినది. యజ్ఞముసేయుట అధర్మముగాదు; బలిపీఠముయొద్దకుఁ దీసికొని పోఁబడుచుండిన గొఱ్ఱె పిల్లను బుద్ధభగవానుఁడు చూచినప్పుడు ఆ మహాపురుషుని హృదయము కరుణారస తరంగితమై దానిని కాపాడుట కుద్యుక్తుఁడాయెను. ధర్మము హృదయములేని యంత్రము, మానవుడు హృదయముగల యంత్రము, రాముఁడు స్వప్రయోజనమును సాధించుటకొఱకు అక్రమముగ వాలిని సంహరించెను, వాల్మీకి యీ విషయము నెఱుంగును; ఆక్రోశ నినాదముచే దిక్కులు మాఱుమ్రోగించుచున్న తారపై ఆ మహాకవికి మిక్కుటమైన సహానుభూతికలిగి, రాముఁడు జహబు చెప్పుటకువీలు లేని ప్రశ్నలను ఆమెచేతను వాలిచేతను సడిగించెను. తరువాత రాముని ధర్మైక పరత్వమునకు హానికలుగునని శంకించి తాను వత్తాసివచ్చి రాముఁడు దేవుఁడు గావున ఆయన చేసినదంతయు ధర్మమనిచెప్పి పై పెచ్చు వాలిచేత గూడ నొప్పించెను? వ్యాసుఁడు పాండవ పక్షపాతి; వారు ఇడుమలు పడిరన్న కనికరముచే వారి తప్పులకు సున్నపు పూఁతలుకొట్టి మాలిన్యమును మాయించెను. తమ సృష్టులను తామే మోహించిన వారు కూడ కలరు ? వీరిలో పైగ్మ్యాలియన్" అను గ్రీకు శిల్పి ముఖ్యుఁడు. ఆతఁడొకరమణీయవతియగు స్త్రీ విగ్రహమును చలువఱాతితో నిర్మించి ఆ సౌందర్యమునకు ముగ్ధుడయి మోహించి తన పడకటింటఁ బెట్టుకొనెనఁట!
ప్రవరుఁడు నీతిశాస్త్రమునందు నిర్ణయింపఁబడిన కొలతలకు సరిపోవునట్లు కత్తిరింపఁబడిన తోలుబొమ్మ. వరూధిని విద్యుల్లతవలె మనకన్నుల యెదుట సంచరించు జీవన్మూర్తి! బయాస్కోప్ చిత్రము. వరూధిని చైతన్యము పరిస్ఫుటముగ గోచరించుటకు ప్రవరుఁడు సృజింపఁబడెను. కవికి అతనిపై సానుభూతి లేదు. “బుద్ధి జాడ్య జనితోన్మాదుల్ గదా' శ్రోత్రియుల్ ! " అని ప్రవరుఁడు తన లోకజ్ఞాన శూన్యతను అత్మదూషణప్రాయముగ ఒప్పుకొనెను. ఈ వాక్యము వేఱుసందర్భమునఁ జెప్పఁబడినప్పటికిని ఆతని శీలమును ఆ వాక్యార్థము నిరంతర మాపాదించియే యుండును. పాదలేపము కరిఁగిపోయిన యనంతరము తన నిస్సహాయతను గుఱించి దుఃఖంచునప్పుడు మన కథానాయకుని సంగతులు మఱికొన్ని బయలుపడును. తల్లిదండ్రులకుఁ దా నొక్కఁడె యల్లారు ముద్దుబిడ్డ. పెండ్లి యయి శిష్యులకుఁ బాఠము చెప్పు వయస్సు వచ్చినప్పటికిని, తన్నుఁజూడనిదె తండ్రి యొక నిమిషమైన యోర్చుకొని యుండ లేఁడు. అసర సందెవేళ ఈ బిడ్డ బయట కాలుపెట్టిన యెడల బూచులు పట్టుకొను నను శంకచే వాకిలి దాటనీయక తల్లి యెల్లప్పుడు రక్షించుచుండును. ప్రవరుఁడు తల్లిదండ్రుల ప్రేమాతి శయముచేతను అనావశ్యకమగునంత జాగ్రత్త చేతను, నిస్సహాయుఁడుగను లోకజ్ఞాన రహితుఁడుగను జేయఁబడిన అమాయకుఁడు. వరూధిని చెలికత్తె యాతఁడు “గోలయున్ బాలుఁడు” అని కనిపెట్టినది ,
ప్రవరుఁడు మృగమదసౌరభము మోసికొనివచ్చు మందమారుతము వలన అచ్చోటు జనాన్వితమని తెలిసికొని చేరఁబోయి యొక దేవకన్యను గాంచెను. ఆమెయె వరూధిని. ఆ యువతి యసమాన రూపలావణ్యవతి; సౌందర్యమునుగాంచి యానందించుటయు దానిని మెచ్చుకొనుటయు అనీతికరము గాదు కాని, మన నీతిమంతుని చిత్తము సౌందర్య ప్రతిరోధకమైన కవచమునందు మగ్గిపోయినది; పాషా ణత్వమె ధీరత్వమైన యెడలఁ బ్రతిమంటప స్తంభమును ధీరుఁడే!
నిరుపమాన సౌందర్యవతులైన కామినులయెదుట లోకమే యెఱుఁగని ఋశ్యశృంగునివంటి ఆజన్మ మునీశ్వరులును. అపారసంకల్పశక్తిసంపన్నులైన విశ్వామిత్రులవంటి యోగీశ్వరులును చలించిరి. ఇంతయేల? “బమ్మ కై నఁబుట్టు రిమ్మ తెవులు" ఇట్లు చిత్రించిన వారు మానవ స్వభావము యొక్క లోతుపాతుల నెఱింగిన మహాకవులు. నీతి శాస్త్రమునకు వెఱచి శిల్పమును ద్యజించినవారు గారు. ఆ కాలమునందు ఆర్యసంఘ మింతటి యాచారబద్దముకాదు కాఁబోలు!
ప్రవరుఁడెట్లు చిత్రంపఁబడియుండినఁ బ్రాణవంతుడుగ నుండెడివాఁడు ! ఆయన యింతముం దెన్నఁడును వరూధినివంటి యందకత్తెను జూచియెఱుఁగడు; చూచినప్పుడు ఆశ్చర్యపడి యుండవచ్చును. అనంతరము మానవప్రకృతికి సహజమగు కోరిక పుట్టియుండవచ్చును. మఱుక్షణము నందె - ఆలి మగనికి అన్యకాంతలపై మనసు తగులుట యోగ్యముకాదు. తుచ్ఛసుఖములు “మీసాలపై తేనియ " లని విరక్తి పుట్టియుండవచ్చును. మఱల ఆ లతాంగి రామణీయకమునకు వశుఁడయి, అప్సరస, అందును నేను వలపింపలేదు, నన్ను వలచినది, అనన్యగృహీత , నే నేల భోగింప రాదు?" అని తన మనమును సమాధాన పెట్టుకొని యుండ వచ్చును. మఱునిముసమునందె “ఇంత కాలము అవిచ్చిన్నముగ నెఱవేర్పఁబడిన నావ్రతమునేల నేఁడు భంగముచేసి కొనవలయును?” అని నిరతము తనమనములో వర్తించి అను కూలవతియైన యిల్లాలిని అన్యాయము సేయుటగాఁ దలంచి, ప్రయత్నపూర్వకముగఁ దనరోకలఁ జిక్కఁబట్టవచ్చును. ఇట్టి పరస్పర భావసంఘర్షణమునుండి ధీరుని సంకల్పము నిర్మలమయి దృఢమయి యెట్టకేలకు జయము నొందును ప్రవరుని యీ మనోనాటకము మనకుఁ జూపట్టిననే యాతని పై మనకు సానుభూతి కలుగును; లేకయున్న అతఁడుపాషాణ హృదయుఁడని దూషింతుము.
పెద్దన కీ శిల్పనైపుణ్యము కొఱవడి యుండినదా? కొఱవడియుండిన అంతటి మానుషత్వముగల వరూధిని నెట్లు సృజింపఁగలడు ? అట్లయినఁ బ్రవరుని ఏల యిట్లు యంత్ర విగ్రహముగఁ దీరిచెను? ఒకటిరెండు కారణములు కలవు. పెద్దన రాజసము కలవాఁడు. "రమణీ ప్రియదూతిక తెచ్చి యిచ్చు కప్పురవిడె మాత్మకింపయిన భోజన ముయ్యెలమంచము” కావలసిన భోగప్రియుఁడు. పోతనవలె “హాళికులైన నేమి?" యని స్వశ్రమార్జితము పట్టెఁడన్నము తినుటకు వలయు త్యాగశక్తికలవాఁడు కాఁడు. కావుననే రాజాశ్రితుఁడు. పూర్వాచార ప్రియమైన పండితాభిప్రాయమును బొత్తిగ నిరశించుటకు వీలులేనివాఁడు, అందువలన, పండిత లోకమును సంతృప్తిపరచుటకు ప్రవరుని ఆవిధముగఁ జిత్రించెను. జీవితయాత్ర సునాయాసముగ జరిగిపోవుట కట్టి రాజీయే అవసరమేమో!
పెద్దన ప్రవరుని అంతటి కర్కశహృదయునిగ సవరింపక పోయినయెడల మనుచరిత్ర అధమ కావ్యమని దూషింపఁ బడియుండెడిది. వరూధినిపైఁ గనికరము చూపెనని ఇప్పటికిని పెద్దనపైఁ గత్తినూఱు నీతిమంతులు గలరు !
“కలంచునే సతుల మాయల్ ధీర చిత్తంబుల౯” అని పెద్దన వ్రాసెను. మన యలంకారిక సంప్రదాయము ప్రకారము ఒకవేళ ప్రవరుఁడు ధీరుఁడైనఁ గావచ్చునేమొ కాని, పాపము ! వరూధిని మాయలాఁడి యెట్లయినది ! మాయలాఁడియయ్యును సతియయ్యెనేని దోషము లేదుగదా, తెలుఁగు కవులు సంస్కృత కవులవలె పదప్రయోజనము పాటించువారు కారనియు, పెద్దన 'సతి'ని కేవలము స్త్రీ పర్యాయపదముగ వాడెననియు సమాధానము చెప్పుకొన్నను వరూధిని పన్నిన మాయలేవి? ఆమె వలచినది ; వలచుట మాయలాఁడితన మైనయెడల ఆమెయు మాయలాఁడియె. పెద్దన గారాబపు తిట్లు తిట్టుచున్నాఁడు కాఁబోలు ! లేక మొగమాటపు తిట్లొ! -
వరూధిని క న్యక - అనన్యగృహీత - నిష్కల్మషమైన ప్రేమగలది ; మొట్టమొదట ఎవనిని బ్రేమించెనో అతినినే వివాహమాడినది. (గంధర్వుని మోసము తెలియదు గావున) ధనమార్జించుటకొఱకుఁ బ్రవరుని ప్రేమించుట లేదు. లేని | ప్రేమ నటించుట లేదు. జారిణికి ఇంతటి గాఢానురాగ మెక్కడిది? “ఇంద్రునిభాస్యవాఁ డనఁగ నింద్రుఁడొ చంద్రుఁడొ యా యుపేంద్రుఁడో" అని చెలికత్తెలు అతనిపై లాఘవము పుట్టించుటకు యత్నించినను “పూఁతపసిండివంటి వలపుంబచరించుకులంబునీతికిన్ , లేఁతగదమ్మ" అని దుర్నీతులు బోధించినను చెవినిబెట్టక ప్రవరునే వరించినది. ఆమె యచ్చర కొలమున నుద్భవించినను ప్రవర్తనము భిన్నము. తుదకు పేశల హృదయ. ఆత్మహత్యకూడ చేసికొన ప్రయత్నించినది. వరూధిని ప్రవరుని వరించునప్పటికిఁ గన్యాత్వము చెడినది కాదు “ఆవధూటి ప్రధమసురతంబు గంధర్వపతి గరంచె” అని చెప్పఁబడియున్నది.
వరూధిని ప్రవరుల సంగమము తన కిష్టమయ్యును కవి వదలివేసెను. అందుకు పరిహారముగ మాయాప్రవరుని మూలమునఁ గొంత రహస్య సంతృప్తిగాంచెను. కవి చంద్ర వర్ణనమునందు (సందేశమునకుఁ దావుండదు గదాయని) తన యభిప్రాయమును వెల్లడించెను. “ప్రకృతి నచ్చుండైన సన్మార్గి యెన్నటికిం గూటమివంక వచ్చు వికృతిన్ మగ్నుండుగానేర్చునే” అని వెల్లడించెను. ప్రవరుఁడు శుద్దప్రకృతికిఁ గలిగిన వాఁడేయైనయెడల వరూధినీ సంగమమువలన వచ్చు వికృతికి భయపడవలసిన యవసరముండదు, అది క్షణికము. ప్రవరుఁడు అసంతృప్త హృదయమును సంతోషపెట్టి యోదార్చి పోయి యుండవచ్చును,
రావణుఁడు సీత నెత్తుకొని పోయినప్పుడు రాముఁడు పలవించెను. ఆ శోకవేదనకుఁ జెట్లుకూడ తలలువాంచి యల్లాడెను. ప్రకృతియంతయుఁ గన్నీరునించెను. పెద్దనకూడదుఃఖత యగు వరూధినిపైఁ బ్రకృతి కనికరించినదని వర్ణించెను. కర్మసాక్షియగు సూర్యభగవానుఁడు ప్రవరుని పాషాణహృదయత్వమునకు వెక్కసమంది రోషభీషణ స్ఫురణవహించెను:
<poem> తరుణి ననన్యకాంత, నతిదారుణ వుష్ప శిలీముఖ వ్యధా భరవివశాంగి నంగభవు బారికి నగ్గము సేసి క్రూరుఁడై
/poem>యరిగె మహీనురాధముఁ డహంకృతితో నని రోషభీషణ,
స్పురణ వహించెనో యన నభోమణి దాల్చెఁ గపాయదీధితిన్!
ప్రవరుఁడు క్రూరుఁడు - మహీసురాధముఁడు - అహంకార యుతుఁడు శెబాష్ ! పెద్దనా, ముసుఁగులో దాఁగుకొని నీ అక్కసు వెళ్ళబుచ్చినావు ! కసిదీర్చుకొన్నావు ! ఈ సహానుభూతియె, యీ హృదయ వైశాల్యమె నిన్ను మహాకవి పట్టమునకు అర్హుని జేయుచున్నది.
వరూధిని ప్రశ్నలలో వాద నైపుణ్యము మెఱయు చున్నది; ప్రవరునివి చప్పిడిజవాబులు, 'యజ్ఞ కోటులం బావను లౌటకున్ ఫలము, మా కౌఁగిళ్ళ సుఖించుటేగదా! క్రతువు లొనరించుట స్వర్గభోగములకొఱకు, స్వర్గమునందు అవశ్యాను భోక్తవ్యమును ధర్మమును యోగ్యమునైన రంభాది భోగములు ఇచ్చట యేల నిషిద్ధములయ్యెను ? అశ్రమముగ సశరీర స్వర్గసుఖము సమకొనియుండ వ్రతోపవాసములఁ గృశుఁడవయి ఆత్మ నలఁచుట యెందుకు?' అని వరూధిని ప్రశ్నించుచున్నది.
పెద్దన కళానైపుణ్యమును గుఱించి యొకటి రెండు విషయములు సూచించి యీ వ్యాసము ముగించెదను. ఈ కవికిఁ బ్రకృతి రామణీయక ప్రీతి విశేషముగనున్నది. పద లాలిత్యము...... అందు ముఖ్యముగఁ దెలుఁగుమాటల తియ్యని పోకడలు ఈతనియొద్ద నేర్చుకొనవలయును. 'అల్లసానివాని యల్లిక జిగిబిగి' అను పూర్వ విమర్శకాభిప్రాయము నానుడియై యున్నది. పెద్దన కవిత్వము లలితముగఁ దీర్చి దిద్దఁబడి యున్నదనుటకు సందియము లేదు. “నిలుకడ వలయుఁగృతికి” అను అప్పకవి వచనమునందుఁ గళారహస్య మున్నది. ఒక మనుచరిత్రమే కాదు- కొంచెమించుమించు పూర్వకావ్యములలో చాలవఱకు నిలుకడగా రచింపఁబడినవే. “ఏకైక దినప్రబంధఘటికా సద్యశృత గ్రంథకల్పను " అని రామరాజభూషణుఁడు తన్ను గుఱించి చెప్పుకొనియున్నను వసుచరిత్రము ఒక్క దినములో వ్రాయఁబడిన ప్రబంధము కాదు కడపటి సవరణయయి పూర్తియయిన దనుటకు గొన్ని సంవత్సరములు పట్టియుండును; అనఁగా తన జీవిత కాలమునందు రెండుమూడు కావ్యములకన్న నెక్కుడుగ రచించియుండఁడు. ( నెఱవడి కుదురుటకై వ్రాయఁబడు కాపీ పుస్తకముల వంటివి యెన్ని యేని ఉండవచ్చును, అవి లెక్కలేదు. ) ఆ కాలమున రాజాస్థానములె కవులకు శరణ్యములు. ఆస్థానపండితులు స్థనశల్య పరీక్షచేయు బిరుసు విమర్శకులు. ఇట్టి అగ్నిపరీక్షలో తేరి తెప్పరిల్లిన కావ్యములె గౌరవ యోగ్యము లగుచుండెడివి. ఇట్లనుట వలనఁ బూర్వ కావ్యములన్నియు నీతరగతికిఁ జెందినవని కాదు.
ఇప్పటి పరిస్థితులు వేఱు: వార్తాపత్త్రికలు మాసపత్త్రికలు ప్రబలినవి. ఆపత్త్రికల పుటలు నిండుటకు విషయములు కావలయును. కవులును, వ్యాసకర్తలును ఏదో యొక మొగమోటమిచేత ఏదియైన కొంత (కాగితములు నిండుటకు) వ్రాసిపంపవలసి యుండును. కాగితముపైని సిరాతడి యారకముందె ఖండకావ్యము పోస్టులోఁబడును. ప్రూఫులు సరిచూడక పూర్వమె (అవక తవకగా చూచి యని యర్థము) పత్త్రికలలో ముద్రింపఁబడును. పత్రికాధిపతులు మంచి సెబ్బరలు పరిశీలించి ముద్రించుటకు వీలులేదు. అట్లయిన వారిపుటల నియమమునకు హాని గలుగును. ఇట్టి పరిస్థితులలో నిలుకడ నియమ మెట్లు కొనసాఁగును ? తన గ్రంథము తొందరగ బ్రకటిఁపఁబడవలయునను అక్కఱ పెద్దన కుండియుండదు.
Take time for thinking; never work in haste
And value not yourself for writing fast ;
A rapid poem with such fury writ;
Shows want of judgment not abounding wit
A hundred times consider what you have said ;
Polish. repolish, every colour lay,
And sometimes add, but often take away.
--John Dryden.
అను ఇటువంటి రచనా నియమమును పెద్దన చాల జాగరూకతతోఁ బాటించినట్లున్నది.
ద్రౌపది, కైకేయి, చిత్రాంగి మున్నగువారివంటి నాయికలు మన సారస్వతమునందు అరుదు. కొంచె మంచు మించు నాయికలందరు ముగ్ధులు. మౌగ్ధ్యము రమణీయముగ నుండవచ్చును; కన్యకలందరు ముగ్ధులుగ నుందురను ప్రకృతి నియమము లేదు. వరూధిని ప్రాగల్భ్యముగల కన్యక. తానే వలచినది. ఎట్టకేలకు ““నిక్కము దాపనేల ధరణీసురనందన యింక నీపయిం, జిక్కెమనంబు” అని తన భావమును బహిరంగముగ వెల్లడించెను. ఇట్లు చెప్పుట స్త్రీసహజమా? కాంతలు తమ ప్రేమాతిశయము హావభావములచే సూచింతురు. పాపము! వరూధిని సైత మట్లె చేసినది కాని, ప్రవరుని మనస్సు ఒత్తిడిపడునది గాదు. ఆలసించిన యతఁడు మోరకించుకొని పోవచ్చునను అనుమానముచే ప్రేమను వచించినది.
వరూధిని ప్రవరునివలెకర్కశహృదయ గాదు. భావోద్రేకము కలది. పేశలమైన మనస్సు సౌందర్య పిపాస మిక్కుటము-ప్రవరుని సౌందర్యమున కచ్చెరువందినది-వర్ణించినది ఇంకను తనివి సనక యాతని ప్రేమించినది. వరూధినీ ప్రవరుల సందర్శనమును కవి అద్భుతముగ వర్ణించెను. వరూధిని “అబ్బుర పాటుతోడ నయనాంబుజముల్ వికసింప కాంతి పెల్లుబ్బి కనీనికల్ వికసితోత్పల పంక్తులఁ గుమ్మరింపఁగా, గుబ్బ మెఱుంగుఁ జన్గవ గగుర్పొడునన్” బ్రవరుని గాంచినది. మరియు “ఝళంఝళత్కటక సూచిత వేగపదార విందయై లేచి కుచంబులుం దుఱుము, లేనడు మల్లలనాడ నయ్వెడం బూచిన యొక్క పోఁక నునుబోదియ జేరి విలోకన ప్రభావీచికలం దదీయ పదవి కలశాంబుధి వెల్లి గొల్పి” నది. ఇంకను “మునుమున్ బుట్టెడు కొంకు లౌల్యము నిడన్ మోదంబువిస్తీర్ణతం, జొనుపం గోర్కులు కేళ్ళు ద్రిప్ప మదిమెచ్చుల్ ఱెప్పలల్లార్ప నత్యనుషంగస్థితి ఱిచ్చ పాటొసఁగ నొయ్యారంబునం జంద్రికల్ , దనుకం జూచి” నది. ఈపద్యములందుఁ బ్రతిక్షణ వ్యాప్తమైన కార్యసంచలనము జీవకళావిలసనము నిబిడీకృతమై యున్నది. ఇట్టి పద్యములు ఆంధ్రసారస్వత మకుటమునందుఁ బ్రకాశించు జీవమణులు. ఈ చాకచక్యమునందు పెద్దన తిక్కనకు మాత్రమె రెండవవాఁడు,
నిర్జన ప్రదేశమందుఁ బ్రవరుని గాంచినపుడు వరూధినికి మొట్టమొదట కన్యా సహజమైన సిగ్గుపుట్టినది; పుట్టి, పూచిన పోఁకచెట్టు చాటునకు పోయినది ! ఇంక నే చెట్టు చాటునకు బోయినను ఆమె సౌందర్యము ప్రవరుని కగపడదు. కావుననే సిద్దహస్తుఁడగు కవి సందర్భానుసారముగఁ బోఁక చెట్టును దెచ్చి పెట్టినాఁడు..
“ఇంతలు కన్నులుండ" అను పద్వమునందు లోకోక్తియుఁ జమత్కారమును ధ్వనితముగఁ బ్రవరుని నేత్రసౌందర్యమును వర్ణింపఁబడినది. పద్యములోని మాటలు తేట తెలుంగైనను భావము గంభీరముగను బ్రౌఢముగ నున్నది.
పొంగిపొరలివచ్చు ప్రేమ ప్రవాహమును ఆపుకొన లేక వరూధిని ఆ ఛాందసుని "పాలిండ్లు పొంగారఁ బైయంచుల్ మోవఁగఁ” గౌగిలించుకొనినది. ఆ బ్రాహ్మణుఁడు ఓర మోమిడి హా శ్రీహరీ ! యనీ అంసద్వయమంటి పొమ్మని త్రోసిపుచ్చెను. వీలైనయెడల అంసద్వయమంటి యుండఁడు! సమయమునకుఁ జేతికఱ్ఱ మఱచివచ్చెను. పాప మా వనజగంథి మేని జవ్వాజిపసఁ! గందంబించు నొడలుగడిగికొని పాప పరిహారముగ సంధ్యవార్చినాఁడు. వరూధిని యొక్క యీ యస్త్రముకూడ నిరుపయోగమైనది. తన సౌందర్యము నిరాకరింపఁబడినందుకుఁ గోపమును. గోరికతీఱనందుల కసహనమును. స్త్రీజన సహజమైన అళీకనిందారోపణ నైపుణ్యమును, కొంచెము లేతపాకములోఁబడిన గయ్యాళితనమును, కసిదీర్చుకొను నిచ్చయు వరూధిని మనమునందుఁ జెలరేఁగి ముప్పిరిగొన్నవి; దుఃఖము పొంగిపొరలి వచ్చినది.
"పాటున కింతులోర్తురె? కృపారహితాత్మక, నీవు త్రోవ ని
చ్చోట భవన్నఖాంకురము సోఁకెఁ గనుంగొను.....”
తన యమ్ముల పొదిలోని మన్మధాస్త్రములన్నియు వ్యయమైనవి. తుట్టతుదకీ యస్త్రమొక్కటి నిలిచి యుండినది. ఇది యమోఘము కావచ్చును. అయ్యో! దేవుఁడా, యీ యస్త్రముకూడ ఆఱాతిపైఁ దగిలి మొక్క వోయినది.
నాటకము : చరిత్రము
నెలదినములకు పూర్వము [25] కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరిగారు కళాప్రపూర్ణ వేదము వేంకటరాయశాస్త్రిగారి “ప్రతాపరుద్రీయము"లోని కథ చారిత్రకము కాదని ఒక విమర్శనము గేయముగవ్రాసి “ప్రజామిత్ర"లో, బ్రకటించిరి. ఆ విమర్శనము ప్రతాపరుద్రీయ నాటకమును గుఱించి వ్రాయఁబడినప్పటికిని, అందలి విషయము నాటక రచయితల కందఱకు సంబంధించి యున్నది. కావున ప్రస్తుతము చర్చనీయముగా ఏర్పడినది.
వాఙ్మయ వివాదములలోఁ ప్రవేశించుట నాప్రకృతికి విజాతీయమైన పని. అందులో ఇప్పుడు నాకు ఓపిక గాని, తీఱిక గాని యసలే లేదు. అయినను ఈ విషయము చాల ముఖ్యమని నాకు తోఁచినందువలన, సారస్వత ప్రపంచమున పలుకుబడి కలవారు ఒకప్పుడు పొరపడుదురేని (పొరపడుట మానవ సహజమేగద!) ఆ పొరపాటు తత్త్వదర్శనమునకును, సారస్వత పురోభివృద్ధికిని ఆటంకముగ ఏర్పడవచ్చునను భయముతో ఈ వ్యాసమును వ్రాయఁదలపెట్టితిని.
దృశ్య శ్రవ్య కావ్యములకు రచనా విధానమునతప్ప అంత్య ప్రయోజనమునందు ఏవిధమైన భేదము లేదు. లలిత కళల ప్రయోజన మేదో దృశ్యకావ్య ప్రయోజనముకూడ నదియె—సద్యఃపర నిర్వృతి
నాటకము సామాజికుల రసానుభూతికి హేతువయి, హృదయాహ్లాదము, వినోదము కలిగించిన చాలునా? లేక, యింక నేదియైన సాంఘిక ప్రయోజనమును, ఉపదేశమును ఆశింపవచ్చునా? ఇట్టి ప్రశ్నలకు ప్రాచ్యపాశ్చాత్య విమర్శకులు భిన్న భిన్నముగ ప్రత్యుత్తరము లిచ్చియున్నారు. అయినను నాటకమును సాంఘికోద్దరణము కొఱకు ఉపయోగింప వచ్చునని తీర్మానించిన విమర్శకుల సంఖ్యయే హెచ్చు. నాటకములయందు ఉపదేశముండవచ్చును కాని, ఆ యుపదేశము రసాత్మకమయి, ప్రత్యేకముగ ఒక యుపదేశమని యనిపించుకొనక , అలక్ష్యముగ సామాజికుల హృదయములోనికి ప్రవేసింపవలయును. ఇట్లు నిర్మించుట కళానైపుణ్యము. కవి వాక్కును హ్లాదైక మయమని వర్ణించుచు ప్రయోజనములను లెక్కించునపుడు " కాంతాసమ్మితతయోపదేశ యుజే” అని మమ్మటుఁడు చెప్పెను. దీనినే పాశ్చాత్య విమర్శకులు "Delightful instruction” అని నుడివియున్నారు. “ఆనందమున ఉపదేశమును మెదిపి మానవసంఘోద్దరణమునకు కావ్యము తోడ్పడవలయు” నని హొరేస్ కవి చెప్పెను. విక్టరు హ్యూగో, ఇబ్‌సన్ మొదలు బెర్నార్డుషా వఱకుఁ గల పాశ్చాత్య నాటక రచయితలు నాటకమును మానవ సంఘశ్రేయమునకుగా వినియోగించిరి.
"Art for art's sake”. అనగా, కళ ప్రయోజన నిరపేక్షకముగ నుండవలయునను వాదమొకటి కలదు. ఇది మన దేశమునకు క్రొత్త. కావ్యము ఆనందమాత్ర ప్రయోజనమయ్యును, విశ్వశ్రేయమును చేకూర్చునదిగ కూడ నుండవలయును అని మన లాక్షణికుల మతము. విశ్వశ్రేయ మను మాటయందు సాంఘిక ప్రయోజనత్వము ధ్వనించుచున్నది. ప్రయోజన నిరపేక్షక వాదుల సిద్ధాంత ప్రకారము కవి నిర్బాధ్యుఁడు. తన యానందమును పట్టలేక పాడుకొనుచుండును. సంఘమునందు తన రచనల మూలమున కలుగు అనుకూల ప్రతికూల ప్రవర్తనములతో కవి కేలాటి సంబంధము లేదు. గోకిల ఏమి ప్రయోజనము నాశించి గానము చేయుచున్నది? నెలయేరు ఎవరిని సంతృప్తిపఱచుటకు బిలబిల ధ్వనులతో ప్రవహించుచున్నది? అని వీరు ప్రశ్నించెదరు.
చింతా దీక్షితులుగారు ఈకోయిల, సెలయేటివాదములను ఇమిడ్చి సొగసుగా వ్రాసిన గేయములను నేనెప్పుడో చదివినట్లు జ్ఞప్తియున్నది. ఇట్టి ప్రశ్నలడుగువారు కోయిలకు, సెలయేటికి ప్రయోజనము నాశించు జ్ఞానమున్నదా? లేదా? యని విచారించినట్లు కనఁబడదు. కోకిలపాట మనకు రుచించుట అది ఆనందముతో పాడుచుండుట వలనగాదు; దాని కంఠస్వరమున మాధుర్య ముండుటవలన. కాకికూడ అట్టి ఆనందముతోనేగదా పాడును! దాని గానము మన కేల రుచింపదు?
కవినిర్జరారణ్య ప్రదేశమున కూర్చుండి తన యిచ్చ వచ్చినట్లు పాడుకొనిన చిక్కేమియు లేదు. ఏ నీతియు, నియమము అవసరము లేదు. తానే తుమ్మి తానే దీవించుకొన వచ్చును. కాని, కవి మానవ సంఘములో నొక వ్యక్తిగ నుండి, తన కావ్యవస్తువు మానవసంఘము నాశ్రయించి యుండునెడల, తానెట్లు నిర్బాధ్యముగ పాడుకొనఁగలడు?
ఈ వాదమునందు అనుభవ వ్యతిరేకమైన అసత్యము ఒకటి కలదు. కవి ఆనందముపట్టలేక పాడుకొనునా? కవి రచించునప్పుడు తన మనస్సులోనుండు ఒత్తిడిని ఆనంద మనవచ్చునా? లేక వేదన యనవచ్చునా? మనస్సు ఱెక్కలు విప్పుకొననిదే (Mental relaxation కలుగనిదే) ఆనందము జనింపదు. రచనా సమయమున కవి మనస్సు చక్కగ శ్రుతి చేయఁబడిన వీణాతంత్రివలె బిర్రబిగిసికొని యుండును; ఏ మాత్రము తగిలినను తెగును; ఆ సమయమున నెవ్వఁడైన పిలిచినయెడల అమాంతముగ వానిపైనఁబడి గొంతు నులిమి వేయవలయునను కోపము పుట్టును. ఒకప్పుడు మంచముపై కూర్చుండి వ్రాయుచున్నామా? లేక క్రిందకూర్చుండి మంచముపై నోటుబుక్కు పెట్టుకొని వ్రాయుచున్నామా? యను జ్ఞానముకూడ నుండదు. కలలో పద్యములు, నిదుర మేలుకొనునపుడు పెదవులపై పద్యములు, రేయుంబవళ్ళు నాలు గైదు దినములవఱకు ఏకధారగా ఆవరించియుండు. ఇటువంటి యున్మాదావస్థను, సూక్ష్మ మానిసిక ప్రళయమును ఆనంద మందుమా! బాధయందుమా? ప్రసవ వేదనపడుచుండు తల్లిని చూచి, “ఈమె యెంత ఆనంద మనుభవించుచున్నది! ” అని తలంచువా రుందురా? ప్రసవించిన తదుపరి తల్లి బిడ్డను చూచుకొన్నపుడు ఆనందమనుభవించును. ప్రాసెస్ ఎప్పటికి ఆనందకరముగ నుండదు. ప్రాసెస్ ను రిజల్టును కల గుమ్మటం చేయుటవలన ఈ భ్రాంతి కలుగుచున్నది.
మానవావస్థానుకృతి అభినయము. అభినయము ప్రధానముగాఁ గలది నాట్యము. నాటక రచయిత ప్రకృతిని యథాతథముగ అనుకరింపఁడు, సామాన్యముగ మానవ జీవితమునందు సంభవించు ప్రతి సంఘటనము, ప్రతివిషయము కళయందు మూర్తీభవింపఁ జేయుటకు తగినంత ముఖ్యమైనది గను, ఆవశ్యక మైనదిగ నుండదు. ప్రకృతిపరిపాలనమునందు శక్తి అనవసరముగ వ్యయింపఁబడుచుండును. కవి కళాదృష్టితో అనావశ్యకములైన వివరములు వదలిపెట్టి, ఏర్చి కూర్చి, చేర్చి తీర్చి, కొన్ని సంవత్సరముల కాలపరిమితిగల కథను మూడు నాలుగు గంటలలో ముగియు నాటకముగ నిర్మించును. ప్రకృతి అంతగ పాటింపని పొదుపును కవి జూగరూకతతో అభ్యసించును. కొంచె మించుమించు నాటకము ప్రకృతియొక్క యుత్తమ పునర్నిర్మాణమని చెప్పవచ్చును.
“అద్దములోవలె ప్రకృతిని (నాటకములందు) ప్రతిఫలింపఁజేయుట” అను షేక్‌స్పియరు సూక్తికి మెఱుఁగుపెట్టి నట్లుగను, వాఖ్యాన ప్రాయముగను పరాసు మహాకవి అద్భుత నవలా రచయిత విక్టరు హ్యూగో ఇట్లు వ్రాసెను:
“It seems to us that someone has already said that the drama is a mirror where in nature is reflected. But if it be an ordinary mirror, a smooth and polished surface, it will give only a dull image of objects with no relief, faithful but colourless; everyone knows that colour and light are lost in a simple reflection. The drma, therefore, must be a concentrating mirror, which, instead of weakening, concentrates and condenses the coloured rays, which makes a mere gleam a light, and of a light a flame. Then only is the drama acknowledged by art."
నాటకవస్తువు పౌరాణికమైనను, చారిత్రకమైనను, సాంఘికమైనను కవి తన భావనాగ్నిచేత కరగించి పరిశుద్ధము చేసి, కల్పనాశ క్తియను అచ్చులో అసామాన్యమూర్తిని తయారుచేయును. ఈమూర్తి ప్రకృతికంటె భిన్నముగ నున్నను, దానికి వ్యతిరేకముగ నుండదు. ఇట్లనుటచేత కధను తమ కల్పనకు అనుకూలముగ మార్చవలసిన ఆవశ్వకము కవికి కలదు కార్యకారణ సంబంధము నాటకమున పరిస్పుటముగనో, వ్యంగ్యముగనో గోచరింపవలయును; ఏదియును కారణరహితముగ సంభవింపఁ గూడదు. కావున, కవి ఆది మధ్యాంతములుగల నాటకమును సృజించునప్పుడు, కథలో నెన్నియో మార్పులు చేయవలసియుండును. కవిచేతి కావ్యవస్తువు ప్రతిమాకారుని చేతి బంకమట్టి వంటిది. ఈవిషయమును ఎడ్ గార్ యాలన్ పో అను అమెరిగా కవీంద్రుఁడు ఇట్లు చెప్పియున్నాడు :
"In the hands of the true artist the theme is but a mass of which anything may be fashioned at will or according to the skill of the workman. The clay is, in fact, the slave of the artist. It belongs to him.”
రామాయణము, మహాభారతము ప్రసిద్ధములైన కావ్యేతిహాస గ్రంథములు. ఇవి చారిత్రకములని విశ్వసించు వారు అప్పటికిని ఇప్పటికిని గలరు. అట్టికథల తీసికొనినాటకములు రచించిన భాసుఁడు, కాళిదాసు. భవభూతి, భట్ట నారాయణుఁడు మున్నగు కవులు మూలకథలను ఎట్లుమార్చినదియు మన మెఱుంగుదుము. షేక్ స్పియరు తాను రచించిన చారిత్రక నాటకములోని పాత్రలను యథార్థచారిత్రక పురుషులకంటె భిన్నమైన స్వభావశీలములు గలవారినిగ చిత్రంచెను. ఇది ఆవశ్యకమైన యొక శిల్పలక్షణము. తెల్లని కాగితముపై నల్లనిగీఁతయు నల్లని కాగితముపై తెల్లని గీఁతయు గీచిన స్ఫుటముగ నగపడును. ఏకవర్ణ మయ్యెనేని రెండిటికింగల భేదము గోచరింపదు. అందువలననే కవియు చారిత్రక నాటకములందు సైతము వివిధప్రకృతులు గల వారిని ఒక చోట ప్రవర్తింపఁ జేసి, స్వభావ తారతమ్యమును స్ఫురింపఁ జేయును.
నాటకమునందు కధకంటెను మానవస్వభావ చిత్రణమె ముఖ్యము. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాది చిత్తవికారములు సర్వజనీనములై , సర్వ కాలీన ములై, మానవసంఘముపై నధికారము సల్పుచుండును. అట్టి మానవ స్వభావ శీలములను, మానసిక రహస్యములను కవి నాటకరంగమున మూర్తీభవింపఁజేసి సామాజికులను ఆనందపరవశులఁ గావింపవచ్చును.
“Poetical works belong to the domain of our permanent passions; let them interest those, the voice of all subordinate claims is at once silenced,”
అని శాశ్వతములగు మనోవికారముల ప్రాముఖ్యమును మ్యాథ్యూ ఆర్ నాల్డు కవి వివరిం చెను.
ఒకప్పుడు ఫ్రెంచినాటక రచయితయగు మోలియర్ కవిని విమర్శకులు, “నీ నాటకములు లక్షణవిరుద్ధముల”ని తూలనాడిరఁట. అందుకు “సామాజికులను సంతోష పెట్టుటకు ఏ నాటకలక్షణము లావశ్యకములో అంతకన్న భిన్నములైన లక్షణములతో నాకేమిపని?” అని ఆయన జవాబు చెప్పెనఁట ! నాట్యకళా ప్రపూర్ణుఁడగు బళ్ళారి టి. రాఘవాచార్యుల వారు ఒక యుత్తరమున, "నేను నాటకమును సామాజికులదృష్టితో చదివెదను.” అని వ్రాసియుండిరి. నాటక యోగ్యతను ఒరయుటకు ఇంతకన్న శ్రేష్ఠమైన నికషోపలము మఱియొక టి యుండదని నా యుద్దేశము.
చరిత్రయొక్కయు, నాటకము యొక్కయు ఉద్దేశములు ప్రయోజనములు వేఱు; చరిత్ర జరిగినది జరిగినట్లుగ చెప్పును. జరిగిన దన్నంతమాత్రముననే సకల సబ్బండును చరిత్రకారుఁడు గ్రంథస్థము చేయును. మంచిచెడ్డల ననుసరించి అతఁడు విషయములను ఏర్పఱచకూడదు. ఎంతవఱకు జరిగియుండవచ్చునో, ఎట్లు జరిగియుండిన చిత్తాకర్షకముగ నుండునో దాని నూహించి కవి కావ్యమును వ్రాయును. చారిత్రక విషయము సైతము కవితాస్పర్శ చేత రూపాంతరము పొందును. ఇట్లు వారిరువురి మార్గములు భిన్నమైయుండగా కవి చరిత్రకారుఁడు కానందుకు మనమేల యాతనిని ఎత్తి పొడువవలయును?
మనము నాటకశాలకు పోవునది పురాణములు, చరిత్రములు నేర్చుకొనుటకు కాదు. రెండుమూడు గంటలకాలము నిరపాయకరమగు నానందము ననుభవించుటకు, చారిత్రక విషయములు తెలుసికొనవలయునన్న అందుకు తగిన గ్రంధములు గలవు. ప్రతాపరుద్రీయములోని కథ చారిత్రకము కానందువలన అది ప్రదర్శింపఁబడినప్పుడు సామాజికుల ఆనందమున కేమైన కొఱతయుండునా? పేరిగాఁడు, యుగంధరుఁడు చారిత్రిక పురుషులు కాకపోయినను వారిచేష్టలు, మాటలు మనకు సంతోషము గల్గించును. -
చౌదరిగారు ఢిల్లి యెక్కడ, గంగ యెక్కడ ? అని ప్రశ్నించినారు. నాటక ప్రపంచమును యథార్థ ప్రపంచ దృష్టితో చూడఁజనదు. నాటకము కొన్ని కవి సమయములకును కళానియమములకును లోఁబడియున్న అనన్య పరతంత్ర మైన సృష్టి, చిత్రకారుఁడు గోడపై తెలుపు, నలుపు రంగులతో లిఖించిన చిత్రము చదునుగా (Flat surface) నుండినను, వెలుఁగు నీడలవలన మిట్టపల్లములను స్ఫురింపఁ జేయును. నల్లగానుండు చోటు పల్లము, తెల్లగానుండుచోటు మిట్ట అను చిత్రసమయమును మన మంగీకరించి యున్నాము, ఏలయన, చదునుగానుండు తలమున మిట్ట పల్లములు చూపుట అసంభవముగాన, విధిలేక కొన్ని సంకేతములను అంగీకరించితిమి.
అట్లే నాటకములందుఁగూడ కొన్ని సంకేతములు, సమయములు రూఢియైనవి. నాటకప్రపంచమున కాలము స్థలము సంకుచితమై యుండును. అచ్చట మన భావము సంచరించువఱకు అందలి పరిస్థితులు స్వాభావికముగను, యధార్ధముగను ఉండునట్లు తోఁచును. బహిఃప్రకాశము యొక్క వృద్ధి క్షీణతల ననుసరించి కంటిలోని పాప (రంధ్రము) సరియొత్తు కొనునట్లు, ప్రకరణము ననుసరించి సరియెత్తుకొను శక్తి మన భావమునకు కలదు. అందువలననే నాటక ప్రదర్శనము మనకు ఉపభోగ్య మగుచున్నది.
సునిశితమైన విమర్శక దృష్టితో నాటకము చదువు నపుడు అసంభవములుగా కనఁబడునవి నాటక ప్రయోగమును చూచునప్పుడు అట్లు తోఁపవు. అప్పటి మన భావస్థితి వేఱు.
చరిత్రమును నాటకకర్త ఎంతవఱకు మార్చవచ్చును? అను విషయమును గుఱించి ఫ్రెంచి, జర్శను కవులయు, విమర్శకులయు అభిప్రాయములను ఈ క్రింద నుదాహరించు చున్నాను:-.
"It is besides most commonly asked how far tbe poet may veature in the alterations of the true story, in order to the fitting of it for the stage. Upon which we find different opinions among both the ancient and modern critics; but my opinion is that we may do it, Dot only in the circumstances, but in the principal action itself, provided he makes a very good play of it. For, as the dramatic poet does not much mind the time, because he is no chronologist, no more does he, nor the epic poet, mach mind the true story because they are no historians. They take out the story 80 much as gerves their turn and change the rest not expecting that anybody should be so ridiculous as to como to the theatre to be instructed in the truth of history'.
-Francois Hedlin's
“The whole art of the Stage"
"In short, tragedy is not history in dialogue. History is for tragedy nothing but a storehouse of names wherewith wo are used to &ssociate certain characters. If the post finds in history circumstances that are convenient for the adornment or individualising of his subject, well, let him use them. Only this should be counted as little a merit as the contrary is a crime......"
“The dramatic poet is no historian, be does not relate to us what was once believed to have happened, but he really produces it again not on account of mere historical truth, but for a totally different and nobler aim. Historical accuracy is not his aim, but only the means by which he hopes to attain his aim; he wishes to delude us and touch our hearts through the delusion."
-G. E. Lessing's
“Dramaturgy".
ఈయభిప్రాయములు ముఖ్యములు కావున కొంచెము దీర్ఘములైనను పూర్ణముగ నుదాహరించితిని. పఠితలు వ్యాసగత విషయములను ఆలోచించి వారివారి బుద్ధికి సూటియగు పర్యవసానము తేల్చుకొందురుగాక !
అలంకార తత్త్వము
కావ్య లక్షణములను విధించు గ్రంధములకు అలంకార గ్రంథములని యేల పేరువచ్చినది ? ముఖ్యములైన రసధ్వనులుండగా అలంకారములకేల యింత ప్రాముఖ్య మీయబడినది? “తదదోషౌ శబ్దార్థౌ సుగుణా వనలంకృతి పునః క్వాపి” అను నిర్వచనము ప్రకారము అనలంకృతము లైన శబ్దార్థములకును కావ్యత్వము సిద్ధించునుగదా,
లక్షణ గ్రంథములు అలంకార గ్రంధములని పేరు పడునప్పటికి అలంకారమను పదము కటకాంగదముల వంటిదను సంకుచితార్ధమున రూఢికా లేదు. ఈయర్థము వామనుని కాలమున ప్రారంభమయి మమ్మటుని కాలమునకు బాగుగ రూఢమైనది. అయినను తరువాతి వారుకూడ అలవాటువలన లక్షణ గ్రంథములను అలంకార గ్రంథములని వ్యవహరించు చుండిరి. కావ్య శోభాకరములైన హేతుగుణములన్నింటికిని అలంకారనామము సార్ధకమగును.
భామహుని కాలమున, మాధుర్యము, ప్రసాదము, ఓజస్సు అను కావ్యశోభా హేతువులకు గుణములను పేరు రాలేదు. కావ్యమునకు శరీరసామ్యము తెచ్చిపెట్టిన యనంతరము సాదృశ్య పరిపూర్ణతకొఱకు, శరీరము, ఆత్మ, గుణములు, అలంకారములు మున్నగునవి పృథఃకరింప బడినవి. కావ్యశోభాకరధర్మములు 'అలంకారములని దండి మతము, వామనుడు దండి యభిప్రాయము ననుసరించి యించుక మార్పుతో “కావ్యం గ్రాహ్యమలంకారాత్” అనియు "సౌందర్యమలంకారః” అనియు నిర్వచించెను. సౌందర్యము సౌందర్యాపాదక హేతువుల సమష్టి ఫలము, ఒక్క కటకాంగదములవలననే సౌందర్యము చేకూరదు.
వామనుని కాలమున గుణములకు ప్రాముఖ్యము కలిగినది. అలంకారములకు ప్రత్యేకత పొడచూపినది. కావ్యమునకు శోభ నాపాదించు ధర్మములు గుణములనియు తదతిశయహేతువులు అలంకారములనియు గుణశూన్యమైన కావ్యము అలంకారయుతమయ్యు శోభావహము కాదనియు వామనుని యభిప్రాయము.
సంస్కృతలక్షణ గ్రంథములు క్రీస్తువెనుక నాలుగైదు శతాబ్దుల మధ్య ప్రభవించి క్రమక్రమముగ వ్యాపింప జొచ్చినవి, లక్షణ గ్రంథముల అధికారము హెచ్చినవెనుక రచింపబడిన కావ్యములు చాలవరకు స్వతంత్ర రచనా విధానమును గోల్పోయి అలంకార గ్రంథములలోని లక్షణములకు ఉదాహరణ ప్రాయములైనవి.
లాక్షణికులు తార్కికులుగావున అలంకారములు వారి పృథఃకరణశక్తి సనుసరించియు, సూక్ష్మాతి సూక్ష్మభేదగ్రహణ బుద్దిననుసరించియు కాలక్రమమున పెచ్చు పెరిగినవి. మనము ఏ మాట మాటాడినను అది యేదో యొక యలంకారమగును. అలంకారములు శరీరముకంటే భిన్నములని దానిని తీసివేసిన అసలు కవితా శరీరమె అదృశ్యమగును.
(భరతముని కాలమున “ఉపమా రూపకం చైవ దీపకం యమకం తథా, కావ్య స్యైతేహ్యలంకారాశ్చ త్వారః పరికీర్తితాః” అను ప్రమాణము ననుసరించి ఉపమ, రూపకము, దీపకము అను మూడు అర్ధాలంకారములును యమకమను శబ్దాలంకారమును గుర్తింపబడినవి. రుద్రటుని కాలమున “వాస్తవ మౌపమ్య మతిశయః శ్లేషః” అను నాలుగు అలంకారములు గుర్తింపబడినవి. తర్వాత ఉపమాలంకారము బహువికారములను పొందినది.
“ఉపమైకా శైలూషీ సంప్రాప్తా చిత్రభూమికా భేదాన్. వింజయతి కావ్యరంగే నృత్యంతీ తద్విధాంచేతః "
అలంకారములు పరిమితపదజాలముతో అపరిమిత భావచ్ఛాయలను ప్రకటించుట కేర్పడిన భావ ప్రకటన సాధనములు. వాని రమణీయతకు కారణము భావగాఢత్వము, శబలత్వము; తన్మూలమున రసత్వమును.) -
వాల్మీకి కాళిదాసాది మహాకవులు ఉపమాలంకారమునే విశేషముగ వాడిరి ' "ఉపమా కాళిదాసస్య" అను నానుడి లోకమున గలదు. ఉపమయె అన్ని యలంకారములకు మూలకందము. అలంకారములు కావ్యశరీరమునకు భూషణములను శాస్త్రీయ సాంప్రదాయానుసారముగ వచ్చు మాటలటుండనిచ్చి, భావ ప్రకటనమునకు సంబంధించినంత వఱకు అలంకార ప్రయోజనము నారయుదము. కవి చెప్పదలచుకొన్న భావము స్ఫుటముగ సూటిగ పఠిత హృదయ మున ప్రవేశపెట్టుటకు ఉపమాద్యలంకారములు తోడ్పడును. కొంతసేపు తర్కించి విమర్శించి వివరించినగాని మనసునకు. పట్టని విషయములు సైతము అలంకార ద్వారమున సునాయాసముగ మనమున హత్తుకొనును.
“ఉప్పుకప్పురంబు నొక్క పోలికనుండు
చూడఁజూడ రుచుల జాడవేఱు;
పురుషులందు బుణ్య పురుషులు వేఱయా.”
అరగంటసేపు ఉపన్యసించి వివరింపవలసిన విషయమును సాదృశ్యబలమున కవియొక వాక్యమున సాధించినాడు. భాషపొదుపునకు అలంకార మొక సాధనము.
భాషస్థూలము. భావములు సున్నితములు, ఏ భాష యందైనను పదజాలము పరిమితము. భావచ్ఛాయ లపరిమితములు. కావున పరిమితపదజాలముతో అపరిమిత భావములను ప్రకటింపవలసియున్న యెడల ఏవో కొన్ని సంకేతములు. సమయములు, శబ్దశక్తులు అక్కఱనుబట్టి సహజముగ ఉద్భవించును.
కవిత్వము భాషకు అలంకారము. కావ్యము భాషాలత పూచిన నెత్తావిపూలగుత్తి; భాషాపయోనిధి మథింపగా పైకి దేలిన అమృతకలశము. కావ్యమునందు భాషయు భావ ప్రకటనము ఉత్తమస్థితి నందియుండును. కావ్యమున కవికి లోకోత్తర భావచ్చాయలు ప్రకటింపవలసిన యవసరము కలదు. కాని పదజాలము పరిమితము. ఈ భాషాలోపమును పూరించుటకై కవిపడిన బాధకు ప్రతిఫలముగ ఉపమాలంకారము పుట్టినది. ఒకడు చలినీటిని తాకె ననుకొనుడు. ఆ నీటి చల్లదనమును గుఱించి ఆతడిట్లు చెప్పును : చల్లగా నున్నవి. ఎక్కువ చల్లగా నుండెనేని ఎక్కువ - మిక్కిలి - చాలా - యెంతో అను విశేషణముల నుపయోగించును.
ఈ విశేషణములన్నియు సమానార్థకములె. తారతమ్యమంతగా స్ఫురింపదు. అయినను వాడనుభవించిన చల్లదనమును వర్ణించుటకు ఈ విశేషణములలో నొకటియు చాలదు. అంతట వాడు లోకానుభవజ్ఞానము వలన మిక్కిలి చల్లగానుండు వస్తువు మంచుగడ్డ యొకటి యున్నదని తెలిసికొని "ఈ నీళ్ళు మంచుగడ్డవలె చల్లగా నున్నవి” అని చెప్పును. అంతకంటెను చల్ల గా నుండు నెడల, మంచుగడ్డ కన్న చల్లని వస్తువు నాతడెఱుగని యెడల. ఇక “చల్లని" యను పదమును సాగదీసి యుచ్చరించుచు ఆ పదార్థమును తాడినప్పుడు కలుగు ముఖవికారము నభినయించుచు “అబ్బ! యీనీళ్ళు చల్ ల్ ల్ ల్ ల్ లగా ఉన్నవి” అని నొక్కి చెప్పును. ఇంతటి శీతలత్వమును ప్రకటింపగల పదము భాషలో రూఢియై యున్నయెడల అతడు సాదృశ్యసహాయము పొందవలసిన యవసరముండదు. కాని యే భాషయు ఎప్పటికిని. అట్టి పరిపూర్ణత పొందజాలదు.
“అరవిందాలు గదోయి కన్నులు” అని కవియొక రమణీయవతి కన్నులను వర్ణించును. కవులు భావోద్రిక్త మానసులు. వారి దృష్టి భావరంజితము; శబలితము. అందువలన సామాన్యులు చూడజాలని అంతర్లీనగుణసౌభాగ్యమును కవి దర్శించును. కవి ప్రకటింప దలచుకొన్న భావము లివి:- ఆమె కన్నులు విశాలముగ నున్నవి. కనుగ్రుడ్డుకొనల నాజూకైన యెఱ్ఱరంగు కలదు. కన్నులలో జీవకాంతి తొలికాడు చున్నది. తెల్ల వెలుగు పొడచూపు చున్నది. మెత్తదనము ఆర్ద్రత్వము గలదు. ఈ భావములన్నియు కవి వర్ణింపవలయునన్న ఒక సీసపద్యము వ్రాయవలసి యుండును. ఈ భావములన్నియు స్ఫురింపజేయు ఒక్క పదము ఏ భాషలోను ఉండదు. కావున కవి తాను వర్ణింపదలచుకొన్న గుణములన్నియు అరవిందమున నున్నవని తెలిసికొని యుండుటచేతను అరవిందముయొక్క అనుభవజ్ఞానము సామాన్యముగావునను “అరవిందాలు గదోయి కన్నులు " అని సంక్షిప్త లేఖనమున (Short hand) లిఖంచినట్లు ముక్తసరిగి వర్ణించెను.
ఇట్టి సంకేతముల వలన భావముల యిమిడిక యు భాష పొదుపును సిద్ధించును. పసుపు ఎఱుపు నీలము అను మూడు రంగులే ప్రథానములు, చిత్రకారుడు ఈ మూడు రంగులను మిశ్రమము చేయుటవలన వేలకొలది. వర్ణచ్ఛాయలను సృజంచును. కవియునట్లే పరస్పర భిన్న వస్తువులలోని గుణములను మేళవించి నూత్న సృష్టిని చేయును,
కావ్య కళకు చిత్ర లేఖనమునకు దగ్గరి సంబంధముండినను వాహక భేదముల (Diference of medium) ననుసరించి వారి మార్గములు భిన్న ములు, చిత్రకారుడు ఉపమానోప మేయములను మేళవించి లిఖంచును. అనగా అరవిందములలోని వైశాల్యము నిగనిగ మొదలగు రమణీయగుణములను కన్ను లలో మూర్తీభవించునట్లు చిత్రించును. వేఱుగా అర వింద పత్రములను కంటి ప్రక్కన వ్రేలాడ గట్టవలసిన యవసర ముండదు. చిత్రకారుడు రంగులు కలుపునట్లే కవి భావములను కలుపును; అట్టి భావసమ్మేళనము స్ఫురింపజేయుటకు ఉపమాద్యలంకారములను ఆశ్రయించును.
విరటుని గృహమునందు సైరంధ్రి వాలకముతో నున్న ద్రౌపదిపై కీచకుని మనసు లగ్న మైనది,
క|| నా యున్నబాము దలపవ
యీ యొడలి చీర యిట్టి యేపపుజందం
బోయన్న, మదన వికృతిం
జేయుననుట యెంతయు నిషిద్ధముగాదె.
అని ఆమె యెంత వారించినను కీచకుడు వినడు. వినజాలడు, కామోద్రిక్తమానసుడైన కీచకునకు ప్రకృతిలోని రామణీయకమంతయు సైరంధ్రిగా మూ ర్తీభవించినట్లుకనుపట్టినది. ఈభావగాఢత్వము. తన్మూలమున గలిగిన రసతన్మయత్వము పస్ఫుటము చేయుటకు తగిన భాష కావలయును. కీచకుడు ఆమె యడుగులను చూచెను. సామాన్య భాషలో వానిని వర్ణింపవలయునన్న , అవి మెత్తగను, యెఱ్ఱగను ఉన్నవని చెప్పవచ్చును. అట్లు గాక ఒక వేళ వర్ణించువాడు సహృదయుడైన యెడల అవి “శిరీషకుసుమ పేశలములు' అని వర్ణించును. ఈ మాట లేవియు కీచకుని హృదయమును ఉఱ్ఱూతలూచుచున్న ప్రగాఢ భావోద్రేకమును శతాంశమైనను ప్రకటింప లేవు. కావున కీచకుడే తన భాషతో ఆమెను వర్ణింప వలయును:
- ↑ పూర్వము పద్యకావ్యములు చెవికి వినఁబడునటుల పెద్దగఁ జదువ బడుచుండెడివి. అందువలన కర్ణేంద్రియ ద్వారమునఁగూడ సుఖము నొందుచుండెడి వారము. కాని నేఁడు అలవాటు మాఱినది. చెవులు చేయవలసిన పని కన్నులు చేయుచున్నవి. పెదవులు కదలింపక నవలలు చదువ నలవాటు పడిన మనము పద్యకావ్యములనుగూడ నట్లే చదివి. పొందవలసినంత యానందమును బొందుటలేదు.
- ↑ There is something magical in rhythm. It even makes us believe that the sublime lies within our reach_Goethe.
- ↑ నేను “రసరామణీయకములు" అను వ్యానమునఁ దెలిపినటుల చేతనాచేతన భేదములేక ధమణీయ భావము లన్నిటియందు రసముండుసను మతము నంగీకరించు పక్షమున "వాక్యం రసాత్మకం కావ్యం" అను నిర్వచనముగూడ నంగీకృతమైనట్లె అట్లుగాక రసము కేవలము మానవ చర్యలకు సంబంధించినదే యని తలచుఁనెడల ఈ వ్యానమునందుఁ జూపఁబడిన యభ్యంతరమువలన విశ్వనాథుని నిర్వచనము సంకుచిత మగును.
"(ఇష్టార్థవ్యవచ్చిన్నా పడావళి)"
ఇచ్చట “ఇష్టార్థ” మవఁగా హృద్యార్థము, లేక రమ్యార్థము.
- ↑ (1) Poetry is the spontaneous outflow of powerful feelings. It takes its origin from emotion recollected in tranquility. - Wordsworth.
(2) Poetry we will call Musical Thought.. - Carlyle.
(3) Poetry may be defined as the expression of the imagination. - Shelley.
(4) (Poetry is) the utterence of a passion for truth, beauty; and power, embodying and illustrating its conceptions by imagination and fancy and modulating its Language on the principal of variety in unity. -Leigh Hunt.
(5) Poetry is the rhythmic creation of beauty. - Allan Poe. - ↑ "ప్రతిభా అపూర్వ వస్తునిర్మాణక్షమా ప్రజ్ఞా; తస్యా విశేషో రసావేశ వైశద్య సౌందర్య కావ్యనిర్మాణ క్షమత్వం. లోచనవ్యాఖ్య —ఆభినవ గుప్త పాదాచార్యులు
- ↑ కొందఱు గ్రుడ్డివారు ఏసుఁగును చూచుటకై పొరుగూరికి పోయిరి. వారిలో మొదటివాఁడు తొండమును తాఁకి, ఏనుఁగు తనచేయివలె నున్నదనియు, రెండవవాఁడు కాలునుతాఁకి ఏనుఁగు స్తంభమువలె నున్నదనియు, మూడవవాఁడు పొట్టనుతాఁకి ఏనుఁగు గాదెబొట్టవలె నున్నదనియు, నాల్గవవాఁడు తోఁకనుతాకిఁ ఏనుఁగు కఱ్ఱవలె నున్నదనియుఁ దలంచి తమ యూరికి తిరిగి వచ్చుచు దారిలో తాము చూచిన విషయములను సరి పోల్చుకొనిరి. ప్రతివాఁడును సత్యమే చెప్పినను వారిజ్ఞానము పాక్షికమైనందున భేదాభిప్రాయములు గలిగి వివాదములు పెరిగి తిట్టుకొనసాఁగిరి. అంతలో ఏనుఁగును చూచిన మరియొకఁడు వచ్చి వారు చెప్పిన దంతయు నత్యమేయనియుఁ, బరిపూర్ణసత్యము తేలుటకు వారొకరొకరు తాకిన యంగములను గలిపి చూడవలయుననియుఁ దెల్పెను,
- ↑
శ్లో. యః కౌమాఠహరః నఏవ హిపరస్తా ఏవ చైత్రక్షపా
స్తేచోన్మీలిత యాలతి సురభయః ప్రౌఢా? కదంబానిలాః,
సాచైవాస్మి తథాపి తత్ర సురతవ్యాపార లీలా విధౌ
రేవా రోదసి వేతసీ తరుతలే చేతః నముత్కంఠతే,
(మమ్మటోదాహృతము.)
పరస్పర విరుద్ధములగు విభావనావిశేషోక్తుల సాంకర్య మిందు స్ఫుటముగ నున్నదని విశ్వనాథుని యభిప్రాయము. కాని యీ శ్లోకమును మనము చదువునపుడు మనకుఁ గలుగు ఆనందము ఆలంకార మూలకమైనది కాదు. తనమూలకమైనది.
- ↑ అరిస్టాటలు కవిత్వతత్త్వ నిర్వచనములను సుపూర్ణముగఁ దెలిసి కొనవలయునన్న ప్రొఫెసర్ బుచ్చెరుగారి "Aristotel's theory of poetry and fine art" అను గ్రంథమును జదువవలయును.
- ↑ (1) The art may imitate things as they ought to be.
(2) A work of art reproduces its original not as it is in itself, but as it appears to the senses.
(3) A work of art is in idealised representation of human life.....of character, emotion, action, under for me manifest to sense.- Aristotel.
(Butcher's translation.)
- ↑ 'Imitation' so understood is a creative act. It is a Rivalry of Nature, a completion of her unfulfilled purpose, correction of her failures.
_ Butcher.
- ↑ *మతభేదముల వివరములను, వాద ప్రతివాదములను దెలిసికొనఁ గోరువారు కావ్యప్రకాశికను, రసగంగాధరమును జదువవలయును.
- ↑
భావ్యమానో విభావ ఏవ రసః అనుభావ స్తధా,
వ్యభిచార్యేవ తధా పరిణమతి,ఇవి రనగంగాధరమునం దుదహరింపఁ బడినవి.
- ↑ మహామహోపాధ్యాయ వేదము వెంకటరాయశాస్త్రిగారి తర్జుమా
- ↑ All the arts are immoral. To morals belong the lower and less intellectual spheres. Intertics
- ↑ The office of poetry is not normal instruction, but moral emulation; not doctrine, but inspiration right|G. H. Lews right|The Inner Life of Art
- ↑ *Fine art is not real art till it is in this sense free, and only achieves its highest task, when it has taken its place in the same sphere with religion and philosopby.
--Hegel
Philosophy of Fine Art
- ↑ వీరిప్పుడు మదనపల్లి థియొసాఫికల్ జాతీయకళాశాల ప్రిన్స్‌పాల్‌గా నున్నారు
- ↑ వీరికి నోబెల్ వాఙ్మయ బహుమాసము వచ్చినది
- ↑ *జపాసు కవిత్వ పద్య భేదములందు ' హక్కు' అనునది చాల చిన్న పద్యము. అది పదునేడు నేకాచ్క శబ్దముల పరిమితి గలది. ఈ పద్యముల లోని విషయము జపాను దేశస్థులకుఁదప్ప, ఇతరులకు సాధారణముగ బోధ పడనంతటి సంక్షిప్తముగ నుండును. అందువలననే జపాను వాజ్మయ విమర్శకులు 'కవి యెట్టివాఁడొ పాఠకుఁడును నట్టివాఁడుగ నుండవలయును' అని చెప్పుట. 'హెక్కు' పద్యముల రచించుట చాల కష్టమనియు, బాషో అను సుప్రసిద్ధ 'హెక్కు' కవి తన జీవితమునందు మూడు నూర్ల పద్యములను మాత్రమె రచింపఁగలిగెననియు, యోన్నెగూచి తెలిపియున్నాఁడు. విషయముఁ దెలుపుట కొక ఉదాహరణము ననువదించితిని;
కాలిపోయెసు శాల; రాలెడుపూవు
లెంత నిశ్చలశాంతి నెసగెడు నిపుడు!తనయిల్లు కాలిపోవు నమయమున రాలెడుపూవుల నిశ్చలశాంతిని డమనింపఁగల కవి మనోవస్థయే యీ పద్యమునందలి విశేషము.
- ↑ ఆ నాటకము పేరునుగుఱించి నాకు సంశయము గలదు, నుమతి యని జప్తి, కవిపేరును మఱచిపోతిని.
- ↑
- నాటకము నాయొద్దలేదు. జ్ఞప్తియున్నటులు వ్రాయుచున్నాను
- ↑ ఇది నాటకరచనకు సంబంధించిన విషయము, “ఇందుకు నటకులు బాధ్యులుకారు. నాటకలక్షణమునకు సరిపోవునదియు తమ ప్రతి.భను జక్కగఁ బ్రకటించుకొసుటకు అనువైన పాత్రపోషణము కలదియునగు నాటకమును నటకులు ప్రదర్శనమున కేర్పఱచుకొనవలయును. కాని యిప్పటినటకులపద్దతి వేఱుగ నున్నది. ఏ నాటకములోఁ బాటలు పద్యములు మెండుగనుండునో అదియే యుత్తమనాటకమని వారి యభిప్రాయము; అట్టినాటకములవలన నటకులకు వచ్పుకీర్తి నాట్యపరమైనది కాదు, గానపరమైనది
- ↑ ఒకరాజునకు ఒకరైతు నిమ్మపండును దెచ్చి బహుమతిచేసెను. దానిని జూచుచుండిన మఱియొకఁడు పొడవాటి చింతాకాయను దెచ్చి రాజునకు సమర్పించెను , రాజు చిఱునవ్వుతో "ఇదియేమి బహుమాన ?" మని ప్రశ్నించెను. అందున కాతఁ డిట్లు జవాబు చెప్పెను, “లావువాసి పొడుగులో నున్నది. పులుసునకు. దానమ్మా మొగుడు,”
- ↑ గూడూరులో సబ్‌రిజిస్ట్రారుగా నుండిన నీలం గోవిందరాజులు నాయుడుగారు, బి, ఎ., బద్వేలియందున్నప్పుడు ఆసరస్సును దర్శించిరని నాతోఁజెప్పిరి. వారియొద్ద పెద్దన వంశవృక్షముకూడ కలదు. ఈ నాయుడుగా రిప్పుడు స్వర్గస్థులైరి.
- ↑ 1935 మేనెల 5 తేదికి ముందు నెలనాఁడు.