ఉత్తరహరివంశము/షష్ఠాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

ఉత్తరహరివంశము

షష్ఠాశ్వాసము

శ్రీకలితయోగిహృన్నా
ళీకాంతర్నిజనివాస లేఖాధిపసం
ధ్యాకాలమూలజపన
స్వాకారోంకారరూప హరిహరనాథా!

1


వ.

దేవా వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె.

2


చ.

తెలతెల వేగునంత నరుదెంచి నభోమణివోలె నారదుం
డలరుమొగంబుతో సభ రయంబునఁ జొచ్చినఁ గంసవైరి య
క్కొలువున మించియు న్మనసు గుందగఁ బీఠము డిగ్గి యమ్మునిం
బలుకుల గోప్రదానమధుపర్కములం బరితృప్తుఁ జేసినన్.

3


చ.

అతఁడు సితాంబరావరణమైలమహామణిపీఠ మెక్కి య
చ్యుతు నిజసింహపీఠగతుఁ జూచి మురాంతక! యెంత చిన్న వో
మితి మది నెంత వంత గల దీ యదువీరుల నేల చాల ధీ
రతఁ దరలించి చిత్తముల రాఁజెద రన్న మురారి యిట్లనున్.

4


క.

మునినాథ చెప్పఁ జిట్టలు
మనయనిరుద్ధుండు నిన్న మగువలు గొలువం
దవయింట రాత్రి నెమ్మది
నునికి గలిగెఁ బిదప నున్న యునికిన యడఁగన్.

5

నారదుఁడు శ్రీకృష్ణున కనిరుద్ధుని వృత్తాంతము చెప్పుట

ఉ.

నావుడు నారదుండు యదునాయకవీరులఁ జూచి యద్భుతా
రావరణంబు చూచితిమి రాత్రి నిజం బనిరుధ్ధబాణాబా
డావలిచేత నాదితిసుతాత్మజకై చెలి చిత్రరేఖ సం
భావన నక్కుమారవరుఁ బట్టుట నయ్యుష వాని ముట్టుటన్.

6


క.

బలివాసవులును బోలెం
దలపడి రనిరుద్ధబాణదైత్యులు వేచే
తులవాఁడు రెండుచేతుల
చెలువునిచేఁ జిక్కి మాయ చేకొని భీతిన్.

7


చ.

తనచతురంగసేనలు శతంబులు వేలును గోట్లునున్ ధరం
బెనఁగొనఁ గూల్చె వీఁడు గడుబెట్టనుచుం బెనుఁబాము కట్టునన్
దనువు మునుంగఁ గట్టె విను దానవసూదన! యింతభంగ మే
మనుజుఁడు నోర్వఁడన్నఁ దరమా పరమాత్మజ యాభిలాషికిన్.

8


చ.

అని ముని చెప్పిన న్విని మురాంతకు డంతకుభంగి దైత్యుపై
గినిసి ప్రయాణవస్తువులు కింకరకోటికి నప్పగింపఁ బో
యిన నగి నారదుం డసుర యిచ్చటికిం ఐదునాల్గువేల యో
జనముల నున్నవాఁ డరుగఁజాలునె మానవలోకయానముల్.

9


క.

గరుడనిఁ దలఁపుము పగరం
బొరిగొని కీర్తియును విజయముం గొను మనుడున్
హరి నుబ్బిఁ జేసె మునిభూ
సురపుణ్యాహములతోన సుదతులసేనల్.

10


సీ.

తలఁచె నాగాంతకు దానవాంతకుఁ డంత
                 నతఁడును దోఁచెఁ గెంపారుమేనుఁ
[1]గుంతంబు లన నొప్పుగోళ్ళును భుజములు
                 రెండురెండులు రెండు రెండ్లు మెఱయ

నన్నివేదంబులు నాఱంగములతోడఁ
                 జదివి శ్రీవత్సాంకజలజనేత్ర
రుచి మీఱఁగా నూర్ధరోముఁడై సమధిక
                 కరశాఖుఁడై కెంపు గలుగుపాణి


తే.

తలము లమరంగ గౌరునిద్దపుటెలుంగు
దనర సింహాననుఁ డై తరణికోటి
దీప్తిసుముఖుఁడై యాజానుదీర్ఘబాహుఁ
డై తరుణసుకుమారుఁ డై హర్ష మెసఁగ.

11


వ.

తదనంతరంబ.

12


క.

భూతముల కాత్మ యాత్మకు
దూతంబులు దాన యగు విభుం డితఁ డనఁగా
నీతం దష్టవిభూతి
ఖ్యాతి వడసెఁ బ్రీతుఁ డగు ప్రజాపతిచేతన్.

13


గీ.

సాధ్యులకు దేవతలకుఁ బ్రజాపతులకు
శాశ్వతుఁ డితండ యన దివ్యసంయమీంద్ర
సూతమాగధవంధిసంస్తుతులు చెలఁగ
శ్రీవిభుం డాసువర్ణునిఁ జేర వచ్చె.

14


క.

దేవుఁడు సాత్యకిఁ గనుఁగొని
నావచ్చినయంతదాక నగరమునకు నీ
కావలిసు మ్మని సుతబల
దేవసహాయుఁ డయి వైనతేయుని నెక్కెన్.

15


క.

గెలువుము బాణుని వానికి
గలవారిని విజయలక్ష్మిఁ గయికొను టరుదే
కలన బదాఱు మొగంబుల
మలయుదు నీ వనుచుఁ జెలఁగె మాగధరవముల్.

16

గరుడని నెక్కి కృష్ణుండు బలభద్రప్రద్యుమ్నులతో దండయాత్ర వెడలుట

గీ.

ఆకసంబున వేంచేయుహరి సిద్ధ
సాధ్యచారణగంధర్వసంయమీంద్ర
వివిధసంస్తుతుల్ చెవుల పండువులు చేసె
జయజయారావములతోడ సకలదిశల.

17


తోదకవృత్తములు.

జయజయ మంగళసంగతరూపా!
జయజయ పావకసంభృతిరూపా!
జయజయ కల్పితసాగరతాపా!
జయజయ ఖండితంకరచాపా!

జయజయ మస్తకశస్తకలాపా!
జయజయ కౌస్తుభచారుకలాపా!
జయజయ కాళియసారదురూపా!
జయజయ కంసనృశంసహకోపా!

జయజయ ధౌతవిశంకటపాపా!
జయజయ మోహనిశామణిదీపా!
జయజయ పాదలసత్సరిదాపా!
జయజయ విక్రమశాసితభూపా !

18


చ.

జయజయ శంకచక్రధర శార్ఙ్గరగదాధర శ్రీధరాధరా!
జయజయ భక్తిభావితనిశాచరఖేచరచిత్తగోచరా!
జయజయ కిల్బిషాపనుద శాంతహృదాస్పదచిత్తసమ్మదా!
జయజయ భూతభావన ప్రజాకలితావన లోకపావనా!

19


మ.

జయ నారాయణ పుండరీకనయనా శార్ఙ్గీ జగన్నాయకా!
జయ పీతాంబర భక్తవత్సల విరించస్తోత్రపాత్రక్రియా!
జయ జంభారీవిరోధివిక్రమకథాశ్లాఘావిఘాతక్రమా!
జయ గోవింద ముకుంద మందరధరా శౌరీ మురారీ హరీ!

20

వ.

అని యివ్విధంబున దవ్వుదవ్వుల నివ్వటిల్లు దివ్యుల జయజయాశీర్వచనంబులు
దుర్వారసమరగర్వంబు నిర్వహింపం జేయ నజేయవిక్రమధురంధరుం డయిన
విశ్వంభరుండు.

21


క.

హరితేజము హరికాంతియు
హరివిభవము హరిభయంకరాకృతి హరివే
గిరము హరివిక్రమంబును
హరి యను పేరిటికి లక్ష్మి నాపాదింపన్.

22


చ.

గరుడనికాంతికిన్ హరి పొగడ్త యొనర్చు నిజప్రభాపరం
పర పరగించురూపము గృపానిధి గైకొని యొప్పె నప్పుడో
నరవరచంద్ర నాఁటి తనంబు మనంబున నాఁటి నేఁటికిన్
బొరిఁ బొరిఁ దృప్తి లేదు ననుఁబోటికి వేఱతలంపు లేటికిన్.

23


వ.

అట్లు దివ్యరూపధరుండై.

24


క.

విలు నమ్ము సంకుఁ జక్రముఁ
బలకయుఁ గౌక్షేయకంబుఁ బాశము గదయుం
గల యెనిమిదిచేతుల దాఁ
పల వలపలఁ దాల్చె శౌరి బాణునియనికై.

25


చ.

పడగలు వేయి చేసి బలభద్రునికిన్ హరి పాఁపలాగుతో
నొడలును వేయిరూపముల నొప్పఁగ నప్పుడు వైనతేయుపై
విడిసిన వేయిశృంగముల వెండినగంబును నంజనాద్రియం
దడఁబడఁజేసి రిద్దఱు నుదంచితభానుయుగంబుచాడ్పునన్.

26


శా.

ఉద్యద్విశ్రమకేళికిం గలన నుద్యోగించువాఁడైన యా
ప్రద్యుమ్నుండు సనత్కుమారతనుఁడై భాసిల్లె నమ్మువ్వురన్
మాద్యల్లీల ధరించి దాఁటెను గరుత్మంతుండు విద్యాధరీ
పద్యావిద్యుదనర్గళానిలదురాపస్వర్గమార్గంబునన్.

27


వ.

ఇట్లు పన్నగారి నగారినగరిపొరువు తెరువునం జనునప్పుడు చప్పుడుచే
ఱెక్కల మొక్కలంబుచే రేకులవీకులచే గగనగంగాభంగంబుల భంగంబులకు

నెలవు లవురవంబుల జవంబుల లవంబులం దెలుప నవ్వినతాతనయుండు తన
తమ్ముఁడగుటం దెలుప నిలుపరాక పరాకయిన యనూరుండు రెండురకంబుల
నురంబులావునం బగ్గంబు లగ్గలంబులుగాఁ గుదియింప నదియింప కవ్వెరపున
సరకుగొనక యణకలు వైచిన పచ్చమావులయొచ్చెమావల నీవలఁ గావలి నడచు
మాఠరుండు కఠోరవచనంబులాడినఁ బింగళుం డంగలార్చిన దండుండు దండించినం
జక్కంబడమిఁ దనయెడమిఁ దానడిమిఁ దడిమి నిజంబుగా రవి గారవించి
గోచరులగు ఖేచరుల నడిత్రోవం ద్రోవక ననువు చెల్లింపు నిలింపదంపతులనగవులు
చలింప నప్పులుఁగుఱేనిగఱులనెఱులలో జిక్కిన చుక్కలు లెక్కలు గడవం బొడ
వుననుండి పడి పొడవడంగి వడివడి జడివడం గడివోయినవీరుల నురలించుసుర
తరువులశాఖలరేఖ లెఱకలకుం గఱపన(త్తెఱపి)ప్పు డప్పతత్రిపత్రవైచిత్రి చూచి
వెఱవున మైమలుపునఁ బఱపనేరక యూరకయున్న యన్నభోగమనుల విమానం
బులు చిందఱవందఱ లయి ఘంటలు వెంటలు గొన రాలియుఁ బడగ లెడ గలుగఁ
బడలు వడియునుం దల్పంబులు శిల్పంబులం బాసియుం దలుపులు వెలుపలం గెడ
సియుఁ జెంచులయంచులమించులు మంచు లయ్యునం జెదర మఱియుఁ గాకోదర
విదారి యాకసం బెల్ల బెల్లగిల దిశలు దుర్దశంబులుగ నిర్జరులు జర్జరులుగా
మేఘంబులు మోఘంబులుగా గిన్నెరులు గన్నరులుగా భూతంబులు భీతంబులుగా
రయంబు గండరువును జయంబు బండరువునునై యరుగునట్టియెడ రేవతీరమణుండు
రుక్మిణీరమణునితో నిట్లనియె.

28


సీ.

బాలార్కబింబంబు పరఁగించి రేయెండ
                 మనమీఁదఁ జల్లిన మాయ లేదు
కౌంతంబు మెఱుఁగులు గుప్పించి మెఱుఁగులు
                 మనమీఁదఁ [2]జిలికిన మహిమ లేదు
హరజటామండలం బడరించి క్రొమ్మించు
                 మనమీఁదఁ జిమ్మిన మమత లేదు
కమలభవాండంబు గదలించి సలిలంబు
                 మనమీద ముంచిన మహిమ లేదు

ఆ.

పసుపునిగ్గు వోలెఁ బ్రద్యుమ్నునకు నాకు
నీకుఁ జాయ మేన నివ్వటిల్లెఁ
గనకభూధరంబుఁ గదిసినవారమో
కాక వేఱెతెఱఁగొ కమలనాభ!

29


చ.

అనుఁడు బ్రలంబవైరికి మురాంతకుఁ డిట్లను నిగ్గిరివ్రజం
బనునగరంబు గాచికొని యాహవనీయము మండుచుండు న
య్యనలముచాయఁ జూవె మన మందఱము న్వరవర్ణినీఘన
స్తనవరవర్ణినీద్యుతికిఁ దావల మైతిమి ప్రీతి మీఱఁగన్.

30


క.

నావుడు నీలాంబరుఁ డ
ద్దేవునితో దీని కెయ్యది యుపాయంబో
నీ వెఱుఁగుదేని వేగము
కావింపుము ప్రతివిధానకరణం బనినన్.

31


మ.

వినతానందనుఁ బ్రీతిఁ జూచి పలికె న్విశ్వంభరుం డిప్పు డీ
యనలం బార్పు మనంతరక్రియ నిరాయాసంబునం జేఁత నా
పని యన్నన్ గరుడండు రెండెఱకలన్ భాగీరథీవారిఁ గై
కొని యయ్యాహవనీయ మాఱ గురిసెం గోలాహలోత్పాదియై.

32


క.

నరనాథ! యపుడు నీలాం
బరుఁడును బీతాంబరుండుఁ బ్రద్యుమ్నుడు ము
వ్వురు మూఁడు జగంబులుఁ జా
లరె సాధింప నని నాతలంపునఁ దోఁచెన్.

33


వ.

తదనంతరంబ.

34


మ.

దహనం బాఱుడుఁ బక్షినాథుఁడు మహోత్సాహోత్థరంహస్తనూ
రుహుఁ డై సాగిన నాగిరివ్రజములో రుద్రాజ్ఞఁ దద్రాజధా
ని హితాపాదనులైన యయ్యనుచరాగ్నిశ్రేష్ఠు లొం డొండ దు
స్సహరోషావృతచిత్తులై దశదిశజాజ్వల్యమానాంగులై.

35


వ.

తమలోన.

36

ఉ.

ఎక్కడివారొకో గరుడుఁ డెక్కుడుగాఁ గలవారు వీరపో
యెక్కుడువారు లోకుల కనేకవిభాకరభీకరాకృతుల్
ముక్కుటమూవు రిక్కడకు మ్రొక్కరులై యరుదెంచి రంచుఁ బే
రుక్కున యాదవత్రయరణోద్భటులై చటులైకవిక్రముల్ .

37


వ.

పురారియనుచరాగ్నులు పరాక్రమించు సమయంబున.

38


క.

దానవుఁ డొకఁడు మనోజవు
డానతి విని బాణుచేత నారణము తెఱం
గేను విన వలతుఁ గనుగొను
మా నా కెఱిఁగిం తనుడు సమాలోకించెన్.

39


గీ.

మంటజోదుల కలనఁ గల్మాషకుసుమ
దహనతృషితమహాబలతపను లనఁగ
నుద్భటులు స్వధాకారాశ్రయులు మురారి
తోడఁ దలపడి యేగురుఁ దొలఁగి చనిరి.

40


వ.

మఱియును.

41

కృష్ణుఁడు గిరివ్రజపురరక్షకులగు నగ్నుల గెలుచుట

క.

పోరిరి మురారితో రణ
పారంగతు లయి పతంగపటహస్వర్ణాం
గారభ్రాములు స్వాహా
కారాశ్రయు లేవు రనలకాయు లజేయుల్.

42


క.

అహతము లయె జ్యోతిష్టో
మహనిర్భాగములు రెండు [3]మంటలు వపుష
న్స్మహిమ మయి నడవ నడుమను
సహాయుం డయి యంగిరుఁ డనుసంయమి నడచెన్.

43


చ.

అదరముపై నుదగ్రుఁ డగునంగిరసుం గని నెమ్మొగంబునన్
దరహసితంబు చెన్నెనఁగ దానవసూదనుఁ డల్ల నిట్లనున్

మరలు మునీంద్ర! నీకు వసమా యసమాయుధకేళి గేలికిం
దరమె మదీయసాయకవితానము మానము గోలుపుచ్చదే.

44


మ.

అనుడుం గోపము రూపముం బడిసిన ట్లమ్మౌని శూలంబు చే
కొనిఁ నారాయణుప్రాణముల్ రణముల్ఁ గోడాడఁ జూడన్ జనా
ర్ధనుఁ డాశూలము నర్థచంద్రవిశిఖవ్రాతాహతిం ద్రుంచి య
మ్మునివక్షంబు ముహుర్ముఃక్ష రదస్మఙ్ముద్రాతిరౌద్రంబునన్.

45


శా.

స్థూణాకల్పనిశాతబాణనిహతిం దూలించి సోలించినం
బ్రాణత్రాణపరాయణుల్ హుతవహుల్ బ్రహ్మాత్మజుల్ నల్వుర
బ్బాణుం డున్నెడకుం గళేబరముఁ జూపం దెచ్చి రాలోడిత
క్షోణిభాగపరాగధూసరపరిక్షుణ్ణాంగశృంగారమున్.

46


క.

[4]అంగిరుఁడు పెల్లగిల్లిన
సంగరజయ మమరఁ బాంచజన్యముఁ బూరిం
చెం గంసవైరి ముందఱ
మ్రింగినశశి నుమియునీలమేఘము పోలెన్.

47


మ.

భయరసమగ్నులం బ్రథనభగ్నుల దుర్భరదైన్యభుగ్నులన్
నయనవిలగ్నుల న్వివసనాయితనిర్వృతనగ్నులన్ బరా
జయపరివిగ్నులం బ్రణతిసారవలగ్నుల నగ్నులం బిలే
శయశయనుండు చూచి నడ సాగె గిరివ్రజరాజధానికిన్.

48


మ.

బలివిధ్వంసనుఁడుం బ్రలంబరిపుఁడుం బ్రద్యుమ్నుఁడున్ శంఖముల్
పెలుచం బట్టిరి పన్నగాంతకగకుత్భేటీస్ఫుటారావముం
గలసెం దచ్చతురర్ణవీరవసపక్షధ్వాన మవ్వీటిలో
పలఁ గోలాహలదోహలంబయి గతప్రాణుడు బాణుం డనన్.

49


వ.

అట్టియెడ మిట్టిపడి గిరిప్రజంబు గజిబిజించిన చందంబున గిరివ్రజంబు
గజిబిజి భజించెఁ దదనంతరంబ దైతేయపతి పదాతివ్రాతం బన్యోన్యసైన్య
సన్నాహంబులు దేహంబుల యుల్లాసంబులు రోసంబుల మోసంబుల నోసరింప
నిలింపారి పారిషద పరంపరాపరస్పరశంఖనాదంబుల మోదంబులు నలుమ

డింపఁ జలము డింపక యంపకట్టలు తిట్టలు గొనం బేర్చియు నార్చియు నట్లు పలు
గోట్లం గూర్చియు నేర్చియుఁ దరవరుల వెరవరుల కిచ్చియు మెచ్చియుఁ గొంతం
బును పంతంబులతోఁ బట్టియుఁ దట్టియు నత్తళంబుల కత్తళంబుల వారిచే
బోరించియు సారించియుఁ బరశువులు పరశూరులు కొసంగియు నెసంగియుఁ
జక్రంబులు వక్రంబులు వలుకక సవరించియు వివరించియు బల్లెమ్ములు బెల్లెమ్ముల
విఱువ నమర్చియుఁ జెమర్చియు సెలకట్టియలు సెలికట్టియం నిలిపియుఁ దెలిపియు
నడిదంబులు బెడిదంబులుగఁ గదలంచియు ముదలించియు శూలంబుల మేలంబులం
జూపియు మోపియు గదలు జోదలు మెచ్చం బాటించియుఁ దాటించియు పలియలు
గొనవైచియుఁ ద్రోచియు ముప్పిళ్ళు నప్పిళ్ళు వదలకయుఁ గదలకయుఁ గఠారు
పులు వఠారుల కొప్పించియుఁ దప్పించియుఁ బిడియమ్ముల గడియమ్ము లం బన్నియు
నెన్నియు భేరీభాంకారంబుల దూరంబుల వారించియు వేరించియుఁ జిందంబు
లందంబులుగా మొరయించియు బెరయించియు గజంబులకు ధ్వజంబు లెత్తించియు
జొత్తెంచియు హయంబులకు జయంబు లాశీర్వదించియు మదించియు స్యందనంబు
లకు వందనంబులు జేసియు డాసియుఁ గాలబలంబులకు మేలుబలంబు లెక్కిం
చియు నిక్కించియు సవరణల సవరణ లక్షణంబు లక్షంబునం బొడమం గడమ
వడని కింకరానీకంబునుం గింకరలోకంబును యక్షరాక్షసిదానవగణంబు లై యెయిది
గదిసి నడవ నారాయణుం దాఁకె నయ్యవసరంబున.

50


క.

ద్విరదంబులు నరదంబులు
హరులు నరులు నిక్కు నుక్కు నలవు న్నెలవుం
బురుడున గరుడున కలుకలు
బెరయ నెరయ శౌరి సీరిఁ బిలుచున్ బెలుచన్.

51


శా.

ధారాస్ఫారకృపాణబాణపటలీధారాహతిం దచ్చతు
ర్ధారీశోణితపాణితద్రవనిపీతప్రీతు లై తన్నుఁ జె
న్నారం బన్నగయక్షరాక్షసు లమర్త్యవ్రాతచేస్స్ఫురత్
స్ఫారస్పోరవిహారఘోరనటనాఝాటస్పుటాటోపు లై.

52


క.

తమ నలువురరుధిరంబును
సమరంబునఁ గ్రోలు బాణసైనికుల భుజం

గమయక్షరాక్షసులఁ గని
రమారమణుఁ బిలిచి రాముం డనియెన్.

53


క.

ఆలంబులోన రక్కస
మేలంబులు గలవె మనల మేనుల రుధిరం
బేలా కోలఁగ నిచ్చెదు
బేలా! భూతములఁ బఱపు భీతంబులు గాన్.

54


వ.

అనుటయుఁ బాంచజన్యధరుండుఁ దత్సైన్యంబు దైన్యంబు నొందింపం
దలంచి యాగ్నేయాస్త్రంబు ప్రయోగించిన.

55


మ.

అసురారాతిశరాసనారణిజమై యాగ్నేయబాణంబు బా
ణసురారాతిపతాకినీస్ఫురదరణ్యానింభృతాశాపట
శ్వసనానేకపకర్ణతాళపవనవ్యాఖ్యాతసంఖ్యంబ యై
భసితాకారత నొందఁ జేసె హలి యుబ్బం బెల్లగిల్లం దిశల్.

56


వ.

ఇవ్విధంబున నవ్వధంబునం జిందఱవందఱలై యనీకంబు లనేకంబులు పొడ
వడంగి నిక్కినభయంబున దక్కిన రయంబునం గలబలంబులు గళవళించి మగిడి
నిగిడి నగరంబు చొచ్చిన వెనువెంట నంటం దఱిమి వైనతేయుం డజేయుండయి
తోడన చొచ్చె నట్టియెడ.

57


క.

నానావిధాయుధంబును
నానావిధసైన్యరవము నానావిధభ
ద్రానేకపఘోటకరథ
సైనికమును నైన ప్రమథసైన్యము దోఁచెన్.

58


చ.

పలకలు నొడ్డనంబులును బాసట చేయఁగఁ గత్తిగొంతముల్
బలుసబళంబులు న్వెనుకఁ బన్నిన విండులవారు పైపయిం
దలముగఁ దోఁప వారువపుఁదండము నేనికపిండు దేరుమూఁ
కలుఁ బరిపాటిమై సమరకౌతుకహేతుక మై చెలంగఁగన్.

59

సీ.

నిస్సాణములమ్రోఁత నింగి ముట్టి మురారి
                 పాంచజన్యముతోడ బాదరింపఁ
గరులతొండములసంగడి నిక్కి తాలాంకు
                 వలుఁద నాఁగటితోడ వక్కళింపఁ
దురగఖుకోద్దూతధూళి దిక్కులఁ బ్రాఁకి
                 భుజగారి ఱెక్కలఁ బూజ సేయఁ
గరవాలరుచులు భాస్కరకరంబులఁ ద్రోచి
                 ప్రద్యుమ్నశరములఁ బంత మడుగఁ


తే.

నరదములు గాల్బలంబుల కడ్డ మైన
గ్రింద మీఁదను దెరువులై క్రిక్కిఱియఁగ
డెక్కెములుఁ గొంతములు జల్లెడెలు మలంగఁ
బ్రమథదైతేయసైన్యంబు బయలు మెఱిసె.

60


క.

ము న్నాకసమున సేనలు
పన్ని హరిశరాగ్నిచేత భస్మిత మగుటం
గన్నారఁ జూచి మఱియును
సన్నాహముతోడ నడిచె సైన్యము ధరణిన్.

61


వ.

అట్లున్న సేనలం గనుంగొని నీలాంబరుండు పీతాంబరున కిట్లనియె.

62


ఉ.

ఈచతురంగసేనపయి నెక్కుడువేడుక నిక్కె నామదిం
జూచెదవా యొకింతవడి శూరులఁ దేరులతోడి వ్రేసి వే
లాచలవీచు లట్లు కరులన్ హరులన్ గదియించి నుగ్గుగా
వైచెద వైజయంతువిలు వంచెద బాణునిలజ్జ చించెదన్.

63


వ.

అనుటయు విశ్వంభరుండు.

64


శా.

నా చిత్తంబున నిత్తెఱంగె పొడమెన్ నాగారి మున్నై చనం
బ్రాచీదిఙ్ముఖుఁ డైననాకు సరసం బ్రద్యుమ్నుఁడు న్నీవు హే
లాచాతుర్యము దాపలన్ వలపలన్ లావై పచారింప ధా
త్రీచారంబున మోహరింతము పురారిం జేర లేఁ డిమ్మెయిన్.

65

వ.

అనుటయుం బతంగపతి వసుమతికి నవతరించి వసుదేవసుతుని తలంపున
కనుగుణంబుగ నడచి కడచి ముంగిలియై జంగిలి వెలుచు గోపాలు పోలికం
బ్రతిబలంబులం గదలించియు నదలించియుఁ గడంగి యీటడంగి తాళఫలంబులు
డులుచు పెలుచునం బొదివి పెల్లొదివి హస్తికుల మస్తకంబుల ధర నురలిం
చియుఁ బొరలించియు ముంచి మెయిమెంచి మించిన తురగదళంబులం బొలి
యించియు నరదంబులు చెక్కలు వాయ ఱెక్కల విదిచియు నద్రిచియుఁ
బేరెలమిం దంపడినవీరుల నారెలం జీరి నారులు వోసినట్లు చేసియు మెండు
కొనియున్న శుండాలంబుల తొండంబులు వట్టికొని గుండెలు వగులందన్నియుఁ
గడిమిఁ గడచన్న పన్నగయక్షరాక్షసులఁ బెడచేత వ్రాసియు డాసియుఁ
బాసియు లాసియు వాసి చెడక కలకలంబులు సేయ పలకలవారి కనుంగు
టంబుల నింగికిం జిమ్మియు పఱిపఱిగా నఖంబుల వ్రచ్చియు విచ్చియు
జోచ్చియుఁ బెచ్చు పెరిఁగి వచ్చు బేతాళంబులం బాతాళంబు సొర నడిచియుఁ
బిడిచి వైచిన చందంబున మడఁచి త్రోచియు సరసాన బెరసినం గరసాన నొరసిన
వెరవు చేసియు గేడించినఁ గూడించి యడంచియుఁ బెల్లగిల్లిన మల్లడి గొలిపియు
ననే ప్రకారంబులం జీకాకు పఱిచె నట్టియెడ.

66


శా.

ఈషాదండము సీరతుండము ననిన్ హేరాళమై మూఁకలా
ఘోషింపంగ విహంగమాధిపనఖాంకూరంబు ధీరంబుగా
శేషాహిం గొనివచ్చి చొచ్చి రిపులం జెండాట సూచింపఁగా
రోషోద్రేకముఁ జూపుచుండె బలభద్రుం డుల్లసద్రౌద్రుఁడై.

67


ఉ.

నాఁగలి సాఁచుచుం దిగుచు నాగరథాశ్వభటావళిం గదన్
జాఁగరగొన్న జక్కులఁ బిశాచిక లాచిఱునుగ్గు [5]లెక్కకై
రేఁగినచోట్లనుం దెలుపు రెండునుమూఁడును నాలుగైదుగాఁ
గౌఁగిటఁ గొమ్ములు న్నొగలుఁ గాళులు వ్రేళులుఁ బట్టి చూపుచున్.

68


శా.

ద్యుమ్నంబు న్నికషంబు వోలెఁ బగఱన్ దోఃఖడ్గమున్ రాయఁ బ్ర
ద్యుమ్నుం డాహవకేళి సేయునెడఁ దోడ్తో భూతముల్ ప్రీతితో
నామ్నాయాగతభూతమాంసములు చేయారంగఁ [6]గూర్చున్ వెసన్
నిమ్నోత్తానతలంబు లొక్కమొగిగా నిండా[7]ర బండారమున్.

69

శా.

ప్రద్యుమ్నప్రదరంబు లాబలములం బై పై నివారింపఁగా
విద్యుద్దామపురస్సరాంబుధర మై విస్ఫారముం బాంచజ
న్యోద్యద్ధ్వానము గర్జితంబులుగ దైత్యుల్ భీతిఁ జక్రాంగచం
చద్యానంబునఁ బెల్లగిల్ల వెలిచెం జక్రాయుధుం డుధ్ధతిన్.

70


చ.

నలుగురచేత నిత్తెఱంగున న్నఖలాంగలసాయకాంబకా
ద్యలఘుమహాయుధప్రహత మై దితిజాధిపసేన పాఱినన్
జలజదళాక్షుఁ డొత్తె జలజప్రతిమాన్యము బాహుమధ్యసం
చందుపగుహనాకలితసాగరకన్యముఁ బాంచజన్యమున్.

శివజ్వరము వచ్చి బలరామునిం దాఁకుట

ఉ.

అట్టియెడం గడంగి ప్రమథాధిపుపంపున సీరపాణికిం
గట్టెదు రన్మహాజ్వరము గాళ్లు శిరంబులు మూఁడు మూఁడుగా
ముట్టినఠేవ నిక్కముగ మూఁపులు మూఁడయి వచ్చి తాఁకి ము
చ్చుట్టును బాఱి యార్చె నతిశూరతమై భసితాయుధస్థితిన్.

72


చ.

తఱిమి సహస్రమేఘములు దాఁకి పరాక్రమకేళి చూపఁ బై
నుఱిమిన భంగినార్చి విను మోరి హలాయుధ! బుద్ధిహీన యిట్లెఱిఁగి
యెఱింగి నన్నుఁ గినియించితి ప్రాణముతోడ నింక నె
త్తెఱఁగునఁ బోయె దీమదము ద్రెవ్వఁగఁ జెక్కుదు మేను నొక్కుదున్.

73


క.

గదరాజ నేను నీవును
గదరాజవు నిలువు నిలువు కాని మ్మనుచుం
బొదు లైన బాణవృష్టుల
గదుని మనంబునకు వెఱపు గఱపుచు నడచెన్.

74


మ.

బలభద్రుండు వేయిమండలము లొప్పం గ్రమ్మఱ న్వేగముం
బలముం గాంచి మహాజ్వరం టెడమచే భస్మంబు మంత్రించి పై
జిలికింపంగ నొకింత సోఁకెను రమాశేషంబు బంగారు గు
బ్బలియం దొక్కెడఁ జిందినం దరికొనెన్ భస్మావశేషంబుగాన్.

75


వ.

ఇవ్విధంబున నమ్మేరునగరంబున దొక్కమారు నీ ఱగుటయుం దద
నంతరంబ.

76

క.

బలదేవుమేను సోకిన
వెలిమిడిచే వేఁకి సఱచి విటతాటముగా
నిలుగుటతో ములుగుటతో
నలమటతో సావులింత లంతంతకుఁ గాన్.

77


క.

జడనుం దాపము నిద్రయు
నిడువెండ్రుకతోడ నెగయు నిట్టూర్పులు సం
దడి గొని వడి గొని మదిలోఁ
జిడిముడి పడి కన్నుఁ గవయుఁ జిడిముడి వడఁగాన్.

78


వ.

తదవసరంబున గదుండు సగదుండయి గధాధరున కిట్లనియె.

79


క.

ఓ కృష్ణ! కృష్ణ! చిక్కితిఁ
జేకొను మభయంబు నాకుఁ జేయుము నాతం
డ్రీ! కాలఁ దొడఁగె నొడ లిదె
లోకాధిప! నీకృపాబ్ధిలో ముంపఁ గదే.

80


క.

నావుడుఁ గడురయమున వసు
దేవతనూభవుఁడు రేవతీరమణుని సం
భావనఁ గౌఁగిటఁ జేర్చిన
నావిర్భూతజ్వరాపహరణం బయ్యెన్.

81


వ.

ఇవ్విధంబున.

82


శా.

రాకాచంద్రికఁ దేల్చినట్లు, ఘనసారంబుం బయిం గూర్చిన
ట్లాకాశాపగనీర వ్రాల్చినటు, లాత్మానందయోగామృతం
బేకాంతస్థితిఁ గ్రోల్చినట్లు హరిచే నింపారు నాలింగన
స్వీకారంబున శీతలాంగధరుఁడై సీరాయుధుం డుండఁగన్.

83


క.

ఉభయగదమధ్యమునఁ గై
టభమర్దనుఁ డుండి యచ్చటన్ రణమునకై
యభిముఖునిఁ జేసె నొక్కని
విభు నొక్కనిఁ జేరి వింతవేడుక చూపన్.

84

గీ.

బాహు వెత్తి చల్లనఁ బరిఢవించి
దేవదేవుఁడు పలుకు నత్తెవులుఱేనిఁ
దఱమి నీ శక్తి యెంత యంతయును నేఁడు
నెఱపుమీ యని గర్వంబు నింగి ముట్ట.

85


క.

ఆ మాటలు విని రోగ
గ్రామణి గోపించి కుడికరంబుల రెంటన్
దామోదరు నురముపయిన్
వేమఱు మిడుఁగుఱులతోడి వెలిమిడి చల్లెన్.

86


వ.

ఇట్లు చల్లుటయును.

87


ఉ.

మంజ్వభిరామజైత్రమగు మాధవుగాత్రము దైన్యపాత్రమై
సంజ్వర మొందఁగన్ ధర వెసం దనచేతులు మూఁడు నెత్తి వ్రే
సెం జ్వరుఁ డంతఁ బోక తులసీవనమాలిక పచ్చగంద మం
టం జ్వలనంబు రాఁ బిడికిటం బొడిచెం దదురఃకవాటమున్.

88


వ.

ఇట్లు వ్రేటునుం బోటునుం జూపి మఱియును.

89


చ.

అదరులు వాఱ నూఁదికొని హస్తయుగంబునఁ గంసవైరిఁ గ
ట్టెదురు నురంబు వ్రేసి పెరయీఁగగతిం గఱచె న్మురాంతకుం
డది చిఱునవ్వునం దెగడి యానముం జదియంగ మోఁదినన్
బెదరక వ్రేటుపాటు నెడపెట్టి గదంబు మదంబు చూపఁగన్.

90


శా.

దైతేయారి ఘనంబు గర్జిలి భుజాదండోహతిం జూపి య
త్యాతంకం బగు రౌద్రతాపమును మూర్ధాధిక్యతన్ ముష్టిని
ర్ఘాతవ్రాతము వైచి నొంచె [8]నిటు ప్రారంభించె ఘోరాభిసం
పాతం బష్టభుజత్రిబాహుల కపూర్వస్తోత్రపాత్రంబుగన్.

91


గీ.

పురుషసింహంబు లిమ్మెయిఁ బోరి ముష్టి
ఘట్టనంబుల నదలించు దట్టనలకు

వెక్కసంబుగ నిర్జరుల్ వెఱచి యింత
వలదు వల దంచు నించుకవడిఁ దలంక.

92


క.

సరి సరి ముహూర్తమాత్రం
బరితో హరి పెనఁగి చంప ననువు గని భుజా
పరిఘముల నొక్కెఁ గనకా
భరణంబులతోడ వానిబరులు న్నొగులన్.

93


తే.

జ్వరుఁడు మృతుఁ డయ్యె నని భుజావలయమున ని
మీలితాక్షుఁ డై యున్న యమ్మేటిమగని
నెత్తి యల్లంత వైచిన నెగసి వచ్చి
లోకనాథుని హృదయంబులోను చొచ్చె.

94


వ.

అట్టియెడ ముకుందుండు.

95


క.

గడ గడ వడఁకెడు మేన
న్నిడువెండ్రుక వెట్ట నెదుర చలింపన్
మెడ మడచు నావలించుం
దరఁబడుఁ బడఁబోవు నిలుచు ధరఁ గూర్చుండున్.

96


వ.

అట్లు గూర్చుండి.

97

కృష్ణుఁడు తన్నుఁ దాఁకిన శివజ్వరముపై విష్ణుజ్వరమును బనుచుట

మ.

తనలోఁ జొచ్చిన శాంకరజ్వరముపై దండెత్తఁ గల్పించె న
ద్దనుజారాతి ప్రతిజ్వరంబు నది యాత్మస్వామి డెందంబులోఁ
గని హస్తాంఘ్రి శిరస్త్రయాన్వితుని నాకర్షించి హర్షించెఁ గే
లును మస్తంబులుఁ గాళులుం దనకు నాల్గున్నాల్లు నాల్గుం దగన్.

98


వ.

ఇట్లు వైష్ణవజ్వరంబు నిజతేజఃప్రభావంబున శాంకరజ్వరంబుం బుండరీకాక్షు
డెందంబున నుండనీక వెలికి వెడలించి.

99


శా.

సాహాయ్యం బఖిలాయుధంబులు నిజస్వామిప్రభావంబునన్
బాహాదండములందుఁ జేయఁ గలిగెన్ బ్రత్యర్థికిన్ భస్మస

న్నాహం బాయుధహీనతం దెలుప విన్నాణంబు గైకోలుగా
నూహింపం గదిసెన్ హరిజ్వరముపై నుగ్రజ్వరం బుధ్ధతిన్.

100


గీ.

అటు గదిసి మూఁడు చేతుల నడిచి మగుడ
నతఁడు వేసిన వాపోపు నవసరమున
మదనరిపుబంటం మందులమారి మఱియు
విష్ణుకింకరు వెజ్జును వీపు గఱచె.

101


శా.

వ్రేటుంబోటును గాటు నిత్తెఱఁగునన్ వేమారు సైరించి వీ
రాటోపంబున వైష్ణవామయవిభుం డాకోపతాపాధిపుం
ద్రాటం బెబ్బులిఁ గట్టిన ట్లొకట దోర్దండద్వయిం జుట్టి మో
మోటం బించుక లేక తక్కిన భుజాయుగ్నంబునన్ వ్రేయుచున్.

102


క.

రాఁ దిగుచు నెగుచు నగుచుం
బోఁ దట్టుం బట్టుఁ దిట్టుఁ బొరిఁ బొరి రోఁదున్
మోఁదు మెడ ద్రొక్కు నెక్కును
మీఁదికి నెగయించు వంచు మెయి సారించున్.

103


గీ.

ఎంత చేసిన నంతంత కెక్కుడయిన
బలము జలమును జూప శాంభవరుజావ
రుండు రుక్మిణీవరుజ్వర[9]రోగరాజు
భుజము లుధ్ధతిఁ బుతపుతఁ బోవఁ గఱచి.

104


వ.

విడిపించుకొని మగుడం దలపడి కేశవరుగ్వల్లభునకు.

105


క.

తలఁ దలతోఁ దాఁకించినఁ
దలమీఱుం గాలు గాలఁ దాఁకించిన మి
క్కిలి కాలు గలుగుఁ జేతులఁ
గులికినఁ దనచేయి మీఁ దగున్ వ్రేటునకున్.

106


ఉ.

హత్తినచోట నేడుదలలౌ [10]నలువాయిఁ బెనంగ వ్రేయుచో
నెత్తినఁ జేతులేడును బయిం మెడగానఁగ వచ్చు మెచ్చుగా

నుత్తర[11]దోఃకరంబు సరి నొత్తినఁ గాళులు నేడు దోఁచు నే
క్రొత్తరణంబులుం దలఁపఁగూడవు వేఁకులరాచ పోరిలోన్.

107


వ.

ఇవ్విధంబునం గ్రొవ్వున నివ్వటిల్ల డిల్లంబులు గాక మల్లయుద్ధంబు
సిద్ధంబుగాఁ దొడంగిన గడంగిన మహాజ్వరంబులు జ్వలనజ్వాలాకలాపంబులు
రూపంబులు గైకొన్న విన్ననవునఁ గన్ననువు చూప జగ్గింప నెగ్గించియుఁ బోరు
నెడ నారాయణజ్వరంబు గరంబు గినిసి కవిసిన పరువంబు గరువంబున నుండ
నీక ఖండపరశుజ్వరంబు బట్టి మెట్టుకొని పదంబున మదంబునఁ దాఁచియు
ద్రోచియు మడమల వెడమలంచియు నలంచియుఁ బిక్కల మొక్కలంటునఁ
జప్పరించియు నుప్పరించియు జానువు సానువున నదిమియుఁ గదిమియుఁ
దొడల నొడ లరికట్టియుఁ బట్టియుఁ జేతుల వాతు లడిచియు విడిచియు మనికట్ల
విఱిచియుఁ జఱిచియుఁ గొప్పరంబుల దెప్పరంబుల దెలిపియు నిలిపియు సందుల
బొందులఁ గలయ నొత్తియు హత్తియుఁ గారించియు సారించియుఁ దూలించియు
సోలించియు లయ్యదుకుంజరుని సన్నిధికిం దెచ్చి పెచ్చు పెరిఁగి మెచ్చింపం దలంచి
యిట్లనియె.

108


క.

విఱుతునా మ్రింగుదునో తల
దఱుగుదునో యేను జ్వరుఁడ దాసున్ జ్వరుఁ డా
కఱకంఠు నేయ వి ల్లగు
చెఱకుం జెఱ కైన వంటచెఱకుం జెఱకే.

109


వ.

అనుచుఁ గేశవజ్వరంబు సింహనాదంబుఁ జేసి విజృంభించిన.

110


మ.

పరసేనావనదావపావకుఁడు సంబద్ధాధికక్రోధుఁ డు
త్కరవాతోద్ధురభూషణుండు విలసత్కాలాంతకాకారుఁ డ
య్యురగారాతిపతాకుఁ డుజ్జ్వలజవాత్యుగ్రుండు మాహేశ్వర
జ్వరముం బట్టి వధింపఁ జూడ సుమనస్సంభావనాప్రాప్తయై.

111


చ.

ఒక యశరీరి యిట్లను “మహోదయమూర్తి! మురారి! దేవదే
వ! కుటిలదైత్యదానవనివారణకారత! శాంభవజ్వరం

బకట వినాశ మందఁ దగునయ్య తగం బ్రతిపాలనంబుచే
వికలముగాక యుండ యదువీరవరాగ్రణి కావు నావుడున్.

112


శా.

సంతోషించి మురాంతకుండు విడువన్ శంభుజ్వరం బప్పు డా
పంతం బప్రతిగణ్యరూప మగుచుం బాదప్రణామక్రియా
త్యంతం బయినసపర్య శ్రీవిభునిఁగా నాత్మం దలం పొందఁగా
శాంతిం బొంది నుతిప్రకారవిలసత్సాంద్రోక్తిసంభావనన్.

113


వ.

ఇట్లు స్తుతియించె.

114


శా.

“కృష్ణాంగాయ నమో నమో మురభిదే కేశి ప్రహర్త్రే నమో
నిష్ణాతాయ నమో నమో బలిజితే [12]నిస్వాపభర్త్రే నమః
కృశ్ణేష్టాయ నమో నమో మధుభిదే క్లేశానుశాస్త్రే నమో
ధృష్ణోక్త్రాయ నమో" యనంగ శుభముల్ దీపించు మా కెప్పుడున్.

115


మత్తకోకిల.

ఈశ్వరాయ మహాత్మనే దనుజేశపంక వివస్వతే
శాశ్వతాయ ధరాధృతేంబుజచక్రశార్ఙ్గగదాధరా
యాశ్వమేధఫలైకసంస్తుతిహారివాఙ్మునిరక్షిణే
విశ్వరక్షణహేతవే ప్రభవిష్ణవే౽స్తు నమో యనున్.

116


మ.

సురమర్త్యోరగవిష్టపత్రితయసంక్షోభంబు గావించుచున్
విరసాధిక్యవిశేషపోషణమిళద్వీరప్రలాపంబులన్
సరి లే రంచుఁ జెలంగు దైత్యవిభునిన్ స్తంభంబులోఁ బుట్టి శ్రీ
నరసింహాకృతితో వధించిన నిను న్సంభావనన్ మ్రొక్కెదన్.

117


సీ.

తాటకాజీవనస్థైర్యంబు శరభాను
                 సంచయప్రభలకుఁ జవులు చూపి
ఖరదూషణానీకవరపత్త్రనివహంబు
                 నాశుగపఙ్క్తిఁ జీకాకు పఱచి
రాజత్తరకబంధరాక్షసు జంఘాల
                 పత్త్రిసంఘంబుల పాలు చేసి

పౌలస్త్యవరశిరఃపద్మసందోహంబుఁ
                 దశశిలీముఖములఁ దవులఁ జేసి


ఆ.

రాఘవత్వమందు రణసరోలీలలఁ
గ్రాలుచున్న నిన్నుఁ గన్నులార
జూడఁగంటి జన్మసుఖమెల్లఁ బొడగంటి
ముదముతోడఁ జేరి మ్రొక్కఁగంటి.

118


వ.

అనుచు బహుప్రకారంబుల వినుతించి సాష్టాంగంబుఁగాఁ బ్రణమిల్లి శాంకర
జ్వరంబు నారాయణున కి ట్లనియె.

119


క.

దనుజాధీశవినాశన
వనజాక్ష భవజ్జ్వరంబు వారించి మహి
న్ననుఁ గరుణతోడఁ జూడుము
వినుతించి నమస్కరింతు వీరవరేణ్యా!

120


ఆ.

అనుఁడు గైటభారి యతితుష్టహృదయుఁడై
యట్ల కాక మజ్జ్వరాధివిభుఁడు
నిదేె యడంగు మీర లిద్దఱు లోకంబుఁ
బీడ సేయఁ జంపఁ బెంపు గలిగి.

121


క.

నీవు మదీయజ్వరమును
ద్యావాపృథివీప్రసిద్ధతావైభవనా
నావిధచరిత్రములతో
నీవసుధం బరఁగుఁ డనుడు నెంతయు నెమ్మిన్.

122


వ.

శాంకరజ్వరంబు జనార్దనున కిట్లనియె

123


మత్తకోకిల.

నేను దైత్యనిషూదనుం డగు నీలకంఠకృతుండనై
యేనయంబును లేక మర్త్యుల యేపు మాపి చరెంచి దు
ర్మానినై పిదపన్ భవజ్జ్వరరాజనిర్మథనస్ఫుర
త్తానవవ్యథ నొంది కింకరదైన్య మొందితి నావుడున్.

124

క.

హరియును ముదమున గిరిశ
జ్వరరచితమదీయవినుతి వచనవ్రజమున్
నరుడు పఠించినఁ దలఁచిన
జ్వరరహితుం డనుడు జ్వరుఁడు సంతస మొదవన్.

125


వ.

నారాయణునకుఁ బునఃప్రణామం బాచరించి సంగరంబు వెడలెఁ దద
నంతరంబ సంరంభవిజృంభితుం డై పీతాంబరుండు నీలాంబర ప్రద్యుమ్ను
లిరుదెసల బలసి నడువ నసురబలంబు గదిసిన.

126

కృష్ణ ప్రద్యుమ్న బలభద్రులు రాక్షసవీరులతోఁ బోరుట

మ.

గరుడస్యందను లైనమూవురకు రక్షశ్శూరసైన్యంబుతో
సురసంఘావృతజంభశాత్రవసభాశోభాఢ్యరంభాంగనా
వరముఖ్యామరభీరుభాసురమనోవైదగ్ధ్యరోధోత్సుకో
దురతాలాలితయోధవిక్రమమిళద్యుద్ధంబు సిద్ధించినన్.

127


క.

కరులును హరులును దేరులు
నరులు దెరలఁ బోర శౌరి నలఁచుం గలఁచుం
గరములు నురములు శిరములు
సరములుగాఁ గ్రుచ్చు మెచ్చు జరగుం బరఁగున్.

128


వ.

ఇట్లు బడబానలకీలాకలావసదృశంబు లగుశరంబులం బరబలంబులం
బఱపి తత్సైన్యంబు దైన్యంబు నొందించి సింధుకన్యాధవుండు పాంచజన్యం
బొత్తె రోహిణీనందనుండు సనందనుండై శంఖంబు పూరించె నప్పుడు రమా
వల్లభ భల్లప్రహతంబు లై డొల్లుభటులతలలు తాలఫలంబులం బోలం దదు
పరినృత్యమాకంకగృధ్రపర్ణంబులు పర్ణపుటంబుల ననుకరింప మధుమథనప్రదర
దళితంబు లగుమకుటమాణిక్యంబు మెఱుంగులగములు నిజజయలక్ష్మీ
నీరాజనదీపప్రభారాజులుగాఁ దదనురూపంబు లయి ధరం దొరుగు సితాత
పత్రంబులు రజతభాజనంబులుగాఁ బీతాంబరాంబక భీతనిశ్వసత్కరికరశీక
రాసారంబు గగనమందాకినీబిందుసందోహంబులం దనకు శిశిరోపచారంబులు
చేసినచందంబుఁ దెగడం దదుచితంబు లయి మీఁదికి నెగయుకుంభికుంభ
ముక్తాఫలంబులు సురముక్తాసుమనోవర్షశోభాకర్షణంబు చేయ నన్యోన్యబాణఘట్టనం,

నెగసి మింట నంటుమంటలు సురనారీవీరకరగ్రహోమంబు విడంబింప నివ్విధం
బునం బ్రథనకుశలుండై సమంగళుం డైనయనంగజనకుం జూచి మనంబున మెచ్చి
పెచ్చు పెరిఁగి బలభద్రుండు రౌద్రాకారుండై సహోదరసహాయుండై లాంగ
లంబున మతంగజంబులం బడఁదిగిచి సూతరథ్యసహితంబుగా రథంబులు
చదిసినఁ గదిసినకడంకతోఁ బ్రధనప్రవీణరథికులు పలుగాఁడి బ్రద్దసందుల డిగ
నుఱికి చింత విడిచి పంతంబులు కలిగి వఠారితనంబునం గఠారువు వెతికికొని
యెదిర్చినం జూచి కసిమసంగి ముసలంబునం గైదువులు విఱుగ
వ్రాసినం దునుకలు దమయంగంబులు నాటిన సొలసి తెలిసి విబుధవధూటీకర
గ్రహణనిషేధక్రోధంబున దనకట్టెదుర నిలిచిన సురనగరంబున కరుగంజేసి
తత్పర్యంతయుధ్యమానహయారోహకులు తనపైఁ దఱిమి యుఱమిన నీసున
వేసి గాసిలం జేసి మొదలం దనచేత దెగినస్యందనారోహకులకు విందులు
సందడించునట్లుగా మందించి చిందఱవందఱ చేసి సానందుం డయినకందర్పపాలుం
జూచి యతనికి బాసటయై ప్రద్యుమ్నుండు చాపంబు గుడుసుపడం దిగిచి పరివే
షాభిమండలచండఖద్యోతద్యోతమానసముద్యదేహుండై కాలాంతకునకు వింత
యగుపంతంబు గఱపువాడునుంబోలెఁ బురదహనంబు నాఁటి రుద్రునకు భద్ర
రౌద్రంబు నేర్పరింప నేర్పుగలిగి కౌశికజాజ్వల్యమానజ్వాలామయూఖరేఖానర్గళ
ప్రేంఖళనభాసురుం డయి యసురబలంబునకుం జలంబునం బ్రదరంబుల దరం
బులు పుట్టించియుఁ గరంబులు దట్టించియు రూపు మాపియు నేపుఁ జూపియు
గరంబులు ఖండించియు శిరంబులు తుండించియు గజంబులం బఱపియు ధ్వజంబులం
జెఱపియు సంభ్రమంబున విజృంభించునవసరంబున.

129


సీ.

యంత్రకుఁ డాడించి యవనిఁ ద్రోచినవ్రాలు
                 బొమ్మలగతి రథపూగములును
నిర్ఘాతహతిచేత నెఱ దప్పి కూలిన
                 కుధరాశిచాడ్పునఁ గుంజరములు
సెలయేటిరయమున నిలమీఁదబడ్డ గం
                 డశిలలభంగి ఘోటవ్రజంబు

[13]ధాతృశిల్పాగారపాతభిన్నాంగు లై
                 పడియున్న రూపులపగిది భటులు


తే.

వికటముగఁ ద్రెళ్ళ నొరగెను విచ్చి పఱచెఁ
దొరిగెఁ బృథ్వీతలంబున దునుక లయ్యెఁ
జండశార్ఙ్గశరాసనశాతవిశిఖ
జాలముల నేయఁ జలమునఁ జక్రధరుఁడు.

130


ఉ.

లోఁగక సంగరస్థలములోనఁ బరాక్రమకేళి చూపుచున్
మూఁగినదైత్యదానవుల మొక్కల ముక్కునఁ జక్కు చేసి తా
నీఁగలతిండిగాఁ జదిపె నేపున నచ్యుతపూర్వజుండు పై
నాఁగలి సాఁచి రాఁదిగిచి నాగరథాశ్వపదాతిసంహతిన్.

131


శా.

ప్రద్యుమ్నుండు పయోధినిమ్నుఁడు మహారావంబు సంధిల్లగా
నుద్యద్భాణపరంపరానవరతోద్ద్యోతాతివర్షంబుచే
విద్యుత్వత్ప్రతిమానమూర్తి యగుచున్ వీరాద్రులం గప్పఁగా
నుద్యోగింతురు దివ్యకాంతలు వివాహోత్సాహసంభావనన్.

132


శా.

కాష్ఠాలిన్ శిఖి ముట్టికొన్నకరణిం గాముండు బాహుస్ఫుర
న్నైష్ఠుర్యాతిశయంబునం బరబలౌన్నత్యం బనిత్యంబుగా
శ్రేష్ఠాస్త్రంబుల నేసి వారల సురస్త్రీరత్నకామ్యత్సుథా
గోష్ఠీతత్పరతాసమంచితులఁ గాఁ గోపించి యేసెన్ వెసన్.

133


వ.

మఱియు ననేకసాయకంబులు పరఁగించిన నసురసేన చెనకం జాలక
మొనలకుం దలంగియు గలంగియు నరదంబులతో దాఁగియుం దూఁగియు ద్విర
దంబులలోఁ జిక్కియుం జొక్కియుఁ దెరువునఁ బోవెఱచియుం బఱచియుం
దరువులలోఁ దూఱియు బాఱియుఁ బోటువడి పొరలియుం గెరలియు వాటు
వడి తెరలియు మరలియు బహుప్రకారంబులం బఱవం దొడంగె నయ్య
వసరంబున.

134


మహాస్రగ్ధర.

శతసాహస్రాశ్వపంక్తుల్ సమయఁగ దశలక్షల్ భటుల్ ద్రెళ్ళదేరుల్
క్షితిఁ గూలం గోటసంఖ్యల్ గెడయఁ గరివరాశీతిసాహస్రసంఖ్యల్

హతశేషానీక మాజిన్ వ్యథఁ బడముసలాద్యాయుధంబుల్ ధరన్ వై
చి తొలంగం బాఱఁ బోరం జిడిముడి నడుచుం జిక్కుచుం బాఱుచుండన్.

135


వ.

బాణుండు వారలతో నిట్లనియె.

136


ఉ.

మానితమాన[14]ధైర్యకులమందిరసుందరకీర్తివిస్ఫుర
ద్దానవవంశజాతు[15]లరు దారుణశాతమహాస్త్రసంహతిన్
స్థానముఁ గీర్తియుం గిరిశసంగతియుం బెడఁబాసి పోదురే
మానముకంటెఁ బ్రాణములు మంచివియే తలఁపంగ నక్కటా!

137


సీ.

అనిమొనఁ బావకు నైన నాహుతి చేయఁ
                 దివిరెడుమదిలోనిధీరగుణము
తమలావుకొలఁదులు దా రెఱుంగర యంచు
                 జను లెల్ల మిముఁ జేయుసంస్తవంబు
మిన్ను పయిఁ బడినను మెలుపుతో నఱచేతు
                 లొగ్గఁ జాలుటకు నై యోర్చులావు
మానిసిగందంబు మాఱు వల్చె నటంచు
                 నాజిలో వైరులఁ నడచులావు


ఆ.

పాఱు విడిచి మీకు బాఱంగ నగునయ్య
వితితశౌర్యులార! వీరులార
సతతనిశితశస్త్రసందోహధరులార!
దళితవిమతులార! దనుజులార!

138


సీ.

వేలుపుజడదారి విం దారగించుచో
                 నానందబాష్పంబు లడ్డపడును
రక్తనిమ్నగ ననురాగంబు సంధిల్ల
                 నుబ్బి భూతావళు లోలలాడు
నిర్జరకామినీనిలయాంగణంబులఁ
                 బచ్చతోరణములు పరఁగుచుండు

స్యందనకుంజరహయభటవ్రజములు
                 తునక లై ధరమీఁదఁ దొరుగుచుండు


ఆ.

మొదల మీరు గెల్చుకదనంబులం దెల్ల
నిత్తెఱంగులావు రిత్తవుచ్చి
తిరుగఁ దగునె మీకు ధీరతఁ బెడఁబాసి
వినుతశౌర్యులార! [16]దనుజులార!

139


సీ.

సంగరం బనిన నుత్సవము కేఁగిన క్రియ
                 సొలవక చనియెడిశూరులార!
శంకరుఁ డెప్పుడు సంభావనలు చేయ
                 నుల్లసిల్లుచు నుండు యోధులార!
గాత్రఖండములు ధరిత్రిపైఁ దొరుగంగ
                 శత్రుల గెలిచెడి జైత్రులార!
[17]సమితిలో సేనానిశౌర్యంబు మెచ్చక
                 మిన్నక తిరిగెడి మేటులార


ఆ.

ప్రకటులార మాన్యబలులార విశ్రుత
విక్రమప్రభావవితతులార!
ప్రమథులార! దైత్యపతులార మీకును!
బాఱు టర్హమయ్య బవరమందు.

140


వ.

అట్లుంగాక.

141


క.

ఏ నుండఁగ నీలోపల
మానవుల జయించు టెంత మానము మీకున్
మానుఁడు పలాయనక్రియ
దానవవరులార యననఁ దదనీకంబున్.

142


చ.

విడువక పాఱి పారిషదవీరులుఁ గొందఱు యాతుధానులుం
దడఁబడుచిత్తముల్ రయము దక్కినబీరము వియ్యమందఁగాఁ

జిడిముడిపాటు పాదములఁ జెందఁగ మోముల దైన్య మొందగా,
జెడియును [18]జెడ్క కయ్యమునఁ జేరఁగఁ జిత్తము నిల్పి రయ్యెడన్.

143


వ.

కుంభాండుం డారూఢస్యందనుండై బలంబులతో నిట్లనియె.

144


ఉ.

బాణుఁడు వీఁడె మాంత్రయుతబాణుఁడు దానవశూరసైనిక
త్రాణుఁడు శంకరస్తుతిపరాయణుఁ డుజ్జ్వలరోపదీప్తదృ
క్కోణుఁడు సంగరస్ఫురితకోపపరాబ్ధఘటావళీజగ
త్రాణుఁడు యుద్ధవిశ్రుతపరాక్రమరౌద్రరసప్రమాణుఁడున్.


క.

గిరితనయాధిపషాణ్మా
తురముఖ్యబలంబు లివి యె[19]దుర్కొన్నవి కే
తురజోవిసరాంతర్హిత
హరిదశ్వసురాయనంబు లై క్రొవ్వలరన్.

146


వ.

 మీరింక సాధ్వసగ్రస్తులైన నగునె ధీరమనస్కు లై సమరంబునకు సమరం
డనునవసరంబున సర్వజ్ఞుం డఖర్వసమరగర్వపర్వతారోహణనిర్వక్రపర్వని
ర్వాహకనిర్వేదనపారిషదవీరపరివృతుండును నమందానందకందళితవందారుబృందా
రకబృందసందోహసందీయమానమానసుండును సమరజయజయారావమనోహ
రుండును రణశ్రమనివారణకారణశ్వేతాతపత్త్రాయమాణశర్వరీనాథశంకాసముత్పా
దిజటాజూటతటతటినీతామరససురఖిసరసవాత్యావిహాయస్సముత్థితపరాగవి
స్తారప్రభావిభాసితుండును నందీశసందావితస్యందనవందనమాలికాసందేహ
సర్వతఃప్రసర్యమాణత్రిశూలవిశాలమరీచిద్విగుణితతరణికిరణుండును వితత
భుజబలయుతసకలగణభటసముదయవిలసదసిరుచిరరుచివిరాజితమయూరరాజ
విచిత్రగతిచాతురీచతురసమ్మదసేనానీసైన్యసేవ్యమానుండును నై జనార్దనుం
దాఁకి నిలునిలుమని యదల్చి మఱియును.

147

శివకేశవులయుద్ధము

శా.

చతురంభోనిధిమేఖలావలయభూచక్రంబు గంపింపఁగా
శితికంఠుండు విశేషరోషవిరిసత్సింహారవోద్యుక్తుఁడై

శతనారాచము లేసినన్ హరియుఁ బర్జన్యాస్త్ర మేసె న్వెసన్
శతరూపం బయి తచ్చరంబు శివునిన్ సైన్యంబులం గప్పఁగన్.

148


గీ.

అట్లు పొదివినఁ గుపితుఁడై యంధకారి
యగ్నిదైవత్యశరమున నసురవైరి
నేసె నేసిన నాయస్త్ర మెల్లకడల
మంట మొత్తంబుతో దివి మాఱు మలసె.

149


శా.

ఆయస్త్రం బతిఘోరమై పొదువ దైత్యారాతియున్ రాముఁడున్
మాయావల్లభుఁడుం బతత్రివిభుఁడు న్నాకీక్షణాగమ్యులై
ఛాయాహీనత నొంది రగ్నివిశిఖాజాజ్వల్యమానాంగులై
పోయెం బో యదువంశ మంచుఁ [20]గలఁగన్ భూతావలుల్ భీతితోన్.

150


గీ.

అ ట్లవస్థాంతరప్రాప్తు లైనవారిఁ
జేరి దనుజులు చేసిరి సింహనాద
మగ్నిబాణశిఖావృతుం డైనవానిఁ
బోలిసె నని యెంచి మాధవుఁ బొదివి హరుఁడు.

151


ఉ.

అంతట నంబుజోదరుఁడు నబ్ధిపదైవతశస్త్ర మేసినన్
సంతతివారిధారలను జారుతటిల్లతికావితాన మ
త్యంతమహానినాదసతతాద్భుతభీషణగర్జితంబులన్
సంతస మందఁ జేసె సురసంఘములన్ దనుజుల్ చలింపఁగన్.

152


క.

ఆశస్త్రదహనుఁ డాఱిన
నీశానుఁడు రోషవహ్ని నేసెఁ గ్రమమునం
బైశాచము రాక్షసమును
నైశం బాంగిరస మనుమహాస్త్రముల హరిన్..

153


వ.

వాసుదేవుండునుం దదస్త్రనివారణంబు చేయఁ దలంచి.

154


సీ.

వాయవ్య సావిత్ర వాసన మోహన
                 ముఖ్యాస్త్రముల నేసి మురవిరోధి

యాత్మాస్త్ర మేసిన నాయస్త్రదీప్తిచే
                 నసురప్రమథభూతయక్షగణము
బాణునితోఁ గూడఁ బాఱె నల్గడలకు
                 నంధకారం బయ్యె నఖిలజగతి
విశ్వేశుఁ డప్పుడు వెలుఁగుచు నుండెను
                 నంది మహాదేవు స్యందనంబుఁ


ఆ.

గానఁ డయ్యె శివుఁడు గైశవాస్త్రం బేయ
నాత్మబాణ మగుట నచ్యుతుండుఁ
దూణమందుఁ బెట్టఁ దొడి యేసె రుద్రుండు
పాశుపతము నదియ కేశవుండు.

155


వ.

ప్రయోగించిన నయ్యస్త్రంబులు గగనమధ్యభాసురంబులయి చండమరీచి
సంశ్రితంబు లై తరణిమండలంబు ననుకరించి చిత్రభానుత్వంబునను శిఖావత్త్వంబు
నను హవ్యవాహనసమానం బయి యుగ్రప్రకటిత్వంబునను జ్యోతిర్మయత్వంబు
నను గై లాసోపమానం బయి క్రూరసత్త్వసమగ్రత్వంబునను మహారావత్వంబు
నను బారావారప్రతిమానం బయి సుమనఃప్రియత్వంబునను సూర్యమండలాశ్ర
యత్వంబునను సువర్ణధరణీధరసంకాశం బయి యివ్విధంబునుం గాక
యొక్కొక్కయెడల నెగసి మింట నంటు మంట లంటిన వేఁడిమికి సైరింపం
జాలక ప్రభాకరుండు త్వరితంబున రథంబు నడుపు మని జంకించిన శంకించి
యనూరుండు రయంబున నుంకించియుం హయంబుల నంకించియుఁ బగ్గంబులు
సడల విడిచిన ననుస్యూతలాలాజలంబు లగు వక్త్రగహ్వరంబులు గలుగు హరి
దశ్వంబుల జవంబులకు నోర్వక యిక్క డక్కడ పడిన చుక్కలును దిరుగుడు
వడిన దివ్యవిమానంబుల పయిం బొల్చు పతాకాపటసముదయంబులం జూచి
విహాయసకూలంకషానుమానంబునన్ సలిలవినోదాగతసురముగ్ధవరవర్ణినీశరీర
విరాజమానవరవర్ణినీవైభవంబు ననుకరించు సర్వతః ప్రసరన్మయూఖశిఖాజాలం
బునను సకలమహీధరంబులును సువర్ణాచలంబు లయినం దదీయకనకలతాకుం
జంబుల విహరించు సురకామినీప్రేమానుభావంబు లగు శయ్యాతలంబులం బరఁగు
పుండరీకంబులకు సువర్ణత్వం బాపాదించి జాజ్వల్యమానంబై శైవాస్త్రంబు నిగిడె
నట్టియెడ.

156

గీ.

తోచెఁ నల్గడ ధూమకేతువ్రజంబు
పడె నకాలపుఁబిడుగులు పుడమిమీఁద
మాఁగువారెను మార్తాండమండలంబుఁ
బరఁగెఁ జుక్కలు దివమున బయలు మెఱసి.

157


క.

ప్రమద ముడిగె దిక్స్తంభే
రమసంఘము బృంహితములు ప్రకటితములుగాఁ
దమదెసలు విడిచి పాఱెను
దమయంతన దానవారి [21]ధారలు దొరుగన్.

158


క.

అవ్విబుధజగతిలోపలఁ
గ్రొవ్వి దఱిఁగి సురగణంబు క్షోభము నొందెన్
ఇవ్విధమున నుత్పాతము
నివ్వటిలం దొడఁగుటయును నిష్కరుణతతోన్.

159


క.

అవియును నొకటొకటికి నె
త్తు వోవక పెనఁగిన గని మధు త్రిపురహరుల్
సవరణతో మగుడంగాఁ
దివిచిరి ఖేచరగణంబు దివిరి నుతింపన్.

160


క.

దహనానలవిధుమాధవ
మహస్సముద్భవము ద్రిపురమథనాస్త్రముఁ గా
మహరుండు ప్రయోగించెను
నహితునిపై సురలు కలఁగ నసురలు చెలఁగన్.

161


శా.

ఔన్నత్యస్ఫురదంశుదీప్త మగునాయస్త్రంబు వీక్షింపుచున్
వెన్నుం డాత్మఁ దలంచె నేశరముచే విశ్వేశుఁ డుత్కోపుఁడై
తన్నుం జంపఁ దలంచె నంచు మహితౌదార్యం బవార్యంబుగా
నున్నిద్రాబ్జదళాక్షుఁ డుండె సమరోద్యోగానవద్యాకృతిన్.

162


క.

అంబోజనాభుఁ డహిత
స్తంభవిరచనప్రవీణతావైభవుఁ డై

జృంభణశర మేసిన సం
రంభవిజృంభణము దక్కి ప్రమథాధిపుఁడున్.

163


క.

తడబడుచు నొడలు మలుచుచు
వడిఁ దూగుచు నావులింత వచ్చిన సొలయున్
బుడివడు గాళులు నిలువక
పడఁ బోవుం బడగకాముపైఁ బడి యొఱగున్.

164


వ.

అవ్విధంబున.

165


చ.

మనుజవరాగ్రణీమహితమార్గణజృంభణసారభీతుఁడై
ధనదసఖుండు వ్రాలిన నుదారమణిశ్రితవక్షుఁ డుల్లస
ద్వనజదళాక్షుఁ డొత్తె రవధన్యముఁ బౌరసమూహమాన్యమున్
దనుజచమూమనోరచితదారుణదైన్యముఁ బాంచజన్యమున్.

166


శా.

ఆయంభోజదళాక్షుఁ డుగ్రతరపంచాస్యారవం బొప్పఁగా
మ్రోయించె న్విశిఖాసనంబు హృదయామోదంబు నిండార ర
క్షోయక్షప్రమథేశసైన్యములు సంక్షోభంబు నొందంగఁ బా
ణాయత్యుద్భుటశక్తిబాణుఁడు గతాహ్లాదంబుతోఁ బాఱఁగన్.

167


క.

తక్కినసైన్యము లనిలోఁ
జిక్కి పరాఙ్ముతఁ దొలఁగె శివుఁడును భీతిం
బొక్కుచు నలసతమెయి న
ల్దిక్కుఁ దిరిగి నిలిచి యావులించుచు నుండెన్.

168


వ.

తదనంతరంబ.

169


మ.

నియతామర్షముతోడ బాణసచివానీకంబు నుద్యన్మహా
హయసంబంధము జైత్రమంత్రవివిధాయత్తాస్త్రసంఘోద్భవ
స్మయసైన్యావృత మైన స్యందనముఁ గ్రౌంచద్వేషి యెక్కె న్వెసన్
లయకాలాంతకసన్నిభుం డయి రణోన్మాదంబు సంధిల్లగన్.

170

కుమారస్వామి కృష్ణ బలభద్ర ప్రద్యుమ్నులతోఁ దలపడుట

ఉ.

కయ్యములోని దైత్యులు వికారవపుఃప్రమథవ్రజంబు లా
యయ్యకు నెక్కు డీతని మహాద్భుతవిక్రమమన్నఁ బొంగి తా

నయ్యెడఁ బార్వతీసుతుఁ డహంకృతితో శతముల్ సహస్రముల్
చయ్యన నేసెఁ బాణములఁ జక్రధరున్ బలభద్రుఁ దత్సుతున్.

171


శా.

నిమ్నుం డై శరజుండు సంగరమిళన్నిష్కంపరోషంబుతో
నామ్నాయాత్ముని వేయిబాణములచే హలాప్రియున్ నూఱిటన్
ద్యుమ్నక్ష్మాధరవాసు లచ్చెరువునం దూఁగాడ నిశ్శంకుఁ బ్ర
ద్యుమ్నుం బెక్కుసహస్రబాణములచేఁ దూలించి మించె న్వెసన్.

172


వ.

ఆ సమయంబున.

173


ఉ.

అంచితరక్తదేహులు మహాయుధభీషణు లయ్యదూద్వహుల్
నొంచిరి పాయువహ్నిఘననూత్నమహాస్త్రములం బ్రకోపులై
సంచితకోపదారుణవిశంకటబాణకృతారిమారణున్
గ్రౌంచవిదారణుం బ్రమదకారణు నుజ్జ్వలశక్తిధారణున్.

174


క.

ఆనలినాయతనేత్రుఁడు
నానీలాంబకుడు మరుఁడు నధికముదముతో
నానామంత్రసమన్విత
సేనానీశరగణంబు చేసిరి మాయన్.

175


వ.

అట్టియెడ.

176


ఉ.

దేవగణంబు డెందముల ధీరత దక్కె విమానపంక్తి నా
నావిధపద్యలం దొలఁగె నాకనివాసివనోల్లసన్మహీ
జావళి గూలె విద్రుతము లయ్యె దిశాకరు లుగ్రభంగి నీ
భావభవారినందనుఁడు బ్రహ్మశిరం బనునస్త్ర మేసినన్.

177


క.

ఆదిత్యశతద్యుతి దా
మోదరుఁడు సుదర్శనముఁ బ్రయోగించి తద
స్త్రావృతదీప్తిం జెఱచెను
గాదంబిని తపనుకాంతిఁ గప్పినపగిదిన్.

178


వ.

తదనంతరంబ తదస్త్రంబు తిరస్కృతౌఘం బగుటయుం బటుచటుల
భ్రుకుటి కుటిలవిశంకటలలాటతటనికటవికటపటీయస్స్వేదోదబిందుసమభివ్యక్తీ

కృతరోషావేశుం డై విశాఖుండు సంబద్ధఘంటాసమూహదీర్ఘఘర్షరనిర్ఘోషం
బును వితతసువర్ణప్రభాశిఖాజాలంబును జయలక్ష్మీవినిర్మితనారాయణనీరాజనక్రియ
ననుకరించు హేమమయం బగు శక్తిం బ్రయోగించిన.

179


శంకాకీర్ణమనస్కదానవరిపుల్ చక్రాయుధుం డింతతోఁ
గుంకెంబో యని భీతులయిరి యచటం గ్రోధాప్తదీప్తిన్ మహా
హుంకారంబున శక్తిఁ గూల్చె విమతవ్యూహంబు భీతిల్ల నా
తంకంబుం బెడఁబాసి విష్ణుఁడు జగత్ప్రఖ్యాతచారిత్రుఁడై.

180


ఆ.

[22]అంతఁ బోక శౌరి యగ్రజుండును దాను
జక్రమును హయంబుఁ జటులగదయు
భుజములందుఁ దాల్పఁ బొరిఁబొరిఁ గదిరెడు
భీతి మానసమునఁ బిచ్చలింప.

181


వ.

గుహుండు చేయునది లేక తిరుగంబడినఁ బూర్వజయుతుండై (పూర్వ
గీర్వాణుం డగుబాణు నజేయు) హృషీకేశుండు సమయింపం దలంచి వెంటందగులు
నవసరంబునం గోటవియన నొక్కయుచ్చమల్లి వచ్చి యడ్డపడిన నగ్నికం జూచి
నారాయణుఁడు మాఱుమొగంబు వెట్టికొని యప్పుడు ద్వాదశవర్షంబులు నన్నుం
గొలిచిన ఫలంబు ని న్నొకమరి చూచినం జెడునని శపించె నది మొదలుగా
నానగ్నిక దిగంబర యై నవ్విధంబున.

182


మ.

జ్వరుఁడున్ శంకరుఁడుం గుమారుఁడు మహా[23]సైన్యంబు సన్నాహసు
స్థిరలీలం డిగఁద్రావి దానవవిభుశ్రేయోవిశేషాదిక
స్ఫురితశ్రీఁ బెడఁబాసి సంతతమహాశూరాగ్రణీసద్యశ
స్సరణుల్ బెండువడం దొలంగిరి మహాసంగ్రామరంగంబునన్.

183


వ.

ఇవ్విధంబున సగుహజ్వరుండై ఖండపరశుండు పాఱిన సురపద్యా
విరాజమానారరనిర్ఝరిణీప్రవాహశంకాసంపాదననిదాననిరంతరవైజయంతీ

సంతానంబును ననవద్యవిద్యోతితవివర్ధితతరతరణికిరణసర్వతోజాజ్వల్యమానా
ఖర్వనిర్వత్రసర్వతఃప్రసర్ప్యమాణయుద్ధవిలోకనాగతదర్వీకరసార్వభౌమ
ఫణామండలమాణిక్యమరీచివిడంబనాపండితతేజఃకృపాణప్రముఖశస్త్రాస్త్రం
బులం గలుగు స్యందనంబులునుఁ బరాభూతభేరీభాంకారభయానకఘంటాపటల
గ్రైవేయకబృంహితారావంబులును నధఃకృతఘనాఘనకళేబరచ్ఛాయాచ్ఛాదిత
దిగంతరాళంబును గరవినిర్గతశీకరాసారకృతదుర్దినంబును నవిరతగళన్మదోదక
ధారాపటలచటులకటంకటీయద్విరేఫరాజావరోధవధూమాధుర్యధుర్యధ్వానసమా
కర్ణనానందంబును సవ్విధంబును గాక నభోవీథియుం బోలె నక్షత్రమాలాలంకృతం
బై పారావారంబునుంబోలె మహాసత్తసమగ్రం బై త్యాగిగృహాంగణంబునుం బోలె
దానధారామనోహరం బై ధారాగృహబునుం బోలెఁ జారుఘటాంకితం బై
మలయశైలంబునుం బోలె విషధరప్రకాశంబై త్రిలోచనాస్థానంబునుం బోలె శక్తి
ధరాధిష్ఠితంబై చతురాసనముఖపంక్తియుం బోలె సామోద్భవస్థానం బై శరీరం
బునం బొల్చు సింధూరంబును ధారాధరమయసాయంతనసంధ్యాసందేహసంపా
దనకారణంబగు మతంగజపంక్తియు నతిత్వరితగమనవేగతిరస్కృతసమీ
రణంబులును ఖురదళితధరాధూళిపాళీవిరచితాపరసర్వంసహాంబులును చరణజనిత
పవనంబులును పరనగహ్వారనిష్యూతలాలాజంబులును పల్యాణఖచితనూత్నరత్న
తేజోవికాసంబులును బాదమధ్యవిలీనగగనంబులునై పంచభూతాత్మకత్వంబునను
హారినామధేయానుగుణగణంబులను శక్రతురగవిలోకనకౌతూహాలంబునం బోలె
నభంబు నాక్రమించి శ్రుతతదీయజలధిసంభవపాదంబులం బోలె నర్థాక్రమణ
నివృత్తంబులై ప్రభాకరహాయంబు లసహాయంబులై జరగం జాల వని జనంబు
లాడు వచనంబులు విని స్వకీయవినయజనితలజ్జాయుతంబులుం బోలె నమితాన
నంబులై గమనవిస్తారితచామరంబులై పునస్సంజనితపక్షంబులుం బోలె మనో
జ్ఞంబులై యివ్విధంబునుంగాక కైలాసనగరంబును బోలె నీశ్వరప్రియంబు లయ్యును
గుర్వర్ణమంజులంబులై మేరుగిరినితంబునుం బోలె దేవమణినివాసంబు లయ్యును
నసురాధిష్ఠితంబులై సాగరంబునుంబోలెఁ బ్రకటితనిఖిలావర్తంబు లయ్యును
జడమయంబులై యక్షిరచయంబునుబోలె దీర్ఘప్లుతప్రచారంబు లయ్యును
హ్రస్వంబు లయి విలసిల్లు ఘొటకంబులును నఖిలరత్నఖచితమకుటకోటి

ప్రభాప్రహాసితతరణిమండలంబులును గోపావేశవిశంకటభ్రుకుటిచటుల
లలాటదేశంబులుం బరస్పరకృపాణఘట్టనప్రభావిహాయస్సముత్థితస్ఫులింగధూమ
కేతుసముపలక్షీతానిమిత్తంబులును శింజినీటంకారపాదస్థితబిరుదకటకధ్వానసింహా
నాదవిడంబితనిస్సాణనిస్వనంబులును మఱియునుం గోదండంబు లుద్దండులై
ధరించియుం జరించియు గదలు ప్రొదలు (!) చెలంగం బట్టియుం దట్టియు శరం
బులు గరంబుల నమర్చియుం జెమర్చియు శక్తులు శక్తులకు నిచ్చియుం బుచ్చియుఁ
గఠారంబులు గుఠారంబుల కొసంగియు నెసంగియుఁ బట్టసంబు లట్టహాసంబులతోఁ
గదలించియు ముదలించియు బల్లెమ్ములు బల్లెమ్ముల విఱువ సవరించియుఁ జంద్ర
హాసంబులు మందహాసంబులతో జళిపించియు దళిపించియుఁ దోమరంబులు చామ
రంబులతో నొనర్చియుం దనర్చియుం బ్రాసంబులు రోసంబులతో సారించియు గారిం
చియు సబళంబులు సుబలంబులుగా నొత్తియు నెత్తియు శల్యంబులు తుల్యంబులుగా
ధరించియు భరించియు నారసంబులు సారసంబులతోఁ దిట్టలు గొనం గూర్చియు
నేర్చియుఁ బలకలు పులకలు నెగయఁ బాటించియుఁ దాఁటించియుఁ గంక
టంబులు సంకటంబులని తమయేలికల నడిగియుం దొడిగియు నలుదెసలం
బరఁగుకాలుబలంబులును గూడం జనుదేర విమతపతాకినీప్రతిభయమూర్తియగు
బాణాసురుండు బాహుసహాస్రధృతనిఖిలశస్త్రాస్త్రసందోహుం డై నారాయణుం
దాఁకె మఱియును

184


శా.

ఆరూఢోరగవైరి యైనశతపత్త్రాక్షుం బ్రవీక్షించి దు
ర్వారక్రూరమదాభిమానవిలసద్వైషమ్యసంపాదనో
దారస్ఫారభుజాబలాతిశయితాతారుణ్యభాస్వద్యశ
స్ఫారవ్యాప్తచతుఃపయోనిధివృతక్ష్మామండలాభోగుఁ డై.

185

బాఁణుడు కృష్ణునితోఁ బ్రతాపోక్తులు పలుకుట

క.

బాణుం డిట్లను నిన్ను
బ్రాణముతో మగుడ నీను పట్టణమునకున్
రేణూకృతతనుఁ జేసి ప్ర
వీణత మైఁ బరగువాఁడ వేయును నేలా.

186

క.

తూణోద్ధృతశితవిలస
ద్బాణపరంపరలు వొదువ ధారాస్యూతో
చ్ఛోణితవాహినిఁ దేలుచు
శోణితనగరమున మడియుఁ జొప్పడె నీకున్.

187


క.

ద్వారక లోపలఁ జుట్టలు
సూరెల నినుఁ గొలిచినట్టు సుమనోనగరీ
సూరిజనంబులు గొలిచెడి
చారుక్రియ చేయువాఁడ జలజదళాక్షా!

188


ఉ.

నీ విపు డష్టబాహుఁడవు నేను గఠోరసమస్తశస్త్రసం
భావితదోస్సహస్రరుచిభాసురదేహుఁడ నాకు సాటి యీ
భూవలయంబునం బొడమఁ బోలదు [24]నీ వట నాకు సాటియే
యీవియదున్నతిం బులుఁగు నెక్కిన యంతనె యింత నేమగున్.

189


వ.

అట్లుం గాక.

190


క.

నీనిశితబాణతతికిని
మానసములు దల్లడిల్ల మగిడి చనంగా
నేను జ్వరుండను హరుఁడను
సేనానిని గాను నన్నుఁ జెనయఁగ వశమే.

191


క.

నిన్ను సువర్ణాచలమున
సన్నుత మగువనములోన సరసిజనేత్రల్
మన్నింప నొదవు వేడుక
మన్నిశితశరాగ్నిచేత మరిగింతుఁ జుమీ.

192


క.

నావేయికరంబులుఁ గడుఁ
జేవ మిగిలి కోటి సంఖ్యఁ జెన్నెసలారన్
నీ వసమె నన్నుఁ గెలువను
దేవతలకుఁ జూడరాదు తిరమై నన్నున్.

193

వ.

అని యప్పుడు.

194


క.

దనుజుం డాడెడు వచనము
అనేకపకరాగ్రశీకరాకృతిఁ బోలెన్
ఘనవాత[25]తరంగముల జ
లనిధి నడుమనుండు నేఱులంబోలె వెసన్

195


క.

అప్పుడు జగములు గాల్పఁగ
నుప్పొంగుచు నున్న నిర్జరోత్తమబింబం
బొప్పు వెసఁ దాల్చె దనుజుం
డప్పరుసున నాడుచుండ నతని నయనముల్

196


వ.

తదనంతరంబ సరోషసంభ్రమోత్సాహదీపితుం డై నారాయణుం
డతని కిట్లనియె.

197


ఉ.

ఏమిర బాణ! వ్రీడన విహీనభయోద్దుతమానసుండ వై
యే మని పెక్కులాడెద విదేటికి మాటల జేత [26]నివు సం
గ్రామము గెల్వవచ్చునె వికారపుమాట జయంబ[27]యేని నీ
కీమెయి నేల భాషితము లెక్కుడు గాఁ బచరింపు మాజిలోన్.

198


క.

ఈ చందమైన విజయము
నీచే నగుఁ గాక యున్న నిక్కిపుజయముం
జూచెద వైనను నోరీ!
నాచే జితుఁ డగుము గెలువు నన్నును నీవున్ .

199

కృష్ణ బాణాసురుల యుద్ధము

క.

అనుచు నిశాతాశుగములు
దనుజునిపై నేయ నతఁడు దద్చరములకున్
మనమున విస్మయ మందుచు
ననేకబాణముల నేసె నంభోజాక్షున్.

200

వ.

మఱియు ననేకాయుధంబులం బొదివి యెనిమిదిచేతులతో సహస్రబాహువగు
తనతో సరిసరిగాఁ బోరినం జూచి విస్మయాకులితచిత్తుండై బాణుండు కోపించి
తొల్లి హిరణ్యకశిపుండు బలి కిచ్చిన యాగ్నేయబాణంబుం బ్రయోగించిన సకలదిశా
జాజ్వల్యమానం బయి విజృంభించిన దామోదరుండు.

201


క.

పర్జన్యబాణ మేసిన
నూర్జితవర్షంబుతోడ నున్నతతరధా
రార్జవము గాఁగ నప్పుడు
నిర్జించెను దనుజశరము నిఖిలవిబుధులున్.

202


క.

కొనియాడిరి నారాయణు
వినుతించిరి ముదముతోడ వేడ్కలు దొలఁకన్
మనమున నప్పట కప్పటి
కనూనవాక్యములఁ బొగడి రంభోజాక్షున్.

203


వ.

తదవసరంబున గరుడమయూరంబులు సమరకాంక్షమానసంబులతోడం దల
పడిన నప్పుడు గరుడండు దక్షిణపక్షంబున వ్రేయం బూనిన సంకుచితశరీరంబై
మయూరంబు సవ్యభాగంబునకు నెగసి ముక్కునం బొడిచి ఱెక్కల నడిచి
తదుపరిభాగంబునకు నెగసినం జూచి తానునుం దోడన యెగసి తదీయదేవంబు
చరణంబుల నిఱికియు మఱియు గగనంబునకు నుఱికియు దిరుగంబడి నీలకంఠ
శిరంబు చంచుపుటంబునం గీలించి తదీయపక్షంబు గోళ్ళ గీఱియు జూళ్ళు వాఱియు
నయ్యాయోధనశిక్షితుం డగుపతత్త్రిపతితనదక్షిణపక్షంబున నడిచి మహిం బడ
విడిచిన నామయూరరా జర్ధపదపాతజనితజ్ఞానుండై క్రమ్మఱ నెరిగి యురవునం
దాకియు దుండంబు సారించియుఁ బ్రచండంబుగాఁ గారించియు ఱెక్కల వ్రేయం
బూఁచియుఁ బ్రక్కలు డాయునఖంబులఁ జాచిఁయు బహుప్రకారంబుల గారించినం
గనుంగొని సుపర్ణుండు విజృంభించి సువర్ణసంకీర్ణకిరణసముదాయవ్యాప్త
నభోమండలుం డై పత్త్రంబులం జిత్రంబులుగా మయూరంబు వ్రేసియు నీసునం
బోనీక గాసిచేసియు మఱియు మునుం దనువు లేక లేఖలోకంబు వెక్కసం బంద

నక్కాకోదరవిదారి యగువైనతేయుండు తదీయోదరంబు వ్రచ్చి రణభూమికి బలి
చేసిన.

204


క.

అప్పుడు బర్హిణ మోడిన
నుప్పొంగెను [28]దివ్యవినుతు లుడువీథిన్ దా
నప్పరుసున బాణాసురుఁ
డప్పటి కప్పటికిఁ దలఁకె నధికభయమునన్.

205


ఉ.

పుట్టెను దైత్యసేనల నపూర్వతరం బగుశోకభారముం
గట్టిరి దేవసంఘములు కాంచనతోరణపంక్తు లెల్లెడం
బట్టణవీథి నయ్యెడరు బాణుఁడు చూచుచు భీతి నొందఁగా
నట్టియెడన్ గిరీశవచనాజ్ఞను నంది రథంబు దెచ్చినన్.

206


క.

ఆయరద మెక్కి బాణుం
డాయుధచయవితతరోస్సహస్రరుచిరుఁ డై
తోయజలోచనుఁ దాఁకెను
నాయతశరవర్ష మొప్ప నతివేగమునన్.

207


శా.

జ్వాలాంతం బగు బ్రహ్మశీర్షకమహాస్త్రం బేసినం గేశవుం
డాలోనన్ భ్రుకుటీవిశంకటలటాభోగుఁ డై సంచర
ల్లీలాపాటితదైత్యచక్రము లసతేజశ్చయావక్రముం
గాలత్రాసవిధానదైత్యఝషరేఖానక్రముం జక్రమున్.

208


గీ.

అటు ప్రయోగించి యాయస్త్ర మంతఁ బెఱిచి
పుష్పకారూఢహరిహయపూర్వవిబుధ
సంస్తవాధికవర్ణితసమ్మదుండు
కృష్ణుఁ డట్లను సంగరతృష్ణుతోడ.

209


శా.

ఓరి దానవధూర్త! నీదువచనోద్యోగంబు లెట్లేఁగెరా
రారా యిం కిట నేమి చేసెదవురా క్రౌర్యంబు శౌర్యంబు స
ద్వీరత్వంబును గల్గెనేని దనుజా తెల్లంబుగాఁ జూపుమం
చా రాజీవవిలోచనుండు వచనవ్యాపారపారీణతన్.

210

వ.

మఱియును.

211


ఉ.

తొల్లి సహస్రబాహువు గృతవీర్యతనూభవుండు గ
ర్వోల్లసమానమానసహితోదయమానసుఁ డై దశాస్యహృ
త్ఫుల్లసరోజుసోముఁ డయి భూరిమఖప్రథితాభిమానుఁడై
చెల్లియు రేణుకాతనయుచేఁ జెడఁడే మదిలోఁ దలంపవే.

212


ఉ.

నిన్నును నత్తెఱంగుననె నేఁడు కరద్వయయుక్తుఁ జేసి ద
ర్పోన్నతి మాన్చి నీదుసుహృదుధ్ధతి గీటడఁగింతుఁ బాఱకి
ట్లున్నగతిం జెలంగుమని యుద్ధవిశాదుఁడై మురారి తాఁ
జెన్నోదవవ్ సుదర్శనముఁ జేత నమర్చెఁ బ్రయోగకాంక్షతోన్.

213


వ.

అట్టియెడ.

214


క.

శశిసూర్యశక్రహరపా
శిశమనసద్దీప్తితతి వసించెను జక్రా
కృశమూర్తి లోన నప్పుడు
విశాలలోచనుఁడు సకలవిస్మయకరుఁ డై.

215


క.

చక్రము వైవగఁ బూన్ప న
వక్రముగాఁ జెలఁగె విబుధవరమునివినుతుల్
వక్రుండు వినుతి జేసెఁ ద్రి
విక్రమునిం ద్రిదివవీథి వివిధక్రియలన్.

216

చక్రప్రయోగము చేయఁ దివురు కృష్ణుని యెదుట నగ్నిక నిలుచుట

క.

అత్తెఱఁ గంతయు నగ్నిక
చిత్తమునం దెలిసి విష్ణుసేవాపర నై
యిత్తఱి బాణాసురునిం
దత్తఱపడకుండఁ గావఁ దగదే యనుచున్.

217


గీ.

దేవదేవ జగన్నాథ దివ్యమూర్తి
కావవే దనుజేశ్వరుఁ గరుణతోడ

ననుచుఁ గోటవి యెదురుగా నరుగుదేర
మోము చూడక కన్నులు మూసికొనుచు.

218


క.

దనుజాధీశుని చేతులు
తునుకలు గాఁ గినుకతోడఁ దోయజనయనుం
డనవరతనిశిధారా
జనితవిమతచిత్తభయముఁ జక్రము వైచెన్.

219


వ.

ఆ సుదర్శనంబు.

220


క.

సమసెను బాణాసురుఁ డని
యమరులు సంతోష మొంద నఖిలోజ్జ్వల మై
యమరారి భుజము లన్నియుఁ
గొమరారఁగ నఱికి నఱికి కుప్పలు పెట్టెన్.

221


శా.

మేదోలిప్తశరీర మై ఘనమహోమిశ్రంబు చక్రాయుధం
బాదైత్యాహితుఁ జేర వచ్చి త్రిజగత్యాధారకీర్తీశిర
శ్ఛేదానుజ్ఞకు నానతిమ్మన యదుశ్రేష్ఠుండు రాజన్మనో
మోదంబారఁగ నట్ల చేయఁ దలఁపన్ భూతేశ్వరుం డంతలోన్.

222


శా.

వైరూపాక్షిధరాత్మజాజ్వరగణవ్రాతంబు లంతంతటం
జేరంగాఁ జనుదేరఁ గోటవిపిశాచీశాకినీనాయకుల్
ప్రారబ్ధస్థితితోఁ జెలంగి చన నత్యాశ్చర్యసంపాది యై
యారాజీవదళాక్ష ముందఱ మనోహారిస్తవం బొప్పఁగా.

223


ఉ.

దేవునిచెట్ట వట్టికొని దేవ! యదూద్వహా! సర్వలోకసం
భావితకీర్తిమూర్తియుతభానుసహస్రసమప్రకాశ నా
నావిధవిక్రమాధికవినాయకనాయకపారికాంక్షిసం
సేవితవైరిరాణ్మథన సిద్ధవినోదన బాణుఁ గావవే.

224

చ.

అనుడు మురాంతకుండు ప్రమథాధిప బాణసురారి నీవు గా
చినక్రియ నీనుఁ గాచితిని సిద్ధము నావచనంబు దీని కిం
తనఁ బనిలేదు మీఁదటి ప్రధానపుఁగార్యము దీర్ప నీయను
జ్ఞను విలసిల్లఁ బోయెద విశంకటసత్కరుణారార్ద్ర శంకరా!

225


మ.

అనుచుం గృష్ణుఁడు వోయినం బిదప బాణామర్త్యవైరీశును
ద్ఘనచక్రాయుధనిష్ఠురక్షతగళద్రక్త్రార్ద్రసర్వాంగు న
న్ననుభూతాప్రతిమప్రగల్భపరివాదాంతర్హితోద్విక్రమున్
జనితాస్త్రాధికవేదనాప్రకటమూర్ఛాపారవశ్యాత్మునిన్.

226


క.

నందీశ్వరుఁ డిట్లను నా
నంద మొదవ నసురనాథునకు సమ్మోహ
స్పందితమానసునకు దో
స్సందోహవిహీనదేహసరధస్రునకున్.

227


శా.

పోయెన్ విష్ణుఁడు లెమ్ము లెమ్మనుడు నుద్భూతాధికప్రజ్ఞుఁడై
యాయుగ్రాక్షపదాబ్జసేవకుఁడు బాణామర్త్యవైరీశ్వరుం
డాయాసాంగుఁడు మాధవాస్త్రవినిఘాతాస్రాక్తసర్వాంగుఁ డై
మాయాత్యక్తమనస్కుఁడై గతరణోన్మాదంబుతో లేచినన్.

228


వ.

నందికేశ్వరుండు పురారి ముందట నృత్యంబు చేయ నియోగించిన.

229


క.

తాండవము చేసె బాణుడు
ఖండసుధాకిరణమకుటకరుణాపరుఁ డై
చండహరిశాస్త్రనివహో
దండక్షతగళితశోణితము తొడవులుగాన్.

230


క.

జనితవరకాంక్ష బాణుం
డు నర్తనము చేయ హృత్పటుతరప్రియుఁ డై

త్రినయనుఁడు వరము వేఁడుము
దనుజాధిప యనుడు నతఁడు దద్దయు నెమ్మిన్.

231


సీ.

అజరుండు నమరుండు నగువర మడుగంగ
                 హరుఁడును నవ్వర మతని కిచ్చి
క్రమ్మఱ నడుగు వరమ్మన్న నతఁడు నా
                 దేవరముందట దివిరి నాదు
కరణి నృత్యము చేయఁగల్గినవారికి
                 నిమ్ము పుత్త్రుల నన్న నిచ్చె హరుఁడు
సత్యక్షమార్జనాచారు లై వర్ణితా
                 హారులై మద్భక్తి యతిశయిల్ల


ఆ.

నాకు నెదుర నాడునరులు పుత్త్రులఁ గాంతు
రింక నడుగు వరము శంక దక్కి
యనిన విష్ణుచక్రహతిజాతనిష్ఠుర
బాధ మాన వరముఁ బడసె నతఁడు.

232


క.

క్రమ్మఱ నడుగుము వర మన
సమ్మదమునఁ బ్రమథనాథసైన్యాఢ్యుం డై
నెమ్మి మహాకాళుం జన
సమ్మదుఁ డయి యుండఁ బడసె జగములలోనన్.

233


వ.

మఱియును.

234


క.

తన యొడలు రెండుచేతుల
మును పొందిన యొప్పుతోడఁ బురడించెడు స
జ్జననుతశోభను వెలుఁగఁగ
ననూనవర మీశువలన నసురుఁడు పొందెన్.

235


వ.

ఇత్తెఱంగున.

236

ఉ.

పంచవరప్రదానమున భరుఁడు బాణకృతప్రమోదుఁడై
సంచితనూత్నపారిషదసౌరసమూహకృతస్తవక్రియో
దంచితకీర్తిపూరితదిగంతరుఁ డై నికటప్రవర్తన
క్రౌంచమహిధ్రవైరి గిరిరాజసుతాభజనాతిమోదుఁ డై.

237


వ.

అంతర్ధానంబు చేసె నంతట.

238

శ్రీకృష్ణుఁ డనిరుద్ధుని విడిపించుకొని పోవుట

చ.

గరుడని నెక్కి కేశవుఁడు గ్రక్కున బాణ[29]గృహంబు చేరఁగా
నరిగినఁ బక్షిరాజుఁ గని యచ్యుతపౌత్త్రునిఁ జుట్టికొన్న య
య్యురగము లెల్ల నల్ దెసల నూడనిఁ బాడినఁ జూచి సంతత
స్ఫురితసుఖాతికంటకితసుస్థిరమానసుఁడై ప్రియంబునన్.

239


క.

అనిరుద్ధు మేను దనచే
తను నిమిరె మురాంతకుండు దర్పవిరాజ
దనుజవినాశనపటుతర
సునిశితచక్రాయుధాతిశోభితకరుఁ డై.

240


మ.

అనిరుద్ధుండుఁ బితామహస్తుతివచోవ్యాపారపారీణుఁ డై
తనుఁ బక్షీంద్రుని నెక్కు మన్న నతఁడున్ దై త్యేంద్రకన్యాసఖుల్
దనతోఁ గూడ సుపర్ణు నెక్కఁ బిదపన్ దామోదరుం డెక్క నా
యన యేఁగె న్వివిధప్రచారముల నత్యాశ్చర్యయానంబునన్.

241


క.

గరుడఁడు నడువఁగ దూరము
జరగి హరియు సలిలపాలుసన్నిధి బాణా
సురగోగణములయునికియు
స్థిరముగ విని యతనిదిక్కు చేరుతలఁపునన్.

242


వ.

సుపర్ణున కిట్లనియె.

243

క.

దనుజునియావుల వరుణుఁడు
తనదిక్కున నునిచినాఁడు తత్కార్యముకై
మనకుం బోవలె నద్దెస
కనఘా చనఁ దీఱునేని యరుగు మచటికిన్.

244


వ.

అనుడు మురాంతకునకు నాగాంతకుం డిట్లనియె.

245


క.

నాకును గార్యం బేలా
నీకుం బనిచేయఁ గలుగ నీరజనాభా!
యేకడకు నైనఁ జనియెదఁ
బ్రాకటవిజయాభిరామ! పాపవిరామా!

246


క.

అనుచుం బశ్చిమవేలా
వనమునకుం బక్షివిభుఁడు వరుణునిపురికిం
గోనిపోయె సమ్మదించుచు
వననిధిమధ్యంబు చొచ్చి వనజదళాక్షున్.

247


వ.

గోగణంబుఁ జేరఁ జను నవసరంబునన.

248


ఉ.

అక్కడ నున్న వారుణభటాళులు మ్రొక్కలులై రణంబులో
నుక్కున నొండొరుం బిలిచి యుగ్రతరాగ్రహవిగ్రహేచ్ఛనల్
దిక్కులకుం జెలంగు దృఢధీరరవంబులు నింగిముట్టఁగా
నెక్కట యెక్క డంచు విహగేశ్వరవాహనుఁ దాఁకి రయ్యెడన్.

249


క.

మదమునఁ దన్నుం జెనయగఁ
బదిలముతోఁ జేరినట్టి ప్రాచేతససై
న్యదృఢభటాలిదవాగ్నులఁ
బ్రదరంబుల జల్లు గురిసి పాఱఁగఁ దోలెన్.

250


వ.

తదనంతరంబ.

251

సీ.

నిస్సాణరావంబు నింగి ముట్టి భటాళి
                 శంఖనాదంబుల సవదరింపఁ
గరికరశీకరకణములు విక్రాంత
                 మకుటముక్తారుచి మక్కళింపఁ
దురగహేషారవోద్ధురత యోధవ్రాత
                 సింహనాదంబుతోఁ జెలిమి సేయ
శకటనేమి విభిన్నసర్వంసహాధూళి
                 భటభూషణరజంబు బాదరింప


తే.

సకలదిశలును నిండి సైనికులు గొలువఁ
దన్నుఁ గొనియాడ నమరగంధర్వగణము
ప్రకటరుచితోడ ధవళాతపత్ర మొప్ప
వరుణుఁ డరుదెంచె విక్రమోద్ధురత మెఱయ.

252


క.

కొడుకులు మనుమలుఁ గొలువఁగ
విడు విడు మని శూరగణము వేగిరపడఁగా
గొడగులు గగనము గప్పఁగ
జడనిధిపతి వచ్చి నిలిచె సమరతలమునన్.

253


వ.

ఇట్లు నిలిచి దివ్యనివహజేగీయమానానూనచారిత్రుండై వరుణుండు బహు
శరంబులం బొదవినం గైటభాంతకుండు స్వకీయధనుర్విద్యాకౌశలంబునఁ దదీయ
సాయకంబులు ఖండించి మఱియును వైష్ణవాస్త్రంబు ప్రయోగించినఁ దదీయాను
స్యూతజలధారాసమూహంబు వైష్ణవాస్త్రంబు నుపశమింప జేసె నట్టియెడ.

254


మహాస్రగ్ధర.

జలజాక్షుం డంత రోషజ్వలితహృదయుఁ డై
                 సంచితౌదార్యతేజో
బలవిస్తారోద్ధతారిప్రకరగజఘటా
                 ప్రఖ్యజీమూతరాజీ

కలితోద్యత్ర్కౌర్యధైర్యక్షయభయదమహా
                 కార్యవాతోరుమూర్తిన్
విలసద్దిక్పూరకీర్తిన్ విసృమరమహితో
                 ద్వృత్తివిద్విట్కృతార్తిన్.

255


క.

చక్రము వైవఁగఁ బూన్పఁగ
విక్రమకేళికిఁ దొలంగి విస్మయభీతిని
ర్వక్రవ్యాపృతచేతో
పక్రాంతానందుఁ డైనపాశాయుధుఁడున్.

256


ఉ.

దేవునిముందట న్నిలిచి దేవ యదూద్వహ నీదు దాసకృ
త్యావహనప్రవీణమతి నక్షయకీ ర్తిసమృద్ధి నొందితిన్
దేవర యింత చేసిన విధేయులకుం జొర నెద్దిచో టటం
చావరుణుండు వచ్చి వినయంబున మ్రొక్కుచుఁ బల్కె గ్రమ్మఱన్.

257


క.

తామసరాజసగుణములు
నీ మనమునఁ బొందఁ దగునె నీ వాద్యుఁ డవున్
మేము వికారగుణంబులు
సేమంబునఁ గన్న మమ్ము శిక్షింపఁ దగున్.

258


క.

నీకు వికారము దగునే
మా కెల్లను బుద్ధి చెప్పి మముఁ బ్రోవంగాఁ
జేకొని యున్నాఁడ వనుచు
నాకృష్ణుని నాదిమూల మని జగ మెఱుఁగన్.

259


క.

వరుణుఁడు గొనియాడిన విని
సరసిజనేత్రుండు మెచ్చి సమ్మదమునఁ ద
త్కరములు మోడ్చుచు నప్పుడు
సురరిపుగోగణము దెచ్చి చూపు మనవుడున్.

260

క.

ఆసాగరవిభుఁ డిట్లను
బాస వలికినాఁడ నేను బాణునితోడన్
నీసురభుల నే నసువులఁ
బాసినపుడు గాని యొరులపాలికిఁ బోవన్.

261


క.

ఈనంటిఁ గాన నను నను
మానము లేకుండఁ జంపి మఱి గోగణమున్
నీ నేర్చునట్లు గొని పొ
మ్మో నలినదళాక్ష త్రిభువనోత్తమమూర్తీ!

262


క.

అనుడుం గరుణారసమున
మన మభిషేకంబు చేయఁ బాశధరునికిన్
దనుజునియావుల నిచ్చెను
జనియెఁ బురికి వరుణుఁ దంత సంతస మెసఁగన్.

263


వ.

ఇవ్విధంబునం బురంబు చేరం జనునప్పుడు.

264


సీ.

గంధర్వజయజయ గాననాదంబులు
                 శంఖారవంబులు సాము చేయ
ముత్యాలసేసల మొల్లంబుతోఁగూడ
                 సురపుష్పవృష్టులు సొబగు మీఱ
ద్వారభాసురమణితోరణపంక్తితో
                 విబుధజూటప్రభ వియ్య మంద
బర్హీర్ముఖారూఢభద్రసామజములు
                 కేలిశైలంబుల గేలి సేయ


ఆ.

సురభీయుక్తధార సుకుమారమకరంద
సక్తియుక్తచిత్తషట్పదాళి
మధురనినదకలితమాన్యతరూద్యాన
మైనపురము చొచ్చె నచ్యుతుండు.

265

సీ.

మానినీమంజులమంజీరకరరవ
                 కేళీసరోహంసకిలితంబు
కామినీకాముకకలహప్రసాదన
                 పండితశారికాభాసురంబు
సరసకథాలాపసంగీతసాహిత్య
                 చతురశుకస్తోమసంచితంబు
అంగనాగండూషహాలాలసద్గంధ
                 వకుళపుష్పావళిప్రకటితంబు


ఆ.

విలసదగరుగంధ విస్ఫుటతరగంధ
మైన వివిధమందిరాంగణంబు
చూచి నెమ్మనమున సుడివడ నానంద
మంత కంత కుబ్బె నచ్యుతుండు.

266


క.

ద్వారావతీపురంబున
శౌరిఁ గొలిచి వచ్చునట్టిసౌరగణము త
త్ప్రేరితసుమనోవర్ష మ
పారముగా మోదంబు జేసి ప్రస్తుతితోడన్.

267


వ.

నారాయణునకుం బ్రణామం బాచరించి సమ్మదాక్రాంతమానసు లై తొలంగి
చూచుచుండిరి తదనంతరంబ.

268


సీ.

గళితమదోదకగండస్థలీసంగి
                 మధుపఝంకారాత్తమత్తగజము
హేషారవోద్ధతిపోషితనిస్సాణ
                 పటహభేరీధ్వానబహుళహయము
ప్రాకారచితరత్నబహువిధతరధాను
                 లిప్తసౌధసమూహదీప్తతలము
ఫాలస్థలీకృతప్రకటితాంజలిపుట
                 పరిచారికావళీభాసురంబు

ఆ.

ద్వారఖచితరత్నతోరణోపాంతావ
లంబిమౌక్తికోపలసిత మైన
నగరి చొచ్చె శౌరి నానావిధానూన
వినుతిలసితహృద్వివేకుఁ డగుచు.

269


ఆ.

విష్ణుఁ గొలిచి వచ్చు విబుధగణం బెల్ల
మృగమయూరనిజతురగధవళప
తత్రినివహదృఢరథంబులు డిగి విష్ణు
వెనుక నగరిలోనఁ జనిరి యంత.

270


క.

వసుదేవుని నాహుకునిన్
వెస సాంబుని నల్ముకునిని విపృధుని శైనే
యు సభాక్షకు నందకునిని
నసమానబలాఢ్యు లైన యదువుల కెల్లన్.

271


వ.

ఆలింగనము చేసి వారలతోడి నిట్లనిరి యీతం డసాధ్యుం డయిన బాణా
సురునిం గరద్వయసమేతుం గావించి ముహూర్తమాత్రంబున ద్వారకానగరంబు
నకు వచ్చె ననన్యసామాన్యం బైన దైవం బితఁడ కాఁడే మీభాగ్యంబున నితండు
యదువంశంబునం బుట్టె నని బహువిధంబులం నారాయణు వినుతించి దేవత
లమరావతి కరిగి రని వైశంపాయనుండు జనమేజయునకుం జెప్పి సకలచరాచర
క్షేమంకరక్రియాలంకరణం బగు నీ హరిస్తోత్రంబు తలంపు మని యతని కీర్త
నంబు వివరించె నని సూతుండు శౌనకాది మహామునీశ్వరులకుం జెప్పిన.

272


ఉ.

భావుకకారణా భువనభారకదారణ శస్త్రధారణా
పావనచారణా సుహృదపాయనివారణ సత్కధారణా!
భావవినోదకా పరమభక్తకమోదక వైరిభేదకా!
సేవకవారిజాసన విశేషకృపాసన దైత్యశాసనా!

273

క.

కల్పాంతమహితవిలస
చ్ఛిల్పవిదాభరణహరణ చిత్రచరిత్రా!
కల్పితపన్నగతల్పా
కల్పానల్పప్రకాశకమనీయయశా!

274


మాలిని.

చరవిరహితమూర్తీ తారగౌరోరుకీర్తీ!
పరిహృతవిబుధార్తీ భవ్యసంపత్తిపూర్తీ!
యురగశయనభూషా యోగిసంతోషభాషా!
చరణశరణపోషా జంతురక్షాభిలాషా!

275


గద్యము.

ఇది శ్రీమదుభయకవిమిత్త్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాధనవిరాజి
తిక్కన సోమయాజి ప్రణీతం బైన శ్రీ మహాభారతకథానంతరంబున శ్రీమత్సకల
భాషాభూషణ సాహిత్యరసపోషణ సంవిధానచక్రవర్తి సంపూర్ణకీర్తి నవీనగుణసనాధ
నాచన సోమనాథ ప్రణీతం బైన యుత్తరహరివంశంబునందు షష్ఠాశ్వాసము.

ఉత్తరహరివంశము సంపూర్ణము.

[30]సీ.

పురుడు వచ్చిననాఁడ పూతనామోతన
                 స్తన్యజీవితములు చవులు సూచె
వెన్న మ్రింగెడినాఁడ వెడద [31]పుక్కిటిలోని
                 జగము వల్లవరాజసతికిఁ జూపెఁ
దడవి యాడెడునాఁడ దనుజరూపములైన
                 మద్దుల యుద్దులు మలఁగఁజేసె
నడవ నేర్చిననాఁడ పుడమి వ్రేఁగంతయుఁ
                 బాపఁబూనిన తనపనులు దెలిపెఁ


గీ.

గాచె శరణాగతులఁ బశుగణము గాచెఁ
గేల గిరి యెత్తె నెత్తెఁ బాంచాలిమాన
మనఁగఁ బొగడొందు దేవర నాశ్రయింతు
జిష్ణసఖుఁ గౌస్తుభాలంకరిష్ణుఁ గృష్ణు.

  1. గుంతలంబులు నొప్పుగోళ్ళును
  2. బొలసిన
  3. మంటల పురుషుల్
  4. అంగిరసుఁడు వెలగిలిన
  5. వేఱుచో
  6. మార్చున్
  7. రు—ముల్
  8. నటనప్రారంభఘోరాజిసం, వ్రాతంబైన భుజత్రిబాహుల
  9. రోగరాజ, భుజగభుజములు పురపురఁ బోవఁ గఱచి
  10. ననువాయి
  11. డొక్కరంబు
  12. నిష్పాపపాత్రే
  13. ధాతుశిలాగార
  14. దైత్య
  15. లయి
  16. వీరులార
  17. శివగణసమితి....మెచ్చక తిరిగెడి
  18. జెడకయ్యమును జేయఁగ
  19. దూరోన్నతకే
  20. జెలఁగెన్ భూతావళుల్ భీతితోన్
  21. తరువును తిరిగెన్
  22. అంతఁ బోవక శౌరియు నగ్రజుండు
    చక్రమును శార్ఙ్గము హలంబు చటులగదయు
    భుజములందుఁ దాలుప బొరిబొరిఁ దిరిగెడు
    భీతిచే మానసంబును పిచ్చలింప.
  23. సైన్యౌఘసన్నాహసు
  24. తా నట
  25. తరంగంబుల, నెనయ జలధినడుమ నుండు నేఱులఁ బొలెన్
  26. నీవు సం
  27. యైన నిం, కేమియు నేం
  28. దివ్యగణము లుడుగణవీథిన్, ఆ-
  29. గృహాంతరంబుకై, యరిగినఁ
  30. ప్రస్తుత ముద్రిత యుత్తరహరివంశమున నీ పద్యము లేదు. దీనిని పూర్వహరివంశములోనిదిగా నడకుదిటి వీరరాజుగారు భావించిరి.
  31. పొక్కిలి