ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/సైదాపేట
ఇవ్విథమున ముందలి సాధకబాధకములు బాగుగ నాలోచించుకొనక, పట్టపరీక్షాఫలితములు తెలియకమున్నె, వేవేగముగ నేను బోధానాభ్యసనకళాశాలకుఁ బరుగిడితిని !
45. సైదాపేట
1893 వ సంవత్సరము ఫిబ్రవరి 1 వ తేదీని సైదాపేట బోధనాభ్యసనకళాశాలలో మృత్యుంజయరావు నేనును జేరితిమి. ఆ విద్యాలయములో జ్ఞానకాండమునకంటె కర్మకాండమునకే ప్రాముఖ్య మీయఁబడుచుండెను. ఒక్కొక్కప్పుడు, జ్ఞానసంపాదనమున కచట బొత్తిగ నవకాశము గలిగెడిదియెకాదు ! అచ్చటి నిరంతరకర్మకలాపము విద్యార్థులను వట్టి కీలుబొమ్మలగఁ జేయుచుండెను ! వేకువనె డ్రిల్లు, పిమ్మట డ్రాయింగు. ఈరెండును పూర్తియగునప్పటికి తొమ్మిదిగంటలు. పదిమొదలు నాలుగు నాలుగున్నరవఱకును బడి. పిమ్మట కసరతుగాని, సభగాని, సాయంత్రమువఱకును. మొత్తముమీఁద విద్యార్థి చదువుకొనుట కేమియు వ్యవధి లేకుండెడిది. కసరతు అయినను, శరీరమున కేమియు వ్యాయామ మొసంగని వట్టి డ్రిల్లు. ఇందు సరిగా కీలుబొమ్మలవలెనే సాధకులు వికృతాంగ వైఖరులతో నటునిటుఁ దిరుగుచు కాలక్షేపము చేయుదురు !
ఒకపూట ఉపాధ్యాయులు మాకు బోధింతురు. ఈబదులు తీర్చివేయుటకా యనునట్టుగ మే మింకొకపూట మావిద్యార్థులకు బోధింతుము ! కళాశాలనుండి మేము గ్రహించినది విద్యావిశేషమేమియు నందు లేదనియె ! ఇచటి బోధనాప్రభావ మింతటితో నిలువక, జ్ఞానబోధకపుస్తకములు మేము చదువ నవకాశముకూడ లేకుండఁ జేసెను ! సహాయాధ్యక్షుఁడగు డెన్హాముదొర ప్రవీణుఁడు. ఆయన విద్యావిశారదుఁడును, విశాలహృదయుఁడును. ఆ విద్యాలయమందలి విద్యనిరర్థక మని చెప్పివేయ నాయన వెనుదీయఁడు ! ఇంగ్లండుదేశమందలి విద్యార్థులనుగుఱించియు, విద్యాశాలలనుగుఱించియు, వినోద విషయములాయన వలన వినుచుందుము.
మే మచట మా విద్యార్థులకుఁజేయు బోధనావిధానమును గుఱించి కొంచెము చెప్పవలెను. ఇంచుమించుగ నందఱు విద్యార్థులును నిరక్షరకుక్షులె. విహారార్థమె వారు విద్యాశాలకు వేంచేయుచు, బోధకవిద్యార్థులగు మాబోటి క్రొత్తవారిని జూచి పరిహసించుచు, మాప్రశ్నలను వినుపించుకొనక వాని కపసవ్యసమాధానము లిచ్చుచు, చదువు నేరువవలె నను వాంఛ యేకోశమునను లేక, గురువుల కడ్డంకులు గలిగించుచు వ్యర్థకాలక్షేపము చేయుదురు ! విద్యార్థుల నేపట్టునను గొట్టక తిట్టక మఱి విద్యాబోధన చేయవలె నను విపరీత సిద్ధాంత మా విద్యాశాలయందు ప్రాచుర్యమున నుండుట గ్రహించి, విద్యార్థులు వినయవివేకములు వీడి, సర్వస్వతంత్రులై మెలఁగు చుండిరి. ఇచటి వికారపువిద్యలు విపరీతవిధానములును జూచి, ఏదో యొకవింతలోకమున నుంటి మని కొన్నాళ్లవఱకును మే మనుకొంటిమి.
మృత్యుంజయరావు, అతనిభార్యయును ఇపుడు సైదాపేటలో నొకచిన్న యింటఁ గాపుర ముండిరి. నేను అఱవ పూటకూటింట భుజించుచు, స్నేహితునిబసలో నివసించుచుంటిని. కొలఁదిదినములలో ప్రథమశాస్త్రపరీక్షాఫలితములు తెలిసెను. మాతమ్ముఁడు వెంకటరామయ్య ఆపరీక్షలో నుత్తీర్ణుఁడై, పట్టపరీక్షతరగతిలోఁ జేరెను. మృత్యుంజయరావు తమ్ముఁడు కామేశ్వరరావు చెన్నపురిలో పట్టపరీక్షకుఁ జదువుచు, సైదాపేటలోని యన్న యింట విడిసియుండెను. ఆర్య పాఠశాలాధికారియు, హిందూపత్రికాసంపాదకులును నగు జి. సుబ్ర హ్మణ్యయ్యరుగారు, బుచ్చయ్యపంతులుగారిసిఫారసుమీఁద, బోధనాభ్యసనానంతరమున మిత్రుని నన్నుఁ దమవిద్యాలయమున బోధకులగ నియమింతుమని వాగ్దానము చేసిరి. కొలఁదిదినములకే మాపట్టపరీక్షాఫలితములు తెలిసెను. గణితశాస్త్రమునందు జయ మందుటచేత మృత్యుంజయరావును, మూఁడుభాగములందు నొకమాఱె యుత్తీర్ణ మగుటచేత నేనును, పట్టపరీక్షఁ బూర్తి చేసితిమి. కావున మేము బోధనాభ్యసన కళాశాలలో నుండుట నిశ్చయ మయ్యెను.
పైని చెప్పిన నిత్యకర్మానుష్ఠానమున మునిఁగి మిత్రుఁడు నేనును మేయి 10 వ తేదీవఱకును సైదాపేటలో నుంటిమి. మాకుఁ బ్రియమగు భావికాలమునందలి "ఆస్తికపాఠశాల"నుగుఱించి మే మిరువురము మాటాడుకొనుచుందుము. ఆవిద్యాలయము నెలకొల్పుట సాధ్యమని యొకమాఱును కా దని యొకమఱును మాకుఁ దోఁచుచుండెను. పాఠశాలాస్థాపనము నిజమైనచో, రాజమంద్రిలో ముందు మేము సమాజవిధులు, పత్రికపనులు నెట్లు జరుపుదుమా యని యాలోచించు కొనుచుందుము.
మృత్యుంజయరావు స్మేహపాత్రుఁడె. కాని, యతఁ డొక్కొకసారి యమితమితభాషిత్వ మూని, తన మనస్సునందలి సందియములను సహచరుఁడను సహాధ్యాయుఁడను నగు నాతో ధారాళముగఁ జెప్పకుండెడివాఁడు. పరదేశమున నొకరికష్టసుఖముల కొకరు కావలసిన మా కిరువురకు నందువలనఁ దగినంత సౌహార్దమేర్పడక, మీఁదు మిక్కిలి యరమరలు జనించెను. తక్కిన మిత్రులైనను, మాపొరపాటులను సవరించి, మాకుఁ బొత్తు గలిగింపనేరకుండిరి.
సైదాపేట మద్రాసునకంటె నెక్కువ యారోగ్యప్రదమైనది. ఆకాలమున బోధనాభ్యసన కళాశాలచెంతనే "వ్యవసాయకళాశాల" కూడ నుండెడిది. ఆకళాశాల కనుబంధముగ మంచిపొలము లుండెడివి. పెద్దపెద్దయావులు వర్ధిలుచుండెడివి. స్వచ్ఛముగనుండు నచటియావు పాలును, ఆపొలములలో పైరగు కూరగాయలును మేము కొనుక్కొను చుండెడివారము. ఆవైపునకు షికారు పోవునపుడెల్ల నిర్మలవాయువును బీల్చుచు, మనోహరములగు పూలమొలకలను జూచుచు నుండెడివారము.
సైదాపేట యెంతటి చక్కని నిశ్శబ్దప్రదేశమైనను, మే మచటి సౌకర్యముల ననుభవింప వలనుపడకుండెను. కళాశాలాదినములలో మే మెచటికిని కాలు గదుపుటకు వ్యవధానమె లేదు. నేను అఱవ పూటకూళ్ల వారియతిథిని, అచటివంటకములు మొదట కొన్ని దినములు చోద్యముగ నుండినను, పిమ్మట నోటికి వెగ టయ్యెను. చప్పనికూరలు, సారహీనములగు పప్పుపచ్చడులును, నేయిలేని యన్నమును, అనుదినమును భుజించి, నానాలుక బరడుగట్టిపోయెను ! అఱవవారిసాంప్రదాయములు, ద్రావిడాచారములును జూచి, మా తెలుఁగుకన్నులు కాయలుగాచిపోయెను ! ఎపుడు పాఠశాల గట్టివేయుదురా యని మేము రోజులు లెక్కించుకొనుచుంటిని. తుదకు 11 వ మేయి తేదీని మిత్రులయొద్ద వీడుకో లొంది, నేను రెయిలులో రాజమంద్రి బయలుదేరితిని.
46. వేసవిసెలవులు
నేను రాజమంద్రికి వచ్చుటయే తడవుగా, మరల నచటిసమాజముకొఱకు పాటుపడితిని. "సత్యసంవర్థని"కి వ్యాసములు రచింపఁ బూనితిని. కనకరాజు నేనును సమాజపుస్తకములను సరిదితిమి. నే నాతనితో "ఆస్తికపాఠశాల"నుగూర్చి ముచ్చటించునపుడు, సానుభూతి నగఁబఱచి, మిత్రులమనస్పర్థలు పోఁగొట్ట నాతఁడు ప్రయ