ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/వ్యాధిగ్రస్తత
రావుగార్లు పరశువాకములో బుచ్చయ్యపంతులుగారియింటఁ గలసి కాపురము చేయునట్టుగను, సైదాపేటలోఁ గాపురముండు నేను మృత్యుంజయరావునకు భోజనసౌకర్యము చేయుటకును, ఏర్పాటు లయ్యెను ! సహాధ్యాయుఁడు కొల్లిపర సీతారామయ్యగారు సకుటుంబముగ నుండు నింటిభాగమున మేము సైదాపేటలోఁ గాపుర మేర్పఱుచుకొంటిమి. కురుపులబాధతో మాకడగొట్టుచెల్లెలు చనిపోయెనని తెలిసి మిగుల విషాద మందితిమి.
47. వ్యాధిగ్రస్తత
నేను సైదాపేటలో పాదము పెట్టుటయే తడవుగ నాశరీరమున మరల వ్యాధి యంకురించెను. జ్వరముతో నారంభించినరోగము మెల్లగ నజీర్ణవ్యాధిగఁ బరిణమిల్లెను. నా జఠరము మిగుల బలహీన మయ్యెను. మద్రాసునందలి మిత్రుఁడు నారాయణస్వామినాయఁడు గారు మంచిమందు లిచ్చెనేగాని, రోగములొంగక లోలోననే రగులు చుండెను. నీరసము హెచ్చెను. కొంచెము నెమ్మదిగ నుండినపుడు పాఠాశాలకుఁ బోయి విద్య గఱపుచును, బజారువెచ్చములకై యెండలోఁ దిరుగుచును నుంటిని. ఈమధ్యగ నొకటిరెండుసారులు నాభార్యయు జబ్బుపడెను. ఎటులో నా పనులు చేసికొనుచు, నేను దినములు గడుప నెంచితిని.
"లంకణములలో మనుగుడుపు" అనునట్టుగ, కష్టపరిస్థితులందు నాభార్యకుఁ జదువు చెప్పుటకును, ధర్మసూత్రములు బోధించుటకును నేను బూనుకొంటిని ! నాసహచరుఁడు సీతారామయ్యగారిసతియు జననియు చెల్లెండ్రును నాభార్యయం దమిత ప్రేమానురాగములు గలిగి వర్తించిరి. క్రొత్తనెచ్చెలుల సావాసమున నాభార్యకు విద్యయందభిరుచి కలిగెను. నాగురువర్యులగు మల్లాది వెంకటరత్నముగారు ఆజూలై నెలనుండియుఁ బ్రచురించెడి "తెలుఁగుజనానాపత్రిక" ప్రతులును, "సత్యసంవర్థనీ" పత్రికయును, ఇతరపుస్తకములందలి కథలు మున్నగు నవియును జదువుచు, నాభార్య విద్యయం దభివృద్ధిఁగాంచుచుండెను.
నా నీరసస్థితిని గ్రహించి కళాశాలలో ప్రథమోపాధ్యాయుఁడు నేను బోధింపవలసినపాఠములు తగ్గించెను. ఇప్పుడు నేను ప్రవేశపరీక్షకుఁ జదివెడి యొకవిద్యార్థికి తెలుఁగుమాత్రమే చెప్పవలెను.
రాజమంద్రిలోని క్రైస్తవపాఠశాలాధికారి తనవిద్యాలయము నందు ప్రథమోపాధ్యాయపదవి నా కిచ్చెద నని జూలైతుదిని వ్రాసెను. నా కిది యక్కఱలేదని యానాఁడే యాయనకుఁ బ్రత్యుత్తర మిచ్చి, యీసంగతి కనకరాజునకుఁ దెలియఁబఱచితిని.
కష్టసుఖములందును రోగారోగ్యములందును, పత్రికాపుత్రిక యగు సత్యసంవర్థని యభ్యున్నతికై నేను పాటుపడితిని. ఇప్పుడు నెలనెలయును ఆంగ్లేయవ్యాసములు నేనే వ్రాసి సరిచూచి పంపుచు వచ్చితిని. ఇవిగాక, వార్తలు విశేషములు, ఉల్లేఖనములును నేనే సిద్ధపఱచుచును, అప్పుడప్పుడు ఆంధ్రవ్యాసములు రచించుచునువచ్చితిని. ఇప్పుడు కనకరాజు పట్టపరీక్షకు కొలఁదిమాసములకే పోవలసినవాఁ డగుటచేత, ఆపరీక్ష మొదటితరగతిలోఁ జదువుచుండు నాతమ్ముఁడు వెంకటరామయ్య "సత్యసంవర్థనీ" సంపాదకత్వమున నాతనికి సహాయుఁ డయ్యెను.
రాఁబోవు సంవత్సరమునుండియు రాజమంద్రిలో మొదటితరగతి బోధనాభ్యసనకళాశాల నెలకొల్పఁబడు ననువార్తను ఆగష్టు నాలుగవ తేదీని "హిందూపత్రిక"లో నేను జూచితిని. ఇదియే నిజ మైనచో, మెట్కాఫ్దొర చెప్పినట్టుగ రాజమంద్రిలోని యున్నతపాఠశాలా విద్య యంతయు దొరతనమువారి హస్తగత మగును ! అందువలన మాయుద్యమమునకు తప్పక భంగము గలుగును. ఇది చూచిన మృత్యుంజయరావునకును నాకును మతి పోవునటు లయ్యెను. 6 వ ఆగష్టు ఆదివారమున, నేను మృత్యుంజయరావును గలసి చెన్నపురి వెళ్లి, హిందూపత్రికాధిపతియగు సుబ్రహ్మణ్యయ్యరుగారితో సంభాషించితిమి. రాజమంద్రికళాశాలనుగుఱించి నేను వ్రాయువ్యాసము లాయన తన పత్రికయందుఁ బ్రచురించుట కంగీకరించెను. "ఆంధ్రప్రకాశిక" పత్రికాధిపతులగు పార్థసారధి నాయఁడుగారు నిటులె చేయుటకును, నాకుఁ దమపత్రిక నుచితముగఁ బంపుటకును దయతో సమ్మతించిరి.
ఆసాయంకాలము మరల మేము సైదాపేట వచ్చునప్పటికె హిందూపత్రికకు నాప్రథమవ్యాసము పూర్తియయ్యెను ! మఱునాఁడె నే నది యాపత్రికకుఁ బంపివేసితిని. కడుపులోనివికారముతో బాధ నొందుచుండినను, వ్యాసరచనావ్యాసంగమున నే నుంటిని ! ఆదినములలో కామేశ్వరరావుభార్య పరశువాకములో జబ్బుపడుటచేత, ఆమెసహాయార్థమై నాభార్య నచటికిఁ బంపువేసితిని. నా కంతకంతకు శరీరమున వ్యాధి నీరసములు హెచ్చుచుండెను. ఒక నెల సెల వీయుఁడని వైద్యాలయాధికారియొద్దకుఁ బోయితిని. సర్టిఫికేటు "రేపిచ్చెదను, మాపిచ్చెదను" అని న న్నాతఁడు త్రిప్పి బాధించెను. కళాశాల రైటరుమాత్రము సజ్జనుఁడు, శాంతచిత్తుఁడును. నాకు సదుపాయము చేయుదునని యతఁడు వాగ్దానము చేసెను. నావ్యాధి దినదినమును ముదురుచుండెను. నాకు వైద్యుని సర్టిఫికేటు దొరకినను దొరకకున్నను, రాజమంద్రి పోయి ప్రాణములు దక్కించుకొన నేను నిశ్చ యించుకొని, 12 వ ఆగష్టు శనివారమురోజున మృత్యుంజయరావుతో పరశువాకమునకుఁ బయన మైతిని.
ఆకాలమున సుప్రసిద్ధవైద్యులగు వరదప్ప నాయఁడుగారియొద్ద మందు పుచ్చుకొనుచు, చెన్నపురిలోనే యుండు మని బుచ్చయ్యపంతులు గంగరాజుగార్లు నా కాలోచన చెప్పిరి. నాయఁడుగారి మందువలన నేను గొంచెము తెప్పిఱిల్లి, వెంకటరత్నమునాయఁడు గారు మున్నగు మిత్రులను సందర్శించుచుంటిని. కాని, 17 వ ఆగష్టు నుండి నావ్యాధి ప్రకోపించెను. నాయసహాయస్థితిఁ జూచి, నా భార్యయు, మిత్రుఁడు గంగరాజును గన్నీరు తెచ్చుకొనిరి. రాజమంద్రి తిరిగి చూచినఁగాని నాకు దేహస్వాస్థ్యము గలుగదని చెప్పివేసితిని. ఆమఱునాఁటిసాయంకాలము భార్యతో నేను రాజమంద్రి పయనమైతిని. ఈనీరసస్థితిలో నేను బ్రయాణము చేయవలసివచ్చినందుకు మిత్రులు విచారము నొందిరి.
ఐనను, రెయిలులో నాజబ్బు హెచ్చలేదు. కృష్ణానది యావలి యొడ్డున సీతానగరమునందు రెయిలు దిగి, యిసుకలో నడచి, చక్రముల పడవ మీఁద బెజవాడయొడ్డు చేరి, రెయి లందుకొను నప్పటికి, నాకు తలప్రాణము తోఁకకు వచ్చెను ! ఎటులొ రాత్రికి రాజమంద్రి చేరితిమి. "విశీర్ణగ్రామ" కథానాయకునివలె స్వస్థలముననే నేను స్వస్థుఁడను గాఁగోరితిని ! తలిదండ్రులు తమ్ములు చెలియండ్రును నాయెడఁ బ్రేమాతిశయమున నుండిరి.
రాజమంద్రి వచ్చినకొన్నిదినములవఱకును నాకు దేహమున ససిగాలేదు. ఇచట కనకరాజు వీరేశలింగముపంతులు మున్నగుమిత్రులు నన్నుఁ జూచిరి. రంగనాయకులునాయఁడుగారు, తియ్యనిమందు లిచ్చి నా యారోగ్యము చక్కపఱతునని నన్నుఁ బ్రోత్సహించిరి. సత్యసంవర్థనికి వ్యాసములు వ్రాయుట, చందాదారులకుఁ బత్రికలంపుట, సమాజపుస్తకాగారము సరిచూచుట మున్నగుపనులతో దినములు గడపితిని. స్కాటు, షేక్స్పియర్ మున్నగు కవులరచనములు చదివి వినోదించుచుంటిని.
ఒక్కొక్కప్పుడు కడుపులోనిబాధ యుద్రేకించి నన్ను వేధించు చుండెను. రంగనాయకులునాయఁడుగారు ప్రీతిపూర్వకముగఁ జేసిన వైద్యమువలన, శరీరమునఁ గొంతస్వస్థత గలుగుచుండెను. పరిపూర్ణారోగ్యము లభించుటకు నే నిచ్చట నింకొకనెల యుండవలయునని స్నేహితు లనిరి కాని, సైదాపేటకళాశాలాధ్యక్షునికోరికమీఁద గాని, నా సెలవు పొడిగింప వీలుపడదని మండలవైద్యాధికారి చెప్పివేసెను. మరల సైదాపేట పోవుట తప్ప నాకు గత్యంతరము లేదు ! నే నంత ప్రయాణసన్నాహము చేసితిని. 10 వ సెప్టెంబరున చెన్నపురి సుఖముగఁ జేరి, కళాశాలలో మఱునాఁడు ప్రవేశించితిని.
48. ఆస్తికపాఠశాల
నేను తిరిగి సైదాపేట సేమముగ వచ్చినందుకు సహచరులు సంతోషించిరి. కళాశాలకుఁ బోయి, యథాప్రకారముగ నాపనులు చూచుకొనుచువచ్చితిని. ఐనను, నాశరీరమునుండి రోగాంకురములు పూర్తిగఁ దొలఁగిపోలేదు. అపుడపుడు నాకు జ్వరము, అజీర్ణమును గానిపించుచునేయుండెను. నాభార్యకుఁగూడ జబ్బుచేయుచునే వచ్చెను. సైదాపేట శీతలప్రదేశ మగుటచేత, తఱచుగ మా కస్వస్థత గలుగుచుండె నని మిత్రు లనుచువచ్చిరి.