కంకణము/సాగరమునందలి కంకణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

సాగరమునందలి కంకణము

ఆ.వె. కూలి సొమ్మసిల్లి కులమువారి కృపోప
      చారవిధుల సేద దేరి, దైవ
      మా! భవార్ణవమున మఱలఁ ద్రోసితె యని
      భోరుభోరుమనుచుఁ బొరలి యేడ్చి.

చ. క్రమముగఁ గన్నువిచ్చితిని గాంచితిలోకము, లోకమెల్ల సం
   ద్రమె యనుకొంటి బుద్బుదవితానములే ప్రజలంచు నెంచితిన్
   సమతయు శాంతి నిశ్చలత సాగనియిందలి సర్వజీవన
   క్రమముల గుర్తెఱింగితి నగాధవిషాదపయోధి మున్గితిన్.

ఉ. సంతత మీయపారమగు సాగరమందలి జీవనంబుతో
   నెంతయు నంటి యంటనటు లేఁ జరియింపఁగ నెంచి, దేనినా
   శింతును నాశ్రయింతు నను చింతమునింగితిఁ గాని జీవనా
   క్రాంతముగాని సాధనము గానఁగనైతిని నెన్నిభంగులన్.

ఉ. జీవనధర్మమూనియును జీవసమం దెటు లంటి యంటన
   ట్లే విహరింపనేర్తు? నగరే వినిరే నెవరేని నన్ను? నా
   కేవెరవున్ స్ఫురింప కెద నింతతలంచుకొలందిఁ దోఁచు నా
   నావిధసంశయమ్ములుమనమ్ముఁ గలంచెఁ దొలంచె ధైర్యమున్.

ఉ. రమ్మిటురమ్ము సాగరతరంగములందు నుయాలలూఁగ జి
   త్రమ్మగు కేళిమై గిరగిరన్ సుడులం దిరుగంగ నంచు, లే
   శమ్మును దోఁచనీక నను సారెకుఁ బిల్చెడువారిచేత స్వాం
   మఱింత నావశము దప్పెనయో పరమార్థ చింతలన్.

మ. ఇవి కల్లోలము లిందుఁ జిక్కుకొనరా, దీవంక నావర్తముల్
    తవులం గూడదు వీనియం, దట నగాధం బట్లుపోఁగూడ, దు
    న్న విధంబుండెదనన్న జీవనగతుల్ నన్నొక్కచో నిల్వనీ
    వవిలంఘ్యంబగు నిట్టిసాగరమునందా చేరితిన్ దైవమా!

క. పృథువిషనిధి యిది క్షీరో
   దధియట! రత్నాకరమట! తన్మధ్యమునన్
   బుధవంద్యుడు నారాయణుఁ
   డధివసియించునఁట! యివి యనౌచితులె కదా!

సీ. కామించి పెక్కుభంగము లోర్చి శృంగితో
          మైమఱపూనె నీమద్గురంబు
   క్రోధించి కలతిమికులముల నలయించి
          పొలియించె నీతిమింగలము కొదమ
   లోభించి యామిషలాభ మన్యులకీక
          మెసవక యెసఁగె నిమ్ముసలి మొసలి
   మోహించి స్వకుటుంబమును మేపు చాకొన్న
         పయి మీలకొసఁగ దీపాడుఝషము

   మదమునన్ గ్రాహమును గడుమత్సరమున
   మకరమును నిటఁ బోరాడుటకుఁ దొడంగె
   నకట! దుర్గుణంబుల కెల్ల నాలయంబు
   సకలభయహేతుభూత మీసాగరంబు.

ఉ. రాగముపోదు, త్యాగమనరాదు, విరాగముగల్గ, దింద్రియో
   ద్యోగము మాఱ, దెయ్యెడల యోగము సాగదు, సర్వజంతుసం
   భోగవిలాసలాలసము భూతవినాశనహేతుభూత మీ
   సాగర మెట్టిబుద్ధిబలశాలికినైనను నీదరా దహో!

ఉ. జీవనమందు భ్రాంతిపడి చిక్కుకొనందగ దిందుఁ బెక్కున
   క్రావళు లుండు నెంతటిమహాబలునే న్గబళించుచుండు; దం
   తావళవల్లభుండు ఘననక్రముఖంబునఁ జిక్కి స్రుక్కఁగా
   రావలసెంగదా మును మురారి వికుంఠమునుండి ధాత్రికిన్.