ఉషాపరిణయము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీ రాజగోపాలాయనమః

ఉషాపరిణయము

(పద్య కావ్యము)

తృతీయాశ్వాసము

}}
క.

శ్రీరాజ[1]గోపహరిచర
ణారాధనసావధాన! యర్థినిధానా!
వీరారిమదవిజృంభణ
వారణ! శ్రీవిజయరాఘవక్ష్మారమణా!

1


వ.

అవధరింపుము.


చిత్రరేఖ యనిరుద్ధుని వర్ణించుట

క.

ఇవ్విధమున లాలించిన
జవ్వనిఁ గనుఁగొనుచు మిగులసంభ్రమ మొప్పన్
నివ్వటిలు ప్రేమతోడను
బువ్విలుతుని సుతునిఁ జూపి పొలఁతుక యనియెన్.

2


సీ.

ఇందుబింబముతోడు నెనవచ్చు నీతని
        నెమ్మోముఁ జూడు మిందీవరాక్షి!
భానుసమానుఁడై భాసిల్లు నీతని
        తేజంబుఁ జూడు మంభోజనేత్ర!

చక్కెర లొల్కెడు చక్కని యీతని
        కెమ్మోవిఁ జూడుము కీరవాణి!
పండువెన్నెలచాయ భాసిల్లు నీతని
        కుఱునవ్వుఁ జూడు చకోరనయన!


గీ.

యరులపై బాణవర్షముల్ కురియుకతన
జ్యాకిణాంకితమించు బాహాయుగంబుఁ
బరులతల మెట్టు మృదు[2]పాదపంకజముల
భామ! వీక్షింపు కన్నులపండువుగను.

3


వ.

అని పల్కుచున్న సమయంబున.


అనిరుద్ధుఁడు కలఁగని మేల్కని యాశ్చర్యపడుట

సీ.

అందంబుమీరంగ నలివేణి యొక్క
        యెలమిఁ దోడ్కొనివచ్చి యింపుమీరు
బంగారుమేడలో బాగుగా హవణించు
        పువ్వులపాన్పుపైఁ బొసఁగ నుంచ
మెఱుఁగుదీఁగెనుబోలు మృగనేత్ర యొక్కతె
        శయ్యపైఁ గూర్చుండి నెయ్యమమరఁ
జక్కెర మోవాని సరసంబు మీరఁగాఁ
        బుక్కిటివిడె మిచ్చి బుజ్జగించి


గీ.

 తలిరువిలుకానికేళినిఁ దనివిదీరఁ
గలసినట్లుండఁ గలఁ గని కాంక్షతోడ
బాళి నయ్యనిరుద్ధుండు మేలుకాంచి
యెదుట నిలుచున్న చక్కనియింతిఁ జూచె.

4

వ.

మఱియును.


చ.

చెలువగు హేమసౌధమును జిత్రపటంబుల నెమ్మిగుంపులన్
జిలుకలపంజరంబులను జెల్వుగఁ బల్కెడు పారువంబులన్
బలుమరు వ్రాయ నందియలు ప్రాంతమునన్ జరియించునంచలన్
గలయఁగఁ జూచె నచ్చెరువు గ్రమ్మఁగ సారెకు నెమ్మనంబునన్.

5


సీ.

త్రిజగంబునను గల్గు తేజోనిధుల నెల్ల
        బాగుగా వ్రాసిన పటమునందు
భలబ్రదుఁడును శౌరి ప్రద్యుమ్నుఁడును దాను
        మహినిఁ బ్రసిద్ధులౌ మనుజపతులు
మఱియొక్క పటమున మందరగిరిలీల
        మిక్కిలిఁ బొడవైన మేనుఁగల్గి
వేయికరంబుల వివిధాస్త్రములఁ బూని
        సురులు గెల్వఁగనున్న శూరుఁడొకఁడు


గీ.

చెలఁగుచుండఁగఁ జూచి యచ్చెరువుఁ జెంది
మనుజవర్యల దనుజుల మహిమమీరు
సురల నీక్రియ వ్రాయంగ సోద్య మయ్యె
నెవ్వనిదొకాని యీ సౌధ మెంతవింత!

6


వ.

అని వితర్కింపుచు.


ఉ.

ద్వారకలోన నానగరతామరసాక్షులు కొల్వఁ జుట్టులన్
గోరిక నున్న నే నవుర! గోప్యముగా నిట కెట్లు వచ్చితిన్
వీరలఁ జూడ నామదికి వింతయి తోఁచె ని దేమి చోద్యమో!
యారయ స్వప్నమో! నిజమొ! యక్కట! భ్రాంతియొ! యంచు నెంచుచున్.

7

క.

కలఁ గనెడువారు లేరా
కల యెవ్వరికైన నిజముగా నీకరణిన్
దెలియక ముందఱ దోఁచునె
పలుకఁగ యిది వింత యనుచు భావములోనన్.

8


క.

ఎవ్వరితోడం బలుకుదు?
నెవ్వరు? తను నెఱుఁగువార లిందఱిలోనన్
జవ్వనులఁ జేరఁబిల్చిన
నవ్వుచుఁ దొలఁగుదురొ! లేక నను జేరుదురో!

9


క.

నెయ్యముఁ జేసి ప్రసంగము
ద్రియ్యుచు నీ కార్య మిల్ల దెలియుద మని తా
నొయ్యార మమర నప్పుడు
శయ్యను గూర్చుండి మిగులసరసం బమరన్.

10


ఉషానిరుద్ధులు పరస్పరసౌందర్యము గని పరవశులగుట

సీ.

చెలులు చుట్టును గొల్వఁ జికురాకువిల్కాని
        మోహానాస్త్రంబన ముడువుమాఱి
సిగ్గుచేఁ దల వంచి చిరునవ్వు నవ్వుచుఁ
        గ్రేగంటఁ దనుజూచు కీరవాణిఁ
బసిఁడిసలాకతోఁ బ్రతివచ్చు నెమ్మేని
        కాంతులు దిక్కులఁ గలయఁబర్వ
మిక్కిలిప్రేమచే మేను చెమర్పంగఁ
        దనలోన రతిఁగూడఁ దలఁచుదాని


గీ.

బాణసుతఁ జూచి యెంతయు భావమలర
నడుగవచ్చిన కార్యంబు నపుడు మఱచి
మరుని మాయలచేఁ జిక్కి మదనసూనుఁ
డెలమిఁ దలయూచి సొక్కుచు నింపుమీర.

11

సీ.

నెరివెంట్రుకలకప్పు దొరయు నీచెలికొప్పు
        నీలమేఘముతీరు లీలఁ గేరు
కాంతుల వాటంబు కాంతలలాటంబు
        విదియచందురుకొవ్వు వేగ నవ్వు
నమృతంబునకు దీవియైన యీసకిమోవి
        పగడంబులను బొల్చు బాగు గెల్చు
కలువరేకులనేలు కలికికన్నులడాలు
        నిడువాలుగలసంచు నీట ముంచు


గీ.

వెలఁదికనుబొమ లతనుని విండ్లకొమలు
చంపకశ్రీల వెన్నాన చాననాస
చెనకుఁ జిందంబులకులంబుఁ జెలిగళంబు
పంచదారలుఁ గుల్కు నీభామపల్కు.

12


సీ.

తామరతూడులఁ దరమిడి నిరసించు
        కొమ్మభుజంబులకొమరు భళిర!
బంగారుకుండల బాగెంతలేదను
        కువలయలోచనకుచము లవుర!
కేసరిమధ్యంబు గేలి సేయఁగఁజాలు
        గజరాజగామినికౌనుమేలు
కందర్పు నసిధార గడకుఁ ద్రోయఁగ నెంచు
        మెలఁతనూఁగారును మెచ్చవచ్చు


గీ.

సైకతంబుల గెల్చును జానజఘన
మరఁటికంబంబుల నదల్పు నతివతొడలు
కమలగర్భంబులను గెల్చుఁ గలికిజంఘ
లబ్జముల నవ్వు నీయింతియడుగు లెంచ.

13

క.

కుందకయుండఁగఁ గరముల
నిందుముఖిన్ బ్రహ్మ యెట్లు సృజియించెనొకో!
యందంబు బొగడఁ దరమా!
కందర్పుని రాజ్యలక్ష్మికైవడి నమరెన్.

14


సీ.

రెప్పవేయక నేను దప్పక చూచితే
        తరుణిమోమున దృష్టితాఁకునొక్కొ!
ముచ్చటదీర నే మొనపంట నొక్కితే
        కమలాక్షికెమ్మోవి కందునొక్కొ!
కోరిక మీర నేఁ గొనగోట మీటితే
        పణఁతిగుబ్బ లపుడె పగులునొక్కొ!
పచ్చవిల్తునికేళి బాళి నేఁ గూడితే
        బాలిక నెమ్మేను బడలునొక్కొ!


గీ.

అట్లుగావునఁ బూర్ణశశాంకవదన
బాగుమారినయట్టి యీ పల్లవోష్ఠి
కాంతులును జాలఁ జెలువొందు కలశకుచకు
నీలతాంగినిఁ గూడుట యెట్టులొక్కొ!

15


సీ.

శౌరిని సేవింప జంభారి యేతేరఁ
        గనుఁగొంటి రంభాదికామినులను
శ్రీకృష్ణు సేవింపఁ జిత్రరథుండు రాఁ
        గనుఁగొంటి గంధర్వకన్నికలను
జలజాక్షుఁ బూజింప నల కుబేరుఁడు రాఁగఁ
        గనుఁగొంటిఁ గిన్నరవనజముఖుల
హరిఁ జూడ సకలదేశాధీశ్వరులు రాఁగ
        గనుఁగొంటి మనుజశృంగారవతులఁ

గీ.

గలదె దీనియొయ్యార మేకాంతలకును
జూడ మిటువంటిచెలువ మేసుదతులందు
బ్రహ్మ యెట్లు నిర్మించె నీపద్మముఖిని
నెంత యని సన్నుతింతు నీయింతిసొగసు.

16


వ.

అని యనిరుద్ధుఁడు తనమనంబున వితర్కించు సమయంబున.


క.

అనిరుద్ధుని సౌందర్యము
వనితామణి చూచి మిగుల వాంఛలుమీరన్
మనమున సోద్యం బందుచు
వినుతించెను వానిసొగసు వేడుక మీరన్.

17


సీ.

సకలంకమైనట్టి చంద్రబింబము వీని
        వదనంబుతో సాటివచ్చు టెట్లు?
రేయెల్ల ముకుళించు తోయజంబులు వీని
        కన్నులసామ్యంబుఁ గాంచుటెట్లు?
పగతురఁ గని పాఱు ఫణిరాజములు వీని
        భుజములపోలికఁ బొందు టెట్లు?
అమితటంకవిభేద్య మగుకవాటము వీని
        వక్షంబునకు సరివచ్చు టెట్లు?


గీ.

యింతచక్కనివాని నే నెందుఁ జూడ
వీనిఁ జూడంగఁ జూడంగ వేడుకయ్యె
వేయికన్నులు గలిగిన వీనిసొగసుఁ
గలయ వీక్షింతు నామది కాంక్ష దీర.

18


ఉ.

నిద్దురలేచియు న్మిగులనేర్పున రమ్మని నన్ను వీఁడు తా
నొద్దికఁ జేరదీయక నే యూరక యుండుట కేమి హేతువో!
తద్దయు ద్వారకాపురము తామరసాక్షులఁ జూచు వీని కా
నిద్దపురూపులున్ మిగులనేర్పులు లేని తెఱంగొ! నాయెడన్.

19

మన్మథుఁ డుషానిరుద్ధుల మోహపరవశులఁ జేయుట

వ.

అని తలంచు నయ్యవసరంబున.


చ.

ఉదుటగు చిల్కతేజిపయి నుధ్ధతిమీరఁగ వచ్చి నిల్చి తా
నెదురుగఁ దేఁటినారి మొరయింపుచుఁ బువ్వులవింటి వారలన్
గదసి ప్రసూనవర్షములు గాఢముగా వరుషించె నెంచఁగా
మదనుఁడు బంచబాణుఁ డనుమాట నిజంబగునే తలంపఁగన్.

20


క.

తనయునిమీఁదనే దాడిగ
జనకుండట వచ్చెనన్న సమ్మతి యగునే
యని గలదు బాణుతో నని
తనబలములఁ గూడి వచ్చెఁ దథ్యం బరయన్.

21


చ.

అల విరివింటిరాయలు సహాయత వచ్చిన వచ్చుఁగాని తా
బలువిడి వారిపైఁ గుసుమబాణము లేయుట యేమి యంటివా
యలరఁగఁ దద్వివాహసమయంబున కచ్చుగ వచ్చి పూలచేఁ
జెలువుగ వారికిద్దఱికి సేసలుఁ బెట్టుటయే నిజంబగున్.

22


వ.

ఇవ్విధంబున.


సీ.

పచ్చవిల్తుఁడు వాఁడిబాణంబు లేయఁగా
        నాయుష యిట్లను నాత్మలోనఁ
గలలోనఁ గలయు నీకందర్పతనయునిఁ
        దోడితెమ్మని చాల వేఁడుకొనఁగ
ద్వారకాపురిఁ జేరి తరలాక్షి నామీఁది
        నెనరున నిటు దెచ్చె నేర్చు మెఱసి
యేమిసేయుదు నీతఁ డింతి రమ్మని పిల్చి
        గారవించడు మదికాఁకదీరఁ

గీ.

బ్రియుఁడె తను జేర రమ్మని ప్రేమమీర
గారవించిన మిక్కిలి ఘనతగాని
బలిమిచేఁ జేరఁబోయినఁ జులుకగాదె!
వలవు దాఁచెద నంటినా వశముగాదు.

23

అనిరుద్ధుఁడు చిత్రరేఖను వివరముల నడుగుట, చిత్రరేఖ యనిరుద్ధునికి సకలము చెప్పుట

వ.

అని వితర్కించు సమయంబున.


క.

ననవింటివానిగాసికి
మనమునఁ దాళంగలేక మమతలు హెచ్చన్
వనజాక్షి నొకతెఁ గనుఁగొని
యనిరుద్ధుం డిట్టు లనియె నందముగాఁగన్.

24


క.

ఎవ్వతె యీ బాలామణి?
యెవ్వరి దీకనకసౌధ? మిది యేనగరం?
బెవ్వరివారలు మీరలు?
జవ్వని! తెలుపంగవలయు సత్యముగాఁగన్.

25


వ.

అనిపల్కిన యనిరుద్ధుం జేరవచ్చి చిత్రరేఖ యిట్లనియె.


సీ.

ఇది శోణపురమందు రిందుకు నాథుండు
        ప్రహ్లాదవంశుండు బాణుఁ డరయ
నల బాణుపుత్రి యీయతివలమేల్బంతి
        “ఉష” యనువిఖ్యాతి నొఱపుమీరు
నిచట నుండువార మిందఱ మీయింతి
        చెలులము నాపేరు చిత్రరేఖ
కలలోన నిను గూడి కామునిగాసిచే
        నీకాంత నను వేఁడ నెలమితోడ

గీ.

ముజ్జగంబులఁ గలవారిమూర్తు లెల్లఁ
బటమునను వ్రాసి చూప నీభామ ప్రేమ
నీదురూపంబు రేఖయు నెమ్మిఁ జూచి
నిన్ను దోడ్కొనిరమ్మన్న నేర్పుమీర.

26


ఉ.

ద్వారక కేగి యాపురమువారలు నన్ గనకుండునట్లుగా
సారెకు మాయఁగప్పి యల శౌరినివాసముమున్ను గాఁగ మీ
వారినగళ్లలో వెదకి వైణికమౌనియనుగ్రహంబున
న్వేరమె తోడితెచ్చితిని నిన్నిటకున్ మకరాంకనందనా!

27


మ.

చెలిమిన్ లక్ష్మిని జోడుఁగూడి హరి దాఁ జెన్నొందు చందంబునన్
బలుకుందొయ్యలిఁ గూడి బ్రహ్మ కడుఁబ్రేమన్ మీరు బాగొప్పఁగా
నల పౌలోమినిఁగూడి వాసవుఁడు నెయ్యంబొప్ప వర్ధిల్లు న
ట్లెలమిన్ భామిని నీవు గూడి పదివేలేండ్లుండుమీ యిద్ధరన్.

28


క.

అని పల్కిన చెలిమాటలు
విని యావలరాజుసుతుఁడు వేడుక మీరన్
దనమనసు దాఁచ కప్పుడు
ననఁబోఁడిమొగంబుఁ జూచి నవ్వుచుఁ బల్కెన్.

29


సీ.

బాణనందనకును బ్రాణపదంబైన
        సకియవుగావున సరవిమీర
భావింప మాకును బ్రాణపదంబైన
        దానవు నీకును దాఁచనేల
కలలోనఁ గూడిన కాంతయే నీకును
        నిల్లా లగు నటంచు నెలమి మున్ను
ముక్కంటిసతి పల్కె ముదమున ననుజూచి
        నెలఁత! నే నిప్పుడు నిదురబోవ

గీ.

నిచ్చటికి నీవు నను దోడితెచ్చినట్లు
వేడుకను నన్ను నీయుష గూడినట్లు
మేలుగలయట్టి కలఁ గని మేలుకనుచు
నిజముగా మిమ్ముఁ జూచితి నీరజాక్షి!

30


వ.

అనిన ననిరుద్ధునిఁ జూచి చిత్రరేఖ యిట్లనియె.


క.

రమణుల నెందఱినైనను
రమణీయత నేలుకొన్న రసికుఁడవుగదా!
తమితోడుత మాచెలి నిపు
డమరఁగ రతి నేలుకోర యతనుకుమారా!

31


క.

అని యొకపనినెపమున న
[3]య్యనుఁగుచెలియ చెలులతోడ నావలికేగన్
వినమితముఖియౌ నుషఁ గని
యనిరుద్ధుం డపుడు మందహాసముమీరన్.

32


అనిరుద్ధుఁ డుషను గాంధర్వమున వివాహమాడుట
సంభోగశృంగారము

క.

మనకోరిక లీడేరెను
వనితామణి! రమ్మటంచు వాంఛలు మీరన్
దనరెడు గాంధర్వంబునఁ
దనకరమున నింతికరముఁ దడయక పట్టెన్.

33


సీ.

చేరంగ రమ్మని చేపట్టి తీసినఁ
        జిరునవ్వు నవ్వుచుఁ జే విదల్చుఁ
బయ్యదఁ దొలఁగించి బటువుగుబ్బలఁ [4]బట్ట
        మాటికిఁ జనుదోయి మఱుఁగుసేయు

మోము మోమునఁ జేర్చి ముద్దుపెట్టఁగ రాగ
        మురిపెంపు సిగ్గుతో మోముఁ ద్రిప్పుఁ
బ్రేమంబుమీరఁగ బిగువుగౌఁగిటఁ జేర్ప
        లజ్జచేఁ బతికేలు లలినిఁ ద్రోయుఁ


గీ.

బోఁకముడి వదలింపఁగఁ బొంకముగను
ముడి సడల్పంగనీయక ముదిత పెనఁగుఁ
గాముకేళికిఁ దమితోడఁ గలయరాఁగ
గోల నలుదిక్కులను జూచుఁ గొంకుమిగుల.

34


వ.

అయ్యవసరంబున.


సీ.

ముచ్చటదీరఁగ ముద్దుబెట్టవె చేరి
        మోమేల త్రిప్పెద ముద్దుగుమ్మ!
వీనుల నమృతంబు వెదచల్లునట్లుగా
        మాటలాడ వదేమి మచ్చకంటి!
మరుకాఁక దీరంగ మమతలు హెచ్చంగఁ
        [5]గౌఁగిలింపవె నన్ను కలువకంటి!
యక్కునఁ గదియించి యాదరింపుచుఁ బ్రేమఁ
        బుక్కిటివిడె మీవె పువ్వుఁబోణి!


గీ.

భామ! మ్రొక్కెద నే నీదు పదములకును
మనవు లాలించి యేలవే మందగమన!
చాలదయఁ జూడవే నన్ను సన్నుతాంగి!
రతుల నన్నేలవే లీల రాజవదన!

35

క.

అని లాలింపుచు నయ్యుష
ననిరుద్ధుఁడు చేరఁగీసి యందముగాఁగన్
దనతొడలమీఁద నుంచుక
వనితామణిమేను నిమిరి వలపమరంగన్.

36


సీ.

కుంకుమ బూసెదఁ బొంకంబుగా నని
        కులుకుసిబ్బవుగబ్బిగుబ్బ లంటి
తీరుగాఁ గస్తూరి దిద్దెద ననుచును
        దేటైన చెక్కిలి గోట జీరి
పుక్కిటివీడెంబుఁ బొసఁగ నిచ్చెద నని
        ముచ్చటదీరఁగ మోవియాని
నీటుగాఁ గుచ్చలనెఱిక దిద్దెద నని
        మురువుమీరిన పోఁకముడి వదల్చి


గీ.

మేను నిమిరెడుకైవడి మించువేడ్కఁ
గదిసి కళలంటి సొక్కించి గారవించి
కాఁక దీరఁగఁ గౌఁగిటఁ గదియ జేర్చి
సిగ్గుఁదొలగించె నప్పు డాచెలువ కతఁడు.

37


క.

గిలిగింత లిడుచు మిగులన్
గలరవములు మించునట్టి గళరవములఁ దా
వలపులు గులుకఁగఁ బలుకుచు
జలజాక్షిని రతులఁ గూడి సంతసమమరన్.

38


సీ.

బాలిక బడలిన భావంబుఁ గనుఁగొని
        ముదముతో విభుఁ డిచ్చె మోవితేనె
శీతాంశుముఖిమేనఁ జిరుజెమటలుఁ జూచి
        చెలువుండు దుప్పటిచేత నొత్తె

మదిరాక్షిముంగురుల్ చెదరిన వీక్షించి
        పతి గోరులను దువ్వె బాగుమీర
జలజాక్షినుదుటను జాఱిన తిలకంబు
        రాణించఁగా దిద్దెఁ బ్రాణవిభుఁడు


గీ.

మెలఁత యుపరతులను జాల నలసియున్న
దొయ్యలిపదంబు లప్పుడు తొడల నుంచి
నెయ్య మమరంగ నొత్తుచు నెనరుమీఱ
నచ్యుతునిమన్మఁ డీలీల నాదరించె.

39


వ.

అంత.


చ.

మనసిజకేళిఁ దాను పతి మక్కువమీఱఁగఁ గూడియుండుటల్
ఘనమగునట్టి మానికపుకంబమునన్ గనుపట్టుచుండఁగాఁ
దనచెలువుండు వేఱె యొకతామరసాక్షినిఁ గూడెనంచు వే
కనుఁగొనుచున్ బరాఙ్ముఖత గాంచెను ముగ్ధలుగారె మానినుల్.

40


విప్రలంభశృంగారము

వ.

అంత.


క.

జవ్వని నేరము లేకనె
యివ్వగ నలుగంగ హేతువేమీ? యనుచున్
నివ్వెఱగందుచు మదిలో
నవ్వలిమోమయ్యె నప్పు డనిరుద్ధుండున్.

41


క.

ఇరువురు నీక్రియ నుండఁగ
మరుఁ డప్పుడు చేరి మిగుల మమతలు హెచ్చన్
దురుసైన తుంటవింటను
విరిగోల(ను) నేసి యార్చె వేగముగాఁగన్.

42

వ.

ఇవ్విధంబున బాణపరంపరలు నించు మించువిల్కానివేఁడిమికిఁ
దాళఁజాలక యాబాణపుత్రిక తనలోఁ దా నిట్లనియె.


సీ.

కలలోనఁ గూడిన కాంతునిఁ దెమ్మని
        చిత్రరేఖను వేఁడ (చిత్ర)గతిని
నీతనిఁ దోడ్తెచ్చి యెలమితో నను గూర్పఁ
        గంతునికేళినిఁ గలసి మెలసి
సంతసంబమరంగ సౌఖ్యాబ్ధిఁ దేలుచుఁ
        గంబంబులో నీడఁ గాంచి యపుడు
భ్రమసి యిదేమని పల్కరించక యౌర!
        యిట్లేల? యలిగితి నితనితోడ


గీ.

నేనె ముందుగ నితనితో నిపుడు పల్క
నలిగియున్నది తానె మాటాడె ననుచు
నాథుఁ డెంతయు నను జూచి నవ్వునొక్కొ!
యేమి సేయుదు? నీయల్క యెట్లు తీరు?

43


సీ.

కదిసి ప్రేమను వీనిఁ గౌఁగిలింపకయున్న
        నతనుతాపము చల్ల నౌట యెట్లు?
ముచ్చటతో వీనిమోని యానకయున్నఁ
        బచ్చవిల్తునిబారిఁ బాయు టెట్లు?
సారెకు వీనితో సరసమాడకయున్నఁ
        గంతునిహుంకృతి గడచు టెట్లు?
తొడరువేడుక వీనితొడల నుండకయున్న
        దలిరువిల్తునిదాడిఁ దప్పు టెట్లు?


గీ.

చేరి చెక్కిలి నొక్కుచుఁ జెలిమి మిగుల
గళరవంబులుఁ బల్కుచు వలపు హెచ్చఁ
దనివి దీరంగ వీనితోఁ బెనఁగకున్న
నించువిల్తుని నిపుడు జయించు టెట్లు?

44

సీ.

ముదిత! రమ్మని వీఁడు ముందుగాఁ బల్కితే
        చెఱకువిల్కానికి జెరువు సేతుఁ
గాంత! రమ్మని వీఁడు కౌఁగిటఁ జేర్చితే
        పువ్వులవిల్తునిఁ బూజ సేతుఁ
రమ్మని వీఁడు సరసంబు లాడితే
        చిగురువిల్కానికి సేవఁ జేతు
రమణి! రమ్మని వీఁడు రతికేళిఁ గూడితే
        పచ్చవిల్కానిని బ్రస్తుతింతు


గీ.

నిరువురము యేము రేబగ లెనసియున్న
నల వసంతునిఁ జంద్రుని మలయపవనుఁ
బ్రాణబంధువు లనుచును భావమునను
గోర్కిమీరఁగ నేవేళఁ గొలుతు నేను.

45


సీ.

పంచదార నొసంగి బాగుగాఁ బెంచిన
        చిలుకైన నితనితోఁ దెలుపదాయె
బాళినే సాఁకిన పారువంబైనను
        బతికిని దమిబుట్ట బలుకదాయె
నెనరుతో నడుపులు నేర్పిన యంచైన
        నాథునిదూత్యంబు నడపదాయె
బ్రాణపదంబైన బట్టిగాఁడైనను
        జెలువునికిని బుద్ధిఁ జెప్పదాయె


గీ.

గోర్కెమీరఁగఁ గలలోనఁ గూడి మిగుల
నూరుఁబేరును నెఱుఁగకయున్న విభుని
నెనరుతో నన్నుఁ గూర్చిన నేర్పుఁగలుగు
చిత్రరేఖైన నీవేళఁ జేరదాయె.

46

క.

అని మనమున నుష యీగతి
ఘనమగు విరహంబుచేతఁ గలఁగంగా న
య్యనిరుద్ధుం డావేళనె
తనమనమున నిట్టులనుచుఁ దలఁచెను బ్రేమన్.

47


సీ.

ఇంతి! నీవలిగిన హేతు వెయ్యది? యని
        యడుగక నే నేల? యలిగి తగట!
కలికి! నీయలుకకుఁ గారణం బేమని
        యిపుడు నే నడిగితే యింత తడవు
పలుకక యిప్పుడు పల్కవచ్చె నటంచుఁ
        బలుకునో! పలకదో! పద్మగంధి
మోడి యేమిటి? కని మ్రొక్కి నే వేఁడినఁ
        జూచునో! చూడదో! శోభనాంగి


గీ.

యీవిరహసాగరము దాఁట నేది? తేప
యేమి సేయుదు? నీకోప మెట్లుదీరు?
నిమిష మేఁడయి తోచెను నెనరుమీర
వెలఁదిఁ గూర్పంగ నెవ్వరి? వేఁడుకొందు.

48


సీ.

కదియుచీఁకటిఁ జంద్రుఁ డుదయించు టౌగదా!
        తెఱవ యిప్పుడు మోముఁ ద్రిప్పెనేని
యాకలిఁగొన్నచో నమృత మబ్బుటగదా!
        యింతి కెమ్మో వాననిచ్చెనేని
పేదకు బంగారుబిందె లబ్బుటగదా!
        చెలువ కుచము లంటఁ జేర్చెనేని
యెండ నుండఁగ నీడ యెదురువచ్చుటగదా!
        సుదతి చల్లనిచూపుఁ జూచెనేని

గీ.

యనుచు మనమున యోజింపు చతఁడు మిగులఁ
గలయ నలుదిక్కులునుఁ జూచి కాఁక హెచ్చ
భామఁ గూడుటకు నుపాయమేమి యనుచు
భావమున మకరాంకుని భజన సేయ.

49


సీ.

పొలయల్కచేతను బొలఁతి యుండఁగఁ జేరి
        పతి మ్రొక్కుచున్నట్టి భావములును
నవ్వుటాలకును నాథుం డల్గినం జూచి
        సతి వేడుకొనుచున్న చందములును
నా పడకింటిలో నందంబుమీరిన
        చిత్రపటంబునఁ జెలఁగఁ జూచి
ఘనత నీచిత్రరేఖాదర్శనంబున
        మరుకాఁక యొకకొంత మట్టువడియె


గీ.

ననుచుఁ బతి పల్క విని తనయాత్మలోనఁ
జిత్రరేఖను గనుఁగొను చెల్మి మీర
బాణనందన మగుడినఁ బతియు వేడ్కఁ
దాను నభిముఖుఁ డగుచును దరుణిఁ గూడె.

50

ప్రభాతమున నుషానిరుద్ధులఁ జూచి చెలులు సంతసించుట

వ.

అంత.


క.

మదమున సహస్రకరుఁ డనఁ
గదనంబున మించు బాణుకరములు ద్రుంచన్
గదియు హరిఁ జూతు మనుక్రియ
నుదయాచలమందు భానుఁ డుదయంబయ్యెన్.

61


వ.

ఆసమయంబున.

సీ.

ఒయ్యారమున దనయురమున నొరగిన
        నతివమోవానెడు నందగానిఁ
జెలువుమీరఁగఁ దనచెక్కిలి నొక్కిన
        కొమ్మగుబ్బలు జీరు కోడెకానిఁ
దీరుగా నుదుటను దిలకంబు దిద్దెడు
        వనితెకొప్పును దువ్వు వన్నెకానిఁ
గలపంబుఁ దనమేన గలయంగ నలఁదెడు
        నువిదనీవి వదల్చు హొయిలుకాని


గీ.

నోరి! రమ్మని ప్రేమ బింబోష్ఠి పిల్వ
భామ! యూడిగ మేమని? పలుకువాని
నల్ల యనిరుద్ధుఁ జూచిరి హర్ష మొదవఁ
జిత్రరేఖయు మొదలైన చెలువలెల్ల.

52


వ.

అందు.


సీ.

సుదతి! వీరల చెల్వుఁ జూచితె కన్నులు
        చల్లనాయె ననియె సకియ యొకతె
భళి! వీరి నిర్వురఁ గలయఁగూర్చితి వని
        చిత్రరేఖను మెచ్చెఁ జెలువ యొకతె
రతిమన్మథులలీల రాణించి రనుచును
        వన్నె మీరఁగఁ బల్కె వనితె యొకతె
యింతచెల్వమువారి నెలమితో సృజియించు
        బ్రహ్మ నేర్పరి యనె పడఁతి యొకతె


గీ.

చక్కదనమున సరసత జవ్వనమున
నిరువురకుఁ దగునని యెంచె నింతి యొకతె
యెంతచక్కనివార లీయిరువు రనిన
దృష్టిదాఁకెనె యని పల్కె దెఱవ యొకతె.

53

వ.

అని నీనెచ్చెలులు ముచ్చటనున్న యాసమయంబున.


అంతఃపురపు కావలివారు ఉషానిరుద్ధులుండు విధమును గని యచ్చెరువంది బాణుని కెఱుకపఱచుట

సీ.

గండశైలమురీతి గనుపట్టు శిరముల
        విరసి తూలెడు పల్లవెంట్రుకలును
బండికండ్లను గేరు బటువులౌ మిడిగ్రుడ్ల
        వేఁడిమి వెదచల్లు వీక్షణములు
కడువిశాలములైన కడుపులపైఁ బడి
        జానుల జాఱెడు చన్నుగవలు
వంకలై కనుపట్టు వాఁడికోరలుఁ గల్గి
        చాకిబానల మించు బాకినోళ్లుఁ


గీ.

బ్రాఁతచేటల కెనయైన పాదములును
గటికిచీఁకటిఁ గమ్మెడు కారుమేను
లమర గుదియలబోలు బెత్తములుఁ బూని
అన్నగారులు తమవెంట నంటినడవ.

54


చ.

కనకమయాంబరంబులును గస్తూరివీణియలున్ జవాదియున్
బునుఁగును గుంకుమంబు ముడిబువ్వులు తావులుగుల్కు చందనం
బును దెలనాకుకట్టలను బోఁకలముళ్లును బాణపుత్రికిన్
దినమును దెచ్చుకట్టడగఁ దెచ్చిరి హెగ్గడికత్తె లత్తరిన్.

55


సీ.

పగడంపుచాయల జిగిమించు మోవుల
        సొంపుమీరిన పలుగెంపుగములఁ
బెక్కుటద్దంబుల చెలువుమీరుచు నున్న
        గోటిజీరల పలునీటువగల

జాఱుగొప్పున మీఁదఁ దీరుగాఁ గనుపించు
        వాడిన నునువిరవాది సరుల
రాతెల్ల వేగింప రతిఁ జెందుబడలిక
        వసివాళ్లువాడిన వదనములను


గీ.

వింతసొగసు వహింపుచు వేడ్క మదిని
వెలయ నొండొరుల్ తమతమవలువ లపుడు
మారవడఁ గట్టి యల రతిమన్మథు లన
నేకశయ్య వారిర్వురు నెసఁగఁ జూచి.

56


క.

అచ్చెరువందుచు వారలు
హెచ్చఁగ మదిలోనఁ గనుక యిరువురమీఁదన్
జెచ్చరఁ జేతులఁ జఱచుచు
వచ్చెనుగద! దూరటంచు వనరుచుఁ దమలోన్.

57


సీ.

దివిజులకైనను దేరిచూడఁగరాని
        శోణితపుర మెట్లు? చొచ్చివచ్చెఁ
గావలివారలు కనకుండ నేరీతి?
        నంతఃపురముఁ జేరె నందముగను
బాణనందనకు నీపార్థివసుతునకు
        వియ్య మెట్టులు? గలిగె నెయ్యమమర
వీరున్నచందంబు వేడుకతోఁ జూడ
        సంతోష మెట్లయ్యె? సకియలకును


గీ.

నేమి మాయలుఁ బన్నెనో! యిందఱికిని
చొక్కుపొడిఁ జల్లెఁబోలు! నీసుదతిమీఁద
బాణునంతఃపురంబను భయము లేక
వీఁడు తానెట్లు? వచ్చెనే వెలఁదులార!

58

వ.

అని మఱియును.


క.

తలయూఁపుచుఁ దత్తఱపడి
తలఁపున నొకయింతయైనఁ దాలిమి లేకీ
చెలియున్న తెఱంగెల్లను
బలిపుత్రునితోడఁ దెలియఁ బలుకుద మనుచున్.

59


వ.

గ్రక్కున బాణుసమ్ముఖంబునకు వచ్చి హెగ్గడికత్తియలు
మ్రొక్కి యిట్లనిరి.


సీ.

అసురేంద్ర! నీకన్యయంతఃపురంబున
        వింత యొక్కటి బుట్టె వినుము నేఁడు
చిగురువిల్లునికన్న మిగులఁ జక్కనివాఁడు
        వీరాధివీరుఁడై వెలయువాఁడు
బంగారుచాయల బాగుమీరినవాఁడు
        సింహావలోకనశ్రీలవాడు
చెన్ను మీరుచునున్న చిన్నిపాయమువాఁడు
        జ్యాకిణాంగోరుభుజములవాఁడు


గీ.

తమ్మిరేకుల గెల్చు నేత్రములవాఁడు
సోముని హసింపజాలు నెమ్మోమువాఁడు
వలమురినిఁ బోల్పఁజాలిన గళమువాఁడు
కొమరుమీరినయట్టి కొమరుఁడొకఁడు.

60


క.

ఏపున మేమిందఱమున్
గాఁపుగ వాకిటనె యుండఁ గనకుండఁగఁ దా
నేపగిది? వచ్చినాడో
నీపుత్రినిఁ గూడినాఁడు నేర్పమరంగన్.

61

కోపావిష్టుండగు బాణాసురుని యాజ్ఞచే దైత్యు లనిరుద్ధుని బంధింప నేగుట

సీ.

అనవుఁడు గోపించి యసురేంద్రుఁ డవ్వేళ
        నద్దిరా! బలిపుత్రు నంతవాని
నగరుఁ బ్రవేశించి నడుమేడలోపలఁ
        దగు నుషాకన్యకఁ దాను గూడి
తనకులంబునకు నెంతయు నిందఁగావించె
        నదిగాక భయలేశమైన లేక
నను సడ్డసేయ కింతయు నున్నచెల్వెంచ
        నింత సాహసవంతు లేరి జగతి


గీ.

ననుచుఁ బల్కుచుఁ గంటఁ గెంపతిశయిల్లఁ
జజ్జ మెఁలగెడు దనుజులఁ బారఁ జూచి
మీరు మీసాధనంబులు మెఱయఁ బూని
యమ్మహాబలుఁ బట్టితెం డనుచుఁ బల్కె.

62


క.

దనుజాధీశుని పంపున
దనుజులు వివిధాయుధములుఁ దాలిచి వెస నీ
మనుజుని బట్టుఁడు పొడువుం
డనుచున్ హరిపౌత్రుఁ జేర నరిగిరి కినుకన్.

63

దైత్యబలములఁ జూచి యుష కలఁగఁగా ననిరుద్ధుఁడు ధైర్యము చెప్పుట

వ.

అంత.

చ.

ఘనముగ నార్పు లుప్పతిలఁ గైదువలున్ ఝళిపించి వచ్చునా
దనుజులఁ జూచి డెందమునఁ దద్దయు భీతిలి యీదురాత్మకుల్
తనపతి నేమి సేతురొ! యుదగ్రత నంచును జింతఁ జెందు జ
వ్వనిఁ గని మందహాసమున వారిజనాభుని పౌత్రుఁ [6]డిట్లనెన్.

64


ఉ.

ఇంత చెలింపనేల? యిపు డేఁ గలుగంగ సమస్తదైత్యులున్
బంతము లాడుచున్ నడవ బాణుఁడు వచ్చిన సంగరంబునన్
ద్రుంతు జయంబుఁ జేకొనుదు దోర్బల మొప్పఁగ నీకు నిప్పుడే
సంతస మొప్పఁ జేయుదును సారసలోచన! నీవె చూడఁగన్.

65


గీ.

అనుచుఁ దగఁ బల్కి యంకుశాహతినిఁ గినియు
గంధకరిలీల వెస లేచి కంతుసుతుఁడు
భయముచేతను వారించు పడఁతిమీరి
వీఁక దైత్యుల మార్కొనె విక్రమమున.

66


వ.

ఆసమయంబున బాణపుత్రియగు నుషాకన్య మనంబున ఘనం
బుగా భయంబుఁ జెంది తనసమీపంబుననున్న చిత్రరేఖంజూచి
వజ్రపాణికైనం దేరిచూడఁగూడని యీబాణాసురుని బలంబుల
కెదిరి యీయనిరుద్ధుం డెట్లు? జయంబుఁ జేకొను నని యడిగిన
నుషకుఁ జిత్రరేఖ యిట్లనియె.


క.

అనిరుద్ధుని లా వెఱుఁగక
వనితా! మదిలోన నిట్లు వగవఁగ నేలా?
దనుజుల నందఱ నిప్పుడె
యనిమొన నిదె గెల్చివచ్చు నసహాయుండై.

67


వ.

అని పల్కి.

ఉ.

అత్తరిఁ జిత్రరేఖ సమరాభినివేశభటాళిఁ జూచి తాఁ
జిత్తములో నిలింపమునిశేఖరునిన్ దలఁపంగ నామునీం
ద్రోత్తముఁ డంతరిక్షమున నొయ్యన నచ్చటి కేగి నిల్చి యో
చిత్తజపుత్ర! నీకు జయసిద్ధి ఘటించు నటంచుఁ బల్కినన్.

68


వ.

తద్వాక్యంబు లాకర్ణించి చాల సంతోషించి యాయనిరుద్ధుండు
నవ్వుచు దానవులఁ గని రోషభీషణుండగుచు సింహనాదంబు
గావించి సౌధంబు డిగి రాఁగాఁ జూచి కొందఱు దైత్యులు కకా
పికలై చని రయ్యవసరంబున.


అనిరుద్ధుని పరాక్రమమునకుఁ దాళలేక దైత్యులు బాణాసురునికడకుఁ జేరుట

క.

కరియూధంబులఁ గనుఁగొని
హరి యుద్ధతిమీర వచ్చు నాగ్రహ మమరన్
హరిపౌత్రుం డావేళనె
యరులన్ గని సింహనాద మలరన్ జేసెన్.

69


సీ.

ఆమురాంతకపౌత్రుఁ డంతఃపురద్వార
        పరిఘంబుఁ గైకొని బలముమీర
రాకాశిమూఁకల వీఁకతో నొప్పింప
        దానవుల్ మగుడ నుద్ధతివహించి
పరశుముద్గరగదాప్రాసపట్టిసముఖ్య
        వివిధాయుధంబులు వేగఁ బరపి
తన్ను నొప్పించినఁ దగ సర్వభూతాత్ముఁ
        డగుటను జెలియింప కపుడు సొరిదిఁ

గీ.

బ్రళయజలదంబు గర్జించుపగిది నార్చి
పగటిమార్తాండబింబంబుభాతి మిగుల
వేఁడిఁ జూపుచుఁ బరిఘంబు విసరి విసరి
దనుజబలములఁ బెక్కండ్ర ధరణిఁ గూల్చె.

70


మ.

ఘనసంఘంబు ప్రచండవాతమున వేగ న్విచ్చు చందంబునన్
ఘనదంభోళికఠోరఘోరపరిఘాఘాతంబునన్ నొచ్చి యా
దనుజానీకము బార వెంటఁ జని యుత్సాహంబు రెట్టింప న
య్యనిరుద్ధుం డటఁ బోకు పోకుఁడు నిలుండంచున్ వెసన్ బల్కుచున్.

71


క.

అలఘుపరాక్రమనిధియగు
వలరాయని సుతునిఁ జూచి పలుమరు వేడ్కన్
భళిభళి! యనుచును బొగడుచుఁ
గలహాశనమౌని యపుడు గంతులు వైచెన్.

72


క.

హతశేషులైన దానవు
లతినిష్ఠురతేజుఁడైన యనిరుద్ధుసము
ద్ధతిఁ జూచి నిల్వనోపక
యతిరయమున బాణుకడకు నరిగిరి భీతిన్.

73


వ.

అంత.


బాణుఁ డంతర్హితుఁడై పన్నగాస్త్రములచే ననిరుద్ధుని బంధించుట

సీ.

ప్రజ్వరిల్లెడు హోమపావకుకైవడి
        బాణుడు గోపసంభరితుఁ డగుచుఁ
దనమంత్రి యెదుట నుంచిన తేరిపై నెక్కి
        ఖడ్గంబుఁ ద్రిప్పుచు గగనవీథిఁ

బరశుపట్టిసశూలపాశముద్గరకుంత
        చక్రకార్ముకముఖ్యసాధనములఁ
గరముల వేయిని గరముఁ జెన్నువహించి
        శక్రధ్వజంబులసాటిఁ బూన


గీ.

విలుగుణధ్వనిఁ గావించి విక్రమించి
యట్టహాసంబు సేయుచు నతికఠోర
బాణవర్షంబుఁ గురియుచు భావభవుని
తనయు మార్కొని భుజబలోదగ్రుఁ డగుచు.

74


క.

నిలునిలు మనుచును గన్నుల
బలుకెంపొదవంగ వాఁడిపలుకులు బలుకన్
దెలియఁగ విని యనిరుద్ధుఁడు
కలఁగక బలిసుతుని మోముఁ గనుఁగొని నవ్వెన్.

75


చ.

బలువగకిన్కచే వెలయ భానునికైవడి మీరి తేరిపై
విలసిలు బాణుఁ జూచి భయవిహ్వలయై యుష మేడలోపలన్
జెలువునిఁ జూచుచుండె నిక సేయుదు నేమని మూఢచిత్తయై
తలఁకుచుఁ జిత్రరేఖయును దద్దయుఁ జింతిలుచుండె నత్తరిన్.

76


సీ.

కింకిణీరవములపొంకమై ర(తన)ంపు
        బిరుదుటెక్కెంబులమురువుఁ బూని
వివిధశస్త్రాస్త్రముల్ వెలయ నొప్పువహించు
        నరదంబుపై నెక్కి యనికిఁ బేర్చి
కరసహస్రంబుచేఁ గడుఁ దేజరిల్లుచు
        నటవచ్చి నిల్చి బాణాసుకుండు
నెలవంకగురుతుల నీటుఁ గాంచినవానిఁ
        గలితాంగరాగుఁడై చెలగువాని

గీ.

వాలుఁ బలకయు ధరియించి వఱలువానిఁ
బాదసంచారమున నుర్విఁ బ్రబలువాని
నఖిలభువనైకవీరు నయ్యదుకుమారుఁ
గాంచి కోపించి బొమముడి కదుర నపుడు.

77


క.

వివిధాయుధరహితుండును
గవచవిహీనుండు [7]వీనిఁ గంటిరె మీరల్
జవమలరఁ బట్టి తెండని
యవిరళగతి దనుజభటుల నాజ్ఞాపించెన్.

78


సీ.

ప్రళయకాలమునాటి పటుమేఘబృందంబు
        లాదిత్యుఁ గప్పిన యందమలర
ఖరదూషణాదిరాక్షసనాథయూథంబు
        లారాముపై వచ్చు హరువుదోఁప
రహికెక్కు చైద్యజరాసంధముఖ్యులు
        శ్రీకృష్ణుఁ బొదివిన చెలువు మెఱయ
గోగ్రహణంబునఁ గురుబలం బెల్లను
        గాండీవిఁ గప్పిన క్రమముమీర


గీ.

నపుడు దైతేయు లాగ్రహవ్యగ్రు లగుచు
బహువిధాయుధహస్తులై ప్రబలి మిగులఁ
గారుచిచ్చును మిడుతలు గవిసినట్లు
శూరుఁడౌ ననిరుద్ధునిఁ జుట్టుకొనిరి.

79


మ.

అనిరుద్ధుండును రోషభీషణతరాహంకారహుంకారుఁడై
దనుజానీకముఁ దేరిచూచి నగుచున్ దర్పంబుమీరన్ గడున్
దునియల్ గాఁ బడవ్రేయ నద్దనుజులన్ దుర్వారఖడ్గంబుచే
ననికిన్ జాలక పారి రందఱును హాహాకారముల్ మీరఁగన్.

80

వ.

ఇవ్విధంబున వెఱపునం బారి మఱుఁగుఁ జొచ్చిన నిశాచరుల
నూఱడించి బాణుండు తనయరదంబు సమ్ముఖంబు సేయించి.


క.

తనవేయికరంబులచే
వినుతిగ ధరియించినట్టి వివిధాయుధముల్
గనుఁగొనలఁ గెంపు నింపుచు
ననిరుద్ధునిమీద వైచె నాగ్రహ మొదవన్.

81


క.

ఈరీతి బాణుఁ డేసిన
భూరిశరంబులను గేడెమున నేర్పొదవన్
వారింపుచు ననిమొన నా
శూరుఁడు విలసిల్లె నుదయసూర్యునిభంగిన్.

82


గీ.

గంధగజమును బరికించి కాననమున
సరకుగొననట్టి సింహంబుకరణి మఱియు
లేశమైనను దైత్యేంద్రు లెక్కగొనక
సమరముఖమునఁ బొల్చె నాశౌర్యధనుఁడు.

83


వ.

ఇట్లు నిలిచిన.


సీ.

బాణుఁ డంత నిశాతబాణజాలంబుల
        గరులంటగా నేసి గాత్రసీమ
మర్మముల్ నొప్పింప మగటిమి చెడక యా
        యనిరుద్ధుఁ డాగ్రహవ్యగ్రుఁ డగుచు
నిఖిలాంగకంబులు నెత్తుట జొతిల్లఁ
        గావించి విశిఖసంఘముల కోర్చి
యసురేంద్రుతేరుపై కరుగ నారణకోవి
        దుండు ఖడ్గంబులఁ దోమరముల

గీ.

సునిశితములైన ముద్గరశూలచక్ర
పరశుపట్టిసముఖఘనప్రహరణముల
నిఖలజగములు కంపింప నిగుడఁ జేసి
మించి ప్రద్యుమ్న తనయుని ముంచె మఱియు.

84


గీ.

బాణుఁ డీరీతి నొప్పింప బాణతతులఁ
గలఁగ కాతఁడు తన చేతిఖడ్గమునను
వానిరథకూబరముఁ ద్రుంచి పూనికలర
హయములను ద్రుంచి బెట్టేర్చె నతిశయమున.

85


క.

ఈరీతి విక్రమంబున
మీరిన యనిరుద్ధుఁ జూచి మేల్మే లనుచున్
భూరిముదంబునఁ బొగడుచు
నారదుఁ డట నిల్చి నింగి నాట్యముఁ జేసెన్.

86


క.

ఎంతయుఁ గినుకను బాణుఁడు
పంతముమీరంగ వివిధబాణంబులచే
గంతునికొడుకును ననిలో
నంతర్హితుఁ జేయ దనుజు లార్చిరి పెలుచన్.

87


సీ.

అనిరుద్ధుఁ డవియెల్ల నడిదంబుచేఁ ద్రుంచి
        కోపించి తన్ను మార్కొన్న వాఁడు
కాలదండమురీతిఁ గాలాగ్నికైవడి
        మిక్కిలి దీవ్రమౌ నొక్కశక్తి
జగములు కలఁగంగ జ్వాలలు [8]నిండంగ
        ఘంటలు మ్రోయంగఁ గాంతి చెలఁగఁ
బ్రద్యుమ్ననందనుపైఁ బ్రయోగించిన
        నలశక్తియే పూని యాఘనుండు

గీ.

బలితనూభవుమీఁదను భయదముగను
వడిఁ బ్రయోగింప నది వచ్చి వానిరొమ్ము
భూరిజవమున భేదించి భూమిఁ జొచ్చె
నపుడు దేవత లార్చిరి యంబరమున.

88


వ.

అయ్యవసరంబున రణంబున మూర్ఛాగతుండైనతరి బాణునిఁ
జూచి కుంభాండుం డిట్లనియె.


ఉ.

ఓ యసురేంద్ర! వీని నని నోర్వఁగ నీకు నశక్య మీజగ
ధేయపరాక్రముండు రణకేళివిశారదుఁ డట్లుగావునన్
ధీయుతమూర్తివై యిపుడు తీవ్రరణంబటు గట్టిపెట్టి నీ
మాయను నొంచి వీని నిట మమ్మును నిన్నును గావఁగాఁ దగున్.

89


గీ.

అనుచుఁ గుంభాండుఁ డాడిన నసురవిభుఁడు
తెలివిఁ గైకొని ఘనకోపదీపుఁ డగుచు
మించి గరుడుండు పామును ద్రుంచుకరణి
వీని ఖండింతు ననుచును బూని పలికి.

90


క.

హరులును గేతువు సారథి
యరదంబునుగూడ బాణుఁ డంతర్హితుఁడై
యరిగిన యూహరిమనుమఁడు
వెరవక నలుదిశల వాని వెదకుచు నుండెన్.

91


సీ.

బలిపుత్రుఁ డప్పుడు బలుమాయచేతను
        దను గానరాకుండ ధరణి నిల్చి
యనిరుద్ధు నయ్యెడ నతిఘోరతరములౌ
        పన్నగాస్త్రంబుల బద్ధుఁ జేసి

తన కేతుదండంబుఁ దనర నానుకనిల్చి
        పరుషవాక్యంబులుఁ బలికి మిగుల
మనమునఁ గోపంబు (మలయుచు నుండం)గఁ
        గుంభాండుఁ జూచి యీకులవిదూరుఁ


గీ.

[9]గొదవ యెన్నఁడు లేని యీ కులమునకును
నిందఁ దెచ్చిన వీనిని నీవు వేగ
యింపుమీరంగ నిపుడె హింసింపు మనిన
నసురవిభుఁ జూచి మంత్రి యిట్లనియె మగుడ.

92


బాణాసురుం డనిరుద్ధుని నాజ్ఞాపింపఁగాఁ గుంభాండుండు వారించుట

ఉ.

ఓరజనీచరేంద్ర! హిత మొక్కటిఁ జెప్పెదఁ జిత్తగింపు మే
తీరున? వచ్చె వీఁ డిటకుఁ దేఁకువ నెవ్వరు? తోడితెచ్చి రే
యూరు? కులంబు? వీని కని యోర్పమరంగ వివేకశాలివై
యారసి పిమ్మటన్ దగు నుదగ్రతరంబుగఁ దెంపు సేయఁగన్.

93


సీ.

శుక్రున కెనయైన శౌర్యంబుఁగలవాఁడు
        ఘనభుజాబలముచేఁ దనరువాఁడు
నిఖిలాస్త్రములయందు నేర్పుఁగల్గినవాఁడు
        భానుతేజంబుచేఁ బరఁగువాఁడు
కమనీయశృంగారగరిమఁ జెన్నగువాడు
        నలరువిల్తునిరీతి నలరువాఁడు
రాజలక్షణములరమణ గాంచినవాఁడు
        చిన్నిప్రాయంబునఁ జెలఁగువాఁడు

గీ.

బవరమునఁ జేరి దేవదానవులకై న
గెలువరానట్టి మగటిమిఁ గలుగువాఁడు
కరసహస్రంబుగల నిన్ను కలన నోర్చి
వరబలోన్నతిఁ జెలువొందువాఁడు వీఁడు.

94


వ.

ఏవంవిధగుణగరిష్ఠుండైన యీపురుషశ్రేష్ఠుండు మాన్య యగు
నీకన్య గంధర్వవివాహంబున వరియించెఁ గావునఁ బూజార్హుండు
గాని వధార్హుండుగాఁడని వినయంబు నయంబు ప్రియంబు
మీరఁగాఁ బల్కు కుంభాండువాక్యంబు లంగీకరించి (పాశ)సమే
తునిగా ననిరుద్ధుఁ గావలి బెట్టించి మంత్రియుం దానును బాణుఁడు
నిజనివాసంబునకుం జనియె నంత.


అనిరుద్ధుఁడు దుఃఖితయగు నుషాకన్యను సమాశ్వాసపఱచి దుర్గాస్తవమున గతబంధనుండగుట

క.

నారదచోదితుఁ డగుచును
వారిజనయనుండు వచ్చు వాలాయము నీ
క్రూరునిఁ ద్రుంచు నటంచు ను
దారతఁ బ్రద్యుమ్నసుతుఁడు తలంచుచు నుండెన్.

95


ఉ.

పన్నగపాశబద్ధుఁడగు ప్రాణవిభున్ బరికించి గాటమౌ
విన్నదనంబునన్ మొగము వేఁకువచంద్రునిరీతి నొప్పఁగాఁ
గన్నుల బాష్పపూరములు గబ్బిచనుంగవమీఁద జూఱఁగాఁ
గన్నియ నెమ్మనంబు కలఁగన్ గడుఁజింత వహించె నత్తరిన్.

96


వ.

ఇట్లు దుఃఖితయగు నుషఁ జూచి యనిరుద్ధుం డిట్లనియె.

ఉ.

కన్నియ! దైన్య మొందకుము కమ్రకరాంచితశంఖచక్రుఁ డా
వెన్నుఁడు వచ్చు నాకొఱకు వేగమె దైత్యులఁ ద్రుంచు నాజిలో
నిన్నును నన్ను దోడ్కొనుచు నెమ్మిని ద్వారకఁ జేరఁ గమ్మరన్
జెన్నువహింపగా మనకుఁ జేకురు భాగ్యము లెల్లకాలమున్.

97


క.

అని వనిత నూఱడింపుచు
ఘనమగు దుర్గాస్తవమున గతపన్నగబం
ధనుఁ డగుచు నతిముదంబున
ననిరుద్ధుం డుండె దనుజునంతిపురమునన్.

98


క.

నారదుఁ డావృత్తాంతము
వారిజనాభునకుఁ దెల్పువాఁడై నింగిన్
భూరిజవంబున మీరుచు
ద్వారవతీపురికి నేగె వాంఛ దలిర్పన్.

99


ద్వారకాపురమున స్త్రీ లనిరుద్ధుని మేల్కొల్పఁజనుట; అంతఃపురస్త్రీ లనిరుద్ధుని గాన కెల్లెడల వెదకి తుదకు శ్రీకృష్ణున కెఱుకపఱచుట

వ.

అంత.


సీ.

అరుణోదయంబున హరిపౌత్రు మేల్కొల్ప
        నెప్పటిశ్రమమున నిందుముఖులు
పడకయింటికి వచ్చి బాగుగా నెంతయుఁ
        దంబురల్ సుతిఁగూర్చి తనరువేడ్క
దేవగాంధారియు దేశాక్షి మలహరి
        గుండక్రియ లలిత గుజ్జరియును
మొదలుగాఁ గలయట్టి యుదయరాగంబులు
        వినుతింపఁ గొందఱు వింతవగల

గీ.

నద్దమును క్షీరకుంభంబు లలరుసరులు
కామధేనువు మున్నుగాఁ గల్గుభవ్య
వస్తువులతోడ శోభనవాద్యములును
బూని కాచిరి కొంద ఱంభోజముఖులు.

100


సీ.

పడకింటిలోపలఁ బవళించి యున్నట్టి
        కాంతలు మేల్కాంచి కంతుతనయుఁ
డీరేయి యిక్కడ నెలమితోఁ గ్రీడించి
        మనల వంచించి యేమగువకడకొ
చని దానితో గూడి సంతోష మమరంగ
        బడలిక నెమ్మేనఁ బొడమ నిపుడు
నౌరౌర! యుదయమైనదియును నెఱుఁగక
        యూరక నిదురింపుచున్నవాఁడొ!


గీ.

పురిని గల వారయువతులపొందుఁ గోరి
మదనకేళికి నలయుచు నిదురఁబోయి
తెల్లవారినకతమున నుల్లమునను
సిగ్గుపడి రాకయున్నాడొ! చెలువలార!

101


క.

ఇచ్చకములాడి మిక్కిలి
విచ్చలవిడి గొల్లచెలుల వేడుక మీరన్
దచ్చనలఁ గూడి జుణిగెడు
నచ్చుతునకు మనుమఁ డనిన నడుగఁగ నేలా.

102


క.

అని యనిరుద్ధుని నింతులు
మనమున నెన్నుచును మిగుల మమతలు హెచ్చన్
వనితలయిండ్లను వెదకఁగ
ననఁబోఁడులఁ బంపి రపుడు నవ్వుచు నంతన్.

103

క.

ఇల్లిల్లు వెదకి యప్పుడె
తెల్లమిగాఁ దెలిసివచ్చి తెఱువలు తెలపన్
గొల్లల నెగ్గడికత్తెల
వల్లభుఁ డెచ్చోట నున్నవాఁడని తెలియన్.

104


వ.

దిగ్గన వచ్చి యెగ్గడికత్తియలు బద్ధాంజలులై యయ్యనిరుద్ధుని
కులసతులతో నిట్లనిరి.


ఉ.

ఇంతులు గొల్వఁ జుట్ల దొర యిక్కడనే కొలువుండఁ గంటి మే
మంతిపురంబు దాఁటి విభుఁ డవ్వలి కేగఁగఁ గాన మేమియున్
వింతగు చిక్కుబీగములు వేసినయట్లనె యున్న విప్పుడున్
గంతునిపట్టి యిట్లరుగఁ గారణ మేమియొ! సోద్య మయ్యెడిన్.

105


వ.

అని మందలించిన నయ్యిందునదనలు తమలో దామిట్లనిరి.


సీ.

బాళితో రమణుండు భామ! రమ్మని పిల్పి
        విరులుఁ గొప్పునఁ జుట్టె వింతగాఁగఁ
దమితోడ నాథుండు తరణి! రమ్మని పిల్చి
        పుక్కిటివిడె మిచ్చె బుజ్జగించి
యెలమిమీరఁగఁ బతి యెలనాగ! రమ్మని
        తిలకంబు దిద్దెను దీరుగాఁగఁ
బ్రేమతోఁ జెలువుండు బిత్తరి! రమ్మని
        కౌఁగిటఁ జేర్చెను గారవించి


గీ.

యోరి! రమ్మని నేఁ బిల్వ నొఱపుమీరఁ
బలికె సేబా సనుచు మెచ్చి బాగుమీర
సమరతుల నన్ను దేలించి సరసమమర
సురటిచేతను విసరెను సుదతులార!

106

క.

నవ్వులకును మనతోడను
బువ్వులవిలుకానిసుతుఁడు పొంకముగాఁగన్
దవ్వుల డాఁగఁగబోలును
జవ్వనిరో! వెదుకుదాము సరసత ననుచున్.

107


సీ.

మేలుగాఁ గనుపట్టు కేళీగృహంబులు
        గొప్పలై మించిన యుప్పరిగెలుఁ
జెలువంబు మీరిన శృంగారవనముల
        నింపైన పూఁబొదరిండ్లయందు
నవరత్నవిరచితనాటకశాలల
        సౌవర్ణమయములౌ సజ్జలందు
నెలమిఁ గ్రీడించు నింతులయిండ్ల(యందు)ను
        మెచ్చంగఁదగు మేలుమిద్దెలందు


గీ.

వెలఁదు లందఱు గుంపులై వెదకి వెదకి
కంతుతనయుని గానక కళవళమున
నచ్చెరువుఁ జెందుచును జాల నాత్మలోనఁ
బలికి రిట్లని యెంతయు భావమలర.

108


చ.

మునుపును శంబరాసురుఁడు ముచ్చుతనంబునఁ బంచబాణునిన్
గొని తనయింటి కేగె నని క్రొత్తలుగా వినుచుందు మిట్టిచో
ననిమొన నోర్వఁజాలమిని యచ్చెరువొందఁగ నెవ్వఁడేనియున్
మనసిజుసూను నెత్తుకొని మాధవునిన్ గనగుండ డాఁగెనో!

109


వ.

అని యింతులెల్ల యోజన సేయుచు డగ్గఱనున్న హెగ్గడి
కత్తియలతో నిట్లనిరి.

క.

హరితోడుత నీకార్యము
సరగున నిందఱును దెల్పి సంతసమమరన్
వరునిన్ దోడ్కొని రమ్మని
గరితలకును మ్రొక్కి వారు కదలిరి వేగన్.

110


వ.

అంత.


క.

కమలంబులు వికసించెను
గమలాప్తుం డుదయమయ్యె గౌరవ మొప్పన్
గమలాక్ష! మేలుకొను మని
కమలముఖులు మేలుకొలుపఁ గడువేడుకతోన్.

111


సీ.

హరియప్డు మేల్కాంచి యద్దంబుఁ బువ్వులు
        కపిలధేనువు క్షీరకలశములను
విప్రయుగ్మంబును వేడుక వీక్షించి
        నిత్యకృత్యముఁ దీర్చి నేమమమరఁ
బసిఁడికంబంబుల భాసిల్లుచున్నట్టి
        కొలువుకూటంబునఁ గొమరుమీరఁ
జెలఁగెడు నవరత్నసింహాసనంబునఁ
        గొలువున్నసమయంబుఁ జెలులు దెలిసి


గీ.

విన్నవింపఁగఁ బదియాఱువేలు సతులు
నల్ల రుక్మిణి మొదలైన యష్టమహిషు
లెలమిమీరఁగ శ్రీకృష్ణుఁ గొలువ నపుడు
వచ్చి రచటికిఁ దమతమ వైభవముల.

111


వ.

అంత.

సీ.

అలరుక్మిణీదేవి యందంబు కనుపట్ట
        నిలువుటద్దముఁ బట్టె నేర్పు మెఱయ
భామినీమణి సత్యభామ సిగ నమర్చి
        బురు(సారు)మాల్ గట్టెఁ బొంకముగను
జాంబవతీసతి జాతికస్తురిచేత
        దిలకంబు దిద్దెను దీరుగాగ
మిత్రవిందాకాంత మేలైనచౌకట్లు
        వీనులఁ గీలించె వింతగాఁగఁ


గీ.

గంఠమున భద్ర నిలిపెను గంఠసరులు
నురమున సుదంత కౌస్తుభ మొప్ప నుంచెఁ
జనవునఁ గళిందకన్య చేసరు లమర్చె
బిరుదుపెండెంబు లక్షణ పేర్మిఁ బెట్టె.

113


వ.

మఱియును.


సీ.

పొలుపు మీరినయట్టి బురుసాహిజారును
        దొయ్యలి యొక్కతె తొడగనిచ్చె
బసిఁడివ్రాత చెఱుంగు మిసిమిగల్గిన దట్టిఁ
        దరుణి యొక్కతమర్చె హరువుగాఁగ
రంగుమారినయట్టి బంగారుదుప్పటిఁ
        బడఁతి యొక్కతె కట్టె బాగు మెఱయఁ
బంచరత్నంబుల భాసురంబగు వంకి
        సుదతి యొక్కతె చెక్కె సొగసుమీరఁ


గీ.

జేరి యడపంబుఁ గట్టెను జెలువ యొకతె
కడఁగి కాళంజిఁ బూనెను గాంత యొకతె
సురఁటిచేతను విసరెను సుదతి యొ తె
వెలయ వింజామరముఁ బూనె వెలఁది యొకతె.

114

క.

చెలు లంద ఱిట్లు గొల్వఁగ
మలయు కరేణుపులనడిమి మత్తేభ మనన్
జెలువొందెడు గోపాలకు
నెలమిన్ వీక్షించి మ్రొక్కి హెగ్గడికత్తెల్.

115


క.

చనవరులగు గరితలతో
ననిరుద్ధుని గాన మనుచు నక్కజమీరన్
వినయంబుతోడఁ దెల్పిన
వనజాక్షున కెఱుకసేయ వారలు నంతన్.

116


వ.

మందస్మితసుందరవదనారవిందుండై గోవిందుండును.


క.

ఏలా మీకీయోజన
వాలాయముగాఁగఁ బంచబాణునిసుతు నే
నేలీలనైనఁ దెచ్చెద
బాలికలకుఁ దెలుపుఁ డనుచుఁ బనిచెన్ వారిన్.

117


శ్రీకృష్ణుఁ డాస్థానమును జేరి సకలపరివారములను రప్పించి యనిరుద్ధుఁడు కానరాకుండుటను దెల్పుట

వ.

ఇవ్విధంబున హెగ్గడికత్తియలకు నానలిచ్చి యగ్గజరాజవర
దుండు దగ్గఱను నున్న యన్నగారులన్ జూచి దారకునిఁ దేరుఁ
దెమ్మనుండని పనిచిన యనంతరంబ.


ఉ.

సారథి తేరుఁ దెచ్చె నని సారసనేత్రులు విన్నవింప నా
నీరజనాభుఁ డొద్దితరుణీతతి హెచ్చరి కంచుఁ దెల్పఁగా
మేరువుకైవడి దిశల మిక్కిలి గాంతులు నించి మించు న
త్తేరపు డెక్కివచ్చె నతితీవ్రగతిన్ సభఁ జేర వేడుకన్.

118

వ.

ఇవ్విధంబున సుధర్మాస్థానంబునకున్ వచ్చి యచ్యుతుండు
అచ్చటన్ గొలు విచ్చి కూర్చుండి దండనుండు నవసరంబుల
బంధుపరిజనంబుల మంత్రివరుల గుఱిదొరల రప్పించుండని
యానతిచ్చిన.


క.

అవసరమువార లప్పుడె
జపమునఁ జని దొరలకెల్ల సరగునఁ దెల్పన్
సవరణలు మెఱయ వచ్చిరి
నవిరళగతి నుగ్రసేనుఁడాదిగ సభకున్.

119


వ.

మఱియును.


సీ.

తనయుఁ డేకార్యంబుఁ దలఁచినాఁడో! యని
        వసుదేవుఁ డటవచ్చి వాంఛమీర
ననుజుఁ డెవ్వని గెల్వ నాత్మ నెంచెనొ! యని
        నీలాంబరుఁడు వచ్చె నెమ్మిమెఱయ
నని గల్గెనో! తమయన్నకు నని యెంచి
        సాత్యకి వచ్చెను సరభసముగ
నయ్య పిల్పించిన యవసరం బేమని?
        ప్రద్యుమ్నుఁడును వచ్చె బలము కొలువ


గీ.

మఱియు నుద్ధవముఖులైన మంత్రివరులు
పరఁగఁ గృతవర్మ మొదలైన బంధువులును
నల్ల యక్రూరుఁడాదిగా నాప్తజనులు
వచ్చి రాశౌరిసభఁ జేర వరుసగాఁగ.

120


వ.

తదనంతరంబ.

క.

వచ్చినవారికి నప్పుడె
యచ్యుతుఁ డెదురేగి మిగుల నందముగాఁగన్
మచ్చికఁ దండ్రికి నన్నకు
ముచ్చట మీరంగ మ్రొక్కి మోదము వెలయన్.

121


క.

వసుదేవప్రముఖుల నల
బిసరుహలోచనుఁడు హేమపీఠంబులఁపై
బొసఁగంగ నిల్పుచు మది కిం
పెసఁగంగా వారిఁ జూచి యిట్లని పల్కెన్.

122


సీ.

వింత యొకటి నేఁడు వినరయ్య దొరలార!
        యరయ నిన్నటిరేయి యంతిపురము
బీగముద్రలునైన పిదపను నిదురించు
        ననిరుద్ధుఁ గానమం చతివ లనిరి
యిది యేమి హేతువో? యిందఱు యోజించి
        తెలియఁబల్కు డటన్నఁ దేటగాఁగ
విని వారు మిక్కిలి విస్మయంబందుచు
        ముందుఁ దోఁచక శౌరిమోముఁ జూచి


గీ.

జగతి సర్వంబుఁ దెలిసిన స్వామివీవ
నీకుఁ దెలియని దేమి? యీ జోకములను
మమ్ము నడుగంగ నేలయ్య? మదన జనక!
తెలియ మీరలె యిపు డానతీయవలయు.

123


వ.

అనిన విని కపటనాటకసూత్రధారుండైన శౌరి సర్వంబునుం
దెలిసియుం దెలియనివానిచందంబున డెందంబున యోజన
సేయుచున్న సమయంబున.

నారదుఁడు శ్రీకృష్ణునికి ననిరుద్ధుని వృత్తాంతమును బాణాసురుని బలమును దెలుపుట

ఉ.

తెల్లనిమేనిపై నలరుతేజము దిక్కులఁ బిక్కటిల్లఁగా
గొల్లలయేలికైన హరిఁ గోరికఁ బాడుచు వీణె మీటుచున్
బల్లిదుఁడై చరించు నల బాణుని గర్వ మణంచ నెంచి తా
మెల్లనె నారదుం డపుడు మేదినికిన్ దిగివచ్చె వేడుకన్.

124


క.

ఇల కిటువలె దిగివచ్చిన
కలహాశనమౌనిపాదకమలంబులకున్
వలగొని మ్రొక్కుచు శౌరియుఁ
జెలువగు సద్భక్తి బూజసేయుచు మిగులన్.

125


సీ.

మౌనీంద్రుఁ దోడ్తెచ్చి మణిపీఠమున నుంచి
        యతని యనుజ్ఞచే నపుడు హరియు
సింహాసనంబునఁ జెలఁగుచుఁ గూర్చుండి
        కుశలంబు లడిగినఁ గోర్కి మీర
ధర మీ రవతరించి ధర్మంబు పోషింప
        సర్వంబు కుశలంబె స్వామి! యనినఁ
దాపసోత్తమునకుఁ దనర నంజలి సేసి
        యనిరుద్ధువృత్తాంత మడుగ నితఁడు


గీ.

పరఁగు బ్రహ్మాండముల నెల్ల బాగుమీర
గర్భమున నుంచుకొన్నట్టి ఘనుఁడ వౌర!
యిట్టివృత్తాంత మేమియు నెఱుఁగనట్టు
లడిగెదవు నీ వెఱుంగని యదియుఁ గలదె!

126

సీ.

బలితనూభవుఁడగు బాణాసురునిపుత్రి
        కలలోన యనిరుద్ధుఁ గలసి వేడ్కఁ
జిత్రరేఖను జూచి చెలువునిఁ దెమ్మన్న
        నళినాక్షి మాయచే నగరుఁ జొచ్చి
యనిరుద్ధుఁ దోడ్కొని యప్పురంబున కేగి
        యల యుషతోఁ గూర్చినట్టి వార్త
బాణాసురుఁడు విని బలములతో వచ్చి
        పన్నగాస్త్రంబులఁ బదిలముగను


గీ.

బంచబాణునితనయుని బద్ధుఁ జేసి
బయలుదేఱకయుండఁగఁ బ్రబలునైన
యట్టి దనుజులఁ గావలిఁ బెట్టినాఁడు
మనుమ నిటు దోడితెమ్ము నీ మహిమ మెఱయ.

127


వ.

అని పల్కిన.


సీ.

బలభద్రుఁ డప్పుడు పంతంబు లాడుచు
        ముసలంబుఁ ద్రిప్పెను మొక్కలమున
సమరంబులో దైత్యు సమయఁజేయుదు నంచు
        సాత్యకి లేచెను సంభ్రమమునఁ
బట్టినిఁ జెఱపట్టు ప్రబలుఁడౌ దానవుఁ
        బట్టి తెచ్చెద ననెఁ బంచశరుఁడు
బాణునిఁ గూల్చెద బాణాగ్నిచే నని
        సాంబుండు పలికెను సాహసమున


గీ.

మఱియు గృతవర్మ మొదలైన మనుజపతులు
శోణితపురంబునను గల్గు శూరవరులఁ
జెండుబెండాడి మిక్కిలిఁ జేవమెఱయ
నల్ల యనిరుద్ధుఁ దోడ్తెత్తు మనుచుఁ బల్క.

128

క.

వీరాలాపము లాడెడు
వారల వారించి యపుడు వసుదేవసుతున్
జేరఁగ రమ్మని ప్రేమను
నారదుఁ డిట్లనుచుఁ బల్కె నైపుణిమీరన్.

129


సీ.

ముల్లోకములు మెచ్చ ముక్కంటిచేతను
        వరములుఁ గైకొన్న వరబలుండు
వేయికరంబుల వివిధాయుధంబులు
        ధరియించి యనిసేయు ధైర్యశాలి
దేవేంద్రముఖులైన దిక్పాలకుల నెల్ల
        క్షణమాత్రమున గెల్చు సాహసికుఁడు
మాయాబలంబున మగటిమిచేతను
        బగతుల సాధించు బల్లిదుండు


గీ.

ప్రమథగణములతోఁగూడ భర్గునంత
వాఁడు వాకిటిగొల్లయై వచ్చికొలువ
నల్ల శోణితపుర మేలునట్టి మేటి
యమితతేజోధికుండు బాణాసురుండు.

130


గీ.

జగములన్నియు సృజియింప సారెఁ బ్రోవఁ
జతురుఁడవు నీకు నిండు నసాధ్య మేమి?
వీరుల కసాధ్యుఁ డగునె యవ్వీరవరుఁడు
నీవె గెలువంగవలయును నేర్చుమీర.

131


వ.

అని విజయప్రయాణంబునకు శుభముహూర్తంబు నిర్ణయించిన.


క.

అరుణాబ్జనాయికాంబా
చరణాంబుజసాధుభజనసంభృతహృదయా!
నిరతాన్నదానపోషిత
ధరణీసురవర్య! శాశ్వతశ్రీధుర్యా!

132

క.

సాక్షాత్కృతకనకవనా
ధ్యక్ష! విపక్షావనీంద్రదారణదక్షా!
అక్షయకరణావీక్షణ
రక్షితకవిరాజ! దినకరప్రియతేజా!

133


ధోద్ధత.

అంగనాహృదయహారిసత్కృపా
పాంగవీక్షణ! కృతార్థసద్గుణా!
సంగరాపహృతశాత్రవౌఘమా
తంగబృందభరితశ్రితాంగణా!

134


గద్య.

ఇది శ్రీమద్రాజగోపాలకరుణాకటాక్షవీక్షణానుక్షణప్రవర్ధమాన
సారసారస్వతధురీణయు విచిత్రతరపత్రికాశతలిఖితవాచికార్థావగా
హనప్రవీణయు తత్ప్రతిపత్రికాశతస్వహస్తలేఖనప్రశస్తకీర్తియు
శృంగారరసతరంగితపదకవిత్వమహనీయమతిస్ఫూర్తియు అతులి
తాష్టభాషాకవితాసర్వంకషమనీషావిశేషశారదయు రాజనీతి
విద్యావిశారదయు విజయరాఘవమహీపాలవిరచితకనకాభిషే
కయు విద్వత్కవిజనస్తవనీయవివేకయు మన్నారుదాసవిలాస
నామమహాప్రబంధనిబంధనకృతలక్షణయు మహనీయరామా
యణభాగవతభారతకథాసంగ్రహణవిచక్షణయు పసపులేటి
వెంకటాద్రిబహుజన్మతపఃఫలంబును మంగమాంబాగర్భశుక్తి
ముక్తాఫలంబును రంగద్గుణకదంబయు నగు రంగాజమ్మ వచన
రచనాచమత్కృతిం జెన్నుమీరు ఉషాపరిణయంబను మహాప్రబం
ధంబునందుఁ దృతీయాశ్వాసము.

శ్రీరాజగోపాలాయనమః

  1. గోపాల
  2. వార
  3. య్యనుఁగుజెలి చెలులతోడ నావలికి నేఁగన్
  4. పట్టి
  5. కౌఁగిలింపఁగ
  6. డిట్లనున్
  7. వీఁడు
  8. నిడుంగ
  9. కొదవ యెన్నడును లేని కులమునకును