Jump to content

కవికర్ణరసాయనము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

ప్రథమాశ్వాసము

కథాప్రారంభము

వ.

సమర్పితంబుగా నాయొనర్పంబూనినమాంధాతృచరిత్రం బనుకావ్యకథాకల్పవల్లికి
నాలవాలం బైనపురవరం బెట్టిదనిన.

1

సాకేతపురవర్ణనము

సీ.

జాతరోపమనోజ్ఞజాతరూపం బైన, కోటచే వలయాద్రి నోటుపఱచి
మధుసుధారసపూరమధురనీరం బైన, పరిఘచే వారాశి భంగపఱచి
నవరత్నచిత్రాభినవయత్నకము లైన, యిండ్లచేఁ గనకాద్రియేపు గఱచి
కాంతినిర్మలచంద్రకాంతబద్ధము లైన, కుట్టిమంబుల ధాత్రిఁ గొంచపఱచి


గీ.

కమలగర్భుండు దనసృష్టి గానిభువన, కోశగర్వంబు నణఁగింపఁ గోరి దీని
వేడ్క నిర్మించె ననఁ బొల్చు వినతహృదయ, ఘట్టనం బైనసాకేతపట్టణంబు.

2


క.

పట్టణరమ బిరుదునకై, పట్టినపగలింటిదివియబాగునఁ గోటం
జుట్టును దన్మణిగణరుచి, ఘట్టితతేజుఁ డయి తిరుగు ఖరకరుఁ డెపుడున్.

3


క.

పరిఘాకమఠము పైఁ దన, భరియించినధరణి నిలిపి ప్రాక్కమఠము త
చ్చిరవహనశ్రమహతికా, పరిఘాజలఖేలనంబు పలుమఱు సలుపున్.

4


గీ.

అతిసమున్నతకనకహర్మ్యములతుదలఁ, జెలువ మొలికెడుసాలభంజికలు వొలుచుఁ
బురవిశేషవిలోకనాద్భుతముకతనఁ, జేష్ట లెడలిన ఖేచరస్త్రీలువోలె.

5


ఉ.

కన్నులపండువై పొలుచుఁ గన్గొన నప్పురలక్ష్మి సారెకు
న్విన్ననువొప్ప విచ్చునెఱవేణితెఱంగున మందమారుతో
ద్యన్నిజకేతనాంచలకరాగ్రములం బ్రవిసారితంబు లై
యున్నతసౌధశైలశిఖరోపరిలంబితమేషలేఖికల్.

6


శా.

ఏణీలోచన లాత్మవక్త్రరుచిచే నేణాంకసౌభాగ్య మ
క్షీణప్రౌఢి హరింప సౌధపరిసంకీర్ణేంద్రనీలోపల

శ్రేణీనిర్మలకుట్టిమంబులపయిన్ శీతాంశుఁడున్ బేద యై
ప్రాణాచారము వడ్డయట్ల ప్రతిబింబవ్యాప్తి చూడం దగున్.

7


చ.

అహరహముం బ్రభాతముల హర్మ్యతలోపరిచంద్రశాలికా
గృహములఁ గామినీసురతకేలివిసూత్రితహారమౌక్తిక
గ్రహణపరాయణంబు లగుఁ గావురఁ దన్మతిభ్రాంతతారకా
గ్రహములఁ జంచులం గమిచి క్రాయుఁ బురిం జిఱుప్రోదిపార్వముల్.

8

ద్విజాదివర్ణనము

క.

క్రతుభుజులకు గృహపాచకు, లతిగూఢ బ్రహ్మనిధికి నాజనికులు భా
రతికిం బేరోలగములు, ప్రతిలే కలరుదురు పురము బ్రాహ్మణవర్యుల్.

9


శా.

పౌనఃపుణ్యముచేతఁ గాని రిపులన్ భంజింప లేఁ డయ్యె భూ
దానం బొక్కటి గాని షోడశమహాదానంబులుం జేయ లేఁ
డేనీతిన్ జమదగ్నిరాముఁడు సముం డిద్ధప్రసిద్ధోన్నమ
ద్దానక్షాత్రగుణంబులం బురవరాంతఃక్షత్రియశ్రేణికిన్.

10


ఉ.

లేకి నిధివ్రజంబు లవలేశము కాంచనభూధరంబు ర
త్నాకరరత్నరాసు లడిగంట్ల మరున్మణికామధుక్సురా
నోకహముల్ క్రయోచికవినూతనవస్తువు లిట్టి వట్టి వ
న్వాకుల కందరానిపురవైశ్యులసంపద లెన్నిచూపుచోన్.

11


క.

ప్రతివర్షంబును ధర ను, ద్ధతిఁ బడియెను పిడుగు లెల్లఁ దగఁ గూర్చి నరా
కృతులుగ ననఁగూర్చె నొకో, శతధృతి యన వీట సుభటసంఘము వొలుచున్.

12


సీ.

అవలీలమై నెట్టియవనీరుహము లైనఁ, బెఱుకుట యెలదూండ్లు వెఱికినట్ల
కొమ్మలతుదఁ క్రొచ్చి కులశైలతటు లైనఁ, గూల్చుట నదిదరుల్ గూల్చినట్ల
యున్మత్తవృత్తిమై నుదధిసప్తక మైనఁ, గలఁచుట మడుగులు గలఁచునట్ల
బలిమి నెంతటి యనిఁ బర సైన్యతతుల మ, ట్టాడుట తుంగలో నాడునట్ల


గీ.

 కాఁ జరించుచుఁ దమయందుఁ గలుగురౌద్ర, రసము లుత్కటమై వెలి నెసఁగుమాడ్కిఁ
గోపమదధార లనిశంబు గురియుచుండ, పఱలుఁ బుగివారణము లనివారణములు.

13


సీ.

కట్టడిఁజెలియలికట్టయె కట్టగా, బిగువుమైఁ బేరెంబు వెట్టకుండ
లంఘరలాఘవోల్లసనంబుమై మొక్క, లించి వార్ధులు చౌకళింపకుండ
బిట్టుదిగంతముల్ ముట్టఁజూపినవిధి, పవమానుగడ తెగఁబాఱకుండ
భరతాభినయముల నిరపేక్షగా లోక, దృష్టులు దనియ నర్తింపకుండ


గీ.

రయముచేఁ జిత్తగతుల గెల్చియును బతుల, మతులలోనన వర్తింప మాకు వలసె
ననుచు సిగ్గునఁ దలవంచుకొనినవిటులొ, యనఁగఁదగి యొప్పుఁ బురి నుత్తమాశ్వతతులు.

14

క.

క్షితిసుర లొనర్పుసతత, క్రతువుల నాహుతులు గొనుచుఁ గాఁపున్నసుర
వ్రతతులవిమానములయా, కృతులం బొలుపారు వీటఁ గ్రీడాగృహముల్.

15


క.

వేడుకఁ బతులుం దామును, గ్రీడాగేహములు చొచ్చి కెలనం దెలిరా
గోడలఁ గనుపట్టెడుతమ, నీడలు సవతు లని మానినీజన మలుగున్.

16


శా.

దర్పం బేర్పడ ముగ్ధలం బతులు నూత్నక్రీడకుం దార్చి కం
దర్పుం డార్వఁగ నీవిబంధనములం దప్పింప నవ్వీటిలో
నర్పించుం బునరంశుకస్థితిఁ ద్రపాహైన్యం బభావంబుగాఁ
గర్పూరాగరుధూపధూమపటలీగాఢాకృతీప్రక్రియల్.

17


శా.

కేలీగేహసరోమరాళమిథునక్రేంకారముం గన్యకా
డోలాకాంచనకింకిణీఘనరవాటోపంబు నృత్యన్నటీ
హేలానూపురశింజితంబుఁ బురి నింపేపారఁగా లోఁగొనుం
గాలోద్యత్పురుషాయమానగణికాకాంచీకలక్వాణముల్.

18


ఆ.

ఉచితసమయ మగుటయును రత్నగర్భప్ర, సూతి నొందియున్నచొప్పు మెఱయ
వివిధమణిసమృద్ధి వీక్షింపఁగా నొప్పు, నప్పురంబులోన నాపణములు.

19

వేశ్యావర్ణనము

సీ.

గమనంబులేచాలుఁ గన్నులు దనియింప, నృత్తంబు లేలకో నేర్చి రిట్లు
పలుకులే చాలు వీనులకుఁ బండువు సేయ, నెఱపాట లేలొకో నేర్చి రిట్లు
సౌందర్యములె చాలు సమ్మోహనమునకు, నేపథ్య మేలకో పేర్చి రిట్లు
తారుణ్యములె చాలుఁ దలఁపులు గరఁగింప, నెఱతనం బేలకో నేర్చి రిట్టు


ఆ.

లిది ప్రియాతిరేక మిది గదా నఖముఖ, సాధ్యమునకుఁ బరశుసంగ్రహంబు
వీరు గలుగ మరుఁడు విజయగాఁ డెట్లన, వఱలుదురు పురంబువారసతులు.

20

పుష్పలావికావర్ణనము

సీ.

కరముల కందిచ్చువిరులబంతులకంటె, వెడఁదోఁచుచన్నులు వేడ్కఁ బెనుప
మవ్వంపుగొననెత్తుపువ్వుటెత్తులకంటెఁ, గరమూలరుచిచూడ్కిఁ గమిచి తిగువఁ
గోరిన నొసఁగెడుకొసరుపువ్వులకంటె, మొలకనవ్వులు డెందములు గరంప
నిండారుసరములనెత్తావిగమికంటె, సుముఖసౌరభములు చొక్కుఁ బెనుప


ఆ.

జట్టికాండ్రఁ దమదుసరససుందరవిలా, సములచేతఁ దార జట్టిగొనుచుఁ
బురమువీథులకును భూషణప్రాయ మై, క్రాలుఁ బుష్పలావికాజనంబు.

21

పౌరవిలాసినీవర్ణనము

గీ.

అంగరాగంబు దమవెలయాట నంత, రంగరాగంబు నొసఁగెడునప్పురంబు
గట్టివాలుపడంతులు కంతుచేతి, గట్టివాలున కొప్పింతు రెట్టివారి.

22

మ.

అజహచ్చంద్రవిజృంభముల్ శుకపికాధ్యారూఢనానావిధ
ద్విజమృష్టాన్నయథేష్టసత్రగృహముల్ దీవ్యన్మదోత్సేకభా
వజసర్వస్వము లంచితానిలనిజస్వారాజ్యము ల్దంపతీ
వ్రజతారుణ్యసమృద్ధిసాక్షులు పురప్రాంతస్స్థితారామముల్.

23


చ.

అలికులకుంతలంబులు రథాంగకుచంబులు పద్మవక్త్రముల్
గలరవపద్మినుల్ గడువికాసముతోఁ దమయందు సక్త మై
యలర విహారవేళఁ దము నంటినకాంతలమేనికస్తురిన్
జులకన సోడుముట్టు సరసు ల్సరసుల్వలె నొప్పు నప్పురిన్.

24

గంధవహవర్ణనము

సీ.

ప్రణయవాదములు దంపతులందు నుదయించి, రంజిల్లు మానాంకురములు మేసి
సురతాంతవిశ్రాంతసుందరీజనముల, వక్షోజతటఘర్మవారిఁ గ్రోలి
వనములు మధుగర్భవతులు గాఁ బూమొగ్గ, మొదవులకొమారములు హరించి
విషయానుభవకథావిముఖవిరక్తుల, పటుతరధైర్యవప్రములు గూల్చి


గీ.

గంధలోభానుబంధిపుష్పంధయముల, ఝంకృతులచే ఘణి ల్లన ఱంకె లిడుచు
విషమశరుపేర జన్నియవిడిచిరనఁగఁ, గ్రొవ్వి చరియించు నవ్వీటఁ గోడెగాడ్పు.

25

సాకేతాధీశ యువనాశ్వవర్ణనము

మ.

ఇట్టివిలాసలక్ష్మి దనకీడును గీడును లేనియమ్మహా
పట్టణ మేలు నుద్ధతసపత్ననృపాలకఫాలపట్టికా
పట్టనవాతతస్ఫురితపాదసరోరుహుఁ డష్టదిక్తటీ
హట్టచరత్ప్రతాపహరిదశ్వుఁ డనా యువనాశ్వుఁ డున్నతిన్.

26


సీ.

తన భూభరణదక్షతకు మెచ్చి ఫణిరాజు, చులుకన యగువేయుఁదలలు నూఁపఁ
దనఖడ్గపుత్రి శాత్రవుల నచ్చరలను, జిన్నిబొమ్మలపెండ్లిఁ జేసి యాడఁ
దనమూర్తి సుందరతాగర్వవతు లైన, సతులమానసములఁ బ్రతిఫలింపఁ
దనకీర్తివల్లికాతతుల కాశాధివ, కుంభిదంతములు వేఁగొనలు గాఁగఁ


గీ.

బ్రస్తుతికి నెక్కి సతతధారాళనైజ, దానచిరవాసనావాసితప్రపంచ
రంజనైకమహారాజకుంజరంబు, విశ్వభూభర్త యై యువనాశ్వవిభుఁడు.

27

యువనాశ్వునకు మునిశాపము గల్గుట

శా.

ఆరాజోత్తముఁ డొక్కనాఁడు మృగయావ్యాసక్తిఁ గాంతారకాం
తారంబుల్ వెసఁ జొచ్చి వాహముఖఫేనంబుల్ వనీదేవితా
హారప్రౌఢి ఘటింపఁగా జనియె మధ్యాహ్నాతపక్లిష్టసే
నారాహిత్యముఁ బొంధి దప్పిఁబడి ఖిన్నస్వాంతుఁ డై యొక్కఁడున్.

28

గీ.

పోయి పెద్దదూరమున నొకమునియాశ్ర, మంబు చేరి చొచ్చి మౌని నచటఁ
దడవి కానలేక తత్పర్ణశాలికా, భ్యంతరంబు దఱిసి యరసె నందు.

29


క.

కందుకముఁ బోనితెల్లని, యండం బొక్కటి మృదుచ్ఛదాచ్ఛాదితమై
యుండఁగ నద్భుతరసమ, గ్నుం డగుచుం గదిసి పుచ్చుకొని ముద మొదవన్.

30


శా.

ఔరా! యిట్టివిచిత్ర మేఖగజమో యండం బి దిమ్మౌనియే
లారక్షించునొ మూల డాఁచి యని లీలాకందుకక్రీడమై
నారాజన్యుఁడు చేతఁ బట్టికొని రా నయ్యండ మయ్యాశ్రమ
ద్వారప్రాంతమునం బ్రమాదమున హస్తస్రస్త మై భూస్థలిన్.

31


గీ.

పడినయంతఁ బెక్కు పఱియ లై నెఱవుగాఁ, గలల మచట వఱదగట్టుటయును
దలఁకి మానిరాకఁ దలపోసి మునుమును, చనియె మునియు వచ్చి చాల నడలి.

32


మ.

తనప్రాణేశ్వరి తొల్లి యంచల వినోదవ్యాప్తి సాకాంక్ష జూ
చినయాకోర్కి నెఱింగి యయ్యతివతోఁ జిత్రప్రభావంబు పొం
దున హంసాకృతు లై రమించుటయు సద్యోగర్భజం బైన దాఁ
చినవాఁ డౌటఁ దదండభంగమునకుం జింతాతీసంతప్తుఁ డై.

33


గీ.

చింత దేఱి యిట్లు చేసిన యతులపా, పాత్మకుండు గర్భ మవసిచచ్చుఁ
గాక యని శపించె భూకాంతుఁ డిట ధాత్రి, నేలుచుండఁ గొంతకాలమునకు.

34

యువనాశ్వుఁడు పుత్త్రులులేమిఁ బరితపించుట

గీ.

భువనభరిత మగుచుఁ బొదలు విభాతవి, స్ఫురణ నడఁచుమంచువోలె మ్రింగె
విభునిమనసులోని విశ్వభూచక్రాధి, పత్యసమ్మదము నపత్యకాంక్ష.

35


సీ.

నందనుఁ జూడ నానందించుచూడ్కుల, కెవ్వియుఁ జూడంగ నేవ మయ్యెఁ
దనయానులాపంబు వినఁ గోరువీనుల, కెవ్వియు నాలింప నేవ మయ్యె
సుతుమౌళి మూర్కొనఁ జూచుఘ్రాణంబున, కెవ్వియుఁ బసిగొన నేవ మయ్యెఁ
గొడుకుతియ్యనిపేరు నుడువఁ గోరెడుజిహ్వ, కెవ్విముఁ జవిఁగొన నేవ మయ్యెఁ


గీ.

బట్టి కౌఁగిటఁ జేర్పంగఁ బరఁగుమేని, కితర మెవ్వియు సోకంగ నేవ మయ్యె
విశ్వభూమీశుఁ డగుయువనాశ్వపతికి, సుతుఁడు వెలి యైన బ్రదు కేమి సొంపు దలఁప.

36


క.

సంతతిలేమికి నాభూ, కాంతుం డెంతయును వంత గడలుకొనంగా
సంతతదురంతచింతా, క్రాంతస్వాంతం బొకింత గళవళపడఁగన్.

37


శా.

ఏలా యేలితి విశ్వభూవలయ మి ట్లేకాతపత్రంబుగా?
నేలా తోలితి గర్వితారినృపులన్ హేమాచలం బెక్కఁగా?
నేలా వ్రాలితి యాచకావనకథాహేవాకసంపత్తి? నిం
కేలా బిడ్డలు లేనియీబ్రదుకు? గొడ్డేఱయ్యెఁ జింతింపఁగన్.

38

సీ.

జలక మార్చినఁ జిన్ని శయ్యలో నొయ్యొయ్యఁ, గాలు చే యార్పంగఁ గనుట లేద
కెంగల లేబొజ్జగిలిగింత లిడి నవ్వు, నెలమోముఁ దమ్మి ముద్దిడుట లేద
తియ్యఁదేనియ లొల్కుతీపనవ్వులతోడి, తొక్కుపల్కులు విని చొక్క లేద
వడఁకుతోఁ జిఱుతప్పుటడుగుల నేతేరఁ, జేచాఁచి యక్కునఁ జేర్పలేద


గీ.

పుత్రకులు లేనిసిరి యేల భోగ మేల, బాలకులు లేనితా నేల బ్రదు క దేల
యాత్మజులు లేనిశయ మేల హర్ష మేల, యహముఁ బర మెద్ది సంతానహీనులకును.

39


ఉ.

ముంగిటనాడుపుత్రుఁ డతిమోదమునం దను దౌలఁ గాంచి వే
డ్కం గరయుగ్మమెత్తి చిఱుగంతులతో వెడయేడ్పుతోడ డా
యంగఁ జెలంగి యెత్తికొని యక్కునఁ జిక్కఁగఁ జేర్చి ముద్దు మో
ముం గమియార ముద్దిడుట ముజ్జగ మేలుట గాకయుండునే.

40


వ.

అదియునుంగాక.

41


ఉ.

నారకయాతనాంబుధికి నావ నిబద్ధకవాటగోపుర
ద్వారమునందుఁ గుంచిక భవక్షితిజంబునకున్ ఫలంబు వి
స్ఫారనిజార్థగుప్తిత్రీ కనపాయనిధిస్థలి వంశవర్ధనాం
కూరము పుత్రునిం బడయఁ గోరుట యొప్పదె యెట్టివారికిన్?

42

యువనాశ్వుఁ డింద్రయాగము సేయుట

సీ.

అని చాలఁ జింతించి యాకోర్కి యాత్మీయ, కులగురుం డగుమౌనికులగరిష్ఠు
నకు వసిష్ఠునకు విన్నపము సేయుటయు న, య్యుగ్రాంశుకులు నతఁ డూరడించి
తగిననానావిధద్రవ్యముల్ దెప్పించి, హోతల రప్పించి యుక్తవిధుల
శతమఖప్రీతిగా నతులితక్రియ నొక్క, యింద్రయాగంబు సేయించుటయును


గీ.

దూర్ణమున నధ్వరక్రియ పూర్ణ మైన, మహిత మగు వేదమంత్రాభిమంత్రితాక్ష
తములు చల్లినకలశోదకములు దెచ్చి, భూతలాధీశునకుఁ జూపి హోత లపుడు.

43


క.

ఆలింపుమీ జలంబులు, గ్రోలినప్రాణికి నృపాలకులమౌళిమణీ!
వేలావలయితధరణిం, బాలింపం గలుగుసార్వభౌముఁడు పుట్టున్.

44


గీ.

అని యెఱిఁగించి దాపించి రవి మహీశ, వరుఁడు నారాత్రి యెల్ల జాగరము చేసి
మౌనివాక్యం బమోఘంబు గానఁ దెలివి, దప్పి డప్పికి నానీరు ద్రాగుటయును.

45

మాంధాతృజననము

ఉ.

గర్భము నిల్చి కుక్షి యధికంబుగఁ గానఁగ వచ్చి గ్రక్కునన్
దుర్భరతీవ్రవేదనల దూలుచు సోలుచు నేల వ్రాలఁగా
నర్భకుఁ డొక్కఁ డయ్యినకులాగ్రణిగర్భ మగల్చికొంచు నా
విర్భవ మొందె భూజనులు విస్మయమగ్నులు గాఁగ నయ్యెడన్.

46

శా.

 విస్రస్తాకులవేణిబంధములతో విభ్రష్టసంవాస లై
ఘస్రాంతంబున వాడుతమ్ములగతిం గై వ్రాలి వక్త్రప్రభా
విస్రంభంబు లడంగ నవ్విభుసతు ల్వే వచ్చి నేత్రాంబుజా
తాప్రాధౌతపయోధరద్వయతటీవ్యాలిప్తకాశ్మీర లై.

47


క.

రోదనముతో వసిష్ఠుని, పాదంబులమీఁద వాలి పతిభిక్షము దం
డ్రీ! దయసేయుము నావుడు, నాదర మొప్పఁగ మునికులాగ్రణి యాత్మన్.

48


ఉ.

ఇంచుక చింతఁ జేసి నృపుఁ డీదశ నేమిట నొందె నేమి సే
యించిన నేమి పుట్టె? నగునే? యిఁక నిన్నియు నేల? యేను జే
యించినయిష్టియం దహహ! యీయవకార్యము పుట్టు టెట్లురా?
యంచు నహంకరించి తనయాత్మ గుణించి తలంచె నింద్రునిన్.

49


శా.

ఆకర్షించిన దేవభర్తయు జగం బాశ్చర్యహర్షంబు లు
ద్రేకింపం దనుఁ జూడ నాత్మగుణగాత్రప్రౌఢగంధర్వయో
షాకంఠధ్వనితాళవృంతరనాచాతుర్యహేవాకప
న్నాకశ్రీమణికంకణోల్లసదమందక్రేంకృతుల్ ప్రోవఁగన్.

50


గీ.

వచ్చినపుడ భక్తి నచ్చటివా రెల్ల, నవనియందుఁ జాఁగి యవనతులుగ
నర్హమణిమయాసనాసీనుఁ డై మౌని, తన్నుఁ దలఁచినట్టితలఁపుఁ దెలిసి.

51


ఉ.

నన్ను గుఱించి మీరు సవనం బొనరించితి రిందుఁ గల్మషం
బెన్న నొకండునుం గలుగ దివ్విభుఁ డివ్విధి నీల్గునట్లుగా
మున్నొకమౌని దిట్టుటయు మోసము నేఁ డిటఁ గల్గె పైన నే
ని న్నృపుప్రాణము ల్మరల నిచ్చితి నిమ్మునినాథునానతిన్.

52


మ.

అని లోకంబుల కెల్ల నద్భుతముగా నాభూవిభుం బ్రాణయు
క్తుని గా దీవన లిచ్చి తా నిజకరాంగష్ఠంబు తద్బాలవ
క్త్రనిపిష్టంబుగఁ జేయ వాఁడును సుధాప్రస్యందముం గ్రోలె నా
తని మాంధాతృసమాఖ్యుఁ జేసి హరి యంతర్ధానముం బొందినన్.

53


గీ.

జాతివేదుండు వీజనశక్తిఁ బోలె, నుష్మకరుఁడు తపర్తుసంయుక్తిఁ బోలె
నక్కుమారుండు జాతకర్మానుషక్తి, సమధికాశ్చర్యధుర్యతేజమునఁ బొలిచె.

54


సీ.

కనుఱెప్ప లిడ నెఱుంగనిచూడ్కిఁ జూచుచు, జిగివీఁపు దోఁప బోరగిలఁ బడుచుఁ
గరజానువులఁ జతుశ్చరణుఁ డై తిరుగుచు, శిశునిదర్శితదృఢస్నేహుఁ డగుచు
భాసురమితపదన్యాసంబు చూపుచు, హ్రదవిహారమున దుర్వారుఁ డగుచు
జనకజానందబీజత్వంబు గైకొంచు, గుణములముసలి నాఁ బ్రణుతిఁ గనుచు


గీ.

వసననిరపేక్ష నిచ్ఛాప్రవర్తి యగుచు, హయసమారోహణంబు సేయంగఁ గలిగి
రాసుతుఁడు దనశైశవక్రమదశావ, తారములచేతఁ బూరుషోత్తమతఁ దెలిపె.

55

మాంధాతృఁడు సకలవిద్యలు నేర్చుట

క.

కాలోపనీతుఁ డై భూ, పాలతనూభవుఁడు గురునిపాలం బ్రచుర
వ్యాలోలకాకపక్ష, శ్రీలక్షితుఁ డగుచు నభ్యసించెన్ విద్యల్.

56


క.

మందానిలుచే నలరుల, కందులఁ గని తావు లెల్లఁ గైకొనునళిమా
డ్కిం దగుగురువశమున నృప, నందనుమతి శాస్త్రవాసనలఁ దూఁకొనియెన్.

57


సీ.

తూఱిబాల్యంబు వోఁ ద్రోచి ప్రాయంబు వె, ట్టినకవాటంబుఁ బాటించె నురము
జయరమాలంబనశాఖ లై బాహువు, లాజానుదైర్ఘ్యంబు నధిగమించె
వదనచంద్రునిఁ జొచ్చి బ్రదికెడు చీఁకట్ల, గతి నవశ్మశ్రురేఖలు జనించె
నర్థిదైన్యములపై నడరుకెంపునుబోలె, నీక్షణాంచలముల నెఱ్ఱ దోఁచె


గీ.

సుందరత్వమునకుఁ జో టిచ్చి తాసంకు, చించె ననఁగఁ గడుఁ గృశించె నడుము
జనవరాత్మజునకు సకలలోకోత్సవా, పాది యైనయౌవనోదయమున.

58

యువనాశ్వుఁడు మాంధాతకుఁ బట్టముఁ గట్టుట

క.

యువనాశ్వుఁ డంతనాత్మజు, యువభావంబునకు హర్ష మొదవఁగ నొకనాఁ
డు వసిష్ఠానుమతిన్ వై, భవమున నభిషిక్తుఁ జేసి పట్టముఁ గట్టెన్.

59


క.

శుభవేళ యుక్తవిధిమై, విభుఁ డగురాకొమరుతోడ విశ్వంభర దా
నభిషిక్త యగుచు సాత్విక, విభవమునఁ జెమర్చియున్నవిధమునఁ బోలెన్.

60


సీ.

శంఖకాహళవేణుఝల్లరీపణవాది, వారిత్రనాదంబు లాదరించి '
నృపగణోపాయనాన్వితసింధుఘోటక, ఘీంకారహేషలఁ గేలినేలి
చామరగ్రాహిణీశయకుశేశయమణి, కంకణక్రేంకృతి గారవించి
జయజీవముఖబహుస్వస్తిప్రశస్తివి, ప్రాశీర్నినాదంబు ననుమతించి


గీ.

విభుతమైఁ బేర్చి యువనాశ్వవిభునికూర్మి, పట్టి పట్టాభిషేకవైభవమునందుఁ
బ్రణమదుత్పతదపనిభృన్మణికిరీట, కోటికోటీవిభూషణాకులరవంబు.

61


ఉ.

పాయు తొలంగు మోసరిలు పా పద మంచు మహారవంబుగా
నాయతవేత్రహస్తు లఖిలావనిపాలకులన్ ఒరాబరుల్
సేయఁగఁ బొల్చె ఫాలగతచిత్రవినిర్మలభర్మపట్టికా
శ్రీయుతుఁ డై కుమారకుఁడు సింహగణాంకితభద్రపీఠికన్.

62


గీ.

మణిమయం బైనయారాజమౌళిమౌళి, చిత్రరుచి నొప్పె ధవళాతపత్ర మపుడు
హాటకాచలశృంగశృంగాటకాగ్ర, విభ్రమచ్ఛుభ్రశరదభ్రవిభ్రమమున.

63


మ.

అమరీవిభ్రమరీతిలోలనయనాహస్తాబ్జదోధూయమా
నమణీదండకచామరాగ్రపవమానస్యందనాందోళన

క్రమశోభన్ నృపకుంతలప్రకర ముత్కర్షార్హ మయ్యెం దదీ
యమృదుస్పర్శసుఖోన్నతిన్ బరవశం బై తూఁగుచందంబునన్.

64

ఆశ్వాసాంతము

శా.

సర్గస్థేమలయాదికారణ మహాసంకల్పపంకేజభూ
భర్గాశాపతీశాసనేశనకళాపారీణ సర్వానుభృ
ద్వర్గవ్యాకృతనామరూపబహిరంతర్వ్యాపకాదుర్గతీ
స్వర్గస్వానుభవాపవర్గఫలదస్వాతంత్ర్యసర్వంకషా.

65


క.

వినిహతనతాఖిలార్తీ, యనఘనియంతృత్వచిదచిదంతర్వర్తీ
యనవధికమధురకీర్తీ, మునిజనచేతశ్శరవ్యమోహనమూర్తీ.

66


పంచచామరము.

మరుత్ప్రరోహతూలతల్పమధ్యసంస్థలీశయా
ధరారమాకరోపలాలితప్రసారితాంఘ్రికా
మరుద్వృధాకవానుబంధమంధరోత్సవానక
స్ఫురద్విరావవర్తితాపభూవనీశిఖావళా.

67


గద్య.

ఇది శ్రీమద్భట్టపరాశరదేశికేంద్రచరణసరసీరుహసేవకోపసేవక నరసింహనామధేయ
ప్రణీతం బైనకవికర్ణరసాయనం బనుకావ్యంబునందుఁ బ్రథమాశ్వాసము.