ఆబ్రహాము లింకను చరిత్ర/మొదటి ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఆబ్రహాము లింకను.

మొదటి ప్రకరణము

ఆబ్రహాము లింకను తల్లిదండ్రులు, జననము, శైశవము.

రమారమి యొకటిరెండు శతాబ్దములకుబూర్వ మమెరికాఖండ మిప్పటివలె ధనసంపత్తిచే నొప్పి, గొప్ప పట్టణము లనేకములచే నలంకరింపబడి లోకమందెల్లర కన్నుల మిఱుమిట్లు గొలుపుచుండుట లేదు. ఎచ్చట జూచిన నడవులు విస్తారమై ఎఱ్ఱ యిందియనులను మోటుజాతివారితో నిండి యితరులకు జొర భయము గల్పించుచుండు. అప్పుడప్పుడ తెల్లవారనేకు లితరఖండముల నాక్రమించుకొనిన తెఱంగుననే యీ ఖండము నాక్రమించుకొన బ్రయత్నించుచుండిరి. పాశ్చాత్యుల దమదమ దేశముల జీవనోపాయము లేనివారు మనదేశమునందు వలె నాకలముల దినియో బిచ్చ మెత్తుకొనియో పొట్టబోసికొనుటలేదు. ఇతర దేశములకు దఱలి మొదట మొదట కష్టములపాలయ్యు రానురాను స్వశక్తికిప్రయోగమున బ్రవృద్ధిగాంచి యిప్పటి యమెరికను వలె సుఖం బుందురు. అయిన నెంతసాహసవంతు లయినను దారిద్ర్యమున మునిగి తేలువారే యిట్టిపనికి బ్రప్రథమమున సమకట్టు చుందురు. అమెరికాయందు నూరుసంవత్సరములకుము న్నుత్తర పస్చిమభాగములయందలి ఎఱ్ఱ యిందియనులు దెల్లవారనిన బద్ధవైరము బూనియుందురు. ఆభాగముల వసించు యూరోపియనులంద ఱన్నివేళల దుపాకి సాయము గొనక యిలువెడలుట లేకుండెను. అంతజాగ్రత్తతో బయిలుదేరినను వారు తమ ప్రాణముల బిడికిట బట్టుకొని ఎఱ్ఱ యిందియను లెప్పు డేమార్చి పైబడుదురో గదాయని జంకుచు నటునిటుజూచుచు మెలగు చుందురు. మహోత్పాతముల కాలవాలమగు నిట్టితరుణమున నాబ్రహాము లింకను తాత పూర్వ ప్రదేశమగు వర్జినియాయందుండి యచట జనబాహుళ్య మగుట గాంచి కెంటకీసీమ సారవంతమనివిని పశ్చిమభాగమైదు:ఖభాజ నంబగుట గూడ లెక్కగొనక యచటికి 1780 సంవత్సరమునం బ్రయాణమై పోయెను. అప్పటి లింకను దండ్రియగు థామసు రెండుసంవత్సరములవాడు. అతనిని మఱియిద్దఱు కుమారులను, ఇద్దఱు కూతులను వెంటబెట్టుకొని యాయాసములకు వెనుదీయక లింకను తాత కెంటకీ సీమజొచ్చి యొక నివాసస్థల మేర్పఱచుకొని నాలుగుసంవత్సరములు గడపెను. ఆ మీద నొకనాడతడు దనపెద్దకుమారుల బ్రక్కపొలములం బనిచేయ బంచి థామసును దగ్గర నునుచుకొని తానొక చేని కావరణము గట్టుచుండెను. ఆ కార్యమున మగ్నుడై యుండ దటాలున నొక్కగుండుదెబ్బ యతనిని నేలగూల్చె. థామసు దిగ్భ్రమ జెందె. అతని యన్న మార్డికే సాహాయ్యార్థము ప్రక్కపల్లియకుఱికె. మఱియొకయన్న జోషియా దమకుటీరము జేరుకొని గోడకన్నముల నుండి శత్రువుల బరిశీలింపదొడగె. వారు దమ దాగుడుభూమి వదలి యేతెంచి తండ్రి భూమివ్రాల దిగ్భ్రమజెంది నిలుచున్న థామసుగాంచి యతని నెత్తుకొనిపోవ బ్రయత్నించిరి. అయిన జోషియా సూటిగా జూచి థామసు నెత్త నుద్యమించుచుండిన యింది యనును యమనిలయంబున కతిథి జేసె. మార్డికే సబలుడై యారంగముపై జూపట్టె. థామసును దిగవిడచి యిందియనులు రయమున దొలగి చనిరి.

కటకటా! కడుపుకక్కురితి దనకును దనబిడ్డలకును భోజనము సమృద్ధిగ దొరకును గదా యనుపేరాసచే లింకను తాత యిట్లు చిచ్చుఱికి ప్రాణములు గోలుపోయెగా! ఇక నతని కుటుంబమునకు జీవనాధారమేమిగలదు. చేతికష్టము చేసి వారిని దొందరలపాలుసేయక రక్షించుచుండిన యా సత్యసంపన్నుని కళేబర మింటికి దెచ్చినపు డావిపన్ను లెంత పొగిలిరో మనమూహింపగల్గుదుమే? భర్త పరలోకగతుండగుటయు థామసుతల్లి యాప్రదేశము విడిచి చనెను. థామసు పెద్దవా డైనంతనే యతడు స్వపరిశ్రమమున సంపాదించుకొని బ్రతుకవలసి వచ్చెను. అతడంతగ నొడలువంచి పనిసేయువాడుగాడు. ఒకయూరి నుండి మఱియొక యూరికిని ఒక వ్యాపారమునుండి మఱియొక వ్యాపారమునకును దిరుగు స్వభావ మతనికి బట్టువడి యుండెను. సోమరితనమున బర్యటనము సలుపుచుండుట వలన నతని కొక్క చిన్నలాభము గలిగెను. అక్కడక్కడ వినుచు గనుచు వచ్చిన విశేషము లనేకము లతనిశిరోపేటిక జేరి భావికాలమున నితరులకు బ్రదర్శింప బడుచుండుట జేసి యతని కత్యాదర గౌరవముల దెచ్చిపెట్టుచుండెను.

త్రిమ్మరియై బహుకాలము చుట్టిచుట్టి కట్టకడపట నేదేని యొక వృత్తి ప్రవేశింతముగాకయని యిచ్చయొడమి యత డెలిజబెత్ టవునునందు బ్రబలుడగు జోసెఫ్‌హాంక్ససు నొక యొడ్లంగివద్ద పని నేర్చుకొన దీర్మానము చేసికొని యతని గృహమునకు బోయెను. అచ్చట నితడొక్క దెబ్బన రెండు పిట్టల గొట్టినట్లు విద్యాభార్యల రెంటిని గడించెను. వృత్తియందతని కంతచొరవ యలవడదాయెను. సర్వసాధారణ వస్తువుల నిర్మించుటయందు మాత్ర మతనికిశక్తిగలిగెను. నైపుణ్యము సూపి చక్కని పనివా డని పేరువడయుట కత డసమర్ధు డయ్యెను. కావున నిందు గళత్రసంపాదనమె యతని కెక్కుడు లాభకారియాయెను.

ఆలాభము వొంది థామసు ఎలిజబెత్ టవునులో నొక గుడిసెకుక్కియందు దనగృహిణితో గొంతకాలము వసించి యచటినుండి నోలిన్‌చరి దరియం దంతకంటె గొంచె ముత్కృష్ట మగు నొక కొయ్యగుడిసె నిర్మించుకొని యచటికి జనియెను. అది గవాక్షద్వార శూన్యంబై, సమప్రదేశ వర్జితంబై, నిర్జన భూమధ్యస్థాపితంబై, పేదరికమున కిదె ముద్ర వెట్టుచున్నదాన నని చాటుచుండెను. అయిన నాప్రక్క శిలలమధ్యము నుండి బుడబుడ ధ్వనులచే వీనుల విందు సేయుచు స్వచ్ఛోదకంబుల కన్నుల కానంద మొసగుచు నెల్ల కాల మల్లనల్లన ప్రవహించు నొక చిన్న జలాశయమొం డాచండకర్కశరంగంబునకు వన్నెవెట్టుచుండెను.

థామసాకుటీరమున కన్న మిన్నయగు గేహంబు నిర్మించుకొన నశక్తుం డగుట నద్దానిన తన యునికి సేసికొని యుండెను. ఇట్లు దురవస్థ పాలగువా డత డొక్కడె గాడు. అతని తెగవారెల్లరును విద్యాగంధము లేక యెప్పటి కప్పుడు క్షుత్పిశాచంబు బోద్రోలు నంతటి సామర్థ్య మైనను లేని వారై దారిద్ర్యమున మునింగి తేలుచుందురు.

థామసెప్పుడును బాఠశాల ముఖము సూచినవాడు గాడు. నాలుగుక్షరము చేర్చి చదువుటకుగాని రెండక్కరములుకూర్చి వ్రాయుటకు గాని యత డెఱుగడు. అయిన నతనిభార్య ధారాళముగ జదువ గల్గుడు. వ్రాయుటయందంత సమర్థురాలు గాదు. తనపేరు వ్రాసికొనునంత మాత్రము పరిశ్రమ గలది. ఇట్లగుట వివాహానంతర మామె దనభర్తం గాంచి విద్యాభ్యసనమునకు గాలాతిక్రమణ మెప్పటికిని లేదు. మీ రిప్పటికైన బనిబూని యక్కార్య మొనర్పవచ్చుననియె. థామసరువదియెనిమిది సంవత్సరములవాడై సౌలభ్యమునందే దృష్టికలవా డగుట ముసలిముప్పుకు దొలిసమర్త యన్నట్లా వయసున నక్షరమాల బ్రారంభించుట దుర్ఘట మని జడసెను. అయిన నాంసి యతని సందియంబుల దీర్చి స్వహస్తమున పేరు లిఖింప గల్గినను గుర్తువేసి కాలము గడుపుటకన్న ననేక మడుంగులు లెస్స యగునని తెల్పి దా దనభర్త నంత వానిగ జేయ సమకట్టెను. తుట్టతుద కాసాత్వికుడు దనసతీతిలకము గురువుగా జేకొని మిక్కిలి శ్రద్ధ జేసి బుద్ధికుశలంత కవగాహన మగువిధమున సంతక మొనర్చునంతటి ప్రవీణుడై ఈ X గుర్తువేయ విద్యావిహీనుల తరగతి నుండి తప్పించుకొన గల్గెను.

థామసు నాంసి వీరిరువును క్రైస్తవ మతస్థులై యప్పటి బాప్టిస్టు తెగకు జేరినవారు. ఆకాలమున నీతెగవారే సుగుణసంపదకు బేరెక్కి యుండిరి. కావున వా రెల్లపుడును స్వమత ధర్మముల దప్పక పాటింప బ్రయత్నించుచుందురు. థామసుభార్య యాతనికన్న నెక్కుడు క్రైస్తవభక్తి గలదియు నెక్కుడు మనశ్శక్తియుతయు. "ఆమె సన్న నై యంత రక్తపుష్టిలేక చుఱుకుదనము గల్గి సాహ సౌదార్య స్వభావముచే నొప్పి తనవారల మొఱకుదనమునకు వగచుచుండె" నని దాక్టరు హాలండు చెప్పుచున్నాడు. "ఆమె కుటుంబమువారామెబుద్ధిచాతుర్యము లనన్యసామాన్యము లని తలంచుచుండి"రని లేమను వక్కాణించుచున్నాడు. నిశ్చయముగా నామె గుణగణ్య యై బుద్ధి కుశలత గలిగి యొప్పుచుండెను. ఆమెయందు థామసున కధిక గౌరవమును గౌరవముచే నాదర ణానురాగములును బలము నొందెను. అందువలన నాతడామె సుబోధలచే సంపూర్ణఫలము వడసెను.

నిరుపేద లగు నిట్టితలిదండ్రులవలన నిదివఱకు వర్ణింపబడిన మహామందిరమున 1809 వ సం||ము ఫిబ్రవరి 10 వ తేది ఆబ్రహాము లింకను భూమియందవతరించెను. నాలుగుసంవత్సరములకు దరువాత నతనితండ్రి నాబుచరియదరికి వెడలెను. అచట నతడు నూటముప్పది యెకరములభూమి గడించుట మిక్కిలి యాశ్చర్యకరమై తోచుచున్నది. రెండవసంవత్సరమే యందు నూరెకరము లమ్మివేయబడియె ననుట యీ యాశ్చర్య మును గొంత నివారించుచున్నది. అయినను దక్కిన ముప్పదియెనిమిది యెకరములైన గొని పైరుపెట్టుట ఈబీద లింకనున కెట్లుసాధ్య మాయె ననుసందియము గలుగక మానదు. నాంసీని జేపట్టి నదిమొదలు థామ సేదో యొక విధమున వృద్ధి వొందుచువచ్చె ననుట నిర్వివాదాంశము. అతని పూర్వాచారములును పూర్వ గుణవిశేషంబులును మెల్లమెల్లగ నాతని విడిచిపెట్టసాగెను.

థామసు లింకను కథలు సెప్పుటయం దతిసమర్థుడు. తమ పూర్వీకుల చరిత్రము నంతయు మిక్కిలి యుత్సాహముతో జెప్పుచుండును. ఇదివఱకు వ్రాయబడిన విషయముల కీతడు మఱియొక యంశమును వీరరసోత్పాదకంబును జేర్చి తన కుమారుని మనము రంజిలజేయుచుండెనట. థామసు ఆబ్రహామును గుఱించి "అబ్బీ! మీతాత నాకు జెప్పుచుండిన విషయము లన్నియు విశదీకరింప దొడగితినేని దినములు గాదు వారము లైనను జాలక పోవును. అత డీ దేశమునకు వచ్చిన 1780 వ సంవత్సరముననే ఎఱ్ఱ యిందియనులు గుంపులు గుంపులుగ జేరి తెల్లవారిపై దండెత్తివచ్చి ముట్టడించిరి. అపుడు మనవా రెల్లరును సైనికులు గావలసివచ్చెను. డేనియల్ బూ నకు మహవేటకాడు సేనానయకుల వాడుగ నియమింపబడెను. జనరల్ క్లార్కు సర్వసేనాధిపత్యము వహించి లోయరు బ్లూలిక్సు దగ్గర శత్రువుల సమరంబున నెది ర్చెను. అతిఘోరయుద్ధ మొకటి ప్రారంభమాయెను. ఇందియనులు తెల్లవారిని బరాజితులజేసి పలుతెఱంగుల వేధింపజొచ్చిరి. బూను కుమారుడు గాయము లనేకములు తగిలి క్షతకలిత శరీరుడాయెను. అతనితండ్రి యాతని నెత్తికొని పలాయితు డగుటకు బ్రయత్నించెను. తదర్థ మతడు పుత్రుని వీపున మోసికొని ప్రక్కనుండుహ్రదంబున దుమికి యీదుకొని పోవ నారంభించెను. ఎదురుగట్టు చేరునంతన ఆబాలు డుసురులు దొరగెను. అచట నిలిచి తిరిగిచూడ నిందియనులు వెన్నంటి ప్రవాహజలంబుల దేలుకొని వచ్చుచుంట విశద మాయెను. తనప్రాణముల గాపాడికొనుటకై యతడు దిట్టతనము వహించి. దనపట్టిక ళేబరంబు నట్టె దిగవైచి పరువిడవలసివచ్చెను. అట్లు పఱువిడి సురక్షితముగ నతడు బ్రయంటు ష్టేషను జేరెను. ఈ మధ్యకాలమున నిందియనులు ముగ్గురు పడుచుల జెరబట్టి గొంఫోయిరి. అం దొక్కతె బూను కొమార్తె. ముగ్గురును బూన్సుబరో గ్రామమునకు జేరినవారు. వారు కెంటకీ నదియం దొక చిన్న యోడపై విహరింపుచుండి దూర తటంబు వెరిసి యొడ్డుతాకిరి. అప్పుడు సామీప్యకుంజపుంజంబుల నుండి తటాలున నిందియనులు వెలువడుట గాంచి యా యాడుబిడ్డలు మృత్యుసాన్నిధ్యంబున కీడ్వబడినతెఱంగున భయవిహ్వలమానసలై ఘనస్వనంబున మొఱ్ఱోయని కేకవైచి యాకోట యందలిజనుల చెవు లవియ జేసిరి. మనవారును ద్వరితగతి సాయమొనర్ప వెలువడిరి గాని వా రాయోడ చేరునప్పటికి కిందియనులు పిల్లలగొని కడుదవ్వున కఱగి యుండిరి. రాత్రి యైనందున వారిని దఱుముకొని పోవుట యసాధ్యమయ్యెను. కావున బలముల జేర్చుకొని మనవా రిందియనుల బొరికొల్పి తమబిడ్డల గాపాడుకొను నుద్యమమున వేకువజామున బయలుదేఱిరి. వారు నలుబదిమైళ్లు వెదకివెదకి కట్టకడపట లోకభాంధవుడు పశ్చిమాంబుధిజేర నాతనికై వగచు జంతుసంతానంపు దు:ఖపుంజంబు వ్యాపించుచున్నదో యనుతెఱంగున తిమిరంబులు దట్టము లగుసమయంబున రాత్రిభోజనంబునకై పచనకార్యంబు లొనరించుకొన దండు విడిచిన యిందియనుల గాంచిరి. కాంచి తా మచట నుండుట కనిన నిందియను లాపడుచుల ప్రాణములు గొందు రేమో యనివెఱచి వారి కట్టి కార్య మొనర్చుటకు గాల మొసంగక హటాత్తుగ నొక దెబ్బన బిడ్డల దాకకుండ గురిపెట్టి జడివాన యందలి వడగండ్ల తెఱంగున తుపాకి గుండ్ల కోలాహలంబుగ బఱపిరి. ఇందియనులలో నొక్కని గుండుదెబ్బ చెండాడుటయు వా రెల్లరు నీ మహోత్పాతంబునకు నిలువజాలక చెల్లాచెదరై పడచుల విడనాడి దిక్కు కొక్కడుగ పాఱిపోయిరి." అది యీవిధమున నుప్పొంగుచు జెప్పుచుండును. ఇట్టి కష్టతరానుభవంబుల విషయము లాబ్రహామునం దేలాటి యూహ లొడమజేసినదియు జెప్ప నలవిగాదు. అయిన దన పూర్వీకుల స్థితికంటె దనస్థితి పెక్కు మడుంగు లనుభవ నీయ మనుట మాత్ర మాతనికి దప్పక విశద మై యుండును.

నాబుచరియ గృహమునందే ఆబ్రహాము లింకను చేపలు పట్టుట మొదలగు నాటల నేర్చెను. మిక్కిలి చిన్నవాడుగ నుండునపుడే యత డసామాన్య శక్తి జూపుచుండెను. ఆరు సంవత్సరములనాడే యత డేదుబందుల వేటాడుచుండెను. మఱియు జెట్టు కొమ్మల బట్టుకొని జలాశయంబులపై నూగుచుండు టాతని కత్యానందదాయి. అత డొకనా డీ కార్యమున నుండ నకస్మాత్తుగ బట్టువదలి గభీలున తటాకంబున బడియెను. అతని తోడిబాలు డగు బిల్లి మనస్థైర్యంబు సూపి, జాగ్రత్తపడి, సత్వరమున నతని సేవింపకున్న థామసు లింకను దన పుత్రరత్నంబును, యునైటెడ్ స్టేట్సు దన దేశాధ్యక్ష శిరోమణిని నాడు గోలుపోయి యుండును.

అనేకవిధంబుల నాబ్రహాము తన బుద్ధిచాతుర్యంబులను, శక్తి సాహసంబులను బిల్లతనమునందే చూపి తనసాటి బాలుర కంటె మిక్కిలి సమర్థు డగుట వెల్లడి చేసెను. అతని తల్లి దండ్రు లీ విషయమును గ్రహించి సంతసింపక పోలేదు. రా బోవు ప్రకరణమున నాబ్రహాము లింక నింకొక విషయమున జదువరుల మనంబుల కాహ్లాద మొస గెడనుగాత.

_______

రెండవ ప్రకరణము

బాల్యము.

ఆబ్రహాము తల్లిదండ్రులు నివసించుచుండిన దేశస్థితిని గుఱించి యిదివఱకేవ్రాసియుంటిమి. అప్పుడు దేశమునకు దగిన విద్యాశాలలును, విద్యాశాలలకు దగిన యుపాధ్యాయులును అరుదు. మనదేశమునగూడ గ్రామము లనేకములయందు బళ్లు లేకుండుటయును, ఉన్నచో నైన తగుపంతులవా రుండకపోవుట దటస్తించుటయు సర్వసాధారణము. పూర్వ నాగిరకు లగుప్రజలును నవనాగరికాగ్రగణ్యు లగు ప్రభువులును గల హిందూదేశమే యిరువదియవశతాబ్దంబున నిట్టి దుర్దశయం దుండ నిప్పటి కొక శతాబ్దమునకు ము న్నప్పుడప్పుడ గన్నులు దెఱచుచుండిన యా కెంటకీ సీమయందు విద్యాసాధనము లతి యరు దనిన నేమివింత. అందున లక్ష్మీప్రసాదములేని యదృష్ట హీనులకు సరస్వితి చెలిమి కష్టసాధ్యము. థామసు లింకను రొట్టెముక్కకంటె నెక్కు డాశించినవాం డయ్యును దనబిడ్డల జదివించ బ్రయాసపడు చుండును. మొట్టమొదట