ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర/ప్రవేశిక

వికీసోర్స్ నుండి

1

ప్రవేశిక

భారతదేశంలోని పెద్ద రాష్ట్రాల్లొ ఆంధ్రప్రదేశ్ ఐదవ స్థానాన్ని ఆక్రమించింది దీని వైశాల్యం 2,75,909 చ. కి. మీ. దాదాపు 54 మిలియన్ల (1981) జనాభాను కల్గివుంది. వైశాల్యంలోను, జనాభాలోను ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారత రాష్ట్రాల్లోకెల్లా అతి పెద్దది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతాలుగ తూర్పున బంగాళా ఖాతము, ఉత్తరాన ఒరిస్సా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు, దక్షిణాన తమిళనాడు, పశ్చిమాన కర్ణాటక, మహారాష్ట్రలు ఉన్నాయి. 960 కి. మీ సుదీర్ఘమైన తీరప్రాంతాన్ని కల్గి ఉంది. దేశంలో పెద్ద నౌకా కేంద్రాల్లో ఒకటైన విశాఖపట్నం నౌకా కేంద్రం ఈ రాష్ట్రంలోనే ఉంది. భారత నౌకాదళపు తూర్పు విభాగపు కేంద్రంగాను, దేశంలో ఏకైక జలాంతర్గాముల స్థావరంగాను విశాఖపట్నం ప్రసిద్ధి చెందింది.

ఇరవై మూడు జిల్లాలు [1] గల ఆంధ్రరాష్ట్రం భౌగోళికంగా మూడు విభాగాలుగా వ్యవహరించబడుతోంది అవి 1 సర్కారు ప్రాంతం లేక తీరాంధ్ర ప్రాంతం, 2 రాయలసీమ, 3 తెలంగాణాలు. సర్కారు, రాయలసీమ ప్రాంతాలు మొదట ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో వుండేవి. తర్వాత 1953 అక్టోబరు 1 వ

ఆంధ్రరాష్ట్రం అవతరించడంతో మద్రాసు నుండి వేరు పడ్డాయి. తెలంగాణా ప్రాంతం నైజాం పాలనలోని హైదరాబాదు సంస్థానంలో ఉండేది. కాని 1956 నవంబరు 1 న హైదరాబాదు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించడంతో తెలంగాణా ప్రాంతం విశాలాంద్రలో భాగంగా మారిపోయింది.

ఆంధ్రప్రదేశ్ లో అత్యధికులు వ్యవహరించే భాష తెలుగు దాదాపు 88 శాతం ప్రజలు తెలుగు భాషలో వ్యవహరిస్తారు. రాష్ట్రంలో తెలుగు తర్వాత రెండవ స్థానాన్ని ఉర్దూ భాష ఆక్రమించింది. దాదాపు 7 శాతం ప్రజలు ఉర్దూ భాష మాట్లాడుతారు. దాదాపు 88 శాతం ప్రజలు హిందువులు కాగా 7 శాతం ముస్లింలు, 4 శాతం క్రైస్తవులు వున్నారు. సిక్కులు, బౌద్ధులు, పారశీకులు కలసి ఒక శాతం ఉన్నారు.

పూర్వచరిత్ర

క్రీ. పూ. 1000 సంవత్సరాల నాటిదైన ఐతరేయ బ్రాహ్మణంలో మొట్టమొదటి సారిగా ఆంధ్రులను గూర్చిన ప్రశంస కనిపిస్తుంది. సునశ్శేపుని దత్తత తీసుకోవడానికి అంగీకరించిన తన 50 మంది కుమారులను విశ్వామిత్రుడు బ్రాహ్మణవర్గం నుండి బహిష్కరించాడు. ఈ విధంగా బహిష్కరించబడ్డ విశ్వామిత్ర సంతతకి చెందిన వారుగా ఆంధ్రులతో పాటు పుండ్రులు, సవరులు, పుళిందులు, మూతిబుల్ని పేర్కోవడం జరిగింది. మహాభారత యుద్దంలో ఆంధ్రులు, కౌరవుల పక్షాన నిలిచిపోరాడినట్లు తెలుస్తున్నది. ధర్మరాజు చేపట్టిన రాజసూయయాగంలో భాగంగా సహదేవుడు ఆంధ్రరాష్ట్రాన్ని కూడ జయించినట్లు పేర్కొనడం జరిగింది.

ఆంధ్రదేశంలో చారిత్రక యుగం మౌర్యుల పాలన నుండే ప్రారంభమయిందని చెప్పవచ్చు. మౌర్య సామ్రాజ్యంలో ఆంధ్రదేశం ఒక భాగంగా ఉండేది. కర్నూలు జిల్లా యందలి ఎర్రగుడిలో కన్పించే అశోకుని శాసనాన్ని దీనికి నిదర్శనంగా పేర్కొనవచ్చు. చంద్రగుప్తమౌర్యుని ఆస్థానంలో గ్రీకు రాయబారిగా వుండిన మెగస్తనీసు తాను రచించిన 'ఇండికా' అన్న గ్రంధంలో పలుచోట్ల ఆంధ్రులను గూర్చి ప్రస్తావించాడు. ఆంధ్రులు పటిష్టమైన సైనిక వ్యవస్థను కల్గి, సర్వస్వతంత్రులై ఉండేవారని మెగస్తనీసు రచనవల్ల


తెలుస్తున్నది ఇంకా ఆంధ్రులకు దాదాపు 30 కోటలు, ఒక లక్ష కాల్బలము, 2000 అశ్వాలు, 1000 ఏనుగులు ఉండేవని తెలుస్తున్నది.

కణ్వవంశీయుల్లో చివరివాడైన సుశర్మ అను మగధరాజును ఆంధ్రరాజైన శ్రీముఖుడు హతమార్చి మగధ రాజ్యాన్ని ఆక్రమించినట్లు మత్స్య, వాయు పురాణాలు చెపుతున్నాయి. కాని శాతవాహనుల పాలన ఇంకా ముందే (క్రీ. పూ. 236లో) ప్రారంభం అయినట్లు శాసనాధారాలు చెబుతున్నాయి. మౌర్యుల ప్రాభవం క్షీణించిన తర్వాత వారి సామంతులైన ఆంధ్రులు స్వతంత్రతను ప్రకటించారు.

శాతవాహనులు

ఆంధ్రుల పుట్టుపూర్వోత్తరాలు

ఆంధ్రుల పుట్టుకను గురించి అనేక వాదోపవాదాలున్నాయి. ఆంధ్రులు ఆర్యులని, దక్కను ప్రాంతానికి వలస వచ్చి స్థానికులతో కలసిపోయి వారి సంస్కృతిని అలవర్చుకొన్నారని కొందరి భావం కాని ఆంధ్రులు ఆర్యులు కారని, ద్రావిడులేనని, ద్రావిడులు అతి ప్రాచీనకాలం నుండి దేశమంతటా నివసిస్తున్నారని మరికొందరి వాదన

ఆంధ్రుల జన్మస్థానం గురించి గూడా వివాదం ఉంది. ఆంధ్రుల జన్మస్థానం గోదావరి, కృష్ణా నదుల మధ్య ప్రాంతమని కొందరు భావించగా, ఆంధ్రశాతవాహనుల పాలన మొదట మహారాష్ట్రలోని మరధ్వాడ ప్రాంతంలో స్థాపించబడిందని, వారు తమ సామ్రాజ్యాన్ని తూర్పుదిశగా కృష్ణా గోదావరిలోయ ప్రాంతాలకు విస్తరింపచేశారని, పశ్చిమ ప్రాంతంలో తమ ఆధిపత్యం క్షీణించిన తర్వాతనే ఆంధ్రప్రాంతానికి తమ రాజధానిని మార్చారని మరికొందరు పండితులు అభిప్రాయపడ్డారు.

ఆంధ్రులు అసలు శాతవాహనులేనా? అన్న వివాదం గూడా మరొకటి ఉంది. కొందరు పండితులు, శాతవాహనులు ఆంధ్రులు కారని, వారు సర్వస్వతంత్రులైన ఒక రాజవంశీయులని భావించారు. కాని బండార్కర్, రాప్సన్, వి ఎ స్మిత్ వంటి ప్రసిద్ది చెందిన చరిత్రకారులు మాత్రం శాతవాహనులు ఆంధ్రదేశానికి చెందినవారుగానే అభిప్రాయపడ్డారు. ఈ అభిప్రాయనికనుగుణంగా


పురాణాల్లోని ఆధారాల్ని వారు ఎత్తిచూపారు. పురాణాలు శాతవహనుల్ని గూర్చి ప్రస్తావించేటప్పుడు 'ఆంధ్ర దేశీయ', 'ఆంధ్ర జాతీయ' అని వ్యవహరించాయి. అశోకుని శాసనాలు కూడా శాతవాహనుల్ని 'ఆంధ్రభృత్యులు'గా వర్ణించాయి.

శాతవాహనుల పాలన

శాతవాహనుల పాలన ప్రారంభాన్ని గురించి, వారి పరిపాలనా కాలాన్ని గురించి వివిధాభిప్రాయాలు ఉన్నాయి. శాతవాహనుల కాలం క్రీ పూ 6 లేక 5 వ శతాబ్దిలో ప్రారంభం అయివుంటుందని ఆర్ బండార్కర్ అను పండితుడు అభిప్రాయపడ్డాడు. కాని ఈ అభిప్రాయాన్ని చాలామంది పండితులు అంగీకరించలేదు. శాతవాహనుల పాలన క్రీ పూ 221 నుండి క్రీ శ. 218 సంవత్సరాల మధ్య కాలంలో విలసిల్లినట్లు డా ఎం రామారావు అభిప్రాయపడ్డారు.

శ్రీముఖుడు (క్రీ. పూ. 221 - 198)

అశోకుని మరణం తర్వాత మౌర్య సామ్రాజ్యం క్రమంగా క్షీణించింది. ఉత్తర భారతంలోని అస్థిరతను ఆసరాగాతీసుకుని శాతవాహనులు తమ స్వతంత్రతను ప్రకటించారు. శాతవాహన రాజుల్లో మొదటి వాడు శ్రీముఖుడు. ఇతని కాలంలో శాతవాహన రాజ్యం పశ్చిమాన దక్కను ప్రాంతం వరకు వ్యాపించింది. శ్రీముఖుడు దాదాపు 23 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. శ్రీముఖుని తర్వాత అతని తమ్ముడు కృష్ణ క్రీ పూ 198 లో రాజ్యాధికారం చేపట్టాడు.

కృష్ణ(క్రీ. పూ. 198 - 180)

కృష్ణ తన సోదరుని అడుగుజాడల్లో రాజ్యాన్ని పాలించి పశ్చిమాన నాసిక్ వరకు రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ఇతని పాలన గురించిన విశేషాలు మనకంతగా లభించలేదు. నానేఘాట్ చెక్కడాల్లోని చిత్రాల్లో సైతం కృష్ణ చిత్రం కన్పించదు. కృష్ణ తర్వాత రాజ్యానికి వచ్చిన మొదటి శాతకర్ణి భార్య నాగానిక నానేఘాట్‌లో చిత్రాల్ని చెక్కించింది. తన సంతానం, తండ్రి, భర్త, శాతకర్ణి తండ్రి చిత్రాల్ని చెక్కించిన ఈమె కృష్ణ చిత్రాన్ని చెక్కింపకపోవడం ఆశ్చర్యం వేస్తుంది. దీనివల్ల కృష్ణ సింహాసనాన్ని అక్రమంగా చేజిక్కుంచుకుని ఉంటాడని కొంతమంది పండితులు అభిప్రాయపడ్డారు.

శాతకర్ణి (క్రీ. పూ. 180 - 170)

శాతకర్ణి భార్య నాగానిక. ఈమెనే నాయనిక అని కూడా అంటారు. ఈమె వేయించిన నానేఘాట్ శాసనం వల్ల శాతకర్ణి పాలనను గురించిన చాల విషయాలు మనకు తెలుస్తున్నాయి. నాగానిక మహారధి 'త్రాణకైరో' కుమార్తె. ఈమె రాచకార్యాల్లో కూడా తన ప్రభావాన్ని చూపగల్గింది. మగధ నేలిన పుష్యమిత్రసుంగునికి, కళింగనేలిన కారవేలునికి శాతకర్ణి సమకాలీనుడు. పశ్చిమ మాల్వా, అనుప లేక నర్మదా నది లోయ ప్రాంతాన్ని, విదర్బను శాతకర్ణి ఆక్రమించినట్లు నానేఘాట్ శాసనం తెలియజేస్తుంది. ఈ ప్రాంతాల్ని జయించినందుకు విజయ చిహ్నంగా శాతకర్ణి అశ్వమేధ యాగాన్ని, ఒక రాజసూయాగాన్ని కూడా నిర్వహించినట్లు పై శాసనం తెలుపుతోంది. శాతకర్ణి తనను తాను 'సామ్రాట్టు'గా ప్రకటించుకొని 'దక్షణాపతి', 'అప్రతిహతఃచక్ర' వంటి బిరుదుల్ని దరించాడు. శాతకర్ణి తర్వాత పిన్న వయస్కుడైన ఆయన కుమారుడు వేదశ్రీ రాజ్యానికి వచ్చాడు. నాగనిక తన కుమారుని పేరుతో ప్రభుత్వ వ్యవహారాల్ని సమర్థవంతంగా నిర్వహించింది. వేదశ్రీ యుక్తవయస్సుకు రాకముందే మరణించాడు. తర్వాత వేదశ్రీ తమ్ముడు సతిశ్రీ రాజ్యాధికారాన్ని చేపట్టాడు. వీరిని గురించిగాని, వీరి తర్వాతి రాజులను గురించి తెలిపే ఆధారాలు ఏవీ లేవు. తర్వాత వచ్చిన ముఖ్యమైన రాజుల్లో రెండవ శాతకర్ణి ఒకడు. ఇతడు క్రీ. పూ. 152 నుండి 96 సంవత్సరం వరకు పాలించాడు.

రెండవ శాతకర్ణి (క్రీ. పూ. 152 - 96)

రెండవ శాతకర్ణి సాగించిన సుధీర్ఘమైన పరిపాలన శాతవాహనుల చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా పేర్కొనవచ్చు. ఇతని కాలంలోనే మగధ రాజధానియైన పాటలీపుత్రం మొదటిసారిగా శాతవాహనుల ఆధీనంలోకివచ్చింది. విదుష, కళింగ రాజ్యాల్ని కూడా ఆక్రమించి శాతకర్ణి తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేశాడు. కాని తన చివరి రోజుల్లో శాక్యులు పశ్చిమ దక్కను ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. శాతకర్ణి తర్వాతి రాజుల గురించి మనకంతగా తెలియదు. తర్వాత వచ్చిన రాజుల్లో హాలుడు ముఖ్యుడు. ఇతడు క్రీ. శ. 19 నుండి 24 వ సంవత్సరం వరకు రాజ్యపాలన చేశాడు. హాలుడు (క్రీ. పూ. 19 - 24)

హాలుడు శాతవాహన రాజుల్లో 17 వ వాడు. వాత్స్యాయనుని కామసూత్రంలోను, రాజశేఖరుని కావ్యమీమాంసలోను హాలుని గూర్చిన ప్రశంస ఉంది. హాలుడు సాహిత్యాన్ని, కళల్ని ఆదరించి పోషించాడు. స్వయంగా ప్రాకృతభాషలో 'సప్తశతి' అనే గ్రంథాన్ని హాలుడు రచించాడు. బృహత్కధ రచయితయైన గుణాడ్యుడు హాలునికి సమకాలికుడు. చాలమంది కవులకు, పండితులకు ఆశ్రయం కల్పించడం వల్ల హాలునికి 'కవివత్సలుడు' అనే బిరుదు వచ్చింది. హాలుడు సప్తగోదావరి - భీమనదుల ఒడ్డున శ్రీలంక రాజకుమార్తెను పెళ్ళాడాడు. హాలుని తర్వాత శాతవాహనుల చరిత్ర మరల మరుగున పడింది. శాతవాహనులు మధ్య, పశ్చిమ భారతాల్లో తమ అధికారాన్ని కోల్పోయారు. వీరి పాలన ఆంధ్రదేశంలో మొదట తమ అధీనంలో ఉండిన ప్రాంతాలవరకే పరిమితమయింది.

మలి శాతవాహనులు

గౌతమీపుత్ర శాతకర్ణి (క్రీ. శ. 78 - 102)

ప్రాచీన భారతదేశపాలకుల్లో గౌతమీపుత్ర శాతకర్ణి పేరెన్నికగన్నవాడు. ఇతడు శివస్వాతి, గౌతమీ బాలశ్రీలకు గల్గిన పుత్రరత్నము. శాతకర్ణి వ్యక్తిత్వాన్ని గురించి, అతని ఘనవిజయాల్ని గురించి బాలశ్రీ నాసిక్ శాసనం చక్కగా తెలియచేస్తుంది.

గౌతమీ పుత్రశాతకర్ణి రాజ్యాధికారానికి వచ్చేనాటికి దేశపరిస్థులు నిరాశాజనకంగా ఉండేవి. భారత గంగా మైదానంలోకి కుషాణులు చొచ్చుకు రావడం మొదలయింది. పశ్చమ దక్కను ప్రాంతం క్షాహరాటుల చేతుల్లోకి పోయింది. హిందూమతాన్ని స్వీకరించి భారతదేశంలో స్థిరపడ్డ విదేశీ తెగలైన శాక్యులు, యవనులు, పహ్లవులు దక్కను ప్రాంతంలో శాంతిభద్రలకు భంగం కలిగించారు. ఈ పరిస్థితుల్లో శాతకర్ణి ధైర్యాన్ని కోల్పోక పరిస్థితులకు అనుగుణంగా స్పదించి శాక్యుల్ని, యవనుల్ని, పహ్లవుల్ని ఓడించాడు. నహాపనుని క్షాత్రపవంశాన్ని సమూలంగా నాశనం చేశాడు. శాతవాహన వంశ ప్రతిష్ఠను తిరిగి నెలకొల్పాడు. శాతకర్ణి అనుప, అపరంత, సౌరాష్ట్ర, కుకుర, అవంతి రాజ్యాల్ని


నహాపనుని నుండి స్వాధీనం చేసుకున్నాడు. ఇవేకాక విదర్బ, ఆస్మాక, మూలక రాజ్యాల్ని కూడా తన అధీనంలోకి తెచ్చాడు. ఈ ప్రాంతాలు పశ్చిమ భారతంలోను, దక్కనులోను (ప్రస్తుత గుజరాత్, మహారాష్ట్ర) ఉన్నాయి. దక్షిణాన కృష్ణా నది నుండి ఉత్తరాన మాల్వ, కధియ వారు ప్రాంతాల వరకు, తూర్పున బంగాళాఖాతం నుండి పశ్చిమాన కొంకణ ప్రాంతం వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేశాడు. 'త్రి సముద్రతోయ పీతవాహన' (మూడు సముద్రాల నీరు త్రాగిన గుర్రాలు కలవాడు) అనే బిరుదును వహించాడు. దీన్ని బట్టి శాతకర్ణి బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూమహాసముద్ర పర్యంతం దండయాత్రను నిర్వహించినట్లు తెలుస్తున్నది.

సాహిత్యం

శాతవాహన రాజులు సంస్కృత, ప్రాకృత భాషా సాహిత్యాల్ని చక్కగా పోషించారు. శాతవాహన రాజైన హాలుడు, 'సప్తశతి' అనే గ్రంధాన్ని ప్రాకృతంలో రచించాడు. గుణాఢ్యుడు 'బృహత్కధ'ను పైశాచీమాండలికంలో వ్రాశాడు.

వర్తక వ్యాపారాలు

శాతవాహన రాజులు దేశంలోనే కాక విదేశాలలో సైతం వర్తక వ్యాపారాలు నడిపేవారు. శాతవాహనుల నాణాలపై కన్పించే ఓడబొమ్మ వారి సముద్ర వర్తకానికి నిదర్శనంగా పేర్కొనవచ్చు. కృష్ణానదీలోయ ప్రాంతంలో దొరకిన రోమను నాణేలు ఈ అభిప్రాయానికి మరింత బలం చేకూర్చాయి.

ఆర్ధిక రంగంలో 'శ్రేణులు' అభివృద్ధి చెందడం శాతవాహనుల పాలనలోని ఒక ముఖ్యలక్షణంగా భావించవచ్చు. ఈ శ్రేణులు ఈనాటి బ్యాంకుల వలె పనిచేసి వర్తకాభివృద్ధికి దోహదం చేశాయి.

నాగార్జునుడు

మాధ్యమిక వాద సిద్దాంతకర్తయైన ఆచార్య నాగార్జునుని ప్రసక్తి లేకుండా శాతవాహనుల చరిత్రకు పరిపూర్ణత చేకూరదని చెప్పవచ్చు. ప్రాచీన కాలంలో శ్రీపర్వతంగా వ్యవహరించబడ్డ ఈనాటి నాగార్జున కొండలో నాగార్జునుడు నివశించాడు. కొంతకాలం పాటు గౌతమీ పుత్ర యజ్ఞశ్రీ ఆస్థానాన్ని కూడ అలంకరించాడు. నాగార్జునుడు తత్త్వశాస్త్రవేత్తగానే కాక రసాయన శాస్త్రవేత్తగా


కూడ ప్రసిద్ధి చెండాడు. శాతవాహనుల సాంస్కృతిక సేవ విశేషంగాను, బహుముఖంగాను సాగిందని చెప్పవచ్చు.

గౌతమీ పుత్ర శాతకర్ణి హిందూమతాభివృద్ధికి విశేషంగా కృషి చేశాడు. హిందూ సాంఘీక వ్యవస్థలోని నాల్గు వర్ణాల్ని సమాన గౌరవంతో ఆదరించాడు. ఇతనితో పాటు రాణియైన వాసిష్ఠ ధర్మోద్దరణకు అంకితభావంతో కృషి చేసింది. రాజమాతయైన గౌతమీ బాలశ్రీ చాల గొప్ప వ్యక్తిత్వాన్ని కల్గిఉండేది. శాతకర్ణి తన్నుతాను 'గౌతమీపుత్రుడు'గా సగర్వంగా పిలుచుకునేవాడు. శాతకర్ణి తర్వాత ఆయన కుమారుడు వాసిష్ఠ పుత్ర పులోమావి రాజ్యాధికారానికి వచ్చి క్రీ. శ. 102 నుండి 130 సంవత్సరం వరకు పాలించాడు. తన తండ్రి ఇచ్చిన విస్తృత సామ్రాజ్యాన్ని పులోమావి చక్కగా కాపాడగల్గాడు. వాసిష్ఠ పుత్రపులోమావి తర్వాత శాతకర్ణి రాజ్యానికి వచ్చి క్రీ. శ. 130 సం. నుండి 154 సం. వరకు పాలించాడు. శాక్య రాజైన రుద్రదామనుడు శాతకర్ణిని ఓడించి శాతవాహన సామ్రాజ్యంలోని కొన్ని ప్రాంతాల్ని స్వాధీనం చేసుకున్నాడు.

గౌతమీ పుత్ర యజ్ఞశ్రీ (క్రీ. శ. 174 - 203)

ప్రసిద్ది చెందిన శాతవాహన రాజుల్లో చివరివాడు గౌతమీపుత్ర యజ్ఞశ్రీ. రుద్రదామనుని మరణం తర్వాత ఉజ్జయినిలో చెలరేగిన అల్లకల్లోల్లాల్ని ఆసరాగా తీసుకుని యజ్ఞశ్రీ ఆ రాజ్యంపై దండెత్తాడు. పశ్చిమ, మధ్య భారతాల్లోని చాల ప్రాంతాల్లో శాతవహనుల పూర్వ వైభవాన్ని నెలకొల్ప గలిగాడు.

అమరావతి స్తూపాన్ని విస్తృత పరచి మహా చైత్యానికి చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటు చేశాడు. యజ్ఞశ్రీ ఆస్థానంలో ఆచార్య నాగార్జునుడు కొంత కాలం పాటు వున్నాడు. యజ్ఞశ్రీ మరణం తర్వాత శాతవాహన సామ్రాజ్యం క్రమంగా క్షీణించింది. క్రీ. శ. 3 వ శతాబ్దికంతా రాజకీయంగా పూర్తిగా తెరమరుగయింది.

శాతవాహనుల సాంస్కృతిక సేవ

క్రీ. పూ 3 వ శతాబ్దినుండి క్రీ. శ 3 వ శతాబ్దివరకు దాదాపు అయిదువందల సంవత్సరాలు సాగిన శాతవాహనుల పాలన భారతదేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా భావించవచ్చు. శాతవాహనుల ప్రాభవానికి ముందు భారతదేశ చరిత్ర అంటే కేవలం ఉత్తర భారతదేశ చరిత్రగా భావించేవారు. ఉత్తరాన నర్మదా


నది నుండి దక్షిణాన తుంగభద్ర వరకు, తూర్పున బంగాళాఖాతం నుండి పశ్చిమాన అరేబియా సముద్రం వరకు గల భూభాగంపై శాతవాహనులు తమ ఆధిపత్యాన్ని చెలాయించడంతో దక్కను ప్రాంతానికి శాంతి సౌభాగ్యాల్ని చేకూర్చిపెట్టారు. ఇదే కాలంలో ఉత్తర భారతంలో విదేశీ దండయాత్రల వల్ల, అంతరంగిక కల్లోలాల వల్ల రాజకీయ అస్థిరత చోటు చేసుకోవడం గమనించ దగ్గది.

శాతవాహనుల పాలన అత్యున్నత దశలో ఉన్నప్పుడు ఈనాటి ఆంధ్ర దేశమే కాక మహారాష్ట, గుజరాతు, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఒరిస్సా, బీహారు రాష్ట్రాల్లోని ప్రాంతాలు సైతం శాతవాహన సామ్రాజ్య పరిధిలో ఉండేవి. వైశాల్యంలో మౌరసామ్రాజ్యం తర్వాత శాతవాహన సామ్రాజ్యాన్ని అతి పెద్దదిగా పేర్కొనవచ్చు.

మతం

శాతవాహన రాజులు వైదిక మతాన్ని అవలంబించారు. వర్ణాశ్రమధర్మం ఆధారంగా ఏర్పడిన చాతుర్వర్ణ వ్యవస్థను పటిష్టం చేశారు. కాని వీరు మతోన్మాదులు మాత్రం కాదు. అశ్వమేధం, రాజసూయం వంటి క్రతువుల్ని నిర్వహించారు. బౌద్ధమతాన్ని ఆదరించడమే కాక చాలమంది శాతవాహన రాణులు బౌద్ధమత విశ్వాసాల్ని ఆచరించారు. వీరు అనేక బౌద్ధ విహారాల్ని, చైత్యగృహాల్ని నిర్మించడానికి సాయపడ్డారు. చైత్యగృహాలు బౌద్ధాలయాలుగాను, విహారాలు బౌద్ధ భిక్షవుల నివాస స్థలాలుగాను ఉపయోగపడేవి.

సమాజం

శాతవాహన రాజులు బ్రాహ్మణులు. వర్ణాశ్రమధర్మానుసారం ఏర్పడ్డ చాతుర్వర్ణ వ్యవస్థను పటిష్టం చేశారు. సాంఘీక వ్యవస్థను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలుగా విభజించడమే గాక, సాంఘీక హోదాననుసరించి కూడ మరో విభజన ఏర్పడింది. ఉన్నతోద్యోగులైన మహారధులు, మహాభోజులు, మహాసేనాపతులు మొదటి వర్గంగా వ్యవహరించబడ్డారు. అమాత్యులు, మహామాత్రులు, భాండాగారికులు, నైగములు, సార్ధవాహులు మొదలగు మధ్యతరగతి ఉద్యోగులు రెండవ వర్గంలో చేరారు. ఇక మూడవ వర్గంలో చిన్న ఉద్యోగులైన లేఖకులు, వృత్తికారులైన సువర్ణకారులు, ఘండికులు ఉన్నారు. తర్వాత లోహవణిజులు,


వార్ధకులు, మాలాకారులు, దాసకులు మొదలగువారు నాలుగోవర్గంగా పరిగణింప బడేవారు.

కళాపోషణ

శాతవాహన రాజులు కళ, వాస్తు శిల్పాల్ని విశేషంగా ప్రోత్సహించారు. ప్రసిద్ధి చెందిన కన్హేరి, కార్ల, నాసిక్ గుహలు, ప్రపంచ కీర్తి బడసిన సాంచి, అమరావతి బౌద్ధ స్తూపాలు వీరి కళా పోషణకు నిదర్శనంగా నిలిచాయి. శాతవాహనుల రాజధానియైన అమరావతి పేరుమీదుగా ఒక భారతీయ కళాశైలి పిలవబడుతున్నది. అదే విధంగా అజంతా గుహల్లో కన్పించే అతిప్రాచీనమైన చిత్రకళాఖండాలు శాతవాహనుల కాలం నాటివే.

కాకతీయులు

క్రీ. శ. 3 వ శతాబ్దిలో శాతవాహనుల సామ్రాజ్యం అంతరించిన తర్వాత ఆంధ్రదేశాన్ని ఇక్ష్వాకులు, తూర్పు చాళుక్యుల వంటి చిన్న చిన్న రాజవంశాలు దాదాపు 700 సంవత్సరాలు పాలించాయి. క్రీ. శ. 11 వ శతాబ్దిలో వరంగల్లులో కాకతీయుల అధికారస్థాపనతో ఆంధ్రుల చరిత్రకు, నాగరికతకు రూపుదిద్దగల నాయకత్వం ఆంధ్రదేశానికి లభించింది.

కాకతీయుల పుట్టుపూర్వోత్తరాల్ని గురించి కూడ వాదోపవాదోలున్నాయి. 'కాకతీయ' అన్న పేరు వరంగల్లు పాలకులు పూజించే 'కాకతి' అను స్థానిక దేవతాపరంగా వచ్చి ఉంటుందని కొంతమంది పండితులు భావిస్తున్నారు. మరి కొందరు 'కాకతి' అనే పట్టణం పేరు నుండి కాకతీయ పదం రూపొంది ఉంటుందని భావిస్తున్నారు. కాని కాకతీయ రాజులు వేంగి దేశాన్నేలిన తూర్పు చాళుక్యుల సామంతులనే విషయంలో మాత్రం పండితులందరు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తూర్పు చాళుక్య రాజైన రెండవ అమ్మరాజు మరణం తర్వాత సామంత రాజైన మొదటి బేతరాజు క్రీ. శ. 1000 సంవత్సరంలో స్వతంత్రతను ప్రకటించి ఒక కొత్త రాజవంశాన్ని స్థాపించాడు. ఇతడు ముఫ్పై సంవత్సరాలు పాలించాడు. బేతరాజు తర్వాత ఆయన కుమారుడు మొదటి ప్రోలయ రాజ్యాధిపత్యాన్ని స్వీకరించాడు. మొదటి ప్రోలయ (క్రీ. శ. 1030 - 1075)

తన తండ్రి మరణంతో క్రీ. శ. 1030 లో సింహాసనాన్ని అదిష్టించిన ప్రోలయ చాల క్లిష్టమయిన సమస్యల్ని ఎదుర్కోవలసి వచ్చింది. తన రాజ్యానికి చోళుల వల్ల, కళ్యాణి చాళుక్యుల వల్ల ప్రమాదం ఏర్పడింది. చక్రకూట రాజైన నాగవంశి తన రాజ్యాన్ని ఆక్రమించే ప్రయత్నాలు చేశాడు. అయినా ప్రోలయ పరిస్థితులకు ఎదురు నిలచి చక్రకూటరాజ్యంపై దండెత్తాడు. ఈరాజ్యపాలకుడైన ధారావశువును ఓడించాడు. ప్రోలయ తన 36 సంవత్సరాల రాజ్యపాలనలో తన రాజ్యాన్ని అన్నివైపులకు విస్తరించగలిగాడు. ప్రోలయ తర్వాత రాజ్యానికి వచ్చిన రెండవ బేతరాజు క్రీ. శ. 1075 నుండి 1110 వరకు రాజ్యం చేశాడు. ఇతని కాలంలో చెప్పుకోదగిన విశేషాలు ఏమీ లేవు. రాజ్య రాజధానిని వరంగల్లు సమీపంలోని అనమకొండకు మార్చాడు. 'త్రిభువనమల్ల' అనే బిరుదును వహించాడు.

రెండవ ప్రోలయ (క్రీ. శ. 1110 - 1158)

ప్రాచీన కాకతీయ రాజుల్లో రెండవ ప్రోలయ ముఖ్యుడు. ఇతని విజయాల్ని గురించి ఇతని కుమారుడైన రుద్రదేవుడు వేయించిన అనమకొండ శాసనంలో వివరంగా వర్ణింపబడి ఉంది. ఇతడు మైలపదేవుని, గోవిందరాజును, గుండయను, జగ్గదేవుని జయించినట్లు విదితమౌతుంది. కాని ఈరాజుల్ని, వారి రాజ్యాల్ని గుర్తించడంలో చాల వాదోపవాదాలు ఉన్నాయి.

రుద్రదేవుడు (క్రీ. శ. 1158 - 1195)

తన తండ్రి రెండవ ప్రోలయ మరణం తర్వాత క్రీ. శ. 1158 లో రుద్రదేవుడు సింహాసనాన్ని అదిష్ఠించాడు. అనమకొండలోని రుద్రేశ్వరాలయంలో రుద్రదేవుడు వేయించిన శాసనంలో అతడు నిర్వహించిన దండయాత్రల్ని గురించి విపులంగా వర్ణింపబడిఉంది. తన రాజ్యం చుట్టు ప్రక్కల ఉన్న చాళుక్య రాజ్య సామంతుల్ని ఓడించినట్లు ఈ శాసనం వల్ల తెలుస్తున్నది. తూర్పున వెలనాడు ప్రభువుతోను, పశ్చిమాన యాదవ రాజులతోను రుద్రదేవుడు అనేక యుద్ధాలు చేసినట్లు తెలుస్తున్నది. రుద్రదేవుడు సాహిత్యాన్ని విశేషంగా ఆదరించాడు. అనమకొండలో గంభీరమైన రుద్రేశ్వరాలయాన్ని నిర్మించాడు. స్వయంగా సంస్కృతభాషలో నీతిసారమనే గ్రంధాన్ని రచించాడు. పాల్కురికి సోమనాధుని వంటి శైవభక్తులకు తన ఆస్థానంలో ఆశ్రయం కల్పించాడు. ఇతని పాలనలోనే రాజ్య రాజధాని అనమకొండనుండి వరంగల్లుకు మార్చబడింది. ఒకవైపు రుద్రదేవుడు తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడంలో నిమగ్నుడై ఉండగా దేవగిరిని పాలించే యాదవరాజులు దక్షిణప్రాంతం వైపు చొచ్చుకు రావడం జరిగింది. జైత్రపాలుడనే యాదవరాజు క్రీ. శ. 1195 లో కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేశాడు. ఈ యుద్ధంలోనే శత్రువును ఎదుర్కొంటూ రుద్రదేవుడు తన ప్రాణాలు వదిలాడు. రుద్రదేవునికి సంతానం లేనందువల్ల ఇతని తమ్ముడు మహాదేవుడు రాజ్యాధికారం చేపట్టాడు.

మహాదేవుడు (క్రీ. శ. 1195 - 1198)

రుద్రదేవుని తమ్ముడైన మహాదేవుడు మూడు సంవత్సరాలు మాత్రం రాజ్యపాలనం చేయగలిగాడు. యాదవుల రాజధానియైన దేవగిరిని ముట్టడించడంలో ఇతడు ప్రాణాల్ని కోల్పోయాడు.

గణపతి దేవుడు (క్రీ. శ. 1198 - 1262)

కాకతీయ రాజుల్లో ప్రసిద్ధుడైన రాజు గణపతి దేవుడు. తన తండ్రి మహాదేవుడు చేపట్టిన దేవగిరి ముట్టడిలో తన వంతు సహాయాన్ని అందించేందుకు తండ్రితో పాటు యుద్దభూమికి వెళ్ళాడు. ఈ యుద్ధంలో మహేదేవుడు మరణించడమూ, గణపతిదేవుడు శత్రువులకు బందీ కావడం జరిగింది. ఈ వార్త కాకతీయ రాజ్యంలో అల్లకల్లోలం రేపింది. కాకతీయుల సామంతులు చాలమంది తిరుగుబాటు చేసి తమ స్వతంత్రను ప్రకటించడానికి ప్రయత్నించారు. కాని కాకతీయులకు విశ్వాసపాత్రుడైన సైన్యాధిపతి రేచర్లరుద్రుడు ఈ తిరుగుబాట్లను అణచివేసి రాజ్యం చీలిపోకుండా కాపాడాడు. క్రి. శ. 1202 లో గణపతి దేవుడు శత్రురాజుల చెరనుండి విముక్తుడు కావడంతో మరల యధాతధంగా రాజ్యపాలన చేసే అవకాశం కల్గింది.

దాదాపు 60 సంవత్సరాలు సాగిన గణపతి దేవుని పాలనలో ఈనాటి ఆంధ్రదేశంలోని చాలా ప్రాంతం కాకతీయుల అధికారంక్రిందికి వచ్చింది.


గణపతి దేవుడు మొదట తన దృష్టిని తీరాంధ్ర దేశంలోని వెలనాడు, వేంగి ప్రాంతాలపై మరల్చి వాటిని స్వాధీనం చేసుకున్నాడు. కళింగ రాజ్యాన్ని కూడా కైవశం చేసుకున్నాడు. నెల్లూరు ప్రభువైన మనుమసిద్ధికి తన రాజ్యాన్ని తిరిగి పొందడానికి సాయం చేశాడు. మనుమసిద్ధి మంత్రిగాను, మహాభారతాన్ని వెలయించిన కవిత్రయంలో ఒకరుగా పేరుపొందిన తిక్కన, గణపతి దేవుని సహాయాన్ని పొందడంలో కీలకపాత్ర వహించాడు. తన ప్రభువైన మనుమసిద్దిని గట్టెక్కించగలిగాడు. రాయలసీమ ప్రాంతంలో ముఖ్యనాయకుడైన గంగయసాహిరిని గణపతి దేవుడు అణచివేయగలిగాడు. కంచిని స్వాధీనం చేసుకోవడం, దేవగిరి యాదవుల్ని అణచివేయడం గణపతిదేవుడు చేసిన గొప్ప కార్యాలుగా చెప్పవచ్చు.

నిరంతరం యుద్దాల్లో మునిగి ఉన్నా గణపతి దేవుడు రాజ్యపాలనలో మాత్ర అశ్రద్ద చూపలేదు. అనేక దేవాలయాల్ని కట్టించాడు. సాగునీటి పద్దతుల్ని మెరుగు పరచి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడ్డాడు. వర్తకవ్యాపారాల్ని ప్రోత్సహించాడు. దీనికి మోటుపల్లి ఓడరేవులోని అభయశాసనాన్ని నిదర్శనంగా భావించవచ్చు. ప్రాచీనకాలంలోను, మధ్యయుగంలోను మోటుపల్లి ఓడరేవు చాల ప్రసిద్ది చెందింది. అనేక విదేశీ ఓడలు కూడా మోటుపల్లి ఓడరేవుకు వచ్చేవి. వెలనాడు పాలకుల పతనంతో మధ్య తీరాంధ్రంలో పరిస్థితులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. దీని అవకాశంగా తీసుకుని స్థానిక నాయకులు విదేశస్తుల నుండే గాక స్థానిక వ్యాపారస్తుల నుండి కూడ అక్రమపన్నులు వసూలు చేసేవారు. దీని ఫలితంగా ఈ నౌకాకేంద్రం మూతపడింది. వ్యాపారం క్షీణించిపోయింది. వెలనాడును స్వాధీనం చేసుకున్న తర్వాత గణపతిదేవుడు అభయ శాసనాన్ని వేయించి విదేశీ ఓడలకు రక్షణ కల్పించాడు. అక్రమ పన్నులన్నింటినీ రద్దు చేశాడు. అచిరకాలంలోనే మోటుపల్లి రేవు తన పూర్వ వైభవాన్ని పొందగల్గింది.

గణపతి దేవునికి ఇద్దరు కుమార్తెలు. కుమారులు మాత్రం లేరు. రుద్రాంబ మొదటి పుత్రిక కాగా గణపాంబ రెండవ కుమార్తె. రుద్రాంబ మాత్రం రాజ్యపాలనా వ్యవహారాల్లో చురుకుగా పాల్గొనేది. గణపతిదేవుడు దాదాపు 64 సంవత్సరాలు విజయవంతంగా పాలించి క్రీ. శ. 1262 లో మరణించాడు.


కాకతీయ ప్రభువుల్లో గణపతిదేవుడు గొప్పవాడనటంలో సందేహం లేదు. తెలుగు భాషను మాట్లాడే చాల ప్రాంతాల్ని ఒకే అధికారం క్రిందకు తెచ్చి వ్యవసాయకంగా, వాణిజ్యపరంగానే కాక ఇంకా అనేక రంగాల్లో ఈ ప్రాంత అభివృద్ధికి నాంది పలికాడు. క్రీ. పూ. 1240 నుండే తన కుమార్తె రుద్రాంబను పాలనా వ్యవహారాల్లో చురుకుగా పాల్గొనేఋలు ప్రోత్సహించి చక్రవర్తిగా గణపతిదేవుడు తన విజ్ఞతను, ముందు చూపును ప్రదర్శించాడు.

రుద్రాంబ (క్రీ. శ. 1262 - 1296)

గణపతి దేవుని మరణం తర్వాత క్రీ. శ. 1262 లో రుద్రాంబ కాకతీయ సామ్రాజ్యానికి నాయకత్వం వహించింది. ఆంధ్రదేశాన్ని ఏలిన ఏకైక మహిళ రుద్రాంబ. స్త్రీ సింహాసనం చేపట్టడం ఇష్టం లేని సామంతులు తిరుగుబాటు లేవదీశారు కాని రుద్రాంబ వీటన్నింటినీ ఎదుర్కొని సామ్రాజాన్ని అవిచ్చిన్నంగా కాపాడగల్గింది.

క్రీ. శ. 1268 - 70 సంవత్సరాల మధ్య యాదవరాజైన మహాదేవుడు కాకతీయ సామ్రాజ్యంపై దండయాత్ర చేశాడు. దీనివల్ల రాజ్యానికి ఏ మాత్రం నష్టం కలుగలేదు. ఏ భూభాగాన్ని వదులుకోలేదు.

క్రీ. శ. 1280 లో రుద్రాంబ తన మనుమడైన ప్రతాపరుద్రదేవుని యువరాజుగా పట్టాభిషిక్తుణ్ని చేసింది. 1285 లో పాండ్యులు, యాదవులు, హోయసాలులు కూటమిగా చేరి కాకతీయ సామ్రాజ్యాన్ని కబళించాలని ప్రయత్నించినపుడు యువరాజు ప్రతాపరుద్రుడు వారి ప్రయత్నాన్ని విచ్చిన్నం చేశాడు.

ప్రతాపరుద్రుడు (క్రీ. శ. 1296 - 1323)

క్రీ. శ. 1296 లో రుద్రాంబ మరణించడంతో ప్రతాపరుద్రుడు రాజ్యపాలన చేపట్టాడు. తాను పరిపాలనా భాద్యతల్ని స్వీకరించిన నాటినుండే ప్రతాపరుద్రుడు అనేక సంస్కరణల్ని ప్రవేశపెట్టాడు. గణపతిదేవుని కాలంలో తన అధీనంలోని వివిధ ప్రాంతాలకు రాజప్రతినిధుల్ని నియమించి ఆయా ప్రాంతాల పాలనా బాద్యతల్ని వారి కప్పగించేవారు. వీరినే 'నాయకులు' అంటారు. ఈ నాయకుల్ని వివిధ కులాల్నుండి నియమించే ఆచారం ఉండేది. దీనినే


'నాయంకార పద్దతి' అంటారు. కాని ప్రతాపరుద్రుడు ఈ ఆచారానికి స్వస్తిపల్కి కేవలం పద్మనాయక కులం నుండే నాయకుల్ని నియమించాడు. ఇతర కులాల నాయకుల్ని తొలగించాడు. క్రీ. శ. 1303 లో ఉత్తర భారతం నుండి ముస్లింలు దండయాత్ర చేయడంతో ప్రతాపరుద్రుని సంస్కరణా కార్యకలాపాలకు ఆటంకం కల్గింది. క్రీ. శ. 1303 నుండి క్రీ. శ. 1323 వరకు కాకతీయ సామ్రాజ్యంపై ఢిల్లీ పాలకులు అయిదుసార్లు దండయాత్ర చేశారు. ఈ దండయాత్రల వల్ల కాకతీయ సామ్రాజ్యం పతనమయింది.

యాదవరాజ్యమైన దేవగిరిపై విజయం సాధించిన తర్వాత క్రీ. శ. 1296 లో అల్లాఉద్దీన్ ఢిల్లీ సింహాసనాన్ని చేపట్టాడు. కార, అలహాబాదు ప్రాంతాల గవర్నరుగా ఉన్నప్పుడు అనధికారంగా అల్లాఉద్దీన్ దేవగిరిపై దండయాత్రను నిర్వహించాడు. ఈ యుద్దంలో విజయం సాధించిన తర్వాతనే తన మామ సుల్తాను జలాలుద్దీన్ను హత్యగావించి తన్ను తాను సుల్తానుగా ప్రకటించుకున్నాడు. దేవగిరిని సునాయాసంగా గెలవడంతో అల్లాయుద్దీన్ ఖిల్జీ మరల 1303 లో దక్షిణ భారత దండయాత్ర చేశాడు. అయితే కాకతీయ సైన్యం కరీంనగరు జిల్లాలోని ఉప్పరపల్లి వద్ద ముస్లిం సైన్యాన్ని ఓడించింది. మరల క్రీ. శ. 1307 లో మాలిక్‌కాఫర్ నాయకత్వాన ముస్లిం సేనలు దక్షిణదేశంపై దండయాత్ర చేసి దేవగిరిని ముట్టడించడానికి ప్రయత్నించాయి. తర్వాత 1310 జనవరి 19 న వరంగల్లు కోటను మాలిక్‌కాఫరు ముట్టడించాడు. కాకతీయ సైన్యం రెండు నెలలు పాటు వీరోచితంగా పోరాడి చివరికి మార్చి 19 న లొంగిపోయి మాలిక్‌కాఫర్ విధించిన షరతులకు అంగీకరించింది. ప్రతాపరుద్రుడు తన అపార సంపదను సమర్పించడమే కాకుండా డిల్లీ సుల్తాన్‌కు ప్రతిఏటా కప్పం కట్టడానికి అంగీకరించాడు.

మాలిక్‌కాఫర్ ఢిల్లీ చేరుకోగానే రాయలసీమ లోని కాకతీయ సామంతులైన అంబరాజు (గండికోట), త్రిపురాంతకుడు (వల్లూరు) తిరుగుబాటు చేశారు. ప్రతాపరుద్రుడు తన సైన్యాన్ని నడిపించి తిరుగుబాటును అణచివేశాడు. ఈ సమయంలోనే శ్రీశైలం, త్రిపురాంతకాలలోని ప్రసిద్ధి చెందిన శివాలయాల్ని ప్రతాపరుద్రుడు దర్శించాడు. దట్టమైన అడవులతో కూడియున్న ఈ ప్రాంతాల్ని చూచి నివాసయోగ్యంగా చేయదల్చాడు. అడవుల్లోని చెట్లను


నరికించి అధిక భూభాగాన్ని వ్యవసాయాయోగ్యంగాను, నివాసయోగ్యంగాను తీర్చి దిద్ది కొత్త గ్రామాల్ని నిర్మించాడు. తెలంగాణా, కోస్తా ప్రాంతాల ప్రజల్ని ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడేందుకు ప్రోత్సహించాడు. ఈ ప్రాంతాన్ని ఒక 'నాయంకర'గ రూపొందించి స్థానిక ముఖ్యుడైన వీడెము కొమ్మరాజుకు పాలనా బాధ్యతల్ని అప్పజెప్పాడు.

రాయలసీమలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్న తర్వాత ప్రతాపరుద్రుడు కంచిపైన, పాండ్యరాజులపైన దండయాత్ర చేశాడు. కంచిని స్వాధీనం చేసికొని వీరపాండ్య, సుందరపాండ్యలను ఓడించాడు. ప్రతాపరుద్రుడు మాలిక్‌కపూర్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రతిఏటా ఢిల్లీ సుల్తానుకు కప్పం కట్టేవాడు. క్రీ. శ. 1316 లో అల్లాయుద్దీన్ మరణించడంతో సింహాసనం కోసం పోరాటం ప్రారంభమైంది. దీన్ని ఆసరగా తీసుకుని ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తానుకు కట్టవలసిన కప్పాన్ని నిలిపివేశాడు. అయితే క్రీ. శ. 1318 లో కుతుబుద్దీన్ ముబారక్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు. సుల్తానుకు కట్టాల్సిన కప్పాన్ని రాబట్టుకునేందుకు ఖుస్రూ ఖాన్ నాయకత్వంలో వరంగల్లుపైకి తన సైన్యాన్ని పంపాడు. ఈ సమయంలో ప్రతాప రుద్రుడు కంపిలి రాజైన కుమార రాజుతో యుద్దంలో వున్నందున డ్లిల్లీ సుల్తాన్‌తో సంధి కుదుర్చుకుని, కట్టాల్సిన కప్పాన్ని పూర్తిగా చెల్లించాడు.

క్రీ. శ. 1320 లో ఢిల్లీ సింహాసనంపై ఖిల్జీల అదుప తప్పడంతో తుగ్లకులు అధికారం చేపట్టారు. ఘియాసుద్ధీన్ ఢిల్లీ సుల్తానయ్యాడు. కప్పం విధించే విషయంలోను, రాజ్యాక్రమణ విషయంలోను దక్కను ప్రాంతంలో అనుసరించవలసిన వ్యూహాన్ని ఘియాసుద్ధీన్ మార్చేశాడు. ఈ మధ్యలో ప్రతాపరుద్రుడు మరల సుల్తానుకు కట్టవలసిన కప్పాన్ని నిలిపివేశాడు. అంతే కాకుండ ఖిల్జీ గవర్నరైన ఖుస్రోకు తాను దత్తం చేసిన చాదర్‌కోట మొదలగు ప్రాంతాల్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. క్రీ. శ. 1321 లో ఢిల్లీ సుల్తాన్ తన కుమారుడైన ఉలుగ్‌ఖాన్ నాయకత్వంలో అతిపెద్ద సైన్యాన్ని వరంగల్లుపైకి పంపాడు. కాని ఈ దాడిని వరంగల్లు సైన్యం తిప్పికొట్టడంతో ఢిల్లీ సైన్యానికి విపరీతమైన నష్టం కల్గింది. ఢిల్లీ సైన్యం తిరుగుముఖం పట్టింది. అయితే తర్వాత నాలుగు నెలలకే ఢిల్లీ సైన్యం వరంగల్లుపై దాడిచేసి విజయాన్ని సాధించింది.


ప్రతాపరుద్రుడు కుటుంబసమేతంగా బందీ అయి ఢిల్లీకి పంపబడ్డాడు. కాని ప్రతాపరుద్రుడు మార్గమధ్యంలోనే ఆత్మహత్య చేసికొని ప్రాణాలు విడిచాడు.

వరంగల్లును ఆక్రమించిన తర్వాత ఉలుగ్‌ఖాన్ తీరం మీదుగా నెల్లూరు నుండి రాజమండ్రి వరకు గల ప్రాంతాలపై దాడి జరిపి 1324 సెప్టెంబరు కంతా కాకతీయ సామ్రాజ్యాన్నంతటినీ స్వాధీనం చేసుకున్నాడు. ఎవరూ ఊహించని రీతిలో వరంగల్లుతో పాటు కాకతీయ సామ్రాజ్యమంతా శత్రువుల స్వాధీనం కావడంతో ప్రజల్లో భయాందోళనలు ఎక్కువయ్యాయి దీనికి తగ్గట్టుగానే ముస్లిం పాలకులు పరమనిరంకుశంగా పాలన చేశారు. దీనితో అనతి కాలంలోనే కాకతీయ సామంతులు నాయకత్వం వహించి ముస్లిం పాలన నుండి విముక్తి పొందేందుకు ఒక ఉద్యమం చేపట్టారు.

కాకతీయులు ఆంధ్రసంస్కృతికి చేసిన సేవ

ఆంధ్రుల సంస్కృతీ వికాసానికి కాకతీయులు ఎనలేని సేవ చేశారు. దాదాపు మూడు వందల సంవత్సరాలు పాలించిన కాకతీయులు ముస్లిం దండయాత్రల నుండి ఆంధ్రదేశాన్ని రక్షించి ఆంధ్రుల చరిత్రకు, సంస్కృతికి ఒక రూపం కల్పించారు.

సాహిత్యం

తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నింటినీ ఒకే అధికారం క్రిందికి తెచ్చి ఆంధ్రదేశానికి ఒక గుర్తింపు కలుగుజేసినవారుగా కాకతీయులు చిరస్మరణీయులు. వీరి కాలంలోనే తెలుగు భాషా సాహిత్యాలు క్రమంగా వికాసదిశలో పయనించాయి. నన్నయ రచించిన మహాభారత కావ్యమే తెలుగు భాషలో వెలువడిన మొదటి రచన. రాజమండ్రి నేలిన తూర్పు చాళుక్య రాజైన రాజరాజనరేంద్రుని కాలంలో (క్రీ. శ. 1019 - 61) నన్నయ మహాభారత రచన కుపక్రమించి పూర్తి చేయలేకపోయాడు. కాని నెల్లూరు ప్రభువైన మనుమసిద్ది ఆస్థానకవి, మంత్రియైన తిక్కన మహాభారతంలో మిగిలిన 15 పర్వాల్ని పూర్తి చేశాడు. మనుమసిద్దిని గద్దె నెక్కించేందుకు గణపతి దేవుని సహాయం కోరి వరంగల్లుకు వచ్చి అక్కడే ఈ 15 పర్వాల్ని పూర్తిచేయడం విశేషం

విద్యానాధుడు, సత్కల్యమల్లుడు, పాల్కురికి సోమనాధుడు, భాస్కరుడు వంటి ప్రసిద్ది చెందిన కవులు కాకతీయుల కాలంలో వెలసిన వారే. మొదట ప్రతాపరుద్రుడు స్వయంగా నీతిశాస్త్రం అను గ్రంధాన్ని రచించాడు పాల్కురికి సోమనాధుడు రచించిన బసవపురాణం, పండితారాధ్య చరిత్ర ఈః నాటికీ ప్రసిద్ధి చెందిన కావ్యాలుగా మిగిలిపోయాయి. భాస్కరరామాయణం కూడ ఈకాలంలో వెలువడ్డ రచనయే ప్రసిద్దుడైన సుమతి శతక కర్త బద్దెన కూడ కాకతీయుల యుగానికి చెందినవాడే

కళలు

కాకతీయులు ఆలయాల్ని నిర్మిచడంలో శ్రద్ద కనపరిచారు అనమకొండలోని రుద్రేశ్వరాలయం, వరంగల్లు కోటలోని స్వయం భూనాధ దేవాలయం కాకతీయులు చేపట్టిన నిర్మాణాలే రామప్ప దేవాలయం, పిల్లల మర్రి దేవాలయాలు కళాజగత్తులో గొప్పవిగా నిలిచిపోయాయి. వరంగల్లు కోటలో కన్పించే గంభీరమైన నాలుగు మహాద్వారాలు ఆంద్రకళాకారుల నైపుణ్యానికి చిహ్నాలుగా దర్శనమిస్తాయి కాకతీయ రాజధానియైన వరంగల్లునే 'ఆంధ్రమహానగరం' అని కూడ వ్యవహరిస్తారు. ఆంధ్రదేశం లోని ఏ నగరానికి ఇటువంటి ఖ్యాతి లభించలేదు

సాగునీటి నిర్మాణాలు

కాకతీయుల కాలంలో వ్యవసాయం విశేషంగా అభివృద్ది చెందింది ఈ అభివృద్దికి కాకతీయ రాజులు నిర్మించిన అనేక చెరువులు కొలనులు, బావులు మొదలైనవి దోహదం చేశాయి. వీటిలో రామప్ప చెరువు పాకాల చెరువు పేర్కొనదగినవి. ప్రతాపరుద్రుడు కర్నూలు జిల్లాలోని అటవీ ప్రాంతమైన చాల భూభాగాన్ని వ్యవసాయ యోగ్యంగాను, నివాసయోగ్యంగాను చేసి అక్కడ వివిధ ప్రాంతాల ప్రజలు వచ్చి స్థిరపడేందుకు ప్రోత్సహించాడు

మతం

క్రీ శ. 11వ శతాబ్దిలో కాకతీయులు తమ అధికారాన్ని స్థాపించేనాటికి, ఆంద్రదేశంలో జైనమతం విశేష ప్రచారంలో ఉండేది. కాని రెండు శతాబ్దాలకే జైన మతం ఆంధ్రదేశం నుండి కనుమరుగైంది. జైనమతం స్థానంలో శైవమతం విశేషంగా వ్యాప్తిలోకి వచ్చింది. శ్రీపతి శివలెంక మంచన, మల్లిఖార్జున పండితారాడ్యుడు అను ముగ్గురు ఆంధ్రదేశంలో శైవమత వ్యాప్తికి మూలకారకులయ్యారు. కర్ణాటకప్రాంతంలోవీరశైవం వీరవిహారం చేయడంతో మతసంఘర్షణలు మొదలై రక్తపాతానికి దారితీసింది. ఈ ప్రభావం నుండి ఆంధ్రదేశం గూడ తప్పించుకోలేకపోయింది. శైవులకు, జైనులకు మధ్య అనేక సంఘర్షణలు జరిగాయి. అనమకొండలోని 'పద్మాక్షి ' ఆలయంతోపాటు అనేక జైన ఆలయాలు శివాలయాలుగా మార్చబడ్డాయి. రెండవ ప్రోలయ తర్వాత వచ్చిన కాకతీయ రాజులు గొప్ప శైవభక్తులుగా మారారు. కాని వీరు ఎప్పుడూ మత మౌఢ్యంతో ప్రవర్తించలేదు. జైనులకు శైవులకు మధ్య తలెత్తిన అనేక వివాదాల్ని పరిష్కరించడానికి ప్రయత్నించారు.

ఒక్కమాటలో కాకతీయుల పాలన ఆంధ్రదేశనికి, తెలుగుభాషకు ఒక ప్రత్యేక అస్థిత్వాన్ని కులుగజేసిందని చెప్పవచ్చు.

విజయనగర సామ్రాజ్యం (క్రీ.శ. 1336-1678)

కాకతీయ సామ్రాజ్యం పతనం తర్వాత ముస్లిం పాలకుల నిరంకుశత్వం మితిమీరిపొవడంతో దక్షిణ భారతంలోని ప్రజలకు ఒకరకమైన భద్రతారాహిత్య భావం కలిగింది దీనితో ఇస్లాం మతాన్ని ఎదుర్కోవడానికి హిందువులు సుసంఘటితంగా సిద్ధమయ్యారు. ఈ ప్రయత్నంలో హరిహర బుక్కరాయ సొదరులు ప్రత్యేకపాత్రను నిర్వహించారు. ఈ అన్నదమ్ముల జన్మస్ధలం వరంగల్లు కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుని వద్ద హరిహరరాయలు మంత్రిగాను, బుక్కరాయలు కోశాధికారిగాను పనిచేశారు. క్రీ.శ. 1323 లో వరంగల్లును ముస్లింలు ముట్టడించడంతో ఈ సోదరులు తప్పించుకు పారిపోయారు. తుంగభద్రా నది ఉత్తరపు ఒడ్దున వెలసిన కంపిలి రాజ్యంలో వీరు తమ సేవలు నిర్వహించారు కంపిలి రాజ్యాన్ని కూడ ముస్లింలు కబళించినపుడు వీరు తుంగభద్రను దాటి వచ్చి క్రీ.శ.1336 లో 'విజయనగరం' అనే కొత్త నగరాన్ని స్థాపించారు.

విజనగరసామ్రాజ్యాన్ని నాలుగు రాజవంశాలు వరుసగా పాలించాయి. అవి 1) సంగమవంశం 2)సాళువ వంశం 3) తుళువ వంశం 4) అరవీడు వంశం సంగమ వంశం (క్రీ. శ. 1336 -- 1485)

మొదటి హరిహరరాయలు (1336-1356), మొదటి బుక్కరాయలు (1356- 1377), రెండవ హరిహరరాయలు (1377-1406), మొదటి దేవరాయలు (1406-1422), రెండవ దేవరాయలు (1422-1465) మరియు విరూపాక్షుడు (1465-1485) వరుసగా సంగమ వంశానికి చెందిన రాజులు విరూపాక్షుని పాలనలో బహమనీ సుల్తాను ప్రధాన మంత్రియైన మహమ్మద్‌ గవాన్‌ విజయనగరంపై దండెత్తి వచ్చాడు విరూపాక్షుడు బహమనీ రాజ్యపు సవాలును ఎదుర్కోలేకపోయాడు. విరూపాక్షుడు తన కుమారుని చేత సంహరింపబడ్డాడు. కాని విరూపాక్షుని కుమారుడు పశ్చాతాపముచే పదవీ కాంక్షలేక సింహాసనాన్ని తన తమ్ముడైన ప్రౌఢదేవరాయలకు త్యాగం చేశాడు కాని చంద్రగిరి పాలకుడైన సాళువు గుండయ కుమారుడైన సాళువ నరసింహుడు ప్రౌఢదేవరాయలను పదవీచ్యుతుని చేసి‌ సింహాసనాన్ని అదిష్టించి కొత్త రాజవంశానికి నాందిపలికాడు

సాళువ వంశం (క్రీ. శ. 1485 - 1505)

ఈః వంశంలో సాళువ నరసింహరాయలు, ఇమ్మడి నరసింహరాయలు అను ఇద్దరు రాజులు మాత్రమే రాజ్యపాలన చేశారు.

తుళువ వంశం (క్రీ. శ. 1505 -- 1570)

క్రీ శ 1505 లో వీరనరసింహరాయలు ఇమ్మడి నరసింహరాయుల్ని సంహరించి సింహాసనం చేపట్టడంతో తుళువ వంశ రాజుల పాలన ప్రారంభమయింది వీరనరసింహరాయల తర్వాత అతని సవతి తమ్ముడైన శ్రీ కృష్ణదేవరాయలు 1509లో విజయనగర రాజ్యాధీశుడుగా పదవి బాధ్యతల్ని చేపట్టాడు.

శ్రీకృష్ణదేవారాయలు ( (క్రీ. శ. 1509 - 1529)

దక్షిణ భారతాన్ని ఏలిన రాజులందరిలోను శ్రీకృష్ణదేవరాయలు ప్రసిద్దుడైన గొప్ప చక్రవర్తి. 1509లో తాను రాజ్యాధికారం చేపట్టేనాటికి రాజ్యంలోని పరిస్థితులు అస్తవ్యస్తంగాను, నిరాశాజనకంగాను ఉండేవి. ఒరిస్సా పాలకులు నెల్లూరు వరకు గల తీరాంధ్ర దేశాన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. విజయనగరాన్ని ఫణంగా పెట్టీ తన సరిహద్దుల్ని విస్తరింపజేయాలని బీజాపూరు సుల్తాను ప్రయత్నాలు ప్రారంభించాడు.

ఈ పరిస్థితుల్లో శ్రీ కృష్ణదేవరాయలు, విజయనగరంపై కలసికట్టుగా మతయుద్ధం (జీహాద్‌) ప్రారంభించే ప్రయత్నంలో ఉన్న దక్కను ముస్లిం పాలకులపై తన దృష్టి మరల్చాడు. ఈ ముస్లిం రాజ్యాల కూటమికి యూసఫ్‌ ఆదిల్‌ఖాన్‌ నాయకత్వం వహించాడు. కాని శ్రీకృష్ణదేవరాయలు, ముస్లిం కూటమి సైన్యాన్ని ఆదోని వద్ద చిత్తుగా ఓడించాడు. వెనుతిరిగిన ముస్లిం సైన్యాన్ని వెంటాడి కోవలకొండ వద్ద మరోసారి ఓడించాడు. ఈ యుద్దంలో యూసఫ్‌ ఆదిల్‌‌ఖాన్‌ మరణించాడు క్రీ శ. 1512లో రాయచూరును రాయలు ఆక్రమించాడు కృష్ణా - తుంగభద్రా నదుల మధ్య ప్రాంతమంతా శ్రీకృష్ణదేవరాయల అధీనంలోకి వచ్చింది. అక్రమంగా అధికారానికి వచ్చిన బారిద్‌ మమాలిక్‌ను తొలగించి మహమ్మద్‌ షాకు బహమనీ రాజ్యాన్ని తిరిగి కట్టబెట్టాడు

తర్వాత కృష్ణదేవరాయలు ఉమ్మత్తూరు పాలేగార్లపె తన దృష్టిని మరల్చి ఉమ్మత్తూరును స్వాధీనం చేసుకోవడమే కాక, శివసముద్రం, శ్రీరంగ పట్టణాల్ని కూడ వశపర్చుకున్నాడు

ఒరిస్సా దండయాత్ర

శ్రీకృష్ణదేవరాయలు ఒరిస్సా పాలకులపై అయిదుసార్లు దండయాత్ర చేశాడు ఒరిస్సా పాలకులు స్వాధీనం చేసుకున్న నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిని తిరిగి వశం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. క్రీ శ 1513లో దుర్బేద్యమై న ఉదయగిరి కోటపై దండెత్తి అతి పెద్దదైన ప్రతాపరుద్రుని సైన్యాన్ని ఓడించగల్గాడు. ఒరియా సైన్యం కొండవీడులో తలదాచుకోవలసి వచ్చింది. ఉదయగిరిని స్వాధీ నం చేసుకున్న తరువాత శ్రీకృష్ణదేవరాయలు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్దం తిరుపతిని సందర్శించాడు. తిరుమల గుడిలోని ద్వారం వద్ద తన విగ్రహాన్ని తన రాణులైన చిన్నాదేవి, తిరుమల దేవి విగ్రహాల్ని ప్రతిష్టించాడు.

శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించిన తర్వాత శ్రీ కృష్ణదేవరాయలు మరల రెండోసారి ఒరియా పాలకులపై దండయాత్ర చేశాడు. కొండవీడు మార్గంలో గల కందుకూరు, వినుకొండ, బెల్లంకొండ మొదలైన కోటల్ని స్వాధీనం చేసుకున్నాడు కొండవీడును చుట్టుముట్టాడు. కాని సైన్యాధిపతియైన సాళువ తిమ్మయ కోటను వశపరుచుకోలేక పోయాడు. అందువల్ల శ్రీ కృష్ణదేవరాయలు స్వయంగా సైన్యాన్ని నడిపించి పెద్ద ఎత్తున దాడిచేశాడు చివరకు ఒరియా సైన్యం లొంగిపోయింది. యువరాజైన వీరభద్రునితో పాటు చాలమంది ఒరియా రాజప్రముఖులను బంధించి విజయనగరానికి తీసుకుపోయాడు

ఇక మూడవ దండయా[తలో కృష్ణానది ఒడ్డున గల బెజవాడను రాయలు స్వాధీనం చేసుకున్నాడు. గోల్కొండ మార్గంలో ఉన్న కొండపల్లిని కూడ ఆక్రమించాడు నల్గొండ, వరంగల్లు, జిల్లాలోని కోటలన్నీ విజయనగరం ఆధీనంలోకి వచ్చాయి.

నాల్గవ దండయాత్రలో వేంగి రాజ్యం తిరిగి స్వాధీనమయింది రాజమండ్రి అతి సునాయాసంగా చేజిక్కింది. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు సింహాచలం వెళ్ళి అక్కడి ఆలయంలోని నరసింహస్వామిని దర్శించాడు పొట్నూరు వద్ద తస విజయాలకు చిహ్నంగా ఒక విజయస్థంభాన్ని నాటించాడు

చివరిదైన అయిదవ దండయాత్రలో శ్రీకృష్ణదేవరాయలు గజపతుల రాజధానియైన కటకంపై దండయాత్ర సాగించాడు యువరాజైన వీరభద్రుడు విజయనగర చెఱసాలలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతాపరుద్రుడు సంధికి అంగీకరించాడు. క్రీ శ 1518లో జరిగిన ఒడంబడిక ప్రకారం ప్రతాపరుద్రుడు తన కుమార్తెను శ్రీకృష్ణదేవరాయల కిచ్చి వివావాం జరిపించాడు దీనికి ప్రతిఫలంగా శ్రీకృష్ణదేవరాయలు కృష్ణానదికి ఉత్తరంగా తాను ఆక్రమించిన ప్రాంతాలన్నింటినీ ఒరిస్సా రాజుకు తిరిగి ఇచ్చేశాడు.

గోల్కొండ

శ్రీకృష్ణదేవరాయలు ఒరిస్సా దండయాత్రలో తలమునకలై ఉండగా, గోల్కొండ సుల్తాను అయిన కులీకుతుబ్‌ షా పానగల్లు, గుంటూరు ప్రాంతాలపై దాడిచేసి వరంగల్లు, ఖమ్మంపేట, కొండపల్లి, ఏలూరు, రాజమండ్రిలో గల కోటల్ని స్వాధీనం చేసుకున్నాడు. ఒరిస్సా ప్రభువు నుండి కృష్ణా గోదావరీ ముఖద్వారాల మధ్య గల ప్రాంతాన్నంతా బలవంతంగా చేజిక్కించుకున్నాడు తర్వాత నాదెండ్ల గోపన్న అధీనంలో ఉన్న కొండవీడును చుట్టుముట్టాడు నాదెండ్ల గొపన్న శ్రీకృవ్ణదేవరాయల మంత్రియైన తిమ్మరుసుకు మేనల్లుడు. గోపన్న గోల్కొండ సెన్యాన్ని సమర్దవంతంగా ఎదుర్కోలేకపోయినపుడు తిమ్మరుసు స్వయంగా సైన్యాన్ని నడిపించి గోల్కొండ సైన్యాన్ని ఓడించడమే కాక వారి సేనాపతియై న మదరుల్‌ ముల్కును బంధించాడు.

బిజావూర్‌

శ్రీకృష్ణదేవరాయలు చివరిసారిగా బిజాపూర్‌ ను పాలిస్తున్న ఇస్మాయిల్‌ ఆదిల్‌ షాపై దండయాత్ర చేశాడు క్రీ శ 1512లో రాయలచే ఆక్రమింపబడ్డ కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని తిరిగి బిజాపూరుకు స్వాధీనం చేయవలసిందిగా సుల్తాను కోరాడు. ఈ నేపధ్యంలో సాగిన యుద్దంలో బిజాపూరు సైన్యం చిత్తుగా ఓడిపోయింది. తర్వాత శ్రీకృవ్ణదేవరాయలు గుల్బర్గా వరకు తన సైన్యాన్ని నడిపించి అక్కడ గల కోటను ధ్వంసం చేశాడు ముహమ్మదుషా పెద్ద కుమారునికి బహమనీ రాజ్యాన్ని అప్పగించి మిగిలిన ఇద్దరు కొడుకుల్ని బంధీలుగా విజయనగరానికి తీసుకుపోయాడు.

పోర్చుగీసులతో సంబంధాలు

శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీసు వారితో స్నేహపూర్వక సంబంధాల్ని కలిగియుండేవాడు. క్రీ శ 1510లో భారతదేశంలోని పోర్చుగీసుల ఆధీనంలో గల ప్రాంతాలన్నింటికి గోవా కేంద్రస్థానమయింది. దీని ఫలితంగా వాణిజ్యం అభివృద్ది చెందింది శ్రీకృవ్ణదేవరాయలు ఆరేబియా గుర్రాల్ని పోర్చుగీసు వారి ద్వారా పొందేవాడు ఇదేకాక పోర్చుగీసువారు తుపాకులు మొదలయిన యుద్ద సామాగ్రిని కూడ విజయనగరానికి అందచేశారు. ఈ ఆయుధసామగ్రితోనే రాయలు రాయచూరుపై దండెత్తాడు. విజయనగరానికి నీరు సరఫరా చేసేందుకు పోర్చుగీసు ఇంజనీర్లు సహాయపడ్డారు

శ్రీకృష్ణదేవరాయలు చివరి రోజులు విషాదకరంగా మారాయి రాయలు తాను జీవించి ఉండగానే తన చిన్న కుమారుడైన తిరుమలదేవుని విజయనగర రాజుగా చేశాడు కాని తిరుమలదేవుడు సింహాసనం అదిష్టించిన ఎనిమిది నెలలకే మరణించాడు తిమ్మరుసు కుమారుడైన తిమ్మడు తిరుమలదేవునికి విషప్రయోగం

  1. (1) 23 జిల్లాలు 1 శ్రీకాకుళం 2. విజయనగరం 3. విశాఖపట్టణం 4. తూర్పు గోదావరి 5. పశ్చిమ గోదావరి 6. కృష్ణా 7. గుంటూరు 8. ప్రకాశం 9. నెల్లూరు 10. చిత్తూరు 11. అనంతపురం 12. కడప 13. కర్నూలు 14. మహబూబ్‌నగర్ (పాలమూర్) 15. మెదక్ (మెతుకు) 16. నిజామాబాద్ (ఇందూరు) 17. కరీంనగర్ (ఎల్లందల) 18. అదిలాబాద్ (ఎదులాపురం) 19. వరంగల్ (ఓరుగల్లు) 20. నల్గొండ 21. ఖమ్మం 22. హైదరాబాద్ (భాగ్యనగరం) 23. రంగారెడ్డి.