Jump to content

కవికర్ణరసాయనము/పీఠిక

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

కవికర్ణరసాయనము

పీఠిక

శ్రీరంగనాథస్తుతి



రామావసుధాపయోధరములం జేదోయిరెంట న్సమ
ప్రారంభంబునఁ జిత్రభంగి మకరీపత్రాంకము ల్వ్రాసి ని
ర్వైరప్రేమల నిద్దఱందు సమసారస్యంబునం దేలునా
శ్రీరంగేశుఁడు మమ్ము నిర్మలసుఖశ్రీయుక్తులం జేయుతన్.

1

బ్రహ్మస్తుతి

చ.

పొలయలుకన్ జపంబునకుఁ బూనుకనుంగవ లెల్ల మోడ్చియుం
దలఁపున మంత్రవర్ణమయతం గనుపట్టినవాణిఁ జూచి న
వ్వొలయఁ గవుంగిలించి సుసుఖోన్నతిఁ జెందెడువిశ్వతోముఖుం
డెలమి దలిర్ప మత్కృతికి నీవుత విశ్వజనాభిముఖ్యమున్.

2

శివస్తుతి

మ.

ముకుటాగ్రస్థితచంద్రచంద్రిక సదా ముంపం ప్రభావం బెఱుం
గక శశ్వత్పరిరంభణావితతసౌఖ్యస్నిగ్ధుఁ డై జాయఁ బా
యక లీలాపరుఁ డైనశంకరుఁడు నిత్యప్రీతి సంధించుతన్
సకలాహ్లాదము గా మదీయకృతికి నశబ్ధార్థదాంపత్యమున్.

3

విఘ్నేశ్వరస్తుతి

మ.

నను మన్నింపుము నీకు మామ యగుమైనాకంబు నాకాధినా
థునిమోలం బడు నంచుఁ బార్వతి వియద్ధూత్కారము న్మాన్చినం
దనతుండంబునఁ బీల్చియున్న జలధిం దాఁ గ్రమ్మఱం గ్రుమ్మరిం
చినశుండాలముఖుండు మామకకృతిశ్రీ కిచ్చు నిర్విఘ్నతన్.

4

సరస్వతీస్తుతి

శా.

కాసారంబులు సాహిణంబులు సరిత్కాంతుండు పూఁదోఁట వి
ద్యాసీమంబులు రచ్చపట్లు సురకాంతాలోకసీమంతభూ
షాసిందూరము పాదలాక్ష యగుభాషాదేవి మత్ప్రౌఢజి
హ్వాసింహాసన మూనుఁ గాతఁ గృతియుక్తాలంక్రియాహంక్రియన్.

5


వ.

అని యభీష్టఫలప్రదపరమపురుషప్రార్థనంబును గావ్యసాధారణలక్షణోపస్థాపనాభిప్రాయంబున నితరోచితదేవతానిరూపణంబునుం గావించి.

6

కృతికర్తృజ్ఞాపనము

క.

గురువరభట్టపరాశర, చరణసరోరుహసముల్లసన్మానసుఁడన్
నరసింహనామధేయుఁడఁ, బరిచితసత్కృతిరసానుభవహేతువునన్.

7

సత్కవి ప్రశంస

చ.

మనమునఁ గొన్ననెవ్వగలు మాన్పి ఘటింతురు కావ్యసమ్మదం
బనఘకథాముఖంబున హితాహితబోధ మొనర్తు రింపుగాఁ
గనుఁగొనుకంటె నద్భుతముగా నెఱిఁగింతు రతీంద్రియార్థముల్
ఘనమతు లెల్లవారికి నకారణబంధులు గారె సత్కవుల్.

8


వ.

అందున.

9

మిశ్రకావ్యప్రశంస

గీ.

కావ్య ముత్పాద్య మైన సత్కావ్య మింక, నుక్తకావ్యంబ యే పునరుక్తిఁ దెచ్చుఁ
గానఁ గవితాభిముఖుఁ డైనకవివరునకు, మిశ్రకావ్యంబె కావ్యమై మెఱుఁగు దెచ్చు.

10

కాకవినిరాకృతి

క.

నేరిచిన సుకవి కృతిచేఁ, బే రెఱిఁగించుకొని జగతిఁ బెంపగు టొప్పున్
నేరకకృతిఁ జెప్పుట దన, నేరమి యపకీర్తి జగతి నిలుపుట గాదే.

11


క.

ఏరసముఁ జెప్పఁ బూనిన, నారస మాలించువారి కడరింపనియా
నీరసపుఁగావ్యశవముల, దూరమున న పరిహరింపుదురు నీతిజ్ఞుల్.

12


చ.

ఫణితులు రెంట మూఁట నొకపద్యము గూరుచువారు లక్ష్యల
క్షణసహకావ్యనిర్వహత గల్గుట చిత్రము గాని యట్లపో
ఫణిమణిమాత్రధారు లగుపాము లసంఖ్యము గాక తత్ఫణా
మణివిధవిశ్వభూభృతిసమర్థుఁడు శేషుఁడు గాక కల్గునే.

13


క.

ఆకులనె యుండుకవితా, పాకములనె మొదలు చెడినప్రాఁదప్పులయా
లోకము జిహ్వాంచలముల, యాకులు గాకుండు నెవ్వి యవివో కవితల్.

14

క.

పరభుక్తము లైనయలం, కరణముల జుగుప్స లేక కైకొని పదవి
స్ఫురణంబు చూపుకుకవిత, పరికింపఁగ లజ్ఞలేనిబానిస గాదే!

15


ఉ.

సాంతము గాఁగ శబ్దహృదయజ్ఞులు గా రుచితప్రయోక్త లై
వింతలుగాఁ బ్రబంధములవీథులు ద్రొక్కఁగ లేరు శక్తు లై
దొంతరజల్లిబొంతవెడదూర్చి గతార్థము కూర్చుదుష్కవి
భ్రాంతులసందడిం దడవఁ బాసె రసజ్ఞులకుం గవిత్వముల్.

16


క.

కలకంఠకలన చూపక, కలకంఠం బూరకున్నఁ గాకమ కాదే?
కలితనిజవాగ్విలాసం, బలరింపనితద్జ్ఞుఁ డైన నజ్ఞుం డగుటన్.

17

కవిప్రతిజ్ఞ

చ.

హృదయగతిం బురాతనకవీశ్వరు లేగనివీథి లేదు నేఁ
దదనుమతిన్ రచించుకృతి తాత్త్వికులం గరఁగింపకుండునే
మదగజరాజము ల్చనినమార్గములం గడునింపు నింపవే?
మదగజరాజయానమదమంధరబంధురయానమానముల్.

18

పురోభాగిదూషణము

చ.

ఖలుఁ డిలఁ దప్పులే వెదకుఁ గావ్యరసానుభవంబు సేయ లేఁ
డొలుకులు కోరుఁ గాక ముద మూనఁగ గర్దభ మొంద నేర్చునే?
మలయమరుద్విధూతమధుమాసవికస్వరకేసరావళీ
గళితపరాగయోగపరికల్పితపేశలతల్పసౌఖ్యముల్.

19


క.

ఎల్లరు మెచ్చనిచమత్కృతి, నుల్లంబున మెచ్చుఁగాక యొకఁ డుష్ట్రకులం
బొల్లనిపల్లవితామ్రము, గొల్లలుగాఁ బొగడ నొక్కకోయిల లేదే?

20

రసజ్ఞభూషణము

ఆ.

తప్పు గల్గె నేనితార తీర్చి రసజ్ఞు, లస్మదీయకవిత ననుమతింతు
రించుటలుక గలిగెనేఁ దీర్చి ప్రేయసి, నుల్లమున వరింప కోర్తు రెట్లు?

21

కృతిప్రశంస

గీ.

యతి విటుఁడు గాకపోవు టె ట్లస్మదీయ, కావ్యశృంగారవర్ణనాకర్ణనమున
విటుఁడు యతిగాక పోరాదు వెస మదీయ, కావ్యవైరాగ్యవర్ణనాకర్ణనమున.

22


వ.

అని వితర్కపూర్వకంబుగా నపూర్వవిరచనాచాతుర్యంబు నెఱయ మెఱయ నన్వర్థ
నామంబుగాఁ గవికర్ణరసాయనం బక నొక్కకావ్యంబు రచియింప నున్ముఖుండ నై
యనుకూలనాయకాన్వేషణపరాయణాయత్తం బైనచిత్తంబున.

23

నరకృతిపతిత్వగర్హణము

సీ.

ఆందోళికలయందు నంతరచరు లైన, సవికృతాకృతుల పిశాచజనులు
పరకరాళంబు లై ప్రార్థింపఁ గనుఁగోక, వాయెత్తకుండుజీవచ్ఛవములు
వాలవీజనములఁ గ్రాలుచు నీఁగకు, నంటీవిఖరవర్తులాండసములు
వేత్రపరంపరావిలకంటకాకృతిఁ, జేరఁబోరానిబర్బూరతరులు


గీ.

శంఖనాగస్వరస్వరశ్రవణసమద, విస్ఫుటచ్ఛత్రవిస్ఫారితస్ఫటాక
విష్టవిషవైద్యవశవర్తిదుష్టఫణులు, ప్రభుదురాత్ముల నెవ్వాఁడు ప్రస్తుతించు.

24


వ.

అదియునుం గాక.

25


గీ.

నరగుణాంకితమయ్యెనే సరసకృతియు, దూష్య మగు శునిధృతగతదుగ్ధమట్లు
హరిగుణాంకిత మయ్యె నే నసదుకృతియు, హారసూత్రంబుగతి హృదయంగమంబు.

26

కృతినాథరంగనాథప్రశంస

సీ.

జగదేకపతి యయ్య సకలాభిగమ్యుండు, సర్వశాసకుఁ డయ్యు సదయహృదయుఁ
డభిమతప్రదుఁ డయ్యు నంజలిసాధ్యుండు, పరిపూర్ణుఁ డయ్యును బ్రణతికాముఁ
డతిగతేంద్రియుఁ డయ్యు ననిమిషదృగ్దృశ్యుఁ, డనియోజ్యుఁ డయ్యు భక్తానుయాయి
సాక్షి యయ్యు సుతాపచారానభిజ్ఞుండు, సముఁ డయ్యు నార్తరక్షాపరుండు


గీ.

భద్రగుణనిధి దుర్గుణప్రతిభటుండు, సముఁడు నధికుండు లేనియుత్తమపురుషుఁడు
వెదకి చూచిన శ్రీరంగవిభునివంటి, ప్రభువు నత్యంతసులభుండు ప్రభువు గలఁడె.

27


శా.

జ్ఞానప్రౌఢమహాకవీశ్వరవచస్సంస్తూయమానుండు ల
క్ష్మీనాథుండు మదల్పవాక్యరచనాస్వీకర్త గాకుండునే?
నానాభూపతు లెల్లఁ గానుకలు రత్నశ్రేణు లర్పింపఁగా
దానాముష్టిముచుం గుచేలుఁ గరుణన్ ధన్యాత్ముఁ గాఁ జూడఁడే.

28


వ.

అని సకలలోకనాయకుం డైన శ్రీరంగనాయకుం డాకృతినాయకుండుగా నిశ్చయించి
మొదలం గృతిముఖాలంకారంబుగాఁ గృతినాయకుదివ్యావతారక్రమం బభివర్ణించెద.

29

శ్రీరంగనాథదివ్యావతారవైభవము

సీ.

మున్ను కల్పాది నంభోజనాభునినాభి, నలినగర్భంబున నలువ పుట్టి
యఖిలైకమూలంబు లైనవేదంబుల, నతనికృపాలబ్ధి నధిగమించి
శబ్దానుసారి యై జగ మెల్ల సృజియించి, పరికించి యింద్రాదిపదములెల్ల
నాత్మాధికారంబు నస్థిరం బని కాంచి, నిర్విణ్ణుఁ డై మోక్షనిత్యసుఖము


గీ.

పరమపురుషప్రసాదసంప్రాప్య మనియుఁ, దత్ప్రసాదంబు తత్పదద్వంద్వభజన
సాధ్య మగుటయు వేదాంతసరణి నెఱిఁగి, తపము గావించె దుగ్ధాబ్ధితటమునందు.

30

ఉ.

మెచ్చి రమావిభుండును సమీపమునం దొకకచ్ఛపాకృతిన్
వచ్చి వరంబు వేఁడు మన వారిజగర్భుఁడు మ్రొక్కి కోర్కినా
కిచ్చెద వేనిఁ జూపు పరమేశ్వర! నీదగుదివ్యవిగ్రహం
బచ్చుగ మత్స్యకచ్ఛపముఖాకృతు లన్నియు భూతపూర్వముల్.

31


గీ.

ఎద్ది నైసర్గికము నీకు నెద్ది పరమ, మెద్ది గోప్యంబు శాశ్వతం బెద్ది యెద్ది
దివ్య మఖిలేశ! యుపనిష ద్వేద్య పెద్ది, యట్టిరూపంబు చూపి కృతార్థుఁ జేయు.

32


చ.

అన నిని కంజగర్భ! భవదర్థితరూపము ముక్తలోకజీ
వన ముదిచూడఁ జెల్లదు భూదృశబద్ధులకుం గృపానిబం
ధనమతిఁ జూపువాఁడ నవతారముఖంబున నట్టిదీనిఁ గ
న్గొన నధికారి వీ వగుటకుం గొను మిచ్చెద మూలమంత్రమున్.

33


వ.

అని యనుగ్రహాతిశయంబున నపవర్గఘంటాపథం బగుశ్రీమదష్టాక్షరీమంత్రంబును
దదనుష్ఠానంబునుం దదర్థస్వరూపంబును దదనుభావంబును దద్విషయనిజనిరతిశయప్రి
యభావంబునుం దేటపడ నానతియిచ్చి కపటకచ్ఛపంబంతర్ధానంబు నొందినం బరమే
ష్ఠియు నుక్తమంత్రానుష్ఠాననిష్ఠాపటిష్ఠుం డై చిరకాలంబు తపంబు సేయం దత్తపః
ఫలరూపం బై సకలజగదద్భుతావహంబు గా దుగ్ధమహార్ణవమధ్యంబున.

34


సీ.

భుజగాధిపతిధృతస్ఫురదాతపత్రంబు, చంద్రార్కకరచలచ్చామరంబు
సూత్రవతీభర్తృవేత్రపాణియుతంబు, విహగరాజస్కంధవిలసితంబు
నందసునందాదినానాభుజిష్యంబు, గంధర్వకిన్నరీగాయకంబు
సనకసనందాదిజయశబ్దముఖరంబు, సిద్ధసాధ్యగణాధిసేవితంబు


గీ.

విశ్వతఃకల్పతరుపుష్పవృష్టికంబు, దేవదుందుభిరవదళద్దిక్తటంబు
భూరితేజోమయంబు నై పొడమి పాలిచె, రంగధామంబు జగదేకమంగళంబు.

35


క.

అపుడు భయాద్భుతహర్ష, స్థపుటితమతి కిచ్చపడివచతురాననుపై c
గృపడగ్గఱ వచ్చి రమా, ధిపభటుఁడు సునందుఁ డతనిఁ దెలుపుచుఁ బలికెన్.

36


గీ.

నలినసంభవ! శ్రీరంగనామకలిత, మీవిమానంబు ప్రణవంబు సూవె యిందుఁ
బ్రణవవాచ్యార్థ మిందిరారమణుఁ డున్న, వాఁడు నినుఁ బ్రీతుఁ జేయంగవచ్చె నిట్లు.

37


క.

నిలుదెసలఁ జాఁగి మ్రొక్కుచు, నలుమాఱు ప్రదక్షిణము లొనర్చి చిరతపః
ఫల మగు శ్రీరంగేశ్వరు, జలజజ! సేవింపు మోక్షసాత్కృతి గలుగున్.

38


వ.

అని యాదేశింపం బ్రమోదంబు నలుమడింపఁ జతుర్ముఖుండును జతుర్ముఖప్రణామ
సలక్షణంబు లగుచతుఃప్రదక్షిణంబులు నాచరించి శ్రీరంగదివ్యవిమానగర్భంబున.

39


సీ.

దక్షిణహస్తోపధానవిధానుఁ డై, వలప్రక్కగా నొత్తగిలినవాని
నాజానుదీర్ఘత్వ మఖిలవేద్యంబు గా, నెడమబాహువు సాఁగ నిడినవాని

నాకుంచితోత్కుంచితాగ్రజానుకము లై, యుండ నంఘ్రులు సాఁచి యున్నవాని
నాకస్మికస్మితవ్యాకోచలోచన, యుగకోణములఁ గృప యొలుకువాని


గీ.

జలధినిశ్శేషభూషణశ్రమహిమాచ, లాగ్రవిశ్రాంతనవమేఘ మనఁగ శేష
శయనశయుఁ డైనకోమలశ్యామలాంగు, రంగపతిఁ గాంచె భారతీరమణుఁ డపుడు.

40


క.

ఘనతరహర్షాంబుధిలో, మునిఁగిమునిఁగి తేలుచందమున భక్తిఁ బునః
పునరానతుఁ డైచతురా, ననముల నుతియింప రంగనాయకుఁ డనియెన్.

41


గీ.

పద్మసద్మ! భవత్తపఃఫలము నగుచు, నవతరించితి నిట్లు నీ స్తవమువలనఁ
దుష్టహృదయుండ నైతి నభీష్ట మెద్ది, వేఁడుకొనుమన్న భారతీవిభుఁడు పొంగి.

42


క.

అవలోకనార్హ మగునీ, యవతారంబునను నాకు ననుదినమును బ్ర
త్యవసరపూజావిషయత, నివసింపు గృహార్చ వగుచు నిత్యము ననుడున్.

43


సీ.

ఎలన వ్వెలర్ప నీతలఁ పెఱింగియ దివ్య, భవనంబుతోడ ని ట్లవతరించి
నాఁడ నిం కిటమీఁద నవతరింపఁగఁ బూను, నర్చాకృతుల కెల్ల నాద్య మిదియ
యర్థింపుమీ స్వయంవ్యక్తవిగ్రహు నన్ను, గృహదైవతంబకా నహరహంబు
పాంచరాత్రవిధానపరుఁడ వై ద్విపరార్థ, కాలాంతమున ముక్తిఁ గాంతు వనిన


గీ.

ధాత చరితార్థుఁ డై రంగధాము నాత్మ, భువనమున యందు విరజాఖ్యఁ బొలుచు నేటి
తీరభూమిఁ బ్రతిష్ఠించి దినదినంబు, యుక్తవిధిఁ బూజ సేయుచు నుండునంత.

44


క.

ధరపై నిక్ష్వాకునరే, శ్వరుఁ డనఁగా వైష్ణవాగ్రసరుఁ డఖిలశ్రీ
విరతమతి మోక్షసాధన, పరుఁ డై చింతించు నాత్మభావములోనన్.

45


గీ.

తండ్రి వైవస్వతుండు మాతాత రవియు, ఘనులు గావున బ్రహ్మలోకమున కేగి
యచట రంగేశుఁ గొలిచి మోక్షార్హు లైరి, మందసుకృతికి నా కంత మహిమ గలదె.

46


క.

నాదుతపంబునఁ గలిగెం, గాదే? యని రంగపతి నొకండయ విధికిం
గా దనుభవింప ‘నేక, స్స్వాదు న భుంజీత' యనెడు సామెత వినఁడే!

47


మ.

అపవర్గప్రద మైనరంగము మహాయాసంబుచేఁ గాంచియుం
గృప లే కేరికిఁ గానియాత్మపురి నిక్షేపించుకొన్నాఁ డహో!
కపటాత్ముండు విధాత నే నఖిలలోకప్రాప్తుఁ డై మర్త్యవి
ష్టపసంస్థుండుగ రంగవల్లభుఁ దపస్సంప్రీతునిం జేసెదన్.

48


క.

అని నిష్టురనిష్ఠఁ దపం, బొనరింప నజుం డెఱింగి యులుకున దీనా
ననుఁ డై తనసన్నిధి నది, వినుపించినఁ జూచి రంగవిభుఁ డి ట్లనియెన్.

49


సీ.

కల దిల కేగుసంకల్పంబు మా కిందుఁ, బరితపింపక విను పద్మగర్భ!
సాకేతనగరి నైక్ష్వాకులచే మహా, యుగచతుష్కము పూజ నొంది పిదపఁ

గావేరిఁ జంద్రపుష్కరిణీతటంబున, సప్తమన్వంతరస్థాయి నగుదుఁ
దావకవాసరాంతమునఁ గ్రమ్మఱ వచ్చి, పొందుదు నీచేతఁ బూజ లిచట


గీ.

నహరహంబును నిట్లు గతాగతములఁ, జేసి రెండుపరార్థముల్ చెల్లినపుడు
నీకు నపవర్గ మేఁ గరుణించి పోదు, ధామమును నేను నాపరవ్యోమమునకు.

50


ఉ.

నీకుఁ ద్రికాలపూజనము నిచ్చలు దప్పక చొప్పడు న్మహీ
లోకజనంబున న్మదవలోకనగోచర మై కృతార్థతన్
గైకొనుఁ గాన మాతలఁపు గా దన కిప్పుడు యిమ్ము నన్ను ని
క్ష్వాకున కన్న నొం డనఁగ వారిజగర్భుఁడు నోడి ప్రీతుఁ డై.

51


వ.

హంసవాహనారూఢుం డై యింద్రాదిబృందారకవర్ణంబునుం దానును దుందుభీరవము
లు గ్రందుకొన గరుడస్యందనబంధురం బైన శ్రీరంగదివ్యవిమానంబు భూలోకంబున
కుం గొనివచ్చి యిక్ష్వాకుమహీనాథున కర్పించినం గృతార్థుం డై యమ్మహాభుజుండును
నిజతపఃఫలంబును జగజ్జనభాగధేయంబు నగునమ్మహాదివ్యభవనంబు మకుటాలంకారంబు
గా మస్తకాగ్రంబున వహించి మహోత్సవత్సేకం బై పౌరలోకం బెదురుకొన
నయోధ్యాపట్టణోత్తరదిశ నర్ధక్రోశంబునఁ దమసాసరయూమధ్యమనోహరప్రదే
శంబున నయోధ్యాముఖంబుగా నుక్తవిధిం బ్రతిష్ఠించి కాంచనమణిమయగోపురప్రసా
దమండపాదినిర్మాణంబుల గ్రామగజతురంగదాసదాసీరథఛత్రచామరాద్యుచితోపకరణస
మర్పణంబుల నిత్యనైమిత్తికాదిమహోత్సవాచరణంబుల యావజ్జీవంబు నసాధారణం
బుగా భగవదారాధనం బొనరించెఁ దదనంతరంబునఁ దద్వంశసంభవు లనుకకుత్థ్స
రఘుదిలీపప్రముఖమహీపాలకోత్తములు నుత్తమోత్తమభావంబుల రంగధామసమర్చ
నంబు గావింపం గ్రమంబున మహాయుగచతుష్టయంబు చనం బంచమత్రేతాయుగ
కాలంబున.

52


సీ.

దశరథధారుణీధవుఁడు పుత్రార్థి యై, యశ్వమేధము సేయునవసరమున
నిలఁగలనృపలోక మెల్ల నేతెంచుట, నందులోఁ జోళదేశాధిభర్త
ధర్మవరాఖ్యుఁ డాదశరథైశ్వర్యంబు, రంగధామార్చనక్రమముఁ జూచి
యిక్ష్వాకుకులమున కిహపరైశ్వర్యంబు, లెపుడు రంగేశునికృపనె కాదె?


గీ.

ధాతసంగతి నిక్ష్వాకురీతిఁ గాంతుఁ, దపముచే నేను శ్రీరంగధామ మనుచుఁ
దలఁచి యజ్ఞాంతమున ధరాధవులయట్ల, పూజితుండయి యాత్మీయపురికి నరిగి.

53


గీ.

చంద్రపుష్కరిణీతీరసంస్థుఁ డగుచుఁ, దపమునకుఁ బూన నచ్చటితపసు లతని
తపము వారించి శ్రీరంగధామ మిటకుఁ, దాన చనుదెంచు వినుము తత్కారణమును.

54


క.

ఇటకును దద్దిశ నేత, త్తటినీతటియందుఁ గలదు దాల్భ్యాశ్రమ మ
చ్చట ము న్నిష్టకథాలం, పటమతి దాల్భ్యుండు మేము భాషింపంగన్.

55

గీ.

ప్రాంతనీపవనీస్థితవ్యాఘ్రదనుజుఁ, గూల్చి భగవంతుఁ డమరులు గొలువ నచటి
కరుగుదేరఁ బ్రణామార్చనాభినుతులఁ, బ్రీతుఁ గావించి వరము గోరితిమి నేము.

56


గీ.

అహరహంబు నిచట నర్చనాదులచేత, నీను భజింపవలయు నిత్యసన్ని
ధాన మిచట మాకు దయ సేయు మనిన ద, యార్ద్రుఁ డగుచు నిట్టు లానతిచ్చె.

57


మ.

హరిదశ్వాన్వయమందు దాశరథినై యస్మత్పదాంభోజత
త్పరుఁ డై యుండువిభీషణాఖ్యునకు మద్ధామంబు శ్రీరంగమే
కరుణాధీనత నీ నతండు గొని రాఁ గావేరిలోఁ జంద్రపు
ష్కరిణీతీరమునందుఁ గైకొనియెదం గల్పావధిస్థైర్యమున్.

58


గీ.

రంగదివ్యవిమానగర్భమున శేష, శయనశయు నన్ భజింపుఁడు సంతతంబు
నని యెఱింగించి చన నేము నసురమథనుఁ, గొలిచి యేగితి మర్కమండలముదనుక.

59


క.

చని క్రమ్మఱియెడుమముఁ గనుఁ, గోని మీకులకంద మైనకోకనదాప్తుం
డనియె మునులార! యిందఱు, వినుఁ డే నెఱిఁగింతుఁ బూర్వవృత్తాంతంబున్.

60


సీ.

బ్రహ్మలోకమున శ్రీరంగేశు నే నుపాసించి వేఁడితిని నాచేతియట్ల
మద్వంశభవు లైనమనుజనాయకులచే, నర్చితుండుగ విభుఁ డట్ల యియ్యఁ
గొని వచ్చి యిక్ష్వాకుకులులచే నిన్నా ళ్ల, యోధ్యయందు సపర్య నొందె నింక
నస్మత్కులీనుల యని ధర్మవర్మాదు, లగుచోళనృపులచే నర్చితుఁడుగఁ


గీ.

బోవుఁ గావేరిలోఁ జంద్రపుష్కరిణికిఁ, గానఁ జనునది మోక్షార్థు లైనజనము
లచట శ్రీరంగపతిఁ గొల్వ ననిన వచ్చి, నాఁటనుండియు నేము నున్నార మిచట.

61


చ.

దశరథరాముఁ డై పొడమె దైత్యవిభేదియు రంగధామమున్
దశవదనానుజుం డటకుఁ దథ్యమ కా కొని వచ్చి వచ్చినన్
భృశముగ నీకు మేము వినుపించినదాఁకఁ దపంబుచే వృథా
కృశుఁడవు గాక నెమ్మది సుఖింపు మహీపరిపాలకుండ వై.

62


వ.

అని యాదేశించినం బ్రహృష్టహృదయుండై ధర్మవర్మయుం గ్రమ్మఱి తదుపాంతకా
వేరీదక్షిణతీరస్థితం బైననిచుళానామనిజపురంబునకుం జని రంగధామసమాగమప్రతీ
క్షాపరుం డై రాజ్యంబు సేయుచుండఁ గొండొకకాలంబున.

63


ఉ.

రావణుఁ గూల్చి వచ్చి రఘురాముఁడు దా హయమేధదీక్షితుం
డై వసుధేశులం బిలువ నంపినఁ దాను నయోధ్య కేగి చో
ళావనిభర్త రాజసభయందు విభీషణుఁ గాంచి సమ్మదం
బావహిల న్మఖాంతమున నర్చితుఁ డై చనుదెంచెఁ గ్రమ్మఱన్.

64


క.

వచ్చి విభీషణుఁ డిదిగో, తెచ్చున్ శ్రీరంగధామదివ్యవిమానం
బిచ్చటి కనునిశ్చయమున, హెచ్చినహర్షమునఁ గృతసమీహితబుద్ధిన్.

65

వ.

రాక్షసేశ్వరుం డైనవిభీషణు నాతిథ్యంబున నఖిలలోకేశ్వరుం డైన శ్రీరంగపతిసమర్చ
నంబునకుం దగినట్లుగా నుచితవివిధప్రశస్తవస్తూపకరణసామగ్రీసంపత్సంపాతనంబు
చేసికొని విభీషణాగమనంబునకు నెదురెదురుచూచుచుండు నంత.

66


సీ.

అట నయోధ్యాపురియందు శ్రీరఘురాముఁ, డాత్మోపకర్తయు నతిహితుండు
నగు విభీషణు లంక కనుపునప్పు డనుగ్ర, హాతిరేకమున నిజాన్వయైక
జీవధనం బైన శ్రీరంగధామంబు, సపరిచ్ఛదంబును సపరిజనము
గా నొసంగుటయు నాదానవాధిపుఁడు కృ, తార్థుఁ డై ధరణి సాష్టాంగ మెఱఁగి


తే.

మస్తకంబున ధరియించి మంత్రివరులుఁ దా నభోవీథి లంకకు దక్షిణాభి
ముఖముగాఁ గడు ముదమున మోచి తెచ్చు, వేళనడుమన మధ్యాహ్నకాల మైన.

67


గీ.

తత్సమయపూజనము సేయఁ దలఁపు వొడమి, మహికి డిగ్గి మరుద్వృతామధ్యమహిత
చంద్రపుష్కరిణీసరస్తటమునందు, దనుజపతి నిల్పె శ్రీరంగధామ మపుడు.

68


మ.

కని యచ్చో మును లద్భుతప్రమదమగ్నస్వాంతు లై చోళభూ
జనభర్త న్వినుపింప వచ్చి సలిపెన్ సంప్రీతి నాతిథ్యమున్
దనుజేంద్రుండును రంగధామునకు నుక్తప్రక్రియం జేసె న
మ్మనుజాధీశ కృతోపచారములచే మధ్యాహ్నకాలార్చనల్.

69


గీ.

తాను మునులును శ్రీరంగధాముఁ గాంచి, చిరమనోరథసిద్ధికిఁ జిత్త మలరఁ
జోళభూభర్త యొకకొంతకాల మిచట, దనుజపర! నిల్పు మని వేఁడుకొన నతండు.

70


ఉ.

నైకటికంబు ఫాల్గునమున న్నరనాయక! రంగభర్త కి
క్ష్వాకుకృతోత్సవం బగుటఁ జయ్యన లంకకుఁ బోవు టొప్పు నా
నీ కిది లంక గాదె శుభనిష్ఠఁ దదుత్సవలక్ష్మి నిచ్చటం
జేకొని రంగభర్తఁ గృప సేయు కృతార్థత మాకు నీదయన్.

71


క.

అని వేఁడి యమ్మహాత్ముని, యనుమతిఁ గొని హృష్టహృదయుఁ డై చిరకాలో
పనతనిజయత్నఫలముగ, నొనరించెం దన్మహోత్సవోపక్రియలన్.

72


సీ.

నవ్యనైకసమగ్రదివ్యభోగములచే, రాగమగ్నుం డయ్యె రంగభర్త
సవినయపరవస్తుసత్కారములచేతఁ, బ్రీతాత్ముఁ డయ్యె విభీషణుండు
అర్ఘ్యపాద్యప్రభృత్యర్హార్పణములచేఁ, బ్రముదితం బయ్యెఁ దపస్వికులము
మృష్టాన్నసత్రాద్యభీష్టదానములచే, సంతుష్టిఁ బొందిరి సకలజనులు


తే.

నవబృధము సేయ జగము కృతార్థమయ్యెఁ, బూతమతి ఫాల్గునంబునం బుబ్బతొడఁగి
ధర్మవరాఖ్యుఁ డగుచోళధరణీధవుఁడు, తగ నొనర్చు నవాహ్నికోత్సవము నపుడు.

73


క.

ఈగతిఁ బ్రతిదిననవనవ, భోగమునఁ బదేనునాళ్లు వోవఁ బ్రయాణో
ద్యోగమున నృపుని నిలిపి మ, నోగతిఁ బోలుచు విభీషణుఁడు గృతనతియై.

74

తే.

ఎత్తఁజూచిన శ్రీరంగ మెగసిరాక, యచలమునుబోలె నిశ్చలం బైన నతఁడు
బాష్పనిష్పీడితాక్షుఁ డై పరితపింప, సదయహృదయుండు శ్రీరంగశాయి వలికె.

75


క.

లేలెమ్ము వత్స! యీగతి, నేల పరితపింప మాకు నిచ్చట విడువం
జాలమికిఁ గలదు కారణ, జాలము వినుపింతు వినుము సర్వము దెలియన్.

76


మ.

పరితఃప్రాంతపరీతసహ్యతనయాబాలానిలాసేవ్యముల్
పరిమాణప్రథమానపూగకుహళీప్రాదుర్భవామోదముల్
సరసాభ్రంకషనారికేళనిబిడచ్ఛాయంబు లీచంద్రపు
ష్కరిణీపుణ్యసమీపదేశములు శక్యంబే విసర్జింపఁగన్.

77


సీ.

సరిలేదు చంద్రపుష్కరిణీసమీపంబు, నకు నెందు నని మెచ్చినాఁడఁ గాన
నన్వయభవులచే నర్చితుండుగ సూర్యునకు శపథం బిచ్చినాఁడఁ గాన
మునులు వీరికి నిత్యముగ సేవఁ గృపసేయుఁ, వాడ నై వర మిచ్చినాఁడఁ గాన
ననపాయు లగుమహీజనులకు మోక్ష మీ, నామదిఁ గరుణించినాఁడఁ గాన


ఆ.

నిచటు విడిచి నాకు నెచటికి నేగరా, దిదియె కాదు వేఱ హేతు వొకటి
గలుగు నీకవేరకన్యాప్రవాహమ, ధ్యంబు విడువరామి కదియు వినుము.

78


వ.

మున్ను విశ్వానసునామధేయుం డైనగంధర్వవరుం డనంతపద్మనాభదేవుం బ్రబోధితుం
జేయుటకు దక్షిణసముద్రతీరంబునకుం జనుచు నడుమ వింధ్యపాదప్రశస్త లగుసమస్త
నదులం గనుంగొని యందఱికి నేకనమస్కారంబు గావించుచుం గడచి చన నమ్మహా
త్ముం డొనరించిన నమస్కారంబు తనక తనక యని యహంకరించుట నమ్మహానదుల
కందఱకుం దమలో వివాదంబు వుట్టి జరుగుచుండం గొండొకకాలంబున.

79


గీ.

తిరిగి యతఁడు నాటితెరువు గానఁగ వచ్చి, తొంటియట్ల మ్రొక్కె నొంటిమ్రొక్కు
మొక్క నీవు మ్రొక్కు మ్రొ క్కిందు నెవ్వరి, కనుచు నెల్లనదులు నడుగుటయును.

80


క.

వినుఁ డెల్లందులు మీలో, ఘన మగునదె నాదుమ్రొక్కు గైకొనునది పొం
డని చనుటయుఁ దమలో గుణ, ఘనతకు నై తొంటికంటెఁ గలహం బయ్యెన్.

81


గీ.

పోరిపోరి పరిశ్రాంతిఁ బొంది గర్వ, మెడలి క్రమమున శాంతు లై రెల్లనదులు
నత్యహంకృతి జహ్నుకన్యాకుఁ గవేర, కన్యకును బోక చిరకాలకలహ మయ్యె.

82


క.

ఇరువురును జతుర్ముఖుసభ, కరుగ నతఁడు గంగ యధిక మనుటయు దుఃఖా
తురయై కవేరికన్యక, సరసిజభవుఁ గూర్చి తపము సలుపఁగ నజుఁడున్.

83


క.

గంగానది భగవత్పద, సంగతి గల దగుట నొసఁగఁ జన దధికతఁ ద
ద్గంగాసామ్య మొసంగితి, గంగాసమ మనఁగ వేరకన్యయు నలుకన్.

84


చ.

నలువఁ దొఱంగి ఘోరముగ నన్నుగుఱించి తపం బొనర్పఁగా
వల దని గంగకంటె గుణసత్త్వసుసిద్ధికిఁ దావకోదర

స్థలమున రంగధామసహితంబు వసించెద నంటిఁ గావునన్
నిలిచెద నీకవేరసుతనిర్ఘరమధ్యమునన్ విభీషణా!

85


క.

కావున గతశోకుఁడ వై, నీ విప్పుడు లంక కరిగి నెమ్మది రాజ్య
శ్రీవిభవ మనుభవింపుము, నావుడుఁ గడుదైన్యమునఁ బునఃప్రణతుం డై.

86


గీ.

పుండరీకాక్ష! యిచట నీ వుండు దేని, లంక యేటికి! సామ్రాజ్యలక్ష్మి యేల?
నాకు సర్వంబు నీపాదనలినయుగమె, యుండఁ గలవాఁడ నేను నీయొద్దఁ గొలిచి.

87


శా.

కల్పాంతావధికంబు నాకు మును లంకారాజ్య మాయుష్యముం
గల్పించె న్రఘుభర్త మోక్షపద మాకాంక్షింప శేషాహిరా
ట్తల్పు న్నిన్నిటు లిచ్చినాఁడు కృపతోడ న్వేదశాఖాశిఖా
కల్పత్వత్పదపల్లవంబులకు నేఁ గాఁజాల దూరస్థుఁడన్.

88


సీ.

అనవుడు వత్స! యి ట్లగు నైన నాయాజ్ఞ, సేయంగవలయుటఁ జింత యుడిగి
లంకాధిరాజ్యపాలకుఁడ వై యుండుము, నలువ దినావసానముల నెల్ల
జనుదెమ్ము ననుఁ గూడి సత్యలోకమునకు, రెండు పరార్థముల్ నిండినపుడు
కొనిపోదు నాతోన నిను నిత్యపదమున, కట్ణౌట లంక కీ వరుగు మిచట


తే.

నుండునట్లుగ నినుఁ జూచుచుండువాఁడ, నెపుడు లంకాభిముఖుఁడ నై యీవు నరులు
గూడి యిచ్చోట నుండుట గూడ దనిన, దనుజకులనాయకుండు నొం డనఁగ నోడి.

89


వ.

ప్రదక్షిణపూర్వకంబుగా సాష్టాంగదండప్రణామం బాచరించి శ్రీరంగవల్లభుపదార
విందంబులు నిజశిరోభాగంబున దృఢంబుగాఁ జేర్చుకొని బాష్పధారాళలోచనంబుల
నంతంత మరలిమరలి సేవించుచు నెట్టకేనియు విభీషణుండు మంత్రిసమేతుం డై
లంకకుం జనియె ననంతరంబ ధర్మవర్మాదిచోళరాజపరంపరాపూజితుం డై యనాలోచిత
విశేషాశేషజగజ్జనంబులకు మోక్షసత్రప్రదానం బొనరించుచు నుభయకావేరీమధ్యం
బునఁ జంద్రపుష్కరిణీతీరంబున శ్రీరంగనామధేయదివ్యగృహస్థుం డై యుండుటం జేసి.

90


సీ.

అపవర్గకాంక్షచే నాఁకొన్నవానికిఁ, దంగేటిజున్ను శ్రీరంగశాయి
నిర్వాణదారిద్ర్యనిర్విణ్ణుఁ డగువాని, ముంగిటిశేవధి రంగశాయి
సంసారమలవిమోచనము నాకాంక్షించు, పంగువుపై గంగ రంగశాయి
పరమార్థలాభతత్పరుఁ డైనవానికి, ముంగొంగుపసిఁడి శ్రీరంగశాయి


తే.

బెదర కాఁకటియమృతంబుఁ బిదికికొనఁగ, శృంగములు లేనిమొదవు శ్రీరంగశాయి
కోరువారలకోర్కు లీఁగోరివచ్చు, జంగమామరతరువు శ్రీరంగశాయి.

91

షష్ఠ్యంతములు

క.

ఈదృశగుణనిధికి మహా, హ్లాదసుఖాకారసంవిదమృతాంబుధికిన్
వేదాంతనేతినేతిస, మాదీష్టనిషేధవిషయితాత్మావధికిన్.

92

క.

ఖ్యాతతరచంద్రపుష్కరి, ణీతటగృహమేధికాత్మనిరతేక్ష్వాకు
వ్రాతకులదైవతమునకు, ధాతృశతాహరహరార్చితపదాబ్జునకున్.

93


క.

పంగూపరిపరినిపత, ద్గంగాసమమాదృశాక్షిగతగోచరభా
వాంగీకర్తకుఁ జోళ, ప్రాంగణపరిదృశ్యమానబహుసేవధికిన్.

94


క.

ద్వివిధోభయదిక్స్రవహ, త్కవేరకన్యాతటోపగతపూగవనీ
నవకుహళీపరిమళవహ, పవనోపాస్యునకు వికచపద్మాస్యునకున్.

95


క.

శారదచంద్రాతపవి, స్తారాస్తరణాభిరామతల్పితయమునా
చారుతరపులినసాక్షికి, జారగ్రామణికి ధూర్తజనతామణికిన్.

96


క.

అసమసమసమరసమయ, ప్రసభమదప్రసృతివిసృమరదురసురసమి
త్యనువిసరగ్రసనరసో, ల్లసదసిరససాలభుజచలద్భుజగునకున్.

97


క.

భాషాధిపశేషాదిమ, నీషాపదగోచరగుణనిస్సామ్యునకున్
దోషాచరయోషాజన, భూషామోషాచరణనిపుణశౌర్యునకున్.

98


క.

హేయప్రతిభటున కసం, ఖ్యేయప్రథమానగుణమహిష్ఠునకు ముని
ధ్యేయస్వరూపి కనుసం, ధేయప్రియదివ్యనామధేయాఢ్యునకున్.

99


క.

కారుణ్యఖనికి నజహ, త్తారుణ్యనవాభిరూపతాప్రకటితళ్ళం
గారరసాధీశ్వరునకు, శ్రీరంగేశ్వరున కర్థిచింతామణికిన్.

100