ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/సౌఖ్య దినములు
మేము పరీక్ష నిమిత్తమై చెన్నపురి బయలుదేఱవలసిన దినములు వచ్చెను. ఆ సమయమునందు, నామీఁద గల వైరభావము స్నేహితులు వెలిపుచ్చ నారంభించిరి. వీరలలో నగ్రేసరుఁడు నా మిత్రుఁడు మృత్యుంజయరావె యగుటకు నే నెంతయు వగచితిని. ఇట్టి స్వభావము గలవారితోఁ జెలిమి చేసి, యేల నే నీసమాజమునఁ బని చేసితినని విచారించితిని. నేను చెన్నపురికిఁ బోవునపుడు సెలవు గైకొనుటకు వీరేశలింగముగారియొద్ద కేగఁగా, ఆయన మా యంత: కలహముల సంగతి విని, స్నేహితు లందఱిని సమావేశపఱచి, మాలో మరల మిత్రభావము నెలకొల్పఁ బ్రయత్నించిరి. వారిమాటలు శిరసావహించి మే మందఱమును వారి హితవచనముల చొప్పున మెలఁగ వాగ్దానము చేసితిమి. ఇపు డందఱము కూడి ప్రయాణము చేయ సమ్మతించుటయె యీ స్నేహ పునరుద్ధరణమునకు సూచన.
42. సౌఖ్య దినములు
రోగములు, మనస్పర్థలు, మున్నగు శోధనల కెంత లోనైనను, 1892 వ సంవత్సరమున తుదియాఱు నెలలును నాకు నా స్నేహితులకును విద్యార్థిదశలో నెల్ల సుఖతమదినము లని చెప్పవచ్చును. మిత్రుల మందఱమును గలసియుండెడి యా యిల్లపుడు రాజభవనము వలె నాకును నా స్నేహితులకును గానఁబడియెడిది ! ముఖ్యముగ సంఘసంస్కరణాభి మానుల కది యాటపట్టయ్యెను. అచటినుండి వీచుగాలియె సంస్కరణాభిమానబీజములను నలుదెసలకును వెదచల్లు నటు లుండెను. సంస్కరణమును గూర్చి చర్చలు, ప్రసంగములు, సంభాషణములును, ఎల్ల సమయములందును, అచట వినవచ్చు చుండెను. సంస్కరణమును గూర్చిన పత్రిక లచటఁ జదువరులకు లభ్య మగు చుండెను. సంస్కరణాభిమానులగు చిన్నలు పెద్దలు, విద్యార్థులు విద్యాధికులును పలుమా ఱచట సమావేశ మగుచు నొకరి యూహా పోహము లొకరు గ్రహించుచుండిరి. రాజమంద్రిలో జరుగు సంస్కరణకార్యప్రణాళిక యంతయు నిచట నారంభమై, మున్ముందుగఁ బ్రచుర మగుచువచ్చెను.
సంస్కరణ పక్షమున కెట్టి సంబంధము గలవారు పట్టణమునకు వేంచేసినను, వారలను గూర్చిన వార్తలు ప్రథమమున నిచ్చటనే ప్రభవించుచుండెను. ఆసమయమున నొక భూతవైద్యుఁడు రాజమంద్రి వచ్చి, ఎవరియింటనో బసచేసి, వైద్యము చేయుచుండెను. మే మాయనతో వాద ప్రతివాదనలు చేయుటకు వారియొద్దకుఁ బోవుచుండెడివారము. దయ్యములను జూపింపు మనియు, పట్టింపు మనియు, మాలోఁ గొందఱ మాయనతో డీకొని వాదించితిమి. ఆయన యట్లు చేసెద నని పలికియు, తుద కేమియుఁ జేయలేక వెడలి పోయెను. హిందూమతము, దివ్యజ్ఞాన సమాజములను గూర్చి ప్రసంగించుటకు, మేము సాహసమున బయలుదేఱుచుందుము.
మాయందఱికిని వివాహ సంస్కరణము ప్రియతమమగునంశము. వితంతూద్వాహములు చేసికొనినవారిలోఁ బెక్కండ్రు మాకు సావాసులే. వారియిండ్లు మామేడ కంటియె యుండెను. వారినిజూచి పోవుటకు వచ్చెడి వీరేశలింగము పంతులు మున్నగు సంస్కర్తలు, మామేడమీఁదికి వచ్చి మాతో మాటాడి పోవుచుందురు. మే మచట నుండు దినములలో రెండుమూఁడు వితంతూద్వాహములు దగ్గఱ యింటిలోనే జరిగెను. ఆ పెండ్లి పెద్దలలో మామిత్రులె ముఖ్యులు. మృత్యుంజయరావు ప్రోత్సాహముననే యందొక పెండ్లి జరిగెను. ఆ పెండ్లికుమారునికి పెండ్లికుమార్తెకును పునర్వివాహావశ్యకతను గుఱించి బోధించి, వారి కాలోచనలు చెప్పి, వారి చిక్కులు విడఁదీసి పరిణయము జరిగించినవారు మృత్యుంజయరావు, ఆతని సతీతిలక మగు మాణిక్యాంబయును.
అచట జరిగిన యింకొక వివాహసందర్భమునఁగూడ మా స్నేహితులే యధ్వర్యము చేసిరి. ఆసమయమున నచటికి వచ్చిన పెద్దలను మేమె సన్మానించితిమి. వివాహదినములలో వధూవరులను జూచి పోవుటకు కళాశాలాధ్యక్షులగు మెట్కాపు దొరయును ఆయన సతీమణియు వేంచేసిరి. ఇంటిచూరు పొట్టిగ నుండుటచేత, ఆసమయమున దొరగారికి ముఖముమీఁద కొంచెము గాయమయ్యెను.
విద్యార్థులతోఁ గిటకిట మనుచుండు మా మేడ చూచి పోవుటకు పిన్నలుపెద్దలు వచ్చుచుందురు. నాతమ్ములు చెల్లెండ్రును నన్నుఁ జూచి మాటాడు నెపమున తఱచుగ నా బసకు వచ్చుచు, మేడ మీఁదినుండి చుట్టుపట్టుల యిండ్లు చెట్లును జూచి వినోదించుచుందురు. దూరమునందలి యీ మేడగదిలో నేనుండుట, ఈనిశ్శబ్ద ప్రదేశమున విద్యాపరిశ్రమము చేయుటకుఁ గాక, ఇచ్ఛావిహారము సల్పుటకె యని బాల్యమున నుండువా రనుకొనుచు వచ్చిరి ! నేను రాజాది రాజుల భోగము ననుభవించుచుంటి నని మాపెద్దచెల్లె లానాఁ డను చుండెడిది !
43. పట్టపరీక్ష
నే నిపుడు పట్టపరీక్షకుఁ జెన్నపురి పోవలసియుండెను. తేమ యుబుకుచుండెడి మా పర్ణ కుటీరమునుండి కుటుంబమును ఎదురుగ నుండెడి యింటికిఁ జేర్చినఁగాని నాకుఁ దోఁచలేదు. స్నేహితులతోఁ గలసి నే నంత పట్టణమునకుఁ బ్రయాణ మైతిని. మార్గమధ్యమున పడ వలో "సత్యసంవర్థని"కి వ్యాసములు వ్రాయుచుంటిని. గుంటూరిలో మృత్యుంజయరావునకు బంధువు లుండుటవలన మే మందఱము నచట నొకదినము నిలిచి చెన్నపురి ప్రయాణ మైతిమి. స్నేహితులతో నాడుచు పాడుచుండుటచేత, ఆ దీర్ఘ ప్రయాణమువలని బడలిక నా కగఁబడలేదు. లింగి సెట్టివీథిలో నుండు రామలింగయ్య పూఁటకూళ్ల యింటి మేడలో నామిత్రుఁడు గంగరాజు నివసించెను. అది నా కతఁ డిచ్చి, శీతకాలపు సెలవులకుఁ దాను నర్సాపురము వెళ్లిపోయెను. మృత్యుంజయరావు, అతని భార్యయును, పరశువాకము వెళ్లి, అచ్చట మన్నవ బుచ్చయ్య పంతులుగారియింట బసచేసిరి. నాకుఁ జేరువనె సాంబశివరావు మున్నగు స్నేహితులు విడిసిరి. నా ప్రాఁతస్నేహితులగు వెంకటరత్నము నాయఁడుగారిని, నారాయణస్వామి నాయఁడుగారిని గలసికొని, వారితో సంభాషణములందు తీఱికకాలమును గడుపుచుంటిని. నే నిచట శ్రద్ధతోఁ జదువుచుంటిని. రాజమంద్రి స్నేహితుఁడు పానుగంటి అప్పారావుగారితోఁ దఱచుగ నేను ప్రాఁత పాఠములు తిరుగవేయుచుండువాఁడను.
నా సహాధ్యాయుఁడు రామారావుగారు పరశువాకములో జబ్బుపడుటచేత, అతని నాబసకుఁ గొనివచ్చి, వైద్యుఁడు నారాయణస్వామి నాయఁడుగారిచే మందిప్పించితిని. అతనికి నాకును నాయఁడుగారు తమ సహజకృపావిశేషముతో మందు లిచ్చుటవలన మాకు స్వస్థత గలిగెను. డిశంబరు చివరభాగమున చెన్నపురి బ్రాహ్మమందిరములో "ఆస్తికసమావేశము," బ్రాహ్మసమాజ వార్షికసభలును జరిగెను. సమాజ పత్రికయగు "ఫెల్లోవర్కరు" పత్రికను పున నుద్ధరించుటకు వెంకటరత్నము నాయఁడుగారు సమాజమిత్రులును