కథలు - గాథలు (చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి)/ఆచారభేదాలు

వికీసోర్స్ నుండి

ఆచారభేదాలు

పూర్వకాలంలో కఱవులు వచ్చాయంటే వాట్లకు కారణం వర్షాలు కురవకపోవడం అనుకొని వారుణ జపాలు చేయించడమూ, సహస్రఘటాభిషేకాలు చేయించడమూ యీరీతిగా రాజులు ఆ రోజుల్లో దైవాన్ని నమ్మి దేవతారాధనలు చేసి ఆ వుపద్రవాన్ని తొలగించుకునేవారు - విరాటపర్వం యేకదీక్షగా ఉదయంస్నానం చేసుకుని పారాయణ చేయడంకూడా వర్షాన్ని కురిపించేది.

నా విద్యార్థిదశలో కిర్లంపూడిలో మాగురువుగారూ మేమూ ఆసంస్థాన వార్షికానికి వెళ్లినప్పడు ఆ సమీపగ్రామం గెద్దనాపల్లి కాపురస్థులు ఆయీ పారాయణనిమిత్తం మీ శిష్యులలో యెవరినేనా వొకరిని పంపవలసిందని కోరితే విద్యార్థులలో అల్లులలో మల్లుగావున్న నన్ను పంపించారు గురువుగారు. చెఱువువొడ్డున కూర్చుని పారాయణ చేసేటప్పటికి యెక్కువగా కాదుగాని వొక అఱదుక్కి చినుకులు వెంటనే (తిడితే గుద్దినట్టు) పడ్డాయి. యదనంతరన్యాయంచేత ఆ వర్షం నా పారాయణకు ఫలితంగా ఆ వూరి గృహస్థులు భావించి నన్ను సత్కరించారు.

నేను యేడెనిమిదేళ్ల వయస్సులో వుండగా వొక కఱువువచ్చింది. దాన్నే ధాత యీశ్వర కఱువుగా ఇప్పుడు మనవాళ్లు చెప్పుకుంటారు. రు.1 టికి పదిమానికలు అంటే పది సేర్లుబియ్యం ఇచ్చేవారు. ఆ కాలానికదే పెద్ద కఱువు. కాలం బాగుంటే రు.1కి అయిదూ ఆఱూ కుంచాలుబియ్యం యిచ్చే ధర్మకాలంగదా అది? పంటవిస్తరించి పండేటట్టయితే యెక్కడి ధాన్యం అక్కడే ముక్కిపోయే రోజులు అవి. సుమారు పుట్టెడు నువ్వులు మాతాలూకు కొనేవాళ్లు లేక నుసికావడం నా చిన్నతనంలో నేనే యెఱుగుదును. బందరులో స్కూలుపండితుడుగా వుండేరోజులలో వేసంగి సెలవులకు గుడివాడమీదుగా నూజివీడు రైలు స్టేషనుకు (అప్పటికింకా బందరురైలు తయారు కాలేదు) ప్రయాణంచేస్తూ చోరభయంచేత యేవూరుదగ్గఱ పొద్దుగుంకితే ఆ వూళ్లోనే మకాం చేయవలసివచ్చేది. కానుమోలు వగయిరా వూళ్లుకొన్ని ఆ రోడ్డున తగిలేవి. అక్కడ వంటచేసుకోవలసివచ్చేది. మజ్జిగ కొనుకోవడానికి సంసారుల వీధికి వెడితే అమ్మకానికి దొరికేదేకాదు. కావలిస్తే వూరికే పోస్తామనేవారు ఆ సంసారుల ఆడవాళ్లు. ఆ వూళ్లన్నీ యీకఱువు రాకకు పూర్వమే మాఱిపోయాయి. యిప్పుడు చెప్పనే అక్కఱలేదు. కొందఱు రైతు గృహస్థులు రైలుస్టేషనుల దగ్గఱకి తమ నౌకర్లద్వారా మంచి మజ్జిగ దాహానికి పుణ్యంకోసం సమీప స్టేషనులకు పంపడం వుండేది. యివన్నీ యీ యుద్ధపు కఱువుకు పూర్వమే అంతరించాయి. మనకి కఱువంటూ రావడం యే యాభైయేళ్లకో లేక పోలేదుగాని దాని క్కారణం వర్షాభావమే.

పురాణాల్లో ద్వాదశవర్షక్షామాలు వినపడతాయి. గౌతమమహర్షి ఆలాటి క్షామాన్ని గాయత్రీ మంత్రజపం మూలంగా జయించి తన ఆశ్రమాన్ని తంజావూరు సత్రంగా మార్చినట్టు దేవీభాగవతంలో ఉంది. నివారణ యేలాజరిగినా రావడాని క్మారణం వర్షాభావమే. వొకటి రెండేళ్లు పుష్కలంగా వర్షాలు లేక పంట బాగా పండకపోయినా మన మాతృదేశం తన బిడ్డల్ని పోషించుకోగలదుగాని బ్రహ్మరాక్షసిలాగ మన పాలిటికి రైలువచ్చిపట్టుకుంది. అయితే రైలువల్ల యెన్నో సదుపాయాలున్నాయిగదా? అది లేకపోతే బతకడం యెలాగ అంటారేమో? అది లేని రోజుల్లో బతికినవాళ్లే మన తాత ముత్తాతలు. అదేకాదు-తుదకు సిగరెట్లు లేదా సబ్బులు లేదా! టీ, ఇంకా యెక్సెట్రాలు యేవీ లేకపోయినా మన బతుకు పుస్తకాపేక్షే మన తండ్రులలో పలుమంది ఆ రైలు యెఱుగని వాళ్లే యెంత వర్షం కురిసినా యెంత పంట పండినా ఆ బ్రహ్మరాక్షసి యెక్కడికో పట్టుకుపోయి మాయం చేస్తుంది. అందుచేత “సాహెబుకు సవారాజ్యం అబ్బినా బీబికి కుట్టుకాడలే" అనే సామెతకు మనం గుఱికావలసిందే.

పూర్వపు కఱువల్లావొక్క బియ్యానికి మాత్రమే. కట్టుకోవడానికి గుడ్డలు లేవని విన్నట్టులేదు. యింకా అపరాలు లేకపోవడమూలేదు. పాశ్చాత్య నాగరికత బాగా వ్యాప్తిలోకివచ్చి యాభైయేళ్లకంటె ఎక్కువ కాలేదు. క్రమంగా దేశం యేవిధంగా తయారయిందంటే? సర్వత్రా- (1) కాళ్లువున్న కుంటివాళ్లూ, (2) కళ్లువున్న గుడ్డివాళ్లూ యీ విధంగా తయారయింది. సావిట్లోనుంచి వంటయింట్లోకి తిండికి పోవలసివస్తే సైకిలు వుండవలసిందేకదా? అయితే సైకిళ్లు, మోటార్లు వగయిరా యంత్రాలవల్ల వున్న లాభాలు వదిలిపెట్టి యేదో స్వల్పదోషాన్ని బయడపెట్టడము న్యాయమా?- అంటే వినండి!

లాభాలు ప్రత్యక్షంగా కనపడుతూవుంటే నేను లేవనగలనా? లౌకికంగా సంచరించే టీచర్లు వగయిరాలకే కాదు - పల్లెటూళ్లలో పైల కాపర్లుకూడా సైకిలుతోనే నడకసాగిస్తూ వున్నారు. ఆఖరుకర్మ చేయించే పురోహితులు పట్నాలలో దీనిద్వారా యెక్కువలాభం (తహసీల్ దారీ జీతం) పొందుతూన్నారు; యెఱుగుదును. కాని ఆయీ సాధనాలు వుపకారంకంటె అపకారాన్ని యెక్కువచేసినట్టు కనపడుతూ వుందంటాను. నేడో, రేపో - మన భారతదేశం క్షామదేవతకు గుఱికావలసి రావడం ఆయీ సాధనాలలో రైలుమూలాన్నే అని తోస్తుంది. దీని బారినుండి తప్పించుకోడానికి కొందఱు చెప్పే వుపాయం - ముఖ్యంగా సంతాన నిరోధము. ఆ వుపాయము చెప్పినవారు పాశ్చాత్యులే. ఆ వుపాయము వల్ల పుట్టబోయే సంఖ్య తగ్గుతుంది. కాని యిప్పటికే పుట్టిన వాళ్లగతేలాగ? రైతులకు నాలుగు డబ్బులు కనపడడమే కావలసింది. షావుకార్లకు వర్తక లాభమే కావలసింది. యింకో విశేషం : వీరికి రేపు కూడులేక చచ్చేవాళ్లలో మనంకూడా భాగస్వాములం కావలసి వస్తుందనే వివేచన వున్నట్టే లేదు. రైతు తనమట్టుకు నిలవచేసుకుంటాడే అందాం. తన చుట్టుపట్ల కొంపల్లో వాళ్లకు డబ్బుక్కూడా పదార్థం దొరకనప్పుడు ఆ సంసారిని వీళ్లు మెక్కనిస్తారా? అందుచేత వెల హెచ్చుగా అమ్మే పద్ధతినేనా రైతులు షావుకార్లకు యివ్వక తమ వూళ్లోనే నిలవచేస్తే బాగుంటుందిగాని అట్టివివేకం రైతులకు వున్నట్టులేదు. అందుకే ప్రభుత్వం కలుగజేసుకోవడంగాని, లేకపోతే యీ పరిశ్రమ ప్రభుత్వానికి తగిలేది కాదు. అయితే సాక్షాత్తుగా పెద్ద అధికార్లు అవాంతరంగా జరిగే మోసాలు కనిపెట్టడానికి అవకాశం వుండదు. యెన్నో మోసాలు జరుగుతాయని మాత్రం వారికి తెలుసు, అక్కడికి ఆ మోసగాళ్లకోసం యేదో ఒక వల తయారుచేశారు. ఆవలవల్ల ఆర్జించిన ఆర్జకులకు నష్టి కలిగినా సామాన్య ప్రజకేంలాభం? గతంలోవలె కాక యికముందు క్షామం రాబోతుంది అని కనిపెట్టి నివారణోపాయాలు వెదుకుతూవున్నారు. వేరుశనగపిండి దగ్గఱనుంచి ఆహారానికి వుపయోగించ వలసిందన్నారు. యింటి దొడ్ల దగ్గఱనుంచీ దున్ని పండించవలసిందన్నారు. తినగలిగితే గడ్డిక్కూడా అభ్యనుజ్ఞ వుంటుందో వుండదో కనుక్కోవాలి. యేం జరుగుతుందో? తుదకు జనాభా పెరగడం కారణంగా భావించి సంతానం ఆపవలసిందనే వారి వూహ. ఆపాతరమణీయంగా కనపడినా నిన్న మొన్నటిదాకా సరిపడి హఠాత్తుగా తన బిడ్డలను పెంచుకొనే శక్తి భారతమాతకు తగ్గిపోవడం అనుభవవిరుద్ధం కనక దీనికి కారణం రైలుద్వారా జరిగే యెగుమతులే కాని అన్యంకాదు. ప్రతీదీ ఒకదానికి లాభంగా వుండేది వేఱొకదానికి నష్టిని కలిగించడం సహజం. ‘బాబుకు పెళ్లి అయిందని సంతోషిస్తే సవతితల్లిరావడానికి విచారించవలసే వస్తుంది."

లోకం యావత్తు తియ్యనీటికి చేపల మాదిరిని పాశ్చాత్యనాగరికతకు అలవాటు పడింది. కుంకుడుకాయలు వాడకం తగ్గింది. ఆ స్థానంలో చాలాభాగం సబ్బు ప్రవేశించింది. చల్దివణ్ణం నాగరిక కుటుంబాల్లోనే కాదు కూలీనాలీ చేసుకునే నిమ్నజాతుల కుటుంబాల్లోనూ నూటికి తొంభైపాళ్లు లోపించింది. ఆ స్థానానికి కాఫీ లేదా, టీ ఆదేశంగా ప్రవేశించింది. పైలకాపు కుర్రలదగ్గిరనుంచీ పొగాకు చుట్ట కాల్చడానికి బదులు సిగరెట్లు వ్యాపించాయి. ఆశ్చర్యం వేస్తుంది. సాలుకు పాతికో ముప్పయ్యో రూపాయలు వ్యయించి యే దినపత్రికనో తెప్పించుకుంటే దానిలో చెరిసగం, సిగరెట్ల అడ్వర్టేజుమెంటో, లేదా సబ్బు అడ్వర్టేజుమెంటో తప్ప యితరం కనపడదు. సబ్బుదానిలో తారలు కనపడతారు. చూచి యువకులు ఆనందిస్తారు. అందుకుగా వ్రాసిన మాటలకు అర్థం తెలుస్తుంది. కాని సిగరెట్లదానిలో వుండే బొమ్మలకు, అర్థం మాబోట్లకు గోచరించదు. రేషనింగు బియ్యానికి పెడుతున్నారు గాని సిగరెట్లకు పెడుతూవున్నట్టు ෂීක. దారిద్ర్య కారణంచేతనూ కరువు చేతనూ ఆరోజు కడుపుకు అన్నం లేకపోయినా సినిమా ఖర్చు తప్పదు. గాంధీగారు రాట్నం వొడుక్కోవడాన్ని బోధిస్తారుగాని సినిమాఖర్చు తగ్గించుకోండని గాని సిగరెట్లుమానండని కాని బోధించరు. అంతమాత్రంచేత మహాత్మునికి ఆ యీ దుర్వ్యయాలిష్టమనికాదు. ఆయన బోధించే విషయాలన్నీ సంసారుల శ్రేయస్సుకు వుపకరించేవే కాని వినేదెవ్వరు? అందులోనల్లా వొక్క అస్పృశ్యతను గూర్చిన బోధ మాత్రమే అమల్లో పెడతారని తోస్తోంది. యెందుచేతంటే? దానికి చేతిడబ్బువదలదు కనుక. భగవంతుడవతరించి బోధించినా యీ దేశానికి మంచిరోజు లున్నట్టు తోcచదు.

మొదటి యుద్ధానంతరం ఫ్రాన్సు దేశంలో జనాభా తగ్గిందనే కారణముచేత, దాన్ని పూర్తిచేయడానికి ఆడవాళ్లందఱూ సంతానం (ఏవిధంగా నేనాసరే) కనితీరవలసిందే అని శాసనం చేశారు. పాపం? అంతకుమున్ను మతవ్యాప్తిన్నీ ధర్మవైద్యమున్నూ చేసే బ్రహ్మచారిణులు (నన్సు) దేశం వదలిపోనేనాపోవాలి. లేదా సంతానమేనాకనాలి. అని చెప్పుకున్నారు. కొందఱు స్త్రీలు కేవలం గొడ్డుతాళ్లుగానే సృజింపబడతారు. అనేకులతో చుట్టఱికం వుండిన్నీ ఆబాపతు స్త్రీలు "పద్మపత్రమివాంభసా” అన్న గీతా వాక్యానికి వుదాహరణంగా వుంటారు. యీలాటి కఱువులుకోటి వచ్చినా వాళ్ల భర్తలకు చిక్కులేదు. యెప్పటికీ లింగీలింగడే గదా? ఆ శాసనం ఆ స్త్రీలపట్ల యేలా అమలు జరిగిందో తెలుసుకోలేదు.

మన భరతఖండంలో యే యే ఆచారాలు హేయంగా మనం భావిస్తామో, అవసరమయితే అవన్నీ యూరపుఖండం నిరాఘాటంగా ఆమోదిస్తుంది. ఆఖండవాసులతో యీ ఖండవాసులు దేనికీ పోటీచేసి నెగ్గలేరు. యీ ఖండం యెప్పటికేనా బాగుపడాలంటే వారి నాగరికతకు వొకదణ్ణం పెట్టి వర్తించడమే మార్గం. ఆయీ మాటకు యితర లోకులమాటల్లా వుండగా యింట్లో పెళ్లాంబిడ్డలే చెవి వొగ్గరు. వారు మనకు-స్వరాజ్యం యిచ్చి యేలుకోండని దూరంగా కూర్చున్నా - వారినాగరికత మనమీద అనుగ్రహించి దూరంగా తొలగితేనే తప్ప మనం బాగుపడం, వారికి నామకః మతమంటూ వున్నప్పటికీ క్షణంలో వారు దాన్ని త్యజిస్తారు. ఆచారవ్యవహారాలలో ఉత్తరధ్రువానికీ దక్షిణ ధ్రువానికీ వున్నంతదూరంగా పైకి కనపడినా మనతోపాటు మతవిశ్వాసం కలవాళ్లు మహమ్మదీయులే. నిన్న మొన్నటిదాకా రష్యాలో దేవుడు లేడు; నేడు మళ్లా వున్నాడని వినవస్తూవుంది. యెల్లుండి మళ్లాఉండడు. ఆవలెల్లుండి వుంటాడు. "మదధీనా తవస్థితిః" అని ఎవరో ఆచార్యపురుషులు దేవుణ్ణిగురించి - అన్నారంటారుగాని అది యూరపుఖండంలో చాలా కాలంనాడే అమలుజరగడానికి ఆరంభించింది. కొన్నాళ్లు ముస్సోలినీ దేవుడు, అంతకంటేకూడా పెద్దదేవుడు. హిట్లరు. గుఱ్ఱపు జట్కావాడు బాగా నడిచే తన గుఱ్ఱాన్ని హిట్లరు పదంతోటి వాడేవాడు. మీసాన్ని గుఱించి చెప్పేదేమిటి? హిట్లరు అంతరించినా ఆ మీసాలు కనబడుతూ వున్నంతకాలం అతడు వున్నట్టే. నాజీజం నశించినా ఆ మీసం నశించదు. యే కాలంలోనూ నేటి భారతీయులవంటి ప్రజలు వున్నట్లు గ్రంథ దృష్టాంతం కనపడదు. ఆడవాళ్ల నాగరికత యెన్ని వెఱ్ఱితలలువేసిందో వేసింది. యిప్పటికి సుమారు యిరవైయేళ్ల నాడు "యజ్ఞోపవీతం బుజ మెక్కు జందెం" దగ్గిఱికివచ్చి రవికె గౌరవం నిల్చింది. యిది యేదేశాన్నుంచి రవాణా అయిందోగాని పాశ్చాత్య నాగరికతబాపతుకాదు. వారిది చలిదేశం. వొంటినిండా బట్టలేనిదే బతకలేరు. కఱవును గూర్చి వ్రాస్తూ మాఱుపుంతలోపడ్డాం.

ధాన్యం పుష్కలంగా మనకు పండినా అన్ని ఖండాలూ పండితే తప్ప మనకు కఱువు తగ్గదు. వర్షాభావంచేత ధాన్యం వగయిరాలు పండ లేదుకనక వాటివెల హెచ్చిందను కుందాం. తోళ్లవెల యెందుకు హెచ్చాలి? సినీమా టికట్టువెల యెందుకు హెచ్చాలి. నల్లమందువెల యెందుకు హెచ్చాలి? భోగంమేళాల వెలదగ్గిరనుంచీ హెచ్చడానికి ధాన్యంవెల హెచ్చడమేనా కారణం? యేమో దీనిలో కొంత "వేలాంవెఱ్ఱి" వుండితీరుతుంది. మంగలి బుఱ్ఱగొఱగడానికి చార్టీ హెచ్చించడంవంటిదేనా సినీమా టిక్కెట్టుకు వెల పెంచడం, వాడికి ఆ డబ్బులలో బియ్యం కొనుకుంటేనే కాని పొయికిందకీ పొయిమీదకీ పదార్థం దొరకదు. సినీమావారికి యెక్కువ ధనం వుండడమేకదా యీ వ్యాపారం ఆరంభించడానికి కారణం. వారిని యీ ధాన్యపుకఱువేం బాధిస్తుంది? యీ కఱవురోజుల్లో బియ్యానికి పెట్టిన రేషనింగు సినీమాలకుకూడా పెడితే కొంత బీదలపిల్లలకు కూడు అర్ధాకలిగానేనా - దొరకేదేమో? "కఱవు దరిద్ర మాబ్దికముకల్గె నొకప్పుడు" అన్నట్టు యిప్పటి కఱువుకు సినీమాల పీడకూడా సంప్రాప్తించింది. వొకటేమిటి? గృహస్థుల జీవితం యెన్నివిధాల దుర్భరం కావాలో అన్ని అన్నివిధాలా దుర్భరంగా తయారయింది. కఱువు తగ్గేదాకా సంతాననిరోధం అమల్లో పెట్టినా తరవాత మళ్లా కంటాడుగదా? అలా కనడంలో ఆడపిల్లల్ని కన్నట్టయితే పెళ్లి కొడుక్కి కట్నం పన్ను చెల్లించలేక చస్తాడు.

దానికి కంట్రోలు గవర్నమెంటు పెట్టకపోయినా గృహస్థేపెట్టుకోవాలి. యెవ్వడూ ఆచరణలో పెట్టడంలేదుగాని ఋషులు చక్కనికట్టుబాటు యీ విషయంలో రేషనింగును మించినదాన్ని చేసేవున్నారు. ఆరీతిగా దంపతులు ప్రవర్తిస్తే తప్పక ఆయినా బాధలో చాలావఱకు తగ్గుతుంది. యెన్నో నిషేధాలు ధర్మశాస్త్రోల్లో వున్నాయి. యేంలాభం? ఆచరించేవాళ్లు అగ్రవర్ణాలలోనే కనపడరు. నిమ్నజాతులే కొంతమెరుగు. అంతకంటే కూడా చతుష్పాద జంతువులు మెఱుగు, వాట్లకంటె జ్ఞానానికి మనిషి యెక్కువ అనుకోవడమేకాని, సంతానం కనడంలో వాట్ల ఆచారమే అభినందనీయం. వొక్క రష్యా తప్ప యితర ఖండాలలో లేదా యితర దేశాలలో జనాభా హెచ్చి వొకళ్లు వేఱొకళ్ల దేశాన్ని ఆక్రమించడానికి యత్నించడమూ, తద్ద్వారా రక్తపాతమూ, తన్మూలకంగా క్షామమూ వస్తూన్నట్టు యీ కాలంలో స్పష్టమవుతోంది. కోట్లకొలది జనం చచ్చినప్పుడు, యుద్ధానికి పూర్వం సమృద్ధిగా సరిపోయే పంట యిటీవల మిగలవలసింది, ఆలాకాక తల కిందుగ పరిణమించింది. కొన్ని దేశాలు యుద్ధకారణంగా ఆనకట్టలువగైరా చెడి నీటి వసతులు పాడయి వ్యవసాయానికి లాయకుకాకపోవడంచేత దారిద్ర్యానికి గుఱికావడంవల్ల అక్కడికి మన పదార్థాలు యెగుమతి కావడంచేత మన దేశానికి యీ క్షామబాధ సిద్ధించింది. దీని క్కారణం రైలే, “కుంభకోణేకృతం పాపం కుంభకోణే వినశ్యతి" అన్నట్లు రైలువల్ల వచ్చిన చిక్కు రైలువల్లనూ, స్టీమర్లవల్ల వచ్చిన చిక్కు స్టీమర్లవల్లనూ తీరాలిగాని అన్యథా తీరే వుపాయం కనపడదు. యెందఱు యెన్ని చోట్లకు రాయబారాలుగా వెళ్లినా పదార్థమంటూ వుంటే తప్ప ప్రయోజనం వుండదుగదా! యిప్పడు సమృద్ధిగా వరాలు కురిసినా కరువు వెంటనేపోదు. వచ్చే సంవత్సరం పోవాలి. వొక్క వర్షంతోటే లేదు, యింకా యెన్నో యోగాలు అనుకూలించాలి. యితర దేశాలుకూడా బాగా ఫలించాలి, లేకపోతే మననోటికి మన పంట అందదు. మనషావుకార్లు మన దేశానికి అరిష్ట గ్రహాలుగా పరిణమిస్తారు. యెన్ని విధాల అవయోగాలు వుండాలో అన్నీ సమకూడి వున్నాయి! "స్వరాజ్యం" వస్తే మాత్రం వీట్లని తట్టుకోగలదా? పాపం, యేమో. “తినబోతూ రుచులెందుకు?" హరిజనులు వ్యవసాయదారుణ్ణి యిప్పుడే పీల్చుకుతింటూన్నారు. బస్తా 1కి రు. 20–0–0 లేనా వెల వుంటేనే కాని రైతుకు విత్తనాలుకూడా మిగలనిచ్చేటట్టులేదు కూలిథోరణి. అంతా కూలీల కింద మాఱితే బాగుంటుందనిపిస్తూవుంది. కాని ఆ పద్ధతిని వ్యవసాయం చేసి గవర్నమెంటుకు పన్నెవరు చెల్లిస్తారు? మాట్లాడేటప్పటి కల్లా సమ్మె .అక్కడినుంచి కాల్పులు, పేల్పులు, యీ దేశానికి మంచి కాలమంటూ భవిష్యత్తులోవుందా? అనిపిస్తుంది. యెందుకన్నాడో నన్నయ్య భట్టారకుడు "గతకాలము మేలు వచ్చు కాలము కన్నన్" అన్నాడు – మహానుభావుడు, నిత్య సత్య వచనుడు, మత్యమరాచార్యుడు. “సత్కవి వాక్యము రిత్తవోవునే".


★ ★ ★