ఉద్భటారాధ్యచరిత్రము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీ

ఉద్భటారాధ్యచరిత్రము

తృతీయాశ్వాసము


క.

శ్రీస్తనపాళీశరధిప
దాస్తోప్రదరదళితహరిహయరిపు శం
భుస్తుతిపఠనధురీణ సు
ధీస్తుత్యా! యన్నమంత్రిదేచామత్యా!

1


వ.

విన్నవింపుము.

2


గీ.

ఇట్లు కృతకృత్యుఁడై యమ్మహీశ్వరుండు
వృషభకేతనరుద్ధదృగ్వీధి యగుచుఁ
బ్రబలువిశ్వేశ్వరునిమందిరంబు డాసి
యతులపులకాభిరాముఁడై యతివతోడ.

3


శా.

స్నిగ్ధాష్టాపదశుంభదీప్తి రవి నాశ్లేషింప శుభ్రాంబుద
స్రగ్ధావళ్యముఁ గేలిఁబెట్టుశిఖరప్రాంశుచ్ఛటాశోభలన్
దుగ్ధాంభోనిధి దీటుకొల్పఁగ సుధాంధోనాథకోదండస
మ్యగ్ధామశ్రయతోరణద్యుతులు నేత్రానందముం జూపఁగన్.

4


సీ.

ఉత్తాలతరపతాకోజ్జృంభణంబుల
        జలజాప్తుహరులమే నులుకఁ జేయ
రత్నగవాక్షనిర్వత్ననిర్వన్నవా
        గరుధూపము(లును) నుత్కరముఁ బెనుప

నిర్దయస్ఫాలితోన్నిద్రభేరీభూరి
        భాంకారముల మిన్ను బధిరితముగ
సేవాసమాగత సిద్దసీమంతినీ
        తనురోచి మెఱుఁగులు తళుకు లొదవ


గీ.

సకలశాస్త్రక్రమంబులు చర్చ సేయు
నాగమజ్ఞులకలకలం బనువు మిగుల
యోగవిద్యావిలాసప్రయోగపరతఁ
దగుపరివ్రాట్టు లుచితవర్తనలు సూప.

5


శా.

ఆకుంబచ్చల మ్రుచ్చిలించుమణికుడ్యస్ఫూర్తి దూర్వాదళ
శ్రీకిం జాలి కురంగశాబకమనఃప్రీతిం బ్రసాదింపఁగాఁ
బ్రాకట్యాంచితసంచరత్కరిముఖప్రత్యగ్రదానాంబుధా
రాకల్లోలితగంధముల్ దశదిశావ్రాతంబు వాసింపఁగాన్.

6


మ.

అతఁ డబ్జాక్షుఁ డతండు దా మఱి సురాధ్యక్షుం డతం డంబికా
డతఁ డంభోనిధిభర్త యాతఁ డతఁ డాయ క్షేశ్వరుం డంబికా
శ్రితవామాంగ! మహేశ! విశ్వపతి! వీరిం జూడు మీ విప్పు డిం
దతిచిత్తేశ హసాద టంచు పనివెంటన్ నంది భాషింపఁగాన్.

7


ఉ.

ఎక్కడఁ జూచినం బ్రమథు లెక్కడఁ జూచిన యోగిమండలం
బెక్కడఁ జూచినన్ ఖచరు లెక్కడఁ జూచిన సిద్ధయౌవతం
బెక్కడఁ జూచినన్ సుకృతు లెక్కడఁ జూచిన మూర్తితోడఁ బెం
పెక్కినవేదము ల్గలిగి యెల్లసమృద్ధులఁ దేజరిల్లుచున్.

8


క.

దీపించు విశ్వపతిగుడి
భూపాలుఁడు చేరి చొచ్చి పొలఁతియుఁ దానుం
జూపులు విలసిల్లఁగఁ ద
ద్గోపతిగమనునకు మ్రొక్కి గురుతరభక్తిన్!

9

వ.

లేచి పులకితతనుఫలకుండై యలితలంబున నంజలిపుటంబు ఘటియించి యిట్లనియె.

10


గీ.

జయ మహాకాళ! విశ్వేశ! జయ మఘారి!
జయ మురాంతకసాయక! జయ మహేశ!
జయ విరూపాక్ష! ధూర్జటీ! జయ గణేశ!
జయ చతుర్వ్యూహ! జయ చంద్రశకలజూట!

11


క.

అలికాక్షుఁ బార్వతీధవుఁ
గలికాలవికారదూరు గణవరు మల్లీ
కలికావర్ణు ధనేశ్వరు
చెలికానిని నిన్నుఁ గొల్తు శివ! ఫణివలయా!

12


గీ.

నీకు మ్రొక్కు లొనర్చెద నీలకంఠ!
కంఠభాగకరీశ్వరడుంఠిజనక!
జనకముఖయోగిజనగేయ! సరళభావ!
భావజాంతర! హర! యీశ! పంచవదన!

13


సీ.

కామాహితుఁడ వయ్యుఁ గరుణతో నెట్లు భ
        క్తులపాలిటికిఁ గామదుండ వైతి
వుగ్రలక్షణరేఖ నొందఁజాలియు సర్వ
        మంగళాన్వితమూర్తి మనితి మెట్లు
భవరోగవైద్యవిభ్రమముఁ దాల్చియు నెట్లు
        మాననితలయేఱుఁ బూనినాఁడ
పరసిచూడఁగ దిగంబరుఁడ వయ్యును నిరం
        తరవిభూతిస్ఫూర్తిఁ దనరి తెట్లు

గీ.

తొడరి యింతంత యనరాని పొడవు నయ్యుఁ
గుదురుకొంటివి యేరీతిఁ గొమ్మచంట
నిట్టి నీసొంపు వర్ణింప నెవ్వఁ డోపు?
హరిణలాంఛనజూట! పశ్యల్లలాట!

14


చ.

అని శివుఁ బ్రస్తుతించి వసుధాధిపచంద్రుఁడు సద్గురూపది
ష్టనియమపద్ధతిం దవిలి చామయుఁ దా నుచితస్థలంబు గై
కొని బుధపూజనాదుల నకుత్సితభక్తి నొనర్చి చేసె నం
దనఫలసిద్ధికై తపము తత్పరతన్ జగదద్భుతస్థితిన్.

15


మ.

బహిరుద్భాసితశంభుమూర్తిని మనఃపద్మస్థితుం జేసి భూ
మహిళాభర్త జితేంద్రియత్వమును సౌమ్యస్ఫూర్తియుం బూని లో
సహితవ్రాతముదర్పమున్ సడలఁజేయన్ జాలి చేయుం దపం
బు హరిత్పాలురు మౌనులుం జనులు నుద్భూతాద్భుతు ల్గా మదిన్.

16


గీ.

కొన్నినాళ్లు హవిష్యంబు గుడుచుఁ గొన్ని
నాళ్లు ఫలములు దినుఁ గొన్నినాళ్లు త్రావు
నారములు గాడ్పు లొకకొన్నినాళ్లు గ్రోలు
నొల్లఁ డెవ్వియు మఱి యంతనుండి నృపుఁడు.

17


క.

పతి యేక్రియ వర్తించును
సతియును వర్తించు నట్ల సన్మార్గమునన్
బతియట్ల మెలఁగవలదా
పతి దేవతలైన పుణ్యభామల కెల్లన్.

18


సీ.

నిర్మేఘ మగుమింట నిర్గమించిననీరు
        ధరణిపరాగంబుఁ బరిహరించుఁ
బరిమళంబును మందభావంబు గలిగిన
        గంధవాహము శైత్యగతుల వీచుఁ

బుష్పాపచయవేళఁ బొడవులయ్యును గరాం
        బురుహంబునకు నందుఁ దరులు వేగ
నన్యోన్యవైరంబు లడఁచి సత్త్వంబులు
        వాత్సల్య మమరఁ బార్శ్వములఁ దిరుగు


గీ.

నార్తవం బగు గుణ మెల్ల నపనయించి
మేని కింపైనగతిఁ బర్వు భానురశ్మి
యతిమునీశ్వరుఁడగు నృపాలాగ్రగణ్యుఁ
డతులనిష్ఠఁ దపోలక్ష్మి నందుకొనుఁడు.

19


ఉ.

వాడదు మేను నిట్టు లుపవాసము లుండిన ధైర్య మింతయున్
వీడదు సారెకున్ బొడమువిఘ్నములం గని యింద్రియంబులన్
గూడదు నెమ్మనంబు సమకూరిసనిష్ఠఁ గురంగపాణిపై
నూడనిభక్తి గల్గి తన మొప్పఁగఁ జేయునృపాలహేళికిన్.

20


క.

పరిమితదినములలోపల
జిరకాలతపఃఫలంబు క్షితిపతి గాంచెన్
హరకరుణాసంపన్నుల
కరుదారఁగ నందరానియట్టిది గలదే?

21


సీ.

మండువేసవినాఁడు మార్తాండుఁ గనుఁగొంచు
        నుండునగ్నులు చుట్టు మెండుకొనఁగ
బలు వానకాలంబు చలన మింతయు లేక
        పద్మాసనస్థుఁడై బయట నిలుచుఁ
దుస్తరంబైన శీతుం గందువను గంఠ
        దఘ్ననీరంబులఁ దవిలి యరలు(?)
హరుఁడు శీఘ్రమునఁ బ్రత్యక్షంబు గామిని
        శంకింపఁ, డాత్మ నిస్తంద్రుఁడగుట

గీ.

పూర్వభోగంబుఁ దలపోసి పొరయఁ డింత
చావలము మౌనివరదృష్టసరణియంద
నడుచుఁ, దక్కినతుచ్ఛంపునడక యందఁ
డీశ్వరాసక్తుఁడగు ప్రమథేశ్వరుండు.

22


క.

శివరక్షకలిమి ధరణీ
ధవుఁ డుగ్రతపంబు సేయఁ దత్తేజముచే
రవిదీప్తి గుంటుపడియెన్
బవనంబులవీఁక సడలెఁ బ్రభచెడె నగ్నుల్.

23


ఉ.

చెంగనిభక్తిచేఁ గొదువసేయక ఘోరతపంబు సల్పురా
జుం గరుణింపఁగాఁ దలఁచె సోముఁడు విశ్వవిభుండు కాశికా
రంగమహానటుండు గుణరాజితుఁ డట్టిద కాదె చూడఁగా
జంగమకల్పభూజము భుజంగమహారుఁడు కొల్చువారికిన్.

24


సీ.

చిఱుతవెన్నెలగాయు చిన్నిచుక్కల రాజు
        తలవాఁకకును నావపొలువు నిలుప
మెడకప్పుమించు గ్రమ్మినచేతిపై జింక
        దూర్వాదళభ్రాంతిఁ దొంగలింపఁ
బొడవైన తెలిమేనిపూతదావులఁ దావుఁ
        దరలి ఫాలాక్షంబు దమకపడఁగఁ
గటిసీమ ద్రిండుగా గట్టినచేలకుఁ
        గాక యెక్కిన గిబ్బ కడలుద్రొక్కఁ


గీ.

బాఁపసొమ్ములు నలుమోము పాఱుకాడ
మూఁడుమోముల పెనుపోటుముట్టుఁ దాల్చి
పూనికయుఁ గల్గి కనుపట్టె భూతభర్త
పరమకారుణ్యమున మహీపాలుమ్రోల.

25

క.

సురగరుడయక్షవిద్యా
ధరకిన్నరవరులు బలసి తహతహతోడన్
హరుఁ గొలిచి వచ్చి రంభో
ధరరవములఁ దెగడు నుతివిధాధ్వను లమరన్.

26


ఉ.

లోపలఁ దోచుచున్న యతిలోకుఁడు విశ్వవిభుండు ముందటన్
రూవముఁ దాల్చి నిల్చిన సరోరుహవైరికులాబ్ధిచంద్రుఁ డ
బ్భూపతి దండరూపమున భోరున మ్రొక్క సముద్ధితాంగుఁడై
యాపురుషత్రయాత్ము మదనాంతకుఁ బ్రస్తుతి సేయు నీక్రియన్.

27


దండకము.

శ్రీమన్మహాదేవ! దేవస్రవంతీవయోధౌతసుస్నిగ్ధరుగ్ధారిచంచజ్జటాబృంద! బృందారకేంద్రాది సాంద్రోరుకోటీరకోటీతటీరత్ననిర్వత్న నిర్యన్మరీచిచ్ఛటాటోపకిమ్మీరితాంఘ్రిద్వయా! అద్వయంబైన నీయొప్పు హృత్పద్మవీథిన్ వితర్కించి దుస్తరబంధంబులం ద్రుంచి ప్రజ్ఞాసముల్లాసము ల్గ్రాల విజ్ఞానసిద్ధిం బ్రసిద్ధాత్ములై యుండఁగా లేక యేకాలమున్ జీకులై త్రవ్వుచున్ దుర్వివేకుల్ ఖిలాచారసంచారులై చేర లే రెన్నడున్ నిన్ను నున్నిద్రచిద్రూపరూపాతిగా! నాగకేయూర! మాయూరపింఛచ్ఛవిస్ఫూర్తిపాటచ్చరోచ్చూన నానాదిగంతౌఘజంఘాల నీరంధ్రధూమంబులన్ గీలికీలాకరాళోజ్జ్వలల్లోలసారా లఘుజ్వాలలం బేర్చి కోలాహలోదగ్రమై క్రాలుహాలాహలంబున్ జగద్భీతితోఁ గూడఁ గొంకూడి వే క్రీడయుంబోలెఁ గేల న్వడిం బట్టి బిట్టెత్తి చిత్తంబు మత్తిల్ల నుత్తుంగహర్షంబునన్ గ్రమ్మి భక్షించి లోకంబు రక్షించి యక్షీణతేజంబునం బొల్చు సద్రక్షకున్ నిన్ను నెన్నన్ దరంబా ధరం బాపరేణాంత యత్యంతధీశాలికిన్ శూలపాణీ! గణాధ్యక్ష! దక్షుండు మాత్సర్యదీక్షాత్ముఁడై క్రొవ్వి వీక్షాప్రపాతైకమాత్రావధూతాంతకు

నిన్నుఁ గన్నాని రప్పింప కుప్పొంగి దర్పించి క్రించుందనం బొందుచున్ మందభాగ్యోదయత్వంబునన్ బన్ని జన్నంబు సేయంగ నంగీకృతోద్యోగియై యున్న మిన్నంది కందర్పదుర్వారదోర్గర్వ సర్వస్వసంహారవిద్యాసముద్యుక్తనేత్రంబుతోఁ జిత్రచిత్రోన్నతిం బొల్చి పెల్చన్ జగత్కంపవిశ్రేణియై తూలు నుద్యజ్జటాశ్రేణితో నేణభృత్ఖండమల్లీప్రనూనోల్లసద్గండభాగంబుతో భోగపట్టాంచలలోదంచదుద్దండ మాణిక్యరేఖామయూఖావళీకీర్ణనిర్నిద్రచక్షుశ్శ్రవోహారపుంజంబుతోఁ గంజగర్భాండగర్భప్రభేదక్రియాభీమభూమాది దిక్సామజోద్దామశుండాభచండోజ్జ్వలన్మండలాగ్రాదిదీపాయుధస్తోమ సమ్మోహితారాతిదృగ్వ్యూహబాహాసహస్రంబుతో దుస్సహం బై మహోత్సాహమై సాహసాధిష్ఠితంబైన శ్రీవీరభద్రాకృతిం దాల్చి సన్మానముం గన్నని న్నెంతవాఁడైన నింతంతనంజాలునే కాలకంఠా! నృకంఠీరవోద్రేకవిద్రావణామర్త్యవిద్విట్ఛిరఃపద్మపూజావిరాజత్పదాంభోజ! యంభోజసంభూతమూర్ధంబు భిక్షాటనప్రక్రియాపాత్రగా గోత్రభృత్క్రూరకంకాళముం దాళమై యొప్పు చేముట్టుగా దిట్ట యాశీవిషాధీశుఁ డంఘ్రిస్థలిన్ గండపెండేరరాజంబుగాఁ దేజముల్ గ్రమ్మ శార్దూలపుందోలు పైఁ జాలఁగాఁ గ్రాల ఫాలాస్థివారంబు తోరంపుగ్రీవన్ మహాహారముఖ్యంబుగా విశ్వచక్షుర్భయాపాదియౌ నాశ్మశానంబు ధామంబుగాఁ జేసి యెవ్వారికిం దేరిచూడంగరానట్టి దట్టంపురూపంబుఁ బ్రాపించియున్ ముక్తదుస్సంగుఁడై భక్తియుక్తాంగుఁడై కొల్చుధీశాలికిన్ సౌమ్యవిస్ఫూర్తి వర్తింతు వార్తార్తిహారీ! పురారీ! విరూపాక్ష! వక్షోజచక్రంబులన్ జారునేత్రాసితాబ్జంబులన్ వక్త్రపద్మంబునం గుంతలోత్తాలశైవాలజాలంబునన్ బాహువల్లీమృణాళంబులన్ బంధురోష్ఠాచ్ఛ బంధూళ పుష్పచ్ఛటన్ మందహాసామృతస్యంద

డిండీరసారంబునన్ నిమ్ననాభీశుభావర్తగర్తంబునన్ గోమలోచ్చైర్వళిచ్ఛేదవీచీసముల్లాససౌభాగ్యయోగంబునన్ నిత్యలక్ష్మీనివాసోన్నతం బస్ఫురత్సైకతాభ్యున్నతిం బాదకూర్మస్థితిని బేర్మి మత్తిల్లు నీహార శైలాత్మజాతాసరోజాకరంబున్
మహాకేళీహంసంబవై లో రిరంసాగతుల్ గ్రాలం గ్రీడించుప్రోడం బ్రసూనేషుకోట్యర్బుదామందసౌందర్యధుర్యు న్నినుం గొల్చుపుణ్యుల్ విపశ్చిద్వరేణ్యుల్ గదా చూడఁజూడాంచలసూతనీహారధామా! సుధాధామ! రామాకుచాభ్యంతరం బెట్లు నీ కున్కిపట్టయ్యెనే నీకుఁ గట్ట న్మదేభేంద్రచర్మంబె? శర్మప్రదా! నిర్మలాత్మా భవా! నీమహత్త్వంబు నిర్ణీతముంజేయ గీర్నాథుఁడుం జాలునే? నేత్రకర్ణేశతల్పాశుగా! భక్తకల్పా! సుధావిస్ఫురజ్జల్ప! ఆద్యం బచింత్యం బభేద్యం బసాధ్యం బబాధ్యం బనూనం బహీనం బనంతంబునై యొప్ప మత్పుణ్యపాకంబునం జేసి యాలోకసాధ్యంబుగాఁ దోఁచె వాచంయమిధ్యేయమూర్తీ! కృపాధారకీర్తీ! నమస్తే నమస్తే నమస్తే.

28


చ.

అని తనుఁ బ్రస్తుతించుమనుజాధిపు మెచ్చి యుమాకళత్రుఁ డి
ట్లనియె ధరాధినాథ వినుమా యనుమానము మాని నీవు కో
రినవర మెద్దియైన వివరించి రయంబున నిత్తు సత్తుగా
నను నలరించుభక్తులు గనం దగరే తమచింతితార్థముల్.

29


మ.

అనినం బ్రాంజలియై నృపాలుఁడు దయాయత్తు న్మహాదేవుఁ బ
ల్కు నుమానాథ! గిరీ ! చంద్రధర! నాకున్ సద్వరం బిచ్చితే
ని నిరాఘాటతరప్రతాపుని హిమానీశుభ్రకీర్తి ప్రియుం
జనతారక్షణదక్షు నిమ్ము తనయున్ సత్యాకరున్ శ్రీకరున్.

30

క.

అనియనుడు శివుఁడు నీమన
మునఁ గోరిక ఫలించు భూవర! కో నీ
వనితకు నిమ్మని కల్పక
జనితంబగుఫల మొకండు జనపతి కొసఁగెన్.

31


చ.

ఒసఁగినఁ దత్ఫలంబు మనుజోద్వహుఁ డాదరమొప్ప నంది వె
క్కసమగుభక్తి మ్రొక్కెఁ గఱకంఠునకున్ సతితోడ నంత న
య్యసమవిలోచనుండును సురాసురయక్షసమన్వితంబుగా
విసవిస నక్షిపద్ధతికి విందగుచందము మానె నయ్యెడన్.

32


మ.

హరదత్తంబగు కల్పవృక్షఫల మార్యస్తుత్య! విశ్వంభరే
శ్వరుకాంతామణి ప్రాణవల్లభు నిజాజ్ఞాసంగతిన్ నేమ మొ
ప్ప రుచిన్ లోఁగొనియెన్ సదాశివు మనఃపద్మంబునం జేర్చి శ్రీ
కరమై యొప్పుదినంబునన్ దనయకాంక్షాయుక్తి మత్తిల్లుచున్.

33


వ.

ఇట్లు సఫలమనోరథుండై యమ్మహారథుఁదు నిజనగరోన్ముఖుండై యొక్కనాఁడు.

34


సీ.

భక్తవత్సల! విశ్వభర్త! శంకర! నాదు
        కోర్కి యీడేర్పుమీ కొంకులేక
అన్నపూర్ణాదేవి! యంబ! సైకతనితం
        బిని! నన్ను రక్షించుమీ ప్రియమున
డుంఠివిఘ్నేశ! యుత్కంఠ నున్ముఖవృత్తి
        నొందుమీ ననుఁ బ్రోచునొరిమ గలిగి
యఖలలోకనమస్య! యాకాశగం ! ని
        ర్మలమూర్తి! యొసఁగుమీ మహిమ నాకు

గీ.

రమ్యమతులార! యో పరివ్రాట్టులార!
యొరిమ సంకల్పసిద్ధి చేయుండు మిమ్ముఁ
గొలిచి యిన్నాళ్లు చల్లగా నిలిచినాఁడ
నరుగుచున్నాఁడ మీయాజ్ఞ, నాత్మపురికి.

35


గీ.

అనుచు నాబాలగోపాల మవనిభర్త
యరుగు కాశికలో నున్నయందఱికిని
బెద్దపిన్నతరంబునఁ బేరుగ్రుచ్చి
చెప్పి గమనించెఁ దానేలు సీమఁగుఱిచి.

36


సీ.

నలినాక్షితోఁ గాంచనస్యందనం బెక్కి
        పెంపెక్కి భూజంభభేదనుండు
వారణరథహయవరభటాత్మకమైన
        బలము పార్శ్వంబుల బలసి కొలువఁ
గౌండిన్యమునిలోకమండలాధివునకుఁ
        దనదువృత్తాంతంబుఁ దగినయట్లు
తేటతెల్లఁగ జెప్పి దీవించి యమ్మహా
        మహుఁడు పొమ్మన సంభ్రమమునఁ గదలి


గీ.

చని మనోహరరత్నకాంచనవిచిత్ర
బహుపతాకాభిరామంబుఁ బటువినోద
పూరితము నైన తనపురంబునకు వచ్చి
మరల వహియించె గహ్వరి గురుభుజమున.

37


ఉ.

సాగరసప్తకీవృతరసాసరసీరుహలోచనం గృపా
సాగరుఁ డాసుధాంశుకులచంద్రుఁడు క్రమ్మఱ నేలుచుండె నా
శాగజదంతకాంతముల సారెకు నాత్మవిశుద్ధకీర్తి నా
నాగతులన్ విలాసవశనాట్యము చూపుచునుండ నంతటన్.

38

క.

గిరిజావల్లభకరుణా
పరిణామసమగ్ర యుగుచుఁ బతిదేవత భూ
వరురాణి గర్భవైభవ
పరిశీలిత యయ్యె సకలబంధులు నలరన్.

39


మ.

పలుకం బారెఁ గపోలపాళికలు పైపైఁ దోఁచె జాడ్యంబు చ
న్నులఁ బొంకంబు ఘటిల్లె సోగలకన్నుల్ వెల్ల కాఁ జొచ్చె ను
గులు విచ్చెన్ వళిభంగముల్ సరులపైఁ గోర్కుల్ తమింబాసె న
గ్గలమై చిట్టుము లుట్టగాఁ దొడఁగె రాకాచంద్రబింబాస్యకున్.

40


మ.

కలగాంచుం డమరుత్రిశూలధరుఁడై కన్పట్టుబాలుండు పొ
త్తుల నున్నాఁడని యాలకించు బయలం దోతెంచు గంధర్వగీ
తులు కైలాసవసుంధరాస్థలమునందున్ గొల్వు గూర్చుండఁగాఁ
దలఁచుం బాలిక చంద్రశేఖర కళాదర్పస్ఫురద్గర్భయై.

41


మ.

సరి నంభోనిధివేష్టితాఖలధరాచక్రాభిరక్షావిధా
చరణుం బుత్త్రకుఁ గానఁగాఁగల సరోజాతాస్యకుం దోఁచు ని
ర్భరతన్ జిత్తమునందు శత్రువనితాఫాలస్థలీకుంకుమో
త్కరముద్రాహరణప్రవీణఖరఖడ్గప్రాప్తిపైఁ గోరికల్.

42


చ.

పలుచనిసొమ్ములున్ వెలుకఁబారుముఖాబ్దముఁ గ్రమ్మునూర్పులున్
దొలకుల నిండుకుక్షియును దుమ్మెదబోదలతోడి తమ్మి మొ
గ్గల నగునీలచూచుకయుగంబునఁ బొల్చుపయోధరంబు ల
త్యలగకటాక్షము ల్గలిగి యంగన చూ పలరించు భర్తకున్.

41


సీ.

అమృతాంశుకులవనాయతవసంతాగమం
        బరివీరజయగర్వహరణముద్ర
నిఖలబంధుసరోజనీరజాప్తమరీచి
        శాంభవతేజఃప్రచారవీధి

ఆహిరాజభారనిగ్రహముక్తికారణం
        బాశాధిపతి నిజాశావృతంబు
ప్రియసఖీవీక్షణోచ్చయనసంపల్లక్ష్మి
        వల్లభేప్సితలతాపల్లవంబు


గీ.

ననఁగఁ జూపట్టి పొదలె నొయ్యన దినంబు
దినమునకు వృద్ధిఁ బొందుచు గొనబు మిగిలి
సాధుసంస్కారసంపత్తి సంస్కృతంబు
వనితగర్భంబు సౌభాగ్యవర్ధకంబు.

44


ఉ.

ఐదుశుభగ్రహంబు లరుణాంశుని గూడుక యుచ్చగంబులై
ప్రోది వహింవ సొంపుగల పుణ్యదినంబున రాజురాణి శా
తోదరి గాంచె బుత్త్రు నతులోర్జితదీధితిమిత్రు విశ్వర
క్షాదితిజారిమూర్తి ప్రభుశక్తిసమాశ్రితభానుకైవడిన్.

45


వ.

అంత.

46


సీ.

వినుతపావనజలంబున మజ్జనము చేసి
        కమనీయశుద్ధవస్త్రములు గట్టి
మౌహూర్తికులచేత మార్తాండముఖశుభ
        గ్రహముల యనపద్యగతులు దెలిసి
తరతమభావంబుఁ బరికించి పుడమివే
        ల్పులకు సువర్ణంబు భూరివెట్టి
పంజరంబుల నున్నపక్షుల బందీల
        హస్తుల విడిపించి యర్హభంగి


గీ.

వినుతదానంబు లొనరించి యనుఁగుఁజెలుల
యట్ల నట్టింటఁ బగవారి నాదరించి
నగరదైవతముల నర్చనాసమృద్ధిఁ
దనిపె సుతజన్మదినమున ధరణివిభుఁడు.

47

ఉ.

సంచితపుణ్యశాలి నృపచంద్రకళాభరణుండు దా విశే
షించియు శేషహారునకుఁ జిత్రమణీకృతతోరణంబులున్
గాంచనదీపపాళికలు గ్రామములున్ బహువస్త్ర పేటికల్
చంచలనేత్రలన్ దనయుజన్మదినంబున నిచ్చె వేడుకన్!

48


సీ.

ఘుమఘుమనురుమ నంకురితమౌ నూతన
        మణి వహించువిదూరమహివిధమునఁ
చిఱుతప్రాయముతోడి శీతాంశువుని సొంపు
        డళుకొత్తునపరదిక్తటితెఱఁగునఁ
గొదమరాయంచ సమ్మదమున విహరించు
        చెలువంబుఁ దలమోచుకొలనికరణి
నవకమై తళుకొత్తు ననకుట్మలంబుచే
        వఱలుమోహనకల్పవల్లిపగిది


గీ.

భాసురోంకారమును గూడి ప్రజ్వరిల్లు
వివులపంచాక్షరీమంత్రవిద్యరీతి
భర్గకళ పూని దీపించుబాలుఁ బొదివి
కూర్మి దనరారె నృపురాణి కువలయాక్షి.

49


చ.

జగతి నరిష్టముల్ దలగఁ జాలి భుజాభుజగాధినాథుపై
నిగుడుపఁ గల్గుపుణ్యగుణనిర్మలమూర్తి కరిష్ట మింతయున్
దగులునె పాయుఁగా కనువిధంబున వీడె నరిష్టసంగమం
బగణితభాగ్యలక్షణవిహారికి భూపతి ముద్దుపట్టికిన్.

50


మ.

పురుడుం బుణ్యముఁ దీర్చి శంకరపదాంభోజాతభృంగంబు భూ
వరచూడామణి వల్లకీపతి నభోవాణీవశస్వాంతుఁడై
సురధాత్రీసురులం భజించి పిదవన్ సూనున్ బ్రభాభాను వే
దరవం బొప్పఁగ ముంజభోజుఁ డని యంతం బెట్టెఁ బే రున్నతిన్.

51

శా.

గీర్వాణాహతమర్దలధ్వనులు గల్గెన్ సర్వదిగ్వీథి గం
ధర్వీగానము తానమానములతోఁ దారస్థితిం దోఁచె స
ప్తార్వద్యోతము నిర్మలంబగుచుఁ గాయం జొచ్చెఁ బాథోధియం
తర్వైశ్వానరతాపమున్ వదలెఁ దన్నామోక్తికాలంబునన్.

52


సీ.

ఆపాదమస్తకం బంగసంధులవెంట
        దుసికిల నూనియ దోఁగ నంటి
ప్రత్యగ్రబింబికాపత్రచుంబితముగా
        బలుచగా నెమ్మేన నలుగువెట్టి
గాజుఁగొప్పెరలలోఁ గమ్మనీరున నూరు
        తలములపైఁ జేర్చి జలకమార్చి
శివరక్ష యంచు మచ్చిక జలంబులు గొన్ని
        చుళుకమాత్ర మొగంబుచుట్టుఁ ద్రిప్పి


గీ.

యెయ్యనొయ్యనఁ దడియొత్తి యుగ్గుచూపి
తిరుగఁ దలయంటి చనుబాల దెలివిగొలిపి
నేత్రముల నంజనము నించి నిద్రవోవఁ
బాడుఁ బొత్తుల సవరించి బాలు ధాత్రి.

53


శా.

నీలస్తంభవిజృంభితోజ్జ్వలహిమానీశుభ్రసౌధంబులో
నాలోలంబగు తొట్టెమంచమున నొయ్యం జేర్చి జోకొట్టి యు
య్యాలో జొంపల యంచు నూఁపుదురు శుద్ధాంతాబ్జపత్రాక్షు లా
బాలుం బాలశశాంకశేఖరకృపాపారీణు గారామునన్.

54


చ.

తగినవిభుండు గల్లె నని ధారుణి హర్షము నొందెఁ గల్వపూ
మొగడలవిందువంగడము ముందఱికిన్ మొనసాఁగె ఱేనికిన్
బెగడుపితౄణభావమునఁ బేర్చుట మానెఁ గృపావిలాసవ
న్నిగమహయప్రభావగుణనిశ్చితుఁడై నృపసూతి యొప్పుటన్.

55

ఉ.

ఉగ్గననిట్లుపల్కు విమలోష్ఠపుటంబులు వచ్చి సారెకుం
బుగ్గననవ్వు రెప్పకవ పొందఁగఁజేయక చూచు దిక్కులన్
డగ్గఱి జోలవాడెడుపడంతులపాటలు నాలకించు స
మ్యగ్గుణశాలి యైనమనుజాగ్రణిపుత్త్రుఁడు బాల్యసంపదన్.

56


మ.

జడలై తూలెడు పుట్టువెండ్రుకల్ రక్షావాలికాబంధముల్
మెడ శార్దూలనఖంబు ముద్రికలచే మేకొన్నహస్తాంగుళుల్
కడుఁ జూపట్టిన మద్దికాయలును గల్ గల్లంచుఁ బాదంబులన్
నడుపం బల్కెడుగజ్జెలుం గలిగి కన్పట్టున్ గుమారుం డిలన్.

57


సీ.

అలికపట్టికమీఁద నతులముక్తాఫల
        శ్రీకరంబగు రావిరేక మెఱయఁ
బాలబుగ్గలకాంతి మేలంబులాడుచు
        మద్దికాయలతళ్కు ముద్దుగురియ
మణిబంధములయందు మట్టసంబగుచేఁతఁ
        గనుపట్టుహస్తకంకణము లమర
సిగ్గెఱుఁగని కటిసీమ నడ్డిగలు గ్రు
        చ్చిన గట్టియగు కాంచి జిగిదొలంక


గీ.

తొక్కుఁబల్కుల నమృతంబు పిక్కటిల్ల
మురిపమంతయు లావణ్యగరిమ గాఁగ
నడ్గులకు మడ్గులొత్తంగ నల్లనడుచుఁ
బడుచునవకంబు మీఱినపాయమునను.

58


సీ.

ఇంతవైభవ మెద్ది హిమశైలనందనా
        ప్రమథనాథులు గన్నకొమరుసామి
కిమ్మహాసౌభాగ్య మెద్ది పులోమజా
        హరిహయు ల్గన్నజయంతమూర్తి

కీపాటిసిరి యెద్ది యిందిరామధుకైట
        భారులు గన్నపుష్పాయుధునకు
నీలాగుగారవం బెద్ది కౌసల్యాద
        శరథేశ్వరులు గన్నఖరవిరోధి


గీ.

కిట్టిగోమున నున్కిపట్టెట్టు దేవ
కియును వసుదేవుఁడును గన్న కేలిమనుజ
విగ్రహుండగు త్రైలోక్యవిభున కనఁగఁ
బెరుఁగుఁబుత్త్రుండు జనమనఃప్రియ మెలర్ప.

59


గీ.

అరఁటిపండన నడుగెత్తు ననఘమూర్తి
చెఱకుఁగోలకుఁ జేసాఁచుఁ జిన్నితండ్రి
యనుచు శుద్ధాంతగామినీజనులు చెలఁగి
నడవు దిద్దంగ నడుచు భూనాథసుతుఁడు.

60


గీ.

నడుచుధర్మంబు పుడమిపై నడుపవేని
తొలుకుఁబలుకు విరోధులబలము లొలుకఁ
బ్రోది నేనికకొమ్మున దాదిఱొమ్ము
నన్నెవివర్ధిల్లెఁ బ్రమథేశ్వరునిసుతుండు.

61


గీ.

జలధరమునకు సురధనుర్విలసనంబు
కుంభిరాజంబునకు మదోజ్జృంభణంబు
చంద్రునకు శారదారంభసౌష్టవంబుఁ
బోలె జవ్వన మారాజపుత్త్రుఁ బొదివె.

62


సీ.

మాంసలాంగద్వయీమహిమ ముక్కంటినం
        దనమూఁపురమునకు ననుఁ గనంగ
దిగిభశుండాందండదీర్ఘహస్తంబులు
        భూమిజయస్తంభములొ యనంగ

శాస్త్రదృష్టికృతార్థచారులోచనములు
        సిరికిఁ బద్మంపుటోవరులొ యనఁగ
సాలమానమున నుత్తాలోజ్జ్వలంబైన
        రూపు పౌరుషములప్రో వనంగ


గీ.

క్షత్త్రధర్మంబు దాన సాక్షాత్కరించి
యుజ్జ్వలాకారసంపద నొందె ననఁగ
సర్వజనతావిలోచనపర్వ మయ్యె
రాకుమారుండు యౌవనారంభవేళ.

68


సీ.

లబ్ధవర్ణశ్రవోలంకారరేఖయై
        భాసిల్లు నాడినభాషణంబు
హరిణలాంఛనజూటచరణాంబుజములకు
        రోలంబపాకమై వ్రాలు మనుసు
హరిదంతకరిదంతపరిఘాతరములకు
        బలువెడితొడవులై వెలయుఁ గీర్తి
దర్పితాహితరాజదావానలమునకు
        ఘనవర్షధారయౌ ఖడ్గధార


గీ.

ప్రచురయాచకలోచనోత్పలములకును
విమలచంద్రాతపంబగు వితరణంబు
గండుమీఱుచు నారాజగంధకరటి
భాగ్యసౌభాగ్యవైభవోద్భాసి యగుట.

64


చ.

చదువక వేదశాస్త్రములు సమ్ముద మొప్పఁగఁ జేసె సామునం
గదియఁగ హెచ్చి వచ్చె నసికార్ముకచర్మముఖాస్త్రకౌశలం
బొదవె నొకప్పుడున్ దడవకుండినఁ గానకళావిలాసముం
గొదువ యొకింత లేక ఫణికుండలుపంవున రాజసూతికిన్.

65

సీ.

ఎట్టిపల్కులనైన నింతశంకరకథా
        సౌరభం బుండిన సమ్మతించు
నేచందముననైనఁ గాచి చక్కన జేయు
        శితికంఠుధర్మంబు కుతిలపడినఁ
బసుబిడ్డనికినైనఁబట్టి తత్త్వముఁ దెల్పి
        హరుఁడె దైవంబని తెరవు దొక్కు
నీశుభక్తుఁడు గోరి యీ రాని దడిగిన
        ద్రోయ కిచ్చును దృణప్రాయముగను


గీ.

వారినిధిఁ దోఁచు బుద్బుదప్రాయమట్లు
త్రిజగములు భర్గతేజోబ్ధిఁ దేల నెఱుఁగు?
గర్భశైవుండు కలిదోషగర్వహరణ
భూరిసత్కీర్తి శ్రీముంజభోజమూర్తి.

66


శా.

మత్తారాతినృపాలకంధరలు ద్రుంపం బుట్టి క్రొన్నెత్తురున్
హత్తన్ జిప్పిలు చెమ్మఁగ్రమ్ము నసిధారాధ్వంబులే మెట్టి యు
ద్వృత్తిన్ వచ్చును జిక్కువారక సమిద్వీధిం జయశ్రీతదా
యత్తత్వంబు వహించి చిత్రఘటనావ్యాపారపారీణ యై.

67


సీ.

తడవిండ్లవగ మాని తడవిండ్లవగ పూని
        మందోదయుండయ్యె మగధభర్త
పదమంచు నడవంగఁ బదమంచు లనియంగ
        గును కభ్యసించు నాకురువిభుండు
ఆలము లెత్తుటడించి యలము లొప్పఁగఁబొంచి
        వనవాటుకటు నేఁగె వత్సరాజు
కలను సేయుచలంబు కలనులేక బలంబు
        నెఱిఁడప్పి దిటదప్పె నిషధనాథుఁ

గీ.

డహహ! ఫాలాక్షశూలధారాగ్రశాత
ముఖమహాఖడ్గవల్లరీసఖభుజాహి
సార్వభౌముండు ధైర్యసుపర్వకాద్రి
రాజకంఠీరవుఁడు ముంజభోజు కలిమి.

68


శా.

మెట్టం డెన్నడు నుగ్రధాటి రణకుంభివ్యగ్రభాగంబులన్
బట్టం డెన్నఁడుఁ గేలం జాపలతటిత్పక్రూరబాణంబుతో
ముట్టం డెన్నఁడు మండలాగ్రము బ్రియాంభోరాశి భూభర్త దా
వెట్టిం గొట్టము చేయుచుండుదురు నిర్వీర్యాత్ములై శాత్రవుల్.

69


గీ.

స్ఫటికశిలయందుఁ గలయంగఁ బ్రతిఫలించు
దాసనపుఁ బూవు కెంజాయతళుకువోలెఁ
దండ్రిగుణసారవిస్ఫూర్తి తనయునందు
నాఁడునాఁటికిఁ బర్వికొనంగవచ్చు.

70


చ.

భసితముఁ బాముబేరుములుఁ బచ్చికరీశ్వరవృత్తి వేఁడి బ
ల్విసముఁ గరోటిపాత్రికయు వృద్ధతరంబగు నుక్షరాజమున్
నొసలివిలోచనంబు విడనూకి శుభోజ్జ్వలలక్షణంబులన్
బస నటియించుశంకరునిభాతి మనోహరసూతి పొల్పుగున్.

71


సీ.

పరమపావనమనఃపంకేరుహమునకు
        హరగాథ పరిమళవ్యాప్తి గాఁగఁ
గమనీయసత్కీర్తికల్పవల్లికి సర్ప
        విభుఁడు పెన్గూఁకటిపేరు గాఁగ
మానితనిజభుజమందారశాఖకు
        దానోదకము పూవుఁదేనె గాఁగఁ
బ్రణుతనానానూత్నగుణరత్నముల కీశ
        భక్తవర్ణము లున్కిపట్లు గాఁగ

గీ.

మండలాగ్రావలమునకు మత్తవైరి
గేహినీబాష్పధార లాజ్యాహుతులుగ
వసుమతీశ్వరకోటీరవజ్రకలిక
రాజనందనుఁ డొప్ప హేరాళముగను.

72


శా.

ఆరాజశ్యకులావతంసము భుజాయత్తాసికాలాహిచేఁ
గ్రూరారాతులప్రాణవాయుభరముల్ గ్రోలించుచో నెక్కు త
న్నారీలోచనపద్మపత్త్రములలోనం బల్విషం బిట్టి చి
త్రారంభం బతడందెకాక మఱి యెందైనం (గనం) బోలునే.

73


గీ.

జలజవదనలు మీనలోచనలు చక్ర
వాకవక్షోరుహలు నైనవసుమతీశ
కన్యకాసింధువులు ప్రేమ గడలుకొనఁగఁ
జెట్టవట్టిరి లక్షణశ్రేష్టు నతని.

74


చ.

వినయమునన్ వివేకమున విక్రమసంపద సాధులక్షణం
బునఁ గొద యింతలేక ఫణిభూషణు సత్కృప గల్గి విశ్వభూ
జననుతిపాత్రు నింపలర సాగరకాంచికి నాథుఁ జేసెఁ ద
జ్జనకుఁడు శైలదంతి కిటి సర్పవిభుల్ ప్రమదంబు నొందఁగాన్.

75


క.

ప్రాయమునఁ గొంచెమయినన్
న్యాయము భుజశక్తి నరవరార్కుఁడు మిగులన్
గాయు దవానలకీలా
ప్రాయప్రబలప్రతాపబహుళాతపముల్.

76


గీ.

ముదియువటభూజమందున మూలబలము
పదిలముగ నూడ లొయ్యన గదియురీతి
జరఠనృపుఁ బాసి తత్పుత్త్రుఁ దరుణుఁ బొదవె
మూక పాపయి యందంద ముట్టి కొలువ.

77

క.

తల్లిగల ప్రజలకైవడి
బల్లిదుఁడగు నతనిబాహుబలమున ధరలో
నెల్లజనులు మోదించిరి
చల్లనయై రామరాజ్యసౌఖ్యముఁ గనుచున్.

78


క.

నరవరుఁ డేల "శతాయుః
పురుష" యనెడు వేదవాక్యముగఁ బ్రజ బ్రదుకున్
ధరఁ గొండ్రవేయఁ బండున్
దొరఁగున్ వర్షంబు సావితో నెయ్యెడలన్.

79


క.

హృత్పృథమేచక యయ్యను
దర్పార్థివుఖడ్గయష్టి ధవళయశశ్శ్రీ
నుత్పాదించున్ బ్రధిత రి
పూత్పలగంధిస్మితంబు నొగిలె ననుక్రియన్.

80


క.

హరుఁడు జగంబుల నుండఁగ
హరునందు జగంబు లుండ నాత్మ నెఱిఁగి భా
సురవిజ్ఞానాంబుధి భూ
పురందరుఁడొ యనఁగ ముంజభోజుఁడు వెలయున్.

81


క.

నుతసుగుణశాలి యగుతన
సుతునందు ధరిత్రి నిలిపి సొబగొందుట హృ
ద్దతిఁ గనుఁగొని ప్రమథేశ్వరుఁ
డతివయుఁ దాఁ గాశికకును నరిగెడు నెడలన్.

82


క.

భవసంభవసౌఖ్యంబుల
చవు లొల్లగ కుబుస మూడ్చుసర్పము పోలెన్
దవు లూడిచి ప్రమథేశుఁడు
సవినయసుతుఁ బల్కు నిట్టిచందముతోడన్.

83

చ.

చదివితి నాల్గువేదములు శాస్త్రము లాఱుఁ దదన్యవిద్యలున్
సదభిమతోక్తదక్షిణల జన్నము లన్నియు నాచరించితిన్
దుది నిను గూర్మి బంధుజన తోయజసూర్యునిఁ గంటిఁ బుత్త్రుఁగాఁ
గొదువ యొకింత లేక కనుఁగొంటి నిహంబునఁ గల్గుసౌఖ్యముల్.

84


గీ.

చాలఁ దనిసితి నిందుల సౌఖ్యలబ్ధి
గరిమతోఁ గాలుకే లాడుకాలముననే
విశ్వపతి నీశుఁ గాశికావిభు భజించి
యుల్లముననున్న యుడు కాఱి యుండవలయు.

85


గీ.

శైశవంబునఁ జదువును జవ్వనమున
భోగసక్తియు వార్ధకమున మునీంద్ర
వృత్తి నిలుచుటయును మీఁద విపులయోగ
కలన మై ద్రోచుటయు మనకులమునడక.

86


ఉ.

కావున నేను గాశిఁ గఱగంఠు భజించి సమస్తపావి
ద్రావణజాహ్నవీసలిలధారలఁ దోఁగెదఁ బుట్టువుం దిగం
ద్రావుటకై మదుద్యమము దప్పదు నిక్కము మామకాజ్ఞ నీ
భూవలయంబు తొంటినృపపుంగవులట్టులఁ బ్రోవు నందనా!

87


క.

దొరకు నిరంతరపుణ్యము
పరోపకారమునఁ, గరము పాపము వచ్చున్
బరపీడనంబుచే నని
వరువడి నయశాస్త్రవిదులు పలికిరి వత్సా!

88


క.

కావున పరోపకారమె
వేవిధములఁ జేయుబుద్ధి విడువకు పాపై
కావాసము పరపీడన
మౌ వీడుము తత్ప్రసక్తి యార్యస్తుత్యా!

89

మ.

నయకావ్యున్ మతిగీష్పతిన్ బ్రబలసేనాపోషసేనాని న
వ్యయగాంభీర్యవయోనిధాను శుచితావ్యాసక్తి గాంగేయు స
త్యయమప్రోద్భవు ధైర్యహేమగిరిసంధాజామదగ్న్యుం దయో
దయ రామున్ సచివాగ్రణిన్ బెనుపు తత్కార్యసంసిద్ధికిన్.

90


గీ.

గోపకుం డావునల్లనఁ గుస్తరించి
యొయ్య నొయ్యన దుగ్ధంబు లొడుచుకరణిఁ
బ్రజలచిత్తంబు గందనిపగిది నడచి
ధర్మవర్తనమునఁ గాంచు ధనము లనఘ!

91


గీ.

ఎంతయపరాధ మంతయు నెగ్గుసేయు
విధివిధం బెట్టులట్లనె వేల్పు లగ్ని
ఫలము చేకొను నందాఁక బట్టినట్టి
పని విసర్జింపఁ గార్యసంభావ్యబుద్ధి.

92


వ.

అని ప్రమథేశ్వరుం డనేకప్రకారంబులఁ దనకుమారునికి విద్యాప్రకారం బెఱింగించి తనయుద్యోగంబునకుఁ బరితపించు నతని నుచితవచనంబుల నూఱడం బలికి ధర్మపత్నితో ముక్తంబునకు నవిముక్తప్రయత్నంబునం జనియె నంత.

93


ఉ.

తండ్రి విరక్తుఁడై మునిమతంబునఁ గాశికిఁ జన్నపిమ్మటన్
దండ్రియుఁ దల్లియుం గురుఁడు దాతయు దైవమునై మహీప్రజన్
దీండ్రవహింపఁ బ్రోచు నరదేవశిఖామణి వైరిమండలం
బాండ్రను బిడ్డలన్ విడిచి యద్రిమహాగృహముల్ భజింపగా!

94


ఉ.

ఆదిమశైవలక్షణసమాచరణాత్ముఁడు ముంజభోజభూ
మీదయితుండు వారిధులు మేరగ మధ్యమలోక మేలుచున్
సాదులఁ బేదలన్ విభవసాందులఁ జేయుచు నుండి యొక్క
డా దివిషన్నదీమకుటు నాత్మఁ దలంచుచుఁ బల్కు నీక్రియన్.

95

క.

ఈకాంతలు నీతనయులు
నీకాంచనరాసు లెల్ల నెన్నఁడు ధ్రువముల్
గాకుండు టెఱిఁగి బుధులకుఁ
గాకోదర రాజహారుఁ గని మనవలదే?

96


క.

చదివియు వివేక మెఱుఁగక
మదమున హరకథలు చదువ మఱచినమూఢున్
గుదియింపవె యమకింకర
పదభిదురఠోరఘోరపాతములు తుదిన్.

97


క.

శ్రీకంధరపదజలజా
లోకనవిముఖాత్ములైన లోకులమొగ మా
లోకించిన ప్రాజ్ఞుల కా
లోకింపఁగవలదె లోకలోచనమూర్తిన్.

98


క.

అని తోఁపుచున్నయది నా
మనమున నట్లయ్యు మమత మానదు సుతదా
రనికాయంబుమీఁదట
మనుకొని ము న్నెట్టికర్మములు సేసితినో.

99


క.

ఈ విషయానుభవంబులు
పోవిడు మని తెలిపి చెప్పి పురహరుఁ గొలువన్
ద్రోవ కనుపించుపుణ్యుని
దేవుంగాఁ జూతు నొక్కొ ధీమార్గమునన్.

100


క.

సద్గురునాథకటాక్షస
ముద్గతకారుణ్యలాభమునఁ గాక తగన్
హృద్గోచర యెట్లగు దివి
షద్గంగాధరుపదాంబుజద్వయి నాకున్.

101

క.

అహికంకణుపాదాంభో
రుహములు గనువాఁడ సద్గురునికృపకతనన్
వహియింపంగ నోపని దు
స్సహసంస్కృతి యిదియు నొక్కసౌఖ్యము కొఱకే!

102


గీ.

అరసి యెంతటివారికి నందరాని
నీలలోహితపదమహానిధిఁ గనంగఁ
దత్త్వవిదుఁడైన దేశికోత్తంసుసదయ
మగు కటాక్షాంచలంబు దివ్యాంజనంబు.

103


గీ.

చేవ సంసారభవసుఖక్షితిజమునకు,
నావ కలుషాంబునిధి తారణంబునకును,
ద్రోవ దుర్లభతరము ముక్తిదుర్గమునకు
శ్రీమదారాధ్యపాదరాజీవసేవ.

104


ఉ.

కాయము శారదాంబుదనికాయమువోలెఁ దలంప నధ్రువం
బాయువు భిన్నకుంభగత మైనజలగతిన్ వసించు నీ
ప్రాయము సత్త నా దగగు పంచమ(?)వాసరభోగ్య మింక నా
కాయజవైరిఁ జేరుటయె కర్జము నాకు గురూక్తిపద్ధతిన్.

105


క.

ముక్కంటిమూర్తి యిదియని
నిక్కంబుగఁ దెలిపి చూపనేర్చుగురుఁడు నా
కెక్కడఁ గలిగెడి దైవమ!
అక్కట నాప్రార్థనంబు నాలింపఁగదే!

106


గీ.

అనువిచారంబుతోడ నన్యములు నెవ్వి
యును సమీక్షింప నొల్లక మనసులోన
దగినదేశికు నరయు నద్ధరణినాథుఁ
డొక్కరే యిట్లు కలగాంచె నక్కజముగ.

107

గీ.

అక్షమాలావిభూషితుం డరుణజటుఁడు
సాంద్రభసితాంగరాగుండు శైవుఁ డొకఁడు
తెరువుఁ జూపంగ నరిగి భూవరుఁడు నడిచె
ఖండపరశునినగరంబు వెండికొండ.

108


వ.

ఇట్లఖిలజగన్మండనంబగు నక్కొండలఱేని నధిరోహణంబు చేసి తదీయంబులగు బహువిశేషంబులకుఁ బ్రతోషంబుఁ బోషింపుచుఁ ద్రోచి చని యథోచితప్రకారంబున నందికేశ్వరానుగ్రహంబు వడసి జ్యోతిర్మయంబగు చేతోజదమను దివ్యభవనంబునఁ జొచ్చి సప్తకక్ష్యాంరంబులు గడచి యగ్రభాగంబున.

109


క.

ఖరకరహిమకరవైశ్వా
నరదీప్తుల ధిక్కరించి నానాదిశలన్
బొరిఁబొరిఁ బొదివెడి యొక భీ
కరతేజము గాంచి ధరణికాంతుం డంతన్.

110


గీ.

అధికతరసంభ్రమంబున నంగకములఁ
బులకజాలంబు చెమటయు నెలకొనంగఁ
బొగడ దగ్గఱలోఁగి యబ్భూమివరుఁడు
చిత్రరూపంబువోలె నిశ్చేష్టుఁ డయ్యె.

111


గీ.

ఇట్లు నివ్వెఱగందియు నెట్టకేల
కు నరనాథుఁ డచలభక్తిధనుఁడు గాఁగ
నమ్మహోదారతేజంబు నక్షిమార్గ
మునకుఁ గోచరముగఁ జేసి యనుపదంబ.

112

సీ.

చందవోజ్జ్వలశివాస్తనమండలముఁ బోలు
        వెలిగుబ్బమూపురం బలమువాని
వెండిగుబ్బలిచక్కి నుండియు నఖిలంబుఁ
        దానయై యున్న చందంబువానిఁ
బెనుబాము రెడ్డిగంబున మించి వలయాచ
        లావృతక్షితివోలె నమరువాని
భసితచర్చాసముల్లసితుఁడై చంద్రికా
        న్విరిహిమాచలమూర్తి హెచ్చువాని


గీ.

జడలఁ దుఱిమిన రేఱేనియొడల వడియు
నమృతసేకంబుచేతఁ బ్రాణములు వడయు
విధుశిరోమాలికలు చేయు వేదపాఠ
మునకు మోదించువేల్పుఁ గల్గొనియె నృపుఁడు.

113


ఉ.

ఆమునిమానసాంబుజవిహారమరాళు నగేంద్రకన్యకా
స్వామిఁ ద్రయీమయాత్ముఁ బురుషత్రయమూర్తి జగన్నివాసు నా
శాముఖిసంచరద్బహుళసాంద్రశరీరమహస్సమూహు ఫా
లామృతభానుమౌళిఁ గొనియాడె మహీరమణుండు మ్రొక్కుచున్.

114


క.

తనుఁ బ్రస్తుతించుభూవిభుఁ
గని కరుణారసము దొలుక గౌరీవిభుఁ డ
ల్లనఁ జేరఁ బిలిచి యిట్లని
యె నిబిడదశనాంశువులు ముఖేందునిఁ బొదువన్.

115


క.

ఇటు ర మ్మర్భక! నీ మది
ఘటియిల్లిన చింత విడువు కలిగెడు నీకున్
గుటిలభవబంధపాశ
త్రుటనసమర్థుండు సద్గురుఁడు వెఱవకుమీ!

116


క.

నాచేతఁ బనుపువడి శై
వాచార్యవతంసుఁ డుద్భటాహ్వయుఁ డిపు డీ
భూచక్రంబున నున్నాఁ
డాచతురాత్మకుఁడు నీకు నగు గురుఁ డధిపా.

117


క.

అనువృత్తాంతంబుం గలి
గినకలఁ గని మేలుకాంచి క్షితిపతి చిత్తం
బున నానందాద్భుతముల
కనుపట్టఁగ నుండె నంతఁ గడచనె నిశియున్.

118


శా.

ప్రాతర్వేళ సమర్హకృత్యములు నిర్వర్తించి ధాత్రీవిభుం
డాతారాధిపమౌళి రాత్రి కలయం దాయాయిచందంబులం
బ్రీతిం బల్కినపల్కు లార్యులకుఁ జేపన్ జెప్పినన్ వారలున్
జేతోవీధుల విస్మయిల్లి నృపునాశీర్వాదముల్ మున్నుఁగాన్.

119


చ.

పలుకుదు రిట్లు వింటివె నృపాలశిఖామణి! నిశ్చలంబుగాఁ
దెలిసినవాఁడ వీశు భవదీయమనోరథముల్ ఫలించుటల్
తలఁప విచిత్రమే గిరిసుతాహృదయేశుఁడు భక్తులైనవా
రల కరచేతిలోని సురరత్నము గొంగుపసిండి యారయన్.

120


క.

కలలోనఁ గంటిఁ జంద్రశ
కలభూషణు ననుట యొక్కకడిఁదియె నీకుం
గలశంభుభక్తి యేరికిఁ
గల దిప్పటికాలమున జగన్నుతచరితా!

121


వ.

ఈవు కృతపుణ్యుండ వీవు తలంచిన సంకల్పంబు నిర్వికల్పంబుగా ఫలియించు సంశయంబు వలవదని ధరాబృందారకులు భూపురందరుచేత సంభావితులై యథేచ్ఛంబుగా జని రంత ముంజభోజుండు దాఁగన్నసుస్వప్నంబునకు నచ్చెరువందుచు నిది నిక్కంబగునొకో యనుచు శంకరుండు నాపాలం గృపాలుం డగునొకో యనుచు ననేకప్రకారంబుల మనోరథపరంపరాపరతంత్రుండై యుండె నక్కాలంబున నొక్కనాఁడు ముక్కంటియానతిఁ దలమోచి.

122

సీ.

పుట్టె నే గురుభర్త భువనాద్భుతముగాఁగ
        నాగేంద్రహారుమాననమువలన
నుండె నే యాచార్యమండలేశ్వరుఁడు భూ
        మండనంబగు ముదిగొండయందుఁ
గట్ట నే దేశికాగ్రణిచేతఁ గంగణం
        బలభేచరులదై న్య మపనయింపఁ
గాంచె నేయారాధ్యపంచాననుం డన్య
        మతవిభేదక్రియాచతురబుద్ధి


గీ.

గరిమ నెలకొల్పె నేమయ్యగారి ఱేఁడు
తరలకుండంగ ధర శైవధర్మవృత్తి
యట్టి శ్రీయుద్భటస్వామి యరుగుదెంచె
రాజకుంజరుఁడగు ముంజభోజుఁ గుఱిఁచి.

123


మ.

భసితోద్ధూళితదేహకాంతులు శరత్ప్రాలేయభానుప్రభం
బరచేయన్ బహుశైవలక్షణములన్ భాసిల్లుట న్మూర్తిశాం
తిసముల్లాసము వాఁ దలిర్చి యట ధాత్రీనాథునాస్థానరం
గసమీపంబున నిల్చె నుద్భటుఁడు శ్రీకంఠాపరాకారుఁడై.

124


క.

చట్టలుఁ దా నురగ భువిం
బుట్టినక్రియఁ దేజరిల్లుపుణ్యుని గురురా
ట్పట్టాభిషిక్తుఁ గన్నుల
పుట్టువునకు ఫలముగాఁగ భూపతి గాంచెన్.

125

గీ.

పాయకుండినవాఁడొ ప్రాగ్భవమునందు
నలపురారాతి తెలిపినఁ దెలిసినాఁడొ
అట్లు వచ్చిన గురుమూర్తి నతఁడ యుద్భ
టాహ్వయుఁడు గాగఁ దలఁచె నయ్యవనివిభుఁడు.

126


మ.

మన మానందరసామృతైకకలనం మత్తిల్లఁ గంఠీరవా
సనముం బూర్వనగంబుడిగ్గు రవియోజం డిగ్గి పాపౌఘ మ
ర్దనమున్ దద్గురుసార్వభౌమునిపదద్వంద్వంబుఁ గోటీరర
త్ననికాయోల్లలదంశుమంజరులచేతన్ గప్పె రా జిమ్ములన్.

127


గీ.

ప్రణతుఁడై యిట్లు మాంపాహి పాహి పాహి
యనుచుఁ బులకాంచితాంగుఁడై పలుకునృపతి
లేవ నియమించి యా గురులింగమూర్తి
పెట్టె శివరక్షయంచు సంప్రీతి భూతి.

128


క.

అహితాంతకుఁడగు ధరణీ
మహిళారమణుఁడు శంభుమానసపుత్త్రున్
విహితసపర్యారచనా
ప్రహృష్టుఁ గావించె వినయభాసురుఁ డగుచున్.

129


సీ.

శరదిందుచంద్రికాచారుప్రభాలబ్ధి
        యఖిలదిక్కులు నిండి యమరువాని
నిత్యప్రసాదమానితదేహసంపత్తి
        మించి చూపరుల బొంకించువాని
అతిశాంతనిజకటాక్షాంచలసామగ్రి
        తలఁపులోపలి శుద్ధిఁ దెలుపువాని
అమృతధారార్ద్రవాక్యశ్రేణిఁ శబశువుల
        నైనఁ దజ్ఞులఁ జేయఁబూనువాని

గీ.

పాపపుంజంబు విరియించి నోపువానిఁ
బుణ్యములపుట్టిని ల్లనఁ బొల్చువాని
సకలశైవాగమార్థలక్షణధురీణు
నలఘువిజ్ఞాను నుద్భటుఁ బలికె నృపుడు.

130


క.

వింటి నటమున్న యాము
క్కంటికృప న్నిన్ను నేఁడు కొతుక మొదవన్
గంటి భవాంబుధి గుల్ఫము
బంటి సుమీ నాకు నింకఁ బరతత్త్వనిధీ!

131


శా.

ఆదిబ్రహ్మకపాలభూషణుఁ ద్రిమూర్త్యాత్మున్ శివున్ వహ్నిచం
ద్రాదిత్యానిలభూమరుత్పథిపయోయజ్వస్వరూపున్ జిదా
మోదున్ శంభు భజించి యోగిజనతాముఖ్యుండవై యున్ననీ
పాదాబ్దంబులు గంటిఁ బాశములచేఁ బట్టూడి శైవాగ్రణీ!

132


క.

అజతుల్యహరమహత్త్వము
నిజముగఁ దెలియంగనోపునేర్పును గనమిన్
గుజగుజయగు నాచిత్తం
బు జనస్తుత! బుద్ధి చెప్పి ప్రోవవె నన్నున్.

133


క.

అఖిలాత్మవేది వింద్రియ
సుఖదూరుఁడ వాదిశైవచూడామణి వు
న్ముఖమంత్రఫలుఁడ వాగమ
సఖబుద్ధివి దేవ! నీవు సామాన్యుఁడవే?

134


ఉ.

ఏమితపంబు చేసి పరమేశ్వరు నేక్రియఁ గొల్చినాఁడనో
యే మునుపంటిపుట్టువున నిట్టిగురూత్తము నిన్నుఁ గంటి మ
త్కామిత మబ్బెఁ బాపములు గ్రాఁచితి ముక్తికురంగలోచనా
కోమలదృగ్విలాసములు గొల్లలు పట్టుదు నింకమీఁదటన్.

135

క.

శివలింగము ధరియింపని
యవివేకికి నిహముఁ బరము నంద దనుచు వే
దవిదులు చెప్పఁగ విని విని
తవులుదుఁ జింతాభరంబు తత్త్వార్థనిధీ!

136


వ.

కావున లింగధారణప్రకారంబుసు గురుశిష్యవర్తనంబును శివార్చనావిధానంబును సవిశేషంబుగాఁ జెప్పి నన్నుఁ గృతార్థుఁ జేయవే యనుచుఁ బునఃబునఃప్రణామంబులు గావించు నృపసార్వభౌమునకు గురుసార్వభౌముం డిట్లనియె.

137


క.

క్షితివర! నీయత్నము మె
చ్చితి మల్ల తలంపు వలయు శ్రీకంధరుపైఁ
గృతపుణ్యుఁడ వీవు మహా
మతిగణ్యుఁడ వీశుభక్తి మరగినకతనన్.

138


క.

ఈ యంగన లీ యాత్మజు
లీ యర్థము లీ దళంబు లిన్నియును దృణ
ప్రాయములు సేసి మదిలో
నాయిందూత్తంసు నిలిపి తద్భుత మధిపా!

139


ఉ.

భూరిసువర్ణపుష్పములఁ బూజ యొనర్చినవాఁడ వీవు కా
మారి మురారిబాణుఁ ద్రిపురారి మఖారి గజారిఁ బాపసం
హారి ననేకజన్మముల నట్టివిధం బొనగూడకుండినన్
వారిజసూతికైనఁ గనవచ్చునె శంకరుభక్తి భూవరా!

140


సీ.

హరున కర్పింపనియన్నంబుఁ గుడుచుట
        కుచ్చితోచ్చిష్టంబుఁ గుడిచినట్లు
భవుని కర్పించనిపానీయ మానుట
        మానక యాసవం బానినట్లు

శివున కర్పింపనిపువుదావి గ్రోలుట
        కుణవధూపం బోలిఁ గ్రోలినట్లు
శంభుభక్తుఁడు గానిజడబుద్ది నంటుట
        గెంటక చండాలు నంటినట్లు


గీ.

పశుపతికిఁ గానిపుణ్యంబు పట్టుటయును
బాపములు సేయుయత్నంబు పట్టినట్టు
లనుచుఁ బ్రాజ్ఞులు విజ్ఞాన మతిశయిల్ల
నన్నితెఱఁగులఁ బూజింతు రష్టమూర్తి.

141


క.

ఉత్తమకులజుండై గుణ
వత్తముఁడై వేదశాస్త్రవరశబ్దార్థా
యత్తమతి నిజముగల లో
కోత్తముఁ గురుఁ జేరవలయు నుర్వీనాథా!

142


క.

శ్రద్ధాభక్తి సమృద్ధిఁ బ్ర
సిద్ధుండై చెప్పినట్ల చేయుచు నెందున్
గ్రుద్ధుండుగాక శాంతియు
సిద్ధాంతము సేయువాఁడు శిష్యతకుఁ దగున్.

143


క.

శివదీక్ష లేక మోక్షముఁ
దవులఁడు జనుఁ డెంతవాఁడుఁ దనయంతనె య
భవుఁగాన భక్తిగలిగిన
భవదూరుఁడు లింగదీక్ష భజియింపఁదగున్.

144


సీ.

ధరణీశ! విను లింగధారణంబునకును
        వివరింతుఁ గాలంబు విశదఫణితిఁ
గడుయోగ్యములు శరత్కాలవైశాఖముల్
        జ్యేష్ఠఫాల్గునమార్గశీర్షసంజ్ఞ

తంబులు నెలలు మధ్యమములు మాఘంబు
        నాషాఢమాసంబు నగుఁ గనిష్ఠ
ములు చైత్రమును బుష్యమును భాద్రపదమును
        శ్రావణంబును నవరంబు లయ్యె


గీ.

నుత్తమంబగు సూర్యచంద్రోపరాగ
కాలముల నిందిరంబగుకాలమైన
ధవళపక్షంబు బహుళపక్షవశమైనఁ
బంచమియు గ్రాహ్యములు సుమ్ము భవునిఁ బూన.

145


గీ.

చవితి నవమిని షష్ఠి నష్టమిని బున్న
మను జతుర్దశి దీక్షకు ననువు గాదు
కడమతిథు లుత్తమములు శంకరు భజింప
నింక నక్షత్రయోగ్యత నేర్పరింతు.

146


సీ.

మంచిది రోహిణి ముఖ లెస్సయది యుత్త
        మము పునర్వసువు పుష్య మగుహితంబు
మృగశీర్షమును గ్రాహ్య మగు హస్త ప్రస్తుత
        ప్రథితంబుసు మ్మనూరాధ యుత్త
రోత్తరాఫల్గును లుత్తరాషాఢయు
        శాస్త్రోక్తములు సాధుసమ్మతములు
రేవతి ముఖ్యంబు భావింప మూలయు
        నర్హంబు హరదీక్ష కవనినాథ!


గీ.

రాసులందునఁ జరమైనరాశి విడిచి
మానితంబగు నచలితంబైనయదియ
గురుబుధోదయకాలంబు లురగహార
ధారణమునకుఁ దగఁ బాపదూరగతుల.

147

చ.

ధరణిప! ఇట్లు దోషరహితంబగుకాలమునందు నంబికే
శ్వరు ధరియించుపుణ్యుఁడు రసాస్థలిఁ జేతెఁడుబంటి డొల్చి పెం
పరయఁగఁ బూర్వపాంసువున నాసుషిరాస్యముఁ బూడ్చి యందుపై
నిరువుగ నొక్కవేది రచియింపఁదగున్ నలుమూల లేర్పడన్.

148


క.

ఆయరుఁగుమీఁద వాఁకి
ళ్ళాయతముగ నాలు గమర నతిరమ్యముగాఁ
జేయందగు శృంగారా
ధేయంబగు మంటపంబు ధీరవిచారా!

149


క.

విలసితగోమయజలముల
నలికిన తన్మంటపమున నైదగువర్ణం
బుల బియ్యముచే స్థండిల
మలవఱపఁగవలయు నుజ్జ్వలాలంక్రియతోన్.

150


గీ.

మహితపుష్పోపచారసామగ్రిచేత
నిగ్గుదేరెడి ముత్యాలమ్రుగ్గుచేత
ధూపదీపాక్షతాదిబహూపచార
రచనచే నొప్పు నందు సంరంభ మెసఁగ.

151


ఆ.

కనకకృతములొండెఁ గాక వెండివయొండెఁ
గాక రాగివొండెఁ గాక మృణ్మ
యంబులొండెఁ గల్గినవి పంచకలశంబు
లమరమూర్తి నిలుపనగు నరేంద్ర!

152


చ.

అలఘునవాంశుకావృతములై తగుతత్కలశంబు లన్నిటిం
గొలఁకునఁ జెర్వునం గలయకుత్సితతోయములందు వేళకుం
గలయవి మంత్రపూర్వకముగాఁ గొని నిండఁగఁ బోసి వాతిలో
పల మణు లెవ్వియైన నిడి పై నవతంతుగవాక్షముద్రికల్.

153

క.

సవరించి చూతపల్లవ
నవదూర్వాంకురకనత్కనకనాగదళా
ది విశేషభద్రవస్తువు
లవిరళముగ నిలువవలయు నందులలోనన్.

154


వ.

ఇట్లు తీర్థాంబుపూరితంబుగాఁ దత్సమంచితకలశపంచకంబున “ఓమాపస్సర్వ" యనువేదమంత్రం బావహించి సకలమంత్రసారంబును మునిజనమనఃకమలకర్ణికాపుష్పంధయంబు నగుపంచాక్షరం బున్ముఖంబు గావించి యీశానతత్పుషాఘోరవామదేవసద్యోజాతంబు లనంబరఁగు వామదేవువదనంబులకు నలంకరణంబులై యైదును నాలుగు నెనిమిదియుఁ బదమూఁడు నెనిమిదియు ననఁ గలుగుసంఖ్యం బ్రఖ్యాతంబులై విశిష్టంబులగు నయ్యష్టాత్రింశత్కళాసంస్మరణంబు సేయుచుఁ బూర్వోక్తంబగు తండులస్థండిలంబున నుత్తరాభిముఖుండై గురూత్తముండు కృతహోముండును, స్వస్తికప్రశస్తుండును, విభూతిపట్టభాసురుండును నగుశిష్యునకు నంగన్యానకరన్యాసంబు లాచరించి, త్రివారంబు తత్కలశవారి నతనియుత్తమాంగంబు ప్రోక్షించి యాక్షణంబ.

155


సీ.

ఆపంచకలశంబులందు నొక్కటి శివ
        కుంభంబుగాఁ బూని కోర తీర్థ
సలిలధారలు చల్లి తొలఁచి గంధాక్షతం
        బులచేతఁ బూజించి నలుచెఱఁగుల
నాల్గుకుండలు నించి నడిమికుంభంబున
        క్షీరంబు పోసి ప్రాచీస్థితంబు
దక్షిణస్థితము నుత్తరసంస్థితంబును
        బశ్చిమస్థితమునై పరగువాని

గీ.

తోను బెరుఁగును నెయ్యిని దేనియయును
బంచదారయఁ గ్రమమునఁ బాదుకొల్పి
హెచ్చి యష్టాంగధూపంబు లిచ్చి శంఖ
కాహళాదికముల మ్రోఁతగడలుకొనఁగ.

156


వ.

స్వస్తికవిస్తృతంబగు కూర్మాసనంబు నిర్మించి ప్రాణప్రతిష్ఠాగరిష్టంబులగు మంత్రంబులు తంత్రపూర్వకముగా నుపన్యసించుచు శంఖముద్రాముద్రితకరాంబుజుండై తచ్ఛిష్యు నుద్దేశించి “ఆవయో స్సిద్ధిర” స్త్వనుచుఁ దన్మస్తంబు హస్తంబునం గుస్తరింపుచు “నయమ్మే హస్తో భగవా” నను వేదమంత్రంబుతోడ నీరంధ్రతేజోవిరాజితంబును అశేషపాశత్రుటనాకర్తృణిమూర్తియును, విజ్ఞానప్రజ్ఞాప్రదర్శనదీపాంకురంబును, గంధపుష్పాద్యుపచారపూజితంబును హృద్యనైవేద్యప్రహృష్టంబునగు జ్యోతిర్లింగంబును “నకదాచిద్వియోజయే” త్తనుచుఁ బుష్పాంజలిపూర్వకంబుగా వినయైకధురీణుండగు నతనికి నగ్గురుండు ప్రాణలింగంబు చేయవలయు నిది లింగధారణప్రకారంబు.

157


క.

అన విని హర్షాశ్రులు కనుఁ
గొనలం దళుకొత్త రాజు గురురాజునకున్
బునరభివాదనములు ధృతి
నొనరిచి యిట్లనియె వినయయుతమానసుఁడై!

158


చ.

తెలిపితి లింగధారణవిధిన్ గురువల్లభ! గుర్వనుజ్ఞకున్
దొలఁగక శిష్యుఁ డెల్లపుడు ధూర్జటిలింగము నెట్టిఠావులన్
నెలకొనఁ జేయఁగావలయు నీమది న న్గరుణించి యాదరం
బొలయఁగఁ జెప్పవే యనుడు నుద్భటుఁడుని నృపుఁ బల్కు నీక్రియన్.

159

గీ.

పొక్కిలందునైన భుజమధ్యమునైనఁ
గేలుదమ్మినైన మౌళినైనఁ
గంఠసీమనై నఁ గఱగంఠు ధరియింపఁ
దగు నృపాల! నాభిదిగువఁ దక్క.

160


క.

నావుడుఁ దద్గురుమణితో
భూవిభుఁ డిట్లనియె భోగిభూషణ యమృత
ఫ్లావిత యగునీవచన
శ్రీ వీనులఁబొరసెఁ గంటిఁ జిరసౌఖ్యంబుల్.

161


గీ.

భక్తులగువారియెడఁ గల్పపాదపంబు
పొడవుగనియున్న ని న్నొత్తియడుగ వెఱవ
భసితరుద్రాక్షధారణప్రాప్తమైన
పుణ్య మెయ్యది వివరించి ప్రోవు మనుడు.

162


క.

సర్వావస్థలయందును
సర్వేశుని లింగమూర్తి సౌభాగ్యకళా
నిర్వాహకు ధరియించిన
సర్వజ్ఞుల కిందు నందు సౌఖ్యము దొరకున్.

163


సీ.

హరకంఠముఖులు సంయములును మనువులు
        నెలకొల్పి రీశానుగళమునందు
బ్రహ్మవిష్ణుసురేశపావకాదులు దాల్చి
        రుత్తమాంగంబుల నూర్ధ్వరేతు
నక్షపాద-శిలాద-హరదత్తముఖ్యులు
        వహించిరి నుదుళ్ళ వామదేవు
శక్తులు నందికేశప్రభృత్యాత్మవే
        దులు పూని రురముల నలికనయను

ఆ.

కొమరుసామి భృంగి కుంజరాస్యుఁడు మొద
లైన భ క్తవరులు హరు ధరించి
రధికభక్తియుక్తి నాత్మీయకరపద్మ
పుటములందు భూమిభువననాథ!

164


ఉ.

అన్నృపుతోడ నిట్లనియె నాగమతత్త్వవిదుండు దేశికుం
డెన్నఁడు నేర్చినాఁడవు మహీవర! శైవరహస్యముల్ గనన్
మొన్నఁటివాఁడ వింతియ విమూఢుల కీసమయంబు దుర్లభం
బెన్న మహావివేకనిధి వీవు కృతార్థుఁడ వెన్నిరీతులన్.

165


గీ.

కపిలయును గృష్ణవర్ణయుఁ గంబునిభయు
ధూమ్రయును జూతపల్లవతామ్రరుచియు
నైనగోవులు గడివెట్ట నందితెచ్చి
భూతి చేయంగవలయుఁ బ్రభూతవహ్ని.

166


సీ.

సంతతైశ్వర్యముల్ సమకూర్చుటకుఁ దానె
        హేతువై యునికి విభూతి యనఁగఁ
గవిసి పాతకముల గదిసి మెసఁగఁ జాలి
        ప్రఖ్యాతి గలుగుట భస్మ మనఁగ
శరదిందుచంద్రికాసారకాంతులు మీఱి
        భాసనంబొందుట భసిత మనఁగ
శాకినీఢాకినీసర్పాదిభయము చే
        రఁగనీక రక్షింప రక్ష యనఁగ


గీ.

నాపదనెల్ల క్షరణంబు నందఁజేయఁ
జాలుమహిమఁ బ్రకాశించి క్షార మనఁగ
బూది యాహ్వయపంచకంబునఁ దలిర్చు
ఫాలలోచనఫాలనేపథ్యకలన.

167

వ.

వెండియుఁ గపిలకృష్ణధవళరక్తధూమ్రవర్ణంబులఁ దగు పూర్వోక్తధేనువులు నందయు సుభద్రయు సురభియు సుమనయు సుశీలయు ననఁబరగు వీనిగర్భంబుల నావిర్భవించి ప్రఖ్యాతయగుట విభూతి భూతనాథుండు సద్యోజాతంబున వహియింపుట విభూతి యనియును, వామదేవంబున ధరియించుట భసితం బనియును, నఘోరంబున భరియింపుట భస్మంబనియును, దత్పురుషంబున నవధరింపుట క్షారంబనియును, నీశానంబున నెలకొలుపుట రక్షయనియును బ్రేక్షణీయయై వర్తిల్లుచు మోక్షలక్ష్మీదరహసితసుధానిష్యందంబు నానందం బగు వినుము.

168


సీ.

కైకొనఁదగు సర్వకాలంబుల విభూతి
        నైమిత్తికములఁ బూనంగవలయు
భసితంబు రక్ష దాల్పఁగ యోగ్య మాయాయి
        యర్హకృత్యంబులయందు భస్మ
మనువగుఁ బూయఁ బాయశ్చిత్తముల మోక్ష
        విధుల సంభావ్యయై వెలయు క్షార
మిది భూతినిర్ణయం బిఁక విను రుద్రాక్ష
        మహిమ వర్ణింతు నిర్మలగుణాఢ్య!


గీ.

అలికనయనుండు మున్ను సురారుపురము
లోరదృష్టికి రాఁ జూచుచుండ నతని
నయనముల రాలు బాష్పసంతతులు ధరణి
వ్రాలి రుద్రాక్షములుగాఁగఁ బ్రబలె నధిప!

169


సీ.

శిఖనొక్కటియు మూఁడు శిరమునముప్పది
        యాఱు మస్తముచుట్టునందుఁ గంఠ
పీఠి ముప్పదిరెండుఁ బృథులవక్షోవీథి
        నేఁబది పదునొండు నేను బాహు

శాఖల షడ్ద్వయసంఖ్యలఁ జేతుల
        నొండొండు నాఱాఱు నొండుచెవుల
నవతియుం బదియునునాల్గు రెండులు నుప
        వీతసూత్రంబున విధిసముక్త


గీ.

మార్గమున రుద్రమణులు ధీమంతులైన
వారలకుఁ దాల్పవలయు భూవలయనాథ
యెన్ని దాల్చినఁ దత్ఫలం బెన్నఁ దరమె?
ధాతకైన చక్షుశ్రవోనేతకైన.

170


చ.

తలఁచినఁ గన్న విన్నఁ గరతామరసంబుల నంటినం దనూ
ఫలకమునందఁ దాల్చిన నభంగురముక్తికురంగలోచనా
చలదలసప్రసాదితలసద్వలమానకటాక్షవీక్షణం
బులఁ బరితుష్టుఁ జేయు దుదిఁ బూరుషు రుద్రమణుల్ నృపాగ్రణీ.

171


క.

అనవిని చరితార్థుండై జననాథుఁడు
గురుకులాశశి నుద్భటు న
ర్చన దనియించి దీక్షకు ననుకూలుం
డుగుచునుండె నక్కాలమునన్.

172


చ.

కుసుమితాకాశ మంబుధరగోవనదూరనభస్సకాశ ము
ల్లసితమరాళి సస్యఫలలాభవిజృంభితపామరాళి శ్రీ
విసృమరసారసంబు హృతవిభ్రమసింధురసారసంబునై
యసదృశలీలఁ బొల్చె శరణాగమ మాగమనార్హమార్గమై.

173


గీ.

కలువపూఁగోల యలదేఁటి కలికినారి
నెనయు పుండ్రేక్షుధనువుతో నెక్కుద్రోచి
దర్పకుండేచి విరహచిత్తములు గలఁచి
గారవెట్టుచునుండుఁ దత్కాలమునను.

174

గీ.

తొల్లి కలఁగిన కొలఁకునెల్లఁ దేర్చి
తనరు కుంభజునున్నతి ధార్తరాష్ట్ర
వినుతమై యొప్పెఁ గుంభజవిలసనంబు
ధార్తరాష్ట్రులచేఁ బ్రస్తుతంబుగాదె.

175


చ.

కలువలకమ్మదాని నొడికంబుగఁ గైకొని పద్మకాననం
బులకడ గుంపుగట్టి కనుమోడ్చిన యంచలఱెక్క మొత్తముల్
జలితములయ్యెఁ గావునఁ బ్రచారముఁ జూపి పరిభ్రమించి రా
త్రుల శరదాగమంబున మరుచ్ఛిశువుల్ విధురశ్మిదోగుచున్.

176


క.

కురిసెన్ గరిమద మంచులు
మొరసెన్ రాజసము దొండముకు వడియె వే
విరిసెం జలకంబులు దీవి నెరసెన్
యామినులఁ జంద్రనిర్మలరోచుల్.

177


గీ.

హెచ్చి పగరలమీఁద దండెత్తు నృవుల
సైన్యహయముల ఖురరజశ్చయము దమకుఁ
బ్రాణవిభుఁడైన వారాశి నరుఁగఁజేయఁ
గాంచి చిక్కినగతి నదుల్ కార్శ్యమొందె.

178


చ.

మెఱుగులు దీటుకొల్పు చనుమిట్టలఁ గమ్మజవాదితావులన్
బిఱిఁదికి ద్రోయువాసనల బేడిసమీల హసించుకన్నులన్
వఱలు కృషీవలాత్మజ లవారణఁ బాడుదు రిందువంశజుల్
చెఱకును రాజనంబుఁగల చేలకడన్ శరదాగమంబునన్.

179


గీ.

సకలజనులకు లోచనోత్సవము సేయఁ
జాలుతత్కాలమున రాజచంద్రమూర్తి
ముంజభోజుండు శివలింగమును ధరింప
యత్న మొనరించె నుద్భటుననుమతమున.

180

శా.

పాటింపందగు నాదువిన్నపము హృత్పద్మంబులం జాహ్నవీ
జూటుం దాల్చెద శుద్ధపంచమి మహీశు ల్వేగ మీ ర్వచ్చి నా
చోటన్ సత్కృప సేయఁగావలము నంచున్ విశ్వవిశ్వంభరన్
జాటంబందె నతండు గాలరులచే శైవోత్తమశ్రేణికిన్.

181


ఉ.

ఆ నృపువిన్నపంబు హృదయంబుల మిక్కిలిఁ బూని ప్రాప్తపం
చాననసన్నిభుల్ శమదమాఢ్యులు దేశికపుంగవుల్ దృఢ
జ్ఞానులు నేలయీనినప్రచారములన్ జనుదెంచి రాత్మతే
జోనిహతంబులై నొరిగి సూర్యమరీచులు విన్నవోవఁగాన్.

182


ఉ.

మిక్కిలికన్ను చేత నొకమేటిత్రిశూలము పాఁపసొమ్ములున్
జక్కెరవింటిజోదుమయిసాననురాచినచందనంబు మే
నిక్కువగాఁగ నుండు నొకయింతియుఁ గల్గినవేల్పు దామమై
యక్కమనీయమూర్తులు ప్రియంబున వల్లకి కేఁగి రయ్యెడన్.

183


క.

ఈయందమ్ముల వచ్చిన
యాయయ్యలపదసరోరుహములు గడిగి భూ
నాయకుఁడు పూజచేసె ము
దాయత్తస్వాంతుఁ డగుచు నంచితభక్తిన్.

184


గీ.

ఇట్లు భయభక్తు లమర విధీరితార్చ
నములఁ దము సంతసిలఁ జేయునలినవైరి
కులశిఖాప్రమథేశునికొడుకు సకల
దేశితులు దీవనలఁ బస్తుతింతు రిట్లు.

185


సీ.

సింధుబల్లహురీతి శ్రీపతిపండితు
        మరియాద ధూపదమాచిదేవు
నట్లు మహాకాళువనువున నల్లక
        ల్కదబహ్మఠేవఁ గక్కయవిధమున

శూలదబాహ్మయ్య చొప్పున బిబ్బబా
        చనలీల వీరనాచాంరుపోల్కి
కదిరె రెమ్మయగారికైవడిఁ దెలుఁగేశు
        మహణయ్యచందాన మాచిరాజు


గీ.

శరణి మాళిగ మారయ్యగతిఁ దెలుంగు
జొమ్మనార్యునివడువున సురియచౌడు
పగిది బసవేశ్వరునిమాడ్కి భక్తియుక్తి
శంభుఁ బూజించి బ్రదుకు రాజన్యచంద్ర!

186


గీ.

అనుచు దీవించి భూపాలు నాదరించి
మహిమ నిల కేఁగి రగ్గురుమండలేశు
అమ్మహీభర్త తమ కిచ్చు నమితవస్తు
సముదయమునకు మదిఁ బ్రహర్షంబు నిండ.

187


క.

అంతట సాగరకాంచీ
కాంతుఁడు శ్రీకంఠుఁ బూనఁ గల్యాణవిధా
క్రాంతమగుదినము చనుదే
నెంతయు హర్షించి పురి సమిద్ధవిభూతిన్.

188


వ.

అలంకరించుటకు ఫణిహారులచేతం జాటంబంచిన.

189


క.

కట్టిరి మణితోరణములు
పెట్టిరి ముత్యాలమ్రుగ్గు పృథులధ్వజముల్
చుట్టిరి సౌధంబులఁ ద
త్పట్టణమునఁ బౌరు లెల్లఁ దమతమయిండ్లన్.

190

క.

ఆవేళ బహుళశృంగా
రావాసములై చెలంగె నద్భుతభూతిం
దేవాలయములు సద్గురు
దేవాలయములును భక్తిదేవాలయముల్.

191


సీ.

ఆపుణ్యదివసంబునందుఁ బ్రభావతీ
        సంభవుం డవితథారంభుఁ డగుచుఁ
గమనీయతీర్థోదకములు దానం బాడి
        వెన్నలనురుఁగుల విన్నఁబుచ్చు
రమణీయశుభ్రవస్త్రములు మెచ్చుగఁ గట్టి
        భసితాక్షమాలికోద్భాసి యగుచు
నసమాక్షుప్రతివచ్చునతులమూర్తుల శైవ
        లాంఛనధరుల నల్లన భజించి


గీ.

శంభులింగంబులకుఁ బ్రపూజలు ఘటించి
తనగురూత్తంసుచేఁ బ్రసాదంబు వడసి
యరిగె బహుతూర్యరవము లంబరము వొదువ
భర్గదీక్షకుఁ దగుమంటపంబు గుఱిచి.

192


వ.

అట్లు చనిచని యాఖండలకోదండదండంబునం దొరఁగుప్రభామండలంబు గండడంచునగణితతోరణంబులవలనను శాతమన్యవశిలాశకలకీలితంబులై యకాలతమోజాలంబు విశాలంబుగాఁ గలిగించు నలఘువలభులవలనను, మధ్యందినమార్తాండమండలంబుం గోడగించి విజృంభించు శాతకుంభకుంభంబులవలనను, నాశావకాశంబులు వాసించు కాలాగరుధూపమాలికలవలనను, వలను మిగిలి విశుద్ధకామధ్వజాంచలగండూషితసుధాంధస్సింధుపయోభరంబును, జతుర్ద్వారభాసురంబును, జతురశ్రవిస్తృతవేదికంబును,

సమస్తప్రశస్తతీర్థోదకపరిపూరితకలశపంచకంబును, గాంతాకరార్పితకర్పూరనీరాజనాదివిరాజితంబును, గమ్రామ్రపల్లవప్రముఖనిఖిలభద్రపదార్థసార్థప్రేక్షణీయంబును నగు దీక్షామంటపంబుఁ బ్రవేశించి యథాకాలంబును యధాశాస్త్రంబును నగునట్లు విభూతిపట్టహోమాదికృత్యంబులు గుర్వనుజ్ఞ నఖర్వభక్తి నొనరించి వినిద్రాస్వాంతుండై ధరణీకాంతుండు మహితమంత్రధారాసారంబుఁ గర్ణపుటీకుటుంబిగా నాకాంక్షించు నవసరంబున.

193


క.

సాక్షాదలికాక్షుం డగు
నక్షయపుణ్యాత్ముఁడైన యగ్గురునాథుం
డక్షుద్రమంత్రవిద్యా
రక్షితుఁ జేయం దలంచి రాజోత్తంసున్.

194


సీ.

వామాంకవిన్యస్తవామేతరకరాంబు
        జయు నవరక్తోత్పలయుతవామ
హస్తయు, ...నగు తనప్రియకాంత
        మెఱుఁగారు పాలిండ్లమీఁదిచాయ
డాకేలు తామెడ (?) మైకొల్పి చొక్కుచుఁ
        బరశువు మృగమును వరము నితర
శయముల ధరియించి సాంద్రసర్వాకల్ప
        భాసమానాంగుఁడై పరిఢవిల్లి


గీ.

లలితనూత్కారణాంశులు తొలుకరించు
మేనఁ బుష్పాస్త్రవిలసనోన్మేష మమర
హారిపద్మాసనాసీనుఁడైన పార్వ
తీశుఁ బ్రాసాదపంచాక్షరీశుఁ బొగడి.

195

చ.

పరశువు ఖడ్గమున్ నిశితబాణము శూలము దక్షిణస్ఫుర
త్కరములపైఁ దనర్ప హితఖండనఖేటధనుష్కపాలమున్
బరువడి వామహస్తములపైఁ జెలఁగన్ నలువారు మేను భీ
కరవదనంబుఁ ద్ర్యక్షములు గాంచనవర్ణజటల్ తలిర్పఁగాన్.

196


చ.

కరయుగళంబునన్ భుజయుగంబునఁ గర్ణయుగంబునం బదాం
బురుహయుగంబునం గటిని బొల్చుగళంబునఁ బార్శ్వసీమలన్
శిరమునఁ గుక్షి నాల్గువది జిహ్వఁ గరాబ్జములన్ వహించు శ్రీ
భరితు నఘోరమూర్తి మనుభర్త నఘాంతకుఁ బ్రస్తుతింపుచున్.

197


వ.

వెండియు దక్కిన శివమంత్రంబులు గల సారంబుఁ బరిగ్రహించి గురుండు శిష్యునకు నుపదేశించిన.

198


చ.

ఒనర నిశావసానసమయోదితభాస్కరునందు నుండి చ
య్యన దిగి దీప్తిఫుల్లజలజాంతరముం దగఁ జొచ్చునట్లు పు
ణ్యనిధి యనంగ నొప్పు గురునాథుమొగంబున నుండి మంత్రవి
ద్య నృపుమొగంబుఁ జొచ్చె విమలాకృతి నగ్నికణావదాతమై.

199


క.

గురుమంత్రవిద్యచే నృపు
కరస్థలాధీనకాలకంధరలింగో
దరముఁ బ్రవేశించె మనో
హరమగు నొకదివ్యతేజ మద్భుతభంగిన్.

200


వ.

ఇట్లు కృతలింగధారణుండై ధరణీరమణుం డజగవబాణాసనపూజాపరాయణుండై.

201


క.

త్రిణయన! భక్తసులభ! స
త్వనిలింపాత్మక! దయావివర్ధన! నాపై
ననురాగం బొదవఁగఁ జ
య్యన నీలింగంబునందు హత్తుము వేడ్కన్.

202

క.

అలధరణీధరకరవర
నిలయ! మహైశ్వర్యధుర్య! నిటలాక్ష! విని
ర్మలదేహ! పార్వతీప్రియ!
నెలకొను మీ యాసనమున నెయ్యముతోడన్.

203


క.

గానప్రియ! విష్ణుకళ
త్రా! నిరుపమ! నిత్య! రాజరాజసఖ! హరా!
సూనాశుగహర! గైకొను
భానుశశాంకాగ్నినేత్ర! పాద్యము దీనిన్.

204


క.

మధుమథనదృగర్పితపద
విధిశీర్షసరోజభేదవిధిచణహస్తా!
విధుకాంతవర్ణ! శివ! జగ
దధినాథ! పరిగ్రహించు మర్ఘ్యము దీనిన్.

205


క.

అణిమాదిగుణాన్విత! భవ!
ఫణివల్లభహార! దివిజభర్తృనమస్యా!
గణనాథ! నీలలోహిత!
ప్రణుతాచమనీయకంబుఁ బాటింవు దయన్.

206


క.

తుహినగిరిదుహితృపాణి
గ్రహణప్రీతాత్మ! భూతగణవృతరాజీ
వహితశతకోటితేజో
మహిత! మదిం బొదలు విహితమజ్జనలబ్ధిన్.

207


క.

అజ్ఞానతిమిరభాస్కర!
విజ్ఞానవిలాసజనక! విశ్వేశ్వర! స
ర్వజ్ఞ! నిజభక్తవత్సల!
ప్రజ్ఞాధిక! కొమ్ము వస్త్రరాజము దీనిన్.

208

క.

విపరీతవికృతఫణివర!
ఉపనిషదర్థస్వరూప! యోగిజనధ్యే
యపద! సువర్ణకృతం బగు
నుపవీతముఁ దాల్పు మిదె సముజ్జ్వలమూర్తీ!

209


క.

జన్మజరామృత్యురహిత!
చిన్మయ! లోకేశ! యీశ! శీతాంశుకళా
భృన్మకుట! గంధ మిదె ప్రేమ
మ న్మము మన్నించి కొనుము మఘవిధ్వంసీ!

210


క.

పవనశిఖతరణి శశిజల
సవనకృదాకాశభూమిసంభృతమూర్తీ
భవభూధరభిదుర! సదా
శివ! యీయక్షతలమీఁదఁ జిత్తం బిడవే.

211


క.

పంచానన! రుచిధిక్కృత
పంచానన! విజిత! దేవపతీసంస్తుత్యా!
పంచాననావతర! హర!
పంచప్రేతేశ! పువ్వు లుంచెదఁ గొనుమీ!

212


క.

శ్రీకంఠ! దివ్యవైభవ!
ప్రాకట....మనూత్తరనివేశరతా!
లోకాధీశ్వర! సురసిం
ధ్వాకల్ప! ప్రధూప మిది ప్రియంబునఁ గొనవే!

213


క.

పాపహర! దేవదేవ! వి
రూపాక్ష! కృపాకటాక్ష! రుద్ర! మహేశా!
తాపత్రయసంహారక!
దీపము లర్పింతు దయ మదిం గనుఁగొనుమీ!

214

క.

దండధరమథన! కుండలి
కుండల! దివిషన్మహీధ్రకోదండ! సుధీ
మండలనీరజవనమా
ర్తాండా! నైవేద్య మిది ముదంబునఁ గొనవే.

215


క.

లంబోదరజనక! బుధా
లంబ! విరూపాక్ష! మోక్షలక్ష్మీప్రద! చ
ర్మాంబర! యంబరకుంతల!
తాంబూలము మీకు నర్పితంబగు మాచేన్.

216


క.

అక్షీణపుణ్య! నవనా
ధ్యక్ష! మహోక్షేంద్రవాహ! ధరణీరథ! ప
ద్మాక్షాశుగ! నేఁ జేయుప్ర
దక్షిణములు చిత్తగింపు దయ నిగమహయా.

217


క.

శ్రీకంధర! మునివల్లభ!
మాకాంతవనీవసంత! మలహర! రమణీ
యాకార! నమోవాక్యము
చేకొను నే నీకొనర్తుఁ జిరతరభక్తిన్.

218


క.

అని షోడశోపచారము
ల నిటలనేత్రుని భజించి లాలితపుణ్యాం
బునిధి యగుముంజభోజుఁడు
గనుఁగొనియెన్ దత్క్షణంబు కల్యాణంబుల్.

219


క.

జితపాశదేశికోత్తమ
కృతదీక్షుం డగుట నిట్లు కృతకృత్యుండై
క్షితివల్లభుండు రెండవ
శితికంఠుఁడు పోలె నఖలసేవితుఁ డయ్యెన్.

220

గీ.

ఉక్తదక్షిణ నారాధ్యు భక్తిఁ దలఁచి
సకలజంగమగురురాజ శైవసముద
యముల నర్హసపర్యల నలరఁజేసి
నిత్యసౌభాగ్యమయమూర్తి నెగడె నృపుఁడు.

221


ఉ.

మానితమూర్తి భూపతి యుమాపతి నీగతిఁ బ్రాణలింగముం
గా నొనరించి పుణ్యములకందువఁ గాంచి దయార్ద్రచిత్తుఁడై
మానుషలోకముం బెనుచు మంజులకీర్తులు మిన్నుముట్ట వి
ద్యానిధి నుద్భటుం గురుకులాగ్రణి రాజ్యధురీణుఁ చేయచున్.

222


క.

పులు దుది విధాత యాదిగఁ
గలవిశ్వమునందుఁ గాలకంఠుఁడు గౌరీ
లలనామనోహరుని మదిఁ
దెలిసి యతం డేలు వసుమతీవలయంబున్.

223


సీ.

భూరివివేకంబు పుట్టినప్పుడె పుట్టెఁ
        గాకున్న నొరులకుఁ గలదె యిట్లు
బుధపోషకేలియుఁ బుట్టినప్పుడె పుట్టె
        గాకున్న నొరులకుఁ గలదె యిట్లు
పుణ్యంబుఁ దెలివియుఁ బుట్టినప్పుడె పుట్టెఁ
        గాకున్న నొరులకుఁ గలదె యిట్లు
భూతదయాప్తియుఁ బుట్టినప్పుడె పుట్టె
        గాకున్న నొరులకుఁ గలదె యిట్లు


గీ.

బుద్దియును బుట్టినప్పుడే పుట్టె నెనరుఁ
గలసి కాకున్న నొరులకుఁ గలదె యిట్టు
ననుచు నఖిలంబుఁ దనుఁ గొనియాడుచుండ
బల్లహాదులరీతిఁ బ్రాభవముఁ దాల్చె.

224

శా.

కామక్రోధములం ద్యజించి మమతన్ ఖండించి శైవాగమ
ప్రామాణ్యంబు పరిగ్రహించి ధరణీభక్తాళిసంరక్షణన్
సామర్థ్యంబున యోగివర్తనమునన్ సంపూర్ణవిజ్ఞానసం
ధామాన్యస్థితి మించె భూపతి సమస్తంబున్ మదిన్ మెచ్చఁగాన్.

225


మ.

అరిసంహారము శైవనిర్ణయకథావ్యాసక్తియున్ సద్గుణ
స్ఫురదత్యద్భుతధర్మసంగతియు నేప్రొద్దున్ వెలిన్ లోన ని
ర్భరతన్ బెంపువహింప రాజసమున్ భాసిల్లు నావల్లకీ
పుర మింపొందఁగ ముంజభోజుఁడు బుధాంభోజాతహంసాకృతిన్.

226


క.

నలినీపత్రము నంటని
సలిలకణంబట్ల తగులు చాలించి ధరా
స్థలి నిట్లు పోచుహిమగర
కులసంభవుఁ డైన రాజగురుఁ డీకరణిన్.

227


క.

సుక్షేత్రంబునఁ బదనున
నిక్షిప్తంబైనవిత్తు నెఱి నీయెడ నా
యక్షీణమంత్రవిద్య మ
హక్షణకరలీలఁ బొదలె నవనీశ్వరుఁడున్.

228


వ.

ఇట్టి శిష్యునిం జూచి గురుం డిట్లనియె.

229


చ.

సమసుఖమోదియై వినయసంగతుఁడై శుచితాభిరాముఁడై
యమరిన నీ తెఱంగు సుగుణాఢ్యువశం బగు మాదృశేరితా
ర్హమనువు మీఁదనుం బ్రబలినట్టి తెఱంగును గూర్చు నారికే
ళమునకుఁ బోసినట్టి సలిలంబు విధంబున భూపురందరా.

230


సీ.

సమపక్షపాతనిశ్చలభక్తియుక్తి ధ
        ర్మార్థకామంబుల నాదరించి

దుష్టనిగ్రహమును శిష్టరక్షణమును
        నిత్యకృత్యములుగా నిర్వహించి
స్రక్చందనాదిసారవిదూరభోగంబు
        లొలసి యొల్లమి గాఁగ నొందఁ జాలి
అప్రమత్తత్వంబు నంది బాహ్యాభ్యంత
        రముల శాత్రవులగర్వం బడంచి


గీ.

జలధివలయితవసుమతీస్థలము నొక్క
పురముఁ బ్రోచుతెఱంగునఁ బ్రోవ నేర్చి
యొప్పు నినుఁ బోల నేర్చు నే యొక్కరుండు
భూరిరుచి రాజ! శ్రీముంజభోజరాజ!

231


క.

నీవంటిశిష్యుకతమున
నావంటిగురుండు నిత్యనవ్యయశశ్శ్రీ
శ్రీవంటియఘపయోనిధి
నావంటినకరణిఁ గడుచు నరనాథమణీ!

232


క.

శిష్యుఁడు పాపము చేసిన
దూష్యస్థితి గురునిఁ జెందుఁ దోరపువీఁకన్
శిష్యుఁడు పుణ్యము సేయ న
దూష్యస్థితి గురునిఁ జెందుఁ దోరపువీఁకన్.

233


వ.

కావున శిష్యుని పుణ్యపాపంబులు గురునితలయవియ కాన యుత్తమశిష్యుఁడు గలుగుట గురునిభాగ్యంబ శిష్యుం డనుత్తముం డగుట గురునిదౌర్భాగ్యంబ యని వేదవిదులు చెప్పుదు రీవు సచ్ఛిష్యుండ వగుటం జేసి మా కదృష్టంబయ్యె నదియునుంగాక.

234

ఉ.

ఏలరె? మున్ను భూపతు లనేకులు రామయయాతిముఖ్యు లీ
నేలయ నీవు ప్రోచునది నేలయ యిట్టియశంబు నిట్టియు
త్తాలతరప్రభావమును దన్నృపు లొందిరె నీక్రియన్ మహీ
పాలలలామ? నీకయిన భాగ్యము వర్ణన సేయ శక్యమే?

235


శా.

నీవున్ జేరమభూనరాదులగతిన్ నేత్రక్రియోద్భాసిలో
కావాసుం గరిచర్మవాసు భువనైకారాధ్యు నిమ్మేనితో
సేవావృత్తిఁ బ్రసన్నుఁ జేసి దిశలన్ శ్రీపూర్ణ సత్కీర్తి పు
ణ్యావేశంబున నిల్పగాఁ గలవు తథ్యం బిందువంశాగ్రణీ.

236


చ.

అనుడుఁ గృతప్రణాముఁ డయి యగ్గురు నిట్లని పల్కు ముంజభో
జనృపతి యిట్లనం దగునె శైవగురూత్తమ! నీకృపారసం
బునఁ దగఁ జెట్టుగట్టు వనువొందుట చిత్రమె మంగళంబు లె
ల్లను సుకృతాధిపుం గొలుచులాభము గల్గినఁ గీర్తి గల్గదే?

237


ఆ.

చెలఁగి పుత్త్రనిర్విశేషంబుగా నన్ను
బ్రోచు నీ ప్రభావమునన గాదె
ఇట్టి వైభవంబు నిట్టి సౌభాగ్యంబు
దొరకె నాకు నిఖలగురువరేణ్య.

238


ఉ.

వారక వ్రేలు నాకి యువవాసఫలం బెడలించునట్లు ని
స్సారములైన యిజ్జగతిసౌఖ్యములన్ మది దూర్వ్యయ మొంది వి
స్తారియఘంబు దూరమని శంకవహించియు మీయనుజ్ఞకుం
దారక పూనినాఁడ వసుధాభరమున్ గురుచంద్రశేఖరా!

239


ఉ.

సేవకలోకముం బొదలజేయుటకై చరకల్పభూరుహ
శ్రీవహియించు నీపదముఁ జేరినవాఁడఁ గృతార్థుఁ జేసి సం
భావనఁ బ్రోవు నన్ను భవబంధముపైఁ దగు లూడ్చి నావుడున్
భూవరుఁ గ్రమ్మఱంబలుకు భూనుతుఁ డుద్భుటమూర్తి యీక్రియన్.

240

గీ.

అన్న! విశ్వాస మొనరించు మస్మదీయ
వాక్యమున సంశయము మాని వసుధఁ బెద్ద
కాల మభిరక్షణము చేసి కడు భజింపఁ
గలవు కైలాసనాథు శ్రీకంఠు నభవు.

241


వ.

అని యుద్భటారాధ్యుండు ప్రియశిష్యుండగు ప్రభావతీతనయు వైరాగ్యంబునకుఁ బరిహారంబుఁ గఱపి రాజయోగిలక్షణంబులం బ్రేక్షణీయుండ వగు మని నియమింపుడు నప్పుడమిఱేఁడును "గురోరాజ్ఞాం నలంఘయే" త్తను న్యాయంబున నజేయభుజభుజగాధినాథుమై ధరావరారోహ విశ్రమింపం జేసి ప్రజావనసమర్దుండయ్యె. నిట్లు,

242


సీ.

ఇందుశేఖరముచే నేమూర్తి దీపించు
        నామూర్తి దానయై యతిశయిల్లి
ఇభచర్మపటమున నేమూర్తి గొమరారు
        నామూర్తి దానయై హరువు చూపి
యిల రథంబుగఁ బన్ని యేమూర్తి జయమొందు
        నామూర్తి దానయై యనువు మిగిలి
యిక్షుధనుర్మూర్తి నేమూర్తి పైఁబూయు
        నామూర్తి దానయై యయము గల్లి


గీ.

యున్నయుద్భటగురునాథునుగ్రకలుష
కరటికంఠీరవస్వామి చరణయుగళి
తనకు నిహపరఫలసిద్ధిజనని గాఁగ
భూమిఁ బాలించు శ్రీముంజభోజమూర్తి.

243


క.

వరహృదయకమలకర్ణిక
గురుచరణద్వయము నిలిపి కువలయరక్షా

చరణమునఁ బొదలుఁ బ్రమథే
శ్వరతనయుఁడు ముంజభోజజనవిభుఁ డెలమిన్.

244


క.

చరలింగమూరియగు నా
గురుదేవుని సింహపీఠిఁ గోరిక నిడి త
చ్చరణాంభోరుహములకును
బరిచర్య యొనర్చు నవనిసతి యనుదినమున్.

245


ఉ.

అంత మనంబులోనఁ బ్రియమారఁ దలంచు మహాత్ముఁ డుద్భటుం
డంతకవైరి తన్బిలిచి యాత్మఁ గఠోరతరోక్తి శపులై
చింతఁ గలంగుఖేచరులఁ జేర్పు మదాకృతి నంచుఁ దొల్లి య
త్యంతదయార్ద్రచిత్తుఁడయి యాగతి నాడినమాట లీక్రియన్.

246


మ.

నిలిచెం ధారుణి శైవధర్మము సమున్మేషంబుతో దుర్మతం
బులు బౌద్ధాగమముఖ్యముల్ సడలె శ్రీపూర్ణాత్ముఁడై శంభువ
జ్జలజాతద్వయభృంగ మీతఁ డన నోజన్ ముంజభోజక్షమా
లలనాధీశుఁడు నాదుశిష్యుఁ డయి యుల్లాసంబు నొందెంధృతిన్.

247


క.

మఱియుం దక్కినపను లరమర
యొకింతయును లేక మలహరు నాజ్ఞన్
నెఱిఫలియించె ధరాస్థలి
నుఱక వసింపంగ నాకు నుచితం బగునే?

248


మ.

వలదా యింక లలాటనేత్రపటుతీవ్రక్రూరశాపానలా
ర్చులచేఁ బ్రేలుచు నానిమిత్తమున దూరూపంబులం బాయఁగాఁ
గల మంచుం గడుఁ గాంక్షలన్ బొదలు తద్గంధర్వులన్ బ్రోవ వా
రలు నోలిన్ సమయాబ్దముల్ గడపి రోర్వంజాలి నీచత్వమున్.

249

చ.

అని కృతనిశ్చయుం డగుచు నగ్గురుకుంజరుఁ డొక్కనాఁడు పా
వనసలిలంబులం దడిసి వచ్చి విశుద్ధతరస్థలంబునం
దనుపమభస్మరుద్రమణు లాదిగఁ గల్గిన శైవచిహ్నముల్
మన మలరంగఁ దాల్చి పురమర్దనలింగముఁ బ్రాణలింగమున్.

250


శా.

హస్తాబ్జంబున సంగ్రహించి వరపద్మాసీనుఁడై జాతవే
దస్తారాధిపభానుభానువులకున్ దానైక్యుఁడై యొప్పు త
న్నిస్తంద్రోజ్జ్వలమూర్తిపై విషయముల్ నెక్కొల్పి యోగంబుచే
మస్తోద్భేదము చేసి జీవితము సంబంధంబుఁ ద్రోచెన్ వెసన్.

251


గీ.

ఆమహాయోగి బ్రహ్మరంధ్రాంతరంబు
వెడలె శతకోటిరవిదీప్తివిలసనంబు
గలుగుతేజం బొకండు తత్కరతలేశ
లింగమును గూడి హరుఁ బొందె లీల నెగసి.

252


క.

జితభవబంధనులను త
త్సుతు లధికులు శాస్త్రసరణితోఁ దత్తనువున్
చతురత శైవజ్ఞానా
హుతిగా భావించి రంత యోగ్యప్రాజ్ఞుల్.

253


ఉ.

అమ్మహనీయమూర్తి తనువందలిధూమము సర్వదిక్కులన్
గ్రమ్ముచు మీఁద రాలు నమరద్రుమనిర్గతపుష్పవృష్టిగం
ధమ్ములతావి గెల్చి వటధామవిహారుల నప్పిశాచబృం
దమ్ములఁ గప్పె నీలజలదప్రతిపక్ష మహస్సహాయమై.

254


గీ.

సిద్ధరసమున వేధించు చెనఁటిలోహ
దళము లమలసువర్ణత్వకలన వెలుఁగు
నట్లు ఖేచరు లుద్భటునంగధూమ
సంగమునఁ జేసి శంభువేషములు గనిరి.

255

సీ.

బాలప్రవాళరుక్పాటచ్చరంబులౌ
        జడల సైంధవకళల్ బెడఁగుకొనఁగ
బంధురపరిణద్ధకంధరాంతరములఁ
        బసిమి దేరెడి చేఁదువిసము లమర
ఘనకవాటాభవక్షఃపీఠికలమీఁద
        నెరకొన్న పెనుపాఁపసరులు బెరయ
శరదభ్రవిభ్రమాకరవిగ్రహంబులఁ
        గంతుభస్మాంగరాగములు గ్రమ్మ


గీ.

వఱలుడాకాళ్ళయందు వైవస్వతప్ర
తాపసంక్షోభకరబిరుదప్రకీర్ణ
ముద్ర లింపొందఁ దద్రుద్రమూర్తిఁ దాల్చి
నిలిచె గంధర్వతతి వెండిరుచులు చెలఁగి.

256


గీ.

ఆ గురుం డిట్లు దేవరయందు నైన
రాత్రి గంధర్వపతి చిత్రరథుఁడు వచ్చె
తెలివితోడుత నెందైన దిరుగ నట క్రి
తంబు చని వేమఱలి పటేంద్రంబు డాయ.

257


క.

కాయలు రాల్చిన మావిడి
సోయగమున నిట్లు మిత్రశూన్యం బగుచున్
దూయనితద్భూజముఁ గని
హాయనుచున్ గుండె పగిలి యతివిహ్వలుఁడై.

258


మ.

పిలుచుం జుట్టుల బంటులన్ సుభటులన్ బేర్గ్రుచ్చి యందంద లోఁ
గలుఁగుం దూరు విధాత నన్నుఁ గరుణం గావంగ రావే సురా
చలకోదండ! యటంచు మ్రొక్కుఁబొరలున్ సర్వంసహన్ గన్నుఁగో
నల నశ్రుల్ జడిచూప బిట్టొరలు గంధర్వేశ్వరుం డెంతయున్.

259

ఉ.

మోచితి నుగ్రశాపభరమున్ శతదివ్యసమంబు లన్నియున్
జూచితి నష్టభోగములు చూచినవారలు నవ్వ నుద్భట
శ్రీచరణాంగధూమములు చెందుట గానమి యీనునంతకున్
గాచి వృకాలి కిచ్చిన ప్రకారము దోఁచె మదీయసిద్ధికిన్.

260


క.

తనుతలఁచిన యత్నంబులు
సమకూరుచు నుండు నెపుడు సత్కర్ములకున్
దమతలఁచిన యత్నంబులు
సమకూరవు దుష్టకర్మసంఛన్నులకున్.

261


క.

నమ్మితి శంకరు వాక్యము
నెమ్మనమునఁ బడ్డపాటు నిష్ఫలమయి నా
కుమ్మలికంబు ఘటించెఁ బ్రి
యమ్మగునే నన్ను నేఁప నబ్జజ! నీకున్.

262


వ.

అని యనేకప్రకారంబుల వితథమనోరథుండై చిత్రరథుం డాక్రందనంబు సేయ నయ్యర్ధరాత్రంబునందు గురువియోగవ్యధాదోదూయమానమానసుండై యుమ్మలింపుచుఁ గ్రమ్మువేదనల నపగతనిద్రుండగు ముంజభోజనరేంద్రుం డయ్యాకోశం బాకర్ణించి సంచలించి యిది యేమిపరిదేవనంబొక్కొ? ఇప్పితృవనభూమినుండి యుడుగక విడువనివేలంబై యతివేలం బగుచు సముద్రఘోషంబునం బోలె భీషణం బగుచు వీతెంచుచున్నయది. దీని నరయుదముగాక యని కాలభైరవంబగు కరాళకరవాలంబు కేలం గీలించి శైలశృంగంబు డిగ్గుసింగంపుఁగొదమయం బోలె హర్మ్యంబు డిగ్గనుఱికి పిఱికిదనంబు వోఁదఱిమి తత్కృపాణప్రభాపటలంబులం దమస్సముదయంబు విరియింపుచు నొక్కరుండ యుక్కుదళు కొత్త నిర్ణిద్రవేగంబున రుద్రభూమి డాయంజని తద్రోదనంబునకు నాదికారణంబగు నిశాచరు నుదారప్రభా

వాతిశయంబునం జేసి కనుంగొనఁ జాలి యతని నుద్దేశించి యిట్లనియె.

263


ఉ.

ఎవ్వఁడ వీవు ధైర్యమఱి యేడ్చెద విచ్చడ నెద్ది కారణం
బెవ్వఁడు నిన్ను నిష్కృపత నింట్రము చేసెను నేఁటిదాఁక నే
నెవ్వని నిట్లు దుర్దశల కిక్కగఁ గన్గొనఁ జెప్పుమన్న వాఁ
డవ్విభుతోడ నిట్లనియె నల్లన గద్గదకంఠనాళుఁడై.

264


క.

ఏమని చెప్పుదుఁ జెప్పిన
నేమి యొనర్పంగఁజాలు దీవిధి భువన
స్వామి యగునట్టి యీశ్వరు
చే మును నియమింపఁబడియెఁ జిరపుణ్యనిధీ.

265


క.

ఏ పుణ్యసాధ్వికడుపున
నో పురుషవతంస పుట్టువొందితి నాహృ
త్తాపంబు పాలె నీపలు
కాపాదితనవసుధారసావిష్కృతియై.

266


చ.

అనఘపచార! నాదుతెఱఁ గంతయుఁ జెప్పెద నీదు పేరు పెం
పును వివరింపు నా కనుడు భూవరుఁ డిట్లను ముంజభోజుఁ డన్
జనపతి నేను విశ్వబుధసంఘనుతంబగు నిప్పురంబు నా
యునికి దగన్ మదీయగురుఁ డుద్భటుఁ డారయ భూతపుంగవా.

267


వ.

ఏను గురువియోగంబునం జేసి గాసిల్లి విసుగుచు నిర్ణిద్రదుఃఖంబున నిద్రలేక యేకతంబ యొక్క హర్మస్థలంబున మేను వైచియుండు నవసరంబున నీ యాక్రందనం బమందం బగుచు వినంబడిన దీని నరయుదముగాక యని సరయంబుగా వచ్చితిఁ బొచ్చెంబుగాదు నీ తెఱం గెఱింగింపు మనుడు నయ్యంబరచరుండు హర్షాడంబ

రంబులు మనంబునం బెనగొనం ససంభ్రమంబుగాఁ బఱతెంచి కృతవందనుండై భూపురంధరున కిట్లనియె.

268


క.

జనవర! మును హరువలనన్
వినియుండుదు నీప్రశస్తి వినుటకు ఫలమై
కనుఁగనకుం దోఁచితి విఁకఁ
గనుఁగొంటిని శాపమోక్షకల్యాణంబున్.

269


సీ.

వినవయ్య! భూప నావృత్తాంతమెల్ల గం
       ధర్వనాథుండఁ జిత్రరథుఁ డనంగఁ
బరగినవాఁడ ము న్బరమేశ్వరున కొక్క
       నెపమున ద్రోహినై కుపితుఁడైన
యద్దేవుకినుకఁ జయ్యనఁ బిశాచాకృతిఁ
       జేరితి నాతోడివారు నేను
జేరి తత్కృపకల్మి శ్రీయుద్భటారాధ్య
       గురు తనుధూమంబు వొరయునాఁడె


గీ.

శాపమోక్షంబు గాంచునిశ్చయము వడసి
యావటంబున నుండితి నిన్నినాళ్లు
కర్మమునఁ జేసి యివుడు వర్గంబువారు
ముక్తులయి చన నా కిట్లు మోసమయ్యె.

270


ఉ.

ఆ గురుసార్వభౌమునకుఁ బ్రాణముప్రాణమ వైన నిన్ను హృ
ద్రాగముతోడఁ గంటి వసుధావర! నెవ్వగలెల్లఁ బాసె నీ
వేగతినైన నాకయిన యీదురవస్థఁ దొలంగఁజేయు గు
ర్వాగమదర్శితంబయిన యార్తజనావనవైభవంబునం.

271


మ.

మదనధ్యంసి మనంబునం బొడమి సామర్థ్యంబుచే సాధు స
మ్మదలక్ష్మిం బొదలించి విశ్వజనతామాన్యస్థితిన్ మించి దు

ర్మదవాదిద్విపసింహమైన భవదారాధ్యుండు నాకై న తు
చ్ఛదశం దీర్ప కుపేక్షఁ జేసె నకటా! సర్వజ్ఞుఁ డై యుండియున్.

272


గీ.

ఆది నుద్భటమూర్తి కామారిచేత
నేను మొదలైన ఖచరులనెల్ల శాప
ముక్తులుగఁ జేయుదని తల మోచి వచ్చి
న న్నుపేక్షించె నేఁడిట్టు నరవరేణ్య.

273


చ.

ఎఱుఁగనివాఁడు గాఁడు నిఖలేంగితవేది భవద్గురుండు తా
మఱచెనొ కాక యేను వటమందిరసీమఁ దొలంగి దిక్కులన్
గుఱిచి బుభుక్షకై చనుట కొంత దలంపక వేగిరించి యే
డ్తెఱ శివునందు నయ్యె జగతీవర! యేమనవచ్చు నాయెడన్.

274


చ.

కలుషవిదూర! యేనొకటిఁ గంటి మనంబున మత్ప్రచారమున్
దెలియనివాఁడు గాఁడు భవదీయగురుండు మదీయదుర్దశా
కలనఁ దొలంగఁజేయగలకార్యము నీతల మోప నుండి కీ
ర్తులఁ బొదలించుపొంటె ననుఁ బ్రోవగ మానె విముక్తిలబ్ధిచేన్.

275


సీ.

శరణాగతత్రాణసంరక్షణంబుచే
       వచ్చు పుణ్యంబు కైవసము సేయు
దుఃఖాతురత్వంబు దొడకిన నోనాడఁ
       డామాటఁజేయు దృఢప్రతిజ్ఞుఁ
డగుటకు సకలభూతాళి ప్రభూతహ
       రంబున నచ్చెరుపడుచునుండఁ
బ్రబ్బిన పేరబ్బురంబున మజ్జారె!
       బళిబళి యనుగడుపారవేగఁ

గీ.

గిన్నరులు పన్నగులు సిద్ధఖేచరులును
బోల విద్యాధరులు గూడి పొగడుపలుకు
లురుతరంబయ్యు దిక్కులు నొరసి మించి
చూచుజనులకు నానందశోభ చెంద.

276


వ.

ఇట్లు మంథానమహీధరమధ్యమానసుధాపయోధిధ్వానంబు విడంబింప నమ్మహీమహేంద్రుండు గంధర్వరక్షణార్థంబై ప్రాణబంధంబుతోడ నవంధ్యసంధాధురంధరత్వంబు సంబంధింపఁజేసి గురుచరణస్మరణపారీణుండై కరాళకరవాలంబుఁ గేలఁ గీలించి శశాంగశేఖరుం గుఱించి.

277


శా.

ఓకందర్పవిరోధి! యో పురహరా! యోహస్తిచర్మాంబరా!
యో కాంతాశ్రితదేహ! యోశశిధరా! యోపద్మగర్భార్చితా!
యోకద్రూసుతహార! యోహరిహరా! యో మేరుబాణాసనా!
ఆకర్ణింపుము నాదువిన్నపము దేవా! వామదేవా! శివా!

278


సీ.

కారణంబులు నీవ కార్యజాలము నీవ
       భావజ్ఞుఁడవు నీవ భావ మీవ
జనకుండవును నీవ జన్యవస్తువు నీవ
       ప్రావకుండవు నీవ ప్రాప్య మీవ
ఆధారమును నీవ యాధేయమును నీవ
       భోక్తవ్యమును నీవ భోక్త వీవ
రక్షకుండపు నీవ రక్షణీయము నీవ
       హార్యంబు నీవ సంహర్త వీవ


గీ.

పూజకుఁడ వీవ పూజ్యంపుఁబొడవు నీవ
వాచకుఁడ వీవ తలపోయ వాచ్య మీవ
జ్ఞానమును నీవ చూడంగ జ్ఞాని వీవ
నిటలలోచన! సకలంబు నీవ నీవ.

279

మ.

వదనాంభోజము లోచనత్రితయభాస్వల్లీలతోఁ గూడఁ బ
ద్మదళాక్షీమణి యోర్తు మేనఁ దిరమై మత్తిల్లగఁన్ రూపసం
పద సొంపొందియు రూపదూరపరతన్ భాసిల్లుచున్నట్టి ని
న్నిదమిత్థంబని ప్రస్తుతించ వశమే! యీశాన! యెవ్వారికిన్.

280


సీ.

నీయంద పొడముచు నీయంద పొదలుచు
       నీయంద విలయించు నిఖిలజగము
సకలచరాచరాసక్తుండ వగు దీవు
       రత్నంబులోని సూత్రమునుబోలె
రజ్జువునందు సర్పభ్రాంతి పొడకట్టు
       కైవడిఁ బ్రకృతి నీవై వసించు
ననవద్య మచ్యుత మాద్య మాద్యంతవి
       రహితమై వెలుగొందు మహిమ వీవ


గీ.

విష్ణుఁ డన రుద్రుఁ డనఁగ వాగ్విభుఁ డనంగఁ
దగిన నామాంతరంబులు దాల్చి నీవు
భ్రమము సమకూర్తు వెఱుఁగని ప్రాకృతులకు
నీ మహత్త్వంబు చిత్రంబు నీలకంఠ!

281


చ.

పనివడి మున్ను ఖేచరులపాటులు మాన్పఁ గుఱించి ఠేవతోఁ
గనుఁగొనినాఁడ వుద్భటు జగన్నుతమూర్తి యతండు పూనుని
ప్పని గొద యయ్యెనేని పురభంజన యేమియనంగవచ్చు నీ
యనుపమసత్ప్రభావ మకటా! వికటాచరణంబు చూపదే?

282


మ.

అనుచున్ ఖేచరరక్షణార్థ మతిధైర్యస్ఫూర్తి చేపట్టి ప
ట్టిన తెంపున్ విడకున్న రాజునకుఁ గంఠేకాలుఁ డిష్టంబు నీ
ననుకూలస్థితితోడ రాఁ దొడఁగెఁ దారాగంబుపైనుండి గొ
బ్బున నుక్షాధిపవల్గనైకవిచలన్భోగీంద్రహారాళియై.

283

మ.

నవరత్నద్యుతిపుంజిపింజరితనానాదిగ్వితానంబు సి
ద్ధవధూగానవిశేషగుంభితముఁ బ్రోద్యత్కింకిణీకారవం
బు విచిత్రాంశుకకేతనంబు నగుచున్ బొల్పొందుసుస్నిగ్ధహే
మవిమానంబున వచ్చె సుద్భటుఁడు కామద్వేషిపార్శ్వంబునన్!

284


మ.

హరు వెంటం జనుదెంచి రత్తఱి విమానారూఢులై సిద్ధకి
న్నరగంధర్వసుపర్వచారణమహానాగాధినాథుల్ మనో
హరచామీకరభూషణప్రతతితో నాలోలహారాళితో
నురుకాశ్మీరరసాంగహారములతో నుద్దామహర్షంబుతోన్.

285


వ.

వెండియు నక్కాండంబునం దక్కినయక్షరక్షఃకులవరేణ్యులు ననూనతపస్సారశరణ్యులగు కుంభనిశుంభకుంభోదరనందికేశ్వరభృంగిరిటిప్రభృతిసారిషదపుంగవులును నింద్రాణ్యాదిమాతృకలును నింద్రాదిదిక్పాలకులును వామదేవాదితత్త్వజ్ఞులును గరుడాద్యండజమండలేశ్వరులును బ్రహ్మాదిప్రధానదైవతంబులును నద్దేవతాసార్వభౌముపిఱుంద సమందానందకందళితహృదయారవిందులై చనుదేర సరభసకరాస్ఫాలితభూరిభేరీగభీరభాంకారంబులును రంభాదిత్రిదశపురంధ్రీమంధరకళ్యాణగానకళాకోలాహలంబును నమరతరుపరిగళితసుమనస్సముదయసంభూతసాంద్రమధురసాస్వాదమదాంధపుష్పంధయఝంకారంబులును దుంబురునారదప్రముఖముఖనిర్గతనిరర్గళజయజయశబ్దసౌష్ఠవంబులును దిక్కులం బిక్కటిల్ల మహోత్సాహంబునం బ్రత్యక్షంబైన యుక్షవాహునకుం బ్రదక్షిణప్రణామంబు లక్షీణభక్తి నొనర్చి ధరాధ్యక్షుండు కరకమలపుటఘటనాపాటవంబు నిటలంబు నలంకరింప నంకురితపులకాంకురుండై యుదారస్వరంబున నిట్లనియె.

286

రగడ.

శ్రీకంధర! గంధేభముఖజనక!
శీతాంశుకళాశోభిజటాభర!
కాకోదరవల్లభహారలతా
కలిత! సుధీజనపద్మదివాకర!
నిటలచటులశిఖినేత్రమహోల్కా
నిర్ధూతాంతక! నమదాఖండల
పటుకరుణారసభరితకటాక్షని
పాతకృతార్తీకృతబుధమండల!
శ్రీమత్కైలాసమహీధరవర!
శిఖరస్థలవిహరణపారాయణ!
చామీకరభూమిధరబాణాసన!
శిలీముఖనారాయణ!
త్రిపురపురంధ్రీజనఫాలాంచల
తిలకమృగమదహరణశరచ్ఛట!
కపటద్వివరాడ్డ్విపికులాధిప!
కర్కశచర్మపటీవృతకటితట!
హృతభవపాశ! మహామునిసేవా
హేవాకసమంచితపదనీరజ
కృత! దురహంకృతిదశాధ్వరదశ
గీర్వాణశ్రీఘటపాటనపటు
భుజగీకృతయువతి మహాసీమంతసరణి
సురుచిరసీమాధ్వన్యలసద్గుణ!
చటులహిమాచలజామాతృత్వవ
శంవదబుద్ధిసమూర్జితసుక్షణ

మిసమిసమను బలువిసము సెకలకును
మెసవఁ గైకొనఁ గుత్తుక ధరియించితి
నొసల నెగఁగుశిఖియసమున మసురుమ
నోభవు మెత్తనిమే నిరియించితి
బలవగు పరశువు పరుషముఖంబునఁ
బరశుమహాసురవరు విదళించితి
జలధరపటలను చెలువము గిరికొను
సామజపతిదర్పం బెడలించితి
పార మెఱుంగక కవిసినమృత్యువు
పాల నలుగుచుఁ గపాలము సించితి
వారిమగంటిమి నెదురుజలంధరు
వాలుఁగొని కడిమి యుడుగక త్రుంచితి
వారినిధులు సరి నేకార్ణవమై
వోడియచూపిన వటమైతివి భళి
దారువిపినమునిచపలాక్షులచి
త్తములు గలంచుట కావట మైతివి
హరివాణీరమణులు నిన్నరయ న
హంకారము చూపిన మిన్నందితి
అరుణజటామండలమధ్యమున సు
రాపగ నెలకొనఁ గడుఁ జెన్నొందితి
బహుకాలము తప మొనరించిన ధన
పతి చెలికారము నుపకృతి చేసితి
మిహిపదమగు సొబగున గినిసినక్రతు
మృగమును బలుదెగకొని వడనేసితి
యాఱుమొగంబులఁ గనుపట్టిన విజ

యాధికునిఁ గుమారకుఁగాఁ గాంచితి
వాఱుదళంబుల మంత్రకుసుమమున
నలిరాజము క్రియ లలిఁ గ్రీడించితి
వొడనం బెన్నకుఁగాఁ దత్కాంతప
యోధరమున నోహోయని పలికితి
నడుఁబ్రియమున బాణాసురుమోసలఁ
గాచుటకును నిరవధికృప చిలికితి
బలువిలు గొని నిబ్బరముగ మోఁదిన
బలమర్ధననందనుఁ జేపట్టితి
దళదళమను ముమ్ములుకుల మెఱుఁగులు
దట్టపఱుచుశూలము చేపట్టితి
నవముక్తాఫలవర్ణంబున గగ
నము మోచిన నందెన బల్లించితి
అవితథమై సర్వధూరావంబగు
నయ్యీశ్వరశబ్దముఁ జెల్లించితి
సకలచరాచరసృష్టిస్థితిలయ
సంధానము నీపాలిదయై తను
నకలంక మమేయ మనుత్తమమగు
నాపరతత్త్వవిభూతియు నీదగు
నిను నింతంతని గురుతింపఁగ నా
నీరజభవముఖ్యులు నేర రనఁగ
ఘనభవపాశనిబద్దులు మాదృ
గ్జను లర్హింతురె నీమహిమఁ గనఁగ
భక్తజనావన పరతంత్రత చే
పట్టుము నన్ను గుణత్రయభాస్వర!
భక్తిముక్తిఫలదాయక శంకర!
భూతేశ్వర! యైశ్వర్యవికస్వర!

287

క.

ఈ చందంబునఁ బొగడు మ
హీచక్రాధీశుమీఁద నీశ్వరుఁడు కృపా
గోచరకటాక్షపాత
ప్రాచుర్యం బొదవఁ బలుకు బలుమృదుఫణితిన్.

288


క.

మెచ్చితి నిను ముమ్మాటికి
నిచ్చెద వర మెద్దియైన నీ వడుగుము శ్రీ
మచ్చరిత యనుఁడు భూవరుఁ
డచ్చంద్రకిరీటుఁ బలుకఁ బ్రాంజలి యగుచున్.

289


చ.

కరుణ యొకింత చిత్తమునఁ గల్గినమేటివి నీవు పార్వతీ
శ్వర! తరుణేందుశేఖర! దివస్పతిముఖ్యనిలింపమౌళి ని
ర్జరతరుపుష్పనిర్గతపరాగవిరాజితపాదపద్మ! ఖే
చరవిభు నీతనిన్ మనుపు శాపము వాయ ననుగ్రహింపవే.

290


క.

నీయందు నుద్భవించిన
యాయుద్భటగురుని పూన్కి యీడేర్చుటకై
శ్రీయుతుఁ జేయు మితని వా
లాయమ్ముగఁ దరుణహరిణలాంఛనమకుటా!

291


మ.

అనుచున్ వేదశిఖావతంసమగు నయ్యదీంద్రజాజానిప
ద్వనజాతద్వితయంబుపై నృపుఁడు గంధర్వేశ్వరుం బెట్టి భో
రున దండాకృతి దోఁప శంభుఁడును గారుణ్యంబుతో లెమ్ము లె
మ్మని తత్ఖేచరుమాళిఁ జేర్చి వరదానాస్రస్తమున్ హస్తమున్.

292


ఉ.

ఆ నిఖలాధినాథుశుభహస్తము మస్తము మోచినంతఁ దే
జోనిధియై మణిమయవిశుద్ధసువర్ణకిరీటహారియై
మానితహారగుచ్ఛరుచిమండలమండితుఁడై వియచ్చరుం
డానినవేడ్కతోడఁ బ్రమథాకృతిఁ దాల్చె విచిత్రసంపదన్.

293

గీ.

రాజగురుభక్తికిని భక్తరాజిపాల
శంకరుఁడు గోరిగంది వశంవదాత్ముఁ
డగుటను సర్వభూతంబు లౌర యనుచు
నద్భుతావేశ మొదవంగ నభినుతించె.

294


సీ.

అంతట నిఖలజ్ఞుఁ డగువిరూపాక్షుఁ డ
        త్యనుపమభక్తిసమగ్రుఁ డైన
క్షితిపతి గురుభక్తికిని జిత్తశుద్ధికి
        సూనృతపాలనస్ఫురణ కార్త
రక్షణశక్తికిఁ బ్రమదితస్వాంతుఁడై
        పలుకు నవ్విభు మహీపాలచంద్ర
వినుము నీయనవద్యవృత్తంబునకు మోద
        మందితిఁ బటుశక్తి నుర్వి నింకఁ


గీ.

కొన్ని సమములు పాలించి కూర్మి నెంచి
దిశల నిర్మలసత్కీర్తిఁ దెలివి నించి
నాదుసాలోక్యలక్ష్మి పొందంగఁగలవు
పొమ్ము మది సంశయము మాని పురమునకును.

295


వ.

అనునవసరంబున హర్దోత్కర్షంబున నద్భుతప్రాభవుండగు నుద్భటుం డనుకంపాసంపదభిరామస్వాంతుండై కృతవందనుండగు నమ్మహీకాంతు నహీనాశీర్వాదంబుల నాదరించె తక్కిన సురకిన్నరగరుడోరగాదులు నాదరంబున నతనిం బ్రశంసించిరి చిత్రరథుండును వసుంధరాకళత్రు నగ్గింపుచుఁ గుంభనిశుంభప్రభృతులగు ప్రమథులం గూడి నర్తించె, నంతకాంతకుండు నంతర్ధానంబు సేసె నిట్లు చరితార్థుఁడగు ముంజభోజుండు నిజనగరంబుఁ బ్రవేశించె నంత.

296

ఉ.

నీతియుఁ బెంపు సొంపు నతినిర్మలకీర్తియుఁ దేజమున్ మహా
ఖ్యాతియు వృద్ధిఁబొంద జతురంబుధివేష్టితభూస్థలంబు నే
కాతపవారణంబుగఁ బ్రియంబున నేలుచునుండె వైభవో
పేతుఁడు ముంజభోజుఁడు మహేంద్రుఁడు నాకముఁ బ్రోచుకైవడిన్.

297


వ.

అనవుడు నమ్మర్షులు హర్షంబున నారోమహర్షణి కిట్లనిరి.

298


ఉ.

అంచితపుణ్య! లక్ష్మి కిరవై తగునుద్భటమూర్తి నిత్యని
ర్వంచితభద్రకీర్తి నఘవారణ! వింటిమి ముక్తికామినీ
చంచలదృగ్విలాసముల సౌఖ్యము గంటిమి పూర్ణశేముషీ
కాంచనగర్భ! నీవలన గాఢతరాఘతమంబుఁ ద్రోచుచున్.

299


వ.

ము న్నుద్భటారాధ్యులకు సంతానంబు గలదని తన్నిర్యాణకాలంబునం గొంత వివరించితి. నమ్మహావంశంబు వర్థిల్లుతెఱం గెఱింగించి మమ్ముఁ గృతార్థులం జేయవే యనుడు నతం డమ్మహర్షుల కిట్లనియె.

300


మ.

వినుఁడీ మామకదేశికోత్తముఁడు సద్విద్యావిమర్శాత్మకుం
డనఘుం డాఢ్యుఁడు సర్వశాస్త్రవిదుఁ డౌవ్యాసుండు నానందముం
దనరన్ నన్నుఁ గృతార్థుఁ జేయఁగను నిత్యం బీశ్వరధ్యానపూ
జనముం దత్సుతభక్తబాంధవకథాసద్గోష్ఠి బంధించినన్.

301


మ.

పరమానందరసాబ్ధిఁ దేలి కరుణాపారీణ నా కిష్టమౌ
హరుభక్తావనుసత్కథాశ్రవణ మాజ్ఞాపించి జన్మాంబుధిన్
దరణంబొందఁగఁ జేయవే యనిన నాధన్యుండు నేతత్కథన్
వరదుండై వినఁ బల్కె ము న్నటుల నే వర్ణింతు మీ కిప్పుడున్.

302


శా.

ఆ గంధర్వులశాపకారణముచే నార్యాకళత్రుండు త
త్త్యాగంబున్ వరమిచ్చి వారికిని నాత్మాబ్జోద్భవుం గూర్చి తా
రాగంబందునఁ బర్కె నుద్భట త్రిలోకారాధ్య! నీ విప్పు డు
ద్వేగం బొప్పఁగ మర్త్యదేశికగుణావిష్టుండ వౌ టొప్పగున్.

303

ఉ.

భూనుతమైనకాశి యనుపుణ్యమహానగరంబునందునన్
నేనును విశ్వనాధుఁ డన నిల్చితి మద్ధృదయాబ్బకర్ణికన్
మానుషరూపివై విబుధమానవకోటులు విస్తృతాత్ములై
నీ నిజదివ్యదీప్తిఁ గని నివ్వెరగందుచు నుందు రందఱున్.

304


వ.

అట్లు గావున.

305


శా.

మాయంశంబున నుద్భవించి చతురామ్నాయాగమార్థాంతర
స్థాయి ప్రస్ఫుటవీరశైవవిధిసిద్ధాంతంబు నల్దిక్కులన్
న్యాయం బొప్పఁగఁ జేసి మానవహృదానందంబుగా శిష్యులు
ఛ్ఛ్రాయంబొందఁ గటాక్షదీక్షలను సంరక్షించు భద్రాత్మకా!

306


శా.

నీవంశం బభివృద్ధి బొందు జగతి న్నీరేజసంతాన స
ద్భావం బొప్ప ననేకు లార్యు లతులప్రఖ్యాతకీర్తు ల్మహా
శైవస్థాపితవేదశాస్త్రవిదులై శాసింతు రారాధ్యతన్
ఠీవిన్ లోకములందు నాదుకృప రెట్టింపంగ వా రందఱున్.

307


క.

కావున మదాజ్ఞఁ గైకొని
భావింప నయోనిజననపద్ధతి దెలుపన్
గావింపుము గంధర్వులఁ
బ్రోవఁగ శైవాగ్నిధూమమును నైక్యమునన్.

308


గీ.

అనిన నౌఁగాకయని శివు నాజ్ఞ [జేసి
నా]కు సాహాయ్యుఁడవు కమ్ము నన్నియెడల
ననిన నట్లని వర మీయ నంత విశ్వ
నాథు ఘర్మజలంబున నవతరించె.

309


ఉ.

అంతట వేదవేదు లగునార్యు లురస్థితలింగపేటికా
భ్యంతరహేమసూత్రఘటనం[చన]భితబ్రహ్మతేజమున్
కంతుశతాంగసౌష్టవము గర్భగృహస్థితదివ్యరూపమున్
నింతగఁ జూచి చూచి మది విస్మయ మొందుచుఁ జిత్రరూపులై.

310

క.

ఈ మహిమ యెట్టిదో మన
కామితము గూర్చఁ దలఁచి కాశీపతి దాఁ
బ్రేమన్ బ్రత్యక్షంబై
పామరులను బ్రోవఁ గురుని భావముఁ దాల్చెన్.

311


మ.

అనుచున్ మౌనముతోడ విశ్వపతి నాత్మాబ్జంబునం జేర్చి నం
తనఁ గన్మోడ్పు ఘటిల్లె [వారలకు నా ధ్యానంబు మై]తోఁచ ని
ట్లనియెన్ మామకహంశు నుద్భటు సమాఖ్యారాధ్యశబ్దంబు చూ
చిన తద్బ్రహ్మముఖోద్భవోత్తమముచే విఖ్యాతిఁ జెందెన్ భువిన్.

312


ఉ.

శంక యొకింత లేక ద్విజసంఘము లెల్లెడఁ గూడి పాపముల్
నింక షడక్షరీమనుపు నీమముతో నుపదేశ మొంది ప
త్పంకజపూజలన్ దనిపి పావనమై తగుకన్యకాదిభ
వ్యంకరదానముల్ ఒసఁగి వర్ధిలుఁ డీగురుమూర్తి దీవనన్.

313


క.

అని కాశీవిశ్వేశ్వరుఁ
డనుపమమృదుమధురఫణితి నాడిన మోదం
బున మేలు కాంచి యుద్భటుఁ
గని తచ్చరణముల వ్రాలి కాంక్ష నుతించిర్.

314


శా.

ఆ వార్తల్ విని రాజమంత్రిసచివవ్యాపారముఖ్యుల్ ప్రభుల్
శైవోద్ధారునిఁ గోటిమన్మధసమశ్రావ్యాంగునిన్ ఉద్భటున్
సేవిం చీశ్వరమంత్రదీక్షల శుభశ్రీ లొంది గ్రామాలయ
ప్రావీణ్యంబగు దాసముల్ ఒసఁగ నారాధ్యప్రభన్ వర్ధిలెన్.

315


ఉ.

ఉత్తరశైవదీక్షల గురూత్తముఁ డుద్భటుఁ డీద్విజాళియం
దుత్తము లిష్టలింగు లని సూక్తులు చెప్పియు లింగధారణల్
కుత్తుకలందుఁ గొందఱకుఁ గూర్పఁగ రాజులు మంత్రివర్గముల్
చిత్తములుం జిగుర్పఁగను శిష్యులునై గురుపూజ చేయఁగాన్.

316

చ.

గురుచరలింగపూజ లొనగూర్పఁగ నుద్భటు కంతఁ గంతు సం
హరుఁడు ప్రసన్నరూపమున నన్నియుఁ దానయి నిత్యనీమముల్
జరుపఁగ వచ్చి తత్క్రమము సాంగముగా నొనరింపఁ జేసి యీ
కరణి నద్రుశ్యుఁడై మెలఁగఁగా మహిమాన్వితుఁడయ్యె నుర్వరన్.

317


గీ.

తద్భుధులలో సుబుద్ధి యన్ ధరణిసురుఁడు
సుగుణమణిగుణసౌభాగ్య సుందరి యను
పేరుగలిగిన కూతుఁరఁ పెండ్లి చేసె
నుద్భటారాధ్యునకు నీశ్వరుండు దెలుప.

318


వ.

అట్లు గావున.

319


శా.

శ్రీకంఠాపరమూర్తి దుర్మతలతాశ్రేణీలవిత్రంబు సు
శ్లోకున్ సంతతతత్త్వదర్శనపరున్ శుద్ధాత్ము నాచార్యచూ
డాకల్పంబు వినమ్రకల్పకము వేదాంతార్థనేతృత్వల
క్ష్మీకంజాగను సాంద్రభక్తిఁ గొలుతున్ శ్రీయుద్భటారాధ్యులన్.

320


మ.

జనియించెన్ హరుమానసంబునఁ బిశాచత్వంబు మాన్పించి ది
వ్యనికాయంబుల శంభుమూర్తి గనఁ జేయంజాలెఁ గైలాసశై
లనివాసంబునఁ గట్టఁ బట్టము బుధశ్లాఘార్హత న్మీఁదటన్
జననప్రాభవపుణ్యముక్తి కతని శ్శక్యంబె వర్ణింపఁగాన్.

321


సీ.

వరశమాకరలబ్ధవర్ణపుంగవులచే
        బోలె విజ్ఞానవిస్ఫూర్తిఁ గాంచి
దృఢసత్ప్రభావనత్తీర్థోదకములచేఁ
        బోలెఁ బావనవృత్తిఁ బొందఁజాలి
శారదారంభవిస్మేరేందురుచులచేఁ
        బోలె నాహ్లాదంబు చాలఁ దాల్చి
చారుప్రభాసాంద్రజాతిరత్నములచేఁ
        బోలె నలంక్రియాశ్రీల మెఱసి

గీ.

వరలు నిఖలజగంబు లెవ్వానివిమల
భద్రగుణములచే నట్టిభాగ్యశాలి
వివిధసేవకసంకల్పదివిజసురభి
యుద్భటస్వామి యద్భుతోద్యోగి వెలయు.

322


సీ.

అథ్వనీనులు చతురామ్నాయవీథికి
        కాందిశీకులు పరనిందగుఱిఁచి
భారవాహులు పు(ణ్య)పరిపాకకలనచే
        దూరదర్శులు తత్త్వసారదృష్టి
కర్మఠు లఖిలసత్కర్మకల్పన గూర్చి
        దానశౌండులు పెట్టఁదగినయెడల
జాగరూకులు శంభుసంపూజనాకేలి
        నైష్ఠికు లనవద్యనిష్ఠకలిమి


గీ.

సకలదేశికరాజన్యమకుటనూత్న
రత్నకోరకమై బుధారాధ్యుఁడైన
యుద్భటారాధ్యవంశపయోధిఁ బుట్టి
నట్టి గురుచంద్రు లఖలధర్మార్థవిదులు.

323


వ.

ఇ ట్లఖిలజగజ్జేగీయమానంబగు నమ్మహాభాగువంశం బతిశయసౌభాగ్యభాగ్యజనకంబై క్రమక్రమంబునఁ బక్షమానర్త్వయనసంవత్సరంబు లతిక్రమించి వివేకంబునకు నాకరంబును, విభవంబునకుఁ ప్రభవంబును, ధర్మంబునకుఁ గూర్మియు, భద్రంబులకు ముద్రయు, బుణ్యంబునకు శరణ్యంబు నై పినాకశరాననుశాసనంబున నాంగీరసబార్హస్పత్యభారద్వాజగోత్రంబునకుఁ బాత్రం బయ్యె నందు కల్లోలినీపల్లవికునందు హల్లకోల్లాసకరుండగు వేల్పు పొలుపున విశాలాక్షివల్లభుండు.......మల్లికార్జునగురుం డుదయించు నతండు.

324

మ.

ప్రణమద్భూపకిరీటకోటిఘటితద్రాఘిష్ఠరత్నచ్చటా
ఘృణికిమ్మిరితపాదపద్ముఁడు బుధక్షేమంగరుం డింద్ర మా
రణదంతాచలరంగరంగదురుసారస్ఫారసత్కీర్తి ని
[ర్గణితేశాగ]మతత్త్వపారగుఁడు శ్రీరమ్యుండు సౌమ్యుం డిలన్.

325


క.

ఆ మల్లికార్జునగురు
స్వామికిఁ బ్రోలయగురుండు జనియించి దిశా
సామజకర్ణపుటీతట
చామరలతికాయమానసాంద్రయశుండై.

326


సీ.

శాంకరీదేవికి షణ్ముఖుండునుబోలె
        నాప్రోలనార్యునర్ధాంగలక్ష్మి
యైనశాంకరికి స్వయంభువుగారు జ
        నించు భద్రాంబికానేత యగుచు
[నార్తలోకభయాపహర్తయై] శ్రీభవా
        నీభర్తయై మహాప్రాభవమున
గల్గు వారలకు శంకరదేశికస్వామి
        యావిర్భవించు నాయలఘుమతికి


గీ.

గౌరమాప్రాణనాథుడు కంబుయశుఁడు
సోమనాథయ్య యాయనసూనుఁ డొప్పు
లింగనారాధ్యుఁ డారాధ్యలేఖవిభుఁడు
మల్లికావల్లభుఁడు కీర్తిపల్లవుండు.

327


శా.

మానాధప్రవణాత్ముఁ డాత్మవిదుఁ డామ్నాయార్థసారైకపా
వనజిహ్వాంచలుఁ డంచితస్మృతికథాన్యాసుండు చార్వాకజై
ననదీవల్లభకుంభసంభవుఁడు జన్మంబొందు మన్మయ్యలిం
గనకున్ మల్లమకుం గుమారుఁడయి గంగాంబామనోభర్తయై.

328

చ.

పర్వతరాజధైర్యుఁ డఘపర్వతపర్వతవైరి సత్ప్రభా
పార్వణశర్వరీశ్వరుఁ డపారకృపావరతంత్రబుద్ధి సౌ
పర్వణధేనురత్నతరుభంగదదానగుణాఢ్యుఁ డుర్వరా
పార్వతియైన పార్వతికి భర్త దగు(న్) మలికార్జునుం డిలన్.

329


క.

ఆగమవిద్యాత్మిక యగు,
నాగమకు న్నాథుఁ డగుచు నానావిధస
ద్భోగమహేంద్రుఁడు పుట్టు సు
రాగమహాధైర్యుఁ డార్యుఁడై పతి దానున్.

330


క.

ఆదంపతులకు గలిగెడు
భూజనమందారశాఖి పురహరపూజా
భ్రాజిష్ణుఁడు పుణ్యఫల
శ్రీజన్మస్థలము చంద్రశేఖరుఁ డెలమిన్.

331


మ.

గంగామౌళిపదాబ్జభృంగము మరుత్కంజేక్షణావర్తులో
త్తుంగస్నిగ్ధపయోధరద్వయతటీదోర్మూలవాటీమచ
ర్చాంగీకారసమర్హకీర్తినిధి శైవారాధ్యముఖ్యుండు వే
దాంగార్ధాత్ముఁడు చంద్రశేఖరుఁడు భవ్యప్రాభవుం డుర్వరన్.

332


సీ.

కువలయోల్లాసంబుఁ గూర్పుట శశియయ్యు
        దోషాకరత్వంబు దొడుకఁ డెచట
విపులవాగ్వృత్తి దర్వీకరేశ్వరుఁ డయ్య
        జిహ్మసంచారంబు సేయఁ డెచట
కమలావివర్ధనోత్కంఠసూర్యుం డయ్యు
        రాజదూరస్థితిఁ గ్రాలఁ డెచట
దివ్యభోగస్ఫూర్తి దేవతావిభుఁ డయ్యు
        గోత్రవిభేదంబు (గూర్చఁ డెచట)

గీ.

[సర్వసాధకతన్] సురశాఖి యయ్యు
గొయ్యదనమున వర్తింపఁగోరఁ డెచట
నఖిలమంత్రరహస్యసిద్ధాంతవేది
చంద్రశేఖర గురురాజచక్రవర్తి.

333


శా.

సాధ్యస్త్రీజనగీతకీర్తి పరమైశ్వర్యాద్యవిద్వన్నికా
యధ్యేయోన్నతి చంద్రశేఖర[గురుం డామ్నాయపారీణులన్
సుధ్యాస్ఫోటిత జాహ్నవీసు(తు)ల గాంచున్ బుత్రులన్ మన్మనా
రాధ్యారాధ్యసమాఖ్యులన్ దినమణిప్రాలేయరుఙ్మిత్రులన్.

334


క.

ఇది యుద్భటదేశికమణి
సదభినుతాచారభావిసంతతిచందం
బొదవించు నీ [కథాగ్ర్యము
మదనవిరోధిదయ ని]ఖిలమంగళసిద్ధుల్.

335


క.

సారమతులట్ల కుజనులు
హారిశివస్తోత్రమునకు హర్షింప రకూ
పారములు(వోలె) నూతులు
కైరవహితురాకఁ బొంగఁగా నేర్చునొకో!

336


వ.

కావున మహా[శ్రద్ధాధురీణులు] మహేశ్వరాచారపారీణులు గావున నపరత్రిపురారియగు నుద్భటారాధ్యులచరితంబు వినుటకుఁ కాక్ష చేసితిరి. ఏను నా నేర్చుచందంబున నుపన్యసించితి. నిందునను గుణంబు పరిగ్రహించి [యానందించితిరి. “మీకు శుభం బగుగాక! లోకాస్సమస్తాన్సుఖినోభవం"] తని సూతుండు శౌనకాదులకు మేదురామోదంబు సంపాదితంబు చేసి వారిచేత సంభావితుండై యథేచ్ఛంబుగం జనియెనని.

337


క.

ఈకథఁ జదివిన వ్రాసిన
లోకులు భవబంధములకు లో[గక ప్రమథుల్

[జేకొన నీశాన]మహా
లోకంబున నుండఁగలరు లోకులు మెచ్చన్.

338


మ.

అనహంకారనిరంకుశప్రతిభ దివ్యస్త్రీల సద్వర్తుల
స్తనశుంభద్వయగంధసారనవముద్రాకల్పనానల్పశో
భనకీర్తిప్రియ విప్రపూజనపరా భా[స్వద్గిరా యాశ్రితా
వనభా]వా పితృవంశ శంభుపదసేవాసావధానాత్మకా!

339


క.

నటదనమ నేత్రజూటీ
తటతటినీచటుల నినదధరారజియో
ద్భటభేరీభాంకార
స్ఫుటఘటనాయాచకౌఘశోకత్రుటనా!

340


మ.

[సారవి]శాలసుధీమణిజాలవచస్తుతసాంద్రకృపా
హారిప్రతాపజితాంబుజబాంధవ, హారహిమోరసుధా[నవనీ]
హారమరాళమహారమణీయమహాస్ఫుటకీర్తిగృహా! కులని
స్తార[విపత్పరితప్తజనావళితా]రక నవ్యసుధానిధీ.

341


గద్యము
ఇది శ్రీమదేలేశ్వర గురువరేణ్య చరణారవింద షట్చరణసకలకళాభరణ
రామనార్యసుపుత్త్ర సుకవిజనమిత్ర కుమారభారతి
బిరుదాభిరామ రామలింగనామధేయప్రణీతం
బైన శ్రీమదుద్భటారాధ్యచరిత్రం బను
మహాప్రబంధంబునందు సర్వంబును
దృతీయాశ్వాసము
సంపూర్ణము
శ్రీ