Jump to content

ఎందరో వికీమీడియన్లు/ఇన్‌ఫ్లుయెన్సరు

వికీసోర్స్ నుండి

ఇన్‌ఫ్లుయెన్సరు

ఆయన వికీపీడియాలో నిర్వాహకుడు, అధికారి. వికీసోర్సులో నిర్వాహకుడు. విక్షనరీలో నిర్వాహకుడు. తెవికీలో 90 వేలు, తెలుగు విక్షనరీలో 30 వేలు, తెలుగు వికీసోర్సులో 57 వేలు, తెలుగు వికీకోట్‌లో వెయ్యి, వికీడేటాలో 20 వేలు, వికీ కామన్సులో 65 వేలు, ఇంగ్లీషు వికీపీడియాలో 40 వేలు, ఇంగ్లీషు విక్షనరీలో 70 వేలు, ఇంగ్లీషు వికీసోర్సులో 40 వేలు - ఉప్ఫ్... వెరసి అన్ని రకాల వికీల్లోనూ ఆయన చేసిన మొత్తం దిద్దుబాట్లు నాలుగు లక్షల పైచిలుకు. ఇందులో ఉన్నాడు అందులో లేడు అని అనడానికి లేదు... అన్నింటా ఉన్నాడు చక్రి లాగా! ఇన్ని ప్రాజెక్టుల్లో ఇంత విరివిగా రాసిన ఈ చక్రి ఎవరూ…? ఎవరయ్య ఎవరు వారు… ఇంకెవరయ్య రాజశేఖరు!

ఔను, డాక్టర్ రాజశేఖరతడు. సినిమా హీరో కాదు, వికీహీరో! మేం ఆటలను ప్రోత్సహిస్తాం అని తమ ఎడ్వర్టైజ్‌మెంటులో చెబుతూ టాటా స్టీల్ వారు, చివర్న, వియాల్సో మేక్ స్టీల్ అని చెప్పుకునేవారు. అలాగే మనం కూడా డాక్టర్ రాజశేఖర్ గారు తన స్వంత పాథాలజీ ల్యాబును నిర్వహిస్తూంటారు కూడా అని నిరాక్షేపణీయంగా చెప్పవచ్చు. వికీపీడియాలో ఒక్కొక్క హీరోది ఒక్కొక్క పద్ధతి. చిన్నచిన్న అడుగులు, పెద్దపెద్ద విజయాలు అనేది ఈయన పద్ధతి. పద్ధతి ఏదైతేనేం అంతిమ లక్ష్యం వికీ అభివృద్ధే ఐనపుడు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కూడా ఈ హీరోను గుర్తించారు, తమ ఉగాది పురస్కారాల ద్వారా! జీవశాస్త్రం, సాహిత్యం వగైరాల మీద వ్యాసాలు రాస్తూంటారు. రాయడమే కాదు, రాయిస్తారు కూడా. వికీలోకి కొత్తగా వచ్చినవాళ్ళకు, వద్దామనుకుంటున్నవాళ్ళకూ ఫోన్లు చేసి రండి రండి, రాయండి రాయండి అంటూ ప్రోత్సహిస్తూ ఉంటారు. వికీలో కొత్తవాళ్ళు ఎవరైనా రాజశేఖర్ గారికి పరిచయమైతే వాళ్ళు నానాటికీ వికీ ప్రాజెక్టుల ఆకర్షణలో పడిపోతారు. వాళ్ళ ఆసక్తులేమిటో, ఇష్టాలేమిటో, బలాబలాలేమిటో తెలుసుకుని, వాళ్ళకి నచ్చే పనులు వికీలో ఏమేం చేయొచ్చో చెప్పి, చేయించి, భుజం తట్టి, "మీరు సూపర్ సార్", "అద్భుతంగా చేస్తున్నారు మేడం" అని ప్రోత్సహిస్తారు. ఇదంతా అయ్యాకా అవతలి వ్యక్తి హనుమంతుళ్ళా సముద్రాన్ని లంఘించేంత విజృంభిస్తారు.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లంటూ ఇప్పుడు కొత్తగా వస్తున్నారు గానీ... మా డాక్టరు గారు ఎప్పటి నుండో వికీ ఇన్‌ఫ్లుయెన్సరు! జస్ట్... ఆ పేరు మాకు తట్టడం లేటైంది, అంతే! ఆయన మాత్రం అందరికంటే ముందే!