శివపురాణము/సతీ ఖండము/సతీదేవి మానసావిష్కృతి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నిరంతర శివదీక్షాపరురాలై చరిస్తోంది - సతీదేవి. ఒకానొక ఆశ్వయుజ మాస శరదృతువేళ శివారాధనా నంతరం, పశుపతి ప్రత్యక్షమై "ఉమా! నీ భక్తికి మెచ్చాను. ఏ వరం కోరుకుంటావో కోరుకో!" అన్నాడు.

సతీదేవి ఎంతో లౌక్యంగానూ - లౌల్యంగానూ తన మనస్సును ఆ పరమపురుషుని ఎదుట ఆవిష్కరించింది. తమకేది అనుగ్రహించా లనిపిస్తే అదే నాకు మహాప్రసాదం అంది. సరే! నాసతిగా స్వీకరించగలనన్నాడు శూలి.

పాణిగ్రహణం శాస్త్రోక్తంగా తండ్రి సమాక్షాన జరగాలని కోరింది దక్షచూలి. శివుని వీడ్కొల్పి, అంతఃపురంలోకి వెళ్లిపోయాక గాని, ఆ శంకరునికి.. తానామెకు వశంకరుడై విరహాగ్నిలోపడ్డ సంగతి తెలియలేదు.

బ్రహ్మకు చెప్పుకుని, ఈ కల్యాణం జరిపించే బాధ్యత బరువు ఆ విధాతపై పెట్టాడు శివుడు. లోలోన ఆనందించి, అన్ని ఏర్పాట్లూ చేసి, కళ్యాణానికి కదలిరమ్మని దక్షునిచే కబురంపేలా చేశాడు కమలాసనుడు.

కళ్యాణ వేళ కలకలానికి కారణం:

దైవజ్ఞులు నిర్ణయించిన శుభముహూర్తపు వేళ... చైత్రశుక్ల త్రయోదశీ ఆదివారం, పూర్వఫల్గుణీ నక్షత్రయుక్త కుంభలగ్నమునకు రుద్రుడు పెండ్లికొడుకుగా నందివాహనారూఢుడై ఇంద్రాదిదేవతలు, విష్ణు, బ్రహ్మ మానస పుత్రుల సమేతంగా దక్షపురికి వేంచేయగా, ఎదుర్కోలు సన్నాహంతో దక్షుడు అల్లునికి సమస్త లాంచనాలతోనూ స్వాగతించి కల్యాణ మండపానికి తోడ్కొని వచ్చాడు.

బ్రహ్మదేవుడే పురోహిత పీఠాన్నలంకరించగా, లక్ష్మీ సరస్వతులే పేరంటాండ్రు కాగా, శచీదేవి తదితరులు ముత్తైదువులుగా మహా వైభవంగా ఉమా - రుద్రుల వివహం జరిగింది.

సప్తపది

మంగళ ప్రదమైన జగన్మంగళకారకుని కమనీయ కల్యాణవేళ.. ఈ వైపరీత్యాలేమిటీ? విధిరాత విధినే వెక్కిరించడమేమిటీ? ఏదో - బుద్ధివక్రించి ఆ తుంటరిపని చేస్తే చేసి ఉండవచ్చు! దానికి ఇంతశిక్ష? బ్రహ్మతరపున మేము అందరం వేడుతున్నాం క్షమాభిక్ష! కరుణించు! అంటూ ముక్తకంఠంతో ఇంద్రాదిదేవతలందరూ విష్ణువు వెనక చేరి కట్టగట్టుకుని మొరపెట్టుకున్నారు. విష్ణువు విన్నపాన్నీ విన్నాక, బ్రహ్మను మన్నించి నప్పటికీ, అతడి మానసిక వ్యభిచారానికి తగినశాస్తి చేయాలనుకున్నాడు.

బ్రహ్మకూడా అపరాధ క్షమాపణ కోరాక అతడి చేత్తోనే అతని తలను స్పృశించుకోమన్నాడు పరమశివుడు. అంతకుముందే పరమశివుని పాదాలను వదలక (తప్పు మన్నించమని) పట్టుకొని ఉన్న బ్రహ్మ ఆ చేతులను అలాగే తన శిరస్సుమీదకు చేర్చుకున్నాడు.

అంతే!... బ్రహ్మ శిరస్సున నంది వాహనారూఢుడైన రుద్రరూపం ముద్రితమైపోయింది. అ విషయం బ్రహ్మకు అవగతమైనా, చేసేదిలేక అంతా శివుడిదే భారం అనుకుంటూ, శివస్తోత్రం చేశాడు. అప్పటికి ఉగ్రుడు శాంతమూర్తి అయినందున బ్రహ్మపట్ల కొంత వాత్సల్యభావం కనపరిచి "నువ్వు రుద్ర శిరస్కుడవనే పేర జగత్ ప్రసిద్ధి పొందెదవుగాక!" అని తన ప్రతీకారాన్ని ప్రముఖమైన వరంగా మార్చాడు.

అయినప్పటికీ చిన్న మెలికపెట్టాడు. "సత్పురుష ద్విజుల కార్యాలను నిర్వర్తించే వేళల బ్రహ్మాధిపత్యం నీదే అవుతుంది. నిన్ను ఈ రూపం గురించి ప్రశ్నించే వారికి అందరికీ నువ్వు యదార్థమే చెప్పవలసి వుంటుంది. వారు నిన్ను అపహాస్యం చేసినపుడల్లా, నీ ఈ పాపం కొద్ది కొద్దిగా తొలగిపోతూంది. ఆ ప్రకారం నవ్వులపాలవడమే నీకు తగ్గ ప్రాయశ్చిత్తం! ఏదేమైనా స్ఖలించబడిన వీర్యం అసామాన్యమైనది కనుక ద్రోణ, పుష్కర, ఆవర్తక, సంవర్తకాలనే నాలుగు ప్రళయమేఘాలై ఆకాశంలోనే సంచరిస్తాయి. మహోధృతంగా ఘోషించి ఉరుములు, పిడుగులు వెలువరిస్తాయే తప్ప ఇతర మేఘాల్లా నీటిధారలై భూపతనం చెందవు" అంటూ అనుగ్రహించాడు.

తప్పు తనదే కనుక అన్నిటికీ తలవంచిన బ్రహ్మ, తర్వాత తంతులను ఆహూతుల అభ్యర్థన మేరకు కానిచ్చేసాడు. బ్రాహ్మణ దక్షిణయిచ్చే సమయానికి రుద్రుడు పరిపూర్ణ ప్రసన్నుడై "ఇంత కళ్యాణాన్నీ కడు సమర్థతతో నిర్వహించిన నీకు దక్షిణగా నీవు కోరిన వరం అనుగ్రహిస్తున్నా! కోరుకో! అన్నాడు.

అందరూ ఆశ్చర్యపోయేలా బ్రహ్మలోక కల్యాణాత్మకమైన వరాన్నే కోరుకున్నాడు. అంతేకాని - అంతక్రితమే తన తలపై పడిన రుద్రముద్ర చిద్రమవ్వాలనేటటువంటి స్వార్థపూరిత వరాలు కోరుకోలేదు. ఇంతకూ బ్రహ్మ కోరిన వరం ఏంటంటే - ఏ కల్యాణ గుణధామునిగా పెళ్లికొడుకు రూపాన్ని శివుడు పొందాడో, ఆ రూపం అక్కడ అలాగే శాశ్వతంగా ఉండిపోవాలి అని! తాను ఆ సమీపంలోనే ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసుకుంటానన్న బ్రహ్మకు ఆ వరం అనుగ్రహించాడు.

తరువాత అప్పగింతలు వంటి తంతులన్నీ యథోక్తంగా పూర్తిచేసి, నూతన వధూవరులను సాగనంపాడు బ్రహ్మ.

వియ్యం - కయ్యం -నెయ్యం - సమపాళ్లుగా సాగిన ఈ కమనీయ కల్యాణ గాధను ఎవరువిన్నా, పఠించినా వారికి సకలశుభాలూ అనుగ్రహించాడు ఆ శుభంకరుడు.

ఎప్పుడో స్వాయంభువ మనువు కాలంనాటి దాక్షాయణీ పరిణయ గాధ ఇది" అని ముగించాడు సూతమహర్షి.

శౌనకాది మహర్షులంతా ఎంతో ఉత్సాహంగా శివ కల్యాణఘట్టం విని ఆనందంగా "ఆ సతీపతుల విలాస విహారాలు వినిపించ వలసింది" అని కోరగా "జిజ్ఞాసువులారా! శివతత్త్వం మిమ్మల్ని ఎటువంటి మాయా మోహావేశాలకూ లోనుచేయకుండు గాక! వివాహవేళ, కేవల చరణ దర్శనమాత్రాన బ్రహ్మ అంతటి వాడికే చిత్తచాంచల్యం ప్రకోపించగా మనమెంత? కనుక తెలిసిగాని - తెలియకగాని మీ మనస్సులందు చిత్తవికారం ఒదవకుండా ఒక్కసారి శివస్మరణ చేసుకోండి! ఆదిదంపతుల సరాగాల్లో సంసార పక్షమైనవి మాత్రం సంక్షిప్తంగా చెప్పు కొస్తాను" అని రోమహర్షణ ముని (సూతమహర్షి మరోపేరు) సెలవిచ్చాడు.

అందరూ ఉచ్చైస్వనంతో శివస్మరణ చేసిన తదుపరి సూతమహర్షి తిరిగి ప్రారంభించాడు.