ఆనందమఠము/రెండవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

సమీపమున నుండు గ్రామముపోయి చేరవలయు సని తలంచి బయలు దేఱి యెండలో నడుగిడుటకు కాక మెల్లమెల్లగా సాయంకాలమున కొక చిన్న గ్రామము పోయి చేరిరి. గ్రామము నకు పోయి చేరినతోడనే మహేంద్రుఁడు నీళ్లు తెచ్చి భార్యకును బిడ్డకు నిచ్చి, ఆహారమును సంపాదింపవలయు నని యాలోచించుచుండెను. ఏమి దొరకును ! ఆ గ్రామములో నొకమనిషి యైన కనఁబడ లేదు. పెద్ద పెద్దయిండ్లున్నవి. ఉన్ననేమి? ఎవరును లేరు. మహేంద్రుఁడు తిరిగితిరిగి వేసారినాఁడు. ఏయింటిముందు నిలిచి కేక వేసినను “ఏమి” అను బదులు లేదు. తర్వాత భార్యను జూచి—— నీవు బిడ్డను పెట్టుకొని కొంచెము సేపు ధైర్యము తెచ్చికొని యీయింటి యరుగుమీఁదఁ గూర్చుండియుండుము. నేనుపోయి శ్రీక్రుష్ణుని దయవలన నేక్కడ నైన పశువు లున్నయెడల పాలుపితికి తెచ్చెదను. అని చెప్పి యచ్చట 'రాసులు రాసులుగా పడియున్న పాత్రలలో నొక దానిని గైకొని వెడలి పోయెను.


రెండవ ప్రకరణము

కళ్యాణి చోరుల పాలగుట

మహేంద్రుఁడు వెడలిపోయెను, కల్యాణి బిడ్డను పెట్టుకొని యొక్క తెయే దీపము లేని జనశూన్యమైన యింటియందుఁ గూర్చుండి నలువైపులఁ జూచుచుండెను, మిగుల భయమయ్యెను. ఎక్కడ నెవ్వరును లేరు. మనుష్యశబ్దమే లేదు. కుక్కల నక్కల కూఁతలుతప్ప, వే ఱేదియు వినఁబడదు. తన మనస్సు నందు 'నేనేల వారిని పొమ్మని చెప్పితిని? ఏమి చేయుదును? అని తలంచుచు, లోపలనైన పోయి 'తలుపు మూసికొని యుండెద' నని తలంచికొని లోపలికిఁబోయి తలుపును చూడగా తలుపు లేదు. ఉపాయాంతరము లేక దిక్కుతో చక అట్లే కూర్చుండి భర్త రాకకై నిరీక్షించుచుండెను. ఉన్నట్లుండి తన కెదురుగ నేదోనీడ కంటి కగపడెను. మనుష్యాకృతివలెఁ దోఁచెను. అయినను, మనుష్యుఁడే యని నిర్ధరించుటకు కాకుండెను, అతిశుష్కమై, శీర్ణమై, మిగులనల్లనై, నిర్వాణమై, వికటాకారమై, యుండు మనుష్య జంతువువలె నేదో వచ్చి ముందు నిలువఁబడెను. కొంచెము సేపటికి ఆఛాయాస్వరూపము ఆస్థిచర్మావ శిష్టమై యతిదీర్ఘమైన శుష్క హస్తమును పైకెత్తి యెవరినో సన్న చేసి పిలిచెను. దానింజూచి కల్యాణికి ప్రాణమేపోయినటు లయ్యెను. తర్వాత, మఱోకఛాయాస్వరూపము మున్ను చెప్పినట్లే వచ్చినది, ఇట్లోక దాని వెంబడి మఱోకటిగావచ్చి మున్ను నిలువంబడిన వికటాకృతిపార్శ్వమున వచ్చి నిలువంబడెను. అన్నియు, లోపలఁ బ్రవేశించెను, ఆచీఁక టిల్లు శ్మశానమువలెను, ఆవికృతస్వరూపములు ప్రేతములవలెను కనఁబడెను. అన్నియు కల్యాణి చుట్టువచ్చి నిల్చేను. కల్యాణి మూర్ఛ నొందెను. ఆ వికటస్వరూపులు కల్యాణినీ దానిబిడ్డను ఎత్తుకొని పొలము మీఁదఁబడి యరణ్యమును ప్రవేశించిరి.

అనంతరము, మహేంద్రుఁడు దుత్తలో పాలు తీసికొని వచ్చెను. వచ్చి చూడఁగా కల్యాణి లేదు. అచ్చటచ్చట వెదకి చూచెను. ఎచ్చటను కనఁబడ లేదు. మొదట బిడ్డ పేరు పెట్టి పిలిచెను. తర్వాత భార్య పేరు పెట్టి పిలిచేసు. ప్రత్యుత్తరమే లేదు. వానికి ఏదియు తోఁప లేదు, జీవచ్ఛకమువలె యట్లే నేలపై పరుండినాఁడు.


మూఁడవ ప్రకరణము

కల్యాణి తప్పించుకొనుట

దొంగలు కల్యాణిని ఎత్తుకొనిపోయి విడిచినవనము మిగులమనోహరమై యుండెను. వెలుతురు చొర వీలులేని స్థితిలో నుండెను. ఆరణ్యశృంగారమును వీక్షించుటకు వేయి కన్ను లైనచాలవు. దరిద్రుని హృదయాంతర్గత మైన సౌందర్యమువలె, ఆవనసౌందర్యము అదృష్టమైనదిగ నుండెను. చూచినవారే లేరు. గ్రామములలో ధాన్యము లేకపోయినను వనమునందుమాత్రము పుష్పము లుండెను. పుష్పము లాయంధకారమునందు వెన్నెలవలె నుండెను. దొంగలు, కల్యాణిని దానికూఁతును కోమలమైన తృణశయ్యయందు పరుండఁ జేసి, యండఱు పరివేష్టించి కూర్చుండి పరస్పరము మాటలాడఁ దొడంగిరి. కొంద 'ఱీమెను దీసికొనిపోయి యేమి చేయవలయును?' అనిరి. అంతలోఁ గొందఱు ఈమెయొద్దనుండునగలను ముందే తీసికొనియైన' దనికి. మఱికొందఱు 'దాని నంతయు భాగించుకొనవలయు' ననిరి. అట్లే భాగించికొనిరి. ఒక దొంగ'వెండి బంగార మెందులకు? ఎంతటి మంచినగ లిచ్చినను నొక పిడికెడు కూడు దొరకుట 'లేదు. ఆఁకలిచే ప్రాణము పోవుచున్నది. ఈదినము ఆకులను తింటిని. నాకు నగ లేల?' అనెను.