కథలు - గాథలు/యెనిమావల్ల కడుపు తేలికపడ్డట్టే సినీమావల్ల యిల్లుతేలికపడుతుంది

వికీసోర్స్ నుండి



"యెనీమా"వల్ల కడుపు తేలికపడ్డట్టే సినీమావల్ల యిల్లుతేలికపడుతుంది

సినీమా పేరు వినబడడం ప్రారంభమై మూడు పుష్కరాలు దాటిందనుకుంటాను. అంతకు పూర్వం యివి లేకపోలేదుగాని "తోలుబొమ్మలు" అనే పేరుతో వున్నాయి. 10 గాని, 5 గాని రూపాయిలిస్తే రామాయణమో? భారతమో? (అంతాకాదు) ప్రధానభాగం వినికి చేసేవారు. వొంటెద్దుబళ్లు తుట్టతుదకు మోటార్లుగా మాఱినట్లే నాగరికత హెచ్చిన కొలదిని ఆ తోలుబొమ్మలు యీ విధంగా - అంటే "సినీమాల"గా మాఱిపోయి లోకానికి ఉపకారమో, అపకారమో చేస్తూన్నాయి. మొట్టమొదట ప్రసిద్ధమైన పట్నాలలో యేవొకటో వుండేది ప్రదర్శించే హాలు; అప్పటికి వట్టిబొమ్మలే కనబడేవి. అభినయంకూడా కనపడేది. వాక్కులేదు. అందుచే యింతగా జనం విరగబడేవారుకారు. చిన్నతనంలో నేను "తోలు బొమ్మలాటలు" చాలా చూచినవాణ్ణి అవడంచేత "అదే యిది" అనే ఉపేక్షా బుద్ధి కలగడంచేత ఆయీ ఆటకు వెళ్లడమందు యిచ్చకలిగిందేకాదు. ఆ స్థితిలో యెవరో బలవంతపెట్టి తీసుకువెళ్లి కూర్చోపెట్టడం జరిగింది. కాని నాకేమోగాని విశేషాదరం కలుగనే లేదు. యీ మహాప్రపంచంలో సర్వులూ భార్యలతో (ఘోషాకూడా త్యజించి) పిల్లలతో పిల్లులతోకూడా (కొందఱు యింటికి తాళం పెట్టికూడా అన్నమాట) వెళ్లిచూచి ఆదరిస్తూవుంటే నా బోటికి దానియందు ఆదరం కలక్కపోతే అది గణనీయంకాదు. కాని అంతోయింతో విద్యాప్రవేశం వున్న నన్ను ఆయీ సినీమా యెందుకు ఆకర్షించలేక పోయిందో? సుంత విచార్యం కాకపోలేదు! దీన్ని యిలా వుంచుదాం. ఆ యీ విషయంలో నేను కనిపెట్టింది కొత్తవిషయం వొకటి వుంది, యెప్పటికప్పుడు యేదో క్రొత్త నాటకం కల్పించడమనేది సామాన్యంకాదు. యిప్పటికి కొన్ని వందలేనా కల్పింపబడి వుంటాయి యీబాపతునాటకాలు. రోజు 1 కి మూడు ఆటలు వేసినా పట్నం 1 కి పది సినీమాశాలలు వున్నా అన్నింటికీ అన్నిఆటలకీ సమృద్ధిగా "ఆడియన్సు" వెడుతూనే వున్నారు. పైగా టికట్టు దొరక్క తిరిగి వచ్చే ప్రజ కనపడడంచేత యీ “సినిమాల గౌరవాన్ని వ్యక్తపరుస్తూ వుంది. కృష్ణా పత్రిక యెంతో ఆవశ్యకమైన విషయమైతే తప్ప ప్రచురించదని వినడం. ఆయీ విషయం తఱచుగా ఆ పత్రిక ప్రచురించి విమర్శిస్తూ వుంటుంది. అట్టి విచిత్రమైన విషయంలో నాకేమో బుద్ధి తగులుకోనేలేదు. మా చిరంజీవులు అప్పడప్పుడు దీని ప్రాశస్త్యాన్ని గూర్చి ప్రసంగించి ప్రశంసిస్తూంటారు. అయినాసరే నా ಬುದ್ಧಿ మామూలుగానే వుంది. యిది పలువురు స్త్రీలకు (ఆటపాటల నేర్పున్నవారికన్న మాట) పురుషులకు విపరీతంగా ధనం పంచిపెడుతూవుంది. యెందఱో దీనివల్ల లాభం పొందుతూ వున్నారు. యింతవఱకు దీన్ని యెవరుగాని కాదన్నవారు లేరు. అయినా సరే నా ಬುದ್ದಿ మాఱుపుంతలోనే నడుస్తూవుంది. యీ మధ్య యెవరోచెప్పగా విన్నాను.

మా పట్నంలో యింకో సినీమాహాలు వెలుస్తూవుంది అని. ఆమాట విన్నప్పుడు నాకీ క్రిందివాక్యం యెప్పుడో నలభైయేళ్లకు మున్ను విన్నది కాదుకాదు బుద్ధిరాజు ఈశ్వరప్పగారు ఆనాటిపత్రికలలో హాస్యప్రధానంగా వ్రాసింది జ్ఞప్తికి దగిలింది. ఆవాక్యం యిది.

"వచ్చే వత్సరం మావూళ్లో యింకో కల్లుదుకాణం పెట్టిస్తారట" నా ಬುದ್ದಿ వీట్ల విషయంలో యీ విధంగా వుండడాని కేం కారణమో యింకా విచార్యమే. అంతో యింతో ధనంకూడా ఆయీ సినీమాకారణంగా నాకు వచ్చిందికూడాను. అయినాసరే దీన్ని నామనస్సు ఆమోదించడంలేదు. ఆ యీ విషయంలో యితరులమాట ఆలా వుండగా కవులలోనేనా నాతో యేకీభవించే వారుంటారో వుండరో వోటుకు పెడితే పుస్తకాపేక్ష కనక అందుకు సాహసించేదిలేదు. యీవిషయంలో నాబుద్ధి

"వూరంతా వొకత్రోవా, వులిపికట్ట వొక త్రోవా," అనే సామెతకు ప్రథమోదాహరణంగా నాకే కనపడుతూ వున్నప్పుడు యితరులకు కనపడడంలో ఆశ్చర్యంలేదు. అద్భుత విషయాలలో విచారిస్తే పరమాద్భుతం రేడియో కాని సినీమాకాదు. అర్థంలో అంతగా పోలిక లేకపోయినా శబ్దంలో "యెనీమాకీ" దీనికీ పోలిక కనపడుతుంది. యేలాగంటే! యింటికి తాళంపెట్టి యావన్మందీ దీనికోసం వెడితే దొంగలు ప్రవేశించి యిల్లు గుల్లచేసినట్లు కొన్ని వార్తలు వినవస్తున్నాయి. వొకానొక గృహస్టు కొడుకు ఆ దొంగలింకా ఇల్లు వదిలి వెళ్లకపూర్వమే, వచ్చి వాళ్లతో కలియబడి హతుడైనట్లు కూడా విన్నాను. అయితే రైలుగాని, విమానంగాని, యెక్కియెవరో వాట్లకు ప్రమాదం వచ్చి హతులైనారన్నంతలో ఆ ప్రయాణాలే మానుకుంటారా? కనక అంతమాత్రంచేత యీ విషయంలోకాదర పాత్రం కాకపోదు. దీనివల్ల పుణ్యపురుషుల చరిత్రలేమి, పతివ్రతల చరిత్రలేమి, చదువురాని పామరులకుకూడా సుళువుగా బోధపడతాయి. కాని సుప్రసిద్ధ పురాణగాథలు- “సినీమా కవుల” స్వకపోలకల్పనలవల్ల యేదోవిధంగా మాఱిపోతూ వుండడం శోచనీయం. అది అలా వుంచుదాం. సుమారు అయిదాఱేండ్లనాడు కాంగ్రెసు మంత్రులు- “మద్యపానము” నిషేధించారు. దానికి ముఖ్య ప్రయోజనం, కూలీ నాలీ చేసుకొని జీవించేవాళ్లు యింట్లో పెళ్లాం బిడ్డలకు అన్నంలేకుండా తెచ్చికొన్నకాస్తా త్రాగుడుకింద వినియోగిస్తున్నారు. కనుక దీన్ని నిషేధిస్తే ఆలాటి సంసారులు కొంత సుఖిస్తారని చెప్పివున్నారు. ప్రస్తుతం బీదలే విశేషించి దీనికి హాజరయ్యేవాళ్లు. కనక దీన్ని నిషేధిస్తే దానితోపాటు కొంత బీదలను సంరక్షించినట్లవుతుందేమో అని నేననుకుంటాను. యేపల్లెటూరునుంచో సకుటుంబంగా దీన్ని చూడడానికి వచ్చే సంసారులు చాలా భాగం వుంటారు. వారికి బళ్లు స్వంతంగా వుంటాయి. వాట్లమీద ప్రయాణం చేస్తారు, వచ్చేది పట్నవాసం కనక అవసరం వున్నా వుండకపోయినా యేదో సామాను కొంత కొంటారు ఆడవాళ్లు. సినీమా ఖర్చు కొంచెమే అయినా ఆ యీ ఖర్చు దానికి యెన్నిరెట్లో తగులుతుంది. ఆ యీ సినీమావల్ల “దుర్నీతి" సునీతికన్న మిక్కిలి అభివృద్ధి అవుతూవున్నట్లు గోచరిస్తుంది. మాటవరసకి– “మాలపిల్ల సినీమా వుందికదా? దానివల్ల నేర్చుకోవలసింది "దుర్నీతి" అందామా? సునీతి అందామా? కొడుకు, వాడికి నచ్చిన కన్యకను వరించి తీసుకువస్తే తండ్రి ఆమోదించవలసిందనేనా? దానివల్ల తేలేఫలితార్థం. ఆయీ సినీమా నోరులేని బ్రాహ్మణ జాతిని అవమానించేది కనక సాగిపోయింది, ఆలాగే కాక మతాభిమానంగల యే మహమ్మదీయులకో, క్రైస్తవులకో యిబ్బంది కలిగించేదే అయితే మఱునాడే నిషేధం తగిలేదే. నాటకరచనలో రసాన్ని భంగించే విషయాలు వుంటే, ఆ విషయం తొలగించి రసానుగుణంగా కథాకల్పన చేయడం సమంజసమని లక్షణ కర్తలు నిర్వచించారు. మచ్చు చూపుతాను, ద్రోణవధ ఘట్టంలో ధర్మరాజు "అశ్వత్థామ హతః" అని అవసరాన్ని బట్టి అబద్ధం ఆడివున్నాడు. దీన్ని వున్నట్టే ప్రదర్శిస్తే ప్రేక్షకులు దుర్నీతిపరులై చెడిపోతారు కనక- "అన్యాధావా ప్రకల్పయేత్" అనే లాక్షణికోక్తినిబట్టి మార్పుచేయడం యుక్తం. యిప్పడు సినీమాలో మార్చేమార్పులు యిలాటివికావు. “పోతన్నగారు” అభిమానశాలి, అయాచకుడు, గర్భవ్యావసాయకుడు, శ్రీరామభక్తుడు అని మాత్రమే కవి పరంపర చెప్పకోవడం. సినీమాలో “అఖండ దాత" అని చిత్రించారు. యిది సుగుణమే అయినా యిట్టి ప్రతీతి లేకపోవడంచేత రుచించదు. యెన్నోయీలాటి వున్నాయి. విస్తరించేదిలేదు. వీట్లవల్ల చరిత్రవిజ్ఞానం పూర్తిగా తబ్బిబ్బవుతూ వుంది. అన్నిటికన్నా మొగుడుతో చెప్పకుండా పెండ్లామూ పిల్లలూ యింటికి తాళంవేసి హాజరవడమనేది ఆర్యుల కుటుంబాలకు బొత్తిగా రుచించేదికాదు. "స్త్రీ స్వాతంత్ర్యం" దీనివల్ల పూర్తిగా వ్యాపిస్తూ వుంది కనక పాశ్చాత్యాపచార వాసన వంటబట్టిన వారికి యిది బాగా రుచించినా ముదుసలి తాతలకు యేదో వెగటుగానే కనపడుతుంది. “విడియాకులు” వగయిరా నూతనాచారాలు అచిరకాలంలో రానైవున్నాయి కనక, దానికియిది "ట్రయినింగు" స్కూలుగా పరిణమించుననడానికి నాకులేశమూ సంశయము కనపడడంలేదు. యేవిధంచేత చూచినా సామాన్యగృహస్టుల జీవనం చాలా దుర్భరంగా మాఱడానికి నూతననాగరికత కారణంగా కనపడుతూవుంది. ప్రతివృత్తికీ అడ్డంకికల్గింది. తుదకు క్షౌరంచేసుకొని జీవించే జాతికికూడా అడ్డంకి. అనగా యేదోదానికి విశ్వామిత్ర సృష్టి యేర్పడింది. చిత్రంగా ప్రపంచం మారిపోయింది. ప్రతీదీ మనకి అలవాటయేవఱకూ తేలికధరలో యేర్పడుతుంది. అందులోకి తియ్యనీటి చేపలాగు అలవాటుపడతాం. తరవాత దాని వెల యెంత పెంచినా దాన్ని మనం మానలేం. దీనికి యెన్నో వుదాహరణాలు చూపవచ్చు. పోస్టుకార్డు చూచుకోండి 3 పైసలు మొదటవుండేది. యిపుడు మూడురెట్లు పెరిగింది. తుదకు మూడు రూపాయలదాఁకా పెరిగినా దాన్నిమానలేము. యీ కార్డులు లేనికాలం మనం యెఱుగం. కాని మనతాత ముత్తాతలెఱుగుదురు. వారు తాటాకులతోటే కష్టించి గ్రంథాలు వ్రాసుకొని చదువుకొని మహాపండితులైనారు.

“పుస్తకేషు చ యావిద్యా" అన్న యోగం మనకు పట్టింది. వారి పాండిత్యమో? “వాచోవిధేయం” పైపై మెఱుఁగులు చూచి భ్రమించే వారికి సమాధానం చెప్పలేంగాని ఆ వెనుకటికాలం మళ్లావస్తే చూదామనుకొనే నాబోటి "చేదస్తులు" అక్కడక్కడ యింకా వుండకపోరుగాని ఆ కాలం “భద్రముగలనాటి రోజు లిఁకరా విఁకరా విఁకరావు నెచ్చెలీ!”

మ. అనుమానింపక కల్పనారుచులపై నాసల్ పిసాళించు నెమ్మనమున్.

త్రిప్పుట పెద్దపెద్దలకే వశముకాదు. అట్టిస్థితిలో సామాన్యులను గూర్చి చెప్పేదేమిటి. యేదో “సినీమాను” గూర్చి వ్రాస్తూ చాలాదూరం వచ్చాం, యెందుచేతో యిది నన్ను ఆకర్షించిందికాదు. కారణం గోచరించలేదు. బహుశః వార్ధక్యమే అనుకుంటాను.

క. కూరిమి విరిగిన సతిపై
   నేరమి దోcచుగతి విషయ నిస్పృహమతి యై
   కోరిక లుడిగినవానికి
   నూరక విశ్వమ్ముపైని నొల్లమి వుట్టున్?
                 (కవికర్ణరసాయనము) - స్వస్తి


★ ★ ★