ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/అమలాపురోద్యోగము
ఒక ధనవ్యయ విషయముననే గాక, మఱికొన్ని సంగతులందును దంపతుల కభిప్రాయభేద మేర్పడెను. నే ననుదినమును సాయంకాలమున కాలువయొడ్డున షికారు పోవుచుండు నప్పుడు, నాతోఁగూడ రమ్మని సతి నాహ్వానించుచుండువాఁడను. ఆమె యట్లు చేయనొల్ల కుండెడిది. పదునాఁఱేండ్ల బాల పతితోఁ గలసి వాహ్యాళి కేగుట, ఆకాలముననే కాదు, ప్రకృతమందును, సాహసకృత్య మని హిందూ సంఘ మెంచుచున్నది ! చెన్న పురివంటి మహాపట్టణములలో హిందూ యువిదల కిట్టి స్వేచ్ఛావర్తనమున కవకాశము గలుగును గాని, బెజవాడవంటి చిన్న పట్టణములలో నిట్టి చర్య లిరుగుపొరుగుల యమ్మలక్కల వికట వ్యాఖ్యానములకుఁ దావలమగుచుండును ! ఇట్టిపనులవలన తరుణవయస్కులగు నబలలకు తోడి కులకాంతలలోఁ దలవంపులు గలుగుచుండును.
6. అమలాపురోద్యోగము
నా "బెజవాడ - అమలాపురముల" యుద్యోగములకుఁ జాల కాలమువఱకు ద్వంద్వయుద్ధము సాగెను ! వేసవిపిమ్మట నేను బెజవాడపాఠశాలఁ జేరిన కొలఁదిదినములకు, అమలాపురపుఁ బని తప్పక యిచ్చెద రని మాతమ్ముఁడు రాజమంద్రినుండి నాకు వ్రాసెను. 17 వ జూలై తేదీని అమలాపురము పాఠశాలాప్రథమోపాధ్యాయుఁడు నాకుఁ దమపాఠశాలలో ద్వితీయోపాధ్యాయపదవి నిచ్చి రని వ్రాసి, నే నది స్వీకరింతునా యని యడిగెను. అందువలన మరల నామనస్సున కలజడి గలిగి, నాఁడే మాప్రథమాధ్యాపకుని యొద్దకుఁ భోయి, యీసంగతి యాయన కెఱిఁగించితిని. ఆయన దిగులుపడి, క్రొత్తపనిఁ గైకొనవలదని సలహానిచ్చెను. కొలఁది దినములలో క్లార్కుదొర బెజవాడ వచ్చు ననియును, అపుడాయనతోఁ దాను నాకష్టములఁగూర్చి చెప్పెద ననియును, అనంతముగారు వాగ్దానముఁ జేసిరి. ప్రకృతఁపుఁబని నాకు ఖాయము చేయుఁడనియు, రాఁబోవు వత్సరమున యల్. టి. పరీక్ష పూర్తిచేసినచో నెనుబదిరూపాయి లీయుఁడనియు, పరీక్షయందు తప్పిపోయినచో నీడెబ్బదియే చాలు ననియు నేను బలికితిని. నా యభీష్టము నెఱవేఱుచో నే నిచటినుండి కదలనక్కఱయె లేదుగదా !
జూలై 23 వ తేదీని క్లార్కుదొర మాపాఠాశాలకు వచ్చి, నా తరగతులలోఁ గొంతసేపు కూర్చుండి, నా బోధనమునకు సంతృప్తి నొందితి ననియు, నాకోరికను జెల్లింతుననియును జెప్పి, నా మనోనిశ్చయ మేమని యడిగెను. ఆరోజుననే మా తమ్ముని యొద్దనుండి వచ్చిన యుత్తరములో, నేను బెజవాడ విడిచి క్రొత్తప్రదేశమున కేగుట శ్రేయమని యుండుటచేత, నా నిర్ధారణమును వెల్లడించుట కొకవారము గడువుఁ గైకొంటిని. 28 వ తేదీని రాజమంద్రి వెళ్లి పరిస్థితులు కనుఁగొంటిని. రాజమంద్రి సబుకలెక్టరే అమలాపురము తాలూకాబోర్డు ప్రెసిడెంటు. ఆ యుద్యోగస్థానమున నడుగఁగా, నాకు హుకు మింకను పంపలేదనియు, అచట నా కెన్నటికి నఱువదిరూపాయలజీతమే యిచ్చెద రనియుఁ దేలెను ! ప్రథమోపాధ్యాయుఁడు నిరంకుశాధికారి యనికూడఁ దెలిసెను ! బెజవాడ "వేడిమంగల"మైనను, నాగరికత కావాసమయిన యానగరము విడిచి, పూర్వాచార పరాయణతకుఁ బట్టుగొమ్మయైన అమాలాపురగ్రామము వెళ్లుట శ్రేయము గాదని నాకుఁ దోఁచెను. బంధుమిత్రుల నటులె చెప్పిరి. కావున నేను బెజవాడలోనే యుండుటకు నిశ్చయించి, ఆసంగతి మచిలీపట్టణము వ్రాయఁగా, దానికిఁ దన యామోదమును క్లార్కుదొర నాకు వెంటనే తెలియఁబఱచెను.
నే నిపుడు బెజవాడలో నుండుటకే స్థిరపఱుచుకొని, మంచములు మున్నగు సామానులు కొంటిని. ఇదివఱకే "జనానాపత్రికా"ధి పత్యమును బూనితిని. ఆపత్రిక చందాదారులకు నాపే రెఱుక పడువఱకు నొక సంవత్సరము పత్రికమీఁద నాపేరుతోఁ బాటు వెంకటరత్నముగారి నామమును బ్రకటింపఁబడెను. కాని, వ్యాసాదులన్నియు నేనే వ్రాసి పంపుచుంటిని. ఇట్లు "సత్యసంవర్థని"ని వదలి వైచిన నాచేతు లొకమాసమైన నూరకుండక, నూతన పత్రికయగు "జనానాపత్రికా" వ్యాసరచనమునఁ దగిలియుండెను !
బెజవాడలోని మా వేఱింటికాపురపుఁ దొలిదినములను గూర్చి యొకింత ప్రస్తావింపవలెను. ఆనాఁటి నా దినచర్య పుస్తకములు పరికింప నా కాశ్చర్యము పొడముచున్నది. నా కప్పు డిఱువదిమూఁడేండ్ల వయస్సు. భార్యకుఁ బదునాఱు వత్సరములు. యువవిద్యాధికుఁడగు పతి బజారుపనులు మున్నగు నిత్యకృత్యములు నిర్వర్తించుట కంటె, విద్యాగంధము లేక బాల్యావస్థ దాటియుదాటని సతియే తనగృహకృత్యములు బాగుగఁ జక్కబెట్టుకొనఁగలిగెను ! ఇంట వంటకముల రుచి కేమాత్రము భంగము వాటిల్లి నను నేను భార్యమీఁద మండిపడుచుందునే కాని, నే దెచ్చిన పుచ్చు పెసలకును, పచ్చి కట్టెలకును, ఆమె యించుక విసిగికొనిన సహించువాఁడను గాను ! ఇంతియ కాదు. భర్తశాసనము చొప్పున ననుదినమును భార్య పాఠముఁ జదివి, వ్రాఁత వ్రాసి, ఆయన బోధనమును జెవియొగ్గి వినుచుండవలయునే కాని, తనవిధులు నెరవేర్చుటయం దావంతయు ప్రాలుమాలికఁ జూపరాదు. స్త్రీవిద్యాభిమానియగు పెనిమిటి స్త్రీస్వాతంత్ర్య మభిల షించియే యిట్లు చేయుచున్నాఁడు గాన, ప్రథమమున సతి విద్యావతియై పిమ్మట స్వేచ్ఛాస్వాతంత్ర్యముల ననుభవింపఁ గోరవలయును ! "పిల్లికి సెలగాటము, ఎలుకకు బ్రాణపోకటమనునట్టుగ, భర్తకఠిన విధానము భార్యమీఁది నిరంకుశాధికారముగఁ బరిణమించెను !
కావుననే నా యుద్యోగపు ప్రధమదినములలో, ఒడుదుడుకు నేలను మోటుబండిపయనమువలె మాసంసారయాత్ర మిగుల కష్టముగ సాగెను ! ఇంటియందలి చిన్నచిన్న పొరపాటులకుఁ బెనిమిటే చీటికిమాటికిఁ జీదరపడుచుండువాఁడు. మగనిపెళుసుమాటలకు మగువ కినుకఁ జెందుచుండునది. ఇట్లు, లోకానుభవము చాలని యాదంపతులు, పరిస్థితు లాడించు కీలుబొమ్మ లయిపోయిరి ! కోపము కోపమునఁ గాక యోరిమిచేతను లాలనవలనను చల్లారునని యాయువ దంపతులకుఁ దెలియ దయ్యెను. కావున, నూతనాశయములతోను, నవీనమనోరధములతోను విలసిల్ల వలసిన యాయౌవనసుఖదినములందు, ఆ కుటుంబమున, పతి యనుతాపవహ్నియందును, సతి యశ్రుధారా తోయములందును గడుప దీక్షావ్రతముఁ గైకొనినవారివలె మెలంగు చుండిరి !
7. ధన్వాడ దంపతులు.
పెద్దలును, మా పాఠశాలాప్రధమోధ్యాయులును నగు శ్రీ ధన్వాడ అనంతముగారు బెజవాడప్రాంతములందలి ప్రజలచే నెక్కువ మన్న నలఁ బడయుచుండిరి. వారా మండలము వారే గౌరవ మార్ధ్వకుటుంబమున జనించి విద్యాధికులైన అనంతముగారు, జీససు మహనీయుని యమూల్యాదేశముల ననుసరించి, స్వసంఘములోని తమ యున్నతస్థానత్యాగ మొనరించి క్రైస్తవమతావలంబము చేసినవారగు