ఆబ్రహాము లింకను చరిత్ర/విజ్ఞానచంద్రికా గ్రంథమాల

వికీసోర్స్ నుండి

విజ్ఞానచంద్రికాగ్రంథమాల.

ఆంధ్రజనుల కొకవిన్నపము,

దేశాభివృద్ధికి భాషాభివృద్ధి యొక గొప్ప సాధనంబని యందఱికిం దెలిసినవిషయమె ఇంగ్లీషువారి యభివృద్ధికి వేఱుకారణంబు లనేకములున్నను* నందుకు వారిభాషాభివృద్ధి యొక మఖ్యకారణ మని విద్వాంసుల యభిప్రాయమై యున్నది. ఇంగ్లండుదేశంబున బ్రస్తుత మున్న గ్రంథ సంగ్రహంబును వార్తాపత్రికలును నేదో యొక దైవిక కారణముచే నేడు లేకుండ నయ్యెనేని ఆదేశము తన యాదిమయుగములోని యనాగరికతకు దిగు నని చెప్పుట యతిశయోక్తి గానేరదు. ఇంగ్లండులోని వార్తాపత్రిక లాదేశమునకు మేలుగాని కీడుగాని కలుగ జేయు సామర్థ్యము గల యొక స్వతంత్రసామ్రాజ్యముగ నెంచబడుచున్నవి. ఇంగ్లీషు పత్రికారాజ మగు 'లండన్ టయిమ్స్‌' పత్రికయొక్క యనుగ్రహమును, జర్మనీచక్రవర్తియు, నమెరికా దేశాధ్యక్షుడును గోరుచుండెద రని మనము వినుచున్నాము. ఇట్టి మహిమ యాపత్రికకు గల్గుటకు గారణం బేమి? ఆపత్రిక చేయుచున్న భాషాభివృద్ధియు దన్మూలకముగా లోకులలో బ్రసరించు చున్న జ్ఞానాభివృద్ధియు నిందుకు గారణము లని వేఱుగ జెప్పవలెనా? 'భాషాభివృద్ధి' 'జ్ఞానాభివృద్ధి' 'దేశాభివృద్ధి' యనుశబ్దములు పర్యాయపదము లని చెప్పనగు. వాజ్మయంబు (Literature) న దగినగ్రంథములు లేనిభాష శిశువుల వచ్చిరాని పలుకులవంటిది. బాలుని యస్పష్టపదములు కొన్నిదినములకు స్పష్టములయినగాని యెటుల వ్యవహారమునకు బనికిరావో యటులనే భాషయం దన్నివిషయములనుగుఱించిన గ్రంథసంగ్రహమున్నంగాని యది జ్ఞానాభివృద్ధికిని, అందుమూలకముగా దేశాభివృద్ధికిని నుపయోగపడనేరదు. అట్లు గ్రంథసంగ్రహము లేనిభాషయే తమమాతృభాషగా గలజనులు శిశువులను బోలి యజ్ఞానమునం దుండవలసివచ్చును. కాన దేశభాషల నభివృద్ధిచేయుట దేశాభిమానుల ప్రథమకర్తవ్యము. హిందూదేశములోని నూఱాఱుదేశభాషలలో బ్రతిభాషను నభివృద్ధిచేయు శ్రమకంటె నిదివఱకే యభివృద్ధిజెందియున్న యింగ్లీభాషనుగాని, హిందూదేశమున కంతటికిని సామాన్యమైన సంస్కృతభాషనుగాని జనులకు విద్యాదానము చేయగూడదా యని కొందఱు వాదించుచున్నారు. కాని దేవభాష యగు సంస్కృతంబును, రాజభాష యగు నింగ్లీషును మన దేశములో నెంత విస్తారముగా వ్యాపించినను, అవి యెన్నటికిని దేశభాషలు కానేరవు. పండితుల మనిపించుకొన గోరువారు కొందఱుమాత్రము సంస్కృతము నభ్యసింతురు; రాజకీయోద్యోగముల కాశపడువారు మఱి కొందఱుమాత్ర మింగ్లీషు నేర్చెదరు. సర్వజనుల కీభాషలు సాధ్యములు కావు. కాని జనసామాన్యమును, ముఖ్యముగ స్త్రీలును, విజ్ఞానము గల వారయినం గాని దేశము నాగరికదేశముగా నెంచబడుటకు వీలులేదు. ఉన్నతస్థితియం దుండు కొందఱు జనులుమాత్రము సాక్షరు లయి యితర జను లందఱు నిరక్షరు లయి యున్నదేశము పైన రంగుబూయబడి లోపల బేడతో నిండియుండు కొండపల్లి బొమ్మవంటిది. అట్టిదేశ మున్నతస్థితి కెన్నడును రాజాలదు. అందుల జనుల నందఱిని విద్యావంతుల జేయుటయే యిందుకు మందు. పైన జెప్పబడిన కారణములవలన నింగ్లీషు సంస్కృతాదిపరభాషలలో సర్వజనులను విద్వాంసుల జేయుట మిక్కిలి కష్టసాధ్యము. అసంబవ మనియు చెప్పవచ్చును. కాబట్టి సర్వజనులకు జ్ఞానాభివృద్ధి కలుగవలెనన్నచో వారివారిదేశభాషలమూలముననే గలుగవలెను.

ఇదియు గాక యింగ్లీషు సంస్కృతము చదువుకొన నిచ్ఛయు సామర్థ్యంబును గలవారికిగూడ నేదియేని విషయము పరభాషలో నేర్చికొనుట కంటె స్వభాషలో నేర్చికొనుట సులభముగదా? జనులకు మొదట నొక క్రొత్తభాష నభ్యసించుటకే యెంతో కాలము పట్టును. పిదప గదా యా భాషలో నితరవిషయముల నేర్చుట. ఉదాహరణార్థము, సంస్కృతంబున గణితము నభ్యసింపవలెనన్న, మొదట సంస్కృతమును బాగుగా నభ్యసించి, యందు వ్యుత్పత్తిజ్ఞానము సంపాదించి పిదపగదా గణితము చదువుటకు బ్రారంభించవలెను. ఇంగ్లీషున నితరశాస్త్రముల నభ్యసింపవలయు ననినను మన మింత పరిశ్రమ చేయవలసి యున్నది. ఇంత ద్రావిడప్రాణాయామ మేల? ఎవరి మతృభాషలో వానికి జ్ఞానదానము చేయగూడదా? అటుల జేయక ప్రస్తుతము మనవారు శాస్త్రములన్నియు నింగ్లీషులో జదువుచున్నందున నెంతయో యెక్కుడు కాలమును, ఎక్కుడు పరిశ్రమయు, నెక్కుడు ధనమును వ్యయ మగుచున్న వని యనేకవిద్వాంసుల యభిప్రాయమై యున్నది. ప్రవేశపరీక్షకు బైపరీక్షలకు జదువు విద్యార్థులకు నిబ్బంది లేకపోయినను, బ్రవేశపరీక్షకు గ్రిందితరగతులలో జదువుపిల్లలు, భూగోళము (Geography), భూమితి (Geometry), పదార్థవిజ్ఞాన శాస్త్రము (Physics), రసాయనశాస్త్రము (Chemistry) మొదలయిన శాస్త్రముల నభ్యసించునపుడు నర్థము తెలియనందునను, లేక తెలిసిన దాని నింగ్లీషులో మరల చెప్ప జేతకానందునను బుస్తకముల గ్రుడ్డిపాఠముచేసి పరీక్షలలో గృతార్థు లగుట మనము చూచుచున్నాము. ఈ శాస్త్రములన్నియు వారివారి మాతృభాషలలో నేర్పినయెడల నాశాస్త్రముల జదువుటకు బ్రస్తుతము పడుచున్నంతశ్రమ పడ నక్కఱలేదు. ఇట్లు సమస్త విద్యలను దేశభాషలలో నేర్పి యొక యింగ్లీషుభాషమాత్రము ద్వితీయభాష (Second Language) గా బోధించినయెడల, బ్రస్తుతము ప్రవేశపరీక్షకు బోవు విద్యార్థులకు గల జ్ఞానమంతయు బ్రస్తుతము పట్టుచున్నకాలములో సగముకాలములోనే గడింపవచ్చునని మహారాష్ట్రీయులు సిద్ధాంతీకరించి యట్టిపాఠశాలల నేర్పఱచుచున్నారు. ఈ పాఠశాలలలో నిండియా, ఇంగ్లండ్, గ్రీస్, రోమ్ ఈ దేశముల చరిత్రములును, అంకగణితము (Arithmetic), బీజగణితము (Algebra), రేఖాగణితము (Geometry), ఈగణితములును, భూగోళము (Geography), పదార్థవిజ్ఞానము (Physics), రసా యనశాస్త్రము (chemistry) మొదలయినశాస్త్రములు దేశభాషలో నేర్పబడును. ఇంగ్లీషు ద్వితీయభాషగా నేర్పబడును. ప్రస్తుతము హిందూదేశ మందు రాష్ట్రీయశిక్షణము (National Education), రాష్ట్రీయవిశ్వవిద్యాలయము (National University) నుగుఱించి జరుగుచున్న ప్రయత్నములలో దేశభాషలలలో జనులకు జ్ఞాన మొసంగుట యొక ముఖ్యాంశమై యున్నది. కాని యిట్లు దేశభాషలయందు వివిధవిద్యల జనులకు బోధించుటకు బ్రారంభించుటకు బూర్వము నాభాషలలో నన్నివిషయములనుగుఱించిన గ్రంథముల నిర్మింపవలయును.

ఈయంశముల నాలోచించియే హిందూదేశములోని బంగాళము, మహారాష్ట్రము, హిందూస్థానము (యునైటెడ్ ప్రావిన్‌సెస్) మొదలగుదేశములలోని జనులు తమతమదేశభాషల యభివృద్ధికై పాటుపడుచున్నారు.

బంగాలీభాషయందు ఫ్రెంచి, యింగ్లీషు భాషలలోని యుత్తమ కల్పిత కథలను బోలిన కథలును, దేశచరిత్రంబులును (Histories), వ్యక్తిచరిత్రంబులును (Biographies), శాస్త్రీయ (Scientific) గ్రంథంబులును, విజ్ఞాన (Philosophical) గ్రంథంబులును, ఇంగ్లీషు పత్రికలబోలు నత్యుత్తమ మాసపత్రికలును, దేశాభిమానపూరితంబు లగు నాటకములును అనేకములు గలవు. ఇంతియ కాదు. వారుభాషాభివృద్ధి జేసిచేసి ప్రస్తుత మాభాషయందు నొక ప్రచండమైన విశ్వకోశమును (Encyclopaedia) గూడ నిర్మించియున్నారు. విశ్వకోశము నిర్మించుటకు భాష యెంత యభివృద్ధి జెంది యుండవలయునో పండితులకు వేఱుగ జెప్ప నక్కఱ లేదు.

బంగాలీభాషతో సమానముగా మనదేశములో నభివృద్ధి జెందుచున్న రెండవభాష మహారాష్ట్రము. మీ కేదేశచరిత్రము కావలసినను నీభాషయందు దొరకగలదు. ప్రకృతిశాస్త్రంబు లనేకములు వ్రాయబడినవి. ప్రఖ్యాతి గాంచిన యింగ్లీషు గ్రంథంబు లనేకము లీభాషయందు భాషాంత రీకరింపబడినవి. జాన్ స్టుఅర్ట్ మిల్, హర్‌బర్ట్ స్పెన్సర్, సర్ జాన్ లబక్ మొదలయిన యింగ్లీషు గ్రంథకారు లనేకులు మహారాష్ట్రవేషముల వేసియున్నారు. ఇట్టిరూపాంతరీభూతగ్రంథంబులు గాక స్వతంత్రగ్రంథంబు లనేకములు ప్రతిసంవత్సరమును నాభాషయందు వెలువడుచున్నవి. ఇట్టి శాస్త్ర చరిత్రవిజ్ఞానవిషయిక నూతనగ్రంథంబుల బ్రచురించుటకు నాభాష యందు రెండువందలపుటల మాసపత్రిక యొకటి 'గ్రంథమాల' యనునది గలదు. దిని సంపాదకుడు (Editor) విష్ణు గోవిందవిజాపురకర్, ఎం.ఏ., అను విద్వాంసుడు. మహారాష్ట్రదేశచరిత్రకు గావలసినసాధనంబుల సేకరించి, మరాఠ్యాంచ్యా ఇతిహాసాచీ సాధనే, (మహారాష్ట్రులచరిత్రకు సాధనములు) అను పేరిట బ్రచురించుటయే తనకర్తవ్యముగా నెంచు స్వార్థత్యాగియైన మహానుభావు డొకడు మహారాష్ట్రదేశమున గలడు. ఈమహాపురుషునినామము విశ్వనాథ కాశీనాథ రాజవాడే, బి.ఏ. ఈయన గొప్పవిద్వాంసు డైనను ఇతర యుద్యోగముల కాశింపక నెలకు నిరువది రూపాయలు వచ్చు పూర్వార్జితమైనసొత్తుతోనే జీవనము గడుపుచు, వివాహము జేసికొనక, మంచి త్రోవలైనను లేని పల్లెలకు గూడ జరిత్రసాధనంబు లున్నవని తెలసిన నడచి వెళ్లి నెలలకొలది యచ్చట నుండి, వంటతానే చేసికొనుచు, నెన్నియో యితరకష్టముల కోర్చి దొరికినసాధనములకు బ్రతులు వ్రాసికొని ప్రచురించుచుండును. ఇట్లు స్వదేశచరిత్రమునందే దృష్టి నిలిపిన యీయోగి యిదివఱకు నెనిమిదిసంపుటముల బ్రచురించెను. ఇంక నెన్నియో సంపుటములకు సరిపోవు నన్ని సాధనముల సేకరించియున్నాడు. అందువలన నిప్పుడు మహారాష్ట్రీయుల చరిత్రసంబంధమైన విశ్వాసార్హము లగు సాధనములు, మూలప్రతులు మొదలయినవి, వెలువడి పరదేశీయులు వ్రాసిన చరిత్రములలోని యసత్యాంశముల బయలుపఱచుచున్నవి.

ఇట్లు మన యిరుగుపొరుగువారు తమతమ దేశభాషల నభివృద్ధి చేసికొన నవిశ్రాంతముగా స్వార్థమునందును దృష్టియుంచక పాటుపడుచుండ మన తెలుగుసీమవారుమాత్ర మితర యన్నివిషయములందువలె భాషాభివృద్ధివిషయమునను గాడనిద్ర పోవుచున్నారు. ఇది మిక్కిలి శోచనీయము. ఇట్లనుటచే నిదివఱకు నాంధ్రభాషాభివృద్ధికై పాటుపడిన వారిని మే మెఱుంగ మని గాని, వారు మనభాష కొనర్చిన మహోపకారమునకై మేము కృతజ్ఞత జూపనొల్ల మని గాని చదువరులు తలంపవలదు.

భాషాభివృద్ధికి గద్యగ్రంథంబు లత్యంతావశ్యకంబు లని మొట్టమొదట గనిపెట్టినది చిన్నయసూరి. తెనుగులోని గద్యగ్రంథంబుల కాతడు నన్నయభట్టు. ఇట్లు చిన్నయసూరిచే బ్రారంభింపబడిన వచనకావ్య పద్ధతిని మిక్కిలి ప్రబలజేసి, విద్వాంసులకును, జనసామాన్యమునకును, స్త్రీలకును గావలయు గ్రంథరాజంబు లనేకంబులు నిర్మించి, గ్రంథసంఖ్యాబాహుళ్యంబుచేతను, సకలజనాదరణీయంబును సకలజనానుకరణీయంబును నగు శైలిని నిర్మించుటచేతను, గద్యతిక్కన యని చెప్పుటకు నర్హులు రావుబహదరు కందుకూరి వీరేశలింగముపంతులవారు, పంతులవారి యితరమతము (Opinions) లను గుఱించి యెవ రేమనుకొన్నను, వారు మనభాషను నభివృద్ధిచేయుటకై చేసినకృషికి వారి నభినుతించునెడ విజ్ఞానము గల యాంధ్రులందఱును నేకీభవింపక తప్పదు.

వీరుగాక యనేకులు పూర్వతరమువారును, మనతరమువారును దమగద్యగ్రంధంబులచే దెలుగుబాసను నలంకరించిరి. వారిలో మ. రా. రాశ్రీలు, కొక్కొండ వేంకటరత్నముపంతులవారును, శతఘంటము వేంకటరంగశాస్త్రి గారును, పూండ్ల రామకృష్ణయ్యపంతులుగారును, వేదము వేంకటరాయశాస్త్రిగారును, శేషగిరిశాస్త్రిగారును, పనప్పాకము శ్రీనివాసాచార్యులు బీ.ఏ.బీ.ఎల్ గారును, నాటకములకు నూతనమార్గము చూపినందుకు ధర్మవరము కృష్ణమాచార్యులు గారును, కల్పితకధలు వ్రాయుటలో జిలకమర్తి లక్ష్మీనరసింహముగారును, స్త్రీల కుపయుక్త గ్రంథములు వ్రాయుటయందున గీర్తి శేషురాలగు భండారు అచ్చమాంబగారును, శ్రీమతి కొటికల పూడి సీతమ్మగారును భాషాభివృద్ధికై మిక్కిలి పాటుపడియున్నారు. వీరుగాక పూర్వ మొకప్పుడుండిన పురుషార్థప్రదాయిని, ఆంధ్రాభాషాసంజీవని, మందారమంజరి, చింతామణి, శ్రీవైజయంతి మొదలయిన మాసపత్రికలును, బ్రస్తుత మున్న సరస్వతి, మంజువాణి, మనోరమ, సువర్ణలేఖ, సావిత్రి, హిందూసుందరి, జనానాపత్రిక మొదలయిన మాసపత్రికలును, ఆంధ్రప్రకాశిక, శశిలేఖ, కృష్ణాపత్రిక, ఆర్యమతబోధిని, సత్యవాది, రవి మొదలైన వార్తాపత్రికలును, తెనుగునం దొకవిధమైన యుపయోగకరంబగు వాజ్మయంబును బుట్టించినవి, బుట్టించుచున్నవి. వీరివ్రాతలలో వ్యక్తి (Individual) విషయికనిందాపూరితంబు లగునవి కొన్ని తప్ప కడమవన్నియు నేమతమును బోధించునవియైనను నుపయోగకరంబులే. కాన నేతద్గ్రంధకర్తలందఱును మనకు వంద్యులు. మే మిచ్చట బేర్కొనినవారు గాక యనేకభాషాభిమానులు లాంధ్రవాజ్మయాభివృద్ధి (Improvement Of Telugu Literature) కై పాటుపడుచున్నారు. వారును మాకు గౌరవనీయులే. వారి యందఱినామము లిచ్చట నుదాహరించుటకు మాస్మరణశక్తియు జోటును జాలవు గాన వారు మమ్ము మన్నించుదురుగాత.

ఇట్లిందఱు పాటుపడుచుండగా 'మన తెలుగువారు నిద్రపోవుచున్నారు' ని మేము వ్రాయుట చదువరులకు వింతగ నుండు నేమో. కాని తెలుగుబాస యొక నాగరికభాష యనిపించుకొనుటకు మనము చేయవలసినప్రయత్నములో నిప్పుడు జరిగియున్నప్రయత్న మొక సహస్త్రాంశమైనను కాదని తెలిసికొనిన మనము నిద్రపోవుచున్నది మేల్కాంచినది తెలియగలదు. మనభాషయం దేగ్రంథములు లేవో మనము విచారించిన మనము ముందు చేయవలసిన కార్యముయొక్క చాయ కనుపడగలదు. ఇండియా, ఇంగ్లండ్, గ్రీస్, రోమ్, అమెరికా, ఫ్రాన్‌స్ ఈదేశములచరిత్రలు మనభాషయందు లేవు. హిందూదేశచరిత్ర మనుపేరిట నొకటి రెండు చిన్నపొత్తములు గలవు. కాని వానిలో వర్ణింపబడినవిషయములు బహు స్వల్పము లయినందున నవి 'చరిత్ర' యను నామమున కంతగా దగినవి కావు. ప్రకృతిశాస్త్రము లన్ననో మనవారికి గలలోనివార్తలు. పదార్థవిజ్ఞానశాస్త్రము (Physics), రసాయనశాస్త్రము (Chemistry), వృక్షశాస్త్రము(Botony), పశుశాస్త్రము(Zoology), జీవశాస్త్రము లేక చేతనశాస్త్రము (Biology), భూగర్భశాస్త్రము (Geology) మొదలయిన ముఖ్యశాస్త్రములనుగుఱించి యొకచిన్నపుస్తకమయినను మనభాషలో లేదు. ఇంకను బ్రకృతిశాస్తంబు లనేకము లున్నవి గాని వానిలో ముఖ్యమైన వాని బేర్కొంటిమి. ఈశాస్త్రములలో నొక్కొక్కదానిపై నింగ్లీషునందు వందలకొలది గ్రంథంబులు వ్రాయబడియున్నవి. అంక గణితము (Arithmetic), బీజగణితము (Algebra), రేఖాగణితము (Eculid), క్షేత్రగణితము (Mensuration), త్రికోణమితి (Trignometry) మొదలయిన గణితములను గుఱించియు బేర్కొన దగినగ్రంథ బొకటియు గానరాదు. ఇంగ్లీషు కథలతో బోల్పదగు కల్పితకథ యొకటియు లేదు. ఉన్నవానిలో మ.రా.రా.శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహముగారిచే రచింపబడిన కథ లుత్తమములు. అవి కొంతవఱకు నింగ్లీషుకధలను బోలియుండును. కాని యవియన్నియు జిన్నవి. గాన వానిని లఘుకల్పితకథ (Novelettes) లన వలయునేకాని కల్పితకథ (Novels) లనుటకు వీలులేదు. కనుక మన కిట్టికథలు కావలసియే యున్నవి. నాటకములనుగుఱించి విచారించినను, సింగి సింగని సంవాదము వినియు, నలునికొఱకు సంగీతమున నేడ్చెడిదమయంతిని జూచియు, మదనతాపమున బొర్లాడుచున్న శకుంతలను గాంచియు మనమిప్పుడు సంతసింపవలసినదేగాని వివిధమానవస్వభావముల గనుపఱచెడి, సంసారమునకు సరియైన ప్రతిబింబ మగు నాటక మాంధ్రంబున నొండైన గలదే? జ్ఞానవిషయము లసంఖ్యంబులు. అందేవిషయమునుగుఱించి విచారించినను మనభాషలో దగినగ్రంథంబులు లేవు. ఈగ్రంథంబుల నన్నిటిని నిర్మించుటకు నూర్గురుపండితు లెడతెగక నూఱుసంవత్సరములు పరిశ్రమ చేసినను చాలు నని తోచదు. కాన దనశక్తికొలదిని తెలుగుభాస నభివృద్ధిచేయుటకు విద్యాగంథ మించుకయినను గల ప్రతియాంధ్రుడును బ్రయత్నింపవలయును. నాచేత నేమగు నని యధైర్య పడరాదు. ఇతరులను నిందించుటయే తనపనిగ బెట్టుకొనక భాషాసేవయే పరమోద్దేశముగ నెంచుకొని యేదో యొక విషయమును జక్కగ నభ్యసించి యందున గుఱించి గ్రంథము వ్రాసిన నది గ్రాహ్యంబే యగు; భాషాభివృద్ధికి సహకారియు నగు.

ఇట్లు తలచి 'యుడుతభక్తి' చందంబున మా యల్పశక్తికొలది నాంధ్రమాతృభాషాసేవ జేయ బ్రయత్నింపవలయు ననెడి యిచ్ఛ గల వార మయి 'విజ్ఞానచంద్రికామండలి' యను పేరిట నొక భాషాభివృద్ధి సంఘం బేర్పఱచినారము. ఈ 'మండలి' వారు 'విజ్ఞానచంద్రికాగ్రంథమాల' యను పేరిట గ్రంథంబుల బ్రచురించెదరు. జ్ఞానవిషయము లసంఖ్యంబులు గాన నన్నింటినిగుఱించిన గ్రంథంబులు నిర్మించుట యేరికిని సాధ్యంబు గాదు. కాన గొన్నివిషయములకు సంబంధించిన గ్రంథములనే వ్రాయదలచినారము. పద్యకావ్యములు, నాటకములు, కల్పితకథలు, భాషా (Language) విషయిక చర్చలు, వాజ్మయ (Literature) విషయిక చర్చలు భాషాభివృద్ధికి నత్యంతావశ్యకంబు లయినను ఈవిషయిక గ్రంథములు మేము ప్రస్తుతము వ్రాయను, వ్రాయించను దలచుకొనలేదు. 1. దేశచరిత్ర (History), 2. వ్యక్తిచరిత్ర (Biography), 3. ప్రకృతి లేక భౌతికశాస్త్రములు (Physical Sciences), 4. [Mill's Liberty, Subjection Of Women, Spencer's Education, Smile's Self help, Character, Thrift, Duty, Lubbock's Pleasures Of Life] మొదలైన యింగ్లీషులోని సర్వోపయోగకరములగు గ్రంథంబుల భాషాంతరీకరణము, ఈ నాల్గు విషయములను గుఱించినగ్రంథంబులు మాత్రము ప్రచురింప దలచినారము. కొందఱు మిత్రుల సూచన ననుసరించి, చరిత్రానుసారు (Historical) లగు కల్పితకథల (Novels) నెవ్వరైన వ్రాసిరేని వానిని బ్రచురింప నియ్య కొంటిమి. మాకార్యక్రమమునకు మే మీయెల్ల లేర్పఱచుకున్నారము.

మొట్టమొదట మేము 'విజ్ఞానచంద్రిక' యనుమాసపత్రిక నొకదానిని బ్రారంభించి యందు నీగ్రంథంబుల బ్రచురపఱుప దలచితిమి. కాని నాలు గసంపూర్ణగ్రంథంబులు నెలనెలకు దునుకలుతునుకలుగా సంవత్సరమంతయు నిచ్చుచుండుటకంటె నొక్కొక్కతఱి నొక్కొక్క సంపూర్ణగ్రంథంబు చదువరుల కిచ్చుట మేలని పిదప నిశ్చయించితిమి. 'విజ్ఞానచంద్రికా గ్రంథమాల' యను పేరిట సంవత్సరమునకు మొత్తముమీద నెనిమిదివందలపుటలకు మించకుండ నాలుగుగ్రంథంబుల బ్రచురింపగలము. ఈ గ్రంథములను నెవ్వరును ముందు చందా యియ్యనక్కఱలేదు. గ్రంథము సిద్ధముకాగానే యది మాచందాదారులకు వాల్యూపేబిల్ ద్వారా పంపగలము. 'విజ్ఞానచంద్రికామండలి' వారు ప్రచురించెడు గ్రంథములకు జందాదారుడ నగుదు ననియు, గ్రంథములు సిద్ధమగునప్పుడెల్ల దనపేర నాగ్రంథములు వ్యాల్యూపేబిల్ ద్వారా పంపవలసిన దనియు, 'మండలి' కార్యదర్శియగు మ.రా.రాశ్రీ, రావిచెట్టి-రంగారావుగారు, రెసిడెన్‌సీ, బాజారు, హైదరాబాద్ (డెక్కన్) పేర వ్రాసిన జాలును. ఇట్లు వ్రాసిన వారిపేళ్లు మాచందాదారులపట్టికలో జేర్చికొందుము. ఇట్టి చందాదారులకు మే మచ్చువేయుగ్రంథంబు లన్నియు బహుస్వల్పమైన వెలకు నియ్యదలచితిమి. శ్రేష్ఠమైన (Superior) నున్నవి (Glazed) కాగితముమీద నచ్చువేసినగ్రంథము, లంచెకూలి మొదలయినవీ మేమే భరించి, నూఱు పుటలకు ర్పు. 0-4-0 చొప్పున నిచ్చెదము. అనగా నొకగ్రంథము నూఱు పుటలే యగునేని యందు కగు నంచెకూలి ర్పు 0-0-6 వ్యాల్యూపేబిల్ కర్చు ర్పు. 0-1-0 పోగా మిగిలిన ర్పు. 0-2-6 మాత్రము పుస్తకభృతి యగును. పదునైదువందల శాశ్వతపుచందాదారులు సమకూరుదురేని గ్రంథ ములవెల నింకను తగ్గింపగలము. చందాదారులు కానివారికి మాగ్రంథములు, అంచెకూలిగాక నూఱుపుటలకు ర్పు. 0-6-0 చొప్పున నియ్యబడును.

మామండలిలోని సభాసదులందఱును బ్రస్తుతము ప్రతిఫల మేమియు గోరకయే యీపనికి బూనియున్నారు. ఇంతియకాదు; నష్టమువచ్చినను గొంతవఱకు భరించుటకు మాలోని గొందఱు సిద్ధముగ నున్నారు. అయినను నాంధ్రవాచకప్రపంచముయొక్క (Telugu Reading Public) సహాయము లేనిదే యిట్టిప్రయత్నములు కొనసాగనేరవు.

తెలుగుసీమలోని జమీదారులును, ఇతర లక్ష్మీపుత్రులును ఇట్టికార్యముల నవలంబించినవారికి ధనరూపమైన కేలూత యొసగి, రాజనరేంద్ర మనుమసిద్ధి కృష్ణరాయలచరిత్రమహిమ యిన్నివందలసంవత్సరములవఱకు గూడ నాంధ్రదేశంబున నున్నదని వెల్లడి చేయుదురు గాక. ఇది ధనాధికులకు గర్తవ్యము.

ఇక విద్యాధికులు మాకును మావలె గ్రంథంబుల బ్రచురించు నితరులకును మూడుతెరంగుల సాయ మొనర్పవలెను. గ్రథంబుల వ్రాయుటయు, నితరులు వ్రాసినగ్రంథంబుల గొనుటయు, నాగ్రంథంబులలోని విషయముల జనసామాన్యమునకు దెల్పుటయు. ఇది యింగ్లీషు నేర్చినవారు మాకు జేయవలసిన త్రివిధసహాయము. ఇందు మొదటిది గ్రంథనిర్మాణంబు. ప్రకృతి శాస్త్రములు మొదలయినవి యింగ్లీషు నేర్చిన విద్వాంసులే వ్రాయవలయును. ఇందునగుఱించి రావుబహదరు కందుకూరి వీరేశలింగముపంతులుగారొకచోట నిట్లు వ్రాయుచున్నారు:-

"ఇట్టిపుస్తకములను రచించుట యింగ్లీషునందు మంచిపాండిత్యము గలిగి బహుశ్రుతు లయి సంస్కృతాంధ్రభాషలయందు తగినంతజ్ఞానము కలవారికే సాధ్యమగును గాని కేవలసంస్కృతపండితులకును కేవలాంధ్రపండితులకును సాధ్యము కాదు. కాబట్టి యీపనిని నిర్వహించి దేశభాష లను వృద్ధిచేయవలసినభార మింగ్లీంషుభాష నభ్యసించిన ప్రతివారు తమ మీద బడిన యీకార్యభారమును వహించి దేశభాషాభివృద్ధికి తోడుపడినిపక్షమున దేశముయొక్క హీనదశకు వా రుత్తరవాదులుగా నుందురు. కాబట్టి యికనైన సర్వకాలాశాలలయందు బట్టపరీక్షల నిచ్చి మెప్పొందినవారు తాము లౌక్యాధికారములయందు బ్రవేశించి భార్యాపుత్రాదుల కాభరణములు చేయించిపెట్టుటతోడనే కృతార్థుల మయితి మను కోఖ దేశభాషావధూటికి గూడ సద్గ్రంథాభరణములను వృద్ధిపఱుప బ్రయత్నింతురని నమ్ముచున్నాము." ఇంగ్లీషు విద్యావిభూషితు లందఱు నీవాక్వంబుల మఱవకుందురు గాక. రమేశచంద్రదత్తు వంటి యింగ్లీషుగ్రంథముల వ్రాసి కీర్తి గన్నవాడుగూడ దనమాతృభాషయగు బెంగాలీలో గ్రంథములు వ్రాయుట తనకు బరమకర్తవ్యముగ నెంచుచున్నాడు. ఇంగ్లీషున బండి మని విఱ్ఱవీగి తెనుగును దిరస్కరించెడు మనవారి నేమనవలె?

ఏశాస్త్ర మెవ్వ రభ్యసించిరో యాశాస్త్రము వారిచేతనేవ్రాయించ నిశ్చయించితిమి గాన నెవ్వరి యభిమానశాస్త్రంబున వారు పొత్తంబులు వ్రాసి మాగ్రంథమాలలో గూర్చుదు రని కోరుచున్నాము.

ప్రకృతిశాస్త్రములు వ్రాయునపుడు ఆయాశాస్త్రంబులలోని పారిభాషికపదములు (Nomenclature) దేశభాషలలో లేనందున గ్రంథకర్తలు త్రొక్కులాడవలసి వచ్చుచున్నది. ఇందుకు గాశీలోని 'నాగరీప్రచారిణీ సభ' వారు విద్వాంసులయొక్క సంఘము నేర్పఱచి భౌతికశాస్త్రము (Physical Sciences) లలోని పారిభాషికపదముల నిర్ణయించి యున్నారు. ఈ పరిభాష సంస్కృతపదభూయిష్ట మయినందున నీపరిభాషనే గ్రహించుటకు మేము నిశ్చయించినాము. ఇట్లు నిశ్చితమైన పరిభాషను వాడక, యెవరికి వారే క్రొత్తపరిభాష కల్పించుకొనుచు గ్రంథములు వ్రాసినచో నవి యెవ్వరికి దెలియక 'మూగ చెవిటివారి ముచ్చటరయ' యగు ననుటకు సందేహము లేదు. కాన మొదట నెంత పిచ్చిగ గానవచ్చినను ఒక పరిభాషనే యందఱును వాడవలయు. ఎప్పుడు నుపయోగించుచుండిన నాక్రొత్తపరిభాషకే గహనార్థంబు సమకూరు. ఇంగ్లీషువారును నిటులనే చేయుచున్నారు. యూరపుపండితులచే నిర్మితంబగు శాస్త్రీయపరిభాష యెంత కర్ణకఠోరం బయినను ఇంగ్లీషు గ్రంథకారులు దానినె వాడుచున్నారు. ఇందువలన శాస్త్రాభివృద్ధికిని, భాషాంతరీకరణంబునకును మిక్కిలి సహాయము కలుగుచున్నది. మనమును అటులనే నాగరీప్రచారిణీ సభవారిపరిభాష గ్రహింతము. ఇక మనవా రిదివఱకు మనభాషయందు నిర్మించిన కొన్నిపారిభాషికపదములగతి యేమని కొంద ఱడుగవచ్చును. మనపదములు నాగరీప్రచారిణీ సభవారిపదములకు నవిరుద్ధము లయినయెడల రెండును పర్యాయములుగా వాడుకొనవచ్చును. 'ఆక్సిజన్‌' అనువాయువును వారు 'అమ్లజన' మనిరి; మనవారు 'ప్రాణవాయువు' వనిరి. వీనిని బర్యాయపదములుగా వాడవచ్చును. మనపదము వారిపదమునకు విరుద్ధముగా నున్నప్పుడు మనము మనపదమును విడువవలెను. ఇందుకు దార్కాణము, మనవారు 'అసిడ్‌' (Acid) అనగా 'క్షార' మనిరి. సభవారు 'ఆసిడ్‌' (Acid) అనగా 'ఆమ్ల' మనిరి. 'క్షార' శబ్దము ఆల్‌కలీ (Alkali) కి సమానార్థక మనిరి. కాన మనము మనపరిభాషను మార్చుకొనవలెను. ఈ నిబంధనానుసారముగా మాగ్రంథమాలలోని ప్రకృతిశాస్త్రములు వ్రాయబడును. ఇతరగ్రంథకారులును నీపరిభాషనే వాడినయెడల మనభాషయందు శాస్త్రీయపరిభాష స్థిరపడగలదు.

మేముగాని మావలె నితరప్రకాశకులు (Publishers) గాని ప్రచురించుగ్రంథంబుల గొనుట యింగ్లీషు నేర్చినవారు చేయవలసిన రెండవపని. మే మింగ్లీషులో నన్నియు జదివెదము, మాకు దెలుగుపొత్తంబు లేలయని కొంద ఱడుగుదురు. కాని యింగ్లీషు వచ్చినంతమాత్రమున వీరన్ని గ్రంథంబుల నాభాషయందు జదువుచున్నారనుటయు, నాభాషలోని యన్నిశాస్త్రీయగ్రంథంబులు వీరి కర్థ మగు ననుటయు నిజము గాదు. చరిత్ర (History)విషయమునందును, తత్వజ్ఞాన (Philosophy) విషయమునందును బట్టపరీక్షలలో గృతార్థులయి, Geology (భూగర్భశాస్త్రము), Biology (జీవశాస్త్రము లేక చేతనశాస్త్రము), Zoology (ప్రాణిశాస్త్రము లేక జంతుశాస్త్రము) అను ప్రకృతిశాస్త్రములపేళ్లైనను విన నట్టి బీ.ఏ.,ఎం.ఏ.,పదవి నందినవారల మన మెందఱిని జూచుట లేదు? ఇట్టి వారీశాస్త్రముల నితరగ్రంథముల దెలుగున నేల చదువగూడదు? ప్రవేశపరీక్ష మొదలయినపరీక్షలకు జదివినవారికి నిట్టిగ్రంథము లర్థమే కానేరవు. కాన వీ రిట్టిగ్రంథంబులు తెలుగున నేల చదువగూడదు?

తా మన్నివిషయములలో నిధులయి తమ కిట్టిపుస్తకములతో బ్రయోజనము లేక పోయినను ఇంగ్లీషు విద్యావిశారదు లిట్టియాంధ్రగ్రంథంబుల గొని, యట్టిగ్రంథంబు లెక్కుడుగ వెలువడునటుల జేయుట వారికి పరమధర్మము. ఎందు కన నిట్టిపరిశ్రమను నభినందించు విజ్ఞానము వారికి గలదు. విజ్ఞానము గలవా రజ్ఞానులవలె బ్రవర్తించుట పాడియె?

ఇదియుగాక మేము వ్రాయుగ్రంథములు జనసామాన్యంబుకొఱకైనను నేడు జనసామాన్యం బీగ్రంథంబుల గౌరవము దెలిసికొనలేనందున నింగ్లీషు నేర్చినయుభయభాషావిదులే యిట్టిగ్రంథంబుల గొని ప్రచురించు వారి బ్రోత్సాహపఱచుచు, జనసామాన్యంబుల కాగ్రంథంబులలోని విషయముల దెలుపుచు, నాగ్రంథంబులు జనులకు బ్రియంబు లగునటుల జేసి వారికి మార్గదర్శకు లగుచుండవలెను. అటుల జేయకునికి మాతృభాషాద్రోహ మనిపించుకొనును.

కేవల సంస్కృతమునందుగాని, కేవ లాంధ్రంబునందుగాని పాండిత్యము గలవారుగూడ మాకు సాయ మొనర్పవలసి యున్నది. క్రొత్త యింగ్లీషుపదములకు సమానార్థకములయిన సంస్కృతపదములుగాని, ఆంధ్రపదములుగాని సేకరించి యియ్య గల్గుశక్తి వీరిక కలదు. నూతనకల్పనల (New ----) మనము వారికి దెల్పిన వారు సొగసైన యాంధ్రపదముల నిర్మింపగలరు. ఇందుకు దార్కాణంబుగ మ.రా.రా.శ్రీ, కొక్కొండ వేంకటరత్నముపంతులుగారిచే రచియింపబడిన 'శ్రీ ఫ్రిన్సపువేల్సు హిందూస్థానసందర్శన మ'ను గ్రంథము జూడనగు. అందు 'నాంగ్లరాజనీతి' (British constitution) యొక్క సంగ్రహవర్ణనయు, బేకన్, షేక్స్‌పియర్ మొదలయిన యాంగ్లవిద్వత్కవులయొక్క వాక్యంబులకు సరియైన తెలుంగును, దేశాటనమువలన గల్గులాభములవర్ణనయు జూచిన, మన పూర్వపండితులు కొందఱు నిజముగ శబ్దసృష్టికి నీశ్వరు లని చెప్పవలసియున్నది. కాన నింగ్లీషు విద్యావిభూషితు లిట్టి పూర్వపండితులసామర్థ్యంబును వ్యర్థముగ పోనీయక తమగ్రంథనిర్మాణంబునకు వారి సహాయంబు గొనుదురు గాక. పూర్వపండితులును మావంటి యింగ్లీషు నేర్చినవారు వ్రాసెడి నూతనాంధ్రగ్రంథంబుల నసూయతో జూడక యందలిలోపముల జూపి యిట్లు దిద్ధుకొనుడని తెలిపి మార్గదర్శకు లగుటకు బ్రార్థితులు. ఇట్లు పౌర్వాత్యపాశ్చాత్యపాండిత్యసమ్మేళనమువలన మనభాషకు నుభయవిద్యలలోని చక్కదనము రాగలదు.

ఇట్లు

సకలయాంధ్రజనులకు విన్నవించు

విజ్ఞానచంద్రికాసభాసదులు

బుధవిధేయులు,

నాయని వెంకటరంగారావు,

మునగాల జమీన్దారు.

రావిచెట్టి రంగారావు,

మన్‌సబ్దారు, హైదరాబాదు.

కే.వి.లక్ష్మణరావు, ఎం.ఏ,

మునగాల దివాను.

జి.హరిసర్వోత్తమరావు, బీ.ఏ.,

అయ్యదేవర కాళేశ్వరరావు, బీ.ఏ.భీ.ఎల్.