Jump to content

ఆత్మచరిత్రము/పరిచయవాక్యము

వికీసోర్స్ నుండి

ఆత్మచరిత్రలు, ఆత్మకథలు, స్వీయచరిత్రలు సకల జనులకును సహజములు. జీవితయాత్ర మానవులకు పురుషార్థసిద్ధికి సాధనము. జీవయాత్రయందు జన్మ సంస్కారము కర్మసంస్కారమూలమునను, ధర్మసంస్కార సాధనమునను పరిపక్వము నొందుచు, పురుషార్థమునకు సాధనమగుచున్నది. ప్రపంచమునందు కులీనులు, శ్రీమంతులు, బలవంతులు, పండితులు, వీరులు, శాస్త్రజ్ఞులు, మతాచార్యులు స్వీయచరిత్రకథనమున కధికారులుగ పరిగణింపబడుచున్నారు. జీవయాత్రయందు సుఖదు:ఖములు, లాభనష్టములు, జయాపజయములు, రాగద్వేషములు, జాతి కుల మత దశాభేదములును లేక సకలజనులకును సంభవములు. జీవయాత్రయందు సుఖదు:ఖములు, లాభనష్టములు, హెచ్చుతగ్గులు, ప్రియాప్రియములు, జయాపజయములు, ఆనందవిషాదములును, పండితపామరులకు, ధనినిర్ధనులకు, సవర్ణావర్ణులకు, గురుశిష్యులకు, స్వామిభృత్యులకు, స్త్రీపురుషులకు, బాల వృద్ధులకును సహజావస్థలు. సకలజనులును స్వకర్మ నిరతు లై సంసిద్ధిని బడయుట కవకాశములను నధికారమును గలిగియున్నారు.

పరమాణువునుండి పరబ్రహ్మమువరకును వ్యాప్తమైన విశ్వమంతయును విశ్వపరిణామమునకు వినియోగ పడుచున్నది. మహాపురుషులజీవితములవలె సామాన్యులజీవితములును విశ్వకల్యాణమునకు మంగళహారతులను సమర్పించుచు విశ్వవికాసమునకు వినియోగపడుచున్నవి. విశ్వయాత్రయందు వ్యక్తులజీవయాత్ర లన్యోన్యాశ్రయములై వికాసమును బొందుచున్నవి.

జీవయాత్రల యుపయోగానుపయోగములు, గుణావగుణములు, మహత్త్వాల్పత్వములును, సాపేక్షములు కాని నిరపేక్షములు కావు. బుద్ధివైభవమునందును, ధైర్యసాహసములందును, గుణశీలములందును, దాన ధర్మములందును, దైవభక్తియందును, సిరిసంపదలందును, విద్యావినయములందును, ప్రవృత్తినివృత్తిమార్గములందును మానవులకుగల భేదములు సాపేక్షములు. మహాపురుషుల జీవితములందువలె సామాన్యజనుల జీవితములందును సుగుణవిశేషములు సహజములు.

అవకాశాధికారములుగల జనులు వారి జీవిత విశేషములను లోకమునకు విశదముచేయుట పురుషలక్ష ణము. స్వీయచరిత్రకథన మాత్మోద్ధరణమునకువలె పరోద్ధరణమునకును వినియోగపడుచున్నది. సత్యార్థ ప్రకాశమునకును, దురభిమాన దురహంకార నిరసనమునకును, ఆత్మచరిత్రలు కథకులకును, పాఠకులకును సాధనములుగ నున్నవి. విద్యావంతుల చరిత్రములును సత్పురుషుల చరిత్రములును ధర్మాత్ముల చరిత్రములును నధికతరముగ నుపయోగపడినను, సామాన్యులచరిత్రలును నాత్మోద్ధరణమున కుపయోగపడగలవు. శ్రీయుత రాయసం వేంకటశివుడుగా రాత్మచరిత్రారంభమునందు నంతమందును వారి యాత్మచరిత్రయొక్క ప్రయోజనము నిట్లు వ్యక్తముచేసిరి:

"గ్రంథకర్త యేపుస్తకము వ్రాసినను, అది యాతని యాత్మ చరిత్రమె యగునని యొక సుప్రసిద్ధ రచయిత నుడివెను. మన రచనములు అద్దములవలె మన యభిప్రాయములను ప్రతిఫలనము చేయుచుండును. మన కొంకిగీఁతలెల్ల మన జీవితకథనే గీయుచున్నను, ఎంతజాగ్రత్తతోఁ జిత్రించిన జీవితచరిత్రమునందును, కొంకర గీఁతలు గానిపించుచునే యుండును! ఇతర రచనములందుకంటె నాత్మకథాసంవిధానమున భ్రమప్రమాదముల తాఁకు డధికముగఁ గానవచ్చును. పరులరూపమును జిత్రించుపట్ల నెంతో నిపుణతచూపు మనవ్రేళ్లు, సొంత ప్రతిమను గీయునపుడు వణకఁజొచ్చును! అహంభావము, పక్షపాతబుద్ధి మున్నగు దుర్లక్షణములు మనల నావేశించి, సత్యపధమునుండి యొక్కొకసారి మనపాదములను పెడదారులఁ బట్టించుచుండును. ఐనను, రోటిలోఁ దల దూర్చినవాఁడు రోఁకటి పోటులకు వెఱచునా? తన జీవితకథను ధారాళముగ వినిపింపసాహసించిన కథకునికి, చిన్నకల్లలచేఁ దన నెరసులు కప్పి పుచ్చనెంచుట సిగ్గులచేటుగదా !

"సత్యప్రకటనమె ముఖ్యావధిగఁ జేకొనిననేను, కీర్తిధనాదుల మీఁదఁ గన్నువేసి, యీ పుస్తకరచనమునకుఁ బూనుకొనలేదు. ఇదివఱలో నాత్మచరిత్రము నాంధ్రమునఁ బ్రచురించిన మద్గురు వర్యులగు కీ. శే. కందుకూరి వీరేశలింగముపంతులుగారి "స్వీయచరిత్రము"ను, గాంధీమహాత్ముని "ఆత్మకథ"ను మించనెంచి నే నీ పుస్తకమును వ్రాయలేదు. ఆ గ్రంథకర్తలు మహామహులు నాదర్శపురుషులును. ఒక్కొకప్పుడు నాబోటి సర్వసామాన్యుని చరిత్రముకూడ సంసారయాత్ర గడపుటయందు కొందఱికి సహాయకారి కావచ్చుననియె నాయాశయము."

"ఇవ్విధమున నా జీవితముగడచిపోయెను. నాకన్నులకె మిగుల లోపభూయిష్ఠముగ నున్న యీ జీవితము, స్వచ్ఛమును నాదర్శప్రాయము నని నే నెట్లు మురియఁగలను? ఐన నీకథ యెవరి కేమాత్రముగ నుపకరించినను, నేను ధన్యుఁడను. ముందును దయామయుఁడగు పరాత్పరుని ప్రాఁపె జీవితయాత్రయందు నాకుఁ జేయూఁత యగుఁగాత!"

పూర్వోదాహృతము లైన భావములు వేంకటశివుడుగారి సౌజన్యమునకును, వినయవివేకములకును నిదర్శనములైనను, గుణావగుణములనిర్ణయమునకు ప్రమాణములు కావని ఆత్మచరిత్రము విశదముచేయుచున్నది. శ్రీయుత రాయసం వేంకట శివుడుగా రాఱువేల నియోగిబ్రాహ్మణులు. తండ్రి సుబ్బారాయడుగారు, తల్లి సీతమ్మగారు. ప్రమోదూత సం. ఆషాడ బ. 10 (దశమి) శనివారము, కన్యాలగ్నమున, 1870 సంవత్సరము జూలయి 23 తేదిని వేలివెన్ను నందు జన్మించిరి. వీరి 6, 3 ఏండ్ల ఆత్మానుభవకథనము పాఠకులకు జీవయాత్రాసేవనమునం దుపచరింపగలదు. గ్రంథకర్త 652 పుటలందును విశదపఱచిన ఆత్మోదంత మాంధ్రావని యందును, హిందూస్థానమునందును, ప్రపంచమునందును సంప్రాప్తమగుచున్న భావక్రియా పరివర్తనమును సింహావలోకనము చేయుచు, ధీమంతులకు కర్తవ్యము నుపదేశించుచున్నది. గతించిన రెండు పురుషాంతరములందును నాంధ్రావనియందు సంప్రాప్తమైన సంస్కారాభ్యుదయమును వేంకటశివుడుగారి ఆత్మచరిత్రము సింహావలోకనము చేయుటకు వినియోగపడుచున్నది.

రాజమహేంద్రవర మాంగ్లసామ్రాజ్యస్థాపనానంతర మాంధ్రావనియం దారంభమునందు సాహిత్యవిజ్ఞాన సంస్కారవికాసమునకు కేంద్రస్థానముగ వెలసినది. ఆంగ్ల సంస్కారము ప్రాచీన భారతసంస్కారమును శిథిలము చేసినది. చిరకాలానుగతము లైన మతాచారములు, సాంఘికవ్యవస్థలు, సాహిత్యరచనలు, విద్యావిధానములు, ఆర్థిక ప్రయోజనములు, రాజ్యాంగనిర్మాణములు శిథిలములై, జీవయాత్రయందు నవీనాదర్శ ప్రయోజనము లుదయించినవి. దేశమునందు ప్రార్థనాసమాజములు, స్త్రీపునర్వివాహములు, పత్రికాప్రచురణములు, నూతనసాహిత్యరచనలు, ఆంగ్లవిద్యాలయములు, రాజకీయోద్యోగములు, నవీనవృత్తులు, పాశ్చాత్యవిజ్ఞానాభిమానమును నవజీవన నిర్మాణమున కుత్తేజమును గలుగజేసినవి. దేశావృతమైన సంస్కార పరివర్తనమునకు శ్రీయుత వీరేశలింగము పంతులుగారి జీవితచరిత్రము ప్రమాణముగ నున్నది. వేంకటశివుడుగారి జీవయాత్రానుసంధానమునకు, కాల మహిమకుతోడు, రాజమహేంద్రనివాసము, విద్యాభ్యాసము, వీరేశలింగము పంతులుగారి సాహచర్య సాంగత్యములు వినియోగపడినవిధమును ఆత్మ చరిత్రోదంతము విశదముచేయుచున్నది. జీవయాత్రయం దాత్మోపలబ్ధికి గృహరంగము బీజము; విద్యారంగము శక్తి; విశ్వరంగము కీలకము. మహాత్ములకువలె సామాన్యులకును నీరంగములు పురుషార్థసిద్ధికి వినియోగపడగల విధమును జీవితచరిత్రములం దాత్మచరిత్రము బోధించుచున్నది.

గృహరంగము: - ఆత్మచరిత్రములకు గృహరంగములు సుక్షేత్రములు. బాల్యమునందు గృహక్షేత్రము లందు సుప్రతిష్ఠితములైన గుణశీలములు కాలక్రమమున పల్లవించి పుష్పించి ఫలించుచున్నవి. బాల్యమునందలి యభ్యాసములు సామాన్యముగ జీవితయాత్రను నిరూపించుచుండును. కోమలహృదయములందు ముద్రితములైన గుణశీలములు జీవయాత్రను ఫలప్రదముచేయగల విధము నాత్మచరిత్రము వివిధ సందర్భములందు ప్రత్యక్షము చేయుచున్నది. గృహరంగములందు బాల్యదశ యందు తల్లికిని సోదరీసోదరులకును బంధుమిత్రాదులకును పరిచర్యలు చేయగల స్వభావము పరోపకారశీలమునకు సాధనం బగుచున్నది. వేంకటశివుడుగారు తల్లికి గృహ కృత్యములందును సోదరీసోదరుల కవసరసమయములందును చేసిన పరిచర్యలు వారి స్వయంసహాయస్వభావమునకును, పరహితపరాయణత్వశీలమునకును, ఆత్మవిశ్వాసమునకును నిదర్శనములు. కుటుంబమునకు సంప్రాప్తమైన సుఖదు:ఖము లానందవిషాదములకు మూలములై, ఆత్మోద్ధరణమునకు వినియోగపడగలవిధము నాత్మచరిత్రము విశదము చేయుచున్నది. గృహరంగములం దభ్యస్తములైన గుణావగుణములు, రాగద్వేషములు, భయభక్తులు, సాంఖ్యయోగములును, విద్యారంగమునందును, విశ్వరంగమునందును పరిపక్వములై జీవయాత్రయందు పరిస్ఫుటము లగుచున్నవి. విద్యారంగము : - విద్యారంగము జీవయాత్రకు సత్త్వాశ్రయము. పరిమితమైన గృహరంగమును విద్యారంగము విశాలము చేయుచు, జీవనప్రవాహమున కుత్తేజమును గలుగజేయుచున్నది. ఉపాధ్యాయులబోధలు, విద్యావ్యాసంగము, యువజనసాహచర్య సాంగత్యసంభాషణములు, ప్రాపంచిక వ్యవహారములును జీవయాత్రయందు సంఘర్షణమునకును, విషాదానందములకును మూలము లగు చున్నవి. గృహరంగమునకును, విద్యారంగమునకును నిత్యజీవనమునందు సంయోగసాహచర్యములు దుర్లభము లైనపుడు, సంఘర్షణము దుస్సహ మగుచున్నది. ఆత్మసంస్కారవిరహితమైన విద్యావిధానము, జీవయాత్రయందు గృహవిద్యారంగములకు సన్నిహితసాహచర్యము దుర్లభము చేసినవిధమును, ఆత్మచరిత్ర యందలి ఘట్టములు విశదము చేయుచున్నవి. తండ్రికొడుకుల దీర్ఘసంభాషణములసారాంశ మిటులు వారి 1900 ఏప్రిలు దిన చర్యపుస్తకమునందు గలదు: -

"మా జనకుఁడు జనాభిప్రాయమును శిరసావహించెడి భీరుఁడు; నే నన్ననో, స్వబుద్ధి సూచించినసత్యపథమునఁ బోయెడి ధీరుఁడను. ఆయన, పామరజనాచారములను గౌరవించి యనుసరించువాఁడు; నేను, వానిని నిరసించి నిగ్రహించెడివాఁడను. వే యేల, మా నాయన పూర్వాచారపరాయణుఁడు; నేను నవనవోన్మేషదీధి తుల నొప్పెడి సంస్కారప్రియుఁడను!" పాఠకులు నా యౌవనము నాఁటి యహంభావమునకు వెఱ గంద కుందురు గాక !"

జననీజనకులతో గలిగిన సంఘర్షణము బందుమిత్రులతోను, సంఘముతోను సహజముగ గలిగినది. ముత్తుస్వామిశాస్త్రి విపరీతవిధానము, జనకుని విచిత్ర చిత్రవృత్తులు, మొదలగు ఘట్టములు విద్యారంగము నందు గలిగిన సంఘర్షణమునకు నిదర్శనములు. వేంకటశివుడుగారి దినచర్యలు వారినియమ జీవయాత్రకు నిదర్శనములు. వారి 20 వ ఏటను వ్రాసిన 1 - 1 - 1990 దినచర్యయం దిట్లు గలదు.

"1 - 1 - 90 : - 'సర్వసమర్థుఁడా ! నాశత్రువులనుండి నన్ను రక్షింప నీవే యోపుదువు గాని, కడు దుర్బలుఁడ నగునేను గాను సుమీ !' ........1. శరీరసాధకమును గూర్చి ముఖ్యముగ శ్రద్ధవహింపవలెను. 2. కోపము, గర్వము, అసూయ, లోభము - వీని నదుపులో నుంచవలెను. 3. ప్రేమ, మతోత్సాహము మున్నగువానిపట్ల మితి మీఱరాదు. 4. నిరర్థకవిషయములనుగుఱించి కాలము వ్యర్ధపుచ్ఛఁగూడదు. 5. ఏపరిస్థితులందును పరనింద చేయరాదు. 6. మంచిసంగతినైనను, అధికవ్యామోహమునఁ జింతింపఁరాదు. 10. పరీక్షలో నఖండవిజయమున కైన నారోగ్యముఁ గోలుపోవరాదు. 11. ఈ విధులను జెల్లించుచు, దుస్సహవాసములు, దుస్సంకల్పములు, దుష్టదృశ్యములు - వీనిని త్యజింపవలయును."

విద్యారంగము సంరంభమునకు మూలమైనను, జీవయాత్రకు శక్తిని గలుగజేయుచున్నది. నవయౌవనో త్సాహ మభిమానావృతమయ్యును జీవితపరిణామమునకు సాధనభూత మగుచున్నది. వేంకటశివుడుగారు విద్యార్థి దశయందు నిర్వహించిన సత్యసంవర్ధనీపత్రిక, ప్రార్థనాసమాజము, సాహిత్యరచనలు, విద్యావ్యాసంగము మొదలగునవి వారి భావిజీవితపరిణామమునకు నిదర్శనములు. వేంకటశివుడుగారు యథార్థమైన విద్యార్థులైన విధమును వారి సంతతవిద్యావ్యాసంగము, ఆత్మజిజ్ఞాస, దైవభక్తి, సంస్కారప్రియత్వమును విశదము చేయుచున్నవి. విద్యారంగమునందలి యభ్యాసాదర్శములు విశ్వరంగమునందు సఫలముగా గల విధమున కాత్మచరిత్రలు ప్రమాణములు.

విశ్వరంగము : - గృహరంగమునం దభ్యస్తములైన ప్రేమభక్తులు, విద్యారంగమునందు సముపార్జితమైన కళాజ్ఞానమును విశ్వరంగమునందు యోగరూపమున నాత్మోపలబ్ధికి వినియోగపడుచున్నవి. సాంఖ్యము వృత్తిసాధనమున యోగరూపమును దాల్చు చున్నది. జీవయాత్రయందు వృత్తులందు భేదము లున్నను, ధర్మలక్ష్యమునందు భేదము లేదు. ధర్మార్థకామమోక్షములను సమకూర్చుటకు స్వధర్మనిర్వహణము ప్రమాణము కాని, వృత్తులు ప్రమాణములు కావు. ఆత్మచరిత్ర యీ పరమార్థము ననేకసందర్భములయందు బోధించుచున్నది. వేంకటశివుడుగా రాత్మచరిత్రమునందు 63 ఏండ్ల యనుభవానంతరము వ్రాసిన భావములు పండితపామరులకు మననార్హములు:

"చిన్ననాఁడు నే ననుకొనినట్టుగ పాఠశాలావరణమునకు వెలుపలిప్రదేశము పాపభూమి కాదనియు, వృత్తులందు పవిత్రత్వాపవిత్రత్వములు నియతములు కావనియు, సంకల్పశుద్ధియె సామాన్యముగ నేకార్యప్రాశస్త్యమును గాని నిర్ణయించు ననియు నానాఁట నాకు నచ్చెను. లోకములోవలెనే బోధకలోకమందును మేఁకవన్నె పులులు లేకపోలేదు. కాని, పరుల సంకుచితాశయములు పామరకృత్యములు వొరవడిగఁ గైకొనవలఁ దని సదా నేను మానసబోధ గావించుకొను వాఁడను. కీర్తిధనాదులను పరమావధిగ నెంచక, వృత్తి నిర్వహణమె ధర్మనిర్వహణముగఁ జేకొని మఱి విద్యాబోధన మొనరింపఁ బ్రయత్నించుచు వచ్చితిని. జ్ఞానస్వీకారమున నుత్తేజిత చేతస్కులగు శిష్యుల ముఖావలోకనము నిరతము నాకుఁ గనులపండువుగ నుండెడిది. కాని, యిది రానురాను క్రమశిక్షణధర్మ నిర్వహణములకు భంగకరమగు సుఖలోలత్వవ్యసనముగఁ బరిణమించిన తరుణము వృత్తివిరామమున కద నని గ్రహించి, విశ్రాంతి చేకొంటిని."

సుబోధకుడు : - విద్యార్థిదశయందు మిత్రాదులు "సుబోధకుడు" అని వేంకటశివుడుగారికి చేసిన నామకరణము జీవయాత్రయం దారూఢమైనది. వారు విజయవాడయం దుపాధ్యాయవృత్తి నుపక్రమించి, నెల్లూరునందు విరమించిరి. విజయవాడ, మద్రాసు, పర్లాకిమిడి, విజయనగరము, గుంటూరు, నెల్లూరుపురములందు విద్యాబోధకవృత్తియందు వారు చేసిన పరిశ్రమ ఆంధ్రావనియం దంతటను వారి శిష్య ప్రశిష్యుల జీవితములయందు ప్రత్యక్ష మగుచున్నది. వేంకటశివుడుగారి సుబోధకత్వము విద్యాబోధకవృత్తి యందే కాక వారివ్యాసములయందును, రచనముల యందును, దిన చర్యల యందును, మతానుష్ఠానమునందును, జీవియాత్రయందును, జీవితపరమార్థమైన ఆత్మచరిత్ర మందును గోచరం బగుచున్నది.

ఆత్మచరిత్రను సింహావలోకనము చేయునపుడు, వేంకటశివుడుగారు వారి జీవయాత్రను నిత్యమైన ఆత్మయాత్రను చేయుటకు చేసిన సంతతపరిశ్రమము పొడగట్టుచున్నది. జీవయాత్రను సంకుచితమైన ఆచారావరణమునుండి విశాలమైన ధర్మావరణమునందు ప్రవహింపజేయుటకు విశ్వ మనుభవించిన దు:ఖవేదనను విశ్వజీవయాత్ర యనంతముఖములను బోధించుచున్నది.

"కాలు కదపక, కలము సాగింపక, మనస్సు పరిశ్రమింపక యుండు నిర్భంధవిపరీతవిశ్రమ మెవరికైనా శాంతి సౌఖ్యము లొనఁ గూర్చినఁ గూర్చుఁగాక. నాకుమాత్ర మది కేవలదుర్భర దుస్థితియే!"

ఆచారావరణమునందు సంకుచితమైన జీవయాత్రను జ్ఞానావరణమునందు విశాలముచేయుట జీవ యాత్రకు పరమార్థము. ఆచారావరణబద్ధమైన జీవయాత్రను ఆత్మావరణమునందు విశాలము చేయగల విధము నాత్మచరిత్రము బోధించుచున్నది. జీవ మాచారావరణము నతిక్రమించి ఆత్మావరణమునందు విహరించుట కభ్యాసయోగము సాధనముగనున్నది. సంసారమునందును, వృత్తివిధానమునందును, సంఘజీవనమునందును, సాహిత్యోపాసనమునందును, దైవారాధనమునందును ఆత్మోపలబ్ధిని బడయుటకు వేంకటశివుడుగారు చేసిన పరిశ్రమను ఆత్మచరిత్రము తెలుపుచున్నది.

వేంకటశివుడుగారు సంసారయాత్రను సరళముగా 63 ఏండ్లు చేసిరి; విద్యావృత్తియందు జీవితమును సౌమ్యముగ గడపిరి; సంఘసంస్కారమునకై విద్యా వివేకములను వినియోగించిరి. సత్యసంవర్ధనీ జనానాపత్రికలను నిర్వహించియును, పత్రికలకు వ్యాసములను వ్రాసియును, హిందూసుందరీమణులు, చిత్రకథామంజరి, మొదలగు గ్రంథములను రచియించియును సాహిత్యోపాసనమును జేసిరి; నియతముగ దైవసంపదల యారాధనము, ఆసక్తిమతారాధనమును జేసిరి. జీవయాత్రయం దాత్మానాత్మల సంరంభమునం దాత్మోద్ధరణమునకై చేసిన ప్రయత్నముల నాత్మచరిత్రము సుగమము చేయుచున్నది. ఆత్మ చరిత్రము, గతించిన యేబదేండ్ల ఆంధ్రాభ్యుదయమును సింహావలోకనముచేయుటకును, భావ్యభ్యుదయమునకును, సాధనముగనున్నది; వీరేశలింగము పంతులు; వేంకటరత్నమునాయుడు, కనకరాజు, రామమూర్తి, పాపయ్య, రంగనాయకులు నాయుడుగార్ల పవిత్రజీవితముల సంస్మరణమునకును, ఆత్మసంస్మరణమునకును సాధనంబుగ నున్నది; సాహిత్యరచనలందును సాంఘికవ్యవస్థలందును, మతాచారాములందును, నిత్యజీవనమునందును సంప్రాప్తమైన భావక్రియాపరివర్తనమును గ్రహించుటకు వినియోగపడుచున్నది. కథకులు మతవిశ్వాసములందు గలిగిన పరివర్తనసందర్భముల తెలిపినభావము లాత్మచరిత్రయం దాత్మవిజయమును ప్రకటించుచున్నవి.

"వయోవిద్యానుభవములతో నాగుణశీలముల కెట్టి పరిణామము గలిగెనో చదువరులు గమనించియున్నారు. అన్నిటికంటెను నామత విశ్వాసములందలి పరివర్తనమె మిగుల స్ఫుటముగఁ దోఁచును. బాల్యకాలమునందలి వైష్ణవక్రైస్తవవిశ్వాసములు యౌవనమున బ్రాహ్మ ప్రార్థనసమాజాదర్శరూపము దాల్చినను, పూర్వవాసనలు పిమ్మట పూర్తిగ వీడెనని కాని, పరిణామకార్య మింతతో నిలిచిపోయె నని కాని చెప్ప వలనుపడదు. లోకానుభవము హెచ్చినకొలఁది, బ్రాహ్మ మతోద్బోధకమగు పరిశుద్ధాస్తికాదర్శముల పోకడలు, బ్రాహ్మ సమాజమునందెకాక, మాతృసంఘమునందును నాకనులకు గోచరించెను. ఇంతియకాదు. కొన్ని సమయములందు క్రొత్తగ వెలసిన సమాజములలో నూతనాశయములు వేవేగమె వన్నె వాయుటయు, మాతృసంఘమె యుదారనవీనభావములతో భాసిల్లుటయు మనము కాంచుచున్నాము. కావుననే, హిందూమతముపట్ల యౌవనమున నాకుఁ గలిగిన నిరసనము నానాఁట తొలఁగిపోయి, అందలి యుత్కృష్టాదర్శములు హృద్యము లయ్యెను. భగవంతునిప్రాపున సంసారయాత్రయందు ధన్యులు కాఁగోరువారు, నామరూపముల విషయమై లేనిపోని దురభిమానములకు లోనుగాక, సర్వమతధర్మములును సాధనములుగఁ జేకొని సత్యము గ్రహింపవచ్చు నని నేను దలంచితిని."

ఆత్మచరిత్రము, గృహవిద్యావిశ్వరంగములయందు, భక్తి జ్ఞానకర్మయోగముల సాధనమునను పూర్ణమైన ఆత్మయోగాభ్యాసమునకు సకలజనులకును వారి సంస్కారమున కనురూపముగను వినియోగపడుచున్నది. జీవయాత్రయం దనిత్యములైన నామరూపావరణము లంతరించి నిత్యమైన యాత్మావరణము జీవిత పరిణామము నందు సార్థకమగుచున్నది. పాఠకమహాశయులు దీర్ఘమైనను భావగర్భితమైన ఆత్మచరిత్రమును చదివి పరిశోధించి ఆత్మచరిత్రమును సార్థకము చేయుదురుగాత. ఈ కృతికి పరిచయవాక్యములను వ్రాయుట కవకాశ ములను గల్పించి గౌరవించినందులకును, ఆంధ్ర గ్రంథమాలయందు ఆత్మచరిత్రమును ఇరువదిరెండవ కుసుమముగ జేర్చినందులకును, వేంకటశివుడుగారికి కృతజ్ఞుడను.

కా. నాగేశ్వరరావు.

శ్రీముఖ సం. శ్రావణ శు.

సప్తమి, శనివారము.