ఎందరో వికీమీడియన్లు/నిర్మోహమైన సేవకుడు
నిర్మోహమైన సేవకుడు
తెలుగు వికీపీడియాలో సాధారణంగా ఎవరూ చెయ్యని పని చేసిన ఒక వ్యక్తి గురించి ఇప్పుడు... ఆయన చేసిన దిద్దుబాట్లను పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది ఎవరికైనా. సాధారణంగా వ్యాసాన్ని మొదలుపెట్టినవారికి “సృష్టికర్త” అనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. తెవికీయులు ఇతర పనులతో పాటు, కొత్త వ్యాసాలను సృష్టించేందుకు కూడా ఉత్సాహం చూపుతూంటారు. ఈ ఉత్సాహం అందరికీ ఉంటుంది. ఉండనివారు అరుదు.
కానీ కెపిఆర్ శాస్త్రి గారు ఒక విశిష్టమైన వ్యక్తి. తెవికీలో ఆయన 6 వేల పైచిలుకు దిద్దుబాట్లు చేసారు. వేలాది వ్యాసాల్లో పనిచేసారు. కానీ ఆయన సృష్టించిన పేజీల సంఖ్య ఎంతో తెలుసా? ఒకటి. ఒక్కటే!. కేవలం ఒకే ఒక్క వ్యాసం సృష్టించాడాయన. అంటే ఆయన దిద్దుబాట్లన్నీ ఉన్న వ్యాసాలను మెరుగుపెట్టడం కోసం చేసినవే. తమ పేరిట కొత్త వ్యాసం ఉండాలనే కోరిక ఎంతో కొంత అందరికీ ఉంటుంది. కానీ ఆయనకది ఈషణ్మాత్రం కూడా లేదనేది దీన్ని బట్టి తెలుస్తోంది. చాలా నిర్మోహమైన సేవ మా శాస్త్రిగారిది. మనందరి ధన్యవాదాలకు, అభినందనలకూ పాత్రుడాయన!
శాస్త్రి గారూ... రండి సార్, బోల్డు పనులున్నాయి, అనేక వ్యాసాల్లో తప్పులు సరిదిద్దాలి.