ఆత్మచరిత్రము/ప్రథమభాగము : విద్యార్థిదశ/పెద్ద పలుకులు !

వికీసోర్స్ నుండి

యును లేదు ! విద్యాధికులు నీతినియమములు పాటింపనివారు ! సంస్కారులకు దేవుఁడు దయ్యము నను వివక్షలు లేవు ! వీరలలో నగ్రేసరుఁడగు వీరేశలింగముపంతులు పరమనాస్తికవాది, సర్వసంకరములకును మూలకందము ! ఇట్టిదురూహలు సతిమనసునుండి పాఱఁద్రోలి, విద్యావంతులు సంస్కారప్రియులును సుగుణసంపత్తికి దూరులు గారనియు, మీఁదుమిక్కిలి వారు స్వార్థరహితజీవితమునకు నాదర్శప్రాయు లనియు బోధించుట నా కిపుడు ప్రథమగార్హస్థ్యధర్మ మయ్యెను. కాని, ఆనాఁటి నా యసంపూర్ణ బోధనలకంటె ననుభవపూర్వకమగు స్వయంకృషిచేతనే యాపొలఁతి నానాఁట తెలివి గలిగి, పిమ్మట "జనానాపత్రిక"లో బ్రచురమైన "శారద" కథానాయిక వలె, పతి కాశ్చర్యము గొలిపెడి సువిద్యాప్రబోధముఁ గాంచి యుండెను !

34. పెద్ద పలుకులు !

ఒకనాఁడు నా పూర్వసహపాఠి యొకఁడు నాయొద్దకు వచ్చి, తన్ను నీచకులస్థుఁ డని కళాశాలలోని మిత్రులు గేలి చేయుచుండిరని చెప్పి, విచారము నొందెను. ఇతఁడు వేశ్యకులజుఁడు. విశాలభావము లలవఱచుకొనవలసిన విద్యార్థులు, గుణసంపన్నుఁడగు నీతనిని నిరసించుట శోచనీయ మని నేను కళాశాలలో మిత్రులతోఁ బలికితిని. వారు నామాట లూఁకొట్టిరే కాని, మనస్సు మార్చుకొనినట్లు గానఁబడలేదు !

పట్టపరీక్షతరగతులలో మాకొక పంచమజాతిక్రైస్తవుఁడు సహపాఠిగ నుండెడివాఁడు. ఒకనా డాతఁడు నాబల్ల యొద్దకు వచ్చి, తా నచటఁ గూర్చుండవచ్చునా యని యడిగెను. విద్యార్థి తర గతిలో నెచటనైనఁ గూర్చుండవచ్చును గాన, నే నాతనిప్రశ్న కాశ్చర్య మందితిని. కాని, హీనజాతివాఁడ నని మిత్రులు తన్ను హేయముగఁ జూచి, తమదరిఁ జేరనీయకుండి రని యతనివలన విని, నా కమితమగు కోపము వచ్చెను. తరగతిలో ననేకులు జాతిభేదములు పాటింప మని చెప్పుకొను ప్రార్థనసామాజికులు. వీ రిట్లు సంకుచితభావములతో నీతనిపట్ల మెలఁగుట నా కాశ్చర్యవిషాదములు గలిగించెను. తెలివిగలవాఁడును, తెలుఁగులో నందఱికంటె మిన్నయును నగునీసహచరు నిట్లు అవజ్ఞ చేయుట తగదని నేను రెండుమూఁడు మాఱులు స్నేహితులతో నొక్కి చెప్పఁగా, వారొకరిమొగ మొకరు చూచుచుండిరే కాని, తమనడవడికి విచారపడలేదు ! అందువలన నావిషాదము మఱింత హెచ్చెను. ఎక్కువచనవుగల యొకమిత్రుఁ డంత మెల్లగ నాతో, "నీకుఁగల సోదరభావము మాకును లేకపోలేదు. కాని, గోమాంసభక్షకుఁడైన యాతఁడు చెంతఁ గూర్చుండు నపుడు మే మచట నిలువఁజాలము !" అని పలికెను. ఈతని మాటలలోఁ గొంత సత్యము లేకపోలేదు గాని, తమతో సమానునిగఁ జూచెడి నలుగుర మధ్య మెలఁగ నవకాశ మున్నప్పుడే యట్టియువకుఁడు ఎక్కువ శుచి శుభ్రములు గలిగి, ఎక్కువజాగ్రతతో సంచరింపఁగలఁ డని నేను నమ్మి, పంచమసహాధ్యాయుని ప్రేమించువాఁడను.

కళాశాలయొద్దనుండు కొట్లలో నే నెఱిఁగిన యొక పూఁట కూళ్ల ముసలమ్మను చుట్టుపట్టుల నుండు విద్యార్థులు, "జలపాత" మని పేరు పెట్టి, వేధించుచుండి రని నాకు వినవచ్చెను ! విద్యాధికులును, ప్రార్థనసమాజికులును గూడ నిట్లు చేయుటకు నే నెంతయు వగచితిని. ఇట్టిసహాధ్యాయులఁ గొందఱి నొకచోటికి నేను బిలిచి, విద్యాధికు లగువారు తమబాధ్యతలను గుర్తింపక, దిక్కులేని పేద పూఁటకూటిదానిని బరిహసించుట సిగ్గులచేటని నొక్కిచెప్పితిని. వీరి మధ్యనుండు సాంబశివరా వంత నందుకొని, నే నందఱిలోను మొనగాఁడ ననుకొని మిడిసిపడుచుంటి ననియు, ప్రార్థనసమాజమునకు నిరంకుశాధికారి నని భావించుకొనుచుంటి ననియు, తానుమాత్రము నన్నావంతయు లెక్కసేయ ననియుఁ జెప్పి వెడలిపోయెను ! ఇది జరిగిన యొకటిరెండు మాసములవఱకును నాతో నతఁడు మాటాడక, సదా మౌనమున నుండువాఁడు ! చనవరియు సరసుఁడునునగు సాంబశివరావే యిట్లు నాతో మాటాడకుండుటకు నేను వగచి, ఒకనాఁ డాతని బిలిచి, "జలపాత"సందర్భమున నే వాడిన నిష్ఠురోక్తులకు నన్ను మన్నింపు మంటిని. నాచెలికాఁ డంత పసిపాపవలె గోలుగోలున నేడ్చి, నామాటలకుఁ దా నేమియు తప్పుపట్టలే దనియును, తనజిహ్వ నరికట్టుటకే తా నీదీర్ఘమౌనవ్రతమవలంబించి ప్రవర్తనమున లాభ మందు చుంటి నని చెప్పెను ! పిమ్మట మే మిరువురమును వెనుకటివలెనే, మనసుగలసిన నేస్తుల మైతిమి.

కాని, యెల్లరును సాంబశివరావు వంటి నిష్కాపట్యహృదయులు గారు. మితిమీఱిన గర్వము నహంభావమును ప్రేరించుటచేతనే నే నిట్లు పెద్దమాటలు చెప్పుచున్నా నని యెంచి, ప్రార్థనసామాజికులలోఁ బలువురు నన్ను లోలోన ద్వేషించిరి. దీనిపర్యవసానము, కొంతవఱకు, కళాశాలాంత్యదినములలో నాకుఁ గానఁబడెను.

35. రంగనాయకులు నాయఁడు గారు.

నేను చెన్నపురి పోయి వచ్చినను, నా నేత్రములబాధ నివారణము గాలేదు. ఎక్కువసేపు చదివినను వ్రాసినను, కనులు మండుచుండును. "పెండ్లికి వెళ్లుచు పిల్లిని వెంటఁగోనిపోయిన" వానికివలె,