Jump to content

ఇంద్రాణీ సప్తశతీ/త్రైష్టుభం శతకమ్

వికీసోర్స్ నుండి




ఓం

షష్ఠం

త్రైష్టుభం శతకమ్

1. ఉపజాతిస్తబకము

1. మందో౽పి బోధం విదధ న్మునీనాం
   స్వచ్ఛో౽పి రాగం త్రిద శేశ్వరస్య |
   అల్పో౽పి ధున్వన్ హరితాం తమాంసి
   స్మితాంకురో భాతు జయంతమాతుః ||

2. అశేషపాపౌఘ నివారణాయ
   భాగ్యస్య పాకాయచ దేవరాజ్ఞీ |
   శోకాకులాం భారతభూమిమేతాం
   లోకస్యమాతా హృదయే కరోతు ||

3. ధర్మద్విషా మింద్రనిరాదరాణాం
   సంహారకర్మణ్యతి జాగరూకాం |
   దేవీంపరా దేవపథే జ్వలంతీం
   ప్రచండచండీం మనసా స్మరామః ||

4. వ్యాప్తాతటిద్వా గమనే నిగూఢా
   నారీ సురేశాన మనోరమావా |
   శక్తిః సుషుమ్నా పథ చారిణీవా
   ప్రచండచండీతి పదస్యభావం ||

1. మందమైనను నీహాసము మునులకు జ్ఞానమిచ్చును, స్వచ్ఛమైనను ఇంద్రునకు రాగమిచ్చును, అల్పమైనను దిక్కుల చీకట్లను బోగొట్టును. అట్టి యింద్రాణీమందహాసము ప్రకాశించు గాక.


2. సకల పాపనివారణకొఱకు, భాగ్యమును వృద్ధిగావించుటకు శోకభూయిష్ఠమైన భారతభూమి నింద్రాణి తన మనస్సునం దుంచుకొనుగాక.


3. ధర్మమునకు శత్రువులై యింద్రుని నిరాదరించువారిని సంహరించుట కతి జాగరూకురాలు, దేవయానమార్గమందు బ్రజ్వలించు శక్తియగు ప్రచండచండిని మేము స్మరించుచుంటిమి.


4. వ్యాపించునది యనిగాని, గమనమందు నిగూఢమైయుండు తటి త్తనిగాని, ఇంద్రసతి యనిగాని సుషుమ్న యందు సంచరించునది యనిగాని 'ప్రచండచండీ' పదమున కర్థము.

(యోగశాస్త్రమందు సుషుమ్న యనునది వ్యష్టిశరీరములందు వెన్నెముకద్వారా మూలాధారమునుండి సహస్రారమువరకు ప్రవహించు శక్తి నాడియని పేర్కొనబడెను. నాడి యనగా శక్తి రశ్మియని భావము. ఇది సూర్యునినుండి ప్రతిశరీరమును బొందు రశ్మి. సూర్య రశ్మి యొక్కొక్కటియు శాఖలగుచు నెన్ని శరీరములున్నవో అన్ని శాఖలుగా విభాగమైనను, ప్రతిశాఖయు సమష్టియందు సుషుమ్న యగుచున్నది. ఆకాశమునుండి సూర్యుని బొందిన ప్రచండచండీ యను తేజశ్శక్తి సూర్యగోళమునుండి యీ విధముగా రశ్మి రూపములచే విభాగమగుచున్నను, ప్రతిరశ్మియందు సంచరించుచున్నందున నీమే సుషుమ్నా మార్గసంచారిణి యగుచున్నది.)

5. సమస్తలోకావని నాయికాయాః
   సుపర్వమార్గేణ శరీరవత్యాః |
   మాతుర్మహోంశం మహనీయసారం
   విజ్ఞానవంత స్తటితం భణంతి ||

6. నిగూఢతేజస్తను రంబికేయం
   ప్రచండచండీ పరితో లసంతీ |
   అవ్యక్తశబ్దేన శరీరవత్యాః
   కల్పాః కవీనాం వచనేషు భిన్నాః ||

7. శబ్దం వినానైవ కదాపితేజ
   స్తేజో వినానైవ కదాపి శబ్దః |
   శక్తి ద్వయం సంతతయుక్తమేత
   త్కథం స్వరూపేణ భవే ద్విభక్తః ||

8. ఏకై వశక్తిః జ్వలతిప్రకృష్టా
   స్వరత్యపి ప్రాభవతః సమంతాత్ |
   క్రియవిభేదా దిహ పండితానాం
   శక్తిద్వయోక్తిస్తు సమర్ధనీయా ||

9. ఏకక్రియాయాశ్చ ఫలప్రభేదా
   త్పునర్విభాగః క్రియతే బహుజ్ఞైః
   కాళీంచ తారాం స్వరమగ్ర్యమాహుః
   ప్రచండచండీం లలితాంచ తేజః ||


5. సమస్త లోకములకు నాయకురాలైన ఆకాశశరీరిణి యగు తల్లి యొక్క మహనీయమైన మహోంశయొక్క సారమును పండితులు తటిత్తనుచున్నారు.

(తేజోంశ సారమును. ఇది వస్తువుతో కూడి సహస్సై తిరుగ వస్తువునుండి సారమువలె వస్త్వనుభవరూపిణియై మహస్సుగా నివృత్తియగును.)


6. నిగూఢ తేజోంశశరీరముగా గల యీ అంబిక సర్వత్ర ప్రకాశించు ప్రచండ చండిక యగుచున్నది. అవ్యక్త శబ్దాంశ శరీరముగా గల దేవియొక్క వికల్పమును (విభూతులను) కవులు భిన్న (దేవీ) నామములతో పిలచిరి.


7. శబ్దము లేనిదే తేజస్సు లేదు. తేజస్సు లేనిదే శబ్దముండదు. ఈ రెండును నిత్యము కలసి నీ శక్తిద్వయమగునప్పుడు, వానిచే నీ స్వరూపమున కెట్లు వ్యత్యాసము కలుగును.

(శబ్ద తేజములు రెండు శక్తియొక్క క్రియా చిచ్ఛాఖలు. ఈ రెండింటికి మూలశక్తి యొక్కటియే గావున మూలస్వరూపము నెఱుగుటకు రెండు మార్గములు విధింపబడెను.)


8. ప్రకృష్టమై యొకేశక్తి జ్వలించుచు, శబ్దించుచు నంతటను బ్రకాశించునప్పుడు పండితులచే చెప్పబడు శక్తిద్వయము క్రియాభేదమందే సమర్థనీయమగును.

(అనగా శబ్దించుట, జ్వలించుట అను క్రియలవలననే శబ్ద తేజములను వేఱుచేయగలమని భావము.)


9. ఒకే క్రియకు ఫలభేదమువలన తిరుగ విభాగము పండితులచే చేయబడెను. శ్రేష్ఠస్వరమును (ఫల భేదమువలన) 'కాళి'గాను, 'తార'గాను చెప్పుచున్నారు; తేజస్సును (ఫల భేదమువలన) చండికగాను, లలితగాను చెప్పుచున్నారు.

10. సంపద్య తే శబ్దగ తేర్హి కాలః
    శబ్దోవరేణ్య స్త్యదభాణి కాళీ |
    ధ్యా తేన శబ్దేన భవంత రేద్య
    ద్బుధా స్తతః శబ్దముశంతి తారాం ||

11. యదక్షరం వేదవిదామృషీణాం
    వేదాంతినాం యః ప్రణవో మునీనాం |
    గౌరీ పురాణేషు వివశ్చి తాం యా
    సా తాంత్రికాణాం వచనేవ తారా ||

12. సంపద్య తే సంహృతి రోజసాయ
    త్ప్రచండచండీ తదుదీరితౌజః |
    సిద్ధ్యే దశేషో౽నుభవో యదోజ
    స్యతో బుద్ధా స్తాం లలితాం వదంతి ||


10. శబ్దగతివలన కాలము పుట్టుచున్నది. అట్టి శ్రేష్ఠశబ్దము కాళి యనబడెను (గతిచే కాలమునుబుట్టించు శబ్దశక్తి). ధ్యానము చేయబడిన శబ్దమువలన సంసారమునుండి తరించుచున్నారు గనుక పండితులా శబ్దమును 'తారా' యనిరి.

(గతివలన పరిణామము లేదా పాచకత్వము ద్యోతనమగును. మఱియు క్రియాశక్తి తెలియబడుచున్నది. కనుక అవ్యక్తమగు శ్రేష్ఠశబ్దమేది క్రియాశక్తిచే నంతటను వ్యాపించి యాకాశవస్తువును వ్యాపింపజేయుటద్వారా యొక స్థితినుండి యింకొకస్థితికి దానిని పాకమొనర్చు చున్నదో, ఆ పాకక్రియాశక్తిచే వస్తురూపముయొక్క పూర్వస్థితి సంహరింపబడినట్లు. క్రొత్తది యుద్బవించినట్లుదోచును. అది నిజమునకు పరిణామమార్పు. దానికి కారణమగు శ్రేష్ఠశబ్దసంబంధ క్రియాశక్తిని కాళియనిరి. మన యుచ్ఛ్వాసనిశ్వాసలందీ శక్తి వైభవము తెలియబడును. ఇంక తారయనగా అవ్యక్తశబ్దశక్తియే యైనను, సర్వశబ్దముల కాంతర్యమందదియే యుండునను ననుభవము నిచ్చి వికృతులనుండి తరింపజేయును. ఉచ్ఛ్వాసనిశ్వాసలను గైకొనినచో, వాటి యొక్క శబ్దమూలము తార. ప్రణవస్వరూపము తార యగును. కేవల పరిణామక్రియాశక్తి కాళియగును. అనగా ప్రాణము. ప్రాణమందు వ్యాపారమును నిరూపించు శక్తి విభూతి అని రెండింటికి తాత్పర్యము. దశమహావిద్యలలో మొదటిది కాళి. రెండవది తార. మనయందు పరావాగ్రూపమున మూలాధారమందా వేశించిన కుండలినీ శక్తియే కాళి. పశ్యంతీ వాక్కనబడు నవ్యక్తప్రణశబ్దరూపిణి తార.)


11. వేదవిదులైన ఋషులు దేని నక్షరముగాను, వేదాంతులైన మునులు దేనిని ప్రణవముగాను, పురాణకర్తలు దేనిని గౌరిగాను పిలచిరో, తాంత్రికుల భాషలో నామెయే తార యగుచున్నది.

(శబ్దమువలెనే తేజస్సుకూడ ఫలభేదముచే రెండు విధములుగా పిలువబడుట తరువాత శ్లోకములో చూడుడు.)


12. ఏ యోజస్సువలన సంహారక్రియ జరగుచున్నదో (ప్రకాశించు చున్నదో) దానిని ప్రచండ చండిక యనిరి ; యే ఓజస్సువలన సకలానుభవసిద్ధి (ఆత్మానుభవ మన్ని యనుభవములకు మూల మను ప్రకాశము) కలుగుచున్నదో దానిని లలిత యని బుధులు పల్కిరి.

13. ప్రచండచండీం లఘునాపదేన
    చండీం విదుః కేచన బుద్ధిమంతః |
    ఏకే విదః శ్రేష్ఠమహోమయీం తాం
    లక్ష్మీం మహత్పూర్వపదాం వదంతి ||

14. అతీవసౌమ్యం లలితేతి శబ్దం
    ప్రచండచిండీత పదంచ భీమం |
    దేవీ దధానా సుతరాం మనోజ్ఞా
    ఘోరాచ నిత్యం హృదిమే విభాతు ||

15. ప్రచండచండీంతు శరీరభాజాం
    తనూషు యోగేన విభిన్న శీర్షాం |
    శక్తిం సుషుమ్నా సరణౌ చరంతీం
    తాం ఛిన్న మస్తాం మునయో వదంతి ||

16. కపాలభేదో యది యోగవీర్యా
    త్సంపద్యతే జీవితఏవ సాధోః |
    తమేవ సంతః ప్రవదంతి శీర్ష
    చ్ఛేదం శరీరాంతర భాసిశక్తేః ||

17. ఉదీర్యసే నిర్జర రాజపత్ని
    త్వం ఛిన్న మస్తా యమినాం తనూషు |
    ఉజ్జృంభణే విశ్వసవిత్రి యస్యాః
    కాయంభవే ద్వైద్యుతయంత్రతుల్యం ||


13. ప్రచండచండిని క్లుప్తముగా కొందఱు 'చండిక' యని వచించిరి. ఆ శ్రేష్ఠ తేజోరూపమునే మఱికొందఱు విద్వాంసులు 'మహాలక్ష్మి' అనుచున్నారు.


14. 'లలిత' యను సౌమ్యపదముగలది, ప్రచండచండి యను భీకర నామమును ధరించునది, అత్యంత మనోజ్ఞ ముగానున్నను ఘోరమైనది యగు శ్రేష్ట తేజశ్శక్తియైన దేవి నా హృదయ మందు బ్రకాశించుగాక. (మూలానుభవము నిచ్చుటకు)


15. శరీరధారులయొక్క శరీరములందు యోగముచే శీర్ష కపాలములను భిన్నముగావించి, సుషుమ్నా నాడియందు సంచరించుశక్తిని మునులు 'ఛిన్న మస్త' యనుచున్నారు.

(మస్తకమును ఛేదించునది.)


16. జీవించుచున్న సాధువునకు యోగబలమువలన కపాలభేదన మైనచో, దానినే శరీరమందు భాసించు శక్తియొక్క శీర్ష చ్చేదమైనట్లు చెప్పుచున్నారు.

(నిజమునకు శీర్ష చ్చేదము సాధకునకైనను, శక్తికైనట్లు ధ్వనించు పే రామెకు ఛిన్న మస్తయని పెట్టబడెనని తాత్పర్యము. ఈసిద్ధి బొందిన సాధకుడు చనిపోనక్కరలేదు. ఈ కవి యిట్టి సిద్ధిని బొంది జీవించెను.)


17. ఓ తల్లీ ! నీవు యోగుల (అనగా కపాలసిద్ధిబొంది జీవించియుండు యోగుల) శరీరములందు 'చిన్న మస్త' యని చెప్పబడుచుంటివి. ఏ నీవిజృంభణమువలన శరీర మొకవైద్యుతయంత్రతుల్యమగునో (అట్టి నీవు ఛిన్న మస్తవని లేదా అట్టి యోగుల శరీరములందు నీవి ఛిన్న మస్తవైతివని అన్వయము.)

18. పితు ర్ని యోగాత్తనయేన కృత్తే
    మస్తే జనన్యాః కిల రేణుకాయాః |
    త్వమావిశః పావని తత్కబంధం
    తద్వా త్వముక్తాసి నికృత్తమస్తా ||

19. ఛిన్నంశిరః కీర్ణ కచం దధానాం
    కరేణ కంఠోద్గత రక్తధారాం |
    రామాంబికాం దుర్జనకాలరాత్రిం
    దేవీం పవిత్రాం మనసా స్మరామి ||

20. ధ్రువో రమా చంద్రధరస్యరామా
    వాగ్వజ్రవైరోచన దీర్ఘనిర్యే |
    కూర్చద్వయం శస్త్రకృశాను జాయే
    విద్యానృపాణాం సురరాజశక్తిః ||


18. ఓ తల్లీ ! తండ్రియాజ్ఞపై కుమారునిచే (అనగా జమదగ్ని ముని యాజ్ఞ పై పరశురామునిచే) తల్లియైన రేణుకయొక్క శిరస్సు ఖండింపబడగా, నీవా కబంధమందు బ్రవేశించితివి. అందువల్ల నైన నీవు 'నికృత్తమస్తా' యనబడుచుంటివి.

(ఇక్కడకూడ నికృత్తమస్తయైనది రేణుక యగునుకాని ఆమెను జీవింపజేయుటకు యోగుల సుషుమ్న యందు బ్రవేశించునట్లు కబంధమందు బ్రవేశించిన శక్తి నికృత్తమస్తకాదు. ఆమె యంశావతారిణియైన రేణుకనుబట్టియు ఛిన్న మస్తా నామము శక్తికి వచ్చియుండునని)


19. విడిపోయిన కొప్పుగలిగి ఛిన్నమైన శిరస్సును చేతియందు ధరించినది, కంఠమునుండి రక్తధారలు కారునది, దుర్జనులకు కాలరాత్రివలె భయంకరమై యుండునది యగు పరశురామ జననియైన పవిత్రదేవిని నేను మనస్సులో స్మరించుచుంటిని.

(పరశురామ జననియైన రేణుకవల్లనే లోకమునకు ఛిన్న మస్తా శక్తివైభవము దెలిసెను. ఆ వైభవ మెట్టిదనిన నిజముగా కంఠపర్యంతము నరుక బడిన శిరస్సుచే ప్రాణము నిర్గమించక, కబంధము ప్రాణయుక్తమై, తెగిన శిరస్సును చేతితో ధరించి యాశ్చర్యము గలిగించెను. కనుకనే రేణుక సాక్షాచ్చక్తి రూపిణిగా ధ్యానింపబడుచున్నది.)


20. ధ్రువః = ఓం; రమా = శ్రీం; చంద్రధరస్యరామా = హ్రీం; వాక్ = ఐం; వజ్రవైరోచన దీర్ఘనిః యే = వజ్రవైరోచనీయే ('న'కారమునకు దీర్ఘని అనగా 'నీ'. అట్టి యంతమునకు 'యే' అను సంబోధనము జేర్చుట); కూర్చద్వయం = హూం హూం ('హూం' అనుదానిని కూర్చయనియు ధేనుబీజమనియు కూడ

21. మాయా ద్వివారంయది సైకవర్ణా
    విద్యైకవర్ణాయది ధేను రేకా
    ధేన్వాది సంబోధనమస్త్ర మగ్నే
    ర్విలాసినీ చేతి ధరేందువర్ణా ||

22. చతుష్ట యేత్రాన్యతమం గృహీత్వా
    మంత్రం మహేంద్రస్య మనోధినాధాం |
    భజేత యస్తాంత్రిక దివ్యభావ
    మాశ్రిత్య సిద్ధీః సకలాః సవిందేత్ ||


పిలుతురు); శస్త్ర, కృశానుజాయే = శస్త్రబీజమగు 'ఫట్‌', అగ్ని భార్యయగు - లేదా అగ్ని శక్తియగు 'స్వాహా'యు - కలుపగా వచ్చు మంత్రము - నృపాణాం సురరాజ శక్తిః విద్యా (భవతి) = శ్రేష్ఠమైన సురరాజ శక్తియగు ఇంద్రాణీ విద్య యగును.

(ఇంద్రాణీయే ప్రచండచండిక లేదా ఛిన్న మస్త. ప్రచండ చండిక యొక్క తాంత్రిక మంత్రమిచ్చట చెప్పబడెను.


21. 20 వ శ్లోకములో చెప్పబడిన మంత్రములో 'హ్రీం' అను మాయాబీజము రెండుసార్లు వచ్చిన దింకొక మంత్రము; ధేను బీజ మొక్కటియు నింకొక మంత్రము; ఆదిని ధేనుబీజము, తరువాత సంబోధింపబడిన వజ్రవైరోచని, తరువాత అస్త్ర బీజము, చివరను 'స్వాహా' కలవి మఱియొక మంత్రము.

ఈవిధముగా పూర్వశ్లోక మందొక మంత్రము చెప్పబడి దానిలో చేయబడిన మార్పులచే మఱి మూడు మంత్రము లిచ్చట పేర్కొనబడెను. మొత్తము నాలుగు మంత్రము లిట్లుండును. -

(1) ఓం శ్రీం హ్రీం ఐం వజ్రవైరోచనీయే హూం హూం ఫట్ స్వాహా (16 అక్షరములు)

(2) ఓం శ్రీం హ్రీం హ్రీం ఐం ఫట్ స్వాహా (17 అక్షరములు)

(3) హూం (ఏకాక్షరి)

(4) హూం వజ్రవైరోచనీయే ఫట్ స్వాహా (11 అక్షరములు)


22. పైని చెప్పబడిన నాల్గింటిలో నొక్క మహావిద్యామంత్రము నైనను గ్రహించి యెవడు దేవిని తాంత్రిక దివ్యభావము నాశ్రయించి భజించునో, వాడు సకలసిద్ధులను బొందును.

(మంత్రాక్షరములే దేవి కంగములని యెంచి మంత్ర రూప మామెకు రూపమగునట్లు ధ్యానించుట తాంత్రిక దివ్య భావము)

23. సంహోత్ర మిత్యద్భుతశక్తి యుక్తం
    వృషాకపేర్దర్శన మంబ మంత్రం |
    యోవైదికం తే మనుజో భజేత
    కించిన్న తస్యేహ జగత్యసాధ్యం ||


23. అద్భుతశక్తియుక్తమై, వృషాకపికి దర్శనమైనట్టి 'సంహోత్ర' మనెడి నీ యొక్క వేదమంత్రము నెవడు భజించునో, ఓ దేవి ! వాని కీ జగత్తునం దసాధ్యమైన దేదియు నుండదు.

ఆ మంత్రమిది : - "సంహోత్రం స్మపురా నారీ సమనం వావ గచ్ఛతి, వేధా ఋసత్య వీరిణీంద్ర పత్నీ మహీయతే, విశ్వ స్మాదింద్ర ఉత్తరః"

(వృషాకపికి నామాంతరమగు గణపతికి (అనగా నీ కవికి) ఒక వేదమంత్రము దర్శనమయ్యెను. అది యింద్రాణీ యనబడు చండీ మంత్రమై, అగ్నిహోత్రమునందర్పితమగు సంహోత్రసంబంధము గలది గావున నీ శ్లోకమందు శ్లేషచే కవి దానిని ధ్వనింపజేసి నట్లును భావించవచ్చును. వైదిక మంత్రములందు తాంత్రికమంత్రములందువలె బీజాక్షరము లుండవు. ఎందువల్లననగా. తాంత్రిక మంత్రములు శబ్ద ప్రధానములుకాగా, వైదిక మంత్రము లర్ధ (తేజ) ప్రధానములు. అట్లైనను, తాంత్రిక మంత్రములలో శ్రేష్ఠమైన వాటికి తత్త్వార్థము లుండకపోవు. దర్శనమైన వేదమంత్ర మింద్రాణీ మహావిద్యయనియు. విరాణ్మహా మంత్ర మనియు. వజ్రాస్త్రవిద్యయనియు, రేణుకా విద్యయనియు బహువిధములుగా వేదమందు స్తుతింపబడి, యిహపరముల రెండింటియందును సకలార్ద సిద్ధిదాయక మగుచున్నది. అంతే గాక. మంత్రార్థముచే సహస్రారసిద్ధికి మించిన హృదయసిద్ధినిచ్చునది యగుచున్నది)

"రాయస్కామో వజ్రహస్తం సుదక్షిణం పుత్రోన పితరంహువే."

(స్త్రీలు జపించునప్పుడు 'పుత్రీణ' అని 'పుత్రోన' కు బదులుగా మార్చవలెను. ఈ మంత్రమునకు 'స్వాహా' అనిచేర్చి, దీనిచే నగ్ని యందు హోమములు చేయబడును.)

అర్థము : - రాయస్ = సకలార్థ కామమోక్షములను, కామో = కోరు చున్నవాడనై, వజ్రహస్తం = వజ్రాయుధమును హస్తమందు ధరించువాడను (ఇంద్రుడు) - లేదా ఆధ్యాత్మి కార్థముచే వజ్రదండ మనబడు సుషుమ్నా శక్తియుతమగు వెన్నెముకను హస్తముచే హృదయస్థానమునుండి ధరించువాడును, సుదక్షిణం = దానముచేయుటకు సుప్రసిద్ధమైన దక్షిణహస్తము కలవాడును

24. ప్రచండచండీ ప్రమదే పురాణే
    పురాణవీరస్య మనోధినాథే |
    ప్రయచ్ఛ పాతుం పటుతాంపరాం మే
    పుణ్యామిమా మార్యనివాస భూమిం ||


(అర్ధనారీశ్వర రూపమందు పురుషదైవమే కుడిచేయి కలవాడు) - అధ్యా త్మార్థముచొప్పున సుప్రసిద్ధమైన దక్షిణభాగముననుండు సూక్ష్మహృదయము స్థానముగా గలవాడును అగు సచ్చిదానంద ఆత్మస్వరూపుని, పుత్రో న పితరం = తండ్రిని కొడుకువలె, హువే = పిలుచుచున్నాను - (అనగా సర్వార్థముల కధికారియైన నింద్రు నా సంపద లర్ధించుటకు హక్కుగల పుత్రునివలె కోరుదునని తాత్పర్యము.

(ఈ యర్థములు బాహ్యమందు ధనధాన్యాది సంపదలకును, ఆంతర్యమం దాత్మ సంపద యనదగు జ్ఞానమునకు, నితరసిద్ధులకును జెందును. ఈ మంత్రము ద్విపాద విరాట్ ఛందస్సు గలదియై, వసిష్ఠఋషికి దర్శనమయ్యెను. ఈ కలియుగ మందిది విస్మరింపబడి, తిరుగ యుగము మార్పును సంకల్పించిన వాసిష్ఠ గణపతిమునికి దర్శనమైనందున రెండుపక్షములందును దీనికి ఋషి వాసిష్ఠుడే యగుచున్నను గణపతి నామ ధేయుడైన యీ వాసిష్ఠుడు వృషాకపి నామాంతరము గలవాడగుటయు గమనింప దగును. ఈ మంత్ర మద్భుత శక్తియుక్తమని వాసిష్ఠుని యనుభవమే ప్రమాణము. శ్రీరమణు డుపదేశించిన హృదయవిద్య కేవల విచారణ మార్గమునకు జెందినదై యుండగా, భక్తి మార్గముచే మంత్రధ్యానమువలనను హృదయవిద్య కుపాయ ముండవలెనని వాసిష్ఠ గణపతిముని చింతించు సమయమున రేణుకా కృపచే నీ మంత్రదర్శనమయ్యెను. పరశురామ దర్శనముతోకూడి యిది విదితమై శ్రీరమణోపదేశమునకు కవచ మంత్ర మగును.)


24. ఓ ప్రచండచండీ ! నీవు పుణ్యమైన యీ ఆర్యభూమిని రక్షించుటకు నా కధిక పటుత్వము నిచ్చెదవుగాక.

25. ప్రపంచరాజ్ఞీం ప్రథితప్రభావాం
    ప్రచండచండీం పరికీర్తయంత్యః |
    ఏతాః ప్రమోదాయ భవంతు శక్తే
    రుపాసకానా ముపజాతయో నః ||

             _________


2. రథోద్ధతానస్తబకము

1. క్షాలనాయ హరితాం విభూతయే
   విష్టపస్య మదనాయ వజ్రిణః |
   తజ్జయంత జననీ ముఖాబ్జతో
   నిర్గతం స్మిత మఘం ధునోతు నః ||

2. అన్న లోపకృశ భీరుకప్రజాం
   భిన్న భావ బలహీన నేతృ కాం |
   వాసవస్య వరవర్ణినీ పరై
   రర్దితా మవతు భారతావనిం ||

3. పాణిపాద మనిమేషరాజ్ఞి తే
   పారిజాత నవ పల్లవోపమం |
   అక్షపా విరహ మంగభా సరి
   ద్వాసి చక్రమిథునం కుచద్వయం ||

4. పూర్ణిమాశశి యశో౽పహారకం
   సంప్రసాద సుషమాస్పదం ముఖం |
   జ్ఞానశక్తిరుచి శేవధీ దృశౌ
   రక్తవర్ణకసుధా ఘనో౽ధరః ||


25. ప్రపంచమునకు రాణియై, యధిక ప్రభావముగల ప్రచండచండిని కీర్తించు నా యీ ఉపజాతివృత్తములు దేవి నుపాసించువారికి సంతోషము నిచ్చుగాక.


___________


1. దిక్కులను శుభ్రపరచుటకు, లోకముల కైశ్వర్య మిచ్చుటకు, ఇంద్రునకు ముద మిచ్చుటకు వెడలు ఇంద్రాణీ ముఖహాసము మా పాపములను తొలగించుగాక.


2. అన్న లోపముచే కృశించి, భయభ్రాంతులై యున్న ప్రజలును భిన్న భావములచే దుర్భలులైన నాయకులును గల భారత భూమిని పీడించు శత్రువులనుండి యింద్రాణి రక్షించుగాక.


3. ఓ తల్లీ ! నీ పాణిపాదములు నూత్న పారిజాత పల్లవములను బోలి ప్రకాశించుచున్నవి. నీ కుచద్వయము రాత్రియందు విరహము లేనివియై, అంగ కాంతియనెడి నదియందు వసించు చక్రవాక మిధునమువలె నున్నది.


4. ఓ దేవీ ! పూర్ణిమచంద్రుని కీర్తి నపహరించు నీ ముఖము ప్రసన్న తాశోభ కాస్పదమైయున్నది. నీ దృష్టులు జ్ఞానశక్తి కాంతులకు నిధులు. నీ యధర మెరుపురంగుగల అమృతము ఘనీభవించినట్లున్నది.

5. మర్దయత్తిమిర ముద్ధతం దిశా
   మల్ప మవ్యధిక వైభవం స్మితం |
   ప్రావృడస్త యమునాతరంగ వ
   న్నీలచారురతి పావనః కచః ||

6. వల్లకీంచ పరుషధ్వనిం వద
   న్దుఃఖితస్యచ ముదావహః స్వరః |
   చారుహా వశ బలా౽లసాగతిః
   కాయ ధామ వచసాం నపద్ధతౌ ||

7. యోగసిద్ధి మతులాం గతా మతి
   శ్చాతురీచ బుధమండలస్తుతా |
   విష్టపత్రితయ రాజ్యతో౽ప్యసి
   త్వం సుఖాయ మహతే బిడౌజసః ||

8. త్వాముదీక్ష్య ధృతదేవతాతనుం
   దీప్తపక్ష్మల విశాలలోచనాం |
   ఆదితో జనని జన్మినా మభూ
   ద్వాసవస్యరతి రాదిమేరసే ||

9. ఆదిమంరస మసాదివాసనా
   వాసితౌ ప్రథమ మప్యగృహ్ణతాం |
   సమ్మదస్యనిధి మాది దంపతీ
   సో౽చల త్త్రిభువనే తతః క్రమః ||

10. జ్యాయసా దివిషదాం పురాతనీ
    నీలకంజ నయనా విలాసినీ |
    యద్విహారమతనో త్ప్రరోచనం
    తత్సతా మభవ దాదిమేరసే ||


5. ఓ దేవీ ! నీ నగవు దిక్కులయొక్క యధికములగు చీకట్లను మర్దించుచు, కొంచెముగా వెడలుచున్నను అధిక వైభవము గలదై యున్నది. నీ కొప్పు శరత్కాల యమునాతరంగమువలె నీలవర్ణముతోగూడి అతిపావనమై యున్నది.


6. ఓ దేవీ ! నీ స్వరము వీణాస్వరమును పరుష మనిపించుచు, దుఃఖించువారి కానంద మొసగుచున్నది. మనోహర విలాసవశమగు నీ నడక మందముగానున్నది. నీ శరీరకాంతి వర్ణింప నలవి గాకున్నది.


7. ఓ దేవీ ! నీ బుద్ధి యతులమైన యోగసిద్ధులను బొందియున్నది. నీ చాతుర్యము పండితులకు స్తుత్యమైయున్నది. దేవేంద్రునికి త్రిలోకాధిపత్యముకంటె నీవేయెక్కువ సుఖము నిచ్చు చున్నావు.


8. ఓ తల్లీ ! దేవతాశరీరమును ధరించి, ప్రకాశించు పక్షములతో (అనగా రెప్ప వెండ్రుకలతో) గూడిన నేత్రములను బొందిన నిన్ను జూచినప్పుడు దేవేంద్రునకు శృంగారమనెడి ఆదిమరసము పుట్టెను.


9. అనాదియైన వాసనచే వసించు నాదిదంపతులు సంతోషనిధి యగు శృంగారరసము నాదియందు బొందిరి. అందువల్లనే ముల్లోకములందా క్రమము ప్రాకెను.


10. నీలోత్పలములవంటి నేత్రములుగల ఆ పురాతనస్త్రీ దేవతా ప్రభువైన యింద్రునితో విహార మే కారణమువలన జేయుచుండెనో, ఆ కారణమువల్లనే సత్పురుషుల కా శృంగారరసమునం దభిలాష గల్గెను.

11. నత్వదంబ నిళినాననా౽ధికా
    నాపి నాకపతితో౽ధికః పుమాన్ |
    నాధికంచ వనమస్తి నందనా
    న్నాది మాదపి రసో౽ధికోరసాత్ ||

12. నాయికా త్వమసమాన చారుతా
    నాయకః స మరుతాం మహీపతిః |
    నందనంచ రసరంగభూః కధం
    మన్మధస్య నభ వేదిహోత్సవః ||

13. దేవి వాం మృతికథైవ దూరతో
    జాతు చిద్గళతినైవ యౌవనం |
    కాంక్షితః పరికరో నదుర్లభః
    కిం రసః పర్ణమేదిహాన్యధా ||

14. విష్టపస్య యువరాజకేశవే
    త్రాణభారమఖిలం నిధాయ వాం |
    క్రీడతో రమర రాజ్ఞి నందనే
    క్రీడితాని మమ సంతు భూతయే ||

15. యద్యువామమర రాజ్ఞి నందనే
    కుర్వతో రహసి దేవి మంత్రణం |
    తత్రచేన్మమ కృతిర్మనాగియం
    స్పర్శమేతి భువి కోను మత్కృతీ ||

16. క్రందనం యది మమేహ వందినో
    నందనే విహరతో స్సవిత్రి వాం |
    అంతరాయకృదధాబ్జకాంతి తే
    సంప్రగృహ్య చరణం క్షమాపయే ||


11. ఓ యంబా ! నీకంటె నధికురాలైన పద్మముఖి లేదు; నాక పతి కంటె నధికుడైన పురుషుడు లేడు; నందనవనముకంటె నధిక మగు వనము లేదు; శృంగారరసముకంటె నధికరసము లేదు.


12. సాటిలేని సౌందర్యముగల నీవు నాయికవు. దేవతా ప్రభువగు ఇంద్రుడు నాయకుడు. నందనవనము రసమునకు రంగస్థలము. ఇక్కడ మన్మధున కింక ఉత్సవము కా కేమి ?


13. ఓ దేవీ ! మీ యుభయులకు మృత్యుకథ దూరమైయున్నది. మీ యౌవన మెప్పటికి జారదు. కోరిన పరికరములు మీకు లభించకపోవు. ఇంక రసమునకు లోపమేమున్నది ?


14. ఓ తల్లీ ! యువరాజైన విష్ణువునకు సర్వవిష్టపభారము విడచి, నందనవనమందు మీరు సల్పు క్రీడలు నా యైశ్వర్యమున కగు గాక (గణపతి జన్మకవి).


15. ఓ దేవీ ! నందనవనమందు మీరు రహస్యాలోచనలు సల్పునప్పుడు నా యీ కృతి కొంచెము మిమ్ము స్పృశించినచో నాకంటె ధన్యుడీ జగత్తునం దెవడుండును.


16. ఓ దేవీ ! ఇప్పుడిక్కడ నమస్కరించుచున్న నాయొక్క మొఱ్ఱ నందనవనములో విహరించు మీ కేమైన విఘ్నము కలుగజేసినచో, నీ పాదపద్మములుబట్టి నేను క్షమాపణ వేడెదను.

17. యోషి తామపి విమోహనాకృతి
    ర్మోహనం పురుషసంహతే రపి |
    ఇంద్రమంబ రమయాం బభూవిథ
    త్వం రసార్ద్రహృదయా లసద్రసం ||

18. దివ్యచందన రసానులేపనైః
    పారిజాత సుమతల్పకల్పనైః |
    చారుగీతకృతిభిశ్చ భేజి రే
    నాకలోక వనదేవతాశ్చ వాం ||

19. స్వర్ణదీసలిలశీకరోక్షి తాః
    పారిజాత సుమగంధ ధారిణః |
    నందనే త్రిదశలోకరాజ్ఞి వాం
    కేపి భేజు రలసాః సమీరణాః ||

20. ఆదధాసి సకలాంగ నాదికే
    పద్మగంధిని సుధాధరాధరే |
    మంజువాణి సుకుమారి సుందరి
    త్వం సురేంద్ర సక లేంద్రియార్చనం ||

21. ఆదిదేవి వదనం తనాభవ
    త్కాంతిధామ మదనం దివస్ప తేః |
    ఆననాదపి రసామృతం కిర
    న్నిష్క్రమం విలసితం కలం గిరాం ||

22. చారువాగ్విలసితాచ్చ నిస్తుల
    ప్రేమవీచిరుచిరం విలోకితం |
    వీక్షి తాదపి విలాస విశ్రమ
    స్థాన మల్పమలసం శుచిస్మితం ||


17. ఓ తల్లీ ! స్త్రీలనుగూడ మోహింపజేయు నాకారము, రసార్ద్ర మగు హృదయముగల నీవు పురుషుల మోహింపజేయు సుందరుడును, ప్రకాశించు రసముగల్గువాడు నగు నింద్రుని రమింపజేసితివి.


18. స్వర్గమందుండు వనదేవతలు మీకు దివ్యచందన రసానులేపనము, పారిజాతపుష్పపు పాన్పులు, సుందరగానకృతులుకూర్చి సేవించుచుండిరి.


19. ఓ తల్లీ ! ఆకాశగంగతో తడుపబడుచు, పారిజాతపుష్ప గంధములను ధరించిన నందనవనములోని పిల్లగాలులు కొన్ని మిమ్ము సేవించుచున్నవి.


20. ఓ దేవీ ! నీ వింద్రుని సకలేంద్రియముల కర్చన (రసార్చన) గలుగజేయుచుంటివి. పద్మగంధిని గనుక ఘ్రాణమునకు, సుధా ధరాధరయగుటచే జిహ్వకు, మంజువాణికావున శోత్రమునకు, సుకుమారి యగుటచే త్వగింద్రియమునకు, సుందరి కనుక చక్షువునకు సంతృప్తి నీయగలుగుచున్నది. (పరికరాలంకారము)


21. ఓ దేవీ ! నీ ముఖ మింద్రునిగూడ మదింపజేయునదై, కాంతులకు నిదియై యున్నది. ముఖముకంటె నీ వాగ్విలాస మధిక రసము నిచ్చుచు మరింత మధురముగా నొప్పుచున్నది.


22. ఓ దేవీ ! ఆ సొగసైన వాగ్విలాసముకంటె నీ చూపు నిరుపమాన ప్రేమ రమ్యము. చూపుకంటె మందమైన నీ నగవు నిర్మలమై, విలాస విశ్రాంతి స్థానమై యున్నది.

23. భాసు రేంద్ర దృఢబాహుపంజరీ
    లజ్జయా సహజయా నమన్ముఖీ |
    తద్విలోచన వికర్షకాలకా
    పాతుమాం త్రిదివలోకనాయికా ||

24. భారతక్షితి విషాదవారణే
    తత్సుతం గణపతిం కృతోద్యమం |
    ఆదధాతు పటుమర్జున స్మితా
    దుర్జన ప్రమథనక్ష మాశచీ ||

25. చారుశబ్ద కలితాః కృతీరిమాః
    సత్కవిక్షితిభుజో రథోద్ధతాః |
    సాశృణోతు సురమేదినీపతే
    ర్నేత్రచిత్తమదనీ విలాసినీ ||

           ________


3. మౌక్తికమాలాస్తబకము

1. నిర్మలభాసాం దిశిదిశి కర్తా
   పుణ్యమతీనాం హృదిహృది ధర్తా |
   పాలయతా న్మామనఘవిలాసః
   శక్రమహిష్యాః సితదరహాసః ||

2. పుణ్య చరిత్రా మునిజనగీతా
   వాసవకాంతా త్రిభువన మాతా |
   వత్సలభావా దవతు విదూనాం
   భారాతభూమిం ధనబలహీనాం ||


23. దేదీప్యమానమైన ఇంద్రుని దృఢ బాహుపంజరమును బొంది, సహజలజ్జచే వంగిన ముఖము, ఇంద్రుని నేత్రముల నాకర్షించు ముంగురులు గల యింద్రాణి నన్ను రక్షించుగాక.


24. భారత భూవిషాదనివారణ విషయమై ప్రయత్నించు గణపతిని ధవళస్మితవదనయై, దుర్జనశిక్షణయందు పటుత్వముగల శచీ దేవీ సమర్ధుని గావించుగాక.


25. ఇంపైన శబ్దములతో సత్కవియైన గణపతిచే కూర్చబడిన యీ 'రథోద్ధతా' వృత్తముల నింద్రాణి వినుగాక.


___________


1. ప్రతి దిశయందును నిర్మల కాంతులను కలిగించునది, ప్రతి హృదయమందును పుణ్యబుద్ధులను ధరించునది, పాపకళంకము లేని విలాసములు గలదియైన ఇంద్రాణీ మందహాసము నన్ను రక్షించుగాక.


2. పుణ్య చరితములుగలది, మునులచేకీర్తింపబడునది, త్రిభువనములకు జననియు నగు నింద్రాణి ధనబలములు రెండును గోల్పోయి దుఃఖితమైన భారతభూమిని వాత్సల్యముతో రక్షించు గావుత.

3. కోటితటిద్వత్తవ తనుకాంతిః
   పూర్ణసమాధౌ తవహృది శాంతిః |
   వాసవభామే భగవతి ఘోరః
   శత్రువిదారీ తవభుజసారః ||

4. ఆశ్రయభూతం సుమధురతాయాః
   ఆలయభూతం జలధిసుతాయాః |
   వాసవదృష్టే స్తవముఖమబ్జం
   కింకరదృష్టే స్తవపదమబ్జం ||

5. పాదసరోజం వృజినహరం తే
   యో భజతే నా సురపతికాంతే |
   తత్రకటాక్షా అయి శతశస్తే
   తస్యసమస్తం భగవతి హస్తే ||

6. జ్ఞాపకశక్తిః ప్రతినరమస్తం
   కారకశక్తిః ప్రతినరహస్తం |
   వాసవ చక్షు స్సుకృతఫలశ్రీ
   ర్భాతు మమాంతః సురభవనశ్రీః ||

7. మంత్రపరాణాం వచసి వసంతీ
   ధ్యానపరాణాం మనసి లసంతీ |
   భక్తిపరాణాం హృది విహరంతీ
   భాతి పరాంబా నభసి చరంతీ ||

8. సేవక పావప్రశమన నామా
   దిక్తిమిరౌఘ ప్రమథన ధామా |
   ఉజ్జ్వలశస్త్రా రణభువి భీమా
   పాతు నతం మాం హరిహయరామా ||


3. ఓ భగవతీ ! నీ శరీర కాంతి కోటిమెఱుపుల ప్రభవలె ప్రకాశించు చున్నది. పూర్ణసమాధిగల నీ హృదయమందు శాంతికలదు. నీ భుజబలము ఘోరమై శత్రుసంహారము చేయునది.


4. మిగుల మాధుర్యమున కాశ్రయమై లక్ష్మీనివాసమున కాల యమువంటిదిగా ప్రసిద్ధిజెందిన పద్మ మింద్రదృష్టిలో నీముఖమే యగుచున్నది. భక్తులదృష్టిలో నీ పాద మట్టి పద్మమగు చున్నది.


5. ఓ దేవీ ! పాపమును తొలగించు నీ పాదపద్మము నెవడు భుజించునో, వానికి నీ కటాక్షశతములు (ముఖపద్మానుగ్రహము) లభించును. వానికి సమస్తము హస్తగత మగుచున్నది.


6. ప్రతి మానవ శిరస్సునందు జ్ఞాపకశక్తిగా నున్నది, ప్రతి నర హస్తమందు కారకశక్తిగా నున్నది, యింద్రుని చక్షువునకు సుకృతఫలసంపదయై యున్నది యగు ఇంద్రాణి నా యంత రంగమున బ్రకాశించుగాక.


7. మంత్రవేత్తల వాక్కున బ్రకాశించునది, ధ్యానపరుల మనస్సున వికసించునది, భక్తిపరుల హృదయమందు విహరించునది, గగన మందు సంచరించునది యైన పరా దేవియగు అంబ భాసించు చున్నది.


8. సేవించువారి పాపములను నశింపజేయు నామముగలది, దిక్కుల చీకట్లను నశింపజేయు తేజస్సుగలది, రణభూమియందు భయమును గలిగించు నుజ్వలశస్త్రముకలదియైన ఇంద్రాణి నమ్రుడనై యున్న నన్ను రక్షించుగాక.

9. యోగినిశక్తి ర్విలససి దాంతిః
   యోషితిశక్తి ర్విలససి కాంతిః |
   జ్ఞానినిశక్తి ర్విలససి తుష్టి
   ర్ధన్వినిశక్తి ర్విలససి దృష్టిః ||

10. సంగినిశక్తి ర్విలససి నిద్రా
    ధ్యాతరిశక్తి ర్విలససి ముద్రా
    వాసవకాంతే గగననిశాంతే
    భాషితుమీశః క్వను విభవంతే ||

11. యద్దితిజానాం దమనమవక్రం
    కేశవహస్తే విలసతిచక్రం |
    తత్రకళా తే భగవతి భద్రా
    కాచన భారంవహతి వినిద్రా ||

12. దుష్టనిశాట ప్రశమన శీలం
    యత్సిత భూభృత్పతికరశూలం |
    తత్ర మహోంశస్తవ జగదీశే
    రాజతి కశ్చిత్పటు రరినాశే ||

13. యన్ని జరోచి ర్హృత రిపుసారం
    వాసవహస్తే కులిశ ముదారం |
    తత్ర తవాంశో విలసతి దివ్యః
    కశ్చన భాసో భగవతి భవ్యః ||

14. అంబరదేశే సుమహతి గుప్తా
    పంకజబంధౌ విలసతి దీప్తా |
    రాజసి మాత ర్హిమరుచిశీతా
    వేదికృశానౌ క్రతుభృతిపూతా ||


9. యోగియొక్క శక్తివై నీవు దమముగాను (ఇంద్రియ నిగ్రహ శక్తిగాను), స్త్రీయొక్క శక్తివై నీవు కాంతిగాను, జ్ఞానియొక్క శక్తివై నీవు తృప్తిగాను, ధనుర్ధరుని శక్తివై నీవు లక్ష్యశుద్ధిగాను ప్రకాశించుచుంటివి.


10. ఓ దేవీ ! సంగదోషముగలవానియందు నీవు నిద్రాశక్తివైతివి, ధ్యానించువానియందు ముద్రాశక్తివైతివి. నీ వైభవమును వర్ణించుట కెవడు సమర్ధుడు ?


11. ఓ దేవీ ! రాక్షసులను ఖండించునట్టిది, యవక్రమైనదై విష్ణు హస్తమందు బ్రకాశించునట్టిది యగు చక్రమేదికలదో, అది భద్రమైన, జాగరూకమైన నీయొక్క ఒకానొక కళాభారమునే వహించుచున్నది.


12. ఓ దేవీ ! దుష్టరాక్షససంహారమే శీలమై యొప్పు కైలాసాధిపతి హస్తమందుండు శూలమేదిగలదో, దానియందు శత్రునాశన పటుత్వముగల నీ తేజముయొక్క ఒక యంశమే ప్రకాశించు చున్నది (విష్ణుచక్రమందును, శివశూలమందును నున్న అస్త్ర శక్తి యామె వైభవమే అనుట.)


13. తన జ్వాలలచే శత్రువులను హరించునది, యుదారమైనది (అనగా సంహారమేగాక మంగళములకొఱకు రక్షించు నుదార లక్షణముకూడ కలది) అయి యింద్రహస్తమందే వజ్రమున్నదో దానియందును దివ్యమగు నీ తేజోంశయే యున్నది.


14. ఓ తల్లీ ! మహిమచే వ్యాపించిన ఆకాశప్రదేశమందు గుప్తము గాను, విలసించు సూర్యునియందు దీప్తముగాను, చల్లని కిరణములుగల చంద్రునియందు శీతలముగాను, క్రతువులనుభరించు వేదికాగ్ని యందు పవిత్రముగాను నీవు ప్రకాశించుచుంటివి.

15. సూక్ష్మరజోభి ర్విహితముదారం
    యజ్జగదేత ద్గగన మపారం |
    తత్తవ వేదః ప్రవదతీ కాయం
    పావని భానుస్తవ తనుజో౽యం ||

16. ఈశ్వరి నైక స్తవ ఖరతేజా
    స్తేపిచ సర్వే జనని తనూజాః |
    ఉజ్వల ఖేటాః కువదతికాయాః
    పావని కస్తే ప్రవదతు మాయాః ||

17. యా మహిమానం ప్రధయతి భూమిః
    పావనకీర్తిర్జలనిధి నేమిః |
    సేయమపీ శే భవతి సుపుత్రీ
    వాసవజాయే తవ జనధాత్రీ ||

18. అంగ! సఖాయో ! విరమత సంగా
    ద్దుర్విషయాణాం కృతమతి భంగాత్ |
    ధ్యాయత చిత్తే ధుతభయబీజం
    వాసవజాయా చరణ సరోజం ||

19. పాపమశేషం సపది విహాతుం
    శక్తిమనల్పామపి పరిధాతుం |
    చేతసి సాధో కురు పరిపూతం
    వాసవజాయా పదజలజాతం ||

20. ఈశ్వరి వంద్యద్యుతి భృతిమేఘే
    కాంక్షిత నీరాణ్యసృజతి మోఘే |
    నిర్మలకీర్తేస్తవ శచి గానం
    శక్ష్యతి కర్తుం తదుదక దానం ||


15. ఓ దేవీ ! సూక్ష్మరజస్సులతో నిండి శ్రేష్ఠమై యే యీఅపార గగనమనబడు (సూక్ష్మ) జగత్తు కలదో, అది నీకు శరీరమని వేదములో చెప్పబడుచున్నది. అట్టి నీకీ సూర్యుడు కుమారుడు.


16. ఓ జననీ ! తీక్ష్ణ తేజస్సు గల సూర్యు డొక్కడే నీకు పుత్రుడు కాడు. భూమివలె పెద్దకాయము గలిగి గగనమందు బ్రకాశించుచు జ్యోతిర్గోళములు అను పుత్రులు నీకు పెక్కుమంది గలరు. నీ మాయల నెవడు చెప్పగలడు.


17. తల్లీ ! పావనకీర్తి గలిగి, సముద్రమును కమ్మిగాగల యే భూమి విశాలమై యున్నదో, అదియు నీ పుత్రికయే.


18. ఓ సఖులారా ! మతిని భ్రష్టమొనర్చు దుర్వ్యసన సాంగత్యమునుండి విరమింపుడు. జన్మభయబీజమును నశింపజేయు నింద్రాణీ పదపద్మములను మీ చిత్తమందు ధ్యానింపుడు.


19. ఓ సాధువా ; వెంటనే సర్వ పాపములనుండి విముక్తుడ వగుటకును, అధికశక్తి బొందుటకును నీ వింద్రాణియొక్క పవిత్ర చరణములను చిత్తమందుంచుకొనుము.


20. ఓ శచీ ! అందరిచేతను పూజింపబడు కాంతిని ధరించు మేఘము వ్యర్ధమై, కాంక్షింపబడిన జలము నది సృజింపజాలనప్పుడు, నీ నిర్మలకీర్తి గానము జలము నీయగలుగుచున్నది.


21. ఆమయవీర్యా ద్విగళతి సారే
    జీవతి కించిద్రసనగనీ రే |
    రక్షతి జంతుం తవ శచినామ
    ప్రాజ్ఞజనైర ప్యగణితధామ ||

22. మధ్యమలోకేస్యతి శుచి రుగ్రా
    రాజసి నాకే విభవ సమగ్రా |
    ప్రాణి శరీరే భవసి విచిత్రా
    వాసవజాయే వివిధ చరిత్రా ||

23. వోమ్నివపుస్తే వినిహతపాపం
    విశ్రుతలీలం తవ దివిరూపం |
    కర్మవశాత్తే భవతి సభోగః
    ప్రాణిశరీరే భగవతి భాగః ||

24. భారతభూమేః శుచ మపహంతుం
    శ్రేష్ఠముపాయం పునరవగంతుం |
    వాసవజాయే దిశ మమబుద్ధిం
    పావని మాయే కురుకురుసిద్ధిం ||

25. సమ్మదయంతీ ర్భుధజనమేతాః
    స్వర్గధరిత్రీపతిసతి ! పూతాః |
    మౌక్తిక మాలాః శృణు నుతికర్తు
    ర్భక్తినిబద్ధాః కవికులభర్తుః ||

           _______


21. ఓ శచీ ! రోగబలమువలన రోగియొక్కబలము జారి, జిహ్వ యందున్న నీటితో నతడు కొంచెము జీవించియుండగా, ప్రాజ్ఞులకు గూడ గణింపనలవిగాని యుత్తమస్థితినిచ్చు నీ నామమే యా జంతువునప్పుడు రక్షించగలదు.


22. ఓ యింద్రాణీ ! నీవు గగనమందు (మధ్యమలోకమందు) విశేష పవిత్రముగను, నుగ్రముగను నుందువు; స్వర్గమందు సమగ్ర వైభవముతో రాజిల్లుచుందువు. ఇంక ప్రాణిశరీరమందు విచిత్రములతో గూడి వివిధములగు చరిత్రలుగల దాని వగుచుంటివి.


23. నీ శరీర మా కాశమందు పాపవర్జితమై, సూర్యునియందు విశ్రుత లీలలుగలదై యున్నది. ప్రాణి శరీరములో కర్మవశమువలన నీ రూపభాగము భోగయుక్తమై యున్నది.


24. ఓ మాయారూపిణీ ! భారతభూమియొక్క దుఃఖమును తొలగించుటకును, శ్రేష్ఠోపాయమును తిరుగ (వేదకోశమునుండి) తెలిసికొనుటకును నాకు బుద్ధినిమ్ము, సిద్ధిని తప్పక చేకూర్చుము.


25. ఓ యింద్రాణీ ! బుధజనులను సంతోషపరచునది, పవిత్రమైనది, భక్తితో గూడినది, కవికులపతిచే సుతింపబడినదియైన యీ 'మౌక్తిక'మాలను నీవు వినుము.


__________

4. సుముఖీస్తబకము


1. అజితమినాగ్ని తటి చ్ఛశిభి
   ర్మమహృదయస్య తమః ప్రబలం |
   అమరపతిప్రమదా హసితం
   విమల ఘృణిప్రకరై ర్హరతు ||

2. సురనృపతేర్దయితా వివతా
   హితశమనీ లులితా మితరైః |
   వరకరుణా వరుణాలయ దృ
   ఙ్మమజననీ మవతా దవనిం ||

3. పటుతపసో జమదగ్ని మునే
   రిహ సహధర్మచరీం భువనే |
   తనయ నికృత్తశిరఃకమలాం
   వరమతి మావిశ దింద్రవధూః ||

4. యదుకులకీర్తి విలోపభియా
   బత వినిగుహ్య ఋతం కవయః |
   మునిగృహిణీ వధహేతుకథా
   మితర పథేన భణంతి మృషా ||

5. న సురభి రర్జునభూమిపతి
   ర్భృగుతిలకస్య జహార స యాం |
   ఇయమమృతాంశు మనోజ్ఞముఖీ
   పరశుధరస్య జనన్యనఘా ||

6. అతిరథ మర్జునభూమిపతిం
   సహపృతనం జమదగ్ని సుతః |
   యుధి సవిజిత్య విశాలయశాః
   పునరపి మాతర మాహృతవాన్ ||


1. సూర్యాగ్నులచే గాని, తటిత్తుచే గాని; చంద్రునిచేగాని జయింపబడజాలని నా హృదయ తమస్సు నింద్రాణీ హసితము తన నిర్మల కాంతిపుంజములచే హరించుగాక.

(మొదటినాల్గును బాహ్యతమస్సులనుమాత్రము జయించును.)

2. నమ్రుల కిష్టములేనిదానిని నశింపజేయు కరుణా సముద్రమగు దృష్టిగల యింద్రాణి యితర మతస్థులచే చీకాకు గావింపబడిన నా యీ జనినియగు భారతభూమిని రక్షించుగాక.


3. ఈ లోకములో కుమారునిచే ఛేదింపబడిన శిరస్సు గలది, శ్రేష్ఠబుద్ధి గలదియైన జమదగ్ని ముని భార్య నింద్రాణి యావేశించెను.


4. యదుకులమున కపకీర్తి వచ్చునను భీతిచే కవులు నిజమును గప్పిపుచ్చి, యీ మునిపత్ని యొక్క వధహేతు కథను వేఱు మార్గమున నసహ్యముగా జెప్పుచున్నారు.

(కార్తవీర్యుడు యదుకులమువాడు.)


5. ఆ కార్తవీర్యార్జునుడు భృగుకుల తిలకుని సురభి నపహరింప లేదు. అతని పత్నియు, చంద్రముఖియు, పాపరహితురాలునగు పరశురామ జననినే యపహరించెను.


6. ఆ జమదగ్ని సుతుడైన పరశురాము డతిరథుడైన అర్జున మహారాజును సేనా సమేతముగా యుద్ధమందు జయించి విశాల కీర్తిగలవాడై, తల్లిని తిరుగ తీసికొనివచ్చెను.


 7. పరగృహవాస కళంకవశా
    న్నిజగృహిణీం జమదగ్ని మునిః |
    బత వినిహంతుమనాకలయం
    స్తనుభవమాదిశ దుగ్రమనాః ||

 8. పితృవచనాదతి భక్తిమతా
    ప్యసురవదాత్మసుతేన హతాం |
    మునిగృహిణీ మనఘేతి వదం
    స్తవ వరదే౽విశదంశ ఇమాం ||

 9. ఇదమవికంప్య మతిప్రబలం
    ప్రభవతి కారణ మార్యనుతే |
    మునిగృహిణీ మనఘాం భణితుం
    శచికలయా యదిమామవిశః ||

10. ఖలజన కల్పిత దుష్టకథా
    శ్రవణవశా ద్యధితం హృదయం |
    అధ చరితే౽వగతే విమల
    స్మృతి వశతో మమ యాతి ముదం ||

11. తవ మహసావిశతా కృపయా
    మమ శచి సూక్ష్మశరీరమిదం |
    నృపరిపుమాతృ పవిత్రకథా
    స్మరణపథం గమితా సపది ||

12. విదధతు రాసురకృత్య ముభౌ
    బహుళగుణామపి యద్గృహిణీం |
    సముని రఘాత యదచ్చకథాం
    దశరధజశ్చ ముమోచ వనే ||


7. పరగృహమందు వసించెనను కళంకము నెంచి తన భార్య నీ జమదగ్ని ముని చంపుట కుద్రమనస్కుడై, మనస్సునం దాలోచించనివాడై, తన కుమారు నాజ్ఞాపించెను. ఆశ్చర్యము !

(తాను చంపక, కుమారుని చంపుమనుట యాశ్చర్యము.)


8. ఓ వరదా ! అతి భక్తిమంతుడైనను (తల్లి యందు), తండ్రి వచనమువలన రాక్షసునివలె తన కుమారునిచే చంపబడిన యీ ముని పత్ని పుణ్యాత్మురాలనుచు నామెను నీ యంశ ప్రవేశించెను.


9. ఓ శచీ ! ఏ హేతువువలన నీవు నీ కళచే నీ మెయం దావేశించితివో, ఆ హేతువువల్లనే మునిపత్ని పవిత్రురాలని చెప్పుట కిది ఖండింపనలవిగాని యత్యంత ప్రబలకారణ మగుచున్నది.


10. దుర్మార్గులచే కల్పితమైన యీ దుష్టకథ వినుటవలన నా హృదయము తొలుత దుఃఖభరితమై, పిదప నిర్మలబుద్ధిచే నిజమగు చరిత్రను తెలిసికొని సంతోషమును బొందెను.


11. ఓ శచీ ! నా యీ సూక్ష్మశరీరమును కృపతో బ్రవేశించిన నీయొక్క తేజస్సువలన పరశురామ జననియొక్క పవిత్ర కథ తత్క్షణమే స్మృతిపథమును బొందెను.


12. బహు గుణములుగల భార్య నా జమదగ్నిముని యే హేతువు వల్ల చంపించెనో, స్చచ్ఛమైన చరిత్రగల భార్యను దశరధ పుత్రు డే హేతువుచే వనమందు విడచిపుచ్చెనో, ఆ హేతువు వలన నుభయులు రాక్షసకృత్యమే చేసిరి.

13. అపి వినికృత్తశిరాః శచి తే
    వరమహసా విశతా సపది |
    అలభత జీవిత మంబ పున
    ర్భువన శుభాయ మునేస్తరుణీ ||

14. యది శిరసా రహితే వపుషి
    ప్రకటతయా విలసంత్యసవః |
    యది హృదయం సహభాతిధియా
    కిమివ విచిత్ర మితశ్చరితం ||

15. పరశుధరస్యసవిత్రి కళా
    త్వయి పురుహూత సరోజదృశః |
    స శిరసి కాచిదభూద్రుచిరా౽
    విశిరసి భీమతమా భవతి ||

16. పరశుధరోర్జున భూమిపతిం
    యదజయ దంబ తపో౽త్ర తవ |
    అభజత కారణతా మనఘే
    వరమునిగేయ పవిత్రకథే ||

17. భగవతి కృత్తశిరా భవతీ
    మధితవతీ నృపతీ నశుభాన్ |
    ప్రధన భువి ప్రగుణం భుజయోః
    పరశుధరాయ వితీర్య బలం ||

18. శుభతమ కుండల పూ ర్వసతిః
    పదనతపాతక సంశమనీ |
    దిశతు నికృత్తశిరాః కుశలం
    మమ సురపార్థివశక్తికళా ||


13. ఓ యంబా ! కృత్తశిరస్కురాలైనను జమదగ్ని భార్యయైన రేణుక తనయందు తత్క్షణమే ప్రవేశించిన నీ యొక్క గొప్ప తేజస్సుచే లోకశుభముకొఱకు తిరుగ జీవితమును బొందెను.


14. శిరస్సులేని శరీరములో స్పష్టముగా ప్రాణములు ప్రకాశించిన హృదయము బుద్ధితో గూడ బ్రకాశించినది. ఇంతకంటె విచిత్ర మేది యుండును ?


15. ఓ రేణుకా ! శిరస్సుతో నున్న నీయందు శచీ సంబంధమైన నొకానొక మోహన కళయు, శిరస్సులేని నీ యందామె యొక్క భీకర కళయు నుండెను.


16. ఓ యంబా ! పరశురాముడు కార్తవీర్యార్జున మహారాజును జయించినప్పు డా విజయమునకు నీ తపస్సే కారణత్వము బొందెను.


17. ఓ భగవతీ ! కృత్తశిరస్సుగల నీవు యుద్ధభూమియందు పరశురాముని భుజముల కమితబలమునిచ్చి, దుర్మార్గులైన రాజులను చంపించినదానవైతివి.


18. శుభమైన కుండలీపురము వాసవముగాగలది, పాదములకు నమస్కరించువారి పాపములను పరిహరించునది, కృత్తశిరస్కురాలు అయిన ఇంద్రాణీకళ నాకు కుశలమిచ్చుగాక.

(కుండలీపురమే పడైవీడను క్షేత్రము. ఇది వేలూరు సమీప మందున్నది.)

19. నిజసుత రంగపతే ర్నికటే
    కృతవసతి ర్నత సిద్ధికరీ |
    దళితశిరాః స్రతనోతు మమ
    ప్రియ మమ రేశ్వరశక్తికళా ||

20. భువితతసహ్య నగాంతరగే
    శుభతమచంద్రగిరౌ వరదా |
    కృతవసతిః కురుతాన్మమ శం
    భృగుకులరామజన న్యజరా ||

21. అవతు నికృత్తశిరాః పదయో
    ర్భజక మనింద్య విచిత్రకథా |
    దినకరమండలమధ్య గృహా
    సురధరణీపతిశక్తికళా ||

22. గగన చరార్చిత పాదుకయా
    పదనత సన్మతి బోధికయా |
    మమ సతతం శుచి రేణుకయా
    పరవదిదం కుల మంబికయా ||

23. శమయితు ముగ్రతమం దురితం
    ప్రథయితు మాత్మ నిగూఢబలం |
    గమయితు మగ్ర్యదశాం స్వకులం
    తవచరణాంబుజ మంబ భజే ||


19. తన కుమారుడైన రంగపతియొక్క సమీపమున వాసము చేయుచున్నది, నమ్రులకు కార్యసిద్ధి నిచ్చుచున్నది, ఛేదింపబడిన శిరస్సు గలదియగు నింద్రాణీ కళ నాకు బ్రియములు సమకూర్చుగాక.

(ఈ క్షేత్రములో రేణుకాలయమునకు కొంచెము దూరములో రఘరామాలయ ముండుట వింత. ఒకప్పుడది పరశురామాలయము కావచ్చును లేదా పరశురామును యుత్తర చరిత్రమే రఘురామ చరిత్రమై యుండవచ్చును.)


20. ఓ సహ్యపర్వతనివాసినీ ! శుభప్రదమైన చంద్రగిరియందు వాసము జేయునది, వరము లిచ్చునది, ముసలితనము లేనిది యగు భార్గవరామ జనని శుభము లొసగు గాక.


21. కృత్త శిరస్సు కలది, పవిత్రమైనట్టియు, విచిత్రమైనట్టియు కథ కలది, సూర్యమండల మధ్యభాగము గృహముగా గలదియైన యింద్రాణీ కళ తన పాదములను భజించు నన్ను రక్షించుగాక. (దేవయాని మార్గమునుండి సూర్యునిబొందునది యింద్రాణీకళ.)


22. దేవతలచే పూజింపబడు పాదుకలు కలది, పాదములకు నమస్కరించువారికి మంచి బుద్ధులిచ్చునది యైన అంబికయగు రేణుక పరాధీనమైన నా యీ భారతకులమును సతతము శుచిగా నుండునట్లొనర్చుగాక.


23. ఓ యంబా ! ఉగ్రతమమైన పాపములను ధ్వంస మొనర్చుటకు, నిగూఢమైన ఆత్మబలమును ప్రకటన మొనర్చుటకు, స్వకులము నుచ్చ దశ బొందించుటకు నేను నీ పాదములను సేవించు చుంటిని.

24. పరవశగా మశివేనవృతాం
    భరతధరాం పరిపాతుమిమాం |
    పటుమతి వాక్క్రియ మాతనుతా
    ద్గణపతి మగ్ర్యహయప్రమదా ||

25. గణపతిదేవ మహోంశజుషో
    గణపతినామ కవిస్రకవేః |
    సురపతి జీవసఖీ శృణుయా
    ద్దశశత పత్రముఖీ సుముఖీః ||

            ________


షష్ఠం త్రైష్టుభం శతకమ్ సంపూర్ణమ్.


24. పరులకు వశమై, యమంగళముతో గూడియున్న యీ భారత భూమిని రక్షిందుట కింద్రాణీదేవి గణపతిని పటుతరబుద్ధి వాక్క్రియలు గమవానిగా జేయుగాక.


25. గణపతి దైవముయొక్క తేజమును బొందిన గణపతినామ కవిచే రచింపబడిన యీ 'సుముఖీ' వృత్తముల నింద్రాణి వినుగాక.


__________