ఆబ్రహాము లింకను చరిత్ర/ఉపోద్ఘాతము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఉపోద్ఘాతము

మనభూమి గుండ్రముగా నుండుట యెల్లరకు దెలిసినదే. ఈగోళమును రెండు బాగములుగా విభజించి పూర్వార్ధగోళము, పశ్చిమార్ధగోళ మని భూగోలశాస్త్రజ్ఞులు నామము లిచ్చి యున్నారు. పుర్వార్ధగోళమునందలి భూప్రదేశము శతశతాబ్దములుగ ననేకజాతులచే నాక్రమింపబడి యనారతము ప్రజల వ్యాపారములచే నిండియున్నది. పశ్చిమార్ధము గొంద ఱడవి జాతులవారిచేమాత్ర మచ్చటచ్చట నుపయోగించుకొనబడుచుండి యైదాఱు నూర్లసంవత్సరములకుముందు గొలంబసు యాత్రవలన సభ్యరాష్ట్రములకంటబడినది. నాటినుండి నేటివర కీనూతనఖండమున జరిగినమార్పు లత్యద్భుతములు. అం దుత్తరభాగమున వెలుగు యునైటెడ్ స్టేట్సు సంయుక్త రాష్ట్రపు బ్రవృద్ధి వచించిన దీరదు లోకమునందు మహౌన్నత్యము గాంచి వాణిజ్యంబున నెల్లదేశముల గెలిచి సంపత్సమృద్ధికై యగ్రతాంబూలంబు స్వీకరించుటే గాక యీ రాష్ట్రము ప్రజాపరిపాలనంబున గూడ లోకమున కుపదేశ మియ్య గలిగి యున్నది. కావున నీరాష్ట్రపుబుట్టుక ప్రవృద్ధులగుఱించి సంక్షిప్తముగ దెలిసికొనుట యత్యావశ్యకము పదునాఱవశతాబ్దమున నింగ్లాందున మతవిషయకచర్చ లతివిస్తరముగ జరుగుచుండెను. ప్రభుత్వమువా రొకమతంబవలంబించి యితర మతస్థుల బీడించుచు వచ్చిరి. మతముపేరు పెట్టి ప్రాణములు గొనుటయు సర్వసాధారణ మాయెను. అనేకులు చిత్రవధకైనను వెనుదీయక తమమనస్సాక్షికి సమ్మత మగుమతమును వదల రైరి. మఱికొందఱు స్వేచ్ఛానుసారముగా దేవపూజ లొనర్చుకొనుటకై విదేశములకు వెడలసాగిరి. అట్లు వెడలినవారిలో నొకగుంపు మొట్టమొదట యునైటెడ్ స్టేట్సు విత్తు నాటినవారు న్యూ యింగ్లం దను ప్రదేశమున దిగి నివాస మేర్పఱచుకొని మొదట పల్లియలుగ దరువాత బట్టణములుగ జేరిరి. వారియభివృద్ధిం గాంచి యితరులును రా నారంభించిరి. ఆంగ్లేయప్రభుత్వమువా రిట్లు దేశాంతరగతులైన తమవారికి సాయ మొసంగుచు దమ యధికారముగ్రింద నవీనమండలము లేర్పఱుప నుత్తరువు లిచ్చిరి. జనులు వర్తక సంఘములుగ జేరి రాజునాజ్ఞమీద నమేరికాలో గ్రొత్తక్రొత్తసీమల నాక్రమించుకొని యేల మొదలిడిరి. కావున నీసంఘముల ప్రతినిధులే యధికారము వహించి పరిపాలించుచుండిరి. మున్మున్ను వచ్చి యుత్తరభాగమున జేరిన ప్రజలు దమప్రతినిధులచే రాజ్యభారనిర్వహణము సేయించుచుండ దక్షిణమున వర్తక సంఘముల యధికారులే రాజులైరి. దీనివలన నుత్తరభాగమున జనులెల్ల నొక్కరీతిగ బరిగణింపబడచు రాజకీయవిషయముల బ్రతినిధులద్వారా స్వానుకూల విధులనే యంగీకరించుచుండ దక్షిణమున దర్జాభేదము లెక్కువయై కాయకష్టము హేయముగ నెంచబడి బానిసవ్యాపారము గడుపెంపు నొందుటకు మార్గము లేర్పడెను. అయిన నాంగ్లేయులకు స్వాతంత్ర్య మనినను బ్రాణ మనినను నొక్కటియ. కాబట్టి దక్షిణ భాగమునందలి వారుగూడ దమ దమ ప్రజా ప్రతినిధిసంఘముల వృద్ధికై పాటుపడుచు బరిపాలనా భాగము విశేషము దమచేత నుంచుకొనుచు వచ్చిరి.


ఇట్లగుట నిప్పుడు యునైటెడ్ స్టేట్సను ప్రదేశమున మొదట మొదట నింగ్లాండునకు లోబడి కొన్ని పరిపాలనా స్వాతంత్ర్యముగల పట్టణములును, సీమలును, మఱికొన్ని యర్ధస్వాతంత్ర్యముగల సీమలు నుండెను.

ఇవన్నియు గాలానుగుణముగ బోయినపోక లనేకములు గలవు. ఇట విస్తరమనవసరము. ప్రథమముననుండి ఈపట్టణములవారును సీమలవారును నేకీభావమున మెలగుచుందురు. తమలో నెవ్వరికేయాపద వచ్చినను అందఱు జేరి దాని నివారింప జూచుచుందురు. 1770 వ సంవత్సర ప్రాంతముల నాంగ్లేయ ప్రభుత్వమువారు దమదేశీయుల లాభమునకై యమెరికా యందలిసీమలపై గొంతపన్ను విధింపజొచ్చిరి. తమలో నొకరిపై బన్ను విధించు నధికార మాంగ్లేయుల కిచ్చినచో నందఱ కాకీడెప్పటికో యొకనాటికి దప్పదని తెలిసికొని, యాంగ్లేయులు భేదోపాయము ప్రయోగింప జూచినను, నాసీమ లెల్ల నొకకట్టుగ వారి నెదిర్చినిలచెను. ఆంగ్లేయు లెన్నియుపాయములు సేసినను సాగనందున యుద్ధమునకు సమకట్టిరి. ఆ సీమలవారును వెనుదీయక సమర మొనర్చిరి. తండోపతండములు సైన్యములుగొని యిరువాగులవారును దిక్కులు పిక్కటిల్ల జేయు భేరీ రవంబులతోడను నాయుధమనిన గజగజ నడుకు పిరికినైన సంపూర్ణోత్సుకు జేయు సింహ్మనాదంబులతోడను గదలి మాటిమాటి కొండొరులతో నొరసికొని జయాపజయంబుల గొనుచు బట్టణముల ముట్టడింపుచు, విడిపించుచు, దేశము నాక్రమించుచు, నాక్రమణ దేర్చుచు బలువిధముల బహుకాలము పెనగిరి. ఈపోరాటమున నాంగ్లేయులే యెక్కుడు దుర్దశలం గుడిచి తుట్టతుద కమెరికాజనుల దాడికోర్వలేక కొంతవఱకు వారిచే బట్టుబడి తమయధికారము నంతయు గోలుపోయిరి.

ఇట్లాంగ్లేయుల యధికారము నుండి దప్పించుకొని యీ సీమల వారు దామైకమత్యము గలిగి యేకరాష్ట్రముగ జేరకుండిన నితరుల మోర్చుట గష్టమనుట మనసునకు దెచ్చుకొని 'సంయుక్త' రాష్ట్ర మేర్పఱుప బూనిరి. సంయుక్తరాష్ట్రపు శక్తిబంధములు మొదట మొదట నామమాత్రములే యైయుండెను. ఏసీమ వారాసీమ మేలుకీడుల యెడనె మెలకువగలిగి సంయుక్తరాష్ట్రపు జట్టదిట్టముల లెక్కకు గొనకుండుట దటస్థించుచుండెను. సీమలెక్కడ మరల వేరుపడి పోవునో యను భయముగూడ మెండుగ నుండెను. అయిన రానురాను జను లొకరితో నొకరుగలిసి వివాహవ్యాపారాదులవలన దగ్గర చేరుటచే సంయోగపు ఫలముల దెల్లమగుచు వచ్చెను. జాతీయతగౌరవ మిట్టిదిగదా యనుట వారికి గ్రమేణ స్ఫురించెను. జాతీయతప్రవృద్ధి తోడనే సంయుక్తరాష్ట్రతయు బ్రవృద్ధి జెందెను. అప్పుడు 'సీమ' జనులు దమమేలును సంయుక్తరాష్ట్రపు మేలును నొక్కటియే యనియు దాము సంయోగమున భాగస్తులు గావున సంయుక్త ప్రభుత్వమునకు లోబడుట యితరులకు లోబడుటగాక తమ నిబంధనల గారవించు కొనుట యనియు సంయుక్తరాష్ట్రపు నౌన్నత్యమునకె 'సీమ' లకు గొంత నష్టము వచ్చినను నష్టముగా గణింప బడగూడదనియు దలంపదొడగిరి.

దక్షిణపు సీమలయందు బానిస మెక్కుడుగ నుండెనని నుడువబడినది. వానిని "బద్ధసీమ" లని పిలిచెదము. ఈ బద్ధ సీమల గూలిపని యను మాటయే యరుదు. ఏకార్యమునకు జూచినను 'దాసు'లనే యుపయోగించుచుందురు. దాసులకు బెట్టునది పిడికెడు కూడు, తొడగించున దొక ముతుకగుడ్డ, కట్టిపెట్టున దొక రాతిగొంది, యనుభవింప జేయునది సంకెళ్ల మోతయు, కొరడాదెబ్బలరుచియు. ఇవన్నియు యజమానికి వ్యయములేక దొరకుచుండును. పశువుల కర్చుకంటె బానిసలకర్చు తక్కు వగుట బానిస వ్యాపారము రానురాను మిక్కిలి యధికమాయెను. ఎచ్చటి జనులను దారిదప్పించి శరణరాహిత్యుల జేసి దొంగలించుకొనివచ్చి యీ సీమల నమ్ముచుంట సాధారాణమయ్యెను. ఇట్టి యమానుషపు గృత్యముల మొదలంట నశింపజేయ నుద్యమించి యుత్తర సీమలవారు ప్రయత్నములు సేయనారంభించిరి. కొన్ని దక్షిణ సీమలు దమ పూర్వ ఘోరాచారముల వదలి "ముక్తసీమ" లగుచు వచ్చెను. మఱికొన్ని సంయోగమునుండి దొలగి పోవసిద్ధపడెను. బానిస వ్యాపారమున కడ్డుపడకూడదని మహా యల్లకల్లోలములు జరిపెను. అయిన దుట్టతుదకు మానవునందడగియుండు దైవికాంశము పైకిలేచి యయ్యాసురప్రవర్తన దుదముట్టింప సమకట్టి యుత్తరదక్షిణసీమలకు యుద్ధమువెట్టి దక్షిణసీమల బరాజితుల జేసితనపని దీర్చుకొనెను. ఇది సులభసాధ్యము కాదాయెను. అనేకులు మహాత్ములీపనికై, దమ యుసురుల దొరగవలసివచ్చెను. అయినను "ధర్మోజయతి" యనువాక్యం బెప్పటికైన గల్ల యగునే. ఎంత ప్రబలుడైనను ఖలుడు బహుకాలము నిలువడుగదా! బానిసంబున కంత్యకాల మాసన్నమై మన కథానాయకుని దనతోడనకొని పరలోకమున కరిగెను. అంతటితో యునైటెడ్‌స్టేట్సు సంయుక్త రాష్ట్రత శిలాశాశ్వత మాయెను.

ఈసంయుక్తరాష్ట్రపు సార్వభౌమత్వము మూడుపట్ల నివసించెడిని.

!. సీమ ప్రతినిధిసభ:- ఆఱుసంవత్సరముల కొకమారు ప్రతి సీమయందలి చట్టనిర్మాణ సభవా రాప్రదేశ మందలి ప్రాముఖ్యు లిద్దఱి నేర్చి యీ సభకు బంపుచుందురు. వీరు 30 సంవత్సరములకు పైబడి లోకానుభవము గలవారుగా నుందురు. వీరి యభిప్రాయములు జనసామాన్యుల మేలు ననుసరించి స్వబుద్ధిజనితము లై యుండును.

2. ప్రజాప్రతినిధి సభ:- సీమచట్ట నిర్మాణ సభకు బ్రతి నిధుల నేర్పఱచువారే వీరిని నిర్వచింతురు. సంయుక్త రాష్ట్రపు జట్టదిట్టము లన్నియు నీరెండు సభల మూలముననే యేర్పడవలెను.

3. దేశాధ్యక్షుడు:- ఆ చట్టదిట్టముల చెల్లించు సర్వాధికారము దేశాద్యక్షునికి గలదు. అతడు చట్టదిట్టములు నిర్మింప బడుతరి వానికంగీకరింప వలెను. అతని యంగీకారము లేనియెడల నావిషయము మఱల పైసభల యందు జర్చింపబడి మూట రెందుపాళ్లు సమ్మతుల బడసిననేకాని రాష్ట్రమున జెల్లదు. దేశాధ్యక్షుడు నాలుగుసంవత్సరముల కొకమారు జనసాన్యులచే బేర్కొనబడు నిర్వాచకుల సమ్మతుల వలన నేమింప బడును. అతడా రాష్ట్రమున జననమంది యుండవలయును. మప్పదియైదు సంవత్సరములకు లోపుగా నుండగూడదు. ఒక్క మతమునకు జేరియుండవలెనను నిర్బంధము లేదు. తా నధికారమున నుండునంతకాలము స్వచ్ఛందవృత్తి రాజ్యభారము నిర్వహింప వచ్చును. విదేశీయులతో యుద్ధము, సంధిమొదలుగా గల్గువిషయముల నిర్ధారణ సేసికొనుటయందును దేశమునందలి యుత్తమస్థానముల కితరుల నేర్పఱచుటయందును మాత్రమ యతడు సీమ ప్రతినిధి సభకు లోబడి యుండవలయును. ఈ పదవిని గుఱించి యుపన్యసించుచు బ్రైసను మహాచరిత్రకారుడు లోకమున నెల్ల మహా మతాచార్యుల స్థానమునకు గుడిచేయి కెడమహస్తము బోలు మహోత్కృష్టపద విది దక్క వేరొండులేదని నుడివియునాడు. ఆంగలోదేశపు రాజును హిందూదేశపు జక్రవర్తియు నగు నా మహాపురుషుడును ఆసియా యైరోపాఖండముల నుత్తరభాగమంతయు దనస్వాదీనమున నుంచుకొని ప్రజల గడగడవడంకం జేయు నాసార్వభౌముండగు జారును ప్రపంచమున నిక నేరాష్ట్రాధిపతియు నమేరికా దేశాధ్యక్షుని శక్తి గారవంబుల గాన డనుట కెంతమాత్రము సందియంబంద బనిలేదు. ఇట్టి లోకోత్కృష్ట పదవి నందిన వారిలో ననేకు లతిహీన జన్ములు గలరు. స్వకాయకష్టంబునను, స్వబుద్ధి విశేషంబునను ఈరెంటికన్న మిన్నయగు స్వగుణశీలంబునను వీరు దేశోద్ధారణ కార్యధురంధరులై యాచంద్రతారకంబగు గీర్తిసామ్రాజ్యంబున సర్వాధికారంబు వహించి తాము పరిపాలించిన యా యునైటెడ్‌స్టేట్సునకు వన్నె వెట్టుచు క్షణభంగురం బగుస్థూలకాయంబు వదలి సూక్ష్మ స్వరూపంబున బ్రపంచము నెల్ల లేవదీయ జూచుచున్నారు. అబ్రహాములింకనం దగ్రగణ్యుడు. అతని చరిత్ర నిచ్చట సంగ్రహముగ వ్రాయ బూనితిమి. దాని జాగ్రతతో జదివి పరిశీలించినచో దేవుడెంత కరుణాళుడో మనుజునకు వృద్ధిబొంద నెంతశక్తి స్వాతంత్ర్యము లిచ్చియున్నాడో, మనదేశమునం దీశక్తి స్వాతంత్ర్యము లుపయోగించు కొనకనో, యుపయోగించు కొనుటకు వీలులేకనో కష్టతమములగు పురాతన సాంఘిక పద్ధతులకు లోబడియు బరదేశీయుల యవచ్ఛిన్న సార్వభౌమత్వపు జల్లని నీడనుండి సంతసింపవలసి వచ్చియు మన హీనజన్ములందెంద ఱాబ్రహాములింకను లడుగంటి పోయిరో చదువరుల చర్చింప గలుగుదురు.


________