ఉత్తరహరివంశము/పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

ఉత్తరహరివంశము

పంచమాశ్వాసము

శ్రీనిశ్రేయనకాంక్షా
నూనవ్రతభార దక్షిణాదార నవ
ర్యానందితచేతో[1]ని
ధ్యానతనుద్యుతినవీన హరిహరనాథా!

1


క.

జనమేజయుఁ డిట్లను న
మ్మునితో హరివర్ణనంబు మును పలుమాఱున్
విని తనియదు మది గ్రమ్మఱ
వినఁ గోరెద ననుడు నతఁడు వేడుకతోడన్.

2


వ.

మున్ను మురాంతకుండు చేసినలావు లెన్ని యెన్ని.

3


క.

ఏణాంకధరుఁడు దోడుగ
బాణుఁడు మొగరింప బాహుపంక్తి[2]శతంబున్
క్షీణముగ నఱికి వానిం
బ్రాణముతోఁ బట్టివిడిచె బలిమథనుఁ డనిన్.

4


వ.

అని మఱియుం గుమారుండు సహాయుం డగుటయుం బరమేశ్వరుండు నిత్య
సాన్నిధ్యంబు చేయుటయుం గాత్యాయని జననీత్వంబు నొందుటయును నతనికి
గాణాపత్యంబు గలుగుటయు నెఱింగించి యింతపట్టునుం గలుగునతండు హరిచేత
హతుండయ్యె ననుటయు జనమేజయుండు తత్కథాశ్రవణకుతూహలి యైన
నా వైశంపాయనుం డిట్లనియె.

5


సీ.

బలితనూజుం డైనబాణాసురుఁడు దొల్లి
                 కార్తికేయుని శూలి గారవించి

ముద్దాడునెడ సూచి మోదంబు ఖేదంబు
                 బొడమ నెమ్మనములోఁ గొడుకు నిట్లు
పాటింపఁడేఁ దండ్రి పని యేమి కటకటా
                 నా తండ్రి యుండిన నన్ను నిట్లు
పాటించు నిటమీఁదఁ బరమేశ్వరుఁడు తండ్రి
                 గాకున్న జన్మంబు కసటు వోదు


తే.

[3]తపము మెచ్చ కద్దేవుండు తండ్రి గాఁడు
గాన మెచ్చింతుఁ దపముచేఁ గానలోన
నతనిఁ బంచేంద్రియంబుల కప్పగింతు
మానసంబున [4]కట తెత్తు మదనహరుని.

6


మ.

అని బాణాసురుఁ డీసు రోసము మమత్వాహంకృతు ల్మానసం
బునకున్ దవ్వులవైచి నిశ్చలగతిన్ ముగ్ధేందుచూడామణిన్
మునిసంఘాతశిరోభినీతచరణాంభోజాతసంభూతనూ
తనరాగద్యుతిభాసురుం బురహరుం దత్త్వస్థితిం జూచుచున్.

7


వ.

ఇట్లని స్తుతించుచు.

8

బాణాసురుఁడు శివుని సేవించి వరములఁ బడయుట

ఉ.

కొలువఁగ నేర నిన్ను శతకోటివిభాకరతేజు డగ్గఱం
బిలువఁగ నేర నిన్ను మునిబృందవివేకవిమర్శదూరునిన్
విలువఁగ నేర నిన్నుఁ బృథివీవియదంతరభిన్ను నేమిటన్
నిలుపఁ గదయ్య నా హృదయనీరజకర్ణికపై మహేశ్వరా!

9


చ.

[5]కలఁగనినారు నిన్ను మదిఁ గౌఁగిటనెత్తుడువారు ముక్తికిం
దొలఁగనివారుగాఁ దెలియుదుం దలపోయుదు లోన నాసలున్
నలఁగవు హృత్పయోజసదనంబునకు న్నినుఁ దెచ్చునంతకున్
మలఁగఁగదే త్రికోణమణిమంటపదీపికపై మహేశ్వరా?

10


చ.

ఒరసిరి నిన్నుఁ దర్కనికషోపలధా[6]రల వన్నెఁ గాన రె
త్తరసిరి విశ్వముం గపిల యైనను నీదెస ముల్లు సూపఁగా

బెరసిరి బ్రహ్మముఖ్యు లగు పెద్దలు [7]బచ్చులువోలె నెల్లచో
నెరసిరిగాని ని న్నెఱుఁగనేరరు నావశమే మహేశ్వరా!

11


గీ.

అనుచు వినుతించుచున్న బాణాసురునకు
నంతకంతకు సంతోష మావహిల్ల
నంధకారాతి పొడసూపి యతనితోడ
నడుగు మిచ్చెద వర మన్న నతఁడు పొంగి.

12


క.

కడువేడ్కతోడ నీకుం
గొడు కయ్యెడునంతకంటెఁ గోర్కియుఁ గలదే
జడుఁ డనక నన్నుఁ గయికౌని
గెడగూర్పుము నన్ను గార్తికేయునితోడన్.

13


ఉ.

నావుడుఁ జంద్రశేఖరుఁడు నవ్వుచుఁ బార్వతిఁ జూచి వీఁడు నీ
కోవనితా కుమారుఁడు గుహుం డితనిం దనతమ్ముఁ డంచు సం
భావన చేయుఁగాక యొకపట్టణ మిమ్ము విశాఖుఁ గన్న య
ప్పావకుఁ డేలు తద్రుధిరపట్టణపార్శ్వమునం దలోదరీ.

14


చ.

పడగయు వాహనంబు నయి బర్హిణవల్లభుఁ డిక్కుమారు నే
ర్పడఁ గదియుం కుమారుడును బాయనినెచ్చెలియై చరించు నా
వుడు నచలేంద్రకన్య యభవుం గొనియాడె వరంబుచేత న
క్కొడుకు మదాంధుఁడై దివిజకోటికిఁ గీ డొనరించె వెండియున్.

15


మ.

గెలిచెం బూర్వనరేంద్రులం బఱపె నాగ్నేయావనీనాథులన్
నలఁచెన్ దక్షిణరాజపంక్తిఁ జెఱిచెన్ నైరృత్యరాట్కోటి
వలవైచెన్ జరమాధిపాళి నడఁచె న్వాయవ్యభూపాలురన్
దొలఁగం బెట్టె నుదీచ్యపార్థివులఁ బోఁదోలెన్ హరాశులన్.

16


క.

గాణాపత్యము వడసెను
బాణుం డిలఁ గార్తికేయపర్వతకన్యా
స్థాణులు పొత్తున మనఁగా
శోణితనగరమున దనుజశోభనకరుఁడై.

17

వ.

ఇట్లు త్రిభువనభవనభారభరణపారీణభుజాస్తంభవిజృంభణంబున సరిలేక
కసిమిరి గొనుకరతలంబులతో నొక్కనాఁడు కాలకంధరులం జేరి యద్దేవునకుం
బ్రణామం బాచరించి యిట్లనియె.

18


సీ.

ఖురఖలీనాఘాతకోలాహలంబుతో
                 నేమి నిర్దోషంబు నెఱప లేదు
నఖపుంఖరోచులు నారితో సంధించి
                 కర్ణావతంసంబు గడప లేదు
మణికిరీటకరోటిమంజీరములు రాయ
                 వీరమధ్యంబులు వ్రేయ లేదు
దంతిదంతావళదంతంబు లొరయ డా
                 కినుల వాచవులఁ జొక్కింప లేదు


తే.

లేదు ప్రతిభటబాహావలేపమహిమ
లేదు సంగ్రామభీమకేలీరవంబు
లేదు విక్రమక్రీడయు లేశమైన
లేదు రాజ్యంబు గలిగియు లేదు ఫలము.

19


శా.

దేవా కయ్యముతోడివేడుక మదిం [8]దీండ్రింప మర్త్యుండు నే
త్రోవం జేతులతీఁట వుత్తు నని కోరుస్ దానవుం డైన నా
కీవే చేతులు చేసి తీకసిమి రిం కెట్లోర్తు నోర్తున్ రిపు
గ్రీవాఖండనమండనస్ఫురదసిక్రేంకారమున్ గల్గినన్.

20


ఉ.

నావుడు దేవదేవుఁడు మనంబున నించుక నవ్వి దానితో
నీవు మయూరకేతనము నేలఁ బడం బొడగన్న యప్పుడా
శీవిషరాజసారభుజసిద్ధము యుద్ధము కల్మి దాని కేఁ
గావలియున్న చోటన యకారణభంగ మనంగఁ బొంగుచున్.

21


వ.

నిజగృహంబునకు వచ్చి.

22


ఉ.

పండినసంతసంబు ముఖపద్మవికాసవిలాస మొంద బా
ణుండు సభాస్థలంబున మనోరథసిద్ధి యెఱుంగఁజేయఁ గుం

భాండుఁడు మంత్రివర్యుఁ డసురాధిపు నత్తఱిఁ జూచి నేఁడు నీ
వొండొకచందమై మిగుల నుబ్బెదు వచ్చినమేలు చెప్పుమా.

23


సీ.

సహజవిగ్రహుడైన శార్ఙ్గిచే మెఱుఁగెక్కు
                 చక్రంబు ముద్దగాఁ జఱచి తొక్కొ
పాతాళగత మైనబంధుదానవకోటిఁ
                 బాటించి తలచూపఁ బంచి తొక్కొ
నీయింటివాకిట నీలలోహితుకంటే
                 గుహునికంటె [9]ఘనుండు గొలిచె నొక్కొ
మీ తండ్రిచే గుజ్జుమెణకరి గొన్న భూ
                 గగనంబు లేలంగఁ గలిగె నొక్కొ


తే.

లవణసాగరమధ్యంబు లావుతోడ
నేలునప్పుడు మన కెల్ల నింత బంటి
న న్నెఱుఁగనీక నీకు నేఁ డున్నయునికి
సబ్బె నెబ్భంగి నిబ్బర మయినయబ్బు.

24


వ.

అనుటయు నద్దనుజుం డమాత్యున కిట్లనియె.

25


చ.

[10]ఇనసమతేజ వింటివె యతీవభుజక్రమవిక్రమక్రియా
ఘను లగుపోటుబంటులకు గాఢతరప్రతిపక్షవక్షభం
జనహృదయైకరంజనవిశాలమహాహవమూల మైనయ
య్యనిమొనఁ గాక కల్గునె సమంచితకీర్తియు ధైర్యమూర్తియున్.

26


ఉ.

లావున వైరిదర్పము వెలార్పక [11]యేఁకరి యున్న చేతులన్
భావభవారిపాదములు పట్టి పరాక్రమకేళిఁ గోరితిన్
డేవునదుండి యన్నెమిలిటెక్కెము గూలినయప్డు సంగరం
బేవల నైనఁ గల్గు ననియెన్ హరుఁ డొండొక మోద మేటికిన్.

27


వ.

అని మఱియును.

28


చ.

నెయ్యము లేనిసంగతియు నిక్కము లేనివచోవిలాసమున్
వియ్యము లేనివైభవము విందులసందడి లేనిముంగిలిం

దియ్యము లేనిచాగమును ధీరత లేనియమాత్యకృత్యముం
గయ్యము లేనిశూరతయుఁ గైకొని యూరక మెచ్చ వచ్చునే.

29


క.

అని మాటలాడుచుండగ
దనుజకులాధీశురాజ్యదర్పము వ్రేఁగై
తునిసినగతి హరు చెప్పిన
పని తప్పక నమలిపడగ బల్లున విఱిగెన్.

30


చ.

విఱిగినఁ బొంగె నద్దనుజవీరవరుండు మనంబులోపలన్
వెఱపును ఖేదము న్వెఱఁగు విస్మయముం బొడమంగ మంత్రి యి
ట్లెఱిఁగి యెఱింగి మారిఁ దనయింటికి రమ్మనువాని కేమియుం
గఱపిన నొప్పునే విధివికారము దప్పునె యిట్లు ద్రిప్పునే.

31


వ.

అనియె నట్టియెడ.

32

శోణితపురమున దుర్నిమిత్తములు పొడసూపుట

క.

బాణుడు సెలఁగ దనుజు
ప్రాణంబులు దల్లడిల్లఁ బ్రతభయతర మై
శోణితపురమున నెల్లను
శోణితవర్షంబు గురిసె సురపతి యలరన్.

33


క.

మార్జాలంబులు చెలఁగుచు
గర్జించెను గొబల నుండి కంపించె బహు
స్ఫూర్జితనినదముతో ధర
వర్ణితపర్వుఁ డయి రాహు వడిఁ బట్టె రవిన్.

34


గీ.

విడువ కెప్పుడు పెనుగాలి వీవఁ దొడఁగెఁ
దోఁచె దక్షిణదిక్కున ధూమకేతు
వసురకన్యలు పూజింప నరుఁగుతోడ
నున్నతం బైనరచ్చమ్రా నొఱగి కెడసె.

35


గీ.

కృత్తికలయందు వక్రించి కీడు [12]సూపె
మంగళుండు దివాకరమండలంబు

వ్రచ్చికొని చుక్కవడె నెల్లవారిఁ గలఁచెఁ
గ్రూరనిర్ఘాతపాతంబు గుండె వగుల.

36


గీ.

రచ్చమ్రాఁకుల నెల్లను రక్తధార
లుద్భవించెఁ బ్రభాకరుం డుక్కు మడుపఁ
గడఁగి బాణునిజన్మనక్షత్ర మైన
భరణి వీక్షించె నది దనపక్షమైన.

37


గీ.

తెలుపుఁ గెంపును ప్రక్కల వెలయ నలుపు
మెడ బెడంగుగఁ గొంతంపుమెఱుఁగువోలె
మూఁడువన్నెలతో నొకమొండె మెగసి
సాంధ్యసమయంబునందు భాస్కరునిఁ గప్పె.

38


వ.

అయ్యవసరంబునం గుంభాండుం డిట్లని విచారించు.

39


ఆ.

వేయుచేతు లిచ్చి వెఱ్ఱిఁ జేసినశూలి
బాణుఁ జెఱుపఁ దలఁచి భండనంబు
గలుగఁ జేసె నింక వెలుగు చే న్మేసినఁ
గాచువార లెందుఁ గలరె జగతి.

40


చ.

త్రిదశపతిన్ జయించి జగతీతల మంతయు నేలుబాణుఁ డే
మదిమది నుండి దానవసమాజము చేటునకై త్రిలోచనుం
గదనము వేఁడె మున్ను బలి గట్టువడెన్ దనకంటెఁ దక్కు వే
యిది విధిపో నిమిత్తములు నేమియు నొప్పవు గీడు దప్పునే.

41


వ.

అట్లుంగాక యద్దనుజేంద్రుం బొడగన్న యప్పుడు.

42


చ.

హరుఁడు గుమారుకంటెఁ గొనియాడుఁ గుమారుఁడు చాలఁగూర్చు నా
హరుఁడుఁ గుమారుఁడున్ రణసహాయులుగా నడతేర వీనిపై
నొరులు పరాక్రమించుటకు నోపుదురే చెడుకాలమైన నె
వ్వరిదెస నేవికారములు వచ్చునొ యింత విచార మేటికిన్.

43


క.

తమ చేసినదుష్కృతములు
తముఁ జెఱుచుం గాక వేఱ తడవం గలదే

తమచేసినసుకృతంబులు
తముఁ గాచును రెండు నేల దైవంబునకున్.

44


గీ.

అనుచుఁ గుంభాండుఁ డరిగె బాణానురుండు
దనుజసుందరీసహితుఁడై మనసులూనఁ
గెరలియాడుచు మధుపానకేళిఁ దేలి
యాహవముఁ గోరుచుండె నయ్యవసరమున.

45

ఇందుధరోపాఖ్యానము

మ.

ఒకనాఁ డిందుధరుఁడుఁ బార్వతియు లీలోద్యానకేళీసరి
న్నికటానేకవిహారదేశముల దైతేయేంద్రకన్యాప్సరో
నికురుంబంబులు పారిజాతకుసుమానీకంబు పైఁ జల్ల ద
ర్పకబాణంబుల కెల్లనెల్ల యగు సౌభాగ్యంబుతో నాడఁగన్.

46


వ.

అట్టియెడ.

47


సీ.

కిసలయంబులతోడఁ గేంగేలు దడఁ బెట్టి
                 వీరులపై నఖకాంతి [13]విజ్ఞరాల్చి
లేఁదీఁగలకు దనూలీలఁ గానుక యిచ్చి
                 గుత్తులుఁ బాలిండ్లు గొలిచి చూచి
చలిగాలి నిశ్వాససౌరభంబుల నాఁగి
                 యళిపఙ్క్తిఁ గురులతో నలుక దీర్చి
పుప్పొళ్ళు [14]సెలగందములు వియ్య మందించి
                 పూఁదేనెఁ జెమటల బుజ్జగించి


తే.

తొడలు ననఁటికంబంబులు మెడలుఁ బోఁక
బోదెలు నెలుంగులును బరవుష్టరుతులు
మాటలును గీరభాషలు మక్కళించి
చిగురుఁబోఁడులు వనకేళి చేయఁ జేయ.

48


వ.

వారిలో నొక్కరు.

49

మ.

సహకారాధిపుఁ గౌగిలించుకొని వాసంతీలతాకాంత సా
రహరిద్రావసగౌరకేసరములన్ రంజిల్లు మాధ్వీకవా
ర్లహరీస్వేదము చూపఁ బట్టపగ లేలా [15]యింతటన్ సిగ్గులే
దహహా యంచుఁ దొలంగి నవ్వెఁ జెలిమాటై ముద్దరా లయ్యెడన్.

50


మ.

ఒకరామాతిలకంబు రత్నరుచితో నొప్పారు మందారకో
రకముం గర్జవతంసత న్నిలుపుచున్ రాగాలతాసక్త చూ
చుకచేలాంచలయై మలంగి విడుమంచుఁ గేలు [16]సాఁచెన్ ససా
యక మౌర్వి న్దెగగొన్న మన్మథుని ప్రత్యాలీఢపాదంబు [17]నాన్.

51


చ.

ఒకచపలాక్షి లేఁజిగురుటూయెలఁ గోయిలరాచవారి ని
క్కకు నెలయింప వచ్చుకలకంటికటాక్షము [18]ఱెక్కతారు స్రు
క్కక పలుమాఱుఁ జూపఁ జెలికత్తెలు [19]ముద్దనబావ పొమ్మనన్
మొకము సగంబు వాంచె మణిముద్రికలం జిఱునవ్వు గప్పుచున్.

52


చ.

లలన లకావితానముల లత్తుకరేకులచాయ చల్లుచే
తుల [20]సెలగొమ్ము లందికొనఁ దోరపునవ్వులు పిక్కటిల్ల నె
చ్చెలులు చెలంగి మావిరులు చెందొవలయ్యె ననం దడంబడం
దలిరులు గోయు రాచిలుకధాఁటులఁ దేఁటులు నాస చేయఁగన్.

53


సీ.

సుడిగొన్నచిగురాకు జొంపంబు గెంపారు
                 తలమీఁద మల్లికాదామ మడఁచి
నిడుదతామరతూఁడు నెట్టెంబు సుట్టి పైఁ
                 బటికంపుఁగడియంపుభాగ మదిమి
తోన యాక్రేవఁ చెందొవఱేకు హత్తించి
                 మెడచక్కిఁ గస్తూరి [21]మెదిచి పూసి
పాయ గొమ్ముల నల్లఁబట్టు దగిల్చి య
                 క్కొనయాకుపై వెండికోర వెట్టి


తే.

ధవళకేతకిధూళిగాత్రమున [22]జెరివి
మోకమామిడి కొకకాంత మ్రొక్కి నిలిచి

యొడలిలోఁ జక్కసగము నా కొసఁగు మనుడు
నద్రికన్యక తలవాంచె హరుఁడు నవ్వె.

54


వ.

తదనంతరంబ.

55


చ.

నడపు తెఱంగు మాటజతనంబు నపాంగవిలాసమున్ ముసుం
గిడినబెడంగు ముద్దుమొగ మించుక పంచిన సిగ్గుఁ బార్వతిం
దడఁ బఱుపంగ నొప్పెసఁగె దర్పకవైరికి నాసపాటుగా
నడరుచుఁ జిత్రరేఖ యనునచ్చెర నెచ్చెలు లిచ్చ మెచ్చఁగన్.

56


క.

అద్దేవుఁడుం బైపడ
గద్దింపుగ శైలకన్య కనుగీఁటంగా
బెద్దవడి నటించుచున
మ్ముద్దియ చిఱునగవుతోడ మ్రొక్కుచు నిలిచెన్.

57


చ.

నిలిచిన చిత్రరేఖఁ గని నీలగళుండు మొగంబు వాంచినం
గలకల నవ్వు నంబిక వికాసముతోఁ జెలికత్తె లింక సి
గ్గులు దగ మానుమంచుఁ బయికొం గెడలింప నపాంగరోచులం
గలఁపె బురారి శైలసుత కన్నులవెన్నెల గాయుమించులన్.

58


వ.

ఇవ్విధంబున.

59


క.

సర్వర్తుక మగువనమున
సర్వజ్ఞుఁడు కేలి సలిపె సలిలక్రీడా
గర్వము మనమునఁ బొడమ న
పూర్వగతిం దఱిసె నేఱు పొలఁతులుఁ దానున్.

60


వ.

అప్పుడు.

61


చ.

తరుణల వీరమద్దియల తాఁకునఁ జిందఱవంద ఱైన క్రొ
న్నురుగులతోడి శైవలము నూలుకొనంగ నితంబపంక్తిపై
బొరలుఁ దరంగరాజి విరిపూవుల నీడిన కుంతలంబులం
బరఁగు పదంబులం దెఱఁగి పైపడ నేర్చు విటాళికైవడిన్.

62


చ.

తలిరులఁ జోఁకెనో దొనలఁ దాఁకెనొ తొండపుఁబిండుఁ బ్రాఁకెనో
పులినము లెక్కెనో కనకపుంగలశంబులు ద్రొక్కెనో మెఱుం

గులగమిఁ జిక్కెనో యనఁ దగుం దలఁపంగ దరంగమాలికల్
మెలఁతల యంగసంగతుల మీఁదికి మీఁదికి నాసచేయుచున్.

63


సీ.

అరుణారవిందంబు లని మ్రొక్కెనో కాని
                 చిగురుటాకుల నింత సేర రావు
పులినంబు లని చాల బుజ్జగించెనో కానీ
                 మరుచక్రముల నింత మరిగి రావు
చక్రవాకము లని సవరించెనో కాని
                 కరికుంభముల నింత గదియ రావు
గండుమీ లని చాల గారవించెనొ కాని
                 పూవుఁదూపుల నింత వొంది రావు


తే.

తరఁగ లాత్మీయధనముల చాయ లయిన
చరణములు నితంబములును జన్నుఁగవలుఁ
గన్నుఁగవలుఁ దోతేర శృంగారజలధి
తరఁగ లింతులు పైకొన్నఁ దలఁకినట్లు.

64


చ.

అలఁతితరంగలుం దఱులు నంబురుహంబు మొగంబు షట్పదం
బులు నలకంబులున్ సుడియుఁ బొక్కిలి నెక్కుఁడు వేడ్క సేయఁగా
నెలతుఁక సంగడిం [23]గమలి నింగిని జుట్టెడు మిన్నునీరిపైఁ
గొలిచి భవాని చేర్చెఁ జనుగుబ్బలజోడుగ జోడుజక్కవల్.

65


చ.

కరఁగినపూఁతఁఁ గనకకందుకకాంతి వెలుంగుచన్నులం
[24]బిరిగొను దొడ్డముత్తియపుఁబేరులు వాయఁగ మన్మథాంకముల్
దరుణుల నంబికావిభుఁడు దార్కొనుచోఁ గనుచాటు మాటుగా
దరఁగలు చల్లుశీకరవితానము మానము గావకుండునే.

66


చ.

తరళతరంగమాలికల తాఁకున కొగ్గికొనంగఁ గామినీ
కరములు దాఁకి శీకరనికాయము దత్కుచకుంభరాజిపై
బరఁగినఁ దోఁచె భావభవుఁ బట్టము గట్టునెడం బ్రవాళభా
సురముఖపూర్ణకుంభశుభసూనకనిర్మలమౌక్తికాక్షతల్.

67

క.

కరసరసిరుహంబున నౌక
సరసిరుహం బమర వదనసరసీరుహమున్
బరిమళవశమున మోపుచు
ధరణీధరతనయ దొంతితామరఁ జూపెన్.

68


ఉ.

చెందొవరేకు ఫాలమునఁ జేర్చి ప్రపుల్లపయోరుహంబుచే
నందముగా బిసావళి భుజాంతరముం గదియించి యుత్పలా
మందమరీచిమేచకచమత్కృతిచారుగళోపచారయై
సుందరి యోర్తు వచ్చి హరుచూపులకున్ హరుఁ డయ్యె నయెయేడన్.

69


వ.

మఱియును గొందఱు దెఱవలు పలుదెఱంగులం గఱకంఠుకైవడి విడంబించునెడ
మృడాని ముఖవికాసంబునకు విలాసం బొసంగ నెసంగిన యాసపాటుచే
నాసన్నసమాసీనయై బాణాసురకన్య యగునుషాకాంత యిట్లని వితర్కించు.

70


సీ.

సల్లాపనవసుధాసారంబు చెవిఁగ్రోల్పఁ
                 జెలికత్తెఁ బుచ్చి మెచ్చించువారు
నానందమకరంద [25]మందంద పైఁ జిందఁ
                 గరకంటిచూపులఁ గప్పువారు
ఘర్మాంబుబిందుముక్తా[26]విభూషణము లు
                 ప్పతిలంగఁ జేసేతఁ బట్టువారు
మఱుపుమున్నీటిలో [27]మానంబు లూటాడ
                 బిగియారుకౌఁగిట బెరయువారుఁ


తే.

బొలయలుకఁ బాసి తెలచినఁ బొందువారుఁ
జతురతరవిహారంబులు సలుపువారుఁ
బ్రథమజన్మంబునం దెంత భాగ్యవతులొ
మగలు మన్నింపఁ బెంపారుమానవతులు.

71


వ.

అని విచారించి చెలికత్తెలతోఁ దనతలంపు వెడల నాడుటయును.

72

చ.

విని చలిగొండచూలు గడువేడుకచూపుల గారవించి య
ద్దనుజతనూజతో నభిమతం బొడగూడెడు నింత నంతకుం
బని గలదే మనోభవునిపట్టము గట్టికొనంగఁజాలు జా
ణని మగనిం గవుంగిట ననారతముం గొనియాడెదో చెలీ.

73


ఉ.

నావుడు నాసరోజముఖి నమ్మికతోడ భవాని కిట్లనున్
దేవి మదీయవాంఛితము తెల్లముగా నొడఁగూడునంటి నా
కావిధ మెన్నఁ డబ్బునొ దయామతి నానతి యిమ్మనంగ నౌ
రా! వలరాచవేగిరము రామకు నంచుఁ జెలంగి నవ్వుచున్.

74


వ.

ఆదేవి యిట్లనియె.

75


గీ.

“కడగి వైశాఖశుక్లపక్షంబునందు
ద్వాదశి దినాంతవేళ సౌధంబుమీద
మదనకేళికి గలలోనఁ గదియు నిన్ను
నెవ్వఁ డాతండ మగఁడు నీ కిందువదన!"

76


క.

అన విని మనమునఁ బెనఁగొను
మనోరథము చేరినట్ల మానిని దొలఁగం
జని సంతసిల్లె దేవియుఁ
బినాకియును జెలులు నిష్టభృత్యులుఁ గొలువన్.

77


క.

వనకేళిని జలకేళిని
వినోదములఁ దేలి తనిసి వీణావేణు
ధ్వనులును గాయకపాఠక
నినాదములు వినుచుఁ దూర్యనిస్వనములతోన్.

78


వ.

పురంబునకు మరల నానతి యిచ్చె నిత్తెఱంగున.

79


క.

దివసావసానమున భవ
భవానులుం జెలులుఁ దురగభద్రేభరథా
ది వివిధయానము లమరం
దివిఁ గొందఱు నరుగ నరుగుదెంచిరి పురికిన్.

80


వ.

వచ్చిన కతిపయదినాంతరంబున.

81

ఉషాకన్య స్వప్నముం గని పరితపించుట

శా.

ఆ దైతేయతనూజ నింగి వ[28]డు నాహర్మ్యంబుపై నొక్కనాఁ
డేదిక్కుం జెలిపిండు మెండుకొనఁగా నేకాంతనిద్రారతిన్
మోదింపం గలలోఁ గుమారుఁ డొకఁ డేమో చేసినం దాల్మి పెం
పేదన్ దిగ్గన మేలు కాంచి నయనోదీర్ణాశ్రుసిక్తాస్యయై.

82


క.

ఎలుఁగెత్తి యేడ్చుఁ దనకుం
దొలుసమ[29]రత నిక్కమైన [30]దురపిల్లుఁ గటా
కుల మిటు దూషిత మగునే
చెలులు నగం దనగుణంబుచే నని వగుచున్.

83


వ.

అట్టియెడం చిత్రరేఖ యనుచెలికత్తె పొడచూపి యుషాకన్యకచేతం దద్భీతి
కారణం బెఱింగి యల్లన బుజ్జగించి యక్కాంతతో నిట్లనియె.

84


చ.

నలినదళాక్షి నీవు బలినందనుకూఁతుర విట్టి నిన్ను మొ
క్కలమున నొక్కరుండు దనకౌఁగిటఁ జేర్చునె! యిట్లు కన్ను నీ
రొలుకఁగ వెఱ్ఱివే? వెఱవ [31]కోడక నొంపఁగ వాని కెన్ దలల్
గలవు విచారహీనవయి కంపము నొందకువే తలోదరీ.

85


వ.

అట్లు గాక.

86


చ.

గెలిచినవాఁడు నేఁడు రణకేళిఁ బురందరుఁ దద్గజేంద్రమున్
వెలిచినవాఁడు దేవతల వెట్టికిఁ బట్టినవాఁడు ధూర్జటిన్
విలిచినవాఁడు భ క్తిమయవిత్తమునన్ ధర నేకవీరుఁడై
నిలిచినవాఁడు శౌర్యమున నీజనకుండు భయం బిదేటికిన్.

87


క.

ఏయెడ భయమెఱుఁగరు దై
తేయాధిపరక్షితులు సతీ జగతి జనుల్
మీయింట నీకు నవమతి
చేయుదురే యొరులు నిప్పుఁ జెద లంటు నటే.

88

వ.

అనుటయు నయ్యుషాకాంత యిట్లనియె.

89


సీ.

మాతండ్రికొలువులో మానినీతిలకంబ
                 రమ్మను నా పేరు వమ్ము వోయె
నాతోడినీడలై ననుఁ బిన్న పెద్దగా
                 సవరించు మీచూపు జాఱువాఱెఁ
[32]బ్రతిదేవతలు నన్ను బయలు నెత్తినదివ్వె
                 యజఱచేతిమానిక మనుట దప్పె
నల్లపొ ల్లెఱుఁగని నాకులం బను మంచి
                 మడుఁగుజీరకుఁ జాల మైల సోఁకె


తే.

నింక మెచ్చనివారు మోమెత్తి చూడఁ
గూడు చవిగాఁనఁ గుడుచుట గూడు నమ్మ
నమ్మ కిటమీఁద నేను బ్రాణానఁ గలిమి
చెలిమి మఱువక తలఁపుమీ చిగురుఁబోడి.


క.

అని వెక్కి వెక్కి యేడ్వంగ
వనజాననఁ జేరి సఖులు వల దుడుగవకా
నిను నెవ్వతెఁగా దలఁచితి
వనదయునుంబోలె నేల యలమట గుడువన్.

91


ఉ.

ఇంతకు మున్న యిచ్చెలువ లెవ్వరుఁ జూడరు నిన్ను నేఁడకా
వింతగ వచ్చితే కతలు వేయును నేటికి నన్యసక్త మై
చింతయు భాషణంబులును చేతలు నీత్రివిధంబు నీడు గా
కింత దలంక నేల కల నెవ్వఁడు డగ్గఱె నేని సెగ్గమే.

92


క.

మనమున నొరుఁ దలఁపవు మా
నిని నియతమబ్రహ్మచారిణివి నీ చరితం
బునఁ గీడు గలుగఁజేసెదు
కనుఁగొన నెవ్వరికి వశము కాలము గడవన్.

93


క.

అని చెలులు పలుక నేమియు
నన నేరక యూరకున్న యసురేశ్వరనం

దనఁ గనుఁగొని కుంభాండుని
తనూజ యగుచిత్రరేఖ తా ని ట్లనియెన్.

94


చ.

ఎఱిఁగితి నీతెఱంగు విను మిందుముఖీ యొకనాఁడు ముగ్ధ
దఱమును గూడియాడఁగ సుధాకరశేఖరుకాంత నీమదిన్
నెఱసినకోర్కి దీర్ప నొకనేర్పరి నీ కల వచ్చు నంటకం
దఱి యిదివో దినంబును సుధాభవనంబునుఁ బ్రొద్దుఁ జూడఁగన్.

95


క.

మఱచితిగాక లతాంగీ
కఱకంఠునితోడ నాఁడు కాత్యాయని నీ
[33]నెఱ నెఱిఁగి నాఁడు సెప్పిన
తెఱఁ గిది సమకూడె నింక దిగు లేమిటికిన్.

96


వ.

అనుటయు నబ్బోటి చిత్తంబున వాటం బయిన పరిభవాభిమానంబు విరిసిన
గన్నీరు దుడిచికొని కొనలుసాగుకోర్కులు గులుకుతలంపులఁ దమకంపు మొల
కలు వొడమం గడమ వడినలజ్జ కడకన్నులం బెరయ నుండెనప్పుడు.

97


మ.

పరపయ్యెం బరిభోగవాంఛ దడవం బా లయ్యె నిద్రారతుల్
పొరపయ్యెం బలుదాల్మి వింతవగపుం బ్రోవయ్యె నాలాపముల్
నెరపయ్యె న్మదనానలంబు వరుస న్నీరయ్యె నాలేపముల్
[34]సొరపయ్యె న్దనువల్లి బాణుసుతకున్ సోలింతలం దూలుచున్.

98


క.

లోఁగిటికి రాని రూపముఁ
గౌఁగిటికిన్ రానిపొందుఁ గారింపంగా
మూఁగినకుసుమశరంబుల
చేఁ గజకఱఁ గందె నతివచిత్తం బంతన్.

99


వ.

ఇట్లు హృదయంబునం కదిరినమదనానలంబుచే నుదిలగొని యాసుదతి
చిత్రరేఖ కిట్లనియె.

100


చ.

ఉడిగి మడింగి మైమఱచి యున్నతఱిం గలలోనఁ జేరె నె
క్కడిమగవాఁ డొకో! యనుచుఁ గందఁగ మేల్కొ.నుచో నతండ యి

ప్పుడు మగఁ డంచుఁ గోరుటకుఁ బొందుగఁ జెప్పితి ముల్లు పుచ్చి కొ
ఱ్ఱడఁచినచంద మయ్యెఁ గమలానన యీ విరహానలంబునన్.

101


క.

నీముడిచినముడి విడువగ
నే మెవ్వరు నేర మింక నీ సౌభాగ్య
శ్రీమహితునిఁ బతిఁ గూర్పం
గామిని నీకంటెఁ జెలులు గలరే చెపుమా.

102


చ.

అనుటయుఁ జిత్రరేఖ దనుజాధిపనందనతోడ ని ట్లనున్
నినుఁ గలలోనఁ జై బైపడిన నేర్పరిమ్రుచ్చు నెఱుంగుదే ని
య్యనువరిరూపుఁ గైవడియు నన్వయముం జరితంబుఁ జెప్పుమా
విని ప్రియుఁ దార్చెదన్ మనము వేడుకఁ దీర్చెదఁ గాము నోర్చెదన్.

103


వ.

అనుటయు నక్కన్యకారత్నం బి ట్లనియె.

104


క.

కలలోనఁ గన్నరూపముఁ
గలలోనన కౌఁగిలింపఁ గంటిఁ బిదప నో
లలనా! నీ పలుకుల నో
లల నాడితిఁ గాని పతిఁ దలంప నెఱుంగన్.

105


క.

ఏదంపతులకుఁ బొడమెనొ
యేదేశమునందుఁ గీర్తి కెక్కినవాఁడో
యే దెసవాడొ యెఱుంగను
మేదిని నిత్తెఱఁగు కూరిమియుఁ గలదె చెలీ!

106


వ.

అనుటయుఁ జిత్రరేఖ విచారించి.

107


గీ.

[35]ఆలజాలంబు నీరిలో నాడుజాడ
గాలిపడగ యాకసమునఁ గ్రాలు త్రోవ
నిదురలొపలఁ గల దోఁచునీడ [36]విధము
గానవచ్చునె యప్పుడ కన్నఁ గాక.

108


వ.

అనుటయు.

109

చ.

వెలిచిన కన్నునీరుజడి వెచ్చనిచన్నులమీఁదివేఁడియుం
దొలకరి ఘర్మతోయములతోఁ గలసె న్మెయి మ్రానుపాటుతో
నెలుఁగున రాలుపా టొదవె నెక్కువివర్ణతతోన లోపలం
గలగొనె నారటంపుఁ బులకంబులతోఁ బొడతెంచెఁ గంపమున్.

110


వ.

ఇవ్విధంబున మవ్వంబు గందినపువ్వునుం బోలె నవ్వనిత నివ్వటిల్లిన
యాయల్లకంబు మల్లడిఁ గొలుప నిలుపోప కున్న విన్న నగు నచ్చెలులు మెచ్చ
నచ్చిత్రరేఖ లేఖననైపుణ్యంబు మెఱయ నిదియ తఱి యని విచారించి
యచ్చపునెయ్యంబున నచ్చపలలోచన కి ట్లనియె.

111


మ.

వనితా యెల్లజగంబులుం బటమునన్ వ్రాయంగ నేర్తున్ సుప
ర్వనరాహిప్రముఖస్వరూపములు చిత్రప్రాప్తిమైఁ జూపెదం
గని నిన్నుం గలలోనఁ బైపడినయాకళ్యాణరత్నాకరున్
మనవాఁ డంచు నెఱింగిపట్టి మది నీ మన్నించినన్ మెచ్చవే.

112


క.

ఏడుదినంబులలో నీ
రేడు జగంబులును వ్రాసి యిత్తుఁ బటము నీ
వేడుకకుఁ దగినవానిని
జూడు మతనిఁ దెత్తు నన్నుఁ జూడు లతాంగీ!

113


వ.

అని బుజ్జగించి యజ్జోటి నొడంబఱిచి నిజమందిరంబునకుం జనియె ననం
తరంబ విరహానలంబు ముప్పిరిగొన్న నప్పువ్వుబోఁడి తనలోన.

114


సీ.

చెలులు బొమ్మలపెండ్లి చేయుచో లజ్జింతు
                 మగనికై యే నేల మరులుకొంటిఁ
గలలోన నొకనిఁ జక్కనివానిఁ బొడగని
                 వెలిఁ జూడ కే నేల వెఱ్ఱినైతిఁ
దగువరుం డని తార తడవి కూర్పకమున్న
                 బంధుల కే నేల పలుచనైతి
గతి మాలి బిగియారుకౌఁగిలి లేని యా
                 ఱడికూర్మి కే నేల ఱట్టు వడితిఁ


తే.

గదిసి పాసినచవి చూడఁ గలిగెఁ గాని
పాసి కదిసినచవి చూడ బాగు గాదు

తలఁపులకు జక్క నుండెడితలఁపు లేదు
లజ్జఁ బోఁద్రోవ లజ్జకు లజ్జలేదు.

115


వ.

కలఁ గన్న తెఱంగు విచారించి.

116


చ.

అకటకటా కటాక్షముల కందియు నందకపోయెఁ గాక వం
చకుఁ డయి వాఁడు నేఁడు దనచక్కదనంబు మనంబులోన నిం
కొకపరి చూపెనే నచట నుప్పరవీథి రథంబు దోలుచున్
మకరపతాకుఁ డుగ్రకుసుమప్రదరంబులపాలు చేయఁడే.

117


వ.

అనుచు నచ్చపలలోచన వెచ్చ నూర్చుటయును.

118


చ.

కడలఁ దొలంగెఁ దుమ్మెదలు కట్టెదురం బొడసూపనోడి పు
ప్పొడిఁబొగ లుప్పతిల్లె మొగముం గమలంబును మోచియున్న య
య్యెడ లెటు లోర్చెనో చిగురు లోర్వవు కందె నదేల వెన్నెలన్
వడవడు మందమారుతము వామవిలోచన వేఁడియూర్పులన్.

119


వ.

మఱియు నమ్మెలంత మేని సంతాపం బంత కంతకు మిగుల నప్పుడు.

120


ఉ.

శూలివిలోకనానలము సోఁకు రతీశుఁ డెఱుంగు గాన య
బ్బాలమనంబులో విరహపావకదాహము నోర్చె నన్న న
ట్లేల పొసంగు దేహము దహించిన యంతటితో మనోజుఁడై
గాలియ చిక్కెఁ గాన చెడఁగాలఁడు వో యెటువంటిమంటలన్.

121


వ.

ఆత్తఱిం దత్తాపంబు సయిరింపక యత్తలోదరి యుల్లంబు డిల్లంబుగాఁ
దొడంగినం గీడ్పడం దలంచి తనలోన.

122


చ.

కిసలయపత్త్రికన్ మకరకేతన నూతనవార్తలన్నియుం
బొసఁగ లిఖించి యందుఁ దలపూవులుఁ దమ్మయు నాసచేయు నా
కొసరు తెఱం గెఱింగి కుచకుంభములం బతిఁవాల్చు నన్ను సం
తసమున వ్రాసియిచ్చినఁ గదా చెలికత్తెల కేను మ్రొక్కుదున్.

123


వ.

అనుచుఁ బరిభోగవాంఛానిరత యయ్యె నయ్యవసరంబున.

124


క.

నీహారముపేర సఖీ
వ్యాహారము విన్న నలుగువారుఁ దనుపుగా

నేహార మఱుతఁ బెట్టిన
నాహారము దొఱుఁగుఁ దొఱఁగు నాహారంబున్.

125


వ.

ఆ సమయంబునం బతిం దడవం దలంచి వెడవెడ మదనోన్మాదంబు
వొడమిన నప్పడంతుక యిట్లనియె.

126


ఉ.

నాదెసఁ గామునమ్నులకు నాఁటుట వైళమ్మ సిగ్గుఁ జిత్తమున్
వాదులు పెట్టుకొన్న [37]యవి వాడిన నెవ్వరి కైన ముందు రా
రో దయితుం గనుంగొన సరోరుహలోచనలార! యింతకున్
జాదులయిల్లు చొచ్చి సెకఁ జల్లెడివెన్నెల వెట్టికొందునే.

127


వ.

అనునెడఁ బిరిగొన్నయారటంబు పొరింబొరిం గారింపఁ దొడంగిన.

128


తే.

ఎసఁగు సంతాపభరమున నిట్టునట్టు
బొరలు శయ్యాతలంబునఁ బువ్వుఁబోఁడి
తివురు విరహానలంబున దివ్వెలెత్తఁ
జిత్తజాతుండు వత్తిఁ దాల్చినవిధమున్.

129


వ.

తదనంతరంబ యంతరంగంబు సంతాపంబుచేతఁ జేతనారహితం బగుచు
వచ్చిన.

130


ఉ.

డెందముమీఁదఁ జెందొవకు డెప్పర మేమియు లేదు చన్నులం
జిందదు ఘర్మవారి చెవిఁ జేర్చిన లేఁజిగు రించుకంతయుం
గందదు నాసికాగ్రమునఁ గన్నుల బాష్పము లూర వింక నీ
సుందరిఁ గావనేరఁడు ప్రసూనశరుం డని యార్తమూర్తులై.

131


వ.

చెలికత్తె లున్నంత.

132


శా.

ముల్లోకంబుల మూర్తులం బటమునన్ ముద్రించి నేర్పెల్ల రా
జిల్లన్ మెల్లన చిత్రరేఖ చనుదెంచె న్నిండుప్రాణంబు సం
ధిల్లన్ బాణతనూజకుం జెలులకున్ దిక్కెవ్వరున్ లేరు నా
తల్లీ వచ్చితె యంచు నెచ్చెలులు మోదం బంద డెందంబునన్.

133


వ.

ఇట్లువచ్చి యక్కాంత యంతకు మున్న యంతంత వింతగా సంతరించిన శశికాంత
జలశీకరశిశిరతరశయనాంతరంబున నప్పటి కప్పటికి వెలయుపుప్పొడు

తిప్పలును గప్పురంపుఁగుప్పలు నుప్పతిల్లిన శీతకరమణిశిలాతలంబుల నెడ నెడ
జాలకంబుల జడిగొన్నఁ బొడకట్టువెన్నెలచేత నట్టువడి మణికుట్టిమంబులు దుడిచి
తుడిచి కడ గానక చిడిముడి పడి యొండొండ బొండుమల్లెలు నిండ నత్తెఱపుల
నొఱపుగాఁ బఱపు కొందఱు దెఱపల ముద్దరాలితనంబునకు మెఱుం గిడిన తెఱఁగున
మెఱయు చతురవనితాకీలితవితతధాతుపటయవనికావితానంబులం గుఱుచ కుఱుచ
కురువేరునం బరువంబగు మరువంబునం గసుగందని బిసంబుల నుప్పరిగలో శారికా
శుకపికంబుబు చడిచప్పుడు దెప్పరమ్ము చేయకుండం జలిచప్పరం బిడి మలయా
నిలంబు మలయు పలుచనిఠావులకు వలయు చెరువులు చెరివి మివులం బొరువున
సురివినకుసుమకిసలయకేసరవిసరంబుల నందంద యరవిందకర్ణికాపీఠంబులం
గందర్పపూజ చేసినం జెలువొందు నిందీవరంబులుఁ జెందొవలుఁ గందువల సంద
డించు నిందిందిరంబులకు విందులుగా సమంచితాకుంచితాలకంబు లగునలికంబులు
వంచి పంచబాణశరంబు లని ప్రమాణంబు విచారించు విరహపరితాపపరిహరణ
నిపుణపురంధ్రగణంబులఁ గన్నకన్నచోటఁ జెన్నమరినకన్నియలు విన్ననై
యున్నయన్నాతి కన్నీరు దుడిచి తుడిచి పన్నీరును జేఁ దడిపికొన వలసి రజతవీటి
కాపటలంబు వెడలం దిగిచి కులికి కులికి చుట్లం దొలంగ వైచినచిందంబులతోడం
బురుడించు చందనలిఖితచంద్రమండలసమర్చనాసమయసముచితపరివారదేవ
తాయమానతారకానికరంబుల మఱియుం గదళీదళవీజనంబులఁ గస్తూరికాకర్దమం
బులఁ గనకకరండభరితమకరందంబుల మణికలశపూర్ణమలయజతోయంబుల
విన్యస్తవివిధకుమమస్తబకవిశాలలాంగణంబుల విగతవీణావినోదాదివిహార
దేశంబుల విచ్ఛిన్నవిభ్రమోపహారవిచారపిచ్ఛందకాదిమందిరంబుల మూకీభూత
శుకశారికానికాయంబులం గల కన్యాంతఃపురంబు గలయం గనుంగొని.

134


క.

ఏనొకటి చేయఁదలఁచినఁ
దా నొకటి దలంచె విధి లతాతన్వికి నా
పూనినపని తుదిముట్టం
గానిక యీనైతి [38]నైతిఁ గపటంపుఁజెలిన్.

135

వ.

అనుచు వచ్చి యచ్చిత్రరేఖ యమ్మచ్చెకంటి పచ్చవిలుతు రచ్చపట్టయిన
పాన్పునం పవడించి యున్న నచ్చోటికి టోయి తప్పక కనుఁగొని.

136


ఉ.

నవ్వక నవ్వునెమ్మొగమున న్నిగుడారెడు వింతకాంతియున్
మవ్వపుఁ గ్రొమ్మెఱుంగులకు మాఱటలైన కటాక్షరోచులుం
జివ్వలు చేసిచేసి యిటు చిక్కునె వెన్నెలవెల్లివేఁడికిం
బువ్వులవాఁడికిం జిగురుబోఁడికి నే మనవచ్చు నీ యెడన్.

137


వ.

అని పలుకుచు నప్పొలఁతి కలికికన్నులకొలుకులం గీలుకొన్న కజ్జలజల
కణంబులు దనపై దుకూలాంచలంబులం మెత్తమెత్తన యొత్తి యత్తరళలోచన
కుచంబులపై ముత్తెపుసరంబులు నులి చక్కం ద్రోచి యాచంద్రముఖి యళికదేశం
బునం గలయఁబడిన యలకంబులు నూలుకొలిపి తెప్పిఱినచందం బెఱింగి చిత్ర
పటంబు దెచ్చితి నీదె చూడుమని యిట్లనియె.

138


సీ.

సుదతి నీమదిలోనిసొర దోఁకి మదనుండు
                 తన కొండుచో టింకఁ దడవుఁ గాక
కాంత నీపలుకులు గరజాణచిలుకల
                 వెదకి నాలుకముల్లు విఱుచుఁ గాక
పడఁతి నీచూపు లుప్పనబట్టె లాడించి
                 చెలులవక్త్రములఁ బూజించుఁ గాక
మెలుఁత నీయడుగులు మెలఁగ నేర్చుట చూచి
                 యందెలతో మాట లార్తుఁ గాక


గీ.

నాకతంబున వచ్చిననవ్వుఁబాటు
మాటు వడఁ జేసి నీ కూర్మిమగనిఁ దెత్తు
నిత్తు నీచిత్రపటమునం దెవ్వఁడైన
మెత్తుగాక నీ చెలికత్తె మేటినేర్పు.

139


మ.

అనుచుం జిత్రపటంబు దెచ్చి హృదయాహ్లాదంబుగాఁ జూపినం
గని యక్కాంత జగత్త్రయంబు సుమనోగంధర్వయక్షాప్సరో
దనుజాదిత్యులసిద్ధసాధ్యవసురుద్రవ్రాతమున్ మారుతా
శనసంకీర్ణరసాతలాశ్రితుల నాశాశూన్యయై దాఁటుచున్.

140

వ.

ఇత్తెఱంగునం ద్రిదివపాతాళంబులయందు మహానుభావులుం గల రని
మునుముట్టం దడవి నిజమనోరథసిద్ది వడయనేరక భూమండలం బవలోకించి భరత
ఖండంబున.

141


సీ.

పాంచాల పాండ్య బర్బర కిరా తాభీర
                 కురు విదేహ విదర్భ కుకుర గౌళ
గాంధార మగధ కొంకణ కళింగ పుళింద
                 సింధు సౌవీరాంధ్ర చేర చోళ
సాముద్ర సాల్వ కోసల కళింగ కుళింగ
                 వత్ససౌరాష్ట్రాంగ వంగ మత్స్య
సూరసేన సుదేష్ణ సుహ్నా కాశ కరూశ
                 లాట కర్ణాట మాళవ వరాట


తే.

కుంత లావంతి [39]ఘూర్జర కుహ్మక త్రి
గర్త బహుధాన యవన టేంకణ దశార్ణ
పుండ్రబాహ్లిక ద్రవిడ కాంభోజ హూణ
కేకయ వసాతి కాశ్మీర కేరళములు.

142


క.

మొద లగుననేకములు జన
పదములు గనుఁగొనె దదీయపతులను మఱియున్
హృదయం బేమూర్తులఁ జే
రద రమణిమనంబులోని రమణుఁడు లేమిన్.

143


క.

తదనంతరంబ చూపుల
కొదవె మహారాష్ట్ర పశ్చిమోత్తరభూమిన్
యదుకులనాయకునగరము
సుదతికి నచ్చిత్రరేఖ చూపెడుచోటన్.

144


వ.

అందుఁ గొందఱ యాదవులం గడచి చని.

145


గీ.

కనియె నక్కాంత యంతటఁ గమలనాభు
సీరిఁ బ్రద్యుమ్ను సాత్యకిఁ జేరి వారి

సరస ననిరుద్ధుఁ జూష మై జాదుకొన్న
పులకములతోడ జల్లనఁ బొడమెఁ జెమట.

146


గీ.

మనసు మ్రుచ్చిలి చొచ్చినమత్తికాఁడు
వీఁడు గొమ్మని చే సాఁచె వెలఁది యపుడు
కాముఁ డటమీఁద ననిరుద్ధుగాత్రమునకు
జిగురుఁబట్టెంబుఁ జేర్చుట చెప్పినట్లు.

147


వ.

ఇట్లు చిత్రలేఖాదర్శితం బయినచిత్రపటంబునం దనమనోరమణుం గనుం
గొని యుషారమణి రమణీయం బయినతదాకారంబునం దవిలి తదన్వయనామ
ధేయంబు లెఱింగింపు మనుటయు నచ్చిత్రరేఖ యిట్లనియె.

148


మ.

వనితా వాసవవైరిమర్దనుఁ డనన్ వర్ణింప నొప్పున్ జనా
ర్దనుఁ డద్దేవుని మున్ను వింటిమికదా తత్పుత్త్రుఁ బ్రద్యుమ్నుఁ గం
తునికంటెం గొనియాడఁగాఁ బొసఁగు తత్సూనుండు నీకోరువాఁ
డనిరుద్ధుం డిటు చిక్కునే సమత నీయన్యోన్యయోగ్యాకృతుల్.

149


క.

ఇక్కన్యకు మగఁడే యితఁ
డక్కట యీమగని కేటియా లిది యనుచుం
జిక్కొట్ట వలదు చెలులకుఁ
బెక్కేటికి నూరు మెచ్చఁ బెండిలి గలిగెన్.

150


క.

వెఱవకు కలలోఁ జేసిన
కొఱగామికి వగచుచోట గుణరత్నము చే
కుఱె నీకు నలిగి తన్నినఁ
బలుపు పయిం బడినయట్లు పద్మదళాక్షీ.

151


వ.

అనుటయు నవ్వనజానన యిట్లనియె.

152


శా.

ఈరూపే కలలోపలం గలసె న న్నేరూపునం జేరు నా
కీరూ పింతటిమేటిరూపసికిఁ దా నిల్లాలుగా నోమున
గ్గారా మేలలితాంగికిం గలుగు నింకం జాలు నెవ్వారికిం
జేరన్ రానిమహానిధానమునకుం జేసాచితిం దొయ్యలీ.

153


వ.

అట్లుం గాక.

154

ఉ.

ముద్దీయ ముద్దరా ల్వెనుక ముందట నొండొకకీడు లే దనం
బెద్దలకెల్ల బాట నయి పెట్టినపీఁటన యుండ నైతి నా
బుద్ధులు దప్పె నేమిటికిఁ బోయిననీళ్ళకుఁ గట్ట వెట్ట నీ
యద్దములోనినీడ కెటు లాసపడం బొసఁగుం దలోదరీ.

155


ఉ.

ధీరుల నింద్రముఖ్యు లగుదిక్పతులం గుతి[40]లాలఁ బెట్టు న
వ్వీరుడు బాణుఁ డేమిటికి వియ్యపు[41]టిచ్చకుఁ దెచ్చు మర్త్యులన్
దూరపువారిఁ దన్విఁ గన నువ్వులఁ గండ్లను నోరఁబోసికొ
న్నారము కాఁ దలంపు లలనా యిలనాడెడు ప్రాణమేటికిన్.

156


గీ.

దనుజకులవైరి శౌరి నందనులు నట్ల
రక్కసులు మనవారు వారలకు మనకు
బొసఁగునె నడుమఁ బెట్టినపూరి గాలు
నేల చిత్రరేఖా తుది నింత సణుగు.

157


వ.

అట్లుగాక నామీఁదినెయ్యంబున నీవు విచారించిన తెఱంగు.

158


మ.

వనితా నీపతితోడఁ గూడ వలతేన్ వారేల వీరేల నీ
కని నన్నా యనిరుద్ధుఁ డున్నయెడ కెట్లయినన్ వెలార్తేనిఁ బో
యిన నాతండు కులాభిమానఘనుఁడై యేయూరి కేత్రోవయం
చనుమానించినఁ ద్రోవ నన్ గొఱవిఁ జేయం జూచెదే క్రమ్మఱన్.

159


వ.

మఱియు నొక్క తెఱంగు విను మక్కుమారు నిక్కడకుం గొని వచ్చి
తన్నుం గలుపు సామర్థ్యంబు గలదేని.

160


క.

కలసెదఁ బతి నతఁ డిచ్చట
మెలఁగుట మాతండ్రి విన్న మే లగునే ప్రే
వులలోన సురియఁ ద్రిప్పిన
కలపనఁ [42]బిండైనఁ జెలిమికత్తెలు నగరే.

161


ఉ.

నావుడుఁ జిత్రరేఖ వదనంబుం బింకము మీఱఁ బల్కు నా
లావున నిప్డు దెత్తు నబలా విభు నింపెసలారఁ గూడి సం

భావన చేయవే చెలులు ప్రాణమునం బరికించునట్లు ర
క్షావిధ మాచరింపు మనసౌధములందు నిగూఢభంగులన్.

162


వ.

అనుచుం దద్దనుజేంద్రకన్యకం దనవచనచాతుర్యంబునం గార్యంబునకు
నొడంబఱచి చిత్రరేఖ యదువీరనగరంబునకుం బోయిన యనంతరంబ యా బింబా
ధరపరితాపంబు గొంత డిందుపడిన యనంతరంబు.

163


క.

[43]వెల్లి యగువగల త్రొక్కున
నిల్లిగ్గులు గానవచ్చు హృదయములోనన్
మల్లామడి యగుమదనుఁడు
మెల్లన కూర్చుండెఁ దాల్మి మినుమిను కనఁగన్.

164


ఆ.

అట్లు చిత్రరేఖ యదువీరనగరంబు
చేర నడిగి యక్కుమారవరుని
బట్టితెచ్చు తెఱఁగు భావించి మాయాబ
లంబు దప్ప నొండులాగు లేమి.

165


వ.

చింతించి.

166


చ.

ఒక కమలాకరంబునకు నొయ్యనఁ జేరిన నందు నారదుం
డకలుషయోగనిశ్చలత నచ్యుతఁ జిత్తమునం దలంప బా
లికరచితప్రణామముకుళీకృతపాణిపయోరుహాళిమా
లిక కుటిలాలకాలికవళీభవదాకృతి యయ్యె నయ్యెడన్.

167


వ.

ఇట్లు మొక్కుచు వినమ్రవదన యయి యున్న యన్నలినలోచనతో
నారదుండు.

168


క.

ఓరమణి! నీవు వచ్చిన
కారణ మెఱిఁగింపు మనుడుఁ గడువేడుక నిం
డారినమదితో నిట్లను
నారమణీతిలక మమ్మహామునితోడన్.

169


మ.

బలిదైత్యేంద్రతనూజుఁ డొప్పు జగతిన్ బాణుండు తత్పుత్రియై
కులదీపం బనఁగా నుషారమణి మాకుం బ్రాణమై యుండు నా

లలనారత్నముఁ బార్వతివరవచోలబ్ధాత్మకుండై యొకం
డలయించెం గలలోన మానసగృహైకాకారుఁ డై వేడుకన్.

170


క.

వాఁ డెవ్వఁడో యెఱుంగదు
పోడిమి చెడ లజ్జ గోలుపుచ్చె ననుచుఁ బూఁ
బోఁడి వగచునెఁడఁ జెప్పితి
వేఁడి[44]కొనన్ మగఁడు నీకు వీఁ డని పిదపన్.

171


క.

వరునిపొడ[45]పొ ట్టెఱుంగక
విరహానలశిఖలచేత వేఁగెడు చెలికి
న్వెరవారఁ జిత్రపటమున
సుర వర పన్నగుల వ్రాసి చూపితి నంతన్.

172


వ.

అందులోన.

173


క.

అనిరుద్ధునిఁ జేపట్టెను
మును గలలోఁ గన్నరూపమునకుం జో డై
యునికిఁ దెలసి యాతనిపయి
మనోజరాగంబు మిగుల మరగించుటయున్.

174


మ.

పరితాపంబునఁ బొందు నప్పొలఁతికిం బంతంబు నే నిచ్చితిం
దరుణీ! తెచ్చెద నీమనోరమణుఁ జింతాధార మిం తేల యం
చు రహస్యంబుగ నిక్కుమారవరుఁ గొంచుంబోవ నా త్రోవఁ గా
నరు తక్కెవ్వరు శౌరికిం బిదపఁ గానం జేయుమీ సంయమీ!

175


వ.

అత్తెఱం గేల యను తలంపు గలదేని నవధరింపుము.

176


ఉ.

బాలుఁ డితండు మార్కొనిన బాణుఁడు గెల్చు మురారియైన నా
భీలభుజుండు దద్దనుజు భీమబలుం బరిమార్చునంతలో
నా లలితాంగి నిర్భయవిహారములం జరియించు వాని హృ
చ్ఛూలముగాక యున్నె మనుజుండుఁ దనూజయుఁ గేలి సల్పఁగన్.

177


వ.

కావున నవశ్యంబు యుద్ధంబు సిద్ధంబు.

178

ఉ.

నావుడు వామలోచనకు నారదుఁ డిట్లనుఁ గయ్యమన్న సం
భావనగన్న చందమునఁ బాఱుదుఁ [46]బయ్యర దూదినై ప్రమో
దావహ మైనయీపని రయంబునఁ జేసినఁ జాలుఁ దెచ్చెదం
లో వసుదేవసూను ననుబోఁటికిఁ గన్నులపండు వొప్పదే.

179


వ.

అనిన విని చిత్రరేఖ వెండియు నొక్కతెఱంగు విన్నవించెద నాకర్ణింపు
మని యిట్లనియె.

180


క.

తన మనుమనిఁ గొనిపోయిన
మనమునఁ గోపించెనేని మధుసూదనుఁ డే
మని శాప మిచ్చునో నా
కన తలఁకున నీకుఁ జెప్ప కట పో వెఱతుం.

181


గీ.

కెలనివారికి నెంతటికీడు పుట్టె
నేని తొలఁగించు హరి దన కేగ్గు చేయు
వెడఁగుఁ జెఱుపండె యెదిరికి న్మడఁచువాఁడు
దనకుఁ దగరంబు చఱచు టెంతటిభరంబు.

182


క.

మునినాథ! నీవు మునుము
ట్టనె చెప్పినఁ జాలు మఱి కడంగఁడు నాపై
గినియ విని యతఁడు దర్పిత
దనుజకృతం బని రణంబు దడవుం బిదపన్.

183


వ.

అనుటయు నారదుండు గలహసంపాదనవిశారదుండు గావున నమ్ముదితతో
నిట్లను నిది నీకుం బని గాదు నాచేసిన సంవిధానంబున నీవు నిశ్చింతంబుగా నని
రుద్ధుం గొనిపొమ్ము.

184


మ.

అనినం బొంగి లతాంగి యాదవనగర్యంతఃప్రవేశంబు చే
సి నభోమండలహారిసౌధమయతం జెన్నారు ప్రాద్యుమ్నిహ
ర్మ్యనితాంతాంతికభూమి చేరి కనకప్రాసాదమధ్యంబునం
దనిరుద్ధు న్విభవప్రసిద్ధుఁ గనియెన్ హాలామదాలంకృతున్.

185

సీ.

లలితనూతనలతాలంకారముల మెచ్చి
                 మొగమిచ్చు లేమావిమోక వోలెఁ
బరివారకాపటలంబుతో నవ్వ
                 దొరకొన్న పిన్నచందురుఁడు వోలె
గమలినీకలికావికాసంబు లెఱిఁగి పై
                 [47]వ్రాలెడు తేఁటిరాచూలి వోలెఁ
సరళసౌదామినీసల్లాపముల మేను
                 గరుపాఱుమిండమేఘంబు వోలె


తే.

నంతకంతకుఁ జిట్టంటు లంటి యంటి
చెలువలకు యౌవనము విందు చేయ నున్న
మాసగుణబద్ధు మన్మథమంత్రసిద్ధు
రుచిరరసవిద్ధు నాయనిరుద్ధుఁ జూచి.

186


క.

మును విద్యాధరసంతతి
యనఁగా వివిధంబు లగునుపాయంబుల మీ
ఱినతనమాయాబలమున
ననిరుద్ధుం బొదివె విస్మయాపాదిని యై.

187

చిత్రరేఖ యుషాంతఃపురంబున కనిరుద్ధుం దెచ్చుట

చ.

పొదివిన నభోవిహారమునఁ బువ్వునుఁ బోలె నలంగకుండ న
మ్మదనసమానుఁ బట్టికొని మానవదానవదేవకోటికిం
గద లెఱుఁగంగనీక చని కాంచె నుషాసతిఁ జిత్రరేఖ యా
ముదితకు రాకపోక [48]లొకమూఁడుముహూర్తము లయ్యె [49]నయ్యెడన్.

188


క.

ఇది నీకోరినఫల మని
సుదతికి ననిరుద్ధుఁ జెలువ చూపి యిటు లనున్
మది సొచ్చి నీకుఁ గూరిమి
యదికిన వలరాచచుట్ట మవునో కాదో.

189


చ.

అనుటయుఁ బూర్ణచంద్రముఖు నాదటఁ జూడఁ జకోరనేత్రకుం
గనుఁగొన నెమ్మనంబు శశికాంతశిలాతల మయ్యె నంతలో

దనియకమున్న కన్నుఁగవ తామరజోడుతెఱంగు దాల్చె ముం
చినపరితాప మంతయును జీకటితోఁ బురుడించు నత్తఱిన్.

190


గీ.

చిత్తమున బాణకన్యక చిత్రరేఖ
చేత లన్నియు నత్యంతచిత్ర మనుచు
సంతసము నొంది యనిరుద్ధు నంతిపురము
నందుఁ బెట్టించె నేకాంతమందిరమున.

191


వ.

అక్కుమారుండు.

192


క.

ఏమగువ పట్టికొనెనో
యేమిటికిం దెచ్చెనో యి దెక్కడిపాటో
యేమీ యెఱుఁగఁడు మది మఱి
తామసి యనువిద్య తొలుతఁ దనుఁ బొందుటయున్.

193


వ.

ఇట్లు మాయామోహితుం డయిన ప్రద్యుమ్నతనయుండు పాన్పుపైఁ బవ్వ
ళించియున్నతఱి నత్తెఱవ చిత్రరేఖ కిట్లనియె.

194


క.

ఇరునెవి యెఱుఁగక యుండం
దరుణీసుఖ మనుభవింపఁ దలఁచిన బదివే
వురకన్ను లెదుటఁ బడితిని
సరివా రెల్లిదము చేయ జాణెత నయితిన్.

195


క.

జలతైలబిందు వయి నా
మెలకువ వెల్లివిరి యైన మేలగునే ని
ర్మలచరితుఁ డయినబాణుం
డలుగఁడె ప్రాణముల కింతయపరాధమునన్.

198


వ.

అనినం జిత్రరేఖ యి ట్లనియె.

197


క.

ఏమనగ లాఁతివారమె
నీమన సెట్లట్ల కాక నీరజవదనా!
యేమటికిఁ [50]దలఁకె దల్లిం
దామరయును బోలె నుండి తగవు విడుతురే.

198

వ.

అనుచు సఖీజనంబులమనంబులకు రహస్యంబు వెలిపుచ్చం దగమిదోఁపం
బలికి వారిం దమతమవినోదంబుల నెప్పటియట్ల నిలువంబంచిన యనంతరంబ.

199


చ.

పడఁతి కుమారచంద్రుకరపల్లవముం దనచన్నుదోయిపై
నిడి పులకించి కన్నుఁగవ యించుక మోడ్చి వెండియుం
జిడిముడిపాటుతో నతనిచెక్కులు గ్రుక్కుచు మోవి వ్రేళులం
బుడుకుచు నుండెఁ దాల్మి గడివోయిన నించుక లజ్జలావునన్.

200


వ.

ఇట్లున్న యక్కన్నియ కన్నెఱింగి చిత్రరేఖ మదుమథను మనుమనిం బొది
విని మాయామోహంబు నెడలించి పరిబోధపరిచిత్తుం జేసి యత్తరుణతో రాత్రి
కడచన్నకొలంది చెప్పి ప్రొద్దువోయెం టోయి వచ్చెదనని వీడుకొని వెడలె నా సమ
యంబున.

201


చ.

[51]ఒదికిలి పాన్పుపైఁ బతికి నొయ్యన కేలు దలాఁపు చేసి క
ట్టెదురుగఁ గౌఁగిలించికొని యెత్తుచు నొత్తుచు మోము మోముతో
గదియ నమర్చి పేర్చి పయిఁగా లిడి నేరిమి లేనినేర్పులం
బొనలెడియూర్పులం గరువువోసినభంగి లతాంగి యుండగన్.

202


వ.

ప్రద్యుమ్నతనయుండు.

203


క.

బిగువుఁజనుంగవతాఁకును
జిగురుంగెమ్మోవి మోవి చేరుటయును సూ
డిగములచేతలగడయును
మగువ కవుంగిట నొకర్తు మరగుటఁ దెలుపన్.

204


వ.

కనువిచ్చు నప్పుడు.

205


ఆ.

మెఱుఁగుఁదీవవోలె మెలఁతుక కౌఁగిట
మేలుకట్లక్రింద మేడమీద
రత్నదీపమధ్యరాజితం బగుతల్న
తలమునందుఁ బొందుతన్నుఁ జూచి.

206

క.

కలగన్న చందమో మది
కలఁగుటయో యైంద్రజాలికవినోదంబో
తెలియఁగ నేర నటంచును
దలఁచును నిజమైన నేన ధన్యుఁడ ననుచున్.

207


క.

నాకనకప్రాసాదము
నాకొలువువిలాసినులును నాచుట్టములున్
లేకున్న నేమి కౌఁగిట
నీకామిని యున్నఁ జాలు నెల్లచవులకున్.

208


వ.

అనుచు నయ్యనిరుద్ధుండు నిద్దురలేమి నక్కామినిపొందు నిక్కంబుగా
దెలిసి.

209


సీ

తెమలించి కురులొయ్యఁ దివియ [52]లే కట మున్న
                 కదిసినకెమ్మోవి గమిచి కమిచి
[53]వెడవెడ సోఁకి పై నడర లే కటమున్న
                 యలవడ్డకౌఁగిట నదిమి యదిమి
వలు వెడలింపఁ [54]జే వాటు లే కటమున్న
                 పైకొన్న జఘనంబుఁ బ్రాఁకి ప్రాఁకి
తమకించి కొసరుపంతంబు లే కటమున్న
                 [55]కదిసినచిత్తంబు గరఁచి కరఁచి


తే.

తుది మొదలికంటెఁ దుదికంటె మొదలు చాలఁ
జవులగను లయినరతులకు జనవు లిచ్చి
పూవిలుతుచేతిజంత్రంపుబొమ్మఁ జేసె
మానినీతిలకంబుఁ గుమారవరుఁడు.

210


వ.

ఇవ్విధంబున మదనకేళిం దేలి యక్కులపాలికాతిలకంబు చేతం గల
లోపలం గన్నది మొదలుగాఁ గౌఁగిటిలోనున్నది తుదిగాఁ దనవృత్తాంతం బంతయు
విని యనిరుద్ధు డుషాసౌభాగ్యానిరుద్ధుం డయి కొన్నదినంబు లొరు లెఱుంగకుండ
వర్తించునెడ నొకనాఁడు.

211

క.

ఆవసదశోధనమునకు
సావాసులు వచ్చి కనిరి సౌధముపై సం
భావితుఁ డై దనుజసుతా
సేవితుఁడై యున్న మనుజసింహుఁ గుమారున్.

212


మ.

కని యక్కోమలికిం గుమారునకు సంగం బంగజాయత్తమై
యునికిన్ బాణునితోడఁ జెప్పఁ జని వా రొండేమియున్ శంకలే
క నరుం డొక్కఁడు దేవ! నీ నగరిలోఁ గన్యాజనాంతఃపురం
బున నున్నాఁడు భవత్సుతావిభుత నిప్పొందియ్యకొన్నాఁడవే.

213


ఉ.

నావుడు రోషవహ్నివలనం బొగ రేఁగినభంగి మోమునం
గావిరి పర్వ నంగమునఁ గంపము నివ్వటిలంగ బాణుఁ డ
త్యావిలచిత్తుఁ డై మనుజుడట్టె మదీయపురంబు చొచ్చె న
చ్చేవయ కాక సానగరు చెర్చె నిసీ మగమాట లేటికిన్.

214


క.

[56]ఏ నటె నాకూఁతురి నటె
మానవుఁ డటె నగరు చొచ్చి మాకులమునకున్
హాని యొనరించెఁ గన్నులఁ
గానఁడు దలయెత్త రోఁత గాదే నాకున్.

215


క.

మనుజాంగనలం బట్టుట
దనుజులకుం జెల్లుఁగాక దనుజాంగనలన్
మనుజులు పట్టుటకును దొర
కొనిరే బెండులు మునింగి గుండులు దేలెన్.

216

అనిరుద్ధుఁ బట్ట బాణుఁడు తనకింకరులఁ బనుచుట

క.

అని తనకింకరసైన్యము
ననిరుద్ధునిమీఁదఁ బనిచె నదియు భయోత్సా
దనగతిఁ బట్టుఁడు కట్టుఁడు
తునుముఁ డనునెలుంగు లడరఁ దోతెంచె వడిన్.

217

క.

అప్పలుకుల కలకలు మది
నుప్పర మెగయంగ నెసఁగె నుల్లాసము మై
నొప్పారఁగ బరిగోలల
నొప్పించిన భద్రగజము నూల్కొన్నగతిన్.

218


వ.

అక్కుమారకంఠీరవుండు.

219


క.

ఆతరుణి వలదు వలదని
భీతిం దనుఁ బట్ట బట్ట భీకరతరని
ర్ఘాతరవసింహనాదుం
డై తత్సౌధంబు డిగ్గె నవుడు గఱచుచున్.

220


వ.

 ఇట్లు డిగ్గి తదంతఃపురద్వారంబున నిలిచి దారుణతరం బగు పరిఘంబు
పుచ్చికొని.

221


మ.

తన మోరధ్వనికిం గలఁగఁబడు తత్సైన్యంబు దైన్యంబునం
దునుకొందం బరిఘంబు పై విసరుచున్ దుర్వారుఁడై పైపయి
న్మునుఁగం బాఱు శరాసిముద్గరగదాముఖ్యాయుధశ్రేణిచే
గినియం జేసిన వేసవిన్ రవి దివిన్ గ్రీడించుచందంబునన్.

222


క.

మండి పదాతులఁ గొందఱఁ
జెండాడిన నున్నవారు చెడి పాఱిరి బా
ణుం డున్నయెడకు నొడళుల
నిండను నెత్తురులు గ్రమ్మి నిట్టూర్పులతోన్.

223


వ.

అప్పు డద్దనుజేంద్రుండు.

224


క.

వెఱవకుడు పాఱకుఁడు చిం
దఱవందర గాకుఁ డేల ధైర్యముఁ దూలన్
మఱచితిరె కులముఁ గీర్తియుఁ
బెఱుకులగతి నింత వలదు బీరము చెడఁగన్.

225


ఉ.

పాఱెడుత్రోవ మీకు నలవాటుగఁ జేసినవీరుఁ డెవ్వఁడో
మీఱి యనేకయుద్ధముల మీరు జయించుట లెల్ల నింతతోఁ

దీఱె ననుం గనుంగొనుఁడు ధీరతఁ దోడ్పడ రండు నాకునుం
బాఱుఁడు పాఱుఁ దంచుఁ బరిపంథుల నోర్వుడు చాలు మీపనుల్.

226


వ.

అని వారి నడకించియు నదలించియుఁ బొదుపు చేసి పోరికిఁ బురికొల్పి
మఱియు మహావీరుల బదివేవురుం బదివేవురుగాఁ బలుదెఱంగుల మూఁకలు చేసి
ప్రమథగణంబులం గలపి పంచిన.

227


శా.

నేలం గొందఱు మింటఁ గొందఱు గజానీకంబుఁ గీలాలము
గ్జాలంబుం బురుడింప సంచితమదోత్సాహంబు దేహంబులం
జాలం గ్రాల నిశాతహేతిలతికాసౌదామనీదామభీ
మాలంకారము బీరముం దెఱుప నుద్యద్విక్రమక్రీడతోన్.

228


వ.

వచ్చి నిలు నిలు మని యదల్చి తాఁకిన.

229


క.

ఒక్కనికిఁ బెక్కుమొనలకు
దక్కక పో రగుట యరిది దానవబలమై
క్రిక్కిఱిసిన తిమిరమునకు
స్రుక్కక యాదవకుమారసూర్యుఁడు నిలిచెన్.

230


వ.

ఇట్లు నిలిచి తనచేతి పరిఘంబు కంధరంబునం జేర్చి.

231


తే.

పరిఘతోమరాదులఁ దన్నుఁ బరులవైవ
వారివారికైదువులన వారి వైచె
మఱియుఁ దనతొంటిపరిఘం బమర్చి చేత
నాసురారాతిసేనపై నడచె నపుడు.

232


వ.

ఇట్లు.

233


క.

ఇరువదినాలుగువేవురు
వరభటులం గింకరుల నవారణఁ బోరం
బరిమార్చి విక్రమక్రమ
ధురంధరుం డయినవిజయదోహలి మఱియున్.

234


క.

పలకయుఁ గరవాలముఁ గొని
పొలికలనం గెలనఁ జదలఁ బొదల మెఱుంగుల్

వల నొప్పారఁ బ్రచారం
బులు ముప్పదిరెండు నిండుమొనలకుఁ జూపెన్.

235


వ.

ఇట్లు వివిధవిక్రమవిహారంబులకు సారంబు లగుకరవాలధారాప్రహారంబుల
బరబలంబులం బొరిగడిగి యదుకుమారకుంజరంబు పంజరంబు విడివడినసింగంబు
నంగంబులవణి ననుకరించుచుఁ గరటిఘటాఘాటవిఘటనంబున జటులవలాహక
పటలవిపాటనంబునఁ దురగపరాపరాఙ్ముఖీకరణనైపుణంబునం దరశతరంగ
పాళీపలాయనప్రతివాదనంబున నిబిడస్యందనసందోహవిదారణంబున విచిత్ర
యానపాత్రవిధ్వంసనంబున సముద్భటభటసముదాయఖండనంబునం బటువిటపి
వాటిమోటనంబునఁ బ్రచండపవమానప్రతిమానుం డగుటయుఁ దత్సైన్యంబు
చాఁపకట్టువడి నందుం గొందఱు విఱిగి పాఱుచో సందడిమ్రందియు సంగడి
వారిం బ్రందియు నెత్తురులు గ్రక్కియు నిగుడ లేక చిక్కియుఁ దాఁకి పడియును
దల్లడపడియును వ్రేళులు గఱచియు వెనుకవారికి వెఱచియుఁ గైదువులు వైచియుఁ
గ్రంతలు చూచియు బడిపాఁతఱలం ద్రెళ్ళియుం బలుకకు మని గిల్లియు నిండ్లు
దూఱియు నెడదవ్వువాఱియుఁ బీనుఁగులలో డాఁగియుఁ బేరుకొన్న రేఁగియుఁ
బోరాక మరలియుఁ బోటులేక పొరలియు చొచ్చియు విరథులై కోలుకొనలేక
పఱచి రప్పుడు గొందఱు నేలయెడ చాలక నింగికిం దొలంగిన.

236


క.

చెడి విఱిగినసైన్యంబుం
బొడగని బాణుండు లోన భుగభుగ మండెన్
విడువక సమిదాజ్యాహుతు
లడరింపఁగఁ బరఁగు నర్వరానలము గతిన్.

237


వ.

అప్పుడు.

238


శా.

కుంభిస్యందనవాజిసైనికపరిక్షోభంబు వారించుచుం
గుంభాండుండు సహస్రవాహయుతముం గోదండముఖ్యాయుధా
రంభోదగ్రము ఖడ్గచర్మవృతమున్ రత్నాఢ్యముం గా ససం
రంభుం డై దశనధ్వజోగ్రరథముం బ్రాంతంబునన్ నిల్పినన్.

239


ఉ.

దానవనాథుఁ డారథ ముదగ్రత నెక్కి సహస్రబాహులం
బూనిన శస్త్రజాలము నభోజలదంబున కింద్రబాపసం

ధానము చేయ బీరపుటదల్పులతోఁ గవచాంగుశిత్రగో
ధానికరంబుతో శరవితానముతో నెదిరించి నిల్చినన్.

240


క.

కనుఁగొని చిఱున వ్వొలయఁగ
ననిరుద్ధుఁడు పూర్ణశశినిభాననుఁ డై మా
ర్కొన నరుణలోచనుం డై
దనుజుఁడు నిలు నిలువు మనుచుఁ దాఁకెం బెలుచన్.

241


వ.

అప్పుడు.

242


క.

ప్రాణము ఝల్లన నుష క
ల్యాణనిధిం బ్రియునిఁ జూడ నతఁడు గుఱియు నా
బాణకరనికరఖతర
బాణంబులకుం గటాక్షబాణంబులకున్.

243


తే.

తండ్రిఁ గనుఁగొన వెఱచి సౌధంబులోన
మఱుఁగుపడు నింతి పతిఁ జూడ మఱియు నెడలుఁ
జిన్నఁబోయినమోముతోఁ జిత్రరేఖ
తనకు వచ్చినచే టని తల్లడిల్లు.

244


వ.

అట్టియెడ బాణాసురుండు.

245


క.

దనుజసుతాసురతోత్థిత
మనోజచిహ్నాభిరామమండన మగునా
యనిరుద్ధుమేను గనుఁగొని
తనుత్రరహితంబు సుకరదారుణ మనుచున్.

246


క.

అడిదము గొని నాతోఁ దల
పడియెడునీపడుచుఁ జంప భరమే యని పై
నడరించె వేయిచేతుల
జడిగొనఁ గైదువులు మఱియు శరనికరములన్.

247


వ.

తదవసరంబున.

248


మ.

పలకన్ బాణపరంపరల్ జడియుచుం ప్రద్యుమ్నసూనుండు మొ
క్కలుఁ డై యేనుఁగు జంప నాది గొనుసింగంబు న్విడంబించి మం

డల విభ్రాంతి నహర్పతిం జెనయుచున్ డాసెం దదంగంబు న
మ్ములచే రక్తమయంలు చేసి దిశలన్ మూసెన్ సురారాతియున్.

249


క.

శరములు దాఁకిన నెత్తురు
దొరిగిన సంగరవిహారదోహలి యై ని
ర్భరరోష మడర బాణుని
యరదమునకుఁ జిత్రగతుల నతఁడు గదిసినన్.

250


వ.

అక్కుమారసింహంబుమీఁద నసురేశ్వరుండు పరిఘపట్టిసముసలముద్గర
ప్రాసప్రముఖంబు లగు వివిధాయుధంబు లొక్కుమ్మడి నడరించిన నతండు
చలింపక సందీప్తక్రోధుండై.

251


క.

గగనమున కెగసి యరదము
నొగ దెగిపడ వ్రేసి ఖడ్గనూతనగతు లొ
ప్పుగఁ దిరిగి తురగములఁ దన
మగతన మమరంగ యదుకుమారుఁడు వ్రేసెన్.

252


ఉ.

వేసిన నింద్రవైరి యదువీరునిపై ముసలాసిముద్గర
ప్రాసగదాదిహేతీనికరంబు ముసుంగుగ వైచె నప్పు డా
యాసురసైన్య మార్చె నతఁ డంతటఁ బోక విచిత్రఖడ్గవి
న్యాసముతో రథంబుకెలనన్ మెఱుఁగై మెఱిచెం దగుక్కనన్.

253


వ.

అట్టియెడ నద్దనుజేంద్రుండు సముద్ధతక్రోధుండై శక్తి వైచిన.

254


శా.

ఘంటాటంకృతితోఁ గృతాంతలగుడాకారంబుతో దిక్కులన్
మింట న్మంటలు గ్రమ్ము క్రొమ్మెఱుఁగుతో నెక్కొన్న యాశక్తి పై
కొంట న్మేను మలంచి పట్టికొని కోకొ మ్మంచు వ్రేసెన్ వెసన్
వెంటన్ గీఱి ధరిత్రి దూఱ నతఁ డవ్వీరుండు మూర్చిల్లగన్.

255


తే.

అంతలోనన తేఱినయసురనాథుఁ
జూచి కుంభాండుఁ డిట్లను శూరుఁ డయిన
యతనితో నింక నీవు గట్టెదుర నిలిచి
పాడిమై నని చేసిన బ్రదుకు కలదె.

256

క.

ఆయుధము దాఁకు డెఱుఁగఁడు
పాయము బలియించి తింతవడి మరల నితం
డాయతభుజుండు మ్రింగును
మాయాబలమునన కాని మడియఁడు నీచేన్.

257


వ.

అనుటయు నతండు రోషదహనదందహ్యమానమానసుండై యొం డుపా
యంబు చేయ నేరక మాయ గైకొనం దలంచి.

258


క.

ఉరగము నెరగొను గరుడని
వెరవున [57]నరు నణఁతు నని దివికి వెస దాఁటెన్
నరథంబుగ సధ్వజముగ
సరథ్యసాహస్రముగ ససారథికముగన్.

259


వ.

ఇవ్విధంబున.

260


క.

ధీరుఁడు బాణుఁ డదృశ్యా
కారుం డయిపోయి కలను గయికొని ఖడ్గ
స్ఫారప్రచారపరుఁ డగు
నారాయణపౌత్రు నేసె నాగాస్త్రములన్.

261


వ.

అయ్యస్త్రంబులచేత.

262


క.

సందానదందశూకా
స్పందితసర్వాంగుఁ డయిన ప్రద్యుమ్యసుతుం
జందనగంధులు చూచిరి
చందనధరణిరుహంబుచందాన ననిన్.

263


వ.

ఇట్లు పాముల చేతం గట్టువడి నేల కొఱిగిన కుమారుం జేరి యరదంబుమీఁదన
టెక్కెంబుకామపై నొఱగి బాణుండుఁ గుంభాండున కిట్లనియె.

264


క.

కులకన్యాదూషకులం
దల గోయక యున్న నేల తగ వగు వీనిం
బొలికలనికి బలి యిమ్మని
పలికినఁ గుంభాండుఁ డసురపతి కిట్లనియెన్.

265

ఆ.

కలనఁ బడినవారిఁ గయికొని [58]కొనిపోయి
పుండ్ల నోమి మగుడఁ బుచ్చు టొప్పు
బంత మడిగి మగుడ బవర మిచ్చుట యొప్పు
నించునేని దాన యేలు టొప్పు.

266


వ.

వినుము చెప్పెద.

267


క.

భుజగర్వ మడఁగఁ జుట్టిన
భుజగాస్త్రము లిట్టు నట్టుఁ బొరలం బడినన్
గజిబిజి లేదు మొగంబున
మజ బాపురె వీనిఁ బోల మగలుం గలరే.

268


గీ.

వేయిచేతులవాఁడవు వివిధసమర
విజయశాలివి దైతేయవీరవరుఁడ
విట్టి నీతోడఁ బోరాడ నెవ్వఁ డోపు
విక్రమక్రీడ సరి లేని వీఁడ కాక.

269


చ.

ఇతనికులంబుఁ బేరు విని యేలఁ దలంచిన నేలు మేలు నీ
కతిబలుఁ డయినబంటు హృదయంబున రోషము పట్టితేని వ
ధ్యతకు విధింప నేల యితఁ డాఁకకుఁ బాత్రము నీ వెఱుంగవే
ప్రతినయు నాజ్ఞయుం దగవుఁ బంతము రాజులు దప్ప రెన్నడున్.

270


మ.

అనినం బండులు గీటి కొంచు హృదయం బల్లాడ బాణాసురుం
డనఘా, నీపలు కేను దాఁటుదునె వీఁ డన్యాయకార్యంబు చే
సిన సైరింపక యుంటి వంశమునకుం జేటైన యీకౌలటే
రునిఁ గన్యాకులటాసమేతముగఁ జేర్తుంగాక కారాస్థితిన్.

271

బాణాసురుఁ డనిరుద్ధునిఁ జెరసాలం బెట్టించుట

గీ.

అనుచుఁ జెఱసాలవారికి నప్పగించి
యాదవకుమారుఁ గూతును నసురవిభుఁడు

మనములోపల నెగ్గించి మరలిపోయె
నాత్మమందిరమునకుఁ గుంభాఁడుఁ గూడి.

272


క.

అంత నిట హరినగరిలో
నంతఃపురకాంత లెల్ల ననిరుద్ధుని సౌ
ధాంతరములందుఁ దడవుచుఁ
జింతించుచు నింక నేమి చేయుద మనుచున్.

279


సీ.

చెందమ్మివిరులలోఁ జిందుతేనెలు వోలె
                 గన్నుల బాష్పాంబుకణము లడర
[59]వదరుచీకట్లలో వ్రాలుచుక్కలవోలె
                 వేణీభరమ్ములో విరులు వ్రేల
దూలుతీఁగెలవెంటఁ దూగుతేఁటులు వోలె
                 నసదునెన్నడుముల నారు లొలయ
[60]రాపుజక్కవలఁ జేరనిచంద్రికలు వోలె
                 జన్నుల ముత్యాలసరులు పెనఁగ


తే.

ముద్దుమోము లల్లార్చుచో మూఁపులందు
గర్ణభూషణజాలంబు గళిగళింప
మార్చి మార్చి చేతుల వ్రేళ్ళ మడఁచికొనుచు
నింక నెట్లమ్మ యంచు నయ్యింతు లేడ్వ.

274


వ.

అందుఁ గొందఱు.

275


సీ.

చక్కనివారిలోఁ జక్కనివాఁడు దాఁ
                 [61]గడుఁబిన్నగాని వేగంబు వీఁడు
బంటు నొచ్చిననోరఁ బలుకండు నెఱవాది
                 సుఖభోగి చుట్టాలసురభి రాచ
బిడ్డయై యుండి గబ్బిదనం బెఱుంగఁడు
                 గరగరనై యుండుఁ గలయ నేర్చు
నూఁపరలాఁడు గాఁ డుపకారి నవ్వు మే
                 లము గాని తనవారు లాఁతివా ర

తే.

నఁడు గడానిబంగారురత్నంపుబొమ్మ
ముంగిటినిధాన మమ్మలముద్దు దమ్ము
లన్న యీతనిఁ గనదేని కన్నతల్లి
కడుపు మసిగాదె దయ్యమ! కరుణ లేదె.

276


సీ.

అఖిలలోకాధీశుఁ డగుచక్రధరునింట
                 నొకకీడుమాట నేఁ డొదవె నమ్మ
బాల్యంబునంద శంబరుఁ జంపెఁ బ్రద్యుమ్నుఁ
                 డతనిలా వెల్లిద మయ్యె నమ్మ
[62]కీడు లేదన దేవకీదేవిబలగ మొ
                 ప్పినఁ బాలలౌఁ బండ్లు పిసికి రమ్మ
యదువీరులు ప్రమత్తు లని మున్ను మెచ్చని
                 చుట్టాలు నగ సేసి చూపె నమ్మ


తే.

చెడఁ దలంచిరి గా కేమి సిలుగు చింత
లీని యివ్వీటి కౌరు లింత పూని రేని
గడచె నింక మారతీదేవి కడుపుచల్ల
నగుట [63]విధి యిన్ని గలిగించె నక్కటకట.

278


క.

మధుమథనక్రోధానల
మధికముగా మండ నూఁదు నవ్వెంగలికిన్
విధి యలుగక [64]మును మృత్యు
క్షుధార్తివివృతాస్యపదవికోఱ యలుగదే.

279


సీ.

అనిరుద్ధసింహంబు నంటి చావునకుఁ ద
                 ప్పిన కరి హరితోడఁ బెసఁగ కున్నె
యదుపుంగవున కింత యపకార మొనరించి
                 దేవతావిభుఁ డైన దిగులు చొరఁడె

మురవైరినీడన మూఁడులోకంబులు
                 బ్రదుకంగ మన కేల పలవరింప
నద్దేవుమనుమని నద్దిరా యెటు చూతు
                 ననక [65]కేరడ మెవ్వఁ డలవరించె


తే.

వెఱవ కోడక యొకరుండు వ్రేలఁ జూప
నెంతవాఁ డక్కుమారు నోరంతప్రొద్దు
గలసి పాసి పోఁజాలనికతన మనకు
నేలతలఁ గాళ్లు నిలువమి నిజము గాక.

280


ఆ.

అనుచు నుండలేక యార్తస్వరంబున
నేడ్చి రంతిపురము నింతు లెల్ల
బురజనంబులెల్ల గురరీనినాదమో
యంగనారవంబొ యని తలంప.

281


వ.

అట్టియెడ వీరభటులు గడురయంబునం జనుదెంచి యెక్క డెక్కడ యను
వారును నే మేమి యనువారును నెవ్వ రెవ్వ రనువారును నిలు నిలు మనువారును
బోకు పో కనువారును నగుచుఁ గళవళించి యక్కామినులచే ననిరుద్ధుం డూరక
యదృశ్యుం డయ్యె నని యెఱింగి విస్మయంబున.

282


గీ.

హలధరుండును హరియు సాత్యకియు మఱియుఁ
బేరు గల దొరలందఱు బెరసి సభకు
నరిగిరి పురంబులో వీరు అంతపట్టు
నెఱుఁగ సన్నాహభేరి వేయించి పిదప.

283


క.

ఇత్తెఱఁగున సభలోపల
దత్తఱమునఁ గూడఁబడిన దర్పితసామం
తోత్తములలోన విపదుఁడు
మత్తద్విపలీల మనసు మండ నిటు లనున్.

284


చ.

ఒకఁ డనిరుద్ధుఁ బాపుటకు నుల్లములో వగ లేదు నాదు సై
నికులఁ దలంప కిందు రజనీసమయంబునఁ జొచ్చి యెవ్వఁడో

మకుటము దన్ని నాశిరము మానికముం గొనిపోయె నంచు ని
ప్పుకలఁ బొల్చినట్లు మదిపొక్కెడు నెక్కుడుభంగపాటునన్.

285


క.

కన్నుండఁ గంటిపాపం
గొన్నట్లు మొఱంగి బాలుఁ గొనిపోవుటకై
యన్నీచు బంధుయుతముగ
మన్నిగొనక యున్న నేఁటిమాటలు మనకున్.

286


క.

నావుడు సాత్యకి యిట్లను
దేవా కుఱఁగటనె వెదకి తెలియగ వచ్చుం
జూవే చోరులఁ జారుల
చే వీటికి దవ్వు వోరు చిక్కుదు రింతన్.

287


ఆ.

అనుడు దనుజవైరి యాహుకుఁ బంచిన
నతఁడు చరులఁ బంచె నాక్షణంబ
గజతురంగరథనికాయము లెక్కి వే
యరుగుదెంచి వార లరసి యరసి.

288


గీ.

కలయం దిరిగిరి రైవతకం బనంగ
మఱి లతావేష్ట మన వేణుమంత మనఁగ
ఋక్షవంత మనంగ మహీధరముల
నంతఁ బోక యుద్యానంబులందు జొచ్చి.

289


వ.

అరయుచుండి రా సమయంబున సేనాపతి యగున నాదృష్టి వెఱచి వెఱచి
నారాయణున కిట్లనియె.

290


క.

ఏ నొకటి విన్నవించెద
దానవకులమథన పెద్దదడవున నుండిఁ
బూని వినిపింపఁ గలపని
యౌనో కాదో విచార మది దెలియఁ దగున్.

291

క.

[66]దెస చెడి మైందద్వివిదులు
నసిలోమపులోములును హయగ్రీవుండున్
[67]వసి మాలి సౌంభసాల్వులు
నిసుంభ నరకులును జెడిరి నీ ఖడ్గమునన్.

292


గీ.

మఱియుఁ గొందఱు నీచేత మడిసి రందు
మిడి యడఁగఁ జొచ్చి తమసూడు దడవలేరు
పారిజాతంబు దెచ్చుచో బ్రదికి పోయె
నిర్జరాధీశుఁ డొకరుఁడు నిన్నుఁ దాకి.

293


శా.

నాకుం జూడ మనంబునం గుటిలుఁడై నాకేశుఁ డిబ్బాలుఁ దా
నే కొంపోయినవాఁడు వాఁడు దగువాఁడే గౌతమస్త్రీరహ
స్స్వీకారాదులు తచ్చరిత్రములు నాచేఁ గ్రొత్తగా నేల క
ర్ణాకర్ణికగథలందు మున్ను వినవే నానాప్రకారంబులన్.

294


వ.

అనుటయు దనుజవైరి విచారించి నిట్టూర్పు నిగిడించి.

295


క.

నాతండ్రీ సురపతిపై
నే తప్పును లేదు మన మనేకవిధములన్
దైతేయవధము చేయుట
యాతని కార్యంబ మనల నతఁడు విడుచునే.

296


వ.

అట్లుం గాక.

297


గీ.

ఉత్తముండు హితము చేసి యూరకుండు
మధ్యముండు హితము చేసి మాఱు వెదకు
నధముఁ డొరుచేయుహిత మైన నణఁచి పుచ్చు
హితమునకు నెగ్గు చేయువాఁ డెవ్వఁ డగును.

298


క.

చేసినమే లెఱుఁగుదు రొరు
గాసింపరు కుచ్చితంపుఁ గఱద లెఱుఁగ ర

త్యాసక్తసౌహృదులు [68]
త్యాసీనులు సురలు వార లపకారకులే.

299


క.

ఇప్పుడు నీ పలికిన పలు
కొప్పదు ప్రద్యుమ్నతనయు నొక్కతె వలపుం
ద్రిప్పులఁ బిడి కొనిపోయెను
దప్పెం బుంశ్చలికి నేటితగవుం గిగవున్.

300


వ.

అని చింతించుచున్న మురాంతకునకు నక్రూరుం డిట్లనియె.

301


క.

మనపని దనపని దనపని
మనపని గా నడతు మతఁడు మనము నొకఁడు మో
చినమో పిందఱు మోచిన
యనువున నీతోడువడుట యతనికిఁ గీడే.

302


ఆ.

ఎట్టికుబుద్ధి యైనఁ దనయిష్టసహాయుని కెగ్గు చేయునే
పట్టెడుచోటు గాల్చుకొను బాలిశుఁడుం గలఁడే సురేశ్వరుం
డట్టె యతండు నిన్ను దనుజాంతకుఁ డండ్రు విరోధ మేటికిన్
బుట్టెడు నిద్దఱుం ద్రిదివభూతలరక్షణ మాచరింపఁగన్.

303


క.

దేవతలఁ గావ మానుష
భావంబున నవతరించి పని వూనిన యా
దేవాదిదేవుఁడవు నీ
వేవిధమున వారు నీకు నిటు చేయుదురే.

304


వ.

అనుటయు నచ్యుతుండు.

305


శా.

గంధర్వామరయక్షరాక్షసుల కీ కార్యంబు సిద్ధించునే
[69]బంధక్యాహృతుఁడైనవాఁడు దలఁపం బ్రాద్యుమ్ని దైత్యాధిప
స్కంధావారవిహారిణుల్ గులట లీ చందంబు గావింతు రీ
[70]బంధుభ్రాంతి వెలార్చెదన్ మనుమనిం బ్రాగ్వృత్తికిం జేర్చెదన్.

308

క.

అనుటయు నచ్యుతు పదిలపు
మనంబు నిలుకడకు వందిమాగధగణముల్
వినుతించినఁ గైవారము
లనర్గళంబుగఁ జెలంగె నాస్థానములోన్.

307


వ.

తదనంతరంబ మున్ను వోయినచారులు.

308


ఆ.

కూడి గిరులుఁ దరులుఁ గొల్లంబుఁ బల్లంబు
నరసి మట్టఁ బుట్ట నడవిఁ దడవి
యోపి తొలలు సెలలు నోలంబుఁ గూలంబుఁ
జూచి క్రంత గ్రుంతఁ జొచ్చి వచ్చి.

309


వ.

మధుసూదను సభామందిరద్వారంబున నిలిచి యిట్లనిరి.

310


క.

తిరిగితిమి గాలి కైనం
జొరఁగూడనిచోటు లెల్ల సూర్యమారీచుల్
పరఁగని నెలవుల చూచుట
యరుదే యనిరుద్ధుఁ జూడ నలవడ దయ్యెన్.

311


తే.

ఇంక నే దిక్కుఁ దడవుదు మెఱుఁగఁ జెప్పు
మనుచుఁ గన్నీరు దొరుగంగ నవుడు గఱచి
కొనుచు బొమగంటు వెట్టుచుఁ గొంద ఱచట
నొం డుపాయంబు నేరక యున్నయంత.

312


మ.

చెలఁగెం దూర్యరవంబు శంఖములు మ్రోసెన్ శౌరిచిత్తంబునం
దళుకొత్తంగఁ బ్రమోద మట్టియెడ నాదైత్యారి యేకార్యమున్
నిలువన్నేరనివాఁడయై మనుమనిం దేఁ బోయెదన్ వార్ధిలో
పల నున్నన్ మును గొంత జూడ యెఱిఁగిఁపంజాలువాఁ డెవ్వఁడో.

313


వ.

అనుచుండె నా సమయంబున.

314


శా.

పారావారనగాధిరాజతనయాపాంగేక్షణోదంచిత
శ్రీరాజత్పులకావళీవరతనుప్రీతిప్రకాశాంతరా!
కారుణ్యామృతవర్షిభాషణవిధాకళ్యాణరత్నాకరా!
దూరీభూతతరాంతరాయనివహా దుష్టాత్మశిక్షాపరా!

315

క.

దోషాకరజయభూషా
దూషితనిశ్శేషితారి దురితపరాళీ!
భీషణఘోషాఢ్యయశః
పోషణనిత్యాభివృద్ధ పుణ్యసమృద్ధా!

316


మాలిని.

నిగమనివహరంగా! నిత్యమానాంతరంగా!
విగతజననసంగా! వీతభేదప్రసంగా!
ఖగహిమకరనేత్రా! గౌరనీలాభ్రగాత్రా!
జగదధికృతపాత్రా! సమ్మదోద్యచ్చరిత్రా!

317


గద్యము.

ఇది శ్రీమదుభయకవిమిత్త్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాధనవిరాజి
తిక్కన సోమయాజీ ప్రణీతం బైన శ్రీ మహాభారతకథానంతరంబున శ్రీమత్సకల
భాషాభూషణ సాహిత్యరసపోషణ సంవిధానచక్రవర్తి సంపూర్ణకీర్తి నవీనగుణసనాథ
నాచన సోమనాథప్రణీతం బైన యుత్తరహరివంశంబునందుఁ బంచమాశ్వాసము.

  1. విద్యానంతధ్యానరూప
  2. శతంబ, క్షీణిగతి
  3. తగవు
  4. కడఁ జేర్తు
  5. ఇది కం వీ ప్రతిలో లేదు.
  6. రులు
  7. పిచ్చులు
  8. దిట్టాడు
  9. ను ఘనుఁ గొలిచి తొక్కొ
  10. ఈ పద్యము ప్రాచ్యలిఖితపుస్తకశాలలోని ప్రతిలో మాత్ర మున్నది.
  11. యాకలిగొన్న
  12. సెదర
  13. విజ్ఞు
  14. నొసలిగంబురు
  15. యింతలో
  16. సారించెసా
  17. లన్; గాన్
  18. ఱెక్కదారి
  19. ముద్దులసాప
  20. సెలగొమ్మ
  21. మేది
  22. జఱచి
  23. కమలినిం గని చుట్టెడు నీరు మిన్నుపై
  24. బెరిఁగిన
  25. మడది పైఁ జిమ్మంగ
  26. భూషణము లుప్పతిల్లంగఁ జేసేత జల్లువారు
  27. మానసంబులు దేల
  28. డఁగా
  29. రతి
  30. దురుపిల్లు
  31. కోడకు నెవ్వగదేల యెవ్విధం, గలవు;.... నొంపగ నేరికేన్ తలల్, గలవె.
  32. ప్రతిదేవతలు; పరిజనంబులు
  33. నెఱి యె
  34. సొరువయ్యెన్
  35. అఖిలజాలంబు నీరిపై
  36. పిదప
  37. నని వాడిన నెవ్వరి కీను?
  38. బలముఁ గపటపుఁజెల్మిన్
  39. కానూపఘూర్జర త్రి
  40. లం గలంచు
  41. టంచుకు
  42. బిందైనఁ
  43. లొల్లి
  44. కొనిక
  45. మ ట్టె
  46. బుయ్యల దూల నై
  47. జూఱాడు, జూటాడుట
  48. యెడ
  49. జూడఁగన్
  50. తలఁకె దల్లీ, తామర దలఁకె, దల్లియు
  51. ఒదకిలి
  52. క యటమున్న
  53. వెడ సోఁకినంత మై
  54. బైవాటు
  55. కరఁగిన
  56. ఏ నీ నటె నాకూఁతును
  57. నపు డతఁడు గగనవీథికి దాఁటెన్
  58. పోట్లపుం, డ్లోమి మచుడఁ బుచ్చుటొప్పుఁ బంత, మడుగ మరల బవర వచ్చుట యెప్పుఁగ, గించు
  59. వలుదచీకట్లలో
  60. రేయిజక్కవలఁ బేరిన
  61. గడుఁబిన్న తాన వేగంబవీఁడె
  62. గెడలే దనఁగ
  63. విధి గన్నికలు చేసి నక్కటకట
  64. మృత్యువునకు
  65. కోఱడ మె
  66. శస
  67. నసి మాలి
  68. స, త్యాసికు లగు
  69. బంధవ్యాహృతుఁ
  70. బంధ