Jump to content

ఎందరో వికీమీడియన్లు/అసలు వికీపీడియా అంటే ఏమిటంటే...

వికీసోర్స్ నుండి

అసలు వికీపీడియా అంటే ఏమిటంటే...

తెలుగులో విజ్ఞాన సర్వస్వాలు చాలా అరుదు. అందునా ఎన్సైక్లోపీడియా బ్రిటానికా లాంటి బృహత్తర విజ్ఞాన సర్వస్వం అసలు లేనేలేదు. సాహిత్య అకాడమీ ప్రచురించిన విజ్ఞాన సర్వస్వం ఉన్నా, అది సాహిత్య విషయాలకే పరిమితమైంది. ఉన్న కొద్దీ కూడా పెద్ద పెద్ద గ్రంథాలయాలలోనే లభ్యం. ఆవకాయ నుండి అంతరిక్షం దాకా, అటుకుల దగ్గర నుండి అణుబాంబు దాకా ప్రతీ విషయాన్ని వివరిస్తూ సాగే విశాల, విశిష్ట, విజ్ఞాన సర్వస్వాన్ని తయారుచెయ్యడమంటే మామూలు విషయం కాదు. అపార ధనవ్యయం, అశేషమైన పనిగంటలు, అనంతమైన పరిశోధన కావాలి. సకల వనరులూ ఉన్న ప్రభుత్వమో, డబ్బును గుమ్మరించగల పోషకులో పూనుకుంటే తప్ప, ఇలాంటి మహత్కార్యాలు సాధ్యం కావు. అటువంటి బృహత్కార్యాన్ని సాధించేందుకు నడుం కట్టారు, తెలుగువారు. ఐతే ఈ పనికి పూనుకున్నది ప్రభుత్వమో, విశ్వవిద్యాలయమో కాదు. కేవలం మనలాంటి సామాన్యులే భుజం భుజం కలిపి ఈ పని చేస్తున్నారు. కొన్నివందల మంది ఉత్సాహవంతులు నిరంతరం శ్రమిస్తూ కోట్ల మందికి ఉపయోగపడగల ఒక విజ్ఞాన కోశాన్ని తయారు చేస్తున్నారు. ఇంతకీ ఏమిటీ విజ్ఞాన కోశం? ఎక్కడ రాస్తున్నారు, ఎవరు రాస్తున్నారు?

అప్పుడెప్పుడో 2001లో మొదలైంది ఈ కథ. లోకంలోని విజ్ఞానాన్నంతటినీ ఒకచోట చేర్చి ప్రజలంతా స్వేచ్ఛగా వాడుకునే వీలు కల్పించాలనే సంకల్పంతో మొదలైంది. ఎక్కడుంది ఈ విజ్ఞానం.. భాండాగారాల్లో ఉంది, సైన్సు పేపర్లలో ఉంది, పుస్తకాల్లో ఉంది, వార్తా పత్రికల్లో ఉంది, పెద్దపెద్ద సర్వర్లలో ఉంది, పర్సనల్ కంప్యూటర్లలో ఉంది, మెమరీ చిప్‌లలో ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ కొందరో అందుకోగలిగే తావుల్లో ఉంది. దీన్నంతటినీ ఎలా తెస్తారు? ఎవరు తెస్తారు? ఎక్కడ పెడతారు? ఎలా తెస్తారు: ఈ సమాచారాన్ననంతటినీ చదివి, తేనెటీగలు మకరందాన్ని సేకరించినట్లు వాటిలోని సారాన్ని సేకరించి తెస్తారు.

ఎవరు తెస్తారు: స్వచ్ఛందంగా పనిచేసే చదువరులు, లేఖకులు

ఎక్కడ చేరుస్తారు: ఇదిగో ఈ వికీపీడియాలో.

వికీపీడియానా.. అంటే?

వికీపీడియా అనే పేరు ఎలా వచ్చిందనే కథాక్రమం బెట్టిదనిన..

చకచక, పకపక, గబగబ, సలసల, టపటప, తపతప అంటూ జమిలి పదాలున్నాయి కదా మనకు. విడిగా వాటికి అర్థం లేదు, కానీ జంటగా చక్కటి అర్థాన్నిస్తాయి. అలాంటి జమిలిపదాలే హవాయీ భాషలో కూడా ఉన్నాయి. వాటిలో వికివికి అనే మాట ఒకటి. దాని అర్థం చకచక/గబగబ అని. ఆశ్చర్యంగా ఉందా? ఔను, నిజమే!

హవాయి విమానాశ్రయంలో ఈ మాట విన్న వార్డ్ కన్నింగ్‌హామ్‌ అనే పెద్దాయనకు అది నచ్చి, 1995 లో తన వెబ్‌సైటుకు ఆ పేరు పెట్టాడు. ఎవరైనా మార్పుచేర్పులు చేసేలా, ఆ మార్పులు కూడా చకచకా చెయ్యగలిగేలా ఆ వెబ్‌సైటును తయారుచేస్తూ దానికి వికివికివెబ్ అని పేరు పెట్టాడు. ఆ వికీ అనే పేరునే తరువాత వికీపీడియాకు కూడా వాడారు. వికివికి+ఎన్‌సైక్లోపీడియా = వికీపీడియా అన్నమాట! 2001లో ఇంగ్లిషులో మొదలైన వికీపీడియా ప్రస్తుతం 326 భాషల్లో ఉంది. తెలుగులో వికీపీడియా 2003 డిసెంబరులో మొదలైంది. మనం దీన్ని గబగబపీడియా అనో చకచకవిజ్ఞానం అనో కూడా అనుకోవచ్చు. తెలుగు వికీపీడియాకు అది ప్రత్యేకం! (చెతురుగా)

వికీపీడియాలో రాసేది ఎవరో ప్రత్యేకంగా అందుకోసం నియమితులైన రచయితలేమీ కాదు. ఉన్నత విద్యావంతులు, శాస్త్రవేత్తలూ ఉన్నారు, సామాన్యులూ రాస్తున్నారు. వికీపీడియాలో ఎవరైనా రాయవచ్చు, ఏ విషయం గురించైనా రాయవచ్చు. కొన్ని నిబంధనలకు కట్టుబాట్లకు లోబడితే చాలు. అలాగే వికీపీడియాలోని వ్యాసాలను ఎవరైనా ఉచితంగా చదువుకోవచ్చు, డబ్బు కట్టక్కరలేదు. అంతేనా, ఆ వ్యాసాలను మీరు ప్రింటు తీసుకోవచ్చు. అసలు వికీపీడియా మొత్తాన్ని మీ కంప్యూటరులోకి డౌనులోడు చేసుకోవచ్చు - పైసా డబ్బు చెల్లించకుండా !! ఇంకా అయిపోలేదు, ఈ మొత్తం వికీపీడియాను ప్రింటు తీసేసి, పుస్తకాలుగా కుట్టేసుకోవచ్చు. ఆగండి, ఇంకా ఉంది. ఈ పుస్తకాలను పెద్ద సంఖ్యలో ప్రింటేసి, వెల కట్టి అమ్ముకోనూవచ్చు!!!! వికీపీడియా మిమ్మల్ని పన్నెత్తి మాటనదు, పైసా డబ్బడగదు. ఒకే ఒక్కమాట - దీన్ని నేను వికీపీడియా నుండి సేకరించాను అని రాస్తే చాలు.