ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/ఉద్యోగప్రయత్నము
47. ఉద్యోగప్రయత్నము
వీరేశలింగముగారి సాయమున "జనానాపత్రికా" ప్రచురణ భారము నాబుజములనుండి చాలవఱకు తొలఁగిపోయెను. అనంతముగారే మరల బెజవాడపాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగను, అధికారులుగను వచ్చినను, ఈమాఱు వారి పరిపాలనము నా కంతగ నచ్చలేదు. ఆయనపేరు చెప్పి పెద్దయుపాధ్యాయులమీఁద చిన్నవార లధికారము చెల్లించుట కడు దుస్సహముగ నుండెను ! నాయెడ ననంతముగారి వైఖరి యిట్లు మాఱిపోవుట చూడఁగా, నే నీపాఠశాలలో నుండుట వారి కిష్టము లేకుండునట్లు తోఁచెను! కావున నే నీసంవత్సరాంతమున వేఱుపాఠశాలకుఁ బోఁయి, స్వగౌరపరక్షణము చేసికొనుట కర్తవ్యముగఁ గానిపించెను. అంత మాసిన న్యాయశాస్త్రపుఁజదువులు మరల నేను విప్పితిని. వెనుకటిచుఱుకుఁదనము లేకున్నను, ఒకరీతిని నే నాపుస్తకములు తిరుగవేసితిని.
మాతల్లికిఁ దఱచుగ వ్యాధి వచ్చుచుండుటవలనఁగూడ నా మనస్తాప మతిశయించెను. 4 వ సెప్టెంబరున మా తమ్మునియొద్ద నుండి వచ్చినయుత్తరములో, ఇటీవల చేసిన జబ్బులో నీరసముచేత ధృతిచెడి యామె యేడ్చెనని యుండెను !
అప్పుడప్పుడు నేను సమావేశపఱుచు సభలు మున్నగునవి నామనస్సున కొకింత యుపశమనము గావించెను. 7 వ సెప్టెంబరున ముగ్గురు స్నేహితులము మరల బాపట్లకు దండయాత్ర సాగించితిమి. మిత్రులు విన్నకోట కోదండరామయ్యగారు సంస్కారపక్షమువారి వాదమును వ్యక్తపఱిచిరి. పూర్వాచారపరుల పక్షమున నూజివీడు వాస్తవ్యులగు సూర్యనారాయణశాస్త్రిగారు, ప్రసంగించుచు, పూర్వ స్మృతికర్తలకు వితంతూద్వాహము లంగీకారమే కాని, పరాశరునికి మాత్ర మని యసమ్మత మని నుడివిరి. మఱియెవరును బ్రసంగింపకయె యధ్యక్షులు సభ విరమించి మా కాశాభంగ మొనరించిరి!
1901 సం. 9 వ సెప్టెంబరు వార్తాపత్రికలలో నెల్లూరు నందలి వెంకటగిరి రాజాగారి పాఠశాలకు ప్రథమోపాధ్యాయుఁడు కావలె ననుప్రకటనము గలదు. నేను దరఖాస్తు నంపితిని. నన్ను గుఱించి సిఫారసు చేయుఁడని యొకరిద్దఱు నెల్లూరుమిత్రులకు నేను వ్రాసినను, నా కీయుద్యోగ మగునని యాశలేదు.
మేము బెజవాడలో నివసించు బంగాళా నిశ్శబ్దమగు ప్రదేశ మందలి తోఁటలో నుండెను. చుట్టుపట్టులఁ జేరువ నిం డ్లేవియు లేవు. సమీపమున నుండునవి క్రైస్తవమహమ్మదీయుల గోరీలదొడ్లు మాత్రమే ! పాఠాశాలలోఁ బను లుండియు, బహిరంగసభలలోఁ బాల్గొనుచును, రాత్రులు నే నింటి కాలస్యముగ వచ్చునపు డెల్ల, ఒంటరిగ నింట నుండు నాభార్య దిగులుపడుచుండెడిది. 11 వ సెప్టెంబరున రాత్రి నే నాలస్యముగ నిలు సేరునప్పటికి నాభార్య విలపించు చుండెను. ఈ యిల్లు విడిచి యింకొక ప్రవేశమునకుఁ బోవుట యుక్త మని నా కంత తోఁచెను.
బాలికాపాఠశాలల పరీక్షాధికారి స్వామిరావుగారు 22 వ సెప్టెంబరున నా కగపడి, 'జనానాపత్రిక'లో మతవిషయక చర్చలు జరుగుచున్న వని పెద్దపరీక్షాధికారిణి కారుదొరసానిగారి యభిప్రాయ మని నాకుఁ జెప్పిరి. నే నేమిచేయను ? తెలుఁగుతెలియని యీ యధికారి ప్రముఖులు 'జనానాపత్రిక' ను గుఱించి వట్టి యపోహములు పడుచున్నారు ! కొలఁదిరోజులలో నే నాకాం తను బెజవాడలోఁ గలసికొని మాటాడఁగా, నిజము తెలిసికొని యామె నాపత్రికదెస మరల సుముఖి యయ్యెను !
17 వ అక్టోబరున నేను భార్యయు రాజమంద్రి వెళ్లి మావాండ్రను జూచితిమి. మా తమ్మునికుమారుఁడు నరసింహము, చెల్లెలికూఁతురు నరసమ్మయును మంచి యారోగ్యము లేకయుండిరి. కుటుంబ మంతయు బెజవాడ వచ్చినచో నందఱమును గలసి హాయిగ నుందు మని నేను మా తమ్మునికి బోధించితిని.
మఱునాఁటి "మద్రాసుస్టాండర్డు" పత్రికలో పర్లాకిమిడి కళాశాలలోని యుపాధ్యాయుఁ డొకఁడు నెల్లూరు వెళ్లిపోయె నని యుండుటచూచి, నా కా యుద్యోగము లభింపఁ బ్రయత్నింపుఁ డని మిత్రులు రాజగురువు పైడిగంటము కృష్ణారావుగార్లకు వ్రాసితిని. మే మంత బంధుదర్శనార్థమై కాకినాడ వెళ్లితిమి. నా కీ పర్లాకిమిడి యుద్యోగమునుగూర్చి సాయము చేయుడని స్కాటుదొరగారికి వ్రాసి, పర్లాకిమిడి కళాశాలాధికారికి దరఖాస్తు నంపితిని. పాఠశాలల పరీక్షాధికారినుండి సిఫారసు తీసికొని, యది పర్లాకిమిడి పంపితిని.
నేను బెజవాడకు 9 వ అక్టోబబరున తిరిగివచ్చితిని. అచట నాకు వెంకటరత్నమునాయఁడు గారు కానిపించి, తమ తమ్ముని భార్య చనిపోయె నను దు:ఖవార్త చెవిని వేసిరి. ఇపు డీ యన్నదమ్ము లిరువురును కళత్రవిహీను లయిరని వగచితిని. ఆసాయంకాలము నేను బసకు వచ్చుచుండఁగా, దారిలో నొకచోట విపద్దశనుండు నొక మనుజుని దీనాలాపములు వినవచ్చెను ! నే నచటికిఁ బోయి చూడఁగా, ఒక యూరపియను వలంటీరు తన చాకలివాఁడు సరిగా బట్ట లుదక లేదని కోపించి, వానిని మోదుచుండెను ! నే నడ్డుపడి, వానికి బుద్ధిచెప్పెద నని పలికి, చాకలిని విడిపించితిని.
నే నిపుడు పర్లాకిమిడి యుద్యోగమునకై గట్టిప్రయత్నము చేసితిని, అనంతముగారు తాము దయతో సిఫారసు చేయుటయేకాక, మద్రాసు నందలి తమతోడియల్లునికి నన్ను గుఱించి వ్రాసి, నాకుఁ దోడు పడుఁ డని వారిని గోరిరి. క్లార్కు పాలుదొరలను, నాగోజీరావు పంతులుగారిని, నా కీ యుద్యోగవిషయమై సాయము చేయుఁడని నేను వేఁడితిని.
48. తమ్మునివ్యాధి
నే నీమాఱు బెజవాడ యొంటరిగ వచ్చుటచేత, గోపాలమను విద్యార్థి యువకుఁడు నా కీదినములలో వంట చేసిపెట్టు చుండువాఁడు. ఆతనిది నెల్లూరువంట. వంటకము లన్నియు జిహ్వకు మందులవలెఁ దగులుచుండెను ! ఎటులో చేదు మ్రింగునట్లు నే నన్నము దినుచు, దినములు పుచ్చుచుంటిని.
విద్యార్థులు, తమ "ప్రసంగసమాజ" వార్షి కోత్సవ సమయమున నన్నొక యుపన్యాస మీయు మని కోరిరి. "బోధకుల విధులు" అను నొక యాంగ్లవ్యాసము వ్రాసి, 3 వ అక్టోబరున సమాజసభలోఁ జదివితిని. విద్యార్థులు నుపాధ్యాయులు నది మెచ్చుకొనిరి. "సంఘసంస్కారిణీ" పత్రికలో నది ప్రకటిత మయ్యెను.
రెండవ నవంబరున రాజమంద్రినుండి వచ్చిన యుత్తరములో, తమ్ముఁడు సూర్యనారాయణకు ఎక్కువగ జ్వరము వచ్చె ననియు, నన్ను తక్షణమే రమ్మనియు నుండెను. ఆ సాయంకాలమునకు రాజ