ఒక యోగి ఆత్మకథ/అధ్యాయం 25

వికీసోర్స్ నుండి

అధ్యాయం : 25

అన్నయ్య అనంతుడు,

చెల్లెలు నళిని

“అనంతుడింక బతకడు; ఈ జన్మకు అనుభవించవలసిన కర్మ తీరిపోయింది.”

ఒకనాడు పొద్దున నేను గాఢమైన ధ్యానంలో మునిగి ఉండగా, ఈ ఘోరమైన మాటలు నా అంతశ్చేతనలోకి చేరాయి. నేను సన్యాసం తీసుకున్న కొత్తలో, నా జన్మస్థలమైన గోరఖ్‌పూర్‌లో ఉన్న మా అనంతన్నయ్యకి అతిథిగా వెళ్ళాను. హఠాత్తుగా ఏదో జబ్బుచేసి మంచం పట్టాడతను; నేను ప్రేమగా అతనికి ఉపచారాలు చేశాను.

గంభీరమైన ఈ అంతర్ఘోష నన్ను దుఃఖంలో ముంచేసింది. నా కళ్ళముందే అన్నయ్యని తీసుకుపోబోతూంటే నేను నిస్సహాయుడిగా చూస్తూ ఉండాలంటే, గోరఖ్‌పూర్‌లో అట్టేకాలం ఉండడం నాకు దుర్భర మనిపించింది. నన్ను అర్థంచేసుకోకుండా బంధువులు విమర్శ చేస్తున్నప్పటికీ నాకు దొరికిన మొదటి ఓడ ఎక్కి భారతదేశాన్ని విడిచిపెట్టాను. ఆ ఓడ బర్మా, చైనా సముద్రంగుండా జపాను చేరింది. నేను కోబేలో దిగి, కొన్నాళ్ళక్కడ గడిపాను. దుఃఖంతో గుండె బరువెక్కి ఉన్నందువల్ల బయట తిరిగి ఏవీ చూడాలని కూడా అనిపించలేదు.

భారతదేశానికి తిరుగు ప్రయాణంలో మా ఓడ షాంఘై చేరింది. అక్కడ, ఓడలో వైద్యుడిగా పనిచేసే డా॥ మిశ్రాగారు, కళాత్మకమైన వస్తుసామగ్రి అమ్మే దుకాణాలకు తీసుకువెళ్ళి చూపించారు. శ్రీయుక్తేశ్వర్‌గారికీ, మా ఇంట్లో వాళ్ళకీ, స్నేహితులకీ బహూకరించడంకోసం రకరకాల కానుకలు ఎంపికచేశాను. అనంతుడికోసం, ఒక వెదురు గడమీద నగిషీలు చెక్కి ఉన్న పొడుగాటి వస్తు వొకటి కొన్నాను. చైనా వాడయిన అమ్మకందారు ఆ వస్తువును నా చేతికి ఇచ్చీ ఇయ్యగానే నేను దాన్ని నేల మీదికి జారవిడిచి, “చచ్చిపోయిన అన్నయ్యకోసం కొన్నానిది!” అని విలపించాను.

అన్నయ్య ఆత్మ సరిగా ఆ క్షణంలోనే శరీరంలోంచి విడుదల అయి అనంతంలో కలిసిపోయిందన్న స్పష్టమయిన అనుభూతి ఒకటి కలిగింది నాకు. నేను కొన్న జ్ఞాపకచిహ్నం, కింద పడ్డంవల్ల, అశుభ సూచనగా ఫళుక్కున విరిగింది. వెక్కి వెక్కి ఏడుస్తూ, విరిగిన వెదురు ముక్కమీద ఇలా రాశాను. “ఇప్పుడే పోయిన- ప్రియమైన అనంతన్నయ్య కోసం.”

నాతో ఉన్న డాక్టరు వెటకారంగా నవ్వుతూ నన్ను గమనిస్తూనే ఉన్నాడు.

“కన్నీళ్ళు పెట్టుకోకండి. ఆయన పోయారని మీకు రూఢి అయే దాకా కన్నీళ్ళు రాల్చడమెందుకు?”

మా ఓడ కలకత్తా చేరినప్పుడు, డా॥ మిశ్రా మళ్ళీ నా వెంట వచ్చారు. నన్ను పలకరించడానికని, మా చిన్న తమ్ముడు విష్ణు ఓడరేవు దగ్గర ఎదురు చూస్తున్నాడు.

“అనంతన్నయ్య ఈ జన్మ కడతేర్చుకుపోయాడని నాకు తెలుసు,” అన్నాను విష్ణుతో, వాడేమీ చెప్పడానికి వ్యవధి ఇవ్వకుండానే. “అనంతుడు ఎప్పుడు పోయాడో నాకూ ఈ డాక్టరుగారికి చెప్పు.”

విష్ణు తేదీ చెప్పాడు; నేను షాంఘైలో కానుకలు కొన్న రోజే అది.

“చూడండి! ఈ సంగతి బయటెక్కడా పొక్కనివ్వకండి! లేకపోతే, ఇప్పటికే ఎంతో పెద్దగా ఉన్న వైద్యవిద్యలో మానసిక ప్రసారం కూడా చేర్చి ఇంకో ఏడాదే ఎక్కువ చదివిస్తారు ప్రొఫెసర్లు!” గుర్పార్ రోడ్డులో ఉన్న ఇంట్లో నేను అడుగు పెట్టేసరికి నాన్న గారు ఆప్యాయంగా కౌగలించుకున్నారు. “వచ్చావా,” అన్నారు నాన్నగారు మృదువుగా. ఆయన కళ్ళలోంచి రెండు పెద్ద నీటిబొట్లు రాలాయి. మామూలుగా పైకి తొణకని నాన్నగారు, తమ వాత్సల్యాన్ని ఇంతకు ముందెన్నడూ ఈ రకంగా బయటికి కనబరచలేదు. పైకి గంభీరులైన తండ్రి; లోలోపల కరిగిపోయే తల్లిగుండె గలవారు. కుటుంబ విషయాలన్నిటిలోనూ ఆయన ఇలా ద్విపాత్రాభినయం చేస్తూ వ్యవహరించారు.

అనంతుడు పోయిన కొన్నాళ్ళకే, మా చిన్న చెల్లెలు నళిని దైవోపశమనం వల్ల మృత్యుముఖంలోంచి బయటపడింది. ఆ కథ చెప్పే ముందు, మా చిన్నప్పటి సంగతులు కొన్ని ముచ్చటిస్తాను.

నాకూ నళినికీ మధ్య చిన్నప్పటి అనుబంధం మరీ అంత సంతోషకరమైందని చెప్పడానికి లేదు. నేను బక్కగా ఉండేవాణ్ణి; తను నా కంటె బక్కపలచగా ఉండేది. అలా ఉన్నందుకు నేను మా చెల్లెల్ని తరచు ఏడిపిస్తూ ఉండేవాణ్ణి; దానికి అజ్ఞాతమైన ప్రేరణ ఏమిటో గుర్తుపట్టడానికి మనోవ్యాధి నిపుణులకు ఏమంత కష్టం కాదు. తను ఇచ్చే ఎదురు జవాబులు కూడా కుర్రకారుకు సహజమైనంత ఘాటుగాను కుండ బద్దలు కొట్టినట్టు ఉండేవి. ఒక్కొక్కప్పుడు అమ్మ కలగజేసుకునేది; నా చెంప మీద (నేనే పెద్దవాణ్ణి కనక) సుతారంగా ఒక్కటి అంటించి, మా పిల్ల తగువుల్ని అప్పటిమట్టుకు సర్దుబాటు చేసేది.

నళినికి చదువు అయిపోయాక, డా॥ పంచానన్ బోస్ కిచ్చి పెళ్ళిచెయ్యడానికి నిశ్చయమైంది. యోగ్యుడయిన ఈ యువకుడు కలకత్తాలో డాక్టరు. సుదీర్ఘమైన పెళ్ళి తతంగాలన్నీ సకాలంలోనే జరిగాయి. పెళ్ళినాటి రాత్రి నేను, మా కలకత్తా ఇంట్లో, నట్టింట్లో కులాసాగా ముచ్చట్లాడుకుంటున్న పెద్ద బంధువర్గంతో కలిసి కూర్చున్నాను. పెళ్ళికొడుకు, నిండుగా బంగారపు జరీగల తలగడా మీదికి వాలి కూర్చున్నాడు. ఆయన పక్కనే కూర్చుంది నళిని. ముచ్చటైన బచ్చలపండు వన్నె పట్టుచీర కూడా ఆమె బక్కతనాన్ని పూర్తిగా మరుగుపరచలేకపోయింది. నేను మా కొత్త బావగారి తలగడా వైపుచేరి స్నేహపూర్వకంగా పళ్ళు ఇకిలించాను. పెళ్ళిరోజు దాకా ఆయన నళినిని చూడలేదు; పెళ్ళి లాటరీలో తనకి దక్కేదేమిటో చివరికి తెలుస్త అప్పుడే. నా సానుభూతి అందుకున్న డా. బోస్, సిగ్గుపడుతూ నళినివేపు చూపించి, “ఇదేమిటంటావ్?” అని నా చెవిలో గొణిగాడు.

“ఏమిటేమిటి డాక్టర్? మీ పరిశీలనకోసం ఓ ఎముకలగూడు!”

ఏళ్ళు గడిచేకొద్దీ, డా॥ బోసు మా కుటుంబానికి ఆప్తుడవుతూ వచ్చాడు; ఒంట్లో నలతచేసినప్పుడల్లా మావాళ్ళు ఆయన దగ్గరికే వెళ్ళేవాళ్ళు. ఆయనా నేనూ దగ్గరి స్నేహితులమయాం; ఇద్దరం కలిసి వేళాకోళం చేసేవాళ్ళం - ఎవరినో చెప్పక్కర్లేదు - సాధారణంగా నళిని మీదే మా విసుర్లు.

ఒక నాడు నాతో అన్నారు మా బావగారు: “వైద్యులకు విస్మయం కలిగించే సంగతిది. బక్క పలచటి మీ చెల్లెలిమీద ఎన్నో ప్రయోగాలు చేసి చూశాను - కాడ్‌లివర్ ఆయిలు, వెన్న, మాల్తు, తేనె, చేపలు, మాంసం, గుడ్లు, టానిక్కులు. అయినా, అంగుళంలో నూరోవంతు కూడా ఒళ్ళు చెయ్యలేదు ఈవిడ.”

కొన్నాళ్ళ తరవాత నేను బోసుగారింటికి వెళ్ళాను. అక్కడ నా పనికి ఐదు నిమిషాలే పట్టింది. నేను తిరిగి వచ్చేస్తున్నాను, నళిని చూడ్డం లేదనే అనుకున్నాను. నేను వీధిగుమ్మం దగ్గరికి వచ్చేసరికి ఆమె గొంతు వినిపించింది; ఆప్యాయంగానే ఉన్నా, ఆజ్ఞాపిస్తున్నట్టు ఉందది.

“అన్నయ్యా, ఇలా రా. ఈసారి నన్ను తప్పించుకుపోలేవు. నీతో మాట్లాడాలనుకుంటున్నాను.”

నేను మెట్లెక్కి తన గదికి వెళ్ళాను. తను కళ్ళు తడుపుకోడం చూసి ఆశ్చర్యపోయాను.

“అన్నయ్యా, మన పాత కోపతాపాలన్నీ మరిచిపోదాం. ఇప్పుడు నువ్వు ఆధ్యాత్మికమార్గంలో నిలదొక్కుకున్నావు. నేను కూడా అన్ని విధాలా నీలా కావాలనుకుంటున్నా,” అని చెప్పి, కొంచెం ఆశగా ఇలా అంది: “నువ్విప్పుడు పుష్టిగా కనిపిస్తున్నావు. నాకు కాస్త సాయం చెయ్యవూ? మా ఆయన నా దరిదాపులకే రావటం లేదు; నేను ఆయన కోసం ఎంత ఇదయితే ఏం లాభం? నేనిలా సన్నగా, ఏ ఆకర్షణ లేకుండా ఉన్నప్పటికీ, దైవసాక్షాత్కార సాధనలో మాత్రం ముందుకు పోవాలన్నదే నా ముఖ్యమైన కోరిక.”

ఆమె విన్నపం నా గుండెను కరిగించింది. మా కొత్త స్నేహం నిలకడగా పెరిగింది. ఒకనాడు తను నాకు శిష్యురాలినవుతా నన్నది.

“నువ్వెలా అనుకుంటే అలా తర్ఫీదు ఇయ్యి నాకు. టానిక్కుల మీదకన్న దేవుడిమీదే నమ్మక ముంచుతాను.” మందు సీసాలన్నీ పోగుచేసి కిటికీలోంచి బయటి కుళ్ళుకాలవలోకి విసిరి పారేసింది. ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికని, భోజనంలో చేపలూ మాంసమూ గుడ్లూ మానెయ్యమన్నాను.

నళిని నేను పెట్టిన నిషేధాలన్నీ కచ్చితంగా పాటిస్తూ, ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చినా కూడా, కేవలం శాకాహారమే తింటూ కొన్ని నెలలు గడిపిన తరవాత నేనోసారి చూడ్డానికి వెళ్ళాను.

“చెల్లాయ్, నువ్వు ఆధ్యాత్మిక నియమాల్ని నిష్ఠగా పాటిస్తున్నావు; నీకు వచ్చే బహుమతి దగ్గరలోనే ఉంది,” అంటూ కొంటెగా చిరునవ్వు నవ్వాను. “నీకు ఎంత లావవాలని ఉంది? మన అత్తయ్య ఉందే కొన్నేళ్ళుగా తన పాదాలు తను చూసుకోలేకపోతున్నావిడ - ఆవిడంత లావు అవాలని ఉందా?”

“ఉఁహూఁ! నీ అంత లావు కావాలి.”

నేను గంభీరంగా ఇలా అన్నాను: “దేవుడి దయవల్ల, నేనెప్పుడూ నిజమే చెబుతూ ఉన్నాను కనక, ఇప్పుడూ నిజమే చెబుతున్నాను.[1] దేవుడి ఆశీస్సుల ద్వారా, ఈ రోజునుంచి నీ శరీరం నిజంగా మార్పు చెందుతుంది. ఒక్క నెల్లాళ్ళలో, నాకున్నంత బరువు రావాలి నీ శరీరానికి.”

నా గుండెలోంచి వెలువడ్డ ఈ మాటలు నిజమయాయి. ఒక్క ముప్ఫై రోజులకల్లా, నళిని బరువు నా బరువుతో సమానమయింది. కొత్తగా వచ్చిన గుండ్రతనంతో ఆమెకు మంచి అందం వచ్చింది. దాంతో వాళ్ళాయన ఆమెను గాఢంగా ప్రేమించాడు. అమంగళంతో ఆరంభమయిన వాళ్ళ దాంపత్యం ఆదర్శంగా చెప్పుకోదగ్గంత హాయిగా పరిణమించింది.

నేను దేశంలో లేనప్పుడు నళినికి సన్నిపాతజ్వరం (టైఫాయిడ్) వచ్చిందని, నేను జపానునుంచి తిరిగి రాగానే తెలిసింది. హుటాహుటిని వాళ్ళింటికి ఉరికి సన్నగా పుల్లలా అయిపోయిన నళినిని చూసి కొయ్యబారి పోయాను. ఆమె అపస్మారకంలో ఉంది.

“ఈ జబ్బువల్ల మీ చెల్లాయి మనస్సు కలతచెందకముందు ‘ముకుందన్నయ్య ఉండి ఉంటే నాకిలా అయేది కాదు,’ అంటూండేది తరచు,” అన్నారు మా బావగారు. “డాక్టర్లకి నాకూ రవ్వంత ఆశకూడా కనిపించడం లేదు. టైఫాయిడ్‌తో అన్నాళ్ళు బాధపడింది చాలక, ఇప్పుడు నెత్తురు విరేచనాలు మొదలయాయి,” అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు ఆయన.

నా ప్రార్థనలతో భూమ్యాకాశాలు దద్దరిల్లేటంతగా విశ్వప్రయత్నం చేశాను. నాతో పూర్తిగా సహకరించే ఆంగ్లో ఇండియన్ నర్సు నొకామెను ఏర్పాటుచేసి, రకరకాల యోగచికిత్సా పద్ధతులు మా చెల్లిమీద ప్రయోగించాను. నెత్తురు విరేచనాలు కట్టేశాయి.

కాని డా॥ బోసు విచారగ్రస్తంగా తల ఆడించారు. “పోవడాని కింక ఆమెలో రక్తమే లేదు.”

“తప్పకుండా కోలుకుంటుంది,” అన్నాను, దృఢంగా జవాబిస్తూ. “ఏడు రోజుల్లో తన జ్వరం తగ్గిపోతుంది.”

ఒక వారం తిరిగేసరికి నళిని కళ్ళువిప్పి, ఆప్యాయంగా గుర్తుపట్టి నా వేపు చూస్తూ ఉంటే నాకు ఒళ్ళు పులకించింది. ఆ రోజు మొదలు తను త్వరత్వరగా కోలుకుంది. తన మామూలు బరువు తనకి వచ్చినప్పటికీ, దాదాపు ప్రాణాంతకమైన ఆ జబ్బు కలిగించిన హానికి బాధాకరమైన గుర్తుగా, కాళ్ళు పడిపోయాయి. వైద్యనిపుణులయిన భారతీయులూ, ఇంగ్లీషువాళ్ళూ కూడా ఆమెను, ఆశ వదులుకోవలసిన అవిటి దానికింద తేల్చి చెప్పేశారు.

ఆమె ప్రాణంకోసం, ప్రార్థన ద్వారా నిర్విరామంగా నేను సాగించిన యుద్ధం, నన్ను బాగా నీరసపెట్టేసింది. శ్రీయుక్తేశ్వర్‌గారి సహాయం కోసం నేను శ్రీరాంపూర్ వెళ్ళాను. నళిని దుస్థితి చెప్పేసరికి ఆయన గాఢంగా సానుభూతి ప్రకటించారు.

“ఒక్క నెల గడిచేసరికి మీ చెల్లాయి కాళ్ళు మామూలుగా అవుతాయి,” అంటూ ఆయన, “చిల్లు చెయ్యని, రెండు క్యారెట్ల ముత్యం ఒకటి సంపాదించి దాన్ని ఒక కొలికికి అమిర్చి, చర్మానికి తగిలేటట్టుగా ఒక పట్టీతో కట్టుకోమను.” నేను ఆనందంగా ఒక నిట్టూర్పు విడిచి ఆయన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను.

“స్వామీ, మీరు దేశికచక్రవర్తులు; ఆమె కోలుకుంటుందని మీరన్నమాట ఒక్కటి చాలు. కాని, మీరు కాదూ కూడదంటే మాత్రం ఒక ముత్యం సంపాయించి ఇస్తాను.”

గురుదేవులు తల ఆడించారు. “ఔను. అలాగే చెయ్యి.” ఆయన నళినిని ఎన్నడూ చూసినవారు కారు; కాని ఆమె శారీరక, మానసిక లక్షణాలు సరిగ్గా వర్ణించి చెప్పారు.

“స్వామీ, ఇది జ్యోతిష సంబంధమైన పరిశీలనా? ఆమె పుట్టిన రోజుకాని, సమయం కాని మీకు తెలియదే!”

శ్రీయుక్తేశ్వర్‌గారు చిరునవ్వు నవ్వారు. “అంతకన్న లోతయిన జ్యోతిషం ఉంది; పంచాంగాలూ గడియారాలూ చెప్పే సాక్ష్యం మీద ఆధారపడదది. ప్రతి మనిషీ సృష్టికర్త లేదా విరాట్ పురుషుడి అంశ; అతనికి సూక్ష్మశరీరం ఒకటీ స్థూలశరీరం ఒకటీ ఉంటాయి. మానవ నేత్రం భౌతికరూపాన్నే చూస్తుంది, కాని అంతశ్చక్షువు మరింత గాఢంగా చొచ్చుకుపోతుంది. ప్రతి మనిషీ ఒక అంతర్భాగంగానూ ప్రత్యేక వ్యక్తిగానూ ఏర్పడిఉన్న బ్రహ్మాండ స్వరూపంలోకి కూడా చొచ్చుకు పోయి చూస్తుంది.

నేను కలకత్తాకు తిరిగివచ్చి నళినికోసం ఒక ముత్యం[2] కొన్నాను. ఒక నెల అయేసరికి, పడిపోయిన ఆమె కాళ్ళు పూర్తిగా నయమయి పోయాయి.

మా గురుదేవులకు హృదయపూర్వకమైన తన కృతజ్ఞత ఆందజెయ్యమని చెప్పింది చెల్లాయి. నేను చెప్పిన కబురు ప్రశాంతంగా విన్నారాయన. కాని నేను సెలవు తీసుకుని వెళ్ళబోతుండగా ఆయన, గూఢమైన వ్యాఖ్య ఒకటి చేశారు.

“మీ చెల్లాయికి అసలు పిల్లలే పుట్టరని చాలామంది డాక్టర్లు చెప్పారు. ఇక కొన్నేళ్ళలో తను ఇద్దరు కూతుళ్ళని కంటుందని కచ్చితంగా చెప్పు.”

ఆ తరవాత కొన్నేళ్ళకి నళినికి ఒక కూతురు పుట్టి ఆనందపరిచింది; మరి కొన్నేళ్ళకి మరో కూతురు కూడా కలిగింది.

  1. ఎప్పుడూ అలవాటుగా నిజం చెప్పే వాళ్ళకి, తాము ఏది అంటే అది జరిగే శక్తి వస్తుందని హిందూ పవిత్ర గ్రంథాలు ఘోషిస్తున్నాయి. వాళ్ళ హృదయంలోంచి వెలువడ్డమాట జరిగి తీరుతుంది. (“సత్య ప్రతిష్ఠాయాం క్రియా ఫలాశ్రయత్వం”. యోగసూత్రాలు: 2 : 36)

లోకాలు సత్యంమీద నిర్మించినవి కాబట్టి, పవిత్ర గ్రంథాలన్నీ దాన్ని శ్రేష్టగుణంగా కీర్తించాయి. ఏ మనిషయినా సరే, దానివల్ల తన జీవితాన్ని అనంత శక్తితో అనుసంధానం చేసుకోవచ్చు నన్నాయి. “సత్యమే భగవంతుడు,” అని గాంధీగారు తరచు అంటూండేవారు. ఆలోచనలో, మాటలో, చేతలో పూర్ణ సత్యం కోసమే ఆయన జీవితమంతా శ్రమించారు. సత్యమనే ఆదర్శం హిందూ సమాజాన్ని యుగయుగాలుగా అనుప్రాణికం కావిస్తూ వస్తోంది.

ఈ భూమిమీద ఏది ఇచ్చినా సరే బ్రాహ్మణులు అబద్ధమాడరు,” అంటాడు మార్కోపోలో. భారతదేశంలో న్యాయమూర్తిగా పనిచేసిన విలియం స్లీమన్ అనే ఇంగ్లీషువాడు, ‘జర్నీ త్రూ ఔట్ ఇన్ 1849-59’ అనే గ్రంథంలో అంటాడు: “ఒక్క మనిషి అబద్ధం చెప్పడం మీద ఆధారపడి, అతని ఆస్తికి కాని, స్వేచ్ఛకుకాని, ప్రాణానికికాని సంబంధించిన కేసులు వందలకొద్దీ వచ్చాయి నా దగ్గరికి, కాని అతడు, ససేమిరా అబద్ధం చెప్పనన్నాడు.

  • ముత్యాలూ రత్నాలూ లోహాలూ కొన్ని ఓషధులు మనిషి ఒంటికి తగిలి ఉన్నట్లయితే, అవి - శరీర కణాలమీద విద్యుదయస్కాంత ప్రభావం చూపిస్తాయి. కొన్ని మొక్కల్లోనూ, లోహాల్లోనూ రత్నాల్లోనూ కూడా ఉండే కర్బనమూ ఇతర లోహమూలకాలూ మానవశరీరంలోనూ ఉన్నాయి. ఈ విషయాల్లో ఋషులు కనిపెట్టినవాటిని, ఎప్పుడో ఒకనాడు, శరీరశాస్త్రవేత్తలు కూడా ధ్రువపరుస్తారు. విద్యుత్ ప్రాణప్రవాహంతో, సంవేదనశీలకమైన మానవ శరీరం, ఈనాటికీ అన్వేషించని అనేక రహస్యాలకు కేంద్రం.

    రత్నాలకూ లోహపు కడియాలకూ శరీరంలోని రోగాల్ని నయంచేసే విలువ ఉన్నప్పటికీ, శ్రీయుక్తేశ్వర్‌గారు వాటిని సిఫార్సు చెయ్యడానికి మరో కారణం కూడా లేకపోలేదు. సద్గురువులు తాము రోగనివారకులుగా కనిపించాలని ఆశించరు; దేవుడే రోగనివారకుడు. అంచేత సాధువులు, ఈశ్వరుడి దగ్గర్నించి తాము సవినయంగా అందుకున్న శక్తుల్ని తరచు, రకరకాల ముసుగుల్లో మరుగు పరుస్తారు. సాధారణంగా మానవుడు, ప్రత్యక్ష వస్తువులమీదే విశ్వాసం పెట్టుకుంటాడు; రోగం నయం కావడానికని మా గురుదేవుల దగ్గరికి ఎవరయినా వచ్చినప్పుడు, ఆయన వాళ్ళకి దండకడియం వేసుకోమనో, రత్నం ధరించమనో సలహా ఇస్తూండేవారు; వాళ్ళలో విశ్వాసం రగుల్కొల్పడానికి, వాళ్ళ దృష్టిని తమ మీంచి మళ్ళించడానికి అలా చేస్తూ ఉండేవారు. కడియాలకూ రత్నాలకూ విద్యుదయస్కాంత సంబంధమైన రోగనివారక శక్తులు అంతర్గతంగా ఉన్నప్పటికీ, వాటితోబాటు గురుదేవుల గుప్తమైన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు కూడా కలిసి ఉండేవి.