శివపురాణము/సతీ ఖండము/శివునికి భిక్షాపాత్రగా కపాలం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

బ్రహ్మకు ఆదిలో ఐదుశిరస్సులుండేవి. శివునికి ఒక్కటే! (ఈ వివాహం నాటికి, బ్రహ్మకు ఇంకా ఐదుతలలున్న సంగతిని కొన్ని పురాణాలు ప్రస్తావిస్తున్నప్పటికీ) ఈ కథాంశం ముందు జరిగినదా? తర్వాత జరిగినదా అనే శంక ప్రక్కన పెట్టి, సావధానంగా వినమని - మన ఋషివరేణ్యులను కోరుతున్నాను.

ఒకప్పుడు - బ్రహ్మకూ, శివునికీ మాటపట్టింపువచ్చి నేను అధికుడనంటే - నేను అధికుడననే అహంకారం ప్రబలమైంది. 'నేను వచ్చిన తరువాతనే, ఈ సృష్టిలో కొచ్చిన నువ్వు నాకంటే అధికుడవెలా అవుతావు? చూశావా! నాకు ఐదు శిరసులున్నాయి' అన్నాడు బ్రహ్మ. 'నేనూ చూపించగలను ఐదుతలల్నీ! అంటూ శివుడు తన పంచముఖాన్ని చూపించాడు.

ఆ పంచముఖాలూ ఇవి : 1. సద్యోజాత, 2. వామదేవ, 3. అఘోర, 4. తత్పురుష, 5. ఈశాన.

దేవతలకు ఎన్నడూ ఐదు ముఖాలూ వరుసగా ఉండవు. నాలుగు దిక్కులకూ నాలుగు, ఊర్థ్వముగా (పైకి)చూచునట్లు ఇంకొకటీ ఒక పుష్పాకృతిలో ఈ ముఖాల అమరిక ఉంటుంది. కనుకనే సర్వదిక్కులనూ, సర్వ విశ్వాన్నీ వీక్షించే ఆ మహాశివుడు సర్వతోముఖుడను నామాంతరము చేత కూడ సుప్రసిద్థుడు. ఆయనకు తెలియని అంశంగాని, ఆయన వివరించలేని అంశంగాని లేవు. ఎవరేది ఎంత దాచాలన్నా సర్వేశుని వద్ద దాచలేరు.

బ్రహ్మకు ఆ విధంగా శివపంచముఖ దర్శనం కలిగినప్పటికీ, అసూయకొద్దీ ఈశ్వరునింకా రెచ్చగొట్టాడు. తన శిరస్సులే సహజమైన వన్నాడు. శివునికి తలలు నీటి బుడగల్లాటివని పోల్చి, అవి కాస్సేపటికే పేలిపోగలవని నిందించాడు.

దాంతో పరమశివుడు నిజంగానే ఉగ్రావతారుడైనాడు. కేవలం కొనగోట మీటి, బ్రహ్మ ఐదో శిరస్సు త్రుంచేశాడు. తలను ఉత్తమాంగం అన్నందవల్ల - అదిలేకుంటే మిగతా శరీరం మరణించినట్టే భావించబడుతున్నందు వల్ల శివునికి తక్షణమే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. అది ఆ మహాశివుణ్ణి సైతం అలాగే వదలకుండా పట్టుకుంది. కొనగోట అంటుకున్న బ్రహ్మయొక్క ఐదో శిరస్సు ఎంతకూ ఊడిపడదు.

ఈలోగా బ్రహ్మ కోపంలోంచి, మహాతేజోరూపుడైన ఓ వీర పురుషుడు జనించగా - బ్రహ్మ అతడితో శివుని సంహరించమని ఆదేశించాడు. అతడు శివుని ఎగాదిగా చూసి 'ఇతడి వంటి బ్రహ్మహత్యా పాతకుని చంపి నేను పాపాత్ముడిని కాదల్చుకోలేదు!.. తండ్రీ! నన్ను మన్నించు!, అని అక్కడినుంచి నిష్క్రమించాడు.

(ఈమధ్యలో మరికొంత కథ నడిచినప్పటికీ - అది అప్రస్తుత మగుటచే, ఇట విడువబడినది). చివరికి నారాయణుని బోధతో, వారణాసీ పురాన్ని ఒరుసుకుంటూ పారుతున్న గంగానది సర్వపాపహారిణి కనుక అందులో స్నానము చేసి పాతకం పోగొట్టుకున్నాడు. అక్కడి బదరికాశ్రమ సమీపంలో శివుని గోటినంటుకున్న బ్రహ్మకపాలము గూడ ఊడిపడిపోయింది. (అదే నేటి బ్రహ్మకపాల పుణ్యక్షేత్రం)

తన బ్రహ్మహత్యా పాతకం పోగొట్టే ఉపాయం చెప్పమని, శివుడు చాలాకాలం పాటు, అది అలా తనచేతిని అంటి ఉండగానే ఎందరెందరినో అడిగాడు. ఒకవార్త ఈ చివరినుండి ఆ చివరకు వెళ్లేసరికి ఎన్నెన్నో 'అటులట - ఇటులట' వంటి 'అట' కబుర్లు చేరి - దాని అసలు స్వరూపం పోగొట్టుకుని ఎన్నో చిలవలు - పలవలు చేర్చుకున్న చందంగా తయారవుతుంది. 'ఈ శివునికి అంటుకున్న కపాలఘటన' సైతం నానా మెలికలూ తిరిగి - 'చివరికి శివుడికి అడుక్కోవడానికి సరైన భిక్షాపాత్ర లేక, పుర్రెచేత బట్టి మరీ ఆడుక్కుంటున్నాడు' అనే రీతిగా.. దక్షుని చెవిన చేరింది. ఇట్టి అల్లుడివల్ల తనకెంత అపఖ్యాతి అనుకుంటూ, దక్షుడు కూడా అపార్థం చేసుకున్నాడు తప్ప, ఆ పరమ శివతత్త్వం గ్రహించుకో లేకపోయాడు. తన వ్యధని కోపంగా పరివర్తించాడు.

మన పురాణాలలో పాత్రలుగానీ; అందులోని సంఘటనలు గానీ పూర్తిగా మానవజీవితంలో ఎన్నోఅంశాలకు ప్రతిరూపాలే! అవీ -ఇవీ వేర్వేరు కావు. తన ఆలోచనా సరళినే, ఆయా పాత్రలకూ - ఘటనలకూ ఆరోపించి చూసుకుంటే, విషయం తేటతెల్లమవుతుంది.