ఆబ్రహాము లింకను చరిత్ర/పదునైదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఇదివిని యచ్చటి సభ్యులందఱు ప్రక్కలు వక్కలగునట్లు నవ్వ నారంభించిరి. అటుతరువాత నెప్పుడును వాబాషు ప్రతినిధి విధానలోపములని యాక్షేపించినవాడు కాడు.

లింకను దన కట్టెగుడిసె వదలిన పదిసంవత్సరములలో నిల్లినాయిలో మహాప్రసిద్ధి వడసెను. ఇచ్చట న్యాయవాదులలో బ్రాముఖ్యు డెవ్వడనిన నాసీమ జనులెల్ల రతనిన చూపుదురు.

1842 వ సంవత్సరమున ముప్పదిమూడు సంవత్సరముల వయస్సున నతడు హానరబిల్ రాబర్టు యస్. టాడ్ కూతురగు మేరి టాడును బెండ్లియాడెను. ఈవివాహమువలన నతనికి రాబర్టు, ఎడ్వార్డుసు, విల్లియము, థామసులను నలుగురు కుమారులు గలిగిరి. ఎడ్వార్డు బిడ్డగా నున్నపుడె చనిపోయె. విల్లియము పండ్రెండు సంవత్సరములవాడై వాషింగుటను పట్టణమున మృతినొందె. థామ నిరువదేండ్లవాడయి యిల్లినాయిలో బరలోక ప్రాప్తి జెందె. రాబర్టుమాత్రము తరువాత వాషింగనులో యుద్ధవిషయిక కార్యదర్శి యయ్యెను.

పదునైదవ ప్రకరణము

న్యాయవాదిత్వము.

లింకను న్యాయవాది యుద్యోగము ప్రారంభించినపు దతనియొద్ద నొక కాసైనను లేకుండెను. స్వారిసేయుటకు గుఱ్ఱమును దానిపై సామగ్రి మోసికొనిపోవుట కొక తిత్తియు గొనుట కతనికి ధన మొక స్నేహితు డియ్యవలసివచ్చెను. అశ్వ మావశ్యక మై యుండెనా యను సంశయము చదువరుల మనములకు గోచరింపవచ్చును.

ఆకాలమున గక్షిదారులు న్యాయస్థానమునకు బోవుట లేదు. న్యాయస్థానమ గక్షిదారుల నరసికొని సంచరించుచుండును. న్యాయాధికారులు దమతమ నిర్ణీతప్రదేశములకు వెడలి యెచ్చటి వివాదముల నచ్చటనె తీర్చివచ్చుచుందురు. ఇట్టిన్యాయస్థలములకు దేబడు వివాదముల సంఖ్య కనుగుణముగ 'భ్రమణ' కాలము పట్టుచుండును. ఒక్కొకమా రీ 'భ్రమణము' లనుండి లింక నింటికి మూడుమాసముల మీదట దిరిగివచ్చుచుండెను. ఇట్లొకతరి యతడు గార్యార్థియై వెడలియుండినపు డతనికి సందియము గొలుప నాతనిభార్య దమగృహమున కింపులు గురిపించు మేడ గట్టించి నూతనాకారము వహింప జేసెనట. లింకను మఱలివచ్చి యింటియందలి మార్పుల బరికించి తెలియని వానిబోలె దూరముననుండు నొకని బిలిచి,

"నాయనా! లింక నిప్పు డెచట నివసించు. ఇదివఱ కీ గేహంబున నుండునే?" యని ప్రశ్నించెనట.

కొంతద్రవ్య మార్జించినపిదప లింక నొక యొంటి గుఱ్ఱపు బండిని సంపాదించెను. అదియు నంత యుత్తమమైనది గాదు. సొంపుగాని దినముల నద్దాని నుపయోగించు కొనుచుండెను. ఇంతటిమితపరికరములు గలవా డైనను అతని రాకమాత్రము భూస్వాములకును న్యాయవాదులకును మోదప్రదం బయి యుండెను.

న్యాయవాదిగ నున్నెడ నతడు నిష్కాపట్యము, నిష్పక్షపాతము, న్యాయవాంఛ, దయ, ధారాళత్వముల జూపి ప్రసిద్ధి వడసెను. ఈ గుణముల సూచించు దృష్టాంతముల లిఖించి యొక గ్రంథము నింప నగును. అయిన నిచ్చట గొన్నిటి మాత్ర పొందుపఱచెదము.

లింకనువద్ద కొక వ్యాజ్యకా డేతెంచి తన కథనెల్ల జెప్పుకొనియెను. చక్కగ విని,

"నీకు నే నుపయుక్తుడ గాజాల. నీ వ్యాజ్య మనృత" మనియెను.

"అదంతయు మీ పనిగాదు. నే డబ్బిచ్చి మిము నాపరము వాదింప నునిచికొనిన సరిగదా" యని వాడు ప్రతిపల్కెను.

"నేనట్లు వాదింపను. న్యాయవాదిగ నుండుట యన్యాయమును న్యాయ మొనర్ప గడగుట కాదు. నిస్సంశయముగ దప్పుత్రోవల ద్రొక్కువ్యాజ్యమే నెన్నటికిని నంగీకరింపను."

"నా వెరిని మీరు దొందరల బెట్టవచ్చును గాదా?" "అవును, వివాదము నే గెలిచియిచ్చెద ననుటకు సందేహము లేదు. ఒక ప్రదేశపు జనులనెల్లర దాఱుమాఱు చేయ గల్గుదును. ఆ విధవను ఆపె యాఱుగురు దండ్రిలేని బిడ్డలను రిక్తహస్తుల జేసి న్యాయానుసారముగ వారికి గల యాఱు వందల డాలరుల నీ కిప్పించ గల్గుదును. అయిన నే నట్టి యన్యాయపు పనులు సేయువాడును గాను."

"మీ కెంత వేతన మిచ్చినను జేయరా?"

"నీకు గలదంతయు నా కూడ్చి పెట్టినను నే జేయను. చట్టదిట్టములు సరియని యొప్పుకొను విషయములు గొన్ని నీతిబాహ్యములు గలవని యెఱుంగుము. నీ వివాదమునకు దోడ్పడుదు ననుట గల్ల."

ఈ యుత్తర ప్రత్యుత్తరములకు వ్యాజ్యకా డాగ్రహము పూని,

"మీరు రాకున్న గుడ్డిగవ్వవోయె. మీవంటి న్యాయవాదు లీసీమయందు దండోపతండములు గల"రని నొడివి రభసమున వెడలబోయెను.

లింక నతని నాపి "వేతనము దీసికొనక నీ కొక యాలోచన సెప్పెద వినుము. నీవు చూడ మిక్కిలి చుఱుకైన పనివాడుగ నున్నావు. ఆ యాఱువందల డాలరు లింక నేవిధమున నైన గడింపుము. పొ మ్మ"ని చెప్పి పంపెను. ఒకనాటి మధ్యాహ్న కాలమున లింకను హెరండనుల యుద్యోగస్థలమున కొకముసలి నీగ్రో (సిద్దీ) స్త్రీ యేతెంచి తన విషయమెల్ల సాంతముగ జెప్పుకొనెను. అంతకుబూర్వ మాపె గెంటకీ సీమయందు హిన్కె లను నతని బానిసగా నుండెను. అతడు దయా మయత్వంబున నామెను బిడ్డలను నిల్లినాయి సీమకు దెచ్చి స్వేచ్ఛ యొసగి యుండెను. అప్పుడామె కుమారుడు న్యూఆర్లియన్సుకు బోయి యుండి యవివేకి యై గ్రామము సొచ్చెను. ఇతరసీమలనుండి వచ్చు ముక్త బానిసల బట్టి మరల దాస్యమున కమ్మవచ్చు నను 'సీమ' చట్టము ననుసరించి పోలీసువా రతని బట్టి యుంచిరి. వెంటనే మరల్చుకొని రాకున్న ద్వరలోనే మరల నతనికి దాస్యము సంభవించిన ట్లుండెను. అట్టి యాపదనుండి తన పుత్రు దప్పించరే యని యామె వేడెను. లింక నార్ద్రహృదయత్వము వెల్లివిరియ జొచ్చెను. కఠినచట్టములపై నాగ్రహమును మెండయ్యెను.

హెరవ్డను నవలోకించి "రాజకీయోద్యోగస్థలమునకు బరువిడి యీ నీగ్రోను రక్షింప గవర్నరు చిస్సెలుగా రేమైన జేయగలుగుదురేమో తెలిసికొని రమ్మ"నెను.

ఆ యాలోచన నిష్ఫల మాయెను. గవర్నరు దన కా విషయమున నెట్టి యధికారమును లేదని వార్త బంపెను. ఇట్టి యాసురకృత్యమును నిరాకరింపజాలని చట్టముల హీనత్వంబునకు మిక్కిలి కనలి లేచి నిలిచి తన నిడుపుచేతుల నాకాశమార్గంబునకు బఱపి,

"దైవానుగ్రహం బుండిన నా నీగ్రో నిప్పుడ రక్షించెద. లేకున్న గవర్నరు కిట్టివిషయముల నిష్టానుసారముగ బ్రవర్తింప నధికార మిచ్చువఱ కిరువదిసంవత్సరములైన జట్ట నిర్మాణసభయందు బోరాడి యల్లకల్లోలం బొనర్చెద" ననియెను.

వెంటనే లింకను హెరన్డనులు దమ ధనము న్యూఆర్లియన్సుకు బంపి యా నీగ్రోను విడిపించిరి.

లింక నొకతఱి చిక్కుల కిక్క యగు నొక వ్యాజ్యములో వాదించుచు దాను దప్పుపక్షమున నుంట బొడగాంచెను. కక్షిదారుడు దుర్నీతుడై యతని కబద్ధము సెప్పి యుండెను. అతడు శ్రమ జేసి తన కక్షిదారుకై యొక యప్పు లెక్కను సిద్ధాంతపఱచెను. అయిన బ్రతికక్షివా రా లెక్క కెల్ల విరుద్ధముగ జెల్లుచీటి (రశీదు) నొకదాని గనుపఱచిరి. దీనివిషయము లింకనున కెఱుకయే లేదు. ఎదురు న్యాయవాది దన వాదము ముగించుటకుమున్నె లింకను న్యాయస్థలము నుండి లేచిపోయి యుండెను. దాని గాంచి న్యాయాధికారి యతని బిలువ నంపెను. అయిన లింకను నేను రాజాల నని న్యాయాధికారికి జెప్పుము. నాహస్తము మాలిన్యంబు నందినది, కడుగుకొన నేతెంచితి" ననిదూత ననిపెను.

హత్య వివాదమున నొక్కట ముద్దాయిని రక్షించుటకై లింకను సీవెట్టులు నేమింపుకొనబడిరి. సాక్ష్యము విననతరువాత లింకనునకు దనపక్షమువాడు నేరస్తుడే యని తోచెను. వెంటనే ప్రక్కగదిలోనికి దన సహవాదింబిలిచి,

"సీవెట్టూ, మనవాడు నేరస్తుడే"యనెను.

"అందుకు సందియములేదని" సీవెట్టు ప్రత్యుత్తరమిచ్చెను.

"అతనిని నీవ రక్షించుకొనవలెను. నే నిక సాయ మొనర్పజాల" నని లింకను దన సదనమునకు వెడలెను.

సీవెట్టు మిక్కిలి చాతుర్యముతో వాదించి నేరస్తుని న్యాయశిక్షనుండి తొలగించెను. వాడు వేతనముగ న్యాయ వాదుల కని వేయిడాలరు లిచ్చెను. అయిన లింక నందొక్క వీసమైన గొనడాయెను.

ఒకనా డొక యబల యతని మందిరమునకు వచ్చి తనకు న్యాయము జరుప నతని నియమించుకొన గోరెను. ఆలోచన వేతనముగ రెండువందల యేబది డాలరుల చీటినిచ్చి మఱునాడు రమ్మన నంగీకరించి పోయెను.

రెండవరో జామె వచ్చునప్పటికి దగు విషయముల నెల్ల లింకను పరామర్శించి యుంచెను. ఆమె వచ్చినతోడనె "అమ్మా, నీ హక్కు స్థాపించుట కావంతయైన నాధారము గానరా దనుటకు జింతిల్లుచున్నా" ననెను.

ఆమె మిక్కిలి చిన్నవోయి "అదెట్ల"ని విచారించెను.

అంత లింకను విషయములనెల్ల నామెకు జక్కగ విశదీకరింప నామె లేచిపోవ నుద్యమించెను. లింకను "నిలునిలు" మనుచు దన కోటు జేబులోనుండి యామె యిచ్చిన చీటి దీసియిచ్చెను.

ఆమె వెఱగంది "మీ రద్దాని సంపాదించితిరి. అది మీదె యగు" ననెను.

"కాదు, కాదు, అది సరికాదు. నా ధర్మము నే జేసితిని. నే నేమియు గ్రహింప" నని గట్టిగ బల్కి యామె దాని గొని పోవునట్లు చేసెను.

లింకను బాల్యమున "పిన్ని హానా" యను నామె యతనియెడ బ్రేమ గలిగి యుడుపుల శుభ్రపఱచి యిచ్చుచు భుజించుట కప్పుడప్పు డేమైన నొసగుచుండెను. అందుకు బ్రతికృతిగ లింక నామె కుమారుని యుయ్యెల నూపుచుండెను.

ఇప్పటి కా శిశువుతండ్రి పరలోకప్రాప్తి జెందియుండెను. ఆ శిశువు దరుణవయస్కు డై పోరాని పోకల బోవుచుండెను. అట్లు మెలగుచు నొక్కతఱి హత్యనేరమున జిక్కు కొనెను. హానా దు:ఖము నిర్వచనీయ మాయె. తన కుమారుడు దుర్మార్గమున నిట్టి యిక్కట్టుల బడి దండనీయుడు గావలసెనే యను చింతచే నేమియు జేయ దోపక భ్రమ జెంది కొంతసేపటికి దెప్పిఱిలి "గురుగుణు డాబి" మనసునకు దట్ట నత డేమేని సాయ మొనర్చు నని నిశ్చయించుకొని లింకనుకు మొఱ వెట్టుచు దన పుత్రు రక్షింపవలసిన దని వేడుచు వార్త బంపెను. లింక నాజాబు జూచినతోడనె చక్షువుల నుదకములు వ్రాల్చి తనకృతజ్ఞాత జూపుట కదియ సమయ మనుకొని, హానాకై యామె బిడ్డ నెంతకష్టముల కోర్చియైన గాపాడ గంకణము గట్టెను. శక్తికొలది పాటుపడుదుననియు దైవానుగ్రహముండిన మేలు గాగలదనియు దక్షణ మాపె స్ప్రింగుఫీల్డుకు రావలసిన దనియు హానాకు బ్రత్యుత్తరము వ్రాసెను.

ఆమె కా వాగ్దాన మాకాశవాణి దోడ్పడ నెంచి పల్కినట్లగుపడెను. పగులు స్థితియందుండు గుండె ధైర్యము గొన నామె సత్వరముగ స్ప్రింగుఫీల్డుకు వచ్చిచేరి లింకనున కున్నవిషయముల వెల్లడి పఱచెను. కొందఱు వయోవంతులు హాలారస పానమత్తులై హాస్యానుకూల ప్రసంగంబుల కారంభించి తన్తూలంబున వివాదంబులకు గడగి రోషానలారుణితలోచను ---------సింధురంబుల తెఱంగున మై మఱచి యొండొ రుల దాకికొనుచుండ నందు మేట్సుగారను నతడు మృతినొందెను. అతని చావునకు హానా కుమారుడు విల్లియము గారణమని యానేరము మోపియుంచిరి. హానా మాత్రము దనకుమారుడుగాక మఱెవ్వడో యాపనిని జేసె నని నమ్మెను. ఆమె కథ నెల్ల సంపూర్ణముగ వినిపించిన తరువాత లింకనుగూడ విల్లియము నిరపరాధియని స్థాపింప లేకపోయినను నపరాధి యనుటకు దగినంత యాధారములు గానరాకుంట స్పష్టముగా గనెను. అందువలన నా ముదుసలిపై మిక్కిలి దయపుట్టి యాపె పట్టిని యురినుండి యెట్లైన రక్షింపవలె నని నిర్ధారణ సేసికొనెను. నేరస్తుని దండింపించవలె నను నుత్సాహ మపు డతివిస్తరముగ నుండుటంబట్టియు, నీ విల్లియమే దండనీయు డను వార్త వ్యాపించి యుండుటంబట్టియు నప్పటి స్థితియందు నిష్పక్షపాతులగు జ్యూరరులు (న్యాయసభలోని పంచాయితిదారులు) లభించుట గష్టతమ మనుట గుర్తించి యా వివాదపు విచారణ మఱియొక మాఱు మూడుమాసముల మీద జరుపవలసిన దని లింకను న్యాయవాదిని వేడి యట్లేసేయుటకు నుత్తరవు గొనెను. ఈ మార్గ మవలంభించుటకు హానా దనపుత్రు జూచుదత్తరమున నియ్యకొనకున్నను లింకను పై జెప్పినవిషయముల విశదీకరించి తన వివాదము జతపఱచుకొనుటకు గూడ నది సహకారి యగునని నుడివిన తరువాత నామె దన కుమారు లింకనున కప్పగించి యతడేమిచేసినను మంచిద యని యంగీకరించెను.

నిర్ణీతదినమునకు మధ్యకాలములో నాబ్రహా మైదువేల డాలర్లు వేతనముగ గొనినవానివలె శ్రమపడి సాక్ష్యవిశేషముల సమకూర్చుకొనుచు నితర సాహాయ్యముల జేర్చుకొను చుండెను.

విచారణదినమున న్యాయస్థానమున కనేకులు లగ్నహృదయు లాగతులైరి. వారు ప్రశాంత మనస్కులై మధ్య గొంతకాలము గడపియుండుటచే మొదటి దినములయందువలె సంభ్రమచిత్తులై యుండుట మాని న్యాయాన్యాయవివేచన సేయుటకు దగిన మనోవృత్తి గలవారై యుండిరి. పిర్యాదు పరము సాక్షులొక్కరివెంబడి నొకరు పరీక్షింపబడిరి. కొందఱు విల్లియము పూర్వపు దుష్ప్రవర్తన స్థిరపఱచిరి. మఱికొందఱు నేరము సమయమున దాము చూచినవిషయముల దెలుపుట కేతెంచిరి. పిర్యాదిమాత్రము విల్లియ మాయుధముచే నిహతుని జావనడచినది చూచితినని దృఢముగ బల్కెను.

అయిన నీపిర్యాదిని చమత్కారముతో బరీక్షించి లింక నందఱువెఱగంద బ్రతిపక్షమువారి వాదమె వారిపైకి ద్రిప్పెను. సాక్ష్య మతడు విమర్శించువఱకు నచ్చటివారెల్ల నేరము నిస్సంశయముగ స్థాపింపబడె ననుకొనుచుండిరి. అయిన నతనిచర్చ ప్రారంభమగుటతో నానేర మన్యాయముగ నీతరుణమున విల్లియముపై మోపబడెననుట విశదమాయెను. లింకను మనస్థితి వర్ణింప బదసామగ్రి చాలదు. ఒక్కెడ దన యుపకారికి బ్రత్యుపకారము సేయవలయు నను వాంఛయు, నొక్కెడ నన్యాయపు నేర మారోపించిన దుష్టాత్ములపై గిన్కయు, మఱి యొక్కెడ నిరపరాధి కిట్టి యిడుమలు దటస్థించె నను వగపును, నింకొక్కెడ నితరులకష్టముల మాన్ప బురికొల్పు సహజదయామయత్వంబును నతనిహృదయముం బ్రజ్వరిల్ల జేయుచుండెను. దాన జేసి యతని వాద మద్భుత వాక్పాటనము వల్లను, గ్రమక్రమముగ నారోపణ మొనర్చు స్వనగాంభీర్యము వల్లను, మాటిమాటికి మనోవికారముల బోధించు ముఖవైఖరీభేదముల వల్లను వినువారి మనముల నినుమును గాంతమువోలె నాకర్షించి యైంద్రజాల శక్తిబలంబునబోలె మార్చివేసెను. అచ్చటివారెల్ల లింకను వాదము వినకమున్ను విల్లియముపై నెంతయాగ్రహ మూనియుండిరో యంతయాగ్రహము వినిన తరువాత బిర్యాదిపై బూనిరి. వా రందఱు లింకను శక్తికిమెచ్చి యనేకపర్యాయములు మహారావము నింగి ముట్ట జేతులు చఱచిరి.

న్యాయాధిపతియు జ్యూరరులును విల్లియము నిరపరాధి యని యతని విడుదలచేసిరి. విల్లియము హానాల సంతసమునకు మేర లేకుండెను. లింకనునెడ వారికి గలిగిన కృతజ్ఞత వెలువరింప లేరైరి. అతడును వారి గౌరవాదరణవచనముల బ్రేమతో స్వీకరించి విల్లియమునకు బుద్ధిసెప్పి యతడు మరల నట్టి దుష్టసాంగత్యములకు బోకుండుటయె తనకు జూపదగు కృతజ్ఞత యని నొడివి వానిచేత నొప్పించుకొనియెను.

మఱియొకవిషయమున గూడ నీ "పిన్నిహానా" కితడు సాయ మొనర్చెను. అది పెంచి వ్రాయు టనవసరము.

మాఱుదల్లియెడ నితనికి గల యనురాగము గనబఱచు నట్టి యంశ మొండిట జూపనగును. న్యాయవాదిత్వమునకు బ్రారంభించిన కొన్నిదినములలో నొక్కవివాదమున లింక నైదువందల డాలర్లు గడించి వాని లెక్కించుకొనుచుండెను. అపుడు సహవాది యొకడు గనుపింప నాతనితో,

"ఇదె చూడుడు. నేసంపాదించినదానిలో నిదియె గొప్ప వేతనము. ఇక రెండువంద లేబదిడాలరు లున్న నొక మంచి క్షేత్రము గొని నాముసలి మాఱుదల్లి కియ్య గల్గుదు" ననెను.

'మిగత భాగ మే నప్పిచ్చెద' నని యతడు ప్రత్యుత్తర మిచ్చెను.

"అయిన సంతసించితిని కానిమ్ము" అనుచు లింక నప్పు పత్రము వ్రాయబోయెను. "కొంచెము నిలుపుము. నీవు చెప్పినరీతిని వ్యయపఱచుట కంగీకరింప" నని సహవాది వల్కెను.

"ఏలొకో?"

"మీ మాఱుదల్లి ముదుకలి యగుచున్నది. బహు కాలము జీవింపదు. ఆయమ యనంతర మాచేను నీవ యనుభవించున ట్లేర్పఱుపవలెను."

"అట్లు నే నొక్కనాటికి జేయను. ఆయమ నాపై గనుపఱచిన విశ్వాసప్రేమల కేనొనర్చు నుపకృతి బహు స్వల్పము. అందును లోపము సేయ నా మనసొప్ప" దని ఖండితముగ బలికి తనచేతనైన త్వరలో నాయాస్తిగొని మాఱుదల్లి కిచ్చివేసెను.

1851 వ సంవత్సరమున దండ్రికి మరణావస్థ దటస్థించిన దని విని లింకను గార్యబాహుళ్యమున జేసియు దనభార్యను ఘోరతర వ్యాధి బీడించుచుండుట జేసియు గదలిపోజాలక పితృభక్తి యుట్టిపడు పదముల నుత్తరమొకటి వ్రాసి పంపెను. అందు గొంతభాగ మీక్రింద వ్రాయబడుచున్నది.

"నాతండ్రికిగాని తల్లికిగాని వారు జీవించినంతకాల మెట్టిసౌఖ్యలోపంబును నుండ గూడదని నాకోరిక. తండ్రిగారి కిప్పటి జబ్బు కుదురుటకు వలయు వైద్యులుగాని వస్తువులు గాని నాపేరు స్వేచ్ఛగ నుపయోగించి సమకూర్పవలసినది. తండ్రిగారి కీజాడ్యమునుండి విముక్తి గలుగు గాకని యెప్పుడు దైవమున కెరగుచున్నాను. అయిన నెట్లుండి యెట్లువచ్చినను దండ్రిగారిని దయా సముద్రుండును, సర్వాంతర్యామియు, సర్వ శక్తుడును నగు నాపరమాత్మను మఱువక యారాధించి యతని మఱుగు జొరు మనుము ........ఇప్పుడు నేనును దండ్రిగారును నొకరిని నొకరు చూచుకొనుట యిద్దఱికి మిక్కిలి దు:ఖప్రదముగనే యుండునుగాని సంతస మియ్యజాలదు. దైవానుగ్రహము తప్పి యత డిపుడు పరలోకమున కేగవలసివచ్చిన నిదివఱ కటకుబోయిన ప్రియబాంధవుల సంతోషముతో గలసి కొన గల్గును. అచిరకాలములోనే నిలువయుండు మేమును నీశ్వరాజ్ఞచే నా యానంద మనుభవింతుము గాక."

________

పదునాఱవ ప్రకరణము

గౌరవాధిక్యతం కెందుట.

లింకను న్యాయవాదిత్వమున నుండి సంపాదించిన ప్రజా ప్రతినిధి సభ్యత్వాది విషయముల గుఱించి విశేషము వ్రాయ బనిలేదు. అతడు దేశాధ్యక్షతకు నేమింపబడువఱకు గ్రమక్రమముగ వృద్ధిబొందుచు వచ్చెను. జనుల కందఱ కాతని సద్గుణసంపద విదిత మగుట నెల్లరును దమతమ స్వల్పభేద