ఆత్మచరిత్రము/ఉపోద్ఘాతము

వికీసోర్స్ నుండి

ఉపోద్ఘాతము.

గ్రంథకర్త యేపుస్తకము వ్రాసినను, అది యాతని యాత్మ, చరిత్రమె యగునని యొక సుప్రసిద్ధ రచయిత నుడివెను. మనరచనములు అద్దములవలె మనయభిప్రాయములను ప్రతిఫలనము చేయుచుండును. మన కొంకిగీఁత లెల్ల మన జీవితకథనే గీయుచున్నను, ఎంతజాగ్రత్తతోఁ జిత్రించిన జీవితచిత్రములందును, కొంకరగీఁతలు గానిపించుచునే యుండును ! ఇతర రచనములందుకంటె నాత్మకథా సంవిధానమున భ్రమప్రమాదముల తాఁకు డధికముగఁ గానవచ్చును. పరులరూపమును జిత్రించుపట్ల నెంతో నిపుణతచూపు మనవ్రేళ్లు, సొంత ప్రతిమను గీయునపుడు వణఁకజొచ్చును ! అహంభావము, పక్షపాతబుద్ధి మున్నగు దుర్ల క్షణములు మనల నావేశించి, సత్యపథమునుండి యొక్కొకసారి మనపాదములను పెడదారులఁ బట్టించు చుండును. ఐనను, రోటిలోఁదల దూర్చినవాఁడు రోఁకటిపోటులకు వెఱచునా ? తన జీవితకథను ధారాళముగ వినిపింపసాహసించిన కథకునికి, చిన్నకల్లలచేఁ దన నెరసులు కప్పి పుచ్చ నెంచుట సిగ్గులచేటుగదా !

సత్యప్రకటనమె ముఖ్యావధిగఁ జేకొనిననేను, కీర్తిధనాదుల మీఁదఁ గన్నువేసి, యీ పుస్తకరచనమునకుఁ బూనుకొనలేదు. ఇదివఱలో నాత్మచరిత్రము నాంధ్రమునఁ బ్రుచురించిన ముద్గురు వర్యులగు కీ. శే. కందుకూరి వీరేశలింగముపంతులుగారి "స్వీయచరిత్రము"ను, గాంధీమహాత్ముని "ఆత్మకథ"ను మించనెంచి నే నీపుస్తకమును వ్రాయలేదు. ఆగ్రంథకర్తలు మహామహులు, నాదర్శ, పురుషులును, ఐన నొక్కొకప్పుడు నాబోటి సర్వసామాన్యుని చరిత్రముకూడ సంసారయాత్ర గడపుటయందు కొందఱికి సాహాయ్యకారి కావచ్చుననియె నాయాశయము.

ఈపుస్తకరచనాసందర్భమునుగూర్చియు, దీని యాధారములను గుఱించియు నొకింత చెప్పెదను. నేను 1888 వ సంవత్సరమధ్యము నుండి 1902 వ సంవత్సరారంభమువఱకును విడువకుండఁగను, పిమ్మట చాలకాల మప్పుడప్పుడును, దినచర్యపుస్తకములు వ్రాయుచు వచ్చితిని. ఆకాలమందలి నాయాశయాలోచనములు, నే జదివిన పుస్తకములలోనివిషయములు, చేసినపనులు మున్నగునవి యందు వర్ణింపఁబడియున్నవి. వీనికిఁ దోడుగ 1891 వ సంవత్సరము జూలైనుండి యేడెనిమిది సంవత్సరములు "సత్యసంవర్ధని"ని, 1894 వ జులై నుండి 1906 వఱకు "తెలుగు జనానాపత్రిక"ను బ్రచురించితిని. ఆకాలమందును, పిమ్మటను కొన్ని తెలుఁగుపుస్తకములు రచియించితిని. వీనియన్నిటిప్రతులును, నే నితరపత్రికలకు వ్రాసిన వ్యాసాదులు, చేసిన యుపన్యాసములును నాముందటఁ గలవు. ఇవిగాక, నే నుంచుచువచ్చిన యింటిలెక్కలపుస్తకములు, నాకు వచ్చిన యుత్తరములు మొదలగు ప్రాఁతకాగితములును చాల గలవు. ఇవి యన్నియు నాజ్ఞాపకశక్తి కాధారముగఁ జేసికొని, 1930 వ సంవత్సరాంతమున "శ్రీ వీరేశలింగ సంస్మృతి"ని రచించితిని. వీనిసాయముననే 1931 వ సం. అక్టోబరులో నా "ఆత్మచరిత్ర" ప్రథమభాగమును వ్రాసి, నా సోదరీసోదరుల కది చూపించి, తక్కినభాగములు వెనువెంటనే లిఖించితిని.

ఈగ్రంథరచనాపద్ధతిని గుఱించి యొకింత ప్రస్తావించెదను. పూర్వకాలమున పరిస్థితు లెట్లు నామనసునకుఁ దట్టెనో, ఆకాలమున నా యూహాప్రపంచ మెటు లుండెనో చదువరులు గ్రహింపఁగోరెదరు గాన, అపుడు నాదినచర్యపుస్తకములలో నింగ్లీషున నేను లిఖించిన సంగతులు లిఖించినరీతినె నేను సామాన్యముగ నిందు తెలుఁగున వ్రాసితిని. నావ్యాసాదులలోని సంగతులు కొన్ని యిటఁ జేర్చితిని. నా కితరులు వ్రాసిన జాబులలోని విషయములు కొన్ని ప్రకటించితిని. నేను తెలుఁగున వ్రాసిన వ్యాసాదులు నే నాకాలమునఁ బ్రకటించిన నాపత్రికలలోను, ఇతరపత్రికలలోను, నాతెలుఁగు పుస్తకములలోను నున్నవిగాన, వానినంత విపులముగ నిచటఁదెలుపక, నాయింగ్లీషురచనముల ముఖ్యభాగముల యాంధ్రానువాదమె యిం దచ్చటచ్చట ముద్రించితిని.

నా విద్యార్థిదశనుగూర్చిన చరిత్రభాగము, పిమ్మట జరిగిన నా యెనిమిది సంవత్సరముల యుపాధ్యాయదశాకథాభాగ మంతటి దీర్ఘతను గాంచియుండుటయు, ఇటీవలి ముప్పదిసంవత్సరముల యుపన్యాసక దశాచరిత్రము కడు కుఱుచుగ నుండుటయు, చదువరుల కొకింత వింతగఁ దోఁపవచ్చును. దీనికిఁ గారణము లేకపోలేదు. మొదటి రెండుదశలందును నేను దినచర్యపుస్తకములు సరిగ నుంచుచువచ్చితిని, కళాశాలాదినములందలి నాదీర్ఘ దినచర్యపుస్తకములందలి వ్రాఁతలు, ఆకాలమందలి నాయధికభావోద్రేకమునకును, నిరోధ మెఱుఁగని నా చిత్తవృత్తులకును అద్దములవంటివె. ఉపన్యాసకదశయందలి నా దినచర్యపుస్తకములు వట్టితెల్ల కాగితపుఁబుటలనె ప్రదర్శించుచున్నవి. వృత్తి సంబంధమగు కార్యావళియె యాకాలమందలి నా దినచర్యయంతయు.

జీవితమందు నా కధికప్రేమాస్పదులయి, వివిధపరిస్థితులందు నాకుఁ జేదోడువాదోడుగనుండు నా యిరువురు తమ్ములకును చెల్లెలికినే కాక, తమయకాలమరణమున నాహృదయమును దు:ఖజలధిని ముంచివైచి దివికేగిన తక్కిన సోదరీసోదరులకును నే నీపుస్తకమును గృతి యొసంగి, కొంత మనశ్శాంతి నొందుచున్నాను. ఈపుస్తకమును దమ యమూల్యగ్రంథమాల కొకనూతన కుసుమముగఁ గైకొని, దీనికిఁ దొలిపలుకు వ్రాసి, నన్ను గౌరవించిన శ్రీ దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావుపంతులుగారికి నాకృతజ్ఞతాపూర్వక నమస్కృతులు సమర్పించుచున్నాను. ఈపుస్తకముద్రణము నందు నాకు వలసిన సౌకర్యము లొనఁగూర్చిన ఆంధ్రపత్రికా ముద్రాక్షరశాలవారికి వందనము లర్పించుచున్నాను.

ఈపుస్తకము వ్రాయునపుడు నాకుఁ గలిగిన పెక్కు సందియములను నివారణముచేసి, మంచిసూచనలు చేసిన నా పూర్వశిష్యులు మిత్రులునగు శ్రీకొలచెలమ కృష్ణసోమయాజులు గారికిని, అక్కడక్కడ కొన్ని మంచిమార్పులు సూచించిన శ్రీయుత చన్నాప్రెగడ భానుమూర్తిగారికిని వందనము లర్పించుచున్నాను.

ఇందులోఁ జేర్చినపట్టికలో తప్పొప్పులలో ముఖ్యములగునవి కొన్ని చూపింపఁబడినవి.

పుస్తకమందలి కథ వేవేగముగ సాగిపోవుటకు ప్రతిబంధకములును, సామాన్యపాఠకుల కంతగ రుచింపక యనగత్యముగఁ దోఁచునవియునగు కొన్ని విషయములు పుస్తకముచివరను అనుబంధ రూపమునఁ దెలుపఁబడినవి.

పాఠకమహాశయు లీగ్రంథమందలి లోపములు క్షమింపవలెనని వేఁడుచున్నాను. ఈపుస్తకపఠనమువలన నెవరి కేమాత్రము లాభము చేకూరినను, నే నమితానంద మందెదను; ఎవరిమనస్సునకు నొప్పికలిగెనను, మిక్కిలి విచారమందెదను.

రాయసం వెంకటశివుఁడు.

జూను, 1933.