ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/జనకుని విచిత్ర చిత్తవృత్తులు
డని యొకమాఱును లేఁ డని యొకమాఱును సిద్ధాంతరాద్ధాంతములతోఁ గూడిన హేతువాదనలతో నాతఁడు మాయెదుట వాదించు చుండును ! గట్టిప్రయత్నములు చేసి దేశక్షేమంకరములగు సంస్కారములు నెలకొల్పుట విద్యాధికులధర్మ మని యొకతఱియును, మానుష ప్రయత్నము నిష్ప్రయోజన మనియు, కాలప్రవాహమునఁ బడి లోకము శక్తివీడి గొట్టుకొనిపోవుచున్న దని యొకతఱియును, అతఁడు వాదించుచుండును ! వీనిలో ప్రతియొకవాదనయు సహేతుకముగఁ గానవచ్చినను, ఇట్టి వన్నియు నొకపుఱ్ఱెలోనే పుట్టి, ఒక నోటనె బయలువెడలుట గాంచిన యువకుల మగు మేము విభ్రాంత చేతస్కుల మగుచుందుము !
22. జనకుని విచిత్ర చిత్తవృత్తులు
ఇంతలో కళాశాలకు వేసవికాలపుసెలవు లిచ్చిరి. విద్యార్థులగు హితు లెవరిగ్రామమునకు వారు వెడలిపోయిరి. మాకుటుంబముకూడ రాజమంద్రి విడిచెను. మా తమ్మునివివాహ మిపుడు నిశ్చయమయ్యెను గాన, మేము ముందుగ వేలివెన్ను పోయి, అచటినుండి రేలంగి వెళ్లితిమి. అక్కడనుండియె మేము పెండ్లికి తరలిపోవలెను. వివాహమునకు వలయుసన్నాహ మంతయు జరుగుచుండెను.
వివాహమునకు ముందలిదినములలో నింట మాతండ్రి వెనుకటివలెనే సంస్కరణవిషయములనుగూర్చి నాతోఁ జర్చలు సలుపుచుండెడివాఁడు 22 వ ఏప్రిలురాత్రి భోజనసమయమున మా తండ్రి మాటాడుచు, పోలవరముజమీందారు క్రైస్తవుఁ డయ్యె నని మాకువినవచ్చినవార్తమీఁద వ్యాఖ్య చేసి, మతభ్రష్టత్వమును గర్హించి మితిమీఱిన కోపావేశము గనఁబఱచెను. "జాతిబాహ్యుఁడైపోకుండ నెవఁడుగాని సంఘములో నిలిచియె తన యిచ్చవచ్చినట్టుగ నీశ్వరుని ధ్యానింపఁగూడదా ?" అని యాయన ప్రశ్నము. మా నాయన యెపుడు నిట్లు పూర్వాచారపరాయణతయె గనఁబఱచినను కొంత మేలే ! కాని, ఆయన స్థిరత్వము లేక, ఒకప్పు డొకవిధముగను, ఇంకొకసారి యింకొకరీతిని మాటాడుచుండువాఁడు. అందువలన నే నాయనను గపటి యని తలంచువాఁడను. దీనికిఁ దగినంత కారణము లేకపోలేదు.
1. "బ్రాహ్మణులు మహిమాన్వితులు, బ్రహ్మవర్చస్సున తేజరిల్లుమహానుభావులు. వారిని నిరసించి పరాభవించువారికి పుట్టగతులు లే"వని యొకమాఱును, "బ్రాహ్మణులు మ్రుచ్చులు ! వారిని గర్హింపవలెను" అని యింకొకమాఱును.
2. జాతినిగుఱించి మాటాడుచు, "అగ్రవర్ణమున నుండుటయె బ్రాహ్మణునిగౌరవము తెల్పుచున్నది. స్వజాత్యాభిమానము మన ముఖ్యధర్మము" అని యొకప్పుడును, "అన్నిజాతులు నొకటియె. భోజనసమయమున బ్రహ్మణేతరులను జూచుటకు బ్రాహ్మణులు సంకోచపడ నక్కఱలేదు. బొంబాయి ప్రాంతములందలి బ్రాహ్మణులు మనవలె దృష్టిదోషమును పాటింపరు." అని యొకప్పుడును
3. వేదములనుగూర్చి ప్రసంగించుచు, "వేదములు దేవదత్తములు. వేదాధ్యయనసంపన్నుఁడైన బ్రాహ్మణుఁడు దైవసమానుఁడు, పాముమంత్రమునకు దయ్యముమంత్రమునకును పటిమ యుండగా, వేదమంత్రములకు మహత్తు లేకుండునా ? విగ్రహములకు మహిమ లేక పోలేదు." అని యొకప్పుడును, "విగ్రహము లనిన నాకు తలనొప్పి, హృదయమే యీశ్వరాలయము. పూజల కని నేను బ్రాహ్మణులను ప్రార్థింపను." అని యొకప్పుడును మాతండ్రి పలుకుచుండువాఁడు ! ఆయనకుఁ గల యిట్టి పరస్పరవిరుద్ధభావములు చూచినపుడు ఆశ్చర్యమంది, ఆయన కీవిషయములందు కాపట్య మారోపించి నేను కొంత వఱకు సేదదేఱుచుందును !
దినదినమును మా తండ్రిచర్యల వైపరీత్య మతిశయించుచుండి నట్లు నాకుఁ గనఁబడెను. రేలంగిలో నొకనాఁటిరాత్రి మా పురోహితునితో మాటాడుచు, మాజనకుఁడు నన్నుఁ జూపించి, "మతమును గుఱించి చర్చ చేయుటకు మావాఁడు మిక్కిలి సమర్థుఁడు. మొన్న రాజమంద్రిలో వీడు వీనిస్నే హితులును ఒక స్వాములవారితో వేదములు మొదలగువాటినిగుఱించి చర్చ చేసి జయించిరి. దేవు డొక్కడే యనిన్ని, మనుష్యు లందరు సమాను లనిన్నీ మావాడు వాదింపగలడు" అని ఆయనతోఁ జెప్పివేసెను !
దీనినిఁబట్టి మాతండ్రి నాయభిప్రాయములను బాగుగ గుర్తెఱిఁగియె యుండె నని నేను స్పష్టపఱుచుకొంటిని.
ఇది జరిగిన కొలఁదిదినములకు నే నొకప్రొద్దున, "సంస్కరణావశ్యకత" ను గూర్చి తెలుఁగున నొకవ్యాసము వ్రాయుచుంటిని. అప్పుడప్పుడు నాదగ్గఱకు వచ్చి మాతండ్రి నావ్రాఁత కనిపెట్టు చుండెను. రాత్రి భోజనానంతరమున నేను జదువుకొనుచుండఁగా, ఆయన మాపురోహితుని మఱికొందఱిని వెంటఁబెట్టుకొని నాదగ్గఱకు వచ్చి, ప్రొద్దున వ్రాసినకాగితము చదువు మని నన్నుఁ గోరెను. "మా వాడు రాజమంద్రిలో ఒక మతసభకు కార్యదర్శి. జాతు లన్ని యు నొక్కటె యని యతనిమతము. మతవిషయములగుఱించి మీలో నెవరితోనైనను వీడు వాదించగలడు ! మావాడు యింగ్లీషున వేద ములు చదివినాడు" అను నతిశయోక్తులు పలికి, మాతండ్రి నావ్యాసమును వినఁగోరెను. నే నేమి చేతును? బెదరు తీఱి నావ్యాసము చదివి, సంతోషభరితుఁడ నైతిని. భవిష్యత్తున నేను మాహావక్తనై యుపన్యాసములు గావించెద నని యుప్పొంగిపోతిని. ఒకటిమాత్రము నా కింతట స్పష్ట మయ్యెను. సంస్కరణమందు నాకుఁగల గట్టిపట్టుదల మానాయనకు ద్యోతక మయ్యెను. కాని, నాయాశయము లెన్నటికిని కార్యరూపముఁ దాల్చక, కేవల సంకల్పదశయందె యుండు నని మా తండ్రివాంఛ కాఁబోలు !
23. వెంకటరావు సావాసము
నా పూర్వమిత్రుఁడగు వెంకటరావు, ఆ దినములో తన యారోగ్యమునిమిత్తము రేలంగి వచ్చెను. అతనిమామగారు అక్కడనే జమిందారీయుద్యోయై, కుటుంబముతో నుండెను. వేసవి సెలవులు నేనును రేలంగిలోనే గడపుటచేత, నాస్నేహితునిఁ దఱచుగఁ గలసికొనుచు వచ్చితిని. వ్యాధిప్రకోపమువలన నానేస్తునిదేహము మిక్కిలి శుష్కించిపోయెను. ఆనవాలు పట్టలేని రీతిని శరీరము చిక్కియున్నను, అతని మాటలు, అతనివైఖరియును, వెనుకటివలెనే ఝంకరించుచుండెను ! ఆతఁడు రాజమంద్రి విడిచి వచ్చినపిమ్మట నచ్చటి సమచారములు, సంఘసంస్కరణసమాజ స్థాపనము, సారంగధరునిమెట్టమీఁది మాఫలాహారములు, అదికారణముగ బయలువెడలిన మాబహిష్కార వృత్తాంతములు, ఇవియన్నియు సమగ్రముగ నేను వినిపించి, సంస్కరణము పట్ల నతని సాహాయ్యసానుభూతులు స్నేహితుల మాశించుచుంటి మని పలికితిని. తా నెన్నఁడును తలంపనివిధమున మేము పట్టణమునఁ గార్యసాధనము చేయుచుండుట కాతఁడు ముదమంది, నే నభివృద్ధి నొందుట కభినందించెను.