Jump to content

కవికోకిల గ్రంథావళి-3: నాటకములు/సీతావనవాసము

వికీసోర్స్ నుండి






సీతావనవాసము.

ప్రధమ ముద్రణము 1921













సీతావన వాసము

నాంది

                     శ్రీవైదేహియుఁ బుత్రకుల్ కుశలవుల్
                                 సేవింప, సౌమిత్రి భ
                     క్త్యావేశమ్మునఁ ఛత్రమెత్త, నిరుచా
                                 యన్ నిల్చి వీచోపులన్
                     వైవంగా లవణారియున్ భరతుఁడున్
                                 భద్రాసనాసీనుఁడై
                     యీవిశ్వంబును నేలు రాముఁడిడు మీ
                                 కిష్టాయురారోగ్యముల్ !

ప్రథమాంకము

_________

ప్రథమ స్థలము : లంక

_________

[శూర్పణఖ ప్రవేశము.]

శూర్ప: ఆహా ! కాలవైషమ్యము ! దానవేశ్వరుఁడు పేరోలగంబుండు సభామంటపమున సాలెపురువులు గూళు లల్లుచున్నవి. సకల సామంత మహీకాంతుల కైవారములకు మాఱు గుడ్లగూబల కర్ణకఠోరములగు, విరావములు వినవచ్చుచున్నవి. ఔరా, రాజధాని దుస్థితి !


                  సుర సిద్ధ సాధ్య కిన్నర యక్ష గంధర్వ
                              రాజులకును డాయరాని లంక !
                  పన్నగాశనపక్ష పరిభవ సంపాది
                              యంభోధి పరిఖయై యలరు లంక !
                  మేరుకోదండు దుర్వార శౌర్యంబైనఁ
                              గరగించు వీరులఁ గన్న లంక !
                  అభ్రంక షోత్తుంగ హర్మ్యగోపుర వైభ
                              వముల నాకము సిగ్గుపఱచు లంక !

                    ప్రళయ రుద్రార్క చండ విభ్రాజ తేజుఁ
                    డైన దశకంఠునకు రాజధాని లంక !
                    నేఁటి కెట్లాయె - నక్కటా ! నేలమట్ట
                    మాయె దుష్టదైవము మాకు దాయయౌట.

ఔరా ! రాక్షసులకు వినాశము ! సురేంద్రుని పరాభవించిన మేఘనాదుండు మడసె. అవార్య శౌర్యబలసాహసుండు కుంభకర్ణుండు కాల వశంవదుఁడయ్యె. మాల్యవదాది రాక్షసవీరనాయకులు శరతల్పము లలంకరించిరి. చతుర్దశభువన విద్రావణుండు రావణుండుపరాభూత భుజవీర్యుండై రణక్రోడశాయి యయ్యె.

                    కైలాసేశ్వరు వెండికొండ వడఁకంగాఁ జేత నూఁగించి, ది
                    క్పాల శ్రేణికి నాజ్ఞవెట్టి, మునులం గారించి, నైలింప క
                    న్యాళిం దెచ్చి నవగ్రహంబులను గారాగారమం దుంచి శౌ
                    ర్యాలఁబంబుగ రాజ్యమేలిన సురేంద్రారాతియుం గూలెఁగా!

వీరవతంసులకు విరోధి సైన్యంబులఁ జీల్చి చెండాడి విజయలక్ష్మిని వరించుటయో లేక యాత్మోచిత మరణంబునొంది స్వర్గభోగలాలసు లగుటయో ధర్మముగాని, రాక్షసయోధులకు ఇంతటి యధ:పతనము తగునా !

                    మరణము నైజమెల్లర, కమానుష దోర్బల సాహసాంకు లా
                    సుర నికరంబు, లట్టిరికి శూరులు వోయెడి త్రోవలెస్స గా
                    ని, రణమునన్ నరాశనుల నిశ్చల యోధవతంసులట్ల వా
                    నరులు నరుల్ జయించిరన నా కుదయించెడి లజ్జపెల్లుగన్.

దండ కాటవి రాముఁడు నా ముక్కు - సెవులు గోయింపఁ గినిసి రావణునిం బురికొల్పి సీతఁ జెరఁబెట్టించితిననియుఁ దన్మూలంబున రాక్షస కుల వినాశం బయ్యెననియు దైత్యాంగనలు నన్ను దూఱుచుందురు. ఆ యంగ వైకల్య కథావిధాన మొకవంకయు అసురకులవినాశ సంతాపవహ్ని వేఱొకవంకయు నాచిత్తము దరికొల్పుచున్నది. దైత్యకుల క్షయమునకు నేనా హేతుభూతురాలను ? - కాను; కాను; ముమ్మాటికిం గాను. సురారికుల కలంకుఁడు ప్రతిపక్షభూషణుఁడు స్వపక్షదూషణుఁడు ఆవిభీషణుఁడే కారకుఁడు ఆరాక్షసాధముఁడే నిజరాజ్య రహస్యంబులఁ బరుల కెఱింగించి కులాధ:పాతంబునకుఁ దోడ్పడియె. ఓరీ విభీషణా, నీ యొక్కని యవివేకంబున దైతేయసముదాయమున కంతటికి నాపదవాటిల్లెఁగదా. నీ మౌఢ్యమునఁ గదా లంకాపురలక్ష్మీ భగ్నావశేషగోపురమిషంబునఁ జేతులు బారచాఁపి రణనిహత భర్తృకా విలాపంబుల వాపోవుచున్నది. ఛీ ! ఆ దైత్యకులాంగారుని నామమేల స్మరించితిని ? అట్టి పంద పవిత్రమగు మాకులమున జన్మించి వంశపారంపర్యాగత గౌరవంబు నేల నేలపా లొనరించె ?

                   అరిపాదంబులు పట్టి దాసుఁడయి, దైత్యవ్రాతముం బోరిలోఁ
                   బరిమార్పించి, సహోదరాదులమృతిన్ భాగ్యంబుగా నెంచు ము
                   ష్కరుఁడై నేఁడు విభీషణాసురుఁడు లంకరాజ్య మేలంగ సి
                   గ్గఱి యిచ్చో నివసింపఁగావలెనె యింక న్నీచపుం గూటికిన్ ?

వనంబునఁ గందమూలఫలాదులు లేవా యీపాడుపొట్ట నించికొనుటకు ? ఆఁడుదాన వయ్యు రాక్షసకులంబున దశకంఠునకు సోదరినై జనియింప లేదా ? [ఉల్కిపడి యాకసమువంకఁజూచి] ఆహా ! రణనిహతులైన దైతేయవీరులు నాకన్నులకుఁ బొడకట్టుచున్నారు. పోటుగంటులనుండి దొరంగు ఒక్కొక రక్తపూరమును ఒక్కొక నాలుకగ ప్రతిహింసా పరాయణత్వ ము నుపదేశించుచున్నది.

మేఘనాదాది మహావీరులారా, నాప్రతిజ్ఞ వినుఁడు:

                   మీరల్ రాక్షస వీరయోధులు బలామేయ ప్రభావైక దు
                   ర్వారుల్ పోరుల నే నరాంగనకునై స్వర్గం బధిష్ఠించి యు
                   న్నారో, యాధరణీ కుమారి యవమానం బొంది శోకార్తయై
                   ఘోరారణ్యములం దనాథయయి యెగ్గుంబొందఁ గల్పించెదన్.

[ఆశ్చర్యముతో] ఏమిది ! వారెంతలో అదృశ్యులైరి ! ఇదియేమి మనోభ్రాంతియా ? స్వప్నమా ? లేక సత్యమైయుండునా ? నన్నుఁ బ్రతిహింసకుఁ బురికొల్పుటకై పితృలోకవాసులు నాకు దర్శన మిచ్చియుందురు కాఁబోలు !

రాముని మోసగించి తనచేతనే సీతను గాంతారముల ద్రోయించి ఆ నృపతి గోడుగోడని దు:ఖింప నేను పకపక నగ నిలింప లోకవాసులగు మా బంధుసందోహము 'వహవా ! శూర్పణఖా !' యని నన్నభినందించునప్పుడు గదా నాజన్మము కృతార్థమగుట ! నేఁడే నే నయోధ్యకుంబోయి పూర్వాలోచిత కల్పనాక్రమంబున సమయమువేసి పగతీర్చుకొనియెద !

[నిష్క్రమించును.]

ద్వితీయ స్థలము: వనము.

_________

[సీత, ఊర్మిళ విహరించుచుందురు.]

సీత: గృహారామ పరిసరము అతిక్రమించి నిసర్గ రమణీయమగు నీవనోపాంత దేశమునకు వచ్చితిమి.

ఊర్మి: అక్కా, చాల అలసితివని మున్నే హెచ్చరించితినిగద.

                 కడప దిగలేని నిర్భర గర్భవతివి,
                 చారు సుమకోమలవు, ప్రయాసమున కోర్వ,
                 వెంత చెప్పిన వినక వనాంతరమున
                 కింత దవ్వేల నడువంగ నిగురుబోఁడి ?

సీత: వనాలోకన కుతూహలము నన్నింతదూర మెలయించినది.

ఊర్మి: అత్తగా రీసాహసము వినిన -

సీత: ఏమీ ?

ఊర్మి: మనల నిద్దఱను గోపింతురు.

సీత: ఆత్మవినోదార్థము ఇందుల విహరించుచుంటిమి.

ఊర్మి: అట్లయిన గమనాయాసము లేదా ?

సీత: ఇపుడిపుడు దోఁచుచున్నది.

ఊర్మి: ఇఁక మరలుదమా ?

సీత: ఇంచుక సేపీ వెన్నెల ఱాలతిన్నెపై విశ్రమించి యంత:పురమున కేఁగుదము. చెల్లెలా, మార్గపరిశ్రాంతము లగు నాయవయవముల కీ మంద మారుత సుఖాశ్లేష మమృత లేపనమువలె నున్నది.

                   జిలిబిలి కమ్మఁదేనియల చిత్తడి జాఱుచుఁ, బుప్పొడిన్ వనీ
                   తలముల రాల్చుచుం,గుసుమ తల్పములంబొరలాడుచున్, ధునీ
                   సలిల తరంగ డోలికల సంతత మూఁగుచు, శీతలంపుఁ గౌఁ
                   గిళుల మదంగకంబుల సుఖింపఁగఁజేయు మరుత్కిశోరముల్.

ఊర్మిళా, గృహారామములకన్న ఈవనాంతరములు రమణీయములుగ నున్నవి.

                   చాలుగ మార్గపార్శ్వ తరుశాఖలఁ బుష్పిత వన్యవల్లు లు
                   య్యాలల పోలికం గదలియాడ, మయూరములెక్కి కూయుచుం
                   గేళిఁజరించుచుండి తొనికింపగఁ దీవలనుండి క్రొంబువుల్
                   రాలిన నేలయంత నవరత్నమయంబుగఁ గాంతు లీనెడున్.

ఊర్మి: అక్కా, పదునాలుగేఁడులు దండకారణ్యమున నివసించిన నీకు కృత్రిమారామ వాటిక లింపుగొలుపునా ? అచ్చటి నిర్ఘరములు. అచ్చటి శకుంత సంతానములు, అచ్చటి వివిధమృగవిహార సందర్శనములు ఇచ్చట లభించునా ?

సీత: చెల్లెలా, దండకారణ్యమన్నంతనే నాయొడలెల్ల గగురెత్తు చున్నది.

                   దండకారణ్య వాసంబు దలఁచినంత
                   హర్ష శోకానుభవము పె ల్లగ్గలించు;
                   వనవిహారము, తాపన జనుల మైత్రి,
                   రాక్షస విరోధమట మాకుఁ బ్రాప్తమౌట.

ఊర్మి: అక్కా, గడచినది గదా యారణ్యవృత్తాంతము.

సీత: అయినను అందనుభవించిన సుఖదు:ఖావస్థలు మఱపునకు వచ్చునవియా ? జనస్థానమునఁ బదునాలుగువేల కంచురథముల రక్కసులతో నసహాయ శూరుఁడయి పోరి, వారినుక్కడంచిన ఆర్యపుత్రుల శౌర్యమూర్తి నేఁడు దర్శించినటులఁ బొడకట్టుచున్నది.

                    ఖరదూషణాది దైత్యో
                    త్కరముల నురుమాడి, రుధిరధారలు దొరఁగన్
                    శరజ క్షతములఁ గాంతుఁడు
                    వఱలెను కింశుకము బూతపట్టిన యటులన్.

ఊర్మి: అక్కా, శూర్పణఖా పరిభవానంతరము గదా ఈ సమరము జరిగినది.

సీత: అవునవును ! ఆ దానవి కడుమాయలమారి పిశాళి జంత.

                    'నిను మ్రింగెద' నని యసురాం
                    గన బాహువు లప్పళించి ఘన ఘోషమునన్
                    నను దరియరాఁగ నగ్రజు
                    పనుపున నీప్రియుఁడు దానిఁ బరిభవ పఱచెన్.

ఊర్మి : అ రక్కసికి మంచి శాంతి పూజయే జరగినది.

సీత : ఊర్మిళా, యాదైత్యాంగనయేగదా నాయపహృతికి మూలము !

ఊర్మి : [ఆశ్చర్యవిషాదములతో] ఏమీ ! దాని యకార్యమా యది యంతయు ?

సీత : చెల్లెలా, కాలము గానియపుడు అమృతముగూడ విషమగు చుండును. ఆ బంగారుజింక యెంతపని చేసినది ?

                     కనకమయమైన హరిణంబు గఱికబయలఁ
                     గ్రేళ్లుదాఁటుచుఁ గొమ్ముల గీటుకొనుచుఁ
                     జిక్కిచిక్కక యల్లంతఁజేరి బెదరి
                     చూచు మురిపెంబు చిత్తంబు సొచ్చివిడదు.

అయ్యో! ఆర్యపుత్రా, యింతవఱకే నీసందర్శనము. సన్యాసివేషమున - హా ! యిఁక నుడువఁజాలను, పవిత్ర చరిత్రుఁడగు లక్ష్మణకుమారుని నిర్హేతుకముగఁ దూలనాడిన ఫలము తత్క్షణమే యనుభవించితిని.

ఊర్మి : అక్కా, యెందుకీ కర్ణకఠోరవృత్తాంతము ? [స్వగతము] నేనేల దండ కారణ్య వృత్తాంతము నెత్తితిని ?

సీత : న న్నారక్కసుని బారినుండి రక్షించుచుటకు నిజప్రాణ పరిత్యాగము గావించిన మహాత్ముఁడు పక్షిరాజు జటాయువు నా తలఁపునకు వచ్చుచున్నాఁడు.

                     సురరిపుబాణపాతములస్రుక్కియునెత్తురుగ్రక్కియున్ మహో
                     ద్ధుర గరుదంచ లానిల విధూత విమాను నొనర్చి రావణున్
                     ఖర నఖరాగ్ర కుంచికలఁ గండలు దొల్చుచు నెట్ట కేలకున్
                     దురమునఁ గూలె దుష్టవిధి దోడ్పడమిన్ ఖగవర్యుఁ డక్కటా !

ఇదే యాశాభంగపరమావధి ! ఇదే దండకాంత్యదర్శనము ! ప్రాణేశ్వరా, రక్షింపుము ! రక్షింపుము ! [మూర్చిల్లును]

ఊర్మి : [దు:ఖముతో] అయ్యో ! యిఁక నేనేమి సేయుదును ? అక్కా, అక్కా.

[రాముఁడు ప్రవేశించును.]

రాము : [స్వగతము] ఎవతెదో స్త్రీకంఠస్వనముగ నున్నదీ దీనా లాపము ?

ఊర్మిళ : ఓహో ! బావగారిచ్చటకే వచ్చుచున్నారు. అక్కా, యూరడిల్లు మూరడిల్లుము.

రాము : [డగ్గరి] ఇది యేమి యూర్మిళా, మీయక్క మూర్ఛిల్లు యున్నది ? భయకారణమేమియుఁ గలుగదు గదా ?

ఊర్మి : ఆరణ్య నివాసవిషయము స్మరించి మూర్ఛిల్లినది.

రాము : ఓసి బేలా ! [కరస్పర్శగావించి] ప్రేయసీ, యూరడిల్లుము. గడచిపోయినది లెమ్ము వనవాసవిషయము.

సీత : [మెల్లగఁ గనులువిప్పి] ప్రాణవల్లభా, రక్షింపఁబడితిని.

రాము : భ్రాంతి నుండియా ?

సీత : ఏమీ దండక గాదా యిది ?

రాము : నీ మృదుల హృదయము నడుగుము.

సీత : [స్వగతము] స్వప్నమునందువలె నవస్థాంతరము పొందితిని. [ప్రకాశముగ] ఆర్యపుత్రుఁడు విహారమునకై యిచ్చటికే విచ్చేయ నేల ?

రాము : [చిఱునవ్వుతో] నేనడుగఁ దలఁచిన ప్రశ్నను నీవే యడిగితివా ? మఱి యెక్కడ విహరింతును ? ధర్మాసనము వీడి యంతపురంబున కేఁగితిని; అయ్యది ప్రియావిశూన్యమగుట హృదయాహ్లాద వస్తువు నన్వేషించుచు నింతదూరము వచ్చితిని.

సీత : ఆరణ్యావాసముతప్పినను అభ్యాసము వాసనా రూపముగ నున్నది కాఁబోలు !

రాము : [చిఱునవ్వుతో] కావుననే గర్భాలసవయ్యు వనముల వినోదించుట. సీత : [సిగ్గుతో] ఆర్యపుత్రునికే ఋణపడితిని.

ఊర్మి : అక్కా, సంధ్యాపూజకుఁ గుసుమములు కోసికొనివచ్చెదను. [పువ్వులబుట్టతో నిష్క్రమించును.]

సీత : [స్వగతము] నామనోభీష్టము నెఱింగింతునా ?

రాము : ప్రేయసీ, యేమొ తలపోయుచున్న ట్లున్నావు.

సీత : ఏమియు లేదు.

రాము : జానకీ, నీవు నా బహి:ప్రాణమవుగదా, మనకిద్దఱకు నన్యోన్య మెఱుంగరాని రహస్యము లుండునా ?

సీత : రహస్యముగాదు. నాకొక యభిలాషగలదు. భాగీరథీ పరిసరాటవుల నివసించు తాపస కన్యకల స్నేహానుబంధము నన్నీడ్చుచున్నది.

రాము : ఇందుకా యింత శంకించుచుంటివి ?

సీత : ప్రాణవల్లభా, మునికన్యకలతోఁ బ్రొద్దువుచ్చుచుండిన యా దినములు నేనెట్లు మఱతను ?

                    గిరిసాను స్రుత నిర్ఘరీతటములం గ్రీడింపగాఁ బోయి, సాం
                    ధ్య రమారంజిత పశ్చిమాశఁ గల చిత్రంబుల్ విలోకించుచున్,
                    సరసాలాపము లాడికొంచు ఋషికన్యల్ నేను సంతోష ని
                    ర్భరచిత్తంబులఁ బుచ్చినట్టి దినముల్ భావంబుఁ బ్రేరించెడిన్.

రాము : కాంతా, నిండుపున్నమనాఁటి రేయి నీవును ఆరణ్య బాలికలు గూడి యాడుచుండ -

సీత : చాలుచాలు ఆర్యపుత్రుని వినోదము !

          రాము : గాంగ పరిసర వల్లీ కుడుంగములను
                    దాపసాంగన లీవును దాఁగియాడ

                    నెవరెఱుంగక పొదరింట నేను సొచ్చి
                    సింహగర్జల మిమ్ము వంచింపలేదె ?

సీత : ముగ్ధములైన తాపసకన్యకల బెదరుచూపులు ఆర్యపుత్రును కామెతలైనవి కాఁబోలు.

రాము : సీతా, యా దినములు మఱచినను మఱపురావు.

సీత : ప్రాణవల్లభా, ఆ వనప్రదేశములు మఱొకమాఱు దర్శించి వత్తము.

రాము : అటులనే పోవుదము లెమ్ము.

సీత : [స్వగతము] ధన్యను.

రాము : ఇఁక నంత:పురమున కేఁగుదము.

                    పశ్చిమాద్రికి డీకొని పగులవాఱి
                    యర్కుఁడను నావ సాంధ్య రాగాబ్ధియందు
                    నల్లనల్లన మునుఁగంగ నా యుదంత
                    మవనిఁ దెలుపంగ ననఁ బక్షు లఱచి పఱచు.

సీత : ఊర్మిళా.

ఊర్మి : ఇదిగో ! వచ్చుచున్నాను.

[అందఱు నిష్క్రమింతురు.]

____________

ద్వితీయాంకము

_________

ప్రథమ స్థలము : సభామంటపము

_________.

[రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, వసిష్ఠమహర్షియు ఆసీనులై యుందురు.]

వసి : రామచంద్రా, ఋశ్యశృంగమహర్షి యజ్ఞదీక్ష వహించి మనకు నాహ్వానపత్రిక నంపియున్నాఁడు

రాము : విషయము వినిపింపుఁడు.

వసి : జానకి ఆపన్నసత్వ; దూరప్రయాణాయాసమున కోర్వఁ జాలదు. రామచంద్రుఁడు సీతావినోదార్థ మచ్చటనే నిలుచుఁగాక; కౌసల్యాది మహాదేవులును, లక్ష్మణ భరత శత్రుఘ్నులును, వసిష్ఠాది ఋషీశ్వరులును, దక్కిన బంధుమిత్రులును దర్శానార్థము విచ్చేయఁ బ్రార్థితులు.

రాము : మునీంద్రా, మాబావగారి సీతాపక్షపాతమువలన యజ్ఞ సందర్శన కుతూహలమునుండి తొలఁగింపఁ బడితిని. మునిపుంగవు లెల్లరు యాగమంటపము నలంకరించి ఋశ్యశృంగమహర్షిని గృతకృత్యుని గావింపుఁడు.

వసి : వత్సా, సవనమన్నఁ దాపసులకుఁ బండువుగదా.

రాము : భరతా, ప్రయాణసన్నాహము లొనరింపుము.

భర : ఆజ్ఞానువర్తిని.

[భరతుఁడు నిష్క్రమించును.]

[మునులు ప్రవేశింతురు.]

మునులు : త్రైలోక్యభద్రా రామభద్రా, దీనశరణ్యా, రక్షింపుము, రక్షింపుము !

రాము : మునీంద్రులారా, స్వాగతము !

లక్ష్మ : ఋషిపుంగవులారా, యభివాదనములు.

శత్రు : తాపసులారా, వందనములు.

వసి : రామరాజ్యమున గుశలమేగదా తాపసోత్తములకు ?

మునులు : ఇవిగో ! మా కుశల నిదర్శనములు. [వస్తువులుంతురు.]

శత్రు : [నిరూపించి] భగ్నకమండలములే యివి !

లక్ష్మ : ఇవి త్రుటితాక్షమాలికలు; ఇవి వల్కలాజిన ఖండములు - ఋషీశ్వరులారా, ఏల యీ తాపసవస్తు ప్రదర్శనము ?

ముని : [కోపముతో] రక్షోదుష్కార్య భగ్నావశేష తాపస వస్తుప్రదర్శన మనిన సార్థకముగనుండును.

రాము : ఏమి యీవిపరీతము ?

వసి : రామరాజ్యమునఁగూడ రాక్షస బాధయా ?

లక్ష్మ : రాక్షసుల గర్వమింకను శేషించియున్నదా ?

రాము : మునీంద్రులారా, యీ యాసనములపైఁ గూర్చుండుఁడు.

1 - ముని : రాజా, మాకేల యీ యాసనములు ?

2 - ముని : రామచంద్రా, మేమిప్పుడే గోడ కుర్జీలుగూర్చుండి దిగివచ్చితిమి.

3 - ముని : మహారాజా, మా గడ్డముల పీచుత్రాళ్ళతో గుదియఁ గట్టఁబడి రేయుంబవలు కదలమెదలలేక కుంచితాంగులమయి, పుణ్యవశమున విడిపింపఁ బడిన మాకు నిలుచుండుటయే సౌఖ్యము.

రాము : అయ్యో ! యెంతకష్టము !

శత్రు : ఔరా ! రాక్షసాధముల దుష్కార్యము లెట్లు మేర మీ ఱుచున్నవి ?

రాము : మునీశ్వరులారా, మిమ్ముఁ జీకాకుపఱచిన రాక్షసాధముఁ డెవఁడు ?

1 - ముని : మహారాజా, యారాక్షసునిపేరు దలఁచినంతనే యా దురాత్ముని భయంకరస్వరూపము మాకుఁ బ్రత్యక్షమగుచున్నది.

వసి : పాపము ! రాక్షసభీతు లీ ఋషీశ్వరులు.

2 - ముని :

                     హిమవత్పర్వత సానుభాగమున గౌరీశుం దపోనిష్ఠ మో
                     దము నొందించి, విరోధి వీర నికర ధ్వంసోగ్రమౌ శూల రా
                     జము నార్జించి, తదాది తాపసుల నాశంబే వ్రతంబట్లు దు
                     ర్దముఁడై యా లవణాసురుండు వనులన్ దర్పించి వర్తించెడిన్.

రాము : ఓహో ! శంకర వరప్రసాద గర్వితుఁ డా లవణుఁడు?

లక్ష్మ : శునకపుచ్ఛముఁ బట్టుకొని మహాసముద్రము నీఁదఁగడఁగుటయా ?

4 - ముని [స్వగతము] లవణుఁడు శంకర వరప్రసాద దుర్వారుఁడని వెనుదీయునా రామచంద్రుఁడు?

శత్రు : ఆ దుష్టరాక్షసుఁడు అర్ధనారీశ్వర వరప్రసాద మాత్రముననే యింత గర్వింప వలయునా?

                     సీతాదేవి స్వయంవరంబున నృపశ్రేష్ఠుండు మాయన్న డా
                     చేతంబట్టిన శైవకార్ముకము విచ్ఛిన్నంబుగాఁ గూలదే !
                     భీతింజెందుదుమే త్రిశూల మనినన్? వేయేల ? భూతేశ్వరున్
                     మాతోఁ బోరుకుఁ దెచ్చిన న్విడతుమే మాంసాశనవ్రాతమున్.

1 - ముని : రాజకుమారా, ఆత్మోచితశూరాలాపము లాడితివి.

2 - ముని : మేము రక్షింపఁబడితిమి.

3 - ముని : దీనరక్షామణీ, వర్ధిల్లుము.

రాము : మునులారా, భయపడవలదు.

4 - ముని : [మునులవంకఁదిరిగి] తాపసులారా, మహారాజు అభయప్రదానముచేసెను. ఇఁక భయపడకుఁడు.

వసి : ధర్మము గౌరవింపఁబడినది.

2 - ముని : మహాప్రభూ రామభద్రా, ఆదుష్టరాక్షసుఁడు బ్రతికి యుండువఱకు మా నిత్యనైమిత్తిక కృత్యములు కొనసాగవు.

1 - ముని : దీనశరణ్యా, మా యాపద లేమని విన్నవింతుము?

                      సవన యూపస్తంభ నివహంబు రోకళ్ళ
                                 కని పెల్లగింప మాఱాడరాదు;
                      యాగభాగంబుల నర్పింపుఁ డనికోర
                                 నీకున్న యమపురి కేఁగవలయు;
                      పీచుగడ్డంబులు పెఱికి త్రాళులుపేన
                                 వలెనన్న నెదిరింప వలనుపడదు;
                      తపసి కన్నెలఁబట్టి దయమాలి చెఱఁబెట్టఁ
                                 గనులు కాయలుగాయఁ గాంచవలయు:

                      రాక్షసుల దుండగంబులు రాజసభలఁ
                      దెలుపునట్టివె? యటఁజూడ వలయుఁగాని,
                      రామభద్రుఁ డార్యావర్త రాజ్యమేలఁ
                      దాపసుల కిట్టి దుర్గతి దాపరించె.

వసి : హరి హరి ! యెంతటి మాట వినవలసె.

రాము : పాపము శాంతించుఁగాక !

2 - ముని : మహారాజా, ఆ లవణాసురుని విజృంభణ మటుండనిచ్చి మానవ మాంసాభిలాషులగు ఆ దానవసైనికుల యపలాప ప్రలాపంబులు విని విని మాచెవులు కాయలు గాచినవి.

                     లవణుం డీ భువనత్రయీశ్వరుఁడి,కేలాపల్కు? లింకొక్క మా
                     నవనాథుం బతియంచు వాకొనిన మీనాల్కల్ దెగంగోసి నె
                     త్రు వెదల్ చల్లెద మూరకాకులకు, నేరో మిమ్ము రక్షించు ధ
                     ర్మవిదుల్ దెండన నాశ్రయించితిమి రామా, మౌనికల్పద్రుమా.

వసి : దానవసంహారమునకై యవతరించిన ధర్మస్వరూపునకు విధి గదా తాపస రక్షణము.

లక్ష్మ : మునీంద్రా, యూరపిచ్చుకపై బ్రహ్మాస్రము ప్రయోగింప వలయునా ? ఆ యల్పరాక్షసుని వధించుటకు దశకంఠసంహారకుఁ డేఁగవలయునా ?

        సుగంధి - ఒక్కరుండఁ జాలనే మహోగ్రవహ్ని కీలలం
                    గ్రక్కు బాణ సంచయంబు గాడనేసి వాని పే
                    రక్కుఁజీల్చి నెత్రుకండ లంతటన్ విదల్పఁగన్
                    దక్కు వారలేల యొక్క దానవున్ వధింపఁగన్.?

ముని : లక్ష్మణకుమారా, భళి! భళి! ఇంద్రజిత్సంహారకునకుఁ దగినవే యీ వీరవాక్యములు !

శత్రు : అన్నా, నిజప్రతాపమునేల యుజ్జగించుకొందువు? కుక్క ను గొట్ట బచ్చెనకోల కావలయునా?

                    కాయల్గడ్డలు మెక్కు బక్కరుసులం గారించు దైతేయులన్
                    మాయింపన్ యశమౌనె? నీవలుగఁగా మాయావియౌ యింద్రజి
                    త్తో, యుద్ధంబునఁ గుంభకర్ణ ముఖ దైత్యోత్తంసులో వార ! లే
                    లాయీపూనికి? లక్ష్మణా, యసురఁగూల్పన్‌నన్నుఁబుత్తెంచుమా

రాము : వత్సా శత్రఘ్నా, నీపలుకులు ముద్దులొలుకుచున్నవి. నీవే యాలవణాసురుని వధియింపఁ బోయెదవులెమ్ము.

శత్రు : ప్రసాదము.

మునులు : మహాప్రభూ, మాగుండెలు కుదుటఁ బడినవి.

రాము : తాపసులారా, యిఁక మీ మునిపల్లెకుఁ బొండు.

      1 - ముని : శ్రీరామచంద్ర, నీవే
                    యీ రాజ్యము నేలవయ్య యీతి రహితమై
                    ధారాళ సౌఖ్యములు చే
                    కూఱఁగ జనులెల్ల సతముఁ గుతుకము నొందన్ !

[యవనిక జారును.]

తృతీయాంకము

విష్కంభము : హజారపు ముంగిలి.

[భద్రుఁడు ప్రవేశించును.]

భద్రు : గూఢచర్య మెంత నిషురమైన యుద్యోగము ! అప్రియమైనను సత్యమే పలుకవలయును. భూపతులు చారనేత్రులుగదా ! ఏమి సేయుదును ? ఎంతకాలము తెలుపక యూరకుందును ? విశ్వసనీయుఁడ నని గదా మహారాజు నన్నీ కార్యమున నియోగించెను? ఎన్నిమాఱులో పలుక యత్నించియు నాలుక యాడమి నూరకుంటిని; నేఁ జెప్పక దాఁచినను మఱి యేచారుఁడైన దెలుపవచ్చును. కుండనుమూయ మూఁకుడు గలదుగాని, లోకమును మూయ మూఁకుడు గలదా ?

కటకటా! యిట్టి యుద్యోగమునకా యింతకాలము జీవించియుంటిని? ఆత్మహత్యగావించుకొని యీరహస్యము దాఁచియుంతునా ? [ఆలోచించి] ఎంత వెఱ్ఱివాఁడను. నే హత్యగావించుకొనిన మహారాజు విశ్వసనీయుఁడగు వృద్ధచారుని గోల్పోవుటగాక మఱి యేమి లభించును ? కోమలస్వభావయగు జనక రాజకుమారి యీ యపవాదము విన్న బ్రతికి యుండఁగలదా ?

ఆహా ! లోకమెంత యవివేక పూరితము !

                     అగ్నికీలలఁ బరిశుద్ధ యైనతల్లిఁ,
                     బంక్తిరథునకుఁ గోడలిఁ, బరమసాధ్వి,
                     రాఘవుని పత్ని, సద్గుణ రత్నఖనిని
                     దూఱి రీలోకులు కళంక దూషితనుగ.

[మందారిక ప్రవేశించును.]

మందా : [స్వగతము] అంత:పురమున నమ్మకమైన దాసిగనుండుట కన్న బావిలోపడి చచ్చుటమేలు. ఏపనికైనను మందారికయే పోయి చావవలయును. ఆ పురోహితుఁడు ఎక్కడ బ్రాహ్మణార్థము చేయుచున్నాఁడో యెట్లు కనుగొందును? వాఁడుగో ! భద్రుఁడు, దివాణము దిక్కునకే వచ్చుచున్నాఁడు. అతని నడిగినఁ దెలియును. ఈ ముసలిభద్రుఁడు అంత:పురమున తా నొక్కఁడే విశ్వాసపాత్రుఁడని గర్వపడుచుండును. అతని కొకింత శివమెక్కించిపోయెదను. [మందారిక తొలఁగి తొలఁగిపోవుచుండును.]

భద్రుఁడు : ఎవరక్కడ ?

మందా : [పలుకదు.]

భద్రు : ఎవరది ? మందారికా, ఏమిపలుకవు ?

మందా : ఏమియాపదగలిగినది, ప్రాణముపోయేట ట్లరుస్తున్నావు ?

భద్రు : ఓసి తొత్తుకూఁతురా,ఏమితొలఁగితొలఁగిపోవుచున్నావు ?
మందా : నీవంటి నవకోటిమన్మథాకారుని రాచుకొని పోవలయునా ? [పోవుచుండును.]

భద్రు : మాటలలోనే దాఁటిపోవుచున్నావె ! ఇటురమ్ము. నీయొడిలో నేమొదాచుకొని పోవుచున్నావు. ఏమైన దొంగిలించవు గదా ?

మందా: నీపనికి నీవుపొమ్ము. తక్కినపనితో నీకేమిసంబంధము? దివాణమంతయు నీ మొగముపై నడచుచున్నదా?

భద్రు : ఒసే బానిసకూతురా, మహారాజంతవాఁడు నన్ను పల్లెత్తు మాటయనరు. నీవా నన్ను తిరస్కరించుదానవు? రామభద్రుని శైశవమునుండి నేను సేవకుఁడను సుమా.

మందా : అబ్బా ! అయోధ్యారాజ్యమును రక్షించితివి నీవువచ్చిన రాజకుటుంబము పుట్టిమునుగును. [పోవ ప్రయత్నించును.] భద్రు : ఓసీ మాయలాఁడి. [చేయిపట్టుకొని యొడి తడవును]

మందా : [చిఱునవ్వుతో] భద్రా, మనకిరువురికి పాణిగ్రహణమా?

భద్రు : ఛీ! ఛీ! గయ్యాళి. [చేయివదలును]

మందా : నీ రసికత్వము తెలిసిందిగాని, పురోహితుని యెక్కడనైన చూచినావా ?

భద్రు : ఎందుకు ?

మందా : నిన్నటిరాత్రి నాలుగోజామున దేవిగారు దుస్వప్నము గన్నారఁట. అందుకై శాంతిపూజ చేయించవలసిందని ఆజ్ఞ అయింది.

భద్రు : [ఆశ్చర్యముతో] దుస్వప్నమా ! ఔరా ! దుర్భిక్షమునకు ముందు ధూమకేతువు.

మందా : [స్వగతము] ఈ ముసలి భద్రునకు ప్రతిదియు అమిత ముఖ్యముగ దోఁచు చుండును.

భద్రు : మందారికా, పురోహితుఁ డెక్కడనున్నాఁడో నాకుఁ దెలియదు.

మందా : ఈ వానకా ఇన్ని ఢమఢమలు ? [నిష్క్రమించును.]

భద్రు : ఇఁక నాలసింపఁదగదు. సేవకు లస్వరంత్రులుగదా.

[యవలిక.]

ప్రథమ స్థలము: విశ్రాంతిభవనము.

[రాముఁ డాసీనుడైయుండఁగాఁ దెఱయెత్తఁబడును]

రాము : ఓరి, యెవఁడురా అక్కడ ?

ద్వారపాలకుఁడు : మహాప్రభో, దాదుఁడను.

రాము : ఓరీ, రాజ్యకార్యవిముక్తులమైన మా కించుకసేపు లోకవ్యవహార వినోదము గావింపవలయునని భద్రునకు మామాటగఁ దెలియఁజేయుము.

ద్వార : ఏలినవారియాజ్ఙ. [నిష్క్రమించును.]

భద్రు : రామభద్రా, జయము జయము !

రాము : భద్రా, విశేషము లేవియైనఁ గలవా ?

భద్రు : [నవ్వుచు] ఒక గొప్ప విశేషముగలదు. పాపదేవత మాత్రము మిమ్మెప్పుడు వేయినోళ్ళ దూషించుచుండును.

                         సకల భోగభాగ్య సౌఖ్యములకుఁ బుణ్య
                         కార్యములకు నునికి గలదు రామ
                         రాజ్యమందు, నాకు రవయేనిఁ దలదాఁప
                         నీడ లేదటంచు నిత్య మగలు

రాము : [చిఱునవ్వుతో] ఓయీ, నీ ప్రియోక్తులు చాలింపుము. లోకు లే మనుకొనుచున్నారు ?

భద్రు : దేవర పవిత్రచారిత్రము లోకమున కాదర్శప్రాయ మైనది.

                         రాముఁడు లోకరక్షకుఁ, డరాతిభయంకరుఁ డుగ్రదైత్యదో
                         స్థ్సేమహరుండు, దుష్టజన శిక్షకుఁ, డార్యజనావనుండు, స

                       త్యామల నీతికోవిదుఁ, డహంకృతిదూరుఁ డటంచు సజ్జన
                       స్తోమము లాడుకోఁగఁ బరితోషముతో వినుచుందునెప్పుడున్.

రాము : భద్రా, యివి కేవలము స్తుతివాక్యములు. లోపములేవి వాకొనరా లోకులు ?

భద్రు : [స్వగతము] హా ! మందభాగ్యుఁడను ఏమి తెల్పుదును ?

రాము : ఓయీ, యేలపలుకక యూరకున్నావు ?

భద్రు : [స్వగతము] ఇఁక జెప్పకతప్పదు. [చెప్పఁబోయి యూర కుండును.]

రాము : సంశయించెదవు ! [స్వగతము] ఈతనికేలొకో దు:ఖావేశము గల్గినది. పలుకఁజాలక స్తంభితుఁడై యున్నాఁడు.

                     తను వుద్గత ఘర్మంబుగఁ
                     గనుఁగొనలను బాష్పవారి కణములు జారన్
                     ముని పెదవులు చలియింపఁగ
                     మనమునఁ గల వనటఁ దెలుపుమాదిరిఁ దోఁచున్.

[ప్రకాశముగ] ఓయీ, లోకుల కేమియవాంతరము వాటిల్లదు గదా ?

భద్రు : [నిట్టూర్పుతో] అట్టిలోకుల కేల యవాంతరము గలుగును ?

రాము : [ఆతురతో] ఎట్టిలోకులకు ?

భద్రు : బుద్ధిహీనులైన పురజను లాడెడు
        పలుకు లెపుడు నమ్మ వలనుపడదు

రాము : [ఆతురతో] పౌరు లేమనుకొనుచున్నారు ?

భద్రు : అగ్నిశుద్ధియైన యమలచిత్తకుఁ దప్పు
         లంటఁగట్ట జంక, రళుకు వడరు.

రాము : [ఉద్వేగముతో] హా ! యేమి వినుచుంటిని. భద్రా, యేమంటివి? జానకిని నిందించిరా లోకులు ?

భద్రు : జానపదులు నీరుదెచ్చుకొను బావికడ నొకపల్లెత యేమేమొ యపవాదములు పలుకుచుండెను. నే నెట్లు చెప్పఁగలను ?

రాము : భద్రా, యళుకు పడవలదు.

భద్రు : రావణుఁ డెత్తుకొనిపోయి తనయింట నుంచుకొనిన సీతను మరల రాముఁడు పరిగ్రహించెను; కౌసల్యాదేవి యింటఁబెట్టికొనుటకు సందేహింప లేదు. కౌసల్యయే నేనైన కోడలి నిప్పుడే యిల్లు వెడలించి యుందునని యేమేమొ యసంబంద్ధము లాడుచుండెను.

రాము : ఔరా ! మందభాగ్యుఁడనగు నన్నుగుఱించి సాధ్వీమతల్లియగు కౌసల్యా దేవికింగూడ నిందాపాదనమూ ! అకటా ! వంచింపఁబడితిని. శైత్యమునకై శ్రీఖండతరువు నాశ్లేషించితిఁగాని, కోటర నిలీనయగు విష భుంజగిని గాంచనైతి. ఛీ ! దుష్టహృదయమా, వహ్ని పరిశుద్ధయైన సీతను సైతము సంశయించుచున్నావా ?

భద్రు : రామభద్రా, యవివేకుల యాడికోలు పాటింపఁదగదు.

రాము : ఓయీ, సత్యముపలికితివి.

                    ఏ లలితాంగి సచ్చరిత మెల్లజగంబులఁ బాపవల్లికా
                    మూల ఖనిత్రమై భువనపూజ్యమునై నుతికెక్కె, నట్టి నా
                    పాలిటి భాగ్యలక్ష్మి యపవాదభరంబునఁ గ్రుంగునట్లు కాం
                    తాళముతోడ లోకు లనఁ దాలిమినొందునె చిత్త మిత్తఱిన్ ?

ఓ నిర్విచారప్రపంచమా, నీకు గాలావధి యయ్యెఁ గాఁబోలు

                      అనల పరిశుద్ధయైన పూతాత్మసీతఁ
                      దూలనాడిరి లోకులు దురితమతులు,
                      అగ్నిశిఖతోడ సయ్యాట లాడఁబోవు
                      శలభము లెఱుంగునే ప్రాణసంకటంబు?

భద్రు : [స్వగతము] అయ్యో ! యేమి యుత్పాతము లుప్పతిల్లనున్నవో ! [ప్రకాశముగ] మహాప్రభో, శాంతిల్లుము. దేవరయే కోపించిన నిఁకఁ బ్రపంచమున కెవ్వనిపాదతలము శరణ్యము ! ఆకాశమే కూలిపడిన నెత్తిపట్టువార లెవ్వరు ?

రాము : [స్వగతము] కోపావేశమున సత్య మతిక్రమింపనుంటిని. [ప్రకాశముగ] భద్రా, సీత రావణాపహృతయైనదనుట సత్యము, లంకలో నివసించుటయు యథార్థమె. ఇఁక లోకులేమి యన్యాయమాడిరి?

భద్రు : ఇంతవఱకు నిజమాడిరి.

రాము : అవును. లోకము పాపశంకి.

భద్రు : ఇక్ష్వాకువంశము అపవాదాతీతము గదా.

రాము : [స్వగతము] హృదయమా, నీకార్య మెట్లు నిర్వర్తించెదవు ? ప్రియాంగనాశ్లేష సౌఖ్యము నపేక్షించి చిరకాలాగతమగు రఘువంశ కీర్తి కళంకితము సేయుదువా ? సద్యశమును రక్షించుటకయి యర్దాంగినైనఁ బరిత్యజించెదవా ? కఠినచిత్తమా, యేమి యుపదేశించుచున్నావు ?

                        పెండ్లివేళఁ గాలిబొటనవ్రేలి నొక్కి
                        కంకణమనోజ్ఞమగు సీత కరము గొన్న
                        ప్రియము విడనాడి నేఁడు గర్భిణిని సాధ్విఁ
                        గీర్తికొఱకు వనంబున గెంట మనెదె?

[ప్రకాశముగ] భద్రా, నీవుపోయి లక్ష్మణు నిటకు రమ్మనుము.

భద్రు : ఏలినవారిచిముత్తము. [నిష్క్రమించును.]

రాము : ఈయపవాదమును లక్ష్మణునకె ట్లెఱింగింతును ?

[లక్ష్మణుఁడు ప్రవేశించును.]

లక్ష్మ : [స్వగతము] అన్నగారేమొ దీనవదనులై విచారించున్నారు. [ప్రకాశముగ] అన్నా, లక్ష్మణుడు మ్రొక్కుచున్నాఁడు.

రాము : వత్సా లక్ష్మణా, రామునిజీవితము శూన్యమైనది. ఇఁక నీ వసుంధరా భారమును నీవ వహియింపుము. అందుకై నాకొక ప్రత్యుపకారము సేయుము.

లక్ష్మ : [ఆశ్చర్యముతో] ఏమి యీ వింత !

రాము : లక్ష్మణా,

                      ఈ కరవాలము గైకొని
                      నాకంఠముఁ ద్రుంచుమీ -

లక్ష్మ : అమంగళము శాంతించుఁగాక !

రాము :

                      క్షణంబును రాముం డీకష్ట లోకజీవన
                      శోకము సహియింపలేఁడు క్షుభితాత్ముఁడై.

లక్ష్మ " అన్నా, అకాండముగ నీ మనమేల యింత భ్రాంతిల్లినది ? ఏమి యాపద సంభవించదుగదా. నీ కఠోరవాక్యములు నాహృదయపుటము భేదించుచున్నవి. కాంతావియోగమునందైన నింతటి నిర్వేదముఁ బొంది యెఱుఁగవు.

రాము : లక్ష్మణా, సీతావిరహము రామునిది మాత్రమె. కీర్తివియోగము ఇక్ష్వాకువంశ మంతటిది.

                      చిరకాలార్జితమైన గౌరవ యశ:శ్రీ నేఁడు లోకాపవా
                      ద రజ:పంక కళంకితంబయి చెడెం; దమ్ముండ, యింకేల యీ
                      ధరణీరాజ్యము ? పూజ్యవంశగరిమన్ దైన్యాంబుధిన్‌ముంచితిన్;
                      నరనాథుల్ ననుగాంచినవ్వరె? యిసీ ! నాకేలయీప్రాణముల్?

లక్ష్మ : అన్నా, నీపలుకులు వింతఁగొలుపు చున్నవి. ఇక్ష్వాకువంశమా అపవాదపంకిల మగుట ? ఆశ్చర్యము !

                      నిప్పునకుఁ జెదలు పట్టునె ?
                      కప్పుర సిర మొలయునే వికారపుఁ దావిం ?
                      దప్పులు గలుగునె రఘుకుల
                      మొప్పును దేజంబు దొరఁగ నో రఘువీరా.

మీ మనం బిటుల శోకసంతప్తమగునటుల నపరాధ మొనర్చిన వారెవ్వరు ?

రాము : రావణాపహృతయయి పునర్గృహీతయగు సీత.

లక్ష్మ : [నిర్విణ్ణుఁడయి] కటకటా ! యేల యిట్టి సంశయోక్తు లాడెదరు ?

రాము : సంశయోక్తులు లోకులవి.

లక్ష్మ : [కోపముతో] ఏమీ ? - లోకులు దూషించిరా పతివ్రతా శిరోమణిని ?

                     తెలియరొ ! ధారుణీతనయ, తెంపరిమూకల యాడికోలుకున్
                     వెలుపటి సత్య తేజమని, వీరలవారల పోల్కిఁ గండ క్రొ

                     వ్వొలయఁ బవిత్రవర్తనను నొప్పని కారులుప్రేలినట్టి లో
                     కులను నుపేక్షసేఁత మనకు న్నరపాలురకైన ధర్మమే ?

అన్నా, లోకులు మందబుద్ధులు; గతానుగతికులు; సత్యాసత్య వివేక శూన్యులు.

రాము : అవును; అగుదురు.

లక్ష్మ : అట్లయిన వారి యపలాపప్రలాపములా మనకుఁ బ్రమాణములు ?

                     జను లపవాదముల్ పలుకఁ జాలుదురంచుఁ దలంచి, లంకలో
                     ననల విశుద్ధయౌటకు నిలాత్మజ మీ రడుగంగ నెమ్మనం
                     బున నళుకింతలేక నగుమోమునఁ జొచ్చె హుతాశనార్చులన్
                     జనకజ నిష్కళంకయని సన్నుతియింప నిలింపసంతతుల్.

రాము : వత్సా, నాకన్నులను నేనే విశ్వసింపక పోవుదునా ?

                     నమ్మెడివాఁడఁ గాను లలనామణి జానకి సంశయింప న్యా
                     యమ్మని, యైన లోకులు నయమ్మెడఁబాసి వివేకశూన్యులై
                     యి మ్మలినాపవాద ముదయింపగఁ జేసిరి ! దూఱువాప నిం
                     ద్యమ్మొ యధర్మమోవిధియొతమ్ముఁడ, నీ వెతలంపు మీయెడన్

లక్ష్మ : ఇఁక మూఢాత్ములే ధర్మసాక్షులా ?

రాము : లక్ష్మణా,

                      మూఢచిత్తులైన, బుద్ధిమంతులె యైనఁ
                      బ్రజల రంజనంబు పాలనంబు;

                      సత్యబాహ్యమైన, సమ్మతిగానున్న
                      వారి ననుసరింప వలయు నృపతి.

లోకు లభినందింపని రాజ్యపాలనము నిరర్థకము.

                      నన్నైన సీతనైనను,
                      నిన్నైనను రాజ్యమైన నేవిడతును లో
                      కోన్నత కులకీర్తికి నా
                      పన్నత వాటిల్లెనేనిఁ బలుకు లిఁకేలా ?

వత్సా, యేల వితర్కము ? కార్యము నిశ్చయింపఁబడినది.

లక్ష్మ : {ఆతురతో] ఎటులు ?

రాము : ఇటురమ్ము. [మెల్లగా] సీతను ఋష్యాశ్రమున వదలి రావలయు.

లక్ష్మ : [చకితుఁడై] అకటా ! యేమివింటిని ? కానలకుఁ బంపుటయా ? అన్నా, చిత్తచాంచల్యమునఁ బలుకవుగదా ?

రాము :

                      నిండుచూలాలి జానకి నెనరులేక
                      కాననంబుల కంపింపఁ గడఁగు వీని
                      కెక్కడిది చిత్తచాంచల్య ? మేటికరుణ ?
                      యేన క్రూరుండఁ బల్కితి నిట్టిమాట.

లక్ష్మ : అన్నా, అతి కఠోరశాసనము.

రాము : లోకమును సంతోషపెట్టవలయు.

లక్ష్మ : లోకమున సజ్జనులులేరా ? రాము : తమ్ముఁడా, సజ్జనుల కత్తిపోటులకన్నను దుర్జనుల నాలుక పోటు లతి క్రూరములు.

లక్ష్మ : అన్నా, అపూర్వ మీ ఘోరశిక్ష.

రాము : ఇక్ష్వాంకువంశకీర్తి దిగంతవిశ్రాంతము. ఈయపవాదము తూలరాశింబడిన యగ్నికణమువలె సకలదిక్కులకు వ్యాపించును.

లక్ష్మ : మీకు ధర్మము నుపదేశించునంతటి కోవిదుఁడనా ?

రాము : ఉపదేశించియు నిరుపయోగము.

లక్ష్మ : [స్వగతము] అయ్యో ! యిఁక నేనేమి సేయుదును ? [ప్రకాశముగ] అన్నా, దేవి ఆపన్న సత్వ,

రాము : ఈక్రూరాత్ముని చిత్తము పాషాణసదృశము.

లక్ష్మ : వెనుక చింతించియు - [అర్థోక్తియందె]

రాము : లక్ష్మణా, కర్మఫలానుభవ మెవ్వరికిందప్పదు. కార్యము నిశ్చితము. ఆజ్ఞను పాలింపుము.

లక్ష్మ : [స్వగతము] వినయముచే నిరుత్తరుఁడనైతి [ప్రకాశము] మీయిష్టానుసారము ప్రవర్తించెదను.

రాము : దండకారణ్య నివాసినులగు తాపసబాలికల దర్శింప సీత యభిలషించినది. నేఁడే ప్రయాణము సాఁగింపవలయు.

లక్ష్మ : [దు:ఖముతో] అన్నా ! మఱియొక్క మాఱీ -

రాము : లక్ష్మణా, యిఁక మాఱాడిన నాయాన గలదు. అగ్రజుని పనుపుసేయుము. పొమ్ము.

లక్ష్మ : [స్వగతము] ఎఱిఁగి యెఱిఁగి నేనీ ఘోరకృత్య మెట్లొనరింతును? హా ! పాపపుదైవమా నీకెంత నెనరులేక పోయె. [నిష్క్రమించును.]

రాము : [దు:ఖముతో] ఔరా ! యెంతటి కాఠిన్య మారోపించుకొన్నను శోకభారమున నాచిత్తము క్రుంగుచునేయున్నది. పత్నీవిరక్తుఁడ నగుటయే గాక యనుజ తిరస్కారియుం గావలసె. జానకి లేక రామునికి నునికిగలదా ? కఠిన హృదయమా, నీకార్యము నిర్వర్తించితివి. ఇఁక రాముని సంసార మసారమైనది.

హా ! వనవాసప్రియసఖీ జానకీ, నిన్నుఁ గానలకంపి నేనెట్లు బ్రతికి యుందును ? పదునాలుగేడులు ఘోరకాంతారముల నివసించియు నీవు నన్నుఁ గూడియుండుటఁగదా యాపదలెల్ల సౌఖ్యములుగను. అరణ్యమే యయోధ్య గను జూపట్టినది. నీవు దైత్యాపహృతవైనప్పుడు గదా నాకు యథార్థమైన యరణ్య నివాసము.

ప్రాణప్రియా, యీక్రూరాత్ముని యుపబోగ్య హారవల్లికయని గ్రహించితివి; విషవ్యాళమై కఱవనున్నాఁడు.

                     దేహముననుండి హృదయమ్ముఁ దీసివైవ
                     హృదయ దేహమ్ము లెడమౌట బ్రతుకఁ గలవె?
                     నాదు నర్ధాంగి సీత ననాదరమునఁ
                     గాన కంప మాయిద్దఱి గతులిఁ కేమొ !

జానకియందు లోకమేగాదు అపరాధి; ఈకారుణ్య రహితుఁడు రాముఁడుకూడ !

                     ప్రియుఁ డటంచును, సౌందర్యమయుఁడటంచు,
                     ధీరుఁడనుచును, ద్రైలోక్య వీరుఁడనుచు
                     నెవని నమ్మి కరాంబుజ మిచ్చినావొ
                     ఆ కులాంతకుఁడే కానకంపు నిన్ను.

సీతా, మదేకజీవితా, నేను జీవించియు నీ వనాధవైతివా ? [దు:ఖించును.]

[యవనికజాఱును.]

ద్వితీయస్థలము : సీతపడకటిల్లు

[సీత నిద్రించుచుండును; రాముఁడు ప్రవేశించును.]

రాము : అకటా ! కఠోరచిత్తమా, నీ వేల మెత్తందన మూనితివి? నన్నేల యర్ధరాత్రమున నీయంత:పురమునకుఁ గొనితెచ్చితివి? నీయం దనురాగ మిసుమంతయైనఁ గలదా ? అట్లయిన లక్ష్మణుని మృదుమధురములగు అనునయాలాపములు నీ వజ్ర సదృశమగు కవచము నేల భేదింపలేక పోవును ?

                   జననంబాది నిశాత శస్త్ర విదళ చ్ఛత్రూత్తమాంగ స్రవ
                   ద్ఘన రక్త హ్రదమందుఁ జేతులను సంక్షాళించు నీ రామభ
                   ద్రుని చిత్తంబవు ! నీకు నెక్కడిది కారుణ్యంబు? గాకున్నఁ గా
                   ననముం జేర్పఁగ నియ్యకొందువె సతిన్ సంపూర్ణ గర్భాలసన్ ?

ఇదే జానకీ శయనాగారము. ఈమందిర మనుదిన పరిచితమయ్యు మనోలౌల్యమువలన నూతన నివేశమువలె నగపడుచున్నది.

అంత:పురమంతయుఁ బ్రశాంతమై నిద్రానిబద్ధమై నిశ్చలమై యలరారుచున్నది. అచ్చటచ్చట మధుపానమత్తలై నిదురించు పరిచారికల యుచ్ఛ్వాస నిశ్వాసముల యలుకుడుదప్ప నొక్క చీమయైనను నిశాప్రశాంతమునకు భంగము గావింపదు. లోకమంతయు నిద్రానందపరవశమై యున్నను రాముఁడు మాత్రము శోకాకులుఁడై దొంగవలె ప్రసుప్తయగు సీతాలతాంగి శయనాగారముఁ జొచ్చుచున్నాఁడు

[పరిచారిక కలవరించును.]

ఏమది ? పరిచారిక లెవ్వరైన మేల్కనిరా? కాదు ఎవతెయో కల వరించినది. నా జీవితేశ్వరి యెక్కడ నిద్రించుచున్నది? ఆ - అదిగో ! హంసతూలికా తల్పమున -

                      కన్నుల సత్తప:ఫలము కాయము నొందెనొ! యంబుదంబులం
                      జెన్నొలికించు మించటకుఁ జేరెనొ! కల్పలతా కుడుంగ మం
                      దు న్నెఱపూలపాన్పుపయిఁ దూఁగు నిలింపలతాంగి యేమొ!కా
                      ది న్ననబోణి నాదు హృదయేశ్వరి జానకియే నిజంబుగన్ !

ఆహా? యేమి యీ యమాయిక వదనబింబమునఁ దాండవించు లావణ్యము !

                     అలకా క్రాంత లలాటసీమను గవాక్షాయాత చంద్రాంశుమా
                     లలు కర్పూరపు నిగ్గులం జిలుకఁ దల్పంబందు నిద్రించు నీ
                     లలనారత్నము సీత, యైందవ శిలా లావణ్య సారంబు ప్రో
                     జ్జ్వల కాంతాకృతి నొందెనో యనఁగ నాభావంబు రంజించెడిన్!

కరచరణాద్యవయన శోభితమగు నాహృదయ మే యిది. [ముద్దిడఁబోయి వారించుకొని] ఛీ! నే నెవ్వఁడ నీ నారీమణి నంటుటకు ?

                     రాముఁడను గానొ? నిద్రించు రామ సీత
                     గాదొ? నేనేల ముద్దిడరాదొ?

నన్ను నేనే శూన్యుఁడనుగఁ దలంచుకొనుచున్నాను. ఏమి యిది స్వప్నమా?

కంటి

                      నకట! దారుణసత్యంబు; నవనిజాత
                      రామ హృదయంబుగాదింక, రమణి యెవతొ?

మదేకజీవితా, సీతా, గృహేందిరా, హృదయేశ్వరీ, అని మధురముగ సంబోధించు నా నాలుక నేఁటి కిట్టి కఠినాలాపము లాడవలసెఁగదా!

                     ఏకన్య పాణి నందీయ శతానందుఁ
                             డంగంబు పులకింప నందికొంటి;
                     ఏ ననబోణి నే నేగుదెంచఁగఁ దానె
                             ఘోరాటవులకుఁ న న్గూడివచ్చె;
                     ఏ సాధ్వి దను జాపహృతయయ్యు నేక వే
                            ణీవ్రతంబున సతీనియతి గడపె;
                     ఏ మోహనాంగిని నెడఁబాయ నాకు లో
                            కము శూన్యమగునట్టి విమలహృదయ;

                     అంభుజేక్షణ, రాకా శశాంక వదన,
                     యజన భూజాత, పూతవిఖ్యాత సీత
                     పాపకర్ముని కీర్తినాఁ బాసిపోవు;
                     రామభద్రున కింక దుర్భరము బ్రతుకు!

జానకీ, నాహృదయమును దొంగిలించుకొని పోవుదువా ? ఈ రామునకు హృదయ మొకటికలదా? కలిగిన బంగారుబొమ్మను. ఈ ముద్దుల మూటను వన్యమృగములకు బలియాయనెంచునా ? కాంతామణీ, ఈలోకమున నిన్నుఁ గాంచుటకిదియే కడసారియా? ఆశాకుసుమంబున కీ సందర్శన మే వృంతచ్యుతియా?

లలనామణీ, నిరపరాధిని వగు నిన్నుఁగాన పాలుసేయనున్న ఈ కఠినాత్ముని మీ యిలువేల్పులైనఁ గోపింప రేల? పితృలోకవాసులగు నో రఘుకులేశ్వరులారా ! నన్నేల మీరు శపింపరు ? నిలింపులారా, మీ సమక్షమునఁ గదా సీత యగ్నిపరిశుద్ధయైనది, అట్టి మిమ్ములనైన గౌరవింపక కులకాంతను అడవులకు వెడలించు ఈ నిర్దయుని ఏల సహించుచున్నారు. ప్రకృతీఁ నీవేల తామసించితివి ?

                    నిర్భర ప్రళయాబ్ద గర్భసంభూతమై
                            కులిశోత్కరంబు నన్గూల్పదేమొ !
                    ఝంఝానిలోద్వేల సాగర కల్లోల
                            ములు పొంగిపొరలి నన్ముంప వేము!
                    పెటపెటార్భటితోడఁ బెటిలి యీ కుతలంబు
                            అతలంబునకు నన్ను నడపదేమొ!
                    క్షణకాలభగ్నమై స్తంభావలంబంబు
                            సౌధంబు గూలి నం జదుపదేమొ!

                    రాముఁడే లేకయున్న నీరాజవదన
                    యఖిల సౌఖ్యాభిరామయై యలరకున్నె?
                    శోక ఘూర్ణితమయ్యును సొక్కుఁగాని
                    యెంత కఠినంబొ పగుల దీ హృదయమకట!

సీత : [నిదురలో] ఆర్యపుత్రా, నన్ను మఱచితివా ?

రాము : సీత మేల్కనినదా? [చూచి] కాదు కాదు. కలవరించు చున్నది. ఆహా ! ప్రణయోత్కర్షము. ఈ లతాంగి నిద్రయందైనను నన్నే తలపోయుచున్నది.

హృదయేశ్వరీ, క్రూరసర్పము అమృతమయఫలంబు నంటురీతి ఈ నిర్దయుఁడు కడసారి ముద్దుగొనుచున్నాఁడు.

సీత : [మేల్కొనఁబోవును.]

రాము : జానకి మేల్కొనుచున్నది. ఇఁక నిటనుండఁదగదు. వీడిపోవఁ గాళ్ళురాకయున్నవి. ప్రేయసీ, యిదే కడసారి సందర్శనము.

[నిష్క్రమించును.]

సీత : [మేల్కొని] ఆర్యపుత్రుని కంఠస్వనమువలె నెద్దియో అవ్యక్తగంభీరధ్వని నాకు వినఁబడినట్లు తోఁచినది. [కలయంజూచి] ఇచ్చట ఎవ్వరును లేరు. కలగని మేల్కంటినిగాఁబోలు ! కను ఱెప్పలు నిద్రమాంద్యమునఁ గూరికొని పోవుచున్నవి. [మిద్రించును.]

[యవనిక జాఱును.]

చతుర్థాంకము

విష్కంభము

[మధురిక అటుతర్వాత ఒక నిమిషమునకు మందారిక ప్రవేశింతురు.]

మధురిక : ఇదిగో! అంత:పురపరిచారిక వస్తూవున్నది. దీని నడిగిన సమాచారమంతా తెలియును. ఒసే మందారికా, తలవంచుకొని యెక్కడికే బిరబిర పోతున్నావు ?

మందా : ఓహో! మధురికా.

మధు : నీవు రాణిగారితోగూడా మునికన్నెల చూడడానికి పోలేదా ?

మందా : ఆ - నాపని పోయినట్లే వుంది.

మధు : ఏమే గొంతుకు వురివేసుకో బొయ్యేదానివలె మాట్లాడుతున్నావు ? అంత:పురంలో నీకేమైనా చీవట్లు తగిలినవా ?

మందా : కాదేపిచ్చిదానా, మహారాజుగారివొల్లు జబ్బుసంగతి నీకు తెలియలేదా ?

మధు : ఏమో చూచాయగా విన్నాను. ఇప్పుడేమైన నెమ్మదిగా వున్నదా ?

మందా : మధురికా, యేలినవారికి జ్వరతమందము గలిగిందని రాజవైద్యుగులు చెప్పు కొనుచుండగా నేను రహస్యముగ విన్నాను; దేవిగాఱిని గుఱించి యేమేమొ కలువరిస్తున్నాఁడఁట మహారాజు ! రాజకులమంతా హల్లకల్లోలంగా వుంది.

మధు : అయ్యో పాపము ! యీసంగతి రాణిగారికి తెలిసివుంటే మునికన్నెల చూడడానికి పొయ్యేవుండదు.

మందా : దేవిగారు బయలుదేరిన వెనుకనే ప్రెభువుగారికి జన్ని పట్టినదఁట.

మధు : అయ్యో! నీవొక్క మారైనా దరిశింపలేదా యేలివారిని.

మందా : వైద్యుగుల వుత్తరవులేనిదే రాజబందుగులు గూడ అక్కడికి పోగూడదని భద్రుఁడు చెప్పినాఁడు.

[నేపథ్యమున]

ఒసే మందారికా, నీవింకా యిక్కడనే పెత్తనము చేయుచున్నావా ?

మందా : వాడుగో!భద్రుఁడు అరుస్తున్నాడు. తొందరగా పోవలెను. ఆ ముసిలి కట్టెతో నా కత్తకోటరికమైనది. [పోఁబోవును]

మధు : మందారికా, యిట్లెక్కడికి పోతున్నావు ?

మందా : నవగ్రహదానా లియ్యడానికి కొట్టిడీనుండి నవధాన్యాలు తెమ్మని పురోహితుఁడు పంపించితే పోతున్నాను.

మధు : సరేపొమ్ము, సాయింత్రం అక్కడికి వస్తాను.

[ఇరువురు నిష్క్రమింతురు.]

ప్రథమస్థలము : అడవి.

[సీత చెట్టుమొదట నిద్రించుచుండును - లక్ష్మణుఁడు ప్రక్కన నిలుచుండి యుండును.]

లక్ష్మ : వాఁడుగో! శుక్రభగవానుఁ డుదయింపనున్నాఁడు. [ఆలకించి] ఆహా! శకుంతసంతానముల కలకల నినాదములు సమీరసమ్మిళితములై వీనులకు విందొనరించుచున్నవి !

                    అనిలోచ్చాలిత పర్ణ మర్మర రవవ్యాప్తిన్ సుఖస్వప్న బం
                    ధనము ల్వాయఁగ నుల్కిలేచి ఖగసంతానంబు నీడంబులన్
                    ఘనరావంబొనరింప యామవతి యాజ్ఞం గాలముందెల్పఁగో
                    యని చాటించెడు కాలమాపకుని కంఠారావమో నాఁదగున్.

[సీతంగని] ఔరా ! మానవుల కెంతటికష్టములైనను అనుభవించుకొలఁది సాధారణమగుచుండును. లేకయున్న అంత:పురనివాసయోగ్యయగు ఈ సుకుమారి యెక్కడ ? ఘోరమృగభయంకరమయి కఠినశిలాకంటక భూయిష్ఠమగు ఈ కాంతారతలమున నిదురించుట యెక్కడ?

                    లవలీపల్లవ కోమలంబులగు నీలావణ్యవత్యంగముల్
                    దవులం గావలసెం గఠోరధరణీ తల్పంబునన్, రామ బా
                    హువు దిండై సుఖనిద్రనొందఁదగు నీ యోషిల్లలామంబు దా
                    రువుఖండం బుపధానముం జలిపి గూర్కుం బూవుముండ్లంబలెన్.

మానవజీవితము సుఖదు:ఖ పరిపూరితమయ్యును గర్మఫలాను భవ మందు వ్యత్యాసము గనుపట్టుచుండును. అకటా! మా కుటుంబమంతయు నెడతెగని శోకదవానలంబున మ్రగ్గుటకే జన్మించెనా ? ఒక్కరి నొసటనైనను మంచి వ్రాఁతవ్రాయఁడా ఆ విధాత?

                     వనవాసంబుగతించె, దానవుల దుర్వ్యాపారముల్మాసె, భా
                     మినిచేకూఱె, ధరాధిరాజ్యవిభవామేయాను భావంబునన్
                     మనమింపార సుఖంబులొందు చెటులో మాకాలముం బుచ్చనౌ
                     నని యోచింప నిటాయెఁ; జిత్రము లహా!యా దైవనిర్దేశముల్ !

తల్లీ విదేహరాజనందనీ, ఘోరదవానల జ్వాలలు తరుకోటరమున కంటుకొనుచుండ నేమియుందెలియక సుఖనిద్రా పరవశయైయున్న శారికా కుమారివలె శయనించియున్నావా ?

రామచంద్రా, యిట్టి ముగ్ధహృదయను ఇట్టి లోకపావనచరిత్రను నీవెట్లు విడనాడ సాహసించితివి ? ఎంత వేడికొన్నను వినవైతివే ! అకటా ! యీ పాపకార్యమొనరింప అగ్రజుఁడు నన్నే నియోగింపవలయునా ?

                     పదునాలుగేండ్లు వనముల
                     నొదవిన కష్టముల కోర్చి యున్నాఁడు దయా
                     స్పదచిత్తుఁడు గాఁడని యా
                     సదయుఁడు నన్నీ యఘంబు సలుపఁబనిచెనో!

కాకున్న నిట్టి నింద్యోద్యోగమున నన్నేల నియమించును ? కులిశాఘాత ప్రాయమగు రామసందేశము నీ కుసుమకోమల కెట్లెఱింగింతును ? ఎట్లెఱింగింపక యూరకుందును ? ఒకవంక నలంఘ్యమగు నగ్రజునియాజ్ఞ - వే ఱొకవంక మృదులమగు మానుషస్వభావము - నా యంతరాత్మను బీడించుచున్నవి.

సీత : [మేల్కొని] మందారికా, - [కలయంజూచి] ఓహో అంత:పుర మనుకొంటిని. వత్సా, యరుణోదయ మయినట్లున్నది.

                     వనవృక్షచ్ఛదసంచయాంతరములన్ వ్యాపించిసూర్యాంశు కాం
                     చనకాంతుల్ పరికీర్ణ నిష్కముల యోజన్ నేల బింబింప భా
                     నుని భీతిం దిమిరంబు తారకల సందోహంబుతోవచ్చి కా
                     ననపాదంబుల నాశ్రయించె నన నానందంబు సంధించెడిన్.

లక్ష్మణా

లక్ష్మ : [ఆలోచించుచుఁ బలుకడు.]

సీత : [స్వగతము] నిన్నసాయంకాలమున నేఁ బిలిచినను దెలిసికొనక లక్ష్మణుఁ ఢేదియో యోచించుచుండెను. ఇప్పుడు సైతము అన్యాయత్త చిత్తుఁడై చింతించుచున్నాఁడు. [ప్రకాశముగ] అన్నా, లక్ష్మణా.

లక్ష్మ : అమ్మా, యేమంటివి ?

సీత : నిన్నటినుండియు నీవేలొకో దీర్ఘచింతానిమగ్నుఁడవై యున్నాఁడవు. నీ మోముచూడా దైన్య మొలుకుచున్నది.

లక్ష్మ : విశేష మేమియులేదు. ఈ వనమనోహరత్వమును దలపోయుచుంటిని.

సీత : [స్వగతము] అదియేమొ నామనమున నూహింపరానిసంశయము వొడముచున్నది. [ప్రకాశముగ] లక్ష్మణా, నిన్నటిదినమున మనము గంగానదిని తరియించితిమి గదా, ఇఁక ఋష్యాశ్రమముల కెంతదూర మేఁగవలయును ? వత్సా చూచితివా ఆ లేటికొదమను,

లక్ష్మ : ఎక్కడ? సీత : [నిరూపించి]

                       ఆశ్రమకురంగ మల్లదే ! యఱుతఁబూల
                       మాల వ్రేలాడ సెలయేళ్ళ కూలములను
                       గప్పురము లట్లు నురుగులు గాఱుచుండ
                       మిసిమి పచ్చిక జొంపంబు మేయుఁ గనుము !

లక్ష్మ : అమ్మా, ఈవనసౌభాగ్యము దిలకించుకొలఁది యీప్రాంతములు తాపస నిలయములుగఁ దోఁచుచున్నవి.

                      వనహోమోద్గత ధూమధూమ్రములు పర్ణంబుల్‌ధరాజంబులన్
                      బువుగుత్తుల్ మునిబాలికాపచితముల్ పూజార్థ, మిక్కానలో
                      సవనాజ్యామల సౌరభంబులొలుకున్ సర్వంబు; వేయేల? మౌ
                      ని వరుల్ కాఁపురముండు చిహ్నములురాణించున్ విశేషంబుగన్

సీత : వత్సా, మనము పోవలసిన తపోవన మెంతదూరముననున్నది?

లక్ష్మ : ఈ భాగీరథీ పరిసరారణ్యముననే కొంత దవ్వేఁగవలయు

సీత : అటులైన నేనిఁక నడవఁజాలను. ప్రొద్దుటినుండియు నేదో మనోవికారము ననుఁ గలఁచుచున్నది. రాత్రియంతయు నిదుర పట్టియుఁ బట్టకయుండుటవలన అవయవముల బడలిక యింకను దీఱదు. అదియుంగాక సూర్యతాపము హెచ్చుచున్నది. కొంతసేపీ శీతల తరుచ్ఛాయల సేదదీర్చికొని మెల్లగఁ బోవుదము.

లక్ష్మ : అటులనే విశ్రమింపుము. దప్పిగొనియున్న - [అర్థోక్తియందె.] సీత : లక్ష్మణా, నాకేమియుం బనిలేదు. ఈమనోహరారణ్యవాటికఁ గాంచినంతనే నామన మానందపులకితమైనది. ఆహా! నాజీవిత కాలమంతయు నిచ్చోటనే గడపఁగలిగిన-

లక్ష్మ : [స్వగతము] హతవిధీ, ముందుగనే పలికించుచున్నావా?

సీత :

                    సరసఫలావనమ్ర తరుజాలము తియ్యని పండ్లనిచ్చు; ని
                    ర్ఘరములు నిర్మలాంబులిడుఁ; జల్లనినీడలొసంగుఁ బూఁబొదల్
                    మరుతము పుష్పసౌరభ సమంచితమై గమనప్రయాస ని
                    ష్ఠురతఁదొలంచు; మృత్యువిటఁ జొప్పడినంబ్రియమౌనులక్ష్మణా

ఆహా! ముందటిజన్మమున నేనేమి నోములునోచి ఆర్యపుత్రునివంటి యనుకూలపతిని గాంచితినో గదా. ఆ సరసుఁడు నామనోభీష్టమును అనుసరింపకున్న నాకీ ప్రకృతి రామణీయకము దర్శించు భాగ్య మబ్బియుండునా ?

లక్ష్మ : [స్వగతము] అయ్యో! అమాయికా ! [కన్నీరునించును]

సీత : [చకితయై] అన్నా లక్ష్మణా, నీవేల కన్నీరునించుచున్నావు? నిన్నటినుండియు నా చర్యలన్నియు శంకావహములుగ నున్నవి. ఊరక నిట్టూర్చుచుందువు. ఆలోచించుచుందువు. దీనవదనుఁడవై నేలచూచుచు నీలోన నీవే మాటాడికొందువు. హృదయము నొగిలించు శోకభారము నీమోమునఁ దొల కాడుచున్న ట్లున్నది. వత్సా, అందఱకు సేమమే గదా. నీవేల పలుకవు?

                     ప్రేమ మయుండు నావిభుఁడు, వీరకులా భరణుండు, సద్గుణ
                     స్తోముఁడు, శౌర్యధాముఁడు యశో ధవళీకృత దిక్తలుండు, స

                     త్యామలవర్తనుండు, కరుణామృత సాగరుఁ డా యయోధ్యలో
                     నేమియు నాపదంబొరయ కే సుఖ మొందుచు నున్నవాఁడొకో?

లక్ష్మ : అన్నగారు సుఖముగనే యున్నారు.

సీత : లక్ష్మణా. నామనమునఁ దెలుపనలవిగాని యనుమాన ముప్పతిల్లుచున్నది. నేను వనములకు వెడలునప్పుడు రాజకార్యలంపటుఁడయి హృదయేశ్వరుఁడు నన్ను వీడ్కొలుపఁడాయె. అన్నా, శత్రుఘ్నుని సమరయాత్రలో నేమియు అమంగళము వినవుగదా ! సవనదర్శానార్థమేఁగిన భరతకుమారుఁడును గురుజనులు కుశలముగ నున్నారా?

లక్ష్మ : పూజ్యురాలా, అందఱకుం గుశలమే.

సీత :: లక్ష్మణా, మీయన్న జనరంజకముగఁ బాలించుటలేదా?

లక్ష్మ : అమ్మా, లోకుల సంతోష పెట్టఁ దన యర్థాంగినైనఁగాన పాలుసేయ సాహసించు కీర్తికాముఁడు ధరాతలమెల్ల శాసింప నిఁక జనరంజకత వేఱ చెప్పవలయునా ?

సీత : అట్లైన నీహృదయాందోళనమున కేమికారణము?

                     పరమసౌఖ్యములను భార్యను విడనాడి
                     యన్న ననుసరించి యటవికేఁగు
                     నప్పుడైన నిట్టి యార్తితోఁ గుందవు
                     చింతఁబొంద నేల చెప్పుమన్న.

లక్ష్మ : [కన్నీటితో] తల్లీ లోకపావనీ.

ఏమని దెల్పుదున్ రఘుకులేశ్వరునాజ్ఞ- [నిట్టూర్చును.] సీత : [చకితయై] ఆజ్ఞయేమి - ఏల విలంబించెదవు?

లక్ష్మ : -

                      ......................................................శతారపాతమై
                      నీ మనముం గలంచదె! అనింద్యచరిత్రఁ బతివ్రతామణిన్
                      గోమలచిత్త నిన్నుఁగొని ఘోరమృగాకుల భీకరాటవిన్
                      రాముఁడె వీడఁబంచెననఁ, బ్రాణము లింకెటు చిక్కఁబట్టెదో.

సీత : [దిగాలుపడి] వత్సా, వత్సా లక్ష్మణా, ఏమంటివి? ఆర్యపుత్రుఁడే నన్నుఁ గానలో విడువఁబంచెననియా? ....నిజముగనా? - ఆ - ఆ [మూర్ఛిల్లును.]

లక్ష్మ : అకటా ! యెంతకష్ట మెంత కష్టము ! రామమయ జీవిత మూర్ఛిల్లినది. - తల్లీ, యూరడిల్లుము.

సీత : [సగములేచి] లక్ష్మణా, ఆర్యపుత్రునియెడ నేనేమి యపరాథ మొనరించితిని.

                     తడిగుడ్డఁ జుట్టి చల్లఁగ
                     మెడఁగోసెడు కఠినహృదయు మేలనిపించెన్
                     నడుకాన నన్ను గెంటగఁ
                     దొడరిన కౌసల్యసుతుఁడు; దుర్భర మకటా!

అయ్యో! నేనెంత పాపాత్మురాలను ? నామనోనాయకుని నిష్కారణముగ నిందించుచున్నాను. అన్నా, నీవేమిపరాకున వింటివో గాని, క్షణకాలమైన నన్ను విడనాడి జీవింప నేరని ప్రణయసముద్రుఁడు నామనోహరుఁడు ఇట్టి ఘోరకార్యమున కియ్యకొనునా?

                     ననుగాంచి నిమిషమైనను నొక్కయుగమని
                                  పలుమాఱుఁదిలకించు ప్రణయమహిమ;
                     ప్రణయకోపమున నవ్వలి మొగం బయ్యును
                                  మునుదానె మాటాడు మోహగరిమ;
                     నామనంబెఱిఁగి మన్ననగ లాలించుటే
                                  జన్మఫలంబను జాణతనము;
                     అగ్నిసాక్షిగఁ బెండ్లియాడిన ననుఁబ్రేమఁ
                                  దలఁపున కెలయించు ధర్మసక్తి;

                     నవ్వులాటలకైనను నన్నుఁజేరి
                     మేలమాడంగనోపని మెత్తఁదనము
                     నేఁడు వమ్మయిపో విడనాడినాఁడె?
                     మన్మనోహరుఁ, డిదియేటి మాట వత్స !

లక్ష్మణా, ఆర్యపుత్రుఁ డేమనెనో ఆపలుకులనే వినిపింపుము.

లక్ష్మ : [స్వగతము] అయ్యో! యీసాధ్వీమణి యెంతముద్దరాలు ! [ప్రకాశముగ] తల్లీ, చెప్పెదను.

                     జానకి మన్మన:పదము సాధుజన స్తవనీయశీల ము
                     గ్ధానన........

సీత : [స్వగతము] హృదయమా, యింతకే సంతసింపకుము.

లక్ష్మ : ...ఏలొకో కుజనులాడిరి నిందలు దుర్మదాంధులై

సీత : ఏమీ? లో కాపవాద దూషితనా? లక్ష్మ :

                      మానిని నింక నేలికొన మానితమౌ రఘువంశకీర్తికిన్
                      న్యూనతగల్గుఁగాన నెగులొందక కానన వీడుమీ సతిన్.

సీత : ఆహా! మేఘాండబరములేని వజ్రపాతము ! లక్ష్మణా, అయోధ్యలో సజ్జనులు లేరా ఇది తగదని బోధించుటకు? నీతికోవిదులగు తాపసోత్తములు కఱవయిరా? నాహృదయేశ్వరుని మనము సత్యా సత్య వివేకశూన్యమైనదా? మున్నటిప్రేమ యంతయుఁ గపటనాటకమా ?

                      హృదయకూలంకషంబుగఁ బొదలి పొంగి
                      పొరలు ప్రణయ ప్రవాహంపుఁ దరఁగలైన
                      సరసవీక్షణలసేకంబు సలుపు ప్రియుఁడె
                      యటవులకు నన్నుఁబంపుట యద్భుతంబు!

లక్ష్మ : కరుణా సముద్రుఁడు కఠినచిత్తుఁడగుట దైవ దుర్విపాకము గాక మఱి యేమనవచ్చును?

సీత : కుమారా, ఆర్యపుత్రుఁడు తనకన్నులనే విశ్వసింపఁడా? తన మనమునే సంశయించునా? నా పాతివ్రత్యము ననుమానించెనా?

                      జనముల్ నోటికివచ్చినట్లు పలుకన్ శంకింప రెవ్వారినిన్
                      మనుజాధీశ్వరుఁ డట్టి వాక్యముల సమ్మానించి, చూలాలి కాం
                      తను నిశ్చింతగఁ గానకంపఁదగవే? ధర్మంబె? యీన్యాయముల్
                      మనకై పుట్టెనె లక్ష్మణా? యిదియు సన్మార్గంబెమీబోంట్లకున్ ?

లక్ష్మ : తల్లీ, లోకపావనీ, నీపాతివ్రత్యమును రామచండ్రుఁడు శంకింపలేదు. ఇఁక శంకింపఁబోఁడు. అవివేకు లాడుకొను నపవాదములవలన రఘువంశకీర్తి కళంకితమౌనోయని వెఱచి తనహృదయమును బెఱికి వైచినటుల నిన్ను విడనాడెను.

సీత : [దు:ఖముతో] లక్ష్మణా, యిఁక నెప్పుడైన ప్రాణవల్లభుని దర్శించు నవసర మబ్బునా?

లక్ష్మ : [స్వగతము] ఈతల్లిని ఇట్టి యవస్థలో వీడి నేనెట్లు పోఁగలను?

సీత : జీవితేశ్వరా, ఇఁకనైన దిగంత కీర్తి విస్తారుఁడవుగమ్ము. నాకిఁక మరణమే శరణ్యము.

లక్ష్మ : [స్వగతము] అయ్యో! ఆత్మహత్య గావించుకొనునా? [ప్రకాశముగ] అమ్మా, నిలుకడమీఁదనైనఁ బ్రజలకు నిజము దెలియకుండునా?

సీత : మందభాగ్యనగు నాకుఁగూడ నిట్టి యాశావలంబనమా!

లక్ష్మ : [స్వగతము] కాఠిన్యమా, నామనము నావేశింపుము [ప్రకాశముగ]

                     దురితుఁడ బంధువిరక్తుఁడఁ
                     గరుణారహితుండఁ గ్రూరకర్మఠుఁడను ము
                     ష్కరత వనంబున నిన్విడి
                     పఱ తెంచఁగ నున్న కటికవాఁడను దల్లీ.

సీత : వత్సా, ఆత్మనిందవలదు. సార్వభౌముని శాసనము ఎల్లఱకు వలంఘనీయము. నీకు మార్గము మంగళకరమగుఁగాక !

లక్ష్మ : [స్వగతము]

                    ప్రణయపాశంబు లెట్టివో బలిమిబట్టి
                    లాగినను ద్రెవ్విపోవక సాగుచుండు,
                    లలిత బిసనాళ ఖండంబులను దెమల్ప
                    నడుమ సాగెడు సూత్రకాండములు వోలె!

        [ప్రకాశముగ] అమ్మా, యేమి సెలవిచ్చి పంపెదవు?
               సీత : లక్ష్మణా, నేఁ జెప్పిపంపున దేమున్నది?

                     అపవాదదూషిత యైన కాంతను బాసి
                              పతికీర్తిఁ బొందుట భావ్య మనుము;
                     కౌసల్యయాదిగాఁ గలుగు నత్తల కేను
                              గడుభక్తితో మ్రొక్కు లిడితి ననుము;
                     తోడికోడండ్ర నాతోడి నేస్తము నెంచి
                              కడసారి సేమంబు నడిగె ననుము;
                     చెలికత్తియలు నన్నుఁ బలుమాఱుఁ దలపోసి
                              యుమ్మలింప నిరుపయోగ మనుము;

                      ప్రజల నిఁకమీఁద మోదంబుఁ బడయుఁడనుము;
                      పతిని నెడఁబాసి యిఁక సీత బ్రదుక దనుము;
                      జన్మజన్మంబులకు రామ సార్వభౌముఁ
                      బరమపావను భర్తగాఁ బడతు ననుము.

లక్ష్మ : అమ్మా, యీ ప్రాణఘాతుకుని మన్నింపుము. [నమస్కరించును.] సీత : అన్నా, విచారింపక పయనము గమ్ము.

లక్ష్మ : తల్లీ, వనదేవతలు నీకుఁ బ్రసన్న లగుదురుగాక !

                    వనదేవతలారా, రా
                    మునిపత్నిని నొంటి వీడి పోయెడివాఁడన్
                    వనమృగ బాధలఁ బొందక
                    జనకజ రక్షింపుఁడమ్మ సౌఖ్యములిడుచున్.

[కొన్నియడుగు లిడి - స్వగతము] పాదము లసమ్మతముగ ముందడుగిడు చున్నను మనసేమొ వెనుకకే మరలుచున్నది. [నిష్క్రమించును]

సీత : [లక్ష్మణుఁడేఁగు దెసఁ జూచుచు] నాజీవితశేషమువలె లక్ష్మణుఁ డేఁగుచున్నాఁడు ! నాకు లోకమంతయు నందకార మలీమసమైతోఁచుచున్నది. అయ్యో! ఈనిర్జరారణ్యమున దిక్కు లేనిదాననైతిని. ఇంతటి తిరస్కారము సంభవించునని కలలోనైనఁ దలఁచి యెఱుఁగను. హృదయేశ్వరా, కుసుమకోమలమైన నీచిత్తమేల వజ్రసదృశమైనది? కానికాలమునకుఁ దారహారము విషవ్యాళమై కఱచెనన్న సామెత నేఁడు యథార్థమైనది.

నవకోటి మన్మథాకారా, దీనమందారా, హృదయేశ్వరా, యెన్నికష్టము లనుభవించుచున్నను నీ త్రిజగన్మోహన స్వరూపము క్షణమైన మఱచి యుండఁగలనే?

                     మఱవంగవచ్చునే శరదిందు బింబంబుఁ
                               బురణించు చిన్నారి మోముతీరు ?
                     మఱవంగవచ్చునే మాణిక్య కుండలో
                               జ్జ్వలకోమల కపోల విలసనంబు?

                     మఱవంగవచ్చునే యరవింద దళ సుంద
                              రంబై చెలంగు నేత్రద్వయంబు?
                     మఱవంగవచ్చునే మకరంద రస బిందు
                              తుందిలంబైన ముద్దుల యెలుంగు?

                     నయనపర్వముసేయు నానాథుమూర్తి
                     నింక నీజన్మమునఁగాంచ నెట్టులబ్బు?
                     ప్రణయవృంతంబు విడిపోవ వాడకున్నె
                     జీవ నవపుష్ప మూర్పుల తావి దొలఁగి.

ప్రాణవల్లభా, త్వమే కాలంబను నన్నిటులఁ గాన పాలొనరింప నీకు న్యాయమా? మనోహరా, ప్రాణవల్లభా, యిఁక నాగతియేమి? [చెట్టుకొమ్మపట్టుకొని దు:ఖించును]

[యవనికజాఱును.]

ద్వితీయ స్థలము : అడవి

[వాల్మీకి, మాండవ్యుఁడు మాటలాడుచుండఁగా తెఱ యెత్తఁబడును.]

వాల్మీ : మాండవ్యా, నీవు చూచితిననిచెప్పిన సాధ్వి యెచ్చట నున్నది?

మాండ : ఇచ్చోటనే మూర్ఛిల్లి పడి యుండినది. ఇపు డెచ్చటికో పోయియుండును.

వాల్మీ : ఈవనమం దెయ్యెడనో వృక్షచ్ఛాయల విశ్రమించియుండునేమొ చూతము రమ్ము.

[నిష్క్రమింతురు.]

[తెఱయెత్తఁగా సీత తరుమూలమునఁ గూర్చుండియుండును.]

సీత : చిత్తమా, యూరక యేల యంతరాళసౌధములు నిర్మించెదవు? మున్ను లంకలో నశోకవనమున నివసించు చున్నప్పుడు నామనోనాయకుఁడు దానవ పతిని వధియించి నన్ను మరలఁ గొంపోవునను పేరాసతో మేన నసువులు భరియించితిగాని, యట్టి యాశావలంబము నేఁడు లేదుగదా.

[వాల్మీకి, మాండవ్యుఁడు ప్రవేశింతురు]

వాల్మీ : [స్వగతము] ఈకుమారియా! [ముక్కుపై వ్రేలిడికొని] ఆహా! అంతయుఁ దెలిసె. [ప్రకాశముగ] రామపత్నీ.

సీత : [ఉల్కిపడి లేచి - స్వగతము] ఎవరో మునీశ్వరులు! నన్నెటు గుర్తించిరి? [ప్రకాశముగ] మహాత్ములారా, వందనములు.

వాల్మీ : దీర్ఘ సుమంగలీ భవ! సీత : [స్వగతము] శీఘ్రమే మరణించునట్లు దీవింపరుగదా.

వాల్మీ : బిడ్డా, యోగదృష్టిప్రభావమువలన నంతయు దెలిసికొంటిని. కర్మవశంబున సత్యవంతులకైన, నిక్కట్టులు గలుగుచుండును. సంసార సాగరమున మునిఁగినవారలు సుఖదు:ఖ తరంగ తాడితులు గాకుందురా?

సీత : మునీంద్రా, నిరపరాధులును శిక్షార్హు లగుదురా?

వాల్మీ : అమ్మా, నీ వమాయికవు. నిరపాయకరజీవనము సల్పుచు అరణ్యమున నివ్వరుల నేరికొని తిని బ్రతుకు శకుంత సంతానములు సైతము వ్యాధుని యంపకోలకు గురియగుట లేదా?

సీత : మహాత్మా, లోకు లవివేకులైనను ఆర్యపుత్రుఁడుగూడ వారినే యనుసరింపఁ వలయునా?

వాల్మీ: అమ్మా, ఇది రాజకీయరహస్యము. రాజునకుఁ బ్రజ ప్రాణాధారము. ప్రజలు విద్వేషించి తిరుగఁబడిన సామ్రాజ్యమైనను బునాదిలోనికిఁ గూలిపోవును. కుమారీ, కాలదుర్విపాకమునకు లోఁబడనివారెవ్వరు?

                    అనిలాలోల జలప్రవాహ చలితంబై శుష్కపర్ణావళుల్
                    వెనుకన్ముందుకుఁ బోవురీతి జనులున్ విశ్వంబునం గాలవా
                    హిని నోలాడుచు నస్వతంత్రులయి యేయేవేళ నేదేది గాం
                    చనగున్ దానిఁ బరిగ్రహించి తుదకుం జాలింత్రు సంసారముల్

సాధ్వీ, ఆరణ్యకుల్యాపరిసరమున మా యాశ్రమ మున్నది. అచ్చట మునిబాలికలు నీకు సహచారిణుఁలై యుపచరింతురు, - మాండవ్యా.

మాండ : స్వామీ

వాల్మీ : నీవు శీఘ్రముగఁబోయి పరిపక్వ ఫలములు గోసికొని యాశ్రమమునకు రమ్ము.

మాండ : చిత్తము [నిష్క్రమించును.] వాల్మీ : బిడ్డా, శంకింపవలదు. మీతండ్రి జనకరాజేంద్రుఁడు మా కత్యంత ప్రియమిత్రుఁడుగ నుండెను. మాయాశ్రమము నీ పుట్టినిల్లుగఁ దలఁచుకొనుము. శీఘ్రకాలమున నీవు వీరమాత వయ్యెదవు.

సీత : [కన్నీటితో] మునీంద్రా, నాపరీభవమును మాజనకుఁడెఱుంగక మున్ను తపోవనవాసి యయ్యెను. లేకుండిన నాకొఱ కెట్లు పరితపించి యుండునో!

వాల్మీ : కుమారీ, విచారింపకుము. నీ వాసన్న సత్వవు. మార్గాయాసమున బడలియున్న దానవు. అరణ్యసహజమగు నాతిథ్యముంగొని విశ్రమింతువు రమ్ము.

సీత : [స్వగతము] తాపసులు నిర్హేతుక వాత్సల్యవంతులు ! [ప్రకాశముగ] మహాత్మా, నే నేమహర్షిచేఁ గరుణింపఁ పడితిని ?

వాల్మీ : వత్సా, నన్ను వాల్మీకి యందురు.

సీత : [స్వగతము] ఈపవిత్రనామమును మున్నే వినియుంటిని. [ప్రకాశముగ] తాపసోత్తమా, యీ దిక్కులేని దానిని రక్షించితిరి.

వాల్మీ : బిడ్డా, అందఱను రక్షించుటకు సకలాంతర్యామి భగవంతుఁ డొకఁడు గలఁడు. పోదము రమ్ము, కాలవిలంబునంబునఁ దపోంతరాయము గలుగును.

సీత : మీచరణముల ననుసరించుచున్నాను.

              [స్వగతము] దరియు దాపులేక తరఁగ లుల్లోలించు
                              జలధి మధ్య నావ సడలి క్రుంక
                              మునుఁగనున్న నావికునికిఁ జెక్కవిధానఁ
                              బ్రాప్తమయ్యెఁ దాపసాశ్రయంబు.

[నిష్క్రమించును.]

పంచమాంకము.

ప్రథమ స్థలము : అయోధ్య.

[శూర్పణఖ ప్రవేశించును.]

               శూర్ప: మాన్యులొనరింపనేరని మహితకార్య
                         మొక్క యల్పుఁడె యొడగూర్చు నొక్కవేళ;
                         రావణేంద్రజిదాది వీరప్రముఖులు
                         సలుపఁజాలని పని నాకు శక్యమయ్యె!

నే నాటిన యుక్తికల్పలతాబీజ మంకురించి, తీవలల్లుకొని, పూలు పూచి ఫలించినది. నా కల్పనాచాతుర్యము పరమావధి నొందినది. పల్లెత వేసము దాల్చి భద్రుఁడు వినునట్లు సీతను అపనిందలాడితిని. ఆముదుసలిగొడ్డు గంభీరముగఁ దలయూపుచుం బోయెను. ఒక్కగడియలో సీతాపవాదము వాడ వాడల మాఱుమ్రోగునటుల అమ్మలక్కలు నీటికివచ్చు బావులకడను పణ్య వీథులందును రచ్చకొట్టములదగ్గరను వివాదములు పెంచుచుంటిని. రామ రాజ్యముపై ప్రజలకును మునీశ్వరులకును ద్వేషబుద్ధి జనియించునటుల లవణాసురుని ప్రేరించి తపోవనములు ధ్వంసము గావించితిని.

ఆహా! నేఁటికి నా కపటనాటకము ముగిసినది. రామచంద్రుఁడు సీత నడవులకు వెడలించి తాను నేఁడు విరహవిహ్వలుఁడై శోకసాగరమునఁ బారము గానక ప్రాణసంశయావస్థలో నున్నాఁడు. గర్భ మంధరయగు సీతను ఒక్కపెట్టునఁ జంపిన నేమి లాభముగలదు? అడవులలోఁ బడరాని యిడుములు గుడిపించి క్రమక్రమముగ శోకానలంబున మాడ్చినఁగదా నా కసిదీఱును. [వికటహాస మొనరించి] ఆహా! నేఁడుగదా నేను దశకంఠునకు సహోదరినిగ వన్నె కెక్కుట ! నేఁడుగదా పితృలోకవాసులగు మా బందుమిత్రులు పరితృప్తులగుట! [ఆకాశమువంకఁగాంచి] దశకంఠా, మేఘనాధా, కుంభకర్ణాది రాక్షస వీరనాయకులారా,

                      సీతారామ విషాదబాష్ప సలిలాసేకంబు గావించి మీ
                      చేతంబుల్ రగిలించు శోకదహనార్చి న్నేఁడు చల్లార్చితిం;
                      బ్రీతిన్‌రాక్షస విక్రమోచిత సుఖశ్రేయంబుల బొంది చిం
                      తా తాపం బెడలించి శాంతిగొనుఁడీ నాకంబున న్నిచ్చలున్.

నేఁటికి నా గుండె బరువు తీఱినది. ఇదిగో! నాదీక్షాకంకణము విచ్చుచున్నాను. సంతోషరసపూరము నాహృదయతటముల నొరసికొని ప్రవహించుచున్నది. వేగమ పోయి యీయుదంతము యుద్ధనిహత భర్తృకలగు దైత్యాంగనల కెఱింగించి వారి చిత్తము లించుక చల్లఁబఱిచెదను.

[నిష్క్రమించును.]

ద్వితీయ స్థలము : అంతర్భవనము

[రామ భరత వసిష్ఠులు కూర్చుండి యుందురు]

రాము : తమ్ముఁడా, నేనెంత కరుణాశూన్యుఁడను ?

                   చేతులారంగఁబెంచి చేఁజేతఁ బూవ
                   నున్న మల్లికఁ బెకలించు తెన్నుగాఁగఁ
                   బ్రాణములకన్న మిన్నయై పరగు ప్రియను
                   ఘోరకాంతారములఁద్రోసి కూళనైతి.

భర : అన్నా, నీవేయిటులఁ జింతించుచున్న మాబోంట్లగతి యేమి?

వసి : వత్సా రామచంద్రా, సర్వమెఱింగిన నీవే యిటుల నడుకానఁ బడుచున్నావు.

రాము : అంతపుణ్యము నా కలవడునా ?

వసి : గంధ సింధురము పంకనిమగ్నమైన దాని నుద్ధరించు వారలెవ్వరు? నీశోకమును దిగమ్రింగి తమ్ములను బుజ్జగించ వలసినవాఁడవు గదా.

రాము : మునీంద్రా, జానకిని దిగమ్రింగినవాఁడను, శోకమును దిగమ్రింగలేనా? కొండలు మ్రింగువానికి గండశిల లొక లెక్కయా?

భర : అన్నా, నీపరితాపమునకు మేరయే దొరకకున్నది. మాయల్పధైర్యముగూడ ప్రవాహ సంఘర్షణమున నైకతబంధమువలె కరఁగిపోవుచున్నది.

వసి : భరతా, యుమ్మలింపకుము, మీయన్న నూరడింపుము. చింతింప నేమి లాభముగలదు?

                  
                      శోకదహనార్చు లుజ్జ్వలించుటయె తప్ప,
                      బాష్ప బిందువులెడలేక పడుట దప్ప,
                      గాంచువారల మనములఁ గలత దప్ప
                      నేల శోకింప? నుపయోగ మేమిగలదు?

రాము : తమ్ముఁడా, లక్ష్మణుఁడు వచ్చెనో లేదో కనుగొనిరమ్ము.

భర : వచ్చిన మాదర్శనము చేయకుండునా?

రాము : ఏమో, అయినను చూచిరమ్ము.

భర : [స్వగతము] ధీరహృదయుఁడగు రామచంద్రుఁడే ప్రియా విరహ చంచలుఁడయి యిట్లు గుందుచున్నాఁడఁట! ఇఁక సామాన్య మానవుల విషయము చెప్పవలయునా?

[నిష్క్రమించును.]

రాము : తాపసోత్తమా, ఉంఛవృత్తితో జీవించు నీచుని నిర్బాధ్యతకుఁగూడ నే నసూయ పడవలసిన వాఁడనైతిని.

వసి : వత్సా, యట్లన వలదు. ఉన్నతవృక్షములకుగాక ఝంఝా మారుత సంఘర్షణ మల్ప కుటజంబులకుఁ గల్గునా? బాధ్యత వహించు పురుష పుంగవుల కెల్లరకు స్తుతినిందలు సుఖదు:ఖములు అనివార్యములు.

రాము : [విననియట్లు] అయ్యో! ఆమోహన స్వరూపమును నే నెటు మఱవఁగలదు?

                     కలగని నిద్ర లేవ నటఁ గాంచినదెల్ల మనంబులోపలన్
                     గలకగ ఖండఖండములుగా వలఁగాంచిన దృశ్యమట్టులం
                     దొలఁగి తొలంగకే వెనుకఁ దోఁచెడిరీతి ధరాకుమారి యు
                     జ్వలమగు సుస్వరూపమెదఁబాయకపాసియుఁబాయకుండెడున్

[భరతుఁడు ప్రవేశించును.]

భర : అన్నా, లక్ష్మణుఁ డింకను రాలేదు.

రాము : ఏలరాఁడు ? ఇంతలో వచ్చియుండును. మరలఁబోయి కనుగొనిరమ్ము.

భర : [స్వగతము] అకటా! నిశ్చలమైన రాముని చిత్తమెంత లౌల్యము వహించినది?

[నిష్క్రమించును.]

రాము : వసిష్ఠమునీంద్రా, మీరు దివ్యదృష్టివంతులుగదా మా జానకి యేమైనదో చెప్పగలరా?

ఎంతవెఱ్ఱివాఁడను? ఏమైయుండును?

                     అకట! కంటక భూయిష్ఠమైన కాన,
                     గర్భభరమునఁ బార్ష్ణి భాగములు క్రుంగ
                     నడుగు నామడగా నల్ల నడుగులిడుచు
                     నడవిమృగముల కాహార మయ్యెయుండు!

మాతల్లి కౌసల్య 'వత్సా, నా ముద్దులకోడ లెక్కడ'యని యడగిన వన్యములకు బలివెట్టితి నమ్మాయని చెప్పుదునా? [దు:ఖించును]

వసి : రామచంద్రా, మిన్నులువడ్డచోటు పోవుకొలఁది నిరంతముగఁ బోవుచుండును. దు:ఖసాగర మీఁదుకొలఁది నిరవధికమై దోఁచుచుండును. ఏప్రజలు రంజమునకై ప్రియాంగనను విడనాడితిలో, రాజ్యకార్యముల నారయమి, ఆలోకులకే కష్టము వాటిల్లును. వత్సా, నీవు విధిజ్ఞుఁడవు. శోకింపక ధీరుఁడవుగమ్ము. రాము : తాపసోత్తమా, దు:ఖ మెంత యడఁచికొన్నను నీటిబుగ్గవలె నిరంతరముగఁ బెల్లుబుకుచున్నది.

                     విరహ సంతాపమెట్టిదో నిరయగహ్వ
                     రంబువెడలెడి ధూమపరంపర లటు
                     లేచి హృదయాంతారాళ మలీమసముగఁ
                     గడలుకొను బుద్ధిసూర్యుండు కప్పువడఁగ.

[భరతుఁడు లక్ష్మణుఁడు ప్రవేశింతురు.]

రాము : [ఆతురతతో] అన్నా లక్ష్మణా, నాజానకి నేమిచేసితివి? [కౌఁగిలించుకొనును]

లక్ష్మ : కఠినాత్ముఁడను, మీయాజ్ఞ నిర్వర్తించి వచ్చితిని.

రాము : హా! మదెక జీవితా, సీతా. [క్రుంగిపోవును]

[యవనిక జాఱును]

షష్ఠాంకము

ప్రథమ స్థలము : అడవి.

[వాల్మీకి కృష్ణాజి నాసీనుఁడై యుండును]

వాల్మీ : సర్వకాల సర్వవస్థలయందుఁ దపోనందనిలీనమైన నా చిత్తము కుటుంబవాగురుల దవుల్కొనది. ఆహా! సంపర్గదోషము! కుశలవుల నెత్తి పెంచుకతమునఁ దపోదగ్ధరసమగు నాహృదయముగూడ సాంసారిక ప్రేమకుఁ దావలమైనది. ఇఁక సామాన్యుల విషయము చెప్పవలయునా?

లోకేశ్వరా, నిదాఘసంతాపమున శుష్కించిన వన లతలువోలె యెన్నఁడో జీర్ణించిన సంసారవాసనలఁ బునరుజ్జీవింపనెంచి యిట్టి చిత్రమగు లీలనొకటి గల్పించితివా? అఘటనా ఘటన చాతురీసమంచితా, కుశలవుల నా పోషణముననుంచి యొక బాధ్యతను గలిగించితివి. నన్నెప్పుడు బాధ్యాతావిముక్తుని గావించెదవు? కుశలవులకు యధావిధిగ ఉపనయనము గావించితిని. క్షత్త్రియోచితవిద్యలయందు నిపుణులఁగాంచితిని. వీరకుమారు లిఁకఁ బర్ణశాలలఁ గష్టములకుఁ బాల్పడఁ దగరు. నవఖండ సాంరాజ్యధురంధర క్షముండగు రామభద్రుని పుత్రు లెక్కడ - ఆకలములు దిని, అడవులఁ దపోనిష్ఠలఁ గాలముగడపు మాబోంట్ల కుటీరములెక్కడ?

ఆ జనక రాజకుమారి, పుత్రకులమూలమున నింతకాలము బ్రతికియున్నది. లేకున్న నెప్పుడో ప్రాణపరిత్యాగము గావించుకొనియుండును.

[నేపథ్యమున]

వాల్మీకిమునీంద్రా, మృత్యుంజయ తీర్థసేవాతత్పరులగు ఋషీశ్వరులు వేచియున్నారు.

వాల్మీ : ఇదిగో! వచ్చుచున్నాను.

[నిష్క్రమించును.]

________

ద్వితీయ స్థలము : అడవి.

________

[మునిబాలురు ప్రవేశింతురు]

మాండవ్యుఁడు : కుశలవు లింతలో నెట్లుపోయిరి?

సానందుఁడు : అయ్యయ్యో -

మాండ : సానందా, యేమేమి?

సానం : వారుగో! కుశలవులు. కొదమనులాగివైచి తల్లిసింగమును పాలు పితుకుచున్నారు.

మాండ : అబ్బబ్బో! చచ్చిరి, చచ్చిరి. సింహము తిరిగిచూచి పండ్లికిలించుచున్నది. - అభ్భా, బిడ్డలుగారురా వీళ్ళు పిట్టపిడుగులు.

సానం : వీరుచచ్చిన మనపైకివచ్చును. మాండవ్యా, మనము ఆశ్రమమునకు వెళ్ళుదమురమ్ము.

[కుశలవులు ప్రవేశింతురు.]

లవు : [సింగపుఁగొదమను ముద్దుపెట్టుకొనుచు] బుజ్జమ్మా, మన మాడుకొందాము. నీకు తియ్యనిపండ్లు కోసిపెట్టెదను.

కుశు : [పెద్దసింగపు జూలుపట్టుకొని] సింహమా, పరుగెత్తుము. నీపై స్వారిచేసి చూచెదను. మునిబాలురు : [భయపడుదురు.]

లవు : సానందా, యీబుజ్జమ్మను తీసికొని మేముగూడ ఆశ్రమానికి వచ్చెదము.

సానం : మీరు చచ్చునదిగాక మమ్ములనుగూడ చంపుటకా ?

మాండ : సానందా, నాకు భయమెత్తుచున్నది. మనము వీరికన్న ముందుగ పరుగెత్తుదము.

కుశు : మాండవ్యా, భయపడకండి. ఇవి పసిపాపలవంటివి. మనల నేమిచేయవు.

లవు : [నవ్వుచు సింగపుఁగొదమను మునిబాలురపై విసరుచు] ఇదిగో! సింగపుకూన, వదలిపెట్టిన మిమ్ము కఱచి చంపును.

మునిబాలురు : అయ్యో! చచ్చితిమి - చచ్చితిమి.

లవు : అభ్భా ! యెంత మహిమావంతులురా వీళ్ళు! చచ్చి మరల బ్రతికినారు.

సానం : లవా, మీదుండగములు తల్లితోఁజెప్పి మిమ్ములఁ గొట్టించెదము.

లవు : ఏమీ కొట్టించెదరా ? - [సింగపుఁగొదమను చంకఁబెట్టుకొని సానందుని దగ్గఱకుఁ బోవును]

సానం : [వెనుకకుఁదగ్గుచు] అయ్యో! అక్కడనే యుండుము. మమ్ము సింగపుఁగొదమచేఁ గఱిపింపకుము. బ్రాహ్మణ హత్యా పాతకము చుట్టుకొనును.

కుశు : [స్వగతము] మునిబాలకు లెంత పిఱికివారు!

మాండ : లవా, యొకసింహముండినట్లు మఱియొకసింహ ముండదు సుమా. నీమురిపెము గిరిపెము వెళ్ళివచ్చును.

లవు : [చిఱునవ్వుతో] అవునవును ! ఉండవు; కొన్ని ఆఁడువి కొన్ని మొగవి; కొన్ని చిన్నవి; కొన్ని పెద్దవి. మాండ : మేము మాట్లాడిన మీకు ఎగతాళిగనున్నది.

కుశు : తమ్ముఁడా, వీరు ధైర్యవంతులు. వీరితో చర్లాటము లాడఁబోకుము.

లవు : [ఒదుగుచు] సానందా, యీసింగముబారినుండి మమ్ము రక్షింపుము.

సానం : ఏమీ మమ్మెత్తిపొడిచెదరా ? మేము పిఱికివార మనుకొంటిరా? మా తల్లిదండ్రులు నిగ్రహానుగ్రహశక్తిమంతులు - శాపప్రయోగ దక్షులు !

కుశు : ఊ - ఊ! మాకు భయమెత్తుచున్నది. చీమలపుట్ట చూడు దాగుకొంటాము.

లవు : [నవ్వుచు] మాతాత ముత్తాతలుగూడ రాజ్యాలేలిన ప్రజ్ఞావంతులే!

మాండ : సానందా, నీవిఁక మాటాడక రమ్ము; అడవిమేఁకల పాలు ద్రావి వీరికి పొగరుపట్టియున్నది. వాల్మీకిపాదులవారి యాశ్రమమునకుఁ బోయి మనపయి సొడ్డులేకుండ వీరితల్లితోఁ జెప్పుదము.

సానం : అవును. పోదము పద.

[నిష్క్రమింతురు.]

లవు : అన్నా, తల్లిసింగమును తరుమగొట్టుము. ఈ చిన్నకూనను ఆశ్రమమునకుఁ దీసికొనిపోయి నివ్వరియన్నముపెట్టి సాకుదము.

కుశు : పాపము! ఆకొదమను విడిచిపెట్టుము. దానితల్లి యూరకే నీతట్టు చూచుచున్నది. మనతల్లిదగ్గఱనుండి మనలను బలవంతముగ వేఱుపఱచిన మనకును అమ్మకును ఎంతకష్టముగ నుండును.

లవు : అన్నా, మృగాలకుఁ గూడా అంతేనా ?

కుశు : అవునవును.

లవు : అట్లయిన వదలిపెట్టెదను. [కూనను ముద్దుపెట్టుకొనుచు] నాబుజ్జికూనా, నీవుపోయి నీతల్లి పాలు త్రాగుము. [వదలిపెట్టును.]

కుశు : మునిబాలకులు మనలను వదలిపెట్టి పరుగెత్తిరి చూచితివా ?

లవు : అన్నా, వారుతల్లితో యేమేమొ చాడీలు చెప్పుదురు. మనముకూడ వెళ్లుదము రమ్ము.

కుశు : అవును! కదలుము.

[నిష్క్రమింతురు.]

__________

తృతీయ స్థలము : వాల్మీకి ఆశ్రమము.

__________

[సీత ఱాతిబండపైఁ గూర్చుండియుండును.]

సీత : అకటా ! బిడ్డలారా, యీమందభాగ్యురాలి కడుపున నేల పుట్టితిరి ? రఘుకులాలంకారుని యంకపీఠమునఁ గూర్చుండి ముద్దులొసఁగు భాగ్యమునకు దొలంగి యీనట్టడవులఁ దాపసబాలురతోఁ గ్రుమ్మరునట్లు విధి మీనొసట వ్రాసెనా?

                     జలధి పరీత భూవలయ శాసనకర్తకుఁ బుత్రులయ్యు ము
                     ద్దులసుతులెట్టి సౌఖ్యపరితోషము లొందక మౌనియాశ్రమం
                     బుల ఫలమూలము ల్గుడిచి భూషణముల్ కయిసేఁతలేక ప
                     ట్ట లజినముల్ ధరించి యకటా ! సమిధల్ గొని తెచ్చుటాయెనే?

అంధకారమయమైన యాకాశమున నక్షత్రద్వయమువలె బాలకుల సుందర వదనారవిందములు నాకుఁ గొంతయానందము గలిగించుచున్నవి. మొలబంటి దు:ఖమున మోకాలిబంటి సంతోషమనునది యిట్టిదే కాఁబోలు

[మాండవ్యుఁడు, సానందుఁడు ప్రవేశింతురు.]

సానం : అమ్మా.

సీత : నాయనా, యేమి?

సానం : మీ కుశలవులను గట్టుదిట్టము సేయకున్నఁ బ్రాణాపాయము గలుగును.

సీత : సానందా, యేల యిట్లు పలుకుచున్నావు? వా రేమిచేసిరి?

సానం : కొదమను లాగివైచి తల్లిసింగమును పాలు పితుకుచుండిరి. మేము అది యేమిపనియన్న మాపైకి సింహకిశోరమును విసరి భయ పెట్టిరి. నే నబద్ధమాడిన ఈ మాండవ్యుని అడుగుము.

మాండ : ఇందేమి యబద్ధమున్నది.

సీత : అయ్యో! వారికిఁ గ్రూరమృగములతో నేమి చర్లాటము ? వాల్మీకినాయనగారితోఁజెప్పి కుశలవులకుఁ దగు శిక్షచేయించెదను. మీరుపొండు.

మాండ : అమ్మా, అడవిమృగములన్న లవునకుఁ గొంచెముగూడ భయములేదు. మాబోఁటివాండ్లమే భయపడుచుందుము.

[నేపథ్యమున]

అన్నా, నావిల్లుగూడ కొమ్మకుఁ దగిలించుము.

సానం : అమ్మా, మే మిఁకవెళ్ళెదము; లవుని కంఠస్వనమువలె నున్నది. మమ్ముఁజూఁచిన సింగపుకూనను ఉసిగొల్పుదురు.

[నిష్క్రమింతురు]

సీత : కురంగములతోడఁ బంచానన కిశోరములఁ బెంచినను వాని స్వభావ మేల మానును?

                     మొగిలి పుట్టంగ ముండ్లును బుట్టినటులఁ
                     గుశలవులతోడ శౌర్యంబు గూడఁబుట్టె;
                     నార్యతాపస సాహచర్యమున నైన
                     క్షాత్రగుణముల కఱకఱ సమసిపోదు.

[లవుఁడు ప్రవేశించును]

లవు : అమ్మా, నేను సింగపుబుజ్జమ్మను ఆశ్రమానికి తెచ్చెదనంటే అన్నయ్య వద్దన్నాఁడు.

సీత : [కౌఁగిలించుకొని] అయ్యో! నా ముద్దుకూనా, క్రూరమృగములతోడ మీకేమి చర్లాటము ? అవి యొకప్పుడు మిమ్ముఁగఱచినను గఱవవచ్చును.

లవు : [నవ్వుచు] మాచేతిలో లేవా కఱకుబాణాలు ?

సీత : నాయనా! యిఁకమీఁద మీ రట్టిసాహసకార్యము లొనరిపకుఁడు. మందభాగ్యులకు నమృతముగూడ విషమగుచుండును.

లవు : అమ్మా, వాల్మీకితాతగారు చెప్పే రామాయణము నీవు వినలేదా? అందు కథానాయకుఁ డగురాముఁడు చిన్ననాఁడే తాటకను మారీచ సుబాహులను చంపినాఁడఁట! ఆయన క్షత్రయుఁడఁట! అమ్మా క్షత్రియులందరు చిన్నతనమదే యుద్ధము నేర్చుకొంటారా?

సీత : నాయనా, మునిబాలురకు మీకేల యా విచారము.

లవు : అమ్మా, వాల్మీకితాతగారు మాకు చిన్నప్పుడే బాణప్రయోగము శిక్షించినారుగదా! నేను క్షత్రయుఁడ నయ్యెదను. అమ్మా, అన్నయ్య కూడా అవుతాఁడుగదా.

సీత : [లవుని జవిరియెత్తుకొని] నా కన్నతండ్రీ, అట్లే అగుదురు లెమ్ము.

[నేపథ్యమున]

తమ్ముఁడా, రమ్ము రమ్ము.

లవు : [కౌఁగిలి విడిపించుకొని] అన్నయ్య యెందుకో పిలుచుచున్నాఁడు.

[నిష్క్రమించును.]

సీత : అక్కటా ! నాముద్దుకొమరులు ఈ యజ్ఞాతవాసకష్టము లెన్ని దినము లనుభవింతురు ? ఈబిడ్డల ముద్దుమాటలు వినిన ఆర్యపుత్రుఁ డెట్లు సంతసించియుండునోగదా?

                     జనకుఁడు గని మోదింపని
                     తనయుల మృదుభాషణములు ధైర్యోద్ధతులున్
                     దనరియు వ్యర్థంబులు ని
                     ర్జనవనమునఁ బూచియున్న ప్రసవము లటులన్.

[యవనిక జాఱును.]

________

చతుర్థ స్థలము : అడవి.

________

[యజ్ఞదత్తుఁడు ప్రవేశించును]

యజ్ఞ : సవనమన్నసంబరమునఁ గష్టముల గుర్తెఱుంగక యీయుద్యోగమున కొప్పుకొంటిని. నడచినడచి నాపాదములు పుండ్లయినవి. ఏపుట్టలోనో యేపొదలోనో గుక్కిరిమిక్కిరి మనకుండ ముక్కుపట్టుకొని యెన్నడో ప్రాణముపోయిన పీనుఁగులవలె బిఱ్ఱబిగిసికొని కూర్చుండియున్న వగ్గుతాపసుల యిక్కలు నేనెట్లు కనుగొందును? ఆ జడదారులు రాకున్న అశ్వమేధము చక్కగ నెరవేరదఁట! మేములేమా అయిదారువేదములు చదువుకొన్న మహా బ్రాహ్మణులము. అయిన నేమి? శంఖమునుండి జాఱిననీళ్ళే తీర్థమగును.

ఇచ్చట నలుదెసలకుఁ బలుమార్గములు పోవుచున్నవి. ఏదారిని పోయిన నే యరణ్యము సొచ్చి యేక్రూరమృగములవాతఁ బడుదునో అను భయమున నాగుండెలు దేవతార్చనగంటవలె గడగడ గొట్టుకొనుచున్నవి. అయ్యో, నేను తిరిగి దారపుత్రులఁ గాంచు భాగ్యముండునా? ఎట్లయిన నగుగాక! ఇట్టితఱి ధైర్యసాహసము లవలంబించి రెండవ పరశురాముఁడ నయ్యెదను. [నలుదెసలు పరికించి] ఈమార్గము వెడల్పుగను చక్కగనున్నది. అపాయము జరుగునెడల నిరాటంకముగఁ బరుగెత్తుటకుఁ దగియున్నది. [కొంతనడచి] అయ్యో సింహము ! సింహము! చచ్చితిని చచ్చితిని. వేదాధ్యయనపరుఁడను, బ్రాహ్మణుఁడను, రక్షింపుడు. రక్షింపుడు !

[లవుఁడు విల్లుభుజమునఁ తగిలించుకొని పూలబుట్టతో వచ్చును]

లవు : ఎక్కడ ఎక్కడ సింహము? [విల్లుచేతికందుకొనును]

యజ్ఞ : [గద్గదస్వనముతో] నాయనా, అదిగోసింహము. నిన్ను దైవము సమయమునకే పంపినాఁడు.

లవు : [విల్లెక్కు పెట్టి] ఓయి ఛాందసుఁడా! నాచేత మునిహత్య గావింపనెంచితివా?

యజ్ఞ : అబ్బాయీ, కాదుకాదు. అదిగో! సింహము పొదమాటున; గాలికి జూలెగురుచున్నది చూడు.

లవు : చూచి చెప్పెదను.

యజ్ఞ : నేనిక్కడ నుందును.

లవు : [చూడఁబోవును]

యజ్ఞ : మునికుమారా జాగ్రత, జాగ్రత. లవు : చూచితివా. యీయన సునందుల తాత!

యజ్ఞ : అబ్బో! నిజముతెలియక యెంతభయపడినాను. వీరు ప్రతి అమావాస్యకు క్షారము చేయించుకొన్న నాకింత భీతిగలిగియుండదుగదా. [స్వగతము] ఈ మునిపేరు పట్టీలోనున్నదా ? [చూచి] ఉన్నది. [ప్రకాశముగ] ఆర్యా, సునంద మునీంద్రా.

లవు : బ్రాహ్మణుఁడా, సమయము తెలిసికొనక హెచ్చరింపకుము. సునందుల తాతగారు సమాధిలో నున్నారు.

యజ్ఞ : అబ్బో! మునిశాపము తప్పించుకొంటిని. నాయనా, వాల్మీకి మునీంద్రుల యాశ్రమము చూపించెదవా ?

లవు : మీరెవ్వరు? ఎందుకు మాతాతగారి ఆశ్రమానికి వచ్చినారు?

యజ్ఞ : మునికుమారా, నేను సద్బ్రాహ్మణుఁడను. ఈమకర కుండలములు నాశాస్త్రవిత్త్వమును నాకన్న ముందు హెచ్చరింపలేదా? చతుర్దశ వేదసారమును ఈడబ్బాలోవైచి పీల్చుచుందును. [ముక్కుపొడి డబ్బా తీసి చిటికె పొడిపీల్చి] అనఁగా వేదములెల్ల నాకు కరతాలామలకములు.

లవు : అయ్యా, మీరు వాల్మీకితాతగారికి గురువులుగా నుండతగిన వారు. మాతాతగారికి నాలుగువేదములు మాత్రమే తెలియును.

యజ్ఞ : అటులనా - [నవ్వును]

లవు : అవునుగాని, మీపేరేమి ?

యజ్ఞ : నాపేరా ? యజ్ఞదత్తుఁడు.

లవు : మీరిచ్చట కేల వచ్చినారు ?

యజ్ఞ : సకలసామంత మహీకాంత మణి కిరీట రంజిత పాదపద్ముఁడగు ఇక్ష్వాకువంశ ప్రదీపకుఁడు రామచంద్ర నరేంద్రుఁడు అశ్వమేధము నొనరింప నున్నాఁడు. ఆ యజ్ఞదర్శనార్థము మునీశ్వరుల నాహ్వానింప నేను నియోగింపఁబడితిని.

లవు : రామచంద్రనరేంద్రుఁడా ! [ఆలోచించి] ఏమీ రామాయణ కథానాయకుఁడా?

యజ్ఞ : [ఆశ్చర్యముతో] రామాయణ మేమిటి ?

లవు : మీకుతెలియదా?

యజ్ఞ : అయ్యో ! తెలియదే.

లవు : నిజముగనా?

యజ్ఞ : ఏమీ మాబోఁటి మహాబ్రాహ్మణు లబద్ధములాడుదురా ?

లవు : వాల్మీకితాతగారు రఘువంశీయుఁడైన రామునిచరిత్రమును ఛందోబద్ధముగావించిరి. ఆరాముఁడేనా మీ రామచంద్ర నరేంద్రుఁడు?

యజ్ఞ : అట్లేయున్నది. ఏమిచిత్రము ! వేదములందుఁ గాక ఛందస్సు మఱియొక చోటఁబుట్టెనా ?

లవు : అవును; మాతాతగారి అమృతవాక్కునందు.

యజ్ఞ : ఎట్లు ?

లవు : ఒకనాఁడు ప్రొద్దువొడుపున వాల్మీకితాతగారు శిష్యులతోఁ గూడ గంగానదికి స్నానమునకుఁ బోవుచుండ దారిలో నొకచెట్టుకొమ్మపై నొక క్రౌంచమిథునము ముద్దులాడుకొనుచుండెనఁట. అంతలో నొకబోయ యొకపిట్టను కఱకుటమ్మున నేలగూల్చెను. పాపము ! రెండవపిట్ట దానిని గాంచి కరుణముగ వాపోవుచుండ తాతగారు వీక్షించి ఆబోయవానిని శపించిరి.

యజ్ఞ : తర్వాత ?

లవు : ఆశాపము అనుష్టుప్పు శ్లోకరూపమున వెలువడినది. ఈచిత్రమునకు శిష్యులును తాతగారును ఆశ్చర్యపడుచుండు సమయమున బ్రహ్మదేవుఁడు ప్రత్యక్షమయి రఘురాముని చరిత్రమును శ్లోకరూపమున రచియింపుమని ఆదేశించెను.

యజ్ఞ : [స్వగతము] ఆహా! యీకథను వినుకొలఁది వింత వొడముచున్నది ! [ప్రకాశముగ] నాయనా? నీవెవ్వరిబిడ్డవు, మీ తండ్రిపే రేమి ? లవు : ఏమో నాకుఁదెలియదు.

యజ్ఞ : [స్వగతము] ఆహా! ఈకుమారుఁడు రాజకుటుంబమునఁ బుట్టవలసినవాఁడు. [ప్రకాశముగ] నాయనా ? వాల్మీకిమునీంద్రుల, యాశ్రమము చూపించెదవా?

లవు : వాల్మీకితాతగారు కుటీరమునలేరు. మృత్యుంజయ తీర్థమునకు శిష్యులతోఁగూడ పోయియున్నారు.

యజ్ఞ : ఏమి నే బయలుదేరిన లగ్న మహత్త్వము ! ఆగస్త్యమహర్షి యాశ్రమమునకు ఏతట్టు పోవలయును?

లవు : రమ్ము. దారి చూపించిపోయెదను.

యజ్ఞ : నాయనా, దీర్ఘాయుష్మంతుఁడవుగమ్ము.

[నిష్క్రమింతురు.]

_________

పంచమస్థలము : అడవి.

_________

[కుశలవులు సమిధలకట్టలతో ప్రవేశింతురు]

కుశు : తమ్ముఁడా, నీవేరిన సమిధ లివేనా ?

లవు : అన్నా, నేను పుల్లలు ఏరునప్పుడు కాలిలో ముల్లు విఱిగి నొప్పిచేసినది. అందువలన కొద్దిగ నేరితిని.

కుశు : ముల్లు తీసికొంటివా ?

లవు : తీసితిని; ఇంకను కొంచెము నొప్పిగానున్నది.

కుశు : కుటీరమునకుఁ బోదమురమ్ము; గారనూనె పూసిన నొప్పితగ్గును.

లవు : ఇప్పుడే ఆశ్రమమునకు నడువలేను. కొంతసే పీ చెట్లనీడ కూర్చుండి పోవుదము. కుశు : అట్లే కూర్చుండెదము. [ఇరువురు కూర్చుందురు]

కుశు : [ఆలోచనోన్ముఖుఁడై స్వగతము] మాతల్లియేలొకో యడపరానిశోకముచే నెల్లప్పుడుఁ గ్రాగుచుండినటులఁ గన్పట్టును ? ఇతర మునికన్యలవలె పువ్వులు ముడువదు; గారనూనెచరుముట లేక తలవెండ్రుకలు జడగట్టికొనిపోయెను. నీరింకిన వాడిపోవు తమ్మితూఁటివలె మాయమ్మ ఎందువల్లనో క్రమక్రమముగ దిగఁ గరఁగుచున్నది ?

లవు : అన్నా యేమి తలపోయుచున్నావు ?

కుశు : తమ్ముఁడా, అమ్మ యుమ్మలికము నీవెప్పుడైన కనిపెట్టితివా ?

లవు : ఉమ్మలిక మెందుకు ?

కుశు : మనయమ్మ యప్పుడప్పుడు శోకమునఁ గుములుచుండును. నిన్నసాయంకాలమున నే నాశ్రమమునకుఁ బోవుసరికి నొంటిగఁగూర్చుండి కన్నీరు నించుచుండెను. నేను వచ్చుటఁగాంచి గన్నీరద్దుకొని నన్ను ముద్దిడికొనియెను. శోక కారణ మడిగిన ముద్దులు గురిపించి నామాట పులిమి పుచ్చెను.

లవు : అన్నా, మునికన్యలేమైన అమ్మను కష్ట పెట్టినారు కాఁబోలు.

కుశు : అటుగాదు; వారు మనతల్లిని ఎంతో యాదరమున నుపచరించుచుండెదరు.

లవు : అన్నా, మన మాశ్రమమున కరిగి అమ్మను నిజ మడుగుదము.

కుశు : లవా, నాకొకసందేహము గలుగుచున్నది; మన మెవ్వరము ? మనమేల యీ యరణ్యమున నున్నాము ?

లవు : అన్నా, అంతమాత్రము తెలియదా? వాల్మీకి తాతను అమ్మ, నాయనా, యని పిలుచుచుండును. మనతల్లి తాతకూఁతురుగదా ?

కుశు : అట్లయిన మన తండ్రియెవరు ? ఒక్కనాఁడైన మనము ఆయనను చూచియెఱుఁగము.

లవు : [దీనముగ] అన్నా, మనకు దెలియని పిన్ననాఁటనే మర ణించెఁ గాఁబోలు!

కుశు : కాదు, కాదు; మనతల్లి మంగళసూత్రముధరించియున్నది.

లవు : [కొంతసేపూరకుండి] అన్నా తెలిసినది, తెలిసినది. మన తండ్రి యెచ్చటనో తపస్సు చేయుచుండవలయును.

కుశు : నాకేమియుఁ దోఁపకున్నది. మనకును ఇచ్చటి మునిబాలురకును చాలభేదము గనపట్టుచున్నది. వాల్మీకితాతగారు తక్కిన తాపస కుమారులకు శిక్షింపని బాణప్రయోగము మనకుమాత్రమె యేల నేర్పించిరి ?

లవు : మనలను క్షత్రియులను జేయుటకు.

కుశు : లవా, నీసమాధానము నాకు నచ్చలేదు. ఇందేదో కొంత దాపఱికమున్నది. ఎట్టులైన హటముపట్టి ఈరహస్యము నెఱుంగవలయును.

లవు : అవునవును; మనమిద్దఱమేడ్చి అన్నము దినకుండిన అమ్మ యీరహస్యము చెప్పకమానదు.

[నేపథ్యమున]

                     ప్రళయకాలాబ్ధి కల్లోలపటలిరేఁగి
                     పృథివిఁ గబళింపవచ్చెనాఁ బృథులసైన్య
                     మటవిఁగాల్మెట్ట భీతిల్లి యాశ్రమముల
                     కొక్కపెట్టునఁబర్వె మృగోత్కరంబు.

[కుశలవులు లేచి]

లవు : ఏమీ సైన్యమా ?

కుశు : ఆహా! తాతగారు చెప్పినట్లే అయినది. "నేనాశ్రమమున లేనిసమయమున రాక్షసులువచ్చి యజ్ఞవేదికలు పెళ్ళగింతురు. మునిపల్లె కొల్లగొట్టుదురు; జాగరూకులై యుండుఁడ"ని హెచ్చరించిపోయిరి. లవా, ప్రమాదము వాటిల్లినది. [ఇరువురు విల్లెక్కు పెట్టుదురు.]

[నేపథ్యమున]

ఆహా? వింతమృగము ! వింతమృగము !

[మాండవ్యుఁడు ప్రవేశించును]

మాండ : ఆహా! వింతమృగము ! వింతమృగము !

లవు : మాండవ్యా, ఏమి మృగము ?

కుశు : ఆశ్రమముతట్టుకు రక్కసి బలగములు వచ్చినవా ?

మాండ : [భయముతో] అయ్యో ! కుశా, నన్నుఁగాపాడుము.

కుశు : భీతిల్లకుము; రాక్షసులు నీ కెదురుపడిరా ?

మాండ : లేదు.

కుశు : అట్లయిన సైన్యములేమి ?

మాండ : [స్వగతము] దిగులుతీఱినది. [ప్రకాశముగ] అరణ్యమార్గమున ధూళీపటలము ఆకాశమున కెగయుచున్నది. ఒక వింతమృగము బంగారు మొగము పట్ట తళతళమనునట్లు పరుగెత్తుచున్నది.

లవు : మాండవ్యా, అదేమి మృగము ?

మాండ :: వృద్ధతాపసులు దానిని యజ్ఞాశ్వమని చెప్పుచున్నారు.

కుశు : అశ్వములు వాహనములని రామాయణకథయందు విందుము.

లవు : అవునవును.

మాండ :

                    మత్తకోకిల - కాంచమింతకు నట్టివింతమృగంబు నెప్పుడు నీవనిన్
                    మించుపోలిక సంచలించును మేదిని న్నడయాడెడుం;
                    బొంచిపఁట్టగఁ బోవఁ దారును బోదపచ్చిక మేసెడిం;
                    గుంచెతోఁకయుఁ గుచ్చుజూలును గొప్పడెక్కలు చెన్నగున్.

లవు : అన్నా, మనము పోయిచూతము.

కుశు : మాండవ్యా, ఆ గుఱ్ఱ మెచ్చటనున్నది ?

మాండ : కళ్యాణ సరోవరప్రాంతమునఁ బచ్చికబయల మేయుచున్నది.

లవు : పోవుదమురండు.

[అందఱు నిష్క్రమింతురు.]

[తెఱయెత్తఁబడును. గుఱ్ఱము కనఁబడును.]

కుశు : ఆహా ! ఈవారువమెంత తీరుగానున్నది !

మాండ : [దూరమునుండి] కుశా, యొంటిగ దగ్గఱకుఁబోకుము. అది కఱచు నేమొ.

లవు : ఈగుఱ్ఱముపై స్వారిచేసిన నెట్లుండునో? [డగ్గఱి] అన్నా, అదిగో బంగారు పట్ట మోమున వ్రేలాడుచున్నది.

కుశు : [మొగముపట్ట తీసికొనిచూచి] దీనిపై రత్నాక్షరములు గూడ మెఱయుచున్నవి.

మాండ : [స్వగతము] గుఱ్ఱమునకు కఱచుస్వభావము లేదుకాఁబోలు ! [మెల్లగ డగ్గఱును]

కుశు : [ముఖపట్టము పరికించి]

                     పదితలల రావణాసురు
                     మెదిపిన శ్రీరాముఁ డశ్వమేధము సేయన్
                     వదలెను హయమును; వీరుల్
                     పొదలినఁ గట్టుండు; లేక, మోడ్చుఁడు కరముల్.

ఏమేమీ ? శ్రీరాముఁ డశ్వమేధ మొనరింపనున్నాఁడఁట ! ఆతనికన్న వీరులున్న వారువమును బట్టవలయునఁట !

లవు : లేకున్న ? -

కుశు : చేతులు జోడింపవలయునఁట ! ఏమి యీకండకావరము. దశకంఠు నంతటి వీరుని సంహరించితినను గర్వముకాఁబోలు ! లోకములోని వీరమాతలు గొడ్డువోయిరా?

లవు : అన్నా, రాముఁ డసహాయశూరుఁడై దశకంఠుని వధియించెనా ? భ్రాతృద్రోహియగు విభీషణుఁడు, కోఁతులు, కొండమ్రుచ్చులు, ఎలుఁగుబంట్లు లేకున్న రామచంద్రుఁ డేమయ్యుండునో యెవ్వరెఱుఁగుదురు ? ఆశూరత్వమునకా యీ యశ్వమేధము ?

కుశు : మనమీ సవనాశ్వమును కట్టివైచెదము.

లవు : అవునవును, వాల్మీకితాతగారు పక్షపాతముతో వర్ణించిన శ్రీరాముని శూరత్వ మేపాటిదో కనుఁగొందము.

మాండ : అబ్బో ! మీరు మునిపల్లెకంతటికి అగ్ని రగిలింప నున్నారా ? మునిబాలు రెక్కడ ? సార్వభౌము నెదుర్కొను టెక్కడ ?

కుశు : తమ్ముఁడా, నాసమిధలుగూడ నీవు పట్టుకొనిపొమ్ము. ఈయశ్వమును నేను దీసికొనివచ్చెదను ! [తీసికొనును]

లవు : అన్నా, యీ గుఱ్ఱముపై నేనెక్కెదనా ?

కుశు : లవా, యజ్ఞాయశ్వము పవిత్రమయినది.

లవు : అట్లయిన వలదు లెమ్ము.

మాండ : [స్వగతము] మునిపల్లెకేదో మహా ప్రళయము సంభవింప నున్నది.

[యవనిక జాఱును]

సప్తమాంకము

ప్రథమస్థలము : అడవి

[లక్ష్మణుఁడు ప్రవేశించును]

లక్ష్మ : దు:ఖగర్భితములగు పండ్రెండువత్సరములు గడచినప్పటికిని రామపత్నిని విడనాడిన యీ కాంతారస్థలముల దర్శింప, సీతాపరిత్యాగ సంతాపము నేఁటిదివలె నాహృదయతటము లొరసికొనుచుఁ బ్రవృద్ధమగుచున్నది.

                     ధరణిజా పదన్యాస పూతంబులైన
                     యటవులించుక మార్పుతో నైనఁగాంచ
                     నయ్యెఁగాని సీతాకార మాత్మఁ దక్క
                     దృశ్యలోకంబు ననునెందుఁ దేజరిలదు.

సీతావిరహితమైన యశ్వమేధము దు:ఖకరమైనను దన్మూలమున ఆర్యాపునర్దర్శనము లభించు నేమోయను కొండంత యాసతో వచ్చితిని. నా యాస నిద్రమేల్కొన్నవాని స్వప్నమువలె అదృశ్యమయ్యెను. [కొంత నడచి] అకటా ! నేనెంత ప్రాణఘాతుకుఁడను. అగ్రజుని యాజ్ఞగావించి మరణపర్యంతము వేధించు హృదయశల్యము దెచ్చికొంటిని.

                     రామసందేశ మేఁ దెల్పఁ గోమలాంగి
                     జానకీదేవి ప్రాణవిహీన యగుచు

                     వజ్రపాతంబునం గూలు వల్లివోలె
                     మూర్ఛవోయిన తరుకాండ మూల మిదిగొ !

              ఈ ప్రదేశము నేఁటికిని గుర్తింప సాధ్యమగుచున్నది.

                      జనకరాజేంద్ర పుత్రికోష్మల విషాద
                      బాష్పవారి ప్రవాహంబు పాఱిపాఱి
                      పచ్చపూరియు నిచ్చోటఁ బట్ట దకట !
                      పృథ్విశోకాగ్ని పరితప్త హృదయమనఁగ.

[నేపథ్యమున కలకలము.]

[ఆలకించి] ఏమి యీ కలకలము ?

[సేనానాయకుఁడు ప్రవేశించును]

సేనా : జయము జయము యువరాజునకు ! యజ్ఞాశ్వము బంధింపఁబడినది.

లక్ష్మ : [ఆశ్చర్యముతో] ఎవరు బంధించిరి?

సేనా : ఎవఁడో ఋషికుమారుఁడు.

లక్ష్మ : [ఆశ్చర్యముతో] ఋషికుమారుఁడా ? - తెలియక్ల కట్టి యుండును. సవనాశ్వమనిచెప్పి విడిపించుఁడు.

సేనా : మహాప్రభూ, సర్వవిధముల బోధించితిమి. నయ భయములఁ జెప్పితిమి. ఎంత బ్రతిమాలినను వినక ఆతాపస వటువు ముష్కరపుఁ బట్టు పట్టియున్నాఁడు. మేము బెదరించిన సరకుసేయక యెల్లిదమాడుచు శింజనీ టంకారము గావించు చున్నాఁడు. లక్ష్మ : ఏమివింత !

                       కార్ముకం బేడ యడవులఁ గాయగరుబు
                       పండ్లు గుడిచెడి జడదారి వటువులేడ?
                       బ్రహ్మకులమున రెండవ పరశురాముఁ
                       డవతరించెనె కేసరి హరిణి కటులు !

             సేనా : యువరాజా, యాతఁడు సామాన్యతాపసబాలకుఁడుగాఁడు.

                       సౌందర్యశౌర్యముల్ సమభాగములు గాఁగఁ
                                  బంచికొన్నవొ దేహ భావములను !
                       మునిబాలకత్వంబు భుజబల విక్రమం
                                  బైకమత్యముతోడ నలరునవియొ!
                       అంగుళీ కిసలంబు లతుల శరాసనం
                                  బవిరత స్నేహంబు నాసగొనెనొ!
                       శైశవంబును ధైర్య సాహసోద్ధతు లన్న
                                  దమ్ముల యట్లుండఁ దలఁచెనొక్కొ !

                       కాక యన్యోన్యదూరత్వ కలనమెలఁగు
                       గుణములెల్లను నొకచోటఁ గూడి తాప
                       సార్భకాకారము సమాశ్రయంబుగొనునె?
                       యిట్టిచిత్రంబు సృష్టిలో నెందుఁగనము

లక్ష్మ : సేనానీ, ఆ తాపసవటువును జూచుటకు నామన మువ్వి ళ్ళూరుచున్నది. అచ్చోటికి దారితీయుము.

సేనా : ఇదిగో యిటు.

[నిష్క్రమింతురు.]

_________

ద్వితీయ స్థలము : వనము.

_________

[కుశుఁడు ప్రవేశించును; గుఱ్ఱము కట్టఁబడియుండును.]

కుశు : ఈ ఋషీశ్వరు లెంత భీరులు? తాపసులు సవనాశ్వమును బట్టఁగూడదఁట !

                     బలము శౌర్యంబు గల్గిన భార్గవుండు
                     మునివరుఁడు గాక తక్కెనే? జనక తర్ప
                     ణంబునకు రాజకుల శోణితంబు జీవ
                     నదిగఁ బాఱింపలేదె యనంతధాత్రి?

చతురంభోధి పరీత భూవలయమున అయోధ్యాధీశుని యజ్ఞాశ్వమును బట్టు వీరపుంగవుఁ డొక్కఁడైన లేఁడఁట!

[లక్ష్మణుఁడు, సేనాని ప్రవేశింతురు]

సేనా : ఇదిగో! సవనాశ్వము. ఆతఁడే తాపసబాలకుఁడు.

లక్ష్మ : [స్వగతము] ఆహా! సేనాని వర్ణించినంతకన్న ఈయర్భకుఁడు వేయిమడుంగు లెక్కుడుగఁ బ్రకాశించుచున్నాఁడు! [ప్రకాశముగ] సేనానీ, సైన్యతుములమువలన మునీశ్వరుల తపస్సులకు భంగము గలుగకుండునటు లరసికొనుము, సేనల సిద్ధపఱచి ప్రతిక్షణము నాయాజ్ఞకు వేచి యుండుము.

సేనా : దేవర యాజ్ఞాపించినట్లే. [నిష్క్రమించును.]

లక్ష్మ : [డగ్గఱి] బాలకా, ఆశ్రమ లతలను గొఱికివైచెనని యశ్వమును గట్టియుంచితివా?

కుశు : [చిఱునవ్వుతో] కాదుకాదు; ముఖపట్టమును దీసివైచుటకు.

లక్ష్మ : ఇది సవనాశ్వము సుమా !

కుశు : కాదని యెవరనిరి ?

లక్ష్మ : అట్లయిన నీవేల కట్టితివి ? ఆటలాడుటకుం దగిన లక్కబొమ్మ యనుకొంటివా దీనిని?

కుశు : కట్టినది లక్కబొమ్మయనికాదు. పదితలల రక్కసుని దునుమాడిన రాముని కెన్ని తలలుగలవో కనుఁగొనుటకు.

లక్ష్మ : [కోపముతో] ఏమీ ? పరిహాస మాడుచున్నావా?

కుశు : పరిహాసమో, చంద్రహాసమో మీకే తెలియవలయు.

లక్ష్మ : మునికుమారా, తెలియక నిప్పుతో చెర్లాటమాడుచున్నావు.

కుశు : నీటితో నిప్పునకేమి చెర్లాటము ?

లక్ష్మ : [స్వగతము] ఈ సౌందర్యరాశియగు ముద్దుకుమారుఁ డెవ్వని బిడ్డయో! మునితనయుని కిట్టి వాక్పటుత్వము, ఇట్టి సాహస మలవడి యుండునా ? [ప్రకాశముగ] బాలకా, యీవారువమును గట్టినవారు మాతోఁ బోరవలయును. నీవెవ్వరి కుమారుఁడవు ?

కుశు : యుద్ధమునకుఁ బూర్వము సంబంధబాంధవ్యము నెఱపుట మీయాచారము కాఁబోలు!

లక్ష్మ : [స్వగతము] ఈ ముద్దుకుమారునిఁ గాంచినంతనే నిర్హేతుకముగ నా యంతరంగము వాత్సల్య తరంగిత మగుచున్నది!

                     పల్లజడల్ మృగాజినము బాహువులం గురివెంద పేరు లు
                     త్ఫుల్ల ముఖారవిందమును బొల్పుగఁ దాపస బాలకత్వమున్
                     వెల్లడిసేయు; దోర్బలము, పీవరవక్షము, నిర్భయత్వమున్,
                     సల్లలితాంగ సౌష్ఠవము క్షత్రియబాలున కట్టు లొప్పెడున్.

[ప్రకాశము] కుమారా, చండశాసనుఁడగు రామచంద్రుని ప్రతిజ్ఞ అన్యధా పరిణమింపదు. నిన్ను గాంచినంతఁ జిదిమినఁ బాలుచిందు నీబుగ్గలను ముద్దిడికొన మనసు పుట్టుచున్నదిగాని, నిశాత శరపరంపరల నీసుకుమారశరీరము నొగిలించుటకు నాహృదయ మియ్యకొనకున్నది.

కుశు : రాజా, చక్కని రాజనీతిజ్ఞుఁడవుగాని, నీ యళీకవాత్సల్యము మమ్ము మోసగింపఁజాలదు.

లక్ష్మ : ఓయీ వటుఁడా, నీ శ్రేయస్సునకుఁగా నుడివినదంతయు మా యోటమిగఁ దలంచితివా ? - కుమారా, నీ జననీజనకు లెవ్వరు ?

కుశు : ఎదిరి తలిదండ్రుల నెఱుఁగకయున్న శరములు పాఱవు కాఁబోలు !

లక్ష్మ : [స్వగతము] ఏమి యీబాలుని పట్టుఁదల? ఈతనిమోము గాంచినంత నె జానకీదేవి పోలికలు గుప్పున మనమున కెగదట్టుచున్నవి. ఆస యెంతచెడ్డది ! అసాధ్యమునుగూడ సాధ్యమటుల నూహింపఁజేయును? [ప్రకాశముగ] బాలకా, నీకు సంగరమొనరింప నిచ్చగలదా ? నామాట వినుము. నీ ముష్కరపుఁ బట్టుదల నీ ముప్పునకే కారణమగును. ఇట్టి ముద్దు కుమారుని గోల్పోయిన తల్లిదండ్రుల శోకమునకుఁ బారముండునా ? నీకుఁ దల్లిదండ్రు లున్న వారికి నీ వీ బాలిశోద్యమమును దెలిపిరమ్ము. నా యీ కడసారి సదుపదేశమును గమనింపుము.

కుశు : రాజా, క్షత్రియవీరులు ఉపదేశవాక్యములఁ బ్రయోగించియా విజయము నొందుట ! లక్ష్మ : [స్వగతము] వినవిన నీబాలకుని చతురోక్తు లసహ్యములగుచున్నవి. [ప్రకాశముగ] ఓయీ, నీవెవ్వని సవనాశ్వమును బంధించితివో యా లోకైక వీరుని క్రోధాగ్ని శిఖలయం దేల శలభమువలె న్రుగ్దాదవు ? ఆ రామచంద్ర నరేంద్రున యతిలోకశూరత్వము నీకుఁ దెలియక యింతటి సాహసకార్య మొనరించితివి కాఁబోలు?

                    కౌశికయజ్ఞంబుఁ గావంగ నేఁగుచో
                             మార్కొన్న తాటక మదమడంచె;
           కుశు : ఆఁడుదానిని బట్టి యఱచి కూయఁగఁ జంప
                             నదియె శూరత్వము చనగ వలెనె?
           లక్ష్మ : క్రతువాటి శోణిత క్రవ్యముల్ చల్లు మా
                             రీచ సుబాహుల పీచమడఁచె;
           కుశు : పండ్లు గడ్డలుమెక్కు బక్కతపసుల నేచు
                             పిరికి దైత్యులఁగూల్ప వీరుఁడగునె ?
          లక్ష్మ : ధరణీసుతా స్వయంవరమున గిరిజేశు
                             బలువిల్లు డాకేలఁ బట్టివిఱిచె;
          కుశు : చిరకాలముంటఁ బుచ్చినవిల్లు విఱిచిన
                             దానికే చంకలు తట్టవలెనె ?
          లక్ష్మ : అతుల విక్రమశాలి నమరేశు సుతువాలి
                             నొక్క బాణంబున నుక్కడంచె;
          కుశు : ఇరువురు పోరాడునెడఁ బొంచి యొక్కని
                             మఱుగుగాఁ దెగటార్ప మానుషంబె ?
          

లక్ష్మ : [స్వగతము] రామునిచరిత్ర మీ బాలున కెట్లు దెలియును ?

కుశు : ఓయీ, రాజా, యేలయిట్లు వందివలెఁ బొగడుచున్నావు ? రామునిశూరత్వము మాకు క్రొత్తయా ?

                     కోఁతి కొండముచ్చు లెలుఁగుగొడ్లచేత
                     జలధి గట్టించినార లాశ్చర్యముగను !
                     వన్యమృగములఁ బాలించువారు మీరు
                     మీ పరాక్రమోద్ధతికింక మేరగలదె?

లక్ష్మ : ఓయీ !

కుశు : రాజకుమారా, స్తుతిపాఠమునఁ గొంతమఱచితివి. మీరాముఁడు కాకిపైఁగూడ నస్త్రప్రయోగము గావింపలేదా ?

లక్ష్మ : [కోపముతో] ఓరి జ్ఞాన లవ దుర్విదగ్ధా, యెంతతాళుకొన్నను నీ యవినీతిని వీడకున్నావు ? రామచంద్ర నరేంద్రునిఁ దూలనాడిన నీగర్వ మిపుడే యడంచెదను. రమ్ము - నీశరాసనము సజ్యము గావింపుము.

కుశు : రాజా, యిప్పుడు క్షత్రియుఁడవైతివి. తపోవన శాంతికి భంగము గావింపవలదు. ఆ మరుప్రదేశమునకు నడువుము.

[నిష్క్రమింతురు]

_________

తృతీయ స్థలము : వాల్మీకి కుటీరము.

________

[సీత ఆసీనయైయుండును.]

సీత : సూర్యభగవానుఁడు నభోమధ్యగతుఁడై వేడిసెకల నుమియు చున్నాఁడు. నా ముద్దుకొమరు లేలొకో యింతవఱకుఁ గుటీరమునకురారు. అయ్యో! యేమి నా కుడికన్నదరుచున్నది?

[మాండవ్యుఁడు ప్రవేశించును]

మాండ : అమ్మా, అమ్మా. ఆరణ్యకా - [దు:ఖించును]

సీత : నాయనా, మాండవ్యా, యెందుకు దు:ఖించుచున్నావు ? కుశలవు లెక్కడనున్నారు ?

మాండ : అమ్మా, యేమిచెప్పుదును ? ఇంకను గుశలవులా ? [దు:ఖించును.]

సీత : [తత్తరముతో లేచి] ఏమీ ? కుశలవులేమైరి? వా రిపుడెక్కడ నున్నారు ? వచ్చుచున్నారా? ఒక్కమాట చెప్పుము.

మాండ : అయ్యో ! నా నాలుక యాడకున్నది.

సీత : నా ముద్దుబిడ్డలకేమైన నాపద సంభవించెనా? మాండవ్యా, యేల విలపించెదవు ?

మాండ : ఎక్కడివో పాపిసైన్యములు కళ్యాణసరస్సుప్రాంతముల విడిసినవి. వారి సవనాశ్వమును కుశుఁడు కట్టివైచెను. సేనాధిపతి వచ్చునను భీతితో నేను దూరమున దాఁగియుంటిని. అంతలో సేనాని వచ్చెను.

సీత : తర్వాత ?

మాండ : తర్వాత కుశుఁడును సేనానాయకుఁడును ఏమేమొ వివా దములు సలుపుచుండిరి. ఆమాటలు నాకు స్పష్టముగ వినఁబడలేదు.

సీత : మాండవ్యా, కుశలవుల కేమియాపద గలుగదు గదా ? ఒక్క క్షణముసేపు విలంబన మెక్కయుగముగఁ దోఁచుచున్నది.

మాండ : అమ్మా, వా రిరువురు వాదముల నూహింప, సేనాధిపతి యశ్వమును విడువుమనియుఁ గుశుఁడు విడువననియుఁ అన్యోన్యము తర్కించుకొనుచుండినట్లు కనుపట్టినది.

సీత : [నిట్టూర్పుతో] అయ్యో! బాలుఁడెక్కడ, యజ్ఞాశ్వమును బట్టుటెక్కడ? ఇంత నేరమి దగునా? మాండవ్యా, కుశుఁడు అశ్వమును విడువలేదా?

మాండ : ప్రాణమునైన వదలి పెట్టునేమోగాని, వారువమును మాత్రము విడువఁడు.

సీత : అయ్యో! నీవైన బుద్ధి సెప్పవా?

మాండ : నే సమీపమున నుండినఁగదా -

సీత : తరువాత ?

మాండ : సేనానియును గుశుఁడును మరుప్రదేశమున కరిగిరి.

సీత : వా రచ్చటఁ బోరుసల్పిరా ?

మాండ : వేఱు చెప్పవలయునా ?

సీత : అకటా! యెంతప్రమాద మెంతప్రమాదము !

                    పోరులను నారితేరిన వీరులేడ ?
                    బాణ విన్యాస మెఱుఁగని బాలురేడ ?
                    శౌర్యసాహస సాధ్యంబు సమరమేడ ?
                    యిన్ని తలపోసి శంకించు హృదయ మకట !

మాండ : అమ్మా, శంకింపవలదు, కుశుని సంగర కళాకౌశలము వీక్షిం సేనాధిపతి విస్మితచిత్తుఁడై ప్రతీకార సంధానజడుఁడై యూరకుండెను.

సీత : మాండవ్యా లవకుమారుఁడు దగ్గఱలేఁడా ?

మాండ : అమ్మా, ఆతఁడు సమిధలను మోసికొని కుటీరమునకు వచ్చుచుండెను.

సీత : అట్లయినఁ గుశుఁ డొంటరిగ యుద్ధము చేయుచున్నాఁడా ?

మాండ : అయిననేమి ? అగ్నికణ మొక్కటి చాలదా కొండంత తూలరాశిని బుగ్గి సేయుటకు ?

                      తేనెతెట్టెను జెల రేఁపఁ దేనెటీఁగ
                      గములు వెడలెడిచందానఁ గాండపటలి
                      కుశ శరాసన ముక్తమై గుమురుకొనుచు
                      దిక్కులీనిన యట్టులఁ దేజరిల్లె.

సీత : బళీ ! కుశకుమారా, జనకున కనురూపుఁడవైన పుత్రుఁడు వైతివి. మాండవ్యా, తరువాత తరువాత ?

మాండ :

                      రూపంబెత్తిన శౌర్యమట్టుల మహారుద్రాకృతిన్ సంగర
                      వ్యాపారోన్ముఖుఁడై కుశుండు ప్రదరవ్రాతంబుసంధింపఁగం
                      జాపం బుర్వికి జాఱ సైన్యపతి మూర్ఛా వీత చేతస్కుఁడై
                      భూపర్యంక శయానుఁడయ్యె వనభూముల్ పట్ట స్వానీకినుల్.

సీత : ఆహా ! వీరమాత నైతినను నానందంబున నా యొడలెల్లఁ బులకరించుచున్నది. ముద్దుకుమారా, మొన్నటిదనుక నాయొడిలో నాడుకొనుచుంటివే ! యింతటి సమరకళాకౌశల మెప్పు డలవఱచుకొంటి వోయి ?

                    జనకుఁడు నీపరాక్రమము, శౌర్యము, బాహుబలంబు, సంగరం
                    బునఁ జరియించునేర్పు, శరముల్ పఱపించెడి తీరు గాంచినన్
                    గనులఁ బ్రమోదబాష్పములు కాల్వలుగట్టఁగఁ గౌఁగిలింపఁడే
                    తనయుఁడ రమ్మటంచని? సుతా, సుకృతంబటు లుండఁబోలదే !

మాండ : అమ్మా, అంతటఁ గుశుఁడు విజయకుతూహలియై సవనాశ్వము ముఖమున మెఱయుచున్న బంగారు పట్టను లాగికొని కుటీరమునకుఁ దరలుట కుద్యుక్తుఁ డయ్యెను.

సీత : [స్వగతము] నాయనా, ముఖపట్టమును విజయాంకముగఁ గైకొంటివా ? [ప్రకాశముగ] అంతట ?

మాండ : అంతట సింహనాదములొనరించుచుఁ జెల్లాచెదరైన సైన్యములు నొక్క మొనకుఁదలపడి కుశుని చుట్టుముట్టినవి. ఇంతలో మూర్ఛితుఁడగు సేనాని తెప్పిరిలిలేచి సేనలఁ బురికొల్పుచుండెను.

సీత : [నివ్వెఱపాటుతో] అయ్యో! నాయనా, యింకెక్కడి కుశుఁడు ? ఒక్కబాలుని ఇంతసైన్యము పొదువుట వీరనీతియా ?

మాండ : అమ్మా, అంతట కుశుని యవస్థ చలిచీమలకుఁ జిక్కిన యురగ కిశోరమువలె నైనది. [దు:ఖించును]

సీత : [దు:ఖముతో] నన్ను వంచించితివి. ఇంతదనుక కుమారుని శౌర్యవినోదమున మైమఱపించి యతర్కితముగ సత్యమును బ్రత్యక్షము గావించితివి. నాముద్దుకుమారా, రఘువంశ కరీరమా, నాభాగ్య సర్వస్వమా, అసహాయుఁడవై రణరంగమునఁ గూలితివా ?

                     శరముల పోటుగంటుల నజస్రము నెత్తురు లూటకాల్వలై
                     తొరఁగి శరీరముం దడుప దుర్భరవేదన కోర్వలేక యె

                     తైఱఁగునఁ బల్లటిల్లి రణదేశమునన్ శయనించితో! మనం
                     బెరియఁగ నన్నుఁ దమ్ముని నిఁ కెంతగ లోఁదలపోసి కుందితో

అయ్యో ! కుశకుమారా, నాకన్నులవెన్నెలా, నన్నును నీముదు తమ్ముని విడనాడి పోయితివా ? వాల్మీకినాయన వచ్చి, కుశుఁడేడి' యన్న నేనేమి చెప్పుదును తండ్రీ ! ప్రియ తనూజా, నన్నుఁగూడ నీతోడఁ గొనిపొమ్ము. [మూర్ఛిల్లును]

మాండ : అమ్మా, యూరడిల్లుము. నేఁబోయి లవుని దీసికొని వచ్చెదను. [నిష్క్రమించును]

సీత : [తెప్పిరిలి] నాయనా కుశ కుమారా, ఒక్క నిమిషంబున లోకమెల్ల వెలిఁగించి మఱునిమిషంబున నస్తమించు నుల్కవలె నయినదా నీ బ్రతుకు ? వాల్మీకి నాయనగారుండిన సత్తిప:ప్రభావమునఁ బునర్జీవిని గావించియుండు నేమోగదా ! అకటా ! నాబోఁటి దురదృష్టవతికి నంతటి భాగ్యమబ్బునా ? నాముద్దుకూనా, పండ్రెండువత్సరములకే నీకు శతాయుష్యము సంపూర్ణమైనదా ?

                      పూర్ణిమా చంద్రుని బురుణించు నీమోము
                                  కళలెల్లఁ దఱిగెనే కన్నతండ్రి !
                      కల్వఱేకులువోలు కన్నులు జిగిమాసి
                                  మూఁతలు వడియెనే ముద్దుకూ !
                      సువిశాల ఫలకంబు సొంపుమీఱు నురంబు
                                  శోణితం బొలికెనే సుందరాంగ !
                      ఆజానులంబమై యలరు దోర్యుగళంబు
                                  బలము దొలంగెనే కలికి పట్టి !

                      ఆశలకునెల్ల నాలంబమైన నీవు
                      సంగర క్రోడశాయివై సమసినావె !
                      యిట్టి ప్తత్యక్షసత్యంబు నెఱిఁగియుండి
                      పగులదేమొ నాహృదయమ్ము బ్రద్దలగుచు.

అయ్యో ! నాముద్దుబిడ్డా, నన్ను నట్టడవులపాలుచేసి పోయితివా ?

[లవుఁడును మాండవ్యుఁడును ప్రవేశింతురు]

నాయనా, నీ ముద్దులయన్నను గోల్పోయితిమి. [లవును కౌఁగిలించుకొని దు:ఖించును.]

లవు : అమ్మా, యేడువక చెప్పుము. గుఱ్ఱమేమైన అన్నను కఱచెనా ?

సీత : అయ్యో ! నాయనా, యది యజ్ఞాశ్వమఁట గదా.

లవు : అయిన నేమి ?

మాండ : అయిన నేమియా ? అదియే ప్రాణాంతకమైనది.

సీత : అశ్వరక్షకులు కుశునితోఁ బోరాడిరఁట.

లవు : ఏమీ ? అన్నను నొప్పించిరా ?

మాండ : నొప్పించుటయా ! కంఠగతప్రాణునిఁ జేసి రనుము. ఎవరికైన నంతపొగరు తగదు. అందులో తాపసార్భకు లెట్లుండవలయు ?

సీత : మాండవ్యా, ఇది నీతిబోధలకుఁ దరుణమా ?

లవు : ఏమంటివి ? - కంఠగతప్రాణునిఁ జేసిరనియా ?

                      ఉన్నారా కుశునొంచువీరులు నృపవ్యూహంబునం దెచ్చటన్ ?
                      విన్నామే పులిపిల్ల ముట్టి వృకముల్ పీడించి చెండాడుటల్ ?

                        గన్నామే యిటువంటివింత? యయినం గానిండు; నేబోయి మా
                        యన్నం దెత్తు రిపు ప్రభేదన చణ వ్యాపారపారీణతన్

మాండవ్యా, న న్నా కదనరంగమునకుఁ గొనిపొమ్ము.

మాండ : [స్వగతము] అయ్యో! నాకే రావలయునా యీమహా విపత్తు ? మునుఁగబోయి మొసలికిఁ జిక్కితిని. ఒక్క శిలీముఖము తప్పి దారి నాపైఁబడినఁ బ్రాణముల నూటికొనకమానదు. [ప్రకాశముగ] లవా, యిట్టి కార్యముల బాల్యచాపలము ఆపదలకు మూలమగును.

సీత : నాముద్దుకూనా, నీకేల యీదుర్బుద్ధి ? తారతమ్య మెఱుంగక పోరిన కుశకుమారుని గతి యే మైనది ?

                       చంద్రబింబమ్ము జలద సంఛన్నమయ్యెఁ;
                       గాఱుఁచీఁకటి నల్గడఁ గ్రమ్ముకొనియెఁ;
                       దారకలు మాసి యొక్కటే తార నిలిచె;
                       నదియు నుఱిఁగిన గతియేమి యయ్య నాకు ?

లవు : అమ్మా, రోషాగ్నిజ్వాలల నానెత్తురు తుకతుక యుడుకుచున్నది. ప్రతిహింసావేశము నన్నుఁ బెరరేఁపుచున్నది. నన్ను వదలుము.

సీత : నాయనా, నీముష్కరత చాలింపుము. కడసారి నాముద్దు కొమరుని మృతకళేబరమునైనఁ గాంచుటకు నన్నుఁగొనిపొమ్ము.

లవు : తల్లీ, నీవు విచారింపవలదు. అన్న సర్వతోముఖ బాణ ప్రయోగదక్షుఁడు. ఆతఁడు మరణించియుండుట కల్ల. అన్న మూర్ఛిల్లియుండిన భీతిల్లి ఈమాండవ్యుఁడు పరుగెత్తియుండును.

మాండ : నీవుమాత్రము భీతిల్లకుందువా ? అప్పటికిని ధైర్యవంతుఁడను గావున దూరముననుండియైన నంతయుఁ దెలిసికొని వచ్చితిని. లవు : అమ్మా, కాలవిలంబన మగుచున్నది. నన్నుఁబోనిమ్ము. [కౌఁగిలి విడిపించుకొనును.]

సీత : నాయనా, నా మాటవినరా.

                    నాదుముద్దుకూన, నాకన్ను వెన్నెలా,
                    నాదు భాగ్యరాశి, నాకుమార,
                    పుత్రశోకవహ్నిఁ బొగిలింప నెంచితే ?
                    రార కన్నతండ్రి, రణమువలదు.

లవు : అమ్మా, యాకూళలకు అన్నయ్యను నప్పగించి నన్ను సుఖముండు మనియెదవా ?

                    అన్నను నొంచినట్టి యభియాతిబలంబులు చెట్టుపుట్టలన్
                    వెన్నడి మున్నడింబఱవ భీషణసంగరమందు మబ్బులోఁ
                    జెన్నగు మించునా మెఱసి చిందఱవందఱచేసి శౌర్యమ
                    భ్యున్నతి నొందఁ దెచ్చెద సహోదరు నీవు ముదంబుఁబొందఁగన్

సీత : మాండవ్యా, యిఁక నేనేమిసేయుదును ? ఈలవుఁడు నామాట సరకు సేయకున్నాఁడు ?

మాండ : అమ్మా, నీవు బ్రతిమాలినను విననివానికి నా సదుపదేశము చెవిని దూరునా ?

            లవు : తల్లి నీవైన వాల్మీకి తాతయైనఁ
                     దాపసేశ్వరులైన విధాతయైన
                     అన్న యవమానమునకు రోషాగ్నిరగులు
                     నన్ను నిలుపంగ లేరని నమ్ముమమ్మ.

అమ్మా, యిఁకఁ బోయివచ్చెదను. మాండవ్యా, రమ్ము.

మాండ : పోదము పద.

[ఇరువురు నిష్క్రమింతురు.]

సీత : [చేతులుజోడించి] అయ్యో ! జగదీశ్వరా, యీ ముద్దుకుమారు నైన రక్షింపవా ?

                      సూర్యచంద్రులార, సురలార, మునులార,
                      కన్నతండ్రులార గావరయ్య,
                      యిలను నెల్ల నేలు నిక్ష్వాకు భూపాలు
                      ముద్దుపట్టి నాదు ముద్దుపట్టి.

[యవనిక జాఱును.]

_________

చతుర్థ స్థలము : అడవి.

_________

[కుశుఁడు మూర్ఛిల్లియుండును; లక్ష్మణుఁడు ప్రక్కన నిలఁబడి యుండును.]

లక్ష్మ : కటకటా ! నేనెంత యకార్యమొనరించితిని ? రోషావేశమున నీఋషికుమారుని, ఈ శూరబాలకుని, ఈ సౌందర్య రాశిని నా కఱకు టమ్ముల కెఱ గావించితిని !

                     సగముపూచిన యెఱ్ఱ లొద్దుగపురెమ్మ
                     గాలితాఁకున నేలను గూలినటులఁ
                     దూపుగంటుల నెత్తురు దొరఁగుచుండ
                     ధరణి యొడిలోనఁబవళించెఁ దపసి సుతుఁడు.

ఆహా ! నా యవివేకమునకు నాకే లజ్జ వొడముచున్నది ! ఋషి కుమారుని దునుమాడినందుకు అన్న కోపింపకమానఁడు. ఈ కుమారుని దురవస్థఁ గాంచినఁ దాపస దంపతులు నన్ను శపింపక మన్నింతురా ?

         ఉత్సాహ, చిగురుటాకు జొంపమందుఁ జిచ్చువెట్టి యవ్వలన్
                     వగలఁబొగులు మూఢునటుల బాలకున్‌మనోహరున్
                     విగతజీవుఁగా నొనర్చి వీరలోక మందు నే
                     నగడు గుడుతు నంచుఁ జిత్త మారటంబు నొందెడిన్.

ఆహా! యీతాపసబాలకునిపై నకారణవాత్సల్యము నాకేల గలుగుచున్నది ? ఇది తపోవన మహత్వమా యేమి ?

                     అరి దెగటారిన యందుకుఁ
                     బరగదు మోదంబునాదు భావమునందున్
                     బరమ సుహృన్మరణంబనఁ
                     గర ముమ్మలికంబు నన్నుఁ గళవళపెట్టున్.

ఆహా ! బాలకుని యవయవములు మెల్లమెల్లగఁ గదలుచున్నవి శరాఘాతముల నీకుమారుఁడు మైమఱచి పడియుండెనేగాని, దైవవశమున మరణింపఁడాయె. ఈ వీర కిశోరమును మా శిబిరమునకుఁ గొనిపోయి వ్రణ చికిత్సగావించి, యన్నకు ఉపాయనముగ అయోధ్యకుఁ బంపెదను.

[కుశునినెత్తి భుజముపై వైచికొనును.]

[లవుఁడు ప్రవేశించును.]

లవు : [స్వగతము] ఓహో ! యీ రాజకుమారుఁడు అన్న నెత్తుకొని వెడలుచున్నాఁడు. [ప్రకాశము] ఓయీ, నిలుము, నిలుము, నీ దొంగతనము సాఁగుననుకొంటివా ?

                      నేను మాయన్న వెంబడి లేనియపుడు
                      లెక్కయిడరాని సైనికు లొక్క మొగిని
                      పుట్టతేనెకు నీఁగలు మూఁగినటుల
                      ముట్టడించి వధించియుఁ బోవువారె?

లక్ష్మ : [కుశుని నేలపైఁ బరుండఁబెట్టి స్వగతము] ఔరా ! యీ బాలకు డెవ్వఁడు ? ఈమూర్ఛితుని ప్రబింబమో యనునట్లున్నాఁడు! వీరిరువురు కవలైయుందురా ?

లవు : ఓయీ, శూరమ్మన్యుఁడా, మీరాచవారి శూరత్వ మిట్టిదియేనా ? ఒక్క బాలకుని అందఱు సైనికులుపొదివి తెగటార్చుటయేగాక అతని మృతకళేబరము సైతము దొంగిలించుకొని పోవుచున్నావా ?

ఓయీ, ఆకళేరబరమును విజయోపాయనముగఁ దలంచుము. అన్యోన్య జిగీషువులమగు మనలో నెవరు గెలచినను ఆ పారితోషకమును గైకొందము.

లక్ష్మ : బాలకా, నీవీ ఋషికుమారునకు సోదరుఁడవా ?

లవు : నీకు నకాలమృత్యువును. లక్ష్మ : అంతరమెఱుంగక బాల్యచాపలమున మార్కొనిన యీ బాలునిగతి యేమైనదో చూడుము.

లవు : [శింజనీ టంకారము సేయుచు] ఇఁక నీగతి యేమి కానున్నదో తెలిసికొనుము.

కుశు : [మెల్లగఁ గనువి చచి] తమ్ముఁడా, నాకుఁ దోడ్పడవైతివా ? మరణశయ్యయందైన నొక్కమాఱు కౌఁగిలించుకొని నన్ను వీరస్వర్గమునకు వీడ్కొల్పవా ?

లవు : [విల్లుక్రిందవైచి] ఆహా ! మాభాగ్యవశమున అన్న బ్రతికి యున్నాఁడు. [దగ్గరకుఁబోయి మోకాలిపై వంగి] అన్నా, నిన్ను దురాత్ములునొప్పించిరా ? నన్నేల ముందుగఁ బంపివైచితివి ?

కుశు : తమ్ముఁడా, నేనిపుడెక్కడ నున్నాను ?

లవు : రణరంగమున.

కుశు : ఇంకను రాజకుమారుఁడు బ్రతికియున్నాఁడా !

లవు : వీఁడుగో! యజ్ఞపశువువలె బంధనమునకు సిద్ధముగ నున్నాఁడు.

కుశు : [చేతిపై సగములేచి] ఏఁడీ ?

లక్ష్మ : [స్వగతము] ఔరా ! ఏమి యీ కుమారుని క్షాత్రము ?

                    శరఘాతంబుల వేదనన్ సొలయుచున్ శార్దూలపోతంబు నె
                    త్తెరులొల్కంగ సగంబునిక్కి మృగయుం దుండాడ నుంకించెనా
                    శరవిద్ధాంగుఁడు బాలకుం డురు రుషా సంక్షుబ్ధ చిత్తంబునం
                    బరఁగున్; బాపురె ! వీరమోహన రణప్రావీణ్యరూపంబనన్.

కుశు : లవా, నావింటి నిటు లందియిమ్ము. [లవుఁడు అందియిచ్చును] [స్వగతము] ఔరా ! నాకరము శరాసన భారమునైన నోర్వకున్నది. [వింటిని దిగవిడచును]

లవు : [శింజినీ టంకారము సేయును.]

[వాల్మీకి ప్రవేశించును]

వాల్మీ : ఆహా ! శాంతికిఁ దావలమైన తపోవన మేలొకో ఆర్ద్రశోణితపిశితంబులఁ గళంకితమైనది.

లవు : రాజకుమారా, నీప్రాణములఁ గాచికొమ్ము.

                     మాజనని సర్వలోకసమ్మాన్యవృత్త
                     పూతచారిత్ర వీరప్రసూతయేని
                     తాత వాల్మీకి సత్తపో ధన్యుఁడేని

వాల్మీ : ఎవరు నన్నుఁ బేర్కొనుచున్నారు ?

లవు : అస్త్రమియ్యదె,

వాల్మీకి : ఆహా ! ప్రమాదము. విడువక యాఁగుమాఁగు.

లక్ష్మ : మునిచంద్రమా, లక్ష్మణుఁడు మ్రొక్కుచున్నాఁడు.

వాల్మీ : కుమారా, వర్ధిల్లుము !

కుశు : [స్వగతము] లక్ష్మణుఁడా యీతఁడు ?

లవు : తాతా, [వాల్మీకిని కౌఁగిలించుకొని] యీ దురాత్ముని సేనలు అన్నను ముట్టడించి మూర్ఛిల్లఁజేసినవి. అన్నను బ్రతికింపుము.

కుశు : తాతా, నన్ను శీఘ్రముగ వీరస్వర్గమునకు వీడ్కొల్పుము. ఈ శరాఘాత వేదన దుర్భరమగుచున్నది.

వాల్మీ : [స్వగతము] ఆహా ! దైవఘటనాచిత్రము ! [ప్రకాశముగ] నాయనా, యూరడిల్లుము. నీవు వజ్యకాయుఁడవు కాఁగలవు. లక్ష్మ : [స్వగతము] ఏమీ వాల్మీకిమునీంద్రుల మనుమలా యీ వీరకుమారులు ? ఆజన్మ బ్రహ్మచారికిఁ గుటుంబము కలదా ?

వాల్మీకి : [కుశునిపైవంగి] నాయనా కుశా, [ఒడలునిమురుచు] నీ శరాఘాతములన్నియు నిర్వాధకము లయ్యెడిని లెమ్ము.

లక్ష్మ : [స్వగతము] ఆహా ! తపోధనుల మహత్వము !

కుశు : తాతా, సమయమునకువచ్చి నన్ను రక్షించితివి.

లవు : అన్నా, వేదన శమియించినదా ?

కుశు : లవా, తాతగారి తప:ప్రభావ మమోఘముగదా ?

                      చేతితోఁదీసివైచిన రీతిగాఁగఁ
                      దూపుగంటుల వేదన తొలఁగిపోయెఁ;
                      బూర్వ దోర్బల ముత్సాహమును జెలంగెఁ;
                      దగుదు నేనింక వైరి మర్దనము సలుప.

వాల్మీ : కుమారా, యీ పట్టుదలవదలుము. మాననీయులయెడ నపరాధ మొనరించితివి.

కుశు : [స్వగతము] ఆహా ! యేమి వాల్మికితాతగారి పక్షపాతము.

వాల్మీ : లక్ష్మణా, గొప్పప్రమాదము వాటిల్లినది. లోకవిఖ్యాత వీరులగు మీర లీబాలురతోఁ బోరాడుట ధర్మమా ?

లవు : [స్వగతము] ఇంద్రజిత్సంహారకుఁ డగు లక్ష్మణుఁడా యీతఁడు ?

లక్ష్మ : మునికులతిలకా, మన్నింపవలయు. ఈకుమారకుల మనోహరస్వరూపములు నాహృదయమును గరుణావేల్లితమును గావింపఁ బోరుట కిష్ట పడక సవనాశ్వమును వదలుఁడని యెంత బ్రతిమాలుకొన్నను వీరు వినరై నాప్రయత్నము సాఁగమి రఘుకులేశ్వరు ప్రతిజ్ఞ నెఱవేర్చుటకై అనిష్టము తోనైనఁ గదనము సలుపవలసి వచ్చెను.

లవు : [స్వగతము] వాల్మీకి తాతగారు రాకుండిన నింతవఱకే ప్రతిజ్ఞ నెఱవేర్చి యుందువు కాఁబోలు !

వాల్మీ : నాయనా, గతమునకు జింతించిన లాభములేదు. ఈ తపోవనము ప్రవేశించి మా కతిథివైతివి.

లక్ష్మ : మహాప్రసాదము.

లవు : [కుశుని వంక తిరిగి] అన్నా, మనల నొప్పించిన దురాత్మునకు ఆతిథ్యమొసఁగ వలయునా ?

కుశు : లవా, తాతగారు ఆశ్రమధర్మములకు వెలియౌదురా ?

వాల్మీ : కుమారులారా, ఆశ్రమమునకుఁ బోదమురండు; అతిథి సత్కారధన్యుల మగుదము. [స్వగతము] దైవవశమున నేను సమయమునకుఁ దీర్థయాత్రనుండి మరలిరాకున్న నెంతప్రమాదము వాటిల్లియుండునో !

[అందఱు నిష్క్రమింతురు.]

_________

పంచమ స్థలము : వాల్మీకి ఆశ్రమము

_________

[వాల్మీకియు సీతయు సంభాషించు చుందురు.]

వాల్మీ : కుమారీ, ఈవిషయము చక్కగ నాలోచింపుము. ప్రజలింతకు మున్నే తమ యవివేకమును దెలిసికొని పశ్చాతాప పడుచుందురు. పుత్రవతిని నిన్ను రామచంద్రుఁడు కన్నులఁ గప్పికొని స్వీకరించును.

                       నేలనాలుగు చెఱగులు నేలఁజాలు
                       వీరవీరులు కుశలవుల్ వెలఁదిమిన్న,
                       అట్టికొమరుల సౌఖ్యంబు నరసియైనఁ
                       గాంతు సన్నిధిఁ గాలంబుఁ గడపుమమ్మ.

సీత : నాయనా, సర్వమెఱింగిన మీరే యిట్లాడుచున్న నిఁక నే నేమిపలుకఁగలను ? ఆర్యపుత్రునకు నాకన్నను గుమారులకన్నను కీర్తియే గదా యాదరణీయము.

వాల్మీ : కుమారీ, నిన్ను మరలఁ బరిగ్రహించుటవలన రామచంద్రుఁ డపకీర్తివంతుఁ డౌనని యెంచెదవా ?

సీత : ప్రజ లట్లు తలంతురు.

వాల్మీ : అమ్మా, లక్ష్మణునివలన నంతయు నెఱింగితిని. నిన్ను వనములకుఁ బంపినందులకు జనులు రామచంద్రుని తొందరపాటును దూలనాడు చున్నారఁట !

            సీత : ఆహా ! యేమి లోకుల చిత్తచాంచల్యము !

                      నోటి కడ్డమాఁకయులేక మాటలాడి
                      సత్యము నసత్యమెఱుఁగరు జడహృదయులు;
                      గాలివీచిన యట్లెల్లఁ గదలియాడు
                      కేతనాంచల మటు వారి చేత మలరు.

వాల్మీ : జానకీ, జనసామాన్యము కర్ణధారిలేని నావవలె ముందు వెనుకకుఁ ద్రుళ్ళింతలాడుచు అనేకవిధములఁ బోవుచుండును.

సీత : నాయనా, యశ్వమేధ మొనరింప సమకట్టిన యార్యపుత్రుఁడు నూతనముగ సహధర్మచారిణిని బరిగ్రహించి యుండునుగదా ! వాల్మీ : బిడ్డా, రామచంద్రుఁడు ఏకపత్నీవ్రతుఁడని యెఱుంగవా ?

సీత : అట్లయిన సహధర్మచారిణి లేక యజ్ఞదీక్ష యెట్లు వహించును ?

వాల్మీ : నీ ప్రతిబింబమగు స్వర్ణమయవిగ్రహమె సహధర్మచారిణి యగుట !

సీత : [ఆశ్చర్యముతో] ఏమీ యీవింత ! ఆర్యపుత్రుఁ డెంతటికైనఁ దగియున్నాఁడు.

వాల్మీ : శాస్త్రసమ్మతమని యెందఱో ధర్మవేత్తలగు తాపసు లుపదేశించినను ద్వితీయ పరిగ్రహమున కియ్యకొనక నీప్రతికృతిగఁ గాంచన విగ్రహమును నిర్మింపించి రఘుకులేశ్వరుఁడు దీక్షాకంకణము ధరియించెనఁట !

సీత : [స్వగతము] ఆర్యపుత్రుని యేకపత్నీవ్రత మెల్లకాలము వర్థిల్లుఁగాక !

వాల్మీ : అమ్మా, రామచంద్రుఁడు నిన్ను విడనాడియుండువఱకు స్వస్థచిత్తుఁడు కాఁజాలఁడు.

                      నిండుచూలాలి విడనాడ నేర్చెఁగాని
                      విరహతాపంబు రాముఁడు వీడలేఁడు ;
                      పవలురేయును నిన్నెంచి పనవిపనవి
                      పాండురోగి విధంబునఁ బాలిపోవు.

సీత : [స్వగతము] ఆర్యపుత్రునకు వినోదహేతువైన ఆ కనకవిగ్రహమునకన్న సంతాపకారిణి నగు నేనే దురదృష్టవతిని.

[కుశలవులు ప్రవేశింతురు.]

కుశు : తాతా, మాపాఠముల నొప్పగించుకొనుము. మేము పూజా పుష్పములు గోయఁ బోవలయు.

వాల్మీ : నాయనలారా, పాఠము లటుండనిండు. అయోధ్యాపతి యొనరించు అశ్వమేధమునకు మన మాహ్వానింపఁబడితిమి. మనమందఱము నేఁడే రాజధానికిఁ బ్రయాణము కావలయు.

లవు : తాతా, అమ్మ కూడానా ?

వాల్మీ : అవును ?

కుశు : తాతా, అట్లయిన మేము రామాయణకథానాయకునిఁ బ్రత్యక్షముగఁ జూడఁగలమా ?

వాల్మీ : నిస్సంశయముగఁ జూడఁగలరు.

సీత : [స్వగతము] ఆర్యపుత్రుఁడు తమతండ్రి యని తెలిసిన ఈ కుమారకు లెట్లు సంతసించువారోగదా !

లవు : తాతా, ఆలక్ష్మణుఁడేమైన మాపై లేనిపోని తంటాలు చెప్పునేమొ ?

వాల్మీ : న న్ననుసరించు మీకు నేలాటిభయముండదు లెమ్ము.

లవు : అన్నా, రమ్ము. చక్కగ ఉతికియారవైచిన వల్కలములు ధరియించుకొని సిద్ధముగ నుందము.

[కుశలవులు నిష్క్రమింతురు.]

వాల్మీ : కుమారీ, తాపస సువాసినుల యాశార్వాదములు వడసిరమ్ము.

సీత : అటులనే పోయివచ్చెదను.

[నిష్క్రమించును.]

వాల్మీ : నేనిన్ని దినములుఁ దలపోయుచుండిన కార్యము ఆతర్కితముగ అశ్వమేధ సందర్శనమూలమున సిద్ధింప నున్నది ఇఁకనైన రామభద్రుఁడు దారాపుత్ర వంతుఁడై సుఖియించుఁగాక !

[నిష్క్రమించును.]

________

అష్టమాంకము

ప్రథమ స్థలము : యాగమంటపము

[రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులును, రాజులును, మునులును, ప్రజలును కూర్చుండియుందురు.]

రాము : [స్వగతము] అకటా ! సర్వాంగనిర్వాణదాయిని యగు నా జానకిని మోసగించి యడవులకు వెడలించి కృత్రిమమగు కనకవిగ్రహముతోడ నే నీ యాగమంటపము నలంకరింప వలయునా ? ఈసాహసము సీతాబహిష్కారమునకన్న హృదయభేదక మగుచున్నది.

వసి : రామభద్రా, కంకణము ధరియించికొమ్ము.

రాము : [చేయిచాఁపును. వసిష్ఠుఁడు కంకణము కట్టుచుండును.]

                     అవనిజాత రాముని బహి:ప్రాణ మనుచు
                     నెల్ల రనుకొను సత్యంబు కల్లయయ్యె ;
                     నట్లుగాకున్న జానకి నడవి కంపి
                     పాపి రాముండు నింకను బ్రతికియున్నె ?

వసి : రామచంద్రా, హుతాశనున కంజలి ఘటియించి హోమకుండము రగుల్పుము.

రాము : [ఉల్క చేతఁబట్టుకొని కుండము తప్పించి రగిలించుచు] [స్వగతము] సీతా విరహితమైన ఈ యశ్వమేధము నే నెట్లొనర్తును ?

                       నాదు గృహలక్ష్మి, యర్ధాంగి, నా మనో ల
                       తాంత మకరంద బిందువు చెంతనుండ
                       నెన్నొ జన్నంబు లొనరించి యున్న నాకు
                       ధర్మపత్ని యయ్యె నిటఁ గుందనపుబొమ్మ.

లక్ష్మ : [స్వగతము] శోకాకులితచిత్తుఁడగు మాయన్న యజ్ఞవిథుల సాంతముగ నొనరింపఁ గలఁడా ?

రాము : [స్వగతము] జానకీ, నీకై యొనర్చిన అనన్యసాధ్యములగు సాహసకార్యములు నేఁడు నిష్ప్రయోజనము లాయెఁగదా !

                       నీవు లేకుండిన నిస్తుల బలశాలి
                              వాలిఁ జెండాడుట వమ్ముగాదె ?
                       నీవు లేకుండినఁ బావని జృంభించి
                              వనధి దాఁటుటయు నిష్ఫలముగాదె?
                       నీవు లేకుండిన నిఖిల వానరసేన
                              యబ్ధిగట్టుట వ్యర్థ మౌనుగాదె ?
                       నీవు లేకుండిన నిర్ణిద్ర రణవీరు
                              రావణుఁ జంపుట రవ్వగాదె ?

                       స్వార్థపరత నిన్ను సాధుచరిత్రను
                       జేతులారఁ గానఁ జేరఁద్రోసి,
                       వెఱ్ఱిపట్టినటుల వెకలినై చింతింతు
                       గడచినట్టి దుష్ట కార్యమునకు.

[వాల్మీకి కుశలవులు ప్రవేశింతురు]

వాల్మీ : రామభద్రా, మంగళ మగుఁగాక !

రాము : మునీంద్రా, భవదాగమమునఁ గృతార్థుఁడ నైతిని.

మునులు : తథాస్తు. తథాస్తు.

రాము : [స్వగతము] లక్ష్మణుఁ డెఱిగించిన సౌందర్యమూర్తు లీ యిరువురు వటువులై యుందురా ?

[సభలో గుజగుజలు]

రాము : మునీంద్రా, యీ తాపస వటువు లెవ్వరి కుమారులు ?

వాల్మీ : వీరొక వనవాసిని బిడ్డలు.

లవు : [జనాంతికము] అన్నా, యీ యజమానుఁడేనా రామాయణ కథానాయకుఁడు ?

కుశు : అట్లే తోఁచుచున్నాఁడు. తమ్ముఁడా, యీ శాంతస్వరూపుని దర్శించినంతఁ దల్లినిగాంచినంత యనురాగ ముప్పతిల్లుచున్నది !

లవు : అన్నా, వాల్మీకితాత సత్యమే వర్ణించును.

రాము : మునీంద్రా, ఆ వనవాసిని యెవ్వతె ?

వాల్మీ : ఎవ్వతెయో యొకగర్భిణి వనముల నిస్సహాయయై పరితపించుచుండ, నే నాశ్రమమునకుఁ దీసికొనిపోయి కుమారీ నిర్విశేషముగఁ బోషించుచుంటిని.

రాము : తాపసోత్తమా, యీనిర్హేతుకవాత్సల్యము మీ దివ్యచిత్తమున కనురూపమైనది - తరువాత ?

వాల్మీ : కొన్నిదినముల కా సీమంతిని యీకవ బిడ్డలను బ్రసవించెను.

రాము : [స్వగతము] ఆహా! యీ సుందరకుమారులఁ గాంచిన ప్పటినుండి నామనము పరిపరివిధములఁ బోవుచున్నది ! అదియేలొకో వీరి ముఖమండలముల వైదేహి పోలికలు పొడకట్టుచున్నవి. నాభ్రాంతియె యిట్లు తోఁపించుచున్నదా ?

[ప్రకాశముగ] కుమారులారా, యిటురండు.

వాల్మీ : [స్వగతము] వాత్సల్యబీజమా, యంకురింపుము.

కుశలవులు : [అనుజ్ఞకై వాల్మీకితట్టు చూతురు.]

వాల్మీ : నాయనలారా, భయపడకుఁడు. రామభద్రుఁడు సర్వప్రజలకు జనకప్రాయుఁడు.

కుశలవులు : [రాముని వద్దకిపోదురు.]

రాము : [ఇరువురను రెండుచేతులఁ జేరదీసికొని, స్వగతము]

                     ఆహా ! యేమి యీ యాశ్చర్యము !

                     ఈ మనోహరాంగు లీ ముద్దుకొమరులు
                     నన్ను నంటినంత సన్నుతాంగి
                     జనకజాత హస్త సంస్పర్శమట్టులఁ
                     గాయమెల్ల నమృత కలితమయ్యె.

కుశు : [స్వగతము] ఏమి, యీ మహాత్ముని తాపసాదరణము ?

లవు : [స్వగతము] తండ్రి కౌఁగిలి నెఱుంగని నాశరీరము ఈ మహారాజుకౌఁగిట సుఖించుచున్నది.

రాము : కుమారులారా, మీనామధేయము లేమి ?

లవు : మహారాజా, యీయన కుశుఁడు.

కుశు : రాజచంద్రా, యీతఁడు లవుఁడు.

రాము : [స్వగతము] ఎంత కఠోరసంబోధనములు !

వసి : వత్సా, యిఁక యజ్ఞవిధుల గమనింపుము. వాల్మీ : నాయనలారా, మీ రిఁకరండు.

కుశలవులు : [కౌఁగిలి వదల్చుకొని వాల్మీకి దగ్గఱకు వత్తురు.]

రాము : [స్వగతము] ఆహా ! కౌఁగిలి వదల్చుకొనిపోవు నీబాలకుల నాచిత్తముగూడ ననుసరించుచున్నది. ఆగర్భవతియే సీత యై యుండిన ఈ ముద్దుకొమరులే నా బిడ్డలైయుండిన - ఆశా. యీ మందభాగ్యుని యందు నీయూహలన్నియు నిరర్థకములు.

[శూర్పణఖ నీడ్చుకొని విభీషణుఁడు ప్రవేశించును.]

              విభీ : ఓసి కులపాంసనీ, చండి, యోసి జంత,
                      నాకు సోదరివై పుట్టినావె నీవు ?
                      కత్తికొక్కొక్క కండగాఁ గాయమెల్లఁ
                      దఱగివైచినఁ బోనె పాతకము కుటిల ?

లక్ష్మ : దానవేశ్వరా, యాగమంటపముననా స్త్రీహత్య ?

రాము : విభీషణా, ఏమి యీ దౌర్జన్యము ?

విభీ : రఘుకులేశ్వరా, యీ మాయలమారిజంతను ఇప్పుడే శిరచ్ఛేదన మొనరించుట కాజ్ఞ యొసఁగవలయు. ఈ శూర్పణఖయే నిరపరాధిని యగు జానకీదేవి బహిష్కారమునకు మూలము. ఈ రక్కసి యొనరించిన కుట్రలన్నియు నాకుఁ దెలియవచ్చినవి.

రాము : [ఆశ్వర్యముతో] ఏమేమి ?

లక్ష్మ : [స్వగతము] ఇది యేమివింత !

రాము : విభీషణా, యీశూర్పణఖ యేమిచేసినది ?

విభీ : ఈ క్రూరచారిత్రయే తనదుష్టకృత్యమును దెలిసికొనుఁగాక.

[సభలో గుజగుజలు]

శూర్ప : దీనరక్షామణీ, ఆపద్భాంధవా, రామచంద్రా యాఁడుకుయు లాలింపుము. అనాధవత్సలా, ఈపాపాత్మను రక్షింపుము. నాతప్పు క్షమియింపుము. నన్ను బ్రతుకనిమ్ము.

భరతు : [స్వగతము] ఈరహస్యము పూర్వమే తెలిసియుండిన జానకీదేవి యడవులకుఁ బంపఁబడి యుండదుగదా.

విభీ : ఓసీ మాయలమారీ, నీబొంకు లింకఁ జాలింపుము. సీతాప వాదకళంకము నీహృదయ రక్తపూరమున గడిగివేయవలయును.

శత్రు : [స్వగతము] శూర్పణఖ కుట్రయా యింతటికిం గారణము !

శూర్ప : దీనబాంధవా, రామభద్రా, యీ దీనురాలికి నభయ ప్రదాన మొసంగి రక్షింపుము.

                     ప్రాణవల్లభఁ జీకాకు పఱచినట్టి
                     కాకదైత్యుని సైతముఁ గాచినావు;
                     అఖిలలోక శరణ్యుండ వైన నిన్నుఁ
                     బ్రాణదానంబు వేఁడెద రామభద్ర.

లక్ష్మ : అన్నా, యీమాయావినియందు నెనరూనఁదగదు.

రాము : దానవీ, నీవెట్లు సీతాపవాదమునకు మూలమవైతివి ?

శూర్ప : మహారాజా, యథార్థము చెప్పుచున్నాను. నన్ను రక్షించినను శిక్షించినను మీ కరుణయె.

రాము : చెప్పుము.

శూర్ప : రాక్షసవినాశన ప్రతీకారమొనరింపఁ గోరి జానకీదేవిని నెట్లైన నడవులఁ గష్టపెట్టనెంచి అయోధ్యఁ జేరితిని. మాఱువేసంబునఁ జరిం చుచు జనసమ్మర్దములగు ప్రదేశముల ఏమేమొ యపవాదములు వ్యాపింపజేసితిని. రామభద్రా, రక్షింపుము. రక్షింపుము.

ప్రజలు : జానకీదేవి నిష్కలంక - సీతాదేవి సాధుచరిత్ర -

రాము : [స్వగతము] ఓసీ క్రూర రాక్షసీ, నీపగతీర్చుకొంటివా ?

విభీ : మహారాజా, ఈకపటచారిణిని దెగటార్చుటకు ఆజ్ఞవెట్టుము.

శత్రు : అన్నా, ఈ రాక్షసి కరుణార్హ గాదు.

                     నిండుచూలాలి వైదేహి నిష్ఠురంపుఁ
                     గష్టములకుఁ గారణమైన దుష్టురాలిఁ
                     గఱకు కఱవాలమునఁ జీల్చి కండలెల్లఁ
                     గాకులకు గ్రద్దలకు వైవఁ గౌతుకంబు.

రాము : తమ్ముఁడా, దీక్షాకంకణపూతమైన నాహస్తము అపరాధిని రక్తమందైన ముంపఁజాలను. ఈ కుటిలచరిత్రను హింసించినను నాప్రాణవల్లభ మరల బ్రతికివచ్చునా ? శూర్పణఖా, వెడలిపొమ్ము. పాప పరిహారము గావించుకొనుము.

శూర్ప : రఘుకులేశ్వరా, నీయనంత కారుణ్యము వర్ధిల్లుగాక ! దారపుత్రవంతుఁడవై సుఖింపుము.

రాము : [స్వగతము] జానకి జీవించియున్నఁగదా -

ఋషులు : రామభద్రా, నీయతిలోక దయాళుత్వము ప్రశంసనీయము.

విభీ : శూర్పణఖా, రామచంద్రుని యాజ్ఞలేమి నీవు వధింపఁబడక బ్రతికితివి. ఇఁక లంకయం దడుగిడిన నా కరవాలము నీప్రాణముల నూటి కొనును. పొమ్ము. నీపాపాత్మ తరియించునటుల నెక్కడనైన వనమందుఁ దప మాచరింపుము.

శూర్ప : [స్వగతము] పులివాఁతబడిన జింకపిల్ల జాఱి పడినటుల ఈ విభీషణుని చేతినుండి తప్పించుకొంటిని. ఇఁక నెక్కడికైనఁబోయి నా జీవితశేషమును గడపెద.

[నిష్క్రమించును.]

వాల్మీ : [లేచి నిలుచుండి] ఋషీశ్వరులారా, సకల దేశాధీశ్వరు లారా, ప్రజలారా, పవిత్రచారిత్రయగు జానకీదేవి శూర్పణఖ మూలమున నడవులకు వెడలింపఁబడుట మీరెల్ల రెఱుంగుదురుగదా ! నిండు చూలాలు - కోమలశరీర - రాజకుమారి నిస్సహాయయై యెట్లు కాలముగడపుచున్నదో యెవ రెఱుంగుదురు ?

రాము : మునీంద్రా, హృదయ మర్మభేదకమగు నీవిషయము నేల తలపించుచున్నారు ?

వాల్మీ : ఆసాధ్వీమణి కష్టపరంపరలు విన్నఁ గఠోరచిత్తులైనఁ గంటఁ దడివెట్టకుందురా ? ఇఁకఁ గరుణార్ద్రహృదయులగు మీమాట జెప్పవలయునా ?

ప్రజలు : వాల్మీకిమునీంద్రా, మహారాజ్ఞి దురవస్థఁ దలఁచినంత నే మాగుండె లవియుచున్నవి.

వాల్మీ : అవునవును; అయోధ్యావాసులు సజ్జనులని నాకుఁ దెలియును. సీత యన్ననో కదలమెదలలేని గర్భవతి. వనమా ఘోరమృగా కులము. ప్రాణములు పిడికిటఁబట్టుకొని ఆ యబల యెంతకాలము జీవించి యుండును ?

ప్రజలు : కష్టము ! కష్టము !

మునులు : సీత సుఖించుఁగాక !

రాము : [స్వగతము] అయ్యో ! యీమునీంద్రుని పల్కులు వ్రీలుచున్న నా హృదయమునకు శల్య సంచలనములవలె నున్నవి.

వాల్మీ : శూర్పణఖ తనదుష్కార్య మొప్పుకొనినవెనుక సభాస్థారులలో నెవ్వరైన సీతాదేవి బహిష్కారయోగ్యయని చెప్పఁగలరా ? ప్రజలు : మునీంద్రా, సీతాదేవి మాకుఁ గన్నతల్లివంటిది. జానకీదేవి పావనచరిత్ర - పతివ్రతామణి. దేవీబహిష్కారము ప్రమాదజనితము; ప్రమాదజనితము.

రాము : [స్వగతము] ఈప్రజ లే గాలికి ఆ చాపయెత్తు స్వభావము గలవారు.

వాల్మీ : సభ్యులారా, సీతాదేవి దైవవశమున బ్రతికియుండినఁ బునర్గ్రహణ యోగ్యమగునా ?

ప్రజలు : నిస్సంశయముగ - ఈయశ్వమేధమున మహారాజునకు సీతాదేవియే సహధర్మచారిణి గావలయు.

రాము : ఇది యెట్లు సంభవించును ?

వాల్మీ : వత్సా ! ధైవఘటన కసాధ్యముగలదా ?

రాము : [ఆతురతో] ఆర్యా, అట్లయిన మాహృదయేశ్వరి బ్రతికి యున్నదా ?

వాల్మీ : కుమారా, జానకి బ్రతికియున్నది.

[ప్రజలలో సంతోషసూచకసంభాషణలు, గుజగుజలు]

రాము : ఏమి వినుచున్నాను ? ఇది స్వప్నము గాదు గదా ?

ప్రజలు : మహారాజా, మామనములు చల్లఁబడునటుల సీతాదేవిని పరిగ్రహించి సుఖింపుము.

వాల్మీ : రాఘవా, నీకుఁ గుమారులుగూడఁ గలరు.

లక్ష్మ : [స్వగతము] నాయూహ యథార్థమై యుండునా ?

రాము : ఆహా ! యిదియేమో మాయనాటకముగ నున్నది. మునీంద్రా, యిదియంతయు నసంబద్ధము. నాకెక్కడిజానకి ? యెక్కడి కొమరులు ? సీతకును నాకును బండ్రెండు వత్సరములు దుర్భేద్యకుడ్యమువలె యెడఁబాటు గావించినవి. ఇది యంతయు స్వప్నము - మృగతృష్ణాప్రాయ ము - ఇంద్రజాలము - ఈమందభాగ్యునికి భార్యలేదు, బిడ్డలులేరు, సోదరులులేరు, బంధువులులేరు. ఎవ్వరునులేరు. రామునకు లోకమంతయు శూన్యము ; అంధకార మలీమసము; నరక సదృశము.

వాల్మీ : అమ్మా, జానకీ.

[జానకి, తాపసపురంధ్రి, ప్రవేశింతురు; కుశలవులు ఆమెనుచూచి ప్రక్కకు వత్తురు]

రాము : [ఆశ్వర్య దు:ఖములతో] జానకియా ? - ఏకవేణీధారిణి - కృశాంగి - ఆ - నాజానకి బ్రతికియున్నది !

[రాముఁడు పీఠముపైనుండి లేచును. కుశలవులు ఆశ్చర్యముతో చూచుచుందురు. రాముఁడు సీతను దగ్గఱకు తీసికొని] ప్రాణప్రియా, నా స్వార్థపరత్వమును క్షమియింపుము. నాయపరాధమును నీకృపాకటాక్ష వీక్షణములఁ గప్పిపుచ్చుము. నాజివితశేషమును నీ యభీష్టపాలనమునకై వినియోగించి యపరాధ విముక్తుఁడ నయ్యెదను.

నాముద్దు బిడ్డలారా, కుశలవులారా, రండు నాయుత్సంగము నలంకరింపుఁడు. నన్నానందవార్ధి నోలలాడింపుఁడు. మీతల్లి నట్లు నట్టడవులఁ గష్ట పెట్టితినని కోపింపకుఁడు.

కుశు : [స్వగతము] ఇదియేమి, మహారాజి ట్లనుచున్నాఁడు ?

లవు : [స్వగతము] మేము రామాయణకథానాయకుని బిడ్డలమా ?

[సభలో గుజగుజలు]

రాము : నాయనలారా, రండు. నన్నుఁ గౌగిలించుకొనుఁడు.

లవు : [స్వగతము] ఇంతవఱకుఁ దాపసబాలకుల మనుకొను చుంటిమి ! సీత : ప్రాణవల్లభా, యీదీనురాలి యపరాధములను మన్నింపుము.

[పాదములమీఁద వ్రాలును.]

రాము : [లేవనెత్తి] హృదయేశ్వరీ, నిరపరాధిని వని తెలిసియుఁ, గీర్తిలోభమున, మిషవెట్టి నిన్నుఁ గానలకంపిన యీ పాపిరాముఁడు నిన్ను క్షమియించుట కెవ్వఁడు? నీ యతి లోకపాతివ్రత్యము నీయనన్యసాధ్యమైన క్షమ మావంశము నుద్ధరించినది. మఱొకమా ఱీలోకమును నా కానందమయముగ నొనరింపుము. [స్వగతము] ఆహా ! మానవుని సుఖదు:ఖావస్థల భ్రమణము !

                    ఐంద్రజాలికుఁ డాత్మ మోహనపుఁ గుంచె
                    విసరినంతనె మాఱెడి విషయమటుల
                    నాకు నిరయంబుగాఁదోఁచు నాదు బ్రతుకు
                    స్వర్గ సన్నిభమయ్యె నీక్షణమునందు !

[ప్రకాశముగ] మునిసత్తమా, నాకృతజ్ఞత యెట్లుదెలిసికొనుటకుఁ దోఁపకున్నది. నన్నింకొకమాఱు సపత్నీకుని గావించితిరి.

వాల్మీ : వత్సా, కష్టసుఖములు లోకమునకు సహజములు; అని వార్యములు. గడచినది మఱచిపొమ్ము. వర్తమానము ననుభవింపుము. భవిష్యత్తును దృష్టిపథమున నుంచుకొనుము.

ఋషులు : రఘుకులేశ్వరా, జానకీసహితుఁడవై యశ్వమేధము నొనరింపుము. దార పుత్రవంతుఁడవై గార్హస్థ్యసౌఖ్యముల ననుభవింతువు గాక !

ప్రజలు : తల్లీ లోకమాత, అజ్ఞానుల యపరాధముల మన్నించి మమ్ము మీబిడ్డలవలె రక్షింపుఁడు.

      ఋషులు : స్వస్తి ప్రజాభ్య: పరిపాలయంతాం,
                    న్యాయేన మార్గేణ మహీంమహీశా:,
                    గోబ్రాహ్మణేభ్య: శుభమస్తు నిత్యం,
                    లోకా: సమస్తా: సుఖీనో భవంతు !

[యవనిక జాఱును.]

భరతవాక్యం.

                      నెలముమ్మాఱులు వర్షముల్ గురియుతన్
                                 నీరంధ్రమేఘాళి స
                      స్య లతావృక్షచయంబు సత్ఫలయుతంబై
                                  క్షామముల్ వాపుతం
                      గలుగుంగాత స్వరాజ్యమెల్ల ప్రజకుం !
                                   గళ్యాణముల్ సౌఖ్యముల్
                      వెలయుంగావుత స్వర్గమందు బలె నీ
                                   విశ్వంభరన్ నిత్యమున్!

_______


This work is in the public domain in the United States because it was published before January 1, 1929.


The author died in 1947, so this work is also in the public domain in countries and areas where the copyright term is the author's life plus 75 years or less. This work may also be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.