ఎందరో వికీమీడియన్లు/చుక్కాని
చుక్కాని
తెవికీలో రాసేవాళ్లు చాలామందే ఉంటారు. ఆ రాసేవాళ్ళకు అర్థం కాని సాంకేతికపరమైన చిక్కుముళ్ళను సరిచేసి రహదారి ఏర్పరచేవాళ్ళు కొందరే ఉంటారు. అలాంటివాడు మా అర్జున.
ఇదిగో మనకు ఈ సౌకర్యం కావాలి అని ఎవరైనా రచ్చబండలో రాస్తే అర్జున చప్పున అందుకుంటాడు. ఆ సౌకర్యం కోసం కృషి చేస్తాడు. తెవికీలో ఏదైనా సాంకేతిక సమస్య వస్తే అర్జున ఎక్కడ అంటూ వెతుకుతాం. ఈలోగానే అర్జున సంబంధిత డెవలపర్లతో ఆ సమస్య గురించి మాట్లాడుతూంటాడు. సమస్యను పరిష్కరించేదాకా వెంటపడేవాడు. స్వయంగా సాఫ్టువేరు ఇంజనీరు కాబట్టి ఇలాంటి వ్యవహారాలు ఆయనకు కొట్టినపిండి. వికీడేటా నుండి సమాచారాన్ని ఆటోమాటిగ్గా తేవడం, ఎన్వికీ నుండి దిగుమతులు చేయడం ఇలాంటివి చేస్తాడు.
నిర్వాహకుడికి నిర్వచనం అర్జున... సాధారణంగా వికీపీడియన్లు చేసే కృషిలో సింహభాగం వ్యాసాల్లోనే ఉంటుంది. కానీ, తెరవెనుక చెయ్యాల్సిన కృషి చాలానే ఉంటుంది. అది ఎంత బాగా చేస్తే వికీ వ్యాసాలు అంత పుష్టిగా ఉంటాయి. కొందరు ఈ తెరవెనుక కృషి కూడా చేస్తారు. నిర్వాహకులు ఈ తెరవెనుక పని కొంచెం ఎక్కువగా చేస్తారు. అర్జున అందరికంటే ఎక్కువగా చేస్తాడు. అర్జున చేసిన మొత్తం వికీవ్యవసాయంలో ఈ తెరవెనుక కృషి 60 శాతానికి పైనే ఉంది. మరే నిర్వాహకుడూ తెరవెనుక ఇంత కృషి చెయ్యలేదు.
రేపేంటి అని ఆలోచించే కొద్దిమంది వికీపీడియన్లలో అర్జున ముందుంటాడు. వచ్చేయేడు మన లక్ష్యాలేంటి అని ప్రస్తావిస్తాడు. ఈ యేడు మనం ఏం చేసాం అని సమీక్షిస్తాడు. తెవికీకి అతనొక చుక్కాని లాంటివాడు.
అంతేకాదు, పది పదిహేను మంది ఒక అభిప్రాయంతో ఉండగా, దానికి వ్యతిరేక అభిప్రాయం చెప్పి ఒక్కడే ఒంటరిగా నిలబడగల స్వతంత్ర ఆలోచనా శక్తి, నిబద్ధత అర్జున సొంతం. ఆయన వికీపీడియా ఇండియా చాప్టరుకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా కూడా పనిచేసాడు.