ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/"సతీయుతసంఘసంస్కారి"
డిసెంబరు రెండవవారమున నాయఁడుగారు బెజవాడ వచ్చి, యీప్రాంతములందు ప్రాథమిక పరీక్షలు జరిపిరి. వారితో నేను తెనాలి నూజవీడు రేపల్లెగ్రామములు పోయి, యీ పరీక్షలో పాల్గొంటిని. నాయఁడుగారు 27 వ తేదీని మద్రాసు వెళ్లిపోయినపిమ్మట నాకుఁ గొంత విరామము గలిగి, న్యాయశాస్త్రపరీక్షకుఁ జదివితిని.
దాసు శ్రీరాములుగారి యేకైక పుత్రిక మరణించె నని 22 వ తేదీని విని మిగుల విచార మందితిమి. ఈమె విదుషీమణి.
న్యాయశాస్త్రపరీక్ష చదువులు నాప్రాణములు నమలివేయఁ జొచ్చెను ! నా కెపుడైన మనశ్శాంతి కుదురునా యని నే నాశ్చర్యపడితిని. 31 వ తేదీని "హిందూన్యాయశాస్త్రము" ను బూర్తిచేసి, తల తడిని చూచుకొంటిని. ఆసాయంకాలము ఆనకట్టుమీఁదనుండి కృష్ణానదిని దాఁటి, ఆవలియొడ్డునందలి దృశ్యములు మిత్రులతోఁ జూచివచ్చితిని. నూతనవత్సరకార్యముల నాలోచించుకొంటిని. ఇట్లు 1899 వ సంవత్సరము గడచిపోయెను.
36. "సతీయుతసంఘసంస్కారి"
ఈశీర్షికతో చిన్న యాంగ్ల వ్యాసము వ్రాసి, "సంఘసంస్కారిణీ" పత్రికకు నే నంపితిని. అది 1899 వ సంవత్సరము డిశంబరు 10 వ తేదీని ఆపత్రికయందు "బెజ" అను సంజ్ఞాక్షరములతోఁ బ్రకటింపఁబడెను. ఈ క్రింద నుల్లేఖింపఁబడిన యా వ్యాససారమును బట్టి, అందలి విషయములు కొంతవఱకు స్వకీయములెయని చదువరులు గ్రహింపఁగలరు : -
"ప్రేమాధిదేవతయగు మన్మథుడు, అంధుఁ డని యవనులకును, అనంగుఁ డని యార్యులకును విశ్వాసము. వివాహాధిదేవతస్థితి యంతకంటె నధమముగ నున్నది! ఈ యుభయదేవతలలోను మన్మథుఁడు మంచివాఁ డనిపించుకొనుచున్నాడు ! స్త్రీ పురుష హృదయ సమ్మేళనమే యాతనికిఁ బ్రీతికరము. వివాహాధిదేవత యన్ననో, ముఖ్యముగ మనదేశమున తగినంత కారణము లేకయే స్త్రీపురుషులకు నిర్బంధబాంధవ్య మేర్పఱుచుచున్నాడు ! ఈ కిరాతుని చేతలవలన పెక్కండ్రు స్త్రీ పురుషులు తమజీవితసౌఖ్యమును గోలుపోవు చున్నారు.
"సజ్జనుఁడగు నా మిత్రుఁడు 'సంస్కర్త' ను గూర్చి యిచటఁ గొంత ప్రస్తావించెదను. ఆయనయందు ప్రజ్ఞాసామర్థ్యములు విశేషముగ నున్నను, వానివలని మేలుమాత్రము కడు స్వల్పముగఁ గానవచ్చు చున్నది ! ఆయన విద్యావిశారదుఁడు సుగుణభూషితుఁడు నగు నవనాగరకుఁడైనను, వివాహమూలములగు వైషమ్యములవలన, ఆతని ప్రజ్ఞాలు క్రియాశూన్యములును, ఆశయములు నిష్ప్రయోజకములును నగుచున్నవి ! భావసంపదయు మహాశయభాగ్యమును గలవాఁడయ్యును, ఆతనివిలువ యెఱుంగక యాతనిసందేశములచొప్పున నడువ నొల్లని యొక యంగన కాతఁడు గట్టఁబడుట యెంతటి కాలవైపరీత్యము !
"తాను జెప్పినచొప్పున నాచరించుటయే పరమధర్మముగఁ జేసికొనినవాఁ డాపురుషుఁడు ! ఇదియే యాదంపతుల కలతలకుఁ గారణము. స్త్రీపురుషులకుఁ జిత్తవృత్తులందుఁ గొంత భేద మే కాలము నందును గాననగును. ప్రకృతమునం దాభేదము మిగుల నతిశయించి యున్నది. మోటుజాతులలో మగవానికి నాఁడుదానికి నెక్కువ యైకమత్య ముండును. ఇరువుర భావములు నాచరణములు నించు మించుగ నేక విధముననే సాగుచుండును. నాగరికత హెచ్చినకొలఁది పరిస్థితులలోను భావాదులలోను భేదము లేర్పడును. విద్యావంతుఁడగు పురుషుని యాశయములు విద్యాగంధ మెఱుఁగనిస్త్రీకి గొంతెమ్మ కోరికలవలెఁ గానిపించును ! శతాబ్దములనుండి స్త్రీవిద్యను నిరసించెడి యీ భారతదేశమున, స్త్రీపురుషులకుఁగల యీ యంతర మధికమై, ప్రకృతమందలి గృహకల్లోలములకుఁ గారణ మగుచున్నది.
"ఒడ్డుపొడుగులందు హనుమంతునికిని వాలఖిల్యులకును గలభేదము, బుద్ధివిషయమున "ఈ సంస్కర్త"కును అతని సతీమణికిని గలదు. గృహజీవితమునుగుఱించి యున్నతాశయములును, భార్యవిద్యాభ్యున్నతి విషయమై యుత్కృష్ట భావములును గల యీ'సంస్కర్త', జీవితమున పరాజయ మందెనే ! విద్యాధికులగు భారతీయులు పరిష్కరింపలేని సాంఘిక సమస్యల కై వారిని నిందింపఁదగదు. పురుషుఁడొక్కఁడే యీ పరాజయమునకుఁ గారణము గాఁడు. కుటుంబ విషయములలో నతనికి సర్వాధికారము లేదు. పశ్చిమదేశములలో భార్య యనఁగ సామాన్యముగ స్వయంవరయగు సుదతియె. అచ్చట వివాహబంధము భగ్న మైపోవుటకు భార్యాభర్త లిరువురలో తప్పక యొకరు ముఖ్యకారకు లని మనము గ్రహింపవచ్చును. భారతదేశమందట్లు కాదు. 'సంస్కారి' యాశయముల సద్భావము సంశయింప వలనుపడదు. కాని, యాతనిసతినిగూడఁ బూర్తిగ నిందింపనేరము. అజ్ఞానయై యటవీమృగమువలె నాయిల్లాలు పెరిఁగెను. అజ్ఞానయై నిరతము నడవియందే సంచరింప నామె వాంఛించుచున్నది ! ముఖ్యవిషయములం దాపొలఁతి పొరుగు ముసలమ్మలను గురువులఁగఁ జేకొని, భర్తకు ప్రాణసమానమగు నాశయముల నాశన మొనర్చి, అనుతాపలేశము లేక సంసారయాత్ర గడపుచున్న యది !" 37. న్యాయవాదిపరీక్ష
మహబూబు పాఠశాలలో బోధకుఁడును, నాయఁడుగారి స్నేహితుఁడును నగు కుప్పురామయ్యగారు, సకుటుంబముగ వచ్చి మాయింట జనవరిలో 10 దినము లుండిరి. 11 యేండ్లవయస్సుగల యాయనకొమార్తె వితంతు వయ్యెను. ఆమెకుఁ బునర్వివాహము చేయఁ దన కుద్దేశముగలదని యాయన నాతోఁ జెప్పఁగ, కాకినాడలోని నామిత్రు లొకరు తప్పక చేసికొందు రని చెప్పితిని. 11 వ జనవరితేదీని నేను రాజమంద్రి వెళ్లి యక్కడనుండి యాస్నేహితునికి జాబు వ్రాసితిని. ధైర్యముచేసి వా రీపిల్లను వివాహమాడుట ధర్మమనియు, అట్లు చేయకున్న తమరి నిఁక నెవ్వరును నమ్మరనియును, నేను వ్రాసివేసితిని !
ఆదినములలో బోయరుయుద్ధము సాగుచుండెను. ఉభయసైన్యములలోను పెక్కండ్రు నిహతు లగుచుండిరి. ధైర్యాశాలులును, అల్ప సంఖ్యాకులును నగు పగతురదెస బ్రిటీషు వారికిఁ గల వైఖరిని మేము నిరసించుచుండువారము.
మాతమ్ముఁడు వెంకటరామయ్య నాతో న్యాయశాస్త్ర పుస్తకములు చదువుచు, తన వృత్తిపనులు చక్క పెట్టుకొను చుండువాఁడు. మాతండ్రి గతించుటకు మేము మిగుల వగచితిని. 16 వ తేదీని నేను మరల బెజవాడ వెడలివచ్చితిని.
మా మఱఁదలు చామాలమ్మ తనపిల్లలతో బెజవాడ వచ్చి, మాతోఁ గొన్ని రోజు లుండెను. ఆరోజులలో నామెకొమార్తె నగ యొకటి పోయెను. మాయింట 'పాచిపనులు' చేయు నొకపిల్లమీఁద మే మనుమానపడితిమి. కామశాస్త్రిగారు నేనును దానియింటికిఁ