Jump to content

శివపురాణము/సతీ ఖండము/ఉమాశివుల కలహం

వికీసోర్స్ నుండి
(ఉమాశివుల కలహం నుండి మళ్ళించబడింది)

"మానవ మాత్రులే కాదు ! పార్వతీ పరమేశ్వరులకైనా ప్రణయ కలహాలు సర్వ సామాన్యం! ఎంతటి ఆదిదంపతులకైనా సరసం, విరసంగా మారే అంశాలూ ఉంటాయి.

ఒక్కొక్క అవతారంలో ఆ జగజ్జనని, శ్వేత - గౌరాది వర్ణాలలో కనిపించి నప్పటికీ - అధికభాగం అవతారాలలో ఆమె 'శ్యామ' గానే ప్రభవించిందని పౌరాణికుల వాక్కు. ఆ అభిప్రాయం కలగడానికీ కారణం ఉంది. ఆట పట్టించడానికే అవునుగాక! పరమేశ్వరుడంతటి వాడే, అమ్మవారిని 'కాళీ' అనీ; 'తమసా' అనీ; 'శ్యామా' అనీ; 'కజ్జలా' అనీ పిలవడం ఎన్నోసార్లు ఆవిడ గమనించింది.

ఒకసారి రోషం కొద్ధీ, "మీకు నలుపు అయిష్టమైతే ఆ విషయం స్పష్టంగా చెప్పొచ్చు కదా! ఇలా రకరకాలుగా పేర్లు పెట్టి పిల్చి మరీ వినోదించడం దేనికీ? భర్తకు అయిష్టమైన పనేదీ, ఏ సతీచేయదో - ఆమె పతివ్రత అనిపించు కుంటుందని నాకు తెలుసు! మీకింత అయిష్టమైన నలుపు రంగుతో నేనెందుకు ఉండాలి!? ఇప్పుడే ఈ రంగుపోగొట్టుకుని, మిలమిల మెరిసే మేలిమి బంగారు రంగు ప్రసాదించమని తపస్సు చేసి వస్తాను" అని వెళ్లబోయింది.

"ఈ మాత్రం రంగు మార్చడానికి తపస్సు వరకూ ఎందుకు శ్యామా!? అయినా సర్వదేవుళ్లూ - దేవతలూ అంతా నాకోసం తపిస్తూ వుంటే, నీతపస్సు ఎవరికి? నాకు నిజంగానే నీ రంగు మార్చుకోవాలనిపిస్తే అదెంతపని నాకు? ఏదో ఊరకే సరసానికి అన్నాను" అని నవ్వేశాడు శివుడు చిద్విలాసంగా.

భర్త అలా అన్నపట్టికీ - ఏ మూలనో చిన్న సందేహం ఉండిపోయింది అమ్మవారికి. ఎప్పటికైనా బ్రహ్మచేత వరం పొంది, తన శ్యామ వర్ణాన్ని పోగొట్టుకోదలచిందామె.

గృహవసతి లేని సతీదేవి:

అంతవరకూ ఓ ఇల్లూ పొల్లూలేని ఆ జంగమయ్య శ్మశాన భూముల్లో నివశించేవాడు. సతీసమేతంగా - ఆ రుద్రభూముల్లో విహారం సంసారులకు యుక్తం కాదని బ్రహ్మాది దేవతలు చెప్పడంతో, మందర పర్వతమ్మీదకు మకాం మార్చాడు.

వేసవి కాలపు ఎండల తీవ్రతకి కంపించసాగింది సతీదేవి.

ఓరోజు భర్త చెంతచేరి "నాధా! వేసవి కాలం ఎంత తీక్షణంగా ఉన్నదో చూశారు కదా! ఈ వేడి భరించడం నా తరం కాదు. ఓ గృహం నిర్మించుకోవడం ఉత్తమం అని ప్రతిపాదించింది. "నిజమే! అది బాగానే ఉంటుందనుకో! నేను ఎంత సంపన్నుడి ననేదీ నీకు తెలీనిది కాదు. అన్నీ తెలిసిన నీవే, నన్ను అర్థం చేసుకోకపోతే, ఇక లోకులేం అర్థం చేసుకుంటారు?" అంటూ సత్యవచోనిష్ఠతో వెలిగిపోతున్న ముఖాన్ని అమాయకంగా పెట్టి అడిగాడాయన.

సతీదేవి ఇంకేమనడానికీ తోచలేదు. అది నిజంకాకపోతే కదా - వాదులాడడానికి! తానూ అనునిత్యం చూస్తున్నదే! కట్టుబట్టలు లేక పులి చర్మాన్ని, ఆభరణాలు లేక పాముల్నీ, తినతిండిలేక భిక్షాటనాన్ని ఆశ్రయించిన భర్తకి కనీసం పర్ణాలతో కప్పిన ఆశ్రమమైనా లేదు! ఇక పక్కా ఆశ్రయం ఎక్కడ?

వారిద్దరూ ఆ వేసవిని అలా చెట్లకిందనే గడిపేశారు. ఇంతలో ప్రళయ పర్జన్యఘోషలతో వర్షధారలు మొదలయ్యాయి. జంతువులు - పక్షులువంటివే గట్టిగూడు నిర్మించుకుని, పర్జన్యుడి బారినుంచి రక్షించు కోవడం చూసింది సతీదేవి.

మరోక్కసారి భర్తతో గృహనిర్మాణం గురించి ఆలోచించమని ప్రస్తావించింది. "వేసవిని ఏదోలా - ఆచెట్టుక్రింద - ఈ చెట్టుక్రిందా గడిపేశాం! గతించిపోయిందా కాలం! ఇప్పుడీ జలధారల్ని ఎంతదట్టమైన చెట్లూ ఆపేలాలేవు! ఇకనైనా ఓ ఇంటి గురించి ఊహచేయడం సబబేమో!" అని అర్థోక్తిలోనే ఆగిపోయింది.

ఇబ్బందికరంగా ముఖం పెట్టాడు శివుడు. "చూడు సతీ! నీకంతా తెలుసు! తెలిసీ నన్ను పదే - పదే అదే విషయంపై నిగ్గదీయడంలో నీ ఆంతర్యం ఏమిటో, నాకు అర్థంకావడం లేదు" అన్నాడు.

"మీరు నా బాధను అర్థంచేసుకోండి! అదిచాలు!" అంది సతి ముక్తసరిగా!

తక్షణం ఓ ఆలోచన స్ఫురించిన వాడిలా "ఆఁ! సతీ! నాకొక్క ఉపాయం తోచింది. మనం - ఈమేఘాల క్రింద ఉంటేనేగదా... మనకీ వర్షపు బాధ! అంచేత మనమే ఈ మేఘాల పైపైకి పోయి, వాటిపైన అధివసిద్దాం!" అంటూ సతీదేవిని వెంటనిడుకుని, మేఘపటలం పైకి పయనమయ్యాడు మృత్యుంజయుడు.

అందువల్లనే మహాశివునికి 'జీమూతవాహనుడు' అనే పేరుకూడా కలిగింది. క్రమంగా వానాకాలం శుష్కించి, శరద్వేల అయింది. శ్రావణ మేఘాలనాటి అలజడి మార్గశీర్షపు వెన్నెలగా మారింది. మానస సరోవరానికి తరలిన హంసరాజములు సైతం, తిరిగి తామరపూలతో నిండిన కొలనుల్లోకి ప్రవేశించసాగాయి. 'ఈ ప్రకృతిని మనం అనుసరించుదాం! పద!' మన్నాడు - శంకరుడు.

తిరిగి ఆ సతీపతులు మందరపర్వతం మీదకి చేరుకున్నారు. ఈ ప్రకారం ఆది దంపతులు త్రికాలాలనూ అక్కడా - ఇక్కడా విహరిస్తూ హాయిగానే గడిపేస్తూన్నారు.

ప్రస్తుతానికి తాము ఇద్దరమే కనుక, ఏదోలా గడిచిపోతూన్నప్పటికీ, రేపు సంతానం కలిగితే, ఈ సంసార లంపటమంతా అటూ ఇటూ త్రిప్పడం సాధ్యమయ్యేదేనా? అనే శంక అపుడపుడు సతీదేవికి కలిగినా, 'ఆసమయానికి తగ్గవేవో అపుడు ఆలోచించవచ్చులెమ్మని ' ధైర్యం చెప్పే భర్త అమాయకపు ముఖం చూసినప్పుడల్లా - సతీదేవికి ఇక తర్వాత మాట తోచేదికాదు.