ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/"ప్రాచీన నవీన సైతానులు"
కాలములో బెజవాడ వచ్చునట్టును, మేమిరువురమును గలసి యచట నొకవార్తాపత్రిక నెలకొల్పునట్టును మే మేర్పఱుచుకొంటిమి.
18. "ప్రాచీన నవీన సైతానులు"
యల్. టి. ప్రీక్షలో గెలుపొందినపిమ్మట, ఉపాధ్యాయవృత్తి విరమింపవలసివచ్చునని మరల నే నెన్నఁడును మొఱలిడలేదు. బెజవాడ పాఠశాలాధికారులు నా కిపు డైదురూపాయిలు వేతనాభివృద్ధి చేయుటచేత, నాజీత మెనుబదిరూపాయిలయ్యెను. పాఠశాలలోని బోధన, పత్రికలకు వ్రాఁతపనియును నేను క్రమముగ నెరవేర్చు చుంటిని. వెనుకటివలెనే యీవేసంగి నేను రాజమంద్రిలో గడపితిని.
రాజమంద్రిలో నుండు దినములలో నేను సమాజకార్యములు దీక్షతో జరుపుచుండువాఁడను. ఆస్తికపుస్తకాలయమందలి పుస్తకములు సరిచూచి, మిత్రుల నడిగి నూతనగ్రంథములు తెచ్చి యందుఁ జేర్చితిని. సత్యసంవర్థనికి వ్యాసములు వ్రాసితిని. అప్పుడప్పుడు వీరేశలింగముగారిని గలసికొని, వారితో వితంతూద్వాహములనుగుఱించి ముచ్చటించు వాఁడను.
ఆ వేసవిని నేను జదివిన పుస్తకములలో మేరీ కొరెల్లీకన్యా విరచితమగు "సైతానువెతలు" అను నాంగ్లనవల ముఖ్యమైనది. అందు నాగరికాగ్రగణ్యయగు నింగ్లండుదేశమందలి పెద్దలోపములు రచ్చకీడ్వఁబడినవి. ఒక యాంగ్లేయజాతి యన నేల, మానవకోటి యంతయు నీ గ్రంథరాజముయొక్క యుపాలంభనమునకు గుఱియయ్యెను ! ఇచట ప్రదర్శితమైన సైతాను బైబిలులోని సైతాను గాఁడు. ఈతఁడు నవనవోన్మేషకాంతులతో మనచెంతనే విహరించుచు, విద్యానాగరికతలతో విలసిల్లెడి వినూతనశకపురుషుడు ! నేనీ నూతనాంశము నూఁతగఁగైకొని, బాగుగ నాలోచించి, "ప్రాచీననవీనసైతానులు" అను శీర్షికతో నొక యాంగ్ల వ్యాసమును లిఖించితిని. అది యా 1897 వ సంవత్సరము జులై నెల "సత్యసంవర్థని"లోఁ బ్రచురమయ్యెను. అందలి ముఖ్యాంశము లిందుఁ జేర్చు చున్నాఁడను : -
"సైతాను మన ముఖ్యబంధుమిత్రులలో నొకఁడు ! అతఁడు లేకున్నచో, మన మట్టివాని నొకనినిఁ గల్పించి తెచ్చుకొనవలసినదె ! ఆతఁడు లేని మతసిద్ధాంతము రాణింపదు. అనాదిగసైతాను లోకరంగమున విహరించి, నరుల వినమ్రప్రణామములు చేకొనుచున్నాఁడు. దేవుని కొక గుడి వెలయునప్పటికి, జగతిని సైతానుని కేఁబది యాలయము లేర్పడుచున్నవి.
"సైతానుని గూర్చి మానవుల మనస్సీమల నొక సక్రమపరిణామము గన్పట్టుచున్నది. బైబిలు ప్రాఁతనిబంధనలోని సైతాను వికృత సర్పవేషమున మన తొలియవ్వయగు హవ్వను శోధించెను. నూతన నిబంధనకాలము వచ్చునప్పటికి సైతాను తెలుఁగుమీఱెను. అపరూప ఫల మొకటి చూపించి యబలను మోసగించినసైతా నిపుడు, ఈశ్వరాంశసంభూతుఁ డగు జీససునకు జగత్సామ్రాజ్యము కట్టఁబెట్టెద నని భ్రమ పెట్టఁదలకొనెను ! సైతానుని కిపుడు గావలసినది మానవవైకల్యమును, ఆత్మాపహరణమును ! శోధితునితో పాటు శోధకుని స్వభావమును విచిత్రపరివర్తన మందెను.
"మిల్టనుకవి సృజించిన సైతా నింకను నైగనిగ్యము దాల్చియున్నాఁడు. ఆ కవివర్యుఁడు, తాను రచించిన "విశీర్ణస్వర్ణ" కావ్యమునకు ఆదామునకు మాఱుగ సైతానునె నాయకునిగఁ గైకొ నియె నని విమర్శకులు గేలిచేసిరి ! మిల్టనుని సైతానునందు నాచత్వ హీనత్వములు గానరావు. నరకలోకకుడ్యములు తన గంభీరోపన్యాస గర్జనములకు మాఱుమ్రోఁగునట్టుగ సహచరులతోఁ బ్రసంగించి, తన ధీరవచన గాంభీర్యమహిమమున వారల నందఱిని పరమేశ్వరుని మీఁది కెత్తివచ్చునట్టు పురికొల్పఁ గలుగుట సామాన్యప్రతిభము కానేరదు. మిల్టనుకవి, పుక్కిడిపురాణముల సైతానునిగాక, తన సోదరాంగ్లేయు లనుదినమును నగరఘంటాపథంబుల సందర్శించెడి స్వదేశీయ సమకాలిక సరసాగ్రగణ్యుఁడగు సైతానునే వారలకుఁ బ్రదర్శించెను !
"ఈ సైతానుకూడ ప్రకృతకాలమున పదనుడిగి ప్రాఁతగిల్లి పోయినవాఁడె ! అంత పందొమ్మిదవశతాబ్ద మధ్యమునఁ బ్రసిద్ధినొందిన కార్లయిలు రచించిన "సార్టారు రిసార్టసు" నందలి సైతాను వినూతనకాంతులతో విరాజిల్లెను. "సైతాను నీవెలుపల లేఁడు. నీ యంతరంగముననె యాతఁ డణఁగి మణఁగియున్నాఁడు !" అనువేదాంత రహస్యమె కార్లయిలుని సిద్ధాంతసారము.
"ఇంతకంటెను నూతనమగు సైతానుని మన మాధునికాంగ్ల సారస్వతమునఁ బొడఁగాంచఁగలము. మేరీకొరిల్లేకన్యక రచించిన "సైతానువెతలు" అను గ్రంథమునందు సైతానుని ప్రకృత వృత్తాంత కథనము గాననగును. ఇందలి కథానాయకుఁడగు 'టెంపెస్టు' , దరిలేని పేదఱిక మనుభవించుచు నొకనాఁ డాకస్మికముగ నైశ్వర్యవంతుఁడైన యొకలండనునగరనివాసి. ఆ సుదినమున లూసియోరైమానెజ్ అను నొక రాజకుమారుఁ డాయనకు స్నేహితుఁడు సహచరుఁడునై, టెంపెస్టు తనసర్వస్వమును గోలుపోయి మరల దుర్భరదారిద్ర్యదశకు దిగువఱకు నాతనికి విడనాడకుండెను ! అకాలమున లూసియో కనఁబఱచిన శక్తిసామర్థ్యము లన్నియు సైతానుని కళలె ! ప్రకృతకాలపు పురుష వర్యుల యతులిత మేధాశక్తి, వాక్చాతుర్యము, శృంగార విలాసములును, లూసియోయందుఁ జక్కఁగఁ బ్రదర్శితములయ్యెను. ఈ శోధనలలోఁ జిక్కువడవలదని శోధకుఁడు మాటిమాటికిఁ దన్ను వారించుచున్నను, కుశాగ్రబుద్ధియగు టెంపెస్టు ఆసుడిగుండములలోనే పడి కొట్టుకొని పోవుచుండెను ! ఇదియె ప్రకృతపు సైతానుని స్వభావలక్షణము. భాగ్యవంతుల మాయామర్మములందును, ధనికుల దురంత దుష్కృతములలోను, లక్ష్మీపుత్రుల లోభమోహములలోను, స్త్రీపురుషుల గూఢవ్యభిచారము లందును, - ఈనాఁటిసైతాను ప్రత్యక్షమగు చున్నాఁడు !
"ఈ నూతనమగు సైతానుని నమ్మిక లొక్కింత విమర్శింతము. సైతానునికి దైవవిశ్వాసము లేకపోలేదు. ఈశ్వరాజ్ఞోల్లంఘనము మాత్ర మతనికిఁ గడుప్రీతి. సైతాను 'పాపాలభైరవుఁడ'ని ఘోషించునవి బైబిలుక్రైస్తవమతములు మాత్రమె. కొరిల్లీకన్యక వర్ణించిన సైతా నట్లు వర్తింపక, మనుష్యుడు నూతనదుష్పథము త్రొక్కి చూచినపుడెల్ల దు:ఖాతిరేకమున వెతనొందుచుండును. కావుననె యీగ్రంథమునకు "సైతానువెతలు" అను నామకరణము గలిగెను. నరుఁడు చేయు పాపకార్యముల కెల్ల సైతాను వగచుచునేయుండును !
"ఈ పుస్తకమందలి సైతా నిట్లు ఘోషించుచున్నాఁడు : - 'స్త్రీపురుషుల పాపపరంపరయె దరిలేని నాదు:ఖాబ్ధి ! స్వేచ్ఛా పేక్షగల నన్ను బందీకృతునిఁ జేయుచున్న దిదియె. ఇదియె నాకు నరక లోకావరణమున గల్పించి, నన్ను మితిలేని వెతలపాలు చేయుచున్నది. ఇదియె నన్ను బంధించి, ఛేదించి, వికృతాంగునిఁ జేయుచున్నది ! " 'మతగురువులు నా కొనరించు నపకార మే మనఁగా, - పాపమె నావినోద మని నన్నుగుఱించి వారు నిందలువేసి, అపవాదములు వెలయించుచున్నారు ! మనుష్యుఁడా ! ఇపుడైన నీవు నిజము గ్రహింపుము. పాప మేరికైన సంతోషదాయక మగునా ? లోక వినాశకరమగు పాతక మెల్లయు మనుష్యకృతమెసుఁడీ. పాపము దేవుని కపచారము, నావెతల కాలవాలమును ! లోకమందెచట నేమనుజుఁడు దుష్కృతము లొనరించినను, అవి నావేదనల నభివృద్ధి చేసి, నా బానిసత్వమునకు దోహద మొసంగుచున్నవి. నిరతము నరుని శోధింతునని నేను నియమ మూనితిని. ఐనను, మనుజుఁడు నాకు లోఁబడ నక్కఱలేదు. కార్యస్వతంత్రుఁడై యతఁడు నన్ను ధిక్కరించినచో, నేను పలాయన మయ్యెదను. అతఁడు న న్నాదరించెనా, వాని యండనె నేను నిలిచియుండెదను !
" 'అనాదిగ మానిసివేసమున నేను పుడమిని గ్రుమ్మరుచున్నాఁడను. ప్రభువులకు ప్రధానులకును, శిష్యులకు శాస్త్రజ్ఞులకును, పిన్నలకు పెద్దలకును, వారివారి లోపముల ననుసరించి, నేను సాక్షాత్కార మగుచున్నాను ! కాని, యోగ్యులకు పవిత్రులకు విశ్వాసకులకును నేను నమస్కృతు లొనరించి, సంతోషమున వారిని వీడి పలాయితుఁడ నగుచున్నాఁడను. ఇదియె నా నిజస్థితి. నరుఁడు మన:పూర్వకముగ నన్నుద్ధరించి నాకు విముక్తి గలిగించువఱకును, నేను వానినె యాశ్రయించి, అవనియందె నిలిచి యుందును !' "
19. సంఘసంస్కరణసభ
రాజమంద్రిలో 28 వ మెయి తేదీని నేను పురమందిరమునకుఁ బోయి, అచటి పఠనాలయమునుండి "ఇమర్సనుని రచనలు" అను