కంకణము/గాలివానలోఁ గంకణము సాగరమునఁ బడుట

వికీసోర్స్ నుండి

గాలివానలోఁ గంకణము సాగరమునఁ బడుట

శా. నీరంధ్రాంబుధరవ్రజంబు, త్రిజగన్నిర్మూలనాఖేలనా
    పారీణానిలపాదతాడనములన్ బట్టూడి, బిట్టోడి, పె
    ల్లారాటంపడి, బింకమెల్లఁ జెడి, నీరై నాఁటిరేయింగటా!
    ప్రారంభించెమదేభతుండనిభధారాపాతముల్ ధాత్రికిన్.

చ. ప్రభువు ప్రకంపనుండయినరాజ్యము త్యాజ్యముగాన రండురం
   డభయముగల్గుదేశమున కభ్రములార! యటంచు శత్రుభూ
   పుభయము పెంపునన్ వలసపోయెడు తెంపునఁబోవఁ జొచ్చెని
   న్నభము దొలంగి మాఘనఘనాఘనముల్ మహికింగ్రమంబునన్.

ఉ. ఆలయకాల కాలనిభుడైన ప్రభంజను తాడవంబులన్
   జీలియు వ్రీలియున్ మివులఁ జిందరవందరయైన మాపయో
   దాలులనుండి నాఁడు కురియందొడఁగెన్ వడగండ్లుఁగూడఁగీ
   లాలముతోడి మాంసశకలమ్ములలీల నిలాతలమ్మునన్.

ఉ. కొన్ని వనంబులందు నొకకొన్నిసముద్రములందు నింకనుం
   గొన్నికొలంకులందు మఱికొన్ని మహానదులందు నీగతిన్
   గ్రన్ననఁగూలె నీలమణికాంతులనేలు పయోదమాలికల్
   మిన్నుదొలంగి దారుణసమీరణ మారణకారణంబునన్.

సీ. కలుషమ్మెఱుంగ కొక్కటన పెక్కాట ల
            త్యానందమునఁ గూడి యాడియాడి
   నురుచిరబహుదివ్యసుందరీగాన ర
            తిప్రమోదంబులఁ దేలి తేలి
   మిన్నుమన్నరయ కీయున్నతి స్థిరమంచుఁ
            బోరానియాశలఁ బోయిపోయి
   కటకట! తుదకుఁ బ్రకంపన బాధకు
            లోనై మనంబున లోఁగి లోఁగి

   పొంకమును బింకమును జెడి పొరలువాఱి
   ముడుతలంబడి పెనువాతమున మునింగి
   నీరుగ్రమ్ముచు నాఁడుమానిఖిల మేఘ
   మాలికలు క్రమక్రమముగా నేలవ్రాలె.

ఉ. ఇచ్చటనుండి నేలఁబడనీక ననుం గృపఁ గాచుచున్న మా
   నెచ్చలి మబ్బులన్నియుఁజనెన్, బకువాతఁబడంగఁ బాండవుల్
   సొచ్చినయింటివిప్రునకుఁ జొప్పున నాకును సక్రమంబుగా
   వచ్చెను వంతు మారుతునివాతఁబడన్ విధినిర్ణయంబునన్.

క. బలహీనులమగు మాపై
   బలిసి విరోధించి కూల్పఁబాల్పడిన మహా
   బలుబలమును విధిబలము ప్ర
   బలమగునెడఁ బ్రోచు భీమబలుఁ డున్నాఁడే?

ఉ. నెక్కొని మింటనుండి తెగి నేలకురాలినరిక్కరీతి, వి
   ల్లెక్కిడి వ్యాధుఁడేయ గుఱియేటునఁ గూలిన పక్కిభాతి, నే
   దిక్కును లేక నేనకట! తీవ్రతరంబగు మారుతాహతిన్
   గ్రక్కునఁగూలినానొకయగాధమహార్ణవ మధ్యమందునన్.