ఇంద్రాణీ సప్తశతీ/ఔష్ణిహం శతకమ్
ఓం
ద్వితీయం
ఔష్ణిహం శతకమ్
1. కుమారలలితాస్తబకము
1. సురేశ్వర మహిష్యా స్స్మితం శశిసితం మే |
తనోతు మతి మచ్ఛాం కరోతు బల మగ్య్రం ||
2. విధాయ రిపు ధూతిం నిధాయ సుదశాయాం |
పులోమ తనుజాతా ధినోతు భరత క్ష్మాం ||
3. పదప్రణత రక్షా విధాన ధృతదీక్షా |
జగద్భరణ దక్షా పరా జయతి శక్తిః ||
4. స్వర త్యవిరతం సా శనై ర్నభసి రంగే |
జ్వలత్యధిక సూక్ష్మం జగత్ప్రభవ శక్తిః ||
5. మహస్తవ సుసూక్ష్మం నిదాన మఖిలానాం |
భవత్యఖిల మాత ర్జగత్యనుభవానాం ||
6. జనన్యనుభవానాం మతిత్వపరిణామే |
స్వరో భవతి మూలం తవాభ్ర హయరామే
7. య ఈశ్వరి నిదానం సమస్త మతి భానే |
స్వరో గతివి శేషా త్సఏవ ఖలు కాలః ||
1. ఇంద్రాణియొక్క చంద్రునివంటి ధవళ స్మితము నా బుద్ధికి వైర్మల్య మొసగి శ్రేష్ఠబలము నిచ్చుగాక.
2. శత్రునాశనమొనర్చి, భరత భూమిని మంచిదశకు తెచ్చి యింద్రాణి సంతోషపెట్టుగాక.
3. తన పాదములందు నమ్రులైనవారిని రక్షించు విధానమందు దీక్షబూనినది, జగత్తును భరింప సమర్ధురాలైనది యగు పరాశక్తి ప్రకాశించుచున్నది.
4. స్వర్గమం దెడతెరపిలేకను, ఆకాశరంగస్థలమందు సూక్ష్మము గాను గల ఆ యింద్రాణీశక్తి యధికముగాను, సూక్ష్మము గాను బ్రకాశించుచున్నది.
(స్వర్గమందు స్పష్టముగా నున్నందున తేజస్సధికము. ఆతేజము ఆకాశమందు తన సూక్ష్మత్వముచే తిరోధానమై యస్పష్టముగా నుండును.)
5. ఓ తల్లీ ! నీ యతిసూక్ష్మ తేజస్సు జగత్తునందు సకలానుభవములకు నిదానము (ఆధారము) అగుచున్నది.
6. ఓ తల్లీ ! అనుభవములయొక్క జ్ఞాన పరిణామమునకు నీ స్వరమే మూల మగుచున్నది. (ప్రణవ శబ్దము జ్ఞానమునకు నేతకనుక)
7. ఓ యీశ్వరీ ! ఏ స్వరము సమస్త జ్ఞానమునకు మూలమో, ఆ స్వరమే గతివిశేషమువలన కాలమగును గదా !
8. జ్వలం త్వభిహితా త్వం విహాయసి విశాలే |
ప్రచండ పదపూర్వా ప్రపంచకరి చండీ ||
9. స్వరం త్వఖిల బుద్ధి ప్రదా భవసి గౌరీ |
త్రికాలతను రంబ స్మృతా త్వమిహ కాళీ ||
10. మహస్స్వర ఇతీదం ద్వయం తదతిసూక్ష్మం |
మహేశ్వరి తవాంశ ద్వయం పరమముక్తం ||
11. మహో౽తిశయ మాప్తం త్వయి త్రిదివ గాయాం |
స్వరో౽తిశయ మాప్తః సితాద్రి నిలయా యాం ||
12. దివం నయతి పూర్వా భువం యువతి రన్యా |
ద్వయోః ప్రకృతి రభ్రం విశాలమతి మానం ||
8. దేవీ ! విశాలమైన ఆకాశమందు నీవు ప్రీతిచే జ్వలించుచు 'ప్రచండ' పదము ముందుగల చండివై ప్రకాశించుచుంటివి.
(ఆకాశమందు మహిమచే జ్వలించుశక్తి ప్రచండచండి కనుకనే యీమె వైద్యుత శక్తిస్వరూపిణి.)
9. ఓ యంబా ! స్వరరూపిణివై నను యఖిలమునకు బుద్ధి నిచ్చుచు 'గౌరి' వైతివి. త్రికాలములే శరీరముగా గలిగి యిచ్చట 'కాళి'గా స్మరింపబడుచుంటివి.
(అనగా బుద్ధినిచ్చు చిచ్చాఖ యొకటి, నాదముచే పరిణామములను గల్పించు క్రియా శాఖ యింకొకటి.)
10. ఓ యీశ్వరీ ! మహస్సు, స్వరము అను రెండును అతి సూక్ష్మములు. అవి యుత్కృష్టమగు నీయొక్క అంశద్వయముగా చెప్పబడుచున్నవి.
11. స్వర్గమును బొందిన నీ మహస్సు అతిశయమును బొంది యున్నది (ఆకాశముకంటె నివృత్తిచే వేఱైన స్వర్గమందు మహస్సై ఆకాశముతో గూడిన భువనమందది సహస్సనబడును) అట్లే కైలాసమందు వసించు నీ స్వర మతిశయించుచున్నది. (స్వర్గములో మహస్సు విభూతి, కైలాసమందు ప్రణవము విభూతి)
12. మొదట చెప్పబడిన దేవి (అనగా అతిశయించిన మహస్సు కలది) దివమును బొందించుచున్నది, తరువాత చెప్పబడిన దేవి భువమును బొందించుచున్నది. (మొదటిది నివృత్తి స్వరూపిణి, రెండవది ప్రవృత్తి స్వరూపిణి.) ఈ రెండింటికి మూలము కొలవ శక్యముగాని విశాలాకాశమే. (సచ్చిదానందమే)
13. నతే దివి లసంత్యాః పితా తనుభృదన్యః |
స్వయం భువ మిమాంత్వాం సతామవని విద్మః ||
14. సురారి కులజన్మా తవేశ్వరి పులోమా |
పితేతి కవిభాషా పరోక్షగతి రేషా ||
15. వదం త్యసుర శబ్దై ర్ఘనం సజలమేతం |
పులోమ పదమేకం పురాణసతి తేషు ||
16. ప్రకృష్టతర దీప్తి ర్గభీరతర నాదా |
ఇతోహి భవసి త్వం తటి న్ముని యశోదా ||
17. అరాతి రసురో౽యం విభో ర్ని గదిత స్తే |
హయశ్చ బత గీతః పితా తవ పయోదః ||
18. ప్రియైః కిల పరే వాం పరోక్ష వచనౌఘైః |
ప్రతారిత మివేలా జగన్ముని గణేన ||
13. ఓ తల్లీ ! ఆకాశమందు బ్రకాశించు నీ కితర శరీరధారియగు తండ్రి యెవ్వడులేడు. అట్టి నిన్ను మే మందువలన స్వయంభువగా తలచుచుంటిమి.
14. ఓ యీశ్వరీ ! రాక్షసకులమందు బుట్టిన పులోముడు నీ తండ్రి యను కవివచన మప్రమాణమైనది.
(పురాణములలో పులోము డింద్రాణి తండ్రిగా వచింపబడెను.)
15. దేవీ ! జలయుక్తమైన మేఘ మీ యసురవాచక శబ్దములతో పిలువబడెను. అట్టి పదములలో 'పులోమ' పద మొకటి.
(ఘనం అనగా మేఘము. నిఘంటువులో 'ఘనం' అను పదమునకున్న 32 పేళ్లలో 'పులోమ' అనునది యొకటి.)
16. ఓ తల్లీ ! మునులకు గీర్తినిచ్చు నీవు అత్యధిక కాంతియు, గంభీరనాదమున్ను గలిగిన మెఱుపు రూపమున యీ మేఘము నుండి పుట్టితివి.
(కనుక పులోము డామెకు తండ్రి యనబడెను. కాని మెఱుపు రూపమైన విద్యుచ్ఛక్తి పులోముడను మేఘమునకు బూర్వ మాకాశమందు తల్లివలెనున్న విషయమీ కవులు మరచిరి.)
17. ఈ పులోమ రక్కసుడు నీ విభుని శత్రువుగా వచింపబడు చుండెను. నీ తండ్రియైన యీ మేఘము 'హయ' మనియు పిలువబడెను.
18. దేవీ ! మీ యుభయులనుగుఱించి (ఇంద్రయింద్రాణీలగురించి) ప్రియమైన గూఢవాగ్జాలముచే మునిగణములీభూమిని వంచించి నట్లున్నది.
19. నికృష్టమపి రమ్యం యది త్రిదివలోకే |
తవాంబ కిము వాచ్యా రుచి స్త్రిదివ నాథే ||
20. త్వమంబ రమణీయా వధూ స్త్వమివ నాకే |
త్వయా క ఇహ తుల్యాం మృదో వదతు లోకే ||
21. వినీల మివ ఖాంశం విదు స్త్రిదివ మేకే |
పరస్తు వదతి స్వః కవిః కమల బంధుం ||
22. అముత్ర గతశోకే మహా మహసి నాకే |
నమా మ్యధికృతాం తాం మహేంద్ర కులకాంతాం ||
23. యదామ ముత పక్వం మదీయ మఘ ముగ్రం |
తదింద్ర కులకాంతే నివారయ సమగ్రం ||
24. దదాతు భరత క్ష్మా విషాద హరణాయ |
అలం బల ముదారా జయంత జననీ మే ||
25. అతీవ లలితాభిః కుమార లలితాభిః |
ఇమాభి రమరేశ ప్రియా భజతు మోదం ||
- _________
19. ఓ యంబా ! నికృష్టమైన వస్తువుకూడ స్వర్గమందు రమ్యమై యున్నప్పు డింక స్వర్గాధీశ్వరివైన నీ కాంతినిగుఱించి చెప్పుట కేమున్నది.
20. తల్లీ ! స్వర్గమందు నీవంటి రమణీయస్త్రీవి నీవే. ఈ మట్టిలోక మందింక నీకు సమానస్త్రీ నెవడు చెప్పగలడు ?
21. మిక్కిలి నీలమైన ఆకాశము స్వర్గమని కొందఱు భావించు చున్నారు. (నిర్మలాకాశము.) మఱియొక కవి సూర్యుడే స్వర్గమనుచున్నాడు.
22. ఊర్ధ్వమందున్నది, దుఃఖరహితమైనది, గొప్ప తేజస్సుగలది యగు స్వర్గము నధిష్టించిన ఇంద్రాణికి నేను నమస్కరించు చున్నాను.
(స్వర్గమునకు సరియగు నిర్వచన మీయబడెను. దీనినిబట్టి పైశ్లోకములో పేర్కొనబడిన నిర్వచనములు ఖండింపబడినవగును.)
23. ఓ యింద్రాణీ ! పచ్చిగానున్నను, పక్వమైనను నాయొక్క ఉగ్రపాపము లేవిగలవో, అధికముగానున్న ఆ పాపములను నీవు నివారింపుము.
24. ఉదార స్వభావురాలైన జయంతుని తల్లి (ఇంద్రాణి) భరత ఖండ విషాదహరణమునకై నా కత్యంత బలము నొసగుగాక.
25. అతి సుందరమైన యీ కుమార లలితా వృత్తములవలన ఇంద్రాణి సంతోష మొందుగాక.
- ____________
2. మదలేఖాస్తబకము
- ____________
1. పౌలోమ్యాః పరిశుభ్ర జ్యోత్స్నా దృశ్యరుచో మే |
శ్రీమంతో దరహాసాః కల్పంతాం కుశలాయ ||
2. కారుణ్యామృత సిక్తా శక్తా శక్ర మహిష్యాః |
ప్రేక్షా భారత భూమే ర్దౌర్బల్యం విధునోతు ||
3. వందే నిర్జర రాజ్ఞీం సంకల్పేసతి యస్యాః |
సాధ్యా సాధ్య విచారో నైవస్యాదణు కోపి ||
4. సంకల్ప స్తవ కశ్చి చ్చిత్త చేద్దివ ఈశే |
స్యా దుల్లంఘ్య నిసర్గం సిద్ధిర్నిష్ఫలతావా ||
5. మూఢోప్యుత్తమ రీత్యా సిద్ధ్యే దధ్యయనేషు |
మేధావీచ నితాంతం నైనస్యా త్కృతకృత్యః ||
6. ఉత్పద్యేత మహేశ్వర్యప్రాజ్ఞాదపి శాస్త్రం |
యాయాన్మాతరకస్మా ద్విభ్రాంతిం విబుధోపి ||
7. అల్పానామబలానాం సంగ్రామే విజయస్యాత్ |
శక్తానాం బహుళానాం ఘోరాస్యా త్పరిభూతిః ||
8. రాజేరన్నృప పీఠే ష్వఖ్యాతాని కులాని |
స్యాద్దుర్ధర్ష బలానాం పాతో రాజకులానాం ||
1. పరిశుభ్రమైన వెన్నెలవలె గన్పట్టు కాంతులు గల్గి ప్రకాశించు ఇంద్రాణీ దరహాసము నాకు క్షేమము కొఱకగుగాక.
2. దయ యనెడి యమృతముచే తడుపబడు నట్టిది, శక్తిమంతమైనది యగు ఇంద్రాణీ వీక్షణము భారతభూమియొక్క దౌర్బల్యమును హరించుగాక.
3. ఏ దేవి సంకల్పించినప్పుడు సాధ్యాసాధ్య విచారము లేశమైన నుండదో, అట్టి దేవికి నేను నమస్కరింతును.
4. ఓ స్వర్గాధీశ్వరీ ! నీవు సంకల్పించినచో సిద్ధి, నిష్ఫలత యనునవి తమ నైసర్గికస్థితి నతిక్రమించియైనను జరిగితీరును.
5. నీ సంకల్పమునుబట్టి మూఢుడైనను, నుత్తమరీతిని విద్యలందు సిద్ధి బొందును. అత్యంత మేధావియైనను, కృతకృత్యుడు కాజాలడు.
6. ఓ తల్లీ ! నీ సంకల్పానుసారము మూఢునివల్ల శాస్త్రముత్పన్నము కావచ్చును, పండితుడైనను అకస్మాత్తుగా భ్రాంతి బొందవచ్చును.
7. బలహీనులై కొలదిమంది యున్నను సంగ్రామమందు విజయ మొందవచ్చును, చాలమంది యుండి శక్తిమంతులైనను ఘోరాపజయము బొందవచ్చును.
8. కీర్తిలేని వంశములు నృపపీఠమందు బ్రకాశించుచు, మిగుల బలముగల రాజకులములు నశించవచ్చును.
9. నిర్యత్నోపి సమాధే ర్విందేద్దేవి సమృద్ధిం |
యోగస్యాంబ నపశ్యే దభ్యస్యన్నపి సిద్ధిం ||
10. అత్యంతం యదసాధ్యం నేదిష్ఠం భవతీదం |
సాధ్యం సర్వ విధాభి స్స్యా దింద్రాణి దవిష్ఠం ||
11. గాయమో మునిసంఘై ర్గేయాం కామపి మాయాం |
ఇంద్రస్యాపి వినేత్రీం త్రైలోక్యస్యచ ధాత్రీం ||
12. విద్యానామధినాథే కాం విద్యాం శ్రయసే త్వం |
ఇంద్రం కర్తుమధీనం విశ్వస్మా దధికం తం ||
13. నిత్యాలిప్త మనీషే స్త్రీమోహో నవితర్క్యః |
భ్రూచేష్టానుచరత్వా దన్యాస్యా దనుకంపా ||
14. సౌందర్యం పరమన్య ద్వజ్రేశ్వర్యథవా తే |
హర్తుం యత్సుఖమీష్టే తాదృక్ తస్యచ చిత్తం ||
15. చక్షుర్దర్శన మాత్రా న్నిస్తేజో విదధానం |
చిత్తంచో ఝ్జితధైర్యం మత్తానాం దనుజానాం ||
9. ఓ దేవీ ! యత్నము జేయనివాడుగూడ పూర్ణసమాధి బొంద వచ్చును, అభ్యసించుచున్నను యోగస్థితి నొకడు పొందక పోవచ్చును.
10. ఓ యింద్రాణీ ! ఏది యత్యంత అసాధ్యమో, అది సమీపము గావచ్చును ; సర్వవిధముల సాధ్యమైనది దూరము గావచ్చును.
11. ముని సంఘములచే గానము చేయబడునది, యింద్రునిగూడ శాసించునది, త్రిలోకజనని యగు నొకానొక మాయను మేము గానము చేయుచుంటిమి.
12. సకల విద్యాధీశ్వరీ ! ఓ తల్లీ ! విశ్వముకంటె నధికుడైన ఆ యింద్రుని వశ మొనర్చుకొనుటకు నీవే విద్య నాశ్రయించితివి ?
13. ఓ దేవీ ! స్త్రీ మోహమూహింపనలవిగానిది. నీ కనుబొమ్మల చేష్టల కనుచరుడగుటవలన నీ వతనియందు చెప్పనలవిగాని దయ జూపియుందువు.
14. ఓ యింద్రాణీ ! అట్లుగానిచో, నీ సౌందర్య ముత్కృష్ట మైనది, యసాధారణమైనది యని చెప్పవచ్చును. ఏ సౌందర్య మాతని చిత్తమును సులభముగా నపహరించుటకు సమర్ధమగుచున్నదో
(ఆ సౌందర్య మసాధారణోత్కృష్టమైనదని యన్వయము.)
15. ఓ దేవీ ! నీ నేత్రము తన వీక్షణ మాత్రముచేతనే మత్తులైన దనుజుల చిత్తములను ధైర్య తేజోవిహీనములుగా చేయు చున్నది.
16. గర్తే దుర్జన దేహే మగ్నాన్పంక విలగ్నాన్ |
ప్రాణానాత్మ సజాతీ నుద్ధర్తుం ధృతదీక్షం ||
17. వజ్రం నిర్జరరాజో యద్ధత్తే సమరేషు |
త్వ చ్ఛక్తేః కలయైత న్మన్మాత ర్నిరమాయి ||
18. రాజ్ఞీ త్వాత్పరమే తే రాజత్వం శతమన్యోః |
నిశ్శక్తిస్సవినా త్వాం కామాజ్ఞాం కురుతాం న: ||
19. సర్వం శక్ర నిశాంత స్యేశానే తవ హస్తే |
అస్మాకంతు ధియేదం స్తోత్రం సంగ్రహతస్తే ||
20. గంతవ్యం స్వరధీశే నిశ్శేషార్పణ శూరం |
బిభ్రాణా నయసి త్వం మార్జాలీవ కిశోరం ||
21. గృహ్ణన్నంబరనాధా మంబామశ్లథ బంధః |
కీశస్యేవ కిశోరో యోగీ గచ్ఛతి గమ్యం ||
16. దుర్జనదేహమనెడి గోతిలో మునిగిపోయి, పాపపంకమందు చిక్కువడిన ఆత్మసంబంధమగు ప్రాణముల నుద్ధరించుటకు దృఢ దీక్ష బూనిన (వాక్యపూర్తికి తరువాత శ్లోకము చూడుడు.)
17. ఇంద్రుడు యుద్ధమున నెట్టి వజ్రాయుధము ధరించెనో అట్టి వజ్రము నీ శక్తియొక్క కళచేతనే నిర్మింపబడెను.
(శరీరములందుండు వెన్నెముకకు వజ్రదండమని పేరు. దాని యందు శరీరవ్యాపారమును శాసించు నాత్మశక్తిప్రవాహము సుషుమ్నానాడి నాశ్రయించి యుండును. ఈ శక్తియే వజ్రాయుధశక్తియై, యింద్రుడైన ఆత్మచే ధరింపబడినట్లుండును. దీని యనుగ్రహము బొందిన యోగికి శరీరమునంటిన పాపములు నశించి, నాడీగ్రంధులు వీడును. కవికి కపాలభిన్న సిద్ధినిచ్చిన దీ శక్తియే)
18. ఓ దేవీ ! నీవు రాజ్ఞివగుటచేతనే ఇంద్రునకు రాజత్వము కలిగెను. నీవు లేనిచో నత డశక్తుడై మమ్ముల నెట్లాజ్ఞాపించగలడు ?
19. ఓ తల్లీ ! ఇంద్రలోకమందున్న సమస్త విశేషము నీ హస్త మందే కలదు. ఈ స్తోత్రము మాకుండు బుద్ధిచే సంగ్రహముగా చేయబడుచున్నది.
20. ఓ తల్లీ ! మార్జాలకిశోరన్యాయమువలె పూర్తిగా నర్పించు కొనిన శూరుని నీవు భరించుచు గమ్యస్థానము జేర్చు చుంటివి.
(భగవాన్ శ్రీ రమణమహర్షి యుద్దేశింపబడెను.)
21. ఆకాశమునకు ప్రభ్వివి, తల్లివి యైన నిన్ను విడువని పట్టుతో గ్రహించుచున్న యోగి మర్కట కిశోర న్యాయమున గమ్య స్థానము చేరుచున్నాడు. (స్వానుభవమును కవి పేర్కొనెను)
22. పూర్ణాత్మార్పణ హీనో౽ప్యజ్ఞాతా౽పి సమా ధేః |
నిత్యం యో జగదంబ త్వాం సేవేత జపాద్యైః ||
23. తం చా౽చంచల భక్తిం కృత్వాపూరిత కామం |
నిష్ఠాం దాస్యసి తస్మై పౌలోమి క్రమశ స్త్వం ||
24. భిన్నాం సంఘ సహస్రైః ఖిన్నాం శత్రుభరేణ |
పాతుం భారత భూమిం మాతర్దేహి బలం నః ||
25. త్రైలోక్యావన భార శ్రాంతాం వాసవకాంతాం |
హైరంబ్యో మదలేఖా స్సమ్య క్సమ్మదయంతు ||
________
3. హంసమాలాస్తబకము
1. సురుచి ర్వజ్రపాణే స్సుదృశో మందహాసః |
హరతా న్మోహమూలం హృదయస్థం తమో మే ||
2. అమృతం సంకిరంత్యా ప్రసరంత్యేహ దృష్ట్యా |
సురరాజ్ఞీ బలాఢ్యాం భరతక్ష్మాం కరోతు ||
3. అమృతాంభః కిరంతీ కరుణాంభో వహంతీ |
నత రక్షాత్త దీక్షా శచిమాత స్తవేక్షా ||
22. ఓ తల్లీ ! పూర్ణముగా నాత్మార్పణ చేయనివాడైనను, సమాధి యందు జ్ఞానములేనివాడైనను, యెవడు నిన్ను జపాదులతో నిత్యము సేవించుచుండునో,
23. ఓ యింద్రాణీ, వానిని నీ వచంచలభక్తిగలవానిగా జేసి, సర్వ కామములను దీర్చి, వానికి క్రమముగా (ఆత్మ) నిష్ఠ నిత్తువు. (ఇదియు స్వానుభవమే)
24. ఓ తల్లీ ! వేలకొలది సంఘములుగా విచ్ఛిన్నమై, శత్రు భారముచే ఖిన్నురాలైన భారతదేశమును రక్షించుటకు మాకు బల మిమ్ము.
25. ముల్లోకములను భరించుటచే నలసియున్న ఇంద్రాణికి గణపతి యొక్క యీ మదలేఖావృత్తములు లెస్సగా ముదము గూర్చు గాక.
- __________
1. మిగుల కాంతిమంతములగు ఇంద్రాణీ మందహాసములు మోహకారణమైయున్న నా హృదయమందలి యజ్ఞానమును నశింపజేయుగాక.
2. అమృతమును జిమ్ముచు, నీ లోకమందు ప్రసరించు ఇంద్రాణీ దృష్టి (వెన్నెలతో పోలిక) భారతభూమికి బలమిచ్చుగాక.
3. ఓ తల్లీ ! అమృతోదకమును జిమ్మునట్టిది, కారుణ్యోదకమును వహించునట్టిది, నమ్రులను రక్షించుటకు దీక్ష బూనినది నీ చూపగుచున్నది.
4. కృత పీయూష సృష్టి స్తత కళ్యాణ సృష్టిః |
విహితై నో విసష్టి ర్ధృత విజ్ఞాన పుష్టిః ||
5. భృత దేవేంద్ర తుష్టి ర్యమినాం దేవ గృష్టిః |
మమ కామ్యానిదేయా త్తవ విశ్వాంబ దృష్టిః ||
6. జగతాం చక్రవర్తి న్యసితస్తే కటాక్షః |
జలదో భక్తిభాజాం శిఖినాం నర్తనాయ ||
7. సుకృతీ కోపి నాట్యే బహుళే తత్ర మాతః |
జగతే సార భూతా నుపదేశా న్కరోతి ||
8. అవరో నవ్యకావ్యా న్యనవద్యాని ధన్యః |
విదధా త్యప్రయత్నా ద్బుధ భోగక్షమాణి ||
9. ఇతరో భాగ్యశాలీ రమణీయైః ప్రసంగైః |
వితనోతి స్వజాతిం జగతిశ్రేష్ఠ నీతిం ||
4. అమృతమును సృష్టించునట్టిది, మంగళములను నిర్మించునది, పాపములను ధ్వంస మొనర్చునది, విజ్ఞానమును బోషించునది,
5. దేవేంద్రునకు సంతుష్టి గలిగించునది, నియమము గలవారికి కామ ధేనువు (దేవగృష్టి) వంటిదియైన నీ దృష్టి నా కోర్కెలను దీర్చుగాక.
6. ఓ తల్లీ ! నీ నల్లనైన కటాక్షము భక్తులనెడి నెమిళ్ల నాట్యము కొఱకు మేఘమగుచున్నది.
(కారుమేఘము నెమిళ్లకు ప్రీతియై నాట్యమునకు బ్రేరేపించును. భక్తులు నెమిళ్లతోడును, దేవీకటాక్షము కాటుక కంటి సంబంధమై కారుమేఘముతోడను పోలిక.)
7. ఓ మాతా ! విస్తారమైన ఆ నాట్యములో నొకానొక పుణ్య పురుషుడు జగత్తుకొఱకు శ్రేష్ఠమైన ఉపదేశము జేయును.
(ఇది దేవీ కటాక్షప్రేరణమున చేయబడునని భావము. శ్రీరమణోపదేశమును కవి ధ్వనింపజేసెను.)
8. ధన్యుడగు మఱియొకడు పండితుల యాస్వాదము కొఱ కప్రయత్నముగా ననింద్యమైన నూత్న కావ్యములను రచించును.
(కవి తనయం దా దేవీ కటాక్షము బొందిన కార్యరూపమును బేర్కొనెను.)
9. భాగ్యశాలియైన నింకొకడు రమ్యప్రసంగములచే జగత్తునందు తమ జాతివారిని శ్రేషమైన నీతిమంతులుగా చేయును.
(కల్నల్ ఆల్కాటుదొర ధ్వనించుచుండెను.)
10. జగతాం మాతరేకో మహసా పుణ్య శాలీ |
విధుతారిః స్వదేశం కురుతే వీతపాశం ||
11. పర ఇంద్రాణి సాధు ర్బత విస్మృత్య విశ్వం |
రమతే సిక్త గండః ప్రమదాశ్రు ప్రతానైః ||
12. తవరాగార్ద్ర దృష్ట్యా దివి శక్రస్య నాట్యం |
కరుణా సిక్త దృష్ట్యా భువి భక్తస్య నాట్యం ||
13. తవ సప్రేమ దృష్టి ర్బల మింద్రే దధాతి |
తవ కారుణ్య దృష్టి ర్బల మస్మాసు ధత్తాం ||
14. తవ వామాః కటాక్షాః ప్రభు మానందయంతు |
ఉచితో దక్షిణానా మయమ స్త్వీక్షణానాం ||
15. సుకృతానాంప్రపోషం దురితానాం విశోషం |
కరుణార్ద్రా విభాంతీ తవ దృష్టిః క్రియాన్నః ||
16. కురుపాదాబ్జ బంధో స్సరణిం నిస్తమస్కాం |
శచి విజ్ఞాన తేజః కిరతా వీక్షి తేన ||
17. క్రియ యారాధయంతో భువనే తే విభూతీః |
ఇహ కేచిల్లభంతే తవమాతః కటాక్షాన్ ||
10. ఓ మాతా! పుణ్యాత్ముడైన వేఱొకడు తన తేజస్సుచే శత్రువులను బారదోలి, నిజ దేశమును దాస్య బంధమునుండి విడిపించుచున్నాడు. (గాంధీమహాత్ముడు.)
11. ఓ యింద్రాణీ ! సాధువైన మఱియొకడు విశ్వమును మరచి యానంద బాష్పములచే తడుపబడిన చెక్కిళ్లతో క్రీడించు చుండును. ఆశ్చర్యము ! (అరవిందుడు)
12. ఓ దేవీ ! నీ యనురాగ దృష్టిచే స్వర్గమందు దేవేంద్రునకు నాట్యము, నీ కరుణార్ద్ర దృష్టిచే భూమియందు భక్తునకు నాట్యము అగును.
13. నీ దృష్టి ప్రేమతో గూడి యింద్రునకు బలమిచ్చును, కారుణ్యముతో గూడి మాకు బలమిచ్చునుగాక.
14. నీ వామ (వక్ర, రమ్య) కటాక్షము లింద్రుని యానందపరచును. నీ దక్షిణ (ఉదార) కటాక్షములకు ఈ జను డుచితుడగుగాక.
15. కరుణతో బ్రకాశించు నీ చూపు మా పుణ్యముల నభివృద్ధి పరచి, మా పాపములను క్షయము చేయుగాక.
16. ఓ శచీ ! విజ్ఞాన తేజస్సును బ్రసరింపజేయు నీ చూపు నీ పాదాబ్జములను నమ్మియున్న నా మార్గమును తమస్సు లేనిదిగా నొనర్చుగాక.
17. ఓ తల్లీ ! భువనమందుగల నీ విభూతులను క్రియచే నారాధించు కొందఱు నీ కటాక్షము నీ లోకములోనే పొందుచున్నారు.
18. స్ఫుట విజ్ఞానపూర్వం ప్రభజే రన్యది త్వాం |
స్థిరయాదేవి భక్త్యా కిము వక్తవ్య మీశే ||
19. కువిధే ర్విస్మరంతీ భరతక్ష్మా శచి త్వాం |
బహుకాలా దభాగ్యే పతితా దేవ్య యోగ్యే ||
20. అభిషిక్తస్యమాతా తవ తేజోంశ భూతా |
సుదశాం సేవమానా మనయ త్పశ్చి మాశాం ||
21. అయి కాలం కియంతం దయసే పశ్చిమస్యాం |
ఇత ఇంద్రాణి పూర్వా మవలోక స్వ దీనాం ||
22. న వయం పశ్చిమస్యా శ్శచి యాచామ నాశం |
కృపయైతాంచ పూర్వాం నిహితాశా మవాశాం ||
23. సకలం వ్యర్థమాసీ దయి దీనేషు దృష్టా |
తవ విశ్వస్య మాతః కరుణైకా౽వ శిష్టా ||
24. సురరాజస్య కాంతే నరసింహస్యమానుం |
బలవంతం కురుత్వం భరతక్ష్మా౽వనాయ ||
25. రుచిరాభిర్ని జాభి ర్గతిభిర్హ ర్షయంతు |
మరుతాం భర్తు రేతా స్తరుణీం హంసమాలాః ||
- ________
18. దేవీ ! స్థిర భక్తితో స్ఫుటమైన విజ్ఞానముతో నిన్ను భజించు వారుకూడ నీ కటాక్షమును బొందుదురని వేఱేచెప్ప నేల ?
19. ఓ శచీ ! దురదృష్టమువలన నిన్ను మరచిన భారతభూమి చాల కాలమునుండి అయోగ్యమై, యభాగ్యదశకు పతనమయ్యెను.
20. అభిషిక్తుని తల్లియై (విక్టోరియారాణి), నీ తేజోంశవలనజన్మించిన యామె తనను సేవించు పశ్చిమవాసులను మంచి దశకు తెచ్చెను.
21. ఓ యింద్రాణీ ! ఎంతకాలము పశ్చిమ దిక్కుపట్ల దయగా నుందువు. ఈదీనురాలైన పూర్వదిక్కును చూడుమా.
22. ఓ శచీ ! మేము పశ్చిమదిక్కుయొక్క నాశమును యాచించ లేదు. నిరాశజెందియున్న పూర్వదిక్కును కృపతో రక్షింతువని మాయాశ.
23. ఓ తల్లీ ! ఈదీనుల విషయమై సమస్తము వ్యర్ధమైపోయెను. చూడగా, నీ దయయొక్కటి మిగిలియున్నది.
24. ఓ తల్లీ ! నీవు నరసింహ నూనుడగు గణపతిని భరతభూమి రక్షణకొఱకు బలముగలవానిగా జేయుము.
25. ఈ హంసమాలా వృత్తములు మనోహరమగు స్వకీయగతులచే నింద్రాణిని సంతోషపరచుగాక.
- _________
4. మధుమతీస్తబకము
- _________
1. దిశి దిశి ప్రసర ద్రుచి తమో దమనం |
హరతు మే దురితం హరి వధూ హసితం ||
2. హరతు దుఃఖభర ప్రసృత మశ్రుజలం |
భరత భూసుదృశో బలజితో రమణీ ||
3. అతితరాం మహితా సురపతే ర్వనితా |
కరుణయా కలితా మమ శచీ శరణం ||
4. త్రిభువన క్షితి రా డ్భువన భూషణ భా |
అఖిల భాసక భా మమ శచీ శరణం ||
5. సతత యుక్త సుధీ హృదయ దీపక భా |
నిఖిల పాచక భా మమ శచీ శరణం ||
6. రవి విరోచక భా శశి విరాజక భా |
భగణ శోభక భా మమ శచీ శరణం ||
7. గగన ఖేలక భా సకల చాలక భా |
అమృత దాయక భా మమ శచీ శరణం ||
1. అన్ని దిక్కులందు బ్రసరించు కాంతి గలిగి, యజ్ఞానమును బోగొట్టు ఇంద్రాణీ మందహాసము నా పాపములను హరించు గాక.
2. దేవేంద్రుని భార్యయైన ఇంద్రాణి భారతభూమియనెడి కాంత యొక్క దుఃఖభారముచే బ్రవహించు కన్నీ టిధారలను హరించు గాక.
3. అత్యంత పూజితురాలు, దేవేంద్రునకు భార్యయై దయతో నిండినది యగు శచీదేవి నాకు శరణము.
4. త్రైలోక్యాధిపతియైన ఇంద్రునియొక్క భవనమగు అమరావతి నలంకరింపజేయు కాంతిగలది, నిఖిలమునకు తేజస్సునిచ్చు కాంతిగలది యగు శచీదేవి నాకు శరణము.
5. నిత్యము యోగయుక్తులై యుండు పండితుల హృదయములకు జ్యోతియగుచు, నిఖిలమును పచనమొనర్చు శచీ దేవి నాకు శరణము.
6. సూర్యుని ప్రకాశింపజేయు రోచిస్సులుగలది, చంద్రునియందు విరాజమాన కాంతిగలది, నక్షత్రములయందు శోభనిచ్చు కాంతిగలది యైన శచీదేవి నాకు శరణము.
7. గగనమందు క్రీడించు కాంతి, సకలమును చలింపజేయు కాంతి, అమృతమునిచ్చు కాంతిగల శచీ దేవి నాకు శరణము.
8. రుచిలవంగతయా య దనఘాంశు నిధేః |
హృత తమో భవనం భవతి దీపికయా ||
9. స్ఫురతి చారు యతః కిరణమేక మితా |
జలద సౌధతలే ముహురియం చపలా ||
10. భజతి యద్ద్యుతితః కమపి భాగ మితః |
పవి రరాతి హరః ప్రహరణేశ పదం ||
11. భవతి యత్సురుచే రణుతమాంశ మితా |
యువ మనో మదనీ సువదనా స్మితభా ||
12. వితత సూక్ష్మతను ర్మహతి సా గగనే |
పరమ పూరుష భా మమశచీ శరణం ||
13. అమరనాధ సఖీ రుచి నిధాన ముఖీ |
అమృత వర్షక దృ ఙ్మమ శచీ శరణం ||
14. అవిధవా సతతం యువతిరేవ సదా |
అనఘ వీరసుతా మమశచీ శరణం ||
8. పాపరహితకిరణములకు నిధియగు నేదేవి తన కాంతిలేశముచే గల్పించిన దీపమువల్ల గృహమునందలి (అనగా విద్యుద్దీపము) చీకటిని నశింపఁ జేయుచున్నదో,
9. ఏ దేవియొక్క కాంతినుండి యొక్క కిరణమును బొందిన మెఱుపు యీ మేఘమనెడి సౌధతలమందు మాటిమాటికి సొగసును స్ఫురింపజేయుచున్నదో,
10. ఏ దేవియొక్క కాంతినుండి స్వల్పభాగమునుబొందిన వజ్రము శత్రునాశనమొనర్చు నాయుధములలో మేటిపదము బొందు చున్నదో,
11. ఏ దేవియొక్క కాంతిలోని యణుతమాంశనుబొంది, స్త్రీల యొక్క నగవు కాంతి యువకుల మనస్సుల మదింపఁ జేయుచున్నదో,
12. గొప్పదైన ఆకాశమందు వ్యాపించిన సూక్ష్మ దేహముగలది, పరమపురుషుని బ్రకాశింపజేయు చిద్రూపిణియగు ఆ శచీదేవి నాకు శరణము.
13. ఇంద్రసఖియు, కాంతులకు నిధియైన ముఖము గలదియు, అమృతమును వర్షింపజేయు చూపులుగలదియైన శచీదేవి నాకు శరణము.
14. నిత్యసువాసిని, సదా యౌవనముగలది, పాపరహితులైన వీరులు పుత్రులుగా గలదియైన శచీదేవి నాకు శరణము.
15. అమృత వత్యధరే సురధరా పతయే |
చరణయోర్భజతే మమ శచీ శరణం ||
16. స్మితలవేషు సితా శిరసిజే ష్వసితా |
చరణయో రరుణా బహిరపి త్రిగుణా ||
17. కపట చంద్రముఖీ ప్రకృతి రింద్రసణీ |
మృతి జరా రహితా మమ శచీ శరణం ||
18. కృశతమే వ్యుదరే త్రిభువనం దధతీ |
జనిమతాం జననీ మమ శచీ శరణం ||
19. స్థిరతరా మనసి స్థిరతమా వచసి |
నయనయో స్తరళా మమ శచీ శరణం ||
20. మృదుతరా కరయో ర్మృదుతమా వచసి |
కఠిన దుగ్ధ ధరా మమ శచీ శరణం ||
21. మృదుల బాహులతా ప్యమిత భీమ బలా |
అసుర దర్పహరీ మమ శచీ శరణం ||
22. అబలయాపి యయా న సదృశో౽స్తి బలే |
జగతి కశ్చన సా మమ శచీ శరణం ||
15. ఇంద్రుని కొఱ కధరమునందును, భక్తునికొఱకు పాదములందు నమృతమును ధరించిన శచీదేవి నాకు శరణము.
16. మందహాసమందు తెల్లగాను, కేశములందు నల్లగాను, పాదములం దెఱ్ఱగాను బాహ్యమందుగూడ నిట్లు త్రిగుణ యగుచున్నది.
17. చంద్రముఖియును, ఇంద్రసఖియు, జనన మరణములులేని మూలప్రకృతియు నగు శచీదేవి నాకు శరణము.
18. మిక్కిలి చిన్న ఉదరమందైనను త్రిభువనములను ధరించుచు జీవకోటికి తల్లియగు శచీదేవి నాకు శరణము.
19. మనస్సునం దతి స్థిరమైనది, వాక్కునం దత్యంత స్థిరమైనది, నేత్రములందు మాత్రము చాంచల్యము గలదియైన శచీదేవి నాకు శరణము.
20. అతి మృదుకరములు, అత్యంత మృదువాక్కులు, కఠిన కుచములు గల శచీదేవి నాకు శరణము.
21. మృదుహస్తములైనను, నమిత బలపరాక్రమములు గలిగి యసురుల గర్వము నణచిన శచీదేవి నాకు శరణము.
22. అబలయైనను, బలమునకేదేవి కీ జగత్తులో నెవ్వడు సాటి కాడో, అట్టి శచీదేవి నాకు శరణము.
23. అతితరాం సదయా పదరతే మనుజే |
ఖలజనే పరుషా మమశచీ శరణం ||
24. అమర భూమిపతి ప్రియతమే కురు మే |
భరత భూమ్యవస క్షమతమాం ధిషణాం ||
25. మధుర శబ్దతతీ ర్మధుమతీ రజరా |
గణపతే శ్శృణుయా త్సురపతే స్తరుణీ ||
_________
23. తన పాదములం దాసక్తిగల మనుజులయందతి దయగలది, దుర్మార్గుల కతి కఠినురాలు నగు శచీదేవి నాకు శరణము.
24. ఓ తల్లీ ! నాకు భారత భూమిని రక్షించుటకు మిగుల సమర్ధమైన బుద్ధి నిమ్ము.
25. ముసలితనము లేని యింద్రాణి మధురశబ్దములతో కూర్చబడిన గణపతి సంబంధమగు నీ మధుమతీ వృత్తములను వినుగాక.
- ___________
ద్వితీయం ఔష్ణిహం శతకమ్ సంపూర్ణమ్.