కళాపూర్ణోదయము (1943)/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

ద్వితీయాశ్వాసము



      శ్రీఖండాద్రి హిమాచల
      మేఖలికావిలసదపరిమితహయరింఖా
      లేఖితజయలాంఛన నృప
      శేఖర నంద్యాల నారసింహునికృష్ణా.

వ. అవధరింపు మన్విధంబునం గలభాషిణితోడ సంభాషించి యరుగుచు నారదుండు తనమనంబున.

చ. హృదయముఁవ్రే గొకింత శమియించెను జెల్వపుఁగొవ్వు పెంపునం,
      బొదలెడురంభకున్ సవతిపోరు ఘటించుట కంకురార్పణం,
      బిది యిటు గొంత చేసితి నపేక్షిత మంతయు నైన యట్ల యీ,
      సుదతియ చాలు దీనికి నసూయయు నున్నది మాట లారయన్.

క. ఎంచఁగ నాగమనమునకు
     నించుక చుట్టయిన నయ్యె నిది యోగ్యమ సా
     ధించుట కెవ్వారిని బో
     రించనిక్షణ మొక్కటియుఁ దరింపఁగ వశమే.

వ. అని తలపోయుచు శిష్యుండునుందానును బురప్రవేశమార్గంబున నడుచుచుండె నప్పుడు. 5

సీ. దవుదవ్వులనె నేఁడు ధరణికి దిగి వచ్చు.
                    చున్న వాఁడిది యేమియొక్కో యనియుఁ
    గయ్యంబు లిడ నెందు గతి గల్గునో యని
                    వెదకుచు నేతెంచువిధమొ యనియుఁ
    బవనేరితము లైనపాదపాంసువుల నిం
                    దఱఁ గృతార్థులఁ జేయుకొఱకొ యనియు
    నీమార్గమహిపుణ్య మెట్టిదియో ఫలం
                    బునకు రాకది రిత్త చనునె యనియుఁ

గీ. దను నెఱుఁగువార లతిదూరమునన లేచి
   రెండు చేతులు మొగిచి వర్తిల్లుచుండ
   నికటమునఁ గన్నవారలు నేలఁ జాఁగి
   యాదరమునఁ బ్రణామంబు లాచరింప. 6

చ. అలఘువినీతిసంభ్రమసమాకులత న్వెసఁ బల్లకీలు సం
    దలములు వారువంబులును దంతులునాదిగఁ గల్గువాహనం
    బులుడిగివచ్చి మ్రొక్కుదొరమూఁకల పెల్లునఁద్రోవచాలసం
    కులముగ నందు గొంద ఱొకకొంత బరాబరిచేసికొల్చిరాన్ 7

మత్త. కొందఱం గడకంటిదృష్టులఁ గొందఱ న్నెఱచూడ్కులం
    గొందఱం జిఱునవ్వుడాలునఁ గొందఱం దగుదీవెనం

     గొందఱం జెయిసాఁచి లెమ్మని కొందఱుం గయిదండ గొం
     చుం దపోధనుఁ డాదరించెను సొంపుగాఁ బ్రణతాత్ములన్.

వ. ఇవ్విధంబున సకలజన సేవ లాదరింపుచు శిష్యుండునుం దాను నమ్మునివరుండు
    పరస్పరవిఘట్టనవాచాల వీచీహస్త సమార్జితచర్చరిమచర్చికాచర్చాంకురంబులవలనను సంకులకల
    హంసచక్రవాకపుష్కరాహ్వయ ప్రముఖజలపక్షిసందోహ కోలాహలంబువలనను నవిరళ పరిఢౌకమాన
    డిండీరఖండమండలీ పాండిమచ్ఛలవిలసితప్రహసితంబులవలనను నికటంబునం
    బొదలుజలధివిలసనంబులం జెలరేఁగి గేలిచేయుసోయగంబునం బరఁగుపరిఖావలయంబులును
    బరిఖావలయసలిల నిధిసముత్తాలకల్లోలశీకరావకీర్యమాణంబు లగుచుం దమయం
    దుభయతస్సమాకృష్యమాణభోగీంద్రభోగవేష్టనప్రకారానుకారపారీణంబు లై రాణింపుచుం దిరుగు
    మెఱుఁగుఁదీఁగెలు ప్రకాశింప వైశాఖపర్వతనితంబడంబరవిడంబనచతురంబులై చూడ
    నొప్పువైడూర్యప్రాకారంబులును బ్రాకార వలయవిపులకపిశీర్షసముదయసముత్కీర్యమాణ మాణిక్య
    నివహవివిధ కాంతిసంతానసౌమనసమాలికాస్తోమాభిరామపర్యంతభాగం బగుచుం బౌరవిభవలక్ష్మికిం
    బట్టిన యాతపత్త్రంబురీతి నుద్యోతించుగగనమండలంబునకుం బాండురత్వ సంపాదనంబున సొం
    పొనర్చు సమున్నతశిఖర సంసక్త నిర్ణిక్తమౌక్తికభక్తివిశేషంబుతోడం బసిండికామచెలువు నలవరిం

    
     చువాసుదేవప్రాసాదరాజంబును వాసుదేవప్రాసాదరాజ కైతవద్యోతమానశాతకుంభ
     కుంభినీధరంబునకుఁ బ్రత్యంతపర్వతభంగి నంగీకరించి యలంకారంబు
     గావించువసుదేవసంకర్షణ సాత్యకిప్రద్యుమ్నాదియాదవసంఘ సౌధయూధంబులును
     సౌధయూధభూధరవ్రాతజాతమహాతరంగిణీబృందసందేహంబు
     ప్రభవింపంజేయునుభయపార్శ్వభాగహీరమయగృహభిత్తి
     సంతతతంతన్యమానమరీచినిచయ పరిపూర్ణరాజమార్గంబులును
     రాజమార్గసజ్జితశైవాలినీ శైవలభావభాసురంబులైపొలుపారుగారుత్మతబహిర్వత
     ర్దికానికాయంబును బహిర్వతర్దికానికాయవిరచిత కురంగనాభిగోముఖోపరితరంగిత
     రంగవల్లీమతల్లికామనోజ్ఞమౌక్తిక మండలీ పాండిత్యంబులత్యంతకాంతంబు లగుచు
     నుత్తుగహర్మ్యశిఖర కేతుసంఘ సంఘర్షణశకలితపతితాంతరిక్షఖండలక్ష్యమాణ
     నక్షత్రసముత్ప్రేక్షాసంధుక్షణవిచక్షణంబులై వీక్షణపర్వంబునిర్వహింపం బెంపుమీఱుచుం
     దదవలంబనలంబమానవివిధాంబుదకదంబకంబుడంబుఁ జూపుకలువడంబులును
     గలువడంబులం దవిలినమిళిందంబులచందంబు నందపఱచు చంద్రశాలా
     ఖేలనాలోల నాళీకలోచనాలోచనంబుల మరీచి వీచికల పెల్లుచిల్లునం జిమ్మనగ్రోవులఁ
     జిమ్ముగంధసారకస్తూరికానీరధారాప్రసారంబుల తెఱం గెఱింగింప బంగారురంగుపసలఁ బసుపు
     వసంతంబు లాడుభావంబున ఠీవినెఱపుభర్మహర్మ్య శ్రీలఖేలాసంభ్రమోచ్ఛ్వసితవిశరారు
     కేశబంధంబులో యనంగబం

   
    ధురంబు లగు మంథరగంధవహవిహరణవిసృమర కాలాగరుధూపధూమంబులును
    ధూపధూమశ్యామికామిషంబున నిజస్వామి కొలువునకు నిబ్బరంపుఁబేరుబ్బునం
    బ్రబ్బికొనుచుఁ జేరిన శృంగారరస సముద్రంబునకు నిర్ణిద్ర విద్రుమకుడుంగ
    సంఘసాంగత్యసౌభాగ్యంబు ననుగ్రహింపుచుఁ బ్రత్యగ్రజా గ్రదగ్రస్థలస్థాపిత కురువిందకలశ
    కండళ ఛ్చవిచ్ఛటాజటాలితంబులగుగోపురంబులును గోపురద్వారతోరణవ్యాజవిభ్రాజమాన
    మంగళసూత్రసువ్యక్తనిర్వర్తితపరిగ్రహగృహ వైభవ శ్రీసముపభోగనిస్తంద్రు లగుసకలజనులును
    నత్యంత చిత్రతరమహత్త్వంబునంబ్రవర్తిల్ల నుత్తమోత్తమ కీర్తులంబొగడొందు
    తద్ద్వారకానగరంబుఁ దఱియం జొచ్చి యంత 6

సీ. మహనీయకురువిందమాణిక్యకాంతుల
                 చేతఁ బల్లవితమై చెలువుమీఱ
    మరకతమణిసముత్కరమరీచిచ్ఛటా
                 పత్రసంతతి చేత బాగుమీఱ
    నకలంకనవ్యమౌక్తికచాకచక్యప్ర
                 సూనసంపదచేత సొంపుమీఱ
    నింద్రనీలజ్యోతిరిందిందిర శ్రేణి
                 విలసనంబులచేతఁ బొలుపుమీఱఁ

గీ. దనసమున్నతిచే నభస్తరువుఁ బ్రోచి
    విమలశిఖరాగ్రకనక కుంభముల చేత

    సఫలితంబుగఁ జేయుచుఁ జాల వెలయు
    నంబుజాక్షునికొలువుకూటంబుఁ గాంచె. 10

క. కాంచి మణికంధరునితో
   గాంచనగర్బజుఁడు వలికెఁ గల కాలము వీ
   క్షించిన నిది నిచ్చలు నొక
   యంచితరుచి నెఱపుచున్నయది కనుఁగొంటే.11

శా. ఆవైకుంఠముఁ జూచినట్లు కడు నింపై యాసభామండప
   శ్రీవిస్ఫూర్తికతంబున న్మిగుల నా చిత్తంబు నానందము
   ద్రావైచిత్రిఁ గరంచుచున్న యది యేతద్ద్వారకాపట్టణం
   బీవిశ్వంబునఁ గల్లుమే లిదియపో యెందు న్వివేకించినన్.12

వ. అని పల్కుచుఁ జేరంబోవునంత.13
-
క. ఆఋషియాగమనం బపు
   డారసి చని చెప్పి రంబుజాక్షునకు బహి
   శ్చారిణు లగుపరిచారిక
   లారీతిని జెప్ప నతనియానతికల్మిన్ .14

సీ. బంగారు గొలుసులుఁ బవడంపుఁదఱిమెన
                    కోళ్ళును వింత బాగులబొగడలు
   రత్నంపుఁ జిలుకలు రాయంచపతిమలుఁ
                    బసిఁడిపువ్వుల వ్రాఁతపనులసొబగు

   
    వివిధంబు లగుచిత్రవిరచనలును దసి
                      లీనూలిపట్టెయల్లికబెడంగుఁ
    బలుదెఱంగులపట్టుతలగడబిల్లలు
                      మవ్వంపుఁగుంకుమపువ్వుపఱపుఁ

గీ. గలిగి మెఱుఁగులు దిక్కులఁ గడలుకొనఁగ
    మించుదంతపుటుయ్యెలమంచమునను
    బొలుపుమీఱుచుఁ దనయంతిపురముసతుల
    యూడిగంబులు గైకొంచు నున్న శౌరి.

ఉ. అప్పలుకు ల్చెవింబడినయంతన దిగ్గున లేచి యె ట్టెటూ
    యప్పరమేష్ఠినందనుఁడె యౌనె హజారపుఁద్రోవ వచ్చెనే
    యెప్పుడు సంతరిక్షగతి నిచ్చటికే చనుదెంచు నివ్విధం
    బిప్పుడుచాలఁజిత్రమిదియేమొకొయంచుససంభ్రమంబునన్

సీ. తూగుటుయ్యేలఁ దూఁగుచోఁ గొంత చెదరిన
                     యరవిరివన్నెబా గట్ల యుండ
    నడపంబుతొయ్యలి మడిఁచి యిచ్చినతెల
                     నాకుఁజీలిక చేతియంద యుండ
    నట్టిటు దొడిగినయంఘ్రుల రత్నంపు
                     సమ్మాళిగలు సారె జాఱుచుండ
    రాణివాసపుఁజామరగ్రాహిణులు గూడ
                     నరుగుదెంచి తమంత మరలుచుండ

గీ. దనకుఁ గైదండ యొసఁగినతరుణికేలు
    వదల నెఱుఁగమి నది తోన వచ్చుచుండఁ
    గనిసవా రెల్ల నొదుఁగుచుఁ గలఁగుచుండ
    మురరిపుఁడు వాకిటిహజారమునకు వచ్చె. 17

తే. ఇట్లెదుర్కొని ప్రణమిల్లి యింపు బెంపుఁ
    దనరఁ గైదండ యొసఁగి తోడ్కొనుచు నేఁగి
    యతనియాజ్ఞ వెంబడిని శుద్దాంతనికట
    భాసి యగునొక్కమణి సభాభవనమునను. 18
 
మ. జగదీశుండు తపోధనాగ్రణికిఁ బూజావర్తన ల్నాఁడ క్రొ
    త్తగ నేతెంచినవానికిం బలె మహాతాత్పర్యసంయుక్తుఁడై
    తగఁజేసెంగడుఁ గ్రొత్తక్రొత్తగుచు నత్యంతాదరంబెక్కు ధ
    ర్మగరిష్ఠాత్ములబుద్ధి పూజ్యు లగువార ల్పల్మరు న్వచ్చినన్ 19

ఉ. అప్పుడు తత్సభాగృహసమాగమనార్హులు కొల్వు సేతఁ కై
    యెప్పటియట్ల యందుబహిస్థ్సితులై యెఱిఁగించిపంపఁదా
    నప్పరమర్షి వీడ్కొలుపునంతకు రమ్మనఁ గొంకి యచ్యుతుం
    డప్పలుకు ల్గణింపక తదంచితగోష్ఠిన యుండె నింపుతోన్. 20

వ. అప్పు డది యెఱింగి.21

ఉ. మౌనివరేణ్యుఁ డిట్లనియె మాకొక పెద్దతనం బొనర్చి రా
    జ్యానుగుణప్రవర్తనల కక్కట యిమ్మెయిఁ గొంకితేని న



    న్నోనలినాక్ష పొమ్మనుట యుక్తము నీకిపుడట్లుగాక మీ
    వానిఁగఁజూచితేని గొలువం బిలిపింపుమువారి నావుడున్ 22

మ. చెలులం జుట్టల దండనాధుల విపశ్చిద్వర్యులన్ సత్కవీం
    ద్రులమంత్రీశులవారముఖ్యలముకుందుండెంతయుంబ్రీతితోఁ
    బిలిపించెం బొడగాంచి రవ్విభవశోభి న్వారలు న్వేత్రహ
    స్తులు దమ్మందఱనప్డుపేరెలుఁగుతోఁదోడ్తోనెఱింగింపఁగన్ 23

తే. కమలనాభుండు నపుడు శీఘ్రంబ తనదు
   కొలువు వీడ్కోంచు మౌనిఁ దోడ్కొనుచు నేఁగె
   నంతిపురమున కాతండు నాత్మశిష్యు
   వెలుపలన నిల్పితాఁ దన వీణెఁ గొనియె. 24

ఆ. అప్పు డతని చేతియావీణిఁ దాఁ బుచ్చు
    కొనియె సంభ్రమమునఁ గూడ నేఁగి
    కరము వినయ మొప్పఁ గల భాషిణి ముకుందుఁ
    డపుడు దానిఁజూచి యల్ల నగుచు. 25

క. ఏమీ శిష్యత్వంబున
   నీమునివరుసేవ సేయ నిచ్చ వొడమెనో
   యోమగువ యనిన విని యది
   యేమియు లేదని వినీతి నిటు నటు నొదిఁగెన్. 26

ఉ. ఒదుఁగుటయున్ యదుప్రవరుఁ డోహరిణాక్షి తలఁకనేల నీ
    కిది కడులెస్సబుద్ది కృప నిట్టిమహామహులాత్మ సేవకున్ 27

<



    హృదయమునందు నియ్యకొను పెవ్వరికున్నదివేయు నేటికిం
    బదికితి సేవసేయుము శుభప్రదు నిమ్ముని నిట్లయెప్పుడున్ 27

ఉ. నీమతి పెంపుఁబాడుకొనునేరుపులున్ మృదుమంజులస్వర
    శ్రీమధురత్వముం గనుచుఁ జిత్తములోపల నేను నెంతు ని
    క్కోమలి గొంత నారదునకు, బరిచర్య యొనర్చు నేని వి
    ద్యామహిమంగడున్వెలయునంచు నినుంగనుఁగొన్నవేళలన్ 28

మ. అనుచుం జాంబవతీగృహంబునకుఁ దా నమ్మౌనిలోకాధినా
    ధునివెంటం జని శిష్యురాలి నొకతెం దోడ్తెచ్చితిం దీనిఁగై
    కొని శిక్షింపు మటంచు నల్ల నగుచుం గోవిందుఁడాయింతిఁబి
    ల్చి నయంబొప్పఁగఁబల్కెనమ్మగువయుంజిత్తంబురంజిల్లఁగన్ 29

క. నాకు మును మీరు చెప్పెడి
   యాకలభాషిణియె యిది యటంచును వినయో
   త్సేకమునఁ బలికి మునికి వి
   వేకిత నుచితోపచారవిధు లొనరించెన్. 30

సీ. అంతట గోవిందుఁ డాయింతిఁ జూచి యో
                    వనజాక్షి యిచటి కిమ్మునివరేణ్యుఁ
    డేతేర దొరఁకొని యెన్నియో నా ళ్ళయ్యె
                    నేమేమి దిద్దితి వెఱుఁగఁ జెపుమ
    గానచాతురిఁ దాను గడుఁ బ్రోడ యయ్యుఁ దుం
                    బురుమీఁదిమత్సరంబునను జేసి

   
     మనవిద్య సాధింతు నని పూనీ నాఁ డీది
                  యెందు నెవ్వరును ము న్నెఱుఁగకునికి

గీ. గావున విశేషములు నీకుఁ గలవి వరుసఁ
     దెలిపి నీ నేర్చినట్లెల్ల దిద్దు మనుచు
     నొప్పగించితి నిమ్మహాయోగివర్యు
     ననుడు జాంబవతీసతి వినయ మొప్ప. 31

క. ఎప్పుడును మీవచస్స్థితిఁ
     దప్పక యే నడపుచున్న దాన నిపుడు నా
     తప్పొప్పులు మీ రరయుట
     యొప్పు న్విన నవధరింపుఁ డొకకొం తనుచున్ . 32

క. కుందనపుఁగమ్మిఁ దిగిచిన
     యందంబున జవరఁదనము నలరుందేనె
     ల్చిందినగతి మాధుర్యముఁ
     బొందుపడ న్వీణె ముట్టి పొలఁతుక పాడెన్. 33

సీ. ప్రౌఢితో సరిగమపధనిస్వరంబుల
                     ప్రతినియతశ్రుతిక్రమము లెఱిఁగి
     రాగ భేదముల వర్షములు దొలంగించి
                     లయతాలశుద్ధి నెంతయుఁ దలిర్ప
     గ్రామవిశేషమూర్ఛన లేరుపడ మంద్ర
                     మధ్యమతార సామగ్రి దనర

   
     ధాతుమాతుపులు గీత ప్రబంధములందు
                     నసమానలీలమై నతిశయిల్లఁ

గీ. దోర మగుప్రేమరసమునఁ దోఁచి తోఁచి
    వీనులకు నింపుఁ జలువయు విస్తరిలఁగ
    నాకరణిఁ దనకాంత యనేకగతుల

    నాత్మగుణగానములు సేయ వచ్యుతుండు.

34



ఆ. ముదిత మేలుమేలు కొదవలే దెందు నీ
    యనఘచరితు దిద్దు మనుచుఁ జనియె
    జాంబవతియు నొక్కసంవత్సరము దాఁక

    బాట నేర్పె మునికిఁ బాటవమున.

35



ఉ. అంతఁ గ్రమంబునం బ్రియుని యాజ్ఞను సత్యయు భోజకన్యయున్,
    సంతస మొప్ప నప్పరమసంయమి నొక్కొక యేఁడు దిద్ది ర,
    త్యంతమనోజ్ఞగానపటిమాతిశయోన్నతుఁ గాఁగ నవ్విభుం,

    డంతటఁ దాను దిద్దె నొకయబ్దము పూర్ణముగాఁగ నాతనిన్.

36



వ. అప్పుడు మణికంధరుండు కలభాషిణికిఁబోలె నంతఃపుర కాంతలవలనిశిక్ష
    యేమియు లేకుండియుఁ బుండరీకాక్షునియనుగ్రహవిశేషంబున
    సకలరహస్యసంగీతవిద్యాసంపన్నతచేత నారదకలభాషిణులయట్ల

    యత్యధికుండయ్యె.

37

క. అమ్ముగురకు గానము హరి
   యిమ్మెయి నఖిలంబు నేరి యిఁక మిసంగీ
   తమ్మునకు నీడు లేదు జ

   గమ్ముల నని పలికి మోదగరిమం దేల్చెన్.

38



ఆ. అంతిపురములోని కరిగినప్పుడు తదీ
    యాంగనలును దత్ప్రసంగ మైన
    మౌనితోడ నీదు గానవిద్యకు సరి

    లే దటంచుఁ బలికి రాదరమున.

39



వ. అంత.

40



క. మణికంధరుఁడును గలభా
   షిణియుఁ గొలిచి రాఁగ నాఋషిప్రవరశిఖా
   మణి యొక్కనాఁడు యదుభూ

   షణు వీడ్కొని వేడ్క నవని సంచారమునన్.

41



ఆ. చనుచునుండి తనదుసంగీతచాతురి
    గరిమపసకు మున్ను సరసిజాక్షు
    చెలువ లాత్మ మెచ్చి సలిపినయట్టిప్ర

    శంసచందములప్రసంగ మైన.

42



వ. వారితో నిట్లనియె నివ్విధంబున నవ్వరవర్ణినులు మువ్వురుం
    బెక్కుమాఱులు మదీయసంగీతచాతుర్యంబురీతులతినూత
    నంబు లనియు నీ తెఱంగు లెవ్వరికిని దొరక వనియు బలు
  

    కుట గల దది నిజహృదయంబునఁ గలవిధంబో నాదుమదికిఁముదంబొనరించుకొఱకునో యెఱుంగ
    రాదు చదురు లెదిరి మదికి నెట్టిపగిదినైన సమ్మదం బొదవించుట పరమధర్మం బని తలంతురు
    గావున నట్టికథలు గట్టిగ నమ్మరాదు తమచెలుల తోడ నేతత్ప్రసంగమున నేమి పలికి రది నిజంబు
    తదవబో ధంబు గలుగునందాఁక డెందంబు సందియంబు నొందుట తప్ప దనుటయు
    నప్పరమతపోధనునకుం గలభాషిణి యిట్లనియె.43

క. మీవెంట రాకపోకలు
    గావింపఁగ నగరిలోనఁ గలజనములు న
    న్నోవాచంయమ యెఱుఁగుదు
    రావనితలకడకు నాకు నరుగఁగ వచ్చున్.44

గీ. ఇట్లరిగి వారు సఖులతో నిష్టగోష్టి
    నాడుకొనుమాటలను వినఁగూడు నైన
    నేను మీదాన నగుట మీగానకధలు
    వడిన నవ్వేళఁ గొదవలు దడవరేమొ.45

సీ. నా కపేక్షిత మైననాతిరూపు ధరింప
                 సామర్థ్య మబ్బిన నామగుపల
    సఖులరూపముఁ దాల్చి సముచితం బగువేళఁ
                 జని వారిహృదయంబు గనఁగవచ్చు

   
   నన నిది నెపముగాను నిధీశసుతుని దా
               రంభ యై కూడుట రమణికోర్కె
   యదియు మదీయ కార్యానుకూలమ కదా
               యని యాత్మ నలరి యాయతివఁ జూచి

గీ. ఉవిద నీ కిట్టిసామర్థ్య మొదవుటకును
   వర మొసంగితి నేను నీవలసినట్టి
   యంగనలరూపుఁ దాల్చి యాయబ్జనాభు
   వనితలతలంపుఁ దెలిసి రమ్మనుచుఁ బనిచె. 46

సీ. పనిచిన నాచెల్వ వనజదళాక్షుని
                సతులపాలికిని దత్సఖులరూపు
   ధరియించి వార లొద్దను లేనివేళలఁ
                జని ప్రసంగము దెచ్చి సంయమీంద్రు
   సంగీతచాతుర్యభంగు లనన్యసా
                ధారణం బగుట తద్వాక్యసరణి
   చేత నెంతయు సునిశ్చితముగాఁ దెలిసి య
                మ్ముని కది యెఱిఁగించి ముదితుఁ జేసె

గీ. సంయమియు నాయకం జూచి జాంబవతియు
   సత్యభామయు భోజాత్మజయును హరియు
   గురువులుగఁ గానకళ లెల్ల గరిడిముచ్చు
   దనముతో నేర్చితివి గద యనుచుఁ బలికి. 47

గీ. కొమ్మ మున్ను నీవాత్మలోఁ గోరినట్టి
   కాంతు రంభామనోహరాకారుఁ డగుచు
   మెఱయువానిని గూడి రమింపఁగలవు
   నమ్ము పొమ్మిఁక నీభవనమున కనియె.48

వ. అని యవ్వనిత ననిపి మణికంధరుండు దానును సముచిత భాషణంబులు గొంతతడవు నడపి
   నారదుండు నిజేచ్చం జనియె. మణికంధరుండునుదదాదేశంబునఁ దీర్ఘయాత్ర కేఁగె నట మున్ను
   కలభాషిణియు నట్ల నారదుచేత ననిపించుకొని నిజగృహంబునకుం జని గానాభ్యసనం బుడుగుటం జేసి
   మున్నువోలె నగరీరాకపోకలతగులంబు చాలమిఁ గ్రమంబునఁ దన చిత్తంబు నలకూబర చింతాయత్తం
   బగుచుండఁ దత్సమీపగమనంబున కుపాయంబు గానక బహుకాలంబు గడపి కాలయాపనంబు దుష్కరం
   బగుటయు నొక్కనాఁడు దానొక్కతియ వీణెఁగొని గృహారామంబున కరిగి యుండునంత. 49

చ. లలితపుభూతిపూఁతయును లాతపుఁగోలయుఁ గక్షపాలయు
    న్మలగొనుచిన్ని కెంజడలుమందులపొత్తమునాగబెత్తమున్
    లలిఁగనుపట్టుకిన్నెరయు లాహిరిమోదము సింగినాదముం
    జెలు వలరంగ నొప్పునొకసిద్దుఁడు సింగపువారువంబుతోన్.50

గీ. అభ్రపదవి నేతెంచి యయ్యబల యున్న
    తోఁటలోనికి డిగి నద్బుతము గాఁగ

  
    నదియుఁ దన్మహిమకు వెఱఁగందుమనము
    నల్ల నూల్కొల్పి యర్ఘ్యపాద్యాదు లొసఁగె. 51

గీ. అతఁడు నోకలభాషిణి యాత్మగురుని
    గృష్ణుఁ గొలువఁగ నేఁగుదే గీతవిద్య
    పూర్ణముగఁ నేర్చితే రాక పోక లిపుడు
    మానినాఁడుగదా దివ్యమౌనివరుఁడు. 52

క. దానం జేసియు నీకును
    మానస మితరప్రచింత మాని తిరముగా
    నానలకూబరునంద య
    ధీనం బై నిలిచియున్నదియై, తరళాక్షి. 53

చ. కడపటినాఁడు నిన్ను నిటు కాంచనగర్భతనూజుఁడంపుచోఁ
    గడమయభీష్టసిద్దియును గాఁ దగుదీవన యిచ్చెఁ గావునం
    బడఁతి యమోఘ మాయనముపు చలింపఁగనీకుతాల్మి నీ,
    బడలుట చూడ నోపుదురె ప్రాణసఖుల్ క్షణమాత్రమేనియున్ 54

సీ. తడవులనుండియుఁ దపము సేయఁగఁ బూని
                      మణికంధరుఁడు పాట మాని యునికి
    నుపవాసభేదంబు నపనయింపఁగ లేక
                      వ్రేఁగుచున్నవి నాదువీను లిపుడు

     
     వీణె వాయింపు మోవెలఁది నేఁడైనఁ దు
                      ష్టిగ విని పారణసేయుఁ గాని
     ఈభువనముల మియిరువురగానంబ
                      కాని యన్యము లింపు గావు నాకు

గీ. నని పలుక మాటమాటకు నద్భుతంబు
     చాలఁ బ్రబలంగ విని విని యాలతాంగి
     కరసరోజము ల్ముకుళించి కరము వినయ
     మతిశయిల్లంగ ని ట్లను నతనితోడ. 55

క. ఓయనఘ దేవుఁడవో యో
     గాయతకపిలాదిసిద్ధులందు నొకఁడవో
     నీయనుభావం బద్భుత
     మై యున్నది నామమెద్ది యానతి యీవే. 56

క. అని పలుక మణి స్తంభుం
     డనుసిద్ధుఁడ నేను జలరుహానన నీ వెం
     చినవారలలో నెవ్వాఁ
     డను గానని యతఁడు పల్కుటయు వినయమునన్. 57
 
ఉ. ఓమహితాత్మ మీవచన మొక్కొకటే పరికించి చూచినన్
     నామదిలోన నెంతయు ఘనం బగుచున్నది యద్భుతంబు మీ
     రేమహిమన్ యథార్థముగ నిట్లిది సర్వము గంటి రిట్టిమీ
     కీమహిఁ గానరానిది యేమియు లేదు గణించి చూడఁగన్

గీ. నాకుఁ దర్కాణనయైనయంతయును దిరుగఁ
   నడుగఁ జెప్పంగవలవ దోయనఘచరిత
   యిపుడు మణికంధరుని మీరు తపము సేయఁ
   జెప్పితీరి మొదల్కొని యది చెప్పవలయు.

వ. అనుటయు నతం డాయింతిం జూచి యోకాంత నాకు దూర దృష్టి దూరశ్రవణంబులు గలవు దానం జేసి యే నున్న చోటన యుండి సమ స్తంబునుం గంటి నిందు నీ యెఱింగినయర్థం బెల్ల సరిదాఁకెనేకదా యింక నీ వనిపించుకొనిపోయిన వెనుకటి నారదమణికంధర సంభాషణ ప్రకారంబును దపఃపర్యంతం బైనమణికంధరవర్తనంబును వివరించెద వినుమని యిట్లని చెప్పందొడఁగె నట్లు నారదుండు గాన శిక్షాపరిపూర్తి యైన వెనుక నిన్ను నీగృహంబున కనిపి యంత మణికంధరుంజూచి.

క. నీసంగీతవిశేషా
   భ్యాసము సఫలముగ విష్ణుఁ బరమేశ్వరు న
   త్యాసక్తితోడఁ బాడుచు
   వేసరక భజింపు మెల్లవేళలయందున్.

క. ఆదేవున "కెంతయుఁ బ్రియ
   మై దురితవినాశహేతు వగు నిది యని యే
   నాదరమున నామోక్షా
   సాదిన్ వీణియ ధరించి పాడుదు నెపుడున్.

   
   సీ. బృహతీసమాఖ్యతోఁ బెంపు మీఱెడువీణె
                     వహించి యెపుడు విశ్వావసుండు
      జగతిఁ గళావతిసంజ్ఞ నొప్పెడువీణె
                     తోడ నేప్రొద్దును దుంబురుండు
      మహతీసమాహ్వయమహనీయ మీవీణె
                     మానక నిత్యంబుఁ బూని యేను
      గచ్చపి యను పేరఁ గరము శోభిలువీణె
                     సవరించి జగదంబ శారదయును
   
   గీ. బాయ కెంతయుఁ బాటించుభంగు లరయ
      విద్యలం దెల్ల సంగీతవిద్య మిగుల
      నుత్తమము గాదె యది పురుషోత్తమునకు
      నర్పితం బగునేని యే మని నుతింతు.63

  ఉ. నీదుకృతార్థతామహిమ నెమ్మది నెన్నఁగ నంతయింత నా
      రాదు తపంబులం గనఁగ రానిజగత్పతి కృష్ణుఁ డెట్టిభా
      గ్యోదయశాలికిం దొరకు నుల్లమునం బరికించి చూడు మా
      శ్రీదయితుండు నీకుఁ గృపచేసెఁ గురుం డయి గానసత్కళల్.64

   క. కావున నీవిద్య సదా
      యావర్తింపుము కుమార యది సకలాభీ
      ష్టావ్యాప్తికిఁ గారణ మిం
      పావహిలం జేయు నప్పు డటు మనమునకున్.65

శా. ఏనున్ వేగమ యేఁగి నాపడినపాట్లీడేర నాకంబులోఁ
     గానీ కాంచనగర్బుకొల్వునడుమం గానీ పుర ద్విట్సభం
     గానీ తొల్లిటివిష్ణుదేవుకడనే గానీ మదీయోల్లస
     ద్గానప్రౌఢిని వాదుఁబూని గెలుతున్గర్వోన్నతుం దుంబురున్ 66

వ. అనిన నాపలుకు లాకర్లించి మణికంధరుం డమ్మునీంద్రునకు ముకుళితకరకమలుం డగుచు నిట్లనియె
    మీకు గానవిద్య చేతఁ దుంబురుని గెల్చుసంభ్రమం బిప్పటిమాటలవలన నెఱుంగంబడియె నతనియం
    దిట్టిబద్ధమత్సరం బేల పుట్టె తజ్జయంబున కేమి పాట్లం బడితిరి నాకు నింతయు నెఱింగింపవల యు
    ననుటయు నతం డిట్లనియె. 67

ఉ. వైకుంఠంబున నొక్కనాఁ డతులితైశ్వర్యుండు విష్ణుండునా
    ళీకప్రోద్భవముఖ్యదేవగణముల్ సేవింప యోగీశ్వరా
    నీకంబుల్ నిగమాంతసూక్తులను వర్ణింపంగ నొడ్దోలగం
    బైకూర్చుండె మహాసభన్ సదవనవ్యాపారపారీణుఁడై. 68

వ. అప్పుడు. 69

శా. కౌండిన్యాత్రిమరీచిదక్షకపిలాగస్త్యాక్షపాదాంగిర
    శాండిల్యక్రతుకణ్వకుత్సభృగువిశ్వామిత్రమైత్రేయమా
    ర్కండేయాసురివామదేవకపిదుర్వాసోబకవ్యాఘ్రపా
    న్మాండవ్యాదిమహామును ల్చనిరి ప్రేమ ల్మీఱఁ దత్సేవకున్ 70

 
   క. అరిగితి మపు డేనును దుం
      బురుఁడును విశ్వావసుండు మొదలుగ వీణా
      ధరుల మొకకొందరము త
      త్పరతయు భక్తియుఁ దలిర్పఁ దత్సేవకునై 71

   వ. ఇవ్విధంబున దేవమునిసంఘంబులు వచ్చి సేవింప విష్వక్సేనుండు వేత్రహస్తుం డగుచు సందడి
      యెడగలుగ జడియుచు బరాబరి యొనరింప దివ్యవారాంగనానాట్యంబు లవలోకించుచు న ద్దేవ
      దేవుండు పేరోలగమ్మున నున్న సమయంబున.72

  ఉ. వారిదపంక్తిలో వెడలివచ్చు మెఱుంగులపిండు నా సఖీ
      వారముతో రమారమణి వచ్చెను హెగ్గడికత్తె లెందఱేఁ
      గోరి భజింప నాకొలువుకూటముముందరివంక నొప్పుసిం
      గారపుఁదోఁట నుండి యధికం బగు వైభనమింపుమీఱఁగన్ 73

  ఉ. నెచ్చెలిపిండుఁ దానును వనీస్థలిదండ నొకింత గానఁగా
      వచ్చెనో లేదో యాకమలవాసిని యంతనె యేమిచెప్పుదున్
      హెచ్చినసంభ్రమంబున ననేకులు బద్దలవార లెక్కడన్
      వచ్చియొ మోఁది రాకొలువువారిఁ గకాపికలై చన న్వడిన్ 74

   క. అప్పుడు మముబోంట్లకతల్
      చెప్పఁగ నేమిటికిఁ దారసిలి వేత్రధరుల్
      గొప్పఁగఁ జనియె న్నిలువక
      యప్పరమేష్టియును నచటి కతిదూరమునన్.75

క. అతఱిని వేత్రహస్తు లొ
   హో తుంబురుఁడా యటంచు నుచ్చైస్స్వర ము
   ద్ద్యోతింపఁబిల్చి క్రమ్మఱ
   నాతనిఁ దోడ్కొనుచుఁ బోయి రతి వేగమునన్. 76

వ. అట్లు తోడ్కొని పోవుచుండ. 77

చ. కని తమలోనఁ దా రితనిఁ గమ్మఱగాఁ బిలిపించే నే మొకో
    యనియెడు వారు గానవిధులందు ప్రసంగము లేమి గల్గెనో
    యనియెడువారుఁ దచ్చతురు లన్యులు లేరె యితండె కాని
    యిం, దనియెడువారు నై మనములందును సందియమొందిరందఱున్ .78

ఉ. అప్పుడు నేను నామనమునం దితనిం బిలిపించు టెట్లొకో
    యిప్పు టడంచు నిల్చి యరయింప వినంబడియె న్నిజంబుగా
    నప్పురుషో త్తముండు దనయంగనతో వినుచున్నవాఁడు సొం
    పొప్పఁ దదీయగాన మని యొద్దఁ జరించెడువారు చెప్పఁగన్ 79

క. మమ్మెల్ల దోలి యొక్కని
    నిమ్మెయిఁ బిలిపించి హరియు నిందిరయుఁ గడున్
    సమ్మదమునఁ దుంబురుగా
    నమ్మును వినుచునికి విని మనం బెరియంగన్. 80

వ. ఏ నొక్కమఱుంగునం గొంతతడవు గనిపెట్టుకొని యుండ

సీ. అనిపెనా యే మిచ్చె ననుచును సంభ్రమం
                        బున సందడించుచు మూఁగువారు
    సర్వేశ్వరుండు శ్రీసతితోడ గానంబు
                        వినునఁట యడుగనే లనెడువారుఁ
    గడు ననుగ్రహము నెక్కడ లేనియీయీగి
                        పసయుఁ దెల్పెడు నంచుఁ బలుకు వారు
    నీ వొక్కఁడవొ మఱి యెవ్వార లైన న
                        య్యెడ నుండిరో యని యడుగువారు

ఆ. నగుచు సురలు మునులు నరుదంద మేపూఁత
    డంబుతోడ వచ్చెఁ దుంబురుండు
    కడలవారిని గనకస్నాన మాడించు
    పదకమును సునేత్రపటముఁ దాల్చి. 82

వ. అప్పుడు, 83

క. ధగధగ యనుపదకంబున
   నిగనిగ యను క్రొమ్మెఱుంగునేత్రపటమునన్
   భుగభుగ యను మేపూఁతన్
   భగభగ యనిపించె నతఁడు. నాహృదయంబున్. 84

సీ. తనుఁ గ్రమ్మఱంగఁ బిల్చిన వేళయంద నా
                          తో విచారింపక పోవు టెట్లు
    పోయెఁబో ననుఁ బిల్వఁజేయక తా నొక
                          నెఱజాణ యై విద్య నెఱపు పెట్లు

    నెఱపెఁబో ప్రభువు మన్నించినాఁ డని మీఁదు
                            పరికింప కీసొమ్ము పట్టు టెట్లు
    పట్టెఁబో దొంగఁ దే ల్గుట్టిన ట్టివి డాఁచి
                            కొంచుఁ బోవక మెఱయించు టెట్లు

గీ. లేఁడు తగవరి యెందును మూడి చొచ్చి
    వాత వెడలెడువాఁడె యెవ్వాఁడు నంచుఁ
    బాపి తుంబురుఁడౌ యంచుఁ బండ్లు గొఱుకు
    కొంచు లోలోన నుడికితిఁ గొంతతడవు. 85

క. నాకంటె దాను ఘనుఁడే
    యాకొలఁదియు బయలుసేయునంతకు నేనే
    పోకలఁ బోయినఁ బోని
    మ్మీకరణిం జుణిఁగి పోవనిత్తునె వీనిన్.86

వ. అని యాగ్రహించుచు నతనితోడ నెందేనియు వాదు పెట్టు కొని భంగపఱచి యతులితం
    బైనమదీయసం గీతచాతుర్యంబువార్తలు క్రమంబున నిజ్జగన్నాయకునకు వినంబడునట్టి
    యుపాయంబు వెట్టెదంగాక యని యూహించి తదనంతరంబ.87

చ. తలఁగక యిప్పు డిట్లు సముదగ్రతఁ బేర్చినయీర్ష్య బుద్దిలో
    పలన యడంచి మైత్రి గనుపట్టఁగ నింకను గొంత రాకపో
    కలు ఘటియించి యే నతనిగానములో గుణదోషవర్తనల్
    దెలియుట నీతి యాతెలివి లేకగునే జయ మంచు నెంచితిన్ 88

ఆ. ఎంచి యతనియింటి కేఁగితి నొక్కనా
    డతఁడు నపుడు పాట కాయితముగ
    వీణె మేళగించి వెలుపలీమోసల
    నునిచి లోని కరిగి యున్నవాడు. 89

ఉ. ఏనునుదుంబురుం డెచటి కేఁగె గృహంబుననున్న వాఁడెయం
    చానికటంబున న్మెలఁగునట్టిజనంబులఁ బల్కి వీణె యి
    చ్చో నిడి లోనికేఁగె ననుసుద్ది వినంబడ నీవిపంచి యె
    వ్వానిదొయంచు నుండితిమి వారిదె చూతమటంచు నల్లనన్ 90

గీ. పుచ్చుకొని పలికించి యపూర్వ మైన
   శ్రుతుల పెంపు నిర్దోషత నతుల మగుచుఁ
   గడు వెఱఁ గొనర్ప దాని నక్కడన పెట్టి
   మిగుల లజ్జించి వచ్చితి మగిడి యపుడు. 91

వ. ఆసమయంబున నంతరంగంబున. 92

మ. కడుఁ బ్రావీణ్యధురీణుఁ డీతఁ డయినం గాంధర్వసంపూర్తినె
    ల్లెడఁ బ్రఖ్యాతి వహించునాకు నకటా యీతుంబురుండం తయె
    క్కుడుగాఁ గానము నేఁటిదాఁక నని సంక్షోభించుచుం దాడిఁ ద,
    న్నెడువానిం దలదన్నువాడు గలఁడ న్వేషింప నంచెన్నితిన్. 93

చ. అటమును చెల్మిపెంపు దనరారగ నేనును దాను నప్పట
    ప్పటికిని గూడి పాడుదుము పద్మభవాదులయొద్ద నప్పు డె

   చ్చటఁ దన కింత గానకళసంపదకల్మి యెఱుంగనీఁడ ము
   చ్చటపడి యిట్లు విష్ణుఁడుప్రసన్నతఁ దాఁబిలిపించునంతకున్ . 94

క. తమవిద్య నెవ్వ రేమా
   త్రము గనఁజాలుదురు వారిదండను దన్మా
   త్రము ప్రకటింతురు బుధు లు
   త్తములమహిమ నీరుకొలఁది తామర సుమ్మీ. 95

క. ఇటు గాక విను జనంబుల
   పటిమకు నెక్కుడుగ విద్య పచరించుట య
   క్కట విఫలము గాదే యె
   చ్చటఁ జెవిటికిఁ బట్టినట్టిసంకును బోలెన్. 96

వ. అది యట్టుండి నేను నది మొదలుగాఁగ నెక్కడెక్కడ నక్కజపుగానవిద్య గలవారు గలరు వారి నరసి
   యరసి తద్విద్య సాధించుచు నెందునుం దుంబురునకు నీడు గాఁజూలమి
   యెడనెడం బరికించుచుం బెద్దకాలంబు ప్రవర్తిల్లి యీమనోరథంబు సర్వజ్ఞుం డైనపుండరీకాక్షుని
   యనుగ్రహంబుననకాని ఫలియింప నేరదని నిశ్చయించి తద్దేవునిం గూర్చి చిరకాలంబు తపం
   బొనర్చితి నంత. 97

సీ. అంజనాచలగర్వభంజనాచలలీల
                 నీలవర్ణపు మేనిడాలు దనరఁ
    బుండరీకముల నుద్దండరీతుల గెల్చి
                 చెన్నొందునిడు వాలుఁగన్ను లమర



     
     మకరకుండలరుచి ప్రకరకుంఠితము లై
                        దినకరప్రభలు వెన్వెనుక కొదుఁగ
     నురమురత్నమునందుఁ గరము రంజిలునీడ
                        తోడునీడగ లక్ష్మి క్రీడ లాడ

గీ. శంఖచక్రాదిపరికరసహితుఁ డగుచు
     మఘవముఖదేవతాసేవ్యమానుఁ డగుచుఁ
     బతగరాజాధిరోహణోద్భాసి యగుచుఁ
     గృప దలిర్పంగఁ గాన్ఫించెఁ గేశవుండు. 98

ఆ. కానుపించి యేమి కావలయును వర
     మడుగు మనిన నేను నాత్మశక్తి
     కొలఁది నతులు నుతులుఁ జలిపి తుంబురు గాన
     కలనవలన గెలువవలయు నంటి 99

చ. అనుటయునన్నుఁజూచికృపనచ్యుతుఁ డిట్లను నేనుద్వాపరం
     బున వసుదేవనామునకుఁ బుత్రుఁడనై యుదయింతు శిష్టపా
     లనమున దుష్టశిక్షను నిలాస్థలిఁ బ్రోవఁగ నప్డు ద్వారకా
     ఖ్యనగరియందు నీయభిమతార్థ మొనర్చెద రమ్ము నాఁటికిన్ 100

క. అని యంతర్థానము నొం
    దినఁ జిర కాలంబు నేఁ బ్రతీక్షించుచు నం
    తను వాసుదేవుకడ ని
    ట్లనుపమసంగీతకౌశలాఢ్యుడ నైతిన్.101



వ. అని చెప్పి మఱియు ని ట్లనియె. 102

క. ఏ నిన్ని పాట్లఁ బడి యీ
    గానమహిమఁ గంటి నీవుఁ గలభాషిణియున్
    మేను చెమర్పక యుండం
    బూనితి రిది యప్రయాసమున హరికరుణన్. 103

క. అనుడు మిముఁ గొలుచుపుణ్యం
    బునకిది యరుదయ్య ఘనతపోధన త న్నం
    దినవారు తనంత లనన్
    వినరే లోకోక్తి మీరు విశ్వంభరలోన్. 104

మ. అది యట్లుండె నొకప్డు తుంబురుని దా నారీతిఁ బిల్పించియిం
    పుదలిర్పన్ హరిపాటవింటమిగులం బూజ్యబుగాఁ జెప్పి తే
    కొదయున్ లేక సదానివాసముగ వైకుంఠంబులోనుండియా
    సదయు న్విష్ణుని గొల్వఁగలెడుమహాసౌభాగ్య మెట్లబ్బునో 105

క. అనుటయు నమ్మాటకు నె
    మ్మన మలరఁగ నతనిఁ జూచి మణికంధర య
    త్యనముఁడవు మేలు మే లీ
    యనుపమసద్బుద్ధి యేరికైనను గలదే. 106

క. వినరే యెవ్వరుఁ బాపం
    బనఁ బుణ్యం బన ని షేధ మన విధి యనఁ గీ

   
    డన మే లనఁ నిహ మనంబర
    మనఁ దలఁపఁలేరుగాక యాత్మహితంబున్ . 107

చ. అలయక వేదశాస్త్రసతతాభ్యసనవ్యసన ప్రసంగతిం
    దెలివి యొకింత కాంచినగతి న్నుతి కెక్కియు వెఱ్ఱిదీరె రోఁ
    కలి దలఁ జుట్టు మన్నక్రియగా నొకకొందఱు తాల్తురెప్పుడు
    న్గలుషపధప్రవర్తనమె కర్మపువాసన లన్నుకొల్వఁగన్.

సీ. వినుము గంధర్వనందన భూతములయందుఁ
                     బ్రాణు లుత్తమములు ప్రాణులందు
    బుద్ధిజీవులు మేలు బుద్ధిజీవులయందు
                     మనుజులు శ్రేష్ఠులు మనుజులందు
    బ్రాహ్మణు లధికులు బ్రాహ్మణులందు వి
                     ద్వాంసులు ఘనులు విద్వాంసులందు
    విదితార్థకృతిలోలహృదయులు ముఖ్యులు
                     విదితార్థకృతిలోలహృదయులందుఁ
గీ. గర్త లెంతయుఁ బూజ్యులు కర్తలందు
    బ్రహ్మవిదు లెక్కు డామీదఁ బరమ మొకటి
    గలుగ దనుచును మున్ను దాఁ బలికె మనువు
    ధర్మశాస్త్రప్రసంగవర్తనల వేళ.

ఉ. నీవిధ మారయం బరిగణించినయిప్పటితారతమ్యపుం
    ద్రోవ కరంబు దూరముగఁ ద్రొక్కినవాఁడవునిక్కువంబు ల

    క్ష్మీవరనిత్యసన్నిధివిశేషమహత్త్వ మెఱింగినంతనే
    యావిభవంబుఁ గాంచుటకు నాసయొనర్చితిగాన నెమ్మెయిన్ . 110

క. కావున నీ వడిగినయ
    ద్దేవునియనవరతసన్నిధిమహత్త్వవిశే
    షావాప్తికిఁ బెద్దలచే
    నే వినినయుపాయ మిప్పు డెఱిఁగింతుఁ దగన్. 111

క. అధికారి కానివానికి
    నధికపదవి దెలుపఁ బ్రాప్త మయ్యెడుపాపం
    బధికారి యైనవానికి
    నధికపదవి దెలుప కున్న నగు నిక్కముగన్. 112

వ. అని యిట్లని చెప్పె. 113

సీ. తనశక్తికొలది సత్కర్మము ల్ఫల వాంఛ
                    మాని కృష్ణార్పణమతిఁ జలుపుట
     ప్రతిషిద్ధకర్మంబు పరిహరించుట విష్ణు
                    భక్తి పైక్రమమునఁ బాదుకొనుట
     తద్భక్తి గలపుణ్యతములసంసర్గంబు
                    దుర్జను లున్నట్టిత్రోవఁ జనమి
     విష్ణుసన్నిధికళావిఖ్యాతవివిధది
                    వ్యక్షేత్రతీర్థయాత్రాచరణము

గీ. బ్రహ్మచర్యంబుఁ దపము వైరాగ్యగుణము

వలయు వైకుంఠమును గోరువారి కెల్ల

    
     వీనిలోపలఁ గొన్ని గావింపఁ గనిన
     వృథ చనవు చేర్చుఁ గ్రమమున విష్ణుపదము. 114

వ. అని చెప్పి నీవు నిజశక్తికొలఁది నిందు బ్రవర్తిల్లుము కృష్ణానుగ్రహంబునం
     గలిగినయీయనన్యసాధారణసంగీతచాతుర్యంబు వృథసేయక శ్రీపురుషోత్తమశ్రీరంగాదిదివ్యక్షేత్రము
     లందు ముకుందసన్నిధిం దద్దివ్యగుణనామసంకీర్తన గానంబు గావింపు మది సకల శ్రేయోనిదానం బని
     పలికి తత్ప్రసంగవశంబున. 115

ఉ. అక్కజ మైనభక్తి దనరార నతం డనయంబుఁ గృష్ణునిం
     దక్కక యాత్మఁ జూచి ప్రమదంబునఁ బొంగుచుఁ జెంగలించుచుం
     జొక్కుచు మ్రొక్కుచుం బొగడుచుం బులకించుచుం గన్ను మోడ్చుచున్,
     మిక్కిలి చోద్యమందుచును మెచ్చుచుఁ బాడుచు నాట్య మాడుచున్. 116

క. కేవలము నతిప్రేమర
     సావేశవశంవదాత్ముఁ డై తద్గుణముల్
     భావింపుచు నొక రీతిం
     ద్రోవ గనుచు నేఁగె నారదుండు నిజేచ్ఛన్. 117

వ. మణీకంధరుండును దచ్చరితంబులకు నతివిస్మయప్రమోదహృదయుం డగుచు నితం
    డింతధన్యతామహిమంబున నొప్పునే యని కొనియాడుచుం దనదృష్టిమార్గంబు గడచునందాఁ

     క వీక్షించి యంత నెట్టకేలకు నాలోకనంబులం ద్రిప్పుకొని యె నివ్విధంబున గురుం డరిగిన నతండుఁ
     దదు క్తప్రకారంబునఁ బుణ్యకర్మంబులు నడుపుచుఁ గ్రమంబున విష్ణుభక్తి హృదయంబునం బొదలఁ
     దీర్థయాత్ర గావించె నందు. 115

మ. యమునం జూచెను వీచికాచయమునం బ్రాంచర్ఘనశ్యామతో,
    యమునన్ సారస కైరవొచ్చయమునన్ సారావభృంగీ నికా,
    యమునం జక్రమరాళసంచయనునన్ వ్యాఘోషితాఘవ్య పా
    యమునన్ సంతతపుణ్యనిశ్చయమునన్ హర్షప్రకర్షంబు గన్.116

శా. నిధ్యానోత్సవ కారణంబు లగుచు న్మించెం గరం బానదిన్
    మధ్యేతీరవనద్విజప్రకర సమ్యగ్వర్తి తారణ్యక
    స్వాధ్యాయాధ్యయనస్వరాభినయలీలాందోళనభ్రూలతా
    బుధ్యాపాదన నైపుణీవిలసితాంభోవీచిచాంచల్యముల్ . 117

చ. ఇరుగడలంచు మించినయహీశ్వరశయ్య తెఱ౦గుఁ దాల్చి క్రొ
    న్నురువులపంక్తి రాజిలఁగ నూతనపీతపటంబు కైవడిం
    దరళసరోజరేణు సముదాయము సొంపెసఁగంగఁ జూడ్కికా
    తరణితనూజ యొప్పె శయితంబగువిష్ణునిమూర్తియోయనన్ 118

క. ఆవైణికుండు తత్తీ
    ర్థావళిఁ దగువిధు లొనర్చి యాయాచోట్లన్

    శ్రీవరుగుణములు వీణా
    ప్రావీణ్యము పొలుపు మీఱ బాడుచు సంతన్.

వ. మధుర సేవించి యంతట హరిద్వారంబును సాలగ్రామపర్వతంబును బదరికాశ్రమంబును
   నైమిశారణ్యంబును గురుక్షేత్రంబును బ్రయాగయుఁ గాశియు నయోధ్యయు గంగాసాగరసంగమంబును
   స్నానదానాదినిధు లనూనంబుగానడుపుచు దర్శించి యంత నుదధితీరంబున నీలాచలసన్నిధికి నే
   తెంచి.

క. ఇది సాక్షా ద్వైకుంఠం
   బిది నానామునితపస్సమృద్ధివిపాకం
   బిది పరమం బిది శరణం
   బిది పుట్టినయిల్లు సిరుల కెల్లఁ దలంపన్ .

తే. అని నుతించి యింద్రద్యుమ్న మనుసరసిని
    రోహిణీకుండమున సమారూఢభక్తి
    దీర్థమాడుచు నాతఁ డాత్మీయగాన
    నైపుణి వెలార్చుచును జగన్నాధుఁ గొలిచి.

సీ. ఇత్తెఱంగునఁ బురుషోత్తమశ్రీజగ
                   న్నాధునిసంసేవనమునఁ దనరి
   శ్రీకూర్మవిభునియంఘ్రీసరోరుహంబులు
                   గనుఁదమ్ములకు విందుగా నొనర్చి

    సింహాచలాధీశసేవావిశేషలీ
            లలను జన్మంబు నలంకరించి
    శ్రీమదహోబలస్వామిపాదనఖోడు
            జాలసంఘము ఫాలశశికి నొసఁగి

గీ. వేంకటేశ్వరచరణారవిందగంధ
    నందదిందిందిర శ్రేణీ నైల్యమునను
    నిజశిఖాకాంతికిని బుష్టి నిర్వహింపఁ
    జనియె నాదరమేదురస్వాంతుఁ డగుచు.126

మ. కమనీయోజ్వలశీలశాలి యగునాగంధర్వుఁ డంతన్ ఘన
    ప్రమదప్రేమవిశేషసంభృతపరీరంభక్రియాసంభ్రమ
    భ్రమకారాభిముఖప్రసారలహారీబాహాసమూహాసమా
    నమనోజ్ఞం బగుస్వామిపుష్కరిణికి న్వచ్చెం గడున్వేడుకన్ 127

తే. అంత హరిసంతతాశ్రితస్వాంత మైన
    స్వామిపుష్కరిణియును నాశౌరిభక్తు
    తనువు నన్యోన్య పావనత్వము భజించె
    మిగుల మజ్జనసమయసమ్మేళనమున 128

ఉత్సా. అంత నిత్యనియమములు సమస్తమును నొనర్చి యా
        చెంతఁ జెలువు మీఱియున్న క్షితివరాహమూర్తి శ్రీ
        కాంతఁ గొలిచి భక్తి వినయకౌతుకప్రమోదసం
        క్రాంతి శబలతావిశేషకలితచిత్తవృత్తి యై 129

సీ. మణిమయప్రాకారమండపగోపురో
                  దీర్ఘకాంతులచేతఁ దేజమునకుఁ
    జారునదీహస్తచామరవీజన
                  వ్యాపారములచేత వాయువునకు
    నారాధనార్థయాతాయాతజనవిభూ
                  షారజోవృష్టిచే ధారుణికిని
    హృద్యచతుర్విధవాద్యస్వనోపయో
                  గప్రవర్తనముచే గగనమునకు 129

గీ. నిజనవాగరుధూపజనీరవాహ
    జనన సంబంధమహిమచే సలిలమునకుఁ
    బావనత్వంబు గలుగంగఁ బరఁగు వేంక
    టేశునగరు దాఁ జేరి యిం పెసకమెసఁగ.130

క. మునుపు పరివార దేవత
    లను దగ సేవించి నిర్మల ప్రేమభరం
    బున మేను గగురుపొడువఁగ
    ననఘు డతఁడు లోని కరిగి యగ్రమునందున్. 131

సీ. మృదుపదాంబుజములు మెఱుఁగుటందెలుఁ బైఁడి
                          దుప్పటియును మొలముప్పిడియును
     మణిమేఖలయు బొడ్డుమానికంబును వైజ
                          యంతియు నురమున నలరుసిరియు

     వరదహస్తముఁ గటి వర్తిల్లు కేలు శం
                  ఖముఁ జక్రమును దాల్చుకర యుగంబుఁ
     దారహారంబులుఁ జారుకంఠంబు ని
                  ద్దపుఁజెక్కులును నవ్వుఁదళుకుపసలు

గీ. మకరకుండలములును డామరలఁ దెగడు
     కన్నులు మనోజ్ఞనాసయుఁ గలికిబొమలు
     ముత్తియపునామమును రత్నముకుటవరము
     నెసఁగఁ గనుపట్టుశ్రీవేంకటేశుఁ జూచె. 132
 
వ. ఇట్లు చూచి.133

శా. ప్రత్యంగంబును మిక్కిలిం దడవుగా భావించి భావించి యా
    దైత్యారాతితనూవిలాసము సమస్తంబున్ విలోకించెఁ దా
    నత్యంతంబును వేడ్కఁ బొంగుచు నితాంతాశ్చర్యముం బొందుచుం,
    గృత్యం బేమియుఁ గొంతప్రొ ద్దెఱుఁగక క్షీణ ప్రమోదంబుతోన్.134

వ. పదంపడి నిజానుభవం బిట్లని యుగ్గడింపం దొడంగి 135

సీ. పదపద్మములఁ జిక్కి పాయదు నాదృష్టి
                      కనకాంబరమున కేకరణిఁ దెత్తుఁ
    గనకాంబరమునఁ గీల్కొనినఁ జలింప దే
                      నుదరబంధమున నెట్లొనరఁ గూర్తు

   నుదరబంధమున నిం పొంది భేదిల్లదు
                      శ్రీవత్సమున కెట్లు చేరఁ దిగుతు
   శ్రీవత్సమునఁ దారసిలిన రానేరదు
                      కేలుఁదామరల కేక్రియ మరల్తుఁ

గీ. గేలుఁదామరలను గళశ్రీల మోవి
   మకరకుండలముల గండమండలముల
   నాసఁ గనుఁగవ బొమలఁగుంతలములందు
   నెందుఁ బర్విన విడఁజాల దేమి చెప్ప.136


వ. అని పరమానందంబున నితరప్రపంచంబు సర్వంబునుమఱచి కొంతతడవు నిరీక్షించి
   తదనంతరంబ దండ ప్రణామంబు లనేకంబులుగావించి విపంచీసమంచితమృదుమధురనినదంబును
   గంఠస్వరంబును నేకం బగుచు లోకుల నస్తోక సమ్మదాశ్చర్యసంభృతస్తంభభావులఁ గావింప నద్దేవుని
   దివ్యమంగళగుణగానంబు లొనరించె నివ్విధంబున మూఁ డహోరాత్రంబులు సేవించి వేంకటనగంబు
   డిగ్గి చని చని ముందట.137

సీ. ఏపట్టణము ముక్తిహేతుసప్తపురాంత
              రభిగణనాతివిఖ్యాతిశాలి
    యేపట్టణము ఖేలదే కామ్రవిభుశిర
              స్సింధుమత్సరిసరశ్శ్రీవిభాసి

    యేపట్టణము సముదీర్ణకామాక్షీత
               పఃపరిపాకసంపద్విధాయి
    యేపట్టణము సరిద్రూపవాగ్దేవతా
               సంశ్రయాంచితసమస్తద్విజాళి

గీ. బ్రహ్మయజ్ఞవపాహోమపరిమళసహ
    జాతసాక్షాత్పరబ్రహ్మసన్నిధాన
    భాగ్యసౌభాగ్య యోగ్య మేపట్టణంబు
    పుణ్యతర మైనయాకాంచిపురము గనియె. 138

గీ. కని మనంబున మోదంబు గడలుకొనఁగ
    నందు నేకామ్ర నాధుఁ గామాక్షిఁ దక్కుఁ
    గలుగు వేల్పుల దర్శించి కరిగిరీంద్ర
    మునకుఁ జని యుక్తగతి నెక్కిపోవ నెదుట.139

సీ. తనశంఖరుచికి నాతనిమనస్సత్వోద
                  యంబు ప్రత్యుత్థాన మాచరింపఁ
    దనచక్రమునకు నాతనిదివ్య తేజంబు.
                  గురుభావమున నెదుర్కోలుసేయఁ
    దనకృపాలక్ష్మి కాతనిభక్తి నెనరు పెం
                  పెసఁగఁ గౌఁగిటఁ జేర్చి యెత్తుకొనఁగఁ
    దనకౌస్తుభమున కాతనిశుద్ధచిత్ప్రకా
                  శము మైత్రి నెఱపుచు సరస మాడ

గీ. వరదరాజ దేవుఁడు భక్తవత్సలుండు
   మిగులఁ గనుపట్టె నతఁడు నజ్జగదధీశుఁ
   గని పులకితాంగుఁ డగుచును వినుతి చేసి
   పాడుచు భజించె నెంతయు భక్తి మీఱ 140

వ. అంత.141

శా. ఆకాంచీనగరంబు వెల్వడి సముద్యత్పూగపున్నాగరం
    భాకంకేళిరసాలసాలసుమనః పాళీజధూళీమధూ
    ళీకేళీవరగంధవాహపృధుకాళీచంక్రమాలంకృత
    క్ష్మాకప్రాంగణచోళమండలమహాగ్రామంబు లీక్షింపుచున్ 142

చ. చెఱకును రాజనంబువరిచేలును దట్టపుఁబోఁకమ్రాఁకులుం
    దఱ చగుపూవుఁదోఁటలును దమ్మికొలంకులునేటికాల్వలుం
    బఱపగునారికేళవనపంక్తులు మామిడితోఁపులుం గడున్
    మెఱయుచు నాత్మకు న్ముదము మెచ్చును నచ్చెరువున్ ఘటింపఁగన్.143

శా. ఆవీణాధరుఁ డేఁగి కనోనియెఁ బుణ్యఖ్యాతిదర్పోల్లస
    ద్దైవద్వీపవతీసమత్సరవివాదప్రౌఢిమానర్గళ
    వ్యావల్గత్కరభావభృల్లహరికావర్గావృతవ్యోమముం
    గావేరీతటినీలలామము నఘౌఘక్షాళనోద్దామమున్ 144

ఆ. కని తదీయ మైనయనితరసదృశపా
     వనతరప్రభావఘనత దనకుఁ

    గరము మెచ్చొనర్పఁ బరమనిరూఢి నా
    దరముతోడిభ క్తి గరిమఁ దనరి. 145

క. పావనగుణానుభావము
    భావన గావింప నెట్టిపరమనదులు నీ
    కావేరికి సదృశంబులు
    గా వేరికి నైనఁ బొగడఁగా వెర వగునే.146

లయ. ఈనది ప్రవాహయుగళీనిభవిభాసితభు
                        జానియతరంగసదనూనపరిరంభం
       బీనది భజన్నిఖిలమానవమనఃకలుష
                        తానిరసనాతిపటుతానుతజలౌఘం
       బీనది సమస్తతటినీనికరదుష్కరత
                        రానుపమచిద్విభవదానమహనీయం
       బీనది పవిత్రతరమీనది శుభైకనిధి
                        యీనది విముక్తికినిదానము గణింపన్ . 147

ఉత్సా. అమితరంగధామలక్ష్మి నరయఁ బృషతమణినికా
       యములఁ బూజసేయఁ దాల్చినట్టినేత్రభుజసహ
       స్రములు గాని జలరుహములు జలరుహములు గావు భం
       గములు భంగములును గావు గణన సేయ నీనదిన్. 148

మాని. బంగరు చేలయుఁ బద్మనిభాక్షులు బాహుచతుష్కము భవ్య విభో

   త్సంగితశంఖసుదర్శనశార్ ఙ్గగదాముఖచిహ్నము తత్వము నీ
   లాంగము నీనది యౌర సృజించు నిజాశ్రిత దేహికినంతికస
   ద్రంగశయానుఁ దిరంబుగఁజూచికరం బిదివో చతురత్వ మనన్ .

వ. అని ప్రశంసించుచున్న యచటిజనులవాగ్జన్మసాఫల్యంబునకు నుల్లసిల్లుచు నరవిందకుముద
   కహ్లారతల్లజసముల్లసితగంధసంబంధబంధురగంధవహకిశోరవారంబులు దూరంబునన
   యెదుర్కొనఁ జక్రచక్రాంగబకక్రౌంచసారసారావంబులు సారస్యవికస్వరస్వాగతభాషణంబు లశేషంబు
   నుపచరింప నుత్కంపమానకల్లోలజాలంబులు సమాలింగనలీలాలోల బాహుకాండపాండిత్యంబు
   లత్యంతంబుఁ బ్రకటింపఁ దటస్థలస్థాపితస్థూలడిండీరఖండమండలవిలాసంబులు
   రజతాసనసమర్పణప్రకారంబు నేర్పరింప నింపుమీఱుచు నిష్టబంధుసందోహంబులలాగున
   నాగంతుకజనసంతతులు సంతసంబున నుపశ్లోకింపఁ బెంపు మీఱుచున్నయాకావేరియం
   దుచితవిధులుదీర్చి యందు మిక్కుటం బగుపెక్కువ నుక్కుమిగులుజక్క వలచక్కఁదనంబును
   వెక్కిరించునిరుత్తరీయవర్తులోత్తుంగరంగత్కుచయుగంబులసరస సరసంబు లాడంజేరినతెఱంగు నం
   గానుపింపఁ జంకల నిడినకనత్కనకకలశంబులతోడఁ బొ

    లుపారుచు నీరాటరేవున ఠీవి నెఱపు ద్రావిడయువతీ వితతు
    లయతులచతురిమపరిమిళితలలితవచనరచనలరుచులు గొనవలసి తెలిసియుఁ దెరు
    వడుగుతెరువరులం గూడుకొని పురంబు ప్రవేశించి వేదాధ్యయనశబ్దంబులతోడియుద్దులై
    యుద్దీపించుషడ్దర్శనవ్యాఖ్యానఘోషంబులచేతఁ బూతాతిధిశ్రోత్రంబు లగుబ్రాహ్మణగృహవాటికలు
    దాఁటి కోటానఁగోటులై కోటకొమ్మలయందు నవ్యుత్పన్ననిర్వాణంబు లగుమాణిక్యదీపంబులు
    మార్తాండమండలమునకు మాఱుమండుచు ఖండితబహిరంతరతమస్సముచ్చయంబు లగుచు
    హెచ్చనచ్చెరువున విలోకించుచు శ్రీరంగరాజ భజనయాతాయాతవర్తననర్తకీమణివిభూషణ
    ఘోషణపోషణంబుల నినుమడించి యేపారు పారావ తారవాపార పారంపర్యంబులం
    బర్యాకులాంకణంబు లగువిశంకటవిటంకంబుల నలంకృతంబులగుగోపురంబులు విలోకించుచుఁ
    బ్రాకారంబులు సొత్తెంచి యథోచితక్రమంబున వైనతేయాదుల సేవించుచు రంగ సంజ్ఞితం
    బైనదివ్యధామంబు డగ్గఱ నేఁగి యందు.


సీ. ఒసపరిపస మించుపసిఁడిదుప్పటివాని
                  శుభ మైనయురము కౌస్తుభమువానిఁ
    దెలిదమ్మిరేకులఁ దెగడుకన్నులవానిఁ
                  గమ్మకస్తురితిలకంబువాని
    తొలుఁబలుగిల్కుపావలఁ జరించెడు వానిఁ
                  జలువతావులసెజ్జ నలరువాని

     నింద్రనీలపుడాలు నేలువర్ణమువాని
                సిరి మరుల్గొలుపుమైచెలువువాని
  
గీ. మకరకుండలదీప్తిడంబరమువాని
    డంబు నెఱపెడుమణికిరీటంబువాని
    రంగనాయకుఁ గాంచి సాష్టాంగనతులు
    సలిపి తన్మూర్తియంతయుఁ గలయఁజూచె. 151

వ. ఇత్తెఱంగునం జూచి.152

చ. తమి యమరంగ నొక్కొకటి దక్కఁగ నేలెడు నౌర మద్విలో
    కముల మణీకిరీటమును గస్తురి నామము నవ్వుమోము హా
    రములును వైజయంతియు నురస్థ్సలరత్నము శంఖచక్రము
    ఖ్యములును బొడ్డుఁదామరయుఁ గంకణకాంచీపదాంగదాదులున్.153
 
సీ. దివ్యసంయమిమనస్థ్సితిఁ బొల్చుమత్కుల
                      దైవంబుపదములఁ దలఁపుఁ జేర్తు
   నఖిలలోకస్రష్ట యగుబ్రహ్మఁ గన్నమ
                      త్ప్రాణబంధువునాభి నాత్మఁజేర్తు
   దైతేయకంఠనిర్దళనంబు లైననా
                      స్వామిహస్తముల భావంబుఁ జేర్తు
   లక్ష్మిచన్గవకు నలంకార మైననా
                      తండ్రివక్షమునఁ జిత్తంబుఁ జేర్తు



గీ. నుల్లమునకును జూడ్కికి వెల్లిగొలుపు
   నావరదుమోమునందు మనంబుఁ జేర్తు
   ననుచు గీతరూపములుగా నాశుకవిత
   నుతుల రచియించి పాడుచు నతఁడు గొలిచె 154

వ. అంత నాగంధర్వుఁ డచ్చటు వాసి యొక్కించుక తూర్పుగాఁ జని చని.155

చ. అలరుచుఁ గాంచె ముందట నహమ్మతినిర్మధన ప్రవీణమున్
    విలసితసౌధవజ్రరుచినిర్జరనిక్షరిణీప్రవాహసం
    వలనమిళత్ప్రమత్తయినవారమతిప్రదచంద్రశాలికా
    లలితవతీవిలోలదృగలంక్రియమాణముఁ గుంభఘోణమున్.156

వ. అందు కందళదమందసందీప్తిప్రవాహసంక్షాలితదిగంతరాళసంతమసజంబాలంబు లగుగోపురప్రాకా రంబుల దీపించుమాణిక్యమయమందిరంబునందు.157

సీ. నునుగాడ్పుదూది నించినయట్టిచల్లని
                    పానుపుపై లీలఁ బవ్వళించి
    పటువులై హోంబట్టుబటువులో యన నొప్పు
                    రమచన్నుదోయిఁ బాదములు చేర్చి
    చెలువు దీపింపఁగ శిరముక్రిందట నొక్క
                    కేలు దలాడగాఁ గీలుకొలిపి

   బంగారువలువున రంగారుకటిమీఁదఁ
             జక్కఁగా నొక్కహస్తంబు చాచి

గీ. యన్యకరయుగ్మమునఁ బాంచజన్యమును సు
   దర్శనంబును దాల్చి సుదర్శనమున
   నచటిజనములచూడ్కి ధన్యముగఁ జేయు
   శార్ఙ్గపాణిని గొల్చె నుత్సవ మెలర్ప. 158

వ. మఱియు నందు కుంభేశ్వరుని సేవించి దర్భశయనంబున కరిగి యందు రామభద్రు నిర్ణిద్రభక్తి
    తాత్పర్యంబుల సేవించుచు వీణా వాదనానువాద మేదురగానకౌశలంబుతోడ నిట్లని స్తుతించె. 159

తురగవల్గనరగడ.



    దశరధానీశవిమలతరతపఃఫలావతార
    నిశితశరలఘుప్రయోగనిహత తాటకావిహార
    కపటపటుసుబాహుదళనఘటితగాధిసూనుయాగ
    అపరిమేయగౌతమాంగనాఘదమనపదపరాగ
    కోమలేక్షుదళనసదృశఘోరశంభుచాపభంగ
    భూమిజావివాహవిభవపూర్ణసమ్మదాంతరంగ
    పరశురామగర్వపవనపానపీనబాహునాగ
    గురువచోనుపాలనాతికుతుకవిధుతరాజ్యభోగ
    పదభజనవితరణాతిఫలితగుహసమస్తపుణ్య
    పాదుకాప్రదానవిహితభరతసౌహృదానుగుణ్య

   ఘనవిరాధమదవినాశకలితబహువిపన్ని రాస
   వినుతపదనివేశపూతవివిధమౌనికులనివాస
   తతనిశాచరీవిరూపతాకృతప్రియావినోద
   అతులబలఖరాదిదనుజహననజనితవిబుధమోద
   హరిణరూపధారిదారుణాసురాసుహరణబాణ
   పరమఘోరబాహుబలకబంధమర్ధనప్రవీణ
   అమలశబరికాఫలోపహారరుచిఘనాభిముఖ్య
   సమదవాలిదర్పదమనసఫలితార్కతనయసఖ్య
   శరణవరణపరపరానుజప్రదీపితప్రసాద
   అరుణితాక్షికోణవిరచితాంబురాశిగర్వసాద
   పర్వతౌఘరచితసేతుబంధసుతరసింధుకాండ
   గర్విపంక్తికంఠకంఠఖండనప్రచండకాండ
   సకలదివిజనుతచరిత్ర జానకీమనోజ్ఞగాత్ర
   సకరుణాతరంగనేత్ర సాధుభవలతాలవిత్ర
   యతిజపార్హపుణ్యనామ యతివితీర్ణభక్తకామ
   సతతసితయశోభిరామ సర్వలోకపూర్ణధామ
   అహితవిదళనాతిరౌద్ర యార్తపాలనావినిద్ర.
   మహితనిఖలగుణసముద్ర మమ్ముఁ బ్రోవు రామభద్ర 160

క. పరమం బగునీనామము
   కర మామ్నాయములు తారక బ్రహ్మముగా
   నిరతి న్వినుతింపఁగ నా
   తరమే మిము నభినుతింప దశరధరామా. 161

వ. అని వర్ణించి యచటు గదలి సేతుబంధంబునకుం జని యందు రామేశ్వరు బహుభక్తి
   విశేషంబులనారాధించి యనంత శయనంబున కరిగి యందు పద్మనాభునిం గొలుచుచు
   నతని సన్నిధిం గొన్నినాళ్లు దనదుగాంధర్వవిద్య హృద్యంబుగా నెఱపె. నేను గానప్రియత్వంబునం
   జేసి చెవియొగ్గి తత్తత్ప్రదేశంబుల నతండు పాడెడుపాటలు వినుచు దృష్టియుం బాఱ విడిచి యిది
   యంతయుం గనుంగొంటి నివ్విధంబున ననంత పద్మనాభునిసన్నిధినుండి యతం డంత 162

క. ఆపడమటిదిశ దళకళి
   కాపుష్పఫలాదిగరిమకతన సమీప
   శ్రీపకలాపమణీపట
   లీపటిమస్పర్థ వర్దిలెడువనవాటిన్. 163

క. హరిఁగూర్చి తప మొనర్పఁగ
   దొరఁకొనియెను దానఁ జేసి తోయజముఖి యా
   సరసునిగానకళామా
   ధురి యేమియు ననుభవింప దొరకదు నాకున్. 164

క. అని యాదిక్కునకు విలో
   కనములు నిగుడించి యదె నిగాఢపుఁబద్మా
   సన మునఁ గూర్చున్నాఁడో
   వనిత యిపుడు దృఢ సమాధివర్తన మీఱన్ .165

చ. అనుటయు నాలతాంగికడునద్భుతమింతయు నోమహాత్మమీ
    కనుఁగవ కిప్పు డిమ్మెయిఁ బ్రకాశతఁ దత్సకలప్రవర్తన
    ల్గనఁబడుచున్న వేయనినఁ గంజముఖీ యనుమానమున్న ని
    ప్డనుపుము దవ్వుగాఁజెలుల నచ్చటితత్క్రియలెల్లఁ జెప్పెదన్ 165

సీ. అనుడు మహాత్మ మి మ్మంత నే నొరయంగ
                      నర్హనే మీపల్కులందుఁ గలదె
    యనుమాన మనుటయు నైన నిందేమి త
                      ప్పిదియు వినోద మోయింతి యనుచు
    బలిమి నాయక చేతఁ జెలుల నిద్దఱిఁ గడు
                      దవ్వుగా నంపించి త్క్రియలును
    దద్వాక్యములుఁ జెప్పి తార్కాణచేసి యో
                      యబ్జాక్షి, యిది యెట్టు లట్టు లతని

గీ. తీర్థయాత్రయుఁ దపమును దేటపఱుప
     నొదవినపుడు గదా మదికొదవ దీఱు
     దూరతాతారతమ్యవిచార ముండు
     నేమొ లే దొక తెరు వది యెఱుక పఱుప 167

చ. అన విని యట్టి వేళ నికటావనిజంబున నున్న చిల్క యో
    యనఘచరిత్ర నీపలుకులం దొకచోట నసత్యశంక గ
    ల్గునె మును చెప్పినట్టికతలుం దలపోయ యధార్థము ల్మనం
    బున సరిదాఁకెనాకనినఁబుల్గుఁగనుంగొనియద్భుతంబుతోన్ 168

క. కలభాషిణి యి ట్లను నీ
   తలఁపున కెట్లు సరిదాఁకెఁ దథ్యము చెపు మో
   చిలుక మును పెచట నుండుదు
   తలపోయఁగ నీవు చతురతరమతివి కడున్. 169

సీ. అనుడు నాపక్షి యి ట్లనియె నోపూఁబోఁడి
                     నానివాసంబు నందనవనంబు
   వనజాక్షుడిచటికి మును పారిజాతంబు
                     దెచ్చుచోఁ దత్పక్షు లిచ్చ గలిగి
   మరలి పాఱుచునుండ మద్భార్య యవ్వేళఁ
                     బ్రసవార్త యైయున్కి బఱవలేక
   యె ట్లైన నయ్యె నే నిచటన యుండెద
                     నని యొక్కతొఱ్ఱలో నడఁగియుండె

గీ. వెనుకఁ దోడ్కొని పోవ నా కనువుపడదు
   పిల్ల లీఁకలు వచ్చి వర్ధిల్లుదాక
   నంతఁ బలుమాఱు వచ్చి రమ్మనుచు మిగుల
   నెత్తు లిడియెడునన్ను నాయింతి చూచి. 170

క. ఈభవ్యోద్యానంబుల
   సౌభాగ్యముగతిని మానసమునకుఁ గడు నిం
   పై భాసిల్లదు నందన
   వైభవమం దెట్లు ప్రేమ వదలదొ నీకున్. 171

గీ. అనుడు నీవనినట్ల యౌ నైన మనకుఁ
    గలుగుబంధువు లెల్ల నక్కడనె యునికి
    నచట నెఱయంగఁ బాయలే నని యొనర్తు
    రాక పోక లివ్వీటికి నాకమునకు.172

వ. అట్టియే నిప్పు డుప్పరవీధి నేఁగుచుండి మణికంధరుం డనుచు మీర లాడుకొనుమాట చెవింబడిన
    నతని సుద్ధి యిక్కడఁ గలుగుటకు నిమిత్తం బేమి గలిగెనో తెలిసెద నని నిలిచితి నీసిద్దుండు నీకుం
    జెప్పి నతీర్థయాత్రా తపశ్చర్యలవృత్తాంతంబు నిక్కువంబుగాఁ దెలిసినప్రకారంబు వివరించెద వినుము.

సీ. శచియును దాను వాసవుఁ డలనందన
                    వనములోనికి నేఁడు వచ్చియుండ
    నొకచారుఁ డే తెంచీ యో దేవ నే నున్న
                    వనములోనికిఁ దీర్థవాసి యొక్కఁ
    డిట కొన్ని నాళ్ళక్రిందట వచ్చి యచ్చోటఁ
                    దపముసేయఁగఁ బూనె దానికొలఁది
    యెఱుగునంతకు నేను నిన్నినా ళ్ళాలసిం
                    చితి నది నానాటి కతులమైనఁ

గీ. జెప్పవచ్చితి నతఁడు కాశీగయాప్ర
   యాగపురుపోత్తమాహోబలాదు లైన
   పుణ్యభూములు బహుతీర్థములును జూచి
   నాఁడఁట వచించె మొదల నే వేఁడుకొనఁగ. 174

ఉ. ఉగ్రతపఃప్రభావవిభవోద్ధతినుద్భవ మందెె నోసుప
    ర్వాగ్రణి యిప్పుడాతపసియౌదాలనిత్యజలావగాహని
    ష్ఠా గ్రహణాభిపాటలజటాపటలస్ఫుటలాలనాభృశ
    వ్యగ్ర సమగ్రదీప్తి నివహప్రవహద్దహనాంకురచ్ఛటల్ .

క. ఇది మాసాష్టకమున సి
   ద్దిద మిచ్చటి కెవ్వ రేఁగుదెంచి తపమునం
   బొదలినఁ జెప్పుము నా కని
   త్రిదశేశ్వర నన్ను నంపితిరి తద్వనికిన్. 176

క. అని చెప్పినఁ గలదు కలదు
   నిను నట్ల వచించి యందు నిలిపితి ననియా
   యనిమిషవిభుండు చారుని
   ననుపుచుఁ బిలిపించెె రంభ నచటికి వేగన్. 177

క. పిలిపించి యవ్వధూటికి
   నలఘుతరం బైనయట్టియాతపసితపో
   బలమెల్లఁ దాను జారుని
   వలనన్ వినినట్ల చెప్పి వాసవుఁ డంతన్. 178

ఉ. ఓలలితాంగి యీతపసి యుగ్రత నింత నితాంతదుర్గమా
    భీలతపోధురంధరతఁ బేర్చుట నాసురరాజ్యలక్ష్మిఁ దా
    నేలఁగఁ గోరి కావలయు నిప్పుడ దీనికిఁ బ్రత్యుపాయముం
    జాలఁగనెంచి చేయఁదగు సంశయ మంతయుమానునట్లుగన్ 179

క. చింత యొనర్పక యిది యొ
   క్కింత యుపేక్షించి యున్న నెట్లగునో గో
   రంతాలస్యంబునఁ గొం
   డంతప్రయోజనము దప్పు ననఁగా వినమే. 180

క. విను మిట్టిపనుల కెంతయు
   ననుకూలం బగుసహాయ మచ్చర లిపు డీ
   పని కరయ వారిలోనన్
   ఘనతరముగ నీకు నేర్పు గల దని తోఁచెన్. 181

సీ. కడు నల్లికలుగొనుకలికిబిత్తరపుఁజూ
            పులక్రొమ్మెఱుంగులు వలలు గాఁగఁ
    నెఱయంగఁ బర్వెడునిద్దంపులేనవ్వు
            తెలినిగ్గుతరఁగలు తెరలు గాఁగఁ
    గొమరొందునవవిలాసములకన్బొమ లులి
            వాడుచోపుడుగోల లగుచుఁ దనరఁ
    దేనె లుట్టెడుమాటతేటలపసలు వా
            కట్టుమంత్రంబుకరణి నమర

ఆ. నీవు గడఁగి యమ్మునీంద్రశార్దూలుత
    పోమహత్వదర్పమును హరించి
    కీరవాణి యతనిఁ గ్రీడామృగంబుగాఁ
    జేయవలయుఁ గుసుమసాయకునకు. 182

వ. అనిన విని యారంభ జంభ వైరింజూచి యమ్మునింద్రుండనఁగ నెవ్వాఁడని దేవరచిత్తంబున నున్నదియో
     యతండు నారదశిష్యుం డైనమణికంధరుం డని మాకు వినంబడియె నతని నిటమున్ను
     పరికించుచుండుదు మస్మదాదులవిలాసంబు లెవ్వియు నెన్నడును సరకుగొని చూచినవాఁడు
     గాఁడు నేఁడు విశేషించి తపశ్చర్యాతాత్పర్యంబునఁబ్రవర్తిల్లుచున్న వాఁడు గావున నవశ్యంబు
     దేవకార్యంబు నిర్వహింతు ననలేననుటయు నతం డవ్వాలుఁగంటిం జూచి నీకుఁ
     దొంటికంటె వయో రూపలావణ్యవిలాసంబు లెక్కుడుగ వరం బొసంగితి సందియంబు వలదు పొమ్ము
     కార్యసిద్ధి యయ్యెడు నీచాతుర్యమహిమంబు నెఱపుము. 183

క. అనుపలుకుల నలరించుచు
     ననుప మహాత్సాహ మాత్మ ననుపమలీలం
     దనర మణీభూషణములు
     దనరమణీయంగకాంతిఁ దద్దయు మెఱయన్ .184

క. నెచ్చెలులుఁ దాను ధరణికి
    నచ్చెలువ కృత ప్రయాణ యయ్యె నపుడ యా
    యచ్చరపదువుబెడంగు వి
    యచ్చరపదవికి మెఱుంగులై కనుపట్టెన్ .185

వ. అని చెప్పి దీనం జేసి యోకొమ్మ యిమ్మహాత్మునివాక్య

     పద్దతి యంతయు సత్యంబ యగుట యేర్పడియె నని పలికి యిట్లనియె.186

శా . ఏ నానందన మంతటన్ వెడలి యిం దేతెంచితిన్ మున్నుగా
     నో నారీమణి యిప్పు డేఁగెడువిధం బూంచినం దత్తప
     స్థ్సానం బింతకుఁ జేరఁబోవుదురు తద్రంభాదులు న్నావుడుం
     దా నాచిల్కవచోవిలాసమున కత్యంతంబు రంజిల్లుచున్. 187

సీ. అఖిలంబునందు సత్యంతంబు వెలసి వ
              ర్తిల్లెడుశుకసంజ్ఞఁ దేజరిలుచు
    నత్యుదారాగమాఢ్యవ్యాసనందన
              భూయోర్జితానందమునఁ దనరుచు
    ఘనపక్షవిలసనంబున హరితత్వంబు
              తెల్లంబుగాఁ జేసి యుల్లసిలుచు
    నరయ నైసర్గికం బైనవిష్ణుపదైక
              గతికత్వమునఁ జాల నతిశయిలుచు

గీ. నున్నయోచిల్క నీమధురోక్తి మహిమ
    వీనుల కమృతరసములు వెల్లిగొలుపు
    చునికి యుచితంబ మిగుల నీయోగవిభవ
    మింత యం తని పొగడ నే నెంతదాన. 188

క. కావున నినుఁ బెడఁబాయఁగ
   నోవిహగవరేణ్య కొలుపదుల్లం బైనం



ద్వీతీయాశ్వాసము.

111


జోవలయుఁగదా నీకును

సిననితం జూడ ననుచు నెలఁతుక యనిపెన్.189

ఉ: వాసుకిపూర్వజన్మకిటివర్యదిశాగజకచ్ఛపేంద్రనే
లాసుఖసక్తి తత్తదబలాహృదయాంతర సంతతాదరా
శాసితనిత్య భూభరణశక్తి లసద్భు జదండ కీర్తి సం
వాసితపద్మజాండ పరివర్ధితభూసుర కాంతిభాసురా.190


క: కృష్ణక్ష్మ నాయక శ్రీ
కృష్ణ ధ్యానామృతాబ్దిఖీలసలీలా
తృష్ణ జ్ఞాననయావహ
ధృష్ణదాహాబలావధీరతభీమా,191

మంగళమహా శ్రీ.

శీలితశుభాచరణ శిష్టజనతాశరణ

చిత్త విజయాభరణ యుద్ధా

భీలభుజవిస్ఫురిత భీరుదనయత్వరిత

ప్రేమపదసచ్చరిత భావా

లోలకరుణాసహిత లోకభరణావహిత

లోభకలనారహిత విద్యా

ఖేలనసముచ్ఛ్వసిత కేవలసుఖోల్లసిత

కేశవనుతిప్రసితధీరా.192


గద్య. ఇదినిఖిలసూరిలోకాంగీకారతరంగితకవిత్వవైభవ

పింగళియమరనార్యతనూభవసౌజన్యజేయ సూరయ

నామధేయప్రణీతం బైనకళాపూర్ణోదయం బను

మహాకావ్యంబునందు

ద్వితీయాశ్వాసము.