Jump to content

కవికోకిల గ్రంథావళి-4/తెలుగు కవితలో క్రొత్త తెన్నులు

వికీసోర్స్ నుండి






తెలుగుకవితలో క్రొత్తతెన్నులు

తెలుగు కవితలో క్రొత్తతెన్నులు

ఈ వ్యాసము రెడ్డిగారి అసంపూర్ణ రచన. సాహిత్యాభిలాషులకు వుపకరించునను వుద్దేశ్యముతో ఈ సంపుటిలో చేర్చినాము. -సం.)

పూర్వకాలమున మానవ సంఘమునందు మార్పులు చాల ఆలస్యముగ జరుగుచుండినవి. దేశములకు అన్యోన్య సంబంధము పరిమితముగా నుండుటయే దీనికి కారణమై ఉండవచ్చును, సంఘమున కలుగు మార్పులు వాఙ్మయమున కూడ కలుగుట సహజము. ఈ కాలమున పరదేశ గ్రంథ బాహుళ్యమువల్లను వార్తాపత్రికల మూలమునను మార్పులు అనతికాలమున జరుగుచున్నవి. ఈ మార్పులు అనుకూలములా? ప్రతికూలములా? అనిగాని ఆవశ్యకములా? కావా! అనిగాని యోచించుటకుకూడ తడవులేదు. సుడిగాలిలో తగులుకొన్న యెండుటాకువలె మన సంఘము గింగిరీలు కొట్టుచున్న ది. పరదేశమున మ్రోగు ప్రతిధ్వనికిని ఇచ్చట ప్రతిధ్వనులు పుట్టుచున్నవి.

జీవవిలసనము ఉన్నప్పుడు కదలిక ఉండుట స్వాభావికము. ఈ కదలిక రెండు విధములు. సోపానములను ఎక్కు కదలిక యొకటి; దిగు కదలిక మఱొకటి. మన వాఙ్మయ ప్రపంచమున నేడు జరుగుచున్న మార్పులు ఏ కదలికకు సంబంధించినవా అని నిర్ణయించుట అంత తేలికగా కనిపించుట లేదు. అయితే, కాలము మాత్రము అన్నిటిని తూర్పార పట్టును. పొల్లుగింజలు చెత్తా చెదారము గాలికి ఎగిరిపోవును. గట్టిగింజలు మాత్రము నిలిచి ఉండును, ఇది మానవులకు కొంత సంతృప్తి.

ప్రాణములేని యంత్రమునందు ఆజ్ఞాతృణీకరణము శాసనోల్లంఘనము లేదు. ఒక్కసారి తాళము త్రిప్పిన గడియారము ఏమీ మార్పులేక 24 గంటలు నడచును. ప్రాణముకలిగిన జంతువులో ఇటువంటి యాంత్రిక ప్రవృత్తి లేదు.

నిర్బంధ విమోచనము భావదాస్య విముక్తి కలిగిన ప్రథమ దశలో, స్వాతంత్ర్యము విశృంఖలత్వముగ భావింప బడును. విశృంఖలత్వము నాగరిక స్వాతంత్ర్యము కాదు. అది నయాగరా ప్రవాహ పాతమువంటి అసంయమిత శక్తి. దానిని నియమబద్దము కావించినప్పుడే జనోపకారి యగును.

స్వాతంత్ర్యము నియమరహితమైనది కాదు, ప్రజూ ప్రభుత్వము (Democracy) శాసనబాహ్యమైనది కాదు. రెంటికిని నీతులు నియమములు బాధ్యతలు కలవు.

మానవుడు బహువిధములైన భోజన పదార్థములను జీర్ణించుకొని వానికంటె భిన్న మైన తన శరీరమును పోషించు కొనునట్లే ఒక జూతికూడ ఇతరదేశ నాగరకతలలోని ఉత్తమ ధర్మములను తనలో జీర్ణింప జేసుకొని సాంఘిక శరీరమును పెంపుచేసుకొను చున్నది. తన దేహతత్త్వమునకు వికటించిన పదార్దములను వెడలగ్రక్కు చున్నది. ఒకప్పుడు ఇతర దేశములకు జాతులకు వాని పరిస్థితులకు అనువైన వెన్నో మనకు సరిపడకపోవచ్చును. ప్రతి జాతికి ఒక జాతీయ వ్యక్తిత్వమున్నది. జాతీయ సంప్రదాయములలో వేరు నాటు కొననిదే ఏదైనను చిర కాలముండదు.

1914 వ సంవత్సరమున ప్రారంభమైన ప్రపంచ యుద్ధము ముగిసిన తర్వాత యుద్ధ విచ్ఛిన్నమైన యూరపు దేశమునందు ఎన్నో వాఙ్మయోద్యమములు, పుట్టగొడుగులవలె పుట్టి పరిస్థితులు కొంచెము మారునప్పటికి, నశించినవి. వాని ప్రతిధ్వనులు మన దేశమునకూడ వినబడినవి.

చిత్ర లేఖనమున 'క్యూబిజం' (Cubism) అను పద్దతి ఫ్రాన్సు దేశమున పుట్టి ఇంగ్లాండు జర్మనీలకు వ్యాపించినది. 'క్యూబిజం' అనగా మనము చూచు ప్రతివస్తువు Cubes గా అగపడునట్లు చిత్రించుట, ఇది మన యింద్రియజ్ఞానమునకు అనుభూతికి అతీతమైనది. జగదేకమైన భావమును, సార్వజనీ నానుభూతిని కవిగాని చిత్రకారుడుగాని వ్యక్తిగతమైన భావ సౌందర్యముతో మేళవించి అందరకు రుచించునట్లు ఆకృతి బద్దము చేయగలడు. కాని తనకు మాత్రమే అనుభూతమైన దానిని ఏ కవికూడ జగదేకము చేయలేడు. ఈ క్యూబిజము గతి కూడ అట్లే అయినది.

అస్టి గ్మాటిజం (Astigmatism) అను కంటిరోగము అందరకు లేదు. ఆ జబ్బు ఉండువారికి రస్తా హెచ్చు తగ్గులుగా కనబడును. అది రోగమని తెలియక , స్పర్శేంద్రియ జ్ఞానము కూడ లేనియెడల అట్టివానికి ప్రపంచము మిట్టపల్లములుగా కనబడును. అట్టివాడు చిత్రలేఖకు డయ్యెనేని తన చిత్రములలో సమతలముండదు. అట్టి చిత్రములను మనము మెచ్చు కొన జాలము. అది క్రొత్త ఉద్యమము కావచ్చు, కాని ఆ చిత్రములను మెచ్చుకొనుటకు మనకు కూడ అస్టిగ్మాటిజం అను కంటిజబ్బు రావలయును. కొన్ని ఉద్యమములు ఇటువంటి అసామాన్య ప్రకృతులకును కాలమునకును సంబంధించినవి. Cubism, Dadaism, Futurism, Impressionism అను చిత్ర లేఖన పద్దతులు కూడ abnormal psychology కి సంబంధించినవే. యుద్దమందు చూచిన రక్తపాతము, ఘోరత్వము మృత్యువు ఈలాటి మార్పులకు కారణమై యుండును. True, it is a ghostly Company: Expressionistic cubistic shapes, the forms of Futurism, moving and caught in movement: Pictures of horror and protest which have arisen out of the great Death of war.

జర్మనీలో ఈ చిత్రముల సంత పెట్టినప్పుడు దానిని బహిరంగపఱచుచు అధ్యక్షుడు ఇట్లు చెప్పినాడు: Cubism, Dadism, Futurism, Impressionism and the rest have nothing in common with our German people For all these notions are neither old nor are they modern. They are simply the artificial stammering of people whom God has denied the boon of genuine artistic talent and given instead the gift of prating and deception ఈలాటి విపరీత కళాచాపల్యము వారికే నచ్చలేదు. ఇక అటువంటి పరిస్థితులు లేని మనకెట్లు సంతోషము కూర్చును.

ప్రస్తుతపు మహాసంగ్రామము ముగిసిన తర్వాత కూడ శ్మశానవాటికయైన యూరపునందు విపరీతోద్యమములు పుట్టవచ్చును. ఈ యుద్ధమునందు ఇండ్లు ఆస్తులు ప్రాణములు బాతుల స్వాతంత్ర్యము నాశనమైనవి. వాఙ్మయము భగ్నము కాలేదు. అది మాత్రము ఎందుకు భగ్నము కాకూడదు అను భావములుగల ఒక వాఙ్మయ హిట్లరు పుట్టి యూరఫున ఒక విపరీతోద్యమము లేవదీయునేని దాని క్రొత్తందనము వలన మన దేశమునందుకూడ ప్రతిధ్వనులు పుట్టును. ఎద్దు ఈనినదనిన గాటకట్టివేయుమని చెప్పుటయేగదా యిప్పటి మన పరిస్థితి. జాతీయగౌరవము జాతీయ వ్యక్తిత్వము పరిస్పు టము కానంతవఱకు మనకీ యనుకరణ దురవస్థ తప్పదు, '

అయినను, కాలప్రవాహమున మార్పులు అనివార్య ములు. ఆంధ్రుల సాంఘిక జీవనమునందు వాఙ్మయమునందు కొన్ని మార్పులు కలిగినవి. వీరేశలింగంపంతులుగారు ఇంగ్లీషు రచనా మర్యాదలను తెలుగులో ప్రవేశపెట్టిరి. గురిజాడ అప్పారావుగారు గిడుగు రామమూర్తి పంతులుగారు వ్యావహారిక భాషోద్యమమునకు మూలపురుషులైరి. ఇట్టి మార్పులు నేటికాలపు తెలుగు కవితలో పొడచూపినవి. విస్మృతమైన పల్లెపదాలు మరల చెలామణియైనవి. ద్విపదకు గౌరవము కలిగినది. క్రొత్తఛందస్సులు పుట్టినవి. "ఆంగ్లేయుల కావ్య మర్యాదలు ఆకృతులు మన కావ్య పద్దతులందు కొన్ని మార్పులు కలిగించినవి. ఖండకావ్యములు ప్రముఖములైనవి. కవితావస్తువునందు మార్పు కలిగినది. నవలలు ఉపకథలు పుట్టినవి.

ఆఫీసుకు పోవునప్పుడు కోటు బూటు హ్యాటు తగిలించుకొని యింటికి వచ్చినతర్వాత ఎప్పటివలె ధోవతి తుండు గుడ్డతో ఉండినట్లే ఈ మార్పులన్నియు బాహిరములే, కవితాంత రంగమున, కవితా మూల సూత్రములలో మార్పులు కలుగలేదు. ఏలయనగా అవి సార్వకాలీనములు, సార్వ లౌకికములు.

ఈ మూల సూత్రము లెట్టివి ?

యథార్ధమైన కవిత్వమునకు అనివార్యముగా ఛందస్సు అనుగతమౌను.

కవి ప్రతిభయే కవితకు ప్రాణము.

కవితా ప్రయోజనము సద్యఃపర నిర్వృతి. తక్కిన ప్రయోజనములు ఆనుషంగి ములు.

కవితయందు రసరామణీయకములు ప్రథానములు. తక్కినవి పోషకములు.

రసప్రతిబంధకములైన హేతువులు కావ్యదోషములు,

కవితాకళ జకదేకమైనది కావున దాని నిర్మాణ సూత్రములుకూడ జగ దేకములుగ నుండును. ఈమూల సూత్రములకుకూడ ఈనాడు చేటుమూడు అవస్థ వచ్చినట్లు సూచనలగపడు చున్నవి.

రాజకీయ విషయములలో Democracy ప్రవేశించి జనసామాన్యమునకు మేలుచేసినది. అట్లే వాఙ్మయములోనికినీ ప్రవేశించినది. ఉపకారమునకంటే అపకారమే చేసినది, ఎందుచేత ? రాజకీయమైన Democracy నియమబద్దము. వాఙ్మయములోని Democracy విశృంఖలము. ఆ డెమొక్రసి. తప్పుత్రోవ తొక్కినప్పుడు అధికారముగల ప్రజా ప్రతినిధుల చేతిలో కళ్ళెమున్నది. సరియైనదారికి త్రిప్పగలరు. వాఙ్మయములోని డెమొక్రసి తప్పుదారి పట్టినప్పుడు దానిని మరలించు కళ్ళెము చేతపట్టుకొన్న ప్రతినిధులు లేరు. అందువలన ఈ డెమొక్రసీ యింతవరకు విశృంఖలముగానే ప్రవర్తించుచున్నది.

తెలుగు కవితలో నేడుజరుగు మార్పులలో ఛందోబద్దముకాని వచనపు తుంటలను వ్రాసి దానిని కవిత్వమని నామకరణము చేయుట ఒక పెద్దమార్పు. ఈ నావెల్టి తెలుగులో క్రొత్తగా ప్రవేశించినది. ఈ కవిత్వము వ్రాయువారు, ఏ డెనిమిదిమంది నవకవులు. మనదేశములో ఈకవిత్వము కూడ ఒక ప్రతిధ్వని. ప్రతిధ్వనులు ప్రతిఫలించిన కాంతులు సారభూతములు కావు. అనుభూతి జన్యములును కావు.

అమెరికా దేశమున Walt Whitman అను నతడు Leaves of grass అను గ్రంథమును రంచిచెను. దానికి Verse libre అని పేరు పెట్టినారు. అనగా Free verse __ ఛందోబద్దముకాని పద్యము. ఈ పద్యములు అమెరికాలోకంటె ఇంగ్లాండులో ప్రజల మనస్సుల నాకర్షించినవి. కారణమేమనగా, వానిలో ఛందస్సు లేనందువలనకాదు, అమెరికా దేశస్తుల Democratic భావములు సర్వమానవ సౌభ్రాత్రము విశాలమైన Cosmopolitanism ఆపద్యములలో అద్దమునందు ప్రతిబింబమట్లు ఇంగ్లీషువారికి గోచరించినది. ఆ భావములు అందర హృదయములను ఉద్దరింపగల సమర్థములు. నేనా గ్రంథమును మొట్ట మొదట చదివినప్పుడు ఇటువంటి మహోన్నత భావములు ఛందోబద్ధమైయుండిన మఱెంత రమణీయముగా నుండెడివో యని తలంచితిని. Walt Whitman రచించిన కొన్ని పద్యములు లయాన్వితమై ఛందోబద్ధ పద్యములకు దాదాపునకువచ్చుచున్నవి. హృదయములోని లయను మొదలంట యెవరు గోయగలరు? ఛందస్సునందు లయపుట్టును. లేక మనసులోని లయవలన ఛందస్సు పుట్టును. లయ కృత్రిమముగా కల్పించుకొన్న కవితోపకరణముగాదు. అది సహజము. కావుననే జగదేకము ప్రపంచములోని అన్ని జాతుల భాషలలోను అక్షరబద్ధము కాని అనాగరిక భాషలందును కవిత్వము ఛందోబద్ధముగానే ఉన్నది. ఈనియమము స్వాభావికము కానియెడల జగదేకత్వము సిద్ధింపదు

ఇప్పటి పదార్ధ విజ్ఞాన శాస్త్రజ్ఞులు కూడ Radiation, matter అనియు స్టూలముగా మన కంటికి కనబడు వస్తువులు కూడా bottled up radiations అనియు చెప్పుచున్నారు. ఈ radiation కాలావకాశ బద్దములైన తరంగములుగ ప్రసరించును. ఈ అలలు లయాబద్దములు. ఈ ప్రకృతియే లయా బద్దము లయసహజము. లయయొక్క శ్రుతిసుభగత్వమే ఛందస్సు,

కవితా విషయములందు మనలాక్షణికులకును యూరపియన్ విమర్శకులకును గమనింపదగిన భేదములు లేవు. Poetry is the rythmic creation of beauty అని ఆలన్ పో అన్నాడు. Musical thought అని కార్లయిలు చెప్పినాడు. There is something magical in rythm. It even makes us believe that the sublime lies within our reach అని జర్నను కవి గెతె లయా సౌందర్యముల సాహచర్యమును వివరించి . నాడు. ఛందస్సు యదార్థమైన కవికి ఆటంకము కాదు. సహాయకరమె. హృదయములో నేమూలనో దాగియున్న భావములు ఉద్రిక్తములయి ఉత్తేజితములయి లయాశ క్తి మూలమున ఉత్పతన క్షమములు కాగలవు. 'A metrical garb has in all languages been appropria-ted to poetry. It is but the outward development of the music and hormony within. The verse far from being a restraint on the true poet, is the suitable index of his sense and is adopted by his free and delibarate choice' అని చఁదస్సునకు కవి మనసులోని లయాశబ్ద సారస్యములకును గల అవినా భావ సంబంధమును Newman గారు వచించినారు.

ఛందస్సు లేని పద్యము విన్నప్పుడు ఉప్పు లేని చప్పిడి కూరతో అన్నము తిన్నటులుండును. శ్రుతిరంజకత్వము అభావమగును. ఆనందదాయక హేతువులలో ఒకటి లుప్తమయి మన ఆనందము పరిపూర్ణముకాద., ఇంకను వీలైన యెడల ఆనందహేతువులను చేర్చుట న్యాయముగాని ఉన్న వానిని ఊడబెరుకుట సమంజసముకాదు. అపని చేయుటకు కవులే అవసరములేదు. ఏ అసమర్థుడు కూడ చేయవచ్చును.

రాయప్రోలు సుబ్బారావుగారు నవ్యకవులకు ప్రతినిధిగ రమ్యాలోకమను కావ్యనియమ గ్రంథమును రచించిరి. దానిలో

ప్రాతవైనంతనే త్యజింపరు: నవీన
మైనమాత్ర వరింపరు; ప్రియములై న
హృదయ సేవ్యమానము లైనవెల్ల స్వీక
రించి భావాంబరమలంకరింతు రర్థి

.

చిర యశః స్థాయిగొనిన ప్రాచీన సుకవి
వాఙ్మయమునను ఆకర్షవంతమయిన
రమ్యభావకలాపముల్, శ్రావ్యమైన
శబ్దరీతి విధానముల్ సంగ్రహింత్రు.

శీలమట్టుల నౌచితి చెదరనీక
అహివిధాన అశ్లీల మనాదరించి
ప్రేమమంత్ర మహోపాసనామయులగు
నవ్యుల కుపాదియయ్యె సౌందర్యమొకటె

ఈ రమ్యాలోకము సుబ్బారావుగారు ఉద్దేశించిన నవ్య కవుల Manifesto గా కనబడుచున్నది. శ్రీశ్రీగారు కూడ వారు ఉద్దేశించ కనకవుల పక్షమున మరొక Manifesto ప్రకటించినారు. ఇది 'ఫిడేలు రాగాలడజన్'కు Intro గా ఉన్నది. Intro అంటే Introduction; ఈ రాగాలడజన్ అనునది ఛందోబద్దముకాని పద్యముల సంపుటి. దీనిని రచించిన కవి మావాడె. Intro లో సారాంశ మేమనగా :

ఒక మాటకు ఒక అర్థం అదీ న్యాయం. కాని యీ ప్రపంచంలో చూడండి. ఒక మాటకు పది అర్ధాలు. ఒక అక్షరానికే లక్ష అర్ధాలు. ఇక రెండో కొసను ఒక అర్ధానికే కోటి పదాలు. ఈ అర్థాల నిరంకుశత్వం భరించలేడు నవకవి. వ్యాకరణం మాత్రం ? వాక్యానికి కర్త కర్మ క్రియలు విధిస్తారుకాదూ. వీటికి నవకవి విడాకులిస్తున్నాడు. కర్తలేకుండా ఒక క్రియమాత్రం నిరంకుశంగా విహరిస్తుంటే కొందరు కళ్లు పొడుచుకొంటున్నారు. కాని కవి సర్వతోముఖ స్వాతంత్ర్యదూత , స్వేచ్ఛాదాత. విభక్తి విశృంఖ లంగా షికారు పోవచ్చు. ప్రతిఫలం విచిత్ర సౌందర్యం. విచిత్రమే సౌందర్యం - సౌందర్యమే విచిత్రం.

ఛందస్సుల చండ శాసనానికికూడా కాలం వెళ్ళి పోయింది. కవి హృదయంలో రాగాలపస ఎట్టి తీగలు సాగితె అదే గీతానికి ఆధారం నిర్ణయించాల. నవకవికి అనుకరణ అసహ్యం. ఇవన్నీ ఋణపక్షాన నవకవుల తిరుగుబాటు. వారు సాధించిన ధనం ఏమైనా ఉన్నదా అని ప్రశ్నిస్తారా చదవండి ఫిడేలు రాగాలడజన్ .

శ్రీశ్రీగారు ఉద్దేశించిన నవకవులు ఒకరిద్దరు తప్ప శ్రీ శ్రీ గారితో సహ నాకు మిత్రులు. వారి సౌజన్యముపైన నాకు నమ్మకము కలదు. ఒక వేళ వారు “వచన పద్యాలనే దుడ్డుకర్రలతో పద్యాల నడుములు విరుగ దంతాము” అని నిరాఘాటముగా చాటినప్పటికిని వారిలో ఎవ్వరిలోను ఇటువంటి గడుసుదనము నాకు కనిపించలేదు. అందుచేత అభిప్రాయ భేదములు నాగరకుల స్నేహమునకు భంగము కలిగించవని నానమ్మకము.

రాయప్రోలు సుబ్బారావుగారి Manifesto లో సిద్దాంతీకరింపబడిన కొన్ని విషయములను గురించి నాకు అభిప్రాయ భేదము లున్నప్పటికిని కవితావిషయమై వారు కావించిన నిర్ణయములను గురించి నాకు భిన్నాభిప్రాయము లేదు. అవి సర్వాంగీకార పాత్రములయి సాంప్రదాయికముగ అలవాటులోనున్న నియమములె. కవిత్వమున రస రామణీయకములు ఔచిత్యము ఉండ నక్కరలేదని యెవరు చెప్పరు. శ్రీ శ్రీ గారి నవకవులకంటె సుబ్బారావుగారి నవ్యకవులె తెలుగు దేశమున ఎక్కువగ నున్నారు. అందుకు వారి రచనలే సాక్షులు.

శ్రీశ్రీ గారి Intro లో ప్రతి వాక్యము విమర్శకు పాత్ర మగునంతటి బలహీనముగా నాకు గోచరించినది. ఒక అక్షరమునకు లక్ష అర్థములుండిన కవులకు, ఏమి యిబ్బందిలేదు. ఒక మాటకు పది పర్యాయపదములుండిన ఏమీ చిక్కు లేదు. అవి అన్నియు వాడుకలో రూఢియైనవి కావు. నానార్థ రత్నమాలను ముందు పెట్టుకొని ఏకవి కవిత్వము వ్రాయడు. పూర్వము శ్లేష కావ్యములు వ్రాయుదినములలో అట్టి నిఘంటువులు ఉపయోగపడి యుండవచ్చును. ఇప్పుడెవ్వరు శ్లేషకావ్యములు ద్వ్యర్థి కావ్యములు వ్రాయుటలేదు. ఆ ప్రస్తావనయే అనవసరము,

నిఘంటువులో ఉన్నదన్న మాత్రమున కవి ఆ పదమును గ్రహింపడు, కవి గ్రహించుపదము శ్రవణ సుభగము గను తన భావము ప్రకటించునదిగను ఉండును. కావుననే తిక్కన “కావ్యంబు సరసులైన కవుల చెవులకు నెక్కినగాని నమ్మ డెందు పరిణతిగల్గు కవీశ్వరుండు” అని చెప్పెను. దీనిలో శబ్దసారళ్యము సౌకుమార్యము ధ్వనించుచున్నది. చెవికికూడ ప్రాధాన్యము. పింగళి సూరన “పొసగ ముత్తెపు సరుల్ పోహళించినలీల దమలోన దొరయు శబ్దములు గూర్చి” అని word harmony సూచించినాడు. నానార్థ నిఘంటువు లుండినందువలన, ఆంధ్ర మహాభారతము భాగవతము మున్నగు గొప్ప గ్రంథములను రచించిన పూర్వకవు లకుగాని నేటి కవులకుగాని ఏలాటి యిబ్బంది కలుగుట లేదు. నవకవులకు మాత్రము ఈ బాధ యెందుకు కలుగవలయను?

ఒక వేళ నవకవులు నానార్థ రత్నమాలాది నిఘంటువులు మునిసిపాలిటీవారి చెత్తదిబ్బల స్టోరు అని అనుకొను పక్షమున ఆచెత్తదిబ్బలు మనము నడచు రాజమార్గమున లేవు. వానిని వెదకుకొని పోవువారికే కనబడును. ఆ చెత్త దిబ్బల భారము ఏకవియు మోయుట లేదు. అందులో నవకవులు తాము మోయుచున్నామనియు భరింపలేమనియు అనుకొందురేని అది వారి భ్రాంతి.

వాక్యమున కర్త కర్మ క్రియల అనుబంధానికి నవకవి విడాకు లిస్తున్నాడు. ఒక క్రియమాత్రం నిరంకుశంగా విహరిస్తే కొందరు కళ్ళు పొడుచుకోవడం ఎందుకని శ్రీ శ్రీ గారి ప్రశ్న, చిన్నయసూరిగారి బాల వ్యాకణాన్ని దండిస్తామని నవకవుల ప్రతిజ్ఞ . చిన్నయసూరిగారిని విమర్శింపవలసిన భాగములు వేరేవున్నవి. అవి కర్త కర్మ క్రియలలో కాదు. ఆ పని దక్షులైన పండితులు పూర్వమే చేసియున్నారు.

మనుష్యులు అన్యోన్యము మాటలాడుకొనుటకు తమ భావములను వెల్లడి చేయుటకు భాష పుట్టినది. మనము వాక్యములతో మాటలాడుకొందుము. ఒక వాక్యమునకు కనీసము ఒక కర్త ఒక క్రియ వుండుట అవసరము, ఈ నియమము అనుభవ జన్యమైన అక్కరవలన పుట్టినది.

ఒకప్పుడు ఇద్దరు మనుష్యులు మాటలాడు కొనునప్పుడు ఒక క్రియనే ఉపయోగించవచ్చును. “ఏంరా వస్తావా ?” అంటే “వస్తున్నారా” అనవచ్చు. అప్పుడు కర్త తేలికగా ఊహించుకొనబడును, మూడవ వానిని గురించి చెప్పునప్పుడు “వస్తాడురా" అని అంటే “ఎవడురా " అని రెండవవాడు ప్రశ్నింపవలసి యుండును. రాముడు రా" అని మరల వీడు జవాబు చెప్పవలసియుండును. ఇట్టి సంశయము, కాలహరణము, ఇబ్బంది తొలగించుటకే ఒక వాక్యమున ఒక కర్త ఒక క్రిఁయు అవసరమని చెప్పిరి. ఈ నియమము మన భాషకే కాదు. అన్ని భాషలలో నున్నది. ఈ నియమము ప్రాచీనము కాబట్టి నవకవులకు గ్రాహ్యముకాదని చెప్పుటకు వీలు లేదు. కొన్ని నియమములు మనము వదలదలచుకొన్నను అవి వదలవు. ఈ నియమమును బహిష్కరించి శ్రీశ్రీ గారి కోరిక ప్రకారము ఒక్క క్రియకే యేకచ్చత్రాధిపత్యము కట్టిపెట్టిన యెడల మన భాష మూగ చెవిటివారి భాషయగును. ఇది క్రొత్త ఆవిష్కరణముకాదు. ఒక గొప్ప సిద్ధియుకాదు.

కవులకు భాషను పొదుపుచేయు గుణమున్నది. కవి ఎన్ని తక్కువ మాటలతో క్లీష్టాన్వయ దోషము లేకుండ చెప్పగలడో అన్ని తక్కువ మాటలతో తన భావమును వెల్లడించును. అట్లు చేయలేనియెడల కవిదే దోషము. ప్రకరణమునుబట్టి కర్తనుగాని కర్మనుగాని ఊహించుకొనుట సులువైనయెడల వానిని పరిత్యజించును. “వచ్చెడువాఁడు ఫల్గుణుఁడవశ్యము గెల్తుమనంగరాదు” అని తిక్కనవ్రాసెను. గెల్తుము అను క్రియ కర్మను అపేక్షించుచున్నది. ఎవరిని గెల్తుము? పాండవులను. తిక్కన పాండవులను అని వ్రాయ లేదు. ప్రకరణమునుబట్టి ఊహించుకొనవచ్చును. పూర్వము సిద్ధమైయుండినవి చక్కగ తెలుసుకొనక పోవుటచేత నవకవులకు, ఇట్టివి అపూర్వసిద్ధులుగ తోచును, ఇంతయేల? శ్రీశ్రీగారు ఎంతవరకు తమ వాదమును ఆచరణలో పెట్టగలిగిరో తెలుసుకొనుటకు వారు రచించిన intro ను ఉదాహరణముగ తీసుకొనవచ్చును. వారు తమ వాదము ప్రకారము పీఠిక యంతయు క్రియలతో నింపియుండిన ఇతరులు విమర్శింపవలసిన యవసరము ఉండియుండదు. ఏలయన ఆ భాష మనుష్యులకు అర్థము కాదు. శ్రీశ్రీగారుకూడ విభక్తి విశృంఖలముగా షికారు పోజాలనందుకు సంతోషము. విభక్తులు లేని వాక్యము అన్యోన్యసంబంధము లేని పదసమూహముగ తోచునేగాని భావము తెలుసుకొనుట దుర్లభము. తామే అనుసరింపలేని తియరీలను ఇతరులపై పారవేసి వారిని చీకాకుపెట్టుట యెందుకా అని నాచింత. అయితే దీనికొక సమర్దనమున్నది. నవకవులు, తమ కవిత్వమునకు తమకు ఏలాటి సంబంధము లేదను సమ్మకముకలవారు కావున వారి తియరీలు ఒక వంక వారిరచనలు మరొకవంక నడువవచ్చును,

“కవులు స్వాతంత్ర్యదూతలు స్వేచ్చా దాతలు”, నిజమే. నిరంకుశాః కవయః అనే పలుకుబడి పూర్వమునుండి వ్యాప్తిలోనున్నది. అయితే ఒక్క భేదము మాత్రము కనబడుచున్నది. పూర్వులది నియమబద్ధమైన స్వాతంత్ర్యము. మనవారిది అరాజకమైన విశృంఖలత్వము, కాళిదాసువంటి ప్రతిభాసంపన్నుడైన మహాకవికికూడ “ప్రాంశు లభ్యే ఫలే లోభా దుద్బాహురివవామనః” అని అడకువచేత తన గొప్పతనమును తెలుపుకొనగా, ఒకటిన్నరపేజి చక్కగా వ్రాయ లేని మాబోటివారము దుడ్డుకర్ర లెత్తుకొని బయలుదేరి నడుములు విరుగదన్తామనడము, అహంభావ కపులమని కంచు గంట మ్రోగించడము - ఇదీ ఒక నావల్టీగానే కనపడు చున్నది. వారి సిద్ధులను విమర్శింతుమేని మిగులునది అహంభావమే. తక్కినది అభావమే.

నవకవికి అనుకరణ అసహ్యమని వారన్నారు. అనుకరణము నిస్సారమని అందరు ఒప్పుకొనతగిన విషయము. కాని వీరికి మనదేశపు కవులను అనుసరించడము అనుకరించడము అసహ్యము. పరదేశ కవుల ననుకరించడము పరమార్ధము. ఈ వచన పద్యములు Walt Whitman పద్యముల కనుకరణము కాదని యెవరు చెప్పగలరు. -

ఛందస్సుల చండశాసనానికికూడా కాలం వెళ్లి పోయిందని శ్రీ శ్రీ గారు వ్రాసినారు. ఇది కేవలం భ్రాంతి. పది సంవత్సరములకు పూర్వము భావకవి అని అనిపించుకొనుట ఒక గౌరవము. నాడు భావకవులమని యనుకొన్న వారుకూడ నేడు. ఆపేరువహించుటకు సిగ్గుపడు చున్నారు. ఇప్పుడు ఆ నా వెల్టీ పోయినది. అంతే యీ నవకుల వచనపద్యా ల నా వెల్టీ కూడ, తెలుగుజాతి పరాయిది కానంతవరకు, తెలుగువారి హృదయమున రసజ్ఞత నశించనంతవరకు, తెలుగువారి సాంఘిక జీవన ప్రవాహమునకు గట్లుగా ఆంధ్ర మహా.భారతము భాగవతము రామాయణము జీవించి ఉండునంతవరకు తెలుగు కవిత్వమునకు ఛందస్సునకు విరహముకలుగదు. ఎన్ని రాజ్యములు పుట్టిచచ్చినవి? ఎందరు రాజులు గతించినారు? ఎన్ని నాగరకతలతో మనకు సంబంధము కలిగినది? అయినప్పటికిని ఇప్పటివఱకు తెలుగువారము తెలుగువారము గానే ఉన్నాము, భాగవతము చదివినప్పుడు ఒడలు పులకరింపని ఆంధ్రు డుండడు. భారతము విని తలయూపని తెలుగువా డుండడు ఇవి మన జాతీయసిద్ధులు. వీనిముందు తక్కిన నా వెల్టీలు హనుమంతుని యెదుట కుప్పెగంతులు.

నారాయణబాబుగారు తాము రచించిన వచన పద్యములను ఒకతూరి వినిపించిరి. వానియందు ఈ ఫిడేలరాగాల డజన్‌లో లో వలెకాక, ఉన్నతములైన భావములుండినవి. ఆయనకు ఏపద్యమైనను చక్కగా చదువగల శక్తి కలదు. ఆ పద్యములందు ఒక దానితో నొకటి పొందిపొసగని లయా ఖండములు (Mosaic of rythm) వినిపించినవి. ఛందస్సును త్యజించితిమంటిరే వీనిలో లయాఖండములు గోచరించుటకు కారణమేమని యంటిని. (వానిలో ద్విపద పాదములు, గీత పద్యముల తుంటలు కనబడినవి). ఇవి ఆకాంక్షితముగ పడినవని వారనిరి.

గుడిపాటి వెంకటచలంగారు రాగాలడజన్ పై అభిప్రాయము ఒక వచన పద్యమున వ్రాసిరి. ఆ పద్యము చదివినప్పుడు, . వీరు చందోబద్ధముగ వచ్చు కవిత్వమును కేవలము నవత్వముకొరకు అవయవ విచ్చేదము చేసియుందురని నా యూహకు తట్టినది. నా యూహ యదార్థము కాకపోవచ్చును. ఈ నిదర్శనములు గమనింపుడు.

వేయి కన్నీటిచుక్కల వేడిగాను.
చెవుల ఘోషించి కలవరపరచగలవు,

ఇవి రెండును పరిపూర్ణముగ తేటగీతి పాదములు.

వాడిఅయినట్టి కొనగోళ్ళతోడ (నొక్కి)
చురుకుమనునట్లు పెట్టిన (షోకులాడి)

మొదటి పాదమున 'నొక్కి' అనియు రెండవ పాదమున 'షాకులాడి' అని చేర్చిన తేటగీతి పాదములగును.

నూరువెక్కిరింపులనాలికల్ (గవెలికి)
దిక్కుదిక్కుల పకపకల్ (తేజరిల్ల)

ఈ పాదములలో మొదటి దానికి 'గ వెలికి' అనియు రెండవ దానికి 'తేజరిల్ల' అని చేర్చిన తేటగీతి పాదములగును,

వీరి హృదయములలో దేవుడు ప్రసాదించిన లయా శక్తి ఉన్నది. నవత్వముకొరకు సహజశక్తిని అడగ ద్రొక్కి, పరిపూర్ణమైన ఆకారమునందు అవయవములు భేదించి వీరు సాధించిన ఆ మహాప్రయోజనమేది? ఈ అపకారము వారికే కాదు, లోకమునకు కూడ. ఒక చిత్రమును యిరువయి తుంటలుగ కత్తిరించి చీట్లప్యాకీ కలిపినట్లు కలిపి మరల మేజాపై నెరిపిన ఒక అసంబద్దమైన (Dis - harmonious) చిత్రము కనబడును, ఈ విచిత్ర సౌందర్యమేనా ఛందో వైకల్యమునందు వీరు ఆశించునది !

ఈ నవకవులు రచించు వచనపు తుంటలకు పద్యములని ఎట్లు పేరువచ్చినది? జామెట్రివలన, ప్రోసు పేరాను లయిను ప్రకారము కత్తిరించి వివిధ పరిమితులుగా తుంటలు చేసి, ఒక దాని క్రింద నొకటి అతికించిన ప్రోసు, పోయిట్రీగా మారును. ఇది జామెట్రి కవిత్వము. ఈ కవిత్వమున, తిక్కన చెప్పినట్లు చెవి ప్రథానముకాదు, కన్ను ప్రధానము. ఇది తను భంగమువలన గద్యమూకాదు. ఛందోవిరహితమై దున పద్యమూ కాదు; త్రిశంకునివలె నడుమంతరమున వ్రేలాడుచు రెంటికిం జెడిన రేవడ యైనది.

ఎంతకాలమైనను తెలుగు కవిత్వమునకు ఆ వృత్తాలు ఆ సీస గీత పద్యము లేనా వేరేమీ గతి లేదా యని యందురేని, కలదని నేను మనవి చేయుచున్నాను. క్రొత్త ఛందస్సులు ఆవిష్కరించుకొని కవిత్వము వ్రాయవచ్చును. అవి శ్రవణ సుఖముగా నున్న యెడల నిలిచియుండును. ప్రస్తారము వలన ఎన్ని వృత్తములు పుట్ట లేదు! అవి అన్నీ మన చెవికి రుచించుట లేదు. రుచించినవి మాత్రము నిలిచియున్నవి.

ఆడినదల్లా ఆట కాదు. పాడినదల్లా పాట కాదు. శిల్పముసకు సంయమనము (restraint) అవసరము. వీనియందు అటువంటిది కన్పించదు.

శ్రీ శ్రీ గారు నవకవులు సాధించిన మహాసిద్ధి యని తెలుగుదేశమునకు శిఫారసు చేసిన ఈ ఫిడేలరాగాల డజన్‌ను గురించి రెండు మాటలు, ఆ పుస్తకము చదివినప్పుడు నాకు కలిగిన భావమిది : యౌవన ప్రాదుర్భావ సమయమున కామోద్రిక్తుడయి “కామార్తాహి ప్రకృతికృపణా చేతనా చేత నేషు" అను కాళిదాసు సూక్తికి ఉదాహరణ ప్రాయుడయి వలపు పస్తులతో నవసి మతిచెడిన యువకుని ఉన్మత్త ప్రలాపములు (Mad ravings)గా నాకు స్ఫురించినది. బుర్రా వేంకట సుబ్రహ్మణ్యంగారు చెప్పినట్లు ఒక్క Cleverness ఉన్నంతనే కవిత్వము కాదు.


___________

అభినవాంధ్ర సాహిత్యము

[శ్రీ కొంపెల్ల జనార్దనరావుగారి సంపాదకత్వముస వెలువడుచుండిన “ఉదయిని" పత్రికలో ఈ వ్యాసము ప్రకటింపబడినది. -సం.]

సంషుమునందును వాఙ్మయమునందును మార్పులు అనివార్యములు. అన్యనాగరకతా సంసర్గమను బాహ్య నిమిత్తమువలన మార్పులు అలక్షితముగ తలసూపుచుండును. ఒక వాఙ్మయము యొక్క బాగోగులు, మంచి సెబ్బరలు తెలిసికొనవలయునన్న దానికన్న భిన్న సంప్రదాయము ననుసరించు మఱియొక వాఙ్మయముతో పరిచయము మనకుండవలయును. అద్వైతావస్థయందు తరతమజ్ఞానముండదు. మన దేశీయ వాఙ్మయములన్నియు ఏకసంప్రదాయ బద్దములయి సంస్కృత వాఙ్మయమునకు ప్రతిబింబములుగ నుండినవి.

ఆంగ్లేయుల సంబంధమువలన పాశ్చాత్యనాగరకతతో మనకు పరిచయము కలిగినది. వారి వాఙ్మయము, వారి ప్రకృతి విజ్ఞానము మనదృష్టి నాకర్షించినవి. వారి పరిపాలనా పద్ధతి మనయందు స్వాతంత్ర్యేచ్ఛ పురికొల్పి జాతీయైక్యమును పెంపొందించినది. సంఘమునం దవతరించిన ఈ నూతన స్వాతంత్ర్య ప్రియత్వము రాజకీయ విషయములందే కాక వివిధ సాంఘిక చర్యలయందును తలసూపినది, కట్టు బాట్లకు లోనయి బహిర్వ్యాప్తిని కోల్పోయిన సర్జనశక్తులు నేడు సంకుచితావరణమునుండి వెలి కురికి ఆత్నోచిత కార్యకల్పనకు సిద్ధములైనవి. వాఙ్మయము సాంఘికజీవనముయొక్క ప్రతిబింబమే కావున సంఘమున చెలరేగిన ఈ సంచలనము. ఈ ఆందోళనము, ఈ స్వాతంత్ర్యేచ్ఛ దానియందు మాత్ర మెట్లు ప్రకటితము కాకుండును?

ప్రబంధములలోని పచ్చి శృంగారము నేఁటి యభిరుచులబట్టి మొరటుగ తోచినది అందలి శబ్దలంకారములు, భావప్రేరకములుగాక కేవలము బుద్ధిపరిశ్రమకు వినియోగపడు తెచ్చికోలు అర్థాలంకారములు “intellectual gamnastics అని నిరసింపబడినవి. ఈ యసంతృప్తి ప్రతికూల విమర్శనముతోనే వ్యయమైపోక వాఙ్మయ నిర్మాణమునకు తోడ్పడినది. కందుకూరి వీరేశలింగం పంతులుగారు Vicar of Wakefield, Gulliver's Travels అను ఆంగ్లేయ నవలలను మానాగా పెట్టుకొని తెలుగు నవల రచనకు మార్గదర్శకులైరి. వారు షేక్స్‌పియరు నాటకములను తెనిగించిరి. నాటకములు, ప్రహసనములు, వ్యాసములు, ఖండకావ్యములు, కవిజీవితములు వ్రాసి పంతులుగారు ఆంగ్లేయ వాఙ్మయములోని కొన్ని రచనావిధానములను, సంప్రదాయములను తెలుగులో వెలయించిరి.

వాఙ్మయ రచనలలో కలిగిన మార్పులతో పాటు భాషావిషయములందుకూడ కొంత సంచలనము ప్రారంభమైనది. గ్రాంథిక భాష కృత్రిమమనియు సహజమైన వ్యావహారిక భాషలో వ్రాయుట ఆవశ్యకమనియు గురజాడ అప్పారావుగారు, గిడుగు రామమూర్తి పంతులుగారు తలంచి అందుకు కావలసిన మందుగుండు సామగ్రితో గ్రాంథికభాషా వాదులను ముట్టడించిరి. ఈ యుద్యమమునకు ఫలితముగ వ్యావహారిక భాషావాదములోని సహేతుకత్వమును ఇప్పుడుఅందరును అంగీకరింపక తప్పినదికాదు.

ప్రపంచ వాఙ్మయములనెల్ల జీర్ణించుకొని తన శరీరమునకు కావలసిన నెత్తురు కండలుగ మార్చుకొనుటచేతనే ఆంగ్లేయ వాఙ్మయము నేడు అపరిమితముగ వృద్ధి చెందుచున్నది. విదేశ వాఙ్మయ సంబంధము నూత్న సృష్టికి ప్రతిబంధకము కాదు. ఒక వేళ అపూర్వసృష్టి ప్రేరకము కావచ్చును. ఇందుకు ఆంధ్రదేశమున సుమారు ముప్పది సంవత్సరములనుండి ప్రబలుచున్న అభినవ కవితోద్యమమె తగిన తార్కా ణ. ఆంధ్ర కవుల ప్రతిభానర్తకికి నూత్న నాట్యరంగముల నేర్పఱచిన తప్పేమి ?

అప్పారావుగారి ముత్యాలసరములతో అభినవకవితోద్యమము ప్రారంభమయినది. సంక్షుబ్ధసాగర కల్లోలములలో గాలివీచినట్లెల్ల కొట్టుకొనిపోవుచున్న అభినవ కవితా నావకు కట్టమంచి రామలింగారెడ్డిగారు కర్ణ ధారులై నిలిచిరి. వారు రచించిన కవిత్వ తత్త్వవిచారమను విమర్శన గ్రంథము ఈ నవీనోద్యమమునకు మార్గదర్శక మైనది. ఈ నవయుగ కవితా ప్రభాతముయొక్క ప్రథమరోచులు రాయప్రోలు సుబ్బారావుగారి కుటీర గవాక్షములో ప్రసరించి ఆయనను ప్రబోధించినవి. సుబ్బారావుగారు అంతకు పూర్వమే కవిత్వ మల్లు చుండిరి. ఆయన రచించిన 'లలిత ' యను ప్రథమ కావ్యము శబ్దాలంకారయుతమై పూర్వ ప్రబంధ శైలిని తలపించుచున్నను, అందే భావికవితా పరిణామముయొక్క సూచనలు పొడకట్టుచుండినవి. ఆకాలమున నెల్లరకు పూర్వ ప్రబంధములే పాఠ్యగ్రంథములు, అభినవ కవితకు మానా లేదు. ప్రతి కవియు సొంతమానాలు సృజించుకొనవలసి యుండెను. ఒక సంప్రదాయము కరుడుకట్టిన వెనుక వ్రాయు వారి కంతకష్టముండదు. పిఠాపురమున సుబ్బారావుగారు స్థాపించిన అభినవ కవితా గ్రంథమండలిని ( లేక గ్రంథ మాలయో నాకు జ్ఞప్తిలేదు.) గుఱించిన యొక కరపత్రమును పూర్వమొకప్పుడు సి. వి. కృష్ణయ్యగారి యొద్ద నేను చూచితిని. అంగ్లేయ సాహిత్యములోని పేరిన తేనెగడ్డలను అభినవాంధ్ర కావ్యములలోనికి తెచ్చుట ఆ గ్రంథమండలి యుద్దేశములలో నొకటియని అందు వ్రాయబడి యుండినది. ప్రథమమున సుబ్బారావుగారి యుద్దేశ మెట్లుండినను తరువాత వారు రచించిన కావ్యములు స్వతంత్ర సృష్టులనియే చెప్పవలయును. ఆయన వెనువెంటనే యమార్గ మవలంబించినవారు అబ్బూరి రామకృష్ణారావుగారు. 1915, 1916 మొదలు పింగళి లక్ష్మీకాంతం, వెంకటేశ్వరరావుగార్లు, విశ్వనాథ సత్యనారాయణగారు, వేంకటపార్వతీశ్వర కవులు, శివశంకరశాస్త్రి గారు, కృష్ణశాస్త్రిగారు మఱి యింక కొందఱు ఈ నవీనమార్గము నవలంబించిరి. తరువాత క్రమ క్రమంగా ఇప్పుడు వ్రాయుచున్న కవులందఱు కొద్దిగనో గొప్పగనో స్వతంత్రముగనే రచించుచున్నారు. వీరందఱు ఏక మార్గావలంబికులయ్యును వ్యక్తిగత శిల్ప పరిపాకము ననుసరించి రచనలలో తారతమ్యము గోచరించును. ఈ అభినవ కవితోద్యమ ఫలితముగ కొంత పునరుద్ధరణము, కొంత నూతన సృష్టి కొనసాగినది. “ద్విపద కావ్యంబు ముదిలంజ...”అని తిరస్కరింపబడిన ద్విపదలు, పల్లెపదములు, పునర్గ్రహణ యోగ్యములైనవి. ఖండకావ్యములు, గేయములు, నవలలు, నాటకములు, ఏకాంక నాటికలు, ఉపకథలు, వ్యాసములు పుట్టినవి ఇవి యన్నియు తెలుగువాణికి నూత్నాలంకారములె. ఈ యిరువదియైదు సంవత్సరములనుండి పుట్టిన వాఙ్మయము విమర్శించుటకు తగినంత విరివిగా నున్నది. ఏసమర్దుడైనను నిష్పక్ష పాతబుద్దితో ఈ వాఙ్మయమును విమర్శించినయెడల చాల ఉపయోగకరముగ నుండును.

అభినవ కవిత్వమును గుఱించి యిప్పుడిప్పుడే కొన్ని యాక్షేపములు, ప్రత్యుత్తరములు బయలుదేరు చున్నవి. కాని, ఆ క్షేపములవలెనే ప్రత్యుత్తరములుకూడ మూక ఉమ్మడిగ నున్నవి. ఈ కాలమున వ్రాయబడునదంతయు చెత్తయని తృణీకరించుట యెంత అసమంజసమో ఈ నాటి రచనలన్నియు మహోత్కృష్టములని ప్రశంసించుటకూడ నంత యవిచారమూలకమె. బాగోగులు ఒక వర్తమాన కాలమునకే సంబంధించినవి కావు. చెత్త వ్రాసినవారు పూర్వముకూడ కలరు. అయితే ఆ చెత్తకును మనకును నూరులకొలది సంవత్సరముల అంతరమున్నది. కావున, ఆ చెత్త యంతయు క్రుళ్ళి కాలప్రవాహమున కొట్టుకొని పోయి అంతస్సారముగల యేకొన్ని కావ్యములో నిలిచినవి. ఎచ్చటనో దాగియుండిన చెత్తలు పురాతనములన్నంత మాత్రముననే అచ్చొత్తింపబడినవి యిప్పటికిని మనకు దొరకుచునే యున్నవి. ఈ కాలమున వ్రాయబడున దంతయు బ్రతికియుండునని యెవరు చెప్పగలరు? ఈసంశయము కాలమే. తీర్పగలదు. ప్రతిభావంతులగు కవులు ఏకాలమందైన నుందురు. అయి తే వారిమార్గములు భిన్నములుగ నుండవచ్చును.

పోలవరపు రామబ్రహ్మముగారు 'ప్రజామిత్రలో ఆధునిక కవిత్వమును విమర్శించిరి. వారి విమర్శలో కొంత సత్యమున్నది. కొంత తొందరపాటు, కొంత పొరపాటుకూడ ఉన్న ది. వీరికి వడ్డాది సుబ్బరాయుడుగారు మున్నగు పెద్ద కవులతో ఏలాటి తగాయిదా లేదు. రాయప్రోలు సుబ్బారావు, అబ్బూరి రామకృష్ణరావుగార్ల కావ్యములతో గూడ వీరికేలాటి యిబ్బందిలేదు. కాని యితర కవులు రచించిన కావ్యములన్నియు చెత్తలని వీరభిప్రాయపడిరి. సుబ్బారావు రామకృష్ణారావుగార్ల కావ్యములను మెచ్చుకోగలవారు తదితరులు వ్రాసినదంతయు చెత్తయని యెట్లుతలంచిరో నాకు బోధపడుట లేదు. వారి కావ్యములలో నున్న గుణములును దోషములును తక్కినవారి కావ్యములలోకూడ నున్నవి. పింగళి లక్ష్మీకాంతం వెంకటేశ్వరరావుగార్ల 'సౌందర నందనము, విశ్వనాథ సత్యనారాయణగారి 'ఆంధ్రప్రశస్తి' శివశంకరశాస్త్రిగారి 'హృదయేశ్వరీ, కృష్ణశాస్త్రిగారి గీతములు, వేదుల సత్యనారాయణ శాస్త్రిగారి ఖండకావ్యములు, జాషువాగారి 'ఫిర్దౌసి', నాయని సుబ్బారావుగారి మాతృ గీతములు, సుబ్బారావుగారి 'హంపీ క్షేత్రము', బసవరాజు అప్పారావుగారి గేయములు, నండూరి సుబ్బారావుగారి యెంకిపాటలు, కుందుర్తి నరసింహారావుగారి 'పంపాసరస్సు' (ఇదియొక ఖండకావ్యము), బొడ్డు బాపిరాజుగారి 'విపంచి' యేవాఙ్మయమునకై న అలంకార ప్రాయములుగ నుండగలవు మచ్చునకుగా కొందఱి కవులను, వారికావ్యములను పేర్కొంటిని చక్కగా కవిత్వము. వ్రాయగల కవులు ఇక నెందఱో నేడు ఆంధ్రదేశమున నున్నారు. ఈ రచనలన్ని యు చెత్తని చెప్పుటకు, రామబ్రహ్మముగారు సాహసింతురా ? అట్లు సాహసింతురేని వారి యభినవ కవితాపరిచయము 1916-న సంవత్సర పర్యంత మనియే మన మూహింపవలయును. అట్లు గానిచో వారి సహృదయత్వమును మనము శంకింపవలసి యుండును.

రామబ్రహ్మముగారు చూపించిన కావ్యదోషములు నేటి కవిత్వమున కానవచ్చుచున్నవి. దురాన్వయము, క్లిష్టాన్వయము, అర్థము బోధపడని పదములకూర్పు, నిరర్థక పదాడంబరత్వము, భావప్రకటనము చక్కగా చేయలేని గజిబిజితనము, మున్నగు కావ్యదోషములు ప్రత్యేకముగ ఆయాకవికి సంబంధించిన రచనాలోపములే కాని అవియెల్ల అభినవకవితకు లక్షణములు కావు. కవి మనస్సులోని భావము స్ఫుటముగా ప్రకటించుటకు తగినంత తీవ్రము కాకపోవుట చేతను, భాషపై కావలసినంత ప్రభుత్వము లేకపోవుట చేతను, భావోచితమైన పదమును వెదికికొన లేకపోవుట చేతను ఇట్టిదోషములు కలుగుచుండును. స్వాతంత్ర్యము చేకూరిన వెంటనే సంప్రదాయములమీది ప్రమాణగౌరవము నశించును. అట్లు నశింపనిదే సూత్న సృష్టిని పురికొల్పు సాహాసమలవడదు. ఒకొక్కప్పుడు మనము స్వాతంత్ర్యమును దుర్వినియోగ పఱచుచుండుటయు కలదు. స్వాతంత్ర్యము దుర్వినియోగపడునను భయముతో పారతంత్ర్య మనుభవించుట భావ్యముకాదు. తప్పులు చేయనిదే యొప్పులు నేర్చుకొనము. ఒక నూత్న సంప్రదాయము కరుడుగట్టు ప్రథమదశ యందు యిట్టి దోషము లుప్పతిల్లుచుండును. రవీంద్రనాధ టాగూరుగారు కవిత్వము వ్రాయ ప్రారంభించిన కాలముననే నూత్న సంప్రదాయముకూడ అంకురించుచుండినది. దానికి టాగూరుగారుకూడ కొంత వఱకు బాధ్యులు. ప్రథమమున వీరు వ్రాయుచుండిన బంగాళీ కవిత్వము అర్థమగుట లేదని అందఱు గోలపెట్టిరి. ఇప్పుడు మన కవిత్వమున గోచరించు దోషములు అప్పుడు ఆయన కవిత్వములో కూడ దొరలినవి. దీనిని గుఱించి తన “జీవనస్మృతి ” యందు కొంత సమర్థించిరి.

ఈ సందర్భమున అభినవకవుల కష్టములను గూడ మనము గుర్తింపవలయును. వార్తాపత్రికల మూలమునను, వివిధ గ్రంథబాహుళ్యము వలనను నేడు ప్రపంచమంతటితో మనకు సంబంధమున్నది. కావున మన భావములుకూడ విరివియైనవి. మన భాష మన భావములతో పాటు వృద్ధిపొందలేదు. New phraseology to express Dew ideology" " అన్నట్లు, క్రొత్తభావములను, అందలి తరతమ చ్ఛాయలను వెలిపుచ్చుటకు క్రొత్తరకపు పదముల కూర్పు ఆవశ్యకమగును. కవి యొక్క భాషాప్రభుత్వము, పదములు కూర్చు నేర్పు ఇట్టి యెడ నుపకరించును. భాష యెప్పటికిని భావములకంటె వెనుకపడి యుండును. భావములు మాఱినంత సుళువుగా భాష మాఱదు. అయినను కార్యకుశలుడు కొఱముట్లులేని లోపమును ఎట్లో పూర్తి చేసికొనును. ప్రతిభావంతులగు కవులు, గ్రంథక ర్తలు జన్మించి సమకాలీన భాషను తమ కూర్పు నేర్పుచేత వివిధ భావ ప్రకటనార్హముగ నొనరింతురు. పదజాలము సంకుచితమయ్యున్నను కవి ఆవశ్యకమునుబట్టి ఒక యింద్రజాలముపన్ని భాషా దారిద్ర్యమును అతిక్రమించును. పూర్వమునుండియు కవులు కావ్యములలో ఉప మాద్యలంకారములను వాడుచున్నారు. భామహుని కాలమున నాలుగు అలంకారములె గుర్తింపబడినవి. కాని క్రమ క్రమముగ విమర్శకుల పృథక్కరణ శక్తివలన అలంకారములు పెక్కులయి మనమువ్రాయు ప్రతి వాక్యము, సమాసము, ఏదో యొక యలంకారము క్రిందికి వచ్చునట్లైనది. కాని మొట్ట మొదట యలంకారముల నుపయోగించిన కవి, అవి యలంకారములని, కవితకు మెఱుగు పెట్టుటకుగా వాని నుపయోగించుచున్నానను జ్ఞానముతో శాక, తాను ప్రకటింపదలచిన భావ తీవ్రతను మొక్కవోక స్ఫురింపజేయుటకు పడిన కడగండ్లే యీ యలంకారములని నా యుద్దేశము. తాను చెప్పదలచుకొన్న భావమునకు ఉచితమైన పదము

భాషలోనుండిన ఈ యుపమాద్యలంకారములకు అవసర ముండదు. భాషకు సహజమైన లోపమె యీ యలంకారములకు మూలము. ఒక యుదాహరణము చూడుడు:

నఖలు నఖలు బాణః నన్నిపాత్యో౽య మస్మిన్
మృదుని మృగశరీరే పుష్పరాశా వివాగ్నిః.

దుష్యంతుడు ఆశ్రమ మృగమును తరుముకొని వచ్చుచుండగా కణ్వశిష్యులు చూచి దానిని రక్షింపనెంచి, “ఓ రాజా, యిది యాశ్రమ మృగము, దీనిని చంపదగ" దని చెప్పిరి. ఆశ్రమ కురంగమని బెదరు పెట్టినంతనే సార్వభౌముడు భీతిల్లి దానిని వదలునా? దుష్యంతుడు మృగయా ప్రియుడు. వేటాడుటకొఱకే వచ్చెను. జీవహింస క్షత్రియులకు క్రొత్తది కాదు. కావున వైఖానసులు ఎట్లయిన రాజు హృదయమును కరుణార్ద్రము కావించి మృగమును రక్షింపవలయును. అట్టి యెడ ‘‘మృదువైన మృగశరీరమునందు బాణము ప్రయోగింపవలదు” అని బ్రతిమాలిరి. మృదువు అను విశేషణము బాధ నోర్చుకొనలేని కోమలత్వమును స్పురింప జేయునుగాని, ఎంత సుకుమారమని వైఖానసుడు చెప్పిన రాజు హృదయము ఆర్ద్రమగునో అంత సౌకుమార్యమును స్పురింప జేయుటకీ విశేషణము చాలదు. కావున వైఖానసుడు ఆ భావ తీవ్రతను, సాంద్రతను ఇట్లు ప్రకటించెను : 'రాజా, నీవు మృగముపై బాణము వేయుదువేని పూలరాశిలో అగ్గి పెట్టినట్లే !' పూవులు చాల పేశలములైనవి. తాకిన కంది పోవునవి. తల నిడికోదగినవి. తన ప్రేయసి ధరియించునవి. తాను ప్రణయ బహుమానముగ గొన్నవి. దేవుని పూజించుట కర్హ మైనవి. ప్రకృతిదేవీ దరహాసముల వంటివి. మనోహరములైనవి. ఇట్టి పూలకు నగ్ని రగల్చినట్లగునా! ఈ కార్యము క్రూరము ఘోరము. ఎంత కర్కశాత్ముడైనను ఈ కార్య మొనరింపడు. ఇక సరసుడైన దుష్యంతుని మాట వేఱ చెప్పవలయునా? ఈ సాదృశ్య ప్రభావము “మృదువు” అను విశేషణము అంతకు పూర్వము స్ఫురింప జేయలేని యెన్నో భావములు ఇప్పుడు దానికి సంక్రమించినవి.

కవి గాఢతరమైన తన రసానుభూతిని చెక్కు చెదరనీయక పఠితల హృదయముల స్ఫురింప జేయును. భావమునకు భాష కేవలము సంజ్ఞామాత్రమె, ఒక్కొక్కప్పుడు మనము భావించిన దొకటి, ప్రకటించిన దొకటిగా ఏర్పడును, ఏలయన, భావము సున్నితమైనది. భాష స్థూలమైనది. కావున దీనికొక Momentum కలదు. ఇందుకు ప్రతీకారముగ భావము తీవ్రతరము కానిదే భాష భావమునకు లొంగదు. కవి యుపయోగించు సంజ్ఞలు పఠితలకుగూడ తెలిసినవిగనో తెలిసికొన తగినవిగనో యుండవలయును. 'పదమునకు నిఘంటువు ప్రసాదించు అర్ధమునకంటె వేఱు శక్తులుకూడ కలవు. ఆ శక్తుల యన్నిటిపైనను కవి యాధారపడి తన భావమును స్పురింప జేయును. తన భావము ఇతరుల కెఱుకపడనియంత క్లిష్టసంజ్ఞలతో ప్రకటింపబడియున్న ఆ పద్యము మూగ చెవిటి వారల సంభాషణమువ లె వ్యర్థమగును. కావ్య ప్రయోజనమందు శూన్యమగుటవలన దానికి కావ్యత్య హానికూడ సిద్దించును. F. T. Palgrave గారు “Golden Treasury" అను ఖండకావ్య సంపుటమునకు తాను రచించిన యుపోద్ఘాతమున నిట్లు వ్రాసియున్నారు : '...... that passion, colour, and originality can not atone for serious imperfections in clearness, unity or truth.' కావ్యమునకు ముఖ్యమైన గుణములలో భావ స్ఫుటత్వ మొకటి యని ఈ విమర్శకుని యభిప్రాయము.

భావములు వాచ్యములుగనె యుండవలయునా ? వ్యంగ్యముగ నుండకూడదా? అని కొందఱు ప్రశ్నింప వచ్చును. భావస్ఫుటత్యము వ్యంగ్య మర్యాదకు విరోధి కాదు. ప్రకరణార్థము గోచరించుచునే తదతిరిక్తమైన వేఱొక భావము స్ఫురించవచ్చును. క్లిష్టార్థ సమన్వితములైన పద్యములను దీసికొని యవి వ్యంగ్యప్రధానములని సమర్ధించుట ఇప్పుడొక యాచార మైనది. ధ్వని ప్రధానములని యెన్నబడు సంస్కృత శ్లోకములలో ప్రకరణమునకు సంబంధించిన యర్థము సులభగ్రాహ్యముగనే యుండును.

రామబ్రహ్మముగారు బూతుకథల విమర్శించిరి. వీరికి బూతుకథ పై గలిగిన ఆగ్రహము అభినవసాహిత్యము నంతటిపై ప్రసరించి వారి విమర్శనమునకున్న విలువను తగ్గించినది. బూతుకథలు వెలువడుచుండుట యదార్థమేగాని అభినవ సారస్వతమంతయు ఈ బూతులుతప్ప మఱి యింకేమి లేదని చెప్పుట ఆ సాహిత్యముతోడి వీరి పరిచయ మెంత పాటిదో మనకు గోచరించుచున్నది. మున్నటి వైనను నేటివైనను బూతులు బూతులే. నాగర కాభిరుచిగలవారికి అట్టి కథలు ఏవము పుట్టించును. అట్టి కథకులు ఏ స్త్రీలను సంస్కరించుటకు (గిరీశమువలె) ప్రయత్నించుచున్నారో ఆ స్త్రీల ఆత్మగౌరవమునకే అట్టి కథలు భంగకారులుగ నున్నవి. కథలు వ్రాయువారందరు ఇట్టి బూతుకథలే వ్రాయుటలేదు. ఇట్టి కథలు ప్రచురించుటకు రెండు, మూడు మాసపత్రికలె కంకణము కట్టుకొన్నవి.

“సుబోధిని” పత్రికయందు “నవకవులు - బూతు కవనము” అని రామబ్రహ్మముగారు రచించిన వ్యాసము, “ప్రజామిత్ర" లోని వ్యాసమునకన్న మఱింత తీవ్రమై బూతుకథలతో వారికిగల పరిచయమును సార్థకపఱచు చున్నది. నవకవులెవ్వరును బూతుకవనము వ్రాయుటలేదు. వారి కవిత్వములోని శృంగారము సభ్యముగను నాజూకై న యభిరుచిగలదిగ నుండును. కవిత్వము వ్రాయువారి సంఖ్య చాల తక్కువ. వారి కథలలోగూడ బూతులేదు. అందులో ఒక్కరు మాత్రము అట్టి కథలను వ్రాయుచుందురు. ఇక మీదనైన రామబ్రహ్మముగారు విషయ పృథక్కరణము నందు కొంత పరిశ్రమ చేయుదురుగాక యనియు, అభినవ కావ్య సాహిత్య పరిచయము కలిగించుకొందురుగాక యనియు నా మనవి.


__________

చిత్ర లక్షణము[1]

(శ్రీ పి. వి. రాజమన్నారుగారి సంపాదకత్వమున వెలువడుచుండిన 'కళ' అను మానపత్రికయందు, ఈ వ్యాసము ప్రకటింపబడినది. -సం.)

తొమ్మిది సంవత్సరములకఁ బూర్వము బెర్తోల్డు లౌఫర్ (Berihold Laufer) అను నొక జర్మను పండితుఁడు టిబెట్ దేశపు " తాంజుర్” గ్రంథమాల నుండి "రెమొ ఈశాన్యి” లేక “చిత్రలక్షణము” అను నొక శిల్ప శాస్త్రమును జర్మను అనువాదముతోడఁ బ్రకటించెను. ఆ గ్రంథము నందలి విషయమును సంక్షేపముగఁ గ్రింద వివరించుచున్నాను.

టిబెటు దేశమున బౌద్ధధర్మము ప్రతిష్ఠింపఁబడిన యనంతరము, ఆదేశపు భాషలోనికిఁ జూల సంస్కృత గ్రంథములు తర్జుమా చేయఁబడినవి; ఇట్టి పుస్తకములతోడ "కాఃజుర్", "తాంజుర్" అను రెండు గొప్ప గ్రంథ మాలలు సమకూర్పఁబడినవి. ప్రస్తుతము మేము పర్యాలోచించు గ్రంథము “ తాంజుర్ , " గ్రంథమాలలోనిది.

  1. చిత్రలక్షణమను శీర్షికతో, వంగసాహిత్యపరిషత్ పత్రికయందు రవీంద్రనారాయణ ఘోషుగారొక వ్యాసమును బ్రకటించిరి. అందలి ముఖ్య భాగమును సంకలించి రామానంద చటోపాధ్యాయగారు “ప్రభాసి” చైత్రసంచికయందుఁ బ్రకటించిరి. దానిని "కళ" కొఱకు నేను తెనిగించితిని. -దు. రామిరెడ్డి.