కన్నీటి కెరటాల వెన్నె లేలా?

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


కన్నీటి కెరటాల వెన్నె లేలా?

నిట్టూర్పు గాడ్పులో నెత్తావి యేలా?

ప్రళయకాల మహోగ్ర భయద జీమూ తోరు

గళ ఘోర గంభీర పెళపె ళార్భటులలో

మెర పేలా?


ఆశనిపాతమ్ముతో నంబు వేలా?

హాలాహలమ్ములో నమృత మేలా?

ప్రబల నీరం ధ్రాభ్ర జనిత గాఢ ధ్వాంత

నిబిడ హేమంత రాత్రీ కుంతలములలో

చు క్కేలా?


శిథిల శిశిరమ్ములో చివు రేలా?

పాషాణపాళిపై ప్రసవ మేలా?

వికృత క్రూర క్షుధా క్షుభిత మృత్యు కఠోర

వికట పాండుర శుష్క వదన దంష్ట్రాగ్నిలో

న వ్వేలా?


కన్నీటి కెరటాల వెన్నె లేలా?

నిట్టూర్పు గాడ్పులో నెత్తావి యేలా?