Jump to content

ఎందరో వికీమీడియన్లు/సున్నితపు త్రాసు

వికీసోర్స్ నుండి

సున్నితపు త్రాసు

పరుగెత్తి పాలు తాగేవాడు ఉన్నచోటనే నిలబడి నీళ్ళు తాగేవాడూ ఉంటాడు. మధ్యలోనే కాడిపడేసి నిదరోయే కుందేళ్ళున్న చోటనే నెమ్మదిగా నడుస్తూ గమ్యాన్ని చేరే తాబేళ్ళు ఉంటాయి. పదిమంది వాదులాడుకునేచోట సర్దిచెప్పే పెద్దమనిషి ఉండాలి. వివాదాస్పద విషయంపై వాడిగా వేడిగా చర్చలు జరిగేచోట, నిర్మొహమాటంగా నిజం చెప్పే నేర్పరి ఉండాలి, తప్పొప్పులు తేల్చేసే తీర్పరి ఉండాలి. తెవికీలో రవిచంద్ర ఉన్నాడు.

అతనిక్కడ నిర్వాహకుడూ, అధికారీ. చర్చల్లో, నువ్వు చెప్పేది తప్పు అని ముందుకొచ్చి చెప్పగలిగే నిబద్ధత ఉన్నవాడు. తప్పొప్పులను సరిచూసి, ఉచితానుచితాలను త్రాసులో తూచి సరైన నిర్ణయం చెప్పగల మర్యాద రామన్న. తన పొరపాట్లేమైనా ఉంటే ఒప్పేసుకునే గుణం కూడా ఉన్నవాడు. చర్చలలో వచ్చిన అభిప్రాయాల మేరకు తాను చేసిన నిర్ణయాలపై విమర్శలు వచ్చినపుడు కూడా చలించడు. వివాద సందర్భాల్లో, దీనిపై రవిచంద్ర నిర్ణయం చెయ్యాలి అని కోరుకున్న సందర్భం కూడా ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు, రవిచంద్ర విశ్వసనీయతను.

నిర్వహణ పనులతో పాటు, వ్యాసకర్తగా అనేక వ్యాసాలు సృష్టించాడు. సినిమాలు, జీవిత చరిత్రలు తదితర అనేక అంశాల్లో వ్యాసాలు రాసాడు. ఆధారాలు ఇస్తూ రాస్తాడు. పదహారేళ్ళుగా తెవికీలో కృషి చేస్తూ ఉన్న వాడుకరికి 12 వందల కొత్త వ్యాసాలంటే తక్కువే. అయితే, దానికి కారణం ఉంది - రవిచంద్ర ఇతరులు సృష్టించిన వ్యాసాలను విస్తరించడానికి, మెరుగుపెట్టడానికీ ప్రాధాన్యత నిస్తాడు. ముఖ్యంగా భాషా దోషాలను పట్టుకోవడంలో అతనిది డేగ చూపు. అతని దిద్దుబాట్లలో 60% కి పైగా వ్యాసాల మెరుగుదల కోసం చేసినవే. తెవికీ మొదటి పేజీలో ఉండే ఈ వారం వ్యాసం, ఈ వారం బొమ్మ, మీకు తెలుసా వంటి శీర్షికలను నిర్వహించిన ప్రముఖుల్లో రవిచంద్ర ఒకరు. తాను మొదటి పేజీలో ప్రదర్శించడానికి ఎంచుకున్న ఈ వారం వ్యాసంలో దోషాలేమైనా ఉంటే సవరించి మరీ ప్రచురిస్తాడు.