Jump to content

ఉషాపరిణయము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీ రాజగోపాలాయనమః

ఉషాపరిణయము

(పద్యకావ్యము)

ప్రథమాశ్వాసము

ఇష్టదేవతాస్తుతి

కృత్యవతారిక

ఉ.

శ్రీ విజయాయురున్నతులచే నలరించెదఁ గొల్చువారలన్
ధీవిభవంబుమీర నని తెల్పుచు హేమవనిన్ జెలంగు రా
జీవదళాయతాక్షుఁడగు చెంగమలేశుఁడు మన్ననారు గో
త్రావిబుధేంద్రునిన్ విజయరాఘవచంద్రుని బ్రోచుగావుతన్.

1


శా.

సారోదారకటాక్షవీక్షణసుధాసారంబు తోరంబుగా
భూరి క్షేమ మెసంగఁగా నెపుడు నంభోజాతగర్భాధులన్
శ్రీరంజిల్లఁగఁ జేయుచున్ జెలఁగు మాచెంగమ్మ యిద్ధాత్రిపై
సారెన్ మన్నరుదాసభూవిభుని వాత్సల్యంబునన్ బ్రోవుతన్.

2


సీ.

సంతసంబమర ననంతునిఁ గొనియాడి
        గరుడునిఁ బూజించి ఘనతమీర
సేనాధినాయకు సేవించి భక్తిని
        బన్నిద్దరాళ్వార్లఁ బ్రస్తుతించి

వేదాంతదేశికు వేడ్కతో భజియించి
        వ్యాసవాల్మీకుల వరుసఁ బొగడి
చెలఁగి శతక్రతు శ్రీనివాసాభిఖ్య
        తాతయాచార్యులఁ దలఁచి మదిని


గీ.

వేదసంఘంబు మూర్తీభవించినట్టు
లఖలయాగంబు లొనరించి యవనియందుఁ
జెలువుమారు శతక్రతు శ్రీనివాస
తాతగురువర్యునకును వందన మొనర్తు.

3

సుకవిస్తుతి — కుకవినింద

క.

సకలసభామధ్యంబులఁ
బ్రకటంబుగ విబుధు లెల్ల భళి యనఁదగు నా
సుకవుల సన్నుతిసేయుచుఁ
గుకవుల నిరసింతు మిగులఁ గుశలత మీరన్.

4


వ.

అని యిష్టదేవతానమస్కారంబును సుకవిపురస్కారంబునుఁ
గుకవితిరస్కారంబునుఁ గావించి యేనొక్క ప్రబంధంబు రచి
యించెద నని తలంచుసమయంబున.

5


కృతిభర్త — విజయరాఘవనాయకుఁడు

సీ.

శ్రీరాజగోపాలసేవామహిమచేత
        నేరాజు ధరనెల్ల నేలుచుండుఁ
బరమతంబుల నెల్ల నిరసించి యేమేటి
        వైష్ణవమతమె శాశ్వతముఁ జేసె

బాల్యంబునందునే పగతుర నిర్జించి
        యేనేత కీర్తుల నెసఁగఁ గాంచెఁ
బదియాఱు దానముల్ బ్రణుతింప నేదాత
        యవనీసురల కిచ్చె నాదరించి


గీ.

యాతడచ్చుతభూపవంశాబ్ధిచంద్రుఁ
డధికగాంభీర్యధైర్యశౌర్యాతిపాంద్రుఁ
డవనిఁ దంజాపురాధీశుఁ డనఁగఁ బరఁగు
విజయరాఘవమేదినీవిభువరుండు.

5


వ.

మఱియును సత్యభాషాహరిశ్చంద్రుండును సత్కృపారామచం
ద్రుండును సంగరంగకిరీటియును సకలవిద్యాచాతుర్యపేటియును
దానరాధేయుండును ధరణీజనవినుతభాగధేయుండును రామా
నుజమతసిద్ధాంతస్థాపనాచార్యుండును రాజగోపాలనిత్యకైంకర్య
ధుర్యుండునుఁ జతుర్వేది శతక్రతు శ్రీనివాసాచార్యచరణసరసిజ
సేవానిష్టాగరిష్ఠుండును చతురదధివేష్టితసర్వంసహాపాలక
శ్రేష్ఠుండును సామంతరాజమణికిరీటరంజితపాదాంభోజుండును
సరససాహిత్యకళాభోజుండును రఘునాథనృపాలనందనుండును
రచితకళావత్యంబికానయనానందుండును నగు నివ్విజయరాఘవ
దేవేంద్రుండు రామణీయకవిరచితరాజరాజసభావిజయంబగు రాజ
గోపాలవిజయంబునందు నతులితవిలాసవతులైన కులసతులును
విబుధసన్నుతమతియగు విజయవెంకటపతియును మహితప్రభా
వుండగు మన్నారుదేవుండును తతయశోధనుండగు తాతఘనుం
డును రంగద్గుణవిలాసుండగు చెంగమలదాసుండును మొదలగు
నిఖిలజనమిత్రులైన పుత్రులను నిరుపమచరిత్రపవిత్రులైన పౌత్రు
లును నిరవద్యరూపరేఖాకనకపుత్రికలైన పుత్రికలును నింపు
వెలయఁ దామరతంపరై నిండియుండఁ జెంగట శృంగారవతులు

రంగురక్తులుమీర సంగీతమేళంబు గావింప నగ్రభాగంబున నాచా
ర్యాగ్రేసరుండగు శతక్రతు శ్రీనివాసాచార్యుండు కృతదురిత
భంగంబగు హరివంశకథాప్రసంగంబుఁ గావింప నింపుమీర
నేనును శృంగారరసంబులఁ జెన్నుమీరు మన్నారుదాసవిలా
సంబు వినుపించుచున్నసమయంబున.

5


సీ.

వెంకటేంద్రునిపుత్రి! వినుతసద్గుణధాత్రి!
        ఘనయశోరాజి! రంగాజి! వినుము
ధుర్యమున మించు “మన్నారుదాసవి
        లాస ప్రబంధంబు” లలితఫణితిఁ
గావించి మిగులశృంగారంబు గన్పట్టఁ
        బదములు మృదురసాస్పదము లగుచు
రాణింప రచియించి “రామాయణంబు”ను
        “భాగవతంబు”ను “భారతంబు”


గీ.

సంగ్రహంబున రచియించి సరసరీతి
మమ్ము మెప్పించితివి చాల నెమ్మదనరఁ
బరఁగ హరివంశమున “నుషాపరిణయకథఁ”
దెనుఁగుఁ గావింపు మిఁక నీవు తేటఁగాఁగ.

6


వ.

అని సబహుమానంబుగాఁ దాంబూలజాంబూనదాంబరమాల్యా
భరణంబు లొసంగిన నేనునుం బరమానందంబుఁ జెందుచుఁ బతి
యును గతియునుఁ గులదైవంబునునైన నీదుపాదారవిందంబులు
డెందంబున సేవింపుచున్న తనకు మీరానతిచ్చు కథాసంవిధా
నంబు సర్వంబును నవగతంబగు గావున నల్లన రచియించెద, పంజర
శుకంబు మంజువాక్ఫణితిరంజిల్లం బలికినఁ దత్చోషకుండు సంతో
షించుతెఱంగున మదీయవచనకుసుమార్చనంబంగీకరించి నన్ను

కటాక్షింపుఁడని విన్నవించిన లాలించి యాచార్యచరణారవిందంబు
లకు వందనంబుఁ గావించి యమ్మహామహునియనుజ్ఞం గైకొమ్మ
నుటయు నట్లన సేవించిన దీవించి గురురాజపట్టభద్రుం డిట్లనియె.


కృతభర్తృవంశము

క.

నీపతి మన్నరుదాసుఁడు
గోపాలుఁడు కనుక నితఁడు కోర్కెలు హెచ్చన్
జేపట్టి మనుప నెలకొను
నాపలుకుల నెలఁత! నీ ముఖాంబుజసీమన్.

7


వ.

అని మఱియును.


సీ.

తనరెడు మన్నరుదాసవిలాసంబు
        నమర నీవొనరించు నప్పుడేము
విజయరాఘవమహీవిభుని వంశావళి
        వినుపించితిమి కదా! విశదముగను
గీర్తులుమీరిన కృష్ణభూపాలుండు
        నయశాలి యగు తిమ్మినాయకుండు
దివ్యతేజముగల తిమ్మప్పనాయుండు
        శ్రీనిధియైనట్టి చెవ్వనృపతి


గీ.

చెలఁగి శ్రీరంగమున రామసేతువునను
బొగడ బహువిధకైంకర్యముల నొనర్చి
యచ్యుతాళ్వారు లితఁడన నవని వెలయు
నచ్యుత విభుఁడు నలరిరి యతిశయమున.

8


క.

అల యచ్యుతభూవిభునకు
నలఘుయశఃస్ఫూర్తి మూర్తిమాంబకు సుతుఁడై
వెలసె రఘునాథమహీ
తలపతి రఘునాథుఁ డితఁడె తప్పదనంగన్.

9

కృతభర్తృజన్మప్రకారము

సీ.

తవర నారఘునాథధరణీశ్వరుఁడు చెంజి
        లక్ష్మమ్మ యల్ల కళావతెమ్మ
పట్టంపురాణులై ప్రబలి సేవయొనర్పఁ
        గులమెల్ల వెలయించు కొడుకు వలసి
దానధర్మంబులుఁ దపములు సలుపుచుఁ
        గస్తూరికృష్ణుని ఘనత వేఁడ
నల చెంజిలక్ష్మమ్మకలలోనఁ గస్తూరి
        కృష్ణుఁ డిట్లనెఁ బూర్వవృత్త మొకటి


గీ.

నీవు తొల్తను దేవకీదేవి వరయ
సాటిలేని కళావతీసతి యశోద
యల్ల వసుదేవనందులయాత్మ లిచట
నెగడె నచ్యుతరఘునాథనృపతి యనఁగ.

10


సీ.

అల వసుదేవున కాత్మసంభవుఁడనై
        మందలో బెరుఁగంగ నందునింటఁ
దపములు చేసి యే దనయునిఁ గాంచితి
        బాలలీల యశోద భాగ్యమయ్యె
నని తలంపుచు నుంటి వటుఁగాన నిప్పు డే
        నొగిఁ గళావత్యంబయుదరమందు
నుదయింతు సంతోష మొదవంగ నీవును
        ఘనతఁ బుత్రస్వీకృతిని నొనర్చి


గీ.

విజయరాఘవుఁ డనుపేర వెలయఁజేసి
నన్ను పోషించి యిపుడు నానంద మొందు
మనుచుఁ బల్కంగ మేల్కని హర్ష మంది
వెలయ లక్ష్మమ్మ విభునకు విన్నవించె.

11

వ.

అట్లుదయించిన మహామహుండుగావున.


ఉ.

నిస్తులసద్గుణావళులనిర్మితవాసన నిండ దిక్కులన్
స్వస్తి యొనర్పుచున్ సుజనసంతతి కెల్లను మాటిమాటికిన్
గస్తురికృష్ణుఁ డీతఁడన గౌరవమందుచు ధాత్రిలోపలన్
బ్రస్తుతి కెక్కు నీవిజయరాఘవచంద్రున కిమ్ము నీకృతిన్.

12


వ.

అని యానతిచ్చి యాచార్యశేఖరుండు ప్రబంధారంభంబున
కనుజ్ఞ నిచ్చెఁ గావున.


షష్ఠ్యంతాలు

క.

అమితకళాభోజునకును
గమలాప్తసమాసబాహుఘనతేజునకున్
సమరాగ్రబిడౌజునకును
రమణీజనతామనోహరమనోజునకున్.

13


క.

చెంగమలావరకరుణా
పాంగవిలోకనసమాగతైశ్వర్యునకున్
సంగరరంగోద్ధతరిపు
భంగప్రదమాననీయబలధుర్యనకున్.

14


క.

దారుణశాత్రవమథనో
దారునకుఁ గుమారతాతయాచార్యపదా
ధారునకు విశ్రుతయశో
ధారునకు సరససత్కళాధారునకున్.

15


క.

కనకతులాపూరుషముఖ
వినుతమహాదానకలితవిద్వత్తతికిన్
ఘనశబ్దార్థనిగుంభన
జనితబుధానందసకలసన్నుతకృతికిన్.

16

క.

కనకక్షితిధరధృతికిని
జనకపదాంభోజభజనసంభృతమతికిన్
ఘనవితరణరతికి బుధా
వనకృతికిన్ విజయరాఘవక్ష్మాపతికిన్.

17


వ.

అంకితంబుగా నే నొనర్పంబూనిన యుషాపరిణయంబను మహా
ప్రబంధరాజంబునకుం గథాసంవిధానం బెట్టిదనిన.


కథాప్రారంభము

క.

జనమేజయజనపాలుఁడు
విని వీనులవిందుగాఁగ వెన్నునికథలన్
దనివొందక వైశంపా
యనునకు నిట్లనియె మఱియు నాదర మొప్పన్.

18


సీ.

కృష్ణునిమనమఁడై కీర్తుల వెలసిన
        యనిరుద్ధుఁ డెట్టు? లయ్యసురపుత్రి
యగు నుషాకన్యక నంతఃపురంబున
        వరియించెఁ బ్రబలుఁడై వచ్చినట్టి
బాణుండు శౌరితో బవరంబు గావించి
        ప్రాణంబుతో నెట్లు పారిపోయె?
మును మాకు సంక్షేపమున నెఱింగించితి
        విస్తరంబుగఁ దెల్పు వేడ్కబొడమ


గీ.

ననుచు వేడిన భరతవంశాగ్రణికిని
సావధానంబుగా విను జనవరేణ్య!
వినికిజేసెద సర్వంబు వీనులలర
ననుచు నవ్యాసశిష్యుఁ డిట్లనియె నపుడు.

19

శంకరవరబలముచే బాణాసురుండు గర్వించియుండుట

వ.

ఓ వైష్ణవాగ్రేసర! బలితనూభవుఁడగు బాణాసురుండొక్కనాఁడు
సకలవిలాసంబులుమీర షణ్ముఖుండేతేర నతనివైభవంబుఁ జూచి
మెచ్చి యచ్చరుపడి తానును భద్రంబుగా రుద్రు నారాధించి
యతనికుమారుండ నయ్యెద నని మది నెంచి తీవ్రంబగు తపంబు
సేయ, నంతఁ గొంతకాలంబునకు పార్వతీసమేతుండై ముక్కంటి
యక్కడికి వచ్చిన నయ్యసురవరుండు బహువిధంబుల స్తుతియింప
నా భర్గుండు ప్రసన్నుండై , ఓయి బలినందన! హెచ్చైన నీ
తపంబునకు మెచ్చితిమి. నీవు కోరినట్ల నిక్కుమారునకు సోదరుం
డవై సకలవైభవంబుల సాటిలేనిమేటివై శోణితపురంబునకు
నాయకుండవు గ మ్మేను నీవాకిలిఁ గాచియుండెద నని వరంబు
లొసంగిన.

19


బాణుఁడు శంకరునివద్ద సమరమును కోరుట

క.

వరగర్వంబున బాణుఁడు
గరిమన్ దిక్పతుల గెలిచి కదనములోనన్
సరిలేరు తనకు నిపు డని
పురహరునిం జేరఁబోయి పొంగుచుఁ బలికెన్.

20


ఉ.

శంకర! దేవదానవుల సంగరమందు ననేకభంగులన్
బింక మడంచితిన్ గనక భీతిలి చెంతలఁ జేర రిప్డు మా
కింకిట వేయిచేతులకు నేమి? ప్రయోజన మెంచి చూడఁగాఁ
బొంకముమీర నొక్క యని భోగవిభూషణ! కల్గఁ జేయవే.

21


క.

అని పల్క నవ్వి రుద్రుఁడు
విను బలిసుత! నీదుడాలు విఱిగిన యపుడే
ఘనమగు కయ్యము కలుగును
మనమున యోచించ కిపుడు మగుడుము వేడ్కన్.

22

వ.

అని యిట్లు రుద్రుండు పలికిన బాణాసురుండు సంతసంబున మగుడి
వచ్చి యంతిపురంబునఁ గొలువుండుసమయంబునఁ గుంభాండుం
డను మంత్రివరుండు బలినందనుం గనుంగొని యో స్వామి!
మీకు నింతసంతోషంబు గలుగుటకుఁ గారణం బేమి? యని
యడిగిన నమ్మంత్రివరునకు నా దైత్యవరుం, డిట్లనియె.


ఉత్పాతములఁ గని బాణుఁడు జంకకుండుట

సీ.

వినవోయి కుంభాండ! వివరంబుగాఁగ నే
        ఫాలలోచనుఁ జేరి భక్తి మీర
జగడంబు వేడంగ సమ్మతి నతఁడును
        డాలు ధరిత్రిని వ్రాలునపుడె
కయ్యంబు గల దని నెయ్యంబుతోఁ బల్కె
        ననిన బాణునిమాట కతఁడు వెఱచి
శంకరుకడ కేఁగి సమరంబు వేడంగ
        బలితనూభవ! నీకుఁ బాడి యగునె!


గీ.

యనినవేళనే యతనిడా లవనిఁ బడిన
మించు నుత్పాతములు కనుపించ మఱియు
సడ్డ సేయక వాఁడును సంతసమున
నింతులును దాను సుఖగోష్ఠి నెసఁగుచుండె.

23


బాణాసురుని పుత్రి యుష

వ.

అంత.


సీ.

పార్వతివరమున బాణాసురేంద్రున
        కల యుషాకన్యక యవతరించి
దాదులు పోషింపఁ దనరెడు వేడ్కచే
        శశిరేఖకైవడిఁ జాలఁ బ్రబలి

పరఁగ గుజ్జనగూళ్లు వండి నెచ్చెలులతో
        బేర్వేర బొమ్మలపెండ్లి సేయు
వెన్నెలబైటను గన్నియలుం దాను
        మొనయుచు డాఁగిలి మూతలాడు


గీ.

నింతులను గూడి బంగరుబంతులాడు
బాలికలతోడ నారామకేళి సల్పుఁ
జదువు మృదుకోకిలాలాపసరణిమీర
వీణె వాయించుఁ జెవులకు విందుగాఁగ.

24


వ.

అంత.


సీ.

మోముదామరమీఁద ముద్దుగుల్కుచు వ్రాలు
        గండుమీ లనఁగను గన్ను లమరె
సౌందర్యనదిలోనఁ జక్కఁగా విహరించు
        చక్రవాళము లనఁ జన్ను లమరెఁ
దళుకొత్తు బాహులతాయుగ్మమున నొప్పు
        చికురుటాకు లనంగఁ జేతు లమరె
నాభివల్మీకంబునను వెలువడి వచ్చు
        చిలువనా నూఁగారుచెలువ మమరె


గీ.

మెఱసి తొలఁగని తొలకరి మెఱపనంగ
మిగుల సొబగైన కాంతిచే మేనుఁదీవ
కలితలావణ్యచారుశృంగారగరిమఁ
గలిగి చెలువొందు నల యుషాకన్య కపుడు.

25


ఉష శృంగారవనమునఁ బార్వతిఁ గని వరమును బడయుట

వ.

ఇవ్విధంబున నివ్వటిలుజవ్వనంబున వర్తిల్లుచు నా జవ్వని
యొక్కనాఁడు.

సీ.

పల్లవంబులమించు పదముల రతనంపు
        టందియల్ ఘల్లు ఘల్లనుచు మ్రోయ
ఘననితంబములందుఁ దనరారు బంగారు
        మొలనూలిఘంటలు మురువుఁ జూప
శృంగారములమీరు కెంగేలుదమ్ముల
        నీలంపుగాజులు చాల మొరయఁ
దపనీయమయరత్నతాటంకములు మంచి
        నిద్దంపుచెక్కిళ్ల నిగ్గులీన


గీ.

సరులఁ బెనఁగొని పాలిండ్లు సారెఁ గులుక
గౌను లసియాడ మదహంసగతులు మెఱయ
వనితలును దాను శృంగారవనముఁ జేరె
భావ మిగురింప నల యుషాభామ యపుడు.

26


క.

ముక్కంటి గౌరి యవ్వని
మిక్కిలిఁ బ్రేమంబుమీర మెఱయంగా నా
మక్కువఁ గని యుష తనమది
నక్కట! యిట్లుండవలదె! యనుచుఁ దలంపన్.

27


చ.

అల యుషఁ జూచి గౌరి వదనాంబురుహంబున మందహాసముల్
జెలఁగఁగ మమ్ముఁ జూచి యిటు చింతిల నేఁటికి? నిట్టిభాగ్యముల్
గలుగును నీకు నింక ననఁ గల్గునో! యెన్నటికంచు సిగ్గునం
బలుకఁగ మోము వంచు నల భామినిఁ గన్గొని పల్కె నీగతిన్.

28


సీ.

జలజాక్షి! వినుము వైశాఖమాసమునందు
        భాసురంబగు శుక్లపక్షమునను
రహిమించు ద్వాదశిరాత్రి నీకలలోన
        నెవ్వఁడు పొందు నిన్నెలమి నతఁడె

పతియగు నీకని భావంబు రంజిల్లఁ
        బార్వతి పలికిన పలుకులకును
హర్షించి యెంతయు నాత్మలో నుప్పొంగి
        గౌరికి మ్రొక్కుచుఁ గారవమున


గీ.

బంతిఁ గూర్చుండి యంతట బాగుమీర
రమణులును దాను వనభోజనము నొనర్చి
పరఁగ బాణాసురునిముద్దుపట్టి యపుడు
నిజనివాసంబుఁ జేరెను నెమ్మితోడ.

29


వ.

అంత.


క.

సురగరుడయక్షరాక్షస
వరకన్యలు చేరి కొలువ వైభవ మమరన్
దొరతనము మీరి యెంతయు
సరసిజముఖి యుండెఁ జాలసంతస మెసఁగన్.

30


పార్వతీవరానుసారముగ నుష కలఁ గనుట

క.

కులగిరికన్యక పల్కిన
చెలువున వైశాఖమాససితపక్షమునం
దలరెడు ద్వాదశిరాత్రిని
జలజేక్షణ నిదురబోవుసమయమునందున్.

31


సీ.

చంద్రికనిరసించుసరణిచే రాణించు
        చిరునవ్వు మోమునఁ జెలఁగువాఁడు
తామరరేకులఁ దానెంత లేదను
        వెడఁదకన్నులుఁ గల్గి వెలయువాఁడు

తులకించుదొండపండులఛాయఁ దెగడెడు
        మురువుచే మించు కెమ్మోవివాఁడు
పాంచజన్యముతోడఁ బ్రతివచ్చు ననవచ్చు
        కలితరేఖలఁ బొల్చు గళమువాఁడు


గీ.

నురము బంగరుతల్పన నొప్పువాఁడు
భోగిభోగాభభుజములఁ బొలుచువాఁడు
లలితగజరాజగమనంబుఁ గలుగువాఁడు
కనకములమించునిరసించు కాంతివాఁడు.

32


సీ.

సంపంగిపువ్వులు సరసత సిగఁ జుట్టి
        బురుసారమాల్గట్టి పొంకమమర
నర్ధచంద్రునిసొంపు నదలించు నుదుటను
        దీరుగాఁ దిలకంబు దిద్ది వేడ్క
శ్రీకారములమించు చెలువంబుఁ గల్గిన
        వీనులఁ జౌళట్లు వెలయ నుంచి
బటువుముత్తియముల బాగుగాఁ గూర్చిన
        కంటసరుల్ దాల్చి ఘనతమీరఁ


గీ.

దనర నురమున వజ్రాలతాళి వైచి
హస్తములఁ గెంపుకడియము లలరఁ బూని
వసుధ జీరాడు చుంగులవన్నెఁ గాంచు
మేటి కనకాంబరమువలె వాటుఁదనర.

33


క.

బంగరుమంచముమీఁదను
సంగతిఁ గూర్చుండి మిగులసరసత్వముచే
నంగనఁ దగ రారమ్మని
శృంగారరసంబు మీరు చెలువం బమరన్.

34

సీ.

గందంబు మైఁ బూసి కౌఁగిటం జేర్చుచుఁ
        గస్తూరి దిద్దుచు గారవించి
సంతసంబునఁ జేరి చక్కెరమోవివాని
        బటువుగుబ్బలు జీరి బాగుమీర
గళరవంబులుఁ జేసి కళలంటి సొక్కించి
        చెక్కిలి నొక్కుచుఁ జెలువమమరఁ
దొడలపై నుంచుక తొయ్యలి రమ్మని
        పుక్కిటి విడెమిచ్చి బుజ్జగించి


గీ.

చాలఁ జనవిచ్చి మిక్కిలి సరసముగను
గొప్పు దువ్వుచు విరిసరుల్ గూర్చి వేడ్కఁ
దేటమాటల లాలించి తేనె లొలుక
రతులఁ దేలించె గలలోన రమణుఁ డొకఁడు.

35


కలఁగని మేల్కొన్న యుష కలఁగఁగాఁ జిత్రరేఖ సమాశ్వాసపరచుట

చ.

కలఁ గని మేలుకాంచి తనకంఠము నంటిన గోటిజీరలున్
బలుచనిమోవిపై మిగుల బాగుఁగ నుంచినయట్టి కెంపులుం
గులుకు మెఱుంగు గబ్బివలిగుబ్బల నించిన గంధసారముల్
బలుమరుఁ జూచి సోద్యపడి భావములోనఁ గలంకఁ జెందఁగన్.

36


వ.

అచ్చటికి నెచ్చెలియగు చిత్రరేఖ వచ్చి మాన్య యగునుషాకన్యం
జూచి యిట్లనియె.


సీ.

అక్కరో! నీ వేల? యాత్మలోఁ గలఁగెదు
        వేగంబ తెల్పవే వివరముగను
సకలదిక్పతులను సమరంబులో గెల్చి
        సరిలేకయుండ నీజనకుఁ డెపుడు

నైరావతము నెక్కు నాయింద్రుఁ డెప్పుడు
        చెప్పినయుడిగంబు సేయుచుండ
ఫాలలోచనుఁడును బ్రమథులతోఁగూడి
        గొల్లయై వాకిటఁ గొల్చియుండ


గీ.

నొనర నంతఃపురంబున నున్న నీకు
నింత భయమేమిటికి? వచ్చె నిందువదన!
భావ మిది యని పల్కవే పద్మగంధి!
చెలియ నాకన్న నాప్తు లేచెలులు నీకు?

37


ఉష స్వప్నవృత్తాంతమును చిత్రరేఖకు తెల్పి వగచుట

వ.

అని పల్కిన చిత్రరేఖనుం జూచి యుష యిట్లనియె.


సీ.

మొలకనవ్వులవాఁడు కలువలచెలికాని
        మురువుఁగైకొను ముద్దుమోమువాఁడు
వెడఁదకన్నులవాఁడు వేదండతుండాభఁ
        గొమరొందు బాహుకాండములవాఁడు
చిన్నిపాయమువాఁడు చిగురుకైదువజోదు
        రీతినొప్పెడు రూపరేఖవాఁడు
నిద్దంపుజిగివాఁడు నీలమేఘములీల
        రహిమించు చికురభారంబువాఁడు


గీ.

కలితశృంగారలక్షణగరిమవాఁడు
చెలుపుఁ డొక్కండు ననుఁ జేరి చెలువుమీరి
కౌఁగిటను జేర్చి మోవాని కంతుకేళిఁ
గలయ నంతట మేల్కంటిఁ గలువకంటి!

38

క.

కలలోఁ జేసిన చిన్నెలు
తలపఁగఁ బ్రత్యక్షమౌనె తా మేల్కనినన్
నెలకొనియున్నది యిపుడును
బలుకుదు నేమనుచు నీకుఁ బద్మదళాక్షీ!

39


సీ.

తండ్రిదగ్గఱఁ బోయి తలిరాకుఁబోణిరో!
        యేగతి? నిల్తునే యెమ్మెమీరఁ
గన్నె! యిదేమని కన్నత ల్లడిగిన
        నుత్తరం బేమిత్తు! నువిద! యిపుడు
నన్నదమ్ములు చూచి యాత్మసంశయ మంద
        నేమని? తెల్పుదు నిందువదన!
బంధువర్గము లెల్ల భావించి పరికింప
        మఱుఁ గెటువలె సేతు? మచ్చకంటి!


గీ.

కులసతులమ్రోల నెటువలె నిలుతునమ్మ?
యట్టి బలివంశమునఁ బుట్టినట్టి తనకు
వనిత! రావచ్చునా యపవాద మిట్లు
జగతి సరివారిలో నెట్లు సంచరింతు?

40


చెలులు బాణపుత్రికి ధైర్యము చెప్పుట

క.

ఇటు వగచిన యుషఁ గనుఁగొని
కటకటనుచుఁ జెలులు చాల గళవళపడుచున్
గుటిలాలకమది కప్పుడు
దిటవు గలుగఁ బలికి రిట్లు తేటపడంగన్.

41


మ.

వినవమ్మా! దనుజేంద్రపుత్రి! వలదే వేమారుఁ జింతింపఁగా
నెనయ న్నీచరితంబు లేమెఱుఁగమా యేకార్యముల్ జేసినన్
దనరన్ మంచివెకాని కాని వగునే ధర్మంబు నీ సొమ్మగున్
వనజాక్షీ! కలలోని సంగమమునన్ బాపంబు రానేర్చునే.

42

వ.

అని మఱియు నిట్లనిరి.


సీ.

కడు మనోవాక్కాయకర్మంబులందుఁ దా
        నెవ్వండు కలుషంబులే యొనర్చు
నది పాపమగుఁ గాని యతివరో! నీకును
        గల పురషునిఁ గూడఁ గలుష మగునె
సత్కులంబందును సరసత జన్మించి
        రూపరేఖలచేత రూఢి కెక్కి
నలుగు రౌనన మంచినడకఁ గల్గిన నీకు
        నీవిచారం బేల? యిందువదన!


గీ.

యనుచు నూఱడఁబల్కఁగ నతివ లెల్ల
మదివిచారంబు మానని మగువకడకుఁ
జేరి కుంభాండపుత్రి యాచిత్రరేఖ
పలికె నిట్లని యాయింతిభావ మలర.

43


చిత్రరేఖ పార్వతి వరమును జ్ఞప్తికిఁ దెచ్చుట

సీ.

వనజాక్షీ! యుద్యానవనములోపల నాఁడు
        పార్వతి పలికిన పలుకు లెల్ల
మఱచితిగాఁబోలు! మక్కువ మీరంగ
        నే వివరించెద నిపుడు వినుము
శుకవాణి! వైశాఖశుక్లపక్షంబున
        నలువొందు ద్వాదశినాఁటిరాత్రి
కలఁగూడు పురుషుండె కాంతుఁడౌ ననియును
        నతఁడును శౌర్యాఢ్యుఁ డౌనటంచుఁ


గీ.

బలికెఁ గదవమ్మ! నీతోడఁ బంతమలర
గౌరిపలు కేల తప్పును? కలఁకమాని
సంతసంబున నుండుము సకియ! యనినఁ
జిత్రరేఖకు నిట్లనెఁ జెలువ యపుడు.

44

ఉష తాను కలను జూచిన కాంతుని దెమ్మని చిత్రరేఖతో ననుట

చ.

మఱచిన కార్యమియ్యడను మానిని! నీవు తలంపఁజేసితౌఁ
బరగఁగ నాఁడు గౌరి తగఁ బల్కినరీతిని గంటి స్వప్నమున్
దరుణిరొ! యింక సేయఁదగు తక్కిన కార్య మదేమి యన్న భా
సురగతి నిన్న నేఁ గలను జూచిన చెల్వుని జూపవే సఖీ!

45


క.

అని పల్కిన చెలిమాటలు
విని భావమునందుఁ జాల వేడుక మీరన్
వనజాక్షిఁ జూచి ప్రేమం
బెనయఁగఁ గుంభాండపుత్రి యిట్లని పలికెన్.

46


సీ.

కమళదళాక్షీ! నీకలలోన వచ్చిన
        పురుషుఁ డేకులమునఁ బుట్టినాఁడొ!
పరికింప నెటువంటి బలిమిఁ గల్గినవాఁడొ!
        యెటువంటికీర్తిచే నెనయువాఁడొ!
రూఢిచే నెటువంటిరూపుఁ గల్గినవాఁడొ!
        కనుపట్టు నెటువంటికాంతివాఁడొ!
తెలియంగ నెటువంటిదేశ మేలెడువాఁడొ!
        యేవిలాసముచేత నెసఁగువాఁడొ!


గీ.

యొక్క గుఱుతైన నాతోడ నువిద! నీవు
తెలుపకుండిన నెటువలెఁ దెలియవచ్చు?
చోరుఁడై యంతిపురమును జొచ్చివచ్చి
మగువ! నినుఁగూడు నతఁడు సామాన్యుఁ డగునె!

47


క.

బలిసుతుఁ డేలెడు నీపురి
బలవైరియుఁ జేరవెఱచు బాణాసురునిన్
గెలువఁగఁజాలిన పురుషుఁడు
గలుగుట నీభాగ్యవశము కంజదళాక్షీ!

48

ఉ.

గౌరియనుగ్రహంబునను గల్గెను నీ కిటువంటిభాగ్యముల్
నీరజనేత్ర! తామసము నీ వొనరింపఁగ నేల? వేగమే
యూరును బేరునున్ దెలిసి యొద్దిక సేయుద మెల్లకార్యముల్
శ్రీరమణుండు నీతలఁపుఁ జేకుఱసేయును నేటరేపటన్.

49


వ.

అని పల్కిన.


క.

మరుకాఁకలచే మిక్కిలి
బరవశయై చాలభ్రమసి భామామణి! నా
వరఁ దోడి తెచ్చి చూపుము
పరఁగన్ సరివారలెల్లఁ బ్రస్తుతి సేయన్.

50


వ.

అని మఱియును.


చ.

మలయజగంధి యెంతయును మాటికి మాటికి వెచ్చనూర్చుచున్
బలుమరుఁ దాను గన్నకల భావములోపల నెంచి చూచుచున్
వలపులవింటివాఁడు గడువాఁడిశరంబుల నేయ సోలుచున్
నెలతుక చిత్రరేఖఁ గని నెమ్మిని నిట్లని పల్కె గ్రమ్మరన్.

51


క.

కలలోఁ జూచిన పురుషుని
నెలఁతుక! యిటు దెచ్చి కూర్చు నెనరున ననుచున్
బలుమరు నీగతిఁ బల్కిన
జలజాక్షికిఁ జిత్రరేఖ సరసత ననియెన్.

52


చిత్రరేఖ చిత్రపటముల వ్రాసి దెచ్చుటకై యరుగుట

సీ.

ఉవిదరో! వినవమ్మ! యూరుపే రెఱుఁగక
        యేరీతిఁ దేవచ్చు? నిటకు నతని
నయినను నానేర్చు నాయుపాయంబునఁ
        జిత్రపటంబునం జెలువు మెఱయఁ

ద్రిజగంబులందును దేజంబుచేతను
        బలపరాక్రమములఁ బ్రబలునట్టి
గీర్వాణదానవకిన్నరగంధర్వ
        వసుమతీనాథుల వ్రాసి తెత్తు


గీ.

సప్తదినములలోనను సరవిమీర
నపుడు నీభర్త వీఁడని యంటివేని
యతని దోడ్తెచ్చి నినుఁగూర్తు ననుచుఁ బల్కి
పటము వ్రాయంగఁ జనియెను బద్మగంధి.

53


ఉష విరహతాపము

వ.

అంత.


క.

కటకట! సప్తదినంబులు
నెటువలె నేఁ గడపుదాన నీవిరహాబ్ధిన్
దిటముగఁ బల్కిన నెచ్చెలి
పట మెప్పుడు తెచ్చుననుచు భామామణియున్.

54


సీ.

చెక్కిటఁ జేయిడి చింతచే మిక్కిలి
        గంతునిబారికి గలఁగుచుండు
నిట్టూర్పువుచ్చుచు నెమ్మితో నెంతయుఁ
        దుమ్మెదమ్రోత్రకుఁ దూలుచుండు
వసుమతి బొటవ్రేల వ్రాయుచున్ బ్రేమచేఁ
        గోయిలరవళికిఁ గుందుచుండు
నివ్వెఱఁగందుచు నెనరుతో నెంతయు
        శుకముపల్కులకును సోలుచుండుఁ

గీ.

బరఁగ నలుదిక్కులను జూచి భ్రమయుచుండు
నెపుడు పతిఁ జూతు నేనని యెంచుచుండుఁ
దనరఁ దనలోనె కాంతుని దలఁచుచుండు
మనసుఁ బ్రియుమీదనే నిల్పి మఱిఁగియుండు.

55


సీ.

తనర నేఁ జేసిన తపములు ఫలియింపఁ
        జెలఁగి నాథునిసేవఁ జేయవలదె
కడుమించు నామదికాంక్షలు చేకూరఁ
        జెలువుని గౌఁగిటఁ జేర్పవలదె
తమిమీర నామేనితాపంబు చల్లారఁ
        బ్రాణవల్లభునిమో వానవలదె
ముదముతోడుత నాదు ముచ్చట దీరంగ
        ననశయ్యఁ బ్రియునిఁ బైకొనఁగవలదె


గీ.

యనుచుఁ జింతించు మాటికి నౌర యంచుఁ
దలఁకుఁ దలయూచుఁ దనలోనఁ దత్తఱించు
జిమ్మిరేఁగినవలపులఁ జిక్కి మిగుల
విరహపరితాపభరమునఁ దరుణి యపుడు.

56


మ.

మకరాంరాకృతి నాథుఁడొక్కరుఁడు ప్రేమన్ జేరఁగావచ్చి మ
చ్చికమీరన్ మరుకేళిఁగూడి కలలోఁ జెన్నొంద లాలించుచో
నకటా! యేఁటికి మేలుకొంటి నిఁక నే నారాజకందర్పుతో
రకమౌకూటమిఁ గూడుటెన్నఁడొ! మదిన్ రంజిల్లుటింకెన్నఁడో!

57


సీ.

ఏనోము నోఁచెనో! యెలమితో రమణుండు
        చేపట్టి లాలించు చిగురుఁబోణి
యేపూజఁ జేసెనో! యేచినతమి నాథుఁ
        బైకొని క్రీడించు భాసురాంగి

యే మేలొన ర్చెనో! యేప్రొద్దుఁ బ్రాణేశు
        కౌఁగిట మెలఁగెడు కంబుకంఠి
యేపుణ్య మొనరించెనో! పేర్మి వల్లభుఁ
        బొలయల్క నదలించు పుష్పగంధి


గీ.

యెంత భాగ్యంబుఁ జేసెనో! యెపుడు విభుని
మనసురా సేవయొనరించు మచ్చకంటి
యెట్టి వేలుపుఁ గొల్చెనో! యేకరీతి
వరుఁడు చనవిచ్చి మన్నించు వన్నెలాడి.

58


వ.

అని మఱియును.


సీ.

కాంతుండు కన్నులఁ గట్టినయటులైన
        నోరి! రారా! యని చేరఁబిలుచుఁ
బ్రేమతో రమణుండు పిల్చినయటులైన
        నెనరుతో నేమిరా! యనుచుఁ బలుకు
బ్రియముతో నాథుండు పెదవానినటులైన
        నొకవింత సీత్కృతు లొనరఁజేయుఁ
జెలువుండు గళరవంబులుఁ జేసినటులైన
        వీనులవిందుగా వినుచుఁ జొక్కు


గీ.

మోడిఁ గైకొన్న యటులైన గోడెకాఁడు
చాల వలచితి సొలసితిఁ గేళినేలు
వేడుకలుమీర నన్నంచు వేఁడుకొనును
గాంత మరుమాయచేత విభ్రాంత యగుచు.

59


సీ.

పెంచిన చిల్కను బ్రియముతో రమ్మని
        పద్యముల్ జెప్పదు పద్మగంధి
రాయంచగములను రమణఁ జేరఁగఁబిల్చి
        నడువులు నేర్ప దానళిననేత్రి

నెమ్మిగుంపుల నెల్ల నెమ్మితో రమ్మని
        యాడింపఁగా నెంచ దలరుఁబోణి
శారిక రమ్మని చనవచ్చి మిక్కిలి
        మాటలాడింప దామందయాన


గీ.

ప్రియముమీరంగ బొమ్మలపెండ్లి జేసి
కొమరుఁగుల్కంగ గుజ్జెనగూళ్లు వండి
పడతులకుఁ బెట్ట నొల్ల దప్పంకజాక్షి
విరహభారంబుచేతను గరగి మిగుల.

60


విరహభారముచే తపించుచున్న యుషాకన్యఁ జూచి చెలులు తాపకారణము నడుగుట

క.

నెలకొను విరహముచేతను
గలఁగుచు నీగతిని జాలఁ గళవళపడు నా
పొలఁతుకఁ గని యొకనెచ్చెలి
పలికెన్ నెచ్చెలులఁ జూచి భావమెలర్పన్.

61


సీ.

చెలులార! కంటిరా చెలువ యున్నతెఱంగుఁ
        బలువగలై తోచె భావమునను
గులమున కెంతయుఁ గొదవ వచ్చె నటంచుఁ
        గుందియున్న తెఱంగొ! కుందరదన
కలలోనఁ గలసిన కాంతునిఁ దలఁచుచు
        విరహాన నున్నదో! వెలఁది యిపుడు
బుద్ధిచాతురిచేతఁ బొలఁతుక లందఱు
        నిశ్చయింపుఁడు వేఁగ నేర్పుమీర


గీ.

నసురనాథుండు వినెనేని యాగ్రహించు
నిందుల కుపాయ మేమింక నింతులార!
యనిన వారలలో నొక్కయలరుఁబోణి
నెమ్మి నిట్లని పల్కెను నిశ్చయించి.

62

క.

తరమిడి తనలో నవ్వుచుఁ
గరఁగుచు నలుదిక్కు జూచి కళవళపడు నీ
కరిరాజగమనఁ జూచిన
మరుకాఁకయె సిద్ధమనుచు మగువలతోడన్.

63


గీ.

పలికి మనమెల్ల నిప్పు డీపడఁతిఁ జేరి
తెలియ నడుగుడ మింకను దేటపడఁగ
ననుచు నాలోచన యొనర్చి యందముగను
బలికి రిట్లని యుషఁ జూచి భావమలర.

64


సీ.

ఇంతఁ జింతింపంగ నేలనే? యెలనాగ!
        పలుకవే మాతోడఁ బద్మగంధి!
యెంతకార్యంబైన నే మిందఱముఁ గల్గఁ
        గలఁగ నేఁటికి? నీకుఁ గలువకంటి!
కలలోనఁ బతిఁగూడఁ గులమువారలకెల్లఁ
        గొదవంచు నున్నావొ కుందరదన!
యానాథుఁ బలుమఱు నాత్మలోఁ దలఁపుచు
        విరహాన నున్నావొ సరసిజాక్షి!


గీ.

తెలియఁబల్కుము వేగమే తేటగాఁగ
ననుచుఁ బల్కువయస్యలయానసములుఁ
జూచి యెంతయు సిగ్గుతో సుదతి యపుడు
మనసు డాఁచంగనేరక యనియె నిట్లు.

65


చెలులకుఁ దనతాపకారణముఁ దెలిపి వారితోఁగలసి యుష శృంగారవనమునకు మన్మథు నారాధించుటకై చనుట

ఉ.

ముచ్చటమీర నాకలను మోహముతోడుతఁ గూడునాథుఁడే
యచ్చెరువొంద నాయెదుట నందముగుల్కఁగ నున్నయట్లుగా
నిచ్చటఁ దోఁచెఁ గన్నులకు నేమని? తెల్పుదు నిట్టి మోహముల్
పచ్చనివింటిజోదు పెనుబారికి నేగతి నింకఁ దాళుదున్.

66

వ.

అని మఱియు నిట్లనియె.


సీ.

అల్ల కుంభాండుని యాత్మజయైనట్టి
        చిత్రరేఖ యివుడు చెలువుమీరఁ
ద్రిజగంబులను గల్గు తేజోనిధులనెల్ల
        సప్తదినంబుల సరసరీతి
వ్రాసి తెచ్చెద నని వన్నెమీరఁగఁ బల్కి
        పటముఁ దే నరిగెను బంతమలరఁ
దుంటవిల్తుఁడు వాఁడితూపుల నేయంగ
        గడియ యొక్కయుగంబుగాఁగఁ దోఁచెఁ


గీ.

బ్రాణసకులార! నాదైన భావ మివుడు
మీకు దాచక తెల్పితి మించె వలపు
చేర నెప్పుడు వచ్చునో! చిత్రరేఖ
తలఁపు లెప్పటికి నీడేర్చు దైవమింక.

67


వ.

అని పల్కిన యుషాకన్యకు మాన్యలగు నెచ్చెలు లిట్లనిరి.


క.

కలఁగకు నెమ్మదిలోపల
పొలఁతీ! యిందున్నఁ బొద్దు పోవునె మనకున్
బొలుపగు శృంగారవనిన్
వలరాయని గొల్త మనిరి వాంఛిత మమరన్.

68


క.

ఫణిరాజహారచింతా
మణి కామగవీ సురద్రుమ శ్రీఖండ
క్షణధాధిప శరదభ్ర
ప్రణుతయశస్సాంద్ర! విజయరాఘవచంద్రా!

69


ఉ.

శౌరిపదాబ్జసేవనవిచక్షణ! శ్రీరమణీయవీక్షణా!
వైరిజనాధికస్మయనివారణ! సంభృతమత్తవారణా!
సారసలోచనాప్రసవసాయక! సజ్జనభాగ్యదాయకా!
సారయశోవిభూషితదిశాముఖ! వైష్ణవరక్షణోన్ముఖా!

70

క.

వారాశిపరితక్ష్మా
ధార! భుజదండవిమతదళనోద్దండా!
శ్రీరామాయణసంతత
పారాయణ! సరసహృదయ! పండితసదయా!

71


గద్య.

ఇది శ్రీరాజగోపాలకరుణాకటాక్షవీక్షణానుక్షణప్రవర్ధమానసార
సారస్వతధురీణయు విచిత్రతరపత్రికాశతలిఖితవాచికార్థావగాహన
ప్రవీణయు తత్ప్రతిపత్రికాశతస్వహస్తలేఖనప్రశస్తకీర్తియు
శృంగాగరసతరంగితపదకవిత్వమహనీయమతిస్ఫూర్తియు అతులి
తాష్టభాషాకవితాసర్వంకషమనీషావిశేషశారదయు రాజనీతి
విద్యావిశారదయు విజయరాఘవమహీపాలవిరచితకనకాభిషే
కయు విద్వత్కవిజనస్తవనీయవివేకయు మన్నారుదాసవిలాసనామ
మహాప్రబంధనిబంధనకృతలక్షణయు మహనీయరామాయణ
భాగవతభారతకథాసంగ్రహణవిచక్షణయు పసపులేటి వెంకటాద్రి
బహుజన్మతపఃఫలంబును మంగమాంబాగర్భశుక్తిముక్తాఫలం
బును రంగద్గుణకదంబయు నగు రంగాజమ్మ వచనరచనాచమ
త్కృతిఁ జెన్నుమీరు ఉషాపరిణయంబను మహాప్రబంధంబునందుఁ
బ్రథమాశ్వాసము.

శ్రీ రాజగోపాలాయనమః