ఆనందమఠము/మొదటి ప్రకరణము
మొదటి ప్రకరణము
మహేంద్రసింహుని ప్రవాసము.
సుమారు వేయియు నేడువందలడెబ్బదిమూఁడవ (1773) సంవత్సరము గ్రీష్మకాలమున పదచిహ్న మను గ్రామమునం దొక్కనాఁడు ఎండవేఁడిమి మహాబలముగా నుండెను గ్రామమో పెద్దది. వేలకొలఁది యిండ్లున్నవి. అయినను గ్రామమునం దొకఁడైనను కవఁబడలేదు. చాలు చాలుగా అంగళ్ల వీథులు, పెద్దమార్కెట్, ఒక్కొకవీథిలోను వేలకొలఁదిపూరి యిండ్లు, వానిలో పెద్దవిగను చిన్నవిగనుండు మేడలును కలవు. ఆదిన మెచ్చటను నిశ్శబ్దమే. అంగళ్లు మూసియుండెను. ఆ దినము సంతచేరువారము సంతలోను ఎవరును లేరు. భిక్షమునకు వచ్చువారును ఆదినము రా లేదు. నేఁతగాండ్రు, ముగ్గములను కట్టివేసి యెచ్చటికో పోయి యేడ్చుచుండిరి. రైతులు గొడ్డుగోదలను విడిచిపెట్టి బిడ్డలతోఁగూడి యెక్కడికో పోయిరి. పాఠశాలలను మూసివేసి ఉపాధ్యాయులు పరుగిడిపోయిరి. బిడ్డలకుఁగూడ గట్టిగా నేడ్చుటకు దైర్యము లేదని తోఁచెను. రస్తాలలో నొక్కడైనఁ గనఁబడఁడయ్యె. గుంటలును చెఱువులును విజనమై యుండెను. ఇంటిముంగిళ్లలోను మనుష్యులు లేరు. చెట్లలోఁగూడ పక్షులు లేవు. కొట్టములలో నొక పసరమైన లేదు. కేవలము శ్మశానమువలె కుక్కలు నక్కలు తిరుగుచుండినవి. ఒక పెద్ద మేడ; ఆ యింటి సోపానములు దూరముగ నుండి చూచినను గనఁబడుచుండెను. ఆగృహారణ్యమధ్యమునందాసౌధము పర్వతశిఖరమువలె కనఁబడుచుండెను. పోయి చూడఁగాఁ కవాటబంధనము చేసియుండెను. కేవలనిశ్శబ్దము. గాలిపోనుగూడ దారిలేదు. ఇల్లు మిట్టమధ్యాహ్నమునందును చీకటిగా నుండెను. ఆచీఁకటిలో, అర్ధరాత్రిలో, వికసించిన కుసుమయుగళమువలె దంపతు లిద్దఱుకూర్చుండి యాలోచించు చుండిరి. మహాక్షామము ప్రాప్తమైనది.
వేయియు నేడువందల డెబ్బది యొకటవ (1771)సంవత్సరమునందు పంట చక్కఁగా పండ లేదు. ఆకారణముచే మఱుచటిసంవత్సరమున ధాన్యము ధర హెచ్చైనది. జనులకు మిగుల కష్టము సంభవించెను. దొరతనము వారును దమకుఁ జేరవలసిన పన్నుకై ప్రజలను కష్టపెట్టి గొడ్డుగోదలు నేలలు జప్తి చేసి వసూలు చేసికొనిరి. ఇందువలన బీదలు దినమున కొక పూట భోజనము చేయుచు ప్రాణమును బిగబట్టుకొని యుండిరి. డెబ్బదిమూఁడవ సంవత్సరమునందు మంచి వానలు కురిసెను, ఆసంవత్సరమున జనులు దేవునికి మనయెడ దయ కలిగినదని చెప్పుచుండిరి. కొందఱు కష్టము తీఱె నను కొనుచుండిరి రైతులు సంతోషముతో వ్యవసాయము చేయఁ దొడంగిరి, రైతుల భార్యలు నగలు చేయవలసిన దని భర్తలను పీడించుచుండిరి. అయినను, 'వెనుకటి పైరుచేయు కాలములో నొక చినుకైనను పడలేదు. పై రంతయు నెండిపోయెను. ఒక్క గింజయైనను చేతికి రాలేదు. ఎక్కడనో యొక చోట కొంచెము ధాన్యము పండెను. సర్కారు వారు ఆ ధాన్యమును తమసైన్య ముకొఱకై రొక్క మిచ్చి తీసికొనిరి. జనులకు తినుటకు అన్నము లేకపోయెను. మొదట ఒకపూట ఉపవాసము చేయుటకు ప్రారంభించిరి. ఆకాలమున మహమ్మద్ రేజఖా౯ అనువాఁడు పన్ను వసూలు చేయు అధికారిగా నుండెను. వాఁడీసమయమున సర్కారు వారికి అధికాదాయము కనఁబఱిచి తాను వారి దయకు పాత్రుఁడు కావలయునని తలంచి మామూలుపన్ను కంటే నూటికి పదిరూపాయలు ఎక్కువ శిస్తు విధించినాఁడు. ఇందువలన బంగాళా దేశమంతయు అల్లకల్లోలముగ నుండెను.
జనులు బిచ్చ మెత్తుటకు ప్రారంభించిరి. దుర్భిక్ష కాలమున భిక్షము పెట్టువా రెవరు? ఆనంతరము ఉపవాసము చేయు చుండిరి. పదంపడి రోగములకు పాలైరి. తర్వాత గొడ్డుగోదలను విక్రయించిరి. ఆవల నాఁగళ్లు మొదలైన వ్యవసాయోపకరణములను అమ్మిరి. అటుపిమ్మట, విత్తనములకై యుంచు కొనియుండిన ధాన్యమును తినిరి తదనంతరము నేలలు ఇండ్లు విక్రయించిరి. ఆమీఁద నగలను, గుడ్డలను విక్రయించిరి. తుదకు భార్యలను బిడ్డలను సైతము విక్రయించిరి ఇంకేమి మిగిలి యున్నది? ఏదియు లేదు. అయినను, పెండ్లాము బిడ్డలను విక్రయించినను కొనువారు లేరు వారిని పోషించుటకు మార్గమేది? అందఱును విక్రయించువారేయైరి. తీసుకొనువారు మాత్రము లేరు. అన్నము లేక ఆకు లలములు తినుట కుపక్రమించిరి. పచ్చిగడ్డిని, పశువులను, పక్షులను, కుక్కలను, నక్కలను, పిల్లు లను, ఎలుకలను, ఉడుతలను, పందికొక్కులను తినిరి. అన్నియు తినియైనవి. మిగిలిన దేదియు లేదు, ఇఁక నేమి చేయవచ్చును? అనేకులు పరదేశములకుఁ బోయిరి. అచ్చోటఁగూడ అన్నము లేనందున అనేకులు చచ్చిరి, కొందఱు తినరాని వస్తువుల నంతయు తిని దానిచేఁ గలిగిన రోగములవలన మహాకష్టమనుభవించి ప్రాణత్యాగము చేసిరి.
రోగాద్యుపద్రవములకు మంచి సమయము దొరకెను. జ్వరము, విషూచి, క్షయము, స్ఫోటకము మొదలగు రోగములు కలిగెను. ఒక్కస్ఫోటక వ్యాధి చేతనే అనేకులు గతించిరి. ఏయింటఁ జూచినను చావే; ఎచ్చోటఁ జూచినను రోదన ధ్వనియే. అట్టి కాలమున నొకరి కొక రెట్లు ఉపచరింతురు? ఊఱడింపఁ జేయుదురు ఒకరినొకరు చూచుటకే సాధ్యము కాకుండెను. చచ్చి వారిని మోయువారే లేకపోయిరి. అతి రమణీయసౌధములయందు రోగము వచ్చినవారు అచ్చటనే పడి పరితపించి ప్రాణము విడిచిపెట్టిరి. స్ఫోటకము కనుపించిన తోడనే వారి నక్కడనే విడిచి పెట్టి తక్కినవారు భయముచే పరుగిడి పోవుచుండిరి.
పదచిహ్న గ్రామమునందు మహేంద్ర సింహుఁడను ధనికుఁడుండెను. ఈ క్షామ కాలమున ధనికుఁడును నిర్ధనికుఁడేకదా. దుఃఖపూర్ణ సమయమునందు వానిస్వజనులును, పరిజనులును వ్యాధిచేఁ పీడింపఁబడిన వారై యందఱును వెడలిపోయిరి. కొందఱు మృతిఁ జెందిరి. ఆగొప్ప మేడయందున్న యనేకజనులలో వాఁడును, వాని భార్యయు, వాని కూఁతురు పసిపిల్లయు, చావునకు తప్పియుండిరి.
మహేంద్ర సింహుని భార్య కల్యాణి, ఆలోచన చేయుటనుమాని, తానే పాలుపిండి కాఁచి పిల్లకుపోయుచు, ఆవులకు మేఁత వేసి నీళ్లు పెట్టుచు నుండెను. ఒకనాడు మహేంద్ర సింహుడు భార్యను జూచి —— ఇట్లేన్నాళ్లు నీవు చేయఁగలవు ? అనెను.
కల్యాణి ——చాలాదినములు జరుగదు. జరిగినన్నాళ్లు జరుగనిండు. పిమ్మట తాము బిడ్డను పిలిచికొని నగరమునకు పోయి చేరవలసినదే.
మహేంద్ర —— నగరమునకుఁ బోయి చేరవలసినపుడు నిన్నేల నే నింత శ్రమ పెట్టవలయును. ఇపుడే యెందులకుఁ బోఁగూడదు, బయలు దేఱుము; పోవుదము.
తర్వాత ఈ విషయమై భార్యాభర్త లిర్వురకును విశేష చర్చ జరిగెను.
కల్యాణి —— నగరమునకుఁ బోయిన మేలే.
మహేంద్ర —— పేరేమో రాజనగరము, అది వీరభూమికి రాజధానిగా నున్నది. అచ్చటను ఇదే యవస్థ, జనులు లేరు. ప్రాణరక్షకు ఉపాయము లేనే లేదు.
కల్యాణి —— అట్లయినచో మూర్షిదాబాదు, కాశీంబజారు, కలకత్తా, ఈ ప్రాంతములలో నెచ్చటికైనను బోయిన ప్రాణరక్షణ కలుగును. కనుక, మనము పోయియే చేరవలయును. ఇచ్చట బ్రదుకలేము.
మహేంద్ర —— ఈయిల్లు మాతాత ముత్తాతల కాలము నుండి యున్నది. పరంపరగా సంపాదించిన సకల సంపదలు నిచ్చటనే యున్నవి. మనము విడిచి పెట్టిపోయినయెడల సర్వమును దొంగలు దోఁచికొని పోవుదురు. కల్యాణి —— దొంగలు దోఁచుకొని పోవుకాలము వచ్చినపుడు మన మిద్దఱముండి చేయున దేమి? ప్రాణమే పోయిన మీఁద సంపద ననుభవించువా రెవ్వరు? కూడినంతవఱకు భద్రము చేసి పోదము, బ్రదికియున్నచో వచ్చి యనుభవింప వచ్చును.
మహేంద్ర——నీవు నడుపఁగలవా? నీచేత నగునా ! బోయిలందఱు చచ్చిపోయిరి. బండియున్నదిగాని యెద్దులు లేవు. ఎద్దు లున్నను బండి లేదు. రెండు నున్న యెడల మనిషి లేఁడు. ఒకటియున్న మఱోకటి లేదు. కావున నడిచిపోవలసినదే.
కల్యాణ్ —— నేను నడిచి వచ్చెదను; తాము చింతింప నక్కఱ లేదు.
ఇట్లు చెప్పుచు కల్యాణి తనమనస్సున, 'నేను నడువ లేక మార్గ మధ్యమున గతించినను, వీ రిద్దఱైనను ప్రాణముతోఁ బోయి నగరము చేరనీ' యని తలంచెను.
మఱునాఁ డుదయమున కొద్దిగా ధనమును గైకొని, ఇంటికి బీగము వేసి, పసులను విప్పి విడిచి పెట్టి, బిడ్డను చంకనిడి కొని రాజధానికి ప్రయాణమైరి, కొంచెముదూరము పోయి మహేంద్రసింహుఁడు—— మనము పోవునట్టి మార్గము మంచిది కాదు, ఎచ్చటఁజూచినను కొల్లయే, దారిదోపిడి కాండ్ర నేకులు కలరు. చేత తుపాకియున్న మంచిది యని చెప్పి, యింటికిఁ బోయి తుపాకిని తీసికొనివచ్చెను. దీనిని చూచి కల్యాణి —— ఇది మంచిదే, చేత ఆయుధమున్న సమయమున కుపకరించును. కనుక నేనును పోయి యొక యాయుధమును తీసికొని వచ్చెద నని చెప్పి, బిడ్డను మగనిచేతి కిచ్చి, యింటిలోపలికి పోవుచుండెను. మొదటి ప్రకరణము
15
అప్పుడు మహేంద్ర సింహుఁడు “నీవు ఏయాయుధ మును తీసికొని రాఁగలవు?" అనెను.
ఇంటిలోపలికి బోయి కల్యాణి, ఒకబరిణెను దాఁచికొని వచ్చెను. ఇంతకుమురువే యేదేని కష్టము సంభవించినప్పుడు ప్రాణాత్యాగము చేసికొనవచ్చు నని తలంచి విషమును సంగ్ర హించి యుంచెను, ఆబరిచెయే యది.
జ్యేష్ఠమాసము, ఎండ వేడిమి చెప్పతరము కాదు. భూమి నిప్పున నుండెను. ఆకాశము కాఁగిన తామ్రమువలె నుండెను. నేలపై కాలూనినయెడల బొబ్బలు పొక్కు చుండెను. కల్యాణీ యెండతాపమునకు తాళ్ళ శరీరమంతయు చెమటచే తడిసినదై, బడలి, నిలువనీడ లేక, అక్క డక్కడ నెండియున్న చెట్లనీడల నిలుచుచు, ఒకటిదానికొకటి చాలాదూరములోనున్న గుంటలలోని బురదనీళ్లు త్రాగుచు, మహాకష్టముతో నడిచెను. బిడ్డ, మహేంద్ర సింహునియుద్ధ నుండెను. వాఁడు బిడ్డకు ఎండ వేడిమి తాఁకనీక మాటిమాటికి గుడ్డతో విసరుచుండెను. ఆమార్గమున శ్యామలపత్రములతో శోభితమై సుగంధకుసుమయుక్తమైనట్టి లతా వేష్టిత మైన యొక వృక్షచ్ఛాయయందు వారిర్వురును గూర్చుండి విశ్రమించిరి. మహేంద్రుఁడు కల్యాణిశ్రమసహనమును గాంచి, ఆశ్చర్య మొంది గుడ్డను తడిపి తెచ్చి ముఖముమీఁదను కాళ్లమీఁదసు పిడిచి తాపోపమనము చేసెను.
కల్యాణికి కొంచెము బడలిక తగ్గాను. అయినను, దంపతు లిర్వురుకు ఆకలిచే డస్సినవారైరి. వీరు ఓర్చుకొనియుండిరి. గాని, బిడ్డ నీరునట్టు చే తపించుచుండెను. బిడ్డనిమిత్త మెచ్చటనైన సమీపమున నుండు గ్రామముపోయి చేరవలయు సని తలంచి బయలు దేఱి యెండలో నడుగిడుటకు కాక మెల్లమెల్లగా సాయంకాలమున కొక చిన్న గ్రామము పోయి చేరిరి. గ్రామము నకు పోయి చేరినతోడనే మహేంద్రుఁడు నీళ్లు తెచ్చి భార్యకును బిడ్డకు నిచ్చి, ఆహారమును సంపాదింపవలయు నని యాలోచించుచుండెను. ఏమి దొరకును ! ఆ గ్రామములో నొకమనిషి యైన కనఁబడ లేదు. పెద్ద పెద్దయిండ్లున్నవి. ఉన్ననేమి? ఎవరును లేరు. మహేంద్రుఁడు తిరిగితిరిగి వేసారినాఁడు. ఏయింటిముందు నిలిచి కేక వేసినను “ఏమి” అను బదులు లేదు. తర్వాత భార్యను జూచి—— నీవు బిడ్డను పెట్టుకొని కొంచెము సేపు ధైర్యము తెచ్చికొని యీయింటి యరుగుమీఁదఁ గూర్చుండియుండుము. నేనుపోయి శ్రీక్రుష్ణుని దయవలన నేక్కడ నైన పశువు లున్నయెడల పాలుపితికి తెచ్చెదను. అని చెప్పి యచ్చట 'రాసులు రాసులుగా పడియున్న పాత్రలలో నొక దానిని గైకొని వెడలి పోయెను.
రెండవ ప్రకరణము
కళ్యాణి చోరుల పాలగుట
మహేంద్రుఁడు వెడలిపోయెను, కల్యాణి బిడ్డను పెట్టుకొని యొక్క తెయే దీపము లేని జనశూన్యమైన యింటియందుఁ గూర్చుండి నలువైపులఁ జూచుచుండెను, మిగుల భయమయ్యెను. ఎక్కడ నెవ్వరును లేరు. మనుష్యశబ్దమే లేదు. కుక్కల నక్కల కూఁతలుతప్ప, వే ఱేదియు వినఁబడదు. తన మనస్సు